AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 2nd Lesson ప్రాచీన నాగరికత – సంస్కృతులు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 2nd Lesson ప్రాచీన నాగరికత – సంస్కృతులు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
హరప్పా లిపిని గురించి రాయండి.
జవాబు:
సింధూలోయ నాగరికత త్రవ్వకాలలో రాతితో, మట్టితో చేసిన అనేక ముద్రికలు బయటపడ్డాయి. వాటిపై సింధూ ప్రజల లిపి లిఖించబడివున్నది. ఈ లిపిని ‘బొమ్మల లిపి లేక చిత్ర లిపి’ అంటారు. సింధూ ప్రజలు తమ భావాలను బొమ్మల ద్వారా వ్యక్తపరిచారని ఈ లిపి వల్ల తెలుస్తున్నది. ఈ లిపిలో ఒక వరుసను ఎడమ నుంచి కుడికి, తరువాత వరుసను కుడి నుండి ఎడమకు వ్రాసి ఉండవచ్చునని కొందరి నమ్మకము. సింధూ లిపి నుంచి బ్రాహ్మీ లిపి పుట్టినట్లు కొందరి నమ్మకము. ఈ లిపికి ప్రాచీన ఈజిప్టు, మెసపుటేమియాల లిపిలకు సంబంధం ఉందని కొందరి నమ్మకం. ఈ లిపిని ఇంకా ఎవ్వరూ పూర్తిగా చదవలేదు. ఈ లిపిని బట్టి సింధూ ప్రజలు విద్యావంతులని చెప్పవచ్చు. ఈ లిపి నుంచే ప్రాచీన తమిళభాష తన రూపాన్ని సంతరించుకుందని ఫాదర్ హీరాస్ పేర్కొనగా, కన్నింగ్రమ్, పాండే మొదలైన వారు అశోకుని బ్రాహ్మీ లిపి, సింధూ ప్రజల లిపి నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు.

ప్రశ్న 2.
హరప్పా మత జీవితంలోని ప్రధాన లక్షణాలను రాయండి.
జవాబు:
సింధూ ప్రజల మతం ఆచారాలు వివిధ నమ్మకాలతో కూడుకొన్నవి అని ఆచార్య వీలర్ పండితుని అభిప్రాయం. సింధూ త్రవ్వకాలలో ఎటువంటి దేవాలయములు గాని, దేవతా ప్రతిమలు గాని దొరకలేదు. అయితే సింధూ త్రవ్వకాలలో దొరికిన వివిధ ‘ముద్రల’ (సీల్స్) పై ఉన్న చిత్రాలు మరియు టేరాకోటా (మట్టి) బొమ్మల ద్వారా వారి మతం ఆచారాలు మెచ్చుకోవచ్చును.

ఎ) టేరాకోటా – మట్టి బొమ్మలు: నాటి టెరాకోటా బొమ్మలు బాగా మెరుగుపెట్టినట్లు తెలుస్తుంది. ఆ బొమ్మలలో “మాతృదేవతా మూర్తి” (చరిత్రకారులు అమ్మతల్లిగా పేర్కొనిరి) పెద్దశిరోవేష్టం, నడుముకు వడ్డాణం, ఇంకా కంఠహారాలు, చెవికమ్మలతో కనిపిస్తుంది. కొన్ని బొమ్మలకు నూనెదీపాల పొగ అంటినట్లు కనిపిస్తుంది. ఇది బహుశా నూనెదీపాలు, గుగ్గిలం లేదా సాంబ్రాణి వెలిగించి పూజించడం వల్ల అయి ఉండవచ్చును. సింధూ నాగరికతలో కనిపించే మాతృదేవతా మూర్తులు వంటివి, దక్షిణ భారతదేశంలోని గ్రామాల్లో కనిపించే స్త్రీ దేవతలుగా పేర్కొనవచ్చును. అటులనే ఈజియన్ సముద్రం నుండి పర్షియా వరకు ఉన్న ప్రాంతంలో కొనసాగిన ప్రాచీన నాగరికతలలో ఈ మాతృదేవతా మూర్తులు కనిపిస్తూనే ఉంటాయి.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

బి) ముద్రికలు:
1) సింధూ త్రవ్వకాలలో దాదాపు రెండువేలకు పైగా ఈ ముద్రికలు లభించాయి. ముద్రికలపై వివిధ చిత్రాలు కనబడుతున్నాయి. ఒక ముద్రికపై దేవతామూర్తి ముందు ఒక స్త్రీ రోదిస్తూ చెయ్యెత్తి హరిస్తున్నట్లు కనిపిస్తుంది. అటులనే ఎదురుగా ఎత్తిన చేతిలో కొడవలితో ఒక పురుషుడు కనిపిస్తున్నాడు. ఈ బొమ్మలనుబట్టి హరప్పా ప్రజలు బహుశ ‘నరబలి’ ఇచ్చే ఆచారమును కలిగివుండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం.

2) మరొక ముద్రికలో మాతృదేవతామూర్తి గర్భం నుండి జల ప్రవాహం ఉద్భవిస్తున్నట్లు కనిపిస్తుంది. మరొక ముద్రికలో రావిచెట్టు కొమ్మల మధ్య మాతృదేవతామూర్తి, ఎదురుగా మేకను పట్టుకొన్న మనిషి, ఈ బలి – కాండలో పాల్గొంటున్న కొంతమంది మనుషులు మరొక ముద్రికలో కనిపిస్తున్నారు. సింధూ నాగరికత ప్రజలలో ‘నరబలి’ అటులనే ‘జంతుబలి’ మొదలగు ఆచారాలున్నట్లు పేర్కొనవచ్చును. ముఖ్యముగా ముద్రికలలో “రావిచెట్టు” చిత్రీకరణను బట్టి సింధూ ప్రజలు రావిచెట్టును ఆరాధించినట్లు తెలుస్తుంది.

3) మరో ముద్రికలో కొమ్ములున్న శిరోవేష్టం ధరించిన పురుషదేవతామూర్తి కనిపిస్తుంది. వేదికపై ప్రతిష్టితుడై ఉన్న ఈ మూర్తికి మూడు శిరస్సులున్నాయి. వేదిక దిగువన లేడి, ఏనుగు, పులి, మహిషాల ఆకృతులు చిత్రించబడినాయి. ముఖ్యముగా దేవతామూర్తి అర్ధనిమీలిత నేత్రాలతో పద్మాసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఈ ముద్రికలోని చిత్రాలను పరిశీలించిన చరిత్రకారులు ‘త్రిముఖాలు కలిగిన పశుపతి”గా, “మహాయోగి” గా శివుని చూపుతుందని పేర్కొనిరి.

4) మరో ముద్రికలో త్రిమూర్తి శిరస్సులో నుంచి ఆకులు-పూలు ఉద్భవిస్తున్నట్లు చిత్రించబడెను. రెండు పార్శ్వ. శిరస్సులు, పార్శ్వభంగిమలో కనిపిస్తున్నాయి. కొమ్ములు శిరోవేష్టం ఉంది. ఇది ఉత్పత్తి సౌరశక్తుల అధిదేవతగా శివుని చూపుతుంది.

5) సింధూ త్రవ్వకాలలో లింగరూపంలో శిలలు బయటపడ్డాయి. అటులనే కొన్ని శివలింగాలు స్నాన ఘట్టంపై ప్రతిష్టించబడినాయి.

6) కొన్ని ముద్రలపై జంతురూపాల సమ్మేళనం చిత్రించబడినది. మానవ దేహంపై వృషభం, శిరస్సు, కొమ్ములున్న పులి (సుమేరియన్ పురాణగాథల్లోని ఎంకిడు) అటులనే కొమ్ములున్న పులితో పోరాడుతున్న యోధుడు (సుమేరియన్ పురాణ గాథల్లోని గిల్గమేష్) ఈ చిత్రాలతో పాటు వృషభం, ఏనుగు, మహిషం, కారెనుముల చిత్రాలు కూడా ముద్రికల్లో చిత్రించబడినాయి. కొన్ని ముద్రల్లో జంతురూపాల ముందు ఆహారపు తొట్లు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి సింధూ ప్రజలు జంతువులను ఆరాధించినట్లు చెప్పవచ్చును.

7) సింధూ ప్రజలు ప్రకృతి దేవతలను ఆరాధించినట్లు పేర్కొనవచ్చును. కొన్ని ముద్రికల్లో చెట్లు, అగ్ని, నీరు కూడా ముద్రించబడి ఉంది.

8) కొన్ని ముద్రికల్లో చక్రం, స్వస్తిక్ చిహ్నరూపాల్లో సూర్యునిమూర్తి చిత్రించబడి ఉంది.

9) సింధూ ప్రజలు నాగపూజ ఆరాధకులని కూడా చెప్పవచ్చును. కొన్ని ముద్రికలలో ‘పడగ విప్పిన నాగసర్పం’ ముందు ఆరాధకులు చిత్రించబడి ఉంది.

10) సింధూ ప్రజలకు మరణానంతర జీవితంపై కూడా నమ్మకము కలదు.

ప్రశ్న 3.
హరప్పా నాగరికత ఏ విధంగా పతనమైందో వివరించండి ?
జవాబు:
క్రీ.పూ. 2300 నుండి క్రీ.పూ. 1750 వరకు ఈ నాగరికత వర్ధిల్లింది. ఈ నాగరికత ఎట్లా అంతర్థానమైందో ఎవ్వరికీ అవగాహన కావటం లేదు. సింధూ నది వరదల కారణంగా ఈ నాగరికత అంతరించిందని కొందరు, ఆర్యుల దండయాత్రల వలన నశించిందని కొందరు, వ్యాధిగ్రస్తులై ప్రజలు మరణించటం వలన పతనమైందని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే సింధూ నాగరికత పతనానికి అనేకమంది చరిత్రకారులు అనేక కారణాలు పేర్కొన్నారు.

క్రీ.శ. 1953వ సంవత్సరములో సర్ మార్టిమర్ వీలర్ హరప్పా నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణం అని పేర్కొన్నాడు. అందుకు మొహంజోదారోలోని వివిధచోట్ల లభ్యమైన వివిధ జాతులకు చెందిన 37 అస్థిపంజరాలను, యుద్ధాలు, కోటలను గురించి వేదాల్లో పేర్కొనడాన్ని ఆధారాలుగా చూపించాడు. అయితే వీలర్ సిద్ధాంతాన్ని తిరస్కరించడం ప్రారంభించారు. అందుకు అస్థిపంజరాలు నగరాలు నాశనం అయిన తరువాత కాలానికి చెందనవనీ, అవి కోటకు సమీపంలో లభించలేదని వారు పేర్కొన్నారు. క్రీ.శ. 1994లో కెన్నెత్ కెన్నడీ చేసిన పరిశోధనలు అస్తి పంజరాలపై ఉన్న గుర్తులు దౌర్జన్యకరమైన యుద్ధాల వల్ల కాకుండా కోతల వల్ల ఏర్పడినవని వెల్లడించాడు. ఈనాడు అనేకమంది చరిత్రకారులు కరువు వల్ల, ఈజిప్ట్, మెసపటోమియాల్లో వ్యాపార సంబంధాలు దెబ్బతినడం వల్ల సింధూ నాగరికత పతనమైనట్లు పేర్కొన్నారు. వీటికి తోడు నూతన వ్యక్తులు వలస రావడం, అడవులు నశించడం, వరదలు, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం వంటి కారణాల వల్ల సింధూ లోయ నాగరికత పతనమైనది.

ప్రశ్న 4.
ఋగ్వేద సంస్కృతిని గురించి రాయండి.
జవాబు:
భారతీయ సంస్కృతిని తీర్చిదిద్ది దానికొక విశిష్ట రూపాన్ని ఇచ్చినవారు ఆర్యులు. వారు వేద సాహిత్యాన్ని రచించడంచేత వారి కాలానికి వేదకాలమని పేరు వచ్చింది. క్రీ.పూ. 2000 నుండి క్రీ.పూ. 500 వరకు వేదకాలమని భావిస్తారు. వేద కాలాన్ని ఋగ్వేద కాలం, మలివేద కాలం అని రెండు కాలాలుగా విభజించారు. ఋగ్వేదకాలం-సంస్కృతి (క్రీ.పూ. 1500 – 900): వైదిక వాఙ్మయంలో మొదట రచించిన గ్రంథాలు వేదాలు. వాటిలో అతిపురాతనమైనది ఋగ్వేదము. భారతదేశంలో ఆర్యులు మొదట రచించిన గ్రంథం ఋగ్వేదము. కనుక ఋగ్వేదం వ్రాయబడిన నాటి వరకుగల కాలాన్ని ఋగ్వేదకాలం అంటారు. ఈ కాలంలో ప్రజల జీవన విధానాన్ని గురించి ఋగ్వేదంలో వివరణ ఉంది.
ఋగ్వేదకాలపు ఆర్యుల భౌగోళిక విస్తరణ ఋగ్వేదంలో సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్ నదులను పేర్కొన్నారు. ఈ నదుల ప్రాంతాన్ని సప్తసింధు ప్రాంతం అంటారు. ఋగ్వేదంలో యమున, గంగా నదుల ప్రస్తావన, హిమాలయాల గురించి వివరణ కూడా ఉంది. దీనిని బట్టి ఋగ్వేద ఆర్యులు సప్తసింధూ ప్రాంతంలోను, గంగా, యమున తీరప్రాంతాల్లోను స్థిరపడినట్లు తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

రాజకీయ పరిస్థితులు: ఆర్యులు ఒకే జాతికి చెందినవారే అయినప్పటికి వారిలో అనేక తెగలున్నాయి. ఈ తెగల్లో భరత, మత్స్య, తుర్వస, యదు అనేవి ముఖ్యమైనవి. ఈ తెగల్లో భరతుల తెగ ప్రధానమైనందున భారతదేశంగా ఈ దేశానికి నామకరణం జరిగింది. ఈ కాలంలో రాజ్యానికి రాజే సర్వాధికారి. రాచరికం వంశపారంపర్యంగా సంక్రమించేది. గణతంత్ర రాజ్యాల్లో అధిపతులను ప్రజలే ఎన్నుకొనేవారు. శత్రువుల నుంచి రాజ్యరక్షణ, ప్రజలకు రక్షణ మొదలైనవి రాజు ముఖ్య విధులు. ప్రజల ఆస్తిని సంరక్షించటం కూడా రాజు యొక్క విధి. ఇందుకు ప్రతిఫలంగా ప్రజలు రాజుకు బహుమతులిచ్చేవారు. సేనాని, పురోహితుడు వంటి అధికారుల సహాయంతో రాజు పరిపాలన సాగించేవాడు. పరిపాలనా వ్యవహారాల్లో సభ, సమితి అనే పౌరసభలు రాజుకు సహాయపడేవి. ఈ కాలంలో శిక్షలు కఠినంగా ఉండేవి. పరిపాలనా పునాది గ్రామము. గ్రామాలు స్వయంపోషకాలు. కొన్ని సందర్భాలలో రక్షణ కోసం గ్రామం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించేవారు. ఋగ్వేదార్యులు అనార్యులతోను, వారిలో వారు యుద్ధాలు చేసేవారు. విల్లంబులు, కత్తులు, శూలాలు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు వంటి ఆయుధాలను, గుర్రాలను పూన్చిన రథాలను యుద్ధంలో వాడేవారు.

ఆర్థిక పరిస్థితులు: ఋగ్వేదకాలం నాటి ఆర్యులు గ్రామీణ జీవితాన్ని గడిపారు. పశుపాలన, వ్యవసాయం వారి ప్రధాన వృత్తులు. వారు అడవులను నరకటం ద్వారా క్రొత్త భూమిని సాగులోకి తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని పెంపొందించారు. వరి, గోధుమ, బార్లీ, నువ్వులు నాటి ప్రజల ముఖ్యమైన పంటలు. పశుసంపదను వీరు ప్రాణప్రదంగా భావించేవారు. వర్తకంలో వస్తుమార్పిడి పద్ధతి అమలులో ఉండేది. “నిష్కమణ” అనే ఆభరణాన్ని నాణెంగా ఉపయోగించేవారు. సరుకు రవాణాకు గుర్రాలను, ఎడ్లను, రథాలను ఉపయోగించేవారు.

సాంఘిక పరిస్థితులు: ఋగ్వేద ఆర్యులు ఉమ్మడి కుటుంబాలలో జీవించేవారు. కుటుంబానికి పెద్ద తండ్రి. తండ్రిని ‘గృహపతి’ లేక ‘దంపతి’ అని పిలిచేవారు. సమాజంలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారు సభ, సమితి సమావేశాల్లో పాల్గొనేవారు. తమ భర్తలతో పాటు యజ్ఞయాగాదుల్లో కూడా పాల్గొనేవారు. సంపన్న కుటుంబాలలో బహుభార్యత్వం ఉండేది. బాల్యవివాహాలు లేవు. వృత్తుల ఆధారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను నాలుగు వర్ణాలేర్పడ్డాయి. శూద్రులకు సంఘంలో అట్టడుగు స్థానాన్ని ఇచ్చారు. ఋగ్వేద ఆర్యులు బియ్యం, బార్లీ, పాలు, పెరుగు, వెన్న, కూరగాయలు, పళ్ళు, మాంసం మొదలైన వాటిని ఆహారంగా తీసుకొనేవారు. సోమ, సుర అనే మత్తు పానీయాలను సేవించేవారు. ఉన్ని, నూలు, చర్మసంబంధమైన వస్త్రాలను ధరించేవారు. స్త్రీ, పురుషులిరువురు ఆభరణాలను ధరించేవారు. గుర్రపు పందాలు, రథాల పందాలు, చదరంగం, సంగీతం వారి ముఖ్య వినోదాలు.

మత పరిస్థితులు: ఋగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. వారు తమ దైవాలను స్వర్గ దైవాలు, అంతరిక్ష దైవాలు, భూదైవాలు అను మూడు రకాలుగా వర్గీకరించారు. ద్యుస్ (ఆకాశం), ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని, సోమ వంటి పురుషదేవతలనే కాక అదితి, పృథ్వి వంటి స్త్రీ మూర్తులను కూడా వారు ఆరాధించారు. దైవాలకు ఆగ్రహానుగ్రహాలు ఉంటాయని ప్రజలు నమ్మేవారు. ప్రార్థనలు, యజ్ఞాలు, యాగాలు ఋగ్వేద ఆర్యుల పూజా విధానంలో ముఖ్యమైన అంశాలు. యజ్ఞాల్లో పాలు, ధాన్యం, నెయ్యి వంటి పదార్థాలతో పాటు సోమరసాన్ని కూడా దేవతలకు నైవేద్యంగా సమర్పించేవారు. అయితే ఈ కాలంలో ఏ దైవం కూడా ప్రత్యేక ప్రాధాన్యతను పొందలేదు. “దేవతామూర్తులందరూ ఒక్కటే. వారిని వర్ణించే విధానం వేరు” అనే విషయాన్ని ఆర్యులు నమ్మేవారు. ఈ కాలంలో దేవాలయాలు లేవు. విగ్రహారాధన లేదు. పశుగణాభివృద్ధి, సంతానాభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ పూజల లక్ష్యాలని తెలుస్తున్నది.

ప్రశ్న 5.
మలివేద కాలంనాటి సాంఘిక, ఆర్థిక వ్యవస్థలను గురించి రాయండి.
జవాబు:
ఋగ్వేదానంతర కాలంలో ఆర్యులు తూర్పు, దక్షిణ దిశల్లో విస్తరించసాగారు. ఈ కారణంగా తెగల మధ్య పోరాటం తప్పలేదు. ఫలితంగా బలవంతుల తెగకు బలహీనమైన తెగలు లొంగిపోయి ఆ తెగలతో కలిసిపోయేవి. అలా కొన్ని తెగలు అంతరించి, కొత్త తెగలు ఏర్పడ్డాయి. పురు, భరత తెగలు కలసిపోయి ‘కురుతెగ’ ఏర్పడింది. వారి యొక్క సాంఘిక, ఆర్థిక పరిస్థితులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

సామాజిక వ్యవస్థ: కుల వ్యవస్థ నిర్దిష్టమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు కులాలు లేదా వర్ణాలుగా సమాజ విభజన జరిగింది. బ్రాహ్మణులు యజ్ఞయాగాదుల నిర్వహణను, దేవతారాధనను, అధ్యయనాన్ని చేపట్టేవారు. దేశ రక్షణ, రాజ్యపాలన, క్షత్రియుల విధి. వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారాలను వైశ్యులు నిర్వహించేవారు.
మూడు కులాల వారిని సేవించేవారు, వారికి సహాయపడేవారు శూద్రులు. క్రమంగా వృత్తులు వంశపారంపర్యమయ్యాయి. వృత్తి మార్పిడి జరగలేదు. వర్ణవ్యవస్థ దృఢమైంది. ఆశ్రమ ధర్మాలు కూడా ప్రవేశించాయి. స్త్రీకి గౌరవం తగ్గింది. వివాహాలకు కఠిన నిబంధనలు విధించారు. విద్యావకాశాలు అగ్రవర్ణాల వారికే పరిమితమయ్యాయి.

మతం: ఈ యుగంలో మతం సంక్లిష్టంగా తయారైంది. అగ్ని, ఇంద్రుడు వంటి దేవతలకు ప్రాధాన్యత తగ్గింది. విష్ణువు, రుద్రుడు వంటి దైవాల పట్ల భక్తి పెరిగింది. సృష్టికర్తగా ప్రజాపతి స్థానం పెరిగింది. పశుపోషణ తగ్గడంతో, పశుసంరక్షకుడు “పుషాన్” దేవుడి ఆరాధన తగ్గింది. కర్మకాండలకు, యజ్ఞయాగాదులకు ప్రాముఖ్యత పెరిగింది. ఖర్చుతో కూడుకున్నందువల్ల యజ్ఞయాగాదులు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. భూత, ప్రేతాల్లో నమ్మకాలు బలపడసాగాయి. జంతుబలులు పెరిగాయి. యజ్ఞయాగాదుల్లో బ్రాహ్మణులకు గోవులు, బంగారం, అశ్వాలు, వస్త్రాలను “దక్షిణ”గా సమర్పించేవారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఉపనిషత్తుల తత్వజ్ఞానం సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ యుగాలలో షడ్ దర్శనాలు ఆవిర్భవించాయి.

ఆర్థికవ్యవస్థ: రాజ్యం విస్తరించడంతో కొత్త భూములు సాగులోకి వచ్చి వ్యవసాయం విస్తృతమైంది. వ్యవసాయాభివృద్ధి వర్తకానికి దోహదపడింది. జనాభా పెరిగింది. పరిశ్రమలు, చేతిపనుల వృత్తులు అభివృద్ధి చెందాయి. పరిశ్రమలు, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడంతో పట్టణాలేర్పడ్డాయి. తక్షశిల, హస్తినాపురం, కౌశాంబి, వైశాలి, కాంపిల్య, శ్రావస్తి, వారణాసి పట్టణాలు ఇందుకు ఉదాహరణలు. వస్తు మార్పిడి బదులు శతమానం, కర్షపణ నాణేల వాడకం మొదలైంది. వ్యాపారాభివృద్ధికి అడ్డంకులు పోయాయి. బంగారం, వెండి, రాగి లోహాలతో నాణేలు తయారయ్యాయి. ఐశ్వర్యం అభివృద్ధి చెందడంతో పశుపోషణ తగ్గింది.

ప్రశ్న 6.
ఆశ్రమ విధానం గురించి రాయండి.
జవాబు:
మలివేద కాలంలో ఆశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. ఇవి నాలుగు. వీటినే చతురాశ్రమ ధర్మాలు లేదా ఆశ్రమ ధర్మాలు అంటారు.
1. బ్రహ్మచర్యం: సాత్వికాహారం తింటూ గురుకులంలో విద్యనభ్యసిస్తూ, గురువుకు తగిన సేవ చేయాలి.

2. గృహస్థాశ్రమం: విద్యాభ్యాసము పూర్తి అయిన తదుపరి యుక్త వయస్సు రాగానే వివాహితుడై గృహస్థు ధర్మాలు పాటించి, సంతానవంతుడై వంశాన్ని నిలపాలి.

3. వృద్ధాప్యం: వృద్ధాప్యంలో భగవంతుని ధ్యానము, దానధర్మాలు చేయుట, తీర్థయాత్రలు చేయుట, ముక్తికి మార్గాలను అన్వేషించుట మొదలగు కార్యక్రమాలు చేపట్టాలి.

4. వానప్రస్థం: జీవిత అంతిమ కాలంలో అడవికి వెళ్ళి తపోమార్గంను అనుసరించి, భౌతిక వాంఛలకు, ఐహిక బంధాలకు లోను కాకుండా జీవనం గడపాలి.

జైన, బౌద్ధ మతములలోని సన్యాసి సంప్రదాయానికి దగ్గరగా ఆర్యులు ఆశ్రమ ధర్మాలను చేపట్టారని కొందరి అభిప్రాయం.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మహా స్నానవాటిక
జవాబు:
మొహంజొదారో నగరంలో గల పౌర నిర్మాణాలలో చెప్పుకోదగినది మహాస్నానవాటిక. దీని మధ్య పెద్ద కొలను ఉన్నది. ఈ కొలనులో ఉత్తర, దక్షిణ దిశలలో పెద్ద మెట్లను నిర్మించారు. ఈ కొలనులోకి నీళ్ళు రావడానికి సదుపాయం కూడా ఉంది. మరో మార్గం నుంచి వేడినీటిని లోపలికి పంపేందుకు ఏర్పాట్లున్నాయి. దీని అడుగుభాగాన్ని ఇటుకలతోను, జిప్సంతోను నిర్మించారు. దీనిలో ఈత పందాలు నిర్వహించి ఉండవచ్చు.

ప్రశ్న 2.
ముద్రికలు
జవాబు:
హరప్పా ప్రజలు వివిధ రకాలైన ముద్రికలను వాడేవారు. సుమారు రెండువేల ముద్రికలు వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభించాయి. ఈ ముద్రికలపై వివిధ రకాల జంతువుల బొమ్మలతో పాటు హరప్పా లిపి గుర్తులు కూడా ఉన్నాయి. కొమ్ములున్న శిరోవేష్ఠనం ధరించిన పురుష దేవత ఉన్న ఒక ముద్రిక ప్రధానమైనది.

ప్రశ్న 3.
వేదాలు
జవాబు:
‘వేద’ అనే పదం ‘జ్ఞానం’ అని అర్థం ఇచ్చే ‘విద్’ నుంచి ఆవిర్భవించింది. మరోరకంగా ‘వేదం’ అనే పదానికి గొప్ప జ్ఞానం అని అర్థం చెప్పబడింది. వేదాలు నాలుగు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. యజ్ఞయాగాది క్రతువుల్లో ఉచ్ఛరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైంది. అధర్వణ వేదంలో మంత్రతంత్రాలు ఉన్నాయి. వేదాలతో పాటు బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వంటివి ఉన్నాయి.

ప్రశ్న 4.
దర్శనాలు
జవాబు:
ఆరు విధాలైన దర్శనాలు ఉన్నాయి. వీటిని ‘షడ్దర్శనాలు’ అని అంటారు. న్యాయం, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ ఉత్తర మీమాంస అనేవి షడ్దర్శనాలు. ఇవన్నీ అంతర్గత జీవన విధానాన్ని వివరించి బహిర్గత కర్మలను వ్యతిరేకించాయి. న్యాయ దర్శనాన్ని గౌతమ, వైశేషిక దర్శనాన్ని కన్నడుఋషి, సాంఖ్య దర్శనాన్ని కపిలుడు, యోగధర్శనాన్ని పతంజలి, పూర్వ మీమాంసను జైమిని, ఉత్తర మీమాంసను బాధరాయణుడు రచించారు.

ప్రశ్న 5.
సభ, సమితి
జవాబు:
వేదకాలంనాటి ఆర్యులు రాజ్యాలవలె కాకుండా తెగలుగా ఏర్పడ్డారు. తెగ నాయకున్ని ‘రాజన్’ అని పిలిచేవారు. రాజు స్వేచ్ఛను సభ, సమితి అనే ప్రజాసభలు అడ్డుకొనేవి. సభ అనుమతి లేనిదే రాజన్ అధికారాన్ని స్వీకరించే వీలులేదు. సభలో తెగలోని ఉన్నత వర్గాలవారు సభ్యులు కాగా, సమితిలో సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు.

AP Inter 1st Year History Study Material Chapter 2 ప్రాచీన నాగరికత – సంస్కృతులు

ప్రశ్న 6.
కుల వ్యవస్థ
జవాబు:
మలివేద కాలంలో కులవ్యవస్థ పటిష్టమైంది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు కులాలుగా విభజింపబడింది. యజ్ఞయాగాలు, పూజా సంస్కారాలు, కర్మకాండలు చేయడం బ్రాహ్మణుల ప్రధాన వృత్తి. రెండవ వారు క్షత్రియులు యోధ ధర్మాన్ని నిర్వహించేవారు. మూడవ స్థానాన్ని పొందిన వైశ్యులు వ్యాపారం చేసేవారు. నాలుగు కులాల్లో శూద్రులు తక్కువవారుగా గుర్తింపు పొందారు.