Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు Textbook Questions and Answers.
AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో సాంఘిక, వర్గ విభేదాలను, సాంఘిక పురోగతిని వర్ణించండి.
జవాబు:
సమాజాలు: క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుష సూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది.
పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు చెప్పబడింది.
బ్రాహ్మణులు – తల నుంచి
క్షత్రియులు – దేహం నుంచి
వైశ్యులు – తొడల నుంచి
శూద్రులు – పాదాల నుంచి ఏర్పడ్డారని పేర్కొంది
వర్ణధర్మాన్ని ప్రజలు ఉల్లంఘించడంతో ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలను తయారుచేశారు. వీటన్నింటివల్ల దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం అనేది రాజు కర్తవ్యంగా మారింది. ఫలితంగా రాజుకు న్యాయాధికారాలు లభించాయి. నాడు నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నత వర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు.
రక్త సంబంధం వివాహాలు: రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ కుటుంబీకుల సంబంధాలను తెలుసుకోవడం కష్టం.
ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలో ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.
సామాజిక విభేదాలు: ధర్మశాస్త్రాలు, ‘వర్ణధర్మాలు’, ‘వృత్తిధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. మనదేశంలో ఈ కాలంలోనే న్యాయవ్యవస్థ ఏర్పడింది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి: ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం, కంటికి కన్ను, పంటికి పన్నుగా ఉండేవి. శూద్రులు, ద్విజులకు బానిసలుగా, వ్యవసాయ కూలీలుగా ఉండటం వల్ల వారిని తాకడం, స్నేహం చేయడం, వివాహాలు చేసుకోవడం నిషేధంగా ఉండేది.
వర్ణ తారతమ్యాలు: ఈ క్రింది పట్టిక పని విభజనను తెలుపుతుంది.
1. బ్రాహ్మణులు – 1. వేదాల అధ్యయనం, బోధన, యజ్ఞ యాగాదులు చేయటం, బహుమతుల స్వీకరణ.
2. క్షత్రియులు – 2. యుద్ధాలు చేస్తూ ప్రజలను రక్షించడం పరిపాటి.
3. వైశ్యులు – 3. వేదాధ్యయనం, యజ్ఞయాగాదుల నిర్వహణ, వ్యవసాయ వ్యాపారాల నిర్వహణ.
4. శూద్రులు – 4. పై మూడు వర్ణాల వారికి సేవలు, వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణ.
సామాజిక పురోగతి: వర్ణాలు నాలుగుగా విభజింపబడినట్లు పై పట్టిక తెలియజేస్తుంది. అయితే సమాజ పురోగతిలో జాతులు కూడా కలిసిపోయాయి. ఇతర గ్రంథాల్లో జాతులను కూడా వర్ణాలుగా పేర్కొనడమైంది. వర్ణాలు నాలుగుగా విభజింపబడగా, జాతులకు నిర్దిష్ట సంఖ్య లేదు. జాతులను వర్ణాలుగా బ్రాహ్మణులు ఒప్పుకునేవారు కాదు. ఉదా: బంగారుపని చేసే కొందరు నిషాధుల్ని ‘స్వర్ణకారు’ అనడానికి బ్రాహ్మణులు ఒప్పుకొనేవారు కాదు. అందువల్ల ‘జాతులు ‘శ్రేణులుగా’ ఏర్పడి అన్ని వృత్తులు నిర్వహించేవారు. శూద్రులు ఈ కాలానికి సేవకుల స్థాయి నుంచి వ్యవసాయదారులుగా పురోగమించారు.
సమాజంలో స్త్రీల పరిస్థితి: మనుస్మృతి, ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలకు ఆస్తిలో భాగం లేదు. వివాహ సందర్భంలో స్త్రీలకు ఇచ్చే కానుకలను వారు స్త్రీ ధనంగా పొందవచ్చు. ఈ ధనంపై స్త్రీకి పూర్తి హక్కులు ఉంటాయి. దీనిపై భర్తకు హక్కు లేదు. మనుస్మృతి భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఆస్తి కలిగి ఉండటం నేరంగా పేర్కొంది.
స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ‘ఎక్సోగమి’ అంటారు. తండ్రి ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి సరైన సమయంలో వివాహం చేసేవారు. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల దూర ప్రాంతాలలో ఏర్పడిన వర్తక సంబంధాల వల్ల సంప్రదాయాలు, విశ్వాసాలు, విమర్శలకు దారితీయడంతో బ్రాహ్మణులు క్రీ.పూ. 600వ సం||లో వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చారు.
ప్రశ్న 2.
బ్రాహ్మణ మతంలోని గోత్రం, రక్త సంబంధం, వివాహ పద్ధతులను చర్చించండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుషసూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతవర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు. క్రీ.పూ. 1000వ సం॥లో బ్రాహ్మణులు రూపొందించిన మరొక సామాజిక విధానం గోత్రం.
గోత్రం: గోత్రం అనే పద్ధతి బ్రాహ్మణులతో ప్రారంభమై, బ్రాహ్మణ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉంది. అసలు ‘గోత్రం’ అనే పదానికి అర్థం ‘ఆవులకు సంబంధించినది’. బహుశా ఆవులను బట్టి ఆ సమూహ బ్రాహ్మణులు ఆయా గోత్రాలను పెట్టుకొని ఉండవచ్చు. ఆ తరువాత కాలంలో గోత్రం సమూహ పెద్ద పేరుతో కొనసాగింది. చాలాకాలం తరువాత ఏడుమంది ఋషుల పేర్లతో గోత్రనామాలు ఏర్పడినట్లు గృహ్య సూత్రాలు పేర్కొంటున్నాయి. సగోత్రీకులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది.
రక్త సంబంధం: కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ, కుటుంబీకుల మధ్య సంబంధాలను తెలుసుకోవడం కష్టం. సంస్కృత గ్రంథాల ప్రకారం ‘కులం’ కుటుంబాలకు గుర్తింపును ఇస్తుంది. వంశం అనేది వారి ‘పుట్టుకను’ తెలియజేస్తుంది.
వివాహాలు: ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు. ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలోనే ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.
వివాహ రీతులు:
- ఎండోగమి – అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం.
- ఎక్సోగమి – ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం.
- పోలోగమి – బహుభార్యత్వ
- పోలయాండ్రి – బహు భర్తృత్వం
మొదలగు వివాహ రీతులు 6వ శతాబ్దంలో అమలులో ఉండేవి.
ప్రశ్న 3.
జైనమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
జైనమతం, బౌద్ధమతం కంటే ప్రాచీనమైనది. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వారు 24 మంది. వారిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ వాడైన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆ మతాన్ని సంస్కరించి చక్కని రూపాన్ని అందించినవాడని జైనుల విశ్వాసం.
వర్ధమాన మహావీరుడు: వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకరుడు. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. అతడు క్రీ.పూ. 540వ సంవత్సరంలో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో సిద్ధార్థుడు, త్రిశలకు జన్మించాడు. ఇతని భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని. వర్ధమానుడు 30 ఏళ్ళు నిండకముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటి నుంచి నిష్క్రమించి, సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. పరిపూర్ణ జ్ఞానము పొందిన పిమ్మట ‘జినుడు’ అని, ధైర్యసాహసములతో తపస్సు సాగించుటచేత “మహావీరుడని”, మహాజ్ఞాని అయినందువల్ల “కేవలుడు” అని సమస్త భవబంధములను తెంచుకొనుటచే ‘నిగ్రంథుడ’ని పిలువబడ్డాడు. మహావీరుడని “జినుడు” (జయించినవాడు) అను బిరుదు నుంచి ఈ మతానికి జైనమతమనే పేరు వచ్చింది. మానవుల మోక్షసాధన కోసం మహావీరుడు పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖన వ్రతమును బోధించాడు. వీటిని ఆచరించుట ద్వారా మానవులు మోక్షము లేదా కేవలావస్థను పొందగలరని బోధించాడు. తన సందేశాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూ మహావీరుడు తన 72వ ఏట పావా అనే నగరములో హస్తిపాలుడనే రాజు గృహములో క్రీ.పూ. 468లో మరణించాడు.
మహావీరుని బోధనలు:
1) పంచవ్రతాలు: జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నాలుగు సూత్రములను బోధించాడు. అవి: ఎ) జీవహింస చేయరాదు. బి) అసత్యమాడరాదు. సి) దొంగతనము చేయరాదు. డి) ఆస్తిపాస్తులు వుండరాదు. ఈ నాలుగు సూత్రాలకు లేక వ్రతాలకు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యము అనే ఐదవ సూత్రాన్ని జోడించాడు. ఈ ఐదు సూత్రాలను పంచవ్రతాలు లేక పంచకళ్యాణాలు అంటారు.
2) త్రిరత్నాలు: పంచవ్రతాలతోపాటు త్రిరత్నాలను కూడా మోక్ష సాధనకోసం పాటించాలని మహావీరుడు ప్రబోధించాడు. అవి: ఎ) సమ్యక్ దర్శనం లేక సరియైన విశ్వాసం. బి) సమ్యక్ జ్ఞానం లేక సరియైన జ్ఞానం. సి) సమ్యక్ చరిత్ర లేక సరియైన క్రియ. తీర్థంకరుల బోధనలకై శ్రద్ధను కలిగివుండటమే సమ్యక్ దర్శనము. వాటిలో సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. వీటిని అనుసరించుట ద్వారా దుఃఖలేశం లేని మోక్షం లేదా కైవలావస్థను మానవుడు పొందగలుగుతాడు.
3) సల్లేఖనా వ్రతం: పార్శ్వనాథుడు చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని బోధించాడు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని తపస్సు మాత్రమే కర్మ బంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక బంధాల నుంచి, కర్మ నుంచి విముక్తిని సాధించటమే మోక్షమని ఆయన ప్రవచించాడు. కర్మచేయటం ద్వారా కర్మఫలాన్ని అనుభవించటం కోసం పునర్జన్మను ఎత్తవలసి వస్తుందని, కనుక కర్మను నాశనం చేయటం ద్వారానే మోక్షప్రాప్తిని పొందగలమని ఆయన బోధించాడు. కనుక ఉపవాసములచేత శరీరమును శుష్కింపచేసుకొని ప్రాణత్యాగము చేయటం ద్వారా కర్మను అణచివేయవచ్చునని ఆయన బోధించాడు. ఈ ప్రక్రియనే “సల్లేఖనా వ్రతము” అంటారు.
4) కైవల్యం: జైనమతం యొక్క అంతిమ లక్ష్యం కైవల్యం లేక మోక్షము. పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖనా వ్రతమును ఆచరించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఆయన ప్రవచించాడు. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయినదే మోక్షము. దీనినే కైవల్యావస్థ అంటారు. కైవల్యావస్థ పొందుట ద్వారా మానవుడు కర్మ, పునర్జన్మ వలయము నుండి శాశ్వత విముక్తిని పొందగలుగుతాడు.
5) ఇతర సూత్రాలు: జైనమతం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేవుడున్నాడా లేదా అనే విషయానికి ఈ మతంలో ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై ఆధారపడివుంది. వర్థమాన మహావీరుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన వర్ణవ్యవస్థను వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్నిబట్టి మానవుడు అగ్ర లేక అధమ వర్ణాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం జంతు బలులను, బ్రాహ్మణ ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను నిరసించినది.
జైనమత వ్యాప్తి: జైనమత ప్రచారం కోసం మహావీరుడు జైన సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ, పురుషులిద్దరు ఈ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘాలలో జైన భిక్షువులే కాక, తమ మత సూత్రాల ప్రకారం జీవితం గడుపుతూ విరాళాలు, కానుకల ద్వారా ఆ సంస్థలను పోషించే ఉపాసకులు కూడా వుండేవారు. మహావీరుడు సంవత్సరంలో నెలలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేసేవాడు. జైనమతానికి రాజాదరణ కూడా లభించింది. మగధ పాలకులైన హర్యంక, నందవంశ రాజులు, చంద్రగుప్త మౌర్యుడు, కడపటి మౌర్యరాజైన సంప్రతి జైనమతాన్ని పోషించారు. భారతదేశంలో జైనమతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో బాగా ప్రచారంలో వుంది.
ప్రశ్న 4.
బౌద్ధమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
క్రీ.పూ. భారతదేశంలో జనించిన అనేక మతాలలో బౌద్ధమతం ఒకటి. దీని స్థాపకుడు గౌతమబుద్ధుడు. గౌతమబుద్ధుని జీవితం: గౌతమబుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు క్రీ.పూ. 563వ సం||లో ‘శాక్య’ వంశమునకు చెందిన శుద్దోధనుడు, మాయాదేవీలకు లుంబినీవనమున జన్మించాడు. చిన్నతనమునే తల్లిని కోల్పోయి సవతి తల్లి ప్రజాపతి గౌతమిచే పెంచబడి ‘గౌతముడు’ అని పిలువబడ్డాడు. ఇతనికి ‘యశోధర’ అను రాకుమార్తెతో వివాహం జరిగింది. వారి కుమారుడు ‘రాహులుడు’.
మహా పరిత్యాగము: సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక ముదుసలిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూచి వైరాగ్యానికి లోనై సకల సంపదలను, భోగభాగ్యాలను, భార్యాబిడ్డలను వదిలి ఇల్లు విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనతో అతని మనస్సు వికలమైంది. ప్రపంచమంతా దుఃఖమయమని, జీవితము అశాశ్వతమని గ్రహించి బవబంధములను తెంచుకొని అడవులకు వెళ్ళి సన్యసించాడు. ఈ సంఘటననే ‘మహా పరిత్యాగము’ లేక ‘మహాభినిష్క్రమణము’ అంటారు.
జ్ఞానోదయమును పొందుట సన్యసించిన పిమ్మట సిద్ధార్థుడు సత్యాన్వేషణకై గయను చేరి అచ్చట ఒక అశ్వత్థ వృక్షము క్రింద 40 రోజులు ధ్యానము చేసి జ్ఞానమును పొందాడు. ఈ సంఘటనకే సంబోధి అని పేరు. అప్పటి నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడినాడు. బుద్ధుడు అనగా జ్ఞానము పొందినవాడు అని అర్ధము. బుద్ధుని శాక్యముని అని, తథాగతుడు అని పిలుస్తారు. నాటి నుండి అశ్వత్థ వృక్షము బోధి వృక్షముగాను, గయ బుద్ధగయగాను ప్రసిద్ధి చెందాయి.
ధర్మచక్ర ప్రవర్తనము: బుద్ధుడు గయ నుండి సారనాథ్ చేరి సమీపమున గల జింకల తోటలో తన పూర్వ సహవాసులైన బ్రాహ్మణులకు మొదటిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సంఘటననే ధర్మచక్ర ప్రవర్తనము అంటారు. అప్పటి నుండి అనేక సంవత్సరములు బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేశాడు. తన శిష్యులలో ప్రముఖులైన వారిని సంఘంలో ఏర్పరచాడు.
నిర్వాణం: విస్తృతంగా బౌద్ధమతాన్ని ఉత్తరాపథమంతటా ప్రచారం చేసి బుద్ధుడు తన 80వ ఏట మల్ల రాజధానియైన కుశి నగరమున క్రీ.పూ. 483లో నిర్వాణం పొందాడు.
బుద్ధుని బోధనలు: బుద్ధుని బోధనల ప్రకారం మానవ జీవితం కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నది. మానవుడు చేసిన కర్మఫలము వలననే ఈ శరీరము మరల మరల జన్మనెత్తవలసి వస్తున్నది. కర్మ ఆచరణకు కోర్కెలే మూలము. అజ్ఞానము వలన కోర్కెలు జనించుచున్నాయి. కోర్కెల వలన మానవుడు కర్మలు ఆచరిస్తాడు. ఈ కర్మ ఫలితమే పునర్జన్మ. పునర్జన్మలేని సుఖమైన, ప్రశాంతమైన జీవనమే నిర్వాణము అని బుద్ధుడు బోధించాడు. నిర్వాణ సాధనకు మానవుడు ఆర్య సత్యములను గ్రహించి అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని పాటించవలెను.
ఆర్య సత్యములు: గౌతమ బుద్ధుడు తన దివ్య పరిజ్ఞానము వలన నాలుగు ప్రధానమైన సత్యములను గ్రహించాడు. వీటినే ఆర్య సత్యములు అంటారు. అవి:
- ప్రపంచమంతా దుఃఖమయము.
- దుఃఖమునకు కారణము కోర్కెలు.
- దుఃఖమును అంతము చేయుటకు కోర్కెలను నిరోధించవలెను.
- కోర్కెలను నిరోధించుటకు అష్టాంగమార్గమును అవలంబించవలెను.
అష్టాంగ మార్గము: నిర్వాణమును పొందుటకు మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గమును అనుసరించిన చాలని బుద్ధుడు బోధించాడు. అవి: 1) సరియైన విశ్వాసము 2) సరియైన జ్ఞానము 3) సరియైన వాక్కు 4) సరియైన క్రియ 5) సరియైన జీవనము 6) సరియైన ప్రయత్నం 7) సరియైన ఆలోచన 8) సరియైన ధ్యానము. అష్టాంగ మార్గము ద్వారా ప్రతి వ్యక్తీ శీలసంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గము అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.
దశసూత్ర నీతి: ఆర్యసత్యములు, అష్టాంగ మార్గములతోపాటు బుద్ధుడు పది అంశములు గల దశసూత్ర నీతిని ప్రబోధించాడు. ఈ సూత్రాలు:
- జీవహింస చేయరాదు
- అసత్యమాడరాదు.
- దొంగతనము చేయరాదు.
- ఆస్తిపాస్తులు సమకూర్చుకొనరాదు.
- బ్రహ్మచర్యను పాటించవలెను.
- మత్తు పదార్దములు సేవించరాదు.
- పరుష వాక్యములు వాడరాదు.
- ఇతరుల ఆస్తులను కోరరాదు.
- అవినీతి పనులు చేయరాదు.
- విలాసాలను విడనాడాలి.
నిర్వాణము: ఆర్యసత్యములను గ్రహించి, అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని ఆదరించటం వలన మానవుడు మోక్షమును పొందుటకు అర్హుడవుతాడు. మోక్షమనగా పునర్జన్మలేని జన్మరాహిత్యము. దీనినే బుద్ధుడు నిర్వాణంగా పేర్కొన్నాడు. నిర్వాణ సాధనే ప్రతి వ్యక్తి ధ్యేయం కావలెను అని బుద్ధుడు బోధించాడు.
బౌద్ధమతతత్వం: బుద్ధుడు భగవంతుని ఉనికిని గురించి, ఆత్మను గురించి మౌనం వహించాడు. హిందూమతమందలి కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను అంగీకరించాడు. మహావీరుని వలె బుద్ధుడు కూడా యజ్ఞయాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణుల ఆధికత్యను ఖండించాడు. వేదములను ప్రామాణిక గ్రంథములుగా బుద్ధుడు అంగీకరించాడు.
ముగింపు: ప్రపంచమునకు శాంతి సందేశమునందించుటకు అవతరించిన మహాపురుషులలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. కామ, క్రోధములతో, హింసాత్మక చర్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవకోటిని ధర్మం, అహింస, కరుణ, మానవత అనే మహోన్నత ఆశయాలతో తీర్చిదిద్దుటకు అవతరించిన పుణ్య పురుషుడు. అందువల్లనే ఆసియా జ్యోతియని, ప్రపంచ జ్యోతియని శ్లాఘించబడ్డాడు.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వర్ణ వ్యవస్థ సమాజం
జవాబు:
ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు ‘వర్ణధర్మాలు’ ‘వృత్తి ధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి. ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం.
ప్రశ్న 2.
జాతి అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి. ఒక రాజ్యంలో నివసించే ప్రజలందరూ ఒకే ఉమ్మడి రక్త సంబంధం, పుట్టుకలకు సంబంధించినవారు కాకపోవచ్చు. అయినప్పటికీ పరస్పర గౌరవంతో కూడిన జాతులుగా మెలుగుతున్నాయని చెప్పవచ్చును.
ప్రశ్న 3.
రక్త సంబంధం
జవాబు:
కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు.
ప్రశ్న 4.
త్రిరత్నాలు
జవాబు:
జైనమత సూత్రాలను త్రిరత్నాలు అని అంటారు. అవి:
- సరైన నమ్మకం
- సరైన జ్ఞానం
- సరైన శీలం.
ప్రశ్న 5.
బౌద్దమత సూత్రాలు
జవాబు:
బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను ప్రబోధించాడు. అవి:
- ప్రపంచం దుఃఖమయం.
- దుఃఖానికి కోరికలు కారణం.
- కోరికలను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది.
- దానికి మార్గం ఉన్నది. అదే అష్టాంగ మార్గం.
ప్రశ్న 6.
అజవికులు
జవాబు:
అజవికుల ప్రచారకుడు మక్కలి గోసలి. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలకు ఎక్కువగా చేరలేదు. ఏదీ మానవుడి చేతిలో లేదు. జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని ఈ బాబావారి నమ్మకం. ఈ అజవికులు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు.
ప్రశ్న 7.
తీర్థంకరులు
జవాబు:
జైనమతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు కలరు. వీరిలో మొదటివాడు వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. తీర్థంకరులు అనగా ‘మత గురువులు’ లేదా జీవనస్రవంతిని దాటుటకు మార్గాన్ని చూపించేవారని అర్థం.
ప్రశ్న 8.
బహుభార్యత్వం
జవాబు:
బహు భార్యత్వం అనగా ఒక వ్యక్తి ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకొనుట. దీనినే ‘పోలోగమి’ అని కూడా అంటారు. పూర్వం ఋగ్వేద, మలివేద కాలంలో రాజులలో ఈ పద్ధతి ఉండేది.
ప్రశ్న 9.
ఎక్సోగమి
జవాబు:
స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగమి అని అంటారు. తండ్రి. ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి, సరైన సమయంలో వివాహం చేసేవారు.