AP Inter 2nd Year Civics Study Material Chapter 7 రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Civics Study Material 7th Lesson రాష్ట్ర శాసననిర్మాణ శాఖ Textbook Questions and Answers.

AP Inter 2nd Year Civics Study Material 7th Lesson రాష్ట్ర శాసననిర్మాణ శాఖ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ నిర్మాణం, అధికారాలు, విధులను వివరించండి.
జవాబు:
రాష్ట్ర శాసననిర్మాణ శాఖలో దిగువ సభను విధానసభ అంటారు. విధానసభ సభ్యులను యం.యల్.ఎ. (Members of Legislative Assembly) లు అని అంటారు. భారత రాజ్యాంగంలోని 170వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర విధానసభలో సభ్యుల సంఖ్య 500కు మించకుండా 60కి తగ్గకుండా ఉండాలి. విధానసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపైన మరియు విస్తీర్ణం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిన్న రాష్ట్రాలైన గోవా, మిజోరామ్లలో 40 మంది, సిక్కింలో 32 మంది సభ్యులు ఉండుటకు అవకాశం కల్పించబడింది.

నిర్మాణం: ప్రతి రాష్ట్రంలోను విధానసభ సభ్యులు వయోజన ఓటర్లు ద్వారా ప్రాదేశిక నియోజక వర్గాల వారీగా ప్రత్యక్షంగా ఎన్నకోబడతారు. విధానసభలో ఆంగ్లో-ఇండియన్ వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర గవర్నరు భావించినపుడు ఆ వర్గానికి చెందిన ఒకరిని విధానసభ సభ్యునిగా నియమిస్తారు. విధానసభ నియోజక వర్గాల సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది.

విధానసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రతినిధులకు కేటాయించబడినవి. దేశంలోని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 404 మంది శాసనసభ్యులను కలిగి ఉండగా, సిక్కింలాంటి చిన్న రాష్ట్రాలలో అతి తక్కువ 32 మంది సభ్యులను కలిగి ఉన్నది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యుల సంఖ్య 175 మందిగా నిర్ణయించడమైంది.

సభ్యుల అర్హతలు: విధానసభ సభ్యుడిగా పోటీచేయు వారికి క్రింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  4. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో ఒక వ్యక్తి ఒకేసారి రెండింటిలో సభ్యుడిగా వుండరాదు.

పదవీకాలము: విధానసభ సాధారణ కాల పరిమితి 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాలకు ముందుగానే అర్థాంతరంగా రద్దుచేయవచ్చు. రాజ్యాంగం 356వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భంలో విధానసభ కాలపరిమితిని గరిష్టంగా ఒక సంవత్సరము పొడిగించవచ్చును. అత్యవసర పరిస్థితిని తొలగించిన ఆరు నెలలలోగా విధానసభకు ఎన్నికలు జరిపించాలి.

విధానసభ అధికారాలు – విధులు

ఎ) శాసన నిర్మాణ అధికారాలు విధులు: విధానసభ అనేది ప్రధానమైన శాసన రూపకల్పనా విభాగము. విధానసభకు రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై చట్టాలను రూపొందించేందుకు అధికారముంది. అంతేగాకుండా అది ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా చట్టాలను రూపొందించవచ్చు. అయితే ఒకవేళ విధానసభ ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు రూపొందిస్తే ఆ చట్టం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు భిన్నంగా ఉండకూడదు.

ఒకవేళ భిన్నంగా ఉన్నట్లయితే పార్లమెంటు రూపొందించిన చట్టం మాత్రమే అమలులో ఉంటుంది. విధానసభ సమావేశంలో లేని కాలంలో గవర్నరు జారీచేసే ఆర్డినెన్స్లను విధానసభ ఆమోదిస్తుంది.

బి) కార్యనిర్వాహక అధికారాలు విధులు: విధానసభకు రాష్ట్ర మంత్రిమండలిని నియంత్రించే అధికారం ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు వ్యక్తిగతంగాను, సమిష్టిగాను బాధ్యత వహిస్తుంది. విధానసభ విశ్వాసం ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రిమండలి అధికారంలో కొనసాగుతుంది. విధానసభ రాష్ట్ర మంత్రిమండలిని అనేక విధాలుగా నియంత్రిస్తుంది. అవి: సావధాన తీర్మానం, వాయిదా తీర్మానం, ప్రశ్నోత్తరాలు, అనుబంధ ప్రశ్నలు, కోత తీర్మానం, అవిశ్వాస తీర్మానం. ఈ సందర్భంలో విధానసభ, విధానపరిషత్ కంటే ఎక్కువ అధికారాలను చెలాయిస్తుంది.

సి) ఆర్థిక అధికారాలు – విధులు: విధానసభకు కొన్ని నిర్దిష్టమైన ఆర్థిక సంబంధమైన అధికారాలు ఉంటాయి. విత్త సంబంధమైన నిధులను కేటాయించడానికి, ఆమోదించడానికి దానికి అధికారమున్నది. విత్తం లేకుండా ప్రభుత్వం ఏ రకమయిన విధులను నిర్వహించలేదు. ఎందుకంటే పాలనాయంత్రాంగానికి విత్తం అనేది ఇంధనం వంటిది. ద్రవ్య సంబంధమైన బిల్లులను విధానసభలోనే ప్రవేశపెట్టాలి. విధానసభ ఆర్థిక బిల్లును తిరస్కరిస్తే మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

డి) రాజ్యాంగ సంబంధమైన అధికారాలు: రాజ్యాంగ సవరణ విషయంలో విధానసభ ద్వితీయ పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగ సవరణ ప్రక్రియలో విధానసభ ఎటువంటి చొరవ చూపదు. అయినప్పటికీ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలన్నింటికి సగానికిపైగా రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం. ఏదైనా ఒక రాష్ట్రం సరిహద్దులను మార్చవలసివస్తే పార్లమెంటు సంబంధిత విధానసభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.

ఇ) ఎన్నికల సంబంధమైన విధులు: విధానసభ సభ్యులు భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలలో పాల్గొంటారు. సంబంధిత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులను విధాన సభ సభ్యులు పరోక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నుకుంటారు. విధానపరిషత్తు సభ్యులలో 1/3వ వంతు సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకొంటారు.
ఎఫ్) ఇతర విధులు: విధానసభ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించే వేదికగా పనిచేస్తుంది. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులకు శిక్షణాసంస్థగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో విధానపరిషత్తు ఏర్పాటు చేయుటకు లేదా రద్దుచేయుటకు ఒక తీర్మానం ద్వారా పార్లమెంటుకు నివేదిస్తుంది.

ప్రశ్న 2.
విధానపరిషత్తు నిర్మాణం, అధికారాలు, విధులను క్లుప్తముగా రాయండి.
జవాబు:
విధానపరిషత్తు లేదా విధానమండలి అనేది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ. విధానపరిషత్తు సభ్యులను యం.యల్.సి. (మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్)లు అంటారు. భారతదేశంలో ఏడు రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఉన్నాయి. విధానపరిషత్తు సభ్యుల సంఖ్య కనీసం 40 మందికి తగ్గకుండా, విధానసభ సభ్యులు సంఖ్యలో 1/3వ వంతుకు మించకుండా ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్లో 58 మంది సభ్యులు ఉన్నారు. విధానపరిషత్ కొనసాగింపు విషయంలో విధాన సభ అభీష్టంతో పాటుగా పార్లమెంట్ సాధారణ మెజారీటీతో ఆమోదం తెలపాలి. సంబంధిత శాసనసభ తీర్మానం మేరకు విధానపరిషత్ ఏర్పాటుకు లేక తొలగింపు పార్లమెంట్ తన ఆమోదాన్ని తెలియజేస్తే విధానపరిషత్ ఏర్పాటు లేదా రద్దు అవుతుంది.

నిర్మాణం: విధానపరిషత్తులో కొందరు ఎన్నిక ద్వారా మరికొందరు నియామకం ద్వారా సభ్యత్వం పొందుతారు. వారు పరోక్ష ఎన్నిక ద్వారా నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు పద్ధతిద్వారా ఎన్నుకోబడతారు.

విధానపరిషత్ సభ్యులు ఐదు విధాలుగా ఎన్నుకోబడతారు.

  1. మొత్తం సభ్యులలో 1/3వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, జిల్లాపరిషత్తులు మొదలగు సంస్థల ప్రతినిధులు ఎన్నుకొంటారు.
  2. 1/3వ వంతు మంది సభ్యులను విధానసభ సభ్యులు ఎన్నుకొంటారు.
  3. 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పట్టభద్రులు ఎన్నుకొంటారు.
  4. 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్ళపాటు పనిచేసిన ఉపాధ్యాయులు ఎన్నుకొంటారు.
  5. మిగిలిన 1/6 వంతు మంది సభ్యులను సాహిత్యం, కళలు, సహకారోద్యమం, సామాజిక సేవలకు సంబంధించి ప్రత్యేక పరిజ్ఞానం కలవారిని గవర్నర్ నియామకం చేస్తాడు.

సభ్యుల అర్హతలు: విధానపరిషత్తు సభ్యునిగా పోటీ చేయుటకు ఈ దిగువ తెలిపిన అర్హతలు కలిగి ఉండవలెను.

  • భారత పౌరుడై ఉండవలెను.
  • 30 సం||ల వయస్సు నిండి యుండాలి.
  • పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

పదవీకాలం: విధానపరిషత్తు శాశ్వత సభ. అయితే మొత్తం సభ్యులలో 1/3వ వంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. ఇది శాశ్వతసభ కాబట్టి పదవీ విరమణ చేసిన సభ్యుల స్థానంలో నూతన సభ్యులు ఎన్నుకోబడతారు. ఒక్కొక్క సభ్యుడి పదవీకాలం 6 సం॥లు. సంవత్సరానికి కనీసం రెండుసార్లు ఈ సభ సమావేశమౌతుంది.

విధానపరిషత్తు అధికారాలు విధులు

ఎ) శాసన నిర్మాణ అధికారాలు విధులు: రాష్ట్ర విధానసభతో పోల్చినప్పుడు విధానపరిషత్తుకు తక్కువ అధికారాలు ఉంటాయి. విధానపరిషత్తు అధికారాలు హుందాతనంతో కూడుకున్నట్టివి మాత్రమే. సాధారణ బిల్లులను విధానపరిషత్తులో కూడా ముందుగా ప్రవేశపెట్టవచ్చును. ఉభయ సభల ఆమోదంతోనే అటువంటి బిల్లులను గవర్నర్ | ఆమోదం కొరకు పంపుతారు. విధానసభ ఆమోదించిన సాధారణ బిల్లులను విధానపరిషత్తు తిరస్కరించడానికి లేదా | పునఃపరిశీలనకు పంపడానికి అధికారం కలదు.

బి) కార్యనిర్వాహక అధికారాలు విధులు: విధానసభ అధికారాలతో పోలిస్తే విధానపరిషత్తుకు పరిమితమైన కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకే బాధ్యత వహిస్తుంది. విధానపరిషత్తు మంత్రిమండలి భవిష్యత్తును నిర్ధారించలేదు. అయినప్పటికీ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, సావధాన తీర్మానం ద్వారా అది మంత్రిమండలిని ప్రభావితం చేస్తుంది కాని మంత్రిమండలిని పదవి నుండి తొలగించే అధికారం మాత్రం విధానపరిషత్తుకు లేదు.

సి) ఆర్థిక అధికారాలు విధులు: ఆర్థికాధికారాల విషయంలో విధానపరిషత్తుకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. ఆర్థిక బిల్లులను విధానపరిషత్తులో ముందుగా ప్రవేశపెట్టకూడదు. ఆర్థిక బిల్లులను తిరస్కరించే అధికారం విధానపరిషత్తుకు లేదు. విధానసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను 14 రోజుల వ్యవధిలోగా విధానపరిషత్తు ఆమోదించాల్సి ఉంటుంది.

డి) ఎన్నికల సంబంధమైన విధులు: విధానపరిషత్తు సభా కార్యక్రమాలను హుందాగా నిర్వహించేందుకు తమలో ఒకరిని చైర్మన్గాను, వేరొకరిని డిప్యూటీ చైర్మన్ గానూ ఎన్నుకొంటుంది. సభా సంఘాలైన ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల సంఘాల సభ్యులను ఎన్నుకుంటుంది.

ఇ) ఇతర విధులు: ప్రజాభిప్రాయాన్ని సేకరించి, సంఘటిత పరచి వ్యక్తీకరించేందుకు విధానపరిషత్తు ఒక వేదికగా పనిచేస్తుంది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ మరియు సహకారోద్యమంకు చెందిన వివిధ రంగాల ప్రముఖులకు సభ్యత్వం కల్పించడం ద్వారా విధానపరిషత్తు శాసన నిర్మాణంలో వారి సేవలను వినియోగించుకొంటుంది.

ప్రశ్న 3.
విధానసభ స్పీకరు బాధ్యతలను, పాత్రను వివరించండి.
జవాబు:
సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగా ఎన్నుకొంటారు. స్పీకరు పదవీకాలం 5 సంవత్సరములు.

విధానసభ స్పీకరు అధికారాలు – విధులు: విధానసభ స్పీకరు అధికారాలు – విధులు లోక్సభ స్పీకరు యొక్క అధికారాలు విధులను పోలిఉంటాయి. స్పీకరు అధికారాలు విధులు ఈ క్రింది విధముగా వివరింపవచ్చు.

  1. స్పీకరు విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యక్రమాలను అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తాడు.
  2. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించుటకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు.
  3. సభలో నియమ నిబంధనల గూర్చి వివరిస్తాడు.
  4. వివిధ బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తాడు.
  5. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంబన ఏర్పడితే, తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు.
  6. బిల్లులపై చర్చ సందర్భంగా అనేక తీర్మానాలను, పాయింట్ ఆఫ్ అర్డర్లను ప్రతిపాదించడానికి సభ్యులకు అనుమతినిస్తాడు.
  7. కోరమ్లోని సందర్భంలో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు.
  8. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించే అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తాడు.
  9. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశం కల్పిస్తాడు.
  10. సభా కార్యక్రమాల నిర్వహణకు భంగం కలిగించే సభ్యులను సభనుండి బయటకు వెళ్ళమని ఆదేశిస్తాడు.
  11. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు సభను వాయిదావేసే అధికారం స్పీకరుకు ఉంటుంది.
  12. సభ్యుల రాజీనామాలను ఆమోదించుటకు లేదా తిరస్కరించుటకు స్పీకరుకు అధికారముంది. ఒకవేళ రాజీనామాలను ఆమోదించదలచుకుంటే, అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు.
  13. శాసనసభా కమిటీల ఛైర్మన్లను నియమించి వాటి పనితీరును పర్యవేక్షిస్తాడు. శాసనసభ వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, సాధారణ ప్రయోజన కమిటీలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  14. సభలో ప్రవేశపెట్టే బిల్లు సాధారణ బిల్లా ? లేక ఆర్థిక బిల్లా ? అని నిర్ణయించడంలో అంతిమ నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటాడు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ గురించి క్లుప్తంగా తెలపండి.
జవాబు:
రాజ్యాంగంలో 6వ భాగం 3వ అధ్యాయంలో రాష్ట్ర శాసన నిర్మాణశాఖను గురించి పేర్కొనబడింది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గవర్నర్, రెండు సభలు లేదా ఒక సభతో కూడి ఉండును. విధానసభనే శాసనసభ అని కూడా అంటారు. రెండు సభలుంటే ఒకటి విధానసభ, రెండవది విధాన పరిషత్తు.

విధానసభ లేదా శాసనసభ నిర్మాణము:
సభ్యుల సంఖ్య: విధానసభ ప్రజాప్రతినిధుల సభ. రాష్ట్ర శాసనసభలో ఇది దిగువసభ. దీని సభ్యుల సంఖ్య 500కి మించరాదు. 60కి తగ్గకూడదు. ఈ సభలోని సభ్యులను వయోజనులైన ఓటర్లు ఎన్నుకుంటారు. ఒక ఆంగ్లో – ఇండియన్ సభ్యుడిని అవసరమని భావిస్తే గవర్నర్ నామినేట్ చేస్తాడు. విధానసభ సభ్యులను M.L.A. లు (మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ) అని అంటారు.

సభ్యుల అర్హతలు: విధానసభ సభ్యులు 1) భారతీయ పౌరులై ఉండాలి. 2) 25 సం||ల వయస్సు నిండినవారై ఉండాలి. 3) ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగంగాని, లాభసాటి వ్యాపారం గాని చేయకూడనివారై ఉండాలి.

సభ్యుల పదవీకాలం: విధానసభ సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు. ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ కాలపరిమితికి ముందే రద్దు చేయవచ్చు.

సభాపతి – ఉపసభాపతి (స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్): విధానసభ సభ్యులు తమలో ఒకరిని సభాపతిగాను, మరొకరిని ఉపసభాపతిగాను ఎన్నుకుంటారు. వీరు సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రశ్న 2.
అంచనాల కమిటీ గురించి రాయండి.
జవాబు:
విధానసభ నియమనిబంధనలు, సభావ్యవహారాల నిర్వహణ ప్రకారం అంచనాల కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో విధానసభ నుండి 15 మంది, విధానపరిషత్తు నుండి 5గురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరము. వీరు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. ఈ కమిటీ చైర్మన న్ను స్పీకరు నియమిస్తాడు. అధికార పక్షానికి చెందిన సభ్యుడు చైర్మన్ గా నియమించబడుతారు.

అంచనాల కమిటీ విధులు: అంచనాల కమిటీ విధులు లోక్సభ అంచనాల కమిటీ విధులను పోలివుంటాయి. అవి:

  1. ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడం.
  2. ప్రభుత్వ అంచనాల విషయంలో విత్త సంస్కరణలను, పరిపాలనా సామర్థ్యం పెంపుదలకు తగిన సూచనలను అందించడం.
  3. ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని, ఆదాను పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
  4. విధానాల పరిధిలో వివిధ మంత్రిత్వ శాఖల అంచనాల పరిధిని పరీక్షించడం.
  5. విధానసభకు అంచనాలను సమర్పించే పద్ధతిపై సలహాలివ్వడం.

ప్రశ్న 3.
ప్రభుత్వ ఖాతాల కమిటీ గురించి నీకేమి తెలియును ? [Mar. ’17]
జవాబు:
ఈ కమిటీలో 20 మంది సభ్యులు ఉంటారు. వారిలో 15 మంది విధానసభ సభ్యులు, 5గురు విధానపరిషత్తు సభ్యులు. వారు నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు ద్వారా ఒక సంవత్సర పదవీకాలానికి ఎన్నుకోబడతారు. ప్రభుత్వ ఖాతాల |కమిటీ చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు స్పీకర్చే నియమింపబడతాడు. ఈ కమిటీలో మంత్రులు సభ్యులుగా
ఉండరాదు.

ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులు:
ప్రభుత్వ ఖాతాల కమిటీ ఈ క్రింది విధులను నిర్వర్తిస్తుంది.

  1. ఈ కమిటీ ప్రభుత్వ ఖాతాలను పరిశీలించి ఆయా శాఖలకు బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించినది, లేనిది నిర్ధారిస్తుంది.
  2. కంప్టోలర్ & ఆడిటర్ జనరల్ సమర్పించిన వార్షిక నివేదికలోని అంశాలను, రాష్ట్ర ప్రభుత్వ ఉపకల్పనా ఖాతాలను తనిఖీ చేయడం.
  3. ఈ కమిటీ ప్రభుత్వ ఖాతాల నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని విధానసభ దృష్టికి తెస్తుంది.
  4. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు, ఆదాయ వ్యయాలు, లాభనష్టాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది.
  5. ప్రభుత్వ ఖాతాలు మరియు తనిఖీ పద్ధతులు ప్రక్రియలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
  6. వివిధ శాఖలు చేసిన వ్యయాన్ని, విధానాల అమలుకు సంబంధించిన విషయాలను దర్యాప్తు చేస్తుంది.

ప్రశ్న 4.
విధానసభ స్పీకరుకు గల అధికారాలు – విధులను తెలపండి. [Mar. ’16]
జవాబు:

  1. స్పీకరు విధానసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యక్రమాలను అత్యంత హుందాగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తాడు.
  2. సభా కార్యక్రమాల నిర్వహణలో వివిధ అంశాలపై చర్చించుటకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు.
  3. సభలో నియమనిబంధనల గూర్చి వివరిస్తాడు.
  4. వివిధ బిల్లులపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తాడు.
  5. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, తన నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తాడు.
  6. బిల్లులపై చర్చ సందర్భంగా అనేక తీర్మానాలను, పాయింట్ ఆఫ్ ఆర్డర్లను ప్రతిపాదించడానికి సభ్యులకు అనుమతినిస్తాడు.
  7. కోరమ్లని సందర్భంలో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తాడు.
  8. సభలో సభ్యుల గౌరవానికి భంగం కలిగించే అనుచిత వ్యాఖ్యలను రికార్డులనుండి తొలగిస్తాడు.
  9. సభలో సభ్యులు ప్రసంగించేందుకు అవకాశం కల్పిస్తాడు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విధానసభ సభ్యుడి అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
  4. పార్లమెంటు, రాష్ట్రశాసన సభలలో ఒక వ్యక్తి ఒకేసారి రెండింటిలో సభ్యుడిగా ఉండరాదు.

ప్రశ్న 2.
విధానపరిషత్తు సభ్యుడి అర్హతలు.
జవాబు:

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

ప్రశ్న 3.
కోరమ్. [Mar. ’17]
జవాబు:
విధానసభ కార్యక్రమాల నిర్వహణకు హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కోరమ్ అంటారు. భారత రాజ్యాంగంలోని 188వ ప్రకరణ ప్రకారం విధానసభ కోరమ్ సభ్యుల సంఖ్య 1/10వ వంతు.

ప్రశ్న 4.
రాష్ట్ర శాసనసభ్యుల జీతభత్యాలు.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యులు ఒక్కొక్కరు నెలకు 90,000/-ల జీతభత్యాలను పొందుతారు. అందులో వేతనం 15,000/-లు, నియోజకవర్గ అలవెన్సుగా 75,000/- లు చెల్లించబడతాయి. రాష్ట్రప్రభుత్వం నివాస వసతి కల్పించకపోతే అందుకుగాను ఇంటి అద్దె అలవెన్సుగా నెలకు 10,000/-లు చెల్లించటం జరుగుతుంది. శాసనసభ సమావేశాలకు హాజరైన సభ్యులకు రోజుకు 3 800/-లు దినసరిభత్యం ఇవ్వబడుతుంది.

ప్రశ్న 5.
రాష్ట్రశాసన సభ విశేషాధికారాలు.
జవాబు:
విధానసభ సభ్యులకు విధి నిర్వహణలో కల్పించిన ప్రత్యేక హక్కులే వారికి విశేషాధికారాల రూపంలో ఉంటాయి. ఈ అధికారాలు లేకుంటే విధానసభ హుందాగా, గౌరవప్రదంగా నిర్వహించబడదు. విశేషాధికారాలు రెండు రకాలు. అవి. 1. సమిష్టి విశేషాధికారాలు. 2. వ్యక్తిగత విశేషాధికారాలు. శాసనసభ్యుల ప్రసంగాలు, చర్చలను ఇతరులు ప్రచురించకుండా నిరోధించే హక్కును కల్గి ఉంటారు. శాసన సభ సమావేశాలకు 40 రోజుల ముందు గానీ సమావేశాలనంతరం 40 రోజుల వరకు గానీ సభ్యులను అరెస్టు చేయరాదు.

ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంక్షిప్త చరిత్ర. [Mar. ’17]
జవాబు:
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వున్న 13 జిల్లాల ప్రాంతం కర్నూలు రాజధానిగా 1953 సంవత్సరం అక్టోబరు 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర శాసనసభలో 140 మంది సభ్యులు ఉన్నారు. 1956 నవంబరు 1వ తేదీన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా 2014 జూన్ 2వ తేదీన విభజించడమైంది.

ప్రశ్న 7.
విధానపరిషత్తు చైర్మన్. [Mar, ’16]
జవాబు:
విధాన పరిషత్తు సమావేశాలను నిర్వహించటానికి ఒక చైర్మన్ మరియు ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. విధాన పరిషత్ చైర్మన్ అధికారాలు విధానసభ స్పీకర్ అధికారాలతో పోలి ఉంటాయి. కాని ఏది ఆర్థిక బిల్లో ? ఏది సాధారణ బిల్లో నిర్ణయించే విశిష్ట అధికారం స్పీకరు కల్గి ఉన్నాను. చైర్మన్కు ఆ అధికారం లేదు.

ప్రశ్న 8.
డిప్యూటీ స్పీకర్.
జవాబు:
సభ కార్యక్రమాల నిర్వహణకు విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకరుగాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకొంటారు. స్పీకర్ సమావేశాలకు హాజరుగాని సమయంలో డిప్యూటీ స్పీకర్ సభా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఇటువంటి సందర్భంలో స్పీకర్ అధికారాలన్ని డిప్యూటీ స్పీకరుకు వర్తిస్తాయి.

ప్రశ్న 9.
విధానపరిషత్తు డిప్యూటీ చైర్మన్.
జవాబు:
విధానపరిషత్తు సమావేశాలను నిర్వహించటానికి సభలోని సభ్యులు తమలో నుంచి ఒకరిని చైర్మన్గాను మరొకరిని డిప్యూటీ చైర్మన్ గాను ఎన్నుకొంటారు. చైర్మన్ పదవి ఖాళీ అయిన సందర్భంలోనూ, లేక చైర్మన్ సభకు హాజరు కాని సమయంలోను డిప్యూటీ చైర్మన్ సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ప్రశ్న 10.
కమిటీల రకాలు.
జవాబు:
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకనుగుణంగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణ కొరకు కమిటీలు ఏర్పడినాయి. స్థూలంగా కమిటీలు రెండు రకాలు. అవి:

  1. స్థాయి సంఘాలు.
  2. తాత్కాలిక సంఘాలు.