Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 5th Lesson కేంద్ర న్యాయశాఖ Textbook Questions and Answers.
AP Inter 2nd Year Civics Study Material 5th Lesson కేంద్ర న్యాయశాఖ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భారత సుప్రీంకోర్టు పై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు:
భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. మన పరిపాలనలో సుప్రీంకోర్టు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణచేసి, వారికి న్యాయం చేయడం దీని కర్తవ్యం. ప్రజల హక్కులు కాపాడటం, భారత సమాఖ్య వ్యవస్థను రక్షించడం, రాజ్యాంగాన్ని రక్షించి, శాసనాలను వ్యాఖ్యానించడం వంటి అత్యంత ముఖ్యమైన బాధ్యతలను సుప్రీంకోర్టు నెరవేరుస్తుంది. “ప్రపంచంలోని ఏ దేశపు సుప్రీంకోర్టుకు లేని అధికారాలు భారత సుప్రీంకోర్డుకు ఉన్నాయి” అని ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిర్మాణ సభ్యుడు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అభిప్రాయం. సుప్రీంకోర్టును 1950 జనవరి 26న దేశ రాజధాని కొత్తఢిల్లీలో నెలకొల్పడం జరిగింది.
నిర్మాణం: ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గాక, 30 మంది ఇతర న్యామూర్తులు ఉన్నారు. అర్హతలు: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తికి ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- ఏదైనా ఒకటి లేదా అంతకుమించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం అయిదేళ్ళపాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
- ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం పదేళ్ళపాటు న్యాయవాదిగా వ్యవహరించి ఉండాలి.
- రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయకోవిదుడై ఉండాలి.
నియామకం: ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను భారతరాష్ట్రపతి నియమిస్తారు.
జీత, భత్యములు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.1,00,000/-, ఇతర న్యాయమూర్తులకు ఒక్కొక్కరికి రూ. 90,000/- వేతనంగా లభిస్తుంది.
వేతనంతోపాటు వారికి ఉచిత నివాసగృహం, కార్యాలయం, టెలిఫోన్ సదుపాయాలు మొదలగునవి కల్పిస్తారు. వారి వేతనాన్ని భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. దానిపై పార్లమెంట్కు అదుపు లేదు.
ప్రమాణ స్వీకారం: న్యాయమూర్తులు తాము నిష్పక్షపాతంగా, నిర్భయంగా, అవినీతికి లోనుగాకుండా, విధి నిర్వహణ చేస్తామని, రాజ్యాంగాన్ని కాపాడతామని రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.
పదవీకాలం: న్యాయమూర్తులు 65 సం॥ల వయస్సు వచ్చేవరకు పదవిలో ఉంటారు. పదవీ విరమణ తరువాత వారు ఆదాయాన్నిచ్చే ప్రభుత్వోద్యోగం చేయరాదు.
అభిశంసన: సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పార్లమెంట్ అభిశంసన ద్వారా రాష్ట్రపతి పదవి నుండి తొలగిస్తారు. అవినీతి, దుష్ప్రవర్తన, అసమర్థత, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలుంటే, పార్లమెంట్ ఉభయసభలు వేర్వేరుగా మొత్తం సభ్యులలో సగం మంది కంటే ఎక్కువమంది హాజరై, ఓటు చేసిన వారందరిలో 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదిస్తే న్యాయమూర్తులను తొలగించవచ్చు.
అధికారాలు: సుప్రీంకోర్టుకు ఈ దిగువ అధికారాలున్నాయి.
1. సహజ అధికారాలు లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (Original Jurisdiction): వివాదాలను ముందుగా విని, నిర్ణయించే అధికారాన్ని ప్రారంభ అధికార పరిధి అంటారు. ఈ అధికారం ప్రకారం కొన్ని రకాల వివాదాలను క్రింది కోర్టులకు తీసుకెళ్ళకుండా నేరుగా సుప్రీంకోర్టు నిర్ణయానికి తీసుకెళ్ళవచ్చు. ఈ క్రింది పేర్కొన్న వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి. అవి:
- కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు.
- కేంద్రప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు, వేరొక వైపు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు,
- రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలు.
- సుప్రీంకోర్టు భారత సమాఖ్యను రక్షిస్తుంది.
- శాసనాలను వ్యాఖ్యానిస్తుంది.
- ప్రాథమిక హక్కుల రక్షణ కొరకై హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో వంటి రిట్లను జారీచేస్తుంది.
2) అప్పీళ్ళ విచారణాధికారం (Appelate Power) భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:
- రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు
- సివిల్ అప్పీళ్ళు
- క్రిమినల్ అప్పీళ్ళు
- స్పెషల్ అప్పీళ్ళు.
3) సలహారూపక అధికార పరిధి (Advisory Function): రాష్ట్రపతి ఏదైనా విషయంలో న్యాయసంబంధమైన వివాదముందని భావించినప్పుడు సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. అటువంటి సందర్భాలలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాను ఇచ్చును. ఆ సలహా రాష్ట్రపతి పాటించాలనే నియమం లేదు. 1978లో రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగెను.
4) కోర్ట్ ఆఫ్ రికార్డు (Court of Record): అనేక వివాదాలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం జరుగుతుంది. అవి ఇతర కోర్టులకు, న్యాయవాదులకు మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి.
5) న్యాయ సమీక్షాధికారం (Judicial Review): భారత సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం కలదు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, చట్టాలకు అర్థవివరణ ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే చెల్లనేరవని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు కలదు. దీనిని న్యాయ సమీక్ష అంటారు.
6) తీర్పుల పునఃపరిశీలన (Reconsideration of Judgement): సుప్రీంకోర్టుకు గతంలో తాను ప్రకటించిన తీర్పులను పునఃపరిశీలించి, వాటిని ఆమోదించడానికి, తిరస్కరించడానికి అధికారం ఉంది. ఉదా: గోలక్నాథ్ – పంజాబ్ రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాదం విషయంలో సుప్రీంకోర్టు 1967లో తీర్పు చెబుతూ. భారత పౌరుల ప్రాథమిక హక్కులతో సహా ఏ రాజ్యాంగపరమైన అంశాన్నైనా సవరించేందుకు పార్లమెంటుకు అధికారం లేదని పేర్కొన్నది.
7) ఇతర అధికారాలు (Other Powers):
- సుప్రీంకోర్టు పనిచేయటానికి కావలసిన నియమావళి న్యాయమూర్తులే నిర్ణయిస్తారు.
- కోర్టు సిబ్బందిని నియమిస్తారు, సిబ్బందిని అదుపు చేస్తారు.
- కోర్టు ధిక్కరణ నేరం క్రింద ఏ వ్యక్తినైననూ శిక్షించవచ్చు.
సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి: సుప్రీంకోర్టు స్వతంత్రంగా వ్యవహరించటానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. న్యాయమూర్తులకు ఉద్యోగ భద్రత, కార్యనిర్వాహకశాఖ నుండి న్యాయశాఖ వేరుచేయబడటం, న్యాయశాస్త్ర ప్రవీణులు న్యాయమూర్తులుగా నియమింపబడటం, వారికి మంచి వేతనాలుండటం వంటి పరిస్థితులున్నాయి. అయినా భారత సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు అంత శక్తివంతమైనది కాదని ఒక అభిప్రాయం కలదు.
ప్రశ్న 2.
భారత సుప్రీంకోర్టు అధికారాలు, విధులను రాయండి.
జవాబు:
భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. మన పరిపాలనలో సుప్రీంకోర్టు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణచేసి, వారికి న్యాయం చేయడం దీని కర్తవ్యం. ప్రజల హక్కులు కాపాడటం, భారత సమాఖ్య వ్యవస్థను రక్షించడం, రాజ్యాంగాన్ని రక్షించి, శాసనాలను వ్యాఖ్యానించడం వంటి అత్యంత ముఖ్యమైన
బాధ్యతలను సుప్రీంకోర్టు నెరవేరుస్తుంది. “ప్రపంచంలోని ఏ దేశపు సుప్రీంకోర్టుకు లేని అధికారాలు భారత సుప్రీంకోర్టుకు “ఉన్నాయి” అని ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిర్మాణ సభ్యుడు శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అభిప్రాయం. సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో కలదు.
నిర్మాణం: ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగాక, 30 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అధికారాలు: సుప్రీంకోర్టుకు ఈ దిగువ అధికారాలున్నాయి.
1) సహజ అధికారాలు లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (Original Jurisdiction): వివాదాలను ముందుగా విని, నిర్ణయించే అధికారాన్ని ప్రారంభ అధికార పరిధి అంటారు. ఈ అధికారం ప్రకారం కొన్ని రకాల వివాదాలను క్రింది కోర్టులకు తీసుకెళ్ళకుండా నేరుగా సుప్రీంకోర్టు నిర్ణయానికి తీసుకెళ్ళవచ్చు. ఈ క్రింది పేర్కొన్న వివాదాలు సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి. అవి.
- కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు.
- కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపు, వేరొక వైపు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు,
- రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలు.
- సుప్రీంకోర్టు భారత సమాఖ్యను రక్షిస్తుంది.
- శాసనాలను వ్యాఖ్యానిస్తుంది.
- ప్రాథమిక హక్కుల రక్షణకై హెబియన్ కార్పస్, మాండమస్, కోవారెంటో వంటి రిట్లను జారీ చేస్తుంది.
2) అప్పీళ్ళ విచారణాధికారం (Appelate Power): భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి. అవి:
- రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు
- సివిల్ అప్పీళ్ళు
- క్రిమినల్ అప్పీళ్ళు
- స్పెషల్ అప్పీళ్ళు.
3) సలహారూపక అధికార పరిధి (Advisory Function): రాష్ట్రపతి ఏదైనా విషయంలో న్యాయసంబంధమైన వివాదముందని భావించినప్పుడు సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. అటువంటి సందర్భాలలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాను ఇచ్చును. ఆ సలహా రాష్ట్రపతి పాటించాలనే నియమం లేదు. 1978లో రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి, 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగెను.
4) కోర్ట్ ఆఫ్ రికార్డు (Court of Record): అనేక వివాదాలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం జరుగుతుంది. అవి ఇతర కోర్టులకు, న్యాయవాదులకు మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి.
5) న్యాయ సమీక్షాధికారం (Judicial Review) భారత సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం కలదు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, చట్టాలకు అర్థవివరణ ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే చెల్లనేరవని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు కలదు. దీనిని న్యాయ సమీక్ష అంటారు.
6) తీర్పుల పునఃపరిశీలన (Reconsideration of Judgement): సుప్రీంకోర్టుకు గతంలో తాను ప్రకటించిన తీర్పులను పునఃపరిశీలించి, వాటిని ఆమోదించడానికి, తిరస్కరించడానికి అధికారం ఉంది. ఉదా: గోలక్నాథ్- పంజాబ్ రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాదం విషయంలో సుప్రీంకోర్టు 1967లో తీర్పు చెబుతూ, భారత పౌరుల ప్రాథమిక హక్కులతో సహా ఏ రాజ్యాంగపరమైన అంశాన్నైనా సవరించేందుకు పార్లమెంటుకు అధికారం లేదని పేర్కొన్నది.
7) ఇతర అధికారాలు (Other Powers):
- సుప్రీంకోర్టు పనిచేయటానికి కావలసిన నియమావళి న్యాయమూర్తులే నిర్ణయిస్తారు.
- కోర్టు సిబ్బందిని నియమిస్తారు, సిబ్బందిని అదుపు చేస్తారు.
- కోర్టు ధిక్కరణ నేరం క్రింద ఏ వ్యక్తినైననూ శిక్షించవచ్చు.
- రాజ్యాంగ సూత్రాల అంతిమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.
- దేశంలోని న్యాయస్థానాలలో రికార్డుల నిర్వహణ, న్యాయవాదుల ప్రాక్టీస్కు సంబంధించిన నియమాలను రూపొందిస్తుంది.
- కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భారత రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.
ప్రశ్న 3.
న్యాయ సమీక్షను వర్ణించండి.
జవాబు:
సుప్రీంకోర్టు అధికారాలన్నింటిలో న్యాయ సమీక్ష అత్యంత ముఖ్యమైనది. రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిలబెట్టడమే న్యాయసమీక్ష ఉద్దేశ్యం. రాజ్యాంగంలో న్యాయసమీక్ష గురించి ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు. భారత రాజ్యాంగ లిఖిత స్వభావాన్ని, భారతదేశ సమాఖ్య లక్షణాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా రాజ్యాంగం నుండి ఈ న్యాయ సమీక్ష భావనను గ్రహించారు. శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్యాహక వర్గం చేపట్టిన చర్యలు రాజ్యాంగ బద్దంగా ఉన్నాయా ? లేదా ? అని సమీక్షించడానికి న్యాయస్థానాలకు గల అధికారాన్ని ‘న్యాయసమీక్ష’ అంటారు. ఒక వేళ శాసన సభ చట్టాలు, కార్యనిర్వహక వర్గం నిర్ణయాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని లోపభూయిష్టం, చెల్లుబాటుకావు. అని ప్రకటించవచ్చు. “శాసన నిర్మాణ. చట్టంలోని రాజ్యాంగ భద్రతను పరిశీలించి, నిర్ణయించి, ప్రకటించే సామర్థ్యాన్ని న్యాయస్థానానికి వుండటాన్ని న్యాయ సమీక్షగా ఎమ్.వి. పైలీ పేర్కొన్నాడు.
ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాలు లోపభూయిష్టమైనవి 13వ ప్రకరణం తెలియజేస్తుంది. కాబట్టి పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షకునిగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలను, నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమైనవనీ, అవి చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. అంతేకాక కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా సుప్రీం కోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగం చేసిన అధికారాల పంపిణీకి భిన్నంగా ఉన్న ఏ శాసనాన్నైనా, కార్యనిర్వాహక వర్గ చర్యనైనా తన న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి సమీక్షిస్తుంది.
క్రింది అంశాలను గమనించినట్లయితే సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం అనివార్యమని తెలుస్తుంది. ఎ. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు బి. సమాఖ్య విధానంలో అధికారాల పంపిణీకి విఘాతం కలిగినప్పుడు. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాలు క్రింది వాటికి కూడా విస్తరించాయి.
- కేంద్ర, రాష్ట్ర శాసన సభలు రూపొందించిన శాసనాలకు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక చర్యలకు.
- ప్రభుత్వరంగ సంస్థల నిర్ణయాలకు.
- రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాలను.
సుప్రీంకోర్టు మొదటిసారిగా 1950లో న్యాయసమీక్ష అధికారాన్ని ఉపయోగించి నివారక నిర్భంద (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం, 14వ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది.
భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ చట్టాల జాబిత్యాన్ని నిర్ణయించే అధికారాన్ని వినియోగించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి చెందింది. ఏదేమైనప్పటికి ఈ క్రింది అంశాల వలన న్యాయసమీక్ష అవసరం తప్పనిసరని చెప్పవచ్చును.
- రాజ్యాంగ ఔన్నత్యాన్ని సమర్థించి నిలబెట్టడం
- సమాఖ్య వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటం
- పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం
పై వాటితోబాటుగా న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ పరిరక్షకురాలి హోదాలో సుప్రీంకోర్టుకు సంక్రమించిన అధికారంగా పేర్కొనవచ్చు. దాంతో రాజ్యాంగ అంతిమ వ్యాఖ్యాతగా సుప్రీంకోర్టు న్యాయసమీక్షాధికారం రాజ్యాంగంలోని అన్ని అంశాల పరిశీలనకు విస్తరించింది.
ప్రశ్న 4.
న్యాయశాఖ క్రియాశీలత అనగానేమి ? అందులోని గుణాలు, దోషాలు ఏవి ?
జవాబు:
న్యాయశాఖ క్రియాశీలతను కార్యనిర్వహకశాఖ, శాసన నిర్మాణశాఖల అధికార పరిధిలో జోక్యం చేసుకోవడానికి న్యాయవ్యవస్థ చూపే అత్యుత్సాహంగా భావిస్తారు. వాస్తవానికి న్యాయ వ్యవస్థ సాధారణ కార్యక్రమాలు, చర్యలకంటే న్యాయశాఖ క్రియాశీలత భిన్నమైనది కాదు. సాధారణ పరిభాషలో ‘క్రియాశీలత’ అంటే ‘చురుకుగా ఉండడం’ ‘నిర్ణయాలలో చర్యలు కొనసాగించడం’ ‘క్రియాశీలుడు’ అంటే ‘తన విధి పట్ల అత్యంత ఆసక్తి చూపేవాడు’. ఈ అర్థంలో ప్రతి న్యాయమూర్తి ఒక క్రియాశీలుడే. “ప్రతి న్యాయమూర్తి క్రియాశీలకంగా వుంటూ పురోగమన ధృక్పథంతో గాని లేదా మరొక విధంగా గాని తన విధులను నిర్వహిస్తాడ”ని జస్టిస్. కృష్ణయ్యర్ పేర్కొన్నాడు.
న్యాయవ్యవస్థ ఇంతవరకు తన ముందుకు వచ్చిన వివాదాలపట్ల మాత్రమే స్పందించే సాంప్రదాయ పద్ధతులను విడనాడి వార్తా పత్రికలలో వచ్చిన సమాచారం, పోస్ట్ ద్వారా అందే ఫిర్యాదుల పట్ల స్వయంగా స్పందించి అయా ఆంశాలను తనకు తాను (suo-moto) గా విచారణాంశాలుగా స్వీకరించి బాధితులకు సరియైన న్యాయం అందేటట్లు చర్యలు తీసుకోవడం ప్రారంభించినది. అయితే న్యాయశాఖ క్రియాశీలత ద్వారా చేపట్టిన వివాదాలలో అధిక భాగం ప్రజాప్రయోజన వాజ్యాల (PIL) ద్వారా అందినవే. మొత్తం మీద ప్రజారోగ్యం, బాలకార్మిక వ్యవస్థ, పర్యావరణం,. అవినీతి వంటి అనేక అంశాలపై దాఖలయ్యే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు న్యాయశాఖ క్రియాశీలతను పెంచాయి. మొత్తం మీద న్యాయశాఖ అనేది న్యాయ వ్యవహారాలలో క్రియాశీలత అత్యంత ప్రజాధరణ పొందిన ప్రక్రియగా వర్ణించబడింది.
న్యాయశాఖ క్రియాశీలత – గుణాలు లేదా ప్రయోజనాలు:
- కేవలం వ్యక్తులకే పరిమితం కాకుండా, సమూహాలకు, న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యీకరించబడింది.
- అది కార్యనిర్వాహకవర్గం యొక్క జవాబుదారీతనాన్ని పటిష్ఠ పరచినది.
- ఎన్నికల వ్యవస్థను మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా మార్చడానికి న్యాయక్రియాశీలత ప్రయత్నిస్తుంది.
- ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కోర్టు ఆదేశాన్ని అనుసరించి తమ ఆస్తులు, ఆదాయం, విద్యార్హతలు, నేరచరిత్ర వంటి అంశాలతో కూడిన అఫిడవిట్ (Affidavit) ను సమర్పిస్తున్నారు. దీని ద్వారా ఉత్తమ ప్రతినిధిని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించింది.
న్యాయశాఖ క్రియాశీలత – దోషాలు లేదా నష్టాలు:
- శాసన, కార్యనిర్వాహకశాఖకు, న్యాయశాఖకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించింది.
- ప్రభుత్వంలోని మూడు అంగాల మధ్య సమతుల్యతను సంబంధాలను ఈ భావన దెబ్బతీసిందని కొందరు భావించారు.
- ప్రభుత్వ అంగాలలో ప్రతి ఒక్కటీ ఇతర అంగాల అధికారాలను, పరిధిని గౌరవించాలన్న సూత్రంపైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. న్యాయక్రియాశీలత ఈ ప్రజాస్వామ్య సూత్రంను వక్రీకరించి నష్టపరచింది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సుప్రీంకోర్టు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
రాజ్యాంగంలోని 124వ నిబంధన సుప్రీంకోర్టు నిర్మాణం గురించి పేర్కొన్నది.
సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశం 1950 జనవరి 28వ తేదీన పార్లమెంటు భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్లో జరిగింది. పూర్వ ఫెడరల్ కోర్టు చివరి ప్రధానన్యాయమూర్తిగానూ, సుప్రీంకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తిగాను హరిలాల్ జె. కానియా వ్యవహరించాడు.
సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి పార్లమెంటు చట్టం నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉన్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇతన న్యాయమూర్తులు ఉన్నారు. కొన్ని సందర్భాలలో మరికొంత మంది తాత్కాలిక న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు తాత్కాలిక ప్రాతిపదకన నియమించబడతారు.
అన్ని సాధారణ వివాదాలను ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తుంది. రాజ్యాంగ అంశాలు ఇమిడి ఉన్న వివాదాలను ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరిస్తుంది. ప్రత్యేక వివాదాలను విచారించడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తారు.
ప్రశ్న 2.
సుప్రీంకోర్టు యొక్క రెండు అధికార పరిధులను తెలపండి.
జవాబు:
సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. దాని తీర్పులు, నిర్ణయాలు అంతిమమైనవి. వాటిని మార్పుచేయడానికి లేదా సవరించడానికి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉంది. సుప్రీంకోర్టుకు క్రింద అధికార విధులు ఉన్నాయి. అవి:
1) అప్పీళ్ళ విచారణాధికారం భారతదేశంలోని సుప్రీంకోర్టు అత్యున్నతమైనది. హైకోర్టులిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకు కేసును పునర్విచారణ చేయమని అప్పీలు చేసుకోవచ్చు. అప్పీళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి అవి: 1) రాజ్యాంగ సంబంధమైన అప్పీళ్ళు 2) సివిల్ అప్పీళ్ళు 3) క్రిమినల్ అప్పీళ్ళు 4) స్పెషల్ అప్పీళ్ళు. ఈ అప్పీళ్ళలో మొదటి మూడు విధాలైన వాటిలో హైకోర్టు సర్టిఫికేట్ ఇస్తే అప్పీల్ చేసుకోవచ్చు. 4వ దానికి సంబంధించిన అప్పీల్స్ను హైకోర్టు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ కేసుపై చేసిన అప్పీళ్ళను సుప్రీంకోర్టు స్వీకరించవచ్చు.
2) కోర్ట్ ఆఫ్ రికార్డు: రాజ్యాంగంలోని 141వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు రికార్డులను భద్రపరిచే కోర్టుగా వ్యవహరిస్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరించే సుప్రీంకోర్టు, కోర్టు ధిక్కార నేరానికి పాల్పడే వ్యక్తులను దోషులుగా ప్రకటించి నిందుతులుగా నిలబెట్టవచ్చు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం హోదాలో సుప్రీంకోర్టు తాను వివిధ వివాదాలను పరిష్కరించడంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు, తీర్పులు, ఇతర న్యాయసమాచార అంశాలన్నింటిని రికార్డు రూపంలో నమోదుచేసి భద్రపరుస్తుంది. భవిష్యత్తులో అదే రకమైన వివాదాలను పరిష్కరించడానికి దేశంలో అన్ని న్యాయస్థానాలకు అవి దిక్సూచిగానూ, మార్గదర్శకంగానూ, నమూనాగానూ ఉంటాయి.
ప్రశ్న 3.
సుప్రీంకోర్టు విచారణ అధికారాలు ఏవి ?
జవాబు:
భారతదేశంలో అంతిమ అప్పీళ్ళ న్యాయస్థానంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టుకు గల అప్పీళ్ళ విచారణ పరిధిని మూడు శీర్షికల క్రింద విభజించవచ్చు. అవి:
- రాజ్యాంగ వ్యాఖ్యానంతో ముడిపడి ఉన్న వివాదాలు.
- సివిల్ వివాదాలు.
- క్రిమినల్ వివాదాలు.
రాజ్యాంగ వ్యాఖ్యానానికి సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్న వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది. అటువంటి కేసుల విచారణకు హైకోర్టు ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో రాజ్యాంగ వివరణకు సంబంధించిన అంశాలున్నాయని భావించిన వివాదాలను సుప్రీంకోర్టు స్వయంగా విచారిస్తుంది.
రాజ్యాంగ వ్యాఖ్యానంతో సంబంధంలేని వివాదాలను హైకోర్టు ధ్రువీకరణ పత్రం ప్రాతిపదికపై సుప్రీంకోర్టు విచారణను స్వీకరిస్తుంది. అటువంటి వివాదాల విషయంలో చట్టానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు నిర్ణయం తప్పనిసరిగా అవసరం అని హైకోర్టు భావించాలి.
క్రిమినల్ వివాదాల విషయంలో, హైకోర్టు ప్రకటించిన తీర్పు, తుది ఆదేశం లేదా శిక్షలపై వచ్చే అప్పీళ్ళను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. ఈ రకమైన అప్పీళ్ళు రెండు రకాలు. అవి: 1) క్రింది న్యాయస్థానాలు ప్రకటించిన తీర్పులపై వచ్చిన అప్పీళ్ళను స్వీకరించి, క్రింది న్యాయస్థానాలు విముక్తి చేసిన నిందితునిపై తీర్పుకు వ్యతిరేకంగా మరణశిక్షను ప్రకటించడం 2) క్రింది న్యాయస్థానాల తీర్పులపై వచ్చే అప్పీళ్ళ విచారణను ప్రారంభించి, పునస్సమీక్షించి నిందితునికి మరణశిక్షను ఖరారు చేయడం.
హైకోర్టు ఇచ్చిన తీర్పుల పట్ల అసంతృప్తులైన వ్యక్తుల ప్రార్థనపై వారి వివాదం సుప్రీంకోర్టు పరిశీలించేందుకు అర్హలైందని హైకోర్టు పేర్కొన్న పక్షంలో, సుప్రీంకోర్టు అటువంటి వివాదాల విచారణకు ప్రత్యేక అనుమతిని మంజూరు చేస్తుంది. 136వ అధికరణం ప్రకారం సాధారణ చట్టం పరిధికి వెలుపల ఉండే వివాదాలను కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది.
ప్రశ్న 4.
సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికార పరిధిని వివరించండి.
జవాబు:
ఏదైనా చట్ట సంబంధ విషయంలో లేదా ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశాలపై తన అభిప్రాయం తెలుపవలసినదిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరవచ్చు. ఆ అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. రాజ్యాంగం అమలులోకి రాక పూర్వం కుదుర్చుకోబడిన ఒప్పందాలు, సంధులకు సంబంధించిన వివాదాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. ఈ వివాదాలు రాజ్యాంగం 131వ ప్రకరణ నుంచి మినహాయింపబడినవి.
అయితే రాష్ట్రపతి కోరిన అంశాలపై సుప్రీంకోర్టు తప్పనిసరిగా సలహా ఇవ్వాలనిగానీ, సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని, సలహాను రాష్ట్రపతి విధిగా పాటించాలని గానీ నియమం ఏమిలేదు. అది వారి వివేచనకు వదిలివేయబడుతుంది. 1978లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిలో జరిగిన అధికార దుర్వినియోగంపై విచారణ జరపడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సుప్రీంకోర్టును సలహా అడగటం జరిగింది. గతంలో కూడా ఆ విధంగా జరిగింది. యు.పి.యస్.సి. అధ్యక్షునిగా లేదా సభ్యులను అవినీతి, అక్రమాల ఆరోపణలపై నిర్బంధంగా పదవీ విరమణ చేయించదలిస్తే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. సుప్రీంకోర్టు సలహాలకు ప్రాధాన్యత ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియాలలో ఈ అధికారం లేదు.
ప్రశ్న 5.
రిట్ అధికార పరిధి గురించి రాయండి.
జవాబు:
రిట్ అనే పదానికి అర్థం ‘వ్రాతపూర్వక ఆదేశం’. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ పౌరుల ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి రిట్లను జారీ చేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చింది. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన వ్యక్తి వాటి పరిరక్షణకై సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కుల భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగ పరిహారంలో భాగంగా సుప్రీంకోర్టు 32వ ప్రకరణ ప్రకారం హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరరీ, కోవారెంటో వంటి రిట్లను ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు జారీ చేస్తుంది.
1) హెబియస్ కార్పస్: హెబియస్ కార్పస్ అనగా ‘వ్యక్తి శరీరాన్ని ప్రవేశపెట్టదు’ అని అర్థం. చట్ట వ్యతిరేకంగా నిర్బంధానికి గురైన వ్యక్తికి బంధ విముక్తి కలిగించడానికి ఈ రిట్ మంజూరు చేస్తారు. అక్రమంగా నిర్బంధించబడిన వ్యక్తిని కోర్టు ఎదుట హాజరుపరచండి అని సంబంధిత అధికారిని ఆదేశించడానికి హెబియస్ కార్పస్ రిట్ను సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఆ ఆధికారి ఈ అదేశాన్ని పాటించనట్లయితే కోర్టు ధిక్కారనేరం క్రింద శిక్షార్హుడవు.
2) మాండమస్: మాండమస్ అనగా ‘మేము ఆజ్ఞాపిస్తున్నాము’ అని అర్థం. ఎవరైనా ప్రభుత్వ అధికారి, విధి నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు ఆ విధిని సక్రమంగా నిర్వర్తించమని ఆజ్ఞాపిస్తూ సుప్రీంకోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఈ రిట్ను జారీ చేయబడదు.
3) ప్రొహిబిషన్: ‘నిషేదించుట’ అని దీని అర్థం. ఈ రిట్ను సుప్రీంకోర్టు క్రింది కోర్టులకు జారీ చేస్తుంది. ఏదైనా కేసు విచారణలో క్రింది కోర్టులు లేని అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించకుండా నిరోధించడానికి ఈరిట్ను జారీ చేస్తారు. దీనిని న్యాయ సంబంధిత సంస్థలకు మాత్రమే జారీచేస్తారు.
4) సెర్షియరరీ లాటిన్ లో దీని అర్థం ‘ధృవీకరించబడాలి’ లేదా ‘తెలియజేయుట’. క్రింది కోర్టులు వాటి పరిధిని అతిక్రమించి, వ్యవహరించినప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఈ రిట్ను జారీచేస్తాయి.
5) కో-వారెంటో: ‘ఏ అధికారంతో’ అని దీని అర్థం. ఒక వ్యక్తి తనకు అర్హత, అధికారం లేకపోయినా అధికార పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ ఈ రిట్ను జారీచేస్తారు. ఏ అధికారంతో ఆ పదవి చేపట్టారో తెలియజేయమని సదరు వ్యక్తిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఈ రిట్లు జారీ చేస్తుంది. ఈ రిట్ను ప్రైవేట్ సంస్థలకు జారీచేయబడదు. వీటితోపాటుగా పౌరుల హక్కుల పరిరక్షణ కొరకు కొన్ని యంత్రాంగాలను ఏర్పాటుచేసారు. అవి జాతీయ మహిళా సంఘం, జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం మొదలైనవి.
ప్రశ్న 6.
భారతదేశంలో న్యాయశాఖ క్రియాశీలత గురించి తెలపండి.
జవాబు:
క్రియాశీలుడైన న్యాయమూర్తి రాజ్యాంగ స్వభావాన్ని అర్థం చేసుకొని వుండాలి. భారత రాజ్యాంగం కేవలం ఒక శాసన పత్రం కాదు. అది ప్రజల విలువలు, అభిలాషలను వ్యక్తీకరించే సామాజిక రాజకీయ పత్రం, సమసమాజాన్ని నిర్మించడమే రాజ్యాంగం యొక్క ప్రథమ లక్ష్యం. ఈ సందర్భంలో దేశంలోని పౌరలందరికి సమానహక్కులు హోదా, అవకాశాలు కల్పనే లక్ష్యంగా రాజ్యంగ ప్రవేశికలో స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగ లక్ష్యాలను, గమ్యాన్ని సాధించడానికి ప్రజల ప్రాథమిక హక్కులకు హామీ ఇవ్వబడినది. రాజ్యపాలనలో ఆదేశక సూత్రాలు అతి ప్రధానమైనవిగా భావించడం జరిగింది, వివిధ చట్టాల తయారీలో ఆదేశక సూత్రాలను కాలానుగుణంగా పాటించాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంటుంది.
రాజ్యాంగం యొక్క లక్ష్యాలను సాధించడం శాసననిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖల యొక్క సమిష్టి బాధ్యత. మన రాజ్యాంగ ప్రధాన లక్ష్యమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో న్యాయశాఖ ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి, సమాజంలో అణగారిన బడుగు, బలహీన వర్గాలు, పేదలకు కనీస జీవన అవసరాలను అందివ్వడానికి న్యాయశాఖ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని స్వీకరిస్తున్నది. కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖల మధ్యదూరాన్ని తగ్గించేందుకు, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సమున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నూతన విధానాలను, పద్ధతులను అనుసరిస్తున్నది.
శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వహకశాఖ, అశ్రద్ధ, అలసత్వం కారణంగా కొన్ని సందర్భాలలో సామాజిక దోపిడీకీ గురయ్యే వర్గాలకు సామాజిక న్యాయం అందివ్వడానికి సోషియల్ యాక్షన్ గ్రూపులు (Social Action Groups), పౌర స్వేచ్ఛా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారపరిధిని చెలాయించడంలో న్యాయ పరిమితులను ఎప్పటికప్పుడు విస్తృత పరిచింది. న్యాయస్థానాలకు విస్తరింపబడిన ఈ పాత్రను విమర్శించే వారు విస్తరించబడిన పాత్రకు ‘న్యాయశాఖ క్రియాశీలత’ అని పేరు పెట్టారు అని” జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ పేర్కొన్నారు.
న్యాయశాఖ క్రియాశీలతకు గల కారణాలు: ఈ క్రింద తెలిపిన అంశాలు భారతదేశంలో న్యాయశాఖ క్రియాశీలతను అనుసరించడానికి మూలకారణాలుగా పేర్కొనవచ్చు.
- పరిపాలనా ప్రక్రియలో విస్తరించిన ప్రజావినతుల స్వీకార పరిధి.
- అపరిమిత దత్తశాసనాధికారాలు.
- పరిపాలనపై న్యాయసమీక్ష.
- ప్రజా ప్రభుత్వం బాధ్యతల పెరుగుదల.
- కోర్టు అధికార పరిధిని విచక్షణా రహితంగా ఉపయోగించడం.
- లేని అధికారపరిధిని వినియోగించడం.
- సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన లక్ష్యాల విషయంలో మితిమీరిన ప్రమాణిక నిబంధనల పెరుగుదల.
- ప్రభుత్వంలోని ఇతర యంత్రాంగాల విచ్ఛిత్తి.
ప్రశ్న 7.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనగా నేమి ? [Mar. ’17]
జవాబు:
ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన 1960వ దశకంలో అమెరికాలో అవిర్భవించింది. న్యాయవ్యవస్థ యొక్క గుర్తించబడిన స్థాయి (Locus-standi) కి సంబంధించిన సరళీకృత నియమాలనుంచి పుట్టు కొచ్చినదే ప్రజాప్రయోజన వ్యాజ్యం లేదా సామాజిక చర్యా వ్యాజ్యం (Social action Litigation). ప్రభుత్వ అధికారం వలన ఏ వ్యక్తి తన చట్టబద్ధమైన హక్కులకు భంగం కలిగి నష్టపోయి గాయపడతాడో ఆవ్యక్తి మాత్రమే న్యాయపరిహారం (Judicial Remedy) కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలి అనే సూత్రం పైన సాంప్రదాయ ‘గుర్తింపబడిన స్థాయి’ (లోకస్ స్టాం) నియమంపై ఆధారపడి ఉంటుంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఈ సాంప్రదాయ నియమాన్ని సరళీకరించదలచినది.
సరళీకృత నియమం ప్రకారం చట్టబద్ధమైన హక్కులను నష్టపోయిన లేదా అన్యాయానికి గురైన వ్యక్తి స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేనపుడు సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్యక్తుల సహాయంతో కోర్టుల ద్వారా న్యాయాన్ని అభ్యర్థించవచ్చు.
భారతదేశంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్య ఉద్యమం, అత్యవసర పరిస్థితి అనంతర కాలంలో ప్రారంభమైనది. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ఈ ఉద్యమం ఉద్దేశించింది. అనేక అంశాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) ద్వారా న్యాయశాఖ క్రియాశీలతను సంతరించుకున్నది. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అశక్తులు, అసమర్థులైన బాధితుడు లేదా బాధితుల తరుపున ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా క్లేశనివారణ (Redressal of Grievances) కోసం ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ ఏర్పాటు క్రింద పూర్తిగా అభాగ్యుడు, అనాథుడైనా వ్యక్తి కూడా న్యాయవ్యవస్థ యొక్క సాంప్రదాయ పద్ధతి జోలికి వెళ్ళకుండానే కేవలం ఒక ఉత్తరం ద్వారా కోర్టులో రిట్ పిటిషన్ వేయవచ్చు. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ సూచించిన “తన బాధను కోర్టుకు వినిపించే హక్కు” (Right to be Heard) ద్వారా దీనికి అధీకృత నమ్మకత్వం (Authentica- tion) ఏర్పడుతుంది. పిల్ ద్వారా కోర్టును చేరుతున్న వ్యక్తి నిజాయితీగా సదుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నాడు. తప్ప వ్యక్తి గత ప్రయోజనాలు, ప్రైవేట్ లబ్ది లేదా రాజకీయ లేదా మరి ఏ ఇతర నీతిబాహ్య లక్ష్యాల కోసం కాదు అని న్యాయస్థానం నిర్ధారించుకోవాలి. చట్టం చేత అనుమతింపబడిన, హేతుబద్దమై పాలనా చర్యలను ఆలస్యం చేయడానికో లేదా తమ రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికో రాజకీయనాయకులు కానీ ఇతరులు కానీ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడాన్ని కోర్టులు అనుమతించవు.
ప్రశ్న 8.
న్యాయశాఖ ప్రతిపత్తి అంటే ఏమిటి ? భారత రాజ్యాంగం దానిని ఏ విధంగా ఏర్పాటు చేసింది ?
జవాబు:
న్యాయశాఖ ప్రతిపత్తి – అర్థం: సమన్యాయ పాలనా సూత్రాన్ని కాపాడి అనుసరించడం, శాసన ఆధిక్యాన్ని, ఔన్నత్యాన్ని స్థాపించడం న్యాయశాఖ ప్రధాన విధి. న్యాయశాఖ చట్టం ప్రకారం వివాదాలను పరిష్కరించి వ్యక్తుల హక్కులను పరిరక్షిస్తుంది. ఎవరి నియంతృత్వానికి ప్రజాస్వామ్యం లోబడకుండా ఉండేటట్లు చూస్తుంది. ఈ బాధ్యతలను నెరవేర్చడానికి రాజకీయ ఒత్తిళ్ళకు అవకాశం లేని స్వతంత్ర న్యాయశాఖ అవసరం.
భారత రాజ్యంగంలో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని ఏర్పాటు చేసేందుకు తీసుకున్న చర్యలు:
1) న్యాయమూర్తుల నియామకంలో శాసన నిర్మాణశాఖ పాల్గొనదు. అందువలన న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పార్టీ రాజకీయాలకు ఎటువంటి పాత్ర ఉండదని భావించవచ్చు.
2) న్యాయమూర్తులకు నిర్ణీత పదవీకాలం ఉన్నది. పదవీ విరమణ వయస్సు వచ్చేంతవరకు వారు పదవిలో కొనసాగవచ్చు. అరుదైన సందర్భాలలో రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతి ప్రకారమే వారిని పదవి నుంచి తొలగించవచ్చు. ఈ చర్య వలన న్యాయమూర్తుల నిర్భీతిగా, స్వేచ్ఛగా పనిచేయగలరు.
3) న్యాయమూర్తుల జీతభత్యాల చెల్లింపునకు శాసన నిర్మాణశాఖ అనుమతి అవసరం లేకుండా రాజ్యాంగం ఏర్పాటు చేసింది. అందువలన న్యాయశాఖ అటు కార్యనిర్వాహక, శాసన నిర్మాణశాఖలపై ఆర్థిక విషయాలలో ఆధారపడదు.
4) వ్యక్తిగత విమర్శల నుండి న్యాయమూర్తుల నిర్ణయాలకు, చర్యలకు రాజ్యాంగం రక్షణ కల్పించింది. కోర్టు ధిక్కారం క్రింద దోషిగా గుర్తింపబడిన వ్యక్తులను శిక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు ఇవ్వబడింది. ఈ చర్య అనుచిత విమర్శల నుండి న్యాయమూర్తులను రక్షిస్తుంది.
5) న్యాయశాఖ అనేది శాసననిర్మాణ కార్యనిర్వాహకశాఖల యొక్క అనుబంధశాఖ కాదు. రాజ్యాంగంలో ఈ శాఖకు స్వతంత్ర్య వ్యవస్థగా గుర్తింపు ఉన్నది.
6) న్యాయమూర్తులకు రాజ్యాంగం నిర్దిష్టమైన, ఉన్నత అర్హతలను సూచించింది. అటువంటి నిర్దిష్ట అర్హతలు, అనుభవం ఉన్నవారు మాత్రమే న్యాయమూర్తులుగా నియమించబడతారు.
ప్రశ్న 9.
భారత అటార్నీ జనరల్ అధికారాలు, విధులు ఏవి ? [Mar. ’16]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 76వ ప్రకరణ భారత అటార్నీ జనరల్ పదవికి అవకాశం కల్పిస్తున్నది. ఈయన కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారి. భారత అటార్నీ జనరల్ రాష్ట్రపతిచే నియమింపబడి, రాష్ట్రపతి సంతృప్తిని పొందినంత కాలం పదవిలో కొనసాగుతాడు. పార్లమెంటు సభ్యుడికి ఉన్న అన్ని ప్రత్యేక హక్కులు, రక్షణలను పొందడానికి అటార్నీ జనరల్ ఆర్హుడు. అతడు పార్లమెంట్ సమావేశాలకు హాజరైనప్పుడు ప్రభుత్వానికి కేటాయించిన స్థానాలలో (Government Benches) కూర్చుంటాడు.
అర్హతలు: అటార్నీ జనరల్గా నియమింపబడే వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు గల అర్హతలను కలిగిఉండాలి. అవి:
- భారత పౌరుడై ఉండాలి.
- హైకోర్టు న్యాయమూర్తిగా నిరంతరాయంగా కనీసం ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
- హైకోర్టు న్యాయవాదిగా నిరంతరాయంగా కనీసం పది సంవత్సరాలు వ్యవహరించాలి ఉండాలి.
- రాష్ట్రపతి దృష్టిలో న్యాయకోవిదుడై ఉండాలి.
జీతభత్యాలు: అటార్నీ జనరల్కు జీతం చెల్లించరు. రాష్ట్రపతి నిర్ణయించిన పారితోషికం మాత్రం చెల్లిస్తారు. అతడి పారితోషికాన్ని రాజ్యాంగం నిర్ణయించలేదు. అయితే అటార్నీ జనరల్ పారితోషికం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలతో సమానంగా ఉంటుంది.
తొలగింపు: సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానము తొలగింపుకు వర్తిస్తుంది. రాష్ట్రపతికి రాజీనామా సమర్పించడం ద్వారా అతడు తన పదవి నుండి వైదొలగవచ్చు. నిరూపితమైన అనుచిత ప్రవర్తన లేదా అసమర్ధత వంటి అభియోగాలతో పార్లమెంటు ఉభయసభలు విడివిడిగా ఒక తీర్మానాన్ని మొత్తం సభ్యుల సంఖ్యలో సంపూర్ణ మెజారిటీతోనూ, ఓటింగ్ లో పాల్గొన్న వారిలో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించి రాష్ట్రపతికి పంపితే, ఆ తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి అటార్నీ జనరల్ను పదవి నుండి తొలగిస్తాడు.
అధికారాలు
విధులు: భారత రాజ్యాంగం అటార్నీ జనరలు కొన్ని అధికారాలను దత్తత చేసి మరికొన్ని విధులను అప్పగించినది. అవి:
- రాష్ట్రపతి తన పరిశీలనకు పంపించిన చట్టపరమైన అంశాలపై అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తాడు.
- రాష్ట్రపతి తనకు అప్పగించే న్యాయసంబంధమైన విధులను నిర్వహిస్తాడు.
- భారత రాజ్యాంగం కానీ, చట్టం కానీ తనపై ఉంచిన విధులను నిర్వర్తిస్తాడు.
- కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసులలోనూ ప్రభుత్వం తరపున న్యాయస్థానాలలో హాజరువుతాడు.
- రాష్ట్రపతి సుప్రీంకోర్టు పరిశీలనకు పంపిన ఏ అంశాల విషయంలోనయినా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.
అటార్నీ జనరల్ పార్లమెంటు సభ్యుడు కానప్పటికీ పార్లమెంటు సమావేశాలకు హాజరై చర్చలలో, సమావేశాలలో పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. కానీ అతనికి తీర్మానాలపై ఓటుచేసే ఓటు హక్కు వుండదు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలు.
జవాబు:
- భారతీయ పౌరుడై ఉండాలి.
- ఏదైనా ఒకటి లేదా అంతకు మించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం 5 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
- ఏదైనా ఒకటి లేదా అంతకుమించిన హైకోర్టులలో నిరంతరాయంగా కనీసం 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా వ్యవహరించి ఉండాలి.
- రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయకోవిదుడై ఉండాలి.
ప్రశ్న 2.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు.
జవాబు:
నిరూపితమైన అధికార దుర్వినియోగం, అశక్తత, అయోగ్యత, అసమర్థత మొదలైన కారణాల వలన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలగించబడతారు. అటువంటి మహాభియోగాలతో కూడిన తీర్మానాన్ని పార్లమెంటులోని ఉభయసభలు విడివిడిగా ఆయాసభలలో హజరైన సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదించి ఆన్యాయమూర్తిని తొలగించమని రాష్ట్రపతిని కోరితే, రాష్ట్రపతి వారిని తొలగించవచ్చు.
ప్రశ్న 3.
న్యాయ సమీక్ష. [Mar. ’16]
జవాబు:
సుప్రీంకోర్టు అధికారాలన్నింటిలోకెల్లా న్యాయసమీక్ష అత్యంత ముఖ్యమైనది. శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్వాహిక వర్గం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా ? లేదా ? అని సమీక్షించడానికి న్యాయస్థానాలకు గల అధికారాన్నే ‘న్యాయ సమీక్ష’ అని అంటారు. ఒకవేళ శాసనసభ చట్టాలు, కార్యనిర్వాహక వర్గం నిర్ణయాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని లోపభూయిష్టం, చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది.
ప్రశ్న 4.
కోర్టు ఆఫ్ రికార్డ్.
జవాబు:
రాజ్యాంగంలోని 141వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు రికార్డులను భద్రపరచే కోర్టుగా వ్యవహరిస్తుంది. కోర్టు ధిక్కారానికి పాల్పడే వ్యక్తులను దోషులుగా ప్రకటించి నిందితులుగా నిలబెట్టవచ్చు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో ప్రకటించే తీర్పులు దిగువ కోర్టులన్నింటికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న 5.
న్యాయశాఖ క్రియాశీలత.
జవాబు:
న్యాయశాఖ క్రియాశీలతను కార్యనిర్వాహకశాఖ, శాసన నిర్మాణశాఖల అధికార పరిధిలో జోక్యం చేసుకోవటానికి న్యాయవ్యవస్థ చూపే అత్యుత్సాహంగా భావిస్తారు. సాధారణ పరిభాషలో ‘క్రియాశీలత’ అంటే ‘చురుకుగా ఉండటం నిర్ణయాలలో చర్యలు కొనసాగించటం’. ప్రతి న్యాయమూర్తి క్రియాశీలకంగా వుంటూ పురోగమన దృక్పథంతోగాని లేదా మరొక విధంగా కాని తన విధులను నిర్వహిస్తాడని జస్టిస్. కృష్ణయ్యర్ పేర్కొన్నాడు.
ప్రశ్న 6.
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL).
జవాబు:
చట్టబద్దమైన హక్కులను నష్టపోయినా లేదా అన్యాయానికి గురైన వ్యక్తి స్వయంగా న్యాయస్థానాన్ని | ఆశ్రయించలేనపుడు సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్యక్తుల సహాయంతో కోర్టుల ద్వారా న్యాయాన్ని అభ్యర్థించవచ్చు. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తేవటానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం తోడ్పడుతుంది.
ప్రశ్న 7.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి.
జవాబు:
న్యాయశాఖ చట్టం ప్రకారం వివాదాలను పరిష్కరించి వ్యక్తుల హక్కులను కాపాడుతుంది. ఎవరి నియంతృత్వానికి ప్రజాస్వామ్యం లోబడకుండా ఉండేటట్లు చూస్తుంది. ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి రాజకీయ ఒత్తిళ్ళకు అవకాశం లేని స్వతంత్ర న్యాయశాఖ అవసరం. భారతదేశంలో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి భారత రాజ్యాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
ప్రశ్న 8.
హెబియస్ కార్పస్.
జవాబు:
హెబియస్ కార్పస్ అనగా ‘వ్యక్తి శరీరాన్ని ప్రవేశ పెట్టడం’ అని అర్థం. చట్ట వ్యతిరేకంగా నిర్భంధానికి గురైన వ్యక్తికి బంధవిముక్తి కలిగించటానికి ఈ రిట్ను మంజూరు చేస్తారు. అక్రమంగా నిర్భంధించబడిన వ్యక్తిని కోర్టు ఎదుట హాజరు పరచండి అని సంబంధిత అధికారిని అదేశించడానికి హెబియస్ కార్పస్ రిట్ను సుప్రీంకోర్టు జారీచేస్తుంది.
ప్రశ్న 9.
సుప్రీంకోర్టు పీఠం. [Mar. ’17]
జవాబు:
సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం న్యూఢీల్లిలో ఉంది. పూర్వపు ఫెడరల్ కోర్టు చివరి ప్రధాన న్యాయమూర్తి అయిన హెచ్.జె.కానియా సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. రాజ్యాంగ సంబంధమైన వివాదాలను ఐదురుగు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరిస్తుంది. ప్రత్యేక వివాదాలను విచారించడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువమంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తారు.
ప్రశ్న 10.
రిట్లు (రిట్లు).
జవాబు:
రిట్ అనే పదానికి అర్థం ‘వ్రాతపూర్వక ఆదేశం’. రాజ్యాంగంలోని 32వ ప్రకరణ పౌరులు ప్రాథమిక హక్కులను |అమలు చేయటానికి రిట్లను జారీచేసే అధికారాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినపుడు రాజ్యాంగ పరిహారంలో భాగంగా సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రోహిబిషన్, సెర్షియోరరీ, కోవారంటో మొదలైన రిట్లను జారీ చేస్తుంది.