AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలను వివరించండి.
జవాబు:
క్రీ.శ. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనతో వచ్చిన వ్యవస్థాగత మార్పు విద్యావంతులైన ఒక కొత్త సామాజిక వర్గ ఆవిర్భావానికి దారితీసింది. పాశ్చాత్య విద్య, సంస్కృతితో ప్రభావితులైన విద్యాధికులు సామాజిక ఉద్యమాలకు పూనుకున్నారు.

సామాజిక సంస్కరణోద్యమాలు: 19వ శతాబ్ద ప్రారంభం నాటికి సమాజంలో నెలకొన్న సామాజిక కట్టుబాట్లు స్త్రీలను, దళితులను హీనస్థితికి గురిచేశాయి. బాలికల భ్రూణ హత్య, సతి, నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు ఆనాటి సమాజంలో నెలకొన్న కొన్ని దురాచారాలు. అయితే భారతీయ విద్యావంతులు ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్యుల్లోని ఉదార, ఆశావాద దృక్పథాన్ని చూసి వాటిపట్ల ఆకర్షితులయ్యారు. భారతీయ సమాజంలోని వివక్షాపూరిత దృక్పథం, వెనకబాటుతనం వారి సంస్కరణాభిలాషను దృఢతరం చేసింది.

19వ శతాబ్దంలో ప్రారంభమైన సంస్కరణల్లో రెండు ప్రధాన ధోరణులున్నాయి. అవి మత, సామాజిక సంస్కరణలు, రాజారాంమోహన్ రాయ్ మతానికి హేతువాద దృక్పథాన్ని జోడించాడు. ఇతని కృషివల్ల 1829 డిసెంబర్ 4న సతీ దురాచారం నిషేధించబడింది. అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ‘సతి’ని చట్టరీత్యా నేరంగాను, శిక్షార్హంగాను ప్రకటించాడు. బ్రహ్మసమాజం, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, థియోసాఫికల్ సంఘం లాంటి మత సంస్కరణాభిలాష గల సంస్థలు తమ కార్యక్రమాలను నడిపించాయి. బ్రహ్మసమాజం బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించింది. దయానంద సరస్వతి నాయకత్వంలో ఆర్యసమాజం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉద్యమించి ‘వేదాలకు తరలండని’ ప్రబోధించారు. కరుడుగట్టిన సమాజ పునర్వ్యవస్థీకరణకు భారత తాత్విక సంస్థలు, థియోసాఫికల్ సొసైటీవంటివి పూనుకొన్నాయి. హేతుబద్ద పూజా విధానాన్ని రామకృష్ణ మిషన్ వారు ప్రవచించారు. జొరాస్ట్రియన్ల సంస్థ, రహనుమాయి మజ్దాయాన్ సభ, జొరాస్ట్రియన్ల ప్రాచీన పద్ధతుల పరిరక్షణను ప్రబోధించింది.

ఈ సంస్కర్తలు చేపట్టిన కార్యక్రమాలైన వితంతు పునర్వివాహం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య ఉదార పాశ్చాత్య లౌకిక ధోరణుల్ని సూచిస్తాయి. పర్దా నిషేధం, బాల్యవివాహం రద్దు, బహు భార్యత్వం, దళితుల పట్ల వివక్షను రూపమాపటం కోసం సంస్కర్తలు పూనుకొన్నారు. వివాహ వయోపరిమితి పెంపు, స్త్రీల ఆస్తి హక్కుల్ని వారు కాంక్షించారు. ఈ దురాచారాలను రూపుమాపడం కోసం చట్టాల ఏర్పాటుతోపాటు దేవాలయ ప్రవేశం, భోజన విషయాల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డిప్రెస్డ్ క్లాస్ మిషన్, డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, అలీఘర్ సంస్థ, అమృత్సర్లోని దివానల్సా, బొంబాయి సోషల్ సర్వీసీగ్, ఇండియన్ నేషనల్ సోషల్ సర్వీస్ లీగ్లు, సత్యశోధక్ సమాజ్, హరిజన సేవక్ సంఘ్ లాంటి సంస్థలు కృషి చేశాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలేలు స్త్రీల విద్యావాప్తి, ముఖ్యంగా దళిత బాలికల విద్యా వ్యాప్తికై కృషి చేశారు. వితంతు స్త్రీల సంతానానికి అనాథాశ్రమం కట్టించారు. క్రీ.శ. 1873లో సత్యశోధక్ సమాజాన్ని 1882లో దీనబంధు సార్వజనిక్ సభను స్థాపించి వీటి ద్వారా సంస్కరణలు చేపట్టారు. పండిత రమాబాయి సంప్రదాయ కుటుంబంలో జన్మించింది. సంస్కృతంలో ప్రావీణ్యం గడించి సమాజంలోని మూఢాచారాలను ఏవగించుకొంది. సంస్కృత ప్రావీణ్యానికి ‘పండిత’ అనే గౌరవ బిరుదు రమాబాయి పొందారు. అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి సామాజిక అన్యాయాల నుంచి హిందూ స్త్రీలను రక్షించడం కోసం కృషి చేశారు. పూణేలో మహిళా ఆర్యసమాజాన్ని, బొంబాయిలో శారదా సదన న్ను స్థాపించారు.

బెంగాల్లో హెన్రీలూయిస్ వివియన్ డొరేజియో హేతువాద దృక్పథంతో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపాడు. విద్యాసంస్కరణలకోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పూనుకొన్నారు. ఈయన కృషి వల్లే 1856లో హిందూ స్త్రీల పునర్వివాహానికి ఉన్న నిర్బంధాలన్నీ తొలగి చట్టం చేయడమైంది. ప్రముఖ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల విద్యావ్యాప్తికి కృషి చేశారు. 1825లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఈ సంస్థే తరువాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఆ తర్వాత కాలంలో వివేకానందుడుగా ప్రఖ్యాతి చెందిన నరేంద్రనాథ్ దత్తా రామకృష్ణ మిషన్ స్థాపించాడు. దీని ద్వారా యువతలో దేశభక్తిని రగిల్చి ప్రజోద్ధరణకు పనిచేసేలా వారిని ఉత్తేజపరిచాడు.

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో ‘వందేమాతరం’ ప్రాముఖ్యత తెల్పండి.
జవాబు:
భారతీయులలో పెరుగుతున్న జాతీయభావం బెంగాల్ విభజనతో బహిర్గతమై వందేమాతరం ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం భవిష్యత్లో జరగబోయే ఉద్యమాలకు మార్గదర్శకమైంది.

కారణాలు: ఈ క్రింది కారణాలు వందేమాతర ఉద్యమానికి దోహదపడ్డాయి.
1) మితవాదుల వైఫల్యం: కాంగ్రెస్ స్థాపన జరిగినప్పటి నుంచి నాయకులు తమ కోర్కెల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను అవలంబించారు. వారు ఉద్యమించిన 20 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా సాధించేందేమీ లేదు. దీనితో మితవాదుల యెడల ప్రజలలో అసంతృప్తి బయలుదేరింది.

2) అతివాద జాతీయభావం: అప్పటికే జాతీయోద్యమంలో తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి అతివాద జాతీయ నాయకులున్నారు. పోరాటం ద్వారానే తమ కోర్కెలు తీరుతాయని వారు భావించి తమకు స్వరాజ్యం కావాలని ప్రకటించారు.

3) ఆంగ్లేయుల విభజించు పాలించు విధానం: ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని దెబ్బతీయటానికి బ్రిటీషు ప్రభుత్వం “విభజించి, పాలించు” అనే సాధనాన్ని వినియోగించింది. భారతీయులలోని ఐక్యతను దెబ్బతీసి, వారిని బలహీనపరచి, తద్వారా తాను లబ్ది పొందాలని భావించింది. ఈ లక్ష్య సాధనకు బెంగాల్ను విభజించింది.

4) బెంగాల్ విభజన: బెంగాల్ రాష్ట్రం జాతీయోద్యమానికి ఆయువుపట్టు. దానిని విభజించటం ద్వారా జాతీయోద్యమాన్ని దెబ్బతీయాలని, హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని కర్జన్ ప్రభువు తలపోశాడు. ఈ కారణంగా బెంగాల్ నుంచి 3 కోట్లకు పైగా జనాభా ఉన్న తూర్పు బెంగాల్, అస్సాంలను విడదీసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాడు. బెంగాల్ రాష్ట్రం అతివిశాలమైందని, పాలనా సౌలభ్యం కోసం దాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చని ప్రకటించాడు. ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని మొగ్గలోనే తుంచేయడానికి, కాంగ్రెసు, ప్రజలను విడదీయటానికి ఆంగ్లేయులు ఈ పన్నాగం పన్నారని భారతీయులు భావించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు ప్రారంభించిన ఉద్యమాన్ని వందేమాతరం ఉద్యమం అంటారు. దీనిని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు.

వందేమాతరం ఉద్యమం: వందేమాతరం ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి ప్రజాఉద్యమం. బంకించంద్రుని ‘ఆనందమఠ్’ నవలలోని ‘వందేమాతరం’ గేయం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీనిని వందేమాతర ఉద్యమం అన్నారు. ఉద్యమం బెంగాల్కు మాత్రమే పరిమితం కాక, దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది.

బహిష్కరణోద్యమం: ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, బ్రిటీషు యాజమాన్యంలో ఉన్న విద్యాలయాలను బహిష్కరించటం దేశవ్యాప్తంగా జరిగాయి. విదేశీ వస్త్రాలను ఉద్యమకారులు కుప్పలు కుప్పలుగా పోసి తగులబెట్టారు. ఉద్యమంలో హిందువులు, మహమ్మదీయులు ఐక్యతతో పాల్గొన్నారు.

స్వదేశీ ఉద్యమం: ఈ కాలంలో ఉద్యమకారులు స్వదేశీ ఉద్యమాన్ని కూడా నడిపారు. స్వదేశీ వస్తువులకు ఆదరణ లభించింది. స్వదేశీ భావన అన్ని రంగాలకు వ్యాపించింది. విద్య, సంస్కృతి, వ్యాపారం, పరిశ్రమలు తదితర రంగాలలో స్వదేశీ భావం ప్రజ్వరిల్లింది.

నిర్మాణాత్మక కార్యక్రమం: స్వదేశీ, బహిష్కరణోద్యమాలతో పాటు ప్రజలు నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్వదేశీ పరిశ్రమలను, స్వదేశీ విద్యాలయాలను స్థాపించారు.

ప్రభుత్వ దమన నీతి: ఈ ఉద్యమాన్ని అణచటానికి ప్రభుత్వం దమననీతిని సాగించింది. విద్యార్థులను లాఠీలతో కొట్టించింది. అనేకమంది నాయకులను ఎటువంటి విచారణ లేకుండా జైలులో పెట్టించింది. వందేమాతరం నినాదాలు చేయటం, జెండాలను ధరించటం, ఊరేగింపులను జరపటాన్ని నిషేధించింది. పత్రికా స్వాతంత్ర్యాన్ని కాలరాసింది. కర్జన్ తరువాత వచ్చిన వైస్రాయ్ లార్డ్ మింటో దేశద్రోహ చట్టాన్ని, విస్ఫోటక పదార్థాల చట్టాన్ని, భారతీయ పత్రికా చట్టాన్ని మొదలైన వానిని చేసి ప్రజల హక్కులను అణగద్రొక్కాడు. తిలక్కు 6 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించబడింది. అరవింద ఘోష్ అలీపూర్ బాంబు కేసులో ఇరికించబడ్డాడు. సురేంద్రనాథ్ బెనర్జీ, గాడిచర్ల హరి సర్వోత్తమరావులు నిర్బంధించబడ్డారు. పైగా బ్రిటిష్ ప్రభుత్వం మహమ్మదీయులను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది.

విప్లవోద్యమం: ప్రభుత్వం అనుసరించిన దమననీతికి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులను హత్యచేయడానికి కొందరు యువకులు రహస్య సంఘాలుగా ఏర్పడ్డారు. భూపేంద్రనాథ్ దత్, వి.డి. సావర్కర్, ఖుదీరామ్ బోస్ మొదలైనవారు వీరిలో ప్రముఖులు. ప్రభుత్వం ఖుదీరామ్ బోస్కు కింగ్స్ ఫోర్డ్ప హత్యాప్రయత్నం చేసినందుకు మరణశిక్ష విధించింది. ఈ ఉద్యమం బ్రిటిష్ అధికారులను భయభ్రాంతులను చేసింది. భారతీయులను తృప్తిపరచటానికి, మితవాదులను, అతివాదులను విడదీయడానికి, హిందూ, మహమ్మదీయుల మధ్య స్పర్ధలు సృష్టించటానికి బ్రిటిష్ ప్రభుత్వం 1909 భారతీయ కౌన్సిల్స్ చట్టాన్ని చేసింది. అయినా ఈ ఉద్యమం కొనసాగింది.

బెంగాల్ విభజన రద్దు: లార్డ్ మింటో స్థానంలో వైస్రాయ్ గా వచ్చిన లార్డ్ హార్డింజ్ ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకొన్నాడు. బెంగాల్ విభజన రద్దుచేయాలని, అస్సాంను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని బీహార్, ఛోటా నాగపూర్, ఒరిస్సాలను ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించగానే 1911లో బెంగాల్ విభజన రద్దయింది.

ఫలితాలు: బెంగాల్ విభజన కొన్ని ముఖ్య ఫలితాలనిచ్చింది.

  1. కేవలం నిరసనలు, ప్రదర్శనలు, తీర్మానాలు ఏవిధంగాను పనికిరావని, తీవ్రమైన చర్యలు అవసరమని కాంగ్రెస్ భావించింది. తీర్మానాలకు మద్దతుగా ప్రజాశక్తి తోడైతేగాని సమస్యలు పరిష్కారం కావని ప్రజలు భావించారు.
  2. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం రూపుదిద్దుకుంది.
  3. భారత జాతీయ కాంగ్రెస్ “స్వరాజ్యం” కావాలని కోరింది.
  4. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం మంచి ఊపునందుకున్నాయి. దీనితో భారతీయ పరిశ్రమలు బాగా లబ్దిపొందాయి.
  5. ఈ ఉద్యమం సాంస్కృతిక కార్యకలాపాలను కూడా ప్రభావితం చేసింది. జాతీయ కవిత ఈ కాలంలో పెల్లుబుకింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ మొదలైన వారి రచనలను ప్రభావితం చేశాయి. జాతీయవిద్యకు ప్రోత్సాహం లభించింది.
  6. జాతీయోద్యమం తీవ్రతరమైంది. అతివాదులు శాంతియుత ప్రతిఘటనోద్యమాన్ని కూడా చేపట్టారు. ప్రజలు ప్రభుత్వంతో సహకరించడానికి నిరాకరించడం ఇందులోని ప్రధానాంశం.
  7. ఉగ్రవాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఐరిష్ ఉగ్రవాదులు, రష్యన్ నిహిలిస్టుల విధానాలను అనుసరించి బ్రిటీషు ఉద్యోగులను చంపటానికి పూనుకొన్నారు.
  8. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ లో తీవ్ర భేదాభిప్రాయాలకు దారితీసింది. అతివాదులు, మితవాదులు అను రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు:
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాపత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్ విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.
బహిష్కరణ:

  1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
  2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
  3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
  4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
  5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం. 6) విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
  6. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
  7. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

  1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
  2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
  3. అస్పృశ్యతను నిర్మూలించడం.
  4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
  5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
  6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
ఉద్యమ గమనం 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

  1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
  2. ఉద్యమ కాలంలో హిందూ-మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
  3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
  4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  5. కాంగ్రెస్లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
  6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
  7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో గాంధీజీ నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది. తన నాయకత్వ పటిమతో ఆయన భారత జాతీయ శక్తులను ఏకం చేసి, వాటిని ఒక త్రాటిపై నడిపించిన ఘనుడు. 1919 నుంచి 1947 వరకు గల కాలంలో స్వాతంత్ర్యోద్యమానికి తానే స్ఫూర్తిగా మారిన మహామనిషి, అందువలననే 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీ యుగం” అని పిలుస్తారు.

తొలి జీవితం: గాంధీజీ పూర్తిపేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబరు 2వ తారీఖున సౌరాష్ట్రలోని పోర్బందరులో జన్మించాడు. తన 19వ ఏట ఉన్నత విద్యకై లండన్ వెళ్ళి న్యాయవాద పట్టా పుచ్చుకొని మాతృదేశానికి వచ్చి రాజకోట, బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు.
గాంధీజీ సిద్ధాంతాలు: స్వాతంత్య్ర సముపార్జనకై గాంధీజీ చేపట్టిన రెండు ఆయుధాలలో ఒకటి సత్యాగ్రహం, రెండు అహింస. ‘సత్యాగ్రహం అనగా సత్యమునకు కట్టుబడి ఉండటం అని అర్థం. సత్యాగ్రహము ఐదు విధాలు. అవి:

1) సహాయ నిరాకరణ: శాంతియుత సహాయ నిరాకరణ ద్వారా ఎటువంటి శక్తివంతమైన ప్రభుత్వాన్నైనా పడగొట్టవచ్చు. శాంతియుత ప్రతిఘటన ద్వారా హర్తాళ్ పాటించి, ప్రభుత్వం దమననీతిపై పోరాటం సాగించాలి. మన కోరికలు స్వచ్ఛమైనవిగాను, సమంజసమైనవిగాను ఉండాలి.

2) నిరాహారదీక్ష: ఇతర పద్ధతులు విఫలమైనప్పుడే దీనిని చేపట్టాలి.

3) హిజరత్: హింసాపూరిత వాతావరణంలో ఇమడలేని వ్యక్తులు తమంతట తాముగా ఇతరులకు దూరంగా ఉండాలి.

4) బహిష్కరణ: అన్నిరకాల చెడుకు వ్యతిరేకంగా చేపట్టే నిరాకరణ. ఒక వ్యక్తిని ఆ పనిని చేయకుండా నిరోధించటానికి చేపట్టే శాంతియుత పికెటింగ్. దీనిలో హింసకు తావులేదు.

5) శాసనోల్లంఘనం: ఈ చర్యను చేపట్టే ముందు చర్చలు, ప్రదర్శనలు జరిపి విఫలమైనప్పుడు మాత్రమే శాంతియుత ప్రతిఘటన చేపట్టాలి. ప్రతి చట్టాన్ని ఉల్లంఘించాలి.

అహింస: అహింసా పరమోధర్మః అన్నారు మనవారు. దానినే గాంధీజీ తన ఆయుధంగా స్వీకరించాడు. బౌద్ధ, జైనమతాలు, అశోక చక్రవర్తి ఈ విషయంలో గాంధీజీకి మార్గదర్శకులు. గాంధీజీకి ‘హింస’ అంటే పడదు. మాటల ” ద్వారాగాని, చేత ద్వారాగాని, ఆలోచనల ద్వారా గాని ఎవ్వరికీ హాని కలిగించకూడదన్నది ఆయన సిద్ధాంతం. దీనిలో మూడు రకాల వారున్నారు. మొదటిది అహింసను ఒక సిద్ధాంతంగా నమ్మి ఆచరించే ధైర్యవంతులు, రెండవది అహింసను ఒక విధానంగా చేపట్టేవారు, మూడవది భయస్తులు చేపట్టే అహింసా విధానం. దీనిని గాంధీజీ నిరసించాడు. అవమానాలపాలై, పిరికితనంతో విదేశీ పాలకులకు లొంగి ఉండటం కంటే భారతదేశం తన గౌరవాన్ని తిరిగి పొందటానికి అవసరమైతే ఆయుధాలు చేపట్టవచ్చునని కూడా ఆయన ఉద్బోధించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

దక్షిణాఫ్రికా వెళ్లటం: గాంధీజీ 1893లో ఒక కేసు విచారణ నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లాడు. అచ్చట భారతీయుల దయనీయ పరిస్థితులు చూసి బాధాతప్తుడై వారి హక్కుల పరిరక్షణకై సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమ సాధనాలు ప్రవేశపెట్టి విజయాన్ని సాధించాడు.

భారత రాజకీయాలలో పాల్గొనుట: గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి 1915లో భారతదేశానికి తిరిగివచ్చి సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించాడు. బీహార్లోని చంపారన్ రైతులకు నాయకత్వం వహించి ఆంగ్లో-ఇండియన్ తోట యజమానుల బారినుండి వారిని రక్షించి ప్రఖ్యాతిగాంచాడు. అహ్మదాబాద్ మిల్లు యజమానులబారి నుండి కార్మికులను సంరక్షించి వారి ఉద్యమాన్ని విజయవంతం చేశాడు. గుజరాత్లో కరువు సంభవించినపుడు రైతులను ఋణబాధల నుండి, పన్ను చెల్లింపులనుండి విముక్తి గావించుటకు ‘కైరా’ సత్యాగ్రహాన్ని నిర్వహించి విజయాన్ని సాధించాడు. రౌలట్ శాసనము, జలియన్ వాలాబాగ్ మారణహోమం, గాంధీజీలో నూతన మార్పులు తెచ్చాయి. తిలక్ మరణానంతరం గాంధీజీ జాతీయోద్యమానికి నాయకత్వం వహించి జాతీయోద్యమాన్ని దిగ్విజయంగా నడిపాడు.

జాతీయోద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్ర: గాంధీజీ జాతీయోద్యమ చరిత్రలో నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. జాతీయోద్యమ చరిత్రలో 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీయుగం’ అంటారు.

ఎ) సహాయ నిరాకరణోద్యమం: గాంధీజీ 1920లో జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశంలో శాంతియుత మార్గాల ద్వారా స్వాతంత్య్ర సముపార్జన కాంగ్రెస్ ధ్యేయమని ప్రకటించాడు. దీనిని సాధించటానికి 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం దేశవ్యాప్తమై గాంధీజీ పేరు ప్రఖ్యాతులు పొందాడు. కానీ ఈ ఉద్యమం ‘చౌరీచౌరా’ సంఘటన ద్వారా విప్లవ ధోరణిలో ప్రయాణించుటచేత ప్రజలు శాంతియుత వైఖరికి సుముఖముగా లేరని ఉద్యమాన్ని నిలుపుదల చేసి పలు విమర్శలకు గురైనాడు. గాంధీజీ కారాగార శిక్షను అనుభవించాడు.

బి) శాసనోల్లంఘన ఉద్యమం: సంపూర్ణ స్వరాజ్య సాధనకు గాంధీజీ 1930లో “శాసనోల్లంఘనోద్యమము” ను ప్రారంభించాడు. నాటి ప్రభుత్వం ఉప్పుపై పన్నును విధించగా అది న్యాయసమ్మతం కాదని ఆ చట్టాన్ని ఉల్లంఘించి దండి గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం జరిపి ఉప్పును తయారుచేశాడు. ఇదే జాతీయోద్యమ చరిత్రలో “దండి ఉప్పు సత్యాగ్రహం”గా పేరొందింది.

సి) రౌండేబుల్ సమావేశాలు: గాంధీజీ లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. తదుపరి వైస్రాయ్ ఇర్విన్తో ఒడంబడిక చేసుకొని రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. జిన్నా వైఖరి వల్ల ఈ సమావేశం విఫలమైంది. మూడవ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు.

డి) పూనా ఒడంబడిక: బ్రిటిష్ ప్రధాని ‘మెక్ డోనాల్డ్’ భారతదేశంలో హరిజనులకు, క్రైస్తవులకు నియోజకవర్గ సౌకర్యాలను కల్పిస్తూ “కమ్యూనల్ అవార్డ్”ను ప్రకటించాడు. ఇది జాతీయ సమైక్యతకు హానియని గాంధీజీ బ్రిటిష్ పాలకుల వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. చివరకు నిమ్నజాతుల నాయకుడైన డా. అంబేద్కర్ కృషి వల్ల “పూనా ఒప్పందం” జరిగి గాంధీజీ ఆమరణ నిరాహారదీక్ష విరమించాడు.

ఇ) క్విట్ ఇండియా ఉద్యమం: 1942లో క్రిప్స్ రాయబారాన్ని తోసిపుచ్చి 1942 ఆగస్టు 8వ తారీఖున ఆంగ్లేయులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలని “క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు.

యఫ్) స్వాతంత్ర్య సముపార్జన: గాంధీజీ నడిపిన శాంతియుత ఉద్యమాలను అణచటంలో బ్రిటిష్ పాలకులు వైఫల్యం చెంది 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఈ విధంగా విదేశీయ పాలనలో దాస్యమును అనుభవించిన భారతదేశం గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యము పొందింది.

ప్రశ్న 5.
క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలను, దాని వైఫల్యానికి కారణాలు వివరించండి.
జవాబు:
1941 డిసెంబర్లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. బ్రిటిష్ సామ్రాజ్య భాగాలైన సింగపూర్, బర్మాలను జపాన్ ఆక్రమించినది. జపాన్ సేన పురోగతిని ప్రతిఘటించడానికి భారతీయుల సహకారం అవసరమని బ్రిటిష్ ప్రభుత్వం భావించినది. అందుకుగాను సర్ఫర్డ్ క్రిప్స్న 1942లో భారతదేశం పంపినది. ఆయన భారతీయ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆయన చేసిన ప్రతిపాదనలను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు 2. తక్షణం చేయదగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు.
1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు:

  • యుద్ధానంతరము భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వబడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. భారతదేశానికి కామన్వెల్త్ నుండి వైదొలగే హక్కు కూడా ఉంటుంది.
  • యుద్ధం ముగిసిన తరువాత భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగాన్ని రచించడానికిగాను రాజ్యాంగ పరిషత్ నెలకొల్పబడగలదు.
  • రాజ్యాంగ పరిషత్లో నైష్పత్తిక ప్రాతినిధ్య ప్రాతిపదికపై రాష్ట్ర శాసనసభల సభ్యులచే ఎన్నుకోబడిన సభ్యులు, స్వదేశీ సంస్థానాల జనాభా నిష్పత్తిని బట్టి సంస్థానాధిపతులు నియమించు సభ్యులుండగలరు.

i) కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్ ఏర్పడడానికి హక్కులుండవలెను. స్వదేశీ సంస్థానాలకు కూడా అట్లే నూతన రాజ్యాంగానికి కట్టుబడి ఉండడానికి, లేకపోవటానికి స్వేచ్ఛ ఉండగలదు.

ii) బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయటం వలన ఉత్పన్నమయ్యే విషయాలను చర్చించటానికి రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఒక ఒడంబడిక కుదరవలెను.

2. తక్షణం చేయతగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు: తాత్కాలికంగా “రక్షణ” విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ ఉండగలదు. కాని భారతదేశ నైతిక, సైనిక, భౌతిక వనరులను సమీకరించే బాధ్యత భారత ప్రభుత్వానిదనీ, అందుకు భారత నాయకులు సలహా, సహకారములు అందించగలదని భావించబడినది.

క్రిప్స్ ప్రతిపాదనల మంచి, చెడ్డలు: క్రిప్స్ ప్రతిపాదనలు (1942) భారతదేశంలోని భిన్న రాజకీయ పక్షాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించినట్టివి. ఈ ప్రతిపాదనలు కాంగ్రెస్ డొమినియన్ ప్రతిపత్తి, రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోయే హక్కు మొదలైన ఆశలు చూపెట్టినవి. లీగ్ కోరికయైన పాకిస్తాన్ గుర్తింపు ఈ ప్రతిపాదనలో నిబిడీకృతమై ఉన్న స్వదేశ సంస్థానాధీపతులకు నూతన రాజ్యాంగమును ఆమోదించటానికి లేదా తిరస్కరించడానికి స్వేచ్ఛగలదని ఈ ప్రతిపాదనలో హామీగలదు. అల్పసంఖ్యాకుల భయాలు కూడా అనేక పరిరక్షణల ద్వారా నివృత్తి చేయబడినాయి. ఈ ప్రతిపాదన ఆగస్ట్ ప్రతిపాదనకన్నా మెరుగైనదని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

పూర్తి డొమినియన్ ప్రతిపత్తితో నూతన భారత యూనియన్ ఏర్పాటు చేయబడగలదనటం, కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కుండటం ప్రోత్సాహక విషయాలే కాని కాంగ్రెస్కు పూర్తి స్వాతంత్ర్య ప్రకటన మినహా మిగిలిన విషయాలేవీ సమ్మతం కావు. డొమినియన్ ప్రతిపత్తి ఎంతకాలములోపు ఇవ్వబడగలదో నిర్ధారణ చేయలేదు.

కాంగ్రెస్ కోరికను మన్నించడం కోసం యుద్ధం తరువాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయగలదని ప్రతిపాదన కలదు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణ సంబంధమైన పథకం సవ్యమైనది కాదు. ఉదా: స్వదేశ సంస్థానాల ప్రజలకు రాజ్యాంగ పరిషత్ ప్రతినిధుల ఎంపిక విషయాలలో ప్రమేయం ఉండదు. బ్రిటిష్ రాష్ట్రాల ప్రతినిధులు ఆయా రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికపై నిర్ణయించబడగలదు. పైగా స్వదేశ సంస్థానాధిపతుల ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్లో ఉండటం అనేది భారత ప్రగతికి అవరోధమే.

నూతన రాజ్యాంగం ప్రకారం భారత యూనియన్ నుంచి బ్రిటిష్ రాష్ట్రాలకు, స్వదేశ సంస్థానాలకు విడిపోవటానికి హక్కు ఉండగలదనటం ఈ ప్రతిపాదనలో అతి ప్రమాదకరమైన భాగం. అంటే లీగ్ కోరికయైన పాకిస్తాన్ ఏర్పాటుకు బ్రిటిష్వారు సమ్మతించినట్లు అయినది. ఇది భారత యూనియన్ ఐక్యతకు గొడ్డలిపెట్టుకాగలదు.

వైస్రాయి కార్యనిర్వహణ మండలి సభ్యుల సంఖ్య మరికొందరు భారతీయ ప్రతినిధులతో విస్తృతపరచబడగలదని ఈ ప్రతిపాదనలో కలదు. కార్యనిర్వహణ మండలిగాని, దాని సభ్యులుగాని ఎలాంటి వాస్తవాధికారాన్ని చెలాయించలేరు. అధికారాలన్నీ వైస్రాయి చేతిలోనే కేంద్రీకరించబడగలవు. వివిధ రాజకీయ పక్షాల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావలెనని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే వైస్రాయి ఉండవలెననేది భారతీయల కోరిక. ఇట్టి – పరిస్థితులలో క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఆమోదయోగ్యం కాలేదు.

ప్రతిపాదనల తిరస్కృతి: విభిన్న కారణాలతో దాదాపు భారత రాజకీయ పార్టీలన్నీ ప్రతిపాదనలను తిరస్కరించినాయి. ఈ ప్రతిపాదనలలో భారతదేశ విభజనకు బ్రిటిష్వారు విషబీజాలు నాటారని కాంగ్రెస్ అభిప్రాయపడింది. రక్షణ సమస్య సంబంధంగా క్రిప్స్ కాంగ్రెస్ ఒక అంగీకారానికి రాలేకపోయింది. సంప్రదింపులు విఫలమైనాయి. అత్యవసర పరిస్థితిలో జాతీయ ప్రభుత్వం ఏర్పడవలెనని కాంగ్రెస్ చెప్పినది. రక్షణ విషయాలు కూడా జాతీయ ప్రభుత్వానికి అప్పగించవలెనని కాంగ్రెస్ కోరింది. కాని క్రిప్స్ ఈ కోర్కెలను తిరస్కరించినాడు. భారతీయులకు రక్షణ శాఖను బదిలీ చేయుటకు ఆయన ఇష్టపడలేదు. ‘ఇట్టి ఆపత్సమయములో కూడా బ్రిటిష్వారి మౌలిక వైఖరిలో మార్పులేదని భారతీయులు భావించారు. తత్ఫలితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రిప్స్ ప్రతిపాదనను ఆమోదించలేకపోయింది.

ప్రతిపాదనలలో ఇమిడియున్న పాకిస్తాన్ గుర్తింపును ముస్లింలీగ్ హర్షించినప్పటికీ దాని ఏర్పాటు గూర్చి స్పష్టీకరణ లేకపోయేసరికి విమర్శించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా క్రిప్స్ ప్రతిపాదనపట్ల తమ అసంతృప్తిని వెల్లడించినాయి. క్రిప్స్ ప్రతిపాదనల వైఫల్యమునకు కారణములు:

1) క్రిప్స్ రాయబారం విఫలమగుటకు ప్రధాన కారణం ప్రతిపాదనల అసమగ్రతయే. భారతీయుల దృష్టిలో ఈ ప్రతిపాదనలోని తాత్కాలిక, దీర్ఘకాలిక అంశాలు అసంతృప్తికరమైనవి. దీర్ఘకాలిక అంశమైన డొమినియన్ ప్రతిపత్తి, భారతీయుల ఆసక్తిని ఆకర్షించలేకపోయింది. తాత్కాలిక ప్రతిపాదనలు కూడా అస్పష్టము, అసంతృప్తికరములే. ప్రతిపాదనల ముసాయిదా ప్రకటన కూడా ప్రస్తుతము కన్నా భవిష్యత్తుపై నొక్కి చెప్పినది. అవి మొత్తంగా ఆమోదింపబడటమో, |తిరస్కరించటమో చేయవలెను. సవరణలకు అవకాశం లేదు. ఇన్ని లోపాలు గల ప్రతిపాదనలు సఫలమగుట |అనుమానాస్పదమే. కాంగ్రెస్, లీగ్, సిక్కులు, హిందూ మహాసభవారు ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు.

2) క్రిప్స్ రాయబారం వైఫల్యానికి బ్రిటిష్ అధికారుల స్వార్థం కూడా దోహదపడింది. బ్రిటిష్ మంత్రివర్గం, భారత ప్రభుత్వం భారతీయులకు అధికారాన్ని అప్పగించుటకు ఇష్టపడలేదు. బ్రిటిష్ ప్రధాని చర్చిల్ క్రిప్స్క పూర్తి సహకారాన్ని ఇవ్వలేదు.

3) భారతదేశంలో అప్పుడు అనుకూల వాతారవణం కూడా లేదు. బ్రిటిష్ వారి వైఖరిపట్ల భారతీయులకు విశ్వాసం లేదు.

4) రక్షణశాఖ సమస్య విషయమై క్రిప్స్, కాంగ్రెస్ల మధ్య సంప్రదింపులు విఫలమైనాయి. యుద్ధం కొనసాగినంత కాలం రక్షణశాఖ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండాలని క్రిప్స్ అభిప్రాయం. ఇందుకు జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. ఈ ప్రతిపాదనలను గాంధీజీ మొదటి నుండి వ్యతిరేకించెను. కనుకనే ఆయన ఈ ప్రతిపాదనలను “దివాలా తీయు బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు” అని అభివర్ణించెను. (“A post dated cheque on a withering Bank” -Gandhiji).

ప్రశ్న 6.
శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీసిన కారణాలను, సంఘటనలను పేర్కొనండి.
జవాబు:
గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:
1) మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు) 2) రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు) 3) మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)
మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

  1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
  2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
  3. హిందూ – ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
  4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

  • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
  • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
  • 1930-32 మధ్యకాలంలో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
  • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
    కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:
1) ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్ను చేపట్టడం జరిగింది.

2) బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.

3) బ్రిటిష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.

4) ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

5) కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.

6) బ్రిటిష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి
ఆమోదం తెలిపింది.

7) బ్రిటిష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్లో 1932, నవంబర్ 17 – డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:

  1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
  2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది.
  3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 7.
భారత జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను అంచనా వేయండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్లో పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్కు తీవ్రమైన భేదాభిప్రాయాలు కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోస్ న్ను “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్ లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు, మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్లు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతీయులపై పాశ్చాత్య విద్య ప్రభావం గురించి రాయండి.
జవాబు:
పాశ్చాత్య విద్యావ్యాప్తి ద్వారా భారతీయుల్లో తార్కిక, లౌకిక, ప్రజాస్వామ్య భావాలు పునురుద్ధరింపబడ్డాయి. ఆంగ్ల | బోధన ప్రజల్లో ఏకత్వ భావన కలిగించి, రాజకీయ వికాసానికి తోడ్పడింది. ఆంగ్లవిద్య భారతదేశపు పూర్వ సంస్కృతి, సాహిత్యం, మతం, తాత్వికత, కళ అధ్యయనానికి, పునరుద్ధరణకు తోడ్పడింది. తవ్వకాల ద్వారా బయల్పడిన ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని చూసి భారతీయులు గర్వించారు. ఆంగ్లవిద్య ద్వారా జరిగిన మరో ప్రయోజనం నూతనంగా బ్రిటిష్ ప్రభుత్వరంగాల్లో వచ్చిన ఉద్యోగావకాశాలు. దీంతో పాటు భారతీయ మేధావులు కూడా ఆంగ్లవిద్యను ప్రోత్సహించారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రైస్తవ మిషనరీల ప్రోత్సాహం వల్ల పాశ్చాత్య విద్యనభ్యసించిన విద్యాధికుల సంఖ్య పెరిగింది. మొదటి నుంచి క్రైస్తవ మిషనరీలు విద్యను ప్రోత్సహించాయి. 1717 లో డానిష్ మిషనరీలు మద్రాసులో రెండు ఛారిటీ స్కూళ్ళను తెరిచారు. మద్రాసులోనే కాక అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి స్కూళ్ళను ప్రారంభించారు. కేరీ, మార్మోన్ లాంటి మిషనరీలు 1793వ సంవత్సరంలో వారి కార్యక్రమాలను విస్తృతం చేశారు. బొంబాయిలో విల్సన్ కాలేజి, మద్రాస్ లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. 1853 ఆగ్రాలో సెయింట్ జాన్ కాలేజీ మొదలైంది. మచిలీపట్నం, నాగపూర్లలో మిషనరీ కాలేజీలు స్థాపించబడ్డాయి.

ఆంగ్లవిద్య ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమేకాక, అనేక గ్రంథాలను ప్రాంతీయ భాషల్లో రాయడానికి తోడ్పడింది. దీనివల్ల చదువురాని వారికి కూడా సమాజంలోని దురాచారాల పట్ల అవగాహన కలిగింది. బ్రిటిష్ పాలన దురాగతాలను తెలుసుకొన్న వీరు సంస్కరణావశ్యకతను గుర్తించారు. పాశ్చాత్య మేధావులైన మాకు ముల్లర్, విలియం జోన్స్ వేదాలను, ఉపనిషత్తులను, ఇతర గ్రంథాలను అనువదించారు. వారి పరిశోధనలు భారతదేశ గత చరిత్ర వైభవాన్ని వర్ణించాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 2.
హోం రూల్ ఉద్యమ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
బ్రిటీషు సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే భారతదేశానికి స్వపరిపాలనను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమాన్ని హోంరూల్ ఉద్యమం అంటారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో 1916లో హోం రూల్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి నాయకులు బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు.
బాలగంగాధర్ తిలక్: హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించటానికి తిలక్ 1916 ఏప్రియల్లో బొంబాయిలో ఒక హోం రూల్ లీగ్ను స్థాపించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యభారత్ ప్రాంతాలలో తిలక్ తన ప్రచారాన్ని సాగించాడు. తన “మరాఠా”, “కేసరి” పత్రికల ద్వారా హోం రూల్ భావాన్ని ప్రచారం చేశాడు. తిలక్ హోం రూల్ ఉద్యమ ప్రచారం ప్రజలను చైతన్యవంతుల్ని చేసి, వారిలో స్వీయపాలనాభావాన్ని పటిష్టపరిచింది.

అనిబిసెంట్: హోం రూల్ ఉద్యమం కోసం అనిబిసెంట్ 1916 సెప్టెంబర్ నెలలో మద్రాసులో ఒక హోం రూల్ లీగ్ను స్థాపించింది. మద్రాసు పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని అక్కడ ప్రచారం చేసింది. తన “న్యూ ఇండియా”, “కామన్వీల్” అనే పత్రికల ద్వారా అనిబిసెంట్ తన ప్రచారాన్ని సాగించింది.

హోం రూల్ ఉద్యమ వ్యాప్తి: తిలక్, అనిబిసెంట్ల కృషి వలన హోం రూల్ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఈ ఉద్యమం గురించి ప్రజలకు వివరించడానికి అనేక భాషల్లో అనేక కరపత్రాలను కూడా ప్రచురించారు. హోం రూల్ను సమర్థిస్తూ అనేక నగరాల్లో, గ్రామాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హోం రూల్ ఉద్యమ కాలంలో అనిబిసెంట్ జాతీయవిద్యకు చాలా ప్రాముఖ్యం ఇచ్చింది. విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ఆమె మదనపల్లిలో ఒక కళాశాల నెలకొల్పింది. వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కూడా ఆమె కృషి చేసింది.

ప్రభుత్వ చర్యలు: 1917 నాటికి అనిబిసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెంది, ఆమెను నిర్బంధించింది. ఆమె నిర్బంధాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో సభలు, ప్రదర్శనలు జరిగాయి. తిలక్ దేశ ఉత్తర ప్రాంతాల్లో పర్యటించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. దీనిని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా ఆందోళనకు తలవగ్గి, అనిబిసెంట్ను మద్రాస్ ప్రభుత్వం 1917 సెప్టెంబరు నెలలో విడుదల చేసింది. ఆమె దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారత |జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనిబిసెంట్.

ఉద్యమవ్యాప్తికి కారణాలు’: బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమ నాయకులను నిర్బంధించి ఉద్యమ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. హోం రూల్ ఉద్యమ వ్యాప్తికి కొన్ని కారణాలున్నాయి.
1) 1907 సూరత్ సమావేశంలో చీలిపోయిన కాంగ్రెస్ 1916లో సమైక్యమై సంయుక్తంగా ఉద్యమించింది.

2) బెంగాల్ విభజన రద్దు కావటంతో వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించిన ఉద్యమకారులంతా తమ దృష్టిని హోం రూల్ ఉద్యమంవైపుకు మళ్లించి ఉద్యమానికి బలాన్ని చేకూర్చారు.

3) మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్ ముస్లిం రాజ్యాల యెడల అవలంబించిన వైఖరి భారతదేశంలో ముస్లింలకు కోపాన్ని కలిగించింది. అందువల్ల వారు కాంగ్రెస్ తో 1916లో లక్నో ఒడంబడికను కుదుర్చుకొని స్వీయపాలనోద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యమ ముగింపు: హోం రూల్ ఉద్యమ ఫలితంగా ప్రజలలో నెలకొన్న రాజకీయ చైతన్యాన్ని, బ్రిటీషుపాలన యెడల వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించటానికి 1917 ఆగస్టు 20వ తేదీన భారతరాజ్య వ్యవహారాల మంత్రి మాంటేగ్ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ప్రకారం క్రమక్రమంగా భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పరచబడుతుంది. ఈ ప్రకటన తరువాత బ్రిటీషు ప్రభుత్వం అనిబిసెంట్ను విడుదల చేయగా ఆమె హోం రూల్ ఉద్యమాన్ని నిలిపివేసింది. తిలక్ ఉద్యమాన్ని మరికొన్నాళ్లు కొనసాగించాడు.

ప్రశ్న 3.
జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
1919లో ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో మాంటేగు – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు భారతీయులకు ఎట్టి ప్రత్యేక హక్కులు ఇవ్వకపోగా ముస్లింలతో పాటు సిక్కులకు కూడా ప్రత్యేక స్థానాలు కేటాయించాయి. అందుకు భారతీయులలో అసంతృప్తి ప్రబలింది. ఇదే సమయంలో 1915 1918 కాలంలో చోటు చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలను సమీక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వముచే నియమించబడిన రౌలట్ కమిటీ కొన్ని చర్యలను సూచించింది. ఈ చర్యలన్నీ చట్టరూపం దాల్చాయి. దీనినే రౌలట్ చట్టం అంటారు. ఈ చట్టం వలన ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు సంక్రమించాయి. ఈ చట్టప్రకారం రాజకీయ ఆందోళనకారులను వారంట్ లేకుండా నిర్బంధించవచ్చు. నిర్బంధించిన వారిని విచారించవలసిన పనిలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకమయిన ఏ చిన్న కాగితాన్ని కలిగివున్నా అది నేరంగా పరిగణింపబడుతుంది. ఇంగ్లాండ్లో పౌరుల హక్కులకు పునాది అయిన హెబియస్ కార్పస్ హక్కు భారతీయులకు లేకుండా పోయింది. ఈ బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకించింది. గాంధీజీ ఆ బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ జనరల్ను కోరాడు. కానీ అది ఆమోదించబడింది. కనుక వాటి ఉపసంహరణకు గాంధీజీ ఉద్యమించాడు. 1919 ఏప్రియల్ 6న హర్తాళ్ పాటించవలసిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునందుకొని దేశమంతటా హర్తాళ్ జరిగింది. హిందూ, ముస్లిం భేదం లేకుండా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, పంజాబ్లలో హింసాకాండ జరిగింది. ముఖ్యంగా పంజాబ్లో ప్రజల నాయకులైన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది.

ఈ నిర్భంధానికి వ్యతిరేకంగా అమృత్సర్ ప్రజలు జలియన్ వాలాబాగ్ వద్ద సమావేశమైనారు. సమావేశం సాగుతుండగానే అమృత్సర్ మిలిటరీ కమాండర్ జనరల్ డయ్యర్ అక్కడకు వచ్చి ప్రజలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో 379 మంది మరణించగా, 1200 మంది గాయపడ్డారు. ఈ సంఘటనే చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతంగా ప్రసిద్ధి చెందింది. జలియన్ వాలాబాగ్ సంఘటన భారత స్వాతంత్ర్య సమరంలో ఒక మైలురాయి. ఈ సంఘటన వలన భారత స్వాతంత్ర్యోద్యమం ఒక మహా సంగ్రామంగా మారింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మితవాదులు ఎవరు ?
జవాబు:
జాతీయ కాంగ్రెస్లో తొలి ఇరవై సంవత్సరాల వరకు (1885-1905) ఉన్నత వర్గాలకు చెందిన మితవాదులు ప్రాబల్యం వహించారు. వీరిలో ముఖ్యులు సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్మోహన్ మాలవ్యా, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ ముఖ్యులు. బ్రిటిష్ పాలకులు భారతదేశం పట్ల న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని వారు విశ్వసించారు. ప్రజల కోరికలను మహోజర్లు, సభలు, తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం ద్వారా జాతీయ ప్రగతి సాధించవచ్చునని భావించారు. రాజ్యాంగబద్ధ పోరాటాన్ని వారు చేయడం వల్ల వారిని మితవాదులన్నారు.

ప్రశ్న 2.
ఖేదా సత్యాగ్రహం గురించి రాయండి.
జవాబు:
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో గాంధీజీ పాలుపంచుకొన్నాడు. మిల్లు కార్మికుల వేతనాలను 35 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. చివరకు మిల్లు యజమానులు దిగివచ్చి గాంధీజీ డిమాండ్లకు అంగీకరించారు. అక్కడి నుంచి గాంధీ గుజరాత్లోని ఖేడా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి రైతాంగం దుర్భర పరిస్థితుల్లో ఉంది. పంటల దిగుబడి 25 శాతానికి పడిపోయింది. దాంతో భూమిశిస్తును రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమానికి గాంధీజీ మద్దతు ప్రకటించారు. రైతుల డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గలేదు. వల్లభాయ్ పటేల్, తదితర ఇతర నేతలు గాంధీజీకి జత కలిశారు. చివరకు రైతుల డిమాండు ప్రభుత్వం అంగీకరించింది. సత్యాగ్రహంలో భారతదేశం అద్భుతాలు చేసింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
రౌలట్ సత్యాగ్రహన్ని వివరించండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధానంతరం భారత ప్రజల ఏకాభిప్రాయాన్ని పెడచెవిన పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని 1919 మార్చిలో ఆమోదించింది. గాంధీజీ రాజకీయ జీవితంలో ఈ అణచివేత చట్టం కీలకమైన మార్పును తీసుకువచ్చింది. సత్యాగ్రహం ఆయుధంతో ఆ చట్టాన్ని వ్యతిరేకించాలని గాంధీజీ’ నిర్ణయించాడు. 1919 ఏప్రిల్లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ దేశవ్యాప్త ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు ప్రజలు గొప్పగా స్పందించారు.

ప్రశ్న 4.
సైమన్ కమీషన్ గురించి రాయండి.
జవాబు:
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమీషన్ను నియమించింది. 1927 నవంబర్లో జాన్సైమన్ అధ్యక్షుడిగా ఒక స్థాయీ సంఘాన్ని నియమించింది. అధ్యక్షుడైన సైమన్ పేరు మీద ఆ సంఘానికి సైమన్ కమీషన్ అనే పేరు వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేసేందుకు నియమించిన కమీషన్లో అందరూ ఆంగ్లేయులే ఉండటం, భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆ కమీషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సైమన్ కమీషన్ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదం దేశమంతటా మార్మోగింది. అయినప్పటికీ సైమన్ కమీషన్ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

Leave a Comment