Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 1st Lesson భారత రాజ్యాంగం Textbook Questions and Answers.
AP Inter 2nd Year Civics Study Material 1st Lesson భారత రాజ్యాంగం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ? భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం : ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్ధిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.
అర్థం : Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో అంటే “స్థాపించు” అని అర్థం.
నిర్వచనాలు :
- అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
- లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
- స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. 385 మందితో కూడిన రాజ్యాంగ పరిషత్ రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు నిర్విరామంగా కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.
భారత రాజ్యాంగ నిర్మాణ చారిత్రక నేపథ్యం: భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాల రాజ్యాంగాలన్నింటి కంటే మిక్కిలి శ్రేష్టమైంది. దీనిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించగా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన గల భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. అంతకుపూర్వం భారతీయులకు ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం అవసరమని జాతీయోద్యమ నాయకులు పలుమార్లు డిమాండ్ చేశారు. 1922లో ఏర్పడిన స్వరాజ్యపార్టీ నాయకులు భారతీయులకు శాసనమండళ్ళలో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజ్యాంగపరమైన ఏర్పాట్లు జరగవలసి ఉంటుందని పేర్కొన్నారు. తరువాత 1924 ఫిబ్రవరిలో కేంద్ర శాసన మండలి సమావేశంలో మోతీలాల్ నెహ్రూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ భారత రాజ్యాంగాన్ని వెంటనే రూపొందించుకోవడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్ర శాసనసభ్యులు అత్యధిక
మెజారిటీతో ఆమోదించారు. 1928 మేలో మొతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటుచేసి, భారత ప్రజలకు తగిన రాజ్యాంగాన్ని ఏర్పరచడానికి కొన్ని నియమ నిబంధనలను రూపొందించవలసిందిగా కోరడం జరిగింది. తరువాత మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను 1928 ఆగస్టులో రూపొందించింది. ఆ కమిటీ సూచనలలో అధికభాగం స్వతంత్ర భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది.
1936-1937 కాలంలో భారతదేశంలో ప్రాంతీయ శాసనమండళ్ళకు జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తన ఎజెండాలో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణాన్ని ప్రధాన అంశంగా పేర్కొంది. ఆ తరువాత 1937 ఫిబ్రవరిలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారతీయ శాసనసభ్యులు ప్రాంతీయ ప్రభుత్వాలలో చేరడానికి ఆమోదం తెలిపారు. నూతన ప్రాంతీయ మండళ్ళ సమావేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు డిమాండు ప్రస్తావించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
1940 ఏప్రిల్లో వార్దాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల మధ్య రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.
1940లో వైస్రాయ్ లిన్లిత్ ఆగస్టు ప్రతిపాదన (August offer) ద్వారా భారతీయులు రెండో ప్రపంచ ‘యుద్ధంలో బ్రిటన్కు సహకరించాలనీ, భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొనే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందనీ మొట్టమొదటి సారిగా ప్రకటించాడు. భారత జాతీయ స్రవంతిలో పాల్గొనే వారికి ప్రాతినిధ్యం వహించే సంస్థయే నూతన రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకోవలసి ఉంటుందని పై ప్రతిపాదన పేర్కొంది. 1942లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ యుద్ధకాలపు మంత్రిమండలిలో లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టాఫర్డ్ క్రిప్స్న భారతదేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమాయత్తం గావించాడు. నెహ్రూకు సన్నిహితుడైన క్రిప్స్ తన ప్రతిపాదనలలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ప్రక్రియ గురించి పేర్కొన్నాడు.
భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జూలై – ఆగస్టులలో ఎన్నికలు జరిగాయి.
భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ఆదేశాలమేరకు 1946 డిసెంబర్ 9న జరిగింది. నెహ్రూ సూచనమేరకు అందరికంటే ఎక్కువ వయస్సు, అనుభవం ఉన్న సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మొట్టమొదటి సమావేశంలో 207 మంది సభ్యులు పాల్గొన్నారు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది. 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగపరిషత్తు సమావేశంలో చారిత్రాత్మకమైన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం భారతదేశాన్ని సర్వసత్తాక, స్వతంత్ర్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వర్ణించారు. రాజేంద్రప్రసాద్ తన తొలి అధ్యక్షోపన్యాసంలో భారతదేశం కామన్వెల్త్ రాజ్యంగా కొనసాగుతుందనీ, కుల, మత, వర్గాలతో సంబంధం లేని దిశగా భారతదేశం పయనిస్తుందనే ఆకాంక్షను వెల్లడించారు.
భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అంతకుపూర్వం భారత రాజ్యాంగ పరిషత్తు నాలుగు పర్యాయాలు సమావేశమైంది. మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9-13 మధ్య, రెండో సమావేశం 1947 జనవరి 20-22 మధ్య, మూడో సమావేశం 1947 ఏప్రిల్ 28, మే 2 మధ్య, నాలుగో సమావేశం 1947 జూలైలో జరిగాయి. మొదటి సమావేశంలో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానంపై చర్చ జరిగింది. రెండో సమావేశంలో రాజ్యాంగ రూపకల్పనకు దోహదపడే అల్పసంఖ్యాకుల కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ, సభావ్యవహారాల కమిటీ వంటి అనేక కమిటీలు ఏర్పడ్డాయి. మూడో సమావేశంలో కేంద్రప్రభుత్వ అధికారాల కమిటీ వంటి వివిధ సభా సంఘాల నివేదికలపై చర్చ జరిగింది. నాలుగో సమావేశంలో భావిభారత రాజ్యాంగనమూనా, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగం వంటి విషయాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది. 1947 జూన్ 3న మౌంట్ బాటన్ చేసిన దేశ విభజన ప్రకటనతో రాజ్యాంగ పరిషత్తు స్వరూపమే మారిపోయింది. దేశ విభజన తరువాత భారత రాజ్యాంగ పరిషత్తు నుంచి ముస్లిం లీగ్ వేరయిపోవడంతో దాని సభ్యత్వ సంఖ్య తగ్గిపోయింది. అలాగే దేశ విభజన దరిమిలా రాజ్యాంగ పరిషత్తు ఒకవైపు రాజ్యాంగ నిర్మాణసంస్థగానూ, వేరొకవైపు జాతీయస్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.
రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా హెచ్. వి. ఆర్. అయ్యంగార్, రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య సలహాదారుగా డాక్టర్ బెనగళ్ నర్సింగరావు వ్యవహరించారు.
రాజ్యాంగ ముసాయిదా కమిటీ (Drafting Committee)
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగస్టు 29న ఏర్పరచింది. ఆ కమిటీలో చైర్మన్, ఆరుగురు సభ్యులు (మొత్తం ఏడుగురు) ఉన్నారు. డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ చైర్మన్ వ్యవహరించారు.
ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ ముసాయిదాలోని అంశాలను రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు, ప్రజలు, పత్రికలలో చర్చలు జరిగి అభిప్రాయాల వ్యక్తీకరణకోసం ముసాయిదా ప్రతులను పంచడమైంది.
మొత్తం మీద రాజ్యాంగ ముసాయిదా పై 7635 సవరణలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో 2473 సవరణలను రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతిపై తృతీయ పఠనం 1949 నవంబర్ 14-26ల మధ్య జరిగింది. చివరిగా రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబర్ 26న ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించడానికి రాజ్యాంగ పరిషత్తుకు 2 ‘సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగ పరిషత్తు చివర సమావేశం 1950 జనవరి 24న జరిగింది. ఆ సమావేశంలో సభ్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను భారతదేశ తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది.
భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. నాటి నుండి ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నాము.
ప్రశ్న 2.
భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగం జనవరి 26, 1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. సుమారు రెండు శతాబ్దాల పరాయి పాలన తరువాత 1946లో ఏర్పడిన రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని రూపొందించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో క్రొత్త రాజ్యాంగ నిర్మాణం చేయబడింది. మేధావులు, పరిపాలనావేత్తలు, న్యాయశాస్త్ర నిపుణులు, రాజనీతివేత్తలు కలసి ప్రపంచంలోని ముఖ్య రాజ్యాంగాలు, 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా క్రొత్త రాజ్యాంగ రచన చేశారు.
లక్షణాలు :
1. సుదీర్ఘమైన రాత పూర్వక ప్రతి : భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి అతిపెద్ద రాజ్యాంగము. ఇందులో ప్రస్తుతం 444 అధికరణాలు, 12 ప్రకరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22 భాగాలున్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు పైగా రాజ్యాంగం సవరించబడింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగమయ్యాయి. అన్ని వివరాలు పొందుపరచడం వలన రాజ్యాంగం పెద్దదిగా తయారైంది. ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత “భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిదీర్ఘము, వివరణాత్మక రాజ్యాంగం” అని వర్ణించారు. కొన్ని అలిఖిత నియమాలు కూడా ఉన్నాయి. ఉదా : రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి పోటీ చేయరాదు. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుని మాత్రమే ప్రధానిగా నియమించడం మొదలగునవి.
2. దృఢ, సరళ రాజ్యాంగాల సమ్మేళనం భారత రాజ్యాంగ నిర్మాతలు సమయం, సందర్భాలను బట్టి దృఢ, సరళ లక్షణాలు గల రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారు. భారత రాజ్యాంగం 368వ ప్రకరణ రాజ్యాంగ సవరణ విధానాన్ని సూచిస్తుంది.
- నూతన రాష్ట్రాల ఏర్పాటు (ఉదా : తెలంగాణ) భారత పౌరసత్వం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు వంటి అంశాల సవరణకు సరళమైన పద్ధతి పేర్కొన్నది.
- రాష్ట్రపతి ఎన్నిక కేంద్రప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు, కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలోని అంశాలు మొదలగు వాటిని సవరించేందుకు పార్లమెంటు ఉభయసభలలో 2/3వ వంతు సభ్యుల ఆమోదంతోబాటు సగానికిపైగా రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం. ఈ సందర్భంలో మన రాజ్యాంగం పాక్షిక, సరళ, పాక్షిక దృఢమైన పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.
- ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి కొన్ని అంశాలను సవరించేందుకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ సభ్యుల ఆమోదం అవరమవుతుంది.
3. అర్ధ సమాఖ్య రాజ్యం : భారత రాజ్యాంగంలో కొన్ని సమాఖ్య లక్షణాలు, కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. ఉదా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుండటం, వాటి మధ్య అధికారాల విభజన, సుప్రీంకోర్టు, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం వంటి సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. అట్లాగే ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికల సంఘం, ఒకే పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, రాష్ట్రాల కంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలు వంటి ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులను అరికట్టేందుకు రాజ్యాంగ నిర్మాతలు దృఢమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పండితుడు కె.సి.వేర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించడమైనది.
4. గణతంత్ర ప్రభుత్వం : పూర్వపు, వలస సౌర్వభౌమత్వ రాజ్యం ఇంగ్లండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. అటువంటి సంవిధానంలో అన్ని ప్రభుత్వ పదవులు అర్హతగల పౌరులకు అందుబాటులో ఉంటాయి. వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాచరికం అనేది అప్రజాస్వామికమైంది.
5. పార్లమెంటరీ ప్రభుత్వం : భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న పద్ధతిని సూచించారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో మిగిలిన లక్షణాలైన రెండు రకాల కార్య వర్గాధిపతులు, ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత, పార్లమెంటుకు కార్యవర్గంపై నియంత్రణ, రాజ్యాధినేతకు నామమాత్ర కార్యనిర్వాహక వర్గ హోదా వంటి అంశాలను భారత రాజకీయ వ్యవస్థలో ఆమోదించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సూచించడం జరిగింది.
6. ప్రాథమిక హక్కులు – ప్రాథమిక బాధ్యతలు : భారత రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 25 వరకు గల ప్రకరణలు పౌరులందరికీ ప్రధానమైన మానవ హక్కులను అందించాయి. అటువంటి హక్కులు న్యాయబద్ధమైనవిగా ఉంటూ మౌలికస్వాతంత్ర్యాలను పౌరులను ప్రసాదిస్తాయి. అధికార దుర్వినియోగాన్ని నివారిస్తాయి. ఇక రాజ్యాంగం (42వ సవరణ) చట్టం రాజ్యాంగం నాలుగో భాగంలో 51 A నిబంధనలో ప్రాథమిక విధులను చేర్చింది. ప్రాథమిక విధులన్నీ న్యాయబద్ధమైనప్పటకీ పౌరులు కొన్ని బాధ్యతలకు నిర్వర్తించాల్సిన ఆవశ్యకతను అవి పేర్కొంటాయి.
7. ఏక పౌరసత్వం : భారత రాజ్యాంగం సమాఖ్య పద్ధతి ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ పౌరులందరికీ ఒకే పౌరుసత్వాన్ని ప్రసాదించింది. అమెరికాలాంటి దేశాలలో పౌరులు కేంద్రం, రాష్ట్రాలలో రెండింటిలో పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. కానీ భారతదేశంలో పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకేరకమైన హక్కులను అనుభవిస్తారు. జమ్మూకాశ్మీర్, గిరిజన ప్రాంతాలలో నివసించే వారిని మినహాయిస్తే మిగతా ప్రజల మధ్య ఎటువంటి విచక్షణ పాటించబడదు.
8. వయోజన ఓటుహక్కు: పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికలలో ప్రతినిధులను ఎన్నుకొనేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటుహక్కును ప్రసాదించింది. దాని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఇచ్చింది. అటువంటి ఏర్పాటు భారత ప్రజాస్వామ్యానికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చి సామాన్యప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టలను పెంపొందిస్తుంది. సమానత్వ సూత్రాన్ని సమర్థించి, మైనారిటీల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, సమాజంలోని బలహీనవర్గాలలో నూతన ఉత్తేజాలకు వీలు కల్పిస్తుంది.
9. లౌకిక రాజ్యం : భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసననిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.
10. స్వతంత్ర న్యాయశాఖ : సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వహక శాఖల అధికారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భవించింది. స్వతంత్ర హోదా ఉండుటచేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని ఔచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.
11. ఆదేశక నియమాలు: భారత రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశక నియమాలను ప్రస్తావించాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ నియమాలు సమాఖ్య రాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. సమానమైన పనికి సమాన వేతనం, ఉపాధి అవకాశాల కల్పన, సంపద న్యాయమైన రీతిలో పంపిణీ, వృద్ధాప్య పించన్లు, అస్వస్థత నుంచి కాపాడడం, శ్రామికులకు విశ్రాంతి, వన్యప్రాణుల సంరక్షణ, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను కాపాడడం వంటివి ఆదేశక నియమాలకు కొన్ని ఉదాహరణలు. ఆదేశక సూత్రాలకు న్యాయ స్వభావం లేకపోయినప్పటికీ వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వము విస్మరించరాదు.
12. ద్విసభా విధానం : భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా భారత పార్లమెంటులో లోక్సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ) అనే రెండు సభలు ఉంటాయి. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాలు అనుసరిస్తున్న ద్విసభావిధానాన్ని మన దేశానికి సూచించడమైంది.
13. పంచాయితీరాజ్, మునిసిపాలిటి చట్టాలు : ఇతర సమాఖ్య రాజ్యాంగాల వలె, భారత రాజ్యాంగం ప్రారంభంలో కేంద్రం, రాష్ట్రాలతో కూడిన రెండు ప్రభుత్వాలతో కూడిన రాజకీయ సంవిధానాన్ని ఏర్పరచింది. తరువాత రాజ్యాంగం (73వ, 74వ సవరణలు) చట్టాల ద్వారా పంచాయితీలు, మునిసిపాలిటీలకు రాజ్యాంగపరమైన గుర్తింపుకు ఏర్పాట్లు గావించింది. అటువంటి ఏర్పాట్లు ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగాలలోను లేకపోవడం ఒకే విశేషంగా ఈ సందర్భంలో పేర్కొనవచ్చు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రాజ్యాంగం ముఖ్యాంశాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది. అదేవిధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్ధిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.
రాజ్యాంగం – ముఖ్యాంశాలు :
1) సంఘంలో సభ్యులు, సముదాయాల మధ్య సమన్వయాన్ని చేకూర్చేందుకై అవసరమైన ప్రాథమిక నియమాలను రాజ్యాంగం సూచిస్తుంది. సంఘంలో శక్తి (power) పంపిణీ (distribution) గురించి అది ప్రత్యేకంగా పేర్కొంటుంది. చట్టాలను ఎవరు రూపొందిస్తారు ? అనే అంశాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు చట్టాలను రూపొందిస్తారు. అందుకు భిన్నంగా ప్రజా గణతంత్ర చైనా దేశంలో కమ్యూనిస్టుపార్టీ సర్వాధికారాలు చెలాయిస్తూ, చట్టాలను రూపొందిస్తుంది. సౌదీ అరేబియా వంటి రాజరికం అమల్లో ఉన్న రాజ్యంలో చట్ట స్వభావాన్ని రాజు నిర్ణయిస్తాడు. మొత్తంమీద భారతదేశంలో పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చట్టాల రూపకల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది.
2) రాజ్యాంగం ప్రభుత్వ నిర్మితిని నిర్దేశిస్తుంది. ఆధునిక ప్రభుత్వాలు i) శాసన నిర్మాణ శాఖ ii) కార్యనిర్వాహక శాఖ iii) న్యాయశాఖ అనే మూడు అంశాలతో కూడి ఉంటాయి. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులకు లోబడి శాసన నిర్మాణశాఖ చట్టాలను రూపొందించగా, దేశాధ్యక్షుడు లేదా రాష్ట్ర గవర్నర్, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రితో కూడిన మంత్రివర్గాలు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు సమకూర్చిన మార్గదర్శకాలకు లోబడి, విధాన నిర్ణయాలను
తీసుకొంటారు.
3) రాజ్యాంగం పాలితులు, ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని పేర్కొంటుంది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు అనేవి పౌరుల హక్కులు. ప్రభుత్వ కర్తవ్యాల గురించి సంపూర్ణంగా ప్రస్తావించాయి. భారత రాజ్యాంగం మూడో భాగం, నాల్గో భాగం (ఎ) లు రాజ్యం, పౌరుల మధ్య పరస్పర సంబంధాన్ని సూచిస్తాయి.
4) ప్రతి సంఘానికి (society) కొన్ని నిర్దిష్టమైన ఆకాంక్షలు, ఆశయాలు ఉంటాయి. రాజ్యం అనేది ప్రజల కనీస అవసరాలను సంతృప్తిపరచేందుకై, ప్రజలందరికి మంచి జీవనాన్ని అందించేందుకై ఆవిర్భవించింది. ప్రజల శ్రేయస్సుకై రాజ్యం (ప్రభుత్వం ద్వారా) కృషిచేయాల్సి ఉంటుందని రాజ్యాంగం పేర్కొంటుంది.
5) వర్తమాన, భావితరాలలో సంభవించే అస్థిర పరిస్థితులను నివారించేందుకు సర్వోన్నత ప్రతి అయిన రాజ్యాంగం దోహదపడుతుంది. ఎటువంటి మార్పులనైనా ఆమోదించేందుకు, అలాగే ఏవిధమైన ఒడిదుడుకులను తట్టుకొనే విధంగా రాజ్యాంగం రూపొందుతుంది. రాజ్యాంగం అనేది సజీవ ప్రతిగా ఉంటుంది. అది భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో రాజ్యానికి సంబంధించిన విషయాలను జతపరుస్తుంది.
ప్రశ్న 2.
భారత రాజ్యాంగం నిర్మాణం గురించి తెలపండి.
జవాబు:
ఒకవైపు భారత్, పాకిస్తాన్ల మధ్య అధికారాల మార్పిడికి సంబంధించిన కసరత్తు జరుగుతుండగా వేరొకవైపు భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించేందుకై రాజ్యాంగపరిషత్తు అనే సంస్థను ఏర్పాటు చేయడమైంది. 1946లో రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం విషయంలో ముగ్గురు మంత్రుల బృందం, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. రాజ్యాంగ పరిషత్తుకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలనీ, సభ్యులను రాష్ట్ర శాసనసభలలోని ఎన్నికైన సభ్యులు ఎన్నుకోవాలని సూచించడమైంది. రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యత్వ సంఖ్య 385కాగా అందులో 292 స్థానాలు బ్రిటీష్ ఇండియా పాలిత రాష్ట్రాలకు, 93 స్థానాలు స్వదేశీ సంస్థానాలకు కేటాయించడమైంది. 1946 డిసెంబరు 9వ తేదీన రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని అఖిల భారత ముస్లిం లీగ్ సభ్యులు బహిష్కరించడమైంది. మొత్తం మీద భారత రాజ్యాంగాన్ని ఖరారు చేసేందుకై భారత రాజ్యాంగ పరిషత్తుకు రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులు సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కేవలం పార్టీ ప్రాతిపదికపై ఎన్నుకోబడి, భారతీయ ప్రజానీకానికి చెందిన దాదాపు ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం వహించారని చెప్పవచ్చు. రాజ్యాంగ పరిషత్తులో స్ఫూర్తిదాయకంగా వ్యవహరించిన వారిలో జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లబాయ్ పటేల్ వంటి ప్రముఖుల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న ముగ్గురు నాయకులు రాజ్యాంగ ప్రధాన సూత్రాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే భారత రాజ్యాంగానికి జవసత్త్వాలను అందించినవాడిగా భారత రాజ్యాంగ ముసాయిదా సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ను పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగ ముసాయిదా రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కు సహాయ సహకారాలను అందించిన ప్రముఖ న్యాయవేత్తలలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, ఎమ్.మునీ, టి.టి కృష్ణమాచారి వంటి వారు ఉన్నారు. ఇక రాజ్యాంగానికి పునాదుల ఏర్పాటుకు సంబంధించిన నివేదికలను అందించిన కమిటీలలో కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, కేంద్రప్రభుత్వ నిర్మాణపు కమిటీ, ప్రాథమిక హక్కులు, మైనారిటీ హక్కుల కమిటీ వంటివి ఉన్నాయి. అంతిమంగా భారతరాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26వ తేదీన ఆమోదించింది. భారత రాజ్యాంగం అధీకృత ప్రతిపై రాజ్యాంగ పరిషత్తు సభ్యులు సంతకం చేసిన తరువాత అది 1950 జనవరి 26వ తేదీనాడు అమల్లోకి వచ్చింది.
ప్రశ్న 3.
భారత రాజ్యాంగం ఆధారాలను వర్ణించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత రాజ్యాంగం అనేక అనుభవాల ఆధారంగా రూపొందించి, ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలలోని ఉత్తమ లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది. అలాగే భారతదేశంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, రాజకీయ వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగాన్ని రచించడమైంది.
మొత్తం మీద భారత రాజ్యాంగ రచన సమయంలో క్రింది ఆధారాలను రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు.
1. భారత రాజ్యాంగంలోని అనేక అంశాలు బ్రిటిష్ రాజ్యాంగానికి ప్రాతిపదికగా ఉన్న ‘వెస్ట్ మినిస్టర్ తరహా పద్దతి నుండి గ్రహించడం జరిగింది. పార్లమెంటరీ సంప్రదాయాలు, సమన్యాయపాలన, కేబినెట్ ప్రభుత్వం, శాసన నిర్మాణ – కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం, ఏక పౌరసత్వం, నామమాత్ర కార్యనిర్వాహక అధిపతి వంటివి అందుకు ఉదాహరణలు.
2. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, సమాఖ్య విధానం, రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మాన ప్రతిపాదన వంటి అంశాలు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది.
3. రాజ్య విధాన ఆదేశక సూత్రాలను రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
4. జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి భారత రాష్ట్రపతికి సంబంధించిన అత్యవసర అధికారాలను రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు.
5. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, వర్తకం, వాణిజ్యం, అంతర్రాష్ట్ర రవాణా, పార్లమెంటు, శాసనసభల సభ్యుల ప్రత్యేక హక్కులు వంటి విషయాలను భారత రాజ్యాంగంలో చేర్చడమైంది.
6. భారత రాజ్యాంగంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాల శీర్షికను కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది.
7. దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికరణాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైంది.
8. గణతంత్ర రాజ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు సంబంధించిన అంశాలు ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది.
9. భారత రాజ్యాంగంలోని అత్యధిక అంశాలు భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించడమైంది. పైన పేర్కొన్న రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను గ్రహించడం వల్ల భారత రాజ్యాంగం అధిక పరిమాణంతో కూడిన సుదీర్ఘమైన రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.
దానితో భారత్ రాజ్యాంగాన్ని కొందరు ఐరావతంతో పోల్చారు.
ప్రశ్న 4.
భారత రాజ్యాంగంలోని ఏవైనా మూడు ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
1) గణతంత్ర ప్రభుత్వం : పూర్వపు, వలస సౌర్వభౌమత్వ రాజ్యం ఇంగ్లండ్ వలె కాకుండా భారత రాజ్యాంగ నిర్మాతలు భారత గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. అటువంటి సంవిధానంలో అన్ని ప్రభుత్వ పదవులు అర్హతగల పౌరులకు అందుబాటులో ఉంటాయి. వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రాచరికం అనేది అప్రజాస్వామికమైంది.
2) లౌకిక రాజ్యం : భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసననిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.
3) స్వతంత్ర న్యాయశాఖ : సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయ శాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వహక శాఖల అధికారాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భవించింది. స్వతంత్ర హోదా ఉండుటచేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని ఔచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.
ప్రశ్న 5.
“భారత రాజ్యాంగం ఆత్మయే ప్రవేశిక” వ్యాఖ్యానించండి.
జవాబు:
భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రవేశిక అత్యంత ముఖ్యమైంది. అది భారత రాజ్యాంగ మూలతత్త్వాన్ని సూచిస్తుంది. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం, హామీగా వర్ణించారు. ప్రవేశిక ‘భారతీయులమైన మేము, మా కోసం రాజ్యాంగాన్ని ‘సమర్పించుకుంటున్నాం’ అనే భావాన్ని వ్యక్తీకరించింది. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందనీ స్పష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం’ అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.
1976లో భారత రాజ్యాంగపు 42వ సవరణ చట్టం తరువాత ప్రవేశిక క్రింది విధంగా ఉంది.
“భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి; పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికీ, వారందరిలో వ్యక్తి గౌరవాన్నీ, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ; ఈ 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం”.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
లిఖిత పూర్వక రాజ్యాంగం.
జవాబు:
పెద్ద లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి అతిపెద్ద రాజ్యాంగము. ఇందులో ప్రస్తుతం 444 అధికరణాలు, 12 ప్రకరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 22 భాగాలున్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు పైగా రాజ్యాంగం సవరించబడింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగమయ్యాయి. అన్ని వివరాలు పొందుపరచడం వలన రాజ్యాంగం పెద్దదిగా తయారైంది. ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత “భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిదీర్ఘము, వివరణాత్మక రాజ్యాంగం” అని వర్ణించాడు. కొన్ని అలిఖిత నియమాలు కూడా ఉన్నాయి.
ప్రశ్న 2.
దృఢ రాజ్యాంగం.
జవాబు:
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దువంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి | పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.
ప్రశ్న 3.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు:
భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ నిర్మాతలు | ఐర్లాండ్ తరహాలో ఎన్నికైన దేశాధ్యక్షుడు ఉన్న పద్ధతిని సూచించారు. బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో మిగిలిన లక్షణాలైన రెండు రకాల కార్య వర్గాధిపతులు, ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత, పార్లమెంటుకు కార్యవర్గంపై నియంత్రణ, రాజ్యాధినేతకు నామమాత్ర కార్యనిర్వాహక వర్గ హోదా వంటి అంశాలను భారత రాజకీయ వ్యవస్థలో ఆమోదించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సూచించడం జరిగింది.
ప్రశ్న 4.
ప్రాథమిక హక్కులు.
జవాబు:
రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. ఈ ప్రాథమిక హక్కులను 7 రకాలుగా విభజించవచ్చును. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ఇవి ప్రజలకు స్వేచ్ఛనిస్తాయి. వీటికి భంగం కలిగితే పౌరులు న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు. స్వేచ్ఛ హక్కు, సమానత్వపు ” హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు మొదలగునవి ప్రాథమిక హక్కులు. అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి వీటిని తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాథమిక హక్కులు చాలా అవసరము. ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి. ఇవి నిరపేక్షమైనవి కావు.
ప్రశ్న 5.
లౌకిక రాజ్యం.
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక రాజ్యానికి ప్రతీకగా ఉంటుంది. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్క మతాన్ని |అధికార మతంగా గుర్తించదు. మతప్రాతిపదికపై కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి శాసన నిర్మాణంలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకై రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించింది.
ప్రశ్న 6.
వయోజన ఓటుహక్కు.
జవాబు:
పార్లమెంటు, రాష్ట్రశాసన సభలకు ఎన్నికలలో ప్రతినిధులను ఎన్నుకొనేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటుహక్కును ప్రసాదించింది. దాని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటుహక్కు ఇచ్చింది. అటువంటి ఏర్పాటు భారత ప్రజాస్వామ్యానికి విశేషమైన ప్రాముఖ్యతనిచ్చి సామాన్య ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టలను పెంపొందిస్తుంది. సమానత్వ సూత్రాన్ని సమర్థించి, మైనారిటీల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, సమాజంలోని బలహీనవర్గాలలో నూతన ఉత్తేజాలకు వీలు కల్పిస్తుంది.
ప్రశ్న 7.
ద్విసభా విధానం.
జవాబు:
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానిని అనుగుణంగా భారత పార్లమెంటులో లోక్సభ (దిగువ సభ), రాజ్యసభ (ఎగువ సభ), అనే రెండు సభలు ఉంటాయి. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షణకు ఉద్దేశించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాలు అనుసరిస్తున్న ద్విసభావిధానాన్ని మన దేశానికి సూచించడమైంది.
ప్రశ్న 8.
ఆదేశిక నియమాలు.
జవాబు:
భారత రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశిక నియమాలు ప్రస్తావించాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు వాటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ నియమాలు సమాఖ్య రాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. అవి ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. సమానమైన పనికి సమాన వేతనం, ఉపాధి అవకాశాల కల్పన, సంపద న్యాయమైన రీతిలో పంపిణీ, వృద్ధాప్య పించన్లు, అస్వస్థత నుంచి కాపాడటం, శ్రామికులకు విశ్రాంతి, వన్య ప్రాణుల సంరక్షణ, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను కాపాడడం వంటివి ఆదేశిక నియయాలకు కొన్ని ఉదాహరణలు. ఆదేశిక సూత్రాలను న్యాయ స్వభావం లేకపోయినప్పటికీ వాటిని ఏ బాధ్యతాయుత ప్రభుత్వము విస్మరించరాదు.
ప్రశ్న 9.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి.
జవాబు:
సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైంది. శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖల అధికారాలు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అది అవసరమవుతుంది. భారత సుప్రీంకోర్టు క్రమేణా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైందిగా ఆవిర్భివించింది. స్వతంత్ర హోదా ఉండుట చేత, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక సంస్థల చర్యలను విధానాలలోని జౌచిత్యాన్ని నిర్ణయించగలుగుతారు.
ప్రశ్న 10.
ప్రవేశిక. [Mar. ’17, ’16]
జవాబు:
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం, హామీగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని స్పష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.