Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 10th Lesson సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు Textbook Questions and Answers.
AP Inter 1st Year Commerce Study Material 10th Lesson సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
MSME లను నిర్వచించి, వాటి ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల అభివృద్ధి (MSMED) చట్టము, 2006 పొందుపరచబడిన దాని ప్రకారము MSME లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును.
- ఉత్పత్తి సంస్థలు
- సేవా సంస్థలు
1. ఉత్పత్తి సంస్థలు: వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడి సరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.
MSMEల దృష్టిలో ఉత్పత్తి సంస్థలు వాటి యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా నిర్వచింపబడినవి.
- సూక్ష్మ సంస్థ (Micro enterprise): యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించని సంస్థను సూక్ష్మ సంస్థ అంటారు.
- చిన్నతరహా సంస్థ (Small enterprise): యంత్రపరికరాలలో పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించని సంస్థను చిన్నతరహా సంస్థ అంటారు.
- మధ్యతరహా సంస్థ (Medium enterprise): యంత్రపరికరాలలో పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
2. సేవా సంస్థలు: సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు. వాటిని ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.
- సూక్ష్మ సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
- చిన్నతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
- మధ్యతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్లకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
MSMEల ఆవశ్యకత: MSME లు మన స్థూల జాతీయ ఉత్పత్తిలో సుమారు 8% వాటాను, పారిశ్రామిక ఉత్పత్తిలో 45% వాటాను, ఎగుమతులలో 40% వాటాలను కలిగి ఉన్నవి. MSME రంగము ఉద్యోగ కల్పనలో వ్యవసాయము తరువాత స్థానాన్ని ఆక్రమించినది.
- భారతదేశములోని 90% MSMEలు చట్టం ప్రకారము నమోదు అవసరము లేని సంస్థలే. (వీటిలో 80% వరకు సొంతవ్యాపార సంస్థలే)
- భారతదేశములోని 40% ఎగుమతులు MSME ల ద్వారా జరుగుతున్నవి.
- భారతదేశములో దాదాపుగా 40% వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు MSMEల ద్వారా కల్పించబడుతున్నవి.
- భవిష్యత్ వ్యాపారవేత్తలకు MSME లు వారి పెట్టుబడిస్థాయి ఆధారముగా, వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నవి.
- MSME లు భారతదేశములో వెంచర్ మూలధనము వ్యాపారము కోసము, విదేశీ కంపెనీలకు మంచి మార్కెట్ను కల్పిస్తున్నవి.
ప్రశ్న 2.
MSME లు పొందే వివిధ ప్రోత్సాహకాలను వివరించండి.
జవాబు:
MSME చట్టములో పొందుపరిచిన ధ్యేయాలకు అనుగుణముగా MSME ల చట్టము ఈ క్రింద పేర్కొనబడిన సదుపాయాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు కల్పిస్తుంది.
1. వస్తు, సేవల మొత్తాన్ని సకాలములో చెల్లించడానికి కొనుగోలుదారు బాధ్యత: MSME చట్టములోని సెక్షన్, 15 ప్రకారము ఈ సంస్థలు తమ వస్తుసేవల అమ్మకాలకు సంబంధించి, తమకు రావలసిన వసూళ్ళు సకాలములో రావడానికి తోడ్పడుతుంది. కొనుగోలుదారుడు తాను కొన్న వస్తు, సేవల విలువకు సరైన మొత్తాన్ని అమ్మకపుదారుకు నిర్ణీత సమయములో చెల్లించవలసిన బాధ్యతను తెలియజేస్తుంది.
ఎ) వ్రాతపూర్వక ఒప్పందము ఉన్నప్పుడు: వ్రాతపూర్వక ఒప్పందములో సూచించిన తేదీకిగాని, అంతకు ముందు తేదీకిగాని చెల్లింపు జరగాలి. ఎలాంటి పరిస్థితులలోను ఒప్పందములో తెలిపిన తేదీకంటే 45 రోజులు మించకుండా ఉండాలి.
బి) ఒప్పందము లేనప్పుడు: అమ్మకపుదారుకు, కొనుగోలుదారుకు మధ్య ఎలాంటి ఒప్పందము లేకపోతే, నిర్ణయించిన తేదీలోపు అంటే వ్యవహారము జరిగిన 15 రోజులలోపు చెల్లించాలి.
కొనుగోలుదారుడు, అమ్మకపుదారుడు, ఒప్పందము తేది పదాలను చట్టములో దిగువ విధముగా నిర్వచింపబడినవి. అమ్మకపుదారు నుంచి ప్రతిఫలము నిమిత్తము, ఎవరైతే వస్తువులను కొనుగోలు చేస్తారో లేదా సేవలను పొందుతారో వారిని కొనుగోలుదారు అంటారు.
అమ్మకపుదారు అంటే సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థ.
ఒప్పందము తేదీ అంటే వస్తువులు బదిలీ జరిగిన తేదీ లేదా సేవలను అందించిన రోజు.
2. ఆలస్య కాలానికి కొనుగోలుదారు ద్వారా వడ్డీ చెల్లింపు: ఏదైనా కారణాల వలన కొనుగోలుదారు తాను చెల్లించవలసిన మొత్తాన్ని సకాలములో చెల్లించకపోతే, అతడు ఆ మొత్తానికి వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఈ వడ్డీ సాధారణ బ్యాంకు వడ్డీకి మూడు రెట్లుగా చెల్లించాలి. నెలవారీ మొత్తముగా బాకీ ఉన్న మొత్తముపై వడ్డీని చెల్లించాలి.
3. తగాదాల నివేదన: వస్తుసేవల కోసం చెల్లించవలసిన మొత్తానికి, వడ్డీకి సంబంధించి ఏమైనా తగాదాలు ఉంటే వాటిని సూక్ష్మ, చిన్న సంస్థల మార్గదర్శిక మండలికి సూచించవచ్చు. ఈ మండలి తగిన విచారణచేసి, న్యాయం చేకూరుస్తుంది.
MSME లకు అవసరమైన ప్రోత్సాహక చర్యలు: MSME రంగం ప్రోత్సాహకానికి, అభివృద్ధికి, ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు దిగువ సూచించిన చర్యలను చేపట్టినవి.
- ఉద్యోగులలో, నిర్వాహకులలో, వ్యవస్థాపకులలో నైపుణ్యాల వృద్ధికి చర్యలు, సాంకేతిక అభివృద్ధికి ఏర్పాట్లు, మార్కెటింగ్ సౌకర్యాలు లేదా అవస్థాపనా సౌకర్యాలు, సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల సముదాయాల అభివృద్ధికి కావలసిన కార్యక్రమాలు చేపడతాయి.
- ఈ సంస్థలకు కాలానుగుణముగా, అవసరమైన ఋణసదుపాయాలను అందించడం, సంస్థలు ఖాయిలాపడటానికి అవకాశాలు తగ్గించడం తద్వారా పోటీతత్వాన్ని పెంపొందించడం లాంటి చర్యలు చేపడతాయి.
- ప్రభుత్వము, దాని అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు MSMEల ఉత్పత్తులను, సేవలను వాటి ప్రాధాన్యము ఆధారముగా సేకరిస్తాయి.
- ఈ సంస్థల ప్రోత్సాహకానికి, అభివృద్ధికి కావలసిన ప్రత్యేక నిధులను ఏర్పరచడం లేదా ప్రభుత్వ నిధులను సమకూర్చడం వంటి చర్యలు చేపడతాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
MSME ల చట్టం, 2006 ప్రకారము ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలు: వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడి సరుకును పూర్తిగా తయారైన సరుకుగా మార్చి, వాటి విలువను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలు అని చెప్పవచ్చును.
MSME ల దృష్టిలో ఉత్పత్తి సంస్థలు వాటి యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి ఆధారముగా నిర్వచించబడినది.
- సూక్ష్మ సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించని సంస్థలను సూక్ష్మ సంస్థలు అంటారు.
- చిన్నతరహా సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, కోట్ల రూపాయలకు మించని సంస్థను చిన్నతరహా సంస్థ అంటారు.
- మధ్యతరహా సంస్థ: యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే, దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
ప్రశ్న 2.
MSME ల చట్టం, 2006 ప్రకారము సేవా సంస్థలను నిర్వచించండి. [TS. Mar 15]
జవాబు:
సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు. వాటిని ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.
- సూక్ష్మ సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
- చిన్నతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
- మధ్యతరహా సంస్థ: పరికరాలలో పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
ప్రశ్న 3.
MSMEల నమోదు ప్రక్రియను వివరించండి.
జవాబు:
MSME ల నమోదుకు కావలసిన అంశములు:
- ఏ వ్యక్తి అయినా ఇష్టానుసారము సూక్ష్మ లేదా చిన్నతరహా సంస్థను స్థాపించవచ్చు.
- ఇష్టానుసారము సేవలను అందించడానికి లేదా సేవలు చేయడం కోసం మధ్యతరహా సంస్థను స్థాపించవచ్చు.
- వస్తు ఉత్పత్తి కోసము లేదా తయారీ కోసం మధ్యతరహా సంస్థను స్థాపించడానికి పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం, 1951లోని మొదటి షెడ్యూల్లో పేర్కొన్న విధముగా అనుసరించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల నియమావళి పత్రాన్ని రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వము నిర్దేశించిన లేదా సూచించిన అధికారి వద్ద నమోదు కోసం దాఖలు చేయాలి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సూక్ష్మ సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలు అయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
సేవా సంస్థలు అయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 10 లక్షల రూపాయలకు మించకపోతే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
ప్రశ్న 2.
చిన్నతరహా సంస్థలను నిర్వచించండి. [A.P. Mar. ’15]
జవాబు:
ఉత్పత్తి సంస్థలు అయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
సేవాసంస్థలయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 2 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని చిన్నతరహా సంస్థ అంటారు.
ప్రశ్న 3.
మధ్యతరహా సంస్థలను నిర్వచించండి.
జవాబు:
ఉత్పత్తి సంస్థలయితే యంత్రపరికరాలలో పెట్టిన పెట్టుబడి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 10 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
సేవా సంస్థలయితే పరికరాలలో పెట్టిన పెట్టుబడి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండి, 5 కోట్ల రూపాయలకు మించకపోతే దానిని మధ్యతరహా సంస్థ అంటారు.
ప్రశ్న 4.
ఉత్పత్తి సంస్థలను నిర్వచించండి.
జవాబు:
వస్తూత్పత్తిలో లేదా వస్తుతయారీలో నిమగ్నమైన సంస్థలను ఉత్పత్తి సంస్థలు అంటారు. యంత్రపరికరాలను ఉపయోగించి ముడిసరుకును పూర్తిగా తయారైన వస్తువులుగా మార్చి, వాటికి విలువలను సృష్టించే సంస్థలను ఉత్పత్తి సంస్థలుగా చెప్పవచ్చును.
ప్రశ్న 5.
సేవా సంస్థలను నిర్వచించండి.
జవాబు:
సేవలను అందించడములో నిమగ్నమైన సంస్థలను సేవా సంస్థలు అంటారు.