Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర అంటే ఏమిటి? Textbook Questions and Answers.
AP Inter 1st Year History Study Material 1st Lesson చరిత్ర అంటే ఏమిటి?
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న1.
చరిత్ర రచనా శాస్త్రానికి హెరొడోటస్ చేసిన సేవలు తెలపండి.
జవాబు:
చరిత్ర పితామహుడైన హెరొడోటస్ (క్రీ.శ. 484-430) “గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలను తెలిపేదే చరిత్ర” అని పేర్కొన్నాడు.
హెరొడోటస్ ప్రకారం చరిత్ర శాస్త్రీయమైంది, హేతుబద్ధమైంది, మానవీయమైంది. ఇతడు రచించిన ‘హిస్టోరియా’ అనే గ్రంథం ప్రసిద్ధ పారశీక యుద్ధాన్ని (క్రీ.పూ. 490 నుంచి 480) సవివరంగా వివరించింది. ఈ గ్రంథం తొలి క్రమబద్ధమైన రచన.
నిర్దిష్టమైన ఆధారాలను పరిశీలించి ఒక క్రమపద్ధతిలో రచించినదే చరిత్ర. వివిధ కాలాలు, పరిస్థితుల్లో మానవుల ‘చర్యలను గురించి తెలుపుతున్నందువల్ల ఇది మానవీయ శాస్త్రం. కారణాలను విశ్లేషించి తర్కించి వివేచనతో రచింపబడుతుంది. కాబట్టి చరిత్ర హేతుబద్ధ శాస్త్రం అని హెరొడోటస్ తెలిపాడు.
ఈ విధంగా చరిత్ర హెరొడోటస్ ప్రకారం మానవుని చర్యలు, వాటి వెనుక ఉన్న ఆలోచనలను తెలుపుతుంది. చరిత్ర అనేది కేవలం పేర్లు, తేదీల విషయాలను తెలిపేది మాత్రమే కాదు. సొంతంగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకొనేందుకు రాచబాటవంటిది.
ప్రశ్న 2.
చరిత్ర గురించి కారల్ మార్క్స్ అభిప్రాయాలు తెలపండి.
జవాబు:
“కోరికలు, ఆశలు నెరవేర్చుకొనే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర” అని కారల్ మార్క్స్ (1818-1883) పేర్కొన్నాడు. మానవులు, సమూహాలు తమ అవసరాలు తీర్చుకొని సంతృప్తి పొందేందుకు చేసే కార్యక్రమాలే చరిత్రలో ఉంటాయని పేర్కొన్నాడు. చరిత్ర గొప్ప సంఘర్షణ, వర్గపోరాటం అని మార్క్స్ భావన. అంటే, ఉత్పత్తి సాధనాలను స్వాధీనంలో ఉంచుకొన్న పెట్టుబడిదారీ వర్గానికి, తమ శ్రమను అమ్ముకొని జీవించే శ్రామిక వర్గానికి మధ్య సంఘర్షణగా పేర్కొన్నాడు. ఉనికిలో ఉన్న అన్ని సమాజాల చరిత్ర మొత్తం వర్గపోరాటాలతో కూడినదే ! అన్నది మార్క్స్ వాదన.
వర్గ పోరాటమే చరిత్ర ఇతివృత్తమనీ, దానినే గతితర్కం అని కారల్ మార్క్స్ అభిప్రాయం. చరిత్ర గతిలో ఆయన ఆర్థికాంశాల ప్రాధాన్యతను ఎక్కువ ప్రస్తావించెను. ‘హెగెల్’ తత్వవేత్త ప్రతిపాదించిన ‘యోజన’, ప్రతియోజన, సంయోజన అనే సూత్రాన్ని చరిత్రకు అనువర్తింపచేసి, సామాజిక శాస్త్రాల రచన- అధ్యయనాలకు పనికొచ్చే విలువైన సూత్రాలను నిగమనం చేసినది కారల్ మార్క్స్. చరిత్రను అధ్యయనం చేసి పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుడుతుందనీ, సమాజంలో వర్గాలున్నంత కాలం, ఘర్షణ కొనసాగుతుందనీ, వర్గ పోరాటమే చరిత్ర ఇతివృత్తమనీ సామాజిక పరిణామ క్రమంలో వర్గరహిత సమాజమే చివర దశ అని మార్క్స్ అభిప్రాయపడెను.
ప్రశ్న 3.
చరిత్ర పరిధి గురించి రాయండి.
జవాబు:
చరిత్ర పరిధి ఏది, ఎంత ? అనే ప్రశ్నకు సమాధానంగా ఏం జరిగింది ? ఎట్లా జరిగింది ? ఎందుకు జరిగింది ? అనే ఈ మూడు ప్రశ్నలే చరిత్ర పరిధిని నిర్వచిస్తాయి మరియు నిర్ణయిస్తాయి. ఒకప్పుడు రాజులు, రాణులు, మంత్రులు, యుద్ధాలు మాత్రమే చరిత్రలో ముఖ్యాంశాలుగా ఉండేవి. వారికి సంబంధించిన అంశాలే చరిత్రకు ఇతివృత్తాలు అయినాయి. నేడు “మానవుడే” అన్ని అధ్యయనాంశాలకు కేంద్రం. మానవుని కార్యకలాపాలు, ఆలోచనలు, అభిరుచులు, వ్యాపకాలు మొదలగు అంశాలు పెరిగిన కొద్ది చరిత్ర పరిధి విస్తరించును. నేడు చరిత్ర మానవ నాగరికత పరిణామంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు అయిన సమాజ నిర్మాణం, రాజ్య నిర్మాణం అనే అంశాలను అధ్యయనం చేస్తుంది. ఫలితంగా చరిత్ర యొక్క పరిధి విస్తృతమైంది.
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించేందుకే చరిత్ర పరిమితమై ఉండేది. అయితే నేడు కాలం, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మానవుని కార్యక్రమాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర పరిధి విస్తృతమైంది. మానవ ఆవిర్భావం నుంచి నేటిదాకా దీని పరిధి విస్తరించి ఉంది. చరిత్ర గతకాలంలో ప్రారంభించి, వర్తమానాన్ని తయారుచేసి, భవిష్యత్తుకు మార్గ నిర్దేశకత్వం చేస్తుంది. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్య పతనాలు, చక్రవర్తుల అదృష్ట, దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామం, సామాన్యుల జీవితాలు, చరిత్రకు ప్రధాన విషయాలు. అన్ని లక్షణాలు కలిగిన సమగ్ర శాస్త్రమే చరిత్ర. అన్ని విజ్ఞాన శాస్త్రాలు, పాఠ్యాంశాలను కలుపుకొని ఉన్న చరిత్ర పరిధికి హద్దులు నిర్దేశించలేము.
ప్రశ్న 4.
చరిత్రకు ఇతర సాంఘిక శాస్త్రాలతోగల సంబంధాలు తెలపండి.
జవాబు:
చరిత్రకు ఇతర సామాజిక శాస్త్రాలతో దగ్గర సంబంధం కలదు.
1) చరిత్ర సమాజ విజ్ఞానశాస్త్రం: చరిత్రకు, సమాజ విజ్ఞాన శాస్త్రం (సోషియాలజీ)నకు మధ్య సంబంధం కలదు. ముఖ్యముగా కుటుంబం, తెగ, జాతి, ఆచార వ్యవహారాలు, సమాజం, మతం మొదలగు అంశాలపై ఇరు శాస్త్రాలు ఆధారపడి ఉన్నాయి.
2) చరిత్ర – రాజనీతిశాస్త్రం: చరిత్ర రాజనీతి శాస్త్రాల మధ్య కూడా సంబంధం కలదు. రాజ్య నిర్మాణం, రాజ్య స్వరూపంలో పరిణామం, రాజ్యంలోని ఇతర ముఖ్యాంశాలు, వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి ఇరు శాస్త్రాలు ఒకదానిపై, మరొకటి ఆధారపడి ఉన్నాయి.
3) చరిత్ర – అర్థశాస్త్రం: చరిత్రకు అర్థశాస్త్రానికి కూడా అనేక విషయాలలో సంబంధం కలదు. ముఖ్యముగా ఆర్థిక వ్యవస్థ ప్రారంభం, పరిణామం, వివిధ రూపాలు, వాటి పని, తీరుతెన్నులు, సూత్రాలు, వాటివల్ల ప్రయోజనాలు మొదలైన అంశాలపై ఇరుశాస్త్రాలు ఒకదాని నుండి మరొకటి ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉంటాయి.
4) చరిత్ర ఇతర సామాజిక శాస్త్రాలు: చరిత్రకు మరికొన్ని ఇతర శాస్త్రాలైన ప్రభుత్వపాలనా శాస్త్రం, సాహిత్యం, పురావస్తు శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం (సైకాలజీ) మరియు మానవ శాస్త్రం (ఆంథ్రోపాలజీ) మొదలగు వాటితో సంబంధం కలదు.
ముగింపు: మానవ జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మూలాధారాలు చరిత్ర నుండే లభించును. ప్రతి శాస్త్రానికి అధ్యయనాంశానికి చారిత్రక నేపథ్యం పొందుపరచటం ఒక శాస్త్రీయమైన పద్ధతి అయింది. వివిధ అధ్యయనాంశాలకు చరిత్ర ఆధారాలు మరియు సమాచారం ఇస్తుంది. అటులనే వాటి నుండి తిరిగి తీసుకుంటుంది. అందువలన చరిత్రకు, ఇతర సామాజిక శాస్త్రాలకు అవినాభావ సంబంధం కలదు.
ప్రశ్న 5.
చరిత్ర రచనా శాస్త్రానికి ఇబన్ ఖల్టూన్ చేసిన సేవలు తెలపండి.
జవాబు:
మధ్య ప్రాచ్యంలో ఇస్లాం మత ఆవిర్భావంతో చరిత్ర రచనలో మార్పులు చోటుచేసుకొన్నాయి. చరిత్రపట్ల ఆసక్తిగల అరబ్బులు మత ప్రేరణతో చరిత్ర రచనలో ధోరణులు, పోకడలను అనుసరించారు. అటువంటి చరిత్రకారుల్లో చరిత్రను సంస్కృతీ శాస్త్రంగా తీర్చిదిద్దిన ఇబన్ ఖల్టూన్ ప్రముఖుడు.
చరిత్ర అనేది గత సంఘటనలను, వాటి వెనక ఉన్న కోణాలను తార్కికంగా వివరించేది అయినా ప్రాచీన భారతీయులు చరిత్రపట్ల ఎక్కువ ఆసక్తిని కనబరచలేదు. అయినా గాథలు, పురాణాలు, సంప్రదాయాలు, ఇతిహాసాలు వంటి సాహిత్య రచనల్లో కొంతమేరకు చరిత్ర దాగి ఉంది. సన్యాసుల, ప్రబోధకుల, మత బోధకుల జీవితాలవంటి పాక్షిక చరిత్ర రచనలు ఉన్నాయి. అందుకు అశ్వఘోషుడు రచించిన ‘బుద్ధ చరిత్ర’, బాణుడి ‘హర్ష చరిత్ర’ బిల్హణుడి ‘విక్రమాంక దేవ చరిత్ర’ వంటివి ఉదాహరణలు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, 1306వ సం॥లో రచించిన ‘ప్రబంధ చింతామణి’లు ప్రాచీన భారతదేశంలోని చారిత్రక రచనలు.
ప్రశ్న 6.
చరిత్ర విజ్ఞానశాస్త్రమా ? మానవశాస్త్రమా ?
జవాబు:
చరిత్ర అనేది విజ్ఞానశాస్త్రమా, మానవశాస్త్రమా లేదా కళ అనేది చర్చనీయాంశం. విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా రూపొందిన చరిత్రకు శాస్త్ర విజ్ఞాన హోదా లభిస్తుందని రాంకీ పేర్కొన్నాడు. ఖచ్చితంగా జరిగిన విషయాలను చెప్పడమే చరిత్రకారుని ప్రథమ ధర్మం అన్నాడు. రాంకేను అనుసరించిన జె.బి. బ్యురి చరిత్రను ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నాడు.
విజ్ఞాన శాస్త్రం: విజ్ఞాన శాస్త్రం ప్రయోగాలతో కూడుకొని ఫలితాలు పునరావృతమవుతాయి. జరగబోయేది శాస్త్ర విజ్ఞానంలో ముందే ఊహించవచ్చు అదే ప్రయోగాలను శాస్త్రవేత్తలు మళ్ళీ మళ్ళీ నిరూపించగలరు. కాలచక్రాన్ని చరిత్రకారుడు వెనక్కు తిప్పలేడు. కాబట్టి గతకాలపు సంఘటనలు పునరావృతం చేయలేడు. మానవుల ఆలోచన,
నడవడికలు ఒకేరకంగా ఉండక వైరుధ్యాలతో కూడుకొని ఉంటాయి. చరిత్ర భౌతిక రసాయన శాస్త్రాలవంటి శాస్త్రం కాదు. చరిత్ర దాదాపు కాలగమనంలో పేర్చిన సమాహారమే ! చారిత్రక సంఘటనలకు నకిలీ రూపాలు ఉండవు. కానీ చరిత్ర రచనకు ఉపయోగించే శాస్త్రీయ అన్వేషణ, సత్యనిరూపణ, కృషి, విమర్శనాత్మకత చరిత్రను విజ్ఞాన శాస్త్రానికి దగ్గర చేస్తాయి.
మానవ శాస్త్రం లేదా కళ: గ్రంథస్థం చేసిన గతకాలపు మానవుల జీవనమే చరిత్ర. చరిత్రకారుడు మనోరంజకంగా దాన్ని రచిస్తాడు. అందుకు అతడు కళాకారుడు అయి ఉండాలి. ఒక క్రమపద్ధతిలో లక్ష్యాన్ని చేరుకోవడమే కళ లేదా మానవ శాస్త్రం లక్ష్యం. ఉదా: సంగీతం, నాట్యం, ఈత వంటివి కళలు. గతకాలపు వాస్తవాలను రచించే చరిత్రకారుడికి నేర్పు అవసరం. అందువల్ల చరిత్ర అనేది శాస్త్రమే కాక ప్రజలకు ఉపయోగపడే సాహిత్య రూపం అని కూడా చెప్పవచ్చు. చరిత్ర విజ్ఞాన శాస్త్రం, మానవ శాస్త్రం అని కూడా ట్రెవిలియన్ అభిప్రాయపడ్డాడు.
ప్రశ్న 7.
చరిత్ర రచనలో సాహిత్యాధారాల ప్రాధాన్యత వివరించండి.
జవాబు:
చారిత్రక అంశాలను రాబట్టేందుకు సాహిత్యం బలమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. పాలకులు సాధించిన విజయాలు, రాజకీయ, సాంఘిక, మత విషయాలను సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. సాహిత్య ఆధారాలు రెండు విధాలు.
1) స్వదేశీ సాహిత్యం: వేదకాలం నుండి విజయనగర కాలం వరకు ఉన్న విలువైన రచనలు రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక చరిత్రకు అద్దం పడుతున్నాయి. బౌద్ధ, జైన సాహిత్యం చరిత్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది. పురాణాలు, శాస్త్రాలు, సంప్రదాయాలను వివరిస్తున్నాయి. కల్హణుడి రాజ తరంగిణి, కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రసిద్ధ
రచనలు.
2) విదేశీ సాహిత్యం: మెగస్తనీస్ ఇండికా, పెరిప్లన్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ వంటి గ్రీకు, రోమన్ రచనలు రోమ్, ఆగ్నేయాసియాతో భారత్ సంబంధాలను వెల్లడిస్తున్నాయి. టాలేమి రచన ‘జాగ్రఫీ’ భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రస్తావించింది. చైనాకు చెందిన ఫాహియాన్, హుయన్ త్సాంగ్ రచనలు భారతదేశ ప్రజల స్థితిగతులను, బౌద్ధ కేంద్రాలను వివరించాయి. ఆల్బెరునీ వంటి ముస్లిం యాత్రికులు భారతదేశాన్ని గురించి వివరించారు. మిన్హాజుద్దీన్ సిరాజ్ తన ‘తబాకత్-ఇ-ఇనాసిరి’ లో ఘోరి దండయాత్రలను వివరించాడు. అమీర్ ఖుస్రూ, జియాఉద్దీన్ బరౌనీ రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్రను గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. నికోలోకాంటే, డోమింగ్ పేస్, అబ్దుల్ రజాక్ వంటి ఇటలీ, పోర్చుగీసు, పర్షియన్ యాత్రికుల రచనలు విలువైన చారిత్రక అంశాలను వెల్లడించాయి.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
థూసిడైడిస్
జవాబు:
థూసిడైడిస్ (క్రీ.పూ. 460-400) అనే గ్రీకు చరిత్రకారుడు “జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారమే చరిత్ర” అని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన, విశిష్ఠమైన గుర్తుంచుకోదగ్గ సంఘటనల కూర్పు అయిన చరిత్ర ప్రజలపై ప్రభావాన్ని కనబరుస్తుందనీ, సమాజం అభివృద్ధి చెందేందుకు ప్రేరణ కలిగిస్తుందని ఆయన వివరించాడు. ఆధారం |కోసం అన్వేషణ సాగించాడు. నిష్పాక్షికంగా పరిశోధన సాగించాలన్న ధూసిడైడిస్ తరతరాల ప్రజల చరిత్రను ఒకరి నుంచి ఒకరికి అందించేది కాకుండా అన్ని కాలాలకు విలువలను అందించేదిగా ఉండాలని పేర్కొన్నాడు.
ప్రశ్న 2.
థామస్ కార్లెల్
జవాబు:
థామస్ కార్లెల్ (1795-1881) అసంఖ్యాక జీవిత చరిత్రల సమాహారమే చరిత్ర” అని పేర్కొన్నాడు. మహా పురుషులు, పాలకులు, కళాకారులు, ప్రబోధకుల జీవితాలే ఆయన చరిత్రగా పేర్కొన్నాడు. అంతేకాకండా సామాన్య మానవులు కాకుండా గొప్పవారి మానసిక, ఆధ్యాత్మిక జీవన స్థితిగతులను చరిత్రలో చెప్పాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. నిరాశా నిస్పృహలతో ఉండే సామాన్యులు కాకుండా మేధావులు మాత్రమే చరిత్రకు అవసరం అని కార్లైల్ పేర్కొన్నాడు.
ప్రశ్న 3.
ఇ.హెచ్. కార్
జవాబు:
ఇ.హెచ్.కార్ తన గ్రంథమైన ‘వాట్ ఈజ్ హిస్టరీ’ అనే గ్రంథంలో “చరిత్రకారుడికి, యదార్థాల మధ్యగల నిరంతరంగా సాగే పరస్పర కార్య విధానం, గీతానికి వర్తమానానికి నిరంతరముగా జరిగే అనంతమైన సంభాషణే చరిత్ర” అని వివరించాడు. ప్రకటనల రూపంలో చారిత్రక వాస్తవాలను నమోదు చేయడం ముఖ్యం కాదు. వాటిని సమీక్షించి, అన్వయించి వ్యాఖ్యానించడం చరిత్రకారుడి ప్రధాన కర్తవ్యం. మరో విధంగా చరిత్ర అంటే వ్యాఖ్యానించడం’ అని పేర్కొన్నాడు.
ప్రశ్న 4.
నిష్పక్షపాతమైన చరిత్ర రచన
జవాబు:
చరిత్రలో ఉన్నత ప్రమాణాలను సాధించే సాధనమే విషయ నిష్ఠత. నిష్పాక్షికత, విషయ నిష్ఠతకు మరో పేరు. జరిగిన విషయాలను యధాతథంగా వాస్తవాల ఆధారంగా పొందుపరచడమే నిష్పాక్షిక చరిత్ర రచన. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు, పక్షపాతాలకు తావులేదు. చారిత్రక వాస్తవాలకు చరిత్ర వ్యాఖ్యానికి మధ్య అర్థవంతమైన సంబంధం ఉండేటట్లు చరిత్ర రచన సాగాలి.
ప్రశ్న 5.
కల్హణుడు
జవాబు:
ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడు రచించిన ‘రాజ తరంగిణి’. ఇది క్రీ.శ. 1148 సం॥లో రచించబడినది. ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర, కాశ్మీర్ వారు చరిత్రపట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారని కల్హణుడు తెలియజేసినాడు. చరిత్రపట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా
రచించాడు.
ప్రశ్న 6.
అమీర్ ఖుస్రూ
జవాబు:
భారతదేశంలో ఇస్లాం మతం ప్రవేశించడంతో చరిత్ర రచనలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాలంనాటి చరిత్రకారులు గత కాలంలో జరిగిన అంశాలను, యుద్ధాలు, దండయాత్రలు, పాలనలను వరుసక్రమంలో వివరించారు. కానీ వాటి వెనక ఉన్న కారణాలను పరిగణలోనికి తీసుకోలేదు. ప్రసిద్ధ చరిత్రకారుడు అమీర్ ఖుస్రూ సంఘటనలకు ప్రాధాన్యత ఇచ్చి చరిత్ర రచనచేశాడు. కానీ ఈయన రచనల్లో హేతుబద్ధత కంటే వేదాంత ధోరణి కనిపిస్తుంది.
ప్రశ్న 7.
శాసనాలు
జవాబు:
శాసనాలు చరిత్ర రచనకు ముఖ్య ఆధారాలు. భారతీయ రాజులు మతాధికారులు, ముఖ్యమైన వారికి భూములు, ధనం కానుకలుగా ఇచ్చారు. వీరు ఈ విషయాలను రాయి, రాగి రేకుల మీద చెక్కించారు. అవి ప్రాచీన చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు, అశోకుడి శాసనాలు, శాతవాహనుల శాసనాలు, అలహాబాద్ ప్రశస్తి, రెండవ పులకేశి ఐహోలు శాసనం వంటివి ముఖ్యమైన శాసనాలు. ఇవి సామ్రాజ్యాల, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, భాషా పరిణామానికి శాసనాలు అద్దం పడుతున్నాయి.