Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 3rd Lesson తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి Textbook Questions and Answers.
AP Inter 1st Year History Study Material 3rd Lesson తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మగధ రాజ్య విజృంభణకు దారితీసిన కారణాలను తెలపండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో షోడశ మహాజనపదాలనబడే 16 రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో మగధ రాజ్యం ఒకటి. మగధ రాజ్యం క్రమంగా శక్తివంతంగా రూపొంది విజృంభించింది.
మగధ సామ్రాజ్య ఆవిర్భావానికి కారణాలు: క్రీ.పూ. 6వ శతాబ్దంలో గంగా, యమున మైదాన ప్రాంతంలో 16 జనపదాలు వెలిశాయి. ఈ మహాజనపదాల మధ్య ఆధిపత్యం కోసం నిరంతరం సంఘర్షణలు జరుగుతుండేవి. సార్వభౌమాధికారాన్ని పొందాలనే తలంపుతో ప్రతి జనపదం కూడా సమర్థవంతమైన సైనిక వ్యవస్థను పోషించింది. ఈ రాజకీయ, సైనిక ప్రయోజనాల వెనుక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం వాయువ్య దిశ నుంచి వచ్చే విదేశీ దాడుల ప్రమాదానికి దూరంగా ఉంది. గంగానది, దాని ఉపనదులతో ఈ ప్రాంతం ఐశ్వర్యవంతమైంది. రాజకీయాధిక్యత కోసం కాశీ, కోసల, మగధ, వజ్జి రాజ్యాలు పోటీపడ్డాయి. వాటిలో మగధ విజృంభించి ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో ప్రప్రథమ రాజ్యంగా వెలిసింది.
మగధ రాజ్య విజృంభణకు అనేక పరిస్థితులు దోహదపడ్డాయి.
- మగధలో ప్రకృతిసిద్ధమైన అనేక వనరులున్నాయి. గంగానది, దాని ఉపనదులైన శోణ్, గండక్, గోగ్రా నదులు మగధకు సహజ రక్షణను, రాకపోకల సౌకర్యాలను సమకూర్చాయి.
- ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజగనులు అందుబాటులో ఉన్నందువల్ల మగధ ఆయుధ నిర్మాణంలో ముందంజ వేసింది.
- మధ్యగంగా మైదాన ప్రాంత మధ్యభాగంలో ఉన్నందువల్ల ఆ రాజ్యం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందింది.
- ఈ ప్రాంతంలో ఏనుగులు అధిక సంఖ్యలో ఉండేవి. మగధ పెద్ద ఎత్తున ఏనుగులను సమీకరించి యుద్ధ వ్యూహంలో ముందున్నది.
- మగధకు రాజధాని నగరాలైన గిరివ్రజం, పాటలీపుత్రం రాజ్యానికి ప్రకృతిసిద్ధమైన రక్షణను కల్పించాయి.
- ఈ ప్రాంతం తరచుగా విదేశీ దండయాత్రలకు గురయ్యే వాయువ్య ప్రాంతానికి దూరంగా ఉన్నందువల్ల దండయాత్రల బెడద లేదు.
- పైగా కొత్తగా ఆర్య సంస్కృతి ప్రభావం కిందికి వచ్చిన మగధ ప్రజల్లో ఇతరుల కంటే సామ్రాజ్య విస్తరణ కాంక్ష అధికంగా ఉండేది. ఈ విధమైన కారణాలు ఉన్నందువల్లనే మగధ ఒక సామ్రాజ్యంగా రూపొందింది.
- మగధను పాలించిన రాజవంశాలు మగధ రాజ్య విజృంభణకు దోహదపడ్డాయి.
ప్రశ్న 2.
క్రీ.పూ. 6వ శతాబ్దంనాటి గ్రామీణ జీవనం గురించి తెలపండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి పశుపోషణ స్థానంలో వ్యవసాయం చేరింది. గ్రామాల్లో ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి జీవించారు. ఆనాటి గ్రామాల్లో పంట భూములు కుటుంబ పెద్దల ఆధ్వర్యంలో ఉండేవి. విస్తారమైన భూములు అరుదుగా ఉండేవి. పశువులను కాపర్లు పచ్చిక బయళ్ళలో మేతకు తీసుకొని వెళ్ళేవారు. విస్తారమైన భూముల్లో కూలీలను, బానిసలను ఉపయోగించేవారు.
గ్రామ ప్రజలే గ్రామంలోని వ్యవసాయ పనులు, రహదారులు, భవనాలు, చెరువులు, నీటి పారుదల సౌకర్యాలను ఏర్పాటుచేసుకొనేవారు. గ్రామప్రజలందరు తమ పంటలకు సమీపప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. వీటికి కేంద్రంగా పట్టణం ఉండేది. గ్రామమే సామాజిక, ఆర్థిక వ్యవస్థకు మూలం. నాడు మూడు రకాల గ్రామాలు ఉండేవి. అవి:
- భోజక
- పట్టణ గ్రామాలు
- సరిహద్దు గ్రామాలు.
కొన్ని అటవీ ప్రాంత గ్రామాల పరిసరాలు చుట్టూ పచ్చిక బయళ్ళు బీడు భూములు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది. శూద్రులు అటవీ ప్రాంతాలను చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చుకునేవారు. శూద్రులు ఎక్కువగా వ్యవసాయ కూలీలుగా ఉండడంవల్ల సమాజంలో వారి స్థాయి తక్కువగా ఉండేది. శూద్రుల కంటే కింది స్థాయిలో అంటరానివారిగా పరిగణింపబడే వర్గం ఉండేది. వీరు వేట జంతు చర్మాలతో వస్త్రాలు మొదలైన పనులు చేయడంవల్ల వీరిని తక్కువస్థాయి వారిగా చూసేవారు.
నాడు అనేక చేతివృత్తులు అభివృద్ధి చెందాయి. ఎక్కువ మంది వీటి మీద ఆధారపడి పనిచేసేవారు. ఆ కాలంలో దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. నాడు దాదాపు 18 ముఖ్యమైన వృత్తులవారు ‘శ్రేణులు’గా ఏర్పడ్డారు. ఈ శ్రేణులు నిర్ణయించిన విధి విధానాలను సభ్యులు అంగీకరించాలి.
చేతి వృత్తులతో ఉత్పత్తి అయిన వస్తువులను దూర ప్రాంతాలకు వర్తకులు తీసుకొని వెళ్ళేవారు. 500 ఎడ్లబండ్ల మీద వస్తు రవాణా జరిగినట్లు తెలుస్తున్నది. వస్త్రాలు, దంతపు వస్తువులు, మట్టిపాత్రలు రవాణా అయ్యేవి. వర్తక పట్టణాలన్నీ నదీ తీరాలలో ఉండేవి. ఈ వ్యాపారాభివృద్ధికి నాణాలు వాడినారు. ‘శతమాన’ ‘నిష్క’ మొదలైన నాణాలు
వేదకాలం నుంచి ఉండేవి.
ప్రశ్న 3.
మగధను పాలించిన వివిధ రాజులు ఏ విధంగా రాజ్య విస్తరణ కావించారో తెలపండి.
జవాబు:
మగధ రాజ్య ఆవిర్భావము: మగధ రాజ్య చరిత్రను తెలుసుకోవటానికి పురాణాలు, జైన, బౌద్ధ, వాఙ్మయము, గ్రీక్ రచనలు ఉపకరిస్తున్నాయి. ఇతిహాస యుగంలో మగధను బృహద్రధ రాజవంశం పాలించింది. ఈ వంశానికి చెందిన రాజుల్లో జరాసంధుడు కడు సమర్థుడు. అతని రాజధాని గిరివ్రజము. ఈ వంశంలో చివరి రాజైన రిపుంజయుని హర్యంక వంశస్థులు ఓడించి తమ వంశ పాలనను ప్రారంభించారు.
హర్యంక వంశం (క్రీ.పూ. 544 – 413): మగధ రాజ్య విజృంభణకు పునాదులు వేసింది హర్యంక వంశం. ఈ వంశ స్థాపకుడైన బింబిసారుడు (క్రీ.పూ. 544 – 493) బుద్ధునికి సమకాలికుడు. అతడు కోసల, లిచ్ఛవి, మద్ర, విదేహ రాజకన్యలను వివాహం చేసుకొని, వారి మైత్రితో హర్యంకుల బలాన్ని పెంచాడు. కోసల రాజకుమారిని పెళ్ళాడి సంవత్సరానికి లక్ష సువర్ణాల ఆదాయాన్నిచ్చే కాశీ నగరాన్ని కట్నంగా పొందాడు. అంగరాజును జయించి ఆ రాజ్యాన్ని వశపరచుకొన్నాడు. రాజ్య విస్తరణతోపాటు అతనికి ఆర్థికబలం కూడా సమకూరింది. బింబిసారుని తరువాత అతని కుమారుడు అజాత శత్రువు (క్రీ.పూ. 493 462) రాజ్యానికి వచ్చాడు. అతడు తన 30 సంవత్సరాల పాలనా కాలంలో తన తండ్రి విధానాలను అనుసరిస్తూ మగధ సామ్రాజ్య ఔన్నత్యాన్ని ఇనుమడింపచేశాడు. కోసల, కాశీ రాజులను జయించి వారి రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. వజ్జి గణరాజ్యంలో 16 సంవత్సరాలు దీర్ఘకాలిక పోరాటం చేసి విజయాన్ని సాధించాడు. అవంతి, వత్స, సౌరవి రాకుమార్తెలను పెళ్ళిచేసుకొని ఆ రాజ్యాలమైత్రిని, అండదండలను పొందాడు. పాటలీగ్రామ జలదుర్గాన్ని నిర్మించాడు.
అజాత శత్రు మరణానంతరం రాజ్యానికి వచ్చిన ఉదయనుడు (క్రీ.పూ. 461-444) మగధ రాజధానిని పాటలీపుత్రానికి మార్చాడు. ఇతని తరువాత పాలించిన నలుగురు పాలకులు పితృహంతకులు కావటంతో విసుగు చెందిన ప్రజలు చివరి రాజైన నగదాసకుడ్ని పదవీచ్యుతుడ్ని చేసి, అతని మంత్రియైన శిశునాగుడ్ని రాజుగా చేశారు. దీనితో హర్యంక వంశం అంతరించింది.
శైశునాగవంశం: శిశునాగుడు ఈ శైశునాగ వంశస్థాపకుడు. ఇతడు రాజధానిని పాటలీపుత్రం నుండి రాజగృహానికి మార్చాడు. అవంతి, వత్స రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలిపాడు. ఇతని తరువాత రాజ్యానికి వచ్చిన ఇతని కుమారుడు కాలాశోకుని కాలంలో 2వ బౌద్ధ సంగీతి జరిగింది. కాలాశోకుడిని, అతని 10 మంది కుమారులను చంపి నంద వంశస్థుడైన మహాపద్మనందుడు మగధను ఆక్రమించాడు.
నంద వంశం: నంద వంశ స్థాపకుడు మహాపద్మనందుడు. గ్రీకు రచనల వలన మహాపద్మనందుని తండ్రి శూద్రుడని తెలుస్తున్నది. మహాపద్మనందుడు కాశీ, మిథిల, కళింగ వంటి అనేక రాజ్యాలను ఆక్రమించినట్లు తెలుస్తున్నది. అతడు మహాక్షత్రాంతక అనే బిరుదు పొందాడు. మహాపద్మనందుడి పాలన నుండి చివరి నందరాజు వరకు గల నందుల చరిత్ర తెలియరాదు. అయితే ఈ రాజులను నవనందులు అని వ్యవహరిస్తున్నారు. నందులలో చివరివాడైన ధననందుడు అధిక పన్నుల భారంతో, నిరంకుశ పాలనతో ప్రజలను పీడించాడు. దానితో విసుగు చెందిన ప్రజలకు చంద్రగుప్తు మౌర్యుడు నాయకత్వం వహించాడు. చంద్రగుప్తుడు చాణుక్యుని సాయంతో నంద వంశాన్ని నిర్మూలించి మగధలో మౌర్యవంశాన్ని స్థాపించాడు.
మగధ చరిత్రలో నందులకు విశిష్ట స్థానం ఉంది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించగలిగిన వంశం ప్రాచీన మగధ చరిత్రలో మరొకటి లేదు. శక్తివంతమైనదిగా ఖ్యాతిగాంచిన నంద వంశ సామ్రాజ్యాన్ని కబళించటానికి, ప్రపంచ విజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ కూడా సాహసించలేకపోయాడు. అట్టి సామ్రాజ్య పునాదులపైనే మౌర్య సామ్రాజ్యం నిర్మితమైంది.
ప్రశ్న 4.
క్రీ.పూ. 6వ శతాబ్దకాలం నాటికి ఎన్ని రకాల గ్రామాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దము నాటి గ్రామములే సామాజిక, ఆర్థిక వ్యవస్థకు మూలం. పాళీ గ్రంథాల ప్రకారం ఆనాడు మూడు రకాల గ్రామాలు ఉండేవి. అవి:
- భోజక
- పట్టణ గ్రామాలు
- సరిహద్దు గ్రామాలు.
1. భోజక: ఈ గ్రామంలో అనేక రకాల కులాలు, వర్గాలు ఉండేవి. ఈ గ్రామ పెద్దను ‘భోజక’ అని పిలుస్తారు.
2. పట్టణ గ్రామాలు: ఈ విధంగా ఉన్న గ్రామాల్లో చేతి వృత్తులు, హస్తకళల వృత్తులవారు ఉండేవారు. ఇవి గ్రామాలకు మార్కెట్లుగా పనిచేశాయి.
3. సరిహద్దు గ్రామాలు: ఈ గ్రామాలు దాదాపు అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండి సరిహద్దు గ్రామాలుగా ఉండేవి. కొన్ని అటవీ ప్రాంత గ్రామాల పరిసరాల చుట్టూ పచ్చికబయళ్ళు, బీడు భూములు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ ఆస్తిగా భావించేవారు.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రీ.పూ. 6వ శతాబ్ద కాలానికి సంబంధించిన ఆధారాలు ఏవి?
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్ద కాలం నాటి పరిస్థితులు తెలుసుకోవటానికి ఉన్న ఆధారాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
- సాహిత్య ఆధారాలైన సంస్కృత గ్రంథాలు, త్రిపీటకాలు, త్రిపీటకాలపై వ్యాఖ్యానాలు, జాతక కథలు, దీపవంశం, మహావంశం మొదలైనవి.
- పురావస్తు ఆధారాలైన బార్హూత్, సాంచి, అమరావతి స్థూపాలు, మృణ్మయ పాత్రలు మొదలగునవి.
ప్రశ్న 2.
PUNCH – Marked నాణాలను తెలపండి.
జవాబు:
ఈ నాణాలు కొండలు, చెట్లు, చేపలు, ఎద్దు, ఏనుగు, చంద్రవంక మొదలైన బొమ్మలతో అచ్చువేసి ఉండే చిన్న చిన్న నాణాలు.
ప్రశ్న 3.
గణతంత్ర ప్రభుత్వం అంటే ఏమిటి?
జవాబు:
గణతంత్ర రాజ్యాలు ఎక్కువగా పర్వత ప్రాంతాల వద్ద వెలిశాయి. ఇవి సాధారణ భూములున్న ప్రాంతాలలో వెలిశాయి. గణతంత్ర ప్రభుత్వములు సాంప్రదాయకతను పాటిస్తూ అభివృద్ధి చెందాయి. గణతంత్ర ప్రభుత్వంలో రాజు అధికారములను నియంత్రించుటకు సభ, సమితి అనేవి కీలకపాత్ర వహించును. రాజ్య పాలకుడు సభ, సమితి నిర్ణయాలకు లోబడి పనిచేయవలెను. ఈ ప్రభుత్వములు వారసత్వంగా వచ్చేవికాదు.
ప్రశ్న 4.
క్రీ.పూ. 6వ శతాబ్దంనాటికి ఉన్న ప్రధాన రహదారి మార్గాలు ఏవి?
జవాబు:
- కౌశాంబి నుండి గంగా మైదాన ప్రాంతాల ద్వారా పంజాబ్, తక్షశిల రహదారుల ద్వారా ఇరాన్, మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు ఒక రహదారి.
- రాజగృహ నుంచి కౌశాంబి, ఉజ్జయినులు ద్వారా బరుకచ్చం నుంచి పశ్చిమ దేశాలకు రెండవ రహదారి.
- గంగా మైదానాల ద్వారా బర్మాకు ముఖ్యమైన రహదారి.
- గంగా మైదానాల ప్రాంతం నుంచి, నదీతీర ప్రాంతం ద్వారా దక్షిణ తూర్పు ప్రాంతాలకు ఇంకొక రహదారి మార్గం.
ప్రశ్న 5.
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి వెలసిన ముఖ్య వృత్తులు ఏవి?
జవాబు:
6వ శతాబ్దం నాటికి దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వృత్తులను రెండు రకాలుగా భావించారు. అవి కొన్ని ఉన్నత స్థాయి, కొన్ని క్రింది స్థాయి వృత్తులుగా భావించారు. వడ్రంగులు దంతపు వస్తువుల తయారీదార్లు, నేత పనివారు, కంసాలి మొదలైనవి ఉన్నత వృత్తులుగా భావించబడ్డాయి. వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం, కుమ్మరులను తక్కువ వృత్తికారులుగా భావించేవారు.
ప్రశ్న 6.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో వెలసిన ముఖ్య చేతివృత్తులను తెలుపుము.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్ద కాలంలో అనేక చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి. ఎక్కువమంది వీటి మీద ఆధారపడి పనిచేసేవారు. ఆ కాలంలో దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అవి: వడ్రంగి, నేతపని, కంసాలి, వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం మొదలైనవి చేతివృత్తులు.