Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 4th Lesson విత్త మార్కెట్లు Textbook Questions and Answers.
AP Inter 2nd Year Commerce Study Material 4th Lesson విత్త మార్కెట్లు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
విత్తమార్కెట్ అంటే ఏమిటి ? దాని విధులు మరియు వర్గీకరణను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
విత్త మార్కెట్ అనే పదానికి విస్తృతమైన అర్థము ఉన్నది. ద్రవ్యత్వ ఆస్తులైన వాటాలు, బాండ్లు, కరెన్సీ నోట్లు మరియు డెరివేటివ్స్ వర్తకము కొరకు కొనుగోలు మరియు అమ్మకపుదారులు పాల్గొనే ఏ మార్కెట్ స్థలమైనా అది విత్తమార్కెట్ అవుతుంది. పెద్ద సంఖ్యలో విత్త సాధనాలను కలిగి ఉండే వివిధ విత్తమార్కెట్లు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి. 20వ శతాబ్దము చివరి వరకు ఈ మార్కెట్లలో కొన్ని ప్రయివేటు పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ ప్రవేశము కల్పించగా, మిగిలినవి దేశీయముగా ఉన్న పెద్ద అంతర్జాతీయ బ్యాంకులు మరియు విత్త నిపుణుల కొరకు ప్రత్యేకించబడినవి.
విత్తమార్కెట్ విధులు’: దిగువ తెలిపిన నాలుగు ముఖ్య విధులను నిర్వర్తించుట ద్వారా పరిమిత వనరులను పంపిణీ చేయుటలో విత్త మార్కెట్లు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నవి.
1) పొదుపును సమీకరించి ముఖ్య ఉత్పాదక రంగాలకు మళ్ళించడము: విత్త మార్కెట్ పొదుపు చేసేవారి నుంచి పెట్టుబడిదారులకు పొదుపు మొత్తాలను చేర్చడాన్ని సులభతరము చేస్తుంది. వివిధ పెట్టుబడులలో తమకు ఇష్టమైన వాటిలో అవకాశము కల్పించుట ద్వారా మిగులు నిధులు ముఖ్య ఉత్పాదక అవసరాలకు సరఫరా చేస్తుంది.
2) ధర నిర్ణయాన్ని సులభతరం చేయడం మార్కెట్ డిమాండ్ మరియు సప్లై శక్తులు, వస్తువు లేదా సేవల ధరలను నిర్ణయించడములో సహాయపడతాయి. విత్తమార్కెట్లో కుటుంబాలు నిధుల సరఫరాకు, వ్యాపార సంస్థలు డిమాండుకు ప్రాతినిధ్యము వహిస్తాయి. వాటి మధ్య ఉండే సంబంధము సంబంధిత మార్కెట్లో ఆర్థిక సంబంధమైన ఆస్తుల ధరలను నిర్ణయించడములో తోడ్పడుతుంది.
3) ఆర్థికపరమైన ఆస్తులకు ద్రవ్యత్వము కలుగజేయుట: ఆర్థిక పరమైన ఆస్తుల కొనుగోలు మరియు అమ్మకాలను విత్తమార్కెట్లు సులభతరము చేస్తాయి. ఈ విధముగా చేయడం వలన ఆస్తులకు ద్రవ్యత్వాన్ని కలుగజేసి అవసరమైనపుడు సులభముగా నగదులోనికి మార్చబడతాయి. విత్తమార్కెట్ యంత్రాంగము ద్వారా ఆస్తుల యజమానులు వారి ఆస్తులను || తక్షణము అమ్మగలుగుతారు.
4) కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడము మార్కెట్ లో వర్తకమయ్యే సెక్యూరిటీలను గురించి విలువైన సమాచారాన్ని విత్తమార్కెట్లు అందజేస్తాయి. ఇది విత్త ఆస్తుల కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారుల కాలాన్ని, శ్రమను, ధనాన్ని ఆదా చేస్తుంది. అందువలన విత్తమార్కెట్ కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారులు వారి వ్యక్తిగత అవసరాలను నెరవేర్చుకొనుటకు కలుసుకునే సాధారణ వేదికగా ఉంటుంది.
విత్తమార్కెట్ల వర్గీకరణ: విత్త మార్కెట్ల వర్గీకరణ అవి నిర్వహించే లావాదేవీల కాలపరిమితిని బట్టి ఉంటుంది. ఒక సంవత్సరంలోపు పరిమితిగల కార్యకలాపాలను ద్రవ్య మార్కెట్లోను, దీర్ఘకాల పరిమితిగల కార్యకలాపాలు మూలధన మార్కెట్లో నిర్వహించబడతాయి.
ద్రవ్యమార్కెట్: ఒక సంవత్సరము కాలపరిమితి గల స్వల్పకాలిక నిధులు / ద్రవ్య ఆస్తులతో వ్యవహారాలను జరిపే మార్కెట్ను డ్రవ్య మార్కెట్ అంటారు. ఈ ఆస్తులు ద్రవ్యానికి సమీప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. తాత్కాలిక ‘ద్రవ్య అవసరాలకు, బాధ్యతలకు స్వల్పకాలిక నిధులను ఈ మార్కెట్ సమకూరుస్తుంది. మిగుల నిధుల నుండి రాబడులను ఆర్జించడానికి తాత్కాలిక బదలాయింపు చేస్తుంది. ఈ మార్కెట్లో రిజర్వుబ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్ ఇతర సంస్థలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, భారీ కార్పొరేటు సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యపాత్రను వహిస్తాయి.
మూలధన మార్కెట్: మూలధన మార్కెట్ దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు, సదుపాయాలను కలుగజేస్తుంది. ఇది ఋణ ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చి పెట్టుబడిగా పెడుతుంది. సమాజములోని పొదుపు మొత్తాలు వివిధ మార్గాల ద్వారా సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి. మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, స్టాక్ ఎక్సేంజ్లు ఉంటాయి.
మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ మరియు ద్వితీయ మార్కెట్ అను రెండు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చును. మొదటి సారి నూతనముగా చేసిన జారీలను ప్రాథమిక మార్కెట్ అని, తదుపరి జరిగే ఏదైనా ద్వితీయ మార్కెట్ లో జరుగుతుంది.
ప్రశ్న 2.
మూలధన మార్కెట్ అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
మూలధన మార్కెట్ అనే పదము దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు మరియు సదుపాయాలను తెలుపుతుంది. దీనిలో ఋణ మరియు ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చబడి పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. దీనిలో సమాజములోని పొదుపు మొత్తాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి. మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు మరియు స్టాక్ ఎక్సేంజ్లు ఉంటాయి. బాగా పనిచేసే మూలధన మార్కెట్ ఉండటము వలన ఆర్థికాభివృద్ధి ప్రక్రియ సులభతరం అవుతుంది. వాస్తవంగా ఆర్థికాభివృద్ధికి విత్త విధానము అభివృద్ధి చెందడం తప్పనిసరి అవుతుంది. ద్రవ్య సహాయక సంస్థలు అవసరమైన మేరకు అభివృద్ధి చెందడంతో పాటు మార్కెట్ కార్యకలాపాలు సులభముగా, నిష్పక్షపాతముగా మరియు పారదర్శకముగా ఉండటం ఎంతో అవసరము.
మూలధన మార్కెట్ ప్రాముఖ్యత:
1) పొదుపు చేసేవారిని, పెట్టుబడిదారులను అనుసంధానము చేయుట: దేశములో నిద్రాణముగా ఉన్న పొదుపు మొత్తాలను సమీకరించి ఉత్పాదక, పెట్టుబడి సంస్థలకు సరఫరా చేయడములో మూలధన మార్కెట్ ప్రముఖ పాత్రను వహిస్తుంది. అధిక ఆదాయము ఉన్నవారి నుంచి పొదుపును సమీకరించి, లోటు మరియు ఉత్పాదక రంగాలకు విత్త వనరులను బదిలీ చేస్తుంది.
2) పొదుపును ప్రోత్సహించడము: అభివృద్ధి చెందని దేశాలలో మూలధన మార్కెట్ లేకపోవడం వలన చాలా స్వల్ప పొదుపు మొత్తాలు మాత్రమే కలిగి, వాటిని అనుత్పాదక రంగాలలోను మరియు స్పష్టమైన వినియోగములోనూ వెచ్చిస్తున్నారు. మూలధన మార్కెట్ అభివృద్ధి చెందితే విత్త సంస్థలు ప్రజలను ప్రోత్సహించుటకు వివిధ రకాల సాధనాలను అందుబాటులోకి తెస్తాయి.
3) పెట్టుబడికి ప్రోత్సాహము: వాటాలు, బాండ్లు, సెక్యూరిటీలు మొదలైన పత్రాల లభ్యత వలన ప్రభుత్వానికి ఋణాల మంజూరుకు లేదా పరిశ్రమలలో పెట్టుబడికి ప్రోత్సాహం లభిస్తుంది. అందువలన వ్యాపారస్తులకు, ప్రభుత్వానికి ఋణాలు మంజూరు చేయడం ద్వారా మూలధన మార్కెట్ పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది.
4) ధరలలో స్థిరత్వము: మూలధన మార్కెట్ వాటాలు, సెక్యూరిటీల ధరలను స్థిరీకరించి ధరల హెచ్చు, తగ్గులను నివారిస్తుంది. స్థిరీకరణ ప్రక్రియలో పరపతి కోరేవారికి తక్కువ వడ్డీ పెట్టుబడి సరఫరా సాధ్యపడుతుంది. స్పెక్యులేషన్ మరియు అనుత్పాదక రంగాలలో పెట్టుబడిని తగ్గించవచ్చును.
5) ఆర్థికాభివృద్ధిని పెంపొందించడము: ఏ దేశములోనైనా వివిధ రకాల పరిశ్రమలకు వనరులను సక్రమముగా పంపిణీ చేయుట ద్వారా సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించవచ్చును. మూలధన మార్కెట్ దేశ సాధారణ స్థితిగతులను ప్రతిబింబించడమే కాక ఆర్థికాభివృద్ధి ప్రక్రియను, సులభతరము మరియు వేగవంతము చేస్తుంది.
ప్రశ్న 3.
ద్రవ్య మార్కెట్ మరియు మూలధన మార్కెట్ల మధ్య భేదాలు వ్రాయండి.
జవాబు:
మూలధన మార్కెట్
- పార్టిసిపెంట్సు: మూలధన మార్కెట్లో అభివృద్ధి బ్యాంకులు మరియు పెట్టుబడి సంస్థలు ప్రధాన పాత్రను పోషిస్తాయి.
- సాధనాలు: ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు, బాండ్లు మొదలైనవి ప్రధాన వ్యాపార సాధనాలుగా ఉంటాయి.
- పెట్టుబడి వ్యయము: మూలధన మార్కెట్లో పెట్టుబడి పెద్ద మొత్తములో అవసరము ఉండదు. దీనిలో సెక్యూరిటీల యూనిట్ల విలువ సాధారణముగా తక్కువగా ఉంటుంది.
- కాలపరిమితి: ఇది ఒక సంవత్సరము కంటే ఎక్కువ దీర్ఘకాల పరిమితిగల నిధులకు చెందిన మార్కెట్.
- ద్రవ్యత: మూలధన మార్కెట్ లోని సెక్యూరిటీలను ద్రవ్యత గల పెట్టుబడులుగా భావిస్తారు. కారణం వీటిని స్టాక్ ఎక్సేంజ్లలో అమ్మవచ్చును.
- భద్రత: రాబడి మరియు పెట్టుబడి తిరిగి పొందే విషయములో మూలధన మార్కెట్ సాధనాలు నష్టభయంతో కూడుకున్నవి.
- ఆశించే రాబడి: మూలధన మార్కెట్లో పెట్టుబడి వలన సాధారణముగా పెట్టుబడిదారులకు ద్రవ్యమార్కెట్లో కంటే ఎక్కువగా రాబడి వచ్చే అవకాశము ఉన్నది.
- నియంత్రణ: మూలధన మార్కెట్లోని సంస్థలను సెబి నియంత్రిస్తుంది.
ద్రవ్య మార్కెట్
కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకులు ప్రధాన భాగస్వాములుగా ఉంటాయి.
స్వల్పకాల పరిమితి ఋణ సాధనాలైన ట్రెజరీ బిల్లులు, వర్తకపు బిల్లులు, వాణిజ్య పత్రాలు, డిపాజిట్ సర్టిఫికేట్లు ముఖ్య సాధనాలుగా ఉంటాయి. ద్రవ్య మార్కెట్లో సాధనాలు అధిక వ్యయముతో కూడినవి కావడముతో కార్యకలాపాలు పెద్ద మొత్తములో జరుగుతాయి.
ఇది ఒక సంవత్సరం కాలము మించని స్వల్ప కాల పరిమితి గల నిధుల మార్కెట్.
ద్రవ్య మార్కెట్లోని సాధనాలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం వలన అత్యధిక ద్రవ్యత్వాన్ని పొందుతున్నది.
ద్రవ్య మార్కెట్ సాధారణముగా కనీస నష్టభయం మాత్రమే కలిగి చాలా బాధ్యతతో కూడినది. స్వల్పకాల పెట్టుబడి మరియు జారీ చేసే వారి ఆర్థిక పటిష్టత వలన భద్రత అధికముగా ఉంటుంది.
మూలధన మార్కెట్తో పోల్చి చూసినపుడు ద్రవ్య మార్కెట్లో పెట్టిన పెట్టుబడికి రాబడి తక్కువగా ఉంటుంది.
భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్యమార్కెట్లను నియంత్రిస్తుంది.
ప్రశ్న 4.
స్టాక్ ఎక్సేంజ్్న నిర్వచించి, దాని విధులను చూపండి.
జవాబు:
సెక్యూరిటీల కాంట్రాక్టు క్రమబద్ధచట్టము 1956 స్టాక్ ఎక్సేంజ్ని క్రింది విధముగా నిర్వచించినది. “సెక్యూరిటీలలో వ్యవహారాలు, వాటి కొనుగోలు, అమ్మకాల వ్యాపారములో సహాయము చేయుట, క్రమబద్ధము చేయుట, నియంత్రణ చేయుట మొదలైన ఆశయాలతో ఏర్పడిన నమోదు అయిన లేదా నమోదు కాని వ్యక్తుల సంఘము లేదా వ్యవస్థ”.
స్టాక్ ఎక్సేంజ్ విధులు:
1) మార్కెట్ను సిద్ధముగా ఉంచుట: అన్ని రకములైన సెక్యూరిటీలను అన్నివేళలా కొనడానికి, అమ్మడానికి సంసిద్ధంగా ఉన్న మార్కెట్ స్టాక్ ఎక్సేంజ్. అందువలన పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మూలధనాన్ని సేకరిస్తాయి.
2) సెక్యూరిటీలకు ద్రవ్యతను కలుగజేయుట: స్టాక్ ఎక్సేంజ్ వలన పారిశ్రామిక సంస్థల సెక్యూరిటీలను కొనడానికి, అమ్మడానికి సిద్ధముగా ఉంటుంది. పెట్టుబడిదారులు తేలికగా సెక్యూరిటీలను అమ్ముకొని, సొమ్ము వాపసు తీసుకోవచ్చు. స్టాక్ ఎక్సేంజ్ల వలన సెక్యూరిటీలకు ద్రవ్యత మరియు మార్కెట్ లభిస్తాయి.
3) కొత్త సెక్యూరిటీల పంపిణీ: కొనసాగుతున్న కంపెనీలకు మూలధనము అవసరము అవుతుంది. ఈ అవసరాన్ని స్టాక్ ఎక్సేంజ్ల ద్వారా తీసుకోవచ్చు. కంపెనీ సెక్యూరిటీలకు విస్తృతమైన ప్రచారము చేసి, పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి.
4) మూలధన కల్పనకు అవకాశము: ప్రజలలో పొదుపును, పెట్టుబడి, నష్టము భరించే శక్తిని స్టాక్ ఎక్సేంజ్లు ప్రోత్సహిస్తాయి. దీని వలన ఎక్కువ మూలధన కల్పనకు, దేశ సౌభాగ్యానికి అవకాశము ఏర్పడి దేశ ఆర్థికాభివృద్ధి జరుగును.
5) సెక్యూరిటీల విలువను లెక్కగట్టుట: స్టాక్ ఎక్సేంజ్లలో నిత్యం జరిగే వ్యవహారములు అధికారికముగా నమోదు అవుతాయి. దీనివలన ఏ కంపెనీ పరిస్థితి ఏ విధముగా ఉందనే విషయము పెట్టుబడిదారులకు తెలుస్తుంది. కంపెనీల సెక్యూరిటీల విలువను హేతుబద్ధముగా నిర్ణయించడం జరుగుతుంది.
6) పెట్టుబడిదారుల ఆసక్తులను పరిరక్షించుట: వ్యవహారాలన్నీ స్టాక్ ఎక్సేంజ్లో ముందుగా నిర్ణయించబడిన నిబంధనల ప్రకారము జరుగుతాయి. ఈ నిబంధనలు సెక్యూరిటీల కాంట్రాక్టు రెగ్యులేషన్ చట్టము 1956కు లోబడి ఉంటాయి. అందువలన పెట్టుబడిదారులకు న్యాయము, భద్రత చేకూరుతాయి.
7) స్పేక్యులేషన్కు అవకాశము: సెక్యూరిటీల ధరలలో మార్పులను హేతుబద్ధముగా ముందుగానే ఊహించి సెక్యూరిటీలను కొనుగోలు, అమ్మకాలు జరపడాన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అంటారు. స్టాక్ ఎక్సేంజ్లు స్పెక్యులేషన్కు అవకాశాన్ని కల్పిస్తాయి. సెక్యూరిటీల డిమాండ్, సప్లల మధ్య పొంతన ఏర్పడి, దేశమంతటా ఇంచుమించు ఒకే ధర
అమలులో ఉంటుంది.
8) ఉత్పాదక కార్యక్రమాలకు ద్రవ్యమును ఉపయోగించుట: క్రమబద్ధమైన స్టాక్ మార్కెట్లు ఉండటం వలన దేశములో జరిగే పొదుపు, బంగారములోను, భూముల రూపములో కాకుండా పారిశ్రామిక రంగములో పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. ‘పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు.
ప్రశ్న 5.
SEBI అనగానేమి ? దాని లక్ష్యాలు మరియు విధులను వివరించండి.
జవాబు:
సెక్యూరిటీస్ మరియు ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) క్రమబద్ధమైన మరియు ఆరోగ్యకరమైన సెక్యూరిటీల అభివృద్ధి మరియు పెట్టుబడిదారులకు రక్షణగా పరిపాలన సమితిగా 1988 ఏప్రిల్లో భారత ప్రభుత్వముచే స్థాపించబడినది. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలన, నియంత్రణలో పనిచేస్తుంది. SEBI |కి జనవరి 1992లో ఒక ఆర్డినెన్సు ద్వారా చట్టబద్ధత కల్పించబడి, తర్వాత ఆర్డినెన్సు స్థానములో పార్లమెంటు సెక్యూరిటీస్ నుండి ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చట్టము, 1992లో చేయబడినది.
సెబి లక్ష్యాలు: సెబి ప్రధాన లక్ష్యము పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం, అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు సెక్యూరిటీల మార్కెట్ను నియంత్రించడం.
- సరైన మార్గములో విధులు నిర్వర్తించేలా స్టాక్ ఎక్సేంజ్లను మరియు సెక్యూరిటీల పరిశ్రమను నియంత్రించడం.
- పెట్టుబడిదారులు ముఖ్యముగా వ్యక్తిగత పెట్టుబడిదారుల హక్కులు మరియు ఆసక్తులను పరిరక్షించడం, వారికి మార్గదర్శకం మరియు అవగాహన కల్పించడము.
- ట్రేడింగ్ అక్రమాలను నిరోధించడం మరియు సెక్యూరిటీల పరిశ్రమల స్వయం నియంత్రణ మరియు దాని చట్టబద్ధ నియంత్రణల మధ్య సమన్వయం సాధించడం.
- బ్రోకర్లు, మర్చంట్ బ్యాంకర్లు మొదలైన మధ్యవర్తులలో పోటీతత్వము మరియు వృత్తినైపుణ్యం కలుగజేయుటకు ప్రవర్తనా నియమావళిని అభివృద్ధి చేయడం మరియు సక్రమ విధానాలను రూపొందించడము.
సెబి విధులు: సెబి సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ మరియు అభివృద్ధి, రక్షణ విధులను కూడా నిర్వహిస్తుంది.
I) నియంత్రణ విధులు:
- బ్రోకర్లు, ఉపబ్రోకర్లు మరియు మార్కెట్లో గల ఇతర వ్యక్తుల నమోదు.
- ఉమ్మడి పెట్టుబడి పథకాలు మరియు మ్యూచువల్ ఫండ్స్ నమోదు.
- స్టాక్ ఎక్సేంజ్లు, మరే ఇతర సెక్యూరిటీల మార్కెట్లోని స్టాక్ బ్రోకర్లు, పోర్ట్ ఫోలియో ఎక్సేంజ్లు, చందా పూచీదారులు మరియు మర్చంట్ బ్యాంకర్లను నియంత్రిస్తుంది.
- కంపెనీల టేస్ఓవర్ బిడ్లను నియంత్రించుట.
- స్టాక్ ఎక్సేంజ్లు మరియు మధ్యవర్తులను పర్యవేక్షణ చేయడం, విచారించడం మరియు ఆడిట్ చేయడం ద్వారా సమాచారాన్ని సేకరించడం.
- చట్టము యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఫీజు లేక ఇతర ఛార్జీలను విధించడం.
- భారత ప్రభుత్వము సెక్యూరిటీల కాంట్రాక్టు (క్రమబద్ధ) చట్టం, 1956 క్రింద అప్పగించిన అధికారాన్ని
వినియోగించడం.
II) అభివృద్ధి విధులు
- సెక్యూరిటీల మార్కెట్ మధ్యవర్తులకు శిక్షణ ఇవ్వడం.
- పరిశోధనలను నిర్వహించి మార్కెట్లో పాల్గోనే వారికి ఉపయోగపడే సమాచారాన్ని ప్రచురించడం.
- సరళమైన విధానాన్ని అనుసరించుట ద్వారా మూలధన మార్కెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టడం.
III) రక్షిత విధులు:
- తప్పుడు ప్రకటనలు, అవకతవకలు మొదలైన మోసపూరిత మరియు అన్యాయమైన వ్యాపార విధానాలను నిషేధించడము.
- ఇన్సైడ్ ట్రేడింగ్ను నియంత్రించడం మరియు అటువంటి విధానాలపై భారీ జరిమానాలు విధించడం.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ద్రవ్య మార్కెట్ యొక్క భాగాలను వివరించండి.
జవాబు:
ద్రవ్య మార్కెట్లో దిగువ భాగాలు ఉంటాయి.
1) పిలుపు ద్రవ్య మార్కెట్: ఇది భారతదేశ ద్రవ్య మార్కెట్కు ఒక ముఖ్యమైన ఉప మార్కెట్. దీనిని పిలుపుకు ద్రవ్యము మరియు చిన్న నోటీసుకు ద్రవ్యము మరియు బ్యాంకుల మధ్య ఋణ మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఈ మార్కెట్లో ద్రవ్యాన్ని అతిస్వల్ప కాలము కోసం డిమాండు చేస్తారు. ఇందులో లావాదేవీల వ్యవధి కొన్ని గంటల నుండి 15 రోజుల వరకు ఉంటుంది. ఇది ముంబై, ఢిల్లీ, కలకత్తా మొదలైన పారిశ్రామిక మరియు వాణిజ్య ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందినది. ప్రాథమికముగా ఈ లావాదేవీలు, స్టాక్ బ్రోకర్లు మరియు డీలర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి సహాయపడతాయి. అందుబాటులో ఉన్న ద్రవ్యముపై విధించే రేటును పిలుపు రేటు అంటారు. ఈ రేటును ద్రవ్యానికి ఉన్న డిమాండు మరియు పిలుపు రేటు అంటారు. ఈ రేటును ద్రవ్యానికి ఉన్న డిమాండు మరియు సప్ల ఆధారముగా మార్కెట్ శక్తులచే నిర్ణయింపబడుతుంది.
2) అంగీకార మార్కెట్: ఇది స్వల్పకాలిక సాధనాలు కలిగిన మార్కెట్. ప్రధానముగా ఎగుమతిదారులు తాము ఎగుమతి చేసిన వస్తువులకు త్వరగా చెల్లింపు పొందడానికి ఉపయోగించే పరపతి సాధనము.
3) బిల్ మార్కెట్: బిల్ మార్కెట్ అనగా స్వల్పకాలిక బిల్లులు అని అర్థము. ఇది స్వల్ప తేదీగల పత్రాలు, బిల్లులు మొదలైనవి కొనుగోలు మరియు అమ్మకాల కోసం ఉద్దేశించబడినది. ఇది వాణిజ్య బిల్ మార్కెట్ మరియు ట్రెజరీ బిల్ మార్కెట్ను కలిగి ఉంటుంది. ట్రెజరీ బిల్లులను మార్కెట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి సహాయపడుతుంది. అలాగే ఇతర రంగాలకు కూడా సహాయపడుతుంది.
4) అనుషంగిక ఋణ మార్కెట్: ఇది ద్రవ్యమార్కెట్లో ఒక ముఖ్యమైన భాగము. ఓవర్ డ్రాఫ్టులు, నగదు క్రెడిట్లపై ఋణాల రూపములో తీసుకుంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, బంగారం, వెండి, కార్పొరేషన్ల స్టాక్లు కనీస నగదు నిల్వలను నగదు రిజర్వు నిష్పత్తి అంటారు. పిలుపు ద్రవ్య ఋణాలపై చెల్లించే వడ్డీ రేటును పిలుపు రేటు అంటారు. ఈ రేటు రోజు రోజుకు, కొన్నిసార్లు గంట గంటకు మారుతూ ఉంటుంది.
5) డిపాజిట్ సర్టిఫికేట్లు: సెక్యూరిటీ ఆధారము లేని స్వల్పకాల సాధనాలైన డిపాజిట్ సర్టిఫికేట్లను వాణిజ్య బ్యాంకులు మరియు అభివృద్ధి చెందిన ద్రవ్యసహాయ సంస్థలు జారీ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల వృద్ధి తక్కువగా ఉండి, పరపతి అవసరాలు ఎక్కువగా ఉండి ద్రవ్యత్వము లోపించిన సందర్భాలలో వ్యక్తులకు, కార్పొరేషన్లకు మరియు కంపెనీలకు ఈ సర్టిఫికేట్లు జారీ చేయబడతాయి. స్వల్ప కాలానికి పెద్ద మొత్తాలలో డబ్బు సమీకరించడానికి సహాయపడతాయి. దీనిలో నష్టభయము ఎక్కువగా ఉండటం వలన డిపాజిట్ సర్టిఫికేట్లపై రాబడి ట్రెజరీ బిల్లుల కంటే ఎక్కువగా ఉంటుంది.
6) వాణిజ్యబిల్లు: వ్యాపారము చేసే వివిధ సంస్థలు నిర్వహణ మూలధన అవసరాలకు జారీచేసే బిల్లులను వాణిజ్య బిల్లులు అంటారు. ఇది సంస్థల అరువు అమ్మకాల ద్రవ్య సహాయానికి ఉపయోగపడే స్వల్పకాలిక, బదిలీ యోగ్యతగల, స్వయం ద్రవ్యత్వముగల సాధనము. ఈ బిల్లును అరువుకు అమ్మినవారు వ్రాయగా, అరువుకు కొన్నవారు సమ్మతిని తెలుపుతారు. అప్పుడు అది బిల్ మార్కెట్ సాధనమై వర్తకపు బిల్లుగా పిలవబడుతుంది. గడువు కాలంలోగా అమ్మకపుదారుడు డబ్బు అవసరమయితే ఈ బిల్లును బ్యాంకు వద్ద డిస్కౌంటు చేసుకోవచ్చు. వర్తకపు బిల్లులను వాణిజ్య బ్యాంకు అంగీకరిస్తే ఆ బిల్లును వాణిజ్య బిల్లు అంటారు.
7) అనుషంగిక ఋణాలు: ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల ఆధారముగా వాణిజ్య బ్యాంకులు అందజేసే ఋణాలను అనుషంగిక ఋణాలు అంటారు.
ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్ సాధనాలను వివరించండి.
జవాబు:
1) ట్రెజరీబిల్: సాధారణముగా కేంద్ర ప్రభుత్వము సంవత్సరము లోపు కాలపరిమితిగల స్వల్పకాలిక ఋణం పొందడానికి ట్రెజరీబిల్ ఒక సాధనముగా ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక అవసరాలకు నిధులు పొందడానికి భారత ప్రభుత్వము తరపున భారతీయ రిజర్వుబ్యాంకు ‘జీరో కూపన్ బాండ్ల’ పేరుతో వీటిని జారీ చేస్తుంది. వీటి కొనుగోలు ధర ముద్రిత విలువ కంటే తక్కువగా ఉంటుంది. తిరిగి చెల్లించేటపుడు పూర్తి ముఖ విలువను ప్రభుత్వం చెల్లిస్తుంది.
2) వాణిజ్య పత్రము: నిర్ణీత కాలపరిమితికి జారీచేసి, తిరిగి విమోచనము చేయు సెక్యూరిటీ లేని ప్రామిసరీ నోటు, అన్యాక్రాంత మరియు బదిలీ యోగ్యత గల పత్రాన్ని వాణిజ్య పత్రము అంటారు. భారీ మరియు పరపతి గల కంపెనీలు మార్కెట్ రేటు కంటే తక్కువ వడ్డీకి స్వల్పకాలిక నిధులు పెంచుకునేందుకు వీటిని జారీ చేస్తాయి. సాధారణముగా ఈ వాణిజ్య పత్రాల కాలవ్యవధి 15 రోజుల నుండి ఒక సంవత్సరము వరకు ఉంటుంది. దీనిని డిస్కాంటుకు జారీ చేసి అసలు ధరకు విమోచనం చేయడం జరుగుతుంది. కాలానుగుణ మరియు నిర్వహణ మూలధన అవసరాలకు స్వల్పకాలిక నిధులు సమకూర్చడం దీని ముఖ్యఉద్దేశము. బ్రిడ్జ్ ఫైనాన్స్ అవసరాల నిమిత్తము ఈ సాధనాన్ని కంపెనీలు ఉపయోగిస్తాయి.
3) పిలుపు ద్రవ్యము: ఇది స్వల్పకాలిక నిధుల మార్కెట్. కోరిన తక్షణము కాల పరిమితి ఒక రోజు నుంచి 15 రోజు లోపు తిరిగి చెల్లించే పద్ధతిపై తక్కువ నగదు నిల్వలు ఉన్న బ్యాంకులు ఎక్కువ నగదు నిల్వలున్న బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకుంటాయి.
ప్రశ్న 3.
మూలధన మార్కెట్ యొక్క సాధనాలను వివరించండి.
జవాబు:
మూలధన మార్కెట్ సాధనాలు:
1) రక్షిత ప్రీమియం నోట్లు: ప్రీమియంతో విమోచన చేయదగిన మరియు వేరుచేయగల వారెంటుతో 4 నుండి 7 సంవత్సరాల కాల వ్యవధిలో జారీ చేసిన డిబెంచర్లను రక్షిత ప్రీమియం నోట్లు అంటారు. వీటికి జత చేసిన వారంట్ల ఆధారముగా కలిగిన వారికి పూర్తిగా చెల్లించిన ఈక్విటీ వాటాలను పొందే హక్కు ఉంటుంది.
2) అధిక డిస్కౌంటు బాండ్లు: కాలవ్యవధి తరువాత సమాన విలువకు విమోచనము చేసే ఉద్దేశ్యముతో డిస్కౌంటుకు విక్రయించే బాండ్లను డిస్కౌంటు బాండ్లు అంటారు. జారీదారు దీర్ఘకాలిక నిధుల అవసరాలకు అనుగుణముగా వీటిని రూపొందిస్తారు. పెట్టుబడిదారులు వెంటనే రాబడి కోసం ఎదురు చూడకుండా 25-30 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత అమ్మడానికి కొనుగోలు చేస్తారు.
3) వేరుచేయగలిగిన వారెంట్లతో ఈక్విటీ వాటాలు: కంపెనీ జారీ చేసిన వారెంట్లలో పేర్కొన్న కాలము నిర్ణయించిన ధరవద్ద నిర్దేశించిన వాటాల సంఖ్యను వాటాదారుడు కొనుగోలు చేస్తాడు. ఈ వారంట్లు స్టాక్ ఎక్సేంజ్లో విడిగా నమోదై, విడిగా ట్రేడ్ అవుతాయి.
4) వడ్డీతో పూర్తిగా మారే డిబెంచర్లు: ఇవి నిర్దిష్టకాలము తర్వాత పూర్తిగా ఈక్విటీ వాటాలుగా మార్చబడతాయి. మార్పిడి అనేది ఒకటి లేదా అనేక దశలలో జరగవచ్చు. సాధనము ఒక పూర్తి ఋణ సాధనము అయినపుడు పెట్టుబడిదారులకు వడ్డీ చెల్లించబడుతుంది. అయితే మార్పిడి తర్వాత వడ్డీ చెల్లింపు కూడా మారుతుంది.
5) స్వెట్ ఈక్విటీ వాటాలు: ఉద్యోగులు లేదా డైరెక్టర్లు చేసిన పనికి గుర్తింపుగా సంస్థ వారికి జారీచేసే ఈక్విటీ వాటాలను స్వెట్ ఈక్విటీ వాటాలు అంటారు. సాధారణముగా కంపెనీ వాటాలను కొనుగోలు చేయడం ఉద్యోగులకు ఐచ్ఛికము, కాబట్టి స్వెట్ వాటాల వలన వారు జీతముతో పాటు యాజమాన్య లాభాలలో కూడా భాగం పంచుకుంటారు.
6) విపత్తు బాండ్లు: వీటినే ఉపద్రవ లేదా కాట్ బాండ్లు అంటారు. విపత్తు బాండు సాధారణముగా బీమా సౌకర్యం కలిగిన అధిక దిగుబడినిచ్చే ఋణ సాధనము మరియు విపత్తు సమయంలో డబ్బును సేకరించడానికి వీటిని జారీ చేస్తారు. జారీదారు (బీమా లేదా పునఃభీమా కంపెనీ) ముందుగా నిర్వచించబడిన విపత్తుల వలన ఏర్పడిన నష్టాలతో సతమవుతున్న ప్రత్యేక పరిస్థితులలో వడ్డీని చెల్లించి, తిరిగి చెల్లించవలసిన అసలును వాయిదా వేయడం లేదా పూర్తిగా వదిలి వేయడం జరుగుతుంది.
7) విదేశీ కరెన్సీ మారకపు బాండ్లు మారకపు బాండును డెట్ మరియు ఈక్విటీ సాధనాల సమ్మేళనముగా చెప్పవచ్చు. ఇది రెగ్యులర్ కూపను మరియు అసలు చెల్లింపుతో పాటు బాండు యొక్క ఈక్విటీ లక్షణం కారణముగా కంపెనీ స్టాక్ లో వచ్చే ధరల పెరుగుదల ప్రయోజనము కూడా పొందగలడు.
8) డెరివేటివ్స్: డెరివేటివ్ అనేది ఒక విత్త సాధనము. సాధారణముగా ఆస్తులైన కమాడిటీ, బాండ్, ఈక్విటీ, కరెన్సీ, ఇండెక్స్ మొదలైన వాటి లక్షణాలు మరియు విలువల మీద డెరివేటివ్ లక్షణాలు మరియు విలువలు ఆధారపడి ఉంటాయి.
ప్రశ్న 4.
ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్ల మధ్యగల తేడాలు ఏవి ?
జవాబు:
ప్రాథమిక మార్కెట్
- నూతనముగా ప్రారంభమైన కంపెనీ లేదా కొనసాగుతున్న కంపెనీ కొత్తగా సెక్యూరిటీలను పెట్టుబడిదారులకు అమ్మడం జరుగుతుంది.
- కంపెనీ పెట్టుబడిదారుకు నేరుగా లేదా మధ్య వర్తుల ద్వారా సెక్యూరిటీలను అమ్మడం జరుగుతుంది.
- నిధుల ప్రవాహము పొదుపు చేసే వారి నుండి పెట్టుబడిదారులకు బదిలీ ద్వారా ప్రాథమిక మార్కెట్ ప్రత్యక్షముగా మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది.
- ప్రాథమిక మార్కెట్ సెక్యూరిటీల కొనుగోలు మాత్రమే జరుగుతుంది. అమ్మకాలు సాధ్యము కాదు.
- కంపెనీ నిర్వాహకులచే సెక్యూరిటీల ధరలు నిర్ణయించబడతాయి.
- స్థిరమైన భౌగోళిక ప్రదేశము ఉండదు.
ద్వితీయ మార్కెట్
- ఇక్కడ అప్పటికీ జారీ చేసిన వాటాలలో ట్రేడింగ్ జరుగుతుంది.
- అప్పటికీ ఉన్న వాటాల యజమాన్యపు హక్కు పెట్టుబడిదారుల మధ్య బదిలీ అవుతుంది.
- వాటాలను నగదులోనికి మార్చుకునే వీలుండడం వలన ద్వితీయ మార్కెట్ పరోక్షముగా మూలధన నిర్మాణమును ప్రోత్సహిస్తుంది.
- స్టాక్ ఎక్సేంజ్లో సెక్యూరిటీల కొనుగోలు మరియు అమ్మకాలు జరుగుతాయి.
- సెక్యూరిటీల ధరలు వాటి డిమాండు మరియు సప్లయి ఆధారముగా నిర్ణయించబడతాయి. 6) నిశ్చయమైన ప్రదేశములో ద్వితీయ మార్కెట్ వ్యవహారాలు జరగుతాయి.
ప్రశ్న 5.
BSE మరియు NSE గురించి మీకు ఏమి తెలుసు ?
జవాబు:
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE): భారతదేశములో మొట్టమొదటి స్టాక్ ఎక్సేంజ్ నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ బొంబాయి నగరములో 1875వ సంవత్సరములో స్థాపించబడినది. కాలానుక్రమముగా ఈ సంస్థ బాంబే స్టాక్ ఎక్సేంజ్ గా రూపాంతరము చెందినది. ఇది ఆసియాలో మొదటి స్టాక్ ఎక్సేంజ్ మరియు భారతదేశములోనే లీడింగ్ ఎక్సేంజ్ గ్రూపులలో ఒకటి. గడచిన 140 సంవత్సరాల నుంచి మూలధన సమీకరణ చేస్తూ భారతీయ కార్పొరేటు రంగ అభివృద్ధికి సహకరిస్తుంది. ఇది సెక్యూరిటీల కాంట్రాక్టు (రెగ్యులేషన్) చట్టం 1956 కింద కేంద్ర ప్రభుత్వంచే 1956లో గుర్తించబడిన మొదటి స్టాక్ ఎక్సేంజ్. ఇది ఆసియాలో 4వ అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్ మరియు ప్రపంచములో 9వ అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్ కీర్తించబడినది. 5000లకు పైగా కంపెనీల నమోదు కలిగిన స్టాక్ ఎక్సేంజ్ ప్రపంచములో మొదటి స్థానం పొందినది.
జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (NSE): భారత స్టాక్ మార్కెట్లో అతి ముఖ్యమైన అభివృద్ధి జాతీయ స్టాక్ ఎక్సేంజ్ స్థాపనగా చెప్పవచ్చు. దీనిని నవంబరు 27, 1992న అధునాతన సాంకేతిక పరిజ్ఞానముతో స్థాపించబడి, ఏప్రిల్ 1993లో స్టాక్ ఎక్సేంజ్ గుర్తింపబడినది. 1994వ సంవత్సరములో తన కార్యకలాపాలను డెట్ రంగములో ప్రారంభించినది. తదుపరి నవంబరు 1994లో ఈక్విటీల కొరకు మూలధన రంగములోకి జూన్ 2000 సంవత్సరములో డెరివేటివ్స్ రంగములోనికి తన కార్యకలాపాలను విస్తరించినది. ఇది జాతీయ స్థాయిలో అధునాతన స్క్రీన్ ఆధారిత వర్తక విధానాన్ని నెలకొల్పినది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను పెట్టుబడిదారుల ముందరకు తీసుకొనిరాగలిగినది. భౌగోళిక ప్రాంతాలతో సంబంధము లేకుండా పాదర్శకతతో అందరికి సమానముగా అందుబాటులో ఉండే విధముగా జాతీయ స్క్రీన్ ఆటోమేటిక్ వర్తక విధానాన్ని జాతీయ స్టాక్ ఎక్సేంజ్ ఏర్పాటు చేసినది.
ప్రశ్న 6.
డిపాజిటరీ మరియు డిమెటీరియలైజేషన్ గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
డిపాజిటరీ: బ్యాంకు ఖాతాదారుల సొమ్మును సురక్షితముగా ఉంచినట్లే డిపాజిటరీ కూడా పెట్టుబడిదారుల తరపున సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపములో ఉంచుతుంది. డిపాజిటరీ వద్ద ఖాతాను ప్రారంభించి వాటాలన్నీ | డిపాజిట్ చేయబడతాయి. ఖాతాదారుని తరపున అతని సూచనలకు అనుగుణముగా వాటాలను కొనడం, అమ్మడం జరుగుతుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో నడపబడే ఎలక్ట్రానిక్ స్టోరేజ్ పద్ధతి. దీనిలో వాటా పత్రాలు, బదిలీలు మొదలైన వాటికి సంబంధించి ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు. పెట్టుబడిదారుల వ్యవహారాలన్నీ ఎక్కువ వేగము, సామర్థ్యముతో పరిష్కరించబడతాయి మరియు సెక్యూరిటీలన్నీ బుక్ ఎంట్రీ రూపములో నమోదు చేయబడతాయి.
డిమెటీరియలైజేషన్: వ్యవహారాలన్నీ కంప్యూటరీకరించుట వలన సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు ఎలక్ట్రానిక్ బుక్ ఎంట్రీ పద్ధతిలో పరిష్కారమవుతాయి. సెక్యూరిటీలు భౌతిక రూపములో ఉండి, పెట్టుబడిదారుకు ఎలక్ట్రానిక్ ఎంట్రీ లేదా నంబరు ఇవ్వడం వలన తన అకౌంటులో ఎలక్ట్రానిక్ నిల్వ కలిగి ఉండటం. ఎలక్ట్రానిక్ రూపములో సెక్యూరిటీలు కలిగి ఉండే విధానాన్ని డిమెటీరియలైజేషన్ అంటారు. దీని కొరకు పెట్టుబడిదారుడు సంస్థతో డిమాట్ అకౌంటు ప్రారంభించడాన్ని డిపాజిటరీ అంటారు. వాస్తవానికి ఇపుడు (IPOS) డిమెటీరియలైజేషన్ పద్ధతిలో జారీ చేయబడి 99 శాతం కంటే ఎక్కువ టర్నోవర్ డిమాట్ రూపములో పరిష్కరించడుతుంది. ట్రేడింగ్ 500 వాటాలకు మించితే పరిష్కార విధానము డిమాట్లో జరగాలని సెబీ తప్పనిసరి చేసింది. డిమాట్ రూపములో వాటాలు కలిగి ఉండటము బ్యాంకు ఖాతా వలె చాలా సౌకర్యవంతముగా ఉంటుంది. భౌతిక రూపములో ఉన్న వాటాలు ఎలక్ట్రానిక్ రూపములో లేదా ఎలక్ట్రానిక్ రూపములోఉన్న వాటాలను తిరిగి భౌతిక రూపములోనికి మార్చుకోవచ్చు. నగదువలె డిమెటీరియలైజేషన్ వాటాలను ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు బదిలీ చేస్తుంది. మరియు వాటాలకు సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకే ఖాతా ద్వారా పరిష్కరించుకోవచ్చు. డిమాట్ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీలను తాకట్టుపెట్టి ఋణాలు పొందవచ్చును. వాటా, సర్టిఫికేట్లు పాడైపోవుట, దొంగిలించబడటం లేదా ఫోర్జరీ అనే భయం ఉండదు. పెట్టుబడిదారుని ఖాతాలో సరైన సంఖ్యలో వాటాలను నమోదు చేయవలసిన బాధ్యత బ్రోకర్.
ప్రశ్న 7.
సూచీ అంటే ఏమిటి ? మన దేశములోని రెండు ప్రధాన సూచీలను వివరించండి.
జవాబు:
స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అనేది మార్కెట్ ప్రవర్తనకు భారమితి వంటిది. మార్కెట్ ప్రతినిధి అయిన స్టాక్ సమూహం ద్వారా మొత్తం మార్కెట్ సెంటిమెంట్ను కొలుస్తుంది. ఇది మార్కెట్ దిశను ప్రతిబింబించడముతో పాటు స్టాక్ ధరలలో రోజు రోజుకు వచ్చే హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ఆదర్శవంతమైన సూచీ సెక్యూరిటీల ధరలలో మార్పులకు ప్రాతినిథ్యం వహిస్తూ సాధారణ వాటాల ధరలలో వచ్చే మార్పులను ప్రతిబింబించే విధముగా ఉండాలి. మార్కెట్ సూచీ పెరిగితే మార్కెట్లో అనుకూల పరిస్థితులు ఉండటాన్ని, మార్కెట్ సూచీ తగ్గితే మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉండటాన్ని తెలుపుతుంది. భారతీయ మార్కెట్లో BSE -సెన్సెక్స్ మరియు NSE- నిఫ్టీ ముఖ్యమైన సూచీలు.
సెన్సెక్స్ (SENSEX): సెన్సెక్సున్న సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. సెన్సెక్స్ అనేది BSE యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్. BSE- సెన్సెక్స్ను BSE – 30 అని కూడా అంటారు. BSE భారతీయ సెకండరీ మార్కెట్ ప్రముఖ ఎక్సేంజ్ గా ఉండటం వలన, సెన్సెక్స్ భారతీయ స్టాక్ మార్కెట్కు ముఖ్య సూచికగా ఉన్నది. మార్కెట్ స్థితిగతులను తెలియజేయునపుడు దీనిని తరుచుగా ఉపయోగిస్తారు. 1986లో ప్రారంభించిన సెన్సెక్స్ మార్కెట్లో అత్యంత చురుకుగా | లావాదేవీలు జరిపే 30 స్టాక్స్లో రూపొందించబడినది. అవి ఆర్థిక వ్యవస్థలోని 13 రంగాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వాటికి సంబంధించిన పరిశ్రమలలో అగ్రగాములుగా ఉన్నాయి. ఈ సూచీ ప్రాతిపదిక సంవత్సరం 1978 కాగా, ఆధార సంవత్సరం విలువ 100తో ప్రారంభమైనది
నిఫ్టీ (NIFTY): జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీని నిఫ్టీ అంటారు. NSE లో నమోదైన వివిధ రంగాల స్టాక్ల పనితీరు ఆధారముగా దీనిని లెక్కిస్తారు. నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీని తెలుపుతుంది. 24 రంగాలకు చెందిన 50 ప్రముఖ కంపెనీల స్టాక్ సమూహాన్ని నిఫ్టీ కలిగిఉంటుంది. NSE అవలంభించే అనేక అంశాలపై ఆధారపడి నిఫ్టీలో ఉండే స్టాక్స్ వాటి కంపెనీల పనితీరునుబట్టి కాలానుగుణముగా మారుతూ ఉంటాయి.. 1995 – 96 సంవత్సరము ప్రాతిపదిక సంవత్సరముగా పరిగణిస్తూ 1000 ఆధార విలువతో సూచీ నిర్మించబడినది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
విత్త మార్కెట్.
జవాబు:
విత్త మార్కెట్ అనే పదానికి విస్తృతమైన అర్థము కలదు. ద్రవ్యత్వ ఆస్తులైన వాటాలు, బాండ్లు, కరెన్సీ నోట్లు మరియు డెరివేటివ్స్ వర్తకము కొరకు కొనుగోలుదారులు మరియు అమ్మకపుదారులు పాల్గొనే ఏ మార్కెట్ స్థలమైన అది విత్త మార్కెట్ అంటారు.
ప్రశ్న 2.
విత్త మార్కెట్ వర్గీకరణ.
జవాబు:
విత్త మార్కెట్ల వర్గీకరణ వాటిలో నిర్వహింపబడే లావాదేవీల కాలపరిమితిని బట్టి ఉంటుంది. ఒక సంవత్సరములోపు కాలపరిమితిగల కార్యకలాపాలు ద్రవ్య మార్కెట్లోను, దీర్ఘకాల పరిమితి కార్యకలాపాలు మూలధన మార్కెట్లో నిర్వహించబడతాయి. మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ అని, ద్వితీయ మార్కెట్ అని వర్గీకరించవచ్చును.
ప్రశ్న 3.
ద్రవ్య మార్కెట్.
జవాబు:
ఒక సంవత్సరములోపు కాలపరిమితి గల స్వల్పకాలిక నిధులు ద్రవ్యత్వ ఆస్తులతో వ్యవహారాలు జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. ఈ ఆస్తులు ద్రవ్యానికి సమీప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. తాత్కాలిక ద్రవ్య అవసరాలకు, బాధ్యతలకు స్వల్పకాలిక నిధులను ఈ మార్కెట్ సమకూరుస్తుంది.
ప్రశ్న 4.
మూలధన మార్కెట్.
జవాబు:
మూలధన మార్కెట్ అనే పదము దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు మరియు సదుపాయాలు తెలుపుతుంది. దీనిలో డెట్ మరియు ఈక్విటీ దీర్ఘకాలిక నిధులు సమకూర్చబడి పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. దీనిలో ప్రజల నుంచి వివిధ మార్గాలలో సేకరించి, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టుటకు అందుబాటులో ఉంటాయి.
ప్రశ్న 5.
ప్రాథమిక మార్కెట్..
జవాబు:
ప్రాథమిక మార్కెట్ను నూతన జారీల మార్కెట్ అని కూడా అంటారు. మొదటిసారి జారీ చేసే సెక్యూరిటీలతో పనిచేస్తుంది. పెట్టుబడి నిధులు పొదుపుచేసే వారి నుంచి వ్యవస్థాపకులకు బదిలీ చేయడానికి సహకరించడం ప్రాథమిక మార్కెట్ యొక్క ప్రధాన విధి. ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు, ఋణాలు మరియు డిపాజిట్ల రూపములో ప్రాథమిక మార్కెట్లో కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకుంటాయి.
ప్రశ్న 6.
ద్వితీయ మార్కెట్.
జవాబు:
ద్వితీయ మార్కెట్ను స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్సేంజ్ అని కూడా అంటారు. లోగడ జారీ అయిన సెక్యూరిటీ ల కొనుగోలు మరియు అమ్మకాలకు ఈ మార్కెట్ వీలు కల్పిస్తుంది. ఇది ప్రస్తుత సెక్యూరిటీలకు ద్రవ్యత్వాన్ని మరియు మార్కెట్ అవకాశాన్ని కల్పిస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ మరియు తిరిగి పెట్టుబడి ద్వారా ఉత్పాదక పెట్టుబడులకు నిధులు మళ్ళిస్తూ ఆర్థికాభివృద్ధికి ఈ మార్కెట్ తోడ్పడుతుంది.
ప్రశ్న 7.
ట్రెజరీ బిల్.
జవాబు:
సాధారణముగా కేంద్ర ప్రభుత్వము సంవత్సరంలోపు కాలపరిమితిగల స్వల్పకాలిక ఋణం పొందడానికి ట్రెజరీ | బిల్ ఒక సాధనముగా ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక అవసరాలకు నిధులు పోందడానికి భారత ప్రభుత్వం తరపున భారత రిజర్వు బ్యాంకు ‘జీరో కూపన్ బాండ్ల’ పేరుతో వీటిని జారీ చేస్తుంది.
ప్రశ్న 8.
వాణిజ్య పత్రాలు.
జవాబు:
నిర్ణీత కాలపరిమితికి జారీచేసి, తిరిగి విమోచనము చేయు సెక్యూరిటీ లేని ప్రామిసరీ నోటు, అన్యాక్రాంత మరియు బదిలీ యోగ్యత గల పత్రాన్ని వాణిజ్య పత్రము అంటారు. భారీ మరియు పరపతి గల కంపెనీలు మార్కెట్ రేటు కంటే తక్కువ వడ్డీకి స్వల్పకాలిక నిధులు పెంచుకునేందుకు దీనిని జారీ చేస్తాయి.
ప్రశ్న 9.
డిపాజిట్ల సర్టిఫికేట్.
జవాబు:
సెక్యూరిటీ ఆధారము లేని, బదిలీ యోగ్యత గల స్వల్ప కాలిక సాధనాలు అయిన డిపాజిట్ సర్టిఫికేట్లను వాణిజ్య బ్యాంకులు మరియు అభివృద్ధి చెందిన ద్రవ్య సహాయ సంస్థలు జారీ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల వృద్ధి తక్కువగా ఉండి, పరపతి అవసరాలు ఎక్కువగా ఉండి, ద్రవ్యత్వము లోపించిన అవసరమైన సంస్థలకు ఈ సర్టిఫికేట్లు జారీ చేయబడతాయి.
ప్రశ్న 10.
OTCEI.
జవాబు:
ఇది కంపెనీ చట్టం 1956 క్రింద నమోదైన కంపెనీ. చిన్న మరియు మధ్య తరహా కంపెనీల మూలధన మార్కెట్లో ప్రవేశించి ఫైనాన్స్ సమకూర్చుకోవడానికి ఇది స్థాపింబడినది. ఇది మూలధన మార్కెట్లో పెట్టుబడి కొరకు ఒక అనుకూలమైన పారదర్శక మరియు సమర్థవంతమైన విధానాన్ని పెట్టుబడిదారులకు కల్పిస్తుంది. 1992లో ట్రేడింగ్ ప్రారంభించి పూర్తి కంప్యూటీకరణ, పారదర్శకత మరియు సింగిల్ విండో ఎక్సేంజ్ సౌకర్యం కలదు.
ప్రశ్న 11.
డిమెటీరియలైజేషన్.
జవాబు:
ప్రస్తుతము సెక్యూరిటీల ట్రేడింగ్ అంతా కంప్యూటర్ టెర్మినల్స్ ద్వారా జరుగుతుంది. వ్యవహారాలన్నీ కంప్యూటరీకరించుట వలన సెక్యూరిటీల కొనుగోలు అమ్మకాలు ఎలక్ట్రానిక్ బుక్ ఎంట్రీ పద్దతిన పరిష్కారమవుతున్నాయి. ఈ పద్ధతిలో సెక్యూరిటీలు భౌతిక రూపములో ఉండటం వలన పెట్టుబడిదారులకు ఎలక్ట్రానిక్ ఎంట్రీ లేదా నంబరు ఇవ్వడం వలన తన అకౌంటులో ఎలక్ట్రానిక్ నిల్వ కలిగి ఉంటారు. ఎలక్ట్రానిక్ రూపములో సెక్యూరిటీలు కలిగిఉండే విధానాన్ని డిమెటీరియలైజేషన్ అంటారు.
ప్రశ్న 12.
డిపాజిటరీ.
జవాబు:
డిపాజిటరీ పెట్టుబడిదారుల తరపున సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపములో ఉంచుతుంది. డిపాజిటరీ వద్ద ఖాతాను ప్రారంభించి వాటాలన్నీ డిపాజిట్ చేయబడతాయి. ఖాతాదారుని తరపున అతని సూచనలకు అనుగుణంగా వాటాలను కొనడం, అమ్మడం జరిగినది. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో నడపబడే ఎలక్ట్రానిక్ స్టోరేజి పద్ధతి.
ప్రశ్న 13.
సెన్సెక్స్ (SENSEX).
జవాబు:
సెన్సెక్స్: సెన్సెక్స్ను సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. దీనిని BSE – 30 అని కూడా అంటారు. BSE భారతీయ సెకండరీ మార్కెట్ యొక్క ప్రముఖ ఎక్సేంజ్ ఉన్నందు వలన, సెన్సెక్స్ భారతీయ స్టాక్ మార్కెట్కు ముఖ్య సూచికగా ఉన్నది. మార్కెట్ స్థితిగతులను తెలియజేయునపుడు దీనిని తరుచుగా ఉపయోగిస్తారు.
ప్రశ్న 14.
నిఫ్టీ (NIFTY).
జవాబు: నిఫ్టీ: జాతీయ స్టాక్ ఎక్సేంజ్ని నిఫ్టీ అంటారు. NSE లో నమోదైన వివిధ రంగాల స్టాక్ ల పనితీరు ఆధారముగా దీనిని లెక్కిస్తారు. నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీని తెలుపుతుంది. 24 రంగాలకు చెందిన 50 ప్రముఖ కంపెనీల స్టాక్ సమూహాన్ని నిఫ్టీ కలిగి ఉంటుంది.