Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 4th Lesson కేంద్ర శాసననిర్మాణ శాఖ Textbook Questions and Answers.
AP Inter 2nd Year Civics Study Material 4th Lesson కేంద్ర శాసననిర్మాణ శాఖ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పార్లమెంటు (కేంద్ర శాసన నిర్మాణ శాఖ) అధికారాలు, విధులను వివరించండి. [Mar. ’17, ’16]
జవాబు:
భారత పార్లమెంటు ద్వంద్వ శాసనసభ. దానిలో రెండు సభలు ఉన్నాయి. అవి: రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభను ఎగువసభ అని అంటారు. లోక్సభను దిగువసభ అని అంటారు. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించుటచే దానిని ‘హౌస్ ఆఫ్ స్టేట్స్’ (House of States) అని కూడా అంటారు. దీని గరిష్ఠ సంఖ్య 250. వీరిలో 238 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. 12 మందిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది శాశ్వతసభ. సభ్యుల పదవీకాలం 6 సం॥లు. లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించుటచే అది ప్రజాప్రతినిధుల సభ. దానిని ఆంగ్లంలో ‘హౌస్ ఆఫ్ ది పీపుల్’ (House of the People) అని అంటారు. దీని గరిష్ఠ సంఖ్య 552. దీనిలో 530 మంది రాష్ట్రాల నుండి, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు. ఇద్దరు ఆంగ్లో-ఇండియన్లు రాష్ట్రపతిచే నియమింపబడతారు. కొన్ని విషయాలలో మినహా రెండు సభలకు సమానమైన అధికారాలున్నాయి. రెండు సభలలోని సభ్యులను పార్లమెంట్ సభ్యులనే అంటారు. పార్లమెంటుకు విశేషమైన అధికారాలు ఉన్నాయి.
పార్లమెంటు అధికారాలు: పార్లమెంటు విధులను, అధికారాలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.
1) శాసన నిర్మాణాధికారాలు: ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పరిపాలన నిర్వహించడానికి కావలసిన శాసనాలను తయారుచేయడం పార్లమెంటు ప్రధాన విధి. కేంద్ర మరియు ఉమ్మడి జాబితాలలోని అన్ని అంశాలపైన పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. సాధారణంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం దానికి లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు చేయవచ్చు. అవశిష్టాధికారాలపై (Residuary powers) శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు.
2) కార్యనిర్వహణాధికారాలు: పార్లమెంటరీ విధానంలో మంత్రివర్గం తన చర్యలకు పార్లమెంట్ బాధ్యత వహిస్తుంది. పార్లమెంటు ఎన్నో విధాలుగా కార్యనిర్వహక వర్గాన్ని అదుపు చేస్తుంది. మంత్రులను ప్రశ్నలు అడగడం ద్వారాను, వారి పనులపై ఆక్షేపణ తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారాను, ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ను తిరస్కరించడం ద్వారాను, అవిశ్వాస తీర్మానాలు ఆమోదించడం ద్వారాను పార్లమెంటు మంత్రిమండలిని అదుపులో పెట్టగలుగుతుంది.
3) ఆర్థికాధికారాలు: ఆర్థిక విషయాలలో పార్లమెంటుకు తిరుగులేని అధికారాలు ఉన్నాయి. పార్లమెంటు అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించకూడదు. ప్రభుత్వ ఆదాయ వ్యయపట్టిక (బడ్జెట్ – Budget) పార్లమెంటు అనుమతితో అమలుపరచబడును. సాధారణ బడ్జెట్తో పాటు, రైల్వేబడ్జెట్ను కూడా ఆమోదించును. మనీబిల్లులను ఆమోదించడంలో రాజ్యసభ కంటే లోక్సభకే ఎక్కువ అధికారాలున్నాయి. లోక్సభ ఆమోదించిన తర్వాత మనీబిల్లులు రాజ్యసభకు పంపబడును. వాటిని రాజ్యసభ 14 రోజుల గడువులో తిరిగి లోక్సభకు పంపాలి. వివిధ కమిటీల నివేదికలను పార్లమెంట్ చర్చిస్తుంది.
4) రాజ్యాంగాన్ని సవరించే అధికారము: రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంటుకు ఇచ్చింది. రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించే అధికారం రాష్ట్ర శాసనసభలకు లేదు. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి రాజ్యాంగంలో మూడు పద్దతులు సూచించారు. ఆ పద్దతులననుసరించి పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరిస్తుంది.
5) న్యాయాధికారాలు: భారత పార్లమెంటుకు కొన్ని న్యాయాధికారాలు కూడా ఉన్నాయి. అవి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిపై వచ్చిన అభియోగాలను చర్చించి, 2/3వ వంతుమంది సభ్యుల ఆమోదంతో వారిని పదవుల నుండి తొలగించవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం, వారిని పదవి నుండి తొలగించే అధికారం, అట్లాగే ఇతర ఉన్నతాధికారులను పదవి నుండి తొలగించమని రాష్ట్రపతికి సిఫారసు చేసే అధికారం, కొత్త హైకోర్టులను ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు ఉన్నాయి.
6) ఎన్నికల విధులు: రాజ్యసభకు మరియు లోక్సభకు ఎన్నికైన సభ్యులు అందరూ కలసి రాష్ట్రపతిని ఎన్నుకొనే నియోజకగణంలో భాగంగా ఉంటారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంటులోని ఉభయసభల సభ్యులు కలసి ఎన్నుకొంటారు. వీరుగాక లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను లోక్సభ సభ్యులు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకొంటారు.
7) ప్రజాభిప్రాయ వేదిక: దేశ పరిపాలనకు సంబంధించిన అనేక విషయాలపైన, బిల్లులపైన పార్లమెంట్ సమావేశాలలో సభ్యులు స్వేచ్చగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతినిధులు కాబట్టి, వారు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు కాబట్టి వారి విమర్శలు, చర్చల ద్వారా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది.
8) ఇతర అధికారాలు: పార్లమెంటుకు రాష్ట్రాల సరిహద్దులు, శాసన మండలాల ఏర్పాటు లేదా రద్దు, రాష్ట్రాల పేర్లు మార్చే అధికారం ఉన్నది.
ముగింపు: పైన పేర్కొన్న అధికారాలను పరిశీలిస్తే రాజ్యాంగం, భారత పార్లమెంటుకు విశేషమైన అధికారాలను కల్పించినట్లు తెలియుచున్నది. కానీ న్యాయసమీక్ష, సమాఖ్య ప్రభుత్వ విధానం, లిఖిత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు మొదలగు లక్షణాలు పార్లమెంటు అధికారాలపై కొంత నియంత్రణ స్వభావాన్ని కలిగి ఉన్నాయి.
ప్రశ్న 2.
లోక్సభ స్పీకర్ అధికారాలు, విధుల గురించి వ్రాయండి.
జవాబు:
లోక్సభ స్పీకర్: భారత రాజ్యాంగంలోని 93 నుండి 97 వరకు గల ఐదు అధికరణాలు లోక్సభ స్పీకర్ గురించి పేర్కొన్నాయి. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తరువాత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు లోక్సభ మొదటి సమావేశం తేదీని ప్రకటించడం జరుగుతుంది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించేందుకు రాష్ట్రపతి తాత్కాలిక స్పీకర్ (Protem |Speaker) ను నియమిస్తాడు. సాధారణంగా ఎన్నికైన సభ్యులలో అందరికంటే ఎక్కువసార్లు లోక్సభకు ఎన్నికైన సభ్యుడిని లేదా అందరికంటే వయస్సులో పెద్దవాడైన సభ్యుడిని లేదా సభా నియమాలపట్ల క్షుణ్ణమైన అవగాహన గల సభ్యుడిని రాష్ట్రపతి తాత్కాలిక స్పీకర్గా నియమిస్తాడు. తాత్కాలిక స్పీకర్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తాడు. సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
ఎన్నిక: లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గానూ, మరొకరిని డిప్యూటీ స్పీకర్ గానూ ఎన్నుకుంటారు. సాధారణంగా లోక్సభలో మెజారిటీ స్థానాలు గల అధికార పార్టీకి స్పీకర్ పదవి, భావసారూప్యత గల ఇతర పక్షాలలో ఒకదానికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించడం జరుగుతుంది. ఐతే అనేకసార్లు అందుకు భిన్నంగా రెండు పదవులను
|అధికారపక్షమే ఉంచుకోవడం జరిగింది. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానిపక్షంలో, సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడిన సందర్భంలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిర్ణయించడంలో భాగస్వామ్య పక్షాలు ఒక అవగాహనకు వచ్చి తమలో తాము సర్దుబాటు చేసుకొని ఒకరికి ఆ పదవి వచ్చే విధంగా ప్రయత్నిస్తాయి. మరికొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాగస్వామ్య పక్షాలు ఆ పదవిని తమ వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీ ఎంపిక చేసిన సభ్యునికి కూడా ఇవ్వవచ్చు.
స్పీకర్ అధికారాలు – విధులు: స్పీకర్ అధికారాలు – విధులను సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకై అతడికి భారత రాజ్యాంగం విశేషాధికారాలను సంక్రమింపజేసింది. అంతేగాకుండా పార్లమెంటు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధల చట్టం (Rules of procedures and conduct of Business in Parliament Act – 1956) లోక్ సభ స్పీకర్కు క్రింద పేర్కొన్న వైవిధ్యంతో కూడిన అధికారాలు విధులు ఉంటాయి.
1) లోకసభ సమావేశాలను స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ సమావేశాలను ఎంతో హుందాతనం, భద్రత, సామర్ధ్యాలతో నిర్వహిస్తాడు. సభానాయకుడని సంప్రదించి అజెండాను నిర్ణయిస్తాడు.
2) బిల్లులపై సభ్యులు అభిప్రాయాలు తెలిపేందుకు తగిన సమాయాన్ని కేటాయిస్తాడు. బిల్లులపై అవసరమైతే ఓటింగ్ నిర్వహించి, ఫలితాలను ప్రకటిస్తాడు.
3) లోక్సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభకు పంపుతాడు. రాజ్యసభ పంపించిన బిల్లులను ధృవీకరించి, వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపుతాడు.
4) లోక్సభ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.
5) లోక్సభ సభ్యుల హక్కులు, సౌకర్యాల పరిరక్షణకు అవసరమైన చర్యలను గైకొంటాడు. సభలో అధికారం, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య సమానమైన, నిష్పాక్షిక వైఖరిని ప్రదర్శిస్తాడు. ‘సభలో ప్రతిష్టంభన ఏర్పడితే, తన రూలింగ్ ద్వారా సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు దోహదపడతాడు.
6) ఒక బిల్లు ఆర్థిక పరమైందా ? లేదా ? అనే అంశాన్ని నిర్ణయిస్తాడు. సభ ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేస్తాడు.
7) ఎ) స్పీకర్ సభ్యులు
(1) బిలులపై పాయింట్ ఆఫ్ ఆర్డరు ప్రతిపాదించేందుకు
(2) ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు
(3) ముఖ్యమైన ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు
బి) లోక్సభ సమావేశాలను వాయిదా వేసేందుకు
సి) లోక్సభ సమావేశాల కోరమ్ నిర్ణయించేందుకు అధికారం ఉంది.
8) రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానంపై సభ్యులు అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశం ఇస్తాడు.
9) వివిధ సభా సంఘాలను ఏర్పరచి, వాటి చైర్మన్లు, సభ్యులను నియమిస్తాడు. సభా నియమాల కమిటీ, సభావ్యవహారాల కమిటీలకు పదవిరీత్యా చైర్మన్ గా వ్యవహరిస్తాడు.
10) పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
11) కామన్వెల్త్ స్పీకర్ల ఫోరమ్ సభ్యుడిగానూ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ గాను, లోక్సభ సచివాలయ అధిపతిగానూ వ్యవహరిస్తాడు.
12) లోక్సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులవద్ద ఎన్నికల ధృవీకరణ పత్రాలను స్వీకరిస్తాడు. అట్లాగే సభ్యులు సమర్పించిన రాజీనామా పత్రాలపైన, లోక్సభలో పత్రికా విలేఖరులకు, సందర్శకులకు సీట్ల కేటాయింపు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకొంటాడు.
13) లోక్సభలోను, లోక్సభ ప్రాంగణంలోనూ మార్షల్స్, ఇతర సిబ్బంది పనులను పర్వవేక్షిస్తారు.
14) ఒకానొక బిల్లుపై ఓటింగ్ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, ఆ బిల్లు భవితవ్యాన్ని నిర్ణయించేందుకై ఓటు వేస్తాడు.
15) డిప్యూటీ స్పీకర్ పదవిలో ఖాళీ ఏర్పడినచో, ఆ స్థానం భర్తీకి ఎన్నిక నిర్వహిస్తాడు.
ప్రశ్న 3.
పార్లమెంటులోని ఆర్థిక సంఘాల పాత్రను అంచనా వేయండి.
జవాబు:
ఉపోద్ఘాతం: భారత పార్లమెంటులో ఆర్థిక సంఘాలు మూడున్నాయి. అవి:
- ప్రభుత్వ ఖాతాల సంఘం
- అంచనాల సంఘం
- ప్రభుత్వ ఉపక్రమాల సంఘం
1) ప్రభుత్వ ఖాతాల సంఘం: ప్రభుత్వ ఖాతాల సంఘం 1921లో ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది లోక్సభ నుంచి, 7 గురు రాజ్యసభ నుంచి ఎన్నుకోబడతారు. వారి పదవీకాలం ఒక సంవత్సరం. వారందరూ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతి ప్రకారం ‘ఏకోఓటుబదిలి’ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. లోక్సభ స్పీకర్ వారిలో ఒకరిని ఆ సంఘం అధ్యక్షుడిగా నియమిస్తాడు.
అధికారాలు, విధులు:
- భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ వార్షిక గణాంక తనిఖీ నివేదికలను పరీక్షిస్తుంది.
- ప్రభుత్వ ఖర్చును న్యాయపరమైన, లాంఛనప్రాయమైన దృష్టితో చూసి, వాటిలో సాంకేతిక అభ్యంతరాలను పరీక్షిస్తుంది. ఆర్థిక పొదుపు, జ్ఞానం, సందర్భోచిత కోణములలో పరీక్షిస్తుంది.
- లోకసభలో ప్రవేశపెట్టిన వినియోగాధికార గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు, ఇతర గణాంకాలను పరిశీలించి వెల్లడిస్తుంది.
- ప్రభుత్వ నిధులు సక్రమంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
- కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నిర్వహించిన గణాంకాలను తనిఖీ చేస్తుంది.
2) అంచనాల సంఘం: 1921లో ఆర్థిక స్థాయి సంఘంగా ఇది ఏర్పడింది. తర్వాత 1950 ఏప్రియల్లో అంచనాల సంఘంగా పేరు మారచ్చబడి పనిచేయడం ప్రారంభించింది. ఈ సంఘంలో లోక్సభ నుంచి 30 మంది సభ్యులు ఉంటారు. దీనిలో రాజ్యసభకు ప్రాతినిధ్యం లేదు. ప్రతి సంవత్సరం లోక్సభ సభ్యులు తమలో కొందరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం అనుసరించి ఈ సంఘం సభ్యులను ఎన్నుకొంటారు. ఈ సంఘం సభ్యులు ఒక ఏడాది పాటు పదవిలో ఉంటారు. లోక్సభ స్పీకర్ ఈ సంఘం అధ్యక్షుణ్ణి నియమిస్తాడు.
అధికారాలు, విధులు:
- కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు, ఖర్చును తగ్గించుకొనేందుకు ఆర్థికపరమైన పొదుపును పాటించే విషయంలో సలహాలను ఇస్తుంది.
- ప్రభుత్వ నిధులు అంచనాలకు అనుగుణంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
- లోక్సభ స్పీకర్ అప్పగించిన విషయాలను పరీక్షిస్తుంది.
- అంచనాలలో చేర్చబడిన నిర్ణీత పరిధులకు లోబడి విధానాలు, వాటికి సంబంధించిన ధన సక్రమ వినియోగం గురించి పరీక్షిస్తుంది. కొందరు ఈ సంఘాన్ని నిరంతర ఆర్థిక సంఘంగా వర్ణించారు.
3) ప్రభుత్వ ఉపక్రమాల సంఘం: ఈ సంఘం 1964లో కృష్ణమీనన్ సంఘం సిఫార్సుల ప్రకారం ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులుంటారు. 15 మంది లోక్సభ నుంచి 7 గురు రాజ్యసభ నుండి ఎన్నుకోబడతారు. వారిని ఎన్నుకొనేందుకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటు బదిలి’ సూత్రం అనుసరించబడుతుంది. వీరి పదవీ కాలం ఒక సంవత్సరం. ఈ సంఘం ముఖ్యోద్దేశం ఏమిటంటే ప్రభుత్వ ఖాతాల సంఘం పని భారాన్ని తగ్గించడం. ఈ సంఘం అధ్యక్షుడిగా లోక్సభ నుంచి ఎన్నికైన సభ్యులలో ఒకరిని స్పీకర్ నియమిస్తాడు. అంటే రాజ్యసభకు చెందిన సభ్యులెవరూ ఈ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడరు.
అధికారాలు, విధులు:
- ప్రభుత్వ ఉపక్రమాల గణాంకాలను, నివేదికలను పరీక్షించడం.
- ప్రభుత్వ ఉపక్రమాలపై కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నివేదికను పరీక్షించడం.
- ప్రభుత్వ ఉపక్రమ సంఘాలు మంచి వ్యాపార సూత్రాలను పాటిస్తూ వాటిని సక్రమంగా అమలుచేస్తున్నాయా లేదా, అనే విషయాన్ని పరీక్షించడం.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
లోక్సభ నిర్మాణం గురించి వ్రాయండి.
జవాబు:
లోక్సభ నిర్మాణం: లోక్సభ భారత పార్లమెంటులోని దిగువసభ. దీన్ని ఆంగ్లంలో “హౌస్ ఆఫ్ ది పీపుల్” అని పిలుస్తారు.
భారత రాజ్యాంగం 81వ అధికరణం లోక్సభ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఆ అధికరణం ప్రకారం లోక్సభలో 552 మంది సభ్యులుంటారు. మొత్తం సభ్యులలో 530 మంది రాష్ట్రాలకు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారుకాగా, మిగిలిన ఇద్దరు సభ్యులు ఆంగ్లో ఇండియన్ వర్గానికి చెందినవారు. లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాతినిధ్యంలేదని రాష్ట్రపతి భావిస్తే, ఆ వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాజ్యాంగం 81వ అధికరణం ప్రకారం లోక్సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులను ఆయా రాష్ట్రాలలోని రిజిష్టర్డ్ ఓటర్లు ఎన్నుకుంటారు. అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాలలోని సభ్యులను ఆ ప్రాంతంలోని రిజిష్టర్డ్ ఓటర్లు ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం సభ్యుల ఎన్నిక జరుగుతుంది.
ప్రశ్న 2.
సభాపతి (స్పీకర్) ఎన్నిక విధానమును వివరించండి.
జవాబు:
లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గానూ, వేరొకరిని డిప్యూటీ స్పీకర్గానూ ఎన్నుకుంటారు. సాధారణంగా లోక్సభలో మెజారిటీ స్థానాలుగల అధికార పార్టీకి స్పీకర్ పదవి, భావసారూప్యత గల ఇతర పక్షాలలో ఒక దానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించడం జరుగుతుంది. ఐతే కొన్నిసార్లు అందుకు భిన్నంగా రెండు పదవులను అధికార పక్షమే ఉంచుకోవడం జరిగింది. ఒకవేళ లోక్సభలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో, సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడిన సందర్భంలో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిర్ణయించడంలో భాగస్వామ్య పక్షాలు ఒక అవగాహనకు వచ్చి తమలో తాము సర్దుబాటు చేసుకుని ఒకరికి ఆ పదవి వచ్చే విధంగా ప్రయత్నిస్తాయి. మరికొన్ని ప్రత్యేక పరిస్థితులలో భాగస్వామ్య పక్షాలు ఆ పదవిని తమకు వెలపలి నుంచి మద్దతు ఇస్తున్న పార్టీ ఎంపిక చేసిన సభ్యునికి కూడా ఇవ్వవచ్చు. ఇటువంటి పరిస్థితి 1998 మార్చిలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి ఎదురైంది. ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతునిచ్చే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశానికి చెందిన జి.ఎమ్.సి. బాలయోగికి ఆ పదవి లభించింది. తరువాత ఆయన ఆకస్మిక మరణంవల్ల భాగస్వామ్య పక్షాలలో ఒకటైన శివసేనకు చెందిన మనోహర్ గజానన్ జోషి 2002 మే 10న ఆ పదవిని చేపట్టాడు. అలాగే పద్నాలుగో లోక్సభలో ఐక్యప్రగతి కూటమి (యుపిఎ) కి మద్దతుగా కేంద్ర ప్రభుత్వాన్ని వెలుపలి నుంచి బలపరుస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కి చెందిన సోమనాథ్ చటర్జీ లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు.
స్పీకర్ ఎన్నికలో రెండు ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అవి: (1) స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి. (2) లోక్సభ రద్దయినప్పటికీ స్పీకర్ ఆ పదవిలో కొనసాగుతాడు. కొత్త లోక్సభకు ఎన్నికలు జరిగి నూతన స్పీకర్ ఎంపిక, పదవీ స్వీకారం వరకు స్పీకర్ అధికారంలో కొనసాగుతాడు.
ఒకవేళ స్పీకర్ సక్రమంగా, నిష్పక్షపాతంగా అధికార విధులను నిర్వహించనట్లయితే లోక్సభ సభ్యులు అభిశంసన తీర్మానం ద్వారా ఆయనను తొలగించవచ్చు. అటువంటి తీర్మానాన్ని 14 రోజుల ముందుగా సభకు సమర్పించాలి. ఆ గడువు ముగిసిన తరువాత ఏదో ఒకరోజున సభ ఆ తీర్మానంపై చర్చను ప్రారంభిస్తుంది. ఆ సమయంలో, ఆ తరువాత తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేటప్పుడు స్పీకర్ అధ్యక్ష స్థానంలో ఉండటానికి ఓటింగ్లో పాల్గొనడానికి వీలులేదు. తన అభిప్రాయాలను సభలో వెల్లడించేందుకు ఆయనకు అవకాశం ఉంటుంది.
ప్రశ్న 3.
రాజ్య సభ నిర్మాణం, సభ్యుల అర్హతలు గురించి నీకు ఏమి తెలియునో పేర్కొనండి.
జవాబు:
రాజ్యసభ నిర్మాణం: రాజ్యసభలో సభ్యత్వం మొత్తం 250కు మించి ఉండదు. భారత ఉపరాష్ట్రపతి ఈ సభకు అధికార హోదా రీత్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకొంటారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 233 మంది రాష్ట్రాల నుండి ఎన్నుకోబడగా, మిగిలిన 12మంది భారత రాష్ట్రపతిచే నియమితులవుతారు. మొత్తం సభ్యులలో 229 మంది 29 రాష్ట్రాల నుండి ఎన్నుకోబడగా, ముగ్గురు సభ్యులు జాతీయ దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ నుండి, ఒకరు కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి నుండి ఎన్నుకోబడతారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు మరియు విశిష్ట సేవ చేసిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులుగా నియమిస్తాడు. సాధారణంగా వారు సాహిత్య, శాస్త్ర విజ్ఞానము, కథలు, సామాజిక రంగాలకు చెందినవారై ఉంటారు.
రాజ్యసభ సభ్యులకుండవలసిన అర్హతలు:
- అతడు భారత పౌరుడై ఉండాలి.
- అతడు కనీసం 30 సం|| వయస్సు కలిగి ఉండాలి.
- అతడు ఆ రాష్ట్రంలో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి ఉండాలి.
- అతడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్ని పొందే ఏ హోదాలోనూ పనిచేసి ఉండరాదు.
- అతడు మతిస్థిమితం లేనివాడు లేదా దివాళా కోరు కారాదు.
- అతడు పార్లమెంటుచే సూచించబడిన ఇతర అర్హతలు కూడా పొంది ఉండాలి.
ప్రశ్న 4.
రాజ్యసభ ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ల గురించి వ్రాయండి.
జవాబు:
రాజ్యసభ చైర్మన్: రాజ్యసభ కార్యక్రమాలను నిర్వహించే వ్యక్తిని చైర్మన్ అంటారు. రాజ్యసభలో సభ్యుడు కాకపోయిప్పటికి భారత ఉపరాష్ట్రపతి అధికార హోదా రీత్యా రాజ్యసభకు చైర్మన్. పార్లమెంటు సభ్యులు అతడిని ఉపరాష్ట్రపతిగా 5సం|| కాలానికి ఎన్నుకొంటారు. దాని అర్థం లోక్సభ, రాజ్యసభల సభ్యులందరూ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో
పాల్గొంటారు. ప్రస్తుతం రాజ్యసభ చైర్మను నెలకు జీతభత్యాల క్రింద 1,40,000/- రూపాయలు చెల్లించబడతాయి. భారత సంఘటిత నిధి నుండి ఆయన జీతభత్యాలు చెల్లించబడతాయి. భారత ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగించబడినప్పుడే ఆయన రాజ్యసభ చైర్మన్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకొంటాడు.
డిప్యూటీ చైర్మన్: రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకొంటారు. రాజ్యసభ డిప్యూటీ * చైర్మన్ నెలకు 90,000/- రూపాయలు జీతభత్యాలు పొందుతారు. రాజ్యసభ చైర్మన్ సభకు హాజరు కాని సమయాలలో డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సభా కార్యక్రమాలను నిర్వహిస్తాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అయితే, ఆ ఖాళీ భర్తీ చేయుటకు సభ్యులు ఇంకొకరిని ఎన్నుకొంటారు.
ప్రశ్న 5.
భారత పార్లమెంటుకు గల ఏవైనా మూడు అధికార విధులను తెలపండి.
జవాబు:
1) శాసన సంబంధమైనవి (Legislative Powers): భారత పార్లమెంటు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై బిల్లులను పరిశీలించి ఆమోదిస్తుంది. అలాగే (ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి (బి) రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు, (సి) రాజ్యసభ విజ్ఞప్తిపై (డి) కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల అభ్యర్థన మేరకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై బిల్లులను ఆమోదిస్తుంది. రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సుల స్థానంలో మంత్రులు ప్రతిపాదించే బిల్లులను కూడా ఆమోదిస్తుంది. సాధారణంగా పార్లమెంటు ఉభయసభల్లో దేనిలోనైనా బిల్లులను ప్రతిపాదించడం జరుగుతుంది. ప్రతి బిల్లును రెండు సభలు ఆమోదించిన తరవాతనే స్పీకర్ సంతకంతో వాటిని రాష్ట్రపతి పరిశీలన, ఆమోదాలకు పంపించడం జరుగుతుంది. కొన్ని అరుదైన సందర్భాలలో ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తితే, రాష్ట్రపతి సూచనపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటవుతుంది.
2) కార్యనిర్వాహక సంబంధమైనవి (కార్యవర్గంపై అజమాయిషీ) (Executive Powers-Control Over Executive): భారత పార్లమెంటుకు కేంద్ర కార్యనిర్వాహకశాఖ (కేంద్ర మంత్రిమండలి)పై అజమాయిషీ ఉంటుంది. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రిమండలి జట్టులోని సభ్యులందరూ వ్యక్తిగతంగానూ, ఉమ్మడిగానూ, సమిష్టి బాధ్యతతో తమ అధికార – బాధ్యతలు నిర్వహించేటట్లు పార్లమెంటు చూస్తుంది. పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, కోత తీర్మానాలు, చివరికి అవిశ్వాస తీర్మానం వంటి సాధనాల ద్వారా కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ కలిగి ఉంటారు. ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు అడిగే ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలకు సరైన సమాధానాలను సకాలంలో, సక్రమరీతిలో ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ఏటా రాష్ట్రపతి చేసే ప్రసంగానికి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెటుకు ఆమోదం తెలిపే సందర్భాలలో పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం పనితీరును, గతంలో తీసుకున్న నిర్ణయాలను, అమలులో ఉన్న విధాన నిర్ణయాలను, వర్తమానంలో అనుసరించే ధోరణిని నిశితంగా సమీక్షిస్తారు. జీరో అవర్, కోత తీర్మానం, సభాహక్కుల తీర్మానం, ఓట్-ఆన్-అకౌంట్ వంటి సందర్భాలలో పార్లమెంటు సభ్యులకు కార్యనిర్వాహక వర్గంపై పూర్తి అజమాయిషీ ఉంటుంది.
3) ఆర్థిక సంబంధమైనవి (Financial Powers): భారత ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణకు అవసరమైన ద్రవ్యాన్ని పార్లమెంటు మంజూరు చేస్తుంది. కేంద్ర మంత్రిమండలి ప్రతిపాదించే వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లతో సహా అనేక ఆర్థిక బిల్లులను అది ఆమోదిస్తుంది. పార్లమెంటు ఆమోదంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నులను విధించేందుకు, పాత పన్నులను సవరించేందుకు లేదా రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే (ఎ) భారత కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (బి) ఆర్థిక సంఘం (సి) ప్రభుత్వ ఖాతాల సంఘం (డి) అంచనాల సంఘం వంటి సభా సంఘాల నివేదికలను పార్లమెంటు పరిశీలించి ఆమోదిస్తుంది. ఈ విషయంలో రాజ్యసభకంటే లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి.
ప్రశ్న 6.
బిల్లుల రకాలను వ్రాయండి.
జవాబు:
బిల్లులనేవి పార్లమెంటులో ప్రతిపాదించబడి, చర్చించబడి ఆమోదించబడే రాతపూర్వక ముసాయిదాలు. పార్లమెంటు ఉభయసభలు బిల్లులును ఆమోదించనిదే అవి చట్టంగా చెలామణి కావు. ఒకసారి ఉభయసభల ఆమోదం పొందినచో, బిల్లులు చట్టాలుగా రూపొందుతాయి. మొత్తంమీద పార్లమెంటులో ప్రవేశపెట్టబడే బిల్లులు రెండు రకాలుగా ఉంటాయి. అవి 1. పబ్లిక్ బిల్లులు (ప్రభుత్వ బిల్లులు) 2. ప్రైవేటు బిల్లులు, పబ్లిక్ బిల్లులనేవి పార్లమెంటులో మంత్రులచే ప్రవేశపెట్టబడేవి. ఇక మంత్రులు కాని సభ్యులు పార్లమెంటులో ప్రతిపాదించబడే వాటిని ప్రైవేటు బిల్లులుగా పరిగణించడమైంది. వేరొకవైపు పార్లమెంటులో ప్రతిపాదించబడే బిల్లుల స్వభావం ఆధారంగా వాటిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
అవి:
- సాధారణ బిల్లు
- ఆర్థిక బిల్లు
- ద్రవ్య బిల్లు
- రాజ్యాంగ సవరణ బిల్లు.
సాధారణ బిల్లులనేవి ఆర్థికేతర విషయాలకు సంబంధించినవి. ద్రవ్యబిల్లులనేవి పన్నులు, ప్రభుత్వ వ్యయంలాంటి అంశాలలో ముడిపడి ఉంటాయి. ఆర్థిక బిల్లులనేవి ద్రవ్య బిల్లుల కంటే భిన్నమైనవి. ప్రభుత్వ రెవెన్యూ వంటి విషయాలు వీటిలో ఇమిడి ఉంటాయి. చివరగా రాజ్యాంగ సవరణ బిల్లులు రాజ్యాంగంలోని వివిధ అంశాల సవరణకు ఉద్దేశించినవి.
ప్రశ్న 7.
భారత పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియ దశలను సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
పార్లమెంటులో సాధారణంగా చట్టంగా రూపొందక పూర్వం ప్రతి బిల్లు పార్లమెంటులో ఐదు దశలలో పయనిస్తుంది. అవి 1. బిల్లు ప్రతిపాదన 2. మూడు పఠనాలు 3. రెండో సభలో బిల్లు పరిశీలన 4. సంయుక్త సమావేశం 5. రాష్ట్రపతి ఆమోదం. పైన పేర్కొన్న ఐదు దశలను క్రింద వివరించడమైంది.
1) మొదటి దశ – బిల్లు ప్రతిపాదన: పార్లమెంటులో ఒకానొక బిల్లును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన వచ్చినపుడు, బిల్లుకు సంబంధించిన రాజకీయ, పాలనా అంశాల గురించి సంబంధిత మంత్రిత్వ శాఖ సమాచారాన్ని సేకరిస్తుంది. తరువాత ఆ మంత్రిత్వ శాఖ ఆ విషయాన్ని కేంద్ర కాబినెట్ దృష్టికి తీసుకువెళుతుంది. కేంద్ర కాబినెట్ కనుక ఆ బిల్లును ఆమోదిస్తే, సంబంధిత మంత్రి ఎనిమిది రోజుల వ్యవధిలో సభకు ఆ బిల్లును సమర్పిస్తాడు.
2) రెండో దశ – మూడు పఠనాలు: ఈ దశలో బిల్లు ప్రతిపాదన కర్త స్పీకర్ అనుమతితో ఒక నిర్ణీత రోజున బిల్లును సభలో ప్రవేశపెడతాడు. దీనినే ప్రథమ పఠనం అంటారు. రెండో పఠనంలో మరలా రెండు దశలుంటాయి. మొదటి దశలో బిల్లుపై సాధారణ చర్చ జరుగుతుంది. రెండవ దశలో బిల్లుకు అవసరమైన సవరణలు ప్రతిపాదించవచ్చు. మూడవ పఠనంలో బిల్లుకు సంబంధించిన షెడ్యూళ్ళు, క్లాజులను సభ పరిశీలించి ఓటింగ్ జరుగుతుంది.
3) మూడో దశ – రెండోసభలో బిల్లు పరిశీలన: మొదటి సభలో బిల్లును ఆమోదించిన తరువాత బిల్లు రెండో సభ పరిశీలనకు పంపించబడుతుంది. మొదటి సభవలె, రెండో సభ బిల్లును వివిధ దశలలో పరిశీలిస్తుంది. అప్పుడు రెండో సభ బిల్లును యధాతథంగా ఆమోదించుటకు, బిల్లులో కొన్ని సవరణలను ప్రతిపాదించుటకు లేదా బిల్లును పూర్తిగా తిరస్కరించేందుకు అధికారాన్ని కలిగి ఉంటుంది.
4) నాలుగోదశ సంయుక్త సమావేశం: ఒకానొక బిల్లు ఆమోదం విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినపుడు రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఆ బిల్లులో ఏవైనా సవరణలను ప్రవేశపెట్టేందుకు సభ్యులకు అవకాశం ఉంటుంది.
5) ఐదోదశ – రాష్ట్రపతి ఆమోదం: ఒక బిల్లును రెండు సభలు ఆమోదించిన తరువాత స్పీకర్ ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికై పంపుతాడు. రాష్ట్రపతి బిల్లును ఆమోదిస్తే ఆ బిల్లు చట్టరూపంలో అమల్లోకి వస్తుంది.
ప్రశ్న 8.
ప్రభుత్వ ఖాతాల సంఘం గురించి నీకు ఏమి తెలియునో వ్రాయండి.
జవాబు:
ప్రభుత్వ ఖాతాల సంఘం 1921లో ఏర్పాటైంది. దీనిలో 22మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది లోక్సభనుంచి, 7 గురు రాజ్యసభనుంచి ఎన్నుకోబడతారు. వారి పదవీకాలం ఒక సంవత్సరం. వారందరూ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. లోక్సభ స్పీకర్ వారిలో ఒకరిని ఆ సంఘం అధ్యక్షుడిగా నియమిస్తాడు.
అధికారాలు, విధులు:
- భారత కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ వార్షిక గణాంక తనిఖీ నివేదికలను పరీక్షిస్తుంది.
- ప్రభుత్వ ఖర్చును న్యాయపరమైన, లాంభనప్రాయమైన దృష్టితో చూసి, వాటిలో సాంకేతిక అభ్యంతరాలను పరీక్షిస్తుంది. ఆర్థిక పొదుపు, జ్ఞానం, సందర్భోచిత కోణములలో పరీక్షిస్తుంది.
- లోకసభలో ప్రవేశపెట్టిన వినియోగాధికార గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక గణాంకాలు, ఇతర గణాంకాలను పరిశీలించి వెల్లడిస్తుంది.
- ప్రభుత్వ నిధులు సక్రమంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
- కంప్టోలర్ మరియు ఆడిటర్ జనరల్ నిర్వహించిన గణాంకాలను తనిఖీ చేస్తుంది.
ప్రశ్న 9.
అంచనాల సంఘం నిర్మాణము, విధులను వర్ణించండి.
జవాబు:
నిర్మాణం: 1921లో ఆర్థిక స్థాయి సంఘంగా ఇది ఏర్పడింది. తర్వాత 1950 ఏప్రియల్లో అంచనాల సంఘంగా పేరు మార్చబడి పనిచేయడం ప్రారంభించింది. ఈ సంఘంలో లోక్సభ నుంచి 30 మంది సభ్యులు ఉంటారు. దీనిలో రాజ్యసభకు ప్రాతినిధ్యం లేదు. ప్రతి సంవత్సరం లోక్సభ సభ్యులు తమలో కొందరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ‘ఏకఓటుబదిలీ’ సూత్రం అనుసరించి ఈ సంఘం సభ్యులను ఎన్నుకొంటారు. ఈ సంఘం సభ్యులు ఒక ఏడాది పాటు పదవిలో ఉంటారు. లోక్సభ స్పీకర్ ఈ సంఘం అధ్యక్షుణ్ణి నియమిస్తాడు.
విధులు:
- కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు, ఖర్చును తగ్గించుకొనేందుకు ఆర్థికపరమైన పొదుపును పాటించే విషయంలో సలహాలను ఇస్తుంది.
- ప్రభుత్వ నిధులు అంచనాలకు అనుగుణంగా బట్వాడా చేయబడినవా, లేదా అనే అంశాన్ని పరీక్షిస్తుంది.
- లోక్సభ స్పీకర్ అప్పగించిన విషయాలను పరీక్షిస్తుంది.
- అంచనాలలో చేర్చబడిన నిర్ణీత పరిధులకు లోబడి విధానాలు, వాటికి సంబంధించిన ధన సక్రమ వినియోగం గురించి పరీక్షిస్తుంది. కొందరు ఈ సంఘాన్ని నిరంతర ఆర్థిక సంఘంగా వర్ణించారు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పార్లమెంటు నిర్మాణం.
జవాబు:
రాజ్యాంగం 79వ అధికరణం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖలో (ఎ) రాష్ట్రపతి, (బి) పార్లమెంటులోని ఉభయసభలు అంతర్భాగాలు. లోక్సభ అనేది పార్లమెంటులో దిగువసభ కాగా, రాజ్యసభ ఎగువసభ. రాష్ట్రపతికి ఉభయసభల సమావేశాలను ప్రారంభించేందుకు, వాయిదా వేసేందుకు అధికారం ఉంటుంది.
ప్రశ్న 2.
రాజ్యసభ సభ్యుల అర్హతలు.
జవాబు:
- భారతీయ పౌరుడై ఉండాలి.
- 30 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.
- ఏ రాష్ట్రం నుండి ఎన్నిక కాబడితే ఆ రాష్ట్రంలో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి ఉండాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయాన్ని పొందే ఏ హోదాలోను పనిచేసి ఉండరాదు.
- అతడు మతిస్థిమితం లేనివాడు లేదా దివాళాకోరు కారాదు.
- పార్లమెంటు సూచించిన ఇతర అర్హతలను కూడా కల్గి ఉండాలి.
ప్రశ్న 3.
లోక్సభలో కోరమ్. [Mar. ’16]
జవాబు:
లోక్సభ సమావేశాలను నిర్వహించేందుకు సభలో ఉండాల్సిన కనీస సభ్యుల సంఖ్యను ‘కోరమ్’ అంటారు. ఆ కనీస సంఖ్య మొత్తం సభ్యులలో 1/10వ వంతుగా నిర్ణయించబడింది.
ప్రశ్న 4.
లోక్సభ స్పీకర్.
జవాబు:
భారత రాజ్యాంగం లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఏర్పాటు చేసింది. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకొంటారు. స్పీకర్ లోక్సభ సమావేశాలను సక్రమంగా, సాఫీగా నిర్వహించే బాధ్యతను కల్గి ఉంటాడు. సభ్యుల సంరక్షకుడిగా, సభ ముఖ్య అధికార ప్రతినిధిగా ఉంటూ సభలో అత్యున్నత అధికారములు కల్గి ఉంటాడు.
ప్రశ్న 5.
లోక్సభ డిప్యూటీ స్పీకర్.
జవాబు:
భారత రాజ్యాంగంలోని 93వ ప్రకరణ ప్రకారం, లోక్సభ సమావేశాలను స్పీకర్ లేని సమయాలలో నిర్వహించేందుకు ఒక డిప్యూటీ స్పీకర్ ఉంటారు. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించే సమయంలో స్పీకర్కుండే అధికారాలు, ప్రత్యేక హక్కులు అన్నీ డిప్యూటీ స్పీకర్కు ఉంటాయి.
ప్రశ్న 6.
ప్రభుత్వ ఉపక్రమాల సంఘం. [Mar. ’17]
జవాబు:
ఈ సంఘం 1964లో కృష్ణమీనన్ సంఘం సిఫారసుల ప్రకారం ఏర్పాటైంది. దీనిలో 22 మంది సభ్యులుంటారు. వీరిలో 15 మంది లోక్సభ నుండి, 7 గురు రాజ్యసభ నుండి ఎన్నుకోబడతారు. వీరి పదవీకాలం ఒక సంవత్సరం. ఈ సంఘం ప్రభుత్వ ఉపక్రమాల గణాంకాలను, నివేదికలను పరీక్షిస్తుంది. ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘపు ఇతర విధులను నిర్వహిస్తుంది.
ప్రశ్న 7.
స్పీకర్ జాబితా.
జవాబు:
లోక్సభ స్పీకర్ లోక్సభలోని కొందరు సభ్యులతో కూడిన జాబితాలను తయారుచేసి ప్రకటిస్తాడు. ఈ జాబితాలో గరిష్ఠంగా పదిమంది సభ్యులుంటారు. లోక్సభ సమావేశాల సమయంలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ఈ జాబితాలో ఒకరు సభకు అధ్యక్షత వహించి సమావేశాలను నిర్వహిస్తారు.
ప్రశ్న 8.
తాత్కాలిక (ప్రోటెం) స్పీకర్.
జవాబు:
లోక్సభ సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ను నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ లోక్సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. సాధారణంగా రాష్ట్రపతి లోక్సభకు ఎన్నికైన సభ్యులందరిలో వయస్సులో పెద్దవాడైన వ్యక్తికి ప్రొటెం స్పీకర్గా నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. కొత్త స్పీకర్ ఎన్నికైన తరువాత ప్రొటెం స్పీకర్ పదవి రద్దవుతుంది.
ప్రశ్న 9.
ప్రశ్నా సమయం. [Mar. ’16]
జవాబు:
పార్లమెంటు సమావేశాలలో ప్రతిరోజు మొదటి గంట ప్రశ్నా సమయంకు కేటాయించబడుతుంది. సాధారణంగా ప్రశ్నాసమయం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ప్రభుత్వ పాత్ర, ప్రజాసంబంధ విషయాలు, ప్రభుత్వ పాలన అసమర్థత మొదలగు అంశాలపై సభ్యులు ప్రశ్నల నోటీసులను స్పీకర్కు అందిస్తారు. ప్రశ్నలు మూడు రకాలు.
- నక్షత్ర ప్రశ్నలు
- నక్షత్రం లేని ప్రశ్నలు
- స్వల్ప వ్యవధి ప్రశ్నలు
ప్రశ్న 10.
వాయిదా తీర్మానం.
జవాబు:
పార్లమెంటు సమావేశాలలో ఒకానొక ప్రజా ప్రాధాన్యత అంశాన్ని సభ దృష్టికి తెచ్చేందుకై సభ్యులు ప్రవేశపెట్టే | తీర్మానాన్నే వాయిదా తీర్మానం అంటారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు కనీసం 50 మంది సభ్యుల యుద్ధము అవసరం. వాయిదా తీర్మానంపై రెండున్నర గంటల వ్యవధి తగ్గకుండా చర్చ జరుగుతుంది.
ప్రశ్న 11.
విప్. [Mar. ’17]
జవాబు:
పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా సభ్యులను కోరే అధికారం ఉండటాన్ని విప్ అంటారు. విపన్ను జారీ చేసే అధికారం అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. విప్లను ఆయా పార్టీల నాయకులు నియమిస్తారు. సభ్యులందరూ విప్ల ఆదేశాలను తప్పకుండా పాటించాలి. లేనట్లయితే వారిపై పార్టీ నాయకత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు.
ప్రశ్న 12.
అవిశ్వాస తీర్మానం.
జవాబు:
అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రతిపాదించేందుకు రాజ్యాంగంలోని 75వ ప్రకరణ వీలు కల్పించింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షపార్టీ సభ్యులు ప్రవేశపెడతారు. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ ఆమోదించినట్లయితే కేంద్ర కాబినెట్ రాజీనామా చేయాల్సి ఉంటుంది.