AP Inter 2nd Year Civics Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కుల రకాలను వివరింపుము.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు గల అంశాలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్ధకం చేస్తాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

వీటిని గురించి విపులంగా చర్చిద్దాం
1) సమానత్వపు హక్కు (14 నుండి 18 వరకు గల ప్రకరణలు): ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.
పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ ప్రకరణ స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాలు సందర్శించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపించకూడదని పేర్కొంది.

16వ ప్రకరణ ప్రకారం రాజ్యానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరలందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో మతం, తెగ, కులం, లింగం, పుట్టుక వంటి అంశాలేవి ప్రధానమైనవి కావని ఆ ప్రకరణ పేర్కొంది.

17వ ప్రకరణ అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. ఈ విషయంలో 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైంది.

18వ ప్రకరణ ప్రకారం పౌరలకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు.

2) స్వేచ్ఛా హక్కు (19 నుండి 22 వరకు గల ప్రకరణలు): 19వ రాజ్యాంగ ప్రకరణ భారత పౌరులకు 7 రకాల స్వాతంత్ర్యాలను ప్రసాదించింది. అవి

  1. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వాతంత్య్రం.
  2. శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్య్రం.
  3. సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  4. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్య్రం.
  5. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  6. ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్య్రం.
  7. ఏ వృతినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

20వ ప్రకరణ వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది. ఈ ప్రకరణ అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని పేర్కొంటుంది.

21వ అధికరణం ఏ ఒక్క వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారం తప్ప మరో విధంగా అతని జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. ఈ ప్రకరణలను అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా రద్దుచేయరు.

22వ ప్రకరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్భంధంలోకి తీసుకోకూడదు. నిర్భంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలపటంతోపాటు న్యాయ సహాయం పొందటానికి వీలు కల్పించాలి. ఉదా: నిర్భంధంలోకి తీసుకున్న వ్యక్తిని 24 గం||లలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి.

3) పీడనను నిరోధించే హక్కు (23 మరియు 24 ప్రకరణలు): 23వ ప్రకరణ ప్రకారం రాజ్యంగాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకూడదు. మనషుల క్రయ విక్రయాలు జరపటం, ప్రతిఫలం చెల్లించకుండా బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకోవటం నిషేధం.

24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కల్గించే పనులలో నియమించకూడదు. బాల కార్మికత్వం చేయించుకొనుట చట్టవిరుద్ధం.

4) మత స్వాతంత్ర్యపు హక్కు (25 నుండి 28 ప్రకరణలు): 25వ ప్రకరణ ప్రకారం ప్రతి వ్యక్తి ప్రజా భద్రత, నైతికతకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంబించటానికి, ప్రచారం చేసుకొనటానికి హక్కుంది. 26వ ప్రకరణ ప్రతి వ్యక్తికి ఈ క్రింది హక్కులను ప్రసాదించింది.

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్థులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి
  4. చట్టప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవడానికి

27వ ప్రకరణ మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. ఏదో ఒక మత ప్రయోజనాలకై రాజ్యం వ్యక్తుల నుంచి పన్నుల రూపంలో ఎలాంటి మొత్తాలను వసూలు చేయకూడదని నిర్దేశించింది.

28వ ప్రకరణ రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యాసంస్థలలో మతపరమైన బోధనలు విషేధించడమైంది.

5) సాంస్కృతిక మరియు విద్యా హక్కు (29 మరియు 30 ప్రకరణలు): భారతపౌరులకు సాంస్కృతిక, విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగము ఈ హక్కుల ద్వారా ప్రసాదించింది. 29వ ప్రకరణ ప్రకారం ప్రతి పౌరుడూ స్వంతభాష, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చు. ఈ విషయంలో మత, భాష, ప్రాంతీయ అంశాలేవీ ఆటంకంగా ఉండవు. అల్పసంఖ్యాకులు వారి భాష, సంస్కృతులను పరిరక్షించుకోవచ్చని ఈ హక్కు పేర్కొంది.

30వ ప్రకరణం ప్రకారం ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా గానీ, పాక్షికంగాగానీ ఆర్థిక సహాయం పొందే విద్యార్థులలో కులం, నుతం, ప్రాంతం, వర్ణం, భాష లేదా లింగపరమైన అంశాల ప్రాతిపదికపై పౌరులకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

6) రాజ్యాంగ పరిహారపు హక్కు (32వ ప్రకరణ): ఈ హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలోకి అత్యంత ప్రధానమైంది. ఈ హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగాను, కంచెగాను, భద్రతా కవచంగాను పరిగణించటమైంది. 32వ ప్రకరణ ప్రకారం భారత పౌరల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు, రక్షణకు సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారంటో మొ॥ రిట్లను జారీచేసే అధికారాన్ని కల్గి ఉన్నాయి.

ప్రశ్న 2.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన వివిధ రకాల ఆదేశక సూత్రాలను వివరింపుము. [Mar. ’17]
జవాబు:
భారత రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశక సూత్రాలకు సంబంధించినది. రాజ్యాంగంలోని 36వ అధికరణం నుండి 51వ అధికరణం వరకు అదేశక సూత్రాలకు సంబంధించినవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఈ సూత్రాలు. ఇవి ప్రభుత్వానికి ప్రజలపట్ల గల బాధ్యతలను వివరిస్తాయి. ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకునేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి. వీటిని ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.

ఆదేశక సూత్రాల వర్గీకరణ: మన రాజ్యాంగంలో అదేశక సూత్రాలను ప్రత్యేకంగా వర్గీకరణ లేనప్పటికి ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలు పతనాసౌలభ్యం కొరకు ఆదేశ సూత్రాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: 1. సామ్యవాద సూత్రాలు, 2. ఉదారవాద సూత్రాలు, 3. గాంధేయ సూత్రాలు. వీటిని గురించి క్రింది విధంగా వివరించవచ్చును.

1. సామ్యవాద సూత్రాలు: ఈ సూత్రాలు సామ్యవాద, శ్రేయోరాజ్య సిద్ధాంత స్థాపన లక్ష్యంగా సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించే ఉద్దేశ్యంతో అదేశక సూత్రాల జాబితాలో చేర్చారు. రాజ్యాంగంలోని 38, 39, 41, 42, 43, 46, 47 ప్రకరణలు ఆదేశక సూత్రాలలోని సామ్యవాద ఆదర్శాల గురించి వివరించాయి.
1. 38వ ప్రకరణ ప్రకారం రాజ్యం ప్రజలందరికీ న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించి పెంపొందించడానికి కృషి చేయాలి. రాజ్యంలో ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయాలు దక్కేటట్లుగా చూడాలి.

2. 39వ ప్రకరణ ప్రకారం రాజ్యం క్రింద పేర్కొన్న చర్యలను అమలులో ఉంచడానికి కృషి చేయాలి.

  1. తగినంత జీవనోపాధి అవకాశాలను కల్పించడం.
  2. సమిష్టి సంక్షేమానికి దోహదపడే భౌతిక వనరులను సంపదను పంపిణీ చేయడం.
  3. స్త్రీ, పురుషులందరికీ సమాన వేతనాన్ని అందించడం.
  4. బాలకార్మికుల రక్షణ.
  5. జాతీయ సంపదను వికేంద్రీకరించడం.
  6. కార్మికుల ఆరోగ్యం, శక్తి దుర్వినియోగం కాకుండా చూడడం.
  7. బాలబాలికలను, యువకులను దోపిడీకి గురికాకుండా రక్షణ.

3. 41వ ప్రకరణ ప్రకారం నిరుద్యోగం, వృద్ధాప్యం, అస్వస్థత, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడిన వారికి పనిహక్కు, విద్య, ప్రభుత్వ సహాయం అందే విధంగా చూడాలి.

4. 42వ ప్రకరణ ప్రకారం కార్మికులకు న్యాయబద్ధమైన మానవతా పరిస్థితులతో కూడిన పనిని కల్పించడం, స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలను రాజ్యం కల్పించాలి.

5. 43వ ప్రకరణ ప్రకారం రాజ్యం వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులందరికీ తగిన పనిని కల్పించడం. మంచి ప్రమాణంతో కూడిన జీవనాన్ని గడపడానికి అవసరమైన పరిస్థితులను, విరామాన్ని, సాంఘిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించడానికి కృషిచేయాలి.

6. 47వ ప్రకరణ ప్రకారం ప్రజల పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేయాలి.

2. ఉదారవాద సూత్రాలు: ప్రాథమిక విద్య, ఉమ్మడి పౌరస్మృతి, స్వతంత్ర న్యాయశాఖ, అంతర్జాతీయ శాంతి వంటి ఆశయాల సాధన కోసం ఉదారవాద సూత్రాలను చేర్చారు. వాటిని రాజ్యాంగంలోని 44, 45, 50, 51 ప్రకరణలలో పేర్కొనడమైంది.
1. 44వ ప్రకరణ ప్రకారం దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతి (Common civil code) ని రాజ్యం రూపొందించాలి.

2. 45వ ప్రకరణ ప్రకారం 14సంవత్సరాలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్భంద విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి. ఈ చర్యకు బదులుగా బాలబాలికలు 6సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు వారికి శిశుసంరక్షణ, విద్యలను సమకూర్చడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం (86వ రాజ్యాంగ సవరణ) చట్టం 2002 సూచించింది.

3. 48వ ప్రకరణ ప్రకారం వ్యవసాయం, పశుపోషణలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

4. 49వ ప్రకరణ ప్రకారం జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువులను రాజ్యం సంరక్షించాలి.

5. 48ఎ ప్రకరణ అనుసరించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అడవులు, వన్యప్రాణులను కాపాడటానికి రాజ్యం కృషిచేయాలి.

6. 50వ ప్రకరణ ప్రకారం ప్రజా సేవల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

7. 51వ ప్రకరణ ప్రకారం రాజ్యం (ఎ) అంతర్జాతీయ శాంతిని, న్యాయాన్ని, భద్రతను పెంపొందించడం, (బి) దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవప్రదమైన, దౌత్య సంబంధాలను నిర్వహించడం, సి) చారిత్రక కట్టడాలను, సంస్కృతిని పరిరక్ష కల్పించటం, ఇ) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రోత్సహించడం వంటి చర్యల అమలుకోసం కృషిచేయాలి.

3. గాంధేయ వాద సూత్రాలు: భారతదేశంలో ఆదర్శపాలనను అందించడానికి గాంధేయ సూత్రాలు దోహదపడతాయి. గాంధీజీ ప్రవచించిన ఆదర్శాలను ఆదేశక సూత్రాలలోని 40, 43, 46, 47, 48ఎ, 49 ప్రకరణలలో ప్రస్తావించడం జరిగింది. వాటిని ఈ క్రింది వివరింపబడినవి.

  1. 40వ ప్రకరణ ప్రకారం రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయంపాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
  2. 43వ ప్రకరణ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలి.
  3. 46వ ప్రకరణ ప్రకారం షెడ్యూల్డు కులాల, తరగతుల, బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  4. 47వ ప్రకరణ ప్రకారం ఆరోగ్యానికి హాని కల్గించే మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి.

అదనపు సూత్రాలు: భారత రాజ్యాంగానికి 42 రాజ్యాంగ సవరణ చట్టం, 1976, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఈ క్రింది వాటిని ఆదేశ సూత్రాల జాబితాలో అదనపు సూత్రాలుగా చేర్చాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 390, 430, 48ఎ ప్రకరణలను, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 38వ ప్రకరణ క్లాజ్ 2ను ఆదేశ సూత్రాల జాబితాలో పేర్కొనడం జరిగింది. ఈ సవరణల వల్ల ఆదేశక సూత్రాల సంఖ్య ఘననీయంగా పెరిగింది. వీటిలో క్రింది అంశాలు ఉన్నాయి.

  1. పిల్లల ఆరోగ్యం, ప్రగతి పరిరక్షణకు తగిన అవకాశాలు కల్పించడం.
  2. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం.
  3. కర్మాగార నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం.
  4. పర్యావరణం, అడవులు, వన్యమృగాల పరిరక్షణకు కృషి చేయటం.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక విధులను వర్ణించుము. [Mar. ’16]
జవాబు:
భారత రాజ్యాంగ లక్షణాలలో ప్రాథమిక విధులు అత్యంత విశిష్టమైనవి. అవి పూర్వపు సోవియట్ రష్యా రాజ్యాంగం చేత ప్రేరితమైనవి. భారత రాజ్యాంగం రూపకల్పన కాలం నందు వీటిని రాజ్యాంగం నందు చేర్చలేదు. అయితే శ్రీమన్నారాయణ అగర్వాల్ రచించిన గాంధియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా (1946) అనే గ్రంథంలో వీటిని
గురించి పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రానంతరము భారతదేశంలో రాజకీయపరంగాను, రాజ్యాంగపరంగాను అనేక మార్పులు చోటు చేసుకున్నవి. 1975 – 1977 సంవత్సరాల మధ్య కాలమందు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చవలెననే భావన కేంద్ర ప్రభుత్వమునకు వచ్చినది.

ఐక్యరాజ్యసమితి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన (Universal Declaration of Human Rights), 1948 సోవియట్ యూనియన్ తరహాలోని ప్రాథమిక విధులను, పరిగణలోనికి తీసుకొని భారత రాజ్యాంగంలో చేర్చాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని 1976లో నియమించింది. ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలలో పొందుపర్చిన ప్రాథమిక విధులను పరిశీలించిన పిదప ఈ కమిటీ ఎనిమిది ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచుటకు సూచనలను చేసింది. అందుకు అనుగుణంగా అప్పటి అధికార పార్టీ పార్లమెంట్లో 42వ రాజ్యాంగ సవరణ బిల్లు 1976ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఆ రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. వాటిని రాజ్యాంగం iv ఎ భాగంలో 51ఎ అనే ప్రకరణంలో ప్రస్తావించడమైనది. తరువాత 2002లో రాజ్యాంగం 86వ సవరణ చట్టం ద్వారా మరొక అంశం ప్రాథమిక విధుల జాబితాలో చేర్చడమైంది. దాంతో అప్పటి నుంచి భారత పౌరులకు మొత్తం 11 ప్రాథమిక విధులను సూచించడమైంది. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

భారత రాజ్యాంగంలోని 51-ఎ ప్రకరణ ప్రకారం ప్రతి ఒక్క భారత పౌరుడు తప్పనిసరిగా ఈ క్రింది విధులను నిర్వర్తించవలసి ఉన్నది.

  1. భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ ఆదర్శాల పట్ల, సంస్థల పట్ల, జాతీయ పతాకం, జాతీయ గీతం పట్ల విధేయతను చూపటం.
  2. స్వాతంత్ర్యం సాధనకై జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను గౌరవించి అనుసరించడం.
  3. భారతదేశ సార్వభౌమత్వం, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవడం.
  4. దేశాన్ని రక్షించుకోవడం, అవసరమయినపుడు జాతీయ సేవలో పాల్గొనడం.
  5. మత, భాషా, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను పరిత్యజించడం.
  6. సుసంపన్నమైన వారసత్వాన్ని, వైవిధ్యంతో కూడుకున్న సంస్కృతిని సంరక్షించుకోవడం.
  7. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ వాతావరణాన్ని సంరక్షించుకొని పెంపొందించు కోవడం, ప్రాణికోటి పట్ల కారుణ్యాన్ని చూపించడం.
  8. శాస్త్రీయ వైఖరి, మానవతావాదం, సమతా సంస్కరణ దృక్పథాన్ని కలిగి ఉండటం.
  9. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను విడనాడటం.
  10. జాతి ఉన్నత స్థాయిల్లోకి ఎదగడానికి వ్యక్తి పరంగానూ, సామూహికంగానూ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం.
  11. ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ వయస్సు ఉన్న బాలబాలికలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలు కల్పించడం.

పైన పేర్కొన్న వాటిలో మొదటి పది ప్రాథమిక విధులు 1977 జనవరి మూడో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. పదకొండో ప్రాథమిక విధి 2002 డిసెంబర్ పన్నెండో తేది నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రశ్న 4.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య గల వ్యత్యాసాలను వివరింపుము.
జవాబు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఈ సూత్రాలు. ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకొనేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి. శాసన సభ్యులకు, పాలకులకు ఈ సూత్రాలు ఒక ప్రవర్తనా నియమావళి. భారతదేశంలో సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఇవి మూలము. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా దేశంలో “సంక్షేమ రాజ్యాన్ని” స్థాపించుటే వీటి ఉద్దేశ్యము.

భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశక సూత్రాలు ఉన్నాయి. అవి రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి. ఇవి ప్రభుత్వానికి ప్రజల పట్ల గల బాధ్యతలను వివరిస్తాయి. భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగానూ, వర్గరహిత రాజ్యంగానూ ఏర్పరచటమే ఈ నియమాల లక్ష్యం.

ఈ ఆదేశక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవటానికి వీలులేదు. ప్రభుత్వం విధానాలు రూపొందించుకొనేటప్పుడు వీటికి అనుగుణంగా రూపొందించుకోవాలి.
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రస్తావించబడ్డాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్యగల తేడాలు:

ప్రాథమిక హక్కులు

  1. రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి, సమగ్రాభివృద్ధికి, వికాసానికి తోడ్పడతాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి.
  3. ప్రాథమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు.
  4. ప్రాథమిక హక్కులు పౌరుడు అనుభవించడానికి ఉద్దేశించబడినవి.
  5. ప్రాథమిక హక్కులు వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఇవి అరికడతాయి.
  6. ప్రాథమిక హక్కుల సంఖ్య, పరిధి తగ్గుచున్నది.
  7. ఇవి రాజకీయ ప్రజాస్వామ్య స్థాపనకు ఉద్దేశింపబడ్డాయి.
  8. వీటిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
  9. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాన్ని ‘చెల్లనేరదని’ కోర్టులు కొట్టివేస్తాయి.
  10. ప్రాథమిక హక్కులు ప్రభుత్వాన్ని కొన్ని పనులు చేయవద్దని శాసిస్తాయి.

ఆదేశక సూత్రాలు

  1. రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. ఇవి సమాజ సంక్షేమానికి తోడ్పడతాయి. ఇవి ప్రజల ప్రయోజనాలకు, వారి నైతిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక ప్రగతికి మూలము.
  3. ఆదేశక సూత్రాలకు ఆజ్ఞాపించే స్వభావం లేదు. వీటి అమలు రాష్ట్రాల ఆర్థిక వనరులపై ఆధారపడినాయి. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
  4. ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు.
  5. ఇవి సమాజ సంక్షేమానికై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాటించవలసిన నియమాలు.
  6. ఆదేశక సూత్రాల సంఖ్య, పరిధి విస్తృతమగుచున్నది.
  7. ఇవి సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు ఉద్దేశింపబడ్డాయి.
  8. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు.
  9. ఆదేశక సూత్రాలకు భంగం కల్గించే శాసనం ‘చెల్లనేరదని’ కోర్టులు కొట్టివేయలేవు.
  10. ఆదేశక సూత్రాలు ప్రభుత్వం చేయవలసిన పనుల గురించి ఆదేశిస్తాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు మధ్య మారుతున్న సంబంధాలను వివరింపుము.
జవాబు:
ప్రాథమిక హక్కులు, అదేశక సూత్రాల మధ్య చట్టబద్ధమైనవి మరియు చట్టబద్ధము కానివి అనే వర్గీకరణ ఉన్నప్పటికీ, ఆదేశక సూత్రాలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొన్నవి. ఎన్నో సంవత్సరముల నుండి ఈ రెండింటి మధ్య అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. అవి
1. వ్యక్తి ప్రయోజనాలను కాంక్షిస్తున్న ప్రాథమిక హక్కులకూ, సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్న ఆదేశక సూత్రాల మధ్య అమలు విషయంలో ప్రతిష్టంబన ఏర్పడినపుడు ఏమి జరుగుతుందనే విషయంలో దేశంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ వివాదాంశం రాజకీయాంశంగా రూపుదిద్దుకుంది.

2. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల అమలుకు సంబంధించి అనేక వివాదాంశాలలో సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ఆదేశక సూత్రాలే ప్రాథమిక హక్కులకు లొంగి ఉండాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినది.

3. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు లాంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాల తీర్పుల ఫలితంగానే 1971లో 25వ రాజ్యాంగసవరణ చట్టంను పార్లమెంట్ రూపొందించింది. ఈ సవరణ చట్టంను అనుసరించి ఆదేశక సూత్రాలు అమలును ఉద్దేశించి చేసిన ఏ చట్టాలైనను ప్రాథమిక హక్కులలోని 14వ ప్రకరణ, 19వ ప్రకరణ మరియు 31వ ప్రకరణలు అతిక్రమించుతున్నవనీ, ఆ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు ప్రకటించరాదని సవరణ చట్టంలో పేర్కొనబడినది.

4. 1976లో పార్లమెంట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టంను రూపొందించింది. ఆదేశక సూత్రాలలో కొన్ని గాని లేదా అన్ని సూత్రాలు గాని అమలుపరచుటకు పార్లమెంట్ రూపొందించే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నవని న్యాయస్థానాలు భావించరాదని ఈ రాజ్యాంగ సవరణ చట్టం నందు పేర్కొనబడినది.

5. కేశవానంద భారతి Vs కేరళ ప్రభుత్వం కేసు విషయంలో భారత రాజ్యాంగ మౌలిక అంశాలను సవరణ చేయు అధికారం పార్లమెంట్కు లేదని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించినది. సుప్రీంకోర్టు తీర్పు అర్థాన్ని అనుసరించి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మౌలిక లక్షణంగా భావించబడుచున్నవి.

ప్రశ్న 2.
పౌరునికి గల ఏవైనా మూడు ప్రాథమిక హక్కులను వివరింపుము.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు గల అంశాలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. ప్రాథమిక హక్కులు ప్రజల స్వేచ్ఛకు, సర్వతోముఖ వికాసానికి అవసరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులున్నాయి. వీటిని కోర్టు ద్వారా రక్షించుకోవచ్చు.

వీటిని గురించి విపులంగా చర్చిద్దాం.
1) సమానత్వపు హక్కు (14 నుండి 18 వరకు గల ప్రకరణలు): ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.

పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ ప్రకరణ స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాలు సందర్శించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపించకూడదని పేర్కొంది.

16వ ప్రకరణ ప్రకారం రాజ్యాంగా సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాలలో మతం, తెగ, కులం, లింగం, పుట్టుక వంటి అంశాలేవి ప్రధానమైనవి కావని ఆ ప్రకరణ పేర్కొంది.

17వ ప్రకరణ అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. ఈ విషయంలో 1955లో పార్లమెంటు అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని 1976 నుంచి పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా వ్యవహరించడమైంది.

18వ ప్రకరణ ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయం బిరుదులు మినహా ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు.

2) స్వేచ్ఛా హక్కు (19 నుండి 22 వరకు గల ప్రకరణలు): 19వ రాజ్యాంగ ప్రకరణ భారత పౌరులకు 7 రకాల స్వాతంత్య్రాలను ప్రసాదించింది. అవి

  1. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వాతంత్ర్యం.
  2. శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్ర్యం.
  3. సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  4. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్ర్యం.
  5. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  6. ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్ర్యం.
  7. ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

20వ ప్రకరణ వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది. ఈ ప్రకరణ అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని పేర్కొంటుంది.

21వ అధికరణం ఏ ఒక్క వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి ప్రకారం తప్ప మరో విధంగా అతని జీవనానికి, వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం కల్గించరాదని స్పష్టం చేసింది. ఈ ప్రకరణలను అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా రద్దు చేయరు.

22వ ప్రకరణ ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్భంధంలోకి తీసుకోకూడదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలపటంతోపాటు న్యాయ సహాయం పొందటానికి వీలు కల్పించాలి. ఉదా: నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని 24 గం॥లలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి.

3) పీడనను నిరోధించే హక్కు (23 మరియు 24 ప్రకరణలు):
23వ ప్రకరణ ప్రకారం రాజ్యంగాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకూడదు. మనుషుల క్రయ విక్రయాలు జరపటం, ప్రతిఫలం చెల్లించకుండా బలవంతంగా వెట్టిచాకిరీ పనులు చేయించుకోవటం నిషేధం. 24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలు, గనులు వంటి ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కల్గించే పనులలో నియమించకూడదు. బాల కార్మికత్వం చేయించుకొనుట చట్టవిరుద్ధం.

ప్రశ్న 3.
పౌరులకు గల ఆరు స్వాతంత్య్రాలను పేర్కొనుము. [Mar. ’17]
జవాబు:
ప్రాథమిక హక్కులలో సమానత్వపు హక్కు భారత పౌరులందరికి ‘చట్ట సమానత్వాన్ని కల్పించింది. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ భారతదేశంలో నివసించే వ్యక్తులందరికి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది.

  • వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్య్రం.
  • శాంతియుతంగా సమావేశమయ్యే స్వాతంత్య్రం.
  • సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకొనే స్వాతంత్య్రం.
  • దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్ర్యం.
  • దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవడానికి స్వాతంత్ర్యం.
  • ఆస్తిని సంపాదించుకొనుటకు, ఆర్జించుటకు, దానధర్మాలు, విక్రయాలు చేసుకొనే స్వాతంత్ర్యం.
  • ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకొనే స్వాతంత్య్రం.

అయితే ప్రకరణ 19(1) (f) సబ్ క్లాజులో చెప్పబడిన ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా తొలగించబడినది. ఇప్పుడు ఆరు ప్రాథమిక స్వాతంత్ర్యాలు మాత్రమే కలవు.

ప్రశ్న 4.
రాజ్యాంగ పరిహారపు హక్కును గూర్చి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలో అత్యంత ప్రధానమైంది. ఈ హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగానూ, కంచెగానూ, భద్రతాకవచంగాను పరిగణించడమైంది. పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వంతో సహా ఎవరైనా లేదా ఏ సంస్థ అయినా హరించడానికి లేదా కుదించడానికి ప్రయత్నిస్తే, బాధిత పౌరులు తగిన ఉపశమనాన్ని పొందడానికి ఈ హక్కు వీలు కల్పిస్తుంది. ప్రాథమిక హక్కుల విషయంలో తోటి పౌరులు, ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల నుంచి పౌరులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, వారు సముచిత న్యాయస్థానం ద్వారా రక్షణ పొందవచ్చు. ఈ సందర్భంలో రాజ్యాంగం 32 మరియు 226వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు దురాక్రమణ దారుల చర్యలను క్రమబద్ధం చేయడానికి లేదా అడ్డుకోవడానికి బాధితుల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ కోసం హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారెంటో, మాండమస్ వంటి రెట్లును మంజూరు చేస్తాయి. డాక్టరు బి.ఆర్ అంబేద్కర్ ఈ హక్కును రాజ్యాంగానికి హృదయం, ఆత్మవంటిదని వర్ణించాడు.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కులకు ఆదేశక సూత్రాల మధ్య గల ఐదు వ్యత్యాసాలను వివరింపుము. [Mar. ’16]
జవాబు:
ప్రాథమిక హక్కులు

  1. రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి, సమగ్రాభివృద్ధికి, వికాసానికి తోడ్పడతాయి. ఇవి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తాయి.
  3. ప్రాథమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా రక్షించుకోవచ్చు.
  4. ప్రాథమిక హక్కులు పౌరుడు అనుభవించడానికి ఉద్దేశించబడినవి.
  5. ప్రాథమిక హక్కులు వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఇవి అరికడతాయి.

ఆదేశక సూత్రాలు

  1. రాజ్యాంగం 4వ భాగంలో పొందుపరచబడ్డాయి.
  2. ఇవి సమాజ సంక్షేమానికి తోడ్పడతాయి. ఇవి ప్రజల ప్రయోజనాలకు, వారి నైతిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక ప్రగతికి మూలము. ఆదేశక సూత్రాలకు ఆజ్ఞాపించే స్వభావం లేదు.
  3. వీటి అమలు రాష్ట్రాల ఆర్థిక వనరులపై ఆధారపడినాయి. వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
  4. ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన బాధ్యతలు.
  5. ఇవి సమాజ సంక్షేమానికై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాటించవలసిన నియమాలు.

ప్రశ్న 6.
ఆదేశక సూత్రాల లక్షణాలను వివరింపుము.
జవాబు:

  1. ఆదేశక సూత్రాలు అనేవి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆజ్ఞలు.
  2. ఇవి సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే వివిధ స్థాయిలలో ఉన్న ప్రభుత్వాల అధికార, విధుల పరిధిని విస్తృత పరుస్తాయి.
  3. వీటిని వివిధ ప్రభుత్వాలు ఆర్థిక వనరుల లభ్యత మేరకే అమలుపరుస్తాయి.
  4. ఇవి ప్రజల సమ్మతిని కలిగి ఉంటాయి. సమసమాజ స్థాపనే వీటి లక్ష్యం.
  5. వివిధ స్థాయిలలో గల ప్రభుత్వాలలో అధికార బాధ్యతలు చేపట్టే ఏ పార్టీ అయినా స్వీయ రాజకీయ సిద్దాంతాలతో నిమిత్తం లేకుండా వీటిని అమలుచేయాల్సి ఉంటుంది.
  6. ఈ సూత్రాలను అమలు చేయకపోవడాన్ని ఎటువంటి చట్టధిక్కారమైన చర్యగా పరిగణించరు.
  7. వీటికి శిక్షాత్మక స్వభావం లేదు. వీటిని వెంటనే అమలుచేయాల్సిందిగా ఎవరూ నిర్బంధించరు. వీటి అమలులో ప్రభుత్వాలకు విచక్షణాత్మక అధికారాలు ఉంటాయి.
  8. భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక సమానత్వాలను సాధించి సామాజిక సుహృద్భావాన్ని పెంపొందించటమే వీటి ఆశయం.
  9. వ్యక్తి ప్రగతి కంటే సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడమే వీటి అసలు లక్ష్యం.

ప్రశ్న 7.
ఆదేశక సూత్రాల అమలును పరిశీలింపుము.
జవాబు:
వాస్తవంగా దేశపాలనలో ఆదేశక సూత్రాల అమలు చాలా ముఖ్యమైనది. 1950 నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదేశక సూత్రాల అమలులో కాలానుగుణంగా అనేక చర్యలను తీసుకుంటున్నది. ఇవి క్రింద వివరించబడినవి.

  1. జమీందార్, జాగీర్దారి, ఇనాందారి వ్యవస్థలు రద్దు.
  2. భూసంస్కరణ చట్టాల రూపకల్పన.
  3. రాజభరణాల రద్దు.
  4. 14 వాణిజ్యబ్యాంకుల జాతీయకరణ.
  5. ఖాదీ, గ్రామీణ పరిశ్రమ బోర్డుల నిర్మాణం.
  6. గ్రామ పంచాయితీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
  7. ప్రజా ప్రాతినిధ్య సంస్థల మరియు విద్యాసంస్థల్లో, షెడ్యూల్డు కులాల, తెగల వారికి కొన్ని స్థానాలను కేటాయించడం.
  8. జాతీయ ప్రాధాన్యం ఉన్న కళాత్మకమైన లేదా చారిత్రక స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, వస్తువుల పరిరక్షణ చట్టం 1951 రూపకల్పన.
  9. భారత శిక్షాస్మృతి రూపకల్పన.
  10. గోవులు, దూడలు, ఇతర పాడిపశువులు, లాగుడు బండ్లకు కట్టే పశువుల వధను కొన్ని రాష్ట్రాలలో నిషేధం.

ప్రశ్న 8.
ఆదేశక సూత్రాల ప్రాముఖ్యతను వివరింపుము.
జవాబు:
ఆదేశ సూత్రాలు భారతరాజ్యాంగ లక్షణాలలో ముఖ్యమైనవిగా పరిగణించబడినవి. ఈ సూత్రాల అమలు బాధ్యతను విష్యత్తులో అధికారంలోకి వచ్చు ప్రభుత్వాలకు రాజ్యాంగ నిర్మాతలు అప్పగించారు. ఆదేశక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మగా గ్రావెల్లి ఆస్టిన్ అభివర్ణించాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ సూత్రాలను రాజ్యాంగ )న్నూత లక్షణాలుగా పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని ఈ విభాగం ప్రాథమిక హక్కుల భాగానికి సన్నిహితంగా, అనుబంధంగా ఉంటాయి. అందువలననే రాజ్యాంగంలోని మూడవ భాగం మరియు నాల్గవ భాగం పరస్పర సంబంధం కలిగి ఉన్నవి.

ఆదేశక సూత్రాలను అధికారంలో ఉన్న ఏ పార్టీ అయిన ఈ సూత్రాలను అమలు చేయవచ్చు. ఆ సూత్రాలు ప్రభుత్వంలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహణ శాఖకు మార్గదర్శకాలుగా దోహదపడతాయి. ప్రజలు వారి హక్కులను అనుభవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఆదేశక సూత్రాలు కల్పిస్తాయి. ప్రభుత్వ వివిధ సంస్కరణలకు అవి సూచికలుగా ఉపయోగపడతాయి. రాబోయే ప్రభుత్వ విధానాల స్థిరత్వానికి, కొనసాగింపుకూ అవి హామీ ఇస్తాయి.

ఐవర్ జెన్నింగ్స్, ఆచార్య శ్రీనివాసన్, జి.యన్. జోషి, ఆచార్య కె.టి.షా, కె.సి.వేర్, టి.టి కృష్ణమాచారి, నసీరుద్దీన్ ఆహ్మద్ వంటి ప్రముఖ రాజ్యాంగవేత్తలు ఆదేశక సూత్రాలను శుష్క వాగ్దానాలుగాను, అందంగాను అమర్చిన వస్తువులు గాను, పవిత్ర సంకల్పాలుగాను, అలంకార ప్రాయ సూత్రాలుగా పరిగణించారు. ఆదేశ సూత్రాలకు ఒక ఉమ్మడి సిద్ధాంతమంటూ ఏదీ లేదని ఐవర్ జెన్నింగ్స్ భావించారు. ఆదేశక సూత్రాలనేవి బ్యాంకుల సౌకర్యార్థం డబ్బు చెల్లించడానికి ఇచ్చే చెక్కులుగా ఆచార్య కె.టి.షా వర్ణించాడు.

ఆదేశక సూత్రాలను మరుసటిరోజే మరచిపోయే నూతన సంవత్సర శుభాకాంక్షలుగా నసీరుద్దీన్ అహ్మద్ విమర్శించాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు.
జవాబు:
ప్రథమంగా భారత రాజ్యాంగం భారత పౌరులకు ఏడు ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. ఈ హక్కులను రాజ్యాంగంలో మూడవ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలలో పొందపరచడం జరిగింది. ప్రాథమిక ” హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడినాయి. ప్రాథమిక హక్కులు

  1. సమానత్వపు హక్కు
  2. స్వేచ్ఛా హక్కు
  3. పీడనను నిరోధించే హక్కు
  4. మత స్వాతంత్ర్య హక్కు
  5. విద్యా, సాంస్కృతిక హక్కు
  6. ఆస్తి హక్కు
  7. రాజ్యాంగ పరిహార హక్కు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా, నుండి తొలగించటం జరిగింది.

ప్రశ్న 2.
ఆదేశక సూత్రాల విశ్లేషణ.
జవాబు:
భారతరాజ్యాంగంలో నాల్గవ భాగంలో 36 నుండి 51వ ప్రకరణలు ఆదేశక సూత్రాలను గురించి వివరిస్తున్నాయి.
ఇవి మూడు రకాలు.

  1. సామ్యవాద సూత్రాలు
  2. ఉదారవాద సూత్రాలు
  3. గాంధేయవాద సూత్రాలు

ప్రశ్న 3.
హెబియస్ కార్పస్. [Mar. ’16]
జవాబు:
ఒక వ్యక్తిని నిర్బంధించిన వ్యక్తిపై గాని, అధికారిపై గాని ఈ రిట్జజారీ చేయబడుతుంది. ఈ ఆజ్ఞ ప్రకారం నిర్భంధంలో వున్న వ్యక్తిని కోర్టులో హాజరుపరచవలె. హాజరుపరచిన తరువాత విచారణ జరుగుతుంది. ఇది సాధారణంగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రిట్.

ప్రశ్న 4.
మాండమస్.
జవాబు:
ఈ ఆజ్ఞను న్యాయస్థానాలు ఒక అధికారిపై లేదా ఒక సంస్థపై జారీ చేస్తాయి. దాని ప్రకారం ఆ అధికారి లేదా సంస్థ తాను నెరవేర్చవలసిన విధులు పాటించవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
సాంస్కృతిక విద్యా హక్కులు.
జవాబు:
భారత పౌరులకు సాంస్కృతిక, విద్యాపరమైన అవకాశాలను రాజ్యాంగం ఈ హక్కుల ద్వారా ప్రసాదించింది. | 29వ ప్రకరణ ప్రకారం ప్రతి పౌరుడు స్వంత భాష, సంస్కృతులను పరిరక్షించుకొనవచ్చు. 30వ ప్రకరణ ప్రకారం ప్రభుత్వం నుండి సంపూర్ణంగా కాని, పాక్షికంగా కాని ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలలో కులం, మతం, ప్రాంతం, వర్ణం, భాష, లింగపరమైన అంశాల ప్రాతిపదికగా విద్యార్థులకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

ప్రశ్న 6.
గాంధేయ వాద సూత్రాలు.
జవాబు:
మహాత్మాగాంధీ ప్రవచించిన ఆదర్శాలను ఆదేశక సూత్రాలలో 40, 43, 46, 47, 48ఎ, 49 ప్రకరణలలో ప్రస్తావించటం జరిగింది. భారతదేశంలో ఆదర్శపాలనను నెలకొల్పటానికి ఈ సూత్రాలు తోడ్పడతాయి. పంచాయితీరాజ్ సంస్థలను నెలకొల్పటం, గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించటం, మత్తుపానీయాలు, మాదక ద్రవ్యాలను నిషేధించటం, షెడ్యూల్డు కులాలు, తరగతులు, బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించటం మొదలైన వాటిని గాంధేయవాద సూత్రాలకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 7.
ప్రాథమిక విధుల ప్రాముఖ్యత. [Mar. ’17]
జవాబు:
రాజ్యాంగంలో మొదట ‘విధులు’ చేర్చబడలేదు. కాని 1976లో చేయబడిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం 10 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన ఒక సంఘం ఈ విధులను సూచించింది. అయితే వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి అవకాశం లేదు. ఇవి ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తెస్తాయని, విజ్ఞానదాయకమైన మానసిక అభ్యున్నతికి తోడ్పడతాయని భావింపబడింది. రాజ్యాంగంలోని నాలుగో భాగం ‘ఏ’ లోని 51(ఎ) అధికరణం వీనిని తెలుపుతుంది.

రాజ్యం ప్రజల వద్ద నుంచి ఆశించే సామాజిక చైతన్యం, ప్రవర్తనా నియమావళే ప్రాథమిక విధులు.

ప్రాముఖ్యత:

  1. ప్రాథమిక విధులు భారత పౌరులలో సామాజిక స్పృహను పెంపొందించి, బాధ్యతాయుత ప్రవర్తనను అలవరుస్తాయి.
  2. ఈ విధులు 1948లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమెదించిన విశ్వమానవ హక్కుల ప్రకటన తీర్మానానికి అనుగుణంగా ఉన్నాయి.
  3. ప్రాథమిక విధులు రాజ్యాంగ ఆశయాలను, రాజ్యాంగ చట్టాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను గౌరవిస్తాయి.
  4. ప్రాథమిక విధులు ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, సహకారాన్ని పెంపొందిస్తాయి.
  5. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించుట.

ప్రశ్న 8.
ఏవైనా మూడు ఉదార సూత్రాలు.
జవాబు:
ఆదేశక సూత్రాలలోని ఉదారవాద సూత్రాలు:

  1. 44వ అధికరణం ప్రకారం దేశంలో నివసించే పౌరలందరికీ వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతిని రాజ్యం
    రూపొందించాలి.
  2. 45వ అధికరణం ప్రకారం 14 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి రాజ్యం ప్రయత్నించాలి.
  3. 50వ అధికరణం ప్రకారం పబ్లిక్ సర్వీసుల విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.
  4. 51వ అధికరణం ప్రకారం రాజ్యం (అ) అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుకోవడం
    (ఆ) దేశాల మధ్య న్యాయపరమైన, గౌరవప్రదమైన దౌత్య సంబంధాలను నిర్వహించుకోవడం.

ప్రశ్న 9.
కోవారెంటో.
జవాబు:
సక్రమమైన అధికారం లేకుండా ప్రజా సంస్థలో అధికారం నడిపించే వ్యక్తులను అధికారాన్ని నిర్వహించకుండా ఈ ఆజ్ఞ నిరోధిస్తుంది.

ప్రశ్న 10.
మత స్వాతంత్ర్యపు హక్కు.
జవాబు:
మత స్వాతంత్ర్య హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక. 25వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికీ ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. మత ప్రభావానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా క్రమబద్ధం చేసే చట్టాన్ని రాజ్యం రూపొందించవచ్చు.

26వ అధికరణం ప్రకారం ఏ మతానికి చెందినవారైనా

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కు పొందడానికి, వాటిని కొనుగోలు చేయడానికి చట్ట ప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. 28వ అధికరణం ప్రకారం రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు నిషేధించడం జరిగింది.

ప్రశ్న 11.
పీడనను నిరోధించే హక్కు,
జవాబు:
భారతదేశంలో నివసించే అసంఖ్యాక ప్రజల ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని గుర్తించి, పరిరక్షించి, పెంపొందించటానికి ఈ హక్కును ప్రసాదించటమైంది. రాజ్యం కాని, సంపన్న వర్గాలు కాని వ్యక్తులను దోపిడీకి గురిచేయకుండా నివారించటానికి ఈ హక్కు తోడ్పడుతుంది. మన రాజ్యాంగంలో 23 మరియు 24 ప్రకరణలు ఈ హక్కును వివరిస్తున్నాయి. 23వ ప్రకరణ ప్రకారం మనుషుల క్రయ విక్రయాలు, బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకోవటం నేరం. 24వ ప్రకరణ ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను గనులు, కర్మాగారాలు మొదలైన ప్రమాదకర పనులలో నియమించదారు.