Andhra Pradesh BIEAP AP Inter 1st Year Accountancy Study Material 2nd Lesson అకౌంటింగ్ సూత్రాలు Textbook Questions and Answers.
AP Inter 1st Year Accountancy Study Material 2nd Lesson అకౌంటింగ్ సూత్రాలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
గణక భావనలు ఏవి? అందులో ఏవైనా నాల్గింటిని క్షుణ్ణంగా వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
సర్వసమ్మతమైన అకౌంటింగ్ శాస్త్రానికి మూలమైన అకౌంటింగ్ ప్రమేయాలను అకౌంటింగ్ భావనలు అంటారు. అకౌంటింగ్ శాస్త్రాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన ప్రమేయాలను, షరతులను లేదా సర్వసమ్మతాలను అకౌంటింగ్ భావనలుగా పరిగణించవచ్చును.
1) గతిశీల సంస్థ భావన: ఈ భావన ప్రకారము వ్యాపార సంస్థ సముచితమైన లాభాలను ఆర్జిస్తూ సుదీర్ఘకాలము కొనసాగగలదని, సుదీర్ఘ భవిష్యత్తులో సంస్థను మూసివేయడం జరగదని ఆశించడం జరుగుతుంది.
కాబట్టి వ్యవహారాలను గతిశీల సంస్థ భావనను దృష్టిలో పెట్టుకొని పుస్తకాలు వ్రాస్తారు. ఈ భావన మూలముగానే వస్తు సరఫరాదారులు వస్తు సేవలను వ్యాపార సంస్థకు సరఫరా చేయడం, ఇతర సంస్థలతో వ్యాపార వ్యవహారాలు జరపడం జరుగుతుంది. ఆస్తి-అప్పుల పట్టికలో ఆస్తులను వసూలయ్యే విలువకు కాకుండా తగ్గింపు విలువకు చూపడం జరుగుతుంది.
2) వ్యయ భావన: వ్యాపార సంస్థ తన కార్యకలాపాలను సమర్థవంతముగా నిర్వహించవలెనంటే పలు రకాల ఆస్తులను సేకరించవలసి ఉంటుంది. ఆస్తులను సేకరించడానికి యథార్ధముగా చెల్లించిన మూల్యాన్ని వ్యయము అంటారు. వ్యయ భావన ప్రకారము ఆస్తులను, వాటి సేకరణ చెల్లించిన ధర ప్రకారము పుస్తకాలలో నమోదు చేయాలి.
3) ద్వంద రూప భావన: ఈ భావన ప్రకారము వ్యవహారమునకు ఉన్న రెండు ప్రయోజనాలను అనగా పుచ్చుకొనే ప్రయోజనము, ఇచ్చే ప్రయోజనము ఖాతా పుస్తకాలలో వ్రాయడం జరుగుతుంది. ప్రతి వ్యవహారములో ప్రతి డెబిట్ విలువకు సమానమైన క్రెడిట్ విలువ, ప్రతి క్రెడిట్ విలువకు సమానమైన డెబిట్ విలువ ఉంటుంది. అకౌంటింగ్ సమీకరణము (ఆస్తులు = అప్పులు + మూలధనము) ఈ ద్వంద రూప భావనపై ఆధారపడి ఉన్నది.
4) గణకకాల భావన: ఈ భావన ప్రకారము వ్యాపార సంస్థ ఆర్థిక స్థితిగతులు తెలుసుకొనడానికి అవసరమైన ఆర్థిక నివేదికలను నిర్దిష్ట కాలానికి ఒకేసారి తయారుచేయాలి. ఈ విధముగా తయారుచేసిన ఆర్థిక నివేదికలు సకాలములో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అవసరమైన అభివృద్ధి వ్యూహరచనకు ఉపయోగపడతాయి. సాధారణముగా 12 నెలల కాలపరిమితిని అకౌంటింగ్ కాలము అంటారు. ప్రతి సంవత్సరము మార్చి లేదా డిసెంబరు చివరన ఖాతా పుస్తకాలు ముగిస్తారు.
5) జతపరిచే భావన: ఈ భావన ప్రకారము ఒక అకౌంటింగ్ కాలములో ఆర్జించిన లాభాన్ని కనుక్కోవడానికి ఆ కాలములో వచ్చిన రాబడిని, ఆ రాబడి పొందడానికి ఆ కాలములో చేసిన వ్యయాన్ని జతపరచాలి. యజమానులకు సక్రమముగా చెందాల్సిన ఖచ్చితమైన లాభాలను కనుక్కోవడానికి ఈ భావన ప్రాతిపదికగా ఉంటుంది.
6) వసూలు భావన: ఈ భావన ప్రకారము లాభాన్ని వసూలు అయిన తర్వాతనే పుస్తకాలలో నమోదు చేయాలి. రాబడిని గుర్తించడానికి నగదు వసూలు కానవసరం లేదు. సంస్థ సేవలను అందించడం ద్వారా, వస్తువులను అమ్మకం చేయుట ద్వారా రాబడిని పొందడానికి వసూలు చేసుకోవడానికి న్యాయాత్మక హక్కు కలిగి ఉండాలి.
7) సంపాదన భావన: అకౌంటింగ్ నగదు ప్రాతిపదిక క్రింద కేవలం ఆదాయాలు వసూలు అయినపుడు, ఖర్చులను చెల్లించినపుడు చూపాలి. కాని పెరుగుదల భావన ప్రకారం చెల్లించవలసిన ఖర్చులను, ముందుగా చెల్లించిన ఖర్చులు, రావలసిన ఆదాయాలు, ముందుగా వచ్చిన ఆదాయాలను కూడా ఖాతా పుస్తకాలలో ప్రత్యేకముగా చూపాలి.
ప్రశ్న 2.
గణక సంప్రదాయాలు ఏవి ? సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
అకౌంటింగ్ నివేదికలను తయారుచేయడములో దీర్ఘకాలమునుంచి ఉపయోగించి, అనుసరించి స్థాపించిన ఆచార సంప్రదాయాలను అకౌంటింగ్ సంప్రదాయాలు అంటారు. వీటిని పాటించడము ద్వారా ఆర్థిక నివేదికలు అర్ధవంతముగా, స్పష్టముగా తయారవుతాయి.
ముఖ్యమైన అకౌంటింగ్ సంప్రదాయాలు:
1) సమాచారాన్ని వెల్లడిచేయాలనే సంప్రదాయము వ్యాపారముతో సంబంధమున్న వాటాదారులు, ఋణదాతలు, ప్రభుత్వము, కార్మికులు మొదలైనవారు సంస్థ ఫలితాలను గురించి ఆసక్తికరముగా చూస్తారు. వ్యాపార ఆస్తులను, అప్పులను, నికర ఫలితాలను ప్రకటించాలి. సంస్థకు సంబంధించిన వ్యక్తులు దేశములో నలుమూలలా వ్యాపించి ఉంటారు. వ్యాపార కార్యకలాపాలను డైరెక్టర్ల బోర్డు ‘నిర్వహిస్తుంది. వ్యాపార ఫలితాలను సక్రమమైన పద్దతిలో సమర్పించవలసిన బాధ్యత డైరెక్టర్లదే. వ్యాపార ఆస్తులు, అప్పులపై ప్రభావాన్ని చూపే ప్రతి సంఘటన బహిరంగపరచాలి.
2) విషయ ప్రాధాన్యత సంప్రదాయము: ఆర్థిక ఖాతాలు నిర్వహిస్తున్నప్పుడు, నివేదికలు తయారు చేస్తున్నప్పుడు, వ్యవహారముల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొనవలెను. ప్రాధాన్యత గల విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ప్రాధాన్యత లేని విషయాలను విస్మరించవచ్చు. అనవసరమయిన చిల్లర విషయాలను చూపడం వలన ముఖ్యమైన విషయాలు మరుగునపడి, సమాచారము క్లిష్టతరము కావడం ·జరుగుతుంది.
3) నిలకడగా ఉండాలనే సంప్రదాయము: ఈ సంప్రదాయము ప్రకారము గణక నియమాలు, ఆచరణ పద్ధతులు ప్రతి సంవత్సరము ఒకే రకముగా ఉండాలి. వాటిని మార్చకూడదు. ఆ విధముగా ఉంటేనే ఒక సంవత్సరము ఫలితాలను మరొక సంవత్సరము ఫలితాలతో పోల్చడానికి అవకాశము ఉంటుంది. ఉదా: వ్యాపార సంస్థ స్థిరాస్థులపై తరుగుదలను, స్థిర వాయిదాల పద్ధతి లేదా తగ్గుతున్న నిల్వల పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతిలో మాత్రమే ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయాలి. కాని సంవత్సరములో పద్ధతులు మార్చకూడదు. అదే విధముగా ముగింపు సరుకు విలువ కట్టడానికి FIFO లేదా LIFO పద్ధతిలో ఏదో ఒకటి మాత్రమే ప్రతి సంవత్సరము పాటించాలి.
4) మితవాద సంప్రదాయము: పరిస్థితి యొక్క ఉదాసీన దృక్పథాన్ని తీసుకోవడమే మితవాదము. అనిశ్చిత వాతావరణము నెలకొన్న పరిస్థితిలో రాబోయే నష్టాలన్నింటిని ఎదుర్కొనేందుకుగాను జాగ్రత్తపడటమే ఈ సంప్రదాయ ఉద్దేశ్యము. అన్ని విపత్కర పరిస్థితులలోను వ్యాపారస్తుడు పదిలముగా ఉండటానికి ఈ సంప్రదాయము ఒక విషయాన్ని రూపొందించినది. ఈ నియమము లాభాలను ఊహించవద్దని కాని, అన్ని నష్టాలకు తగిన ఏర్పాటు చేయాలని చెబుతుంది. ముగింపు సరుకును విలువ కట్టేటప్పుడు కొన్న ధర లేదా మార్కెట్ ధర ఏది తక్కువైతే ఆ ధరకే విలువ కడతారు. ముగింపు సరుకు విలువ కట్టడములో మితవాద సూత్రము ప్రతిబింబిస్తుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యాపార అస్తిత్వ భావనను వివరించండి.
జవాబు:
ఈ భావన అత్యంత విశిష్టమైన, మౌలికమైన అకౌంటింగ్ భావన. ఈ భావన ప్రకారము వ్యాపార వ్యవహారములు నమోదు చేసేటపుడు వ్యాపార సంస్థ, యజమాని వేరువేరని భావించడం జరుగుతుంది. యజమానులు లేదా వాటాదారుల వ్యక్తిగత వ్యవహారములను వ్యాపార సంస్థ వ్యవహారాలనుంచి వేరు చేయడానికి ఈ భావన ఉపకరిస్తుంది. అంతేగాక వ్యాపార వ్యవహారములు వ్రాసేటపుడు సంస్థ దృష్ట్యా మాత్రమే పరిగణించడం జరుగుతుంది.
ప్రశ్న 2.
ద్రవ్యరూప భావనను వివరించండి.
జవాబు:
ఈ భావన ప్రకారము ద్రవ్యరూపములో వ్యక్తము చేయగల వ్యవహారాలను మాత్రమే నమోదు చేయాలి. ద్రవ్య రూపములో వ్యక్తం చేయడానికి వీలుకాని అంశాలను ఖాతా పుస్తకాలలో చూపకూడదు. ఆదాయ వసూళ్ళు, ఖర్చుల చెల్లింపులు, ఆస్తుల కొనుగోలు, అమ్మకం మొదలైన ద్రవ్యపరమైన వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో నమోదు
చేయాలి. కాని యంత్రం పనిచేయకపోవడం, సిబ్బంది విధేయత మొదలైనవి చూపకూడదు. కారణము వీటిని ద్రవ్యరూపంలో కొలవలేము. యంత్రం మరమ్మతులు ద్రవ్యరూపములో కొలిచి, ద్రవ్య విలువ పుస్తకాలలో చూపాలి.
ప్రశ్న 3.
మితవాద సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
పరిస్థితి యొక్క ఉదాసీన దృక్పథాన్ని తీసుకోవడమే మితవాదము. అనిశ్చిత వాతావరణము నెలకొన్న పరిస్థితులలో రాబోయే నష్టాలన్నింటిని ఎదుర్కొనేందుకు జాగ్రత్తపడటమే ఈ సంప్రదాయ ఉద్దేశ్యము. అన్ని విపత్కర పరిస్థితులలోనూ వ్యాపారస్తుడు పదిలముగా ఉండటానికి ఈ సంప్రదాయము ఒక విషయాన్ని రూపొందించినది. ఈ నియమము లాభాలను ఊహించవద్దని కాని, అన్ని నష్టాలకు తగిన ఏర్పాటు చేయాలని చెబుతుంది. ముగింపు సరుకును విలువ కట్టేటప్పుడు కొన్న ధర లేదా మార్కెట్ ధర ఏది తక్కువైతే ఆ ధరకే విలువ కడతారు.` ముగింపు సరుకు విలువ కట్టడములో మితవాద సూత్రము ప్రతిబింబిస్తుంది.
ప్రశ్న 4.
అనురూప సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
ఈ సంప్రదాయము ప్రకారము గణక నియమాలు, ఆచరణ పద్ధతులు ప్రతి సంవత్సరము ఒకే రకముగా ఉండాలి. వాటిని మార్చకూడదు. ఆ విధముగా ఉంటేనే ఒక సంవత్సరము ఫలితాలు మరొక సంవత్సరము ఫలితాలతో పోల్చడానికి అవకాశము ఉంటుంది. ఉదా: వ్యాపార సంస్థ స్థిరాస్తులపై తరుగుదలను స్థిర వాయిదాల పద్ధతి లేదా తగ్గుతున్న నిల్వల పద్ధతి, ఏదైనా ఒక పద్ధతిలో మాత్రమే ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయాలి. కాని సంవత్సరములో పద్ధతులు మార్చకూడదు. అదే విధముగా ముగింపు సరుకును విలువ కట్టడానికి FIFO లేదా LIFO పద్ధతిలో ఏదో ఒకటి మాత్రమే ప్రతి సంవత్సరము పాటించాలి.
ప్రశ్న 5.
గణక ప్రమాణాలపై సంక్షిప్త వ్యాఖ్య వ్రాయండి.
జవాబు:
ప్రపంచవ్యాప్తముగా వివిధ వ్యాపార సంస్థల ఖాతాల తయారీలో ఏకరూపత తీసుకొని రావడానికి 1973లో 9 దేశాల సభ్యులు కలిసి అంతర్జాతీయ గణక ప్రమాణాల సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తముగా అన్ని వ్యాపార సంస్థలు ఖాతాలు తయారు చేయడానికి అవసరమైన ప్రమాణాలు రూపొందించి అవి పాటించేలా చర్యలను తీసుకుంటుంది. మన దేశములో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1977లో గణక ప్రమాణాల బోర్డు స్థాపించినది. ‘భారతదేశ వ్యాపార సంస్థలు పాటించవలసిన గణక ప్రమాణాలు తయారుచేసే అధికారము ‘ఈ బోర్డుకు ఉన్నది.
అకౌంటింగ్ పద్ధతులు, ఆచరణలు నిర్దేశించే ప్రమాణీకరించే సూత్రాన్ని గణక ప్రమాణాలు అంటారు. సాధారణముగా అంగీకరించిన గణక సూత్రాలు ఈ అకౌంటింగ్ ప్రమాణాలలో ఒక భాగము. వ్యాపార సంస్థ ఆర్థిక ‘నివేదికలు” అర్ధవంతం కావడానికి, సమర్థవంతముగా తయారుచేయడానికి ఈ ప్రమాణాలు ఉపకరిస్తాయి.