Andhra Pradesh BIEAP AP Inter 1st Year Botany Study Material 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం Textbook Questions and Answers.
AP Inter 1st Year Botany Study Material 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పీచువేర్లకు, అబ్బురపు వేర్లకు గల భేదాలు రాయండి.
జవాబు:
పీచువేర్లు | అబ్బురపు వేర్లు |
కాండము దిగువ భాగము నుండి గుంపుగా ఏర్పడు వేర్లను పీచువేర్లు అంటారు. | ప్రథమ మూలము నుండి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుండి ఏర్పడే వేర్ల సముదాయమును అబ్బురపు వేర్లు అంటారు. |
ప్రశ్న 2.
‘రూపాంతరం’ను నిర్వచించండి. మర్రి వృక్షం, మాంగ్రూప్ మొక్కలలో వేరు ఏవిధంగా రూపాంతరం చెందిందో తెలపండి.
జవాబు:
ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి మొక్కలలో అంగాలలో ఏర్పడే నిర్మాణాత్మకమైన, శాశ్వత మార్పును రూపాంతరం అంటారు. మర్రి వృక్షంలో పెద్దశాఖల నుండి వేర్లు ఏర్పడి నేలలోనికి పెరిగి స్థంభాలవలె మారతాయి. వాటిని ఊడవేర్లు లేదా స్థంభాల వంటి వేర్లు అంటారు. మాంగ్రూవ్లలో అనేక వేర్లు భూమిపైకి, నిటారుగా పెరుగుతాయి. వీటిని శ్వాసమూలాలు అంటారు. ఇవి శ్వాసక్రియకు సహాయపడతాయి.
ప్రశ్న 3.
వృక్షోపజీవుల మొక్కలలో ఏరకం ప్రత్యేకమైన వేర్లు ఏర్పడతాయి ? వాటి విధిని తెలపండి.
జవాబు:
వృక్షోపజీవుల మొక్కలలో వెలమిన్ వేర్లు ఏర్పడి వాతావరణంలోని తేమను శోషించడానికి తోడ్పడతాయి.
ప్రశ్న 4.
క్రిసాంథిమమ్ (చామంతి) లో గల పిలక మొక్క, జాస్మిన్ (మల్లె) లో గల స్టోలను ఏవిధంగా విభేదిస్తుంది?
జవాబు:
పిలక మొక్కలు | స్టోలన్లు |
ప్రధాన అక్షం పీఠభాగము, భూగర్భ కాండ భాగాల నుండి పార్శ్వపుశాఖలు ఏర్పడి, కొంతవరకు మృత్తికలో సమాంతరంగా వృద్ధిచెంది, తరువాత ఏటవాలుగా పెరిగి భూమిపై పత్రయుత శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలను పిలకమొక్కలు అంటారు. ఉదా : చామంతి. |
ప్రధాన అక్షం పీఠభాగం నుండి సున్నితమైన పార్శ్వపుశాఖలుఏర్పడి, కొంతకాలం వాయుగతంగా పెరిగిన తర్వాత వంగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుస్తాయి. ఈ శాఖలను స్టోలన్లు అంటారు. ఉదా : మల్లె. |
ప్రశ్న 5.
తల్పం వంటి పత్రపీఠం అంటే ఏమిటి? ఏ ఆవృత బీజపు కుటుంబ మొక్కలలో అవి కనిపిస్తాయి? [Mar. ’14]
జవాబు:
ఉబ్బివున్న పత్రపీఠంను తల్పం వంటి పత్రపీఠం అంటారు. ఇవి “లెగ్యుమినోసి” కుటుంబ మొక్కలలో కనిపిస్తుంది.
ప్రశ్న 6.
‘ఈనెల వ్యాపనం’ ను నిర్వచించండి. ద్విదళ బీజాలు, ఏకదళబీజాల నుంచి ఈనెల వ్యాపనంలో ఏవిధంగా విభేదిస్తాయి?
జవాబు:
పత్రదళంలో ఈనెలు, చిరు ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనము అంటారు. ద్విదళ బీజ పత్రాలలో చిరు ఈనెలు వలలాగా అమరి ఉంటాయి. దానిని జాలాకార ఈనెల వ్యాపనము అంటారు. ఏకదళబీజ పత్రాలలో చిరు ఈనెలు ఒకదానినొకటి సమాంతరంగా అమరి ఉంటాయి. దానిని సమాంతర ఈనెల వ్యాపనము అంటారు.
ప్రశ్న 7.
పిచ్ఛాకార సంయుక్త పత్రం, హస్తాకార సంయుక్త పత్రాన్ని ఏ విధంగా విభేదిస్తుంది? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షంపై అమరి ఉన్నచో దానిని పిచ్ఛాకార సంయుక్త పత్రము అంటారు. ఉదా: వేప. పత్రకాలు, పత్ర వృంతం కోన భాగంలో సంలగ్నమైవున్న దానిని హస్తాకార సంయుక్త పత్రము అంటారు. ఉదా : బూరుగ.
ప్రశ్న 8.
కీటకాహారి మొక్కలలో కీటకాన్ని బంధించడానికి ఏ అంగం రూపాంతరం చెందింది? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
కీటకాహార మొక్కలలో, కీటకాన్ని బంధించడానికి పత్రాలు బోనులుగా మారతాయి. ఉదా : నెపంథిస్, డయోనియా.
ప్రశ్న 9.
మధ్యాభిసార, నిశ్చిత పుష్ప విన్యాసాల మధ్యగల భేదాన్ని తెలపండి.
జవాబు:
మధ్యాభిసార పుష్పవిన్యాసము | నిశ్చిత పుష్పవిన్యాసము |
1) పుష్పవిన్యాస అక్షం అనిశ్చితంగా పెరుగుతుంది. | 1) పుష్ప విన్యాస అక్షం నిశ్చితంగా పెరుగుతుంది. |
2) పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి వుంటాయి. | 2) పుష్పాలు ఆధారాభిసార క్రమంలో అమరి వుంటాయి. |
3) పుష్పాలు కేంద్రాభిసార క్రమంలో వికసిస్తాయి. | 3) పుష్పాలు కేంద్రాపసార క్రమంలో వికసిస్తాయి. |
ప్రశ్న 10.
సయాథియమ్లోని గిన్నెవంటి నిర్మాణం స్వరూపాన్ని తెలపండి. ఏ కుటుంబంలో అది కనిపిస్తుంది?
జవాబు:
సయాథియమ్లో గిన్నెవంటి నిర్మాణము పరిచక్రపుచ్ఛావళి నుండి (పుష్ప పుచ్ఛాలు) ఏర్పడుతుంది. ఇది యూఫోర్బియేసి కుటుంబ మొక్కలలో కనిపిస్తుంది.
ప్రశ్న 11.
ఫిగ్ (మర్రి జాతి) వృక్షాలలో ఏ పుష్ప విన్యాసం కనిపిస్తుంది ? బ్లాస్టోఫాగా కీటకం ఆ వృక్షంలోని పుష్ప విన్యాసాన్ని ఎందుకు చేరుతుంది?
జవాబు:
ఫిగ్ (మర్రి జాతి) వృక్షంలో హైపనోడియమ్ పుష్పవిన్యాసము కనిపిస్తుంది. ‘బ్లాస్టోఫాగా’ అను కీటకము ఆ పుష్ప విన్యాసంలోని గాల్ పుష్పాలలో తన గుడ్లను పొదుగుతుంది.
ప్రశ్న 12.
సౌష్ఠవయుత పుష్పానికి, పాక్షిక సౌష్టవయుత పుష్పానికి గల భేదాన్ని తెలపండి.
జవాబు:
సౌష్టవయుత పుష్పము | పాక్షిక సౌష్టవయుత పుష్పము |
పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థం తలంనుంచైనా రెండు సమభాగాలుగా విభజించగలిగిన దానిని సౌష్టవయుత పుష్పం అంటారు. ఉదా : ఉమ్మెత్త. |
పుష్పాన్ని మధ్యనుంచి ఏదో ఒక తలంనుంచి మాత్రమే నిలువుగా రెండు సమభాగాలుగా విభజించగలిగితే దానిని పాక్షిక సౌష్టవయుత పుష్పం అంటారు. ఉదా : చిక్కుడు. |
ప్రశ్న 13.
బఠానీ మొక్కలో ఆకర్షణ పత్రాలు ఏవిధంగా అమరి ఉంటాయి? అటువంటి అమరికను ఏమంటారు?
జవాబు:
బఠాణీ, చిక్కుడు మొక్కలలో పుష్పాలలో ఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి. వాటిలో అతిపెద్ద ఆకర్షణ పత్రం (ధ్వజం) రెండు పార్శ్వ ఆకర్షణ పత్రాలను (బాహువులు) కప్పి ఉంచుతుంది. ఈ రెండు బాహువులు తిరిగి పూర్వాంతంలో ఉన్న రెండు అతిచిన్నవైన ఆకర్షణ పత్రాలను (ద్రోణులు) కప్పి ఉంచుతాయి. ఈ రకము అమరికను “వెక్సిల్లరీ” లేక “పాపిలియోనేషియన్” పుష్పరచన అంటారు.
ప్రశ్న 14.
మకుదశోపరిస్థితం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కేశరాలు, ఆకర్షణ పత్రాలతో సంయుక్తమగుటను “మకుటదళో పరిస్థితము” అంటారు. ఉదా : వంగ.
ప్రశ్న 15.
అసంయుక్త, సంయుక్త అండాశయాల మధ్య భేదాలను తెలపండి.
జవాబు:
అసంయుక్త అండాశయం | సంయుక్త అండాశయం |
అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు, అవిస్వేచ్చగా ఉంటే, దానిని అసంయుక్త అండాశయం అంటారు. ఉదా : గులాబీ. |
అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలు ఉన్నప్పుడు అవి కలిసివుంటే, దానిని సంయుక్త అండాశయం అంటారు. ఉదా : టొమాటో. |
ప్రశ్న 16.
‘అండాన్యాసం’ ను నిర్వచించండి. డయాంథర్లో ఏ రకం అండన్యాసం కనిపిస్తుంది?
జవాబు:
అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. డయాంథస్ లో స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం ఉంటుంది.
ప్రశ్న 17.
అనిషేక ఫలం అంటే ఏమిటి? అది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఫలదీకరణం చెందని అండాశయం నుండి ఏర్పడే ఫలాన్ని అనిషేకఫలం అంటారు. దీని ద్వారా వాణిజ్య పరంగా విత్తన రహిత ఫలాలను పొందవచ్చు.
ప్రశ్న 18.
మామిడిలో ఏ రకం ఫలం ఉంది? అది కొబ్బరి ఫలాన్ని ఏ విధంగా విభేదిస్తుంది?
జవాబు:
‘మామిడి’లో ‘టెంకెగల ఫలం’ ఉంటుంది. మామిడిలో బాహ్య ఫల కవచం పలుచగా, మధ్య ఫలకవచం కండగల్గి, విధంగా లోపల టెంకెలాంటి అంతరఫలకవచంతో ఉంటుంది. కొబ్బరిలో మధ్య ఫలకవచము పీచులాగా ఉంటుంది.
ప్రశ్న 19.
కొన్ని ఫలాలను అనృత ఫలాలు అని ఎందుకు అంటారు? రెండు ఉదాహరణలను ఇవ్వండి.
జవాబు:
అండాశయంతోపాటు, పుష్పంలో ఏ ఇతర భాగాలైనా ఫలంగా మారిన, వాటిని అనృతఫలాలు అంటారు.
ఉదా : ఆపిల్లో పుష్పాసనం నుంచి అనృతఫలం ఏర్పడుతుంది. జీడిమామిడిలో పుష్పవృంతం నుంచి అనృతఫలం ఏర్పడుతుంది.
ప్రశ్న 20.
ఒకే విత్తనంగల శుష్క ఫలాలను ఏర్పరచే రెండు మొక్కల పేర్లను తెలపండి.
జవాబు:
- వరి
- జీడి మామిడి
- గడ్డి చేమంతి.
ప్రశ్న 21.
షైజోకార్పిక్ శుష్క ఫలాలను నిర్వచించండి. ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఫలాలు పక్వదశలో పగిలి ఒక్క విత్తనం కల మొక్కలు ఏర్పడుతాయి. దానిని షైజోకార్పిక్ శుష్క ఫలాలు అంటారు. ఉదా : అకేసియా, ఆముదం.
ప్రశ్న 22.
‘ఫలాంశం’ను నిర్వచించండి. ఏ మొక్కలో అది ఏర్పడుతుంది?
జవాబు:
షైజోకార్పిక్ ఫలాలలోని ఒక విత్తనం కల మొక్కలను ఫలాంశాలు అంటారు.
ఉదా : అకేసియా.
ప్రశ్న 23.
సంకలిత ఫలాలు అని వేటిని అంటారు? రెండు ఉదాహరణలు తెలపండి.
జవాబు:
సీతాఫలంలో అనేక ఫలదళాలు స్వేచ్ఛగా ఉంటాయి. ప్రతిఫలదళం ఒక చిరుఫలంగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి గుమిగూడిన ఫలాలను సంకలిత ఫలాలు అంటారు.
ఉదా : అనోనా, నరవేలియా.
ప్రశ్న 24.
పుష్ప విన్యాసం అంతా ఒక ఫలంగా ఏర్పరచే మొక్కను తెలపండి. అటువంటి ఫలాన్ని ఏమంటారు? [Mar. ’14]
జవాబు:
పైన్ ఆపిల్ (ఆనాస). దీనిలోని ఫలమును సంయోగఫలము అంటారు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వేరులోని వివిధ మండలాలను పటం సహాయంతో వివరించండి.
జవాబు:
వేరులో నాలుగు మండలాలు కనిపిస్తాయి. అవి :
1) వేరు తొడుగు మండలము :
వేరు కొనభాగమును కప్పుతూ ఉన్న టోపీ వంటి నిర్మాణమును వేరు తొడుగు అంటారు. ఇది వేరు మృత్తికలోకి చొచ్చుకు పోయేటప్పుడు వేరు కొనను రక్షిస్తుంది.
2) విభజన జరిగే మండలము :
వేరు తొడుగుపైన ఈ మండలం ఉంటుంది. దీనిలోని కణాలు చిన్నవిగా, పలుచని కణకవచాలు కలిగి, చిక్కని కణద్రవ్యంతో ఉంటాయి. ఇవి మరల, మరల విభజన చెందుతూ క్రొత్త కణాలను ఏర్పరుస్తాయి.
3) పొడవు పెరిగే మండలము :
విభజన జరిగే మండలానికి సమీపంగా ఉన్న కణాలు పొడవుగా సాగి పరిమాణంలో పెరుగుట ద్వారా వేరు పొడవు ఎదగటానికి తోడ్పడతాయి.
4) ముదిరిన మండలము :
ఈ ప్రాంతంలోని వేరు కణాలు క్రమేణా విభేదన చెంది పక్వమవుతాయి. కావున దీనిని ముదిరిన మండలం అంటారు. దీనిలోని కొన్ని బాహ్య చర్మ కణాల నుండి చాలా సన్నని, సున్నితమైన దారాల వంటి మూలకేశాలు ఏర్పడతాయి. ఇవి నేల నుండి నీరు, ఖనిజలవణాలను శోషించడానికి తోడ్పడతాయి.
ప్రశ్న 2.
“మొక్కలోని భూగర్భ భాగాలన్నీ వేర్లు కావు” ఈ వాక్యాన్ని బలపరచండి.
జవాబు:
కొన్ని మొక్కలలో కాండాలు మృత్తికలోనికి పెరిగి, ఆహారపదార్థాలను నిల్వచేయడమే కాకుండా, పెరుగుదలకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలికతను చూపే అంగాలుగాను పనిచేస్తాయి. అంతేకాక శాఖీయ ప్రత్యుత్పత్తికి మరియు గడ్డితినే జంతువుల నుండి రక్షణ పొందుతాయి. భూగర్భ కాండాలపై కనుపులు, కనుపు నడిమిలు, మొగ్గలు, పొలుసాకులు ఉంటాయి. కావున మొక్కలోని భూగర్భ భాగాలన్ని వేర్లు కావు అని చెప్పవచ్చు.
ఉదా : బంగాళదుంపలోని దుంపకాండము, అల్లంలోని కొమ్ము, చేమదుంపలోని కందము, ఉల్లిలోని లశునము.
ప్రశ్న 3.
పత్ర విన్యాసంలోని వివిధ రకాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
కాండంపైన లేదా శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్రవిన్యాసం అంటారు. ఇవి మూడు రకాలు.
1) ఏకాంతర పత్రవిన్యాసము :
ప్రతి కణుపు వద్ద ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది.
ఉదా : మందార, ఆవ
2) అభిముఖ పత్రవిన్యాసము :
ప్రతి కణుపు వద్ద రెండు పత్రాలు ఏర్పడి, ఎదురెదురుగా అమరి ఉంటాయి. ఉదా : జిల్లేడు, జామ
3) చక్రియ పత్రవిన్యాసము :
ప్రతి కణుపు వద్ద రెండు కంటే ఎక్కువ పత్రాలు ఏర్పడి వలయంగా అమరి ఉంటాయి. ఉదా : గన్నేరు, ఆలోస్టోనియ.
ప్రశ్న 4.
పత్రరూపాంతరాలు మొక్కలకు ఏవిధంగా తోడ్పడతాయి?
జవాబు:
పత్రరూపాంతరాలు మొక్కలకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అవి
1) నులితీగలు :
బలహీనకాండం కల మొక్కలైన బఠాణీలో పత్రాలు నులితీగలుగా మారి మొక్క ఎగబాకుటకు తోడ్పడతాయి.
2) కంటకాలు :
ఎడారి మొక్కలలో భాష్పోత్సేకమును తగించుటకు, రక్షణకు పత్రాలు కంటకాలుగా మారతాయి.
ఉదా : కాక్టై
3) పొలుసాకులు :
నీరుల్లి, వెల్లుల్లిలలో పత్రాలు ఆహార పదార్థాలను నిల్వచేసి, కండగల పత్రాలుగా మారతాయి.
4) ప్రభాసనము :
ఆస్ట్రేలియన్ అకేసియాలో పత్రాలు పిచ్చాకార సంయుక్త పత్రాలుగా ఉంటాయి. వీటిలో గల పత్రకాలు చిన్నవిగా ఉండి లేతదశలో రాలిపోతాయి. ఆ మొక్కలోని పత్రవృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వాటిని ప్రభాసనము అంటారు.
5) బోను పత్రాలు :
కొన్ని మొక్కలలో కీటకాలను బంధించుట కొరకు పత్రాలు బోనులుగా రూపాంతరం చెంది, వాటిని చంపి, నత్రజని సంబంధ పదార్థాలను గ్రహిస్తాయి.
ఉదా : నెఫంథిస్, డయోనియా.
6) ప్రత్యుత్పత్తి పత్రాలు :
బ్రయోఫిల్లమ్ పత్రపు అంచులలో గల గుంటలలో పత్రోపరిస్థిత మొగ్గలు ఏర్పడి, పత్రం నుండి విడిపోయేటప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుచుకుని స్వతంత్ర మొక్కలుగా పెరిగి శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి.
ప్రశ్న 5.
ఏవైనా రెండు రకాల ప్రత్యేక పుష్పవిన్యాసాలను వివరించండి.
జవాబు:
సయాథియమ్ :
ఈ ప్రత్యేక పుష్పవిన్యాసం ఒకే పుష్పంలా కనిపిస్తుంది. ఇది యుఫర్బియేసి కుటుంబ మొక్కలలో కనిపిస్తుంది. పుష్పవిన్యాసాన్ని ఆవరించి లోతైన గిన్నెవంటి పరిచక్రపుచ్ఛావళి ఉంటుంది. దీని వెలుపలి భాగంలో మకరంద గ్రంథులు ఉంటాయి. గిన్నె మధ్యభాగంలో పొడవైన వృంతంగల త్రిఫలదళ సంయుక్త అండకోశం ఉంటుంది. ఇది స్త్రీ పుష్పం. దీనిచుట్టూ అనేక పురుషపుష్పాలు వృశ్చికాకార సైవ్లో అమరిఉంటాయి. ప్రతీ పురుషపుష్పం ఒక్కొక్క వృంతయుత కేసరాన్ని పోలి ఉంటుంది. స్త్రీ, పురుషపుష్పాలు పరిపత్రరహితాలు. పుష్పాలు కేంద్రాపసారక్రమంలో అమరి ఉంటాయి.
ఉదా : యుఫర్బియా, పోయిన్సెట్టియా.
హైపస్ థోడియమ్ :
ఇది ఒక ఫలాన్ని పోలిన పుష్పవిన్యాసం. దీనిలో పుష్పవిన్యాసాక్షం సంక్షిప్తమై ఉబ్బి, రసభరితమైన గిన్నెవంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీని అగ్రంలో చిన్నరంధ్రం ఉంటుంది. ఈ పుష్పవిన్యాస వృంతం లోపలి కవచంపై అనేక సూక్ష్మమైన, వృంతరహిత, ఏకలింగక పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. పురుషపుష్పాలు అగ్ర రంధ్రానికి దగ&గరగాను, స్త్రీ పుష్పాలు క్రింది భాగంలోను ఏర్పడతాయి. వీటి మధ్యలో కొన్ని వంధ్య స్త్రీ పుష్పాలుంటాయి. వీటిని ‘గాల్ పుష్పాలు’ అంటారు. ఈ పుష్పాలు వికసించే పద్ధతి నిర్ణీత క్రమంలో ఉండదు.
ఉదా : ఫైకస్
ప్రశ్న 6.
పుష్పభాగాలు పుష్పాసనం మీద అమరి ఉన్న విధానాన్ని బట్టి వర్ణించండి.
జవాబు:
పుష్పాసనంపై అండాశయ స్థానమును ఇతర పుష్పభాగాలలో పోల్చిపుష్పాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి :
1) అండకోశాథస్థిత పుష్పము :
పుష్పాసనం అగ్రభాగంలో అండకోశం ఉంటుంది. మిగిలిన పుష్పభాగాలు దాని కింద అమరి ఉంటాయి. దీనిలోని అండాశయాన్ని ఊర్థ్వము అంటారు. ఉదా : ఆవాలు, వంగ
2) పర్యండ కోశ పుష్పము :
పుష్పాసనం మధ్యలో అండకోశం అమరి ఉండి, మిగిలిన పుష్పభాగాలు, పుష్పాసనం అంచునుండి ఒకే ఎత్తులో అమరి ఉంటాయి. దీనిలోని అండాశయాన్ని అర్థ-ఊర్ధ్వ అంటారు.
ఉదా : గులాబీ, బఠాణీ
3) అండకోశోపరిస్థిత పుష్పము :
పుష్పాసనం అంచు పైకి పెరిగి, అండాశయాన్ని పూర్తిగా ఆవరించి ఉంటుంది. మిగిలిన పుష్పభాగాలు అండాశయం పైనుంచి ఏర్పడతాయి. దీనిలో అండాశయాన్ని నిమ్నం అని అంటారు.
ఉదా : జామ, దోస
ప్రశ్న 7.
“రక్షకపత్రాలు, ఆకర్షణపత్రాలు కలిగిన ఆవృతబీజ మొక్కల పుష్పాలు రక్షక, ఆకర్షణపత్రాలు వాటి వలయాల్లోని అమరికలో విభేదిస్తాయి” వివరించండి.
జవాబు:
పుష్పం మొగ్గదశలో ఉన్నప్పుడు, రక్షకపత్రావళి, ఆకర్షణ పత్రావళి అమరి ఉన్న విధానాన్ని పుష్పరచన అంటారు. దీనిలో 4 రకములు కలవు.
1) కవాటయుత పుష్పరచన :
రక్షక లేక ఆకర్షణ పత్రాలు ఒక వలయంలో అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతివ్యాప్తంగా గాకుండా ఉంటాయి.
ఉదా : జిల్లేడు.
2) మెలితిరిగిన పుష్పరచన :
రక్షక, ఆకర్షణ పత్రాల ఒక భాగము అంచుదాని పక్కనే ఉన్న భాగపు అంచును కప్పుతూ అతివ్యాప్తంగా ఉంటుంది.
ఉదా : పత్తి,
3) ఇంబ్రికేట్ పుష్పరచన :
రక్షక ఆకర్షణ పత్రాల అంచులు ఏదో ఒక దిశలోగాకుండా, ఒకదానికొకటి అతివ్యాప్తమై ఉంటాయి.
ఉదా : కాసియా
4) వెక్సిల్లరీ :
బఠాణీ, చిక్కుడు పుష్పాలలో ఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఒక పెద్ద ఆకర్షణ పత్రము (ధ్వజం) రెండు పార్శ్వ ఆకర్షణ పత్రాలును (బాహువులు) కప్పిఉంచుతుంది. ఈ రెండు బాహువులు తిరిగి’ పూర్వాంతంలో ఉన్న రెండు అతి చిన్నవైన ఆకర్షణ పత్రాలను (ద్రోణులు) కప్పి ఉంచుతాయి.
ఉదా : చిక్కుడు, బఠాణీ.
ప్రశ్న 8.
పుష్పించే మొక్కలలోని నాలుగు అండన్యాస రకాలను వర్ణించండి.
జవాబు:
అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. దీనిలో 5 రకాలు కలవు.
1) ఉపాంత అండన్యాసము :
అండన్యాస స్థానము అండాశయపు ఉదరపు అంచువెంట గట్టు లాంటి నిర్మాణాన్ని ఏర్పరచి, దానిపై రెండు వరుసలలో అండాలను కలిగి ఉంటుంది.
ఉదా : బఠాణీ
2) అక్షియ అండన్యాసం :
బహూబిలయుత అండాశయంలో అండన్యాసస్థానం అక్షయంగా ఉండి, దానిపై అండాలు అతుక్కుని ఉంటాయి.
ఉదా : టొమాటో
3) కుడ్య అండన్యాసము :
అండాలు, అండాశయం లోపలి గోడలపైగాని, పరధీయ భాగపై గాని అభివృద్ధి చెంది ఉంటాయి. ఏకబిలయుత అండాశయంలో అనృతకుడ్యం ఏర్పడుట వల్ల ద్విబిలయుతము అవుతుంది.
ఉదా : ఆవ
4) స్వేచ్ఛాకేంద్ర అండన్యాసము :
పటరహిత కేంద్రీయ అక్షంమీద అండాలు ఏర్పడతాయి.
ఉదా : డయాంథస్
5) పీఠ అండన్యాసము :
అండన్యాస స్థానము అండాశయ పీఠంనుంచి వృద్ధి చెంది, ఒకే అండాన్ని కల్గిఉంటుంది.
ఉదా : పొద్దు తిరుగుడు.
ప్రశ్న 9.
మీరు అధ్యయనం చేసిన కండగల ఫలాలను క్లుప్తంగా వర్ణించండి.
జవాబు:
అభివృద్ధి చెందిన తర్వాత పక్వమయ్యే ఫలాలను కండగల ఫలాలు అంటారు. ఇవి 5 రకాలు.
1) మృదుఫలము :
ఇది ద్విఫలదళ లేక బహుఫలదళ సంయుక్త అండకోశము నుంచి అభివృద్ధి చెందుతుంది. దీనిలో మధ్య ఫలకవచము, అంతఃఫలకవచం సంయుక్తమై గుజ్జును ఏర్పరుస్తాయి. విత్తనాలు గట్టిగా ఉంటాయి.
ఉదా : టొమాటో, జామ
2) పెపో :
ఇవి త్రిఫలదళ, సంయుక్త నిమ్న అండాశయం నుంచి ఏర్పడుతుంది. బాహ్య ఫలకవచము పెచ్చులాగా, మధ్యఫలకవచము కండ కలిగి, అంతఃఫలకవచము మెత్తగాను ఉంటాయి.
ఉదా : దోస
3) పోమ్ :
ఈ ఫలము ద్వి లేక బహుఫలదళ, సంయుక్త నిమ్న అండాశయము నుంచి ఏర్పడి, కండ గల పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది. అంతః ఫలకవచము గట్టిగా సాగే భాగంగా ఉంటుంది.
ఉదా : ఆపిల్
4) హెస్పిరీడియమ్ :
ఈ ఫలకము బహూఫలదళ సంయుక్త, ఊర్థ్వ అండాశయము నుంచి ఏర్పడుతుంది. బాహ్యఫలకవచము చర్మిలమై తైలగ్రంథులతో ఉంటుంది. మధ్యఫలకవచము పలుచని కాగితము వలె, అంతఃఫలకవచము రసభరితకేశాలను కలిగి ఉంటాయి.
ఉదా : నిమ్మ.
5) టెంకెగల ఫలము :
ఈ ఫలం ఏకఫలదళ, ఊర్థ్వ అండాశయము నుంచి ఏర్పడి ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది. మామిడిలో బాహ్య ఫలకవచము పలుచగా, మధ్యఫలకవచము కండగల తినే భాగంగా, అంతఃఫలకవచము గట్టి టెంకెలాగా ఉంటాయి. ‘కొబ్బరిలో మధ్యఫలకవచము పీచులాగా ఉంటుంది.
ప్రశ్న 10.
మీరు అధ్యయనం చేసిన వివిధ రకాల శుష్కఫలాలను ఉదాహరణలతో వర్ణించండి.
జవాబు:
అభివృద్ధి చెందిన తర్వాత, ఎండిపోయి లేదా కండరహితంగా ఉండే ఫలాలను శుష్కఫలాలు అంటారు. ఇవి 3 రకాలు.
1) శుష్కవిధారక ఫలాలు :
పక్వదశలో ఎండి, పగిలి విత్తనాలను విడుదల చేస్తాయి. ఉదా : చిక్కుడు, బఠాణీలలో ఫలాలు వృష్టోదర తలాలలో పగిలి రెండు భాగాలుగా విడిపోతాయి. వాటిని ద్వివిదారక ఫలాలు అంటారు. పత్తి దత్తూరలలో గుళిక అనేక విధాలుగా పగిలి విత్తనాలను విడుదల చేస్తుంది.
2) శుష్క అవిధారక ఫలాలు :
ఇవి ఒక విత్తనం మాత్రమే కలిగి, ఫలకవచం క్షీణించిన తర్వాత విత్తనాన్ని విడుదల చేస్తాయి.
ఉదా : a) వరిలో ఫలకవచము, బీజ కవచము సంయుక్తమై అంటాయి. దీనిని కవచబీజకము అంటారు.
b) జీడి మామిడిలో పెంకులాంటి ఫలకవచము కలిగి బహుఫలదళ సంయుక్త అండాశయం నుంచి ఏర్పడిన పెంకుగల ఫలం ఉంటుంది.
c) గడ్డి చేమంతిలో ఒక విత్తనం కల ‘సిప్సెలా’ ఫలము దీర్ఘకాలిక కేశగుచ్ఛము కలిగి ఉంటుంది.
c) బిదుర ఫలాలు : ఫలము అభివృద్ధి చెందిన తర్వాత ఒక విత్తనం కల ముక్కలుగా పగిలే ఫలాలు.
ఉదా : అకేసియా, ఆముదము
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వేరును నిర్వచించండి. వేరు వ్యవస్థలోగల రకాలను తెలపండి. వివిధ విధులను నిర్వర్తించడానికి వేరు ఏ విధంగా రూపాంతరం చెందిందో వివరించండి.
జవాబు:
పిండంలోని ప్రథమ మూలము నేరుగా సాగి మృత్తికలోకి ప్రాథమిక వేరుగా పెరుగుతుంది. ఆవృత బీజాలలో రెండు రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి.
అవి :
1. తల్లివేరు వ్యవస్థ
2. పీచువేరు వ్యవస్థ
1) తల్లివేరు వ్యవస్థ :
ప్రథమ మూలము నుండి ఏర్పడిన ప్రాథమిక వేరు మృత్తికలోనికి పెరిగి, ద్వితీయ, తృతీయలాంటి అనేక క్రమాల వేర్లను పార్శ్వంగా కలిగి తల్లివేరు వ్యవస్థగా మారుతుంది. ఇది ద్విదళ బీజ మొక్కలలో కనిపిస్తుంది.
2) పీచువేరు వ్యవస్థ :
ప్రథమ మూలము నుండి ఏర్పడిన తల్లివేరు స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అనేక సంఖ్యలో వేర్లు కాండము దిగువ భాగం నుంచి ఏర్పడతాయి. ఇది ఏకదళ బీజ మొక్కలలో కనిపిస్తుంది.
వేరు రూపాంతరాలు :
కొన్ని మొక్కలలో వేర్లు నీరు, ఖనిజలవణాల శోషణ, సరఫరా కాకుండా ఇతర విధులు నిర్వర్తించడానికి వాటి ఆకారం, నిర్మాణంలో మార్పు చెందుతాయి. వాటిని వేరు రూపాంతరాలు అంటారు. ఇవి
వివిధ రకాలు :
1) నిల్వవేర్లు :
క్యారట్, టర్నిప్లలో తల్లివేర్లు, చిలకడదుంపలలో అబ్బురపు వేర్లు. ఆస్పరాగస్ లో పీచువేర్లు ఆహార పదార్థములను నిల్వచేయుట వల్ల ఉబ్బుతాయి.
2) ఊడవేర్లు :
మర్రి వృక్షంలో శాఖల నుంచి అబ్బురపు వేర్లు ఏర్పడి, నేలలోకి పెరిగి క్రమంగా స్థంబాలవవె మారతాయి. వాటిని ఊడవేర్లు లేదా స్థంభాల వంటి వేర్లు అంటారు.
3) ఊతవేర్లు :
మొక్కజొన్న, చెరకులలో వేర్లు కాండము కింది కణుపుల నుండి ఏర్పడి, ఆధారాన్నిస్తాయి.
4) శ్వాసవేర్లు :
రైజోఫోరా, అవిసీనియా వంటి బురద ప్రాంతాలలో పెరిగే మాంగ్రూవ్లలో అనేక వేర్లు భూమిపైకి పెరిగి, శ్వాసక్రియకు అవసరమైన ఆక్సిజన్ పొందుటకు సహాయపడతాయి.
5) వృక్షోపజీవవేర్లు :
ఇతర మొక్కలపై పెరిగే వృక్షోపజీవులలో అబ్బురపు వేర్లు ఏర్పడి వాతావరణంలోని తేమను శోషిస్తాయి. వాటిని వెలమిన్ వేర్లు అంటారు.
6) పరాన్న జీవవేర్లు :
విస్కమ్, స్ట్రెగా వంటి మొక్కలలో (పాక్షిక పర్నాజీవులు) హాస్టోరియల్ అనేవేర్లు ఆతిథేయి దారువులోనికి ప్రవేశించి నీరు, ఖనిజలవణాలను శోషిస్తాయి. కస్క్యూట, రఫ్టీసియావంటి మొక్కలలో (సంపూర్ణ పరాన్నజీవులు) హస్టోరియల్ వేర్లు ఆతిథేయి దారువు, పోషక కణజాలములోనికి ప్రవేశించి, నీరు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలను శోషిస్తాయి.
7) బుడిపెలు కల వేర్లు :
ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కలో వాతావరణంలోని నత్రజనిని మొక్కలలో స్థాపించడానికి ‘రైజోబియమ్’ అనే బాక్టీరియమ్, వాటి వేరు వ్యవస్థలో నివాసం ఉంటూ బుడిపెలను ఏర్పరుస్తుంది.
8) కిరణజన్య సంయోగక్రియా వేర్లు :
టీనియోఫిల్లమ్ వంటి కొన్ని మొక్కలలో వేర్లు పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి.
ప్రశ్న 2.
వివిధ విధులను నిర్వర్తించడం కోసం కాండం ఏ విధంగా అనేక రకాలుగా రూపాంతం చెందిందో వివరించండి. [Mar. ’14]
జవాబు:
వివిధ విధులు నిర్వర్తించడానికి కాండము వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుంది. కొన్ని మొక్కలలో కాండము మృత్తికలోనికి పెరిగి ఆహార పదార్థములను నిల్వ చేయుటమే కాక, పెరుగుదలకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దీర్ఘకాలికత చూపుటకు, శాఖీయ వ్యాప్తికి తోడ్పడతాయి. వాటిని భూగర్భ కాండరూపాంతరాలు అంటారు.
ఉదా : బంగాళదుంపలో దుంపకాండము, అల్లంలో కొమ్ము, చేమ దుంపలో కందము, నీరుల్లిలో లశునము. కొన్ని మొక్కలలో వాయుగత కాండాలు అనేక రూపాంతరాలను చూపిస్తాయి. అవి
- దోస, గుమ్మడిలో గ్రీవపు మొగ్గల నుంచి, ద్రాక్షలో కొనమొగ్గనుంచి ఏర్పడే సున్నితమైన చుట్టుకుని ఉన్న నిర్మాణాలు ఏర్పడి, ఎగబాకుటలో తోడ్పడతాయి.
- కాండపు మొగ్గులు చేవదేరిన, నిటారు, మొనదేలిన ముళ్ళుగా మారి గడ్డితిని జంతువుల నుండి రక్షించుకుంటాయి.
- వర్షాభావ ప్రాంతాలలోని కొన్ని మొక్కలలో కాండాలు రూపాంతరం చెంది రసభరితమై బల్లపరుపుగా ఉండే (బ్రహ్మజెముడు) లేదా స్థూపాకారంగా (యుఫోర్బియ) లేదా సూదులవంటి (సరుగుడు) నిర్మాణాలుగా మారతాయి. వాటిలో పత్రాలు కంటకాలు లేక పొలుసులుగా రూపాంతరం చెంది భాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. కావున వాటి కాండాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. వాటిని పత్రాభాకాండాలు అంటారు. ఆస్పరాగస్ నిర్ణీత పెరుగుదల కల శాఖలు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. వాటిని క్లాడోఫిల్స్ అంటారు.
- కొన్ని మొక్కలలో (డయాస్కోరియా) లో శాకీయ మొగ్గలు, లేదా పూమొగ్గలు (అగేవ్) ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. అవి తల్లి మొక్కనుంచి విడిపోయినప్పుడు, నేలను తాకి అబ్బురపు వేర్లను ఏర్పరుచుకుని శాకీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి.
కొన్ని ఉపవాయుగత కాండాలలో శాకీయ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే నిర్మాణాలు ఏర్పడతాయి అవి :
1) రన్నర్లు :
కొన్ని గడ్డిమొక్కలు, ఆక్సాలిస్లో ఉపవాయుగత కాండాలు కొత్త ప్రదేశాలకు విస్తరించి, వృద్ధ బాగాలు నశించినపుడు కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. వాటిని రన్నర్లు అంటారు.
2) స్టోలన్లు :
నీరియమ్, మల్లెలులలో ప్రధాన అక్షం పీఠభాగం నుండి సున్నితమైన పార్శ్వశాఖలు ఏర్పడి వాయుగతంగా పెరిగిన తర్వాత, వంగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుచుకుని కొత్త మొక్కగా పెరుగుతాయి.
3) ఆఫ్సెట్లు :
పిస్టియా, ఐకార్నియా వంటి నీటి పై తేలేమొక్కలలో ఒక కణుపు. మధ్యమండల పార్శ్వశాఖ ఏర్పడుతుంది. ప్రతికణుపు వద్ద రోజెట్ క్రమంలో ఉండే పత్రాలను, చక్రాభ కాండం పీఠభాగం నుంచి ఏర్పడిన సంతులనంజరిపే వేర్లను కలిగి ఉంటుంది.
4) సక్కర్లు :
అరటి, అనాసలలో ప్రధాన అక్షం పీఠభాగము భూగర్భ కాండాల నుండి పార్శ్వశాఖలు ఏర్పడి, కొంతవరకు నేలలో సమాంతరంగా పెరిగి తర్వాత ఏటవాలుగా భూమిపైకి వచ్చి పత్రయుత శాఖలను ఏర్పరుస్తాయి. వీటిని పిలకమొక్కలు అంటారు.
ప్రశ్న 3.
వివిధ రకాల మధ్యాభిసార పుష్పవిన్యాసాలను వివరించండి.
జవాబు:
మధ్యాభిసార పుష్పవిన్యాసములో అనేకరకములు కలవు అవి :
1) మధ్యాభిసార :
పుష్పవిస్యాస అక్షము శాఖారహితంగా లేదా శాఖాయుతంగా సరళంగా ఉండి, అనేక వృంతసహిత పుచ్చసహిత పుష్పాలను అగ్రాభిసార క్రమంలో కల్గి ఉంటుంది.
ఉదా : జనుము, మామిడి
2) సమశిఖి :
పుష్పవిన్యాసఅక్షం పొడవుగా అనేక పుష్పాలను అగ్రాభిసార క్రమంలో ఏర్పడుస్తుంది. పుష్పాలు వివిధ – కణుపుల వద్ద ఏర్పడినప్పటికి, పుష్పవృంతాలు వేర్వేరు పొడవుల్లో ఉండుటవల్ల, పుష్పాలన్నీ ఒకే ఎత్తులో అమరి ఉంటాయి.
ఉదా : కాసియా, కాలిఫ్లవర్
3) గుచ్చము :
పుష్పవిన్యాస అక్షం కొనభాగంలో పుష్పాలన్ని ఒకే స్థానం నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తాయి. ఇవి పరిచక్రపూచ్ఛావః అనే పుచ్చాల వలయంచే కప్పబడి ఉంటుంది.
ఉదా : నీరుల్లి, కారట్ (ఏపియేసి)
4) కంకి :
పుష్పవిన్యాస అక్షం పై అనేక వృంతరహిత పుష్పాలు అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి.
ఉదా : ఉత్తరేణి, గడ్డి (పోయేసి)
5) స్పాడిక్స్ :
పుష్ప విన్యాసం, మట్టి అనే పుష్పపుచ్చ రూపాంతరంతో రక్షించబడుతూ, వృంతరహిత, ఏకలింగక, వంధ్య పుష్పాలను అగ్రాభిసార క్రమంలో కలిగి ఉంటుంది.
ఉదా : అరటి, కొబ్బరి
6) శీర్షవత్ పుష్పవిన్యాసము :
కుచించుకు పోయిన పుష్పవిన్యాస అక్షంపై ఏకలింగక, ద్విలింగక, వృంతరహిత పుష్పాలు కేంద్రాభిసారంగా వృద్ధి చెందుతాయి.
ఉదా : గడ్డి చేమంతి, పొద్దుతిరుగుడు.
Intext Question and Answers
ప్రశ్న 1.
ఏ మొక్కలోని భూగర్భ కాండము, మృత్తికలో భూమికి సమాంతరంగా పెరుగుతూ దీర్ఘకాలికంగా జీవించడానికి తోడ్పడుతుంది?
జవాబు:
అల్లం – జింజిబర్ అఫీషినాలిస్
ప్రశ్న 2.
సూదుల వంటి పత్రాభకాండాలు ఏ మొక్కలో ఉంటాయి?
జవాబు:
సరుగుడు (కాజురైనా)
ప్రశ్న 3.
నెఫంథిస్ వంటి మొక్కలు ఎందుకు కీటకాలను బంధిస్తాయి?
జవాబు:
నత్రజని – కొరకు
ప్రశ్న 4.
ఆస్టరేసి కుటుంబపు మొక్కలలో గల స్వాభావిక పుష్పవిన్యాసాన్ని తెలపండి?
జవాబు:
శీర్షవత్ విన్యాసము
ప్రశ్న 5.
తన పుష్పవిన్యాసంలో అతి తక్కువ సంఖ్యలో పుష్పాలను కలిగిన ఒక మొక్క పేరు తెలపగలరా?
జవాబు:
మందార (హైబిస్కస్ రోజా సైనెన్సిస్)
ప్రశ్న 6.
ఏ కుటుంబంలో నగ్న పుష్పాలు కనిపిస్తాయి?
జవాబు:
యుఫోర్బియేసి – సయాథియమ్
ప్రశ్న 7.
మర్రి వృక్షాలలోని ఏ పుష్పాలలో బ్లాస్టోఫాగా కీటకం గుడ్లు పెడుతుంది?
జవాబు:
గాల్ పుష్పాలలో
ప్రశ్న 8.
కెన్నా పుష్పాలు ఏ రకం సౌష్ఠవాన్ని చూపిస్తాయి?
జవాబు:
సౌష్టవ రహితము
ప్రశ్న 9.
బఠానీ పుష్పాల్లో ద్రోణి ఆకర్షణ పత్రాలు పుష్పానికి ఎటువైపు ఉంటాయి?
జవాబు:
పూర్వాంతంలో
ప్రశ్న 10.
చిక్నైన పుష్పరచనలో ఆకర్షణపత్రాలు కప్పిన అంచులకు, కప్పబడిన అంచులకు గల నిష్పత్తి ఎంత?
జవాబు:
5 : 4
ప్రశ్న 11.
పీఠ అండాన్యాసంలో ఎన్ని అండాలు అతుక్కొని ఉంటాయి?
జవాబు:
1
ప్రశ్న 12.
జీడిమామిడి మొక్కలో ఏ పుష్పభాగం అనృత ఫలాన్ని ఏర్పరుస్తుంది?
జవాబు:
పుష్పవృంతం
ప్రశ్న 13.
ఏ మొక్క గట్టి టెంకులాగా ఉండే అంతః ఫలకవచము, రసభరిత, తినే మృధ్య, ఫలకకవచాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
మామిడి
ప్రశ్న 14.
స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో ‘మట్టి’ స్వరూపం?
జవాబు:
పుష్ప పుచ్చ రూపాంతరము
ప్రశ్న 15.
ఒకే పుష్పంలోని అసంయుక్త అండాశయం నుంచి వృద్ధి చెందే ఫలం ఏ రకానికి చెందుతుంది?
జవాబు:
సంకలిత ఫలము