Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Botany Study Material 1st Lesson మొక్కలలో రవాణా Textbook Questions and Answers.
AP Inter 2nd Year Botany Study Material 1st Lesson మొక్కలలో రవాణా
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పోరిన్లు అంటే ఏమిటి ? విసరణ చర్యలో వాటి పాత్ర ఏమిటి ?
జవాబు:
ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియా, కొన్ని బాక్టీరియమ్ల వెలుపలి త్వచంలో ఉండే పోరిన్లు అనే ప్రొటీన్లు పెద్ద సైజు రంధ్రాలను ఏర్పరిచి చిన్న సైజు ప్రొటీన్లు పరిమాణంతో దాదాపు సమానంగా ఉన్న అణువులను ప్రయాణించడానికి అనుమతిస్తాయి.
ప్రశ్న 2.
నీటిశక్మంను నిర్వచించండి. శుద్ధమైన నీటికి గల నీటిశక్మం విలువ ఎంత ?
జవాబు:
నీటి యొక్క రసాయన శక్మంను నీటి శక్మం అంటారు. ఇది చర్యకు లభ్యమయ్యే శక్తిని లేదా చలనాన్ని కొలవడానికి తోడ్పడుతుంది. శుద్ధమైన నీటికి గల నీటిశక్మ విలువ = 0.
ప్రశ్న 3.
విసరణ, ద్రవాభిసరణకు మధ్య భేదమేమిటి ? [A.P. Mar. ’17]
జవాబు:
విసరణ
1. “అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశంలోనికి వాయువులు లేక అణువులు చలించుట”.
ద్రవాభిసరణ
1. “అల్ప గాఢత గల ప్రదేశం నుండి అధిక గాఢత గల ప్రదేశంలోనికి భేదక పారగమ్య త్వచం ద్వారా నీరు రవాణా అగుట”.
ప్రశ్న 4.
అపోప్లాస్ట్, సింప్లాస్ట్ అంటే ఏమిటి ? [T.S. Mar. ’17, ’15]
జవాబు:
మొక్క దేహం నిండా ప్రక్కప్రక్కన ఆనుకుని ఉన్న కణ కవచాలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్న స్థితిని అపోప్లాస్ట్ అంటారు. దీనిలో నీరు కణత్వచాన్ని దాటదు. ఇది చురుకుగా జరుగుతుంది.
మొక్క దేహంలో కణానికి, కణానికి మధ్య ఏర్పడి ఉన్న ప్రొటోప్లాస్టీ అంతర్జాల వ్యవస్థను సింప్లాస్ట్ అంటారు. దీనిలో నీరు కణత్వచాన్ని దాటి లోపలికి చేరుతుంది. ఇది నెమ్మదిగా జరుగుతుంది.
ప్రశ్న 5.
బాష్పోత్సేకానికి, బిందుస్రావానికి మధ్య భేదమేమిటి ? [A.P. Mar. ’17]
జవాబు:
బాష్పోత్సేకము
- మొక్క వాయుగత భాగాలలోని సజీవ కణజాలాల నుంచి నీరు ఆవిరిరూపంలో వాతావరణంలోకి కోల్పోయే ప్రక్రియ.
- ఇది నియంత్రిత చర్య కాదు.
- ఇది సాధారణంగా పగలు జరుగును.
బిందుస్రావం
- నీరు నీటిబిందువుల రూపంలో వాతావరణంలోకి కోల్పోయే ప్రక్రియ.
- ఇది నియంత్రిత చర్య.
- ఇది రాత్రివేళల్లో జరుగుతుంది.
ప్రశ్న 6.
మొక్కల దారువు ద్వారా జరిగే ద్రవోద్గమానికి కారణమయ్యే కారకాలు ఏవి ? [T.S. Mar. ’17]
జవాబు:
సంసంజనము: నీటి అణువుల మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ.
అంజనము: దారుకణాల ఉపరితలాలకు, నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ.
బాష్పోత్సేకర్షణ: నీటిని పైకి తోయగల తోపుడు బలం.
ప్రశ్న 7.
మొక్కల కణాలలో జరిగే రవాణా సంబంధించి వినియోగ కేంద్రం, ఉత్పత్తి కేంద్రంగా పనిచేసేవి ఏవి ?
జవాబు:
వినియోగ కేంద్రము : మైటోఖాండ్రియా మొక్కకు అవసరమైనప్పుడు శక్తిని అందిస్తుంది.
ఉత్పత్తి కేంద్రము: ఆహార పదార్థాలను తయారుచేసే భాగము హరిత రేణువు.
ప్రశ్న 8.
బాష్పోత్సేకం రాత్రివేళల్లో జరుగుతుందా ? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జరుగుతుంది. రసయుత మొక్కలలో పత్రరంధ్రాలు పగలు మూసుకుని రాత్రులందు తెరుచుకుంటాయి. వీటిలో రాత్రిపూట బాష్పోత్సేకం జరుగుతుంది. ఉదా : బ్రయోఫిల్లమ్, కాక్టై.
ప్రశ్న 9.
పత్రరంధ్రాలు తెరుచుకునే, మూసుకునే సమయాలలో రక్షక కణాలు pH లను పోల్చండి.
జవాబు:
పత్రరంధ్రాలు తెరుచుకునే సమయంలో రక్షక కణాల pH(7) పెరుగుతుంది.
పత్రరంధ్రాలు మూసుకునే సమయంలో రక్షక కణాల pH(5) తగ్గుతుంది.
ప్రశ్న 10.
బాష్పోత్సేకం వల్ల జరిగే నష్టం సంబంధించి C3 మొక్కల కంటే C4 మొక్కలు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఎందుకు ?
జవాబు:
ఒక C4 మొక్క, C3 మొక్క కర్బన స్థాపన చేసినప్పుడు కోల్పోయే నీటిలో సగం మాత్రమే కోల్పోతుంది మరియు రెట్టింపు కర్బన స్థాపన చూపుతుంది.
ప్రశ్న 11.
రవాణా సంతృప్తత అంటే ఏమిటి ? ఇది సులభతర విసరణను ఎలా ప్రభావితం చేస్తుంది ?
జవాబు:
ప్రొటీన్ వాహకాలు అన్ని ఉపయోగించబడినప్పుడు రవాణా చర్యవేగం గరిష్ఠ స్థాయికి చేరుటను రవాణా సంతృప్తత అంటారు. సులభతర విసరణ చాలా విశిష్టమైనది. ఇది కావలసిన పదార్థాలను మాత్రమే కణంలోకి చేరడానికి అనుమతిస్తుంది.
ప్రశ్న 12.
నీటి ఎద్దడి ఉన్న పరిస్థితులలో ABA పత్రరంధ్రాలు మూసివేతను ఎలా కలిగిస్తుంది ?
జవాబు:
నీటి ఎద్దడి పరిస్థితులలో ABA అనే సహజ బాష్పోత్సేక నిరోధకము రక్షక కణాల నుంచి K+ అయానులను బయటకు పంపిస్తుంది. దీనివల్ల రక్షక కణాలు ముడుచుకొని పత్రరంధ్రం మూసుకుంటుంది.
ప్రశ్న 13.
బఠాణీ గింజలకు, గోధుమ గింజలకు ఉన్న నిపాన సామర్థ్యాలను సరిపోల్చండి. [T.S. Mar. ’16]
జవాబు:
ప్రొటీనులకు నిపాన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. గోధుమ గింజలలో ఉన్న కార్బోహైడ్రేటులకు తక్కువ నిపాన సామర్థ్యం ఉంటుంది. అందువల్ల ప్రొటీనులుగల బఠాణీ గింజలు, కార్బోహైడ్రేటులుగల గోధుమ గింజలకంటే ఎక్కువ నిపానము చూపుతాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
నీటిశక్మంను నిర్వచించి, వివరించండి.
జవాబు:
నీటి యొక్క రసాయన శక్మంను నీటిశక్మం అంటారు. ఇది చర్యకు లభ్యమయ్యే శక్తిని లేదా చలనాన్ని కొలవడానికి తోడ్పడుతుంది. దీనిని గ్రీకు సంకేతం (psi) తో సూచిస్తారు. దీని పీడన ప్రమాణాలు పాస్కల్స్ (pa) లో వ్యక్తీకరిస్తారు. ద్రావితశక్మం, పీడనశక్మం అనే అంశాలు నీటిశక్మాన్ని నిర్థారిస్తాయి.
మొక్కలలో రవాణా
a) ద్రావితశక్మం : శుద్ధమైన నీటిలో ఏదైనా ద్రావితాన్ని కరిగించినప్పుడు, ఆ ద్రావణంలోని నీటి అణువుల సంఖ్య, నీటి గాఢత తగ్గిపోయి నీటిశక్మం తగ్గుతుంది. ద్రావితాన్ని కలుపుతున్న కొద్ది నీటి శక్మంలో ఏర్పడుతున్న తగ్గుదలను ద్రావితశక్మం అంటారు. దీనిని Vs గుర్తుతో (T) సూచిస్తారు. దీని విలువ ఎప్పుడూ ఋణాత్మకంగా ఉంటుంది.
b) పీడనశక్మం : మొక్క కణంలోకి నీరు విసరణ చెందినప్పుడు మొక్క వ్యవస్థలో పీడనం వృద్ధి చెందుతుంది. దీనివల్ల కణ కవచం ఒత్తిడికి లోనై ఫలితంగా కణం స్పీతం చెందుతుంది. నీరు ప్రవేశించటం వల్ల స్పీతకణంలో ఎంతవరకు నీటి శక్మం వృద్ధి చెందుతుందో ఆ పీడనాన్ని పీడనశక్మం అంటారు. దీనిని ‘p’ గుర్తుతో సూచిస్తారు. దీని విలువ ధనాత్మకంగా ఉంటుంది.
ψ = π + p or ψ = ψs + ψp; ψ = – + +
ప్రశ్న 2.
సులభతర విసరణపై లఘుటీకాలను వ్రాయండి.
జవాబు:
విసరణ వేగం పదార్థం పరిమాణాన్ని బట్టి ఉంటుంది. కావున చిన్న పరిమాణం గల పదార్థం ఎక్కువ వేగంగా విసరణ చెందుతుంది. ఒక త్వచం ద్వారా ఏ పదార్థమైనా విసరణ చెందాలంటే త్వచ ముఖ్యాంశమైన లిపిడ్ ద్రావణీయతపై ఆధారపడి ఉంటుంది. లిపిడ్లో కరిగిపోయే పదార్థాలు త్వచం ద్వారా ఎక్కువ వేగం విసరణ చెందుతాయి. ఏఏ పదార్థాలు జలాకర్షక ప్రోస్థటిక్ సముదాయాన్ని కలిగి ఉంటాయో, అవి త్వచం ద్వారా సులభంగా ప్రయాణించలేవు. త్వచ ప్రొటీన్లు కొన్ని క్రియాశీల స్థానాలను ఏర్పరచి త్వచం ద్వారా అట్టి పదార్థాల రవాణాను సులభతరం చేస్తాయి. ఇవి గాఢతా ప్రవణత కల్పించవు. అయితే త్వచ ప్రొటీన్ల సహాయంతో విసరణ జరగాలంటే అంతకు ముందే గాఢతా ప్రవణత ఏర్పడి ఉండాలి. అందువల్ల దీనిని సులభతర విసరణ అంటారు. ఇది చాలా విశిష్టమైనది. ఇది కావలసిన పదార్థాలను మాత్రమే కణంలోకి చేరడానికి అనుమతిస్తుంది. ప్రొటీను పక్క గొలుసులతో చర్య జరిపే నిరోధకాలకు ఈ చర్య సూక్ష్మగ్రాహ్యత చూపుతుంది.
కొన్ని వాహక ప్రొటీనులు రెండు రకాల అణువులు కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే విసరణ కలిగిస్తాయి. సింపోర్ట్ రెండు రకాల అణువులు ఒకే దిశలో త్వచం ద్వారా ప్రయాణిస్తాయి. కాని ఆంటిపోర్ట్లో ఇవి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి. ఒక అణువు మరో అణువుతో ప్రమేయం లేకుండా స్వతంత్రంగా త్వచం ద్వారా ప్రయాణిస్తే దానిని యూనిపోర్ట్ అంటారు.
ప్రశ్న 3.
కణద్రవ్య సంకోచం అంటే ఏమిటి ? మన జీవితంలో దాని ఉపయోగమేమిటి ? [A.P. Mar. ’16]
జవాబు:
కణమును అధిక గాఢత గల ద్రావణంలో ఉంచితే, కణం నుండి నీరు బయటకు వెళ్ళిపోయి కణత్వచం కవచం నుండి విడిపోయి కణద్రవ్యం కుచించుకు పోతుంది. దీనిని కౌశిక ద్రవ్య సంకోచం అంటారు. కణద్రవ్యంలోని నీరు, తర్వాత రిక్తికలోని నీరు బయటకు వెళుతుంది. ఈ విధంగా కణంలోని నీరు విసరణ ద్వారా తొలగిపోవడం వల్ల జీవపదార్థం కవచం నుండి విడిపోయి ముడుచుకుంటుంది. ఈ ప్రక్రియ ముందుగా కణకవచం మూలల్లో ప్రారంభమవుతుంది. ఈ దశను ప్రారంభ కణద్రవ్య సంకోచం అంటారు. కావున సాధారణ జీవకణాలు అధిక గాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు ‘శుధం’ చెందుతాయి. మన నిజ జీవితంలో నిల్వ చేసిన పచ్చళ్ళు, ఎండిన ఉప్పుచేపలు, ఉప్పుపట్టిన మాంసం వంటివి ఆచరణీయ ఉదాహరణలు.
ప్రశ్న 4.
ఎత్తయిన వృక్షాలలో ద్రవోద్గమం ఎలా జరుగుతుంది ? [A.P. & T.S. Mar. ’15]
జవాబు:
గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా దారువు ద్వారా జరిగే నీటి ఊర్థ్వ చలనాన్ని ద్రవోద్గమము అంటారు. బాష్పోత్సేకం వల్ల పనిచేసే ద్రవోద్గమము, నీటి భౌతిక ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. అవి :
- సంసంజనము : నీటి అణువుల మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ.
- అసంజనము : దారుకణాల ఉపరితలాలు, నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ.
- బాష్పోత్సేక కర్షణ : నీటిని పైకి తోయగల తోపుడు బలం. ఈ ధర్మాలు నీటికి అధిక తన్యతా బలాన్ని, అధిక కేశికా బలాన్ని కలిగిస్తాయి. మొక్కలలో దారుకణాలు,
దారునాళాలు అతి సన్నని అవకాశిక కలిగి కేశనాళికల వలె పనిచేసి నీటిని కేశికాబలంతో లాగుతాయి. పత్ర రంధ్రాల నుంచి నీరు ఆవిరవుతున్న కొద్ది కణాలపై పలుచని నీటిపొర అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉండటం వల్ల నీటి అణువులు ఒకదానివెంట మరొకటి ఆకర్షింపబడుతూ నీటి స్థంభం దారువు నుంచి పత్రంలోకి లాగబడుతుంది. అంతేకాక బయటి వాతావరణంలో నీటి ఆవిరి తక్కువగా ఉండుట వల్ల నీరు పరిసర గాలిలోకి విసరణ చెందుతుంది. దీనివల్ల బాష్పోత్సేక కర్షణ ఏర్పడుతుంది. బాష్పోత్సేకం వల్ల జనించే బలం దారువులో నీటి స్థంభాన్ని 130 మీటర్లు ఎత్తుకు తోడడానికి కావలసిన పీడనాన్ని కల్పిస్తుంది.
ప్రశ్న 5.
మొక్కలలో పీడన ప్రవాహం పరికల్పన విధానంలో జరిగే చక్కెరల స్థానాంతరణను వర్ణించండి.
జవాబు:
ఉత్పత్తి కేంద్రం నుండి వినియోగ కేంద్రానికి చక్కెరల స్థానాంతరణను వివరించే యాంత్రికంను పీడన ప్రవాహ పరికల్పన అంటారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తి కేంద్రంలో గ్లూకోస్ సంశ్లేషణ జరిగి అది సూక్రోస్గా మార్పు చెందుతుంది. పిదప సూక్రోస్ సహకణాలలోనికి ప్రవేశించి తుదకు సజీవ ఛాలనీ నాళాలలోనికి సక్రియా విధానంలో రవాణా చెందుతుంది. ఉత్పత్తి కేంద్రాలలోని కణాలలో ఆహారం ఉత్పత్తి వల్ల అక్కడ ఉన్న పోషక కణజాలంలో అధిక గాఢ పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో “పక్కనున్న దారువులోని నీరు ద్రవాభిసరణ చర్య ద్వారా పోషక కణజాలంలోకి చేరుతుంది. ఫలితంగా ద్రవాభిసరణ పీడనం పెరిగి పోషక కణజాలంలోనికి ద్రవం తక్కువ పీడనాలు ఉన్నవైపు చలిస్తుంది.
పోషక కణజాలం నుంచి సూక్రోస్ వెలుపలికి రావడానికి, చక్కెరను వినియోగించి దీని శక్తిగా లేక పిండిగా మార్చే కణాలలో చేరడానికి సక్రియా రవాణా జరగాలి. ఈ విధంగా చెక్కరలు తొలగింపబడినప్పుడు ద్రవాభిసరణ పీడనం తగ్గి నీరు పోషక కణజాలం నుండి బహిస్సరణ చెందుతుంది.
దీనిని వివరించడానికి ముంచ్ ఒక ప్రయోగం జరిపారు. దానిలో ఆయన A, B అను రెండు ఆస్మామీటర్లు తీసుకొని, ‘B’ లో చక్కెర ద్రావణం, ‘A’ లో మంచినీరు తీసుకుని రెండింటిని ‘C’ అను గాజు గొట్టంతో కలిపారు. తరువాత ‘A’ మరియు ‘B’ (Bulb)బల్బ్ ను ‘X’ మరియు ‘y’ అను నీటి తొట్టెలలో ఉంచి, వాటిని ‘Z’ అను గొట్టంతో కలిపారు. ద్రవాభిసరణ ప్రక్రియ వల్ల నీరు ‘Y’ నుండి ‘B’ లోనికి, ‘B’ నుండి ‘C’ ద్వారా ‘A’ లోనికి, ‘A’ నుండి ‘X’ లోనికి చివరగా ‘X’ నుండి ‘y’ లోనికి ‘Z’ ద్వారా గాఢతలు సమానం అయ్యేంతవరకు రవాణా అవుతుంది. ఈ ప్రయోగంలో ‘B’ Bulb ను ఉత్పత్తి కేంద్రంగాను, ‘A’ Bulb ను వినియోగ కేంద్రం గాను, ‘C’ ను పోషక కణజాలముతోను ‘X’, ‘Y’ నీటి తొట్టెలను దారువుతోను పోల్చవచ్చు.
ప్రశ్న 6.
“బాష్పోత్సేకం అవశ్యకమైన అనర్థం” వివరించండి. [A.P. Mar. ’17; T.S. Mar. ’16 Mar. ’14]
జవాబు:
బాష్పోత్సేకం వల్ల ప్రయోజనాలు, నష్టాలు గలవు. అవి : ప్రయోజనాలు :
- నీటి నిష్క్రియా శోషణకు సహకరిస్తుంది.
- సమూహ ప్రవాహ యాంత్రికం ద్వారా ఖనిజ లవణాల శోషణకు సహకరిస్తుంది.
- ద్రవోద్గమానికి కావలసిన కర్షణను ఇస్తుంది.
- బాష్పీభవన శీతలీకరణ ద్వారా పత్ర ఉపరితలాన్ని చల్లబరుస్తుంది.
- కణాలకు స్ఫీతస్థితిని కలిగించి ఆకారాన్ని, నిర్మాణాన్ని తెలుపుతుంది.
నష్టాలు :
- ఎక్కువ బాష్పోత్సేకం వల్ల కణాలు శుధః స్థితిలోకి మారి, పెరుగుదల తగ్గుతుంది.
- ఎక్కువ బాష్పోత్సేకం వల్ల పత్రరంధ్రాలు మూసుకుపోయి వాయువుల వినిమయానికి ఆటంకం ఏర్పడుతుంది.
కావున బాష్పోత్సేకంను ‘అవశ్యకమైన అనర్థం’ గా అభివర్ణిస్తారు.
ప్రశ్న 7.
బాష్పోత్సేకం, కిరణజన్య సంయోగక్రియ – ఒక సర్దుబాటు. వివరించండి.
జవాబు:
బాష్పోత్సేకానికి అనేక ప్రయోజనాలున్నాయి. అవి :
- శోషణకు, రవాణాకు కావలసిన బాష్పోత్సేక కర్షణను సృష్టిస్తుంది.
- కిరణజన్య సంయోగక్రియకు కావలసిన నీరు సరఫరా చేస్తుంది.
- నేల నుంచి మొక్క భాగాలకు, ఖనిజాలను రవాణా చేస్తుంది.
- బాష్పీభవన శీతలీకరణ ద్వారా పత్ర ఉపరితలాన్ని చల్లబరుస్తుంది.
- కణాలకు స్ఫీతస్థితిని కలిగించి, ఆకారాన్ని, నిర్మాణాన్ని నిలుపుతుంది.
చురుకుగా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటున్న మొక్కకు అసంతుష్టమైన నీటి ఆవశ్యకత ఉంటుంది. బాష్పోత్సేకం వల్ల వేగంగా జరిగే నీటినష్టం కారణంగా కిరణజన్య సంయోగక్రియకు నీరు అవధి కారకమై ఉంటుంది. వర్షాధార అరణ్యాలలో నీటివలయం వేరు నుంచి పత్రానికి, అక్కడి నుండి వాతావరణంలోకి తిరిగి మృత్తికలోకి నడుస్తుండటం వల్ల అధిక తేమ స్థితులు ఉంటాయి. C4 మొక్కలు, C3 మొక్కల కన్నా రెట్టింపు కర్బన స్థాపన సామర్థ్యాన్ని చూపుతాయి. కాని ఒక C4 యొక్క C3, మొక్క కర్బన స్థాపన చేసేటప్పుడు కోల్పోయే నీటిలో సగం మాత్రమే కోల్పోతుంది.
ప్రశ్న 8.
పత్ర రంధ్రాలు తెరుచుకునే, మూసుకునే యాంత్రికాన్ని వివరించండి. [T.S. Mar. ’15]
జవాబు:
పత్రరంధ్రాలు తెరుచుకునే, మూసుకునే యాంత్రిక విధానము : దీనిని వివరించటానికి 1974లో లెవిట్, K+ పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారము కాంతి సమక్షంలో అనుబంధ కణాల నుండి రక్షక కణాలలోకి K+ అయానులు సంచయనమవుతాయి. దీనికి తోడుగా ప్రొటానులు బహిస్రవణ చెంది రక్షక కణాలు pH పెరుగుతుంది. K+ అయానులతోపాటు Cl– అయానులు కూడ నిష్క్రియా అంతస్రవణ చెందుతాయి. దీనివల్ల రక్షక కణాల నీటి శక్మం పడిపోతుంది. ఫలితంగా రక్షక కణాలలోకి నీరు విసరణ చెంది స్పీతస్థితి కలుగుతుంది. వాటి వెలుపలి గోడలు వెలుపలగా వ్యాపించి రంధ్రం విశాలంగా తెరుచుకుంటుంది. రాత్రివేళలో, కాంతి లేనప్పుడు K+ మరియు Cl– అయానులు రక్షక కణాల నుండి బయటకు వెళ్ళిపోతాయి. దీంతో రక్షక కణాల నీటిశక్మం పెరిగి వాటి నుంచి నీరు వెలుపలికి పోతుంది, ఫలితంగా పత్రరంధ్రం మూసుకుంటుంది.
అభ్యాసాలు
ప్రశ్న 1.
ఎగువ, దిగువ రవాణాల విధానాల మధ్య భేదాన్ని వివరించండి.
జవాబు:
ఎగువ రవాణా
1. ప్రొటీన్లు పదార్థాల రవాణాను తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత దిశలో కలిగించే రవాణా.
దిగువ రవాణా
1. ప్రొటీన్లు పదార్థాల రవాణాను అధిక గాఢత నుండి తక్కువ గాఢత దిశలో కలిగించే రవాణా.
ప్రశ్న 2.
సామాన్య విసరణ, సులభతర విసరణల మధ్య భేదాలను వివరించండి.
జవాబు:
సామాన్య విసరణ
1. ఒక కణం నుంచి మరొక కణంలోకి (అధిక గాఢత) నుంచి అల్ప గాఢతలోకి) జరిగే చర్య.
సులభతర విసరణ
1. జలాకర్షక ప్రాస్థెటిక్ సముదాయాన్ని కల్గి ఉన్న పదార్థాలను త్వచ ప్రోటీన్లు త్వచం ద్వారా రవాణా చేయుట.
ప్రశ్న 3.
భిన్న గాఢతలున్న రెండు ద్రావణాలను కోడిగుడ్డు పొరతో వేరుచేస్తే ఏం జరుగుతుంది ? కారణం తెల్పండి.
జవాబు:
భిన్న గాఢతలున్న రెండు ద్రావణాలను కోడిగుడ్డు పొరతో వేరుచేసిన, ద్రావణము అల్ప గాఢత గల ప్రదేశం నుండి కోడిగుడ్డు పొర (ప్లాస్మాపొర) ద్వారా అధిక గాఢత గల ద్రావణంలోకి, రెండు గాఢతలు సమానమయ్యేటంత వరకు జరుగుతుంది. దీనిని ద్రవాభిసరణ అంటారు.
ప్రశ్న 4.
మొక్కలలో సాధారణంగా ఏ నీటి గమన పథం అధికం ? ఎందుకు ?
జవాబు:
మొక్కలలో సాధారణంగా నీటి గమన పథం అపోప్లాస్ట్ ద్వారా వేగంగా జరుగుతుంది. ఈ వ్యవస్థలో నీటి గమనానికి ఎటువంటి అవరోధాలు ఉండవు. నీరు, ఖనిజాల చలనం స్థూల ప్రవాహంలా ఉంటుంది. దీనికి బాష్పోత్సేకపు లాగుడు, నీటికి ఉన్న సంసంజన, అసంజన బలాలు కూడా తోడ్పడతాయి.
ప్రశ్న 5.
మైకోరైజా సాంగత్యం లేని పైనస్ విత్తనాలు మొలకెత్తవు. ఎందుకు ?
జవాబు:
శిలీంధ్రం, వేరు వ్యవస్థతో కలిపి ఏర్పడిన సహజీవన సాంగత్యాన్ని శిలీంధ్రమూలము (మైకోరైజా) అంటారు. శిలీంధ్రము వేరు చుట్టూ విస్తరించి, మొక్కకు నీరు, ఖనిజాలను అందిస్తుంది. పైనస్ మొక్కకు శిలీంధ్ర మూలాలతో అవికల్ప సంబంధం ఏర్పడి ఉంటుంది. అందువల్ల శిలీంధ్ర మూలాలు లేనిదే పైనస్ విత్తనాలు మొలకెత్తవు.
ప్రశ్న 6.
నీటి ఎద్దడి పరిస్థితులలో పత్రరంధ్రాలు ఎందుకు మూసుకుంటాయి ?
జవాబు:
నీటి ఎద్దడి సమయంలో ABA (అబ్సిసిక్ ఆమ్లము) అనే సహజ బాష్పోత్సేక నిరోధకం రక్షక కణాల నుంచి K+ అయానులను బయటకు పంపిస్తుంది. దీంతో రక్షక కణాలు ముడుచుకొని పత్రరంధ్రం మూసుకుంటుంది.
ప్రశ్న 7.
ఏకదళబీజ మొక్కలలో పత్రరంధ్రాల వితరణ ఎలా ఉంటుంది ?
జవాబు:
ఏకదళ బీజ మొక్కలలో పత్రరంధ్రాలు పత్రం యొక్క ఊర్ధ్వ, అధో బాహ్య చర్మాలలో సమానంగా ఉంటాయి. (ఉభయ పత్రరంధ్ర – సమానము)
ప్రశ్న 8.
పోషకకణజాలంలో చక్కెరలు ఏ రూపంలో రవాణా చెందుతాయి ?
జవాబు:
సూక్రోస్, ఇతర చక్కెరలు, హార్మోనులు మరియు అమైనో ఆమ్లాలు.
ప్రశ్న 9.
వేరు అంతశ్చర్మం అయాన్లను ఒకే దిశలో రవాణా చేయడానికి గల కారణం ఏమిటి ?
జవాబు:
వేరులోని వల్కలం లోపలి పొర అంతశ్చర్మము, సుబరిచ్చే ఏర్పడిన ‘కాస్పేరియన్ బద్దీల’ చే ఉండుట వల్ల నీటికి అయానులకు అపార గమ్యత చూపిస్తాయి. అయితే అయానులు వేరు పొరలలో అంతశ్చర్మంలోని వాహక కణాల ద్వారా రవాణా అవుతాయి.
ప్రశ్న 10.
చురుకుగా వృద్ధి చెందుతున్న మొక్కలో బెరడు వలయాన్ని ఒలిచేస్తే ఏమి జరుగుతుంది. ఎందుకు ?
జవాబు:
బెరడు వలయాన్ని వలిచిన పై భాగము ఉబ్బుతుంది. దీనికి కారణము ఆహార పదార్థాల రవాణా ఆగిపోవడం. దీనిని బట్టి ఆహార పదార్థాల రవాణా పోషక కణజాలం ద్వారా జరుగుతుందని చెప్పవచ్చు.