Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 6th Lesson రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ Textbook Questions and Answers.
AP Inter 2nd Year Civics Study Material 6th Lesson రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ అధికారాలు – విధులను చర్చించండి.
జవాబు:
గవర్నర్ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రాష్ట్ర అధినేత. అతను రాజ్యాంగం యొక్క ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వ నియమితుడు. మన రాజ్యాంగం రాష్ట్ర స్థాయిలో గవర్నర్ పదవికి అవకాశం కల్పించింది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని రాజ్యాంగంలోని 153వ ప్రకరణ తెలుపుతున్నది. అయితే రాజ్యాంగ (7వ సవరణ) చట్టం, 1956 ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ నియమించడానికి వీలు కల్పించింది. ఈ చట్టం ప్రకారమే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ – పశ్చిమ బెంగాల్, మణిపూర్ – మేఘాలయ, త్రిపుర – నాగాలాండ్ రాష్ట్రాలకు కూడా ఉమ్మడి గవర్నర్లు ఉన్నారు.
అర్హతలు: రాజ్యాంగంలోని 157వ ప్రకరణ ప్రకారం గవర్నర్ గా నియమింపబడే వ్యక్తికి క్రింది పేర్కొన్న అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
అలాగే గవర్నర్గా నియమితుడయ్యే వ్యక్తి 158వ ప్రకరణ ప్రకారం క్రింద తెలిపిన షరతులను నిర్దేశించింది.
- పార్లమెంట్లో ఏ సభలోనూ లేదా రాష్ట్ర శాసన నిర్మాణశాఖలోని ఏ సభలోనూ సభ్యుడై ఉండకూడదు.
- ఎటువంటి లాభదాయకమైన పదవిని నిర్వహించకూడదు.
- కోర్టు ద్వారా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటింపబడి ఉండకూడదు.
నియామకం : రాజ్యాంగ ప్రకరణ 155 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా ప్రకారం గవర్నర్ను నియమిస్తాడు. గవర్నర్ నియామక విషయంలో రాష్ట్రపతి క్రింది రెండు సంప్రదాయాలను పాటిస్తాడు.
- సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించడం.
- సంబంధిత రాష్ట్రానికి చెందని ప్రముఖ వ్యక్తిని గవర్నర్ గా నియమించడం.
జీతభత్యములు:- ప్రస్తుతం గవర్నర్కు నెలకు రూ. 1,10,000 లు జీతం లభిస్తుంది. “రాజభవన్” అనే ఉచిత అధికార గృహంలో నివసిస్తాడు. వీటితోపాటు అనేక ఇతర భత్యాలు, సౌకర్యాలు, మినహాయింపులు గవర్నర్కు లభిస్తాయి. పదవీ ప్రమాణ స్వీకారం: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
పదవీకాలం: గవర్నర్ పదవిని స్వీకరించిన నాటినుండి 5 సంవత్సరాలు పదవిలో ఉండటం సాంప్రదాయం. అయితే రాష్ట్రపతి విశ్వాసాన్ని పొందినంతకాలం గవర్నర్ పదవిలో కొనసాగగలడు. వాస్తవానికి ఆచరణలో రాష్ట్రపతి విశ్వాసం అనేది ప్రధానమంత్రి అభిప్రాయంపైన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రధానమంత్రి దృష్టిలో సదభిప్రాయం పొందినంతకాలం పదవిలో ఉండగలరు.
అధికారాలు – విధులు:
రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అధినేత. గవర్నర్ కొన్ని ముఖ్యమైన అధికారాలను, విధులను నిర్వర్తిస్తాడు. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.
- కార్యనిర్వాహణ అధికారాలు విధులు
- శాసననిర్మాణ అధికారాలు – విధులు
- న్యాయాధికారాలు – విధులు
- ఆర్థికాధికారాలు – విధులు
- ఇతర అధికారాలు – విధులు
- వివేచనాధికారాలు
1) కార్యనిర్వాహణాధికారాలు – విధులు: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా సాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను గవర్నర్ రూపొందిస్తాడు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలను సక్రమంగా నిర్వహించి అమలు చేయడానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ ఉన్నత పదవులలో కొన్నింటికి ప్రత్యక్షంగా నియామకాలు జరుపుతాడు. అందులో ముఖ్యమైనవి.
- గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
- మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం లేదా మంత్రివర్గ నిర్మాణంలో మార్పులు చేయడం, మంత్రుల శాఖలలో మార్పులు చేయడం వంటి విధులను నిర్వహిస్తాడు.
- ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను పదవుల నుండి తొలగిస్తాడు.
- రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడమే గాక కులపతిగా కూడా వ్యవహరిస్తాడు.
- రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు.
2) శాసననిర్మాణ అధికారాలు విధులు: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కాని అందులో ఒక అంతర్భాగంగా 168వ ప్రకరణ వర్ణిస్తుంది. ఆ స్థాయిలో శాసన నిర్మాణశాఖకు సంబంధించిన కొన్ని విధులను, అధికారాలను గవర్నర్ నిర్వహిస్తాడు.
- విధానసభ సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ఆవిష్కరిస్తాడు.
- విధానసభ మొదటి సమావేశానికి (బడ్జెట్ సమావేశం) ప్రారంభ ఉపన్యాసం చేస్తాడు.
- విధానసభకు సాధారణ ఎన్నికల అనంతరం ప్రొటెం స్పీకర్ను నియమించి, స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తాడు.
- శాసన నిర్మాణశాఖలోని సభా సమావేశాలకు ఆదేశించడం లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్కు కలదు.
3) న్యాయాధికారాలు విధులు: రాష్ట్ర గవర్నరు న్యాయ సంబంధమైన కొన్ని ముఖ్య అధికార విధులను నిర్వర్తిస్తాడు.
- రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి కోరినచో సలహా ఇస్తాడు.
- రాష్ట్ర అడ్వకేట్ జనరల్ న్ను నియమిస్తాడు.
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, పదోన్నతులు వంటి విషయాలలో అధికారాలను చెలాయిస్తాడు.
- రాష్ట్ర హైకోర్టు (జిల్లా జడ్జీలను మినహాయించి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల (Sub-ordinate courts) లోని న్యాయ సిబ్బందిని నియమిస్తాడు.
- సంబంధిత రాష్ట్ర హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుందీ.
4) ఆర్థికాధిరాలు – విధులు:
- ప్రతి ఆర్థిక సంవత్సరములో రాష్ట్రవార్షిక ఆర్థిక నివేదికను (బడ్జెట్ను) విధాన సభలో సమర్పించే విధంగా చూస్తాడు.
- గవర్నర్ ముందస్తు అనుమతి ద్రవ్య బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టరాదు.
- గవర్నరు అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక గ్రాంట్లకు సంబంధించిన ఏ సిఫార్సులనైనా విధానసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదు.
- రాష్ట్ర ప్రభుత్వ ఆగంతుక నిధి (Contingency fund) ని నిర్వహించడం, అనుకోని వ్యయాన్ని భరించడానికి ఆ నిధి నుండి నిధులను విడుదలచేసే అధికారం గవర్నర్కే ఉంది.
5) ఇతర అధికారాలు, విధులు:
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తరువాత ఆ నివేదికను, దానిపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర అసెంబ్లీకి పంపించి, దానిపై చర్చ జరిగేటట్లు చర్యలు తీసుకుంటాడు.
- రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఆదాయ వ్యయాల గురించి ఆడిటర్ జనరల్ పంపించిన నివేదికలను గవర్నర్ స్వీకరిస్తాడు. గవర్నర్ ఆ నివేదికను కూడా మంత్రి మండలికి, ఆ తరువాత శాసనసభకు పంపడానికి చర్యలు తీసుకుంటాడు.
6) వివేచనాధికారాలు: రాజ్యాంగంలోని 163(1) అధికరణ రాష్ట్ర గవర్నర్కు కొన్ని వివేచనాధికారాలను ప్రసాదించింది. ఈ విధులను మంత్రిమండలి సహాయ సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ తన వివేచన, విజ్ఞతలను ఉపయోగించి నిర్వహిస్తాడు. గవర్నరుకు క్రింద పేర్కొన్న వివేచనాధికారాలు ఉంటాయి.
- ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేని పరిస్థితులలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపికచేయడం. ఈ సందర్భంలో గవర్నరు చాలా చురుకైన పాత్రను నిర్వహిస్తాడు.
- మెజార్టీ సభ్యుల మద్దతు కోల్పోయిన మంత్రి మండలి రాజీనామా చేయడానికి నిరాకరించినపుడు ఆ మంత్రిమండలిని రద్దుచేయడం.
- మంత్రిమండలి శాసనసభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం కోల్పోయినపుడు, ముఖ్యమంత్రి సలహామేరకు శాసనసభను రద్దు చేయవచ్చు.
- రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతిపాలన) విధించాల్సిందిగా రాష్ట్రపతిని కోరడం.
- విధానసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం నిలుపుదల చేయడం.
ప్రశ్న 2.
ముఖ్యమంత్రి అధికారాలు – విధులను వివరించండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి. అతడు ప్రభుత్వాధిపతి. మంత్రిమండలికి నాయకుడు. అధికార పక్షానికి నాయకుడు. గవర్నర్కు, మంత్రిమండలికి మధ్య వారధి వంటివాడు. ఈయన సమర్థతపై ఆధారపడి రాష్ట్ర పరిపాలన నడుస్తుంది. కేంద్రంలో ప్రధాని వలె, రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానం ఉంటుంది.
నియామకం: సాధారణ ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడు గవర్నర్చే ముఖ్యమంత్రిగా నియమింపబడతాడు. ఆయన సలహాపై ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తాడు.
పదవీకాలం: రాజ్యాంగరీత్యా ముఖ్యమంత్రి గవర్నర్ విశ్వాసం పొందగలిగినంత కాలం పదవిలో ఉంటాడు. వాస్తవానికి అసెంబ్లీలో (విధానసభ) మెజారిటీ నిలుపుకొన్నంత కాలమే పదవిలో కొనసాగుతాడు.
అర్హతలు:
- భారతీయ పౌరుడై ఉండాలి.
- శాసనసభలో సభ్యుడై ఉండాలి. కాకపోతే 6 నెలల్లో శాసనసభా సభ్యత్వం పొందాలి. లేకుంటే పదవి పోతుంది.
ముఖ్యమంత్రి అధికారాలు
విధులు:
1) మంత్రిమండలి ఏర్పాటు: తన అభీష్టం మేరకు మంత్రిమండలిని ఏర్పాటుచేయడం ముఖ్యమంత్రి మొదటి ప్రధాన విధి. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల ఎంపిక, నియామకాలలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలోని కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేటట్లు చూస్తాడు.
2) మంత్రిమండలి నాయకుడు: ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నాయకుడు. ఆ హోదాలో అత్యున్నత, అసామాన్యమైన అధికార స్థానాన్ని ముఖ్యమంత్రి అలంకరిస్తాడు. అతడు కేబినేట్ ఛైర్మన్ గా ఉంటూ, కేబినేట్ సమావేశ చర్చనీయాంశాలు (అజెండా), ప్రదేశం, సమయాలను నిర్ణయిస్తాడు. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించి, అందులో చర్చలు సజావుగా, అర్థవంతంగా జరిగేందుకు మార్గనిర్దేశం చేస్తాడు.
3) గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి: ముఖ్యమంత్రి, గవర్నర్ – మంత్రిమండలికి మధ్య ప్రధాన సమాచార మార్గంగానూ, వారధిగానూ పనిచేస్తాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాలు, చేపట్టిన శాసనప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలియజేస్తాడు.
4) విధానసభ నాయకుడు: విధానసభలోని మెజార్టీ సభ్యుల విశ్వాసం, మద్దతులు ముఖ్యమంత్రికి ఉంటాయి. అందుచేత విధానసభకు నాయకుడుగా వ్యవహరిస్తాడు. సభా వ్యవహారాలను సజావుగా, సక్రమంగా నడుపుటకు సభాధ్యక్షునికి (Presiding Officer) పూర్తి సహకారాన్ని అందిస్తాడు.
5) రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి: ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ప్రభుత్వం ముఖ్య విధానాలు, నిర్ణయాలు, కార్యక్రమాలను అధికారికంగా ప్రకటిస్తాడు. కొన్ని సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని, విస్పష్ట ప్రకటన చేయాలని విధానసభలో సభ్యులు పట్టుబట్టినప్పుడు ముఖ్యమంత్రి సభకు వచ్చి ఆమేరకు ప్రభుత్వ విధానం గురించి ప్రకటన చేస్తాడు.
6) అధికార పార్టీ నాయకుడు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తాడు. తన పార్టీ ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొంటాడు. అధికార పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చుటకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను పార్టీ సభ్యులకు వివరిస్తాడు.
7) ప్రజల నాయకుడు: ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకొరకు తరచుగా వివిధ ప్రాంతాలలో పర్యటించి, ప్రజా సమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు.. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలను, అభ్యర్థనలను ఓర్పుగా ఆలకిస్తాడు.
8) గవర్నర్కు ముఖ్య సలహాదారు: రాష్ట్ర గవర్నర్ విధి నిర్వహణలో ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై గవర్నర్కు ముఖ్యమంత్రి సలహాలు, సహాయం అందిస్తాడు.
9) కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావ సంబంధాలు కేంద్ర ప్రభుత్వంతో సుహృద్భావ సంబంధాలను కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. ప్రధానమంత్రి, అతని మంత్రివర్గ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవాలి. కేంద్ర మంత్రులతో సముచిత సంబంధాలను ఏర్పరచుకోవాలి.
10) ప్రతిపక్ష పార్టీతో సంబంధాలు: ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సభా నాయకులు, శాసన సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. తరచుగా కలవడం, ఆరోగ్యకరమైన సంబంధాలు, ఉత్సాహంతో కూడిన స్నేహ పూర్వక దృక్పథం వంటి చర్యల ద్వారా ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సహకారాన్ని పొందవచ్చు.
11) రాజ్యాంగ సంబంధ విధులు: భారత రాజ్యాంగం రాష్ట్రంలో వాస్తవ కార్య నిర్వాహణ అధికారాలన్నింటిని ముఖ్యమంత్రిపై ఉంచింది. ముఖ్యమంత్రి పదవి, స్థాయి రాజ్యాంగం నుంచి ఏర్పడతాయి. ముఖ్యమంత్రి తన అధికారాలను చెలాయించడంలోనూ, బాధ్యతలను నిర్వర్తించడంలోనూ రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.
ప్రశ్న 3.
రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు – విధులను పేర్కొనండి.
జవాబు:
రాజ్యాంగంలోని 163(1)వ ప్రకరణ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పాలన నడపడంలోనూ, అధికారాలను నిర్వహించడంలోనూ తగిన సలహాను ఇచ్చి, సహాయం అందించేందుకై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉండాలని పై ప్రకరణ నిర్దేశిస్తుంది.
నిర్మాణం: సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి అనేది మూడంచెల వ్యవస్థ. అందులో 1) కేబినెట్ హోదా మంత్రులు 2) స్టేట్ హోదా మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు ఉంటారు. అరుదైన సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తారు. వీరు మంత్రిమండలిలో నాల్గవ శ్రేణిలో ఉంటారు.
1) కేబినెట్ మంత్రులు: రాష్ట్ర ప్రభుత్వంలోని హోం, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, గనులు భూగర్భ వనరులు వంటి ప్రధాన మంత్రిత్వశాఖకు అధిపతులుగా కేబినెట్ మంత్రులుంటారు. వీరు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కేబినెట్ సమావేశాలలో కేవలం వీరు మాత్రమే పాల్గొంటారు.
2) స్టేట్ హోదా మంత్రులు: కేబినెట్ మంత్రులతో పోల్చితే తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు వీరు ఆధ్వర్యం వహిస్తారు. మంత్రిత్వ శాఖలకు వీరిని అనుసంధానం చేయవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. వీరు నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారులుగా ఉంటారు. వీరిపై కేబినెట్ మంత్రుల అజమాయిషీ ఉండదు.
3) డిప్యూటీ మంత్రులు: డిప్యూటీ మంత్రులను కేబినెట్ మంత్రులకు అనుబంధంగా నియమిస్తారు. వీరు కేబినెట్ మంత్రులు తమకు అప్పగించిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు వీరు సహాయపడతారు. అందుకే వీరిని సహాయ మంత్రులు అని కూడా పిలుస్తారు.
అర్హతలు: ఒక వ్యక్తి మంత్రిగా నియమించబడాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- ఆ వ్యక్తి శాసన నిర్మాణ శాఖలోని ఏదో ఒక సభలో సభ్యుడై ఉండాలి. (ద్విసభా విధానం అయినట్లయితే)
- ఒకవేళ ఏ సభలోనూ సభ్యులు కానివారు మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 6 నెలల వ్యవధిలోగా విధానసభ సభ్యులుగా ఎన్నిక కావలసి ఉంటుంది. లేకుంటే వారు మంత్రి పదవిని కోల్పోతారు.
- పార్లమెంటు నిర్దేశించే ఇతర అర్హతలను కలిగిఉండాలి.
నియామకం: రాజ్యాంగంలోని 164వ ప్రకరణ ప్రకారం మంత్రులందరినీ గవర్నర్ ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తాడు. విధాన సభలోని తన పార్టీకి (లేదా భాగస్వామ్య పార్టీలకు చెందిన కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నరు నివేదించి, వారిని మంత్రులుగా నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి గవర్నర్కు సిఫారసు చేస్తాడు. ముఖ్యమంత్రి సూచనల ప్రకారం గవర్నర్ మంత్రులను నియమించి వారికి శాఖలను కేటాయిస్తాడు.
పదవీ కాలం: గవర్నర్ మంత్రుల విధి నిర్వాహణ పట్ల సంతోషంగా ఉన్నంతకాలం మంత్రులు తమ పదవిలో కొనసాగగలరని రాజ్యాంగంలో 164(2)వ ప్రకరణ తెలియజేస్తుంది. 164(3)వ ప్రకరణ ప్రకారం మంత్రిమండలి విధానసభకు సమిష్టిగా బాధ్యత వహించాలి. కాబట్టి మంత్రులు ఈ క్రింద చూపిన నియమాలను అనుసరించి పదవిలో
కొనసాగుతారు. అవి:
- గవర్నర్ సంతోషంగా ఉన్నంతకాలం.
- విధానసభకు సమిష్టి బాధ్యతను నెరవేర్చుతూ ఆ సభ విశ్వాసాన్ని పొందినంతకాలం.
రాష్ట్ర మంత్రిమండలి అధికారాలు
విధులు:
1) విధానాల రూపకల్పన: ప్రజా ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి అవసరం అయిన విధానాలను రాష్ట్ర మంత్రిమండలి రూపొందిస్తుంది. ఇది ఎంతో శ్రమతో కూడిన మేథోపరమైన విధి. మంత్రిమండలి సభ్యులు ముఖ్యంగా కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి నాయకత్వాన తరచుగా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ కోసం అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు.
2) చట్టాలను రూపొందించటం: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం, బాధ్యత రాష్ట్ర మంత్రిమండలిపై ఉంది. అందుకై చొరవ తీసుకొని ముసాయిదా బిల్లును రూపొందించి ఖరారు చేస్తుంది. మంత్రిమండలి ఆమోదం పొందిన తరువాత సంబంధిత మంత్రి ముసాయిదా బిల్లును విధానసభలో ప్రవేశపెట్టి, విధానసభ ఆమోదం పొందేటట్లు ప్రతి స్థాయిలో కృషి చేస్తాడు.
3) సుపరిపాలనను అందించడం: రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యతను మంత్రిమండలిపై ఉంచి ఓటు ద్వారా వారికి అధికారాన్ని అప్పగించారు. రాజ్యాంగ మూలసూత్రాలకు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు అనుగుణంగా మంత్రిమండలి రాష్ట్ర పాలనను సాగించాలి.
4) ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం: వివిధ ప్రభుత్వ విభాగాల కార్యక్రమాలను, సమన్వయం చేసే అధికారం, బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సంఘం కాజాలదు.
5) నియామక అధికారాలు: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన ఉన్నత పదవుల నియామకంలో మంత్రిమండలి అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. ఉన్నతాధికారులందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముఖ్య కార్యదర్శులు, ఇతర కార్యదర్శులు, డిపార్ట్మెంట్ అధిపతులు మొదలగువారు మంత్రిమండలిచే నియమించబడతారు.
6) ఆర్థిక అధికారాలు – విధులు: రాష్ట్ర ఆర్థిక వనరులపై మంత్రిమండలి నియంత్రణ కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య విధానాన్ని నిర్ణయించి అమలు చేస్తుంది. రాష్ట్ర మంత్రిమండలి ప్రభుత్వ రాబడి, వ్యయం, పెట్టుబడులు, ఆడిట్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఆయా అంశాలలో మెరుగైన ఫలితాల కోసం చర్యలను తీసుకుంటుంది.. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించి విధానసభ పరిశీలన, ఆమోదాలకు సమర్పిస్తుంది.
7) ఇతర విధులు: రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, నీటి పారుదల, పరిశ్రమలు, రవాణా, విద్య, ప్రణాళికలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి వంటి రంగాలలో వ్యూహాలను ఖరారు చేసి అమలు చేస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో గవర్నర్ పేరుతో అత్యవసర ఆజ్ఞలను (ఆరినెన్స్లను) జారీ చేస్తుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ ఏవైనా మూడు అధికారాలను వివరించండి.
జవాబు:
గవర్నర్ యొక్క అధికారాలు విధులు:
1) కార్యనిర్వాహణాధికారాలు – విధులు: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను స్వయంగా సాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను గవర్నర్ రూపొందిస్తాడు. అందులో భాగంగా రాష్ట్రప్రభుత్వ విధివిధానాలను సక్రమంగా నిర్వహించి అమలు చేయడానికి అనుకూలంగా రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ ఉన్నత పదవులలో కొన్నింటికి ప్రత్యక్షంగా నియామకాలు జరుపుతాడు. అందులో ముఖ్యమైనవి:
- గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
- మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం లేదా మంత్రివర్గ నిర్మాణంలో మార్పులు చేయడం, మంత్రుల శాఖలలో మార్పులు చేయడం వంటి విధులను నిర్వహిస్తాడు.
- ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను పదవుల నుండి తొలగిస్తాడు.
- రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడమే గాక కులపతిగా కూడా వ్యవహరిస్తాడు.
- రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు.
2) శాసననిర్మాణ అధికారాలు విధులు: గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాదు. కాని అందులో ఒక అంతర్భాగంగా 168వ ప్రకరణ వర్ణిస్తుంది. ఆ స్థాయిలో శాసన నిర్మాణశాఖకు సంబంధించిన కొన్ని విధులను, అధికారాలను గవర్నర్ నిర్వహిస్తాడు.
- విధానసభ సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ఆవిష్కరిస్తాడు.
- విధానసభ మొదటి సమావేశానికి (బడ్జెట్ సమావేశం) ప్రారంభ ఉపన్యాసాన్ని చేస్తాడు.
- విధానసభకు సాధారణ ఎన్నికల అనంతరం ప్రోటెం స్పీకర్ను నియమించి, స్పీకర్ ఎన్నికకు మార్గం సుగమం చేస్తాడు.
- శాసన నిర్మాణశాఖలోని సభా సమావేశాలకు ఆదేశించడం లేదా వాయిదా వేసే అధికారం గవర్నర్కు కలదు.
3) న్యాయాధికారాలు – విధులు:
- రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాష్ట్రపతి కోరినచో సలహా ఇస్తాడు.
- రాష్ట్ర అడ్వకేట్ జనరలున్ను నియమిస్తాడు.
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి జిల్లా జడ్జీల నియామకం, పోస్టింగులు, పదోన్నతులు వంటి విషయాలలో అధికారాలను చెలాయిస్తాడు.
- రాష్ట్ర హైకోర్టు (జిల్లా జడ్జీలను మినహాయించి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచనలపై రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల (Sub-ordinate courts) లోని న్యాయ సిబ్బందిని నియమిస్తాడు.
- సంబంధిత రాష్ట్ర హైకోర్టు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి రాష్ట్ర గవర్నర్కు అధికారం ఉంటుంది.
ప్రశ్న 2.
రాష్ట్రపతి – గవర్నర్ పదవుల మధ్యగల వ్యత్యాసాలు ఏవి ?
జవాబు:
రాష్ట్రపతి – గవర్నర్ మధ్య గల వ్యత్యాసాలు:
రాష్ట్రపతి
- రాష్ట్రపతి ఎన్నుకోబడే వ్యక్తి.
- రాష్ట్రపతి పదవీకాలం సాధారణంగా 5 సం॥లు ఉంటుంది.
- రాష్ట్రపతి పదవి నుంచి తొలగించడానికి క్లిష్టమైన మహాభిశంసన తీర్మానం అవసరం.
- రాష్ట్రపతికి వివేచనాధికారాలు లేవు.
- రాష్ట్రపతికి సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉంటాయి.
- రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం పరిపూర్ణమైనది. మరణశిక్షను కానీ, సైనిక కోర్టులు విధించే శిక్షలను గానీ రద్దుచేసి క్షమించే అధికారం అతడికి ఉంది.
- రాష్ట్రపతికి మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి.
- యూనియన్ పబ్లిక్ కమీషన్ ఛైర్మన్, ఇతర సభ్యులను రాజ్యాంగం నిర్దేశించిన కారణాల ప్రకారం తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
- ఏ బిల్లునూ మరే ఇతర అధికారుల పరిశీలన కోసం రాష్ట్రపతి నిలుపుదల చేయవలసిన అవసరం లేదు.
గవర్నర్
- గవర్నర్ నియమింపబడే వ్యక్తి.
- గవర్నర్కు పదవీ కాల భద్రత లేదు. రాష్ట్రపతి సంతృప్తిపైన అతడి పదవీకాలం ఆధారపడి ఉంటుంది.
- గవర్నర్ను సులభంగా తొలగించవచ్చు.
- గవర్నర్కు వివేచనాధికారాలు ఉంటాయి.
- గవర్నర్కు సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉండవు.
- గవర్నర్ క్షమాభిక్ష అధికారాలు పరిమితమైనవి. మరణశిక్షను, సైనిక కోర్టులు విధించిన శిక్షను రద్దుచేసే అధికారం అతడికి లేదు.
- గవర్నర్కు ఎటువంటి అత్యవసర అధికారాలు ఉంటాయి.
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులను తొలగించే అధికారం గవర్నర్కు లేదు.
- కొన్ని బిల్లులను, కొన్ని సమయాలలో రాష్ట్రపతి అనుమతి కోసం నిలుపుదల చేసే అధికారం గవర్నర్కు ఉన్నది.
ప్రశ్న 3.
రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ స్థానం, ప్రాముఖ్యతను పేర్కొనండి.
జవాబు:
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ స్థానం ఎంతో కీలకమైంది. గవర్నర్ ఒకవైపు తనను నియమించిన రాష్ట్రపతికి బాధ్యత వహిస్తూ, వేరొకవైపు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సూచనల ప్రకారం తన అధికారాలను నిర్వహిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాస్తవ కార్యనిర్వాహక అధిపతులతో అతడు సుహృద్భావ సంబంధాలను కలిగి ఉంటాడు. అలాగే అతడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంలోని రాజకీయ, పరిపాలక అధిపతులు కృషి చేసేటట్లు చూస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు రాజ్యాంగబద్ధంగా కొనసాగేటట్లు చూడవలసిన బాధ్యత కూడా గవర్నర్దే. రాజకీయ, పాలనాపరమైన ఒత్తిళ్ళకు లొంగి ఉండక, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అధికార సిబ్బంది పాటించేటట్లు చూస్తాడు. క్రియాశీలక రాజకీయాలలో ఆసక్తి చూపించకుండా విస్తృత రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషిచేస్తాడు. అందువల్ల గవర్నర్ గా నియమితులయ్యే వ్యక్తులకు సునిశిత బుద్ధి, లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి లక్షణాలు ఉండాలి. అధికార, ప్రతిపక్ష పార్టీల పట్ల సమదృక్పథం చూపించాలి. తన అధికార పరిమితులను, రాజ్యాంగ సంప్రదాయాలను గుర్తించి ప్రవర్తిస్తూ ప్రజల మన్ననలను పొందాలి.
సంకీర్ణ మంత్రివర్గాలు ఏర్పాటవుతున్న ప్రస్తుత తరుణంలో గవర్నర్లస్థానం, వారు నిర్వహించే అధికారాలు, విధులు ఆ పదవిలో ఉన్న వ్యక్తి తీరుకు పరీక్షగా పేర్కొనవచ్చు. నిష్కళంక ప్రవర్తన, నిష్పాక్షికత, రాజ్యాంగ సూత్రాల పట్ల నిబద్ధత, పారదర్శకత వంటి లక్షణాలను గవర్నర్లు కలిగి ఉండాలనీ, సామాన్య ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, మైనారిటీలకు చెందిన ప్రయోజనాలను పరిరక్షించడానికి వారు కృషి చేయవలసి ఉంటుందనీ పదకొండో రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం ఒక సందర్భంలో ఉద్భోదించారు.
2010 మే7న బి.పి. సింఘాల్ వర్సస్ యూనియన్ గవర్నమెంట్ వివాదంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ స్థానం గురించి చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ తీర్పులో గవర్నర్ అంకితభావంతో రాజ్యాంగబద్ధులై పనిచేయాలి. | ఏదైనా రాజకీయ పార్టీకి కాకుండా రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాలి. గవర్నర్ కేంద్రప్రభుత్వ ఏజెంట్ లేదా ఉద్యోగి కాదని పేర్కొంది. గవర్నర్ను చాలా అరుదైన, ప్రత్యేకమైన సందర్భాలలో కేంద్రం తొలగించవలసి ఉంటుందని ఉద్భోదించింది. సర్కారియా కమీషన్ కూడా 1947-1986 మధ్య 154 మంది గవర్నర్ల పదవీ కాలాలను పరిశీలించి వాటిలో 104 మంది పదవీకాలం అసంపూర్తిగా ముగిశాయని పేర్కొంది. 2004లో ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, గోవాలో గవర్నర్లను తొలగించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గతంలో గవర్నర్లుగా వ్యవహరించిన వారిలో సరోజినీనాయుడు (ఉత్తరప్రదేశ్), పద్మజానాయుడు (పశ్చిమబెంగాల్), విజయలక్ష్మి పండిట్ (మహారాష్ట్ర), శంకర్ దయాళ్ శర్మ, కృష్ణకాంత్ వంటి వారు తరువాత ఉపరాష్ట్రపతులుగానూ వ్యవహరించారు.
ప్రశ్న 4.
ముఖ్యమంత్రి అధికారాలు – విధులలో ఏవైనా మూడింటిని తెలపండి. [Mar. ’16]
జవాబు:
ముఖ్యమంత్రి తన అధికారాలను, విధులను నిర్వర్తించుటలో ఎంతో అధికార బాధ్యతతో వ్యవహరిస్తారు. అతడి అధికార బాధ్యతలను ఈ క్రింది శీర్షికల ద్వారా వివరించవచ్చు.
1) మంత్రిమండలి ఏర్పాటు: తన అభీష్టం మేరకు మంత్రిమండలిని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి మొదటి ప్రధానవిధి. సాధారణంగా మంత్రివర్గ సభ్యుల ఎంపిక, నియామకాలలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలోని కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేటట్లు చూస్తాడు. వారికి మంత్రిత్వశాఖల కేటాయింపులో గవర్నరుకు సలహాలిస్తాడు. మంత్రిమండలి పరిమాణం కూడా ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఉంటుంది.
2) మంత్రిమండలి నాయకుడు: ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నాయకుడు. ఆ హోదాలో అత్యున్నత, అసామాన్యమైన అధికార స్థానాన్ని ముఖ్యమంత్రి అలంకరిస్తాడు. అతడు రాష్ట్ర కేబినేట్ ఛైర్మన్ గా ఉంటూ, కాబినేట్ సమావేశ చర్చనీయాంశాలు (అజెండా), ప్రదేశం, సమయాలను నిర్ణయిస్తాడు. కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించి, అందులో చర్చలు సజావుగా, అర్థవంతంగా జరిగేందుకు మార్గనిర్ధేశం చేస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు. ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనపుడు ముఖ్యమంత్రి చొరవ చూపి తగు సలహాలు, సూచనల ద్వారా ఏకాభిప్రాయ సాధన దిశ వైపు మంత్రిమండలిని నడిపిస్తాడు.
3) గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి: ముఖ్యమంత్రి, గవర్నర్ – మంత్రిమండలికి మధ్య ప్రధాన సమాచార మార్గంగానూ, వారధిగా పనిచేస్తాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాలు, చేపట్టిన శాసన ప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలియజేస్తాడు. మంత్రుల చర్యలకు సంబంధించిన సమాచారం కావాలని గవర్నర్ కోరితే సంబంధిత సమాచారాన్ని గవర్నరుకు పంపుతాడు. ముఖ్యమంత్రి ముందు అనుమతిలేనిదే మంత్రులు ఎవ్వరూ గవర్నర్ను కలిసి సంప్రదించకూడదు.
ప్రశ్న 5.
రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం గురించి తెలపండి.
జవాబు:
సాధారణంగా రాష్ట్ర మంత్రిమండలి అనేది మూడంచెల వ్యవస్థ. అందులో 1) కేబినెట్ హోదా మంత్రులు 2) స్టేట్ హోదా మంత్రులు 3) డిప్యూటీ మంత్రులు ఉంటారు. అరుదైన సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తాడు. వీరు మంత్రిమండలిలో నాల్గవ శ్రేణిలో ఉంటారు.
1) కేబినెట్ హోదా మంత్రులు: రాష్ట్ర ప్రభుత్వంలోని హోం, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, గనులు – భూగర్భ వనరులు వంటి ప్రధాన మంత్రిత్వశాఖలకు అధిపతులుగా కేబినెట్ మంత్రులుంటారు. వీరు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని అమలు చేయడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
2) స్టేట్ హోదా మంత్రులు: కేబినెట్ మంత్రులతో పోల్చితే తక్కువ ప్రాధాన్యం గల శాఖలకు వీరు ఆధ్వర్యం వహిస్తారు. మంత్రిత్వ శాఖలకు వీరిని అనుసంధానం చేయవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. వీరు నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారులుగా ఉంటారు. వీరిపై కేబినెట్ మంత్రుల అజమాయిషీ ఉండదు.
3) డిప్యూటీ మంత్రులు: డిప్యూటీ మంత్రులను కేబినెట్ మంత్రులకు అనుబంధంగా నియమిస్తారు. వీరు కేబినెట్ మంత్రులు తమకు అప్పగించిన విధులను మాత్రమే నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు వీరు సహాయపడతారు. అందుకే వీరిని సహాయ మంత్రులు అని కూడా పిలుస్తారు.