AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 10th Lesson భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 10th Lesson భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల విధులను వివరించండి.
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలు భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం, 1992 ప్రకారం ఏర్పాటయ్యాయి. సాధారణంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో (జనాభా ఇరవై లక్షల కంటే తక్కువ కాకుండా) గ్రామీణ ప్రాంతాలలో ప్రతి జిల్లాలో మూడంచెల సంస్థలు ఏర్పాటయ్యాయి. అవి.
విధులు.

  1. గ్రామ పంచాయతీలు
  2. మధ్యస్థాయి సంస్థలు (మండల పరిషత్తు)
  3. జిల్లాస్థాయి (జిల్లా పరిషత్తు)

1) గ్రామ పంచాయతీ విధులు: గ్రామపంచాయతీ విధులు రెండు రకాలు: i) ఆవశ్యక విధులు ii) వివేచనాత్మక
i) ఆవశ్యక విధులు: ఆవశ్యక విధులను గ్రామపంచాయతీ తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. అలాంటి వాటిలో క్రింద పేర్కొన్నవి ఉంటాయి.

  1. రహదార్లను నిర్మించడం, మరమ్మత్తులు చేయించడం, నిర్వహించడం.
  2. శ్మశానవాటికలను నిర్మించడం, నిర్వహించడం..
  3. విద్యుత్ స్థంభాలను ఏర్పరచడం, విద్యుత్ సౌకర్యాలను అందించడం.
  4. జనన, మరణాల రిజిస్టర్లను నిర్వహించడం.
  5. అంటురోగాల బారి నుంచి ప్రజలను కాపాడటానికి వారికి తగిన టీకాలను వేయించడం.
  6. త్రాగునీటి సౌకర్యాలను సమకూర్చడం.
  7. కాలిబాటలు, చిన్నవంతెనలు, పబ్లిక్ పార్క్లు, క్రీడాస్థలాలను నిర్మించడం, మరమ్మత్తులు చేయించి నిర్వహించడం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ii) వివేచనాత్మక విధులు:
గ్రామపంచాయతి వివేచనాత్మక లేదా ఐచ్ఛిక విధులను ఆర్థిక వనరుల లభ్యతమేరకు నిర్వహిస్తుంది. వాటిలో క్రిందివి ఉంటాయి.

  1. విశ్రాంతి గృహాల నిర్మాణం, నిర్వహణ.
  2. ప్రాథమిక పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, గ్రంథాలయాలు, పఠన మందిరాల నిర్మాణం.
  3. మాత, శిశు సంక్షేమ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ.
  4. సమాజాభివృద్ధి పథకాల అమలులో స్వచ్చంద శ్రామిక శిబిరాల నిర్వహణ.
  5. ఆధునిక సేద్య పద్ధతుల ప్రచారం.
  6. భూసంస్కరణల అమలు..

2) మధ్యస్థాయి సంస్థలు (మండల పరిషత్తు) విధులు:
మండల పరిషత్తు మండల పరిధిలో క్రింద పేర్కొన్న విధులను నిర్వహిస్తుంది.

  1. సమాజాభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
  2. వైద్యశాలలు, త్రాగునీరు, టీకాలు, పొగరాని పొయ్యలు వంటి సదుపాయాల కల్పనకు తగిన కార్యక్రమాలు చేపడుతుంది.
  3. సామాజిక విద్య, కమ్యూనికేషన్లు, సహకారం, కుటీరపరిశ్రమలు, మహిళాభివృద్ధి, సాంఘిక సంక్షేమం వంటి అనేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షిస్తుంది.
  4. వ్యవసాయరంగంలో అధికోత్పత్తిని సాధించడానికి మేలు రకమైన ఎరువులు, క్రిమిసంహారకమందులు, అధునాతన వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుంది.
  5. పశు సంపద అభివృద్ధి కోసం పశుగ్రాసాన్ని అందించడం కృత్రిమ వీర్యకేంద్రాలు, పశుగ్రాస క్షేత్రాల నిర్వహణ వంటి వివిధ కార్యక్రమాలను అమలుచేస్తుంది.

3) జిల్లా పరిషత్తు విధులు:
జిల్లా పరిషత్తు క్రింద పేర్కొన్న విధులను నిర్వహిస్తుంది.

  1. జిల్లాలోని మండల పరిషత్తుల వార్షిక బడ్జెట్లను ఆమోదిస్తుంది.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మండలాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన సహాయక గ్రాంట్లను మండల పరిషత్తులకు కేటాయిస్తుంది.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి కోసం ఇచ్చే ఆదేశాలను అమలుచేస్తుంది.
  4. వివిధ మండల పరిషత్తుల కార్యకలాపాలను సమన్వయపరిచి, పర్యవేక్షిస్తుంది.
  5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా గణాంక సర్వేలను నిర్వహిస్తుంది.
  6. జిల్లాలోని సెకండరీ స్కూళ్ళను నిర్వహిస్తుంది.
  7. మండల పరిషత్తులు, గ్రామపంచాయతీల ఆర్థిక పరిపుష్టికి అవసరమైన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతుంది.

ప్రశ్న 2.
భారతదేశంలో వివిధ రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలను వర్ణించండి. [Mar. ’17]
జవాబు:
భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు 9 రకాలు. అవి

  1. నగరపాలక సంస్థలు
  2. పురపాలక సంస్థలు
  3. నగర పంచాయతీలు
  4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
  5. టౌన్ ఏరియా కమిటీలు
  6. కంటోన్మెంట్ బోర్డులు
  7. టౌన్ షిప్పులు
  8. పోర్ట్ ట్రస్ట్లు
  9. ప్రత్యేక ప్రయోజిత సంస్థలు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

1) నగరపాలక సంస్థలు:
పట్టణ స్థానిక ప్రభుత్వాలలో నగరపాలక సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇవి అత్యున్నత పట్టణ, స్థానిక సంస్థలుగా అతిపెద్ద నగరాలలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఈ నగరపాలక సంస్థలను ఏర్పాటుచేస్తుంది. భారతదేశంలో 1687లో మద్రాస్ నగరంలో మొట్టమొదటి నగరపాలక సంస్థ ఏర్పాటైంది. మూడు లక్షల జనాభా కలిగి నాలుగుకోట్ల వార్షికాదాయమున్న పట్టణాలను నగరపాలక సంస్థలుగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటుచేస్తుంది.

నగర జనాభా ఆధారంగా ఆయా నగర సంస్థలలోని ప్రతినిధుల సంఖ్యను రాష్ట్ర శాసన సభ నిర్ణయిస్తుంది. ప్రతి నగరపాలక సంస్థలో 1) నగరపాలక మండలి, 2) మేయర్, 3) కమీషనర్, 4) స్థాయీ సంఘాలు అనే నాలుగు ప్రధాన అంగాలు ఉంటాయి.

2) పురపాలక సంస్థలు:
ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. 1) పురపాలక మండలి, 2) పురపాలక చైర్మన్, 3) మున్సిపల్ కమీషనర్, 4) స్థాయీ సంఘాలు. పురపాలక సంస్థ చర్చావేదికయే పురపాలక మండలి. దీనిలో 1) ఎన్నికయ్యే సభ్యులు 2) అనుబంధ సభ్యులు 3) గౌరవ సభ్యులు అనే మూడు రకాల సభ్యులు ఉంటారు. పురపాలక సంస్థ పరిధిలోని రిజిష్టర్ ఓటర్లు మొదటి తరహా సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్స్ అంటారు.

3) నగర పంచాయతీలు:
గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతీ అంటారు. దీని కొరకు జనసాంద్రత, స్థానిక సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు. ఆ ప్రాంత ఆర్థిక ప్రాధాన్యత మొదలైన ప్రామాణికాల ఆధారంగా నగర పంచాయతీ ఏర్పాటు జరుగుతుంది.

నగర పంచాయితీ సభ్యుల సంఖ్యను ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. ఈ సభ్యులు ప్రజలచే వయోజన ఓటుహక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. దీని కొరకు నగర పంచాయతీని వార్డులుగా విభజించి ప్రతి వార్డు నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు:
శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగాలేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడటంతో దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీగా వ్యవహరించడమైంది. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీనిలో ఒక చైర్మన్, కొందరు సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

5) టౌన్ ఏరియా కమిటీలు:
రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తుంటాయి. వీధిదీపాలను అమర్చడం, డ్రైనేజీ సౌకర్యాల కల్పన వంటి విధులను అవి నిర్వహిస్తాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

6) కంటోన్మెంట్ బోర్డులు:
భారతదేశంలో ప్రస్తుతం మూడు రకాల కంటోన్మెంట్ బోర్డులున్నాయి. అవి దేశరక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటై కొనసాగుతున్నాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నుకోబడినవారు సభ్యులుకాగా, కొందరు కేంద్ర ప్రభుత్వంతో నామినేట్ చేయబడినవారు, మరికొందరు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో ఒక జనరల్ ఆఫీసర్ – ఆఫ్- కంమాండర్ (GOC – General Officer of Commander) ఉంటాడు.

7) టౌన్ షిప్ లు:
టౌన్షిప్లు అనేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కు ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు. అతడిని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖ నియమిస్తుంది. టౌన్ షిప్ సేవలు సామాన్య ప్రజలకు కాకుండా అందులో పనిచేసే వారికే లభ్యమవుతాయి.

8) పోర్ట్ ట్రస్ట్:
దేశంలో సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. అవి నౌకాశ్రయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషిచేస్తాయి. కేంద్రప్రభుత్వం అందుకోసం కొన్ని కమిటీలను నియమిస్తుంది. ఆ కమిటీల సభ్యులలో కొందరు ఎన్నుకోబడగా, మరికొందరు నామినేట్ అవుతారు.

9) ప్రత్యేక ప్రయోజిత సంస్థలు:
పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన సంస్థలు పనిచేస్తుంటాయి. పురపాలక సంఘాలు. ఇతర నోటిఫైడ్ ప్రాంతాలలో నివసించే ప్రజల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అవి కృషిచేస్తాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్థాపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం ప్రత్యేకంగా జారీచేసే ఆజ్ఞల ద్వారా అవి ఏర్పడతాయి.

ప్రశ్న 3.
భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలను సమర్థవంతమైనవిగా తీర్చిదిద్దడానికి ఏకీకృత చట్టం అవసరమని కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై నియమించిన సర్కారియా కమీషన్ సూచించింది. పర్యవసానంగా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 1988లో పి.కే. తుంగన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ ఉపసంఘాన్ని నియమించింది. జిల్లా కమిటీల ఏర్పాటుకు అవసరమైన ఆదర్శవంతమైన పరిపాలన, రాజకీయ యంత్రాంగాన్ని సూచించవలసిందిగా ఆ ఉపసంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండేళ్ళ తరువాత 1991 జూన్లో శ్రీ పి.వి. నరసింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కేంద్రప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలకు వెంటనే రాజ్యాంగ ప్రతివృత్తిని కల్పించవలసిన విషయాన్ని గుర్తించింది. 1991 సెప్టెంబర్ లో అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించింది. తరువాత ఆ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సమర్పించడమైంది. పార్లమెంటు ఆ కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించింది. ఆ బిల్లుపై రాష్ట్ర శాసనసభల ఆమోదం కోసం పంపడమైంది. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు ఆ బిల్లుపట్ల తమ సమ్మతిని తెలిపాయి. దాంతో ఆ బిల్లును రాజ్యాంగం (73వ సవరణ) చట్టం, 1992గా పిలవడం జరిగింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రధాన అంశాలు: రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992లో క్రింది ముఖ్యాంశాలు ఉన్నాయి.
1. ఆ చట్టం నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయితీ, గ్రామం అనే నూతన పదాలను చేర్చింది

2. ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభను ఏర్పాటుచేసింది. ఆ గ్రామసభ గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది.

3. ప్రతి రాష్ట్రప్రభుత్వం పంచాయతీరాజ్ యొక్క మూడంచెల విధానాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఉదా: గ్రామ, మాధ్యమిక, జిల్లా స్థాయిలలో పంచాయతీలు

4. ప్రతి రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా పంచాయతీల నిర్మాణానికి సంబంధించిన చట్టాలను రూపొందించాలి. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. పంచాయతీల అధ్యక్షులకు, ఇతర సభ్యులకు, (వారు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నుకోబడినప్పటికీ) తీర్మానాలపై ఓటుచేసే హక్కు ఉంటుంది.

5. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పంచాయతీలలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అలాగే మొత్తం సీట్లలో 1/3వ వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్ కేటాయించడమైంది. (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచడం జరిగింది.)

6. పంచాయతీల కాలపరిమితి అయిదేళ్ళు. ఆ గడుపు ముందే కొత్తగా ఎన్నికలు జరిపించుకోవచ్చు. కాలపరిమితికి ముందే అవి ఒకవేళ రద్దయితే వాటికి ఎన్నికలను నిర్వహించవలసి ఉంటుంది.

7. స్థానిక సంస్థలకు పోటీచేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలను ఎదుర్కొనడమైంది.

8. ఈ చట్టం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది.

9. పంచాయితీల ఖాతాలు, వ్యయాలపై తనిఖీ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

10. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం ఏర్పాటవుతుంది.

ప్రశ్న 4.
భారత రాజ్యాంగం 74వ సవరణ చట్టాన్ని గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
74వ రాజ్యాంగ సవరణ చట్టం: రాజ్యాంగం 74వ సవరణ చట్టం, 1993ను భారత పార్లమెంటు 1992. డిసెంబర్ లో ఆమోదించింది. దానికి 1993, ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రపతి ఆమోదం లభించింది. భారతదేశంలో పట్టణస్థానిక ప్రభుత్వాలను పటిష్టపరచడంలో ఆ చట్టం అత్యంత ముఖ్యమైందిగాను, ప్రగతిశీలమైనదిగానూ వర్ణించడం జరిగింది. భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు సమర్థవంతంగా కార్యకలాపాలను నిర్వహించడానికి ఆ చట్టం ఒక ఉమ్మడి విధివిధానాలను రూపొందించింది. అంతకు పూర్వం ఆ చట్టాన్ని రూపొందించడానికి విశేషమైన కృషి జరిగింది. తొలుత పార్లమెంటు ఆ చట్టానికి సంబంధించిన బిల్లును 1989లో రాజ్యాంగం (65వ సవరణ) బిల్లుగా ప్రతిపాదించడం జరిగింది. అయితే లోక్సభ అర్ధంతర రద్దు కారణంగా ఆ బిల్లు పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు.

తరువాత ఆ బిల్లులో కొన్ని సవరణలు చేసి, 1991, సెప్టెంబర్ 16వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దరిమిలా పార్లమెంటు ఉభయసభలు ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి, 1992 డిసెంబర్లో ఆమోదించాయి. చివరికి రాష్ట్రపతి ఆమోదం తరవాత ఆ బిల్లు చట్టంగా రూపొంది 1993, జూన్ 1వ తేదీన అమల్లోకి వచ్చింది. . ముఖ్యాంశాలు:
1. ఈ చట్టం పట్టణ స్థానిక సంస్థలకు మొట్టమొదటిసారిగా రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చింది. రాజ్యాంగంలో 9(ఎ) అనే భాగాన్ని అదనంగా చేర్చింది.

2. రాజ్యాంగంలో పన్నెండో షెడ్యూల్ను ప్రవేశపెట్టింది.

3. పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలపై తీర్మానాలను రూపొందించుకొని అమలులో ఉంచుకోవడానికి అధికారాన్నిచ్చింది.

4. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన వివిధ పదాలను నిర్వచించింది. జనాభా పదిలక్షలు లేదా అంతకుమించి ఉంటే పట్టణ ప్రాంతాన్ని మహానగర ప్రాంతం (మెట్రోపాలిటన్ ఏరియా) గా ప్రకటించింది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

5. నగరపాలకసంస్థ, మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ వంటి అనేక సంస్థల నిర్మాణానికి ఈ సవరణ వీలు కల్పించింది. నగరపాలక సంస్థ అనేది విస్తృతమైన పట్టణ ప్రాంతాలను వర్తిస్తుంది. పట్టణ స్థానిక సంస్థల పేర్లను ఖరారు చేయడానికి, వాటి భౌగోళిక సరిహద్దులను స్పష్టంగా గుర్తించడానికి ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది.

6. పురపాలక సంస్థ నిర్మాణాన్ని ఈ చట్టం ప్రత్యేకంగా గుర్తించింది. పురపాలక సంస్థ పరిధిలోని విధానసభ సభ్యులు, లోక్సభ సభ్యులు పురపాలక సంస్థల కౌన్సిళ్ళు సమావేశంలో పదవి రీత్యా సభ్యుల హోదాలో పాల్గొంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా పురపాలక సంస్థ సమావేశాలలో రాష్ట్ర విధానపరిషత్తు లేదా రాజ్యసభ సభ్యులు పాల్గొనడానికి అర్హులని ప్రకటించింది.

7. జనాభా మూడులక్షల లేదా అంతకుమించి ఉన్న పురసాలక సంస్థలలో వార్డ్ కమిటీల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. అలాంటి వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు అప్పగించింది.

8. పట్టణ స్థానిక సంస్థలలో కొన్ని స్థానాలను షెడ్యూల్డ్ కులాలు, తెగలకు వారి జానాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయించడం జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఆ సంస్థలలో మూడోవంతు స్థానాలు మహిళలకు, మహిళా అధ్యక్ష పదవులకు రొటేషన్ పద్ధతిలో కేటాయించునట్లు ప్రకటించింది.

ప్రశ్న 5.
జిల్లా కలెక్టర్ అధికారాలు, విధులను అంచనా వేయండి. [Mar. ’16]
జవాబు:
జిల్లా పరిపాలనలో కలెక్టర్ కీలకపాత్ర వహిస్తాడు. అతడు జిల్లా పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లాస్థాయిలో వివిధ పాలనా విధానాల రూపకల్పన, అమలులో ప్రత్యక్ష ప్రమేయం కలిగి ఉంటాడు. జిల్లా ప్రజల సత్వర వికాసానికి అవసరమయ్యే విధి విధానాలను రూపొందించి, అమలు చేయడంలో కలెక్టర్కు కీలకపాత్ర ఉంటుంది. అతడి అధికారాలు విధుల నిర్వహణలో అనేకమంది అధికారులు సహాయపడతారు.

భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవిని 1722లో మొదటిసారిగా తూర్పు ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. కాలంలో ప్రజల వద్ద నుంచి భూమిశిస్తు వసూలుచేసే ఉద్దేశంతో ఆ పదవిని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ఆ పదవిని నిర్వహించే వ్యక్తుల అధికారాలు, విధులలో విశేషమైన మార్పులు చోటుచేసుకున్నాయి. క్రమేణా తూర్పు ఇండియా కంపెనీ, తరువాత బ్రిటిష్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధికార విధులను గణనీయంగా పెంచుతూ వచ్చాయి. వర్తమాన కాలంలో భారతదేశంలో జిల్లా కలెక్టర్గా నియమితులయ్యేవారు ప్రతిష్టాత్మకమైన ఐ.ఏ.ఎస్. హోదా కలిగి ఉంటున్నారు. జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

జిల్లా కలెక్టర్ అధికారాలు – విధులు: జిల్లా పాలన అధిపతిగా – కలెక్టర్కు విశేష అధికారాలు, విస్తృత విధులు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించడమైంది.
1) కలెక్టర్ – ప్రధాన రెవిన్యూ అధికారి: జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. ఆ హోదాలో అతడు జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలను చెల్లించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, తయారీలలో సహకరించడం, ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించడం వంటివి జిల్లా కలెక్టర్కు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి. కలెక్టర్ జిల్లాలో ప్రభుత్వ కోశాగారాల పనితీరును సమీక్షిస్తాడు. పైన పేర్కొన్న విధులన్నీ జిల్లా అభివృద్ధికి సంబంధించినవై ఉంటాయి. అంతేకాకుండా వాటి నిర్వహణలో భౌతిక, ఆర్థిక, మానవ సంబంధమైన వనరుల సమీకరణకు సంబంధం ఉంటుంది.

2) జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం: కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ గా వ్యవహరిస్తాడు. జిల్లాలో పనిచేసే పోలీస్ సిబ్బంది వ్యవహారాలపై అతనికి పర్యవేక్షణాధికారం ఉంటుంది. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగేటట్లు చూడవలసిందిగా పోలీస్ అధికారులకు సూచిస్తాడు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కలెక్టర్కు సహాయకారిగా ఉంటుంది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారు. జిల్లాలోని కారాగారాలు, పోలీస్ సిబ్బంది వ్యవహారాలను కలెక్టర్ నిర్ణీత వ్యవధులలో సమీక్షిస్తాడు.

సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం, పేలుడు పదార్థాల తయారీ, రవాణాకు అనుమతినివ్వడం, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించడానికి అనుమతులు మంజూరుచేయడం వంటి అనేక విధులను కలెక్టర్ నిర్వహిస్తాడు. పైన పేర్కొన్న విధులన్నీ జిల్లా అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

3) ముఖ్య సమన్వయ కర్త: జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల మధ్య కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తాడు. వ్యవసాయం, నీటిపారుదల, సహకారం, విద్య, పరిశ్రమలు వంటి వివిధ శాఖల అధిపతులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాడు. జిల్లాలోని వివిధ శాఖల అధికారుల పనితీరును తెలుసుకుంటాడు. ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచనలను ఇస్తాడు. వివిధ శాఖల అధిపతులు విడివిడిగా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేసినప్పటికీ, అంతిమంగా వారంతా కలెక్టర్కు జవాబుదారీగా ఉంటూ కలెక్టర్ సూచనల మేరకు వ్యవహరిస్తారు.

4) జిల్లా ముఖ్య ఎన్నికల అధికారి: జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తాడు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున జిల్లాలోని వివిధ ప్రాతినిధ్య సంస్థల ప్రతినిధుల ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాడు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూస్తాడు.

ఎన్నికలకు సంబంధించిన వారంతా పార్టీలు అభ్యర్థులు, అధికారులు, నాయకులు, ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించేలా చూస్తాడు. జిల్లాలో సహకార బ్యాంకులు, డెయిరీ యూనిట్లు, నీటి వినియోగ కమిటీలు, పాఠశాల నిర్వహణ కమిటీలు మొదలైన వాటికి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తాడు.

5) జనాభా లెక్కల ముఖ్య అధికారి: కలెక్టర్ జిల్లాలో జనాభా లెక్కల ముఖ్య అధికారిగా వ్యవహరిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేళ్ళకొకసారి జనాభా లెక్కల సేకరణకోసం పంపించే మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా జనాభా లెక్కల సేకరణకు చర్యలు తీసుకుంటాడు. అలాగే జిల్లాలో పాడిపశువులు, ఫలసాయమిచ్చే వృక్షాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన గణాంక సమాచారాన్ని సేకరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. జిల్లాలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం, ఇతర కుటుంబ సంక్షేమ మహిళా సాధికారత వంటి అంశాలకు సంబంధించిన సమాచార సేకరణకు కలెక్టర్ ఏర్పాట్లు చేస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

6) స్థానిక సంస్థల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు: జిల్లాలోని పంచాయితీరాజ్, పట్టణ పాలిత స్థానికసంస్థల సమావేశాలలో కలెక్టర్ శాశ్వత ఆహ్వానితుని హోదాలో పాల్గొంటాడు. జిల్లాలోని వివిధ స్థానిక సంస్థలకు, కేంద్ర, రాష్ట్రాల మధ్య కలెక్టర్ ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్/మండల పరిషత్, సాధారణ/అత్యవసర సమావేశాలకు హాజరై వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సలహాలిస్తాడు. జిల్లాలోని స్థానిక సంస్థల వ్యవహారాలు, పనితీరు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత సమయాలలో విశ్వసనీయ నివేదికలను పంపుతాడు. జిల్లా పరిషత్ ఛైర్మన్పై వచ్చే అవిశ్వాస తీర్మానంపై జిల్లాపరిషత్తు సమావేశాన్ని నిర్వహించి, ఆ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తాడు. జిల్లాలో గ్రామీణ/పట్టణ ప్రాంతాలలో కొత్తగా స్థానిక సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపుతాడు.

ఇతర విధులు: జిల్లా కలెక్టర్ క్రింద పేర్కొన్న ఇతర విధులను నిర్వహిస్తాడు.

  1. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం.
  2. నీటిపారుదల సౌకర్యాల కల్పన.
  3. ప్రభుత్వకోశాగారాలపై పర్యవేక్షణ.
  4. వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం చేకూర్చటం.
  5. జూనియర్ అధికారులకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇప్పించటం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల చారిత్రక నేపధ్యాన్ని సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
చారిత్రక నేపథ్యం: భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ప్రశస్తమైన నాలుగు వేదాలలో మొదటిదైన రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు సంస్థల గురించి ప్రస్తావన ఉంది. ఆ రెండు సంస్థలూ, స్థానిక సంస్థలకు ప్రతిరూపాలే. గ్రామస్థాయిలో ఆ రెండూ అనేక పరిపాలన, రాజకీయ విధులను నిర్వర్తించాయి. ప్రాచీన భారతదేశంలో చక్కని సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడి, పనిచేశాయి. గ్రామీణ సమాజానికి సంబంధించిన పరిపాలన, న్యాయ వ్యవహారాలను పర్యవేక్షించడానికి అవి కొనసాగాయి. వాటిని గ్రామపంచాయితీలు, కుల పంచాయితీలుగా పరిగణించడం జరిగింది. ఆనాటి పాలకుల మద్దతు లేకపోయినప్పటికీ అవి సమర్థవంతంగా వ్యవహరించాయి. మెగస్తనీస్, కౌటిల్యుడు, ఫాహియాన్ వంటి ప్రసిద్ధ పర్యాటకులు తమ గ్రంథాలలో పైన పేర్కొన్న సంస్థల గురించి ప్రస్తావించారు.

మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళ వంశ రాజుల పరిపాలన కాలంలో గ్రామపంచాయితీలు వికసించాయి. స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి పోషించిన వారిలో చోళులకు మంచిపేరు వచ్చింది. అయితే వర్తమాన స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, పనితీరుపై బ్రిటీష్ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల పాత్ర విస్మరించలేనిది. బ్రిటిష్ పాలకులు స్వీయ ప్రయోజనాలను పెంపొందించుకొనే లక్ష్యంతో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి కృషి చేశారు. 1870 నాటి మేయో ప్రభువు, 1882 నాటి రిప్పన్ ప్రభువుల తీర్మానాలు భారతదేశంలో ఈ రకమైన ప్రభుత్వాల పురోగతికి మార్గదర్శకమయ్యాయి. అంతకు పూర్వం 1688లో తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటిసారిగా మదరాసు (ప్రస్తుతం చెన్నై) నగరపాలక సంస్థను ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి రెండో జార్జి అనుమతితో ఆరంభించింది. 1726 నాటికి మదరాసులో ప్రజల వద్ద నుంచి పన్నులను సేకరించడం, న్యాయపాలన వంటి ప్రధాన విధులను నిర్వహించడానికి కొన్ని మేయర్ కోర్టులు ఏర్పాటయ్యాయి. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కలకత్తా (కోల్కతా), మదరాసు (చెన్నై), బొంబాయి (ముంబై) నగరాలలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

1935 చట్టం స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని ఆ చట్టం 12వ ప్రవేశ విషయంగా (Entry 12) ప్రకటించింది. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చట్టాలను రూపొందించడం ద్వారా గ్రామపంచాయితీల అధికారాలను విశేషంగా పెంచడానికి చర్యలు తీసుకున్నాయి. గ్రామపంచాయతీల ఆధీనంలో క్రిమినల్ న్యాయంతో సహా అనేక అంశాలను చేర్చడం జరిగింది. మహత్మాగాంధీ వంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకులు స్థానిక ప్రభుత్వాలను వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా బ్రిటీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

1935 భారత ప్రభుత్వ చట్టం స్థానిక ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయటానికి వీటి ఏర్పాటు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. స్థానిక స్వపరిపాలన రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో 12వ అంశంగా పేర్కొంటారు. వీటి పాలనతో పాటు క్రిమినల్ న్యాయవ్యవస్థలు స్థానిక ప్రభుత్వాల పరిధిలోకి తెచ్చారు. మనదేశ పెద్దలైన మహాత్మాగాంధీలాంటి వారు దీనిని గట్టిగా సమర్థించారు. అయితే రెండవ ప్రపంచయుద్ధం తరువాత తగినంత ప్రగతి స్థానిక ప్రభుత్వాలలో కొనసాగలేదు. మనం ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల అధికారాలు, విధులను రెండు భాగాలుగా విభజించి అధ్యయనం చేయవచ్చు. 1) గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 2) పట్టణ స్థానిక ప్రభుత్వాలు.

ప్రశ్న 2.
స్థానిక ప్రభుత్వాల ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
ప్రయోజనాలు: వర్తమాన ప్రజాస్వామ్య రాజ్యాలలో స్థానిక ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. ఆ సంస్థల వల్ల అనేక ప్రయోజనాలు లభించడం వల్ల వాటిని ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. స్థానిక ప్రభుత్వాల వల్ల క్రింది ప్రయోజనాలు ఉంటాయి.

  1. స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయిలో పెంపొందించి పటిష్టంగావిస్తాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం స్థానిక రాజకీయ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తాయి.
  2. స్థానిక ప్రభుత్వాలు ప్రజలలో రాజకీయ అవగాహనను, బాధ్యతను పెంపొందిస్తాయి. ఎందుకంటే అవి స్థానిక స్థాయిలో వివిధ రాజకీయ సంస్థల నిర్వహణలో విధానాలపై నిర్ణయం, విధానాల అమలులో ప్రజలకు అవకాశమిస్తాయి.
  3. స్థానిక ప్రభుత్వాలు స్థానిక స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించి ఆ సమస్యలు శీఘ్రంగానూ, సంపూర్ణంగానూ పరిష్కారమయ్యేలా చూస్తాయి.
  4. స్థానికంగా అందుబాటులో ఉండే మానవీయ, భౌతిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలోనూ, సక్రమంగా నిర్వహించుకోవడంలోనూ స్థానిక ప్రభుత్వాలు దోహదపడతాయి.
  5. స్థానిక ప్రభుత్వాలు పాలనలో పొదుపు పెంచుతాయి.
  6. ఇవి ప్రజలలో స్వేచ్ఛా వాతావరణాన్ని పెంపొందిస్తాయి.
  7. ఇవి స్వయం సహాయ, స్వయం ఆధారిత స్ఫూర్తిని అలవరుస్తాయి.

ప్రశ్న 3.
పంచాయితీ కార్యదర్శి విధులు ఏవి?
జవాబు:
ప్రతి గ్రామ పంచాయితీకి పూర్తి కాల ప్రభుత్వ అధికారిగా కార్యదర్శి వ్యవహరిస్తాడు. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కార్యదర్శి జీతం ఇతర భత్యాలు ప్రభుత్వనిబంధనల ప్రకారం పంచాయితీ నిధుల నుంచి కేటాయిస్తారు. ఇతను సర్పంచ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తాడు.

పంచాయతీ కార్యదర్శి ఈ క్రింది పేర్కొన్న విధులను నిర్వహిస్తాడు.

  1. పంచాయతీ బడ్జెట్ తయారుచేయడం, వార్షిక పాలనా నివేదికలు తయారుచేయడం.
  2. నెలవారీ, త్రైమాసిక, ఆర్థిక గణాంకాలు తయారుచేయడం.
  3. నగదు పుస్తక నిర్వహణ.
  4. పంచాయతీ రికార్డులను తన ఆధీనంలో భద్రపరుచుట.
  5. పంచాయతీలో ఇతర ఉద్యోగులకు విధులు కేటాయించడం.
  6. గ్రాంటు కోసం ధరఖాస్తుచేయడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిజిష్టరు చేయడం.
  7. పంచాయతీలో జరిగే పనులు తనిఖీ, పని ప్రగతిని పరిశీలించడం.
  8. అభివృద్ధి పనులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం.

ప్రశ్న 4.
గ్రామ సభ గూర్చి నీకు ఏమి తెలియును?
జవాబు:
ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అది సంవత్సరానికి కనీసం మూడుసార్లయినా సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. సమాజ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శ్రీఘ్రగతిన అమలుపరచడానికి, ప్రజల భౌతిక సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి తగిన సూచనలిస్తుంది. గ్రామసభలను బీహార్లో పంచాయతీ అని, ఒడిస్సాలో పాలీ సభ అని వ్యవహరిస్తారు. కేంద్రప్రభుత్వం 2009-2010 సంవత్సరాన్ని పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పరచి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గ్రామసభ సంవత్సరంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన గ్రామసభలను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
మండల పరిషత్తు గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
జిల్లాలో మాథ్యమిక స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు, రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మండల పరిషత్తు ఏర్పాటవుతుంది. మండల పరిషత్తులను వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంచాయతి యూనియన్ కౌన్సిల్, కర్నాటకలో తాలూక అభివృద్ధి బోర్డు, గుజరాత్లో తాలూక పంచాయత్ అని అంటారు. అయినప్పటికీ దీనికి ప్రాచుర్యంలో ఉన్న పేరు పంచాయతీ సమితి.

నిర్మాణం: ప్రతి మండలాన్ని కొన్ని మండల ప్రాదేశిక నియోజకవర్గాలుగా (జనాభా ప్రాతిపదికన) విడదీస్తారు. ఓటర్లు మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. అవి: 1) మండలపరిషత్తు, 2) మండల పరిషత్తు అధ్యక్షుడు 3) మండల పరిషత్తు అభివృద్ధి అధికారి 4) మండల మహాసభ.

ప్రశ్న 6.
జిల్లా పరిషత్తు నిర్మాణం గురించి వివరించండి.
జవాబు:
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి స్వపరిపాలన సంస్థయే జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్తుకు చట్టబద్ధమైన ప్రతిపత్తి ఉంటుంది.

జిల్లా పరిషత్: జిల్లా పరిషత్తులో ఆరు ప్రధాన అంగాలు ఉంటాయి. అవి:

  1. జిల్లా పరిషత్తు,
  2. ఛైర్మన్,
  3. జిల్లా మహాసభ,
  4. ముఖ్య కార్యనిర్వహణాధికారి,
  5. స్థాయీ సంఘాలు,
  6. జిల్లా కలెక్టర్.

జిల్లా పరిషత్తు అనేది జిల్లా స్థాయిలో శాసన నిర్మాణ అంగంగా వ్యవహరిస్తుంది. దానిలో వివిధ రకాల సభ్యులు ఉంటారు. వారిలో ఎన్నికయినవారు కో-ఆప్టెడ్ చేసుకోబడినవారు, ఎక్స్-అఫీషియో సభ్యులుంటారు. జిల్లా స్థాయి అధికారులైన జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెందిన అధ్యక్షులు శాశ్వత ఆహ్వానితుల హోదాలో జిల్లా పరిషత్తు సమావేశాలలో పాల్గొంటారు. అంతేకాకుండా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు (MLAs) జిల్లా పరిషత్తు సమావేశాలలో పాల్గొంటారు.

ప్రశ్న 7.
భారతదేశంలో వివిధ రకాల పట్టణ స్థానిక సంస్థల గూర్చి చర్చించండి.
జవాబు:
భారతదేశంలో 9 రకాల పట్టణ స్థానిక సంస్థలున్నాయి. అవి

  1. నగరపాలక సంస్థలు,
  2. పురపాలక సంస్థలు
  3. నగర పంచాయతీలు
  4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
  5. టౌన్ ఏరియా కమిటీలు
  6. కంటోన్మెంట్ బోర్డులు
  7. టౌన్ షిప్పులు
  8. పోర్టుట్రస్టులు
  9. ప్రత్యేక ప్రయోజిత సంస్థలు.

1) నగరపాలక సంస్థలు: పట్టణ స్థానిక ప్రభుత్వాలలో నగరపాలక సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇవి అత్యున్నత పట్టణ, స్థానిక సంస్థలుగా అతిపెద్ద నగరాలలో ఏర్పాటుచేస్తారు.

2) పురపాలక సంస్థలు: నగరపాలక సంస్థకు దిగువన, గ్రామపంచాయతీ/నగర పంచాయతీకి ఎగువన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంస్థలు. సాధారణంగా జనాభా 20,001 లేదా అంతకుమించితే లేదా . అరవై లక్షలకు మించిన వార్షికాదాయం ఉంటే పురపాలక సంస్థలుగా ఏర్పాటవుతాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

3) నగర పంచాయతీలు: గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం’ లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతీ అంటారు.

4) నోటిఫైడ్ ఏరియా కమిటీలు: శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా లేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడడంతో దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీగా వ్యవహరించడమైంది.

5) టౌన్ ఏరియా కమిటీలు: రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. అవి పరిమితమైన విధులను మాత్రమే నిర్వహిస్తుంటాయి.

6) కంటోన్మెంట్ బోర్డులు భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులనేవి భారత ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం, 1904 ద్వారా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందించడానికి అవి కృషి చేస్తున్నాయి.

7) టౌన్షిప్లు: టౌన్షిప్లు అనేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కు ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు.

8) పోర్ట్ స్ట్లు: దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ స్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి.

9) ప్రత్యేక ప్రయోజిత సంస్థలు: పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈ రకమైన సంస్థలు పనిచేస్తుంటాయి. పురపాలక సంఘాలు. ఇతర నోటిఫైడ్ ప్రాంతాలలో నివసించే ప్రజల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అవి కృషిచేస్తాయి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ప్రత్యేక చట్టాల ప్రకారం వాటిని స్థాపించడం జరుగుతుంది.

ప్రశ్న 8.
మున్సిపాలిటీల గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
నగరపాలక సంస్థకు దిగువన, గ్రామపంచాయతీ / నగర పంచాయితీకి ఎగువన గల పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంస్థలు. సాధారణంగా జనాభా 20,001 లేదా అంతకుమించితే లేదా అరవై లక్షలకు మించిన వార్షికాదాయం ఉంటే పురపాలక సంస్థలుగా ఏర్పాటవుతాయి.

ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి. 1) పురపాలక మండలి, 2) పురపాలక చైర్మన్, 3) మున్సిపల్ కమీషనర్, 4) స్థాయీ సంఘాలు, ఆ నాలుగు రకాల అంగాల గురించి క్రింది విధంగా వివరించవచ్చు.

పురపాలక సంస్థ చర్చావేదికయే పురపాలక మండలి. దీనిలో i) ఎన్నికయ్యే సభ్యులు ii) అనుబంధ సభ్యులు iii) గౌరవ సభ్యులు అనే మూడు రకాల సభ్యులు ఉంటారు. పురపాలక సంస్థ పరిధిలోని రిజిష్టర్డ్ ఓటర్లు మొదటి తరహా సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని కౌన్సిలర్స్ అంటారు. అనుబంధ సభ్యులను, ఎన్నికయిన సభ్యులు ఎన్నుకుంటారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, పురపాలక సంస్థ పరిధిలోని లోక్సభ, విధానసభ సభ్యులు తమ అధికార హోదారీత్యా పురపాలక మండలిలో సభ్యులుగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 9.
జిల్లా కలెక్టర్ యొక్క ఏవైనా మూడు విధులను గూర్చి రాయండి.
జవాబు:
జిల్లా పాలనాధిపతిగా – కలెక్టరుకు విశేష అధికారాలు, విస్తృత విధులు ఉంటాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) కలెక్టర్ – ప్రధాన రెవిన్యూ అధికారి: జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. హోదాలో అతడు జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలను చెల్లించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, తయారీలలో సహకరించడం, ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించడం వంటివి జిల్లా కలెక్టర్కు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి.

2) జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరించడం: కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తాడు. జిల్లాలో పనిచేసే పోలీస్ సిబ్బంది వ్యవహారాలపై అతనికి పర్యవేక్షణాధికారం ఉంటుంది. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగేటట్లు చూడవలసిందిగా పోలీస్ అధికారులకు సూచిస్తాడు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కలెక్టర్కు సహాయకారిగా ఉంటుంది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారు.

3) ముఖ్య సమన్వయ కర్త: జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల మధ్య కలెక్టర్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తాడు. వ్యవసాయం, నీటిపారుదల, సహకారం, విద్య, పరిశ్రమలు వంటి వివిధ శాఖల అధిపతులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తాడు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పనితీరును తెలుసుకుంటాడు. ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచనలను ఇస్తాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
జిల్లా కలెక్టరు పాత్రను అంచనా వేయండి.
జవాబు:
జిల్లాలోని వివిధ స్థానిక ప్రభుత్వాల వ్యవహారాల నిర్వహణలో కలెక్టర్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాడు. జిల్లాలో నివసించే సాధారణ ప్రజానీకానికి కలెక్టర్ స్నేహితుడిగా, తాత్త్వికుడిగా, మార్గదర్శకుడిగా ఉంటాడు. జిల్లాలోని స్థానిక ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు. ‘సాధారణంగా జిల్లాలోని సామాన్య ప్రజలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కలెక్టర్ అందించే సహాయసహకారాల కోసం ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు.

జిల్లాలోని స్థానిక ప్రభుత్వాల పనితీరు గురించి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగిన సూచనలందిస్తాడు. జిల్లాలో నూతనంగా స్థానిక సంస్థలను ఏర్పాటు చేసే విషయంలో కలెక్టర్ సిఫారసులు, వ్యాఖ్యానాలు అత్యంత కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. అనేక సందర్భాలలో జిల్లాలో వ్యవసాయం, పశుపోషణ, రెవిన్యూ, పోలీసు, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో పనిచేసే సిబ్బంది కలెక్టర్ సలహాల ప్రకారం వ్యవహరిస్తారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయక ఉత్పాదితాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, సహకార రుణాలు వంటి సౌకర్యాలు, వ్యవసాయ పంటల మార్కెటింగ్ సదుపాయాలు, ఆరోగ్యం, విద్యవంటి రంగాలలో పనిచేసే సిబ్బంది కలెక్టర్ సలహాల ప్రకారం వ్యవహరిస్తారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయక ఉత్పాదితాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాడు. వ్యవసాయ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడానికి కృషిచేస్తాడు. అలాగే పేదరిక రేఖ దిగువన నివసించే ప్రజలకు ఆరోగ్యం, ఆహారం, త్రాగునీరు, ఉపాధి వంటి సౌకర్యాలు కల్పించడానికి దోహదపడతాడు.

జిల్లా స్థాయిలో కలెక్టర్ దాదాపు నూరుకు పైగా కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించడమనే విషయం కలెక్టర్ పదవి ప్రాముఖ్యత గురించి, జిల్లా పాలనా వ్యవహారాలలో కలెక్టర్ నిర్వహించే కీలకపాత్ర గురించి తెలుపుతుంది. కలెక్టర్ జిల్లాస్థాయిలో వివిధ కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించడంతోపాటుగా ఆ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి తగిన శ్రద్ధ వహిస్తాడు. జిల్లాలో వివిధ మండల పరిషత్తులు, గ్రామపంచాయతీలను నెలలో దాదాపు ఇరవై రోజులపాటు సందర్శించి, ఆయా సంస్థల పనితీరును సమీక్షించి, వాటి మెరుగుదలకు తగిన సూచనలిస్తాడు. రాష్ట్రస్థాయిలో ముఖ్యకార్యదర్శి వలె, జిల్లాస్థాయిలో కలెక్టర్ విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ, తన అధికారాల వినియోగంలో వివేకం, వివేచనలను ప్రదర్శిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక అభివృద్ధి పథకాలైన జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS – National Rural Employment Guarantee Scheme), ప్రధానమంత్రి గ్రామ శోధక్ యోజన (PMGSY), జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం వంటి అనేక కార్యక్రమాల అమలు, విజయాలు, జిల్లా కలెక్టర్ చైతన్యవంతమైన నాయకత్వం పైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల జిల్లాస్థాయిలో ఉత్పన్నమయ్యే ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారంలో, జిల్లా ప్రజలతో మమేకమయ్యే జిల్లా కలెక్టర్తో ఆ ప్రభుత్వాలు నిరంతరం దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటాయి. జిల్లా స్థాయిలో జరిగే ప్రభుత్వ సంబంధమైన అనేక కమిటీలకు కలెక్టర్ కన్వీనర్గానో, సంధానకర్తగానో, సమన్వయ కర్తగానో వ్యవహరిస్తాడు.

ఇటీవలి కాలంలో కలెక్టర్ పదవిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణల ప్రభావంవల్ల కలెక్టర్ అధికార విధులు పునర్నిర్వచించబడినాయి. ఆ పరిణామాలు తమ అధికార విధుల నిర్వహణలో ఎంతో అప్రమత్తతతో వ్యవహరించేటట్లు కలెక్టర్ను తీర్చిదిద్దాయి. అంతేకాకుండా జనాభా పెరుగుదల, శాస్త్రసాంకేతిక రంగాలలో పురోగతి, ప్రణాళికలు, మహిళా సాధికారత, బలహీనవర్గాల సంక్షేమం, రాజ్యాంగపరమైన కర్తవ్యాలు మొదలైన అంశాలు జిల్లా కలెక్టర్ అధికార విధుల నిర్వహణలో విశేషమైన మార్పులకు దారితీశాయి.

ప్రశ్న 11.
ఆకర్షణీయ గ్రామ స్వభావాన్ని వివరించండి. [Mar. ’17]
జవాబు:
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2015లో ఆకర్షణీయ గ్రామ (Smart Village) పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యానికి కట్టుబడి స్వర్ణాంధ్ర లక్ష్యం విజన్ 2029 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటి చేయాలనేది ప్రభుత్వలక్ష్యం. ఈ లక్ష్యసాఫల్యం కోసం ప్రభుత్వం మిషన్ ఆధారిత దృక్పథంతో సాంఘిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల సౌకర్యాలను సృష్టిస్తారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జన్మభూమి, మా ఊరు కార్యక్రమానికి కొనసాగింపుగా ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి పాలన వికేంద్రీకరణ, అధికార దత్తత, ప్రభుత్వసేవలు, అభివృద్ధి పథకాలు మొ॥ విషయాలలో ప్రజలను భాగస్వాములను చేసి వారి జీవన విధానంలో నాణ్యత పెంచడం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనేది ఈ పథకం లక్ష్యం.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు
జవాబు:
ప్రస్తుతం భారతదేశంలో పంచాయితీరాజ్ సంస్థలు లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం ఏర్పాటయ్యాయి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు మూడు అంచెలలో వుంటాయి. అవి:

  1. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు
  2. మండల లేదా మధ్య స్థాయిలో మండల పరిషత్లు
  3. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లు.

ప్రశ్న 2.
రాజ్యాంగం (73వ సవరణ చట్టం) 1992
జవాబు:
భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు లేదా పంచాయితీరాజ్ సంస్థలను సమర్థవంతంగా తీర్చిదిద్దటానికి రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టంలో నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయితీ గ్రామం అనే పదాలను చేర్చడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక గ్రామసభను ఏర్పాటు చేసింది. ఈ చట్టం షెడ్యూల్డు కులాలకు, షెడ్యూల్డు తెగలకు, వెనుకబడిన తరగతులకు మరియు మొత్తం సీట్లలో 33.3 శాతం మహిళలకు కేటాయిస్తూ పంచాయితీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లను కల్పించింది.

ప్రశ్న 3.
గ్రామసభ
జవాబు:
ప్రతి గ్రామ పంచాయితీలో క గ్రామ సభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. ఇది సంవత్సరానికి కనీసం మూడుసార్లు సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయితీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయడం దీని పని.

ప్రశ్న 4.
జిల్లా పరిషత్
జవాబు:
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్తు ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యున్నత స్థాయి స్వపరిపాలన సంస్థయే జిల్లా పరిషత్తు, జిల్లా పరిషత్కు చట్టబద్ధమైన ప్రతిపత్తి ఉంటుంది. జిల్లా పరిషత్లో ఆరు అంగాలుంటాయి. అవి:

  1. జిల్లా పరిషత్
  2. ఛైర్మన్
  3. జిల్లా మహాసభ
  4. ముఖ్య కార్యనిర్వహణాధికారి
  5. స్థాయీసంఘాలు
  6. జిల్లా కలెక్టరు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
ఎం.పి.డి.ఒ (లేదా) మండల పరిషత్ అబివృద్ధి అధికారి [Mar. ’16]
జవాబు:
ఎం.పి.డి.ఒ అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి. ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇతను మండల పరిషత్క పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తారు. మండల పరిషత్, మండల మహాసభ తేదీలు, అజెండాల రూపకల్పనలోనూ ముఖ్యపాత్ర పోషిస్తాడు. మండల పరిషత్ వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. మండల పరిషత్ సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటాడు.

ప్రశ్న 6.
మండల పరిషత్తు
జవాబు:
జిల్లాలో మాధ్యమిక స్థాయిలో గల స్థానిక సంస్థయే మండల పరిషత్తు. రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మండల పరిషత్తు ఏర్పడుతుంది. ప్రతి మండలాన్ని కొన్ని మండల ప్రాదేశిక నియోజక వర్గాలుగా (జనాభా ప్రాతిపదికన) విభజిస్తారు. ఓటర్లు మండల ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులను ఎన్నుకుంటారు. మండల పరిషత్తులో నాలుగు అంగాలుంటాయి. అవి: 1) మండల పరిషత్తు 2) మండల పరిషత్తు అధ్యక్షుడు 3) మండల పరిషత్తు అభివృద్ధి అధికారి 4) మండల మహాసభ.

ప్రశ్న 7.
జిల్లా మహాసభ
జవాబు:
ప్రతి జిల్లాపరిషత్లో జిల్లా మహాసభ ఉంటుంది. దానిలో జిల్లా పరిషత్ చైర్మన్, కొందరు సభ్యులుంటారు. జిల్లా మహాసభ జిల్లా పరిషత్కు సలహా సంస్థగా వ్యవహరిస్తుంది. దాని సమావేశాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్, ఆడిట్ నివేదికలను పరిశీలించడం, జిల్లా పరిషత్క సంబంధించిన గత సంవత్సరపు పరిపాలన నివేదికను పరిశీలించటం జిల్లా మహాసభ ముఖ్య విధులుగా భావిస్తారు.

ప్రశ్న 8.
జిల్లా పరిషత్తు స్థాయీ సంఘాలు
జవాబు:
ప్రతి జిల్లా పరిషత్తులో ఏడు స్థాయి సంఘాలుంటాయి. అవి జిల్లా పరిషత్కు అనేక అంశాలపై సలహాలిస్తుంటాయి. ప్రణాళికలు, విత్తం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళాభ్యుదయం, సామాజిక సంక్షేమం, విద్య, ఆరోగ్యం మొ॥ అంశాలు స్థాయి సంఘాలు పరిధిలో ఉన్నాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పరిషత్తు చైర్మన్ ను సంప్రదించి స్థాయి సంఘాల సమావేశాలను ఏర్పాటుచేస్తాడు.

ప్రశ్న 9.
జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి
జవాబు:
ప్రతి జిల్లా పరిషత్తులో ఒక ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉంటాడు. అతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. అతడు తన అధికారాల, విధుల నిర్వహణలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, మరొకవైపు జిల్లా పరిషత్తుకు బాధ్యత వహిస్తాడు. అతడు జిల్లా పరిషత్తు పరిపాలన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్ సాధారణ సమావేశాల అజెండాను, వార్షిక బడ్జెట్ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాడు. జిల్లా పరిషత్తుకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, భవనాలు, రికార్డులపై పరిపాలనాపరమైన అజమాయిషీ కలిగి ఉంటాడు. జిల్లా పరిషత్తు, జిల్లామహాసభ, జిల్లా స్థాయీ సంఘాలు తీసుకున్న నిర్ణయాలను, ఆమోదించిన తీర్మానాలను అమలులో ఉంచడానికి చర్యలు తీసుకుంటాడు.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
పురపాలక మండలి
జవాబు:
పురపాలక సంస్థ చర్చా వేదికయే పురపాలక మండలి. దీనిలో మూడు రకాల సభ్యులుంటారు. వారు 1) ఎన్నికయ్యే సభ్యులు 2) అనుబంధ సభ్యులు 3) గౌరవ సభ్యులు, పురపాలక మండలి సాధారణంగా నెలకొక పర్యాయం సమావేశమవుతుంది. పురపాలక మండలి సమావేశాల అజెండాను మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ ఛైర్మన్ నన్ను సంప్రదించి రూపొందిస్తాడు. పురపాలక సంస్థకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని పురపాలక మండలి పరిశీలిస్తుంది.

ప్రశ్న 11.
నగర పంచాయతి
జవాబు:
గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయికి పరిణామం చెందే ప్రాంతం లేదా అతిచిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటయ్యే స్థానిక సంస్థలను నగర పంచాయతి అంటారు. జనసాంద్రత, స్థానిక సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు, ఆ ప్రాంత ఆర్థిక ప్రాధాన్యత మొదలైన అంశాల ఆధారంగా నగర పంచాయితీల ఏర్పాటు
జరుగుతుంది.

ప్రశ్న 12.
నోటిఫైడ్ ఏరియా కంపెనీ
జవాబు:
శీఘ్రగతిన అభివృద్ధి పథంలో పురోగమించే పట్టణాలలో లేదా పురపాలక సంస్థల ఏర్పాటుకు అనుకూలంగాలేని పరిస్థితులలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన ద్వారా ఈ కమిటీ ఏర్పడుతుంది. కావున దీనిని నోటిఫైడ్ ఏరియా కమిటీ అని అంటారు. దీనికి చట్టబద్ధమైన హోదా ఉండదు. దీనిలో ఒక చైర్మన్. కొంతమంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీని విధులు పురపాలక సంస్థ విధులను పోలి ఉంటాయి.

ప్రశ్న 13.
కంటోన్మెంట్ బోర్డులు
జవాబు:
భారతదేశంలో కంటోన్మెంట్ బోర్డులనేవి భారత ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం, 1904 ద్వారా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాలలో నివసించే పౌరులు, సైనిక సిబ్బంది తాలుకు వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందించడానికి అవి కృషిచేస్తున్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం మూడు రకాల కంటోన్మెంట్ బోర్డులున్నాయి. అవి దేశరక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటై కొనసాగుతున్నాయి. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో కొందరు ఎన్నుకోబడిన వారు సభ్యులుకాగా, కొందరు కేంద్ర ప్రభుత్వంతో నామినేట్ చేయబడినవారు, మరికొందరు పదవిరీత్యా సభ్యులుగా ఉంటారు. ప్రతి కంటోన్మెంట్ బోర్డులో ఒక జనరల్ ఆఫీసర్ – ఆఫ్ – కమాండర్ (GOC – General Officer of Commander) ఉంటాడు.

ప్రశ్న 14.
టౌన్ ఏరియా కమిటి
జవాబు:
రాష్ట్ర శాసనసభ ఆమోదించే ప్రత్యేక చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీ ఏర్పాటవుతుంది. చిన్న పట్టణాల అవసరాలను తీర్చడానికి ఈ కమిటీలు అవసరమవుతాయి. ఈ కమిటీ నిర్వర్తించే విధులలో ముఖ్యమైనవి వీధి దీపాలను అమర్చటం, డ్రైనేజీ సౌకర్యాల కల్పన, పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజల స్థితిగతులను మెరుగుపరచటం మొదలగునవి.

ప్రశ్న 15.
టౌన్ షిప్
జవాబు:
టౌన్ షిప్ నేవి ప్రభుత్వరంగ సంస్థలలో ఏర్పాటవుతాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బందికి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఇవి కృషిచేస్తాయి. వాటిలో ఎన్నుకోబడే సభ్యులు ఎవరూ ఉండరు. ప్రతి టౌన్షిప్కి ఒక టౌన్ పరిపాలన అధికారి ఉంటాడు. అతడిని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వశాఖ నియమిస్తుంది.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 16.
పోర్ట్ ట్రస్ట్లు
జవాబు:
దేశంలోని సముద్రతీరంలో ఓడరేవులు ఉన్న ప్రాంతాలలో పోర్ట్ ట్రస్ట్లు ఏర్పాటవుతాయి. అలాగే నౌకాశ్రయాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. అవి నౌకాశ్రయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం అందుకోసం కొన్ని కమిటీలను నియమిస్తుంది. ఆ కమిటీల సభ్యులలో కొందరు ఎన్నుకోబడగా, మరికొందరు నామినేట్ అవుతారు.

ప్రశ్న 17.
జిల్లా రెవిన్యూ అధికారిగా కలెక్టర్ [Mar. ’17]
జవాబు:
జిల్లాలో కలెక్టర్ ప్రధాన రెవిన్యూ అధికారిగా వ్యవహరిస్తాడు. జిల్లాలోని గ్రామాలలో భూమిశిస్తు, జమాబందీ లెక్కలకు ఆధ్వర్యం వహిస్తాడు. భూమిశిస్తు వసూళ్ళు, రైతులకు రుణాల మంజూరు, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారాలు చెల్లించటం, ప్రభుత్వభూముల రికార్డులను నిర్వహించటం మొదలగునవి జిల్లా కలెక్టరుకు ఉన్న రెవిన్యూ అధికారాలలో ముఖ్యమైనవి.

ప్రశ్న 18.
జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్
జవాబు:
జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తాడు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూసే బాధ్యత కలెక్టర్పై ఉంది. ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితాలో సవరణలు, ఓటర్ల జాబితాలపై ఫిర్యాదుల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, రిటర్నింగ్ అధికారుల నియాయకం మొదలగు అనేక విధులను కలెక్టర్ నిర్వహిస్తాడు.

ప్రశ్న 19.
స్వర్ణాంధ్రప్రదేశ్
జవాబు:
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2015లో ఆకర్షణీయ గ్రామ పథకాన్ని ప్రారంభించారు. జన్మభూమి, మా వూరు కార్యక్రమానికి కొనసాగింపుగా ఆకర్షణీయ గ్రామం (Smart Village), ఆకర్షణీయ వార్డు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించి, పాలనా వికేంద్రీకరణ, అధికార దత్తత, ప్రభుత్వ సేవలు, అభివృద్ధి పథకాలతో ప్రజలను భాగస్వాములను చేయటం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయటమే ఈ పథకం ఉద్దేశ్యం.

ప్రశ్న 20.
ఆకర్షణీయ నగరం [Mar. ’16]
జవాబు:
‘ఆకర్షణీయ నగరం (Smart City), అనేది అవస్థాపన సౌకర్యాల పరంగా ఎంతగానో అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతం. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్లు, మార్కెట్ల సామర్థ్యం వంటి అంశాలు ఉంటాయి. నివాసితులకు అత్యవసర, ప్రాథమిక సేవలను అందించేందుకు అవసరమైన ప్రధాన అవస్థాపక (Infrastracture), సమాచార సాంకేతికత (Information Technology) లు అందుబాటులో ఉంటాయి.

AP Inter 2nd Year Civics Study Material Chapter 10 భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు

ఆకర్షణీయ నగరాలు పెట్టుబడులు తరలివచ్చేందుకు దోహదపడతాయి. మంచి అవస్థాపన, సాధారణ పారదర్శక, శీఘ్రతతో కూడిన స్థాపనాలకు వీలు కల్పిస్తాయి. పెట్టుబడిదారీ మితృత్వ నగరాలుగా ఉంటూ, ఉద్యమిత్య సంస్థలను స్థాపించి, సమర్థవంతంగా నిర్వహించుకొనేందుకు వీలుకల్పిస్తాయి.

Leave a Comment