Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 11th Lesson ఎన్నికలు – ప్రాతినిధ్యం Textbook Questions and Answers.
AP Inter 2nd Year Civics Study Material 11th Lesson ఎన్నికలు – ప్రాతినిధ్యం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భారతదేశ ఎన్నికల వ్యవస్థపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
పౌరులందరూ ప్రభుత్వం చేసే నిర్ణయాలన్నింటిలో ప్రత్యక్షంగా పాల్గొనే వీలులేదు. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలచే ఎన్నుకోబడి వారి కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చుతారు. కావున ఎన్నికలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని మనం అనుకున్నప్పుడు మన ఆలోచనలు గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలవైపు మళ్ళుతాయి. నేడు ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రతీకలుగా నిలిచాయి.
భారత ఎన్నికలవ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు:
ఈ క్రింది ముఖ్యలక్షణాలు భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని మరియు నిర్వహణను విశదీకరిస్తున్నాయి. అవి:
1) ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ఎన్నిక: భారతదేశంలోని ప్రజలు తమ ప్రజాప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకొనుటకు రాజ్యాంగం వీలుకల్పించింది. పార్లమెంటు సభ్యులను, రాష్ట్ర శాసనసభలకు, పట్టణ, నగరపాలక సంస్థలు గ్రామ పంచాయితీ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ శాసనసభలు ప్రజల అధికారానికి ముఖ్యకేంద్రాలు.
2) కొన్ని సంస్థలకు పరోక్ష ఎన్నికలు: రాజ్యసభ, రాష్ట్రాలవిధానమండలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యాంగం పరోక్ష ఎన్నికలకు అవకాశం కల్పించింది. ఆయా సంస్థలకు, పదవులకు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడతాయి.
3) వయోజన ఓటు హక్కు: భారత రాజ్యాంగం పౌరులందరికి వయోజన ఓటుహక్కును కల్పించినది. 21 సంవత్సరములు నిండిన పౌరులందరికీ కుల, మత, జాతి, లింగవివక్షత లేకుండా ఓటుహక్కును కల్పించినది. ఆ తరువాత ఓటు హక్కుకు అర్హత వయస్సు 21 నుండి 18 సంవత్సరములకు తగ్గించడం జరిగినది. నేడు భారతదేశంలో 18 సంవత్సరములు నిండిన పౌరులందరి పేర్లు ఓటర్ల జాబితాలలో చేర్చబడి వారు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు అర్హత లభించింది.
4) షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సీట్ల కేటాయింపులో ప్రాతినిధ్యం: షెడ్యూల్డ్ కులాలు, తెగల అభీష్టాన్ని పరిరక్షించేందుకు భారతరాజ్యాంగం వారికి పార్లమెంటు, శాసనసభ సీట్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించింది. రాజ్యాంగంలోని 330 ప్రకరణ లోక్సభలోని సీట్లు, 332 ప్రకరణ రాష్ట్రశాసనసభలలోని సీట్లు కేటాయింపులో ఆయాతరగతులకు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొన్నది. వారికి కేటాయించిన స్థానాలలో ఆయా తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలి.
5) నియామకపు ప్రతిపాదనలు: భారతరాజ్యాంగంలోని 337 ప్రకరణం పార్లమెంటులోని లోక్సభకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమించి చెయ్యవచ్చును. ఇదే పద్ధతిలో గవర్నర్ రాష్ట్రశాసన సభకు ఒక ఆంగ్లో ఇండియన్ను నియమించే అధికారం ఉంది.
6) ఓటరు జాబితాల సవరణ: భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి ఓటర్లనమోదు, ఓటరు జాబితాల సవరణ, తయారీ ప్రక్రియలను భారత ఎన్నికల సంఘం చేపడుతుంది. అంతేగాక ప్రతిసాధారణ ఎన్నికలకు ముందుగా ఎన్నికల జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలకు ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది. ప్రతి ఏడాది ఓటరు జాబితాల సవరణకు కూడా అవకాశం ఉన్నది. ఓటరు జాబితాలో ఎవరి పేరు నమోదు కాబడిందో వారు మాత్రమే ఎన్నికల తేదీన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు అర్హులు.
7) ప్రాదేశిక, ఏక సభ్య నియోజకవర్గాలు: భారత ఎన్నికల వ్యవస్థ ఏక సభ్య ప్రాదేశిక నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. నిర్దేశించబడిన ప్రతిపాదిత ప్రాంతంలో నివశించే ఓటర్లు అందర్నీ కలిపి ఒక నియోజకవర్గంగా పరిగణిస్తారు. ఇలాంటి ఒక నియోజకవర్గం నుండి ఒకే ప్రతినిధిని ఓటర్లు ఎన్నుకోవలసి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ శాసన, పార్లమెంటు నియోజకవర్గాలుగా విభజించబడ్డాయి. ప్రతీ నియోజకవర్గం నుండి ఒక శాసనసభ్యుడ్ని, పార్లమెంటు సభ్యుడ్ని ఓటర్లు ఎన్నిక చేసుకుంటారు. వీటిలో కొన్ని నియోజకవర్గాలు షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయిస్తారు. `ఆయా నియోజకవర్గాలలో ఆ తెగలకు, కులాలకు చెందిన అభ్యర్థులను మాత్రమే ఎన్నిక చేసుకోవాలి.
8) నియోజకవర్గాల పునర్విభజన: ప్రతి పది సంవత్సరములకు జనాభాలెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన చేయబడుతాయి. దీనికొరకు నియోజ వర్గాల పునర్విభజన సంఘం ఏర్పాటు చేయబడుతుంది. ఈ సంఘం ప్రతిపాదనల మేరకు నియోజకవర్గాలు పునర్విభజన చేయబడవచ్చు లేదా ఒకదానిలో ఒకటి కలపవచ్చు. ఈ విషయంలో నియోజకవర్గాల పునర్విభజన సంఘం నిర్ణయమే అంతిమం. ఈ సంఘం యొక్క నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయుటకు వీలులేదు.
9) రహస్య బ్యాలెట్ పద్ధతి: ఓటర్లు ఓటును స్వేచ్ఛగా తమ అభీష్టం మేరకు వినియోగించుకొనేందుకు రహస్య ఓటింగుకు వీలు కల్పించింది. ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, రహస్యంగా వినియోగించుకొనేందుకు, దొంగ ఓట్లు వేసేవారిని గుర్తించేందుకు ప్రత్యేకమైన చర్యలు, తీసుకున్నారు. ఇటువంటి విధానం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చాలా అవసరం.
10) ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టడం: భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకొనేందుకు, ఓట్ల లెక్కింపుకు ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటారు. ఓటింగులో బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఓటింగు యంత్రాలను వినియోగించడమైంది.
11) పరస్పర ఆధిక్యత ఓటు పద్ధతి: ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికలలో తోటి అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఓట్ల లెక్కింపుకు అర్హత కల్గిన ఓట్లను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. ఒక అభ్యర్థి విజయాన్ని ఆ అభ్యర్థితో పోటీపడిన అభ్యుర్థులకు వచ్చిన ఓట్లకన్నా ఎక్కువగా వచ్చిన ఓట్లను బట్టి నిర్దేశింపబడుతుంది. అంటే తోటి అభ్యర్థుల కన్నా ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు పోలౌతాయో ఆ అభ్యర్థి గెలుపొందినట్లు లెక్క
2) స్వయంప్రతిపత్తి కలిగిన యంత్రాంగం: రాజ్యాంగంలోని 324 ప్రకరణ ప్రకారం దేశంలోని ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల సంఘం యొక్క ముఖ్యబాధ్యత. ఎన్నికలను స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ భారత ఎన్నికల సంఘం.
ప్రశ్న 2.
భారత ఎన్నికల సంఘం విధులను వివరించండి.
జవాబు:
భారత రాజ్యాంగంలోని ప్రకరణ 324(1) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు సంబంధించిన ఎన్నికలను పర్యవేక్షించి, నిర్వహించుటకై ఎన్నికల సంఘం ఏర్పాటు కొరకు వీలుకల్పించాయి.
భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన శాశ్వతమైన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. నిర్మాణం: భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళ సభ్య వ్యవస్థగా పనిచేయుచున్నది.
నియామకం: ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర కమీషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం: భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లు 6 సంవత్సరములు లేదా 65 సంవత్సరమలు వయస్సు నిండే వరకు పదవిలో కొనసాగుతారు.
ఎన్నికల సంఘం విధులు: భారత రాజ్యాంగంలోని 324 నుండి 328 వరకు గల ప్రకరణలు ఎన్నికల సంఘం యొక్క ఏర్పాట్లు, అధికారాలు, విధులను విశదీకరిస్తున్నాయి. అవి.
- భారత ఎన్నికల సంఘం నిర్ణీత కాలవ్యవధిలో ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.
- ఓటర్ల జాబితాలు నమోదు చేయబడ్డ అర్హత కలిగిన ఓటర్ల పేరులో తప్పులు లేకుండా తయారుచేయటం ఎన్నికల సంఘం విధి.
- ఎన్నికల నిర్వహణకు ఎన్నికల తేదీ, ఇతర వివరాలతో ఎన్నికల ప్రకటన, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కూడా నిర్వహిస్తుంది.
- ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
- ఎన్నికల నిర్వహణ, ప్రశాంతతకు భంగం కలిగినట్లయితే దేశం మొత్తం ఎన్నికలను, లేదా కొన్ని రాష్ట్రాలలో లేదా రాష్ట్రంలో, కొన్ని నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చును.
- పార్టీలకు, ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులకు ఎన్నికల నియమావళిని వర్తింపచేస్తుంది.
- ఏదో ఒకటి లేదా కొన్ని నియోజకవర్గాలలో తిరిగి ఎన్నికల నిర్వహణకు ఆజ్ఞలు జారీ చేయవచ్చును.
- ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సవ్యంగా జరగలేదని భావిస్తే ఎన్నికల సంఘం తిరిగి ఓట్ల లెక్కింపునకు ఆదేశించవచ్చును.
- గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఎన్నికల గుర్తులు కేటాయించటం, రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వటం ఎన్నికల సంఘం ముఖ్యవిధి.
- రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతికి ఎన్నికల సంఘం సలహాలనిస్తుంది.
- రాష్ట్ర శాసనసభలో సభ్యుల అర్హత లేదా అనర్హత విషయాలలో రాష్ట్ర గవర్నర్కు సలహాలిస్తుంది.
ప్రశ్న 3.
ప్రాతినిధ్యం అనగానేమి ? భారతదేశంలో ఎన్ని రకాల ప్రాతినిధ్య వ్యవస్థలు ఉన్నాయో తెలపండి.
జవాబు:
ప్రాతినిధ్యం – అర్థం: ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య లేదా |ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగి ఉంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాల తయారీ కొరకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. భారతదేశంలో అమలులో ఉన్న ప్రాతినిధ్య వ్యవస్థలు:
భారతదేశంలో రెండు రకాల ప్రాతినిధ్య వ్యవస్థలు లేదా పద్ధతులు ఉన్నాయి. అవి:
- ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతి
- వృత్తి ఆధారిత ప్రాతినిధ్య పద్ధతి.
1) ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతి: ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరినీ వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకుంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలోగాని, జనాభా సంఖ్యలో గాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజకవర్గంలో నివసించే ఓటరులందరూ తమ ప్రజాప్రతినిధి ఎన్నికప్రక్రియలో భాగస్వామ్యులౌతారు. ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒకే ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే అది ఏకసభ్య నియోజకవర్గంగా పరిగణిస్తారు. అలాకాక ఒక నియోజక వర్గం నుండి ఒకరికన్నా ఎక్కువమంది ప్రతినిధులు ఎన్నికైతే దానిని బహుళ సభ్య నియోజక వర్గం అంటారు. భారతదేశం లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దిగువసభ సభ్యుల ఎంపిక కొరకు ఏకసభ్య ప్రాదేశిక నియోజకవర్గ పద్దతిని అనుసరిస్తున్నారు.
2) వృత్తి ఆధారిత ప్రాతినిధ్య పద్ధతి: పౌరులు చేసే వృత్తుల ఆధారంగా ఇటువంటి నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి నియోజకవర్గాలలో పౌరులు ఒకే రకమైన వృత్తి లేదా సమాన లక్షణాలు కలిగిన వృత్తులలో నిమగ్నమై ప్రాదేశిక ప్రాంతంలో నివాసముంటారు. వైద్యులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, పత్రికా విలేకరులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శ్రామికులు తదితరులు వివిధ రకాల వృత్తి సంఘాల్ని కలిగి ఉంటారు. ఒకే వ్యక్తి అన్ని రకాల వృత్తులకు ప్రాతినిధ్యం వహించలేడు కనుక వృత్తి లేదా పని ఆధారంగా ప్రాతినిధ్యం ఉండాలి. ఇక చట్టసభలు వివిధ రకాల వృత్తుల సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తే, ఆ సభ వివిధ రకాల ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తూ వాటిని వ్యక్తీకరిస్తుంది. కాని అసంఖ్యాకమైన వృత్తులు, పనులను నిర్వహిస్తున్న అపరిమితమైన సమూహాలున్న దేశంలో అన్ని వృత్తుల వారికి, సమూహాలకు ప్రాతినిధ్యం కల్పించటం సాధ్యం కాదని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
భారత ఎన్నికల వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని నీవు భావిస్తున్నావా ?
జవాబు:
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియలను పరిశీలించి సంస్కరణలను ప్రతిపాదించుటకై అనేక కమిటీలు, కమిషన్లను భారత ప్రభుత్వం నియమించింది. అందులో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.
- 1974 తార్కుండై కమిటీని నియమించగా అది 1975లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
- 1990లో ఎన్నికల సంస్కరణల కొరకు దినేష్ గోస్వామి కమిటీని నియమించడమైంది.
- రాజకీయాలు, నేరాల మధ్య సంబంధాల అధ్యయనం కోసం 1993 సంసత్సరంలో ఓహ్రా కమిటీ నియామకం జరిగింది.
- ఎన్నికలలో రాజకీయ నిధుల అధ్యయనం కొరకు 1998 సంవత్సరంలో ఇంద్రజిత్ గుప్తా కమిటీ నియమించబడింది.
ఎన్నికల సంస్కరణలు:
పైన పేర్కొన్న వివిధ కమిటీలు ఎన్నికల సంస్కరణల కొరకు అనేక సూచనలు, సంస్కరణలు ప్రతిపాదించాయి. వాటిలో ముఖ్యమైనవిగా ఈ క్రింది వాటిని పేర్కొనవచ్చు. అవి.
1) ఓటు అర్హత వయస్సు తగ్గింపు:
ప్రాతినిధ్యం లేని యువతకు ఓటుహక్కు కల్పించేందుకు రాజ్యాంగం (61వ సవరణ) చట్టం 1998 ద్వారా ఓటుహక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడమైంది.
2) ఎన్నికల సంఘానికి ఉద్యోగుల బదిలీ: ఎన్నికల సమయాలలో ఓటర్ల జాబితా తయారీ, సవరణ మరియ తప్పులు సరిదిద్దడం వంటి విధుల నిర్వహణకు అధికారులు మరియు ప్రభుత్వ సిబ్బందికి 1988 నుండి ఎన్నికల సంఘంకు తాత్కాలికంగా బదిలీ చేయడమైంది. ఆ ఉద్యోగులు ఎన్నికల సమయాలలో ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణా పరిధిలో ఉంటారు.
3) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు:
ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను (Electronic Voting Machines) వినియోగించేందుకు 1989లో అవకాశం కల్పించుట జరిగినది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల కొరకు 1998 సంవత్సరంలో మొట్టమొదట ప్రయోగాత్మకంగా కొన్ని నియోజక వర్గాలలో ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలు ఉపయోగించడమైంది. దేశం మొత్తానికి 1999 సాధారణ ఎన్నికలలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ఉపయోగించుట జరిగినది.
4) మద్యం అమ్మకాలపై నిషేధం:
ఫలహార లేదా భోజనశాలలో గాని, ప్రభుత్వ ప్రయివేటు ప్రదేశాలలో గాని ఎన్నికల గడువు ముగియడానికి 48 గంటల ముందునుండి మద్యంగాని లేదా ఇతర మత్తుపానీయాలు గాని విక్రయించుట, పంపిణీ చేయుట, ఓటర్లకు అందించుట చేయరాదు. ఎవరైనా ఈ నిబంధన అతిక్రమించినట్లయితే వారు శిక్షార్హులుగా పరిగణించబడి శిక్షించబడటం జరుగుతుంది.
5) అభ్యర్థులు రెండు నియోజక వర్గాలలో పోటీకి పరిమితం చేయటం:
సాధారణ ఎన్నికలు లేదా ఉపఎన్నికలలో పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలలో ఒకేసారి రెండు నియోజకవర్గాల కంటే ఎక్కువ నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేయరాదు. ఇదే తరహా పరిమితి రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలలో కూడా వర్తిస్తుంది.
6) ఆయుధాలపై నిషేధం:
పోలింగు కేంద్రం సమీపంలో గాని, పోలింగు కేంద్రం లోపలికి గాని ఏ రకమైన ఆయుధాలతో ఎవరు ప్రవేశించరాదు లేదా సంచరించరాదు. అలా చేసినచో అది నేరంగా పరిగణిస్తూ రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా కొంత మొత్తం అపరాధ రుసుము లేదా రెండూ విధించవచ్చును. అంతేగాక ఆ ఆయుధానికి సంబంధించిన లైసైన్సు కూడా రద్దు చేయబడుతుంది.
7) ఎన్నికల ప్రచార సమయం కుదింపు:
ఎన్నికలలో పోటీచేయు అభ్యుర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడుపునుండి పోలింగు తేది మధ్యగల కనీస వ్యవధి 20 రోజుల నుండి 14 రోజులకు కుదించడమైంది.
8) పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్:
కొందరు వ్యక్తులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించేందుకు అవకాశం 1999 సంవత్సరంలో కల్పించబడింది. ఎన్నికల సంఘంచే గుర్తించబడిన కొన్ని వర్గాల వ్యక్తులు తమ ఓటుహక్కును సంబంధిత నియోజకవర్గాల ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే వినియోగించుకోవాలి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఎన్నికల విధులపై లఘటీక రాయండి.
జవాబు:
ఎన్నికల విధులు: ఎన్నికల విధులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి 1) రాజకీయ ఎంపిక 2) రాజకీయ భాగస్వామ్యం 3) మద్దతును అందించడం, కొనసాగించడం 4) అనుబంధ విధులు.
1) రాజకీయ ఎంపిక:
ఎన్నికలను ప్లెబిసైట్, రిఫరెండం లేదా ప్రజానిర్ణయం వంటి వాటిని వివరించడానికి ఉపయోగిస్తారు. ఎన్నికలు ప్రజలు తమ నాయకుల్ని ఎన్నిక చేసుకొనేందుకు, జనేచ్ఛను నిర్ణయించడానికి ఎన్నికలు కీలకమైన సాధనాలుగా ఉంటాయి. అధికారం చట్టబద్ధంగా బదలాయించడానికి, శాంతిని పరిరక్షించడానికి ఎన్నికలు సహాయపడతాయి.
2) రాజకీయ భాగస్వామ్యం:
ఎన్నికల అతిపెద్ద విధి ప్రజలకు రాజకీయ భాగస్వామ్య అవకాశాల్ని, మార్గాల్ని కల్పించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల రాజకీయ భాగస్వామ్యం అతిముఖ్యమైనది. కావున ఎన్నికలకు ఇది కేంద్రబిందువు. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం.
3) నిర్మాణ సహకారం – వ్యవస్థ నిర్వహణ:
ఒక రాజకీయ వ్యవస్థకు ఎన్నికలు చట్టబద్ధతను, రాజకీయ స్థిరత్వాన్ని, సమైక్యతను, గుర్తింపును కల్పించటం ద్వారా సహకరిస్తాయి. కాబట్టి ఎన్నికలు రాజకీయ వ్యవస్థ సహాయం అందించేవి మాత్రమేగాక దానిని నియంత్రించగలిగే కారకంగా చెప్పవచ్చును.
4) అనుబంధ విధులు:
ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య రాజకీయ సమాచారాన్ని అందించే ముఖ్యప్రతినిధులు ఎన్నికలే. ప్రజలు తమ రాజకీయ ప్రతినిధులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేందుకు ఎన్నికలు దోహదపడతాయి.
ప్రశ్న 2.
భారత ఎన్నికల ప్రక్రియను గూర్చి చర్చించండి.
జవాబు:
భారతదేశంలో పార్లమెంటులోని లోక్సభ (దిగువసభ) మరియు రాష్ట్ర విధానసభల సభ్యులను ఎన్నుకునేందుకై చేపట్టే సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే పెద్ద ప్రక్రియగా చెప్పవచ్చు. ప్రతి ఐదుసంవత్సరాలకు రాష్ట్రపతి అదేశానుసారం ఎన్నికల ప్రకటన విడుదలవుతుంది. దేశంలోని ఓటర్లు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకొనేందుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు ఎన్నికల నోటిఫికేషన్లు ఇస్తారు. లోక్సభ, విధానసభల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు లేదా వేర్వేరు సమయాలలోనూ నిర్వహించవచ్చు.
భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ వివిధ దశలలో నిర్వహించబడుతుంది. అవి:
1) నియోజక వర్గాల పునర్విభజన: ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ నియోజక వర్గాల పునర్విభజనతో మొదలౌతుంది. రాష్ట్రపతిచే నియమితమైన నియోజకవర్గాల పునర్విభజనసంఘం ప్రతి పదిసంవత్సరాలకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడుతుంది. సాధారణంగా లోక్సభ నియోజవర్గం ఆరు లేక ఏడు శాసనసభ నియోజకవర్గాలలో కలిపి ఉంటుంది.
2) రాజకీయ పార్టీల గుర్తింపు: దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతం ఆధారంగా పార్టీలను జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలుగాను, లేదా నమోదు చేయబడి గుర్తింపు లేని పార్టీలుగాను వర్గీకరిస్తుంది. అలాగే పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది.
3) ఓటరు గుర్తింపు కార్డులు: ఓటరు జాబితాలు తప్పులు లేనివిగా తీర్చిదిద్దటం, ఎన్నికలలో అక్రమాలకు అడుకట్టవేయటం కొరకు ఎన్నికల సంఘం దేశంలోని అర్హతకలిగిన అందరు ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు ఆగష్టు 1993 నుండి జారీచేయటం జరిగింది.
4) ఓటర్ల జాబితాలు: ఎన్నికల నిర్వహణకు దేశంలోని అర్హత కలిగిన ఓటర్ల పేరుతో నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయటం ముఖ్యమైన విధి. ప్రతి పది సంవత్సరాలకు జరిపే జనాభా లెక్కలు ఆధారంగా ఓటర్లు జాబితాలు సవరించబడతాయి.
5) ఎన్నికల ప్రకటన – రిటర్నింగ్ అధికార్ల నియామకం: ప్రతీసాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రపతి ఎన్నికలసంఘానికి ఆజ్ఞలు జారీ చేస్తారు. వెంటనే ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఎన్నికలతేదీలు, నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ తేదీలు ప్రకటిస్తుంది. వివిధ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారాలను ఎన్నికల సంఘం నియమిస్తుంది.
6) నామినేషన్ పత్రాల దాఖలు చేయుట: ఎన్నికలలో పోటీ చేయ్యాలనుకొనే అభ్యర్థులు తమతమ నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఎన్నికల సంఘంచే ఇవ్వబడిన నామినేషన్ పత్రాలను పూర్తివివరాలతో అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. పార్టీ తరపున పోటీచేయు అభ్యర్థుల పేర్లను ఇద్దరు ప్రతిపాదించాల్సి వుంటుంది.
7) నామినేషన్ పత్రాల పరిశీలన: నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు పూర్తయిన వెంటనే అభ్యర్థులు లేదా వారి అనుమతి పొందిన వ్యక్తుల సమక్షంలో సంబంధిత నియోజకవర్గాలలోని రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులందరి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
8) నామినేషన్ల ఉపసంహరణ: నామినేషన్ పత్రాల పరిశీలనానంతరం ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీ, సమయంలోపుగా అభ్యర్థులు స్వచ్ఛందంగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చును.
9) ఎన్నికల ప్రచారం: ఎన్నికల ప్రక్రియలో తరువాత దశ ఎన్నికల ప్రచారం. పోటీలో నిలిచిన అభ్యర్థులు, పార్టీలు తమ గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలు తమ విధానాలు, కార్యక్రమాలు, వాగ్దానాలుతో కూడిన ఎన్నికల ప్రణాళికలను (Election Manfesto) విడుదల చేస్తారు.
10) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు: బ్యాలెట్ పత్రాలకు, బ్యాలెట్ పెట్టెలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ఉపయోగించటం ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
11) ఓటర్లు ఓటు వేయుట: ప్రతి ప్రాదేశిక నియోజక వర్గంలోనూ ఎన్నికల సిబ్బంది పోలింగు బూత్లు ఏర్పాటు చేసి ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.
12) ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణ: ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎన్నికలప్రచారం నిబంధనల మేరకు నిర్వహించేందుకు, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.
13) ప్రసార మాధ్యమాల ప్రచారం: ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా ఉంచేందుకు గాను ప్రచారమాధ్యమాలను ఎన్నికల తేదీల ఎన్నికల ప్రక్రియను ప్రసారం చేసేందుకు అవకాశం కల్పిస్తారు.
14) ఓట్లలెక్కింపు -ఫలితాల ప్రకటన ఓటింగు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం నిర్దేశించిన తేదీన సమయానికి రిటర్నింగు అధికారి మరియు సిబ్బంది అభ్యర్థులు మరియు వారి ప్రతినిధులు సమక్షంలో ఓటింగు యంత్రాలను తెరుస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో ప్రతీ అభ్యర్థి తనకుపోలైన ఓట్లను సరిచూసుకుంటారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఏ అభ్యర్థికైతే సమీప అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తూ గెలిచిన అభ్యర్థికి ధ్రువప్రతాన్ని అందజేస్తారు.
15) ఎన్నికల ఫిర్యాదులు: ఎన్నికలలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు భావిస్తే ఓటరు లేదా అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఎన్నికలపై ఫిర్యాదు చేయవచ్చును. ఎన్నికల ఫిర్యాదు న్యాయస్థానంలో వేసే వాజ్యం (Suit) కాదు. కాని ఈ ఫిర్యాదులో మొత్తం నియోజకవర్గం అంతా భాగస్వామి అవుతుంది. న్యాయస్థానంలో కూడా ఎన్నిక చెల్లదు అని అభ్యర్థి ఎన్నికను సవాలు చేయవచ్చును. ఇలాంటి ఫిర్యాదు ఆయారాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల (High Court) లలో విచారించబడతాయి. ఎన్నికలలో అక్రమాలు రుజువైతే అభ్యర్థి ఎన్నిక నిలిపివేయబడి రద్దు చేయబడుతుంది.
ప్రశ్న 3.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం, విధులను రాయండి. [Mar. ’16]
జవాబు:
నిర్మాణం: భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళసభ్య వ్యవస్థగా పనిచేయుచున్నది. దీనిని 1950 జనవరి 26న నెలకొల్పారు.
ఎన్నికల సంఘం విధులు:
భారత రాజ్యాంగంలోని 324 నుండి 328 వరకు గల ప్రకరణలు ఎన్నికల సంఘం యొక్క ఏర్పాటు, అధికారాలు, విధులను విశదీకరిస్తున్నాయి. అవి.
- భారత ఎన్నికల సంఘం నిర్ణీత కాలవ్యవధిలో ఓటర్ల జాబితాలను సవరిస్తుంది.
- ఓటర్ల జాబితాలు నమోదు చేయబడ్డ అర్హత కలిగిన ఓటర్ల పేరుతో తప్పులు లేకుండా తయారుచేయటం ఎన్నికల సంఘం విధి.
- ఎన్నికల నిర్వహణకు ఎన్నికల తేదీ, ఇతర వివరాలతో ఎన్నికల ప్రకటన, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కూడా నిర్వహిస్తుంది.
- ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
- ఎన్నికల నిర్వహణ, ప్రశాంతతకు భంగం కలిగినట్లయితే దేశం మొత్తంగా ఎన్నికలను, లేదా కొన్ని రాష్ట్రాలలో లేదా రాష్ట్రంలో, కొన్ని నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయవచ్చు లేదా వాయిదా వేయవచ్చును.
- పార్టీలకు, ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థులను ఎన్నికల నియమావళిని వర్తింపచేస్తుంది.
ప్రశ్న 4.
ప్రాతినిధ్యం అనగానేమి ? ప్రాదేశిక ప్రాతినిధ్యం గురించి నీకు ఏమి తెలుసో రాయండి.
జవాబు:
ప్రాతినిధ్యం – భావం:
ప్రభుత్వ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు. అందుచేతనే ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఏర్పడిన ప్రాతినిధ్య లేదా పరోక్ష ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్య లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కలిగి ఉంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాల తయారీ కొరకు ప్రతినిధులను ఎన్నుకొంటారు. ఆ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు.
ప్రాదేశిక ప్రాతినిధ్యం:
ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరినీ వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకుంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలోగాని, జనాభా సంఖ్యలో గాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజక వర్గంలో నివసించే ఓటరులందరూ తమ ప్రజాప్రతినిధి ఎన్నిక ప్రక్రియలో భాగస్వామ్యలౌతారు. ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఒకే ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే అది ఏకసభ్య నియోజకవర్గంగా పరిగణిస్తారు. అలాకాక ఒక నియోజకవర్గం నుండి ఒకరికన్నా ఎక్కువమంది ప్రతినిధులు ఎన్నికైతే దానిని బహుళ సభ్య నియోజక వర్గం అంటారు. భారతదేశం లాంటి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దిగువసభ సభ్యుల ఎంపిక కొరకు ఏకసభ్య ప్రాదేశిక నియోజవర్గ పద్ధతిని అనుసరిస్తున్నారు.
ప్రశ్న 5.
ఎఫ్.పి.టి.సి వ్యవస్థ యొక్క గుణదోషాలను అంచనా వేయండి.
జవాబు:
ఎఫ్.పి.టి.పి పద్ధతినే “ప్రథమ ఆధిక్యతతో పదవీ విధానం” (First Past The Post System) (FPTP) అంటారు. ఎన్నికలబరిలో ఏ అభ్యర్థి అయితే ఇతర అభ్యర్థుల కన్నా ఆధిక్యంతో ఉంటాడో, ఎన్నికకు కావల్సిన అధిక ఓట్లు సంపాదిస్తాడో అతడే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఈ పద్ధతినే ‘బహుత్వ ప్రాతినిధ్య విధానం’ (ప్లూరల్ సిస్టమ్) అంటారు. ఇదే ఎన్నిక పద్ధతిని మన రాజ్యాంగం ప్రతిపాదించినది.
ఇండియాలో FPTP పద్ధతి యొక్క సాధారణ మరియు సున్నితమైన స్వభావం మూలంగా బహుళ ప్రాచుర్యంలో ఉండి విజయం సాధించినది. ఈ పద్ధతి రాజకీయాలు, ఎన్నికలలో స్పష్టమైన ఎటువంటి పరిజ్ఞానం లేని సాధారణ పౌరునికి కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. అంతేగాక ఎన్నికలలో స్పష్టమైన తమ నిర్ణయాన్ని ఓటర్లు ప్రకటించడానికి ఈ పద్ధతి అనువుగా ఉంటుంది. ఓటర్లు ఎన్నికలలో అత్యధిక ప్రాధాన్యత పార్టీకి, అభ్యర్థికి లేదా రెండింటికి సమతౌల్యంగా ఇస్తారు. ఈ పద్ధతి సాధారణంగా అతిపెద్ద జాతీయ పార్టీకి లేదా సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఈ విధానం- ఒక ప్రాంతంలోని వివిధ సామాజిక సమూహాలు ఒకటిగా కలిసి ఎన్నికలలో విజయం సాధించేందుకు వీలుకల్పిస్తూ ప్రోత్సాహాన్నిస్తుంది. ఏది ఏమైనప్పటికి FPTP వ్యవస్థ సాధారణ ఓటర్లకు సుపరిచయంగాను, సరళమైనదిగాను నిరూపితమైనది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో అతి పెద్ద పార్టీలు ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించేందుకు ఈ పద్ధతి సహకరిస్తుంది.
ప్రశ్న 6.
ఎన్నికల సంస్కరణ పై లఘు వ్యాసం రాయండి. [Mar. ’17]
జవాబు:
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగం, ఎన్నికల ప్రక్రియలను పరిశీలించి సంస్కరణలను ప్రతిపాదించుటకై అనేక కమిటీలు, కమిషన్లను భారత ప్రభుత్వం’ నియమించింది. అందులో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.
- 1974లో తార్కుండె కమిటీని నియమించగా అది 1975లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
- 1990లో ఎన్నికల సంస్కరణల కొరకు దినేష్ గోస్వామి కమిటీని నియమించడమైంది.
- రాజకీయాలు, నేరాల మధ్య సంబంధాల అధ్యయనం కోసం 1993 సంవత్సరంలో ఓహ్రా కమిటీ నియామకం జరిగింది.
- ఎన్నికలలో రాజకీయ నిధుల అధ్యయనం కొరకు 1998 సంవత్సరంలో ఇంద్రజిత్ గుప్తా కమిటీ నియమించబడింది.
- ఎన్నికల చట్టాల సంస్కరణలపై భారత న్యాయసంఘం 1999లో నివేదిక సమర్పించినది.
పైన పేర్కొన్న కమిటీలు, కమిషన్లు ఎన్నికల సంస్కరణల కొరకు చేసిన సూచనలలో ముఖ్యమైనవి
- ఓటు అర్హత వయస్సు తగ్గింపు
- ఎన్నికల సంఘానికి ఉద్యోగుల బదిలీ
- ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు
- మద్యం అమ్మకాలపై నిషేధం
- ఎన్నికల వ్యయపరిమితి పెంపు
- ఆయుధాలపై నిషేధం మొదలగునవి.
ప్రశ్న 7.
నైష్పత్తిక ప్రాతినిధ్య వ్యవస్థ గురించి నీకు ఏమి తెలుసు ?
జవాబు:
ఈ ఎన్నిక పద్ధతిలో రాజకీయ పార్టీల ఓటింగు బలాన్ని బట్టి తమ ప్రాతినిధ్యాన్ని పొందుతుంది. ఈ ఎన్నిక రహస్య పద్ధతిలో నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, విధాన మండలి సభ్యుల ఎన్నికకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. రాష్ట్రాల మధ్య సమానత్వానికి సభ్యుడు చెలాయించే ఓటును విలువలతో గుణించడం చేస్తారు. ముందుగా రాష్ట్ర శాసనసభ్యుల ఓట్ల విలువలను నిర్ధారిస్తారు. ఒక రాష్ట్ర మొత్తం జనాభాను రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్యచే భాగించగా వచ్చిన లబ్దమును మరల వెయ్యిచే భాగించగా వచ్చిన సంఖ్యను ఆ రాష్ట్ర శాసనసభ్యుని ఓటు విలువగా లెక్కిస్తారు. రాష్ట్ర శాసనసభ్యుల మొత్తం ఓటు విలువలను ఎన్నికైన పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యచేత భాగించగా వచ్చిన సంఖ్య పార్లమెంటు సభ్యుని విలువగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యతా ఓటు లేదా ద్వితీయ ప్రాధాన్యతా ఓటును పరిగణనలోనికి తీసుకొని ఆధిక్యత సాధించిన అభ్యర్థిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఈ పద్ధతిలో ఎక్కువమంది ప్రతినిధులు, అల్పసంఖ్యాకులు అల్పసంఖ్యలో ప్రతినిధులను ఎంపిక చేసుకొనే వీలుంటుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఎన్నికలు, ప్రజాస్వామ్యంకు గల సంబంధం.
జవాబు:
ప్రజాస్వామ్య ప్రాతినిధ్య ప్రభుత్వాలకు ఎన్నికలు కీలకమైనవి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్ణీత కాలవ్యవధిలో జరుగుతాయి. ఎన్నికయ్యే ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అంతర్భాగం. రాజకీయ వ్యవస్థకు, దేశంలోని పౌరులకు ఎన్నికలు ముఖ్య సేవలందిస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయీకరణను పెంపొందించేందుకు ఎన్నికలు పెద్ద ప్రతినిధి సంస్థలుగా పనిచేస్తాయి.
ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు. [Mar. ’16]
జవాబు:
భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు, ఓట్లు లెక్కింపుకు ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టింది. వీటినే ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలని అంటారు. ఓటింగులో బ్యాలెట్ పత్రాలను బదులుగా ఓటింగు యంత్రాలను వినియోగించటమైనది.
ప్రశ్న 3.
ప్రాదేశిక ప్రాతినిధ్యం.
జవాబు:
ప్రాదేశిక ప్రాతినిధ్య పద్ధతిలో దేశంలోని ఓటరులందరిని వివిధ ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి, ప్రతి నియోజక వర్గం నుండి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకొంటారు. అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు దాని పరిమాణంలో కాని, జనాభా సంఖ్యలో కాని సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. నియోజకవర్గంలో నివసించే ఓటర్లందరూ తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవటంలో భాగస్వాములవుతారు.
ప్రశ్న 4.
వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం.
జవాబు:
పౌరులు చేసే వృత్తుల ఆధారంగా ఇటువంటి నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి నియోజకవర్గంలో పౌరులు ఒకేరకమైన వృత్తి లేదా సమాన లక్షణాలు కలిగిన వృత్తులలో నిమగ్నమైన ప్రాదేశిక ప్రాంతాలలో నివాసముంటారు. వైద్యులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, న్యాయవాదులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, తదితరులు వివిధ రకాల వృత్తి సంఘాల్ని కల్గి ఉంటారు.
ప్రశ్న 5.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం.
జవాబు:
భారత ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇద్దరు ఎన్నికల కమీషనర్లను కలిగి బహుళ సభ్య వ్యవస్థగా పని చేయుచున్నది. దీనిని 1950 జనవరి 26న నెలకొల్పారు.
ప్రశ్న 6.
ఎన్నికల సంస్కరణలు. [Mar. ’16]
జవాబు:
భారతదేశంలో ఎన్నికలను స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వీలుగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేయటం జరిగింది. అయిన్నప్పటికీ గడిచిన 65 సం॥ల అనుభవం మన ఎన్నికల వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం, వివిధ రాజకీయ పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, రాజ్యాంగ ఎన్నికల నిపుణులు ఎన్నికల వ్యవస్థలో అనేక సలహా సంప్రదింపులలో ముందుకు రావడం జరిగింది.
ప్రశ్న 7.
ఎన్నికల నేరాలు.
జవాబు:
ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, లేదా పద్ధతులను పాల్పడినట్లయితే జైలుశిక్ష లేదా అపరాధ రుసుము లేదా రెండూ విధించబడతాయి. ఎన్నికల నేరాలకు జైలుశిక్ష మూడునెలల నుండి మూడు సంవత్సరాలవరకు ఉంటుంది. మతం, జాతి, కులం, భాష, ప్రాంతాల ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎన్నికల సభలలో గొడవలు సృష్టించి భగ్నం చేయటం ఎన్నికల నేరాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
ప్రశ్న 8.
ఎన్నికలలో అక్రమ పద్ధతులు.
జవాబు:
ఎన్నికలలో అభ్యర్థులు అక్రమ పద్ధతులకు పాల్పడితే ఆ ఎన్నికలను సంఘం రద్దు చేయగలదు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థిని ఆరు సంవత్సరముల వరకు ఎన్నికలలో పోటీచేయటానికి అనర్హునిగా ప్రకటించడమేగాక అటువంటి అభ్యర్థిని న్యాయస్థానంలో విచారణ చేసి శిక్షిస్తారు. ఎన్నికల్లో ముఖ్యమైన అవినీతి, అక్రమ పద్ధతులను ఎన్నికల సంఘం నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకొంటుంది.
ప్రశ్న 9.
భారత ఎన్నికల సంఘం పాత్ర. [Mar, ’17]
జవాబు:
భారతదేశంలో నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించే విషయంలో కాలానుగుణంగా ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర మరియు స్వయంప్రతిపత్తి గల అధికార వ్యవస్థగా రూపుదిద్దుకొంది. ఎన్నికల ప్రక్రియ, పవిత్రతను కాపాడేందుకు ఎన్నికల సంఘం నిష్కర్షగాను, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల సంఘం గతంలో కన్నా మరింత స్వతంత్రంగా, నిర్ణయాత్మకంగా, క్రియాశీలకంగా నేడు వ్యవహరిస్తుందని అందరూ అంగీకరిస్తున్న మాట వాస్తవం.
ప్రశ్న 10.
ప్రాతినిధ్యం.
జవాబు:
ఆధునిక దేశాలలో ప్రభుత్వ ప్రక్రియలో ప్రజలు నేరుగా భాగస్వాములు కాలేరు. ఇలాంటి వ్యవస్థలో ప్రజలు తమకు బదులుగా శాసనాలను రూపొందించుకొనటానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు శాసనసభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ దేశాలలో రెండు రకాల సాధారణ ప్రాతినిధ్యం ప్రామాణికంగా ఉన్నాయి. అవి 1) ప్రాదేశిక ఆధారిత ప్రాతినిధ్యం 2) వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం.