Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 5th Lesson భాగస్వామ్య వ్యాపార సంస్థ Textbook Questions and Answers.
AP Inter 1st Year Commerce Study Material 5th Lesson భాగస్వామ్య వ్యాపార సంస్థ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భాగస్వామ్యాన్ని నిర్వచించి, ప్రయోజనాలు, పరిమితులను చర్చించండి. [A.P & T.S. Mar. ’15]
జవాబు:
కొంత మంది వ్యక్తులు కలిసి ఉమ్మడిగా చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారము అని చెప్పవచ్చును. 1932 భారత భాగస్వామ్య చట్టం ప్రకారం భాగస్వామ్యాన్ని దిగువ విధముగా నిర్వచించినారు. – “అందరుకుగాని, అందరి తరపున కొందరుగాని వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందులోని లాభాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము”.
భాగస్వామ్య సంస్థ ప్రయోజనాలు:
1. స్థాపనా సౌలభ్యము: భాగస్వామ్య వ్యాపారాన్ని స్థాపించడానికి చట్టబద్ధమైన లాంఛనాలు తక్కువ. నమోదు తప్పని సరికాదు. దీనిని స్థాపించడానికి వ్రాత పూర్వకమైన లేదా నోటిమాటల ద్వారా ఏర్పరచుకున్న సాధారణ ఒప్పందము సరిపోతుంది.
2. అధిక నిధులు లభ్యము: భాగస్తులందరూ పెట్టుబడి పెడతారు కాబట్టి, సొంత వ్యాపారానికంటే భాగస్వామ్యానికి ఎక్కువ నిధులు లభిస్తాయి.
3. సత్వర నిర్ణయాలు: భాగస్తులందరూ స్థానికులే కాబట్టి తరచూ కలుసుకుంటూ ఉంటారు. వ్యాపార నిర్ణయాలు జాప్యము లేకుండా తీసుకోవచ్చు. త్వరిత నిర్ణయాల వలన వ్యాపార లాభాలు పెరుగుతాయి.
4. మార్పునకు అనుకూలము: అవసరాన్ని బట్టి వ్యాపారములో మార్పులు చేయడానికి న్యాయపరమైన అవరోధాలు తక్కువ. వ్యాపారస్వభావాన్ని, ప్రదేశాన్ని సులభముగా మార్చుకోవచ్చును.
5. వ్యాపార రహస్యాలు: వ్యాపార రహస్యాలు భాగస్తులకు మాత్రమే తెలిసి ఉంటుంది. లాభనష్టాలను, ఆస్తి-అప్పుల వివరాలను బయటకు వెల్లడిచేయరు. రహస్యాలను జాగ్రత్తగా కాపాడతారు.
6. నష్టాల పంపిణీ: భాగస్వామ్య వ్యాపారములో వచ్చిన నష్టాలను భాగస్తులందరూ అంగీకరించిన నిష్పత్తిలో పంచుకుంటారు. విడివిడిగా ఒక్కొక్క భాగస్తుడు భరించే నష్టము తక్కువ.
7. వ్యక్తిగత శ్రద్ధ: భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రత్యక్షముగాను, అతి సన్నిహితముగాని పర్యవేక్షణ చేస్తారు. అందువలన వృథాలు తగ్గి, వ్యాపారము విజయవంతము అవుతుంది.
8. ప్రత్యేకీకరణ: భాగస్వామ్యములో మూలధనము, నిర్వహణా సామర్థ్యము, సాంకేతిక నైపుణ్యము తదితర లక్షణాలు గల భాగస్తుల కలయిక వలన ప్రత్యేకమైన సేవలను ఉపయోగించుకొని సంస్థ రాణిస్తుంది.
9. ఆసక్తుల పరిరక్షణ: భాగస్వామ్యములో ప్రతిభాగస్తుని హక్కులు, ఆసక్తులు పూర్తిగా కాపాడబడతాయి. ఏ. భాగస్తుడైనా ఒక నిర్ణయం పట్ల అసంతృప్తి చెందితే, అతడు రద్దును కోరవచ్చు లేదా వైదొలగవచ్చు.
పరిమితులు/లోపాలు: భాగస్వామ్య సంస్థలకు క్రింది పరిమితులున్నవి.
1. పరిమిత మూలధనము: వాటాదారుల సంఖ్యకు పరిమితిలేని జాయింట్ స్టాకు కంపెనీలతో పోలిస్తే భాగస్వామ్య సంస్థ నిధులను సేకరించే శక్తి తక్కువ. భాగస్వామ్యములో 20 మందికి మించి భాగస్తులు ఉండరాదు.
2. స్థిరత్వము లేకపోవుట: భాగస్తులలో ఎవరు మరణించినా, విరమించినా లేదా దివాలాతీసినా భాగస్వామ్యము రద్దు అవుతుంది. అసంతృప్తి చెందిన ఏ భాగస్తుడైనా సంస్థను రద్దుపరచడానికి ఏ సమయములోనైనా నోటీసు ఇవ్వవచ్చును.
3. అపరిమిత ఋణబాధ్యత: భాగస్తుల ఋణ బాధ్యత పరిమితము. సంస్థ నష్టాలపాలై వ్యాపార అప్పులను సంస్థ ఆస్తుల నుంచేకాక భాగస్తుల సొంత ఆస్తుల నుంచి తీర్చవలసి ఉంటుంది.
4. వాటాను బదిలీ చేయరాదు: ఏ భాగస్తుడు సహభాగస్తుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేయడానికి వీలులేదు. దీనికి ప్రత్యామ్నాయం సంస్థను రద్దు పరచడమే.
5. భాగస్తుల మధ్య ఐక్యత లోపము: ప్రతి భాగస్తుడు నిర్వహణలో పాల్గొనవచ్చు. ఏ విషయములోనైనా తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. ఇది కొన్నిసార్లు భాగస్తుల మధ్య అభిప్రాయభేదాలు, తగాదాలకు దారితీయవచ్చును.
6. ప్రచ్ఛన్న అధికారము: సంస్థ తరపున లావాదేవీలు జరపడానికి ప్రతిభాగస్తునకు హక్కు ఉంటుంది. ఇది ఆసరాగా తీసుకొని కొంతమంది భాగస్తులు నిర్లక్ష్యముగాను, ‘దురుద్దేశముతో వ్యవహరిస్తే సంస్థ నష్టాలపాలయ్యే అవకాశమున్నది.
7. ప్రజలకు విశ్వాసము లేకపోవడం: భాగస్వామ్యములో లెక్కలను ప్రచురించరు. అంతాగోప్యముగా ఉంటుంది, కాబట్టి ప్రజలకు వీటిపై విశ్వాసము ఉండదు.
ప్రశ్న 2.
భారత భాగస్వామ్య చట్టము, 1932 ప్రకారము భాగస్వామ్య నమోదు తప్పనిసరియా ? సంస్థ నమోదుకు సంబంధించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
భాగస్వామ్య సంస్థ నమోదు తప్పనిసరి అని భారత భాగస్వామ్య చట్టము, 1932లో చెప్పలేదు. కాని సంస్థ నమోదు కాకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. అందువలన నమోదు ఆవశ్యకము అవుతుంది. నమోదును ఏ సమయములోనైనా చేయించవచ్చును. సంస్థను నమోదు చేయడానికి క్రింది విధానాన్ని అవలంబించవలసి
ఉంటుంది.
నమోదు పద్ధతి: భాగస్వామ్య సంస్థ నమోదు కొరకు భాగస్తులు దిగువ సమాచారముతో ఒక నివేదికను తయారుచేసి దరఖాస్తు చేసుకోవాలి.
- భాగస్వామ్య సంస్థ పేరు.
- సంస్థ వ్యాపారము చేసే ప్రదేశము లేదా ప్రదేశాలు.
- భాగస్తుల పూర్తి పేర్లు, చిరునామాలు.
- ప్రతి భాగస్తుడు సంస్థలో చేరిన తేది.
- సంస్థ ప్రారంభమైన తేది, వ్యాపారస్వభావము. .
- భాగస్వామ్య వ్యాపార సంస్థ కాలపరిమితి.
- భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించిన ఇతర అంశాలు.
భాగస్తులు ఈ దరఖాస్తు పత్రముపై సంతకాలు చేసి క్ 3 నమోదు రుసుము చెల్లించి రిజిష్ట్రారుకు దాఖలు చేయాలి. చట్ట ప్రకారము ఉన్న నియమ నిబంధనలతో దరఖాస్తును పరిశీలించిన పిమ్మట రిజిష్ట్రారు సంతృప్తిపడితే, సంస్థ పేరును, భాగస్తుల పేర్లను రిజిష్టరులో నమోదు చేసి, అధికార ముద్రవేసిన నమోదు పత్రాన్ని రిజిష్టారు సంబంధిత సంస్థకు జారీ చేస్తాడు..
ప్రశ్న 3.
భాగస్తులలో రకాలను వివరించండి.
జవాబు:
భాగస్తులకు భాగస్వామ్యములో ఉండే ఆసక్తిని బట్టి వారి బాధ్యతలు, విధులనుబట్టి, నిర్వహణలో వారికున్న హక్కులనుబట్టి భాగస్తులను అనేక రకాలుగా వర్గీకరిస్తారు.
1. సక్రియ భాగస్తుడు: భాగస్వామ్య వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రధాన పాత్రను నిర్వహించే భాగస్తుని ‘సక్రియ భాగస్తుడు’ లేదా ‘నిర్వాహక భాగస్తుడు’ అంటారు. ఇటువంటి భాగస్తుడు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడమే కాక, సంస్థ యొక్క వ్యవహారాలలో ఆసక్తిని చూపించి, సంస్థను నిర్వహించడములో ముఖ్యమైన పాత్రను ” వహిస్తాడు.
2. నిష్క్రియ భాగస్తుడు: భాగస్వామ్య సంస్థకు మూలధనాన్ని సమాకూర్చి నిర్వహణలో పాల్గొనని భాగస్తుని ‘నిష్క్రియ భాగస్తుడు’ అంటారు. ఇతడు నిర్వహణలో పాల్గొనకపోయినా లాభనష్టాలను పంచుకుంటాడు.
3. నామమాత్రపు భాగస్తుడు: యదార్థముగా భాగస్వామ్య సంస్థలో భాగస్తుడు కాకపోయినా తన పేరును, పరపతిని వినియోగించడానికి అంగీకరిస్తే అటువంటి భాగస్తుని నామమాత్రపు భాగస్తుడు అంటారు. ఇతడు మూలధనాన్ని సమకూర్చడు. నిర్వహణలో పాలుపంచుకోడు. లాభాలను పంచుకోడు. అయినప్పటికీ సంస్థ బయటవారితో చేసే కార్యకలాపాలకు ఇతను కూడా బాధ్యత వహిస్తాడు.
4. లాభాలలో భాగస్తుడు: సంస్థ నష్టాలతో సంబంధము లేకుండా లాభాలలో మాత్రమే వాటా పొందే భాగస్తుని లాభాలలో భాగస్తుడు అంటారు. ఇది ‘మైనర్లకు మాత్రమే వర్తిస్తుంది. కారణము మైనర్లు సంస్థ లాభాలలోని భాగాన్ని పొందుతాడు. వారి ఋణ బాధ్యత వారి మూలధనానికి మాత్రమే పరిమితము అవుతుంది.
5. పరిమిత భాగస్తుడు: భాగస్వామ్యములో భాగస్తుని ఋణబాధ్యత సాధారణముగా అపరిమితముగా, సమిష్టిగా, వ్యక్తిగతముగా ఉంటుంది. కాని భాగస్తుని ఋణబాధ్యత అతడు సమకూర్చిన మూలధనానికే పరిమితము అయితే అతనిని పరిమిత భాగస్తుడు అంటారు.
6. సాధారణ భాగస్తుడు: అపరిమిత ఋణ బాధ్యత ఉన్న భాగస్తులను సాధారణ భాగస్తులు అంటారు.
7. భావిత భాగస్తుడు: ఒక వ్యక్తి తన మాటల ద్వారాగాని, చేష్టల ద్వారాగాని ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోయినా భావిత భాగస్తుడే బాధ్యత
వహించాలి.
8. మౌన నిర్ణీత భాగస్తుడు: ఒక భాగస్తుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్తునిగా ప్రకటించినపుడు, భాగస్తుడు కాకపోతే ఆ ప్రకటనను ఖండించవలెను. అలా ఖండించకుండా మౌనముగా ఉండే అతనిని మౌన నిర్ణీత భాగస్తుడు అంటారు. ఇతనికి సంస్థ లాభాలలో వాటా ఉండదు కాని సంస్థ చేసే అప్పులకు మాత్రము పూర్తి బాధ్యత
వహించాలి.
ప్రశ్న 4.
భాగస్వామ్య ఒప్పందము అంటే ఏమిటి ? అందులోని ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు:
హారానికి దారము ఎంత ముఖ్యమో భాగస్వామ్యానికి ఒప్పందము అంత ముఖ్యమైనది. వ్యాపారము నిర్వహించడానికి, లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒడంబడిక కుదురుతుంది. దీనిని భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఇది నోటి మాటలద్వారాగాని, వ్రాతపూర్వకముగాగాని ఉండవచ్చు. అయితే ఇది వ్రాత పూర్వకముగా ఉంటే మంచిది. దీని మీద భాగస్తులందరూ సంతకాలు చేయాలి. దీనిని రిజిష్ట్రారు వద్ద నమోదు చేసుకుంటారు. సంస్థ వ్యాపార నిర్వహణలో భాగస్తుల మధ్య సంబంధము, వారి హక్కులు, విధులు, బాధ్యతలను ఈ ఒప్పందము నిర్వచిస్తుంది. దీనితో బయట వ్యక్తులకు సంబంధము లేదు. ఇందులో పేర్కొన్న అంశాలు భాగస్వామ్య చట్టములోని అంశాలకు విరుద్ధముగా ఉండరాదు. భారత స్టాంపుల చట్టము 1989 ప్రకారము తగిన స్టాంపులను ఈ పత్రముపై అతికించవలసి ఉంటుంది. ప్రతి భాగస్తుని వద్ద ఒప్పందపు నకలు ఉంటుంది. సాధారణముగా ఒప్పందములో దిగువ పేర్కొనబడిన అంశాలు ఉంటాయి.
- వ్యాపార సంస్థ పేరు
- వ్యాపార స్వభావము
- వ్యాపార కాలపరిమితి
- భాగస్తుల పేర్లు, చిరునామాలు
- వ్యాపార ప్రదేశము
- భాగస్తులు సమకూర్చవలసిన మూలధనము
- లాభనష్టాల పంపిణీ నిష్పత్తి
- భాగస్తుల పెట్టుబడిపై చెల్లించవలసిన వడ్డీ
- భాగస్తుల సొంతవాడకాలు, అట్టి సొంతవాడకాలపై భాగస్తుడు చెల్లించవలసిన వడ్డీ
- భాగస్తులకు చెల్లించే జీతాలు, పారితోషికము
- భాగస్తుల హక్కులు, విధులు, బాధ్యతలు
- సంస్థ ఖాతాలను తయారు చేసే పద్ధతి, ఆడిట్ చేయించుట
- భాగస్వామ్య సంస్థ రద్దుపరిచే విధానము
- భాగస్తుల మధ్య తగాదాలు ఏర్పడినపుడు మధ్యవర్తుల ద్వారా పరిష్కార పద్ధతి.
అదనపు ప్రశ్నలు
ప్రశ్న 5.
సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి మధ్యగల వ్యత్యాసాలను తెలపండి.
జవాబు:
సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి మధ్యగల తేడాలు:
సొంత వ్యాపార సంస్థ
- వ్యక్తుల సంఖ్య: దీనిలో ఒకే వ్యక్తి ఉండును.
- స్థాపన: దీనిని స్థాపించుట చాలా సులభం.
- ఋణ బాధ్యత: సొంతవ్యాపారి ఋణబాధ్యత అపరిమితము.
- నమోదు: వ్యాపార సంస్థ నమోదు తప్పని సరికాదు.
- మూలధనము: ఒకే వ్యక్తి మూలధనాన్ని సమ కూరుస్తాడు, కాబట్టి మూలధనము తక్కువ.
- ఒప్పందము: ఒప్పందము అవసరము లేదు.
- వ్యాపార రహస్యాలు: ఒకే వ్యక్తి ఉండటం వలన వ్యాపార రహస్యాలు కాపాడుకోవచ్చు.
- శీఘ్ర నిర్ణయాలు: వ్యాపార నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు.
- శ్రమ విభజన: ఒకే వ్యక్తి ఉండటము వలన శ్రమ విభజనకు అవకాశము లేదు.
- మంచి నిర్ణయాలు: ఒకే వ్యక్తి ఉండటం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు.
భాగస్వామ్య వ్యాపార సంస్థ
- కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారమయితే 10, ఇతర వ్యాపారమైతే 20.
- వ్యాపార స్థాపనకు భాగస్తుల మధ్య అంగీకారముకావలెను.
- భాగస్తుల ఋణ భాధ్యత అపరిమితం, వ్యక్తిగతం, సమిష్టిగతము.
- నమోదు తప్పనిసరి కాకపోయినా అవసరము.
- ఎక్కువ మంది భాగస్తులు ఉండటము వలన ఎక్కువ మూలధనము ఉంటుంది.
- ఒప్పందము లేకుండా భాగస్వామ్యము ఏర్పడదు.
- ఎక్కువ మంది వ్యక్తులు ఉండటము వలన వ్యాపార రహస్యాలు కాపాడలేరు.
- నిర్ణయాలు తీసుకోవడములో ఆలస్యము జరుగుతుంది.
- ఎక్కువ మంది ఉండటము వలన శ్రమ విభజనను ప్రవేశపెట్టవచ్చును.
- భాగస్తులందరూ సమిష్టిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశమున్నది.
ప్రశ్న 6.
భాగస్వామ్య వ్యాపారము, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారాలకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు:
సమిష్టి.హిందూ కుటుంబానికి, భాగస్వామ్యానికి మధ్య గల తేడాలు:
భాగస్వామ్య సంస్థ,
- స్థాపన: భాగస్తుల మధ్య ఒప్పందము.
- సభ్యుల సంఖ్య: కనిష్ట సభ్యుల సంఖ్య 2 గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారాలయితే 10, ఇతర వ్యాపారాలయితే 20.
- నిర్వహణ: భాగస్తులందరూ లేదా అందరు తరపున కొందరు వ్యాపారాన్ని నిర్వహిస్తారు.
- ఋణబాధ్యత: భాగస్తుల ఋణభాధ్యత వ్యక్తిగతం, సమిష్టిగతము, అపరిమితము.
- లాభాల పంపిణీ: ఒప్పందము ప్రకారము లాభనష్టాలను పంపిణీ చేస్తారు.
- రద్దు: భాగస్తుని విరమణ, మరణం లేదా దివాలా తీయడం వలన భాగస్వామ్య ఒప్పందము రద్దవుతుంది.
- మైనర్ భాగస్తుడు: చట్టము ప్రకారము మైనరు భాగస్తుడు కాలేడు.
- సభ్యులను భాగస్తులు అంటారు.
- అధికారము: సంస్థ తరపున వ్యవహరించ- డానికి భాగస్తులకు ప్రచ్ఛన్న అధికారము ఉంటుంది.
- నూతన సభ్యులు: సహభాగస్తుల అంగీకారముతో కొత్త వారిని భాగస్తులుగా చేర్చుకోవచ్చు.
సమిష్టి హిందూ కుటుంబము
- హిందూ చట్టము ద్వారా ఏర్పడుతుంది.
- కనిష్ట సభ్యుల సంఖ్య లేదు. సహవారసుల సంఖ్యకు పరిమితి లేదు.
- కర్త మాత్రమే నిర్వహణను చేపడతాడు.
- కర్త ఋణబాధ్యత అపరిమితము. సహవారసుల ఋణబాధ్యత వారి వాటాలకే పరిమితము. 5. సహవారసుల జనన, మరణాల ద్వారా లాభ నష్టాల వాటా మారుతూ ఉంటుంది.
- ఎవరు మరణించినా వ్యవస్థ రద్దు కాదు. కుటుంబము విడిపోతే వాటాలను పంచడం జరుగుతుంది.
- మైనరు అయినా ఉమ్మడి కుటుంబములో సహవారసుడు అవుతాడు.
- సభ్యులను సహవారసులు అంటారు.
- సహవారసులకు ప్రచ్ఛన్న అధికారము ఉండదు.
- సహవారసులు అంగీకరించినా బయటి వారిని సహవారసులుగా చేర్చుకొనడానికి వీలులేదు.
ప్రశ్న 7.
సహకార సంస్థలకు, భాగస్వామ్యానికి మధ్య గల వ్యత్యాసములేవి ?
జవాబు:
సహకార సంస్థలకు, భాగస్వామ్య సంస్థలకు గల తేడాలు:
సహకార సంస్థ
- స్థాషన: సహకార సంస్థల చట్టం 1912 క్రింద ఇవి స్థాపించబడతాయి..
- సభ్యత్వము: కనిష్ట సభ్యుల సంఖ్య 10, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితము.
- ముఖ్య ఉద్దేశ్యము: సేవాశయము.
- ఋణ బాధ్యత: పరిమితము.
- నిర్వహణ: ప్రజాస్వామ్యబద్ధముగా సంస్థ నిర్వహించబడుతుంది.
- మినహాయింపులు, సౌకర్యములు ; ఆదాయపు పన్ను చెల్లింపులో, స్టాంపు రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది.
- మిగులు లాభాల పంపిణీ: లాభాలలో కొంత శాతము మాత్రమే సభ్యులకు డివిడెండ్లుగా పంచుతారు.
- మూలధనము: మొత్తము వాటాలలో 10%నకు మించిన వాటాలను ఏ వ్యక్తి కొనరాదు.
భాగస్వామ్య సంస్థ
- భారత భాగస్వామ్య చట్టం 1932 క్రింద ఇవి ఏర్పడతాయి.
- కనిష్ట సభ్యుల సంఖ్య 2. గరిష్ట సభ్యుల సంఖ్య బ్యాంకింగ్ వ్యాపారము అయితే 10, ఇతర వ్యాపారాలలో 20.
- ముఖ్య ఉద్దేశ్యము లాభాశయము.
- ఋణబాధ్యత అపరిమితము, వ్యక్తిగతము, సమిష్టి
- భాగస్వామ్య ఒప్పందము సంస్థ నిర్వహణలో పాల్గొనవచ్చు.
- ఎలాంటి సౌకర్యాలు, మినహాయింపులు ఉండవు.
- మొత్తము లాభాలను ఒప్పందము ప్రకారం భాగస్తులకు పంపిణీ చేస్తారు.
- ఒప్పందము ప్రకారము మూలధనాన్ని తేవడం జరుగుతుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భాగస్వామ్యాన్ని నిర్వచించి, ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు:
హాని ప్రకారము “లాభం ఆర్జించే నిమిత్తము చట్టబద్ధమైన వ్యాపారము చేయడానికి అంగీకరించిన అర్హులైన వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము”.
జాన్ శుఖిన్ ప్రకారం “ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారాన్ని ఉమ్మడిగా, బాధ్యతాయుతముగా నిర్వహించడం కోసం వ్రాతపూర్వకముగాగాని, నోటిమాటల ద్వారాగాని కుదుర్చుకున్న ఒప్పందమే భాగస్వామ్యము”. 1932 భారత భాగస్వామ్య చట్టము ప్రకారము “అందరూగాని, అందరి తరపున కొందరుగాని వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందులోని లాభాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే భాగస్వామ్యము”.
లక్షణాలు: భాగస్వామ్య సంస్థకు ఈక్రింది లక్షణాలు ఉంటాయి.
1. స్థాపన: లాభాన్ని ఆర్జించే ఉద్దేశ్యముతో చట్టబద్ధమైన వ్యాపారాన్ని నిర్వహిస్తూ, లాభనష్టాలను పంచుకోవడానికి వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి న్యాయాత్మక ఒప్పందము ద్వారా భాగస్వామ్య సంస్థలు అమలులోనికి వస్తాయి..
2. నమోదు ఐచ్ఛికము: భాగస్వామ్య సంస్థల నమోదు తప్పనిసరికాదు. నమోదు కాని సంస్థలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది.
3. అపరిమిత ఋణబాధ్యత: భాగస్తుల ఋణబాధ్యత అపరిమితము, వ్యక్తిగతము, సమిష్టిగతము. ఋణదాతలు తమ బాకీలను అందరి నుంచి లేదా ఏ ఒక్కరి నుంచైనా వసూలు చేసుకోవచ్చు. వ్యాపార అప్పులకు వ్యాపార ఆస్తులు సరిపోకపోతే, సొంత ఆస్తులనుంచి అప్పులను తీర్చవలసి ఉంటుంది.
4. యజమాని ప్రతినిధి సంబంధము: భాగస్వామ్యములో భాగస్తులు యజమానిగాను, ప్రతినిధులగానూ వ్యవహరిస్తారు. ఏ భాగస్తుడు అయినా బయటవారితో లావాదేవీలు జరపవచ్చు. వారు చేసే పనులకు ఇతర భాగస్తులు కూడా బాధ్యత వహించవలెను.
5. చట్టబద్ధమైన వ్యాపారము: లాభాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తులు చేసే వ్యాపారము చట్టసమ్మతమైనదిగా ఉండాలి.
ప్రశ్న 2.
భాగస్వామ్య నమోదు ప్రక్రియను వివరించండి.
జవాబు:
సమాధానానికి వ్యాసరూప సమాధాన ప్రశ్న నెంబరు 2 ను చూడండి.
ప్రశ్న 3.
భాగస్తుని హక్కులను సంక్షిప్తముగా వివరించండి.
జవాబు:
భాగసుని హక్కులు:
- ప్రతి భాగస్తునకు వ్యాపార నిర్వహణలో పాల్గొనే హక్కు ఉంటుంది.
- వ్యాపారములో వచ్చే లాభనష్టాలు, ఒప్పందములో లేకపోతే, సమానముగా పంచుకోవడానికి హక్కు ఉన్నది.
- వ్యాపార నిర్ణయాలు చేయడంలో ప్రతి భాగస్వామికి తన అభిప్రాయాలను యథేచ్ఛగా వెలుబుచ్చు హక్కు కలదు.
- ప్రతి భాగస్తుడు సంస్థ లెక్కలను తనిఖీ చేసే హక్కు ఉన్నది. అవసరమైన నకళ్ళు తీసుకునే హక్కు కూడా ఉన్నది.
- భాగస్వామ్య సంస్థకు ఏ భాగస్తుడైనా అప్పు ఇచ్చినట్లయితే దానిపై వడ్డీని పొందే హక్కు ఉంటుంది.
- సాధారణ వ్యాపార నిర్వహణలో ప్రతి భాగస్తుడు తాను చేసిన ఖర్చులను లేదా తనకు సంభవించిన నష్టాలను సంస్థ నుంచి రాబట్టుకోవడానికి హక్కు కలిగి ఉంటాడు.
- భాగస్తులకు సంస్థ యొక్క ఆస్తులపై సమిష్టి హక్కు ఉన్నది.
- సంస్థ కొరకు ప్రతి భాగస్తుడు సంస్థ ప్రతినిధిగా పనిచేసి తన చర్యలచే సంస్థకు బాధ్యత వహింపజేయు హక్కు ఉన్నది.
ప్రశ్న 4.
భాగస్తుని విధులను సంక్షిప్తముగా వివరించండి.
జవాబు:
భాగస్తుని విధులు:
- ప్రతి భాగస్తుడు తన విధులను నీతిగాను, నిజాయితీగాను నిర్వహించవలెను.
- ఇతర భాగస్తులతో అత్యంత విశ్వాసముగా వ్యవహరించాలి.
- సక్రియ భాగస్తుడు వ్యాపారము తాలూకు లెక్కలను నిజాయితీగా వ్రాయవలెను.
- వ్యాపార నిర్వహణలో వచ్చిన లాభనష్టాలను భాగస్వామ్య ఒప్పందములో పేర్కొనబడిన నిష్పత్తిలో పంచుకోవాలి.
- ఒక భాగస్వామి యొక్క అశ్రద్ధ వలన సంభవించిన నష్టమును ఆ భాగస్వామియే పూర్తిగా భరించవలెను.
- భాగస్తుడు తన సంస్థకు పోటీ వ్యాపారము చేయరాదు.
- ఏ భాగస్వామి వ్యాపార ఆస్తులను, పేరును ఉపయోగించి రహస్య లాభాలు లేదా కమీషన్ పొందరాదు.
- భాగస్తుల లిఖిత పూర్వకమైన అంగీకారము లేకుండా కొత్త వారిని భాగస్తునిగా చేర్చుకోరాదు.
- సహభాగస్తుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేయరాదు..
- ప్రతి భాగస్తుడు తన అధికార పరిధిలోనే నడుచుకోవాలి.
ప్రశ్న 5.
భాగస్వామ్య సంస్థ రద్దు రకాలను వివరించండి.
జవాబు:
భాగస్వామ్యము రద్దు, భాగస్వామ్య సంస్థ రద్దుకు తేడా ఉన్నది. భాగస్తుని మరణము, విరమణ, మతిభ్రమించడం, దివాలా తీయడం వలన భాగస్వామ్యము రద్దు అవుతుంది. కాని భాగస్వామ్య సంస్థ రద్దుకానవసరము లేదు. సంస్థను |పునర్వవస్థీకరణచెంది అదే పేరు మీద వ్యాపారాన్ని కొనసాగించవచ్చును. కాబట్టి భాగస్వామ్య రద్దులో సంస్థ రద్దు కావచ్చును లేదా కాకపోవచ్చును. కాని భాగస్వామ్య సంస్థ రద్దయితే వ్యాపారమును కొనసాగించే ప్రశ్న ఉండదు. సంస్థ ఆస్తులను అమ్మి, ఋణదాతలకు చెల్లించగా ఏమైనా మిగిలితే మిగిలిన భాగస్తులు పంచుకుంటారు.
భాగస్వామ్య సంస్థ రద్దు దిగువ పద్ధతుల ద్వారా జరుగుతుంది.
- ఒప్పందము ద్వారా రద్దు: భాగస్వామ్య సంస్థను భాగస్తుల పరస్పర అంగీకారముతో లేదా ఒప్పందములో పేర్కొన్న షరతుల ప్రకారము రద్దు చేయవచ్చును.
- నోటీసు ద్వారా రద్దు: ఏ భాగస్తుడైనా సంస్థను రద్దు చేయాలని ‘వ్రాతపూర్వకముగా ఇతర భాగస్తులకు నోటీసు పంపడం ద్వారా కూడా రద్దు పరచవచ్చును.
- ఆగంతుక రద్దు: -ఒక భాగస్తుడు మరణించినా, మతిభ్రమించినా లేదా దివాలా తీసిన ఆ సంస్థను రద్దు చేయవచ్చును.
- తప్పనిసరిగా రద్దు: ఒక భాగస్తుడు లేదా భాగస్తులందరూ దివాలాదారుగా ప్రకటించబడినపుడు లేదా సంస్థ వ్యాపారము చట్ట వ్యతిరేకము అయినపుడు సంస్థ రద్దవుతుంది.
- కోర్టు ద్వారా రద్దు: సంస్థలో ఏ భాగస్తుడైనా శాశ్వతముగా అశక్తుడు అయినా, అనుచితముగా ప్రవర్తించినా, ఉద్దేశ్యపూర్వకముగా ఒప్పందాన్ని అతిక్రమించినా, ఇతరుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేసినా కోర్టు సంస్థను రద్దు చేయవచ్చును.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భాగస్వామ్య సంస్థ
జవాబు:
కింబల్ నిర్వచనము ప్రకారము “ఒక వ్యాపారము నడపడానికి కొంతమంది వ్యక్తులు కలసి మూలధనాన్ని లేదా సేవలను సేకరించుకునే సంస్థను భాగస్వామ్య సంస్థ అనవచ్చు”. “లాభం ఆర్జించే నిమిత్తము చట్టబద్ధమైన వ్యాపారము చేయడానికి అంగీకరించిన అర్హులైన వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న సంబంధమే భాగస్వామ్యము” అని హాని నిర్వచించినాడు. 1932 భారత భాగస్వామ్య చట్టము భాగస్వామ్యాన్ని ఈ విధముగా నిర్వచించినది “అందరూగాని అందరి తరపున కొందరు గాని వ్యాపారము చేస్తూ లాభాన్ని పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమే భాగస్వామ్యము”.
ప్రశ్న 2.
భాగస్వామ్య ఒప్పందము
జవాబు:
హారానికి దారము ఎంత ముఖ్యమో భాగస్వామ్యానికి ఒప్పందము అంత ముఖ్యమైనది. వ్యాపారము నిర్వహించడానికి, లాభాలు పంచుకోవడానికి, పెట్టుబడికి, సొంతవాడకాలకు సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒడంబడిక కుదురుతుంది. దీనిని భాగస్వామ్య ఒప్పందము అంటారు. ఇది నోటిమాటల ద్వారాగాని, వ్రాతపూర్వకముగాగాని ఉండవచ్చు. అది వ్రాతపూర్వకముగా ఉంటేనే శ్రేయస్కరము. భాగస్వామ్య ఒప్పందము వ్రాతపూర్వకముగా ఉంటే దానిని రిజిష్ట్రారు వద్ద నమోదు చేసుకుంటారు.
ప్రశ్న 3.
సక్రియ భాగస్తుడు. [TS. Mar. ’15]
జవాబు:
భాగస్వామ్య వ్యాపార నిర్వహణలో చురుకుగా పాల్గొని ప్రధాన పాత్రను నిర్వహించే భాగస్తుని ‘సక్రియ భాగస్తుడు’ లేదా ‘నిర్వాహక భాగస్తుడు’ అంటారు. ఇటువంటి భాగస్తుడు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడమే కాక, సంస్థ యొక్క వ్యవహారాలలో ఆసక్తిని చూపించి, సంస్థను నిర్వహించడములో ముఖ్యమైన పాత్రను వహిస్తాడు.
ప్రశ్న 4.
నిష్క్రియ భాగస్తుడు
జవాబు:
భాగస్వామ్య సంస్థకు మూలధనాన్ని సమాకూర్చి నిర్వహణలో పాల్గొనని భాగస్తుని నిష్క్రియ భాగస్తుడు అంటారు. ఇతడు నిర్వహణలో పాల్గొనకపోయినా లాభనష్టాలను పంచుకుంటాడు.
ప్రశ్న 5.
భావిత భాగస్తుడు
జవాబు:
ఒక వ్యక్తి తన మాటలద్వారాగాని, చేష్టలద్వారాగాని, ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోతే భావిత భాగస్తుడే అందుకు బాధ్యత వహించాలి.
ప్రశ్న 6.
మౌన నిర్ణీత భాగస్తుడు
జవాబు:
ఒక భాగస్తుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్తునిగా ప్రకటించినపుడు, భాగస్తుడు కాకపోతే ఆ ప్రకటనను ఖండించవలెను. అలా ఖండించకుండా మౌనముగా, ఉంటే అతనిని మౌన నిర్ణీత భాగస్తుడు అంటారు. ఇతనికి సంస్థ లాభాలలో వాటా ఉండదు. కాని, సంస్థ చేసే అప్పులకు మాత్రము పూర్తి బాధ్యతను వహించాలి.