AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 1st Lesson వ్యాపార భావన Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 1st Lesson వ్యాపార భావన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపారాన్ని నిర్వచించండి. వ్యాపార లక్షణాలను తెలపండి.
జవాబు:
“వస్తువుల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ ద్వారా సంపదను ఉత్పత్తిచేయడానికి లేదా ఆర్జించడానికి మళ్ళించిన మానవ యత్నము వ్యాపారము అని” హాని నిర్వచించినాడు.
“ప్రయివేటు లాభార్జనాపేక్షతో సంఘమునకు వస్తుసేవలను అందించడానికి స్థాపించి, నిర్వహించే సంస్థ వ్యాపారమని” వీలర్ చెప్పినాడు.

“వస్తువుల ఉత్పత్తి మరియు అమ్మకాలకు సంబంధించిన అన్ని వ్యాపకాలు వ్యాపార కార్యకలాపములే” అని స్పీగల్ నిర్వచించినాడు.

పైన చెప్పబడిన నిర్వచనాలను విశ్లేషించగా వ్యాపారానికి క్రింది లక్షణాలు ఉంటాయి.
1) ఆర్థిక కార్యకలాపాలు: వ్యాపారములో ఆర్థిక కార్యకలాపాలు మాత్రమే ఇమిడి ఉంటాయి. వస్తూత్పత్తి, తయారైన వస్తువుల పంపిణీ మరియు సేవలకు సంబంధించిన కార్యకలాపములే ఆర్థిక కార్యకలాపములు. ఆర్థిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ ఆర్థిక ప్రయోజనమే లాభార్జన.

2) వస్తుసేవల ఉత్పత్తి లేదా కొనుగోలు: ప్రతి వ్యాపార సంస్థ వస్తుసేవలను లాభానికి అమ్మకము చేసే ఉద్దేశ్యముతో ఉత్పత్తి లేదా కొనుగోలు చేస్తుంది. వస్తువులు వినియోగదారు వస్తువులు కావచ్చు లేదా ఉత్పత్తిదారు వస్తువులు కావచ్చు. వినియోగదారు వస్తువులు అయిన కాఫీ, చెప్పులు, రొట్టె మొదలైనవి. వినియోగదారుల ప్రత్యక్ష వినియోగానికి అందజేస్తారు. ఉత్పత్తిదారు వస్తువులను వినియోగదారు వస్తువులు లేదా మూలధన వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఉదా: ముడిపదార్థాలు, యంత్రాలు మొదలైనవి. రవాణా, గిడ్డంగి వసతి మొదలైన సేవలు కంటికి కనిపించని వస్తువులుగా పరిగణిస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

3) వస్తు సేవల వినిమయము: వ్యాపారములో లాభార్జనాపేక్షతో వస్తుసేవల వినిమయము జరుగుతుంది. స్వవినియోగానికి వస్తుసేవల ఉత్పత్తి లేదా కొనుగోలు చేస్తే అది వ్యాపారమనిపించుకోదు. తిరిగి అమ్మే ఉద్దేశ్యముతో వస్తువులను కొనుగోలు చేయాలి. ఒక వ్యక్తి తన గృహములో భోజనము వండితే అది వ్యాపారము కాదు. కాని అదే వ్యక్తి ఒక హోటలు నడిపి వండితే అది వ్యాపారము. కారణము అతడు తన సేవలను ద్రవ్యమునకు వినిమయం చేస్తున్నాడు.

4) వ్యాపార వ్యవహారాలు అవిచ్ఛిన్నముగా కొనసాగుట: వ్యాపార కార్యకలాపాలు నిరాటంకముగా, అవిచ్ఛిన్నముగా కొనసాగవలెనన్నది వ్యాపారానికి మరొక లక్షణము. ఒక పర్యాయము లేదా అప్పుడప్పుడు వస్తువులను అమ్మితే అది వ్యాపారమనిపించుకొనదు. ఒక వ్యక్తి కౌ 10,000 లకు ఒక టి.వి.ని కొని శ 12,000 లకు అమ్మితే అది వ్యాపారము కాదు. అయితే ఆ వ్యక్తి కొన్ని టి.వి. లను కొని, దుకాణములో నిల్వ ఉంచి, వాటిని నిరంతరము అమ్ముతూ ఉంటే అది వ్యాపారము అవుతుంది.

5) లాభాపేక్ష: వ్యాపారములో లాభాపేక్ష అనేది ముఖ్య ఉద్దేశ్యము. వ్యాపారములో నిలబడడానికి, వ్యాపార వృద్ధికి లాభాలు అవసరము. కాని లాభాలను న్యాయబద్ధముగా, సక్రమమైన రీతిలో ఆర్జించాలి. లాభాలను సంపాదించే ఉద్దేశ్యముతో వ్యాపారస్తుడు సంఘమును దోపిడీ చేయకూడదు. అధిక ధరలతో వినియోగదారులను పీడించకూడదు.

6) రిస్క్ మరియు అనిశ్చయత: రాబడిలో అనిశ్చయత అనేది వ్యాపార లక్షణము. ఏ కారకాల మీదనయితే వ్యాపారము ఆధారపడి ఉంటుందో వాటికి నిశ్చయత ఉండదు కాబట్టి వ్యాపార అవకాశాలు కూడా నిశ్చయముగా ఉండవు. డిమాండులో మార్పులు, ఉద్యోగుల సమ్మె, వరదలు, యుద్ధము, ధరలు పడిపోవుట మొదలైనవి సంభవించ “వచ్చును. సరైన అంచనాలు మరియు భీమా ద్వారా వ్యాపారస్తుడు నష్టభయాన్ని తగ్గించుకోగలడు. కాని పూర్తిగా నివారించలేడు.

7) ప్రయోజనాల సృష్టి: వినియోగదారుల అభిరుచులు, అపేక్షితాలకు అనుగుణముగా వస్తువులను తయారుచేసి పంపిణీ చేస్తారు. వినియోగదారుల అవసరాల నిమిత్తము వ్యాపారము వస్తువులకు అనేక ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఆ ప్రయోజనము ఆకార ప్రయోజనము, స్థల ప్రయోజనము, కాల ప్రయోజనము కావచ్చు. ముడి పదార్థాలను, తయారీ వస్తువులుగా మార్చడం ద్వారా ఆకార ప్రయోజనాలను, తయారైన వస్తువులను ఉత్పత్తి స్థలాల నుంచి వినియోగదారుల ప్రాంతాలకు రవాణా చేసి స్థల ప్రయోజనాలను, ఉత్పత్తులను గిడ్డంగులలో నిల్వ ఉంచి వినియోగదారులకు కావలసిన వెంటనే సరఫరా చేసి కాల ప్రయోజనాలను వ్యాపారము కలుగజేస్తుంది.

8) వ్యాపారము కళ మరియు శాస్త్రము: వ్యాపారమునకు వ్యక్తిగత నైపుణ్యము, అనుభవము అవసరము కాబట్టి దీనిని కళగా భావిస్తారు. అంతేగాక వ్యాపారము కొన్ని సూత్రాలు, చట్టాలపై ఆధారపడుతుంది. కాబట్టి శాస్త్రముగా కూడా పరిగణిస్తారు.

ప్రశ్న 2.
వ్యాపార లక్ష్యాలను వివరించండి.
జవాబు:
వ్యాపార ధ్యేయాలను ఆర్థిక ధ్యేయాలు, సాంఘిక ధ్యేయాలు, మానవ ధ్యేయాలు, జాతీయ ధ్యేయాలుగా విభజించవచ్చును.

ఆర్థిక ధ్యేయాలు: వ్యాపారము యొక్క ఆర్థిక ధ్యేయాలు దిగువ వివరించబడినవి.
1) లాభార్జన: వ్యక్తులు వ్యాపారములో ప్రవేశించడానికి ముఖ్య కారణము లాభార్జన. వ్యాపారము నడుపుటకు లాభమే ముఖ్యమైన ప్రోత్సాహకము. ఒక వ్యాపారము నిలబడవలెనంటే లాభాలు ఆవశ్యకము. లాభాలు వ్యాపార సంస్థ ఉనికికే కాక, వ్యాపార వృద్ధికి, విస్తరణకు కూడా అవసరము.

2) వినియోగదారులను పొందుట: వినియోగదారులు తమ అవసరాలను, కోర్కెలను తీర్చుకొనడానికి వస్తు సేవలను కొనుగోలుచేసి, చెల్లించడానికి తగినంత మంది వినియోగదారులు ఉన్నప్పుడే వ్యాపారము లాభాలను ఆర్జించ గలదు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను, సమంజసమైన ధరలకు అందించవలెను. కాబట్టి వినియోగదారులను పొందటమే ముఖ్యమైన ఆర్థిక ధ్యేయము.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

3) సాంకేతిక అభివృద్ధి: ప్రస్తుత పోటీ ప్రపంచములో ప్రతి సంస్థ నాణ్యమైన సరుకును సమంజసమైన ధరలకు అమ్మడానికి ప్రయత్నము చేస్తుంది. వ్యాపార సంస్థ విజయవంతము కావలెనంటే కొత్త డిజైన్లు, మంచి యంత్రాలు, కొత్త కొత్త వెరైటీలు అవసరము. అంతేగాక నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తిని పెంచుట ద్వారా వ్యయాలను తగ్గించుకోవచ్చును.

సాంఘిక ధ్యేయాలు: హెన్రీ ఫోర్డ్ ఉద్దేశ్యము ప్రకారము వ్యాపారము యొక్క ప్రాథమిక ధ్యేయము సేవలనందించుట మరియు అనుబంధ ధ్యేయము లాభాలను సంపాదించుట. సాంఘిక ధ్యేయాలను దిగువ విధముగా చెప్పవచ్చును.
1) నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచి సరఫరా చేయుట: సంఘానికి అవసరమయ్యే వస్తువులను వ్యాపారము అందజేయవలెను. నాణ్యమైన సరుకు, సరసమైన ధరలకు అందజేయుట వ్యాపారము యొక్క సాంఘిక బాధ్యత.

2) ఉద్యోగులకు న్యాయమైన ప్రతిఫలము: వేతనాలు, జీతాలకు అదనముగా లాభాలలో సమంజసమైన భాగాన్ని ఉద్యోగులకు బోనస్ రూపములో పంపిణీ చేయాలి. పనిచేయడానికి సుముఖమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయుట యజమాని యొక్క విధి.

3) ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించుట: వ్యాపారాన్ని విస్తరించుట ద్వారా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించి, సంఘానికి సేవ చేయవచ్చు. సంపూర్ణ ఉద్యోగిత అనేది సంఘానికి చేసే ముఖ్యమైన సేవగా పేర్కొనవచ్చు.

4) ప్రభుత్వానికి సహకరించుట: జాతీయ ధ్యేయాలను సాధించుటకు వ్యాపారము ప్రభుత్వముతో సహకరించవలెను. వ్యాపారము పన్నులను సకాలములో చెల్లించాలి. ప్రజాహిత సంక్షేమ కార్యములకు, ప్రభుత్వానికి ఇది రాబడిని ఏర్పరుస్తుంది.

5) సాంఘిక సంక్షేమము: వ్యాపారము సాంఘిక, కల్చరల్ మరియు మతపరమైన వ్యవస్థలకు సహాయము చేయాలి. ఇవి స్కూళ్ళు, ఆసుపత్రులు, లైబ్రరీలు, వ్యాయామ సంఘాలు, ప్రయోగ సంస్థలను నిర్మిస్తాయి.

మానవతా ధ్యేయాలు: మానవతా ధ్యేయాలు పనివారి బాగోగులు, వినియోగదారులు, వాటాదారుల సంతృప్తితో ముడిపడి ఉన్నది..
1) యాజమాన్యము, పనివారి మధ్య సహకారము: పనిచేసేవారు కూడా మానవులేనని యాజమాన్యము గుర్తించాలి. ఉద్యోగుల కృషి ద్వారానే లాభదాయకత పెరుగుతుంది. కాబట్టి, వారుపడ్డ కష్టానికి ప్రతిఫలమును అందించాలి.

2) పనివారి సంక్షేమము: పనివారికి భౌతిక అవసరాలు, గుర్తింపు, గౌరవాన్ని కాపాడుట మరియు పనిచేయడానికి తగిన వాతావరణాన్ని కల్పించుట ద్వారా వారు కష్టపడి పనిచేస్తారు. పనివారి ఆరోగ్యము, రక్షణ మరియు సాంఘిక భద్రతకు తగిన ఏర్పాట్లు చేయవలెను.

3) మానవ వనరుల అభివృద్ధి: మానవ వనరులు వ్యాపారములో విలువగల ఆస్తి. వాటిని అభివృద్ధిచేయుట ద్వారా వ్యాపార వృద్ధి జరుగుతుంది. పనివారికి శిక్షణ, వైఖరి, నైపుణ్యాల అభివృద్ధికి వర్క్షాపులు నిర్వహించుట ద్వారా ఇది సాధ్యపడుతుంది.

4) పనివారికి యాజమాన్యములో చోటు: పనివారిని నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పాల్గొనేటట్లు చేయుట ద్వారా వారి వ్యక్తిగత వికాసము అభివృద్ధి చెందుతుంది.

జాతీయ ధ్యేయాలు: వ్యాపారము యొక్క జాతీయ ధ్యేయాలను దిగువ విధముగా వివరించవచ్చును.
1) జాతీయ అవసరాలు: వ్యాపారము వస్తువులను జాతీయ అవసరాలు, ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి చేయవలెను. అరుదుగా లభ్యమయ్యే సహజ వనరుల వృథాను తగ్గించవలెను.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

2) వనరుల అభిలషణీయమైన వినియోగము: వనరుల సక్రమమైన కేటాయింపు, అరుదుగా లభ్యమయ్యే వనరుల అభిలషణీయమైన వినియోగము ద్వారా దేశము త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించగలదు.

3) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి: అన్ని ప్రాంతాలు సమానముగా అభివృద్ధి చెందవలెనంటే పరిశ్రమలను వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించవలెను. దీనివలన ఆ ప్రాంతములో జీవన ప్రమాణము పెరగడానికి తోడ్పడుతుంది.

4).ఎగుమతులను పెంచుట: ఎగుమతులను పెంచడానికి, దిగుమతులపై ఆధారపడుట తగ్గించడానికి వ్యాపారము ప్రభుత్వానికి సహాయపడవలెను.

5) చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి: ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు, పెద్దతరహా పరిశ్రమలకు అవసరమయ్యే ఇన్పుట్లను ఏర్పాటు చేయడానికి చిన్నతరహా పరిశ్రమల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

ప్రశ్న 3.
వ్యాపారం సామాజిక బాధ్యతను చర్చించండి.
జవాబు:
ప్రతి వ్యాపార సంస్థ సమాజములో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సమాజము యొక్క వనరులను ఉపయోగించి సమాజముపైన ఆధారపడుతుంది. దీని వలన సమాజము యొక్క సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత వ్యాపారము మీదనే ఉంటుంది. అందువలన వ్యాపార సంస్థ చేపట్టే అన్ని కార్యకలాపాలు సమాజము యొక్క ఆసక్తులను పరిరక్షించే విధముగా ఉండవలెను. అందువలన ఏ సమాజములో అయితే ఒక వ్యాపారము తన కార్యకలాపాలను నిర్వహిస్తుందో ఆ సమాజ శ్రేయస్సును కాపాడటానికి వ్యాపారానికి ఉండే బాధ్యతను సామాజిక బాధ్యతగా చెప్పుకోవచ్చు.

సామాజిక బాధ్యత భావన: వ్యక్తులు లాభాన్ని ఆర్జించటానికి వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వ్యాపారము యొక్క ధ్యేయము కేవలము లాభాలను ఆర్జించటమే కాదు. వ్యాపార సంస్థ కూడా సమాజంలో భాగమే కాబట్టి అనేక సాంఘిక విధులను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. వ్యాపారస్తుడు సమాజానికి చెడు చేసే కార్యకలాపాలను చేపట్టకూడదు. అందువలన సామాజిక బాధ్యత భావన ఒక వ్యాపారస్తుడిని లాభాలను ఆర్జించటానికి వస్తువులకు కృత్రిమ కొరత కల్పించడము, దొంగ వ్యాపారము, కల్తీచేయుట, పన్నులు ఎగగొట్టుట మొదలైన వాటిని నిరుత్సాహపరుస్తుంది. లాభాలను ఆర్జించటానికి సక్రమమైన రీతిలో వ్యాపారాన్ని నిర్వహించుట, ఉద్యోగస్తులు పనిచేయడానికి మంచి వాతావరణాన్ని ఏర్పరచుట, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించుట, వాతావరణ కాలుష్యాన్ని నివారించుట, జాతీయ వనరులను కాపాడుట మొదలైన వాటికి తోడ్పడేటట్లు చేస్తుంది.

వివిధ ఆసక్తిగల వర్గాలకు గల బాధ్యత: వ్యాపారము యజమానులు, ఉద్యోగస్తులు, సరఫరాదారులు, వినియోగదారులు, ప్రభుత్వము మరియు సమాజముతో వ్యవహరిస్తుంది. వ్యాపారము చేపట్టి ప్రతి కార్యకలాపము పై వర్గాలకు ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా ప్రభావము ఉంటుంది. కాబట్టి వారిని ఆసక్తిగల వర్గాలుగా వర్ణించినారు. వివిధ వర్గాలకు సామాజిక బాధ్యతలు:
1) యజమానులకు: వ్యాపారము యొక్క యజమానులు వ్యాపారమునకు అవసరమయ్యే మూలధనాన్ని సమకూర్చి నష్టభయాన్ని స్వీకరిస్తారు.
యజమానికి, వ్యాపారానికి గల బాధ్యతలు:

  • పెట్టుబడులపై న్యాయమైన ఆర్జనలను డివిడెండ్ల రూపములో పంచడం.
  • మూలధనానికి భద్రత కల్పించి, మూలధన వృద్ధికి తోడ్పడటం.
  • వ్యాపారాన్ని సమర్థవంతముగా నిర్వహించుట.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

2) ఉద్యోగులకు: వ్యాపార సంస్థ భవిష్యత్తు, అందులో పనిచేసే ఉద్యోగస్తుల శక్తి, సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సంస్థలోని ఉద్యోగులపట్ల వ్యాపారానికి వారి ఆసక్తులను పరిరక్షించవలసిన సామాజిక బాధ్యత ఉన్నది.
ఉద్యోగులపట్ల వ్యాపారానికి గల బాధ్యతలు:

  • వేతనాలు, అలెవెన్సులు వారికి చెల్లించడము.
  • పనిచేయడానికి మంచి వాతావరణాన్ని కల్పించి, వారి శ్రేయస్సుకు తోడ్పడుట.
  • తగిన శిక్షణ ద్వారా వారి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుట.
  • ఉద్యోగ భద్రత, సామాజిక బాధ్యత పథకాలు పెన్షన్, పదవీ విరమణ సౌకర్యాలు, గ్రూపు భీమాలు కల్పించుట.

3) సరఫరాదారులకు: సంస్థ ఉత్పత్తికి అవసరమయ్యే ముడిపదార్థాలను, ఇతర మెటీరియల్స్ను వీరు సప్లయి చేస్తారు.
వ్యాపారానికి వారిపైగల బాధ్యతలు:

  • సకాలములో డబ్బును చెల్లించడము.
  • న్యాయమైన షరతులు ఏర్పాటు చేయుట.
  • సమంజసమైన పరపతి కాలాన్ని వినియోగించుకొనుట.

4) వినియోగదారులకు: వ్యాపార సంస్థ మనుగడను సాగించవలెనంటే వారికి ఈ క్రింది వసతులు సమకూర్చ వలెను. వినియోగదారుని పట్ల వ్యాపారానికి గల బాధ్యతలు:

  • మంచి నాణ్యతగల వస్తుసేవలను అందించవలెను.
  • వస్తువులను సకాలములో డెలివరీ చేయవలెను.
  • తక్కువ ధరలకు వస్తువులను అమ్మవలెను..
  • అమ్మకానంతరము సేవలు అందించుట.
  • తక్కువ తూకము, వస్తువులలో కల్తీ మొదలైన అనుచిత చర్యలకు పాల్పడరాదు.

5) ప్రభుత్వానికి: వ్యాపారము ప్రభుత్వము రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణముగా నిర్వహించవలెను.
ప్రభుత్వముపట్ల వ్యాపారానికి బాధ్యతలు:

  • పన్నులు, డ్యూటీలు నిజాయితీగా సకాలములో చెల్లించుట.
  • ప్రభుత్వ నిబంధనలకు అనుగుణముగా సంస్థలను స్థాపించుట.
  • వాతావరణ కాలుష్యాన్ని నివారించే చర్యలను పాటించుట.
  • అనుచిత కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండటము.

6) సమాజానికి: వ్యాపారము సమాజములో ఒక భాగము అయినందున సమాజములోని ఇతర సభ్యులతో సంబంధాలను ఏర్పరచుకొనవలెను.
వ్యాపారానికి సమాజముపట్ల బాధ్యతలు:

  • సమాజములో బలహీన, వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం.
  • ఉద్యోగ అవకాశాలను కల్పించడం.
  • వాతావరణ పరిరక్షణ.
  • ప్రకృతి వనరులను సక్రమముగా వినియోగించుట.
  • క్రీడలు, సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడం.

ప్రశ్న 4.
ఆర్థిక కార్యకలాపాలను వర్గీకరించి, ఒక్కొక్క రకాన్ని వర్ణించండి.
జవాబు:
మానవులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఏదో ఒక వ్యాపకములో నిమగ్నమై ఉంటారు. కోర్కెల స్వభావాన్నిబట్టి మానవ కార్యకలాపాలను ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలుగా విభజించవచ్చు. ద్రవ్యార్జన కోసము కాని, జీవనోపాధిని సంపాదించడానికి కాని మానవుడు చేయు పనులను ఆర్థిక సంబంధమైన కార్యకలాపాలు అంటారు. ఇవి వస్తుసేవల ఉత్పత్తి, వినిమయము మరియు పంపిణీతో సంబంధము కలిగి ఉంటాయి. ప్రేమాభిమానాలతోగాని, సాంఘిక బాధ్యతతో గాని, దేశభక్తితో మానవుడు చేసే పనులను ఆర్థికేతర కార్యకలాపాలు అనవచ్చు. ఈ కార్యకలాపాల ఉద్దేశ్యము సేవలను అందించి తృప్తి పొందడమేకాని లాభార్జన కాదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

ఆర్థిక కార్యకలాపాల వర్గీకరణ: ఆర్థిక కార్యకలాపాలను మరల మూడు రకాలుగా విభజించవచ్చును. అవి:

  1. వ్యాపారము
  2. వృత్తి
  3. ఉద్యోగము

1) వ్యాపారము: వ్యాపారము ఆర్థిక సంబంధమైన వ్యాపకము. ద్రవ్యార్జన మరియు సంపాదన కూడబెట్టుట అనే ఉద్దేశాలతో వస్తుసేవలను ఉత్పత్తిచేసి పంపిణీ చేసే ప్రక్రియ వ్యాపారము. వ్యాపారము చేయుటలో ప్రధాన ఉద్దేశ్యము లాభాన్ని సంపాదించడమే. వ్యాపారము అనే పదానికి అర్థము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండుట. ప్రతి వ్యక్తి ఏదో ఒక వ్యాపకాన్ని చేపడతాడు. రైతు పొలములో పనిచేస్తాడు. పనివాడు ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. గుమాస్తా ఆఫీసులో పనిచేస్తాడు. ఉపాధ్యాయుడు క్లాసులో పాఠాలను బోధిస్తాడు. అమ్మకాల ప్రతినిధి వస్తువుల అమ్మకాలను చేస్తాడు. ఉద్యమదారుడు ఫ్యాక్టరీని నడుపుతాడు. వీరందరి ప్రధాన ఉద్దేశ్యము జీవనోపాధికై ఏదో ఒక పనిని నిర్వహించడమే.

2) వృత్తి: ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణలు ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అనవచ్చు. డాక్టర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు మొదలైనవారు అందజేయు. సేవలు వృత్తి కిందకు వస్తాయి. సాధారణముగా ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క సంఘము ఉంటుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది వైద్యవృత్తికి సంబంధించిన సంఘము. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది లాయర్లకు సంబంధించిన సంఘము.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది అకౌంటెంట్లకు సంబంధించిన వృత్తిపరమైన సంఘము. ఒక వృత్తిని చేపట్టుటకు వ్యక్తికి ఉండవలసిన విద్యార్హతలు ఏమిటి, అతనికి ఎటువంటి శిక్షణ ఉండాలి, ఆ వృత్తిలో పాటించవలసిన నియమాలు మొదలైన విషయాలను వృత్తి సంఘాలు నిర్ణయిస్తాయి. ఒక వృత్తిని చేపట్టే వ్యక్తి దానికి సంబంధించిన సంఘములో సభ్యుడై ఉండాలి. దాని నియమ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలి. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును.

3) ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారముగాని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, ఎవరికయితే పని అప్పగించబడినదో ఆ వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని యొక్క ఆదేశాల ప్రకారము పనిని చేస్తాడు. తన సేవలను అందించినందుకు ఉద్యోగి, యజమాని నుంచి కొంత ప్రతిఫలాన్ని పొందుతాడు. ఆ ప్రతిఫలాన్ని వేతనము లేదా జీతము అంటారు. కొన్ని సమయాలలో వృత్తిని చేపట్టినవారు కూడ ఉద్యోగ కాంట్రాక్టు కింద పనిచేయవచ్చును. ఛార్టర్డ్ అకౌంటెంట్లను కంపెనీ నియమించవచ్చును. ప్రభుత్వ విభాగములోగాని, ప్రయివేటు వ్యవస్థలోగాని సేవలను అందించవచ్చును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార లక్ష్యాలు.
జవాబు:
వ్యాపార ధ్యేయాలను ఆర్థిక, సాంఘిక, మానవత మరియు జాతీయ ధ్యేయాలుగా విభజించవచ్చును.
1) ఆర్ధిక ధ్యేయాలు:

  1. లాభార్జన.
  2. ఖాతాదారుల సృష్టి.
  3. సాంకేతిక అభివృద్ధి.

2) సాంఘిక ధ్యేయాలు:

  1. నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచి సరఫరా చేయుట.
  2. ఉద్యోగులకు న్యాయమైన ప్రతిఫలము.
  3. ఉద్యోగ అవకాశాల కల్పన.
  4. ప్రభుత్వానికి సహకారము.
  5. సాంఘిక సంక్షేమము.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

3) మానవత ధ్యేయాలు:

  1. యాజమాన్యానికి, పనివారికి మధ్య సహకారము.
  2. పనివారి సంక్షేమము.
  3. మానవ వనరుల అభివృద్ధి.
  4. యాజమాన్యములో పనివారు పాల్గొనుట.

4) జాతీయ ధ్యేయాలు:

  1. జాతీయ అవసరాలకు అనుగుణముగా వస్తువుల ఉత్పత్తి.
  2. సహజ వనరుల అభిలషణీయమైన వినియోగము.
  3. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి.
  4. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి.
  5. ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుట.

ప్రశ్న 2.
సామాజిక లక్ష్యాలు.
జవాబు:
హెన్రీ ఫోర్డ్ ఉద్దేశ్యము ప్రకారము వ్యాపారము యొక్క ప్రాధమిక ధ్యేయము సేవలను అందించుట మరియు అనుబంధ ధ్యేయము లాభాలను సంపాదించుట వ్యాపారము యొక్క సామాజిక లక్ష్యాలు.
1) నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచి సరఫరా చేయుట: సంఘానికి అవసరమయ్యే వస్తువులను వ్యాపారము అందజేయవలెను. నాణ్యమైన సరుకు సరసమైన ధరలకు అందజేయుట, వ్యాపారము యొక్క సాంఘిక బాధ్యత.

2) ఉద్యోగులకు న్యాయమైన ప్రతిఫలము వేతనాలు, జీతాలకు అదనముగా లాభాలలో సమంజసమైన భాగాన్ని ఉద్యోగులకు బోనస్ రూపములో పంపిణీ చేయాలి. పని చేయడానికి సుముఖమైన వాతావరణాన్ని ఏర్పాటు
చేయడం యజమాని విధి.

3) ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించుట: వ్యాపారాన్ని విస్తరించుట ద్వారా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించి సంఘానికి సేవ చేయవచ్చు. సంపూర్ణ ఉద్యోగిత అనేది సంఘానికి చేసే ముఖ్యమైన సేవగా పేర్కొనవచ్చు.

4) ప్రభుత్వానికి సహకరించుట: జాతీయ ధ్యేయాలను సాధించుటకు వ్యాపారము ప్రభుత్వముతో సహకరించ వలెను. వ్యాపారము పన్నులను సకాలములో చెల్లించాలి. ప్రజాహిత సంక్షేమ కార్యాలకు ఇది ప్రభుత్వానికి రాబడిని ఏర్పరుస్తుంది.

5) సాంఘిక సంక్షేమము: వ్యాపారము సాంఘిక, కల్చరల్ మరియు మతపరమైన వ్యవస్థలకు సహాయము చేయాలి. ఇవి స్కూళ్ళు, ఆసుపత్రులు, లైబ్రరీలు, వ్యాయామ సంఘాలు, ప్రయోగశాలలను నిర్మిస్తాయి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

ప్రశ్న 3.
వ్యాపారములో లాభం పాత్ర.
జవాబు:
వ్యాపారములో లాభాపేక్ష ముఖ్యమైనది. లాభాపేక్ష లేని ఏ వ్యాపకమైనా వ్యాపారమనిపించుకోదు. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపార కార్యకలాపాల ద్వారా ఎక్కువ లాభాలు గడించడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఆసక్తే అతనిని వ్యాపారములో ఉంచుతుంది. అంతేగాక వ్యాపారము కొంతకాలముపాటు కొనసాగటానికి లాభాలు అవసరము. వ్యాపార చక్రాలు, డిమాండులో మార్పులు, ద్రవ్య మార్కెట్లో హెచ్చుతగ్గులు మొదలైన అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొనవలెనంటే లాభాలు అవసరము. ఒక సంస్థ తన మనుగడను సాధించడానికే కాక వ్యాపార విస్తరణకు, బహుళ వస్తువుల ఉత్పత్తికి లాభాలు కావలెను. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై సముచితమైన ఆర్జన, పనివారికి ఎక్కువ వేతనాలు, ఉద్యమదారులు తిరిగి పెట్టుబడి పెట్టడానికి లాభాలు కావలెను. ఇవన్నీ లాభాలు గడించినపుడే సాధ్యపడతాయి. లాభాపేక్షతో వ్యాపారస్తుడు నాసిరకం వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మి వినియోగదారులను దోచుకొనరాదు. ఇందువలన వారి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. నాణ్యమైన వస్తువులు సముచితమైన ధరలకు అందిస్తే వ్యాపారస్తునకు, ఖాతాదారునకు కూడా ప్రయోజనము కలుగుతుంది.

ప్రశ్న 4.
ఆర్థిక కార్యకలాపాల సంక్షిప్త వివరణ.
జవాబు:
వ్యాపార ఆర్థిక కార్యకలాపాలను వ్యాపారము, వృత్తి, ఉద్యోగము అని మూడు రకాలుగా విభజించవచ్చును. వ్యాపారము: సాహిత్యపరముగా వ్యాపారము అంటే నిరంతరము శ్రమిస్తూ ఉండే స్థితి. ప్రతి వ్యక్తి ఏదో ఒక పనిచేస్తూ నిమగ్నమై ఉంటాడు. లాభార్జన ధ్యేయంతో చేపట్టే వ్యాపకమే వ్యాపారము. వ్యాపార కార్యకలాపాలు వస్తు సేవల ఉత్పత్తి లేదా వినిమయం లాభార్జన లేదా జీవనోపాధి కోసము జరుగుతాయి.

వృత్తి: ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును. ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంట్లకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును.

ఉద్యోగము: ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారము ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి కొంత ప్రతిఫలాన్ని జీతము రూపములో పొందుతాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపారమును నిర్వచించండి.
జవాబు:
సాహిత్యపరముగా వ్యాపారము అంటే నిరంతరము శ్రమిస్తూ ఉండే స్థితి. వ్యాపారాన్ని హాని దిగువ విధముగా నిర్వచించినాడు. “వస్తువు కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ ద్వారా సంపదను ఉత్పత్తి చేయడానికి లేదా ఆర్జించడానికి మళ్ళించిన మానవయత్నము వ్యాపారము”. వీలర్ అభిప్రాయము ప్రకారము “ప్రయివేటు లాభార్జనాపేక్షతో సంఘమునకు వస్తుసేవలను అందించడానికి స్థాపించి, నిర్వహించే సంస్థ వ్యాపారము”.

AP Inter 1st Year Commerce Study Material Chapter 1 వ్యాపార భావన

ప్రశ్న 2.
వృత్తి అంటే ఏమిటి ? [A.P & T.S. Mar. ’15]
జవాబు:
ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణల ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావము కలిగిన సేవలను వ్యక్తిగతముగా అందజేసే వ్యాపకాన్ని వృత్తి అంటారు. వృత్తి సంబంధమైన సేవలను అందజేసినందుకు ప్రతిఫలముగా కొంత సొమ్మును వసూలు చేయవచ్చును. ఉదా: ఒక డాక్టరు వైద్యశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానము ద్వారా పేషెంటుకు సహాయము చేసి ఫీజును వసూలు చేయవచ్చును.

ప్రశ్న 3.
ఉద్యోగము అంటే ఏమిటి ?
జవాబు:
ఒక ఒప్పందము ప్రకారముగాని లేదా సేవా నియమాల ప్రకారముగాని ఒక వ్యక్తి మరొక వ్యక్తికి పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగము క్రిందకు వస్తుంది. పనిని అప్పగించిన వ్యక్తిని యజమాని అని, పని స్వీకరించిన వ్యక్తిని ఉద్యోగి అని అంటారు. ఉద్యోగి యజమాని ఆదేశాల ప్రకారం పని చేసి ప్రతిఫలాన్ని జీతము రూపములో
పొందుతాడు.