Andhra Pradesh BIEAP AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం Textbook Questions and Answers.
AP Inter 1st Year Economics Study Material 1st Lesson పరిచయం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సంపద నిర్వచనం గురించి చర్చించండి.
జవాబు:
అర్థశాస్త్రానికి సంపద నిర్వచనాన్ని ఆడమస్మిత్ అనే ఆర్థికవేత్త తెలియజేసారు. ఆడమ్స్మత్ను అర్థశాస్త్ర ” పితామహుడుగా చెప్పవచ్చు. ఇతని ఉద్దేశ్యంలో అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రం. ఆడమస్మిత్ తన ప్రఖ్యాతి పొందిన “రాజ్యాల సంపద” అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని “రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన” అని నిర్వచించాడు. ఆడమస్మిత్ ఉద్దేశ్యంలో మానవుని ప్రధాన కార్యకలాపము సంపదను ఆర్జించడం. అతని అనుచరులయిన జె.బి. సే, జె. యస్, సాజ్ మొదలగువారు సంపద నిర్వచనాన్ని సమర్థించారు.
సంపద నిర్వచనములోని ప్రధానాంశాలు:
ఆడమస్మిత్ సంపద నిర్వచనంలోని ప్రధానాంశాలు క్రింది విధంగా పేర్కొన్నారు.
- మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్యోద్దేశం సంపదను ఆర్జించడం.
- సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు.
- మానవుని స్వార్థపరమైన ఆలోచన సంపదను ఎక్కువగా ఆర్జించడం.
విమర్శ: అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రమనే సంకుచిత భావన వల్ల ఈ నిర్వచనం విమర్శలకు గురి అయింది.
1) కార్లెల్, రస్కిన్ అర్థశాస్త్రం నిర్వరహన్ని విమర్శించాడు. వారి ఉద్దేశ్యంలో ఈ నిర్వచనం సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలిగాని, ఆర్థిక మానవుని గురించికాదు అని విమర్శించారు. దానివల్ల వారు దీనిని “దయనీయమైన” శాస్త్రంగా వర్ణించారు.
2) ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినాడు. కాని సంపద అనేది కేవలం మానవుని కోరికను తీర్చే ఒక సాధనం మాత్రమేనని మార్షల్ విమర్శించాడు.
3) కేవలం భౌతిక వస్తువులను మాత్రమే ఆడమ్స్మిత్ సంపదగా పరిగణించారు. అభౌతిక కార్యకలాపాలైన ఉపాధ్యాయుల, వైద్యుల సేవలను పరిగణనలోనికి తీసుకోలేదు. అందువల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమై పోతుంది.
4) సంపద నిర్వచనం కేవలం ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తోంది. పంపిణీని నిర్లక్ష్యం చేస్తుంది.
5) స్వార్థాన్ని పెంచును: సంపద నిర్వచనంలో సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మానవుడు స్వార్థపరుడు, కనుక స్వప్రయోజనం కోసం పనిచేస్తాడు. స్మిత్ దృష్టిలో స్వప్రయోజనానికి, సామాజిక ప్రయోజనానికి తేడా లేదు. ఈ నిర్వచనం వల్ల ఆర్థిక వ్యక్తి ఏర్పడతాడు. ఈ ఆర్థిక వ్యక్తి పూర్తిగా స్వార్థపూరితమైనవాడు.
6) ధన దేవత ఉద్భోద (Gosfel of Mammon): ఈ నిర్వచనం సంపద సృష్టికి ప్రాధాన్యతనిస్తుంది. అందువల్ల దీనిని థామస్, కార్లెల్ “ధన దేవత”గా పేర్కొన్నారు.
7) లోపభూయిష్టమైనది: వాల్రాస్ కూడా సంపద నిర్వచనాన్ని పరిశీలించి అది లోపభూయిష్టమైనదని, అశాస్త్రీయమైనదని, అసంపూర్ణమైనదని పేర్కొనెను.
8) సంకుచితమైనది ఆడమస్మిత్ తన నిర్వచనంలో సంపదకు ప్రాధాన్యత ఇచ్చాడు. కాని సంపద మానవుని కోర్కెలను సంతృప్తిపరచటానికి ఒక సాధనంగా ఉండాలి. అనగా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి కాని, సంపదకు కాదు. ఈ విషయంలో సంపద నిర్వచనం అర్థశాస్త్రాన్ని సంకుచిత దృష్టిలో వివరించింది.
ఇన్ని లోపాలున్న కారణంగానే ఎక్కువమంది ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని తిరస్కరించారు.
ప్రశ్న 2.
సంక్షేమం నిర్వచనం గురించి వివరించండి.
జవాబు:
మార్షల్ అర్థశాస్త్రాన్ని “మానవుడు అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రంగా” నిర్వచించారు. ఆయన నిర్వచనంలో మానవుడికి ప్రథమ స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చారు. మార్షల్ ఉద్దేశ్యం ప్రకారం “దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం. శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం
ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ, మరొకవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.” మార్షల్ అనుచరులైన ఏ.సి. పిగూ, ఎడ్విన్ కానస్ వంటి వారు మార్షల్ నిర్వచనాన్ని సమర్థించారు.
ముఖ్య లక్షణాలు:
- సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యకలాపాలను గురించి మాత్రమే మార్షల్ నిర్వచనం పరిగణిస్తోంది.
- మానవునికి, మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు.
- ఇది కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుంది. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన విషయాలతో దీనికి సంబంధం లేదు.
- మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో వ్యక్తి, సమాజం ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.
విమర్శ: మార్షల్ నిర్వచనం కూడా అనేక విమర్శలకు గురైంది. ముఖ్యంగా రాబిన్స్, మార్షల్ యొక్క “శ్రేయస్సు” అనే భావనను విమర్శించాడు.
- అర్థశాస్త్రం సామాజిక శాస్త్రంగాని, మానవశాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలిక సూత్రాలు మానవులందరికి వర్తిస్తాయి. అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవ శాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు.
- మార్షల్ వస్తువులను భౌతిక మరియు అభౌతికమైనవిగా విభజించడం జరిగింది. కాని, తన నిర్వచనంలో అభౌతిక వస్తువులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
- శ్రేయస్సును కొలవవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించారు. శ్రేయస్సు అనేది వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది.
- మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలను మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషంలాంటివి కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విస్మరించాడు.
ప్రశ్న 3.
సంక్షేమ నిర్వచనం కంటే రాబిన్స్ నిర్వచనం ఏ విధంగా మెరుగైనది ?
జవాబు:
శ్రేయస్సు నిర్వచనం: ఆడమస్మిత్ నిర్వచనంలోని లోపాలను మార్షల్ సరిదిద్దడానికి ప్రయత్నించాడు. మానవుడికి సంపదను ఆర్జించటమే అంతిమ ధ్యేయం కాదని, ఒక లక్ష్యాన్ని సాధించడానికి సంపద ఒక సాధనం మాత్రమేనని అన్నాడు. ఆ ఉద్దేశ్యంతో మార్షల్ మానవునికి ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇచ్చాడు. మార్షల్ ప్రకారం అర్థశాస్త్రం అనగా ఒకవైపు సంపద గురించిన చర్చ అని అంతకంటే ముఖ్యంగా మరొకవైపు మానవుని గురించిన పరిశీలనలో ఒక భాగం. అర్థశాస్త్రాన్ని మానవుని శ్రేయస్సుపై దృష్టిని కేంద్రీకరించే శాస్త్రంగా నిర్వచించెను. మార్షల్ పాటు పిగూ, ఎడ్విన్ కానన్, బెవరిడ్జి మొదలైనవారు కూడా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అర్థశాస్త్రాన్ని నిర్వచించారు.
శ్రేయస్సు నిర్వచనంలోని లోపాలు:
- అర్థశాస్త్రం సాధారణ మానవుని దైనందిన కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
- సంఘటిత సమాజంలోని మానవుని ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుంది.
- శ్రేయస్సుకు ప్రథమ స్థానం, సంపదకు ద్వితీయ స్థానం ఇవ్వటం జరిగింది. సంపద మానవ శ్రేయస్సుకు సాధనం మాత్రమే.
- భౌతిక వస్తువుల ఆర్జన వినియోగాలను మాత్రమే అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఆర్థికేతర కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేయదు.
కొరత నిర్వచనం: మార్షల్ నిర్వచనాన్ని విమర్శించి రాబిన్స్ అర్థశాస్త్రానికి విశ్లేషణాత్మక నిర్వచనాన్ని ఇచ్చారు. ‘యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్’ అనే గ్రంథంలో రాబిన్స్ తన నిర్వచనాన్ని తెలియజేసెను. మానవుని అపరిమితమైన కోరికలను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం” అని నిర్వచించెను. ఈ నిర్వచనంలో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని నిత్య సత్యాలు ఉన్నాయి.
1) అపరిమిత కోరికలు: మానవుని కోరికలు అపరిమితం. ఒక కోరిక తీరగానే మరొక కోరిక ఉద్భవిస్తుంది. వాటిని తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం కృషి జరపటం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు కొనసాగుతాయి.
2) వనరులు పరిమితం: మానవుని కోర్కెలు సంతృప్తిపరిచే సాధనాలు లేదా వనరులు పరిమితమైనవి. సాధనాలు పరిమితంగా ఉండటం వల్ల కొరత మరియు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
3) ప్రత్యామ్నాయ ప్రయోజనాలు: వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వాటికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. అనగా ఒక సాధనానికి అనేక ఉపయోగాలు ఉంటాయి.
4) ఎంపిక: సాధనాల కొరత, అపరిమితమైన కోరికల వల్ల ఎంపిక అంశం అతి ముఖ్యమైనదిగా ఉంటుంది. సాధనాల కేటాయింపులోను, కోరికల ప్రాధాన్యతను అనుసరించి సంతృప్తిపరిచే విషయంలోను ఎంపిక సమస్య ఉత్పన్నమవుతుంది.
రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే శాస్త్రీయమైనది:
1) కార్యకలాపాలను విభజించలేదు మార్షల్ అర్థశాస్త్రంలో భౌతిక అంశాలను గూర్చి మాత్రమే వివరించాడు. కాని రాబిన్స్ భౌతిక, అభౌతిక అంశాలను రెండింటిని గూర్చి అర్థశాస్త్రంలో చర్చించాడు.
2) శ్రేయస్సును విమర్శించుట మార్షల్ శ్రేయస్సు అనే పదానికి, అర్థశాస్త్రానికి ముడిపెట్టాడు. కాని రాబిన్స్ ప్రకారం, అర్థశాస్త్రానికి శ్రేయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదు. కారణం అర్థశాస్త్రంలో శ్రేయస్సుకు దోహదపడని వస్తువులు ఉదాహరణకి మత్తు పానీయాలు, సిగరెట్లు, విషం మొదలగు వాటిని గూర్చి కూడా చర్చిస్తాం.
3) లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండుట: రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనే నిర్ణయాలను చేయదు. అందువల్ల ఇది వాస్తవిక శాస్త్రం.
4) శాస్త్రీయమైనది: రాబిన్స్ నిర్వచనం వల్ల ఆర్థిక సమస్య ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి వీలైనది. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని శాస్త్రీయ స్థాయికి చేర్చి, ఎంపిక శాస్త్రంగా మలిచాడు.
5) పరిధిని విస్తృతపరిచింది: ఈ నిర్వచనం అన్ని రకాల ఆర్థిక వ్యవస్థలకు వర్తిస్తుంది. “వనరుల కొరత” అనేది ఒక సార్వత్రిక సమస్య. కనుక ఈ నిర్వచనం వల్ల అర్థశాస్త్ర పరిధి కూడా విస్తరించింది.
రాబిన్స్ నిర్వచనం మార్షల్ నిర్వచనం కంటే మెరుగైనప్పటికి కొన్ని విమర్శలకు గురైనది.
విమర్శ:
1) ఈ నిర్వచనం కొరతగా ఉన్న వనరులను ఉపయోగించి గరిష్ట స్థాయిలో కోరికలను ఏ విధంగా సంతృప్తి పరుచుకోవాలో అనే విషయం మీద దృష్టి సారించలేదు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్వచనంలో శ్రేయస్సు అనే భావన అంతర్గతంగా ఇమిడి ఉంది.
2) రాబిన్స్ నిర్వచనానికి మరొక విమర్శ, ఇది మారుతున్న సమాజానికి వర్తించదు. కాలం మారుతున్న కొద్ది అనేక మార్పులు వస్తాయి. కాబట్టి వనరుల కొరత అనే సమస్యను అధిగమించవచ్చు.
3) ఆధునిక అర్థశాస్త్రంలో చాలా ముఖ్యమైన జాతీయ ఆదాయం, ఉద్యోగిత వంటి స్థూల ఆర్థిక విశ్లేషణను రాబిన్స్ నిర్వచనం విస్మరించింది.
4) ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి ఆధునిక అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యాంశాలను కొరత నిర్వచనంలో చర్చించలేదు.
5) శ్రీమతి జాన్ రాబిన్సన్ ఈ నిర్వచనాన్ని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించని వనరులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్య సమస్య వనరుల కొరత మాత్రమే కాదని, ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేదే ముఖ్యమని ఆమె అభిప్రాయము.
ప్రశ్న 4.
ఆచార్య సామ్యూల్సన్ వృద్ధి నిర్వచనాన్ని తెలియజేయండి.
జవాబు:
రాబిన్స్, నిర్వచనంలో నిశ్చల దృక్పధం ఉన్నదని, కాలానుగుణంగా కోరికలు, లక్ష్యాలు, వనరులు, ఎంపికలు మారుతూ ఉంటాయని సామ్యూల్సన్ అభిప్రాయం. అందువల్ల రాబిన్స్ నిర్వచనంలో ఇమిడి ఉన్న నిశ్చలత్వాన్ని తొలగించి చలనత్వాన్ని కల్పిస్తూ సామ్యూల్సన్ కొత్త నిర్వచనం ఇచ్చాడు.
నిర్వచనం: “ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమితమైన ఉత్పాదక వనరులను ప్రజలు, సమాజం ద్రవ్యంతోగాని, ద్రవ్యం లేకుండాగాని ఎంపిక చేసుకొని ఉపయోగించుకోవడం ద్వారా వస్తూత్పత్తి చేపట్టి దానిని సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య వర్తమాన లేదా భవిష్యత్కాలంలో ఏ విధంగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందనే విషయ పరిశీలనే అర్థశాస్త్రము.”
నిర్వచనంలోని ముఖ్యాంశాలు:
1) వనరుల కొరత: రాబిన్స్ నిర్వచనంలో వలెనే సామ్యూల్సన్ కూడా వనరుల కొరత, అపరిమితమైన కోరికలు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు అనే వాటినే బలపరచాడు.
2) ఆర్థిక వృద్ధి: సామ్యూల్సన్ తన నిర్వచనంలో ఆర్థికవృద్ధికి ప్రాధాన్యతయిచ్చాడు. కాలానుగుణంగా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం, వస్తువులను వర్తమాన, భవిష్యత్కాలంలో పంపిణీ చేయడం అనే పదాలు కాల ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. ఆర్థిక వృద్ధి ప్రాముఖ్యాన్ని తెలియజేసే ప్రస్తుత వినియోగము, భవిష్యత్ వినియోగము కూడా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
3) చలన స్వభావం: సామ్యూల్సన్ నిర్వచనం చలనత్వం కలిగి ఉండటమే కాక విస్తృత పరిధి కలిగి ఉంది. ఎంపిక సమస్య ద్రవ్య ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా వస్తుమార్పిడి సమస్యలో కూడా ఉంది.
4) ఎంపిక సమస్య: ఎంపిక సమస్య సామ్యూల్సన్ చలన దృష్టిలో పరిగణిస్తాడు. ఎంపిక వర్తమానానికే కాకుండా భవిష్యత్కాలానికి కూడా సంబంధించినది. మానవుని కోరికలు స్థిరంగా ఉండవు. అవి కాలంతోపాటు పెరుగుతూ, మారుతూ ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా వనరులను పెంచాలి, మార్పులను తీసుకొని రావాలి. కనుక అర్థశాస్త్రానికి చలనత్వ స్వభావం ఉంటుంది.
కనుక ఈ నిర్వచనం అధిక ప్రజాదరణ పొందింది. మిగిలిన నిర్వచనాల కంటే ఈ నిర్వచనం సమగ్రమైనది. 5. ‘సూక్ష్మ’, ‘స్థూల’ అర్థశాస్త్రాల మధ్య తేడాలను తెలియజేయండి.
జవాబు: ఆర్థిక సమస్యల విశ్లేషణకు ఆధునిక ఆర్థికవేత్తలు రెండు మార్గాలను అవలంబించారు. అవి:
- సూక్ష్మ అర్థశాస్త్రం
- స్థూల అర్థశాస్త్రం
రాగ్నార్ష్ మొదటిసారిగా 1933లో సూక్ష్మ, స్థూల అనే పదాలను అర్థశాస్త్రములో ప్రవేశపెట్టారు.
1. సూక్ష్మ అర్థశాస్త్రం: సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలోని చిన్న చిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఇవి జాతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్న చిన్న భాగాలు లేదా వైయుక్తిక యూనిట్లు మాత్రమే. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో, ఒక సంస్థ గరిష్ట లాభాలను ఏ విధంగా పొందుతుందో సూక్ష్మ అర్థశాస్త్రము మనకు తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రము పరిశీలిస్తుంది. అందువలననే దీనిని ధరల సిద్ధాంతము అని కూడా పిలుస్తారు.
2. స్థూల అర్థశాస్త్రం: స్థూల అర్థశాస్త్రం అనేది ‘Macros’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ‘Macros’ అంటే పెద్ద అని అర్థం. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. జాతీయాదాయం, మొత్తం వినియోగం, మొత్తం పొదుపు, మొత్తం ఉద్యోగిత మొదలైన సమిష్టి అంశాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది..
J.M. కీన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించారు. ఆర్థికమాంద్యం కాలంలో ఆయన రాసిన | పుస్తకం ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం ప్రచురణ తరువాత స్థూల ఆర్థిక సిద్ధాంతానికి ఎక్కువ ప్రాచుర్యం లభించింది.
స్థూల అర్థశాస్త్రాన్ని “ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం” అని కూడా అంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితా సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకొని వివరిస్తుంది.
సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాల మధ్య తేడాలు:
సూక్ష్మ అర్థశాస్త్రం
- సూక్ష్మ అర్థశాస్త్రం అనేది Micros అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. Micro అనగా చిన్న అని అర్థం.
- ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత భాగాలను గురించి అధ్యయనం చేస్తుంది.
- దీనిని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు.
- వస్తు, కారకాల మార్కెట్ ధర నిర్ణయం గురించి వివరిస్తుంది.
- డిమాండ్, సప్లయ్పై ఆధారపడి ధరల యంత్రాంగం ఉంటుంది.
స్థూల అర్థశాస్త్రం
- స్థూల అర్థశాస్త్రం అనేది Macros అనే గ్రీకు పదం నుంచి జనించింది. Macro అనగా పెద్ద అని అర్థం.
- ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది.
- ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.
- జాతీయాదాయం, సమిష్టి ఉద్యోగిత, సమిష్టి పొదుపు, పెట్టుబడి సాధారణ ధరలస్థాయి, ఆర్థికాభివృద్ధి మొదలైన అంశాలను చర్చిస్తుంది.
- సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లయ్ ప్రాతిపదికగా ఉంటుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
జవాబు:
మానవుని కోర్కెలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు. వస్తువులు ప్రాథమికంగా రెండు రకములు. అవి: 1) ఉచిత వస్తువులు 2) ఆర్థిక వస్తువులు
1. ఉచిత వస్తువులు: డిమాండ్ కంటే సప్లై శాశ్వతంగా ఎక్కువగా ఉండి, ధరలేని వస్తువులను ఉచిత వస్తువులంటారు. ఇవి మానవ నిర్మితాలు కాదు, ప్రకృతి ప్రసాదించినవి. వీటికి ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది. ఉదా: గాలి, నీరు.
2. ఆర్థిక వస్తువులు: డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులు అంటారు. ఇవి మానవ నిర్మితాలు. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువలు ఉంటాయి.
ఉదా: ఆహారము, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. ఇవి ఉచితంగా అనుభవించడానికి వీలుండదు.
1. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలు.
ఉచిత వస్తువులు
- ఇవి ప్రకృతి బహుకరించినవి.
- వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది.
- వీటికి ధర ఉండదు.
- వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు.
- ఉపయోగిత విలువ ఉంటుంది.
- ఇవి జాతీయాదాయంలో చేర్చబడవు.
ఆర్థిక వస్తువులు
- ఇవి మానవుడిచే తయారుచేయబడినవి..
- డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంటుంది.
- వీటికి ధర ఉంటుంది.
- వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.
- ఉపయోగిత విలువ, వినిమయ విలువ రెండూ ఉంటాయి.
- ఇవి జాతీయాదాయంలో చేర్చబడతాయి.
ప్రశ్న 2.
కోరికల లక్షణాలు. [Mar. ’17, ‚ ’16, ’15]
జవాబు:
మానవుని కోరికలు, ఆర్థిక కార్యకలాపాలు పురోగతికి దోహదం చేస్తాయి. కోరికలు లేనిదే వినియోగం ఉండదు. ఉత్పత్తి ఉండదు, పంపిణి ఉండదు, వినిమయం ఉండదు..
కోరికలు లక్షణాలు:
1. కోరికలు అనంతాలు: మానవుల కోరికలకు ఒక పరిమితి అంటూ ఉండదు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇవి వ్యక్తులనుబట్టి, కాలాన్నిబట్టి, నివసించే ప్రదేశాన్నిబట్టి మారుతూ ఉంటాయి.
2. ఒక కోరికను పూర్తిగా తృప్తిపరచగలగటం: మానవుడు తన కోరికలన్నింటిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యం కానప్పటికీ, ఒక కోరికను పూర్తిగా తృప్తి పరచటం సాధ్యమవుతుంది.
ఉదా: ఆకలిగా ఉన్న వ్యక్తి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆకలిని పూర్తిగా తీర్చుకోవచ్చు. అదే విధంగా ఒక కారును కొనుగోలు చేయడం ద్వారా, కారు కావాలనే కోరికను సంతృప్తిపరచవచ్చు.
3. కోరికలు పరస్పరం పోటీపడడం: కోరికలు అపరిమితంగా ఉంటాయి. కాని వాటిని తీర్చుకొనే సాధనాలు మాత్రం పరిమితంగా ఉంటాయి. అందువల్ల కోరికలను సంతృప్తిపరచుకునే ప్రాధాన్యత క్రియవలె అది పరస్పరం పోటీపడతాయి.
4. కోరికలు – పూరకాలు: ఒక కోరికను సంతృప్తిపరచుకోవడానికి అనేక వస్తువులు అవసరమవుతాయి. ఉదా: ఏదైనా మనం రాయాలి అనుకున్నప్పుడు పెన్ను, కాగితం, ఇంకు ఉన్నప్పుడే ఆ కోరిక తీరుతుంది.
5. ప్రత్యామ్నాయాలైన కోరికలు: ఒక కోరికను అనేక రకాలుగా తృప్తిపరచుకోవచ్చు.
ఉదా: ఆకలిగా ఉన్నప్పుడు భోజనం లేదా బ్రెడ్ లేదా పాలు, పండ్లు తీసుకోవడం ద్వారా ఈ కోరికను తృప్తిపరచుకోవచ్చు.
6. పునరావృత్తం: అనేక కోరికలు, ఒక సమయంలో వాటిని తృప్తిపరచినప్పుడు మళ్ళీ, మళ్ళీ పుట్టుకొస్తాయి. సాధారణంగా ఇవి కనీస అవసరాలైనా ఆహారం, నిద్ర మొదలైన కోరికల విషయంలో గమనించవచ్చు.
7. కోరికలు అలవాటుగా మారడం: ఒక కోరికను క్రమం తప్పకుండా సంతృప్తిపరచినప్పుడు అది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటును మార్చుకోవడం తొందరగా సాధ్యం కాదు.
8. కోరికల ప్రాముఖ్యంలో తేడా: అన్ని కోరికల తీవ్రత ఒకే విధంగా ఉండదు. కొన్ని కోరికలను వాటి ప్రాముఖ్యతను బట్టి వెంటనే తీర్చుకోవాలని ఉంటుంది. మరికొన్నింటిని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న 3.
ప్రయోజన రకాలు [Mar. ’15]
జవాబు:
మానవుల కోరికలను సంతృప్తిపరచగలిగే వస్తుసేవల శక్తిని ప్రయోజనం అంటారు. అర్థశాస్త్రంలో ప్రయోజనం అనే భావనకు చాలా ప్రాధాన్యత ఉంది.
ప్రయోజనం – రకాలు:
1. రూప ప్రయోజనం: ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవి మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దానిని రూప ప్రయోజనం అంటారు.
2. స్థల ప్రయోజనం: స్థలాన్ని మార్చడం ద్వారా కొన్ని వస్తువులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మార్చడం వల్ల ఆ వస్తువుకు స్థల ప్రయోజనం చేకూరుతుంది. ఉదా: సముద్రతీరంలో ఇసుకకు ప్రయోజనం ఉండదు. దీనిని బయటకు తీసి మార్కెట్లకు రవాణా చేయడం వల్ల స్థల ప్రయోజనం చేకూరుతుంది.
3. కాల ప్రయోజనం: కాలాన్ని బట్టి కూడా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఉదా: పంట చేతికి వచ్చిన కాలంలో ఆహార ధాన్యాలు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. వ్యాపారస్తులు వీటిని నిలువచేసి, కొంతకాలం తరువాత ఈ వస్తువులను మార్కెట్లలో అమ్ముతారు. ఈ విధంగా వస్తువులను నిలవ చేయడం ద్వారా వ్యాపారస్తులు పొందే అదనపు ప్రయోజనాన్నే కాల ప్రయోజనంగా చెప్పవచ్చు.
4. సేవల ప్రయోజనం: సేవకు కూడా మానవుని కోరికలను తీర్చగలిగే శక్తి ఉంటుంది.
ఉదా: టీచర్లు, లాయర్లు, డాక్టర్లు సేవలు మొదలైన సేవలు కూడా మానవులు కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలుగుతారు. అందువల్ల వీటిని సేవ ప్రయోజనాలుగా చెప్పవచ్చు.
ప్రశ్న 4.
జేకబ్ వైనర్ నిర్వచనం [Mar. ’17, ’16]
జవాబు:
అవసరాల ప్రాముఖ్యాన్ని లేదా ఆర్థిక కార్యకలాపాల ప్రాముఖ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తులుగాని, సంస్థలుగాని, ప్రభుత్వన్యాయంగాని, ఆర్థిక వ్యవస్థగాని కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులను పొదుపు లేదా ఆదా చేయటం ద్వారా అపరిమితమైన కోర్కెలను సంతృప్తిపరచటానికి ఎట్లా ఉపయోగించాలి అనేదే ఆర్థిక సమస్య. ఆర్థికవేత్తలు లేవనెత్తిన ప్రశ్నలను, వివిధ అంశాలను విశ్లేషణ చేయటం ద్వారా అర్థశాస్త్రాన్ని మెరుగైన విధంగా అధ్యయనం చేయటానికి వీలుంటుందని వీరి అభిప్రాయం. ఈ అభిప్రాయాలను సమర్థిస్తూ జేకబ్ వైనర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. జేకబ్ వైనర్ ఉద్దేశ్యం ప్రకారం “ఆర్థికవేత్తలు ప్రతిపాదించేది అర్థశాస్త్రం”.
లక్షణాలు ఏవైనా వివిధ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థికవేత్తలు కొన్ని మౌలికమైన సమస్యలను గురించి ఆందోళన కలిగి ఉంటారు.
- ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ?
- వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి ?
- వస్తుసేవలను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ?
- ఉత్పాదక వనరులను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి ?
- అందుబాటులో ఉన్న వనరులన్ని ఉపయోగించబడుతున్నాయా ?
- ఒక కాలవ్యవధిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందా లేదా స్థిరంగా ఉందా ?
ప్రశ్న 5.
వివిధ ఆర్థిక విచారణలను గురించి వివరించండి.
జవాబు:
ఆర్థిక సూత్రాలు, సిద్ధాంతాలు రూపొందించడంలో ఒక నిర్థిష్టమైన పద్ధతి అవలంబించబడుతుంది. పీటర్సన్ అభిప్రాయంలో “ఆర్థిక సూత్రాలను నిర్మించడంలో పరిశీలించడంలో ఉపయోగించే పద్ధతులు, మౌలికాల ప్రక్రియను పద్ధతి (Method) అని అంటారు. ఆర్థిక సంబంధమైన విచారణ చేయడానికి ఆర్థికవేత్తలు సాధారణంగా రెండు రకాలైన పద్ధతులను అవలంబిస్తారు.
- నిగమన పద్ధతి
- ఆగమన పద్ధతి
1. నిగమన పద్ధతి: సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారు. దీనిని ‘పరికల్పన’ | (Hypothetical) లేదా అనిర్థిష్టక (Abstract) పద్ధతి అని కూడా అంటారు. ఇది వాస్తవాలపై కాకుండా ఒక మానసిక అభ్యాసం, తర్కం మీద ఆధారపడి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి కొన్ని నిర్థిష్టమైన ప్రమాణాలు అంగీకరించబడ్డ సూత్రాలు లేదా వాస్తవాల నుంచి తర్కం ద్వారా ఆర్థిక సిద్ధాంతాలను రూపొందించడం జరుగుతుంది. ఇందులో సాధారణ విషయాల నుంచి ఒక నిర్ధిష్ట విషయాన్ని రాబట్టడం జరుగుతుంది.
ఉదా: హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి సాధారణంగా తక్కువ ధర గల వస్తువుని కొంటాడు. ఎక్కువ ధరగల వస్తువును విక్రయిస్తాడు. అయితే మార్కెట్ను గురించి సరైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. నిగమన పద్ధతిలో నిర్ణయాలు చేసేటప్పుడు నాలుగు దశలు ఉంటాయి.
- ఒక సమస్యను ఎన్నుకోవడం
- ప్రమేయాలను రూపొందించడం
- ఒక పరికల్పనను రూపొందించడం (Hypothesis)
- పరికల్పన ప్రతిపాదనను పరిశీలించడం
క్షీణోపాంత ప్రయోజన సూత్రం నిగమన పద్ధతికి ఒక ఉదాహరణ.
2. ఆగమన పద్ధతి: దీనిని చారిత్రక లేదా గుణాత్మక లేదా అనుభవిక, వాస్తవ, నిర్థిష్ట పద్ధతి అని పిలుస్తారు. జర్మనీ ఆర్థికవేత్తలు దీనిని అభివృద్ధి పరిచారు. ఇది ఒక నిర్దిష్ట లేదా ప్రత్యేక అంశం నుంచి విశ్వజనీనతకు పయనిస్తుంది. ” ఇందులో వాస్తవాల వివరాల సేకరణ చేసి సమకూర్చి నేల నిర్ణయాలు చేయబడతాయి. ఉదా: మార్థస్ సిద్ధాంతం.
ఈ పద్ధతిలో నాలుగు దశలు ఉంటాయి.
- సమస్యను ఎన్నుకోవడం
- దత్తాంశాన్ని సేకరించడం
- పరిశీలించడం
- సాధారణీకరించటం
విషయాలను ఉన్నవి ఉన్నట్టుగానే వివరించడం వల్ల ఈ పద్ధతి దిగా భావించబడుతుంది.
ప్రశ్న 6.
స్థూల అర్థశాస్త్రానికి అర్థాన్ని తెలిపి, దాని పరిధి, ప్రాధాన్యతను వివరించండి ?
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రమని రెండు విధాలుగా రాగ్నా 1933 సం॥లో విభజించారు. అప్పటి నుండి ఈ విభజన ప్రచారంలోకి వచ్చింది.
స్థూల అర్థశాస్త్రం వైయుక్తిక యూనిట్లను కాకుండా మొత్తం లేదా సమిష్టి యూనిట్లను మొత్తంగా పరిశీలిస్తుంది. యూనిట్ల మొత్తాన్ని స్పష్టంగా నిర్వచించి వాటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను పరిశీలించడం ఈ విశ్లేషణ ముఖ్యోద్దేశము. గార్డెనర్ ఆక్లే ప్రకారం స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మొత్తం ఉత్పత్తి వనరుల నియామకం, జాతీయాదాయ పరిమాణం, సాధారణ ధరల స్థాయి మొదలైన వాటిని పరిశీలిస్తుంది. స్థూల అర్థశాస్త్రాన్ని ” ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతము” అని కూడా ఆన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
స్థూల అర్థశాస్త్ర పరిధి:
స్థూల అర్థశాస్త్రం – ప్రాధాన్యత:
- ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల పరిశీలనకు తోడ్పడుతుంది. ఆర్థిక సమస్యలకు మూలకారణాలను కనుగొని, వాటి పరిష్కారానికి మార్గాలను సూచిస్తుంది.
- జాతీయోత్పత్తి స్థాయి, దాని కూర్పులను గురించి తెలుపుతుంది. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు మొదలైన వాటిని విశ్లేషిస్తుంది.
- ఆర్థికవ్యవస్థ వృద్ధి, స్థిరత్వాల చర్చలకు తోడ్పడుతుంది. వ్యాపార చక్రాల విశ్లేషణకు సహకరిస్తుంది.
- పేదరికం, నిరుద్యోగితలకు కారణాలను కనుగొని వాటి పరిష్కారానికి తోడ్పడే ఆర్థికాభివృద్ధి విధానాల రూపకల్పనలో సహాయపడుతుంది.
- ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.
- ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణాలను స్పష్ట పరచటానికి సహాయపడుతుంది. అంతర్జాతీయ, జాతీయ సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది.
- ఆర్థిక విధానాల కల్పనకు, ఆచరణకు ఉపయోగపడుతుంది.
ప్రశ్న 7.
సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి ? దాని పరిధి, ప్రాధాన్యాన్ని వివరించండి.
జవాబు:
అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రమని, స్థూల అర్థశాస్త్రమని 1933 సం॥లో రాగ్నార్ ఫ్రిష్ ప్రతిపాదించెను. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘Micros’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘Micro’ అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోనికి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలోని చిన్నచిన్న భాగాలను గూర్చి అధ్యయనం చేస్తుంది. వైయుక్తిక యూనిట్లను గూర్చి వివరంగా పరిశీలిస్తుంది. ఒక వినియోగదారుడు తన ప్రయోజనాన్ని ఏ విధంగా గరిష్టం చేసుకుంటాడో ? ఒక సంస్థ గరిష్ట లాభాలు ఏ విధంగా పొందుతుందో ? సూక్ష్మ అర్థశాస్త్రం తెలుపుతుంది. వస్తువుల ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అందువలనే దీనిని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.
పరిధి: వైయుక్తిక యూనిట్ల పరిశీలనయే సూక్ష్మ అర్థశాస్త్రం. “సంపూర్ణ ఉద్యోగిత” అనే ప్రమేయముపై సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ జరుగుతుంది. ఇది వినియోగదారులను ఉత్పత్తిదారులను విడివిడిగా వారి ప్రవర్తనను విశ్లేషించును. సూక్ష్మ అర్థశాస్త్రం ముఖ్యంగా ఏమిటి ? ఎలా ? ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ? అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. వస్తువుల మార్కెట్లలో ధర నిర్ణయం, కారకాల మార్కెట్లో ధర నిర్ణయం అధ్యయనం చేస్తుంది. ఈ క్రింది చార్టు సూక్ష్మ అర్థశాస్త్ర పరిధిని వివరిస్తుంది.
సూక్ష్మ అర్థశాస్త్ర పరిధి:
ప్రాధాన్యత:
- స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అపరిమిత సంఖ్యలో ఉన్న వినియోగదారులు, ఉత్పత్తిదారులు మధ్య వనరులు అభిలషణీయంగా ఏ విధంగా కేటాయింపులు జరుగుతాయో సూక్ష్మ అర్థశాస్త్రం వివరిస్తుంది.
- ఇది వ్యక్తుల, సంస్థల సమతౌల్యాన్ని వివరిస్తుంది.
- ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనలో ఉపకరిస్తుంది. ఉదాహరణకు ఏకస్వామ్యాల నియంత్రణ, పరిశ్రమల సబ్సిడీ మొదలైనవి.
- ఆర్థిక మంత్రికి పన్ను భారంను ఏ విధంగా వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు అమ్మకందారులకు పంపిణీ చేయాలో వివరిస్తుంది.
- ఉత్పత్తి వ్యయాలు, డిమాండ్ను అంచనా వేయడం వంటి వ్యాపార సంబంధ విషయాలను అధ్యయనం చేస్తుంది.
- పరిమిత సాధనాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి సహకరిస్తుంది.
- ఇది స్థూల అర్థశాస్త్రానికి ప్రతిపాదిక.
ప్రశ్న 8.
చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఈ ప్రవాహం ఆది, అంతములేని చక్రంలాగా ఉంటుంది. చక్రం ఏ విధంగా భ్రమణం చెందుతుందో అదే విధంగా ఆదాయం కూడా భ్రమణం చెందుతుంది. చక్రీయ ఆదాయ ప్రవాహ (Circular flow of Income) స్వరూపాన్ని క్రింది పటం సహాయంతో అవగాహన చేసుకోవచ్చు.
ద్రవ్యరూపంలో ఆదాయం (వేతనాలు, భాటకం, వడ్డీ, లాభాలు)
పైన చూపిన పటం ప్రకారం ఉత్పత్తి కారకాల మార్కెట్కు, వస్తుసేవల మార్కెట్కు మధ్య సన్నిహిత సంబంధమున్నట్లుగా అర్థమవుతుంది. కుటుంబాలు ఉత్పత్తి కారకాలను, మార్కెట్లో విక్రయిస్తాయి. వ్యాపార సంస్థలు ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేస్తాయి. అందువల్ల ఉత్పత్తి కారకాలను ప్రతిఫలాలను వ్యాపార సంస్థలు ద్రవ్యరూపంలో చెల్లిస్తాయి. అనగా ఆదాయం వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు ప్రవహిస్తుంది. వ్యాపార సంస్థలు వినియోగ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ వస్తువులను కుటుంబాలు కొనుగోలు చేస్తాయి. ఈ కారణంగా కుటుంబాలు వ్యాపార సంస్థలకు ద్రవ్యరూపంలో చెల్లింపులు చేస్తాయి. అంటే ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనినే చక్రీయ ఆదాయ ప్రవాహం అంటారు.
ప్రశ్న 9.
వినియోగ, ఉత్పాదక వస్తువుల మధ్య ఉన్న తేడాను వివరించండి.
జవాబు:
మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే ఏ పదార్థాన్నైనా అర్థశాస్త్రంలో “వస్తువు” అంటారు.
వస్తువులను రెండు రకాలుగా విభజిస్తారు. 1) ఉచిత వస్తువులు, 2) ఆర్థిక వస్తువులు.
ఆర్థిక వస్తువులను తిరిగి వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులని విభజిస్తారు.
1. వినియోగ వస్తువులు: మానవ కోరికలను ప్రత్యక్షంగా సంతృప్తిపరచే వస్తువులను వినియోగ వస్తువులంటారు. వీటినే ప్రథమశ్రేణి వస్తువులని కూడా అంటారు. వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది. ఉదా: ఆహారం, వస్త్రాలు, నివసించే ఇల్లు మొదలైనవి. వినియోగ వస్తువులను రెండు రకములుగా విభజించవచ్చును. అవి,
- ఒకసారి ఉపయోగంతో నశించేవి
- కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి.
i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: మనం తినే ఆహారం, త్రాగునీరు లేదా పానీయాలు ఒకసారి ఉపయోగంతోనే వాటి నుండి పొందే ప్రయోజనం నశిస్తుంది. సేవలన్నీ ఒకసారి ఉపయోగంతో ప్రయోజనాన్ని కోల్పోతాయి. ఉదా: విత్తనాలు, ముడిపదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.
ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: ఒకసారితోనే ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండి, వాటిని వినియోగించే వారికి ప్రయోజనాన్ని కలుగజేస్తాయి. ఈ వస్తువులు కొంత కాలంపాటు మన్నికను కలిగి ఉండి వినియోగదారులకు ప్రయోజనాన్ని ఇస్తాయి. వీటిని మన్నికగల వినియోగ వస్తువులంటారు. ఉదా: బల్ల, కుర్చీ, పుస్తకము, టీ.వి. మొదలైనవి.
2. ఉత్పాదక వస్తువులు: వీటినే మూలధన వస్తువులు అని కూడా అంటారు. అనగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని, ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో, అటువంటి వస్తువులను ఉత్పాదక లేదా మూలధన వస్తువులంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరుస్తాయి. వీటినే ద్వితీయ శ్రేణి వస్తువులంటారు. వీటికి ఉత్పన్న లేదా పరోక్ష డిమాండ్ ఉంటుంది. ఇవి రెండు రకములు.
- ఒకసారి ఉపయోగంతో నశించేవి
- కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి
i) ఒకసారి ఉపయోగంతో నశించేవి: ఒకసారి వినియోగించగానే వాటి ప్రయోజనం నశిస్తుంది.
ఉదా: విత్తనాలు, ముడి పదార్థాలు, బొగ్గు, విద్యుత్ మొదలగునవి.
ii) కొంత కాలంపాటు ఉపయోగంలో ఉండేవి: కొన్ని వస్తువులు కొంత కాలం పాటు వినియోగంలో ఉంటాయి. అనగా కొంతకాలంపాటు ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాయి. వీటిని మన్నిక గల ఉత్పాదక వస్తువులు అంటారు. ఉదా: యంత్రాలు, ట్రాక్టర్, కర్మాగార భవనాలు మొదలగునవి.
వినియోగ వస్తువులకు, ఉత్పాదక వస్తువులకు మధ్యగల భేదములు:
వినియోగ వస్తువులు
- ఇవి ప్రత్యక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
- వీటికి ప్రత్యక్ష డిమాండ్ ఉంటుంది.
- ఇవి ప్రథమశ్రేణి వస్తువులు.
- ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనవు.
- వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్నివ్వవు.
ఉత్పాదక వస్తువులు
- ఇవి పరోక్షంగా మానవ కోరికలను సంతృప్తిపరచును.
- వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది.
- ఇవి ద్వితీయ శ్రేణి వస్తువులు.
- ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి.
- వస్తువులను కలిగిన యజమానులకు ఆదాయాన్ని చేకూర్చి పెడతాయి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆర్థిక వస్తువులు [Mar. ’15]
జవాబు:
డిమాండ్ కంటే సప్లై తక్కువగా అనగా కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను ఆర్థిక వస్తువులంటారు. ఉదా: ఆహారం, వస్త్రాలు, యంత్రాలు మొదలైనవి. అవకాశం ఉంటే వీటిని వ్యక్తులు ఎక్కువగా కావాలనుకుంటారు. వీటికి ఉపయోగిత విలువ, వినిమయ విలువ ఉంటాయి. ఇది మానవ నిర్మితాలు. కనుక వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది.
ప్రశ్న 2.
ఉత్పాదక వస్తువులు
జవాబు:
ఉత్పాదక వస్తువులనే మూలధన వస్తువులు అని కూడా అంటారు. ఇవి ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో అటువంటి వస్తువులను ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అంటారు. ఇవి పరోక్షంగా మానవుని కోరికలను సంతృప్తిపరచును. వీటిని ద్వితీయ శ్రేణి వస్తువులంటారు.
వీటికి పరోక్ష లేదా ఉత్పన్న డిమాండ్ ఉంటుంది. ఇవి ఒకసారి ఉపయోగంలో నశించేవి, కొంతకాలంపాటు వినియోగంలో ఉండేవి అని రెండు రకములు. ఉదా: యంత్ర పరికరాలు, కర్మాగార భవనాలు మొదలైనవి.
ప్రశ్న 3.
మధ్యంతర వస్తువులు [Mar. ’17]
జవాబు:
పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువుల ముడిసరుకులను, అంతిమ వినియోగ వస్తువులకు మధ్యలో వివిధ దశలలో ఉన్న వస్తువులను మధ్యంతర వస్తువులు అంటారు. అంతిమ వినియోగానికి కాకుండా ఇతర వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో, ఎక్కడో ఒకచోట ఉపయోగించే వస్తువులు మాధ్యమిక వస్తువులు. ఉదా: సిమెంటు, ఇటుకలు, స్టీలు మొదలైనవి నిర్మాణ రంగంలో మధ్యంతర వస్తువులు.
ప్రశ్న 4.
సంపద [Mar. ’16]
జవాబు:
సాధారణ పరిభాషలో సంపద అనగా కేవలం ప్రజల వద్దనున్న ద్రవ్యం. కాని అర్థశాస్త్రంలో సంపద అనగా ద్రవ్యము మాత్రమే కాకుండా ప్రయోజనం, కొరత బదిలీ చేయటానికి అవకాశం ఉండటము అనే లక్షణాలుగల ఏ వస్తువులైనా సంపదగా పరిగణిస్తారు. ఉదా: భూములు, భవనాలు మొదలైనవి.
ప్రశ్న 5.
ఆదాయం
జవాబు:
ఆదాయానికి మూలం సంపద. ఆదాయం ఒక ప్రవాహం వంటిది. ఆదాయం ఒకసారి వ్యాపార సంస్థల నుండి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల రూపంలో కుటుంబాలకు, మరొకసారి కుటుంబాల నుండి వస్తు సేవలపై వ్యయ రూపంలో వ్యాపార సంస్థలకు ప్రవహిస్తుంది. దీనిని చక్రరూప ఆదాయ ప్రవాహం అంటారు.
ప్రశ్న 6.
ప్రయోజనం [Mar. ’16]
జవాబు:
వస్తుసేవలకుండే మానవ కోరికలను సంతృప్తిపరచగలిగే శక్తిని అర్థశాస్త్రంలో ప్రయోజనం అంటారు. వస్తువు అన్ని యూనిట్ల నుండి పొందే ప్రయోజనం మొత్తాన్ని మొత్తం ప్రయోజనమని, వస్తువు అదనపు యూనిట్ వలన మొత్తం ప్రయోజనానికి కలుపబడే లేదా తీసివేయబడే ప్రయోజనమును ఉపాంత ప్రయోజనమని అంటారు. ఈ భావన అర్థశాస్త్రంలో చాలా ప్రధానమైనది.
ప్రశ్న 7.
వినిమయ విలువ
జవాబు:
ఒక వస్తువును వినిమయం చేసినప్పుడు దాని బదులుగా పొందగలిగే ఇతర వస్తువులను లేదా సాధారణ ద్రవ్యాన్ని వినిమయ విలువ అని అంటారు. ఉచిత వస్తువులకు మారకం విలువ ఉండదు లేదా తక్కువగా ఉంటుంది. కొన్ని రకాల వస్తువులకు మారకం విలువ అధికంగా ఉంటుంది.
ప్రశ్న 8.
ధర
జవాబు:
ఒక వస్తువు విలువను ద్రవ్య రూపంలో చెప్పినట్లయితే దానిని ధర అంటారు.
ఉదా: ‘X’ వస్తువు 10/- వినిమయం చెందుతుంది.
ప్రశ్న 9.
ఎంపిక సమస్య
జవాబు:
సాధనాల కొరత వల్ల మానవుడు అపరిమితమైన కోరికలలో వేటిని సంతృప్తిపరుచుకోవాలి, సాధనాలను ఎట్లా కేటాయించుకోవాలి అని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఎంపిక సమస్యను అతి ముఖ్యమైన అర్థశాస్త్ర సమస్యగా రాబిన్స్ వివరించాడు.
ప్రశ్న 10.
ఆర్థిక కార్యకలాపాలు
జవాబు:
ఆదాయ ఆర్జన, వ్యయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు.
ప్రశ్న 11.
సూక్ష్మ అర్థశాస్త్రం
జవాబు:
సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వైయుక్తిక ఆర్థిక యూనిట్ను పరిగణనలోకి తీసుకొని దాని ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం గురించి వివరిస్తుంది, కాబట్టి దీనిని ధరల సిద్ధాంతం అంటారు.
ప్రశ్న 12.
స్థూల అర్థశాస్త్రం
జవాబు:
స్థూల అర్థశాస్త్రం అనేది మాక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలను అంటే మొత్తం ఉద్యోగిత, మొత్తం ఆదాయం మొదలగు వాటిని గూర్చి అధ్యయనం చేస్తుంది. అందుచే స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు.
ప్రశ్న 13.
నిశ్చల ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఒకే సమయంలో లేదా ఒకే కాలానికి సంబంధించిన విలువలను తెలియజేసే రెండు చలాంకాల మధ్య ఉన్న ప్రమేయ సంబంధాన్ని నిర్ధారించడానికి చేసే విశ్లేషణ. ఉదా: సంపూర్ణ పోటీలోని సమతౌల్య ధర నిర్ణయం.
ప్రశ్న 14.
చలన ఆర్థిక విశ్లేషణ
జవాబు:
ఆర్థిక చలనత్వం వేరువేరు సమయాలకు చెందిన విలువలను తెలియజేసే సంబంధిత చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.
ప్రశ్న 15.
నిగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ ద్వారా సార్వజనీనమైన ఫలితాలను వ్యక్తిగత అంశాలకు వర్తింపచేయడం.
ఉదా: క్షీణోపాంత ప్రయోజన సూత్రం.
ప్రశ్న 16.
ఆగమన పద్ధతి
జవాబు:
తార్కిక విశ్లేషణ చేయడం ద్వారా ప్రత్యేక అంశాల పరిశీలన వల్ల వచ్చిన ఫలితాలు మొత్తం అంశాలకు వర్తింప చేయడం. ఉదా: క్షీణ ప్రతిఫల సూత్రం.