Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు Textbook Questions and Answers.
AP Inter 1st Year Commerce Study Material 11th Lesson బహుళ జాతి సంస్థలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి లక్షణాలను వివరించండి.
జవాబు:
ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, ఇతర దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించినట్లయితే ఆ సంస్థలను బహుళజాతీయ సంస్థలు అంటారు. ఈ బహుళజాతి సంస్థలను మల్టీనేషనల్ సంస్థలని, గ్లోబల్ సంస్థలని లేదా అంతర్జాతీయ సంస్థలని వేరు వేరు పేర్లతో పిలవబడతాయి. పెప్సీ, హుండాయి, నైక్, రీబాక్, ఎల్.జి, సామ్సంగ్ బహుళ జాతి సంస్థలకు ఉదాహరణలు.
నిర్వచనాలు: ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాలను తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు.
అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళజాతి సంస్థ’ అంటారు. విదేశమారక నియంత్రణ చట్టము 1973 ప్రకారము, 1) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థగాని, శాఖగాని ఉన్న సంస్థ. 2) రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ వ్యాపార కార్యకలాపములను కొనసాగించే. సంస్థను బహుళజాతి సంస్థ అంటారు.
బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. అధిక పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు అధిక పరిమాణము కలిగి ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.
2. ప్రపంచ వ్యాప్తముగా కార్యకలాపాలు: ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతీయ సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచ వ్యాప్తముగా విస్తరించినవి.
3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళ జాతిసంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయము యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వము, నియంత్రణలో పనిచేస్తాయి.
4. నిర్వహణలో నైపుణ్యము: బహుళజాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లను, అనుభవము ఉన్నవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన ‘నిర్వహణ ద్వారా తమ కార్యకలాపములను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తారు.
5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉండటము వలన వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించటం జరుగుతుంది.
6. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళజాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంస్థలు వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కేట్ను నియంత్రించడమే కాక ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.
7. అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశము: బహుళజాతీయ సంస్థలకు ఉన్న మూలధనము, సాంకేతిక పరిజ్ఞానము, నైపుణ్యాల బదిలీ ద్వారా సులభముగా అంతర్జాతీయ మార్కెట్లోనికి చొచ్చుకొనిపోతాయి.
ప్రశ్న 2.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాల వలన తన మాతృదేశముతో పాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు. ILO నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో కార్యకలాపాలను నిర్వహించే సంస్థనే బహుళజాతి సంస్థ’ అంటారు.
బహుళజాతి సంస్థల ప్రయోజనాలు: బహుళజాతి సంస్థల వలన అతిథి దేశాలకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.
- అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధన కొరతను తగ్గించడానికి బహుళజాతి సంస్థలు ఆయాదేశాలలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తాయి.
- అతిథి దేశాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆకర్షణీయమైన వేతనాలు చెల్లిస్తారు. ఆదాయము పెంపుదల జరుగుతుంది.
- ఈ సంస్థల వలన అతిథి దేశాలు, విదేశాల నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతాయి.
- వృత్తిపరమైన నిర్వహణను చేపట్టడంవలన అతిథి దేశాలు నిర్వహణా సామర్థ్యాన్ని పెంపొందించుకోగలవు.
- ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించడం ద్వారా ఆ దేశము చెల్లింపు నిల్వ స్థాయి మెరుగవుతుంది. విదేశీమారక నిల్వలలో ఆదాలను పొందడం బహుళజాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది.
- బహుళ సంస్థలు ఆయా దేశాలలో నెలకొని ఉన్న ఏకస్వామ్యాన్ని అడ్డుకోవడంవలన ఆయా దేశాలలో పనిచేసే సాంప్రదాయాలను, పని వాతావరణము సృష్టించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడానికి కూడా వీలవుతుంది.
- బహుళజాతి సంస్థల కార్యకలాపాలవలన అతిథి దేశాలలో వ్యాపారస్తులు, పంపిణీదారులు, వర్తక మధ్యవర్తులు తమ వ్యాపార కార్యకలాపాలను ‘ విస్తృతపరుచుకుంటాయి.
- బహుళజాతి సంస్థలవలన, స్వదేశీ సంస్థలు పరిశోధన, అభివృద్ధి ప్రయోజనాలను పొందుతాయి.
- బహుళజాతి సంస్థలు ఆయాదేశాలలో నాణ్యమైన వస్తుసేవలను అందించడం ద్వారా వినియోగదారులకు కొనుగోలుశక్తి పెరిగి జీవన ప్రమాణస్థాయి మెరుగవుతుంది.
- బహుళజాతి సంస్థల వలన అతిథి దేశాలు పారిశ్రామిక ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తాయి.
స్వదేశాలకు కలిగే ప్రయోజనాలు: బహుళజాతి సంస్థలవలన స్వదేశాలకు ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.
- బహుళజాతి సంస్థలు స్వదేశములో తయారైన వస్తువులు ప్రపంచమంతటా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవకాశాలు కల్పిస్తాయి.
- ఈ సంస్థలు స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను స్వదేశములోను, ఇతర దేశాలలో కల్పిస్తాయి.
- బహుళజాతి సంస్థలు ముడి సరుకు, శ్రమ, భూమి మొదలైన వనరులు పొంది, స్వదేశములో వస్తువులను తక్కువ ధరకు లభించేటట్లు చేస్తాయి.
- స్వదేశ కంపెనీలు ఎగుమతులను చేపట్టడానికి అవసరమైన చేయూతను బహుళజాతి సంస్థల ద్వారా పొందగలుగుతున్నాయి. దీని వలన దీర్ఘకాలములో అనుకూల చెల్లింపుల శేషాన్ని సాధించవచ్చు.
- ఈ సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని సాధించి ఉత్పత్తులను ప్రోత్సహిస్తాయి.
- అతిథి దేశాల నుంచి డివిడెండు, లైసెన్స్ ఫీజు, రాయల్టీలు మొదలైనవి పొందుతాయి. కాబట్టి స్వదేశ ఆరాయము పెంచుకోవడానికి వీలు అవుతుంది.
- ఈ సంస్థల వలన స్వదేశములో విదేశీ సంస్కృతుల వలన వచ్చే ఆదాలు చేకూరుతాయి.
ప్రశ్న 3.
బహుళజాతి సంస్థలను నిర్వచించి, వాటి పరిమితులు/నష్టాలను వివరించండి.
జవాబు:
ఏదైనా సంస్థ తన ఉత్పత్తి కార్యకలాపాల వలన తన మాతృదేశముతోపాటు ఇతర దేశాలకు విస్తరింపజేస్తే అలాంటి సంస్థను బహుళజాతి సంస్థ అంటారు. ILO నివేదిక ప్రకారము “ఒక దేశములో నిర్వహణ కార్యాలయం ఉండి అనేక ఇతర దేశాలతో కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళ జాతీయ సంస్థ” అంటారు.
బహుళజాతి సంస్థల వలన పరిమితులు / అతిథి దేశాలకు బహుళజాతి సంస్థల వలన పరిమితులు:
- బహుళజాతి సంస్థలు అతిథి దేశాలలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో కలసి, ఏకస్వామ్యాన్ని సృష్టించి, ఆర్థికశక్తుల కేంద్రీకరణకు దోహదపడతాయి.
- బహుళజాతి సంస్థలు, తమ దేశములో పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశాలకు బదిలీచేయడానికి ప్రయత్నము చేస్తాయి.
- బహుళజాతి సంస్థలు ఆయా దేశాల రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకొని, అంతర్గత సమస్యలను సృష్టించడంవలన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించవచ్చును.
- లాభాలను సంపాదించే క్రమములో, బహుళజాతి సంస్థలు అతిథి దేశములోని సహజ వనరులను విచక్షణా రహితముగా వినియోగించడమువలన ఆ దేశాలలో సహజవనరులు తగ్గి క్షీణిస్తాయి.
- లాభాలు, డివిడెండ్లు, రాయల్టీ చెల్లింపు రూపములో, పెద్ద మొత్తములో ద్రవ్యము విదేశాలకు ప్రవహిస్తుంది. దీనివలన ఆ దేశ విదేశ మారకములో విపరీత మార్పులు చోటుచేసుకుంటాయి.
- అతిథి దేశాల ఉద్దేశాలను, ప్రాముఖ్యతను బహుళజాతి సంస్థలు పట్టించుకోవు. తమకు లాభదాయకమైన యూనిట్లలో పెట్టుబడిపెడతాయి.
- అతిథి దేశాలతో అనుసంధానాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు బహుళజాతి సంస్థలు అనేక ఆంక్షలు విధిస్తుంది.
- బహుళజాతి సంస్థలు ప్రజల యొక్క అలవాట్లను, కోర్కెలను, ఫ్యాషన్లను మార్చి, విదేశీ సంస్కృతిని వ్యాపింపజేస్తాయి.
స్వదేశానికి బహుళజాతి సంస్థల వలన నష్టాలు:
- బహుళజాతి సంస్థలు స్వదేశము నుంచి వివిధ అతిథి దేశాలకు మూలధన మార్పిడి చేయడమువలన స్వదేశములో ప్రతికూల చెల్లింపుల శేషము జరగవచ్చు.
- బహుళజాతి సంస్థలు పక్షపాత ధోరణి అవలంబించడం వలన స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను సృష్టించలేవు.
- విదేశాలలో పెట్టుబడి లాభదాయకముగా ఉండటంవలన, బహుళజాతి సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యము చేస్తాయి.
ప్రశ్న 4.
ప్రపంచీకరణ అంటే ఏమిటి ? దాని ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
ప్రపంచము స్వయం పోషక జాతీయ ఆర్థిక వ్యవస్థల నుంచి క్రమముగా పరస్పరం ఆధారపడిన సమీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశగా కదులుతున్నది. దీనినే ప్రపంచీకరణగా వ్యవహరించడం జరుగుతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ఉత్పత్తి కారకాలకు ప్రపంచవ్యాప్తముగా సంపూర్ణమైన గమనశీలతను ఏర్పరచడమే ప్రపంచీకరణ. ఒకదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థికవ్యవస్థలలో అనుసంధానము చేసి ప్రపంచాన్ని ఏకైక అంతర్జాతీయ మార్కెట్గా రూపొందించడమే ప్రపంచీకరణ లక్ష్యము. దీనివలన ప్రపంచ దేశాల మధ్య దూరము తగ్గి ప్రపంచమంతా ఒక గ్రామముగా మారే అవకాశము ఉన్నది.
అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు. “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత”. ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి. అవి:
- ఆటంకాలు లేని వర్తక ప్రవాహాలు: దేశ సరిహద్దులు దాటి వస్తువుల ప్రవాహాలు స్వేచ్ఛగా జరగడానికి అనుమతులు తేలికగా లభించేటట్లుగా వర్తక అవరోధాలను తగ్గించుట.
- మూలధన ప్రవాహాలు: వివిధ దేశాల మధ్య మూలధనము స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలుగా వాతావరణాన్ని సృష్టించడం.
- సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము: సాంకేతిక విద్య, విజ్ఞానము ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి, ఒక దేశము నుంచి మరొక దేశానికి స్వేచ్ఛగా ప్రవేశించడానికి అనువైన వాతావరణము.
- ఆటంకములేని శ్రామికుల గమనము: ప్రపంచములోని వివిధ దేశాలమధ్య శ్రామికుల స్వేచ్ఛాగమనాన్ని ప్రోత్సహించే విధముగా వాతావరణమును సృష్టించడము.
ప్రపంచీకరణలో రెండు రూపాలున్నవి. 1) మార్కెట్ను ప్రపంచీకరించడం, 2) ఉత్పత్తిని ప్రపంచీకరించడం.
మార్కెట్ను ప్రపంచీకరించడం అంటే జాతీయ మార్కెట్లను ఒక ప్రపంచ మార్కెట్ కలిపివేయడం ద్వారా వ్యాపార ఆటంకాలు తగ్గి, అంతర్జాతీయ విక్రయాలు సులభతరము అవుతాయి. వినియోగదారుల అభిరుచులు, ఇష్టాలు ఒక ప్రపంచక్రమానుసారము ఐక్యం అవుతుంది. సంస్థలు సారూప్యత గల ప్రధాన వస్తువులను ప్రపంచవ్యాప్తముగా అందిస్తూ ప్రపంచమార్కెట్కు దోహదపడతాయి.
ఉత్పత్తిని ప్రపంచీకరించడం అంటే వస్తుసేవల ఉత్పత్తి కేంద్రాలను ఉత్పత్తికారకములైన శ్రమ, భూమి, మూలధనమును ప్రపంచములోని వివిధ ప్రాంతాలకు వ్యాపింపచేయడం. కంపెనీలు వ్యయమును తగ్గించుట ద్వారా, నాణ్యతను పెంచడంద్వారా వస్తు సేవలను అందించడములో వాటి పనితీరును మెరుగుపరుచుకుంటాయి.
ప్రపంచీకరణకు రెండు కారకాలు ఉంటాయి. 1) తక్కువ వర్తక ఆటంకాలు. 2) సాంకేతికపరమైన మార్పులు. సాంకేతిక మార్పులు టెలీకమ్యూనికేషన్స్ మరియు మైక్రోప్రాసెసర్స్, ప్రపంచవ్యాప్త వెబ్, రవాణాలో పురోగతులు సంభవించినవి. రవాణా వ్యయాలను తగ్గించి, సంస్థలు తమకు ఆర్థికముగా భౌగోళికముగా, అనుకూలముగా ఉన్న ప్రాంతాలకు వ్యాప్తిచెందేలా చేశాయి. సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి, అందించడానికి అయ్యే వ్యయాలను తగ్గించడం ద్వారా ప్రపంచవ్యాప్తమైన ఉత్పత్తి సంవిధానాన్ని సంస్థలు సమర్థవంతముగా నిర్వహించేలా చేశాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బహుళజాతి సంస్థల అర్థాన్ని వివరించండి.
జవాబు:
Multinational అనే పదము రెండు పదముల కలయిక. అవి Multi మరియు National. Multi అంటే అనేకము, బహుళ అని అర్థము. National అంటే జాతి, దేశము అని అర్ధము. కాబట్టి బహుళజాతి సంస్థలు అంటే వివిధ దేశాలలో నడపబడుతున్న లేదా నిర్వహించబడుతున్న సంస్థ అని అర్ధము. ఆ కంపెనీకి ఒక దేశము కంటే ఎక్కువ దేశాలలో ఫ్యాక్టరీలు, బ్రాంచీలు లేదా ఆఫీసులు ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ కమీషన్ ప్రకారము బహుళజాతి సంస్థ అంటే నమోదుచేసిన దేశములో కాకుండా అదనముగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో నిర్వహింపబడుతున్న సంస్థ అని అర్ధము.
బహుళజాతి సంస్థ అంటే కంపెనీల పరంపర లేదా కంపెనీల శ్రేణి అని అర్థము. ఈ కంపెనీలన్నీ ఏకకాలములో వివిధ దేశాలలో నిర్వహింపబడతాయి. అందువలన ఈ కంపెనీలన్నీ వివిధ దేశాల అధికార పరిధులలో పనిచేస్తాయి. కంప్యూటీకరణ మరియు కమ్యూనికేషన్లో అభ్యుదయ ఆధారముగా ఏర్పడిన రెండవ పారిశ్రామిక విప్లవము ఫలితమే బహుళజాతి సంస్థ.
ప్రశ్న 2.
బహుళజాతి సంస్థల లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
బహుళజాతి సంస్థల లక్షణాలు:
1. అధిక పరిమాణము: బహుళజాతి సంస్థల ఆస్తులు, అమ్మకాలు, అధిక పరిమాణములో ఉంటాయి. ఈ సంస్థల అమ్మకాల టర్నోవర్ అభివృద్ధి చెందుతున్న దేశాల స్థూల జాతీయ ఉత్పత్తికంటే ఎక్కువ. ఉదా: IBM నిజ ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ.
2. ప్రపంచవ్యాప్తముగా కార్యకలాపాలు ప్రపంచములో వివిధ దేశాలలో బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. వీటికి ఎన్నో దేశాలలో బ్రాంచీలు, అనుబంధ సంస్థలు, కర్మాగారాలు, కార్యాలయాలు ఉంటాయి. ఉదా: కోకోకోలా, ఆపిల్ సంస్థలు, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రెడ్డి లాబ్స్ వంటివి ప్రపంచవ్యాప్తముగా విస్తరించినవి.
3. కేంద్రీకృత నియంత్రణ: వివిధ దేశాలలో ఉన్న బహుళజాతి సంస్థల బ్రాంచీలు లేదా అనుబంధ సంస్థలు ప్రధాన కార్యాలయం యొక్క పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, నియంత్రణలో పనిచేస్తాయి.
4. నిర్వహణలో నైపుణ్యము: బహుళజాతి సంస్థలు సమర్థవంతమైన మేనేజర్లు, అనుభవము కలవారి సేవలను ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ సంస్థలు వృత్తిపరమైన నిర్వహణ ద్వారా తమ కార్యకలాపాలను మార్కెట్లో విజయవంతముగా నిర్వహిస్తాయి.
5. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము: బహుళజాతి సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉంటుంది కాబట్టి వినియోగదారులకు నాణ్యమైన వస్తుసేవలను అందించడం జరుగుతుంది. 6. ప్రముఖమైన స్థానము, హోదా: బహుళజాతి సంస్థల పరిమాణము, ఆస్తులు, అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపారము కొనసాగిస్తున్న దేశాలలో మార్కెట్ను నియంత్రించడమే కాకుండా ప్రముఖమైన స్థానాన్ని, హోదాను కలిగి ఉంటాయి.
ప్రశ్న 3.
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి కలిగే ఏవైనా నాలుగు ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
బహుళజాతి సంస్థల వలన అతిథి దేశానికి ప్రయోజనాలు:
- మూలధనము సమకూర్చడము: అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూలధనము కొరతను తగ్గించడానికి బహుళజాతి సంస్థలు ఆయాదేశాల పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తాయి.
- సాంకేతిక పరిజ్ఞానము బదిలీ: బహుళజాతి సంస్థల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు సులభముగా బదిలీ చేసుకొనగలుగుతాయి.
- ఉద్యోగాల లభ్యత: అతిథి దేశాలలో బహుళజాతి సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పించి, ఆకర్షణీయమైన వేతనాలను అందిస్తాయి.
- విదేశమారకము: ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించడం ద్వారా ఆ దేశము యొక్క చెల్లింపు నిల్వల స్థాయి మెరుగవుతుంది. విదేశమారకము నిల్వలలో ఆదాలను పొందడం బహుళజాతి సంస్థల ద్వారా సాధ్యమవుతుందీ.
ప్రశ్న 4.
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి కలిగే ఏవైనా నాలుగు ప్రయోజనాలను వివరించండి. [T.S. Mar. ’15]
జవాబు:
- బహుళజాతి సంస్థలు స్వదేశములో తయారైన వస్తువులు ప్రపంచమంతటా మార్కెటింగ్ చేసి అమ్మడానికి అవకాశాలను కల్పిస్తాయి.
- ఈ సంస్థలు స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను స్వదేశములోనూ, ఇతర దేశాలలో కల్పిస్తాయి.
- బహుళజాతి సంస్థలు ముడిసరుకు, శ్రమ, భూమి మొదలైన వనరులను పొంది, స్వదేశములో వస్తువులను తక్కువ ధరకు లభించేటట్లు చేస్తాయి.
- స్వదేశ కంపెనీలు ఎగుమతులను చేపట్టడానికి అవసరమైన చేయూతను బహుళజాతి సంస్థల ద్వారా పొందగలుగుతున్నాయి. దీని వలన దీర్ఘకాలములో అనుకూల చెల్లింపుల శేషాన్ని సాధించవచ్చును.
ప్రశ్న 5.
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి ఉన్న నష్టాలను వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
బహుళజాతి సంస్థల వల్ల అతిథి దేశానికి కలిగే నష్టాలు:
- బహుళజాతి సంస్థలు అతిథి దేశాలలో పెద్దపెద్ద వ్యాపార సంస్థలతో కలిసి, ఏకస్వామ్యాన్ని సృష్టించి, ఆర్థిక శక్తుల కేంద్రీకరణకు దోహదపడుతుంది.
- బహుళజాతి సంస్థలు తమ దేశములో పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశాలకు బదిలీచేయడానికి ప్రయత్నిస్తాయి.
- బహుళజాతి సంస్థలు ఆయాదేశాల రాజకీయ వ్యవహారాలలో జోక్యము చేసుకొని, అంతర్గత సమస్యలను సృష్టించడంవలన దేశ సార్వభౌమాధికారానికి భంగము కలిగించవచ్చు.
- లాభాలను సంపాదించే క్రమములో బహుళజాతి సంస్థలు అతిథి దేశములో సహజవనరులను విచక్షణా- రహితముగా వినియోగించడంవలన ఆ దేశాలలో సహజవనరులు తగ్గి క్షీణిస్తాయి.
ప్రశ్న 6.
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి ఉన్న నష్టాలను వివరించండి.
జవాబు:
బహుళజాతి సంస్థల వల్ల స్వదేశానికి కలిగే నష్టాలు:
- బహళజాతి సంస్థలు స్వదేశము నుంచి అతిథి దేశాలకు మూలధన మార్పిడి చేయడంవలన స్వదేశములో ప్రతికూల చెల్లింపుల శేషము ఏర్పడవచ్చు.
- బహుళజాతి సంస్థలు పక్షపాత ధోరణి అవలంబించడంవలన స్వదేశములోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలు సృష్టించలేవు.
- విదేశాలలో పెట్టుబడి లాభదాయకముగా ఉండటమువలన బహుళజాతి సంస్థలు స్వదేశములో పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యము చేస్తాయి.
- బహుళజాతి సంస్థలు స్వదేశములో విదేశీ సంస్కృతిని వ్యాపింపజేస్తాయి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రపంచీకరణను నిర్వచించండి.
జవాబు:
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల పరిధిని విదేశాలకు విస్తరింపజేయడమే ప్రపంచీకరణ. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రపంచీకరణను ఈ విధముగా నిర్వచించినారు “స్వేచ్ఛా వాణిజ్య విధానము, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికుల గమనశీలత. ఈ నిర్వచనము ప్రకారము ప్రపంచీకరణలో నాలుగు లక్షణాలు ఉన్నవి. 1) ఆటంకాలు లేని వర్తక ప్రవాహము, 2) మూలధన ప్రవాహాలు, 3) సాంకేతిక విజ్ఞానాల ప్రవాహము, 4) ఆటంకములేని శ్రామికుల గమనశీలత.
ప్రశ్న 2.
ఎఫ్.డి.ఐ. ని నిర్వచించండి.
జవాబు:
ఒక దేశములోని (అతిథి దేశము) ఉత్పత్తులను మరొక దేశానికి (స్వదేశానికి) సంబంధించిన సంస్థ నియంత్రించడాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (F.D.I.) అంటారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది బహుళజాతి సంస్థల నిర్వచనాత్మక లక్షణము. స్వదేశము బయట ఉన్న వ్యాపార సంస్థ కార్యకలాపాలలో, ఏదైనా సంస్థ పెట్టుబడి పెడితే దానిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి జరిగినట్లుగా భావిస్తారు.
ప్రశ్న 3.
బహుళజాతీయ సంస్థను నిర్వచించండి.
జవాబు:
అంతర్జాతీయ శ్రామిక నివేదిక ప్రకారము ‘ఒక దేశములో నిర్వహణ కార్యాలయము ఉండి, అనేక ఇతర దేశాలతో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సంస్థను బహుళజాతీయ సంస్థ’ అంటారు. విదేశ మారక నియంత్రణ చట్టం 1973 ప్రకారము
- రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ అనుబంధ సంస్థనుగాని, శాఖ గాని ఉన్న సంస్థ.
- రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో తమ కార్యకలాపాలను కొనసాగించే సంస్థను బహుళజాతి అంటారు.