AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం – మూలాధారాలు – I

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Commerce Study Material 8th Lesson వ్యాపార విత్తం – మూలాధారాలు – I Textbook Questions and Answers.

AP Inter 1st Year Commerce Study Material 8th Lesson వ్యాపార విత్తం – మూలాధారాలు – I

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార విత్తము అంటే ఏమిటి ? ఒక వ్యాపార సంస్థలో దీని అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని వివరించండి. [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
వ్యాపార సంస్థ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ద్రవ్య వనరుల సేకరణ, వినియోగము, నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను వ్యాపార విత్తము అంటారు. గల్మన్, దగల్ ప్రకారము “వ్యాపారములో ఉపయోగించే నిధుల ప్రణాళికీకరణ, సేకరణ, నియంత్రణ, వాడకాన్నే వ్యాపార విత్తము” అంటారు. ఓస్బర్న్ “వ్యాపారములో వాడే నిధుల సేకరణ, వాటిని వాడే ప్రక్రియను వ్యాపార విత్తము” గా నిర్వచించినాడు.

వ్యాపార విత్తము – ఆవశ్యకత: సాధారణముగా వ్యాపారములో స్థిరాస్తుల కొనుగోలుకు, దైనందిన కార్యకలాపాల నిర్వహణకు విత్తము అవసరమవుతుంది. లాభార్జనే ప్రధాన లక్ష్యముగా కలిగిన వ్యాపార సంస్థకు ఈ లక్ష్య సాధన నిమిత్తము ఈ దిగువ తెలిపిన కారణాల వలన విత్తము అవసరమవుతుంది.

1) వ్యాపార ప్రారంభానికి: వ్యాపారాన్ని ప్రారంభించడానికి, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి విత్తము అవసరమవుతుంది. వ్యాపార స్వరూపము, స్వభావాన్ని బట్టి, సాంకేతిక పరిజ్ఞానము బట్టి ఎంత విత్తము అవసరమో. తెలుస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రాథమిక కృషికి విత్తము అవసరము.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

2) వ్యాపార విస్తరణకు: అధునాతనమైన యంత్ర సామాగ్రిని కొనుగోలు చేయడానికి, సాంకేతిక నైపుణ్యముగల శ్రామికులను నియమించుటకు పెద్ద మొత్తములో విత్తము అవసరమవుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినపుడే వస్తువు నాణ్యత పెరుగుతుంది. యూనిట్ వ్యయం తగ్గుతుంది.

3) కొత్త వస్తువులను ఉత్పత్తి చేసి, మార్కెట్ చేయడం: నూతన వస్తువులను రూపొందించడానికి, వినియోగదారులకు వస్తువులను అందించడానికి సంస్థకు విత్తము అవసరము. మార్కెట్లో సుస్థిరముగా నిలబడవలెనంటే వస్తువుల నవకల్పనకు, పరికల్పనకు తగిన ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.

4) కొత్త మార్కెట్లో ప్రవేశించడం: కొత్త మార్కెట్ను సృష్టించుకోవడం అంటే కొత్త ఖాతాదారులను ఆకర్షించడమే. కొత్త మార్కెట్లోనికి ప్రవేశించడానికి, సంస్థకు ప్రచారాల కోసము, చిల్లర దుకాణాలను ఏర్పాటు చేయటము కోసము విత్తము అవసరమవుతుంది.

5) మరొక వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి లేదా స్వాధీనము చేసుకోవడం కోసము: పోటీని నివారించడానికి, మరింత బలపడడానికి ఒక సంస్థ మరొక సంస్థను స్వాధీనము చేసుకోవడానికి విత్తము అవసరమవుతుంది.

6) వ్యాపారాన్ని కొత్త ప్రదేశానికి తరలించవలసినపుడు: ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారాన్ని మరొక కొత్త ప్రదేశానికి మార్చవలసినపుడు, ప్రస్తుతము ఉన్న వ్యాపారాన్ని వేరొక ప్రదేశానికి తరలించవలసి వచ్చినపుడు విత్తము అవసరమవుతుంది.

7) రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసము: వేతనాల చెల్లింపు, రవాణా, స్టేషనరీ, సప్లయిదారులకు చెల్లింపులు మొదలైన రోజువారీ ఖర్చుల కోసము సంస్థకు విత్తము అవసరమవుతుంది.

ప్రశ్న 2.
వివిధ విత్త మూలాధారాల ఎంపికను ప్రభావితము చేయు కారకాలను పేర్కొనండి.
జవాబు:
ఒక సంస్థకు ఆర్థికపరమైన అవసరాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి దీర్ఘకాలిక, స్వల్పకాలిక, స్థిర మూలధన, నిర్వహణ మూలధన అవసరాలుగా చెప్పవచ్చును. అందువలన వ్యాపార సంస్థలు వివిధ అవసరాలకు వివిధ విత్త మూలాధారాలను అన్వేషించవలసి ఉంటుంది. స్వల్పకాలిక నిధుల సేకరణ వ్యయము తక్కువ. కాని అనేక కారణాల వలన దీర్ఘకాలిక నిధులు అవసరమవుతాయి. వివిధ విత్త మూలాధారాలను ఎంపిక చేయడానికి క్రింది కారకాలను పేర్కొనవచ్చును.

1) వ్యయము: వ్యయం రెండు రకాలుగా ఉంటుంది. నిధుల సేకరణ వ్యయం, నిధులను ఉపయోగించేటపుడు అయ్యే వ్యయము. ఒక సంస్థ విత్త మూలాధారాలను ఎంపిక చేసేటప్పుడు ఈ రెండు వ్యయాలను లెక్కలోకి తీసుకొనవలెను.

2) ఆర్థిక పటిష్టత: సంస్థ ఆర్థిక పటిష్టత నిధుల సేకరణలో కీలకమైనది. వ్యాపార సంస్థ ఆర్థికముగా పటిష్టముగా ఉన్నప్పుడే తీసుకున్న ఋణాలను వడ్డీతో సహా చెల్లించగలదు.

3) వ్యాపార సంస్థ తరహా: ఒక వ్యాపార సంస్థ తరహా నిధులను సేకరించే ఎంపికను ప్రభావితం చేస్తుంది. ఉదా: భాగస్వామ్య సంస్థ వాటాలను జారీ చేయడం ద్వారా నిధులను సేకరించలేదు. కంపెనీలు మాత్రమే వాటాలను జారీ చేస్తాయి.

4) కాల పరిమితి, ఆవశ్యకత: ఒక వ్యాపార సంస్థకు ఎంత కాలానికి నిధులు అవసరము అవుతాయో ముందుగానే అంచనా వేయగలగాలి. ఉదా: స్వల్పకాలిక నిధులను తక్కువ వడ్డీరేటుకు వర్తక ఋణం, వాణిజ్య పత్రాల ద్వారా సేకరించవచ్చు. దీర్ఘకాలిక విత్తాన్ని వాటాలు, డిబెంచర్ల జారీ ద్వారా సేకరించవచ్చు.

5) నష్టభయము: వ్యాపార సంస్థ తనకు అందుబాటులో ఉన్న ప్రతి విత్త మూలాధారాన్ని నష్టభయం దృష్ట్యా పరిశీలించవలెను. ఉదా: ఈక్విటీ వాటాల ద్వారా మూలధనాన్ని సేకరిస్తే నష్ట భయం తక్కువ. మూలధనాన్ని, రద్దు అయితే తప్ప, వాపసు చేయనవసరం లేదు. లాభాలు రాకపోతే డివిడెండ్లు చెల్లించనక్కరలేదు. అదే ఋణ సేకరణ ద్వారా నిధులు సమకూర్చుకుంటే అసలు, లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా వడ్డీని చెల్లించాలి.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

6) నియంత్రణ: ఒక ప్రత్యేక నిధుల మూలాధారము సంస్థ నిర్వహణపై ఉన్న యాజమాన్య అధికారాన్ని ప్రభావితము చేయవచ్చు. ఈక్విటీ వాటాల జారీ సంస్థ నియంత్రణాధికారాన్ని పలుచన చేస్తుంది.

7) ఆర్థిక పటిష్టతపై ప్రభావము: వ్యాపార సంస్థ కొన్ని రకాల విత్త వనరులపై ఆధారపడినపుడు మార్కెట్లో సంస్థ ఆర్థిక పటిష్టతపై ప్రభావాన్ని చూపుతుంది. ఉదా: హామీగల డిబెంచర్లను జారీచేస్తే, హామీలేని ఋణదాతలకు కంపెనీ పట్ల ఆసక్తి తగ్గి, పరపతిని పొడిగించడానికి ఇష్టపడకపోవచ్చు.

8) సరళత, సౌలభ్యము: వ్యాపార సంస్థలు ఆర్థిక సహాయక సంస్థల నుంచి ఋణాలు పొందడానికి ఎన్నో నిబంధనలు, లాంఛనాలను పూర్తి చేయవలసి ఉంటుంది. ఉదా: బ్యాంకుల నుంచి ఋణాలు పొందడానికి ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. ఇతరుల నుంచి ఋణాలను తేలికగా పొందడానికి సౌలభ్యము ఉంటే వాణిజ్య బ్యాంకుల కంటే ఇతర విత్త వనరులను ఎన్నుకోవచ్చు.

9) పన్ను ప్రయోజనాలు: పన్ను ఆదాలను దృష్టిలో ఉంచుకొని నిధుల ఆధారాలను ఎంపిక చేసేటప్పుడు కొన్ని మూలాలు మనకు అందుబాటులో ఉండవచ్చు. ఉదా: ఆధిక్యపు వాటాలపై డివిడెండు పన్ను నుంచి మినహాయించలేము. కాని డిబెంచర్ల వడ్డీ చెల్లింపును పన్ను నుంచి మినహాయించవచ్చును.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఒక వ్యాపార సంస్థకు అవసరమైన వివిధ రకాల మూలధనాన్ని పేర్కొనండి.
జవాబు:
వ్యాపార సంస్థ ప్రారంభించడానికి విత్తము అవసరమవుతుంది. దీనినే మూలధనం అంటారు. మూలధనము ఎంత అవసరము అవుతుంది అనేది వ్యాపార సంస్థ యొక్క స్వభావము, పరిమాణాన్ని బట్టి ఉంటుంది. మూలధనమును రెండు రకాలుగా విభజించవచ్చును. అవి: 1. స్థిర మూలధనము 2. నిర్వహణ మూలధనము.
1) స్థిర మూలధనము: ఒక వ్యాపార సంస్థ స్థాపనకు ‘స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను సేకరించడానికి ఉపయోగించే మూలధనమును స్థిర మూలధనము అంటారు. ఇలాంటి మూలధనము లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు. వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటిమీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోను, వ్యాపారము చేసే దుస్తుల పంపిణీ సంస్థలో తక్కువ మొత్తములో అవసరము ఉంటుంది.

2) నిర్వహణ మూలధనము: ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, ఋణగ్రస్తులు, సరుకు నిల్వ, వసూలు బిల్లుల వంటి స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము అంటారు. ప్రస్తుత ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సంవత్సరములోపు నగదు రూపములో తిరిగి పొందే అవకాశమున్నది. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని వ్యాపార సంస్థలకు ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణము వంటి అంశాలనాధారముగా ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనం అవసరమవుతుంది.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

ప్రశ్న 2.
వ్యాపార విత్తమూలాల వర్గీకరణను వివరించండి.
జవాబు:
1) కాల వ్యవధి ఆధారముగా: కాల వ్యవధి ఆధారముగా విత్తాన్ని సేకరించడానికి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక వ్యవధిగా విభజించవచ్చు.
ఎ) దీర్ఘకాలిక విత్తము: దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది. సేకరించడానికి వనరులు –

  • వాటాలు, డిబెంచర్ల జారీ
  • దీర్ఘకాలిక ఋణాలు
  • ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు
  • నిలిపి ఉంచిన ఆర్జనలు, ప్రభుత్వ గ్రాంట్లు.

బి) మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. వీటిని ఈ క్రింది వనరుల నుంచి సేకరించవచ్చును.

  • వాణిజ్య బ్యాంకులు
  • పబ్లిక్ డిపాజిట్లు
  • లీజు విత్తము
  • ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు

సి) స్వల్పకాలిక విత్తము: ఈ తరహా విత్తాన్ని స్వల్పకాలము అంటే ఒక సంవత్సరములోపు అవసరాల నిమిత్తం సేకరిస్తారు. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు

  • వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు
  • వాయిదా ఋణాలు
  • ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
  • వాణిజ్య పత్రాలు

2. యాజమాన్యము ఆధారముగా: నిధులపై యాజమాన్యపు హక్కు ఆధారము రెండు రకాలు. ·
ఎ. యాజమాన్యపు నిధులు
బి. ఋణాత్మక నిధులు

ఎ) యాజమాన్యపు నిధులు: దీనిలో యజమానుల మూలధనమే కాకుండా నిలిపి ఉంచిన ఆర్జనలు కూడా చేరి ఉంటాయి.
బి) ఋణపూర్వక నిధులు: ఋణాల ద్వారా సమకూర్చుకునే నిధులు. వీటికి మూలాలు వాణిజ్య బ్యాంకుల నుంచి, ఆర్థిక ద్రవ్య సహాయక సంస్థల నుంచి ఋణాలు, డిబెంచర్ల జారీ, పబ్లిక్ డిపాజిట్లు, వర్తకపు ఋణాలు.

3) విత్తము ఉత్పన్నమయ్యే మూలాల ఆధారముగా: మూలధన వనరులు అంతర్గత లేదా బహిర్గత మూలాల నుంచి లభించవచ్చు. అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యేవి. లాభాల పునరాకర్షణ, నిలిపి ఉంచిన ఆర్జనలు, వసూలు బిల్లులపై వసూళ్ళు, మిగిలిన సరుకు అమ్మివేయడం, నిధులను వెనుకకు మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.
‘బహిర్గత మూలాలు అంటే సంస్థ వెలుపలి నుంచి లభ్యమయ్యే వనరులు. ఉదా: వాటాలు, డిబెంచర్లు, పబ్లిక్ డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, ద్రవ్య సహాయక సంస్థల నుంచి ఋణాలు, సరుకు సరఫరాదారులు అందించే వర్తక ఋణము, పెట్టుబడిదారులు, ఋణదాతలు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార విత్తము [T.S. Mar. 15.]
జవాబు:
ఆధునిక వ్యాపార సంస్థలకు విత్తము ప్రధానమైనది. వ్యాపారము, విత్తము ఒకదానిపై మరొకటి ఆధారపడి పరస్పరము సహకరించుకుంటూ పనిచేస్తాయి. వ్యాపార సంస్థకు అవసరమైన మూలధనాన్ని సేకరించి, భద్రపరిచి, నిర్వహించి తద్వారా లాభార్జన లక్ష్యాన్ని సాధించుటకు సంబంధించిన కార్యకలాపాలను వ్యాపార విత్తము అంటారు. ఒక వ్యాపారము ప్రారంభించడానికి, విస్తరణకు, మార్కెట్ తన వాటాను పంచుకొనడానికి ప్రతి సంస్థకు విత్తము అవసరము.

ప్రశ్న 2.
స్థిర మూలధనము
జవాబు:
ఒక వ్యాపార సంస్థ స్థాపనకు స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంటు మొదలైన స్థిరాస్తులను సేకరించడానికి ఉపయోగించే మూలధనమును స్థిర మూలధనము అంటారు. ఇలాంటి మూలధనం లేకుండా సంస్థ వ్యాపారాన్ని నిర్వహించలేదు, మనుగడను సాగించలేదు. వ్యాపార సంస్థ తన దీర్ఘకాలిక అవసరాలకు సేకరించే మూలధనమే స్థిర మూలధనము. స్థిర మూలధన పరిమాణము వ్యాపార సంస్థ స్వభావము, కార్యకలాపాలు, ఉత్పత్తి విధానము మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. భారీ పరిశ్రమలకు స్థిర మూలధనము పెద్ద మొత్తములోనూ, వ్యాపారము చేసే దుస్తుల పంపిణీ సంస్థలో తక్కువ మొత్తములో అవసరమవుతుంది.

ప్రశ్న 3.
నిర్వహణ మూలధనము
జవాబు:
ఒక వ్యాపార సంస్థ తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అంటే ముడిపదార్థాల కొనుగోలు, వేతనాల చెల్లింపు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు, స్వల్పకాలిక పెట్టుబడులు, సరుకు మొదలైన స్వల్పకాలిక ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని నిర్వహణ మూలధనము అంటారు. ప్రస్తుత ఆస్తులలో పెట్టుబడి పెట్టిన మూలధనము సంవత్సరంలోపు తిరిగి వచ్చే అవకాశము ఉన్నది. ఈ నిర్వహణ మూలధన పరిమాణము అన్ని సంస్థలలో ఒకే మాదిరిగా ఉండదు. ఆయా సంస్థల అమ్మకాల టర్నోవర్, నగదు అమ్మకాలు, అమ్మకాల పరిమాణాన్నిబట్టి ఎక్కువ లేదా తక్కువ నిర్వహణ మూలధనము అవసరమవుతుంది.

ప్రశ్న 4.
దీర్ఘకాలిక విత్తము [A.P. Mar. ’15]
జవాబు:
దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలకు మించి ఉంటుంది. దీర్ఘకాలిక విత్తమును సేకరించడానికి వనరులు:

  1. వాటాలు, డిబెంచర్ల జారీ
  2. దీర్ఘకాలిక ఋణాలు
  3. ఆర్థిక సంస్థల నుంచి ఋణాలు
  4. నిలిపి ఉంచిన ఆర్జనలు
  5. ప్రభుత్వ గ్రాంట్లు.

ప్రశ్న 5.
స్వల్పకాలిక విత్తము
జవాబు:
ఈ తరహా విత్తాన్ని స్వల్ప కాలానికి అంటే సంవత్సరము అవసరాల నిమిత్తము సేకరించడము జరుగుతుంది. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు

  • వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు
  • వాయిదా పరపతి
  • ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు
  • వాణిజ్య పత్రాలు’

ప్రశ్న 6.
అంతర్గత విత్త మూలాధారాలు
జవాబు:
అంతర్గత మూలాలు అంటే సంస్థలోనే లభ్యమయ్యే వనరులు. అవి:

  1. లాభాల పునరాకర్షణ
  2. నిలిపి ఉంచిన ఆర్జనలు
  3. వసూలు బిల్లులపై వసూళ్ళు
  4. మిగిలిన సరుకు అమ్మకాలు
  5. నిధులను వెనక్కి మళ్ళించడం లేదా నిధుల తగ్గింపు.

AP Inter 1st Year Commerce Study Material Chapter 8 వ్యాపార విత్తం - మూలాధారాలు - I

ప్రశ్న 7.
బహిర్గత నిధులకు మూలాలు
జవాబు:
బహిర్గత నిధులకు మూలాలు అంటే సంస్థ వెలుపలి నుంచి లభించే వనరులు. వీటికి ఉదాహరణలు

  1. వాటాలు
  2. డిబెంచర్లు
  3. పబ్లిక్ డిపాజిట్లు
  4. వాణిజ్య బ్యాంకులు
  5. ద్రవ్య సహాయక సంస్థలు
  6. సరుకు సప్లయిదారులకు అందించే ఋణం
  7. పెట్టుబడిదారులు
  8. ఋణదాతలు