AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 13th Lesson సమాకాలీన ప్రపంచ చరిత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలను, దాని విధులను గూర్చి రాయండి.
జవాబు:
1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఐ.రా.స లక్ష్యాలైన భద్రత, న్యాయం, సంక్షేమం, మానవ హక్కులు అనే లక్ష్యాలను సాధించడానికి అనేక విభాగాలున్నాయి.

ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగాలు:
సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ): ఐ.రా.సలోని ప్రతి సభ్య దేశము సాధారణ సభలో సభ్యులే. సాధారణ సభ ప్రతి సంవత్సరానికొకసారి సమావేశమౌతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి.

సాధారణ సభ ఐ.రా.స. పనితీరుని వివరిస్తుంది, సమీక్షిస్తుంది, పర్యవేక్షిస్తుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలు నెలకొల్పుటకు చర్చలు, సూచనలు చేస్తుంది. ఐ.రా.స. లోని వివిధ సంస్థలలో నియామకాలు చేపడుతుంది. ఐ.రా.స విత్త వ్యవహారాలను నియంత్రిస్తుంది.

భద్రతామండలి: ఇది ఐ.రా.స కార్యనిర్వాహక అంగం. దీనిలో 5 శాశ్వత సభ్యదేశాలు మరియు 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు చైనాలు సభ్యదేశాలు. మిగిలిన 10 తాత్కాలిక సభ్యదేశాలు రెండు సంవత్సరాల కాలపరిమితి కొరకు సాధారణ సభ రొటేషన్ పద్ధతిలో ఎన్నుకుంటుంది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

సాధారణ విషయాలలో భద్రతామండలి సభ్యదేశాలు 15 ఓట్లలో 9 ఓట్లు వస్తే మెజారిటీగా పరిగణించబడతాయి. కానీ ముఖ్యమైన అంశాలలో చర్చ జరిగేటపుడు తొమ్మిది ఓట్లలో ఐదు శాశ్వత సభ్యదేశాల ఓట్లు ఖచ్చితంగా తీర్మానానికి అనుకూలంగా ఉండాలి. శాశ్వత సభ్యదేశాలకు వీటో హక్కు ఉంటుంది. భద్రతామండలి అవసరమైనప్పుడల్లా సమావేశమవుతుంది. భద్రతామండలి సభ్యదేశాల ప్రతినిధులు న్యూయార్క్ లో ఉంటారు.

ఆర్థిక మరియు సాంఘిక మండలి: ఈ మండలిలో 54 మంది విభిన్న దేశాలకు చెందిన సభ్యులు ఉంటారు. వీరు సాధారణ సభచే ఎంపిక చేయబడతారు. వీరి కాలపరిమితి 3 సంవత్సరాలు. ప్రతి మూడు సంవత్సరాలకు మూడవ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. కొత్త సభ్యులు వారి స్థానాలలో ఎన్నిక అవుతారు. ఆర్థిక మరియు సాంఘిక మండలి సంవత్సరానికి రెండు సమావేశాలు నిర్వహిస్తుంది. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సమస్యలను పరిష్కరించడమే దీని ముఖ్య విధి.

ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, మానవ హక్కులకు హామీ ఇవ్వడం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం. వివిధ దేశాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ మండలి కృషి చేస్తుంది. ఈ మండలి యునెస్కో, I.M.F, W.H.O. I.C.O, వంటి ఇతర సంస్థల సహకారంతో పనిచేస్తోంది.

ధర్మకర్తృత్వ మండలి: ఇది వలస దేశాల ప్రతినిధులతో, సాధారణ సభచే ఎన్నుకొనబడిన ప్రతినిధులతో కూడి ఉంటుంది. ఈ మండలి ముఖ్య విధి తనకు అప్పగించబడిన ప్రాంతాల అభీష్టాలను నెరవేర్చడం మరియు ఐ.రా.స. ధర్మకర్తృత్వంలో ఉన్న దేశాల పాలనలో జనరల్ అసెంబ్లీకి సహాయపడటం దీని ముఖ్య విధి.

అంతర్జాతీయ న్యాయస్థానం ఐ.రా.స యొక్క న్యాయమూర్తుల పదవీకాలం 9 సంవత్సరాలు. దేశాల మధ్య వచ్చే న్యాయ వివాదాలను పరిష్కరించడం దీని ముఖ్య విధి. భద్రతామండలి, జనరల్ అసెంబ్లీలకు అవసరమైనపుడు న్యాయ సలహాలను ఇస్తుంది.

సచివాలయం (సెక్రటేరియట్): ఐ.రా.స. రోజువారీ కార్యక్రమాలను సమితి సచివాలయం నిర్వహిస్తుంది. సచివాలయం ముఖ్య పాలనాధికారి సెక్రటరీ జనరల్ పదవీకాలం ఐదు సంవత్సరాలు. భద్రతామండలి ప్రతిపాదనతో సెక్రటరీ జనరల్ నియమింపబడతాడు. వివిధ దేశాలకు చెందిన అనేకమంది అధికారులు సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పనిచేస్తారు. సచివాలయం ఐ.రా.స.కు చెందిన అన్ని రంగాలు రికార్డులను భద్రపరుస్తుంది. ఐ.రా.స. వివిధ రంగాల వార్షిక నివేదికలను జనరల్ అసెంబ్లీకి సమర్పిస్తాడు.

ప్రశ్న 2.
ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలను తెలపండి.
జవాబు:
ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తొలినాళ్ళలో అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసింది. కానీ అనేక సందర్భాలలో రష్యా వీటో హక్కును ఉపయోగించడం వలన కొన్ని సమస్యల పరిష్కారంలో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఐ.రా.స. స్థాపించబడిన కొద్ది కాలంలోనే అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. 1946లో రష్యా, ఇరాన్ ల మధ్య సమస్యను పరిష్కరించింది. ఫ్రాన్స్కు వ్యతిరేకంగా సిరియా, లెబనాన్ల వివాదం, డచ్-ఇండోనేషియా సమస్య, పాలస్తీనా సమస్య, కొరియా వివాదం, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపింది.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇండోనేషియా ప్రజలు హాలెండ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ దేశాన్ని స్వతంత్రంగా, రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకున్నారు. హాలెండ్, ఇండోనేషియా స్వాతంత్య్రాన్ని తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య సాయుధ పోరాటం మొదలయ్యింది. భద్రతామండలి జోక్యం చేసుకుని ఇరు దేశాలను యుద్ధ విరమణకు అంగీకరింపజేసింది. ఇండోనేషియాకు స్వాతంత్య్రం ఇప్పించడంలో సాయపడింది.

పాలస్తీనా విషయంలో అరబ్లకు, బ్రిటన్కు మధ్య విభేదాలు రూపుమాపడానికి ఐ.రా.స. 1948 ఏప్రిల్లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను అనుసరించి పాలస్తీనా నుండి సాయుధ బలగాలను తొలగించి దాని అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవద్దని బ్రిటన్ ను ఐ.రా.స. ఆదేశించింది.

ఇజ్రాయేల్ మీద అరబ్లు దాడి చేసినపుడు ఐ.రా.స. జోక్యం చేసుకొని ఆయుధ పోరాటాన్ని నివారించి వాటి మధ్య యుద్ధ విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది. పాలస్తీనా కాందిశీకుల కొరకు సహాయ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారిని ఆదుకున్నది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా స్వాతంత్ర్యాన్ని పొందింది. కానీ, అది రెండుగా విభజింపబడింది. ఉత్తర కొరియా అప్పటి యు.ఎస్.ఎస్.ఆర్ ‘ నియంత్రణలోకి, దక్షిణ కొరియా అమెరికా, బ్రిటన్, చైనాల ఉమ్మడి నియంత్రణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాపై దాడిచేసింది. ఈ అంశంలో ఐ.రా.స. నిర్మాణాత్మక పాత్ర పోషించింది. జనరల్ మెక్ ఆర్థర్ నాయకత్వంలో దళాలను పంపి ఉత్తర కొరియా ఆగడాలను నియంత్రించింది. 1953లో ఇరుదేశాల మధ్య సంధి కుదిర్చి శాంతిని నెలకొల్పి యుద్ధాన్ని నివారించింది. 1966లో సూయజ్ కెనాల్ విషయంలో నెలకొన్న సంక్షోభాన్ని ఐ.రా.స. సమర్థవంతంగా పరిష్కరించింది.

ప్రశ్న 3.
ప్రచ్ఛన్న యుద్ధమనగానేమి ? అందులో భాగంగా ఏర్పడ్డ ఒడంబడికలు మరియు ప్రణాళికలను గురించి రాయండి.
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రష్యా మరియు అమెరికాలు దగ్గరయ్యాయి. కానీ యుద్ధం అంతమైన తరువాత వారి సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. వారి మధ్య శత్రుభావం ఏర్పడింది. ఈ వైరం యావత్ ప్రపంచాన్ని మూడవ ప్రపంచయుద్ధ అంచుల వరకు తీసుకొనిపోయింది. ఈ రెండు వ్యతిరేకశక్తుల మధ్య ఆయుధాలతో నిజమైన | పోరాటం జరగలేదు.

ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య ఉన్న సిద్దాంతపరమైన విభేదాలే ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణం. అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ పాశ్చాత్యశక్తి, కమ్యూనిజంపై దాడి చేస్తుందేమోనని రష్యా భావించింది. అందువల్ల రష్యా తూర్పు యూరప్లో ఒక సోవియట్ కూటమిని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించింది. యూరప్లో కమ్యూనిజం వ్యాప్తి, సోవియట్ యూనియన్ కూటమి అనేది పాశ్చాత్యదేశాలు, ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని వ్యతిరేకించడానికి దారితీసాయి. ఈ దేశాలు మరో సైనికశక్తి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ విధంగా ప్రపంచం రెండు విరుద్ధ శక్తి కూటములుగా విడిపోయింది. వీటిలో ఒకటి అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య శక్తి కూటమి కాగా మరొకటి యు.ఎస్.ఎస్.ఆర్. నాయకత్వంలోని ప్రాచ్యశక్తి కూటమి అయింది.

యు.ఎస్.ఎ. మరియు రష్యా దేశాల మధ్య మొదటగా విభేదాలు రావడానికి కారణం పోలెండ్, యుగోస్లేవియాల నాజీ వ్యతిరేక ప్రతిఘటన, సైనిక వ్యూహానికి యుద్ధానంతర పునర్నిర్మాణానికి సంబంధించిన సమన్వయం వంటి అంశాలలో ఇరుదేశాల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి.

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందునుండే యూరప్ దేశాలైన పోలెండ్, బల్గేరియా, రుమేనియా, హంగరీ, యుగోస్లేవియా దేశాలలో రష్యా కమ్యూనిస్ట్ పాలన విధించింది. ఆ తరువాత సోవియట్ యూనియన్ తన దృష్టిని పశ్చిమ యూరప్ వైపునకు మళ్ళించింది. రాయితీలు పొందడానికి ఇది టర్కీ మీద, ఇరాక్ మీద ఒత్తిడి చేసింది. గ్రీసు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ విప్లవం తీసుకురావడానికి పథకం వేసింది. ఇటలీలో తన ప్రభావాన్ని విస్తరించింది. సోవియట్ రష్యాలో చేపట్టిన ఈ చర్యలను పాశ్చాత్య దేశాలు గొప్ప ఆందోళనతో గమనించాయి.

కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను అమెరికా చేపట్టింది. యూరప్ ఖండంలో కమ్యూనిస్ట్ ప్రభావం పెరగడాన్ని అరికట్టడానికి ట్రూమన్ సిద్ధాంతాన్ని, మార్షల్ ప్రణాళికను ప్రతిపాదించింది. ఈ చర్యలు, ప్రతిచర్యలే ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది పలికాయి.

ట్రూమన్ సిద్ధాంతము: గ్రీస్, టర్కీలకు సైనిక ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించిన ప్రతిపాదనే ట్రూమన్ సిద్ధాంతం. సాయుధ తిరుగుబాట్లు లేదా విదేశీ ఒత్తిడి ద్వారా స్థానికులను అణచడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించే ప్రజలకు సహాయం అందించే అమెరికా విధానాన్ని ట్యూమన్ సిద్ధాంతం అన్నారు. ఈ సిద్ధాంతం ఈ రెండు దేశాలలో విజయవంతమైంది.

మార్షల్ ప్రణాళిక: యూరప్లో కమ్యూనిజం పెరుగుదలను నివారించడానికి అమెరికా ఒక యూరప్ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమెరికా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ‘మార్షల్ ప్రణాళిక’ గా పేర్కొనడం జరిగింది. అమెరికా రాజ్య కార్యదర్శి అయిన మార్షల్ పేరునే దీనికి పెట్టడం జరిగింది.

ట్రూమన్ సిద్ధాంతానికి పొడిగింపే మార్షల్ ప్రణాళిక. ఈ ప్రణాళిక సర్వ సాధారణంగా యూరప్్కంతా వర్తిస్తుంది. ఇది ఒక ప్రత్యేక రాజ్యానికి పరిమితమైనది కాదు. ఇది నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది కాబట్టి విస్తృతమైన కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించింది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి దీన్ని ఉద్దేశించడమైనది. కమ్యూనిజంకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనే అమెరికా దృఢ నిశ్చయాన్ని కూడా ఇది స్పష్టం చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం యూరప్ లోని అనేక దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందున్న పటిష్ట స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి అనేక ఒప్పందాలు,
సంధులకు దారితీసాయి.

బ్రస్సెల్స్ సంధి: రష్యా ఆధిపత్యాన్ని నివారించడానికి బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ మొదలైన దేశాలు 1948 మార్చిలో బ్రస్సెల్స్ సంధి మీద సంతకాలు చేసాయి. ఈ సంధి పరస్పర సైనిక, ఆర్థిక, రాజకీయ సహకారాన్ని సమకూర్చింది.

నాటో: 1949 ఏప్రియల్ 4న సోవియట్ కూటమికి వ్యతిరేకంగా అమెరికా, కెనడా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లాడ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, గ్రీస్, టర్కీ దేశాలతో కలిసి నాటో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది సోవియట్ కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటయిన రక్షణాత్మక వ్యవస్థ. నాటో సభ్యులు విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా వ్యష్టిగాకాని, సమిష్టిగా కాని పోరాడటానికి సంయుక్తంగా ప్రతిఘటించడానికి అంగీకరించారు. నాటో ఒప్పందం తర్వాత పశ్చిమ యూరప్ లో యుద్ధం జరగలేదు.

మాల్తోవ్ ప్రణాళిక: దీనిని రష్యా విదేశాంగ మంత్రి మాల్తోవ్ ప్రతిపాదించాడు. ఈ ప్రణాళికలో కమ్యూనిస్టు దేశాలన్నింటికి సభ్యత్వం ఉండేది. దీనిలో రష్యా, బల్గేరియా, పోలెండ్, రుమేనియా, తూర్పు యూరప్, మంగోలియా సభ్యులుగా ఉన్నారు. మార్షల్ ప్రణాళికకు ప్రతిచర్యగా రష్యా ప్రారంభించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

వార్సా సంధి: అమెరికా ఏర్పాటు చేసిన నాటోకు వ్యతిరేకంగా 1955 మేలో రష్యా కమ్యూనిస్టు దేశంతో ఈ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అల్బేనియా, రష్యా, బల్గేరియా, హంగేరీ, తూర్పు జర్మనీ, జెకోస్లోవేకియా, రుమేనియా, పోలెండ్ దేశాలు ఆ ఒప్పందంపై సంతకం చేసారు. సంధి ప్రకారం ఏ సభ్యదేశమయినా విదేశీ ముట్టడికి గురైతే ఇతర సభ్యదేశాలన్ని ఆ ముట్టడిదారుడిని సమిష్టిగా ప్రతిఘటించాలి.

ఈ రెండు కూటముల విభజన 1991 డిసెంబర్ లో సోవియట్ సమాఖ్య పతనానంతరం గొప్ప మార్పులకు లోనయింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అలీనోద్యమ ఆవిర్భావం గురించి వ్రాయండి.
జవాబు:
అమెరికా, రష్యాలు రెండు కూటములుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న రోజులలో అలీనోద్యమం 1961లో ప్రారంభమయింది. కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోని కొన్ని వారు కలిసి ఈ అలీనోద్యమాన్ని ప్రారంభించారు.

అలీనోద్యమం 1955 బాండుంగ్ సదస్సులో అంకురార్పణ జరిగింది. 23 ఆసియా దేశాల, 6 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఇండోనేషియాలో సదస్సులో పాల్గొన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో, భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,ఈజిప్ట్కు చెందిన నాజర్ అలీనోద్యమంలో కీలక పాత్ర వహించారు. చైనా ప్రధాని చౌ-ఎన్-లై కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అలీనోద్యమ ముఖ్య ఉద్దేశాలను పంచశీల అంటారు. అవి:

  1. సభ్యదేశాల సార్వభౌమాధికారాన్ని, వారి సహజ సరిహద్దులను గౌరవించుట.
  2. సభ్యదేశాలు పరస్పరం యుద్ధానికి దిగరాదు..
  3. ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరాదు.
  4. పరస్పర లాభాల కోసం సహకారాన్ని పెంచుకోవాలి.
  5. శాంతియుతంగా సభ్యదేశాలతో మెలగుట.

అలీనోద్యమాన్ని బలపరచిన దేశాలు ప్రచ్ఛన్న యుద్ధంలో భాగమైన అమెరికా కూటమిలోగాని, సోవియట్ కూటమిలోగాని చేరడానికి ఇష్టపడలేదు. ఆ విధంగా అలీనోద్యమం కొత్తగా స్వాతంత్రాన్ని పొందిన దేశాలు వారి స్వాతంత్రాన్ని కాపాడుకొంటూ అంతర్జాతీయ సమస్యలందు తటస్థంగా ఉండటానికి ఉద్దేశించబడింది.

ప్రశ్న 2.
నమీబియా ఎదుర్కొన్న సమస్యను గురించి SWAPO ఏవిధంగా పరిష్కరించిందో తెలపండి.
జవాబు:
దక్షిణ పశ్చిమ ఆఫ్రికా ప్రజల సమాఖ్య (SWAPO) ప్రస్తుతం నమీబియాగా ఏర్పడింది. ఈ ప్రాంతం జర్మనీ దేశానికి వలసగా మారింది. అక్కడి ఆఫ్రికా ప్రజలు జర్మనీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. జర్మనీ వారు కౄరంగా 80 వేల మంది నమీబియన్లను చంపివేశారు.

మొదట ప్రపంచ యుద్ధంలో జర్మనీ దక్షిణాఫ్రికా చేతిలో ఓడటంతో నానాజాతి సమితి నమీబియాను పశ్చిమ |ఆఫ్రికా పాలనతో ఉండేట్లు ఏర్పాటు చేసింది. కానీ దక్షిణాఫ్రికా వారు నమీబియాను ఆక్రమించుకున్నారు. 1968లో దక్షిణ పశ్చిమ ఆఫ్రికాకు నమీబియా అని నామకరణం చేసారు. భద్రతా మండలి వారు దక్షిణాఫ్రికాను నమీబియాపై ఆధిపత్యాన్ని వదలమని వత్తిడి చేసారు.

దక్షిణాఫ్రికా పాలనకు వ్యతిరేకంగా స్థానిక నమీబియాన్లను ఐక్యం చేయడానికి SWAPO (సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. వీరి ముఖ్య ఆశయం సంపూర్ణ స్వాతంత్రం. SWAPO గెరిల్లా యుద్ధం ముమ్మరంగా సాగించింది. 74 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నమీబియా స్వాతంత్రాన్ని సాధించారు. SWAPO నాయకుడైన సామ్ నుజోమ్ స్వతంత్ర నమీబియాకు తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

ప్రశ్న 3.
ఐరోపా ఆర్థికమండలి వెనుక లక్ష్యాలను తెలుపండి.
జవాబు:
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం ప్రతి ఐరోపా దేశం వారు రెండు పెద్ద అగ్రరాజ్యాలతో పోలిస్తే చాలా చిన్న దేశాలుగా ఉన్నామని, బలహీనంగా ఉన్నామని భావించారు. అందువలన ఐరోపా దేశాల వారు పరస్పర స్నేహాన్ని, సహకారాన్ని పెంపొందించుకోవాలని అందరూ కలిసి సమిష్టి రాజకీయ, ఆర్థిక, సైనిక కృషి చేయాలని నిర్ణయించారు.

1947లో 16 ఐరోపా దేశాలవారు కలిసి అమెరికా వారి మార్షల్ పథకం ద్వారా లభించే సహాయాన్ని పంచుకోవడానికి ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. 1949లో నాటో ఏర్పడింది. 1951లో ఆరు పశ్చిమ ఐరోపా దేశాలు బొగ్గు, ఉక్కు ఖనిజాలకు సంబంధించి సంయుక్త వాణిజ్యాన్ని నిర్వహించుకోవడానికి సమాఖ్యగా ఏర్పడ్డారు.

ఐరోపా ఆర్థిక సమాఖ్య ‘రోమ్ ఒప్పందం’ ద్వారా 1957లో ఏర్పడింది. యూరప్ లోని అనేక దేశాల వారు దీనిలో సభ్యులు. వీరు వెనుకబడిన దేశాల వారి వస్తువులను దిగుమతి చేసుకునేది మరియు వాణిజ్యాన్ని ఐరోపా ఆర్థిక సమాఖ్య వారే నిర్వహించేవారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బ్రెసెల్స్ లో ఉంది. సభ్య దేశాల మధ్య ఏర్పడే ఆర్థికపరమైన వివాదాలను పరిష్కరిస్తూ, స్నేహపూరిత వాతావరణం నెలకొల్పటానికి కృషి చేస్తుంది. చివరగా ఈ యూనియన్ ‘యూరో’ అనే ఒక సంయుక్త ద్రవ్య చలామణి ఏర్పాటు చేసింది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
OPEC సంస్థలో సభ్యులు ఎవరు ?
జవాబు:
చమురు ఉత్పత్తిచేసే దేశాల వారు 1962లో బాగ్దాద్ నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల వారు ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. దీనిని OPEC (ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) అంటారు. ఈ సమావేశానికి ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా దేశాల వారు హాజరయ్యారు. కాలక్రమేణా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అనేక చమురు ఉత్పత్తి దేశాల వారు ఇందులో చేరారు. OPEC ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో నెలకొల్పారు.

ప్రశ్న 2.
సార్క్ సంస్థ సభ్యదేశాలు ఏవి ?
జవాబు:
దక్షిణాసియాలో ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుట, స్వావలంబన లక్ష్యంలో సార్క్న ఏర్పాటు చేయడం జరిగింది. SAARC (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్)ను దక్షిణాసియా ప్రాంత దేశాలు 1985లో ఢాకా నగరంలో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో స్థాపించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు ఇందులో సభ్యదేశాలు.

AP Inter 2nd Year History Study Material Chapter 13 సమాకాలీన ప్రపంచ చరిత్ర

ప్రశ్న 3.
అట్లాంటిక్ చార్టర్.
జవాబు:
ఆగస్ట్ 1944న అమెరికా అధ్యక్షుడు F.D. రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధానమంత్రి అట్లాంటిక్ సముద్రం మీద సమావేశమై ఒక తీర్మానాన్ని రూపొందించారు. దానిని అట్లాంటిక్ చార్టర్ అంటారు.

దాని లక్ష్యాలు: అంతర్జాతీయ శాంతి భద్రతలు పెంచడం, దేశాల మధ్య స్నేహాన్ని పెంచడం, ప్రజల ప్రాథమిక హక్కులను గుర్తించడం. చార్టర్ సుత్రాల ప్రకారం సభ్యదేశాల మధ్య సమానత్వాన్ని అంగీకరించాలి. తమలోని విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఏదైనా దేశం ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘిస్తే ఐక్యరాజ్య సమితి తీసుకునే చర్యలకు అండగా ఉండాలి.