Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 7th Lesson కంపెనీ స్థాపన Textbook Questions and Answers.
AP Inter 1st Year Commerce Study Material 7th Lesson కంపెనీ స్థాపన
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యవస్థాపనలోని వివిధ దశలను వివరించండి.
జవాబు:
కంపెనీ తనంతట తాను ఉద్భవించదు. ఇది మానవ కృషి ఫలితముగా ఏర్పడుతుంది. ఎవరో ఒకరు పూనుకొని నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును సమీకరించాలి. కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని అంతటిని వ్యవస్థాపన అంటారు. అంటే వ్యాపార ఉద్దేశాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుక్కొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలు సమీకరించి సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనను గెస్టిన్ బర్గ్ ఇట్లా నిర్వచించినాడు. “వ్యాపార అవకాశాలు కనుక్కోవడం, ఆ తరువాత, లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యమును వ్యాపార సంస్థలో వెచ్చించడము”. కంపెనీ వ్యవస్థాపన వ్యయ ప్రయాసలతో కూడినది.
వ్యవస్థాపనలోని దశలు :
1) వ్యాపార అవకాశాలు కనుగొనుట : వ్యాపార విజయము సరైన వ్యాపార ఎన్నికపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపార అవకాశాలు తటస్థించినపుడు ఆ అవకాశాలను ఎంతవరకు అమలుపరచవచ్చును ? లాభదాయకమా ? కాదా ? అనే అంశములు నిశ్చితముగా పరిశీలించి, ఆచరణ యోగ్యము, లాభదాయకమని భావిస్తే వ్యాపార సంస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాడు.
2) సమగ్ర పరిశోధన : ప్రారంభించవలసిన వ్యాపారాన్ని గురించి సమగ్రమైన పరిశోధన జరపాలి. పెట్టుబడిదారుల మనస్తత్వము, మార్కెట్ పరిస్థితులు, కంపెనీకి అవసరమయ్యే ఆర్థిక వనరులు, శ్రామికులు, ముడిపదార్థాలు, యంత్రాల లభ్యత వస్తువుకు ఉండే డిమాండ్ మొదలైన అంశాలను గురించి సమగ్ర పరిశోధన చేయాలి.
3) వనరుల సమీకరణ : వ్యవస్థాపకుడు తాను ఎంపిక చేసిన వ్యాపారము లాభసాటిగా, ఆమోద యోగ్యముగా ఉందని నిర్ధారణ చేసుకున్న తరువాత వ్యాపార సంస్థకు అవసరమయ్యే ముడిపదార్థాలు, ఆస్తులు, యంత్రాలు, నిర్వాహకుల, సాంకేతిక నిపుణుల సేవలు మొదలైనవి సమకూరే లాగా ఒప్పందాలు చేసుకుంటాడు.
4) ఆర్థిక ప్రతిపాదన : వ్యవస్థాపకుడు కంపెనీకి ఉండవలసిన మూలధన స్వరూపాన్ని నిర్ణయిస్తాడు. ఏ రకమైన వాటాలు, డిబెంచర్లు జారీ చేయాలి ? ఎంత మొత్తము జారీచేయాలో నిర్ణయిస్తాడు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించవలసిన దీర్ఘకాలిక ఋణాలను కూడా నిర్ధారణ చేస్తాడు.
ప్రశ్న 2.
కంపెనీ నమోదు గురించి విశదీకరించండి.
జవాబు:
కంపెనీ ఒక కల్పిత వ్యక్తి నమోదు ద్వారా దీనికి అస్తిత్వము వస్తుంది. నమోదు అనేది చట్టపరమైన చర్య. ప్రైవేటు కంపెనీగాని, పబ్లిక్ కంపెనీగాని కంపెనీ రిజిస్ట్రారు కార్యాలయములో అవసరమైన ముఖ్యమైన పత్రాలు దాఖలు చేసి, రిజిస్ట్రేషన్ చేయవలెను.
కంపెనీ నమోదు విధానము : కంపెనీ నమోదు కోసము దిగువ ముఖ్య పత్రాలను తయారు చేసి జతపరచాలి. 1) పేరు అనుమతి కోసం దరఖాస్తు: ‘కంపెనీ నమోదుకోసం మొదట పేరు అనుమతి కోరుతూ ఆ రాష్ట్ర కంపెనీల రిజిస్ట్రారుకు దరఖాస్తు చేయాలి. పేర్ల చట్టం 1950 పరిధిలోపు ఏ పేరైనా కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ రిజిస్ట్రారు దరఖాస్తు అందిన 14 రోజులలోపు అనుమతిని ఇస్తారు. ఆ తేదీనుంచి 3 నెలల లోపు ఆ పేరును రిజిస్ట్రేషన్ చేయాలి.
2) సంస్థాపనా పత్రము : ఈ పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, బయటవారితో ఉన్న సఁ న నిర్వచిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పత్రము దీనిని జాగ్రత్తగా తయారు చేసి తగిన స్టాంపులు అతికించాలి. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు ఈ పత్రముపై
సంతకాలు చేయాలి.
3) కంపెనీ నియమావళి : ఈ పత్రము కంపెనీ అంతర్గత పరిపాలనకు సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు దీని మీద సంతకాలు చేయవలెను. ప్రైవేటు కంపెనీ నియమావళిని తప్పని సరిగా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పబ్లిక్ కంపెనీ నియమావళిని తయారుచేయకపోతే కంపెనీ చట్టంలోని షెడ్యూల్ 1, టేబుల్ A ని అనుసరించవచ్చును.
అవి :
4) అదనపు పత్రాలు : కంపెనీ నమోదుకు మరికొన్ని అదనపు పత్రాలు తయారు చేసి రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
ఎ) డైరెక్టర్ల అంగీకార పత్రము : డైరెక్టర్లుగా వ్యవహరించడానికి వారి సమ్మతిని తెలియజేస్తూ ఒక పత్రాన్ని రిజిస్ట్రారుకు దాఖలు చేయవలెను.
బి) పవర్ ఆఫ్ అటార్నీ : కంపెనీ నమోదుకు కావలసిన లాంఛనాలు పూర్తి చేసినట్లు ధృవీకరించడానికి, అవసరమయితే తగిన మార్పులు చేయడానికి ఒక న్యాయవాదిని వ్యవస్థాపకులు నియమించాలి. అతనిని అటార్నీ అంటారు. అతని నియామకపు పత్రాన్ని కూడా రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
సి) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము తెలిపే నోటీసు : కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయము ఎక్కడ ఏర్పాటు చేయవలెనో ముందు నిర్ణయము అయితే, నమోదైన 30 రోజులలోపు రిజిష్టర్డ్ కార్యాలయ వివరాలను రిజిస్ట్రారుకు తెలియజేయాలి.
డి) డైరెక్టర్ల వివరాలు : కంపెనీ డైరెక్టర్లు, మేనేజరు లేదా సెక్రటరీ మొదలైన వారి వివరాలను ఫారం 32లో పొందుపరిచి నమోదుకు 30 రోజులలోపు రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి.
5) శాసనాత్మక ప్రకటన .: కంపెనీల చట్టం ప్రకారము నమోదుకు సంబంధించి అన్ని లాంఛనాలు సక్రమముగా నిర్వర్తించినట్లు కంపెనీ న్యాయవాది గాని, ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా సెక్రటరీగాని చట్టపూర్వకమైన ప్రకటన చేయించాలి.
6) నమోదు రుసుం చెల్లింపు : కంపెనీ నమోదుకు చట్టప్రకారము నిర్దేశించిన రుసుము చెల్లించి రశీదును పొందాలి.
పైన తెలిపిన పత్రాలన్నింటిని రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందితే నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రాన్ని పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధృవపత్రము పొందనిదే వ్యాపారాన్ని ప్రారంభించరాదు.
ప్రశ్న 3.
సంస్థాపన పత్రం అంటే ఏమిటి ? అందులోని క్లాజులను పేర్కొనండి. [A.P & T.S. Mar. ’15 ]
జవాబు:
భారత కంపెనీల చట్టము క్రింద నమోదైన అన్ని కంపెనీలకు ఆవశ్యకమైన పత్రము సంస్థాపన పత్రము. సంస్థాపనా పత్రమనే పునాది మీదనే కంపెనీ అనే భవనము నిర్మాణము అవుతుంది. ఈ పత్రము కంపెనీ అధికార ఎల్లలను, కంపెనీ వ్యవహారాలకు హద్దులను ఏర్పాటు చేస్తుంది. కంపెనీ ధ్యేయాలను, అధికారాలను, కార్యకలాపాలను వాటాదారులు, ఋణదాతలు, కంపెనీతో ప్రత్యక్షముగా సంబంధమున్న ప్రతివారికి ఖచ్చితముగా తెలియపరచడమే ఈ పత్రము ముఖ్య ఉద్దేశ్యము. కనుక దీనిని కంపెనీ రాజ్యాంగము అంటారు.
ఈ పత్రము కంపెనీకి, బయటవారికి గల సంబంధాలను నిర్వచిస్తుంది. ఈ పత్రములో పొందుపరిచిన వ్యవహారాలు, నిర్వచించిన అధికారాలను, నిర్ణయించిన సంబంధాలను అతిక్రమించి ఏ కంపెనీ నడుచుకోవడానికి వీలులేదు. అలా నడుచుకుంటే ఆ వ్యవహారాలు, అధికారాలు, సంబంధాలు న్యాయవిరుద్ధము అవుతాయి. అవి చెల్లుబాటు కావు:
దీనిని పేరాలుగా విభజించి, వరుసగా సంఖ్యలు వేసి ముద్రించవలెను. పబ్లిక్ కంపెనీ అయితే ఏడుగురు, ప్రైవేటు కంపెనీ అయితే ఇద్దరు సాక్షి సమక్షములో ఈ పత్రాల మీద సంతకాలు చేయవలెను. సంతకము చేసిన ప్రతి వ్యక్తి కనీసం ఒక వాటానైనా తీసుకొనవలెను.
సంస్థాపనా పత్రములోని క్లాజులు.
1) నామధేయపు క్లాజు : ఈ క్లాజులో కంపెనీ పూర్తి పేరు వ్రాయవలెను. పబ్లిక్ కంపెనీ అయితే పేరు చివర ‘లిమిటెడ్’, ప్రైవేటు కంపెనీ అయితే పేరు చివర ‘ప్రైవేటు లిమిటెడ్’ అనే పదములు ఉండాలి. కంపెనీ ఏ పేరునైనా పెట్టుకోవచ్చుగాని అంతకముందు స్థాపితమైన మరొక కంపెనీ పేరును పోలిగాని, సమీపములోగాని ఉండరాదు. అంతేగాక అవాంఛనీయమైన పేర్లు, చట్టముచే బహిష్కరింపబడిన పేర్లు కంపెనీకి పెట్టరాదు.
2) కంపెనీ స్థానపు క్లాజు : కంపెనీ రిజిష్టర్డ్ ఆఫీసు ఏ రాష్ట్రములో ఉన్నదో ఆ రాష్ట్రము పేరు ఈ క్లాజులో తెలిపాలి. కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి కార్యాలయ చిరునామా అవసరము. కంపెనీ నమోదు సమయములో గాని, నమోదు అయిన 30 రోజులలోపు కార్యాలయపు చిరునామాను రిజిస్ట్రారుకు
3) ధ్యేయాల క్లాజు : ఇది అతి ప్రధానమైన క్లాజు. ఇందులో కంపెనీ ధ్యేయాలు, అధికారాలు, వ్యాపార వ్యవహారాల పరిధి స్పష్టముగా పేర్కొనబడి ఉంటాయి. న్యాయపూరితమైన ఎన్ని ధ్యేయాలనైనా ఇందులో చేర్చవచ్చును. వాటినన్నింటిని కంపెనీ చేపట్టనవసరం లేదు. ఈ క్లాజులో చేర్చని కార్యకలాపాలను, ధ్యేయాలను అతిక్రమించి ఏ పని చేయరాదు. అలా చేస్తే అవి న్యాయవిరుద్ధము అవుతాయి.
4) ఋణబాధ్యత క్లాజు : కంపెనీ వాటాదారుల యొక్క స్వభావాన్ని ఈ క్లాజులో వ్రాయవలెను. వాటాదారుల ఋణబాధ్యత వారు తీసుకున్న వాటాల విలువ మేరకు పరిమితమని తెలియజేస్తుంది. ఒకవేళ వాటాలో కొంత మొత్తము చెల్లిస్తే, వారి ఋణబాధ్యత ఆ చెల్లించని మొత్తానికే పరిమితము అవుతుంది.
5) మూలధనపు క్లాజు : ఎంత మూలధనాన్ని జారీ చేయడానికి అనుమతి కావలెనో ఈ క్లాజులో తెలియజేస్తారు. దీనిని అధీకృత మూలధనము, నమోదు మూలధనము అంటారు. ఈ మూలధనాన్ని ఎన్ని వాటాలుగా విభజించినారు, వాటా విలువ ఎంతో తెలియపరచవలెను.
6) వ్యవస్థాపన – చందాల క్లాజు : తాము కంపెనీని స్థాపించడానికి ఒక సంస్థగా ఏర్పడినట్లు, తమ పేర్లకు ఎదురుగా ఉన్న వాటాలను తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు ఒక ప్రకటన ద్వారా ఈ క్లాజులో తెలియజేయాలి. వారందరూ సాక్షి సమక్షములో సంతకాలు చేయాలి.
ప్రశ్న 4.
నియమావళి గురించి నీకేమి తెలుసు ? దానిలోని అంశాలను వ్రాయండి. [A.P Mar. ’15]
జవాబు:
కంపెనీ నమోదు చేసేటప్పుడు రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయవలసిన పత్రాలలో రెండవది నియమావళి. కంపెనీ ఆంతరంగిక వ్యవహారములు సమర్థవంతముగా నిర్వహించుటకు కొన్ని నియమాలు, నిబంధనలు అవసరము. ఆ నియమ నిబంధనలు గల పత్రమే నియమావళి. కంపెనీ నియమావళి ఆంతరంగిక వ్యవహారములకు చుక్కాని వంటిది. నిర్వహణాధికారులకు ఈ నియమావళి మార్గదర్శకముగా ఉంటుంది. కంపెనీకి వాటాదారులకు మధ్య గల సంబంధాన్ని ఇది స్పష్టపరుస్తుంది. ఇది డైరెక్టర్లు, నిర్వహణాధికారులు, వాటాదారులు, ఋణపత్రధారులు అధికారాలను విధులను, బాధ్యతలను స్పష్టముగా నిర్వచిస్తుంది.
కంపెనీ నియమావళిని వివిధ పేరాలుగా విభజించి, వరుసగా సంఖ్యలు వేసి, ముద్రించవలెను. సంస్థాపనా పత్రము మీద సంతకాలు చేసినవారు నియమావళి మీద సాక్షి సమక్షములో సంతకాలు చేయవలెను.
ప్రైవేటు కంపెనీలు, వాటాపరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, అపరిమిత కంపెనీలు నియమావళిని తప్పని సరిగా తయారు చేసుకొనవలెను. పబ్లిక్ కంపెనీ తన సొంత నియమావళిని తయారుచేసుకోవచ్చు. లేకపోతే కంపెనీల చట్టము షెడ్యూల్ 1లో Table A అనే ఆదర్శ నియమావళి వర్తిస్తుంది.
నియమావళిలో ఉండే అంశాలు :
- వాటా మూలధనము దాని తరగతులు, వాటాల సంఖ్య, వాటాల విలువ, వాటాదారుల హక్కులు, వాటా పిలుపులు.
- వాటాల బదిలీ, వాటాల జప్తు, తిరిగి జారీచేసే విధానము.
- డిబెంచర్లు, స్టాకు జారీ.
- వాటా మూలధనము మార్చుట, మూలధన తగ్గింపు.
- డైరెక్టర్ల నియామకము, వారి అధికారాలు, బాధ్యతలు, పారితోషికము.
- మేనేజింగ్ డైరెక్టర్ నియామకము.
- కంపెనీ సమావేశాలు – తీర్మానాలు.
- డివిడెండ్లు, రిజర్వులు, లాభాలను మూలధనంగా మార్చుట.
- ప్రాథమిక ఒప్పందాలు ఆమోదించే తీరు.
- కంపెనీ అధికార ముద్ర.
- కంపెనీ లెక్కలు, వాటి తనిఖీ.
- సభ్యుల ఓటింగ్ పద్దతి.
- సమావేశానికి కోరం నిర్ణయించుట.
- బ్యాంకు ఖాతాల నిర్వహణ.
- కనీసపు చందా.
- మధ్యవర్తిత్వము.
- కంపెనీని రద్దు చేసే విధానము.
ప్రశ్న 5.
పరిచయ పత్రం అంటే ఏమిటి ? అందులోని అంశాలు ఏమిటి ? [A.P. Mar. ’15]
జవాబు:
కంపెనీ : వస్థాపకులు నమోదు పత్రము రూపొందిన తర్వాత మూలధన సేకరణకై వాటాలు, డిబెంచర్లు జారీ చేస్తారు. పెట్టుబడి పెట్టే ప్రజలను ఆహ్వానించుటకు, ఆకర్షించుటకు వ్యవస్థాపకులు ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటనను పరిచయు పము అంటారు. కంపెనీ వాటాలను, ఋణపత్రాలు కొనమని ప్రజలను ఆహ్వానించే విజ్ఞప్తి పత్రమే, పరిచను పత్రము. ఇది నోటీసు రూపములోగాని, సర్క్యులర్ రూపములోగాని, వ్యాపార ప్రకటన లేదా మరేవిధమైన వివర పత్రములోగాని ఉండవచ్చు. కంపెనీల చట్టము ‘పరిచయ పత్రాన్ని ఇలా నిర్వచించినది. కంపెనీ వాటాలకు లేదా డిబెంచర్లకు చందాలు సమకూర్చడానికి లేదా వాటిని కొనడానికి గాని – పరిచయ పత్రము, నోటీసు, ప్రకటన పత్ర వ్యాపార ప్రకటన లేదా మరో విధమైన ప్రతిపాదనల ద్వారా పెట్టుబడి పెట్టే ప్రజలను ఆహ్వానించడము.”
పరిచయ పత్రమును జారీచేయడములో ఉద్దేశ్యము కొత్తగా ఒక కంపెనీ స్థాపించబడినదని, దానిలోని డైరెక్టర్లు దక్షత గల వారిని, కంపెనీకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని ప్రజలకు తెలియచేయడం. అంతేగాక ప్రకటించిన విషయాలకు డైరెక్టర్లదే పూర్తి బాధ్యత అని తెలియజేయడం.
పరిచయపత్రములో ఉండే అంశాలు :
- సంస్థాపనా పత్రములోని అంశాలు, ముఖ్యముగా కంపెనీ ధ్యేయాలు.
- సంస్థాపనా పత్రము మీద సంతకము చేసినవారి పేర్లు, వారి వృత్తులు, చిరునామాలు, వారు తీసుకున్న వాటాల వివరాలు.
- డైరెక్టర్లు, సెక్రటరీ, మేనేజర్ల పేర్లు, విలాసాలు, పారితోషికం.’
- కనీసపు చందా మొత్తము.
- చందా జాబితాలు తెరిచి ఉంచే కాలము.
- వాటా మూలధనాన్ని ఎన్ని తరగతులుగా విభజించినారు, ఎన్ని వాటాలుగా విభజించినది; వాటాదారుల హక్కులు.
- దరఖాస్తు మీద, కేటాయింపు మీద, పిలుపుల మీద చెల్లించవలసిన సొమ్ము.
- చందా పూచీదారుల పేర్లు, వారి కమీషన్.
- ప్రాథమిక ఖర్చులు.
- రిజర్వులు – మిగుళ్ళు వాటిని నిర్వహించే పద్ధతి.
- కంపెనీ ఆడిటర్లు, లాయర్ల పేర్లు, చిరునామాలు.
- కంపెనీ ఆస్తులను విక్రయించిన వారి పేర్లు, వారికి చెల్లించే కొనుగోలు ప్రతిఫలము.
- కంపెనీ వ్యవస్థాపకులకు చెల్లించవలసిన ప్రతిఫలము.
- వాటాదారుల ఓటింగ్ హక్కులు, సమావేశాల వివరాలు.
- ఆస్తి అప్పుల పట్టిక, లాభనష్టాల ఖాతా తనిఖీ చేసే ప్రదేశము, సమయము.
- వ్యాపారము గూర్చి నిపుణుల అభిప్రాయము.
- వాటాదారుల సమస్యలు పరిష్కరించే విధానము.
ప్రశ్న 6.
కంపెనీ స్థాపనా విధానాన్ని కూలంకషంగా విపులీకరించండి.
జవాబు:
కంపెనీ స్థాపనలో నాలుగు దశలుంటాయి. అవి. 1) వ్యవస్థాపన 2) నమోదు లేదా రిజిస్ట్రేషన్ 3) మూలధన సమీకరణ 4) వ్యాపార ప్రారంభము.
1) వ్యవస్థాపన : కంపెనీ ఏర్పాటుకు ముందు జరిగే కార్యక్రమాన్ని వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాలను కనుగొని లాభార్జన కోసము ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్ధవంతముగా నిర్వహించే ప్రక్రియను వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపనలో నాలుగు దశలుంటాయి. 1. వ్యాపార అవకాశాలను కనుగొనుట 2. సమగ్రమైన పరిశోధన, 3. వనరుల సమీకరణ, 4. ఆర్థిక ప్రతిపాదన.
2) కంపెనీ నమోదు లేదా రిజిస్ట్రేషన్ : ఏ కంపెనీ అయినా చట్టబద్ధముగా గుర్తింపు పొందవలెనంటే నమోదు అవసరము. నమోదు కొరకు కొన్ని ముఖ్యమైన పత్రాలను రిజిస్ట్రారు వద్ద దాఖలుచేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీ, నమోదుకొరకు దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలు.
- పేరు అనుమతి కోసము దరఖాస్తు
- సంస్థాపనా పత్రము
- నియమావళి
- క్రింది అదనపు పత్రాలను కూడా రిజిస్ట్రారు వద్ద, దాఖలు చేయాలి.
i) మొదటి డైరెక్టర్ల సమ్మతి పత్రము
ii) పవర్ ఆఫ్ అటార్నీ
iii) కంపెనీ రిజిష్టర్డ్ కార్యాలయం తెలిపే నోటీసు
iv) డైరెక్టర్లు, మేనేజరు, సెక్రటరీ వివరాలు 5. శాసనాత్మక ప్రకటన - నమోదు రుసుం చెల్లింపు
- నమోదు పత్రము
పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి సంతృప్తి చెందిన మీద కంపెనీ నమోదు పత్రాన్ని జారీ చేస్తాడు. నమోదు పత్రము పొందిన వెంటనే ప్రైవేటు కంపెనీ వ్యాపారమును ప్రారంభించవచ్చును. కాని పబ్లిక్ కంపెనీ వ్యాపారమును ప్రారంభించుటకు వ్యాపార ప్రారంభ ధ్రువ పత్రాన్ని పొందవలెను.
3) మూలధన సేకరణ : కంపెనీ వాటాలను జారీచేసి మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ నమోదుకు ప్రాథమిక ఖర్చులు, ఆస్తుల కొనుగోలు మొదలైన వాటికి అవసరమయ్యే మొత్తాన్ని కనీసపు చందా అంటారు. కంపెనీ పరిచయ పత్రములో పేర్కొన్న కనీసపు చందా మొత్తాన్ని సేకరించకుండా వ్యాపారమును ప్రారంభించలేదు. కంపెనీ జారీ చేసిన మూలధనములో మొత్తాన్ని, 90% పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజులలోపు సేకరించాలి. అలా సేకరించకపోతే సెబీ సూచనల మేరకు 10 రోజులలోపు దరఖాస్తు దారులకు తిరిగి చెల్లించవలెను.
4) వ్యాపార ప్రారంభము పబ్లిక్ కంపెనీ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందుటకు ఈ క్రింది పత్రాలను రిజిస్ట్రారుకు సమర్పించాలి.
- పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రము..
- డైరెక్టర్ల అర్హత వాటాలు తీసుకొని చెల్లించినట్లు ధృవీకరణ పత్రము.
- కనీసపు చందా వసూలైనట్లు, దాని మేరకు వాటాలను కేటాయించినట్లుగా ధృవీకరణ పత్రము.
- వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలు పాటించినట్లుగా కంపెనీ డైరెక్టరు లేదా సెక్రటరీ ప్రకటన. పై పత్రాలను రిజిస్ట్రారు పరిశీలించి, సంతృప్తి చెందినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తాడు. ఈ పత్రము పొందడముతో కంపెనీ స్థాపన పూర్తి అవుతుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వివిధ రకాల వ్యవస్థాపకుల గురించి వ్రాయండి.
జవాబు:
వ్యవస్థాపకులను దిగువ విధాలుగా వర్గీకరించవచ్చును.
- వృత్తిగా స్వీకరించిన వ్యవస్థాపకులు : ఈ రకమైన వ్యక్తులు కంపెనీ వ్యవస్థాపనలో ప్రత్యేకీకరణ చూపుతారు. ఒకసారి కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత దానిని వాటాదారులకు అప్పగిస్తారు. వీరు వ్యవస్థాపన పూర్తికాల వృత్తిగా నిర్వహిస్తారు.
- యాదృచ్ఛిక వ్యవస్థాపకులు : ఈ వ్యవస్థాపకులు కంపెనీ వ్యవస్థాపనను వృత్తిగా స్వీకరించనప్పటికి కొన్ని సమయాలలో కంపెనీ వ్యవస్థాపనలో ఆసక్తిని చూపుతారు. ఉదా : లాయర్లు, ఇంజనీర్లు.
- ఆర్థిక వ్యవస్థాపకులు : కొన్ని సందర్భాలలో కొన్ని ఆర్థిక సంస్థలు కంపెనీ వ్యవస్థాపనను చేపట్టవచ్చును.
- సాంకేతిక వ్యవస్థాపకులు: ఈ తరహా వ్యవస్థాపకులు తమకున్న ప్రత్యేక పరిజ్ఞానము ద్వారా కొత్త సంస్థలను స్థాపించడము జరుగుతుంది.
- సంస్థాగత వ్యవస్థాపకులు : కంపెనీ స్థాపనకు కావలసిన సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక సహాయాలను అందించడానికి ప్రత్యేకముగా ఏర్పాటయ్యే సంస్థలను సంస్థాగత వ్యవస్థాపకులు అంటారు. మన దేశములో మేనేజింగ్ ఏజెంట్లు నూతన సంస్థల వ్యవస్థాపనలో ముఖ్యమైన పాత్రను పోషించినారు.
ప్రశ్న 2.
సంస్థాపనా పత్రానికి, నియమావళికి మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలపండి.
జవాబు: సంస్థాపనా పత్రానికి, నియమావళికి మధ్య గల వ్యత్యాసాలు :
సంస్థాపనా పత్రము
- ధ్యేయాలు: సంస్థాపనా పత్రము కంపెనీకి రాజ్యాంగము వంటిది.
- ఉద్దేశ్యాలు : కంపెనీకి, బాహ్య ప్రపంచానికి మధ్యగల సంబంధాలను విశదీకరిస్తుంది.
- ఆవశ్యకత : ప్రతి కంపెనీ సంస్థాపనా పత్రాన్ని తప్పనిసరిగా తయారుచేయాలి. ఇది ప్రధాన పత్రము.
- మార్పులు : మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వము, కోర్టు అనుమతించాలి.
- ఒప్పందము : ఇది చట్టానికి మాత్రమే లోబడి ఉంటుంది.
- చట్ట ప్రభావము : సంస్థాపనా పత్రములో పేర్కొన్న అంశాలకు విరుద్ధముగా కంపెనీ వ్యవహరిస్తే అవి న్యాయాతీతముగా భావించబడతాయి. చెల్లుబడి • కావు.
- హోదా : రెండు పత్రాలకు మధ్య వివాదము ఉంటే ‘సంస్థాపనా పత్రములోని అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది.
నియమావళి
- నియమావళి కంపెనీకి చట్టములాంటిది. అంతర్గత వ్యవహారాలకు చుక్కాని వంటిది.
- కంపెనీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన నియమ నిబంధనలను తెలియజేస్తుంది.
- పబ్లిక్ కంపెనీలకు సొంత నియమావళి అవసరము లేదు. ఇది ద్వితీయ ముఖ్య పత్రము.
- మార్పు కోసం వాటాదారుల ప్రత్యేక తీర్మానము చాలు.
- ఇది కంపెనీల చట్టానికి, సంస్థాపనా పత్రానికి రెండింటికి లోబడి ఉంటుంది.
- నియమావళిలోని అంశాలకు విరుద్ధముగా సంస్థాపనా పత్రానికి లోబడి తీసుకున్న చర్యలను సభ్యులు అంగీకరిస్తే చెల్లుబడి అవుతాయి.
- నియమావళిలోని అంశాలు ఎప్పుడూ సంస్థాపనా పత్రములోని అంశాలకు లోబడి ఉంటాయి.
ప్రశ్న 3.
వ్యవస్థాపకుల విధులను పేర్కొనండి.
జవాబు:
వ్యవస్థాపకుని విధులు :
- వ్యవస్థాపకుడు వ్యాపార అవకాశాలను శోధిస్తాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి వ్యాపారము ప్రారంభించవలెననే విషయములపై పరిశోధనలను జరిపి ఒక నిర్ణయానికి వస్తాడు.
- వ్యాపార ఉద్దేశ్యము ఏర్పడగానే ఆ ఉద్దేశాన్ని ఆచరణలో పెట్టడానికి సవిస్తరమైన శోధనలు చేస్తాడు. ఉత్పత్తి వస్తువుల డిమాండు, ముడిపదార్థాల లభ్యత, రవాణా సౌకర్యాలు, అవసరమైన మూలధనము, లాభాలు మొదలైన అంశాల గురించి పరిశీలన చేసి, ఇవి అనుకూలముగా ఉంటే స్థాపనకు ముందంజ వేస్తాడు.
- ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలి. భవన నిర్మాణాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు సేకరించాలి. నిర్వహణా సామర్థ్యాన్ని సమీకరించుకోవాలి.
- కంపెనీ బ్యాంకర్లను, ఆడిటర్లను, సొలిసిటర్లను ఎన్నుకోవాలి.
- కంపెనీ నమోదుకు కావలసిన ముఖ్య పత్రాలను తయారు చేయాలి.
- కంపెనీకి కావలసిన ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలి.
- కంపెనీని నిర్వహించడానికి కావలసిన మూలధనాన్ని సేకరించాలి.
- పరిచయ పత్రాన్ని జారీచేసి, వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందవలెను.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యవస్థాపన నిర్వచనం.
జవాబు:
కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందు జరిగే కార్యక్రమమును వ్యవస్థాపన అంటారు. అనగా వ్యాపార ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుగొని, లాభార్జనకై ఉత్పత్తి సాధనాలను సమీకరించుకొని సమర్థవంతముగా నిర్వహించే ప్రక్రియ. గెస్టిన్ బర్గ్ వ్యవస్థాపనను ఇలా నిర్వచించినాడు. ‘వ్యాపార అవకాశాలు కనుక్కోవడము, ఆ తరువాత లాభార్జనకై నిధులను, ఆస్తులను, నిర్వహణా సామర్థ్యాన్ని ఆ సంస్థలో వెచ్చించడము’
ప్రశ్న 2.
కనీసపు చందా
జవాబు:
పబ్లిక్ కంపెనీ స్థాపనకు కావలసిన కనీసపు మూలధనాన్ని కనీసపు చందా అంటారు. కనీసపు చందాను పరిచయ పత్రాన్ని జారీ చేసిన 120 రోజుల లోపు సేకరించాలి. ఈ మొత్తాన్ని సేకరించకుండా పబ్లిక్ కంపెనీ వాటాలను కేటాయించరాదు. కనీసపు చందా మొత్తాన్ని క్రింది అంశాల ఆధారముగా నిర్ణయిస్తారు.
- కంపెనీ స్థిరాస్థుల కొనుగోలుకు,
- ప్రాథమిక ఖర్చులు చెల్లించడానికి
- నిర్వహణకు అవసరమైన మూలధన సేకరణకు
- కంపెనీ స్థాపనకు, నిర్వహణకు అవసరమయ్యే ఇతర వ్యయాలకు.
ప్రశ్న 3.
సంస్థాపనా పత్రం
జవాబు:
భారత కంపెనీల చట్టము క్రింద నమోదయిన అన్ని కంపెనీలకు అత్యావశ్యకమైన పత్రము సంస్థాపనా పత్రము. సంస్థాపనా పత్రము అనే పునాది మీదనే కంపెనీ అనే భవనము నిర్మాణము అవుతుంది. ఈ పత్రము కంపెనీ అధికారానికి గల ఎల్లలను, వ్యవహారాలకు హద్దులను ఏర్పాటు చేస్తుంది. కంపెనీ ధ్యేయాలను, అధికారాలను, కార్యకలాపాలను వాటాదారులు, ఋణదాతలు, కంపెనీతో ప్రత్యక్షముగా సంబంధమున్న ప్రతివారికి ఖచ్చితముగా తెలియపరచడమే ఈ పత్రము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కనుక దీనిని కంపెనీ రాజ్యాంగమంటారు.
ప్రశ్న 4.
ప్రత్యామ్నాయ పరిచయ పత్రం.
జవాబు:
పబ్లిక్ కంపెనీలు తామే మూలధనాన్ని సేకరించుకోగలిగితే పరిచయ పత్రాన్ని జారీచేయనక్కర్లేదు. ప్రత్యామ్నాయముగా పరిచయపత్ర నివేదికను వాటాల కేటాయింపుకు కనీసము మూడు రోజులు ముందుగా కంపెనీల రిజిస్ట్రారుకు దాఖలు చేయాలి. పరిచయ పత్రములోని అంశాలే దాదాపుగా దీనిలో ఉంటాయి. ఈ నివేదికపై డైరెక్టర్లు అందరూ సంతకాలు చేయవలెను.
ప్రశ్న 5.
పరిచయ పత్రంలోని అసత్య ప్రకటనలకు విధించే క్రిమినల్ బాధ్యత
జవాబు:
పరిచయ పత్రములో అసత్య ప్రకటనలు ఉండి, వాటిని నమ్మి ఎవరైనా వాటాలను గాని, డిబెంచర్లను గాని కొని నష్టపోయామని నిరూపించినట్లయితే, పరిచయ పత్రము జారీతో సంబంధమున్న ప్రతి వ్యక్తికి 50,000 జరిమానా లేదా రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా రెండింటిని విధించవచ్చును.