AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 6th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 6th Lesson జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాయింట్ స్టాక్ కంపెనీ అనగానేమి ? వాటి లక్షణాలేవి ?
జవాబు:
సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యవస్థలలోని పరిమితులు అధిగమించడానికి కంపెనీ వ్యవస్థ ఉద్భవించినది. ఉమ్మడి వాటాల ద్వారా రూపుదిద్దుకొనే సంస్థ కాబట్టి దీనిని జాయింట్ స్టాక్ కంపెనీ అంటారు. కంపెనీ కొంతమంది వ్యక్తుల స్వచ్ఛంద సంఘము. కొంతమంది వ్యక్తులు కలసి ఒక ధ్యేయమును సాధించడానికి ఏర్పడిన సంస్థ. కంపెనీల
చట్టము దీనికి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదించినది. దీనికి న్యాయాత్మకమైన వ్యక్తిత్వము, పారంపర్యాధికారము, పరిమిత ఋణబాధ్యత ఉన్నవి. కంపెనీలకు ప్రత్యేక వ్యక్తిత్వము ఉండటము అది తన పేరుతోనే ఆస్తులను కొనవచ్చు, అమ్మవచ్చు ఒడంబడికలు చేసుకోవచ్చు. అందుకే అటువంటి సంస్థను కంపెనీల చట్టము సృష్టించిన కల్పిత వ్యక్తిగా వర్ణించడమైనది.

“అధికార ముద్రతో, పారంపర్యాధికారముతో చట్టం సృష్టించిన కల్పిత వ్యక్తిత్వముతో రిజిస్టర్ అయిన స్వచ్ఛంద సంస్థ” – కంపెనీల చట్టము.

“సమిష్టి ధ్యేయం కోసం ఐచ్ఛికముగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే కంపెనీ”

– లార్డ్ జస్టీస్ జేమ్స్ “న్యాయశాస్త్ర దృష్టిలో అదృశ్యముగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడు. కేవలం న్యాయ శాస్త్ర సృష్టి వలన ఏర్పడినది కాబట్టి రాజ్యాంగము నిర్దేశించిన ధర్మాలే దానికి ఉంటాయి. ఆ ధర్మాలలో అతి ముఖ్యమైనవి శాశ్వతత్వము, వ్యక్తిత్వము” – ప్రధాన న్యాయాధికారి మార్షల్.

కంపెనీల లక్షణాలు :
1. న్యాయాత్మకమైన వ్యక్తిత్వము కంపెనీ చట్టము ద్వారా సృష్టించబడుతుంది. మానవునకు సహజముగా ఉండే హక్కులన్నీ కంపెనీలకు ఉంటాయి. కంపెనీ ఆస్తులను సేకరించి, అప్పులు తీసుకోవచ్చు. తన పేరుమీదగానే కోర్టులో దావా వేయవచ్చు. ఇతరులు కూడా కంపెనీ మీద దావా వేయవచ్చు.

2. న్యాయసత్వము : కంపెనీ నమోదు అయిన తర్వాత ప్రత్యేకమైన అస్థిత్వము ఏర్పడుతుంది. కంపెనీ వేరు, కంపెనీ సభ్యులు వేరు. సభ్యులతో కంపెనీకి సంబంధము ఉండదు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

3. స్థాపన : భారత కంపెనీల చట్టము, 1956 క్రింద నమోదు అయినప్పుడే కంపెనీ మనుగడలోనికి వస్తుంది.

4. అధికార ముద్ర : కంపెనీకి భౌతిక రూపము లేదు కాబట్టి అది సంతకాలు చేయలేదు. అందుచేత చట్టం ప్రకారము అధికార ముద్ర ఉండవలెను. ఇది కంపెనీ సంతకము వలె చెలామణి అవుతుంది. అధికార ముద్ర మీద కంపెనీ పేరును, వ్యాపార చిహ్నాన్ని చెక్కుతారు.

5. పారంపర్యాధికారము : చట్టము సృష్టించిన అసహజ మానవుడు కావున కంపెనీ ఛిరకాలము కొనసాగుతుంది. వాటాదారుల మరణముతోగాని, దివాలా తీయడం ద్వారా కంపెనీ మనుగడకు అంతరాయముండదు.

6. పరిమిత ఋణబాధ్యత : వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల మేరకు పరిమితము.

7. వాటాల బదిలీ : పబ్లిక్ కంపెనీలోని వాటాదారులు తమ వాటాలను యథేచ్చగా బయటవారికి బదిలీ చేయవచ్చును.

8. యాజమాన్యానికి, నిర్వహణకు పొత్తుండదు : వాటాదారులు కంపెనీ యజమానులు అయినా వారందరూ నిర్వహణలో పాల్గొనలేరు. వారు ఎన్నుకున్న డైరెక్టర్ల బోర్డు నిర్వహణ చేస్తుంది. కాబట్టి యాజమాన్యం వేరు, నిర్వహణ వేరు,

9. సభ్యుల సంఖ్య : జాయింట్ స్టాక్ కంపెనీలలో ప్రధానముగా పబ్లిక్ కంపెనీలు, ప్రైవేటు కంపెనీలు ఉంటాయి. పబ్లిక్ కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము. ప్రైవేటు కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య 50.

10. చట్టబద్ధమైన నిబంధనలు : కంపెనీ వ్యవహారములన్నీ భారత కంపెనీల చట్టము అజమాయిషీలో జరుగును.

ప్రశ్న 2.
జాయింట్ స్టాక్ కంపెనీకి గల ప్రయోజనాలను, పరిమితులను వివరింపుము. ‘
జవాబు:
కంపెనీ వ్యవస్థ వలన ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
1. భారీ ఆర్థిక వనరులు : ప్రజల నుంచి విస్తారముగా నిధులు సేకరించడానికి కంపెనీ వ్యవస్థ అనువైనది. కంపెనీ వాటాలను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి అమ్మడం వలన స్వల్ప ఆదాయముగల ప్రజలు కూడా వాటాలను సులభముగా కొనగలరు. అందువలన భారీ మూలధనాన్ని తేలికగా సేకరించవచ్చు.

2. పరిమిత ఋణబాధ్యత : వాటాదారుల ఋణబాధ్యత వారి వాటా విలువకు పరిమితము అవుతుంది. కంపెనీ అప్పులు తీర్చడానికి సొంత ఆస్తులు తేనవసరము లేదు. వాటా సొమ్ము మాత్రమే కోల్పోతారు. నష్టభయం తక్కువ. అందువలన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు.

3. శాశ్వతత్వము : కంపెనీల చట్టం ప్రకారము కంపెనీకి ప్రత్యేక న్యాయసత్వము ఉన్నది. అందువలన కంపెనీ నిరాటంకముగా కొనసాగుతుంది. వాటాదారుల మరణము, దివాలా తీయడం వలన కంపెనీ మనుగడకు ఎటువంటి అంతరాయం కలగదు. అది నిరాటంకముగా కొనసాగుతుంది.

4. వాటాల బదిలీ : పబ్లిక్ కంపెనీ వాటాలను ఇతరులు అనుమతి లేకుండా సులభముగా బదిలీ చేయవచ్చును. కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజిలో అమ్ముతారు. బదిలీ సౌకర్యము ద్వారా వీటిని తేలికగా నగదులోనికి మార్చుకొనవచ్చు. కాబట్టి వాటాలకు ద్రవ్యత్వ లక్షణం ఉండటంవలన కంపెనీకి స్థిరత్వము కల్పిస్తుంది.

5. పెద్దతరహా కార్యకలాపాల ఆదాలు : అధిక నిధుల వలన కంపెనీలు ఉత్పత్తిని భారీగా చేపడతాయి. అందువలన కొనుగోళ్ళు, మార్కెటింగ్, సిబ్బంది వినియోగం, రవాణా తదితర వ్యవహారాలలో అనేక ఆదాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి.

6. సమర్థవంతమైన నిర్వహణ : కంపెనీకి అపారమైన నిధులు ఉండటం వలన నిర్వహణ నిపుణులను, వ్యయగణకులను, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, సాంకేతిక నిపుణులను నియమిస్తే వారు నిర్వహణను సమర్థవంతముగా చేపడతారు.

7. పరిశోధన మరియు అభివృద్ధి : ఒక కంపెనీ ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడానికి, నూతన వస్తువుల రూపకల్పనకు, కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఈ విస్తరణ కంపెనీలలోనే సాధ్యము.

8. పన్ను ఆదాలు : కంపెనీలు ఆదాయపు పన్ను ఎక్కువ కట్టవలసి వచ్చినప్పటికి, ఎన్నో పన్ను మినహాయింపులు ఇవ్వడం వలన వీటికి పన్ను చెల్లించే బాధ్యత మొత్తంమీద తగ్గుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

పరిమితులు :
1. స్థాపనలో సౌలభ్యము లేకపోవడము : ఒక కంపెనీని స్థాపించడం చాలా కష్టముతోనూ, ఖర్చుతో కూడుకున్నది. అనేక పత్రాలు తయారుచేసి రిజిస్ట్రారుకు సమర్పించాలి. ఇందుకు నిపుణులు కావలెను. కంపెనీని తప్పనిసరిగా నమోదు చేయవలెను. కాబట్టి కంపెనీ స్థాపన సులభమైన ప్రక్రియ కాదు.

2. డైరెక్టర్ల స్వార్ధపరత్వము : కంపెనీ యజమానులైన వాటాదారులు కంపెనీని పరిపాలన చేయరు. నిర్వహణ కోసం డైరెక్టర్లను ఎన్నుకుంటారు. డైరెక్టర్లు తమ అధికారాలను ముఖ్యకార్యనిర్వహణాధికారికి దత్తం చేస్తారు. ఆయన తన అధికారాలను కింద ఉద్యోగులకు అప్పగిస్తారు. వీరిలో ఎవరు అసమర్థులైనా, స్వార్థపరులైనా కంపెనీ నష్టాలపాలై దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది.

3. శ్రద్ధాసక్తులు తక్కువ : యాజమాన్యానికి, నిర్వహణకు అంతరము ఉంటుంది. నిర్వహణ అంతా సిబ్బంది ‘ద్వారా జరుగుతుంది. సిబ్బందికి వ్యక్తిగత చొరవ, శ్రద్ధాసక్తులు ఉండకపోవచ్చు. సిబ్బంది కష్టపడినా ప్రోత్సాహముండదు కాబట్టి వారిలో అలసత్వము ఏర్పడుతుంది.

4. కొద్దిమంది పరిపాలన : సిద్ధాంతరీత్యా కంపెనీ నిర్వహణ ప్రజాస్వామిక సూత్రాలను అనుసరించి ఉంటుంది. కాని ఆచరణలో ఇది అల్ప సంఖ్యాకుల నిర్వహణ. ఓటింగ్ హక్కులు, నిర్వహణాధికార్డులు చేజిక్కించుకున్న ‘ కొంతమంది డైరెక్టర్లు లోపలి వృత్తముగా ఏర్పడి సర్వాధికారాలు చెలాయిస్తారు.

5. అధికమైన ప్రభుత్వ నియంత్రణ : కంపెనీ నిర్వహణలో అనేక నిబంధనలు పాటించాలి. వార్షిక నివేదికలు, తనిఖీ చేసిన లెక్కలను విధిగా రిజిస్ట్రారుకు సమర్పించాలి. డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వ అనుమతి పొందాలి. కంపెనీ ధ్యేయాలు మార్పుచేయడానికి అనేక చట్టబద్దమైన లాంఛనాలు పాటించాలి.

6. వాటాలలో అనుచిత స్పెక్యులేషన్: పబ్లిక్ కంపెనీల వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చి సులభముగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వాటా ధరలు కంపెనీ ఆర్థిక పరిస్థితి, డివిడెండ్ల చెల్లింపు, కంపెనీ పేరు ప్రతిష్ట, కంపెనీ అభివృద్ధికి అవకాశాలు మొదలైనవాటి మీద ఆధారపడతాయి. కంపెనీ డైరెక్టర్లు కంపెనీ లెక్కలను తారుమారుచేసి, వాటా విలువను తమకు అనుకూలముగా మార్చుకొని స్పెక్యులేషన్ ద్వారా డైరెక్టర్లు లాభపడతారు.

7. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడములో జాప్యము : కంపెనీ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలను డైరెక్టర్ల సమావేశాలలోనూ, వాటాదారుల సమావేశాలలోను తీసుకొనవలెను. ఈ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కొంత కాలయాపన జరుగుతుంది.

8. వ్యాపార రహస్యాలు : వ్యాపార నిర్వహణ వాటాదారులు, డైరెక్టర్లు, ఉద్యోగుల చేతులలో ఉంటుంది. కాబట్టి కంపెనీ రహస్యాలను కాపాడటానికి వీలులేదు.

9. ఆసక్తుల సంఘర్షణ : ఈ తరహా వ్యాపారములో ఆసక్తులకు సంబంధించి నిరంతరము సంఘర్షణ జరుగుతుంది. సాధారణముగా వాటాదారులు, డైరెక్టర్ల మధ్య లేదా వాటాదారులు, ఋణదాతల మధ్య లేదా మేనేజ్మెంట్, సిబ్బందికి మధ్య ఎప్పుడూ కలహాలు, కొనసాగుతూనే ఉంటాయి.

10. గుత్తాధిపత్యము కంపెనీలు గుత్తాధిపత్య ధోరణులను ప్రోత్సహిస్తుంది. వీరు వినియోగదారులను, శ్రామికులను దోచుకోవడం జరుగును.

ప్రశ్న 3.
ప్రైవేటు కంపెనీ, పబ్లిక్ కంపెనీలకు మధ్యగల తేడాలేవి ?
జవాబు:
ప్రైవేటు కంపెనీకి, పబ్లిక్ కంపెనీకి ఈ క్రింది వ్యత్యాసాలున్నవి.
ప్రైవేటు కంపెనీ

  1. సభ్యుల సంఖ్య : కనీసము ఇద్దరు సభ్యులు ఉండాలి. గరిష్ట సభ్యుల సంఖ్య యాభైకి మించరాదు.
  2. కనీస చెల్లింపు మూలధనము 1,00,000.
  3. పేరు : పేరు చివర ప్రైవేటు లిమిటెడ్ అనే మాటలుండాలి.
  4. మూలధన సేకరణ : మూలధన సేకరణకు పరిచయ పత్రాన్ని జారీ చేయరాదు.
  5. వ్యాపార ప్రారంభము : నమోదు పత్రాన్ని పొందిన వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
  6. శాసనాత్మక సమావేశము : శాసనాత్మక సమావేశము ఏర్పాటుచేయనవసరం లేదు.
  7. కనీసపు చందా : కనీసపు చందా నిమిత్తము లేకుండా వాటాలను కేటాయించవచ్చును.
  8. డైరెక్టర్లు : కనీసం ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి. డైరెక్టర్లుగా ఉండటానికి అర్హత వాటాలు తీసుకోనవసరము లేదు. డైరెక్టర్లు రొటేషన్ పద్ధతిలో పదవీ విరమణ చేయనవసరము లేదు.
  9. నియామకము : డైరెక్టర్లు అందరిని ఒకే తీర్మానము ద్వారా నియామకం చేయవచ్చును.
  10. నిర్వాహక పారితోషికము : డైరెక్టర్లకు, ఇతర నిర్వాహకులకు చెల్లించే పారితోషికంపై ‘ పరిమితి లేదు.
  11. కోరమ్ : సమావేశాలకు ఉండవలసిన కోరమ్ 2.
  12. డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వపు అనుమతి లేకుండా ఋణాలు ఇవ్వవచ్చును.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

పబ్లిక్ కంపెనీ

  1. కనీసము ఏడుగురు సభ్యులుండాలి. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  2. కనీస చెల్లింపు మూలధనము 5,00,000
  3. పేరు చివర లిమిటెడ్ అనే మాటను వాడాలి.
  4. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయపత్ర నివేదికను విధిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
  5. వ్యాపార ప్రారంభ ధ్రువపత్రము పొందకుండా వ్యాపారాన్ని ప్రారంభించరాదు.
  6. శాసనాత్మక సమావేశము ఏర్పాటుచేసి శాసన నివేదికను రిజిస్ట్రారుకు దాఖలుచేయవలెను.
  7. కనీసపు చందా నిర్ణీత సమయములో రాకపోతే వాటాలను కేటాయించడానికి వీలులేదు.
  8. కనీసము ముగ్గురు డైరెక్టర్లు ఉండాలి. -డైరెక్టర్లుగా ఉండటానికి అర్హత వాటాలు తీసుకొనవలెను. ప్రతి ఏటా మూడోవంతు డైరెక్టర్లు పదవీ విరమణ చేయవలెను.
  9. ప్రతి డైరెక్టరు ఎన్నికకు ఒక ప్రత్యేక తీర్మానము చేయవలెను.
  10. డైరెక్టర్లకు, నిర్వాహకులకు చెల్లించే పారితోషికం నికర లాభములో 11%నకు మించరాదు.
  11. సమావేశాలకు ఉండవలసిన కోరమ్ 5.
  12. కేంద్ర ప్రభుత్వము అనుమతి లేకుండా డైరెక్టర్లకు ఋణాలను మంజూరు చేయరాదు

ప్రశ్న 4.
భాగస్వామ్యము, కంపెనీ వ్యాపారముల మధ్య గల వ్యత్యాసము లేవి ?
జవాబు:
భాగస్వామ్యానికి, కంపెనీలకు మధ్య ఈ క్రింది వ్యత్యాసాలున్నవి.
భాగస్వామ్యము

  1. స్థాపన : 1932 భారత భాగస్వామ్య చట్టముననుసరించి స్థాపించబడుతుంది.
  2. నమోదు : నమోదు తప్పనిసరి కాదు.”
  3. సభ్యుల సంఖ్య : కనీస సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలలో 10, ఇతర వ్యాపారాలలో 20.
  4. వ్యాపార ప్రారంభము : భాగస్తులు ఒప్పందము కుదుర్చుకున్న వెంటనే ప్రారంభించవచ్చును.
  5. వ్యక్తిత్వము : సభ్యులకు సంస్థకు తేడా లేదు.
  6. ఋణబాధ్యత : భాగస్తుల ఋణబాధ్యత వ్యక్తిగతము, సమిష్టిగతము, అపరిమితము.
  7. వాటాలబదిలీ : ఇతర భాగస్తుల అనుమతి లేకుండా ఏ భాగస్తుడు తన వాటాను బయటవారికి బదిలీ చేయరాదు.
  8. పారంపర్యాధికారము : భాగస్తుల మరణం, విరమణ, దివాలా మూలముగా భాగస్వామ్యము రద్దవుతుంది.
  9. మూలధనము : సంస్థే మూలధనాన్ని సమకూర్చుకుంటుంది.
  10. ఖాతాల ఆడిట్: ఖాతాలను ఆడిట్ చేయనవసరము లేదు.
  11. బాధ్యత : భాగస్తుల కార్యకలాపాలకు సంస్థ బాధ్యత వహిస్తుంది.
  12. నిర్వహణ : భాగస్తులే నిర్వహణ చేపడతారు.

కంపెనీ

  1. 1956 భారత కంపెనీల చట్టముననుసరించి స్థాపన జరుగుతుంది.
  2. నమోదు తప్పనిసరి.
  3. ప్రైవేటు కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య 50. పబ్లిక్ కంపెనీలలో కనిష్ట సభ్యుల సంఖ్య 7. గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
  4. ప్రైవేటు కంపెనీలు నమోదు పత్రాన్ని పబ్లిక్ కంపెనీలు వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందితేగాని వ్యాపారాన్ని ప్రారంభించుటకు వీలులేదు.
  5. కంపెనీ వేరు. కంపెనీలో ఉండే సభ్యులు వేరు.
  6. వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల విలువ మేరకే పరిమితము అవుతుంది.
  7. వాటాదారులు తమ వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చును.
  8. వాటాదారులు, డైరెక్టర్లు మరణించినా, విరమించినా కంపెనీ యథావిధిగా కొనసాగుతుంది.
  9. వాటాలను జారీచేసి, మూలధనాన్ని సేకరించుకుంటుంది.
  10. ఖాతాలను తప్పనిసరిగా ఆడిట్ చేయించాలి.
  11. వాటాదారుల చర్యలు కంపెనీని బంధించలేవు.
  12. కంపెనీలలో నిర్వహణ బాధ్యతను డైరెక్టర్ల బోర్డుకు అప్పగిస్తారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏవైనా ఐదు రకాల కంపెనీలను వివరింపుము.
జవాబు:
కంపెనీలను వ్యవస్థాపన, ప్రజల ఆసక్తి, ఋణబాధ్యత, నియంత్రణ, జాతీయత ఆధారముగా అనేక రకాలుగా విభజించవచ్చును.
1. చార్టర్డ్ కంపెనీలు : ఒక దేశము యొక్క రాజు జారీ చేసిన రాజశాసనమును అనుసరించి ఏర్పడిన కంపెనీలను రాజశాసన కంపెనీలు అంటారు. ఇలాంటి కంపెనీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఉదా : ఈస్ట్ ఇండియా కంపెనీ, ఛార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

2. శాసనాత్మక కంపెనీలు : ఒక దేశ పార్లమెంటుగాని, రాష్ట్ర శాసనసభ ఆమోదించి ప్రత్యేక చట్టము ద్వారా’ ఏర్పడిన కంపెనీలను శాసనాత్మక కంపెనీలు అంటారు. ఉదా : భారత రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, జీవిత భీమా కార్పొరేషన్ మొదలైనవి.

3. రిజిష్టర్డ్ కంపెనీలు : కంపెనీల చట్టము క్రింద రిజిస్ట్రారు వద్ద నమోదైన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అంటారు. ఉదా : ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్, ఇండోనిప్పన్ బాటరీస్ లిమిటెడ్.

4. ప్రభుత్వ కంపెనీలు : కంపెనీల చట్టము 1956 సెక్షన్ 617 ప్రకారము ఏ రిజిస్టర్అయినా కంపెనీలో అయినా కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రెండింటికి చెల్లించిన మూలధనములో 51 శాతానికి ఎక్కువ వాటాలున్న కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ప్రభుత్వము పూర్తిగా లేదా పాక్షికముగా యాజమాన్యాన్ని నిర్వహించవచ్చును. ఉదా : విశాఖ స్టీల్ ప్లాంటు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మొదలైనవి.

5. ప్రైవేటు కంపెనీలు : కంపెనీ నియమావళి ప్రకారము వాటాలను బదిలీ చేయడానికి వీలులేదని, సభ్యుల సంఖ్య 50కి మించరాదని, మూలధన సేకరణకోసం పరిచయ పత్రము జారీచేయడానికి వీలులేని కంపెనీలు ప్రైవేటు కంపెనీలు.

6. పబ్లిక్ కంపెనీలు : చట్టము ప్రకారము ప్రైవేటు కంపెనీలుకాని కంపెనీలు పబ్లిక్ కంపెనీలే. 7. వాటా పరిమిత కంపెనీలు : ఏ కంపెనీలో అయితే వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటా విలువకు పరిమితము అవుతుందో ఆ కంపెనీలను వాటా పరిమిత కంపెనీలు అంటారు.

8. పూచీ పరిమిత కంపెనీలు : ఈ కంపెనీలలో వాటాదారులు కంపెనీ పరిసమాప్తి సమయములో ఒక స్థిర · మొత్తాన్ని చెల్లించడానికి పూచీ ఇస్తారు.

9. అపరిమిత కంపెనీలు : ఈ తరహా కంపెనీలలో వాటాదారుల ఋణబాధ్యత అపరిమితముగా ఉంటుంది.

10. హోల్డింగ్ కంపెనీ : ఒక కంపెనీ వేరొక కంపెనీలో 51 శాతము వాటాలుండి ఆ కంపెనీ విధి విధానాలను నియంత్రించే అధికారము ఉంటే ఆ కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటారు.

11. అనుబంధ కంపెనీ : ఒక కంపెనీని వేరొక కంపెనీ నిర్వహణను నియంత్రించగలిగినపుడు, నియంత్రించబడే కంపెనీని అనుబంధ కంపెనీ అంటారు.

12. స్వదేశ కంపెనీలు : ఒక కంపెనీ మన దేశపు కంపెనీల చట్టం క్రింద నమోదై, మన దేశములో గాని, విదేశాలలో గాని వ్యాపారాన్ని కొనసాగిస్తే దానిని స్వదేశ కంపెనీ అంటారు.

13. విదేశ కంపెనీలు : వేరే దేశములో నమోదై, మన దేశములో వ్యాపార కేంద్రాన్ని ఏర్పరచుకున్న కంపెనీలను విదేశ కంపెనీలు అంటారు.

14. జాతీయ కంపెనీలు : కంపెనీగా నమోదైన దేశపు సరిహద్దులను దాటకుండా వ్యాపారము చేయు కంపెనీలను జాతీయ కంపెనీలు అంటారు.

15. బహుళ జాతీయ కంపెనీలు : తమ దేశపు సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా వ్యాపార కార్యకలాపములను నిర్వర్తించే కంపెనీలను బహుళ జాతీయ కంపెనీలు అంటారు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

ప్రశ్న 2.
పబ్లిక్ కంపెనీ లక్షణాలను వివరింపుము.
జవాబు:
కంపెనీల చట్టము 1956 సెక్షన్ 3 ప్రకారము ప్రైవేటు కంపెనీలు కానివన్నీ పబ్లిక్ కంపెనీలే. ఈ కంపెనీని స్థాపించడానికి కనీసము ఏడుగురు సభ్యులుండాలి. గరిష్ట సభ్యుల సంఖ్యపై పరిమితి లేదు. ఈ కంపెనీలు వాటాలను ప్రజలకు అమ్మవచ్చును. అందుకోసము ప్రజలకు పరిచయ పత్రాన్ని జారీచేయవచ్చును. సభ్యులు (వాటాదారులు) తమ వాటాలను తేలికగా బదిలీ చేసుకొనవచ్చును. ఈ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవలెనంటే రిజిస్ట్రారు నుంచి వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని తప్పనిసరిగా పొందవలెను. ఈ కంపెనీల కనీసపు చెల్లింపు మూలధనము 5,00,000.

భారీ మొత్తములో మూలధనమును వెచ్చించి పెద్ద తరహా కార్యకలాపాలను చేపట్టే వ్యాపార సంస్థలకు పబ్లిక్ కంపెనీ అనువైనది. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తన పేరు చివర లిమిటెడ్ అనే పదాన్ని ఉపయోగించాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బజాజ్ ఆటోలిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్లు పబ్లిక్ కంపెనీలకు ఉదాహరణలు.

 

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కంపెనీ – నిర్వచనం.
జవాబు:
కంపెనీల చట్టము ప్రకారము “అధికార ముద్రతో, పారంపర్యాధికారముతో చట్టము సృష్టించిన కల్పిత వ్యక్తిత్వముతో రిజిస్టర్ అయిన స్వచ్ఛంద సంస్థ”.
ప్రధాన న్యాయాధికారి కంపెనీలను ఈ విధముగా నిర్వచించినాడు. “న్యాయశాస్త్ర దృష్టిలో అదృశ్యముగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడు. కేవలము న్యాయశాస్త్ర సృష్టి వలన ఏర్పడినది. కాబట్టి రాజ్యాంగము నిర్దేశించిన ధర్మాలే ఉంటాయి. ఆ ధర్మాలలో అతిముఖ్యమైనవి శాశ్వతత్వము, వ్యక్తిత్వము.”

ప్రశ్న 2.
ప్రభుత్వ కంపెనీ
జవాబు:
కంపెనీల చట్టము 1956 సెక్షన్ 617 ప్రకారము ఏ రిజిష్టరు అయిన కంపెనీలోనైనా కేంద్రప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రెండింటికి చెల్లించిన మూలధనములో 51 శాతమునకు ఎక్కువ వాటాలున్న కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటారు. ప్రభుత్వము పూర్తిగా గాని, పాక్షికముగా గాని యాజమాన్యాన్ని నిర్వహించవచ్చు. ఉదా : విశాఖ స్టీల్ ప్లాంటు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్.

AP Inter 1st Year Commerce Study Material Chapter 6 జాయింట్ స్టాక్ కంపెనీ స్థాపన

ప్రశ్న 3.
శాసనాత్మక కంపెనీ
జవాబు:
ప్రజాశ్రేయస్సు దృష్ట్యా లోక్సభలోనూ, శాసనసభలోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శాసనము చేసి కంపెనీలను ఏర్పాటుచేస్తాయి. ఇలాంటి కంపెనీలను ప్రత్యేక శాసనాల ద్వారా ఏర్పరచిన కంపెనీలు లేదా శాసనాత్మక కంపెనీలు అంటారు. ఉదా : రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఎయిర్ ఇండియా లిమిటెడ్, జీవిత భీమా కార్పొరేషన్, పారిశ్రామిక ద్రవ్య సహాయ సంస్థ మొదలైనవి.