AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Commerce Study Material 3rd Lesson వ్యాపార సేవలు Textbook Questions and Answers.

AP Inter 2nd Year Commerce Study Material 3rd Lesson వ్యాపార సేవలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్యాంకును నిర్వచించి, వాటి విధులను వివరించండి.
జవాబు:
బ్యాంకింగ్ నియంత్రణ చట్టము 1949 ప్రకారము “ఖాతాదారుల డిమాండ్లపై చెక్కు ద్వారాగాని, డ్రాఫ్ట్ ద్వారా గాని, మరేదైనా పత్రము ద్వారా గాని, తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్మును ఋణాలు ఇవ్వడానికి గాని, పెట్టుబడి కోసం గాని ఉపయోగించడం బ్యాంకింగ్ వ్యాపారము అంటారు.

బ్యాంకులు ఆర్థిక సంస్థలు దేశ ఆర్థిక ప్రగతికి పునాది లాంటివి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు ప్రముఖమైన పాత్రను వహిస్తున్నవి. ఈ బ్యాంకులు ఎక్కువ భాగము ద్రవ్య సప్లయిని నియంత్రిస్తున్నవి. బ్యాంకులు నిర్వహించే విధులను స్థూలముగా రెండు రకాలుగా విభజించవచ్చును. అవి (ఎ) ప్రాథమిక విధులు, (బి) అనుషంగిక విధులు. ఎ) ప్రాథమిక విధులు: 1. డిపాజిట్లను స్వీకరించడము: బ్యాంకులు వివిధ రకములైన డిపాజిట్లను సేకరిస్తాయి.
అవి:
i) ఫిక్స్డ్ డిపాజిట్లు: ఈ ఖాతాలలో డిపాజిట్ చేయబడిన మొత్తము నిర్ణీత కాల వ్యవధికి ముందు ఉపసంహరించడానికి వీలుకాదు. ఈ కాల వ్యవధి సాధారణముగా ఒకటి, రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాలు ఉంటుంది. బ్యాంకులు ఈ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లను కాలపరిమితి గల డిపాజిట్లు మరియు టైమ్ డిపాజిట్లు అంటారు.

ii) కరెంట్ డిపాజిట్ ఖాతాలు: ఈ ఖాతాలను వ్యాపారస్తులు తెరుస్తారు. ప్రతిరోజు ఎన్ని సార్లయినా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి, ఉపసంహరించవచ్చును. ఈ ఖాతాలోని నిల్వపై వడ్డీని చెల్లించరు. వీటిని డిమాండు డిపాజిట్లు అని కూడా అంటారు.

iii) సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు: ఈ డిపాజిట్ల ముఖ్య ఉద్దేశము వ్యక్తులు, వ్యాపారస్తులు, సంస్థల నుంచి చిన్న చిన్న పొదుపు మొత్తాలను ప్రోత్సహించడము. డిపాజిట్ల ఉపసంహరణపై కొన్ని సాధారణ నిబంధనలు ఉంటాయి. ఈ డిపాజిట్లపై తక్కువ వడ్డీని చెల్లిస్తారు.

iv) రికరింగ్ డిపాజిట్ ఖాతాలు: తక్కువ ఆదాయాన్ని పొందేవారు చిన్న మొత్తాలలో పొదుపు చేయడానికి ఈ డిపాజిట్లు అనుకూలము. ఈ డిపాజిట్లలో కొంత కాల వ్యవధిలో (ప్రతి వారానికి, నెలకుగాని నిర్ణయించిన మొత్తాలలో నిర్ణీత కాలము పూర్తి అయ్యేవరకు నగదు జమచేస్తూ ఉండాలి. గడువుకాలము పూర్తి అయిన తర్వాత వడ్డీతో కలిపి పూర్తి మొత్తము సొమ్మును డిపాజిట్ దారుకు తిరిగి చెల్లించబడుతుంది. ఈ డిపాజిట్లపై వడ్డీరేటు సేవింగ్స్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

2) ఋణాలు మంజూరు చేయుట: బ్యాంకు విధులలో రెండవది అవసరమున్న వ్యక్తులకు, సంస్థలకు ఋణాలు లేదా అడ్వాన్సులు అందజేయడము, ప్రతి బ్యాంకు కనిష్ట రిజర్వు నిల్వను రిజర్వు బ్యాంకుల వద్ద డిపాజిట్ చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఋణాల రూపములో అందజేస్తుంది. ఇవి ఐదు రకాలుగా ఉంటాయి.
i) ఋణాలు: ఒక నిర్ణీతకాలానికి బ్యాంకులు కాలపరిమితి గల ఋణాలను గాని, డిమాండు ఋణాలనుగాని అంగీకరించిన వడ్డీ రేటుకు మంజూరు చేస్తాయి. ఈ ఋణాలను సాధారణముగా సెక్యూరిటీలపై జారీచేస్తారు.

ii) క్యాష్ క్రెడిట్: ఒక సంవత్సరము లేదా అంతకంటే తక్కువ కాలానికి ఖాతాదారునికు మంజూరు చేసిన ఋణాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. సరుకునుగాని, ఇతర ఆస్తిని గాని హామీగా ఉంచుకొని ఋణాన్ని మంజూరు చేస్తారు. గడువు కాలము పూర్తి అయిన తర్వాత తిరిగి రెన్యువల్ చేసుకోవచ్చు. బ్యాంకు మంజూరు చేసిన ఋణాన్ని అవసరాన్ని బట్టి ఖాతాదారుడు ఒకేసారిగాని లేక కొన్ని వాయిదాలలో తీసుకొనవచ్చును. క్యాష్ క్రెడిట్పై వడ్డీని వాడుకున్న మొత్తము మీద లెక్కిస్తారు.

iii) ఓవర్ డ్రాఫ్ట్: ఖాతాదారుడు డిపాజిట్ చేసిన మొత్తము కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకోవడానికి సౌకర్యము కల్పించబడుతుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. డిపాజిట్ మొత్తము కంటే ఎంత మొత్తము అప్పుగా తీసుకోవడం జరుగుతుందో దాని మీదనే వడ్డీని వసూలు చేయడం జరుగుతుంది. కరెంట్ ఖాతాదారులకే ఈ సౌకర్యముంటుంది.

iv) బిల్లును డిస్కౌంట్ చేయడము: బిల్లును కలిగిన వ్యక్తికి నగదు అవసరమైనపుడు ఆ బిల్లును బ్యాంకులో డిస్కౌంటు చేసుకొనవచ్చును. బ్యాంకు కొంతమొత్తము డిస్కౌంట్లుగా తగ్గించి, బిల్లుదారుకు డబ్బును చెల్లిస్తాయి. బిల్లు గడువు తేదీన బ్యాంకు బిల్లు స్వీకర్త నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసుకుంటాయి.

v) కోరగానే పిలుపు ద్రవ్యపు ఋణం: కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతుపై ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు ఇచ్చే ఋణాన్ని పిలుపు ద్రవ్యము అంటారు. ఋణాన్ని కేవలము ఒక రోజు నుంచి 14 రోజులకు మాత్రమే మంజూరు చేస్తారు. ఈ ఋణాలను అంతర్గత బ్యాంకు ఋణాలు అంటారు. బ్యాంకుల మిగులు నిధులను అవసరమైన బ్యాంకులకు ఒక రోజు నుంచి వారానికి ఋణంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఋణాన్ని ఇచ్చిన రెండవ రోజు లేదా స్వల్పకాల నోటీసుతో తిరిగి చెల్లించడం జరుగుతుంది.

బి) అనుషంగిక విధులు: బ్యాంకులు ప్రాథమిక విధులతో పాటు దిగువ అనుషంగిక విధులు నిర్వర్తిస్తాయి. 1) ఏజెన్సీ సేవలు: ఖాతాదారులకు ప్రతినిధిగా ఈ క్రింది సేవలు అందిస్తాయి.

  1. చెక్కుల ద్వారా మరియు డ్రాఫ్ట్ ద్వారా ద్రవ్యాన్ని ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి బదిలీచేస్తాయి.
  2. పరపతి సాధనాలు అయిన చెక్కులు, బిల్లులు, ప్రామిసరీ నోట్లపై వసూళ్ళు, చెల్లింపులు చేస్తాయి.
  3. ఖాతాదారుల తరఫున వాటాలు, డిబెంచర్లు, బాండ్లు మొదలైన సెక్యూరిటీలను కొనుగోలు, అమ్మకాలను చేస్తాయి.
  4. బ్యాంకులు ఖాతాదారులు వీలునామాను జాగ్రత్తపరచి, వారి మరణానంతరము వీలునామాను అమలు చేస్తాయి.

2) సాధారణ ప్రజోపయోగ సేవలు:

  1. బ్యాంకులు తమ ఖాతాదారులకు పరపతి లేఖలు జారీ చేస్తాయి.
  2. దూరప్రాంతాలకు ప్రయాణాలపై వెళ్ళినపుడు దొంగల భయం లేకుండా ప్రయాణీకుల చెక్కులను జారీ చేస్తాయి.
  3. విలువైన ఆభరణాలు, వస్తువులు, పత్రాలు దాచుకొనడానికి సేఫ్ డిపాజిట్ లాకర్ల సౌకర్యాలను కల్పిస్తాయి.
  4. విదేశీ బిల్లును అంగీకరించుట లేదా చెల్లించడం చేస్తాయి.

ప్రశ్న 2.
భీమా సూత్రాలను వివరించుము.
జవాబు:
సక్రమమైన కాంట్రాక్టుకు ఉండవలసిన ప్రతిపాదన, స్వీకృతి, స్వేచ్ఛాసమ్మతి, పార్టీల సామర్థ్యము, ప్రతిఫలము, నాయాత్మక ఉద్దేశము మొదలగు సూత్రాలతో పాటు భీమాకు సంబంధించిన దిగువ ప్రాథమిక సూత్రాలను కూడా తృప్తిపరచవలెను.

ఎ) భీమా ఆసక్తి: సక్రమమైన భీమా కాంట్రాక్టుకు ఉండవలసిన ఆవశ్యకాలలో భీమా ఆసక్తి ప్రధానమైనది. భీమా ఆసక్తి లేని ఒప్పందాన్ని జూదము ఒప్పందముగా పరిగణిస్తారు. అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. అటువంటి దానిని కోర్టు ద్వారా అమలుపరచడానికి వీలుండదు. కనుక భీమాపాలసీ తీసుకునే వ్యక్తికి తన జీవితము మీదగాని, ఆస్తిమీద గాని ఆసక్తి కలిగి ఉండాలి. ఉదా: ఒక వ్యక్తికి తన జీవితం మీద, తన భార్య జీవితము మీద ఆసక్తి ఉంటుంది. బ్యాంకరుకు తన వద్ద తనఖా ఉంచిన బాకీదారు ఆస్తిమీద ఆసక్తి ఉంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

బి) అత్యంత విశ్వాసము: భీమా కాంట్రాక్టు విషయము సమగ్రముగాను మరియు కాంట్రాక్టు పార్టీలు అందరూ అత్యంత విశ్వాసపూరితముగా ఉండాలి. కాంట్రాక్టునందు నమ్మకము లోపించిన యడల ఆ పార్టీల మధ్య ఒప్పందము చెల్లదు. అనగా అందులో మోసము లేనపుడే ఆ భీమా కాంట్రాక్టు అత్యంత విశ్వాసపూరితమైది. అందువలన భీమా తీసుకునే వ్యక్తి ఒప్పందానికి సంబంధించిన అన్ని వాస్తవాలను భీమా సంస్థకు తెలియజేయాలి లేని యడల విశ్వాసము లోపించినట్లుగా, ఆ కాంట్రాక్టు చెల్లని కాంట్రాక్టు అవుతుంది.

సి) నష్టపూర్తి: సంభవించిన నష్టాన్ని ద్రవ్య రూపేణ భర్తీ చేయడాన్ని నష్టపూర్తి అని అంటారు. ఇది భీమా ఆస్తి విలువకు మించరాదు. ముందుగా ఒప్పందము చేసుకున్న విధముగా ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగినపుడు భీమాదారుడు జరిగే నష్టాన్ని అంచనా వేసి, దానిని భీమా సంస్థ చెల్లించడాన్ని నష్టపూర్తి అంటారు. నష్టము జరుగుతున్నప్పుడు భీమాదారుడు నష్టాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆ ఆస్తిని తిరిగి పూర్వపు స్థితిలో (యధాస్థితిలో) ఉంచడానికి ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని భీమా సంస్థ అంచనా వేసి భీమాదారుకు చెల్లిస్తుంది. జీవిత భీమా కాంట్రాక్టులు మినహా, ఇతర భీమా కాంట్రాక్టులన్నీ నష్టపూర్తి కాంట్రాక్టులు అవుతాయి.

డి) సమీపకారణము: ఇది (causa proxima) అనే లాటిన్ సూత్రము నుండి ఏర్పడినది. దగ్గర కారణము లేదా తక్షణ కారణం దీని అర్ధము. ఒక నష్టము సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో వాస్తవమైన కారణాన్ని సమీపకారణము అంటారు. భీమా సంస్థ చెల్లించవలసిన బాధ్యతను లెక్కించునపుడు సుమారు కారణమును పరిగణించకుండా సమీపకారణాన్ని తీసుకుంటారు. సముద్ర భీమా విషయములో ఓడలేదా ఓడలోని సరుకునకు వివిధ కారణాల వలన నష్టము సంభవించినపుడు, ఏ ఒక్క కారణాన్ని లెక్కలోకి తీసుకోకుండా సమీపకారణము అనే సూత్రము ద్వారా నష్టాన్ని లెక్కిస్తారు.

ఇ) హక్కుల సంక్రమణ సిద్ధాంతము: దీనినే హక్కులకు ప్రత్యామ్నాయ సిద్ధాంతము అని కూడా అంటారు. దీని అర్ధము హక్కులను పొందే వ్యక్తిని ఋణదాత స్థానములో ఉంచడము. భీమాదారుకు భీమా ఆస్తిపై మరియు ఇతరులపై గల సర్వహక్కులు భీమా సంస్థకు లభించడాన్ని హక్కుల సంక్రమణ అంటారు. దీనినే ప్రతి నివేశము అని కూడా అంటారు. నష్టపూర్తి జరిగిన తర్వాత భీమాదారునికి గల హక్కులు, ఉపశమనాలు అన్ని భీమాసంస్థకు బదిలీ అవుతాయి, భీమా ఆస్తి మీదనే కాక, నష్టాన్ని పూరించడానికి మూడవవ్యక్తి మీద కూడా భీమా సంస్థకు హక్కులు సంక్రమిస్తాయి.

ఎఫ్) చందా: భీమా ఆస్తికి నష్టము కలిగినపుడు, ఆ ఒప్పందములో వేరే భీమా సంస్థలు ఉన్నప్పుడు, ఆ భీమా సంస్థలు దామాషా పద్ధతిలో బాధ్యతను చెల్లించవలసి ఉంటుంది. భీమాదారుడు తనకు కలిగిన నష్టానికి మించిన మొత్తాన్ని పొందలేడు. అన్ని పాలసీలకు భీమా ఆసక్తి ఉండవలెను.

జి) నష్టము తగ్గింపు: భీమా ఆస్తికి కలిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి ఈ సూత్రము వర్తిస్తుంది. భీమాదారుడు భీమా చేయని ఆస్తికి హాని కలిగినపుడు నష్టాన్ని నివారించడానికి లేదా తగ్గించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడో భీమా చేసినపుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలని ఈ సూత్రం తెలియజేస్తుంది.

ప్రశ్న 3.
జీవిత భీమా పాలసీని నిర్వచించి, వాటి రకాలను తెలపండి.
జవాబు:
జీవితభీమాను దిగువ విధముగా నిర్వచించవచ్చును. “భీమా సంస్థ తాను పొందిన ప్రీమియంకు బదులుగా, ఆ ప్రీమియం ఒకే మొత్తముగా గాని లేదా నిర్ణీత వాయిదాలలో గాని, భీమాదారుడు మరణించినపుడు లేదా నిర్ణీత సమయము పూర్తి అయినపుడు నిర్దిష్టమైన సొమ్ము చెల్లించటానికి చేసుకునే కాంట్రాక్టును జీవితభీమా కాంట్రాక్టు
అంటారు.

జీవిత భీమా పాలసీలో గల రకాలు:
1) యావజ్జీవిత పాలసీ: దీనిని సాధారణ పాలసీ అని కూడా అంటారు. ఈ పాలసీలో భీమా చేసిన వ్యక్తి జీవితాంతము ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. భీమా మొత్తాన్ని భీమా చేసిన వ్యక్తి మరణించిన తర్వాతనే చెల్లిస్తారు. ఈ పాలసీ మీద ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇది భీమా చేసిన వ్యక్తి కుటుంబానికి పనికివస్తుంది. ఈ పాలసీలో ముఖ్యమైన లోపము ఏమిటంటే భీమా చేసిన వ్యక్తి ముసిలితనములో, రాబడి ఏమీ లేకపోయినా ప్రీమియం అతడు జీవితాంతము చెల్లించవలెను.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

2) ఎండోమెంట్ పాలసీ: ఈ పాలసీని నిర్దిష్ట కాలానికి అనగా ఎండోమెంట్ కాలానికి తీసుకుంటారు. ఈ పాలసీ నిర్దిష్టకాలము పూర్తి అయిన తర్వాత లేదా ఒక నిర్ణీత వయస్సు వచ్చినపుడు లేదా భీమా చేసిన వ్యక్తి మరణించినపుడు వీటిలో ఏది ముందు జరిగితే అప్పుడు గడుపుకాలము ముగుస్తుంది. ఈ పాలసీలో పెట్టుబడి మరియు రక్షణ కల్పిస్తుంది.

3) లాభాలతో కూడిన, లాభాలు లేని పాలసీలు: లాభాలతో కూడిన పాలసీని జారీచేసినపుడు, పాలసీదారుడు కంపెనీ లాభాలలో భాగాన్ని పంచుకుంటాడు. వీటిని బోనస్ అంటారు. పాలసీ గడువు ముగిసిన తర్వాత భీమా మొత్తాన్ని బోనస్తో కలిపి చెల్లిస్తారు. లాభాలు లేని పాలసీలు అయితే, పాలసీదారునకు లాభాలలో భాగం ఇవ్వరు. పాలసీ గడువు తీరిన తర్వాత భీమా మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. ఈ పాలసీలను భాగమును పంచుకునే మరియు ” భాగాన్ని పంచుకోని పాలసీలు అంటారు.

4) ఉమ్మడి జీవిత భీమా పాలసీ: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తులపై ఉమ్మడిగా జీవితభీమా పాలసీ తీసుకోవచ్చు. పాలసీదారులలో ఏ ఒక్కరు మరణించినా జీవించి ఉన్న మిగిలిన పాలసీదారులకు భీమా సొమ్మును చెల్లిస్తారు. ఈ రకమైన పాలసీలను భార్య, భర్తలు తీసుకుంటారు.

5) మార్పిడి చేయదగు యావజ్జీవిత భీమా పాలసీ: దీనిని యావజ్జీవిత భీమా పాలసీగా జారీ చేసినా నిర్దిష్ట కాలము తర్వాత దీనిని ఎండోమెంట్ పాలసీగా మార్చుకోవడానికి అవకాశము ఉంటుంది. పాలసీదారు కోరిన మీదట ఈ పాలసీని మార్పిడి చేస్తారు. పాలసీని మార్పిడి చేసిన తర్వాత పాలసీ మీద చెల్లించే ప్రీమియం పెరుగుతుంది.

6) జనతా పాలసీ: జనతాపాలసీని జీవిత భీమా కార్పరేషన్ మే, 1957లో ప్రవేశపెట్టినది, దీనిని స్వల్ప ఆదాయముగల వారి కోసం ఉద్దేశించబడినది. దీనిన 5, 10, 15, 20 మరియు 25 సంవత్సరాలకు జారీ చేసినా 60 సంవత్సరములో గడువు తీరుతుంది. ఈ పాలసీల మీద ఎలాంటి ఋణాలు మంజూరు చేయరు.

7) వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారు భీమా సంస్థ వద్ద నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. నిర్ణీతకాలము లేదా పాలసీదారుడు మరణించిన తర్వాత సొమ్మును భీమాసంస్థ చెల్లిస్తూనే ఉంటుంది.

8) సామూహిక భీమా పాలసీ: కుటుంబ సభ్యులు లేదా సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఈ పాలసీని తీసుకోవచ్చును. 9) పిల్లల ఎండోమెంట్ పాలసీ: పిల్లల చదువులకు అయ్యే మొత్తానికి గాని లేదా వారి వివాహాలకు గాని సొమ్ము చెల్లించే పాలసీలను పిల్లల పేరున తీసుకుంటే అలాంటి పాలసీలను పిల్లల ఎండోమెంట్ పాలసీలు అంటారు. పిల్లలు మేజరు అయిన తర్వాత భీమా సొమ్మును చెల్లిస్తారు.

ప్రశ్న 4.
రవాణా గురించి నీవు ఏమి అర్థము చేసుకున్నావు ? రవాణా ప్రయోజనాలను, పరిమితులను వివరించుము.
జవాబు:
భౌతిక పంపిణీలో రవాణా ఒక భాగము. భౌతిక పంపిణీ మార్కెటింగ్ మిశ్రమములో అంతర్భాగము. భౌతికముగా వస్తువులను, వ్యక్తులను ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలించడమే ‘రవాణా’. వస్తు, సేవల ఉత్పత్తి కొన్ని ప్రాంతాలకే పరిమితము కాగా వాటి వినియోగము దేశమంతటా విస్తరించి ఉంటుంది. రవాణా ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగదారుల ప్రదేశాలకు వస్తువులను చేరవేస్తారు. ఈ విధముగా స్థల, సమయ అవరోధాలను రవాణా ద్వారా అధిగమించవచ్చును. రవాణా వస్తువులకు స్థల ప్రయోజనాన్ని, కాల ప్రయోజనాన్ని కల్పిస్తుంది.

సాధారణ పరిభాషలో రవాణా అనగా వస్తువులను ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి తరలించడము. రవాణా వలన ప్రయోజనాలు:
1) సరుకును తరలించడము: వస్తువులను ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలించడమే రవాణా ముఖ్యవిధి. ముడిసరుకులను కర్మాగారానికి, తయారైన వస్తువులను వినియోగ కేంద్రాల (మార్కెట్) కు తరలిస్తుంది.

2) మూలధన, కార్మిక గమనశీలత: రవాణా అభివృద్ధి చెందడం వలన కార్మికులు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తరలివెళ్ళడానికి ఆస్కారము ఉన్నది. మూలధనాన్ని లాభదాయకమైన దానిలో పెట్టుబడి పెట్టటానికి రవాణా చాలా ఉపయోగపడుతుంది.

3) స్థల ప్రయోజనము: సరుకులు ఎక్కడైతే సమృద్ధిగా లభిస్తాయో అక్కడ నుంచి కొరతగా ఉన్న ప్రాంతానికి రవాణా ద్వారా తరలించవచ్చును.

4) ప్రత్యేకీకరణ మరియు శ్రమ విభజన: రవాణా వలన శ్రమ విభజన సాధ్యపడుతుంది. శ్రమ విభజన వలన ప్రత్యేకీకరణ పొందవచ్చును. రవాణా ద్వారా సహజవనరులను సమర్థవంతముగా ఉపయోగించుకొనవచ్చును. ఉదాహరణకు అరబ్ దేశాలలో పెట్రోలియం, స్విట్జర్లాండులో గడియారాలు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

5) కాల ప్రయోజనము: అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానము వలన రవాణా సమయం తగ్గుతుంది. దీని వలన సరుకు వ్యయాన్ని తగ్గించవచ్చును.

6) ధరల స్థిరీకరణ: సరుకులను ఎక్కువగా ఉన్న ప్రదేశము నుంచి కొరతగా ఉన్న ప్రదేశానికి రవాణా ద్వారా తరలించబడుతుంది. అందువలన ధరలు అన్ని ప్రాంతాలలో సమానముగా ఉంటాయి.

7) జాతీయ ఆదాయానికి సహాయము: రవాణా జాతీయ ఆదాయానికి తన వంతు భాగాన్ని అందిస్తుంది. ఉదా: భారత రైల్వేలు.

8) పెద్దతరహా ఉత్పత్తి వలన ఆదాలు: రవాణా వలన భారీతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. రవాణా వలన ముడి సరుకులను, కార్మికులను పొందవచ్చు. తయారైన వస్తువులను త్వరగా అమ్మడానికి సాధ్యపడుతున్నాయి.

9) జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది: తక్కువ ధరకు నాణ్యమైన సరుకు అందుబాటులో ఉండటం వలన ప్రజల యొక్క జీవన ప్రమాణస్థాయి పెరుగుతుంది.

10) దేశ రక్షణ: రవాణా దేశరక్షణను బలోపేతం చేస్తుంది. యుద్ధ సమయాలలో సైనికులను, యుద్ధసామాగ్రి, ఇతర పరికరాలను త్వరగా సరిహద్దు ప్రాంతాలకు తరలించవచ్చును.

రవాణా పరిమితులు:

  1. కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు వాటి వైభవాన్ని కోల్పోతున్నాయి: రవాణా అభివృద్ధి చెందడం వలన శ్రామికులు పెద్ద పెద్ద కర్మాగారాలలో పనిచేయుటకు ఆసక్తి చూపుతున్నారు. అందువలన కుటీర, చిన్న తరహా పరిశ్రమలలో శ్రామికుల లభ్యత తగ్గుతుంది.
  2. ప్రమాదాలు: రవాణా సౌకర్యాలు వృద్ధి చెందడం వలన ప్రమాదాలు కూడా పెరుగుతున్నవి.
  3. అధిక పట్టణీకరణ: రవాణా అభివృద్ధి చెందడం ద్వారా పెద్ద పెద్ద పట్టణాలు ఏర్పడతాయి. అధిక జనాభా పట్టణాలలో ఉండటం వలన గృహాల సమస్యలు, కాలుష్యము, ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రశ్న 5.
రోడ్డు రవాణాను వివరించి, భారత రోడ్డు రకాలను తెలపండి.
జవాబు:
రోడ్డు రవాణా అతి పురాతనమైనది. స్వల్ప దూరాలకు ఈ పద్ధతి అనుకూలమైనది. రోడ్డు రవాణా ద్వారా ఇంటింటి నుంచి వస్తువుల సేకరణ మరియు బట్వాడా సాధ్యపడుతుంది. చెడిపోయే స్వభావము గల వస్తువులకు ఈ పద్ధతి అనుకూలమైనది. ఈ రవాణా పద్ధతిలో ఎద్దులబండ్లు, గుర్రపుబండి, రిక్షా, జీపు, బస్సు, ట్రక్కు వంటి మోటారు వాహనాలను ఉపయోగిస్తారు. రోడ్డు రవాణా ముఖ్యముగా కాగితపు వస్తువులు, బట్టలు, కంప్యూటర్లు, సిమెంటు, పశువులు మొదలైన వాటికి అనుకూలముగా ఉంటుంది.

ప్రపంచ రోడ్డు రవాణా వ్యవస్థలో భారతదేశము చాలా ప్రముఖ స్థానములో ఉన్నది. భారతీయ రోడ్డు మార్గాలను జాతీయ రహదారిగా, రాష్ట్ర రహదారిగా, జిల్లా రోడ్డు మరియు గ్రామీణ రోడ్లుగా వర్గీకరించవచ్చును.

భారతీయ రోడ్డు రకాలు:
ఎ) జాతీయ రహదారులు: జాతీయ రహదారులు వివిధ రాష్ట్రాల రహదారులను కలుపుతూ సైనికులను చేరవేస్తుంది. ఈ రహదారులు రాష్ట్ర రాజధానులను, మహానగరాలను కలుపుతుంది. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టినది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

బి) రాష్ట్ర రహదారులు: రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారులను నిర్వహిస్తాయి. జిల్లా ముఖ్య నగరాలను, ఇతర ముఖ్య పట్టణాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానము చేస్తూ ఏర్పాటు చేస్తారు. మొత్తము రోడ్డు రవాణా వ్యవస్థలో ఈ రహదారుల వ్యవస్థ 4% మాత్రమే కలిగి ఉన్నది.

సి) జిల్లా రహదారులు: ఈ రహదారులు జిల్లా ముఖ్య రోడ్లను, మహానగరాలను కలుపుతాయి. మొత్తము రోడ్డు రవాణా వ్యవస్థలో ఈ రహదారులు 14% కలిగి ఉన్నాయి.

డి) గ్రామీణ రోడ్లు: ఈ రోడ్లు గ్రామీణ ప్రాంతాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి మొత్తము రహదారులలో 80% ఆక్రమించి ఉన్నాయి.

ఇ) సరిహద్దు రోడ్లు -: ఈ రహదారులు ఉత్తర ఈశాన్య సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. సరిహద్దు రహదారి సంస్థవారు నిర్మాణ, నిర్వహణను చేపడతారు. ఈ సంస్థ ఎత్తు ప్రాంతాలలో రోడ్లను నిర్మించి రవాణా సాఫీగా జరగడానికి మంచును తొలగిస్తుంది.

ఎఫ్) అంతర్జాతీయ రహదారులు: భారతదేశము ఇతర దేశాలతో ముఖ్యముగా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఉండటం కోసం ఈ రహదారులను ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 6.
గిడ్డంగి భావనను వివరించి, దాని ప్రాముఖ్యతను వివరించుము.
జవాబు:
వేర్ హౌసింగ్ అనేది రెండు పదముల కలయిక. వేర్ అనగా వస్తువులు అని అర్ధము. అందువలన వేర్ హౌస్ అనగా వస్తువులను భద్రపరుచు ప్రదేశము. కాబట్టి వేర్ హౌసింగ్ వస్తువులను స్టోర్ చేసే కార్యకలాపము. మామూలు పరిభాషలో వేర్ హౌస్ అంటే గోడౌన్ లేదా గిడ్డంగి. వేర్ హౌసింగ్ మార్కెటింగ్ విధులైన Assembling, గ్రేడింగ్ మరియు రవాణాను నిర్వర్తిస్తుంది.

గిడ్డంగులు రెండు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. తయారైన వస్తువులను తరలించడం మరియు నిల్వచేయడం చేస్తుంది. వస్తువులను ప్లాంటు నుంచి గిడ్డంగికి, మరియు గిడ్డంగి నుంచి వినియోగదారులకు చేరవేస్తాయి. నిల్వచేసే విధులలో వస్తువులను అమ్ముడు అయ్యేవరకు గిడ్డంగులలో భద్రపరచి అవసరమైనపుడు సరుకును తరలిస్తాయి. గిడ్డంగులు కాల ప్రయోజనాన్ని తక్కువ వ్యయంతో కల్గిస్తాయి. వర్తకములో ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నవి.

గిడ్డంగుల ప్రాముఖ్యత:

  1. కొన్ని వస్తువులు కొన్ని కాలాలలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. కాని అన్ని కాలాలలో వినియోగించేందుకు గిడ్డంగులు దోహదపడతాయి.
  2. కొన్ని వస్తువులు సంవత్సరము పొడవునా ఉత్పత్తి అవుతాయి. కాని వాటి డిమాండు కొన్ని కాలాలలో, మాత్రమే ఉంటుంది. కాబట్టి గిడ్డంగులు ఈ విషయములో చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి.
  3. పెద్ద పెద్ద మొత్తాలలో సరుకును ఉత్పత్తి చేసి, సరుకులను సప్లయి చేసే కంపెనీలకు గిడ్డంగులు తప్పనిసరి.
  4. గిడ్డంగులు వస్తువులకు డిమాండ్ ఉన్నప్పుడు త్వరగా సప్లయి చేసి కంపెనీలకు సహాయపడతాయి.
  5. వస్తువుల ఉత్పత్తి నిరాటంకముగా ఉండటానికి, ఉత్పత్తి అయిన వస్తువులు సరఫరా కావడానికి గిడ్డంగులు తోడ్పడతాయి.
  6. గిడ్డంగులు ధరల స్థిరీకరణకు ఉపయోగపడతాయి. నిత్యావసర వస్తువులను గిడ్డంగులలో నిల్వచేసి వాటిని నియంత్రిస్తుంది. ధరలలో ఒడిదుడుకులు లేకుండా కాపాడుతుంది.
  7. గిడ్డంగుల ముఖ్య అవసరము ఏమిటంటే ఎక్కువ సరుకులను విభజించడము.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
సేవలు, వస్తువులను నిర్వచించుము.
జవాబు:
సేవలు ఒక పని లేదా ప్రక్రియ. ఇవి జాతీయమైనవి. కంటికి కనిపించనివి. వివిధ రకాల వినియోగదారులు వివిధ రకాల డిమాండును కలిగి ఉంటారు. ఒకే సమయములో ఉత్పత్తి మరియు వినియోగం జరుగుతుంది. సేవలను స్టాక్ గా నిల్వ చేయలేము. సేవలను కలుగజేసినపుడు వినియోగదారుడు పాల్గొనవచ్చును.
ఉదా: ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో స్వయం సేవ.

వస్తువు భౌతికమైనది, సజాతీయమైనది. కంటికి కనిపించేది. వివిధ రకాల వినియోగదారులు ప్రామాణికమైన డిమాండ్లను పొందుతారు. ఉదా: మొబైల్ఫోన్.

వినియోగము మరియు ఉత్పత్తిని విడదీయవచ్చును. స్టాక్గా నిల్వచేసుకోవచ్చు. వస్తువును తయారుచేసేటపుడు వినియోగదారుని చేరిక సాధ్యముకాదు. ఉదా: మోటారు కారు తయారీ.

ప్రశ్న 2.
ఈ – బ్యాంకింగ్ ప్రయోజనాలను వ్రాయండి.
జవాబు:
ఈ – బ్యాంకింగ్ వలన క్రింది ప్రయోజనాలు లభిస్తాయి.

  1. తక్కువ వ్యయం: ఈ పద్ధతిలో బ్యాంకింగ్ వ్యవహారములకు అయ్యే వ్యయం తక్కువగా ఉంటుంది. అందువలన బ్యాంకులు ఎక్కువ లాభాలను ఆర్జిస్తాయి.
  2. త్వరితగతిన సేవలు: ఈ – బ్యాంకింగ్లో ఖాతాదారులకు ఖచ్చితమైన సేవలు బ్యాంకులు త్వరగా అందిస్తాయి.
  3. ఎక్కడైనా ఎప్పుడైనా బ్యాంకింగ్: ఈ పద్ధతిలో బ్యాంకింగ్ సేవలు రోజుకు 24 గంటలు వారానికి 7 రోజులు అందిస్తాయి. ఖాతాదారులు తన ఇంటి నుంచి, ఆఫీసు నుంచి తన ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని మరియు వ్యవహారాలు నిర్వహించడం జరుగుతుంది.
  4. నగదు రహిత బ్యాంకింగ్: ఈ బ్యాంకింగ్ ఎక్కడికైనా నగదు తీసుకొని వెళ్ళే అవసరము ఉండదు.
  5. ప్రపంచ వ్యాప్తము: ఈ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సేవలు ప్రపంచ వ్యాప్తముగా ఏర్పాటు చేస్తుంది.
  6. సెంట్రల్ డేటాబేస్: ప్రతి బ్యాంకు బ్రాంచి దత్తాంశాన్ని కేంద్రీకరించడం జరుగుతుంది. ఖాతాదారు డిపాజిట్ చేయడం గాని, ఉపసంహరణ గాని ఒక బ్రాంచి నుంచి మరొక బ్రాంచికి పంపడం చేయవచ్చు.

ప్రశ్న 3.
మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏమిటి ? మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఏయే సేవలు పొందవచ్చునో వివరించండి?
జవాబు:
ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకు సేవలను వినియోగించుకునే పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. టెలిఫోన్ బ్యాంకింగ్తో పోల్చినపుడు మొబైల్ బ్యాంకింగ్ పరిధి ఎక్కువ మరియు ఉపయోగమైనది. దీనిని దిగువ పద్ధతులలో వినియోగించుకొనవచ్చును.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ఎ) SMS బ్యాంకింగ్: మొబైల్ఫోన్లకు సంక్షిప్త వివరాలను పంపడాన్ని SMS బ్యాంకింగ్ అంటారు. SMS సమాచారాన్ని ప్రాముఖ్యత, అంత ప్రాముఖ్యత లేని బ్యాంకింగ్ వ్యవహారములకు ఉపయోగిస్తారు. ఏదైనా బ్యాంకు వ్యవహారము జరిగిన వెంటనే ఖాతాదారుడు తన ఖాతా నిల్వ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

బి) జి.యస్.యమ్.టూల్ కిట్: జి.యస్.యమ్. టూల్ కిట్లు అనేవి ఈ టెక్నాలజీ ఉన్న మొబైల్ ఫోన్లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ సాఫ్ట్వేర్ మొబైల్ ఫోన్ మెనూలో వచ్చు మార్పులను తెలియజేస్తుంది. ఈ టూల్కిట్ కలిగి ఉన్న మొబైల్ ఫోన్లకు ప్రత్యేక సిన్కార్డులు కలిగి ఉంటాయి. మరియు ఒక స్థిరమైన బ్యాంకు బ్రాంచిలో సంబంధము కలిగి ఉంటాయి. ఖాతాదారుడు ఈ సేవలను ఉపయోగించుకొనవచ్చు.

సి) వేప్: వేప్ అనగా wireless application protocol. వేపు వెబ్ పేజీలతో పోల్చడం జరుగుతుంది. కంప్యూటర్ మానిటర్పై పేజీలు కనపడడమే కాకుండా దాని output చిన్న మొబైల్ ఫోన్లో కూడా చూపుతుంది. వేప్ బ్యాంకింగ్ అంత ప్రాముఖ్యత పొందలేదు. కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నవి.

ప్రశ్న 4.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ దశలను వ్రాయుము.
జవాబు:
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ క్రింది దశలు ఉంటాయి.
1. ఎ.టి.యం: దీనిని ఆటోమేటిక్ టెల్లర్ మిషీన్ అంటారు. ఖాతాదారులు త్వరిత గతిన నగదు తీసుకొనుటకు, నగదు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిపాజిట్లు మొదలగునవి ఎ.టి.యం ద్వారా జరుగుతాయి. వీటిని వివిధ స్థలాలలో ఏర్పాటు చేసి బ్యాంకులోని కంప్యూటర్ అనుసంధానము చేస్తారు. ఖాతాదారుడు బ్యాంకు వారు ఇచ్చిన కార్డు ద్వారా నగదు తీసుకొనవచ్చును.

2. టెలిఫోన్ బ్యాంకింగ్: టెలిఫోన్ నుండి ఖాతాదారులు అనేక వ్యవహారాలు జరుపుతారు. అవి ఖాతాలలోని నిల్వ తెలుసుకొనుట, బదిలీ, బిల్లులు చెల్లింపు, ఆర్డరు నివేదికలు మరియు చెక్కు పుస్తకాలు మొదలైన సేవలు పొందవచ్చును.

3. ఈ – మెయిల్ బ్యాంకింగ్: ఖాతాదారులు ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా వ్యవహారాలు జరుపుతారు. క్లయింటు యొక్క మెయిల్ బాక్స్కు అకౌంటు నివేదికను తరుచుగా కాల ప్రాతిపదికలో పంపడం జరుగుతుంది.

4. నెట్వర్క్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్: ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. కంప్యూటరీకరణ చేసిన ప్రతిబ్యాంకు బ్రాంచి నెట్వర్క్ ద్వారా ఖాతాదారులు తమ ఆమోదాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుపుతారు. ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది ఖాతాదారులు బ్యాంకుకు సంబంధించిన వ్యవహారములు నెరవేర్చుటకు అవకాశమును కల్పిస్తుంది.

5. మొబైల్ బ్యాంకింగ్: ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకొనే పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. దీని పరిధి చాలా ఎక్కువ. మొబైల్ బ్యాంకింగ్ను SMS, G.S.M, Sim Toolkit, మరియు వేప్ టెక్నాలజీలో వినియోగించుకొనవచ్చును.

ప్రశ్న 5.
భీమా అంటే ఏమిటి ? భీమా విధులను వివరించండి.
జవాబు:
భీమా అనగా ఒప్పందము. భీమాలో ఒక పార్టీ మరొక పార్టీకి ప్రతిఫలము కొంత నగదును, వస్తువులకు నష్టము సంభవించడం వలన, పాడైపోవడం వలన లేదా ఒక అనిశ్చిత సంఘటన వలన కలిగే నష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

భీమా విధులు:
i) నిర్దిష్టతను కలుగజేయును: నష్టము సంభవించినపుడు ఒక నిర్ణీత మొత్తాన్ని, భీమా సంస్థ భీమాదారునకు చెల్లించడం జరుగుతుంది. నష్టము సంభవించడం వలనగాని లేక నిర్ణీతకాలము పూర్తి అయిన తర్వాత నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. నిర్దిష్టతను కల్పించడానికి భీమా సంస్థకు ప్రీమియం చెల్లించడం జరుగుతుంది.

ii) రక్షణ: భీమా రెండవ ముఖ్యవిధి రక్షణ కల్పించడం. నష్టము సంభవించుటకు గల అవకాశము నుంచి రక్షిస్తుంది. భీమా అనేది ఒక అనిశ్చిత సంఘటనను నిలవరించదు. కాని సంఘటన జరిగినపుడు నష్ట పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది.

iii)నష్టాన్ని పంచుకోవడం: ఒక అనిశ్చిత సంఘటన జరిగినపుడు ఆ నష్టాన్ని భీమా పాలసీదారులు అందరూ పంచుకోవడం జరుగుతుంది. భీమా పాలసీదారులు అందరూ ప్రీమియం సంస్థకు చెల్లిస్తారు. కాబట్టి నష్టాన్ని కూడా పంచుకుంటారు.

iv)మూలధన కల్పనకు సహాయం: ప్రీమియం రూపములో వచ్చిన మొత్తాన్ని తిరిగి వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అందువలన మూలధన కల్పనకు తోడ్పడుతుంది.

ప్రశ్న 6.
భీమా ప్రయోజనాలు, పరిమితులను వివరించండి.
జవాబు:
భీమా ప్రయోజనాలు: భీమా వలన సాధారణ ప్రజలకు, వర్తకులకు, ప్రభుత్వానికి మరియు వివిధ ఏజెన్సీలకు అనేక లాభాలు కలుగుతాయి.
1. నిర్దిష్టతను కల్పించుట: భీమా సంస్థతో ఒప్పందము చేసుకోవడము వలన భీమాదారుడు అనిర్దిష్టతను నిర్దిష్టముగా మార్చుకోడానికి భీమా సహాయము చేస్తుంది. భీమాదారుడు ప్రీమియంను భీమా సంస్థకు చెల్లించడం ద్వారా నష్ట భయము తగ్గుతుంది.

2. నష్టాలను పంచుట: అనిర్దిష్ట సంఘటనల వలన కలిగే నష్టాలను ఎక్కువమంది భీమాదారులకు పంపిణీ చేయడానికి భీమా తోడ్పడుతుంది. భీమాదారుల నష్టభయాన్ని అన్ని భీమా కంపెనీలకు బదిలీ చేసే అవకాశము కలుగుతుంది. ఆర్థిక నష్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.

3. భద్రత కల్పించుట: అనిశ్చిత సంఘటనల వలన కలిగే నష్టభయము నుండి భీమాదారునకు భద్రత కలుగజేస్తుంది. భీమా ప్రీమియం చెల్లించడం వలన అందుకు ప్రతిఫలముగా భీమాదారుకు కలిగే నష్టానికి లేదా పరిహారానికి భీమా కంపెనీ హామీ ఇస్తుంది. దీనివలన భీమాదారునకు నష్టభయం నుండి రక్షణ లభిస్తుంది.

4. మూలధనము సమకూర్చుట: వివిధ సంస్థలలో మూలధన పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక నష్టభయాలను మరియు నష్టాలను తగ్గిస్తుంది.

5. సామర్థ్యాన్ని పెంచును: నష్టభయాన్ని భీమా తగ్గిస్తుంది. వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులకు భద్రత కల్పిస్తుంది. దీని వలన పారిశ్రామిక అభివృద్ధి మరియు పరిశ్రమలను విస్తరించడానికి అవకాశాలు కలుగుతాయి.

6. విదేశీ మారకద్రవ్యము ఆర్జన: అంతర్జాతీయ వ్యాపారుస్తులకు, ఓడల రవాణాదారులకు మరియు బ్యాంకింగ్ సంస్థలకు భీమా భద్రతను కల్పిస్తుంది. దీని వలన విదేశీ వ్యాపారము వృద్ధి చెంది, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడం జరుగుతుంది. ఫలితముగా దేశ ఆర్థిక వ్యవస్థ పఠిష్టముగా ఉంటుంది.

7. సామాజిక భద్రత: పేదరికము, నిరుఓ’్యగము, రోగాలు, వృద్ధాప్యము, అశక్తత ప్రమాదాలు, అగ్ని మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే అనర్థాలతో పోరాడటానికి భీమా ఒక సాధనముగా పనిచేస్తుంది.

8. పొదుపును ప్రోత్సహించుట: భీమా పొదుపును ప్రోత్సహిస్తుంది. ప్రజలలో ఖర్చు పెట్టే అలవాట్లను మార్చుతుంది. నిర్దిష్టమైన మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తుంది.

భీమా పరిమితులు:

  1. నష్టాన్ని పంచడం: ఒక పాలసీదారుకు కలిగే నష్టాన్ని ఇతర పాలసీదారులందరికి పంచడం వలన తమకు రావలసిన పెట్టుబడి తగ్గిపోతుందని చాలామంది పెట్టుబడిదారులు భీమాను వ్యతిరేకిస్తున్నారు.
  2. ద్రవ్యము వాస్తవిక విలువ: గడువు పూర్తి అయిన చెల్లించే పాలసీ మొత్తము ఎక్కువగా ఉన్నప్పటికి ద్రవ్యము అసలు విలువతో పోలిస్తే తక్కువ.
  3. విశ్వాసంలో లోపము: చాలా మంది పెట్టుబడిదారులకు భీమాపై విశ్వాసము లేకపోవుట వలన తమ పెట్టుబడిని బ్యాంకులు, ఇతర సంస్థలలో ఉంచడానికి ఇష్టపడతారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 7.
జీవిత భీమా ప్రయోజనాలను తెలపండి.
జవాబు:
జీవిత భీమా వలన కలిగే ప్రయోజనాలు:

  1. పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది: జీవిత భీమాలో ప్రజలు నిర్ణీతకాలానికి ప్రీమియం చెల్లిస్తారు. ఈ విధముగా వారిలో పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది.
  2. పాలసీ తాకట్టు పెట్టుట లేదా బదిలీ: జీవిత భీమా పాలసీపై గల హక్కులను ఇతరులకు బదిలీ చేయడం ద్వారా ఋణాలను పొందవచ్చును. ఇతర భీమా సంస్థలు మరియు ద్రవ్య సహాయక సంస్థలకు భీమా పాలసీలను తనఖా ఉంచి గృహ ఋణాలను, ఇతర ఋణాలను పొందవచ్చును.
  3. పన్ను రాయితీ: భీమాదారుడు చెల్లించే ప్రీమియం మొత్తమునకు కేంద్ర ఆర్థికశాఖ పన్నురాయితీలను ఇస్తుంది.
  4. కుటుంబ సభ్యులకు రక్షణ: భీమాదారునకు అకాలమరణము సంభవించినపుడు, అతని కుటుంబ సభ్యులకు జీవిత భీమా ఆర్థిక సహాయం చేయును. ఈ విధముగా కుటుంబసభ్యులకు ఆధారాన్ని కల్పిస్తుంది.
  5. పెట్టుబడికి మంచి మార్గం: భీమాదారుడు పెట్టిన పెట్టుబడికి జీవిత భీమా నుంచి ఆదాయం వస్తుంది మరియు పెట్టుబడి మొత్తానికి రక్షణను కూడా కల్పిస్తుంది.
  6. సామాజిక భద్రత కల్పిస్తుంది: జీవిత భీమా వృద్ధులు, ఆరోగ్యము ప్రమాదము, అంగవైకల్యం, పిల్లల విద్య, వివాహము మొదలైన వాటికి సామాజిక భద్రతను కల్పిస్తుంది.

ప్రశ్న 8.
సముద్రభీమా లక్షణాలను వివరించుము.
జవాబు:
ఆర్నాల్ట్ ప్రకారము “సముద్ర భీమా ఒక పార్టీ ఎదుటి వ్యక్తి నుంచి పొందిన ప్రతిఫలమునకు సముద్ర ప్రయాణము మరియు ఓడలోకి సరుకు ఎక్కించునప్పుడు నిర్ణీత కాలములో సంభవించిన నష్టాన్ని భర్తీ చేసుకొనుటకు ఒక కాంట్రాక్టు”.

సముద్ర భీమా లక్షణాలు:
1. సాధారణ కాంట్రాక్టు సూత్రాలు అనగా భీమా ఆసక్తి, అత్యంత విశ్వాసము, నష్టపూర్తి, హక్కుల సంక్రమణ, పూచీ, సమీపకారణం మొదలైనవి సముద్ర భీమాకు వర్తిస్తాయి.

2. భీమాదారునకు, భీమా సంస్థకు మధ్య ఒప్పందమే సముద్రభీమా, నష్టభయానికి హామీ ఇచ్చినందుకు భీమాదారుడు నిర్ణీత వ్యవధిలో నిర్దిష్టమైన సొమ్మును భీమా సంస్థకు చెల్లించే బాధ్యత ఏర్పడుతుంది.

3. సముద్ర భీమాలో సముద్రములో సరుకు, ఓడ, సముద్రప్రయాణ ఛార్జీలు మొదలైన వాటికి భీమా ఉంటుంది. ఓడ మునిగిపోవుట, కాలిపోవుట, ఓడలు ఢీకొట్టుకొనుట, ఇసుకమేటలలో చిక్కుకొనిపోవుట, దొంగతనము మొదలైన నష్టభయాలకు సముద్ర భీమా హామీ కల్పిస్తుంది.

4. ఒక వైపు ప్రయాణానికి లేక అనేక ప్రయాణాలకు లేదా ఒక నిర్దిష్ట సమయానికి భీమా చేసుకొనవచ్చును. ప్రధానమైన షరతుపూర్తి అయిన తర్వాత తిరిగి భీమాను పునరుద్ధరణ చేసుకొనవచ్చును.

5. సముద్ర భీమాలో సముద్ర ప్రమాదాల వలన కలిగే నష్టాలను పూరించడానికి సంస్థ హామీ ఇవ్వడం జరుగుతుంది. 6. సముద్ర భీమాలో ఓడ లేదా ఓడలోని సరుకు నిల్వకు కలిగిన నష్టమును భీమాదారుకు చెల్లించబడుతుంది. ఇందులో మూడవ వ్యక్తి ‘భీమా కూడా ఉంటుంది.

ప్రశ్న 9.
అగ్ని భీమాను నిర్వచించి, లక్షణాలు వివరించుము.
జవాబు:
భీమా చట్టము 1938 సెక్షన్ 2(62) అగ్ని భీమాను ఇలా నిర్వచించినది. “ఇతర రకాల భీమా వ్యాపారాలతో సంబంధము లేకుండా, ఉదహరించిన భీమా ఆస్తికి అగ్ని వలన లేదా సాంప్రదాయ సిద్ధముగా అగ్నితో సంబంధము కలిగి ఉండి, దాని వలన కలిగే నష్టభయానికి ఇచ్చిన హామీ భీమా కాంట్రాక్టు”..
అగ్ని భీమా లక్షణాలు:
1. నష్టపూర్తి కాంట్రాక్టు: అగ్ని భీమా నష్టపూర్తి కాంట్రాక్టుకు చెందినది. ఈ కాంట్రాక్టులలో నిర్ణీతమైన పాలసీ మొత్తము లేదా అగ్ని ప్రమాదము వలన కలిగిన నష్టము ఏది తక్కువైతే ఆ మొత్తానికి మించి భీమాదారుడు క్లెయిం చేయలేడు.

2. న్యాయాత్మక ప్రతిఫలము: అగ్ని భీమా కాంట్రాక్టులలో ప్రతిఫలము విధిగా ఉండాలి. కాంట్రాక్టులో భీమాదారుడు చెల్లించిన ప్రతిఫలమును ప్రీమియం అంటారు. ఇది భీమా కాంట్రాక్టు ఆవశ్యకాలలో ఒకటి.

3. భీమా ఆసక్తి: అగ్ని భీమా చేయబడిన ఆస్తి లేదా సరుకు మీద భీమాదారునకు ఆసక్తి ఉండవలెను. అదే విధముగా నష్టము జరిగినపుడు నష్ట పరిహారము క్లెయిం చేసే సమయంలో కూడా అతనికి భీమా ఆసక్తి ఉండాలి.

4. అవశేషానికి క్లెయిం: భీమా సరుకు అగ్ని ప్రమాదములో నష్టానికి గురైనపుడు సంస్థ క్లెయిం చెల్లించగానే మిగిలిన సరుకు లేదా నష్టపోయిన సరుకు సంస్థకు బదిలీ అయి, భీమాదారుడు హక్కు కోల్పోతాడు.

5. ప్రమాదానికి కారణము: ప్రమాదము వలన జరిగిన నష్టానికి కారణము అగ్ని లేదా నిప్పురవ్వలు అయి ఉండాలి. ఏ ఇతర కారణం వలన నష్టము జరిగినా సంస్థ ఆ క్లెయిమును పరిష్కారానికి అంగీకరించదు.

6. అత్యంత విశ్వాసము: అగ్ని భీమా కాంట్రాక్టులో భీమాదారుడు మరియు సంస్థకు ఒకరిపై మరొకరికి అత్యంత నమ్మకము ఉండాలి.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 10.
రోడ్డు రవాణా ప్రయోజనాలు, పరిమితులు తెలపండి.
జవాబు:
రోడ్డు రవాణా ప్రయోజనాలు:

  1. తక్కువ మూలధనము: రైల్వేలు మరియు విమానాలతో పోలిస్తే రోడ్ల నిర్మాణానికి తక్కువ మూలధనము అవసరము. రోడ్ల నిర్వహణ సాధారణముగా రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక సంస్థలు చేపడతాయి.
  2. ఇంటింటికి సేవ: వస్తువులను, ప్రయాణీకులను ఎంత మారుమూల ప్రాంతానికైనా, చేరవేస్తుంది. రోడ్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది.
  3. గ్రామీణ ప్రాంతానికి సేవలు: గ్రామీణ ప్రాంతాల వారికి రోడ్డు రవాణా చాలా అనుకూలము. సరుకులను గ్రామీణ పట్టణ ప్రాంతాలలో అమ్మడానికి ఇది అనువైనది.
  4. తక్కువ నిర్వహణ ఖర్చు రైల్వేలతో పోల్చినపుడు రోడ్డు నిర్వహణ వ్యయము చాలా తక్కువగా ఉంటుంది.
  5. మార్పుకు అనుకూలము: రోడ్డు రవాణా వాహనాలను మార్చుకోవడానికి అనుకూలముగా ఉంటుంది. వ్యక్తిగత అవసరాల ఆధారముగా కాలాన్ని, రహదారులను మార్చుకోవచ్చు.
  6. స్వల్ప దూరానికి అనుకూలము: స్వల్ప దూరానికి వస్తువులను మరియు ప్రయాణీకులను త్వరగా, తక్కువ ఖర్చుతో తరలించవచ్చును.
  7. ఇతర రవాణా వ్యవస్థలకు సహాయకారి: ఏ ఇతర రవాణా వ్యవస్థకైనా రోడ్డు రవాణా సహాయకారిగా ఉంటుంది. అన్ని వస్తువుల తరలింపు రోడ్డు రవాణాతో ప్రారంభం అవుతుంది.
  8. తక్కువ వ్యయం: రోడ్డు రవాణాలో ప్రారంభ మూలధనము, నిర్వహణ ఖర్చులు, ఇతర రవా తో పోలిస్తే తక్కువ.
  9. వేగం ఎక్కువ: రోడ్డు రవాణాలో రవాణాకు పట్టేకాలము తగ్గించవచ్చును. జల రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణా వేగవంతమైనది.

రవాణాలో లోపాలు:

  1. ఋతు విధేయమైనది: దూరప్రాంతాలకు రోడ్డు రవాణా అనుకూలమైనది కాదు. వర్షాలు లేక వరదలు వచ్చినపుడు రోడ్డు రవాణా నమ్మదగినది కాదు.
  2. రవాణాలో ప్రమాదాలు: రైళ్ళతో పోలిస్తే రోడ్డు రవాణా అంత సురక్షితం కాదు. మోటారు వాహనాల ద్వారా ప్రమాదాలకు అవకాశాలెక్కువ.
  3. తక్కువ వేగం: ఇతర రవాణాలతో పోల్చినపుడు రోడ్డు రవాణాలో వాహనాలు తక్కువ వేగముతో నడుస్తాయి.
  4. పరిమిత రవాణా సామర్థ్యము: భారీ వస్తువుల రవాణాకు రోడ్డు రవాణా అనుకూలము కాదు. కారణం రోడ్డు రవాణా సామర్థ్యం తక్కువ.
  5. ఖర్చు ఎక్కువ: దూర ప్రాంతాలకు రైలు రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణాలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 11.
రైలు రవాణా ప్రయోజనాలను, లోపాలను వ్రాయుము.
జవాబు:
రైలు రవాణా ప్రయోజనాలు:

  1. దూర ప్రాంతాలకు మోటారు వాహనాల ద్వారా వీలుకాని పెద్ద పెద్ద వస్తువులను రైల్వేలు రవాణా చేస్తాయి.
  2. రైల్వేలు అతిత్వరగా ఖచ్చితముగా వస్తువులను ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి చేరుస్తాయి.
  3. బొగ్గు, ఇతర ముడిసరుకులను సరసమైన రేట్లకు ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి సులభముగా రవాణా చేస్తాయి.
  4. కరువు కాటకాలు మరియు వస్తువులు కొరత ఉన్నప్పుడు అతి త్వరగా వస్తువులను ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి తీసుకొనిపోవడానికి రైల్వేలు సహాయపడతాయి.
  5. శ్రామిక గమనాన్ని ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.
  6. రైలు ప్రయాణము సురక్షితమైనది. ప్రమాదాలు, విఘాతాలకు ఇతర రవాణాలతో పోలిస్తే రైల్వేలో తక్కువ.
  7. రైల్వేలకు వస్తువుల యొక్క రవాణా సామర్థ్యము చాలా ఎక్కువగా ఉంటుంది. అవసరాలను బట్టి రైల్వే వేగను పెంచవచ్చును.

రైల్వే రవాణా లోపాలు:

  1. రైల్వేలకు మూలధనము భారీమొత్తములో అవసరమవుతుంది. నిర్మాణ వ్యయము, నిర్వహణ వ్యయం, పరోక్ష ఖర్చులు మొదలైనవి ఇతర రవాణాలతో పోలిస్తే చాలా ఎక్కువ.
  2. రైల్వే రవాణాలో మరొక లోపము మార్పు లేకపోవడం. వ్యక్తిగత అవసరాలకు అనుగుణముగా రైలు మార్గాన్ని, సమయాన్ని మార్పు చేయలేము.
  3. రైల్వే రవాణా రోడ్డు రవాణా వలె వస్తువులను ఇంటికి తరలించదు.
  4. రైల్వే రవాణా అనేది తక్కువ దూరానికి మరియు తక్కువ బరువు గల వస్తువులను రవాణా చేయడానికి అనుకూలము కాదు.
  5. మోటారు రవాణాతో పోల్చినపుడు రైలు రవాణాలో వస్తువులను లోడింగ్ చేయడానికి, డెలివరీ చేయడానికి ఎక్కువ సమయము, ఎక్కువ శ్రమ అవసరమవుతుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎ.టి.యమ్.
జవాబు:
ఎ.టి.యమ్ అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ అని, ఎనీ టైమ్ మనీమెషీన్ అని కూడా అంటారు. ఖాతాదారులు త్వరగా నగదు తీసుకొనుటకు, బదిలీ, బిల్లుల చెల్లింపు మొదలైనవి ఎ.టి.యమ్ ద్వారా జరుగుతాయి. వీటిని వివిధ స్థానాలలో ఏర్పాటు చేసి బ్యాంకులో కంప్యూటరుకు అనుసంధానము చేస్తారు. ప్రతి ఖాతాదారునకు ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు సహాయముతో ఖాతాదారుడు నగదు తీసుకోవచ్చును.

ప్రశ్న 2.
ఆన్లైన్ బ్యాంకింగ్.
జవాబు:
ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. కంప్యూటీకరణ చేసిన ప్రతి బ్యాంకు బ్రాంచి, నెట్వర్క్ ద్వారా ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవహారాలు జరపడానికి అవకాశం ఏర్పడినది. ఖాతాదారులు ఇంటివద్దనే బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించుకుంటారు.

ప్రశ్న 3.
టెలీ బ్యాంకింగ్.
జవాబు:
దీనిని హోమ్ బ్యాంకింగ్ అంటారు. టెలీఫోన్ నుండి ఖాతాదారులు అనేక వ్యవహారాలు జరుపుతారు. అవి ఖాతాలోని నిల్వ తెలుసుకొనుట, బదిలీ, బిల్లుల చెల్లింపు, ఆర్డర్ స్టేటుమెంట్లు, చెక్కు పుస్తకాలు మొదలైన సేవలను పొందవచ్చు.

ప్రశ్న 4.
మొబైల్ బ్యాంకింగ్.
జవాబు:
ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బ్యాంకు సేవలను వినియోగించుకొను పద్ధతిని మొబైల్ బ్యాంకింగ్ అంటారు. టెలిఫోన్ బ్యాంకింగ్తో పోల్చినపుడు మొబైల్ బ్యాంకింగ్ పరిథి ఎక్కువ మరియు ఉపయోగమైనది. మొబైల్ బ్యాంకింగ్ను యస్.యమ్.ఎస్ బ్యాంకింగ్, జి.యస్.ఎమ్. సిమ్ టూల్కిట్ మరియు వేప్ టెక్నాలజీలలో వినియోగించుకొనవచ్చును.

ప్రశ్న 5.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్.
జవాబు:
కంప్యూటర్ రాకతో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ప్రారంభమైనది. 1970లో ఎ.టి.యమ్, 1980లో టెలీ బ్యాంకింగ్ మరియు ఈ మెయిల్ బ్యాంకింగ్ ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఆచరణలోనికి వచ్చాయి. కొత్త పరికరాలైన క్రెడిట్ కార్డులు, ATM, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ మరియు ఎలక్ట్రానిక్ క్లియరింగ్ హౌస్ పద్ధతులు ప్రతిభావంతమైన, వేగవంతమైన చెల్లింపులు, పరిష్కార పద్ధతులు. వీటిని అన్నింటిని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు.

ప్రశ్న 6.
భీమా సంస్థ మరియు భీమాదారుడు.
జవాబు:
భవిష్యత్తులో ఒక సంఘటన జరిగినపుడు అందుకు సొమ్ము చెల్లించుటకు అంగీకరించిన వారిని భీమా సంస్థ లేదా ఇన్సూరర్ అంటారు. తనకు అనుకోకుండా జరిగే నష్టానికి భద్రత కోరుతూ, అందుకోసం కొంత సొమ్మును సంస్థకు చెల్లించే వ్యక్తిని భీమాదారుడు లేదా ఇన్సూర్డ్ అంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 7.
ప్రీమియం.
జవాబు:
భీమాదారునకు కలిగే నష్టానికి రక్షణ కల్పించినందుకు బదులుగా, భీమాసంస్థకు నిర్దిష్ట సమయానికి భీమాదారుడు చెల్లించే సొమ్మును ప్రీమియం అంటారు.

ప్రశ్న 8.
భీమా నిర్వచనము.
జవాబు:
భీమా అనగా ఒప్పందము. భీమాతో ఒక పార్టీ మరొక పార్టీకి ప్రతిఫలముగా కొంతనగదు మొత్తాన్ని, వస్తువులకు సంభవించడం వలన గాని, పాడైపోవుట వలన గాని, గాయపడుట వలన గాని లేదా అనిశ్చిత సంఘటన జరుగుట వలన గాని కలిగే నష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది.

ప్రశ్న 9.
పునరీమా.
జవాబు:
రెండు లేదా ఎక్కువ భీమా సంస్థల మధ్య జరిగిన భీమా కాంట్రాక్టును పునర్భీమా అంటారు. ఒక భీమా సంస్థ తాను అంగీకరించిన భీమా విషయములో కొంతభాగాన్ని మరొక భీమా సంస్థకు బదిలీ చేస్తూ చేసుకున్న ఏర్పాటునే పునర్భీమా అంటారు. దీని వలన మొదటి భీమా సంస్థ బాధ్యత పరిమితము అవుతుంది.

ప్రశ్న 10.
ద్వంద్వ భీమా
జవాబు:
ద్వంద్వ భీమా అంటే ఒకే ఆస్తిపై ఒకటి కంటే ఎక్కువ భీమా పాలసీలు తీసుకోవడము. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ భీమా పాలసీలను తీసుకోవచ్చు. ఆ పాలసీదారు మరణించినా లేదా నిర్ణీత గడువు తీరినపుడు ఏది ముందు జరిగినా, భీమా సొమ్మును అన్ని భీమా సంస్థలు పూర్తిగా ఎవరికి చెల్లిస్తారు. కాని అగ్ని, సముద్ర భీమాలలో అన్ని భీమా సంస్థలు నష్టాన్ని మించకుండా చెల్లిస్తారు.

ప్రశ్న 11.
హక్కుల సంక్రమణ.
జవాబు:
దీని అర్థము ఋణదాత హక్కులను పొందిన వ్యక్తిని ఋణదాత స్థానములో ఉంచడము. నష్టపరిహారాన్ని చెల్లించిన తర్వాత భీమాదారుకు గల అన్ని హక్కులు భీమాసంస్థకు బదిలీ అవుతాయి. దీనిని హక్కుల సంక్రమణ సిద్ధాంతము లేదా ప్రతినివేశం అంటారు.

ప్రశ్న 12.
సమీపకారణము.
జవాబు:
ఇది causa proxima అనే లాటిన్ సూత్రము నుండి ఏర్పడినది. దీని అర్థము దగ్గర కారణము. ఒక నష్టము సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో వాస్తవమైన కారణాన్ని సమీపకారణము అంటారు. భీమా సంస్థ బాధ్యతను లెక్కించుటకు సుమారు కారణంకాక సమీపకారణం లెక్కలోకి తీసుకుంటారు.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 13.
భీమా ఆసక్తి.
జవాబు:
సక్రమమైన భీమా కాంట్రాక్టు ఆవశ్యకాలలో భీమా ఆసక్తి ప్రధానమైనది. భీమా ఆసక్తి లేని ఒప్పందము జూదముగా భావిస్తారు. అది చెల్లని కాంట్రాక్టు అవుతుంది. కనుక భీమా చేసే వ్యక్తికి ఆస్తి మీద లేదా జీవితం మీద గాని ఆసక్తి కలిగి ఉండాలి. ఉదా: ఒక వ్యక్తికి తన జీవితం మీద గాని, తన భార్య జీవితం మీద భీమా ఆసక్తి ఉంటుంది.

ప్రశ్న 14.
ఎండోమెంట్ పాలసీ.
జవాబు:
ఎండోమెంట్ జీవిత భీమాపాలసీ ఒక నిర్దిష్ట కాలానికి తీసుకునే పాలసీ. గడువుకాలము పూర్తి అయిన తర్వాత గాని లేక పాలసీదారు మరణించినపుడు గాని వీటిలో ఏది ముందు జరిగినా భీమా సంస్థ హామీ ఇచ్చిన సొమ్మును చెల్లిస్తుంది.

ప్రశ్న 15.
యావజ్జీవిత పాలసీ.
జవాబు:
యావజ్జీవిత పాలసీ జీవితకాలము అమలులో ఉంటుంది. ఈ పాలసీ మీద ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ రిస్క్న భరిస్తుంది. భీమా ప్రీమియం 20 నుంచి 25 సంవత్సరాలు లేదా జీవితకాలం చెల్లించాలి.

ప్రశ్న 16.
సముద్ర భీమా.
జవాబు:
సముద్ర భీమాలో ఒక పార్టీ ఎదుట వ్యక్తి నుంచి ప్రతిఫలమును స్వీకరించినందుకుగాను ఆ వ్యక్తికి సముద్ర ప్రయాణములో ప్రమాదాలు మరియు ఓడలోకి సరుకు ఎక్కించునపుడు, భవిష్యత్ అనగా నిర్ణీత కాలములో సంభవించిన నష్టాన్ని భర్తీ చేయుటకు, చేసుకొనుటకు ఒక కాంట్రాక్టు.

ప్రశ్న 17.
సరుకు భీమా.
జవాబు:
సరుకు రవాణా చేయునపుడు అనేక ప్రమాదాలకు గురి అవుతుంది. నౌకాశ్రయములో దొంగతనము లేదా ప్రయాణములో సరుకునకు నష్టము జరుగుట మరియు ఇతర ప్రమాదాలకు గురి అగును. ఇటువంటి నష్ట భయానికి ఇచ్చే హామీని కార్గో భీమా (సరుకు భీమా) అంటారు.

ప్రశ్న 18.
అగ్ని భీమా.
జవాబు:
“భీమా చట్టము 1938 సెక్షన్ 2(6ఎ) అగ్ని భీమాను ఇలా నిర్వచించినది”. ఇతర రకాల భీమా వ్యాపారాలతో సంబంధము లేకుండా ఉదహరించిన భీమా ఆస్తికి అగ్ని వలన గాని లేదా సంప్రదాయ సిద్ధముగా అగ్నితో సంబంధం కలిగి జరిగే నష్టానికి ఇచ్చిన హామీ భీమా కాంట్రాక్టు”.

ప్రశ్న 19.
అగ్ని భీమా లక్షణాలు.
జవాబు:

  1. అగ్ని భీమా నష్ట పూర్తి కాంట్రాక్టు.
  2. అగ్ని భీమాలో న్యాయాత్మక ప్రతిఫలం ఉండాలి.
  3. భీమాదారుకు ఆస్తి మీద భీమా ఆసక్తి ఉండాలి.
  4. ప్రమాదము వలన జరిగిన నష్టానికి కారణం అగ్ని అయి ఉండాలి.
  5. ఈ కాంట్రాక్టు అత్యంత విశ్వాసము గలది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 20.
జాతీయ రహదారి.
జవాబు:
జాతీయ రహదారులు వివిధ రాష్ట్రాల రహదారులను కలుపుతూ సైనికులను చేరవేస్తుంది. ఈ రహదారి రాష్ట్ర రాజధానులను, మహానగరాలను కలుపుతుంది. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ నియంత్రణను ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ చేపట్టింది.

ప్రశ్న 21.
పైపులైన్లు.
జవాబు:
పైపులైన్లు ద్రవ పదార్థాలను తరలించడానికి ఎంతో ప్రాముఖ్యత వహించినది. పైపులైన్ల ద్వారా సహజ వాయువు మరియు ముడిచమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు పైప్ లైన్ల ద్వారా పంపబడతాయి. పైపులైన్లు ఎటువంటి అంతరాయము లేకుండా తక్కువ ఖర్చుతో నిర్వహించబడతాయి.

ప్రశ్న 22.
బాండెడ్ గిడ్డంగులు.
జవాబు:
ప్రభుత్వము చేత అనుమతి పొంది పన్నులు మరియు కస్టమ్స్ సుంకాలు చెల్లించక మునుపు దిగుమతి చేసుకున్న వస్తువులు నిల్వచేయడానికి ఉపయోగపడే గిడ్డంగులను బాండెడ్ గిడ్డంగులు అంటారు. దిగుమతిదారుడు పూర్తి సుంకాలు చెల్లించలేనపుడు, మొత్తం సరుకు అవసరం లేనపుడు, కస్టమ్స్ అధికారులు బాండెడ్ గిడ్డంగులలో భద్రపరుస్తారు.

ప్రశ్న 23.
గిడ్డంగుల రెండు ప్రాముఖ్యతలు.
జవాబు:

  1. కొన్ని వస్తువులు కొన్ని కాలాలలో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. కాని అన్ని కాలాలలో వినియోగించేందుకు గిడ్డంగులు దోహదపడతాయి.
  2. గిడ్డంగులు ధరల స్థిరీకరణకు ఉపయోగపడతాయి. నిత్యావసర వస్తువులను ప్రభుత్వ గిడ్డంగులలో నిల్వచేసి వాటిని నియంత్రిస్తుంది. ధరలలో ఒడిదుడుకులు లేకుండా కాపాడుతుంది.

ప్రశ్న 24.
క్యాష్ క్రెడిట్
జవాబు:
ఒక సంవత్సరానికి లేదా అంతకంటే తక్కువ కాలానికి ఖాతాదారునకు మంజూరు చేసిన ఋణాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. సరుకుగాని, ఇతర ఆస్తి హామీగా ఈ ఋణాన్ని మంజూరు చేస్తారు. ఋణ మొత్తాన్ని ఖాతాదారుడు ఒకేసారి లేదా కొన్ని వాయిదాలలో తీసుకోవచ్చు. ఋణమొత్తముపై కాక ఖాతాదారుడు వాడుకున్న మొత్తంపై వడ్డీని విధిస్తారు.

ప్రశ్న 25.
బిల్లుల డిస్కౌంట్.
జవాబు:
బిల్లుదారు బిల్లు గడువు తేదీకి ముందు నగదు అవసరమయినపుడు బ్యాంకు వద్ద డిస్కౌంటు చేసుకొనవచ్చును. బ్యాంకు బిల్లు మొత్తములో కొంత మొత్తాన్ని తగ్గించి బిల్లుదారుకు చెల్లిస్తుంది. గడువుతేదీన బిల్లు స్వీకర్త నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసుకుంటుంది.

AP Inter 2nd Year Commerce Study Material Chapter 3 వ్యాపార సేవలు

ప్రశ్న 26.
రికేరింగ్ డిపాజిట్.
జవాబు:
తక్కువ ఆదాయము పొందేవారు చిన్న మొత్తాలలో పొదుపు చేయడానికి ఈ డిపాజిట్లు అనుకూలము. ఈ డిపాజిట్లను కొంత కాలవ్యవధి అనగా వారానికి, నెలకు నిర్ణయించిన మొత్తాన్ని నిర్ణీతకాలము పూర్తి అయ్యేవరకు నగదు జమచేస్తూ ఉండాలి. గడువుకాలము పూర్తి అయిన తర్వాత వడ్డీతో సహా మొత్తం సొమ్మును డిపాజిట్ దారుకు చెల్లిస్తారు.