Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థికవృద్ధి – అభివృద్ధి Textbook Questions and Answers.
AP Inter 2nd Year Economics Study Material 1st Lesson ఆర్థికవృద్ధి – అభివృద్ధి
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను వివరించండి.
జవాబు:
తలసరి ఆదాయం, జీవన ప్రమాణం, వనరుల లభ్యత మరియు ఉపయోగం, సాంకేతికాభివృద్ధి మొదలైన లక్షణాల ఆధారంగా ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా వర్గీకరించబడ్డాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలను అధిక ఆదాయ దేశాలు (High Income Countries), పారిశ్రామిక దేశాలు (Industrialised Countries), ఇతర దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలు (Advanced Countries) గా కూడా పిలవడం జరుగుతుంది. అమెరికా, ఇంగ్లాండు (U.K.), ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్ మొదలైనవి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను ఉదాహరణలుగా చెప్పవచ్చును.
1) అధిక తలసరి ఆదాయం: ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. అధిక తలసరి ఆదాయం అభివృద్ధి చెందిన దేశాల ముఖ్య లక్షణం. 2012వ సంవత్సరంలో వినిమయ రేటు ఆధారంగా U.S.A. తలసరి G.N.I. ($ 50,120) భారతదేశం యొక్క తలసరి G.N.I. ($ 1,530) కంటే 33 రెట్లు ఎక్కువగాను మరియు కొనుగోలు శక్తి ఆధారంగా 15 రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్ల అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరి ఆదాయాలలో ఎక్కువ తేడాలు ఉన్నట్లు గమనించవచ్చు.
2) వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత: అభివృద్ధి చెందిన దేశాలు సహజంగా పారిశ్రామిక దేశాలై ఉంటాయి. ఈ దేశాలలో పారిశ్రామిక, సేవారంగాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. వ్యవసాయ రంగంతో పోల్చినపుడు ఆదాయ, ఉద్యోగ అవకాశాల కల్పనలో పారిశ్రామిక సేవారంగాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ రంగాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటాయి. కాబట్టి ఈ రంగాలలో ఉత్పాదకత వ్యవసాయరంగ ఉత్పాదకత కంటే ఎక్కువగా ఉండి, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి చోదక శక్తిగా పనిచేస్తుంది. అమెరికాలో (U.S.A) వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నవారు 1.6 శాతం, కాగా స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1.3 శాతం మాత్రమే ఉంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలు అయితే భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడినవారు 51.1 శాతం గాను, స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 18 శాతంగా ఉంది.
3) అధిక స్థాయిలో మూలధనం, సాంకేతిక విజ్ఞానం: మూలధన కల్పనరేటు ఎక్కువగా ఉండటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం అభివృద్ధి చెందిన దేశాల ముఖ్య లక్షణం. అభివృద్ధి చెందిన దేశాలు అధిక ఆదాయ దేశాలు కాబట్టి వారికి పొదుపు సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా బ్యాంకులు, విత్తసంస్థలు సమర్థవంతంగా పనిచేస్తూ పెద్ద ఎత్తున పొదుపును సమీకరిస్తాయి. ఈ దేశాలలో మూలధన లభ్యత అధికంగా ఉండటం వల్ల అది సాంకేతిక ప్రగతికి దారితీస్తుంది.
4) తక్కువ స్థాయిలో నిరుద్యోగం: నిరుద్యోగ స్వభావం మరియు పరిమాణంలో అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మౌళికమైన భేదం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో “సార్థక డిమాండు” కొరత నిరుద్యోగానికి కారణం అవుతుంది. ఈ దేశాలలోని నిరుద్యోగం చక్రీయ (Cyclical) మరియు సంఘృష్ట (Frictional) మైనది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో “మూలధన కొరత” వల్ల బహిర్గత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగితలు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాలలో శ్రామిక నైపుణ్యం, శ్రామికులు గమనశీలతలు ఎక్కువగా ఉండటమే కాకుండా నిరుద్యోగిత శాతం చాలా తక్కువగా ఉంది.
5) మెరుగైన జీవన ప్రమాణం: సమర్థవంతమైన సాంఘిక భద్రతా వ్యవస్థ, కాలుష్యపరంగా ఉన్నత ప్రమాణాలు పాటించడం, రక్షిత త్రాగునీరు లభ్యత, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం మొదలైన అంశాలు అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాన్ని కల్పిస్తాయి. ఈ దేశాలు విద్య, ఆరోగ్యం, పరిశోధన, శిక్షణ మరియు నైపుణ్యాల కల్పనలపై ఎక్కువ వ్యయం చేస్తాయి. దీనిని మానవ మూలధనం అంటారు. ఉదా: అమెరికాలో విద్య మరియు పరిశోధనల మీద స్థూల దేశీయ ఉత్పత్తిలో 6 శాతం కంటే ఎక్కువ వ్యయం చేస్తూ ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థూల దేశీయ ఉత్పత్తిలో కేవలం 3 శాతం మాత్రమే వ్యయం చేస్తున్నాయి. భారతదేశం తన స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యపైన 2004-2005లో 3.3 శాతం వ్యయం చేయగా 2011-2012 నాటికి ఇది 4 శాతానికి పెరిగింది. మానవాభివృద్ధి సూచిక విషయంలో 2013వ సంవత్సరానికి 187 దేశాలలో నార్వే. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండు దేశాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా, భారతదేశం 135వ స్థానంలో ఉన్నది.
ప్రశ్న 2.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము – చర్చించండి.
జవాబు:
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు గోచరిస్తాయి.
2005
1) జాతీయాదాయం పెరుగుదల: 1950 – 51 సంవత్సరంలో భారతదేశ జాతీయాదాయం, 2004 సం॥పు స్థిర ధరలలో కౌ 2,55,405 కోట్లు. 2013-14 సంవత్సరాలలో జాతీయాదాయం 49,20,183 కోట్లు. దీనిని వేగవంతమైన అభివృద్ధిగా చెప్పవచ్చు.
2) తలసరి ఆదాయం పెరుగుదల: 1950. 51 సంవత్సరంలో నికర తలసరి ఆదాయం, 2004 – 2005 సం||పు స్థిర ధరలలో కౌ 7, 114. 2013-14 సంవత్సరాలలో 39,904. సాపేక్షికంగా నికర తలసరి ఆదాయం చాలా వేగంగా పెరిగింది.
3) పొదుపు, మూలధన కల్పన పెరుగుదల: భారతదేశంలో 1990లో 23 శాతంగా ఉన్న స్థూల దేశీయ పొదుపు రేటు 2012 నాటికి 27.9 శాతానికి పెరిగింది. అదే కాలంలో 24 శాతంగా ఉన్న స్థూల మూలధన కల్పన రేటు 35.6 శాతానికి పెరిగింది. ఇది భారతదేశ అభివృద్ధి గతిని సూచిస్తుంది.
4) వృత్తులవారి శ్రామిక జనాభా: 2011 సంవత్సరపు లెక్కల ప్రకారం 48.9% శ్రామికులు వ్యవసాయ రంగంమీద ఆధారపడినారు. ఇది వ్యవసాయ ప్రాధాన్యతను సూచిస్తుంది. ద్వితీయ రంగం మీద ఆధారపడిన వారి | శాతం క్రమేపి పెరుగుతూ వచ్చింది. 1901లో 10.7% మరియు 2011లో 24.3% శ్రామికులు ద్వితీయ రంగం మీద ఆధారపడినారు. తృతీయ రంగం మీద ఆధారపడిన వారి శాతం 1/5 కంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు.
5) స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా: స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1950-51 సం॥లో 56.5% గా ఉంది. ఈ వాటా క్రమేపి తగ్గుతూ 2013-14 నాటికి 13.9 శాతానికి చేరుకుంది. పారిశ్రామిక రంగం: పారిశ్రామిక రంగంలో 1950-51 సం॥లో వాటా జాతీయాదాయంలో 14.8 శాతం కాగా 2013-14 సం॥ నాటికి పారిశ్రామిక రంగం వాటా 26.2 శాతంగా ఉంది.
అవస్థాపన సౌకర్యాలు: రవాణా, బ్యాంకింగ్, నీటిపారుదల, విద్య, సమాచారం మొదలైన వాటిని అవస్థాపన సౌకర్యాలు అంటారు. వీటి విషయంలో భారత్ ప్రగతిని సాధించింది.
శాస్త్ర విజ్ఞానం – సాంకేతిక విజ్ఞానం: నేడు ఇండియాలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు కల్గిన 3వ పెద్ద దేశంగా ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నది. శాస్త్ర విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానము కల్గిన మానవశక్తిగా ప్రపంచంలో రెండవ దేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందినది.
అయినప్పటికీ జనాభా సమస్యను ఎదుర్కొనుచున్నది. 2011వ సం॥లో 1210 మిలియన్లు ఉన్న భారత జనాభా 2015 నాటికి 1278 మిలియన్లకు పెరిగింది. మనదేశంలో ద్వితీయ, తృతీయ రంగాల అభివృద్ధి వల్ల ఉద్యోగిత పెరిగినప్పటికి నిరుద్యోగ సమస్య ఎదుర్కొనుచున్నది. మన దేశంలో ఆదాయ అసమానతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 2011-12 నాటికి గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు 10% ప్రజల తలసరి నెలసరి వినియోగ వ్యయం 11.5 శాతం పెరగగా 10 శాతం అధిక ధనవంతుల నెలసరి తలసరి వినియోగ వ్యయం 38 శాతం పెరిగింది. ఇదే కాలంలో పట్టణ ప్రాంతాలలో పేద, ధనికుల వినియోగ వ్యయం 17.2 శాతం మరియు 30.2 శాతం పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థలో కూడా సాంకేతిక ద్వంద్వత్వం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండగా, వ్యవసాయ రంగం పురాతన ఉత్పత్తి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నది. కనుక భారతదేశంను అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పవచ్చు.
ప్రశ్న 3.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు వివరించండి. [Mar ’17, ’16]
జవాబు:
ఐక్యరాజ్యసమితి వర్గీకరణ ప్రకారము “ఏ దేశాల వాస్తవిక తలసరి ఆదాయం, అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు కంటే తక్కువగా ఉంటుందో వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పవచ్చు”.
భారత ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం “వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అంటే ఒక ప్రక్క పూర్తిగా ఉపయోగించని లేదా తక్కువ ఉపయోగించిన మానవ వనరులు, మరోప్రక్క పూర్తిగా వినియోగించని సహజ వనరులు కలిసి ఉంటాయి”.
1) తక్కువ తలసరి ఆదాయం: తలసరి ఆదాయం తక్కువ ఉండడం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ముఖ్య లక్షణం. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పిలువబడే అల్ప, మధ్య ఆదాయ దేశాలు తలసరి ఆదాయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే బాగా వెనుకబడి ఉన్నాయి. చైనా, భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరి ఆదాయం, అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఆదాయంతో పోల్చినపుడు చాలా తక్కువగా ఉంది. వినిమయ రేటు ఆధారంగా భారతదేశ తలసరి GNI $ 1070 (2008) నుండి $1530 (2011), కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి GNI $ 2960 నుండి $ 3840 పెరిగినప్పటికీ భారతదేశం ఇంకనూ మధ్య ఆదాయం కంటే తక్కువ ఆదాయం గల దేశాల గ్రూపులోనే ఉంది.
2) మూలధన కొరత: మూలధన కొరత అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ఒక లక్షణం. అప్పుడప్పుడు ఈ దేశాలను ‘మూలధన పేద” దేశాలుగా పిలుస్తారు. తక్కువ తలసరి మూలధనం, ఆర్థిక వ్యవస్థలో మూలధనం కొరతను సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే మూలధన కల్పన రేటు ఈ దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఆ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తిలో 15 నుండి 20 శాతం మధ్య ఉంటుంది. ఈ దేశాలలో తలసరి ఆదాయం తక్కువగా ఉండడం వలన పెట్టుబడులను ప్రేరేపించే పొదుపురేటు చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా ఈ దేశాలలో ప్రోత్సాహకాలు, పొదుపును సమీకరించే సంస్థలు సమర్థవంతంగా లేనందున పొదుపు, పెట్టుబడుల స్థాయి పెరగడం లేదు.
3) జనాభా లక్షణాలు: అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయి. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల రేటు 2 శాతముగా నమోదైంది. వైద్య సౌకర్యాలు మెరుగుపరచి మరణాల రేటు తగ్గించడంలో విజయం సాధించినప్పటికీ అదే రీతిలో జననాల రేటు తగ్గించలేకపోవడం వలన జనాభా విస్ఫోటనానికి దారితీసింది. ఈ అధిక జనాభా సహజ వనరులపైన ఒత్తిడిని పెంచి, పేదరికం, నిరుద్యోగం పెరగడానికి కారణం అయినది. అందువలన ప్రజల జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుంది.
భారతదేశం కూడా అధిక జనాభా సమస్యను ఎదుర్కొంటున్నది. 2011వ సం॥లో 1210 మిలియన్లు ఉన్న భారతదేశ జనాభా 2015 సం॥నాటికి 1278 మిలియన్లకు పెరిగింది. ఇది ప్రపంచ జనాభాలో 17.5 శాతంగా ఉంది. 4) నిరుద్యోగం: అధిక నిరుద్యోగిత అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి. ఈ దేశాలలో ఉన్న బహిర్గత నిరుద్యోగిత (Open unemployment) అభివృద్ధి చెందిన దేశాల నిరుద్యోగితతో పోల్చినపుడు చాలా రెట్లు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వలస రావడం వల్ల పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నది. మందకొడిగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక రంగం పెరుగుతున్న శ్రామిక శక్తికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన స్థితిలో లేనందున వ్యవసాయ రంగాలపై ఒత్తిడి పెరిగి ప్రచ్ఛన్న నిరుద్యోగిత (Disguised unemployment) సమస్యను ఎదుర్కొంటున్నది. భారత ఆర్థిక వ్యవస్థలో మూలధన కొరత నిరుద్యోగానికి కారణం అవుతున్నది. భారతదేశం కూడా బహిర్గత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగిత సమస్యలను ఎదుర్కొంటున్నది.
5) వ్యవసాయ రంగ ప్రాధాన్యత: హార్వే లిబెన్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయి. ఈ దేశాలలో 30 నుండి 70 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. జె.కె. గాల్ బ్రెయిత్ అభిప్రాయంలో “ఒక దేశం పూర్తిగా వ్యవసాయ ఆధార దేశం అయినప్పటికీ అది వ్యవసాయ రంగంలోనే బాగా వెనుకబడి ఉంటుంది”.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో శ్రమ సాంద్రతపై ఆధారపడి వ్యవసాయ రంగం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో వెనుకబడి ఉంటుంది. కాబట్టి ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఉంటుంది. అంతేగాకుండా అధిక జనాభా ఒత్తిడి వలన ఈ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ భూమి విభజనకు మరియు విఘటనలకు గురి అవ్వడం వలన భూకమతాల పరిమాణం తగ్గుతుంది. దీని ఫలితంగా విక్రయం కాగల మిగులు స్వల్పంగా ఉండి ప్రజల ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ఈ దేశాల స్థూల దేశీయ ఉత్పత్తిలో (GDP) ఈ రంగం వాటా 20 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుంది.
ఆర్థిక సర్వే 2013-14 ప్రకారం, భారతదేశ వ్యవసాయ రంగంలో పనిచేయుచున్న జనాభా 54.6 శాతం ఉండగా స్థూల దేశీయ ఉత్పత్తిలో దాని వాటా 13.9 శాతంగా ఉంది.
6) సామూహిక పేదరికం: పేదరికం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రత్యేక లక్షణం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాపేక్షంగా తక్కువ తలసరి ఆదాయ స్థాయిల వద్ద అధికంగా ఉన్న ఆదాయ అసమానతలు సామూహిక పేదరికానికి దారితీస్తున్నాయి. భారతదేశం కూడా పేదరికపు సమస్యను ఎదుర్కొంటున్నది. టెండుల్కర్ కమిటీ సిఫారసు ఆధారంగా ప్రణాళికా సంఘం పేదరిక గీతను పునఃనిర్వచించింది. దీని ప్రకారం 2009-10 సం॥లో నెలసరి తలసరి వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాలలో 673 గాను, పట్టణ ప్రాంతాలలో కే 860గా నిర్ణయించింది.
7) ఆదాయ అసమానతలు: ఆదాయ సంపదలలో అసమానతలు ఉండటం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రత్యేక లక్షణం. భారత ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు పెరుగుతూ ఉన్నాయనే వాస్తవాన్ని నిర్వహించిన వివిధ సర్వేలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో గడిచిన రెండు దశాబ్దాలలో ఆదాయ అసమానతలు 2 రెట్లు పెరిగాయని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ తెలియజేసింది.
8) తక్కువ జీవన ప్రమాణం: అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవన ప్రమాణ స్థాయి చాలా తక్కువగా ఉన్నది. ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని నిజ ఆదాయం, ఆరోగ్యం, విద్యపరంగా సాధించిన వృద్ధి అనే మూడు సూచికల ఆధారంగా కొలవడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రజలు పోషకాహార లోపం, అధిక స్థాయి కాలుష్యం, పారిశుద్ధ్య లోపం, రక్షిత మంచినీటి కొరత మొదలగు సమస్యలతో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల ఆయుర్దాయం 65 సం॥ల లోపు ఉండగా అభివృద్ధి చెందిన దేశాలలో 75 సం॥ల కంటే ఎక్కువగా ఉంది.
9) సాంకేతికంగా వెనుకబాటుతనం: అభివృద్ధి చెందుతున్న దేశాలు పరిశోధన, అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ఉత్పత్తి పద్ధతులలో వెనుకబడి ఉన్నాయి. అధిక మూలధనం కొరతగా ఉండటం వల్ల ఈ దేశాలు శ్రమ సాంద్రత పద్ధతులకు ప్రాధాన్యతనిస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థ కూడా సాంకేతికంగా వెనుకబడి ఉంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలలో ఆధునిక, సంప్రదాయ పరిజ్ఞానం రెండు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. సాంకేతిక వెనుకబాటుతనం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది.
10) అధిక జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరుకు నివసించే సగటు జనాభాను జనసాంద్రత అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక జనాభా ఉండటం వల్ల జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక జనసాంద్రత వల్ల సహజ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది.
11) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ: అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉన్నాయి. ఒకే ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు అనగా ఆధునిక రంగం మరియు సాంప్రదాయ రంగం ప్రక్కప్రక్కనే ఉండటాన్ని ద్వంద్వత్వం అంటారు. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థలు మూడు రకాలు. 1. సాంకేతిక ద్వంద్వత్వం 2. సామాజిక ద్వంద్వత్వం 3. ఆర్థిక ద్వంద్వత్వం. భారత ఆర్థిక వ్యవస్థలో కూడా సాంకేతిక ద్వంద్వత్వం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం, అధునాతన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండగా, వ్యవసాయ రంగం పురాతన ఉత్పత్తి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నది.
12) ధరల అస్థిరత్వం: ధరల అస్థిరత్వం అభివృద్ధి చెందుతున్న దేశాల మౌళిక లక్షణం. ఈ దేశాలలో నిత్యావసర వస్తువుల కొరత వలన మరియు వినియోగం, ఉత్పత్తి మధ్య ఉండే అంతరం వల్ల ధరల అస్థిరత్వం కొనసాగుతూ ఉంటుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలను వివరించండి.
జవాబు:
1960వ వరకు ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే భావనలను పర్యాయపదాలుగా వాడడం జరిగింది. అయితే హిక్స్, షుంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలకు వేర్వేరు అర్థాలను ఇస్తూ, వాటి మధ్య స్పష్టమైన తేడాలను సూచించారు. వారి అభిప్రాయం ప్రకారం ఆర్థికవృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాల సమస్యలకు సంబంధించినది కాగా, ఆర్థికాభివృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాల సమస్యలను అధ్యయనం చేస్తుంది.
ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలు:
ఆర్థికవృద్ధి
- ఆర్థికవృద్ధి ఒక దేశం యొక్క వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది.
- ఆర్థికవృద్ధి అనే ప్రక్రియ ఏకముఖమైనది.
- ఆర్థికవృద్ధి సంకుచితమైన భావన.
- ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఉదా: అమెరికా, కెనడా మొదలైనవి.
- ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థికవృద్ధిని సాధించ వచ్చును.
- ఇది ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మక మార్పులను సూచించును.
- ఆర్థికవృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ సంపద పంపిణీని తెలియజేయదు.
- ఆర్థికవృద్ధిని మానవుని శారీరక పెరుగుదలతో పోల్చవచ్చు.
- దీనిని కొలవగలము.
ఆర్థికాభివృద్ధి
- ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధితో పాటు, సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పులను తెలియజేయును.
- ఆర్థికాభివృద్ధి అనే ప్రక్రియ బహుముఖమైనది.
- ఆర్థికాభివృద్ధి విస్తృతమైన భావన.
- ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఉదా: భారతదేశం, చైనా మొదలైనవి.
- ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థికాభివృద్ధిని సాధించలేము.
- ఇది ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులను సూచించును.
- ఆర్ధికాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ సంపద పంపిణీని తెలియజేయును.
- ఆర్థికాభివృద్ధిని మానవ సంపూర్ణ అభివృద్ధితో పోల్చవచ్చు.
- దీనిని కొలవలేము.
ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను తెలియజేయండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి అనేది బహుముఖమైన ప్రక్రియ. సహజ వనరులు, మూలధనం, మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల వైఖరులు, దేశంలోని రాజకీయ పరిస్థితులు వంటి అంశాలచే ఆర్థికాభివృద్ధి ప్రభావితం చేయబడుతుంది. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను ఈ క్రింది విధంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు.
I. సహజ వనరులు: ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశంలో లభించే సహజ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. జాకబ్ వైనర్, విలియం జె. భౌమాల్ మరియు డబ్ల్యూ ఎ. లూయిస్ మొదలైన ఆర్థికవేత్తలు దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడంలో సహజ వనరుల పాత్ర ముఖ్యమైనదని, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోగలిగినప్పుడే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.
II. ఆర్థిక అంశాలు:
1) మూలధన కల్పన: ఒక దేశ ఆర్థికాభివృద్ధి గతిని మూలధన కల్పన నిర్ణయిస్తుంది. ఆర్థిక మరియు సాంఘిక అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి మూలధన లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థికాభివృద్ధి సాధించుటకు మూలధన కొరత ముఖ్యమైన అవరోధంగా ఉంది.
2) విక్రయం కాగల మిగులు: గ్రామీణ ప్రాంతాల ప్రజల కనీస అవసరాలు తీరిన తరువాత మార్కెట్లో అమ్మకానికి లభ్యమయ్యే వ్యవసాయ రంగంలోని అదనపు ఉత్పత్తిని విక్రయం కాగల మిగులు అంటారు. ఈ విక్రయం కాగల మిగులు గ్రామీణ ప్రాంతాలలో ఆదాయాలను పెంచి తద్వారా వస్తు సేవల డిమాండ్ను ప్రేరేపిస్తుంది. ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాల పురోగతి వ్యవసాయ రంగంలోని విక్రయం కాగల మిగులుపై ఆధారపడి ఉంటుంది.
3) విదేశీ వ్యాపారం: విదేశీ వ్యాపారం, శ్రమ విభజన, ప్రత్యేకీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది వనరుల సమర్థవంతమైన ఉపయోగానికి దారితీస్తుంది. అంతేకాకుండా విదేశీ వ్యాపారం వస్తు సేవల మార్కెట్లను విస్తృతపరచి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత పెరగడానికి దోహదపడుతుంది. అందుచేత విదేశీ వ్యాపారం ఆర్థికాభివృద్ధికి ఒక ఇంజను వంటిదని ఆర్థికవేత్తలు అభివర్ణించారు.
III. ఆర్థికేతర అంశాలు:
1) మానవ వనరులు: మానవ వనరులను ఏ దేశం సక్రమంగాను, సమర్థవంతంగాను వినియోగించుకుంటారో, ఆ దేశం త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంది.
2) సాంకేతిక ప్రగతి: సాంకేతిక ప్రగతి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడమే కాకుండా సామాజిక వాతావరణంలో మార్పులను తీసుకొస్తుంది. దీనివల్ల వనరులు సక్రమంగా వినియోగింపబడి ఉత్పత్తి వ్యయం తగ్గి, వివిధ రంగాలలో గరిష్ట ఉత్పత్తిని సాధించడానికి దోహదపడును.
3) సామాజిక వ్యవస్థ: ఒక దేశంలోని అభివృద్ధి ప్రక్రియలో ఆ దేశంలోని అన్ని వర్గాల ప్రజల చురుకైన భాగస్వామ్యం అవసరం. లోపభూయిష్టమైన సామాజిక నిర్మాణం వలన అభివృద్ధి ఫలాలు ధనికులకు మాత్రమే చెందుతున్నట్లు అనుభవాలు సూచిస్తున్నాయి. దీనివలన ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి.
4) అవినీతి: అభివృద్ధి చెందుతున్న దేశాలలో వివిధ స్థాయిలలో గల అదుపులేని అవినీతి అభివృద్ధి ప్రక్రియకు ఆటంకంగా తయారయ్యింది. పన్నుల ఎగవేత, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అధికారులు కుమ్మక్కు మొదలైన అంశాలు దేశ అభివృద్ధి ప్రక్రియకు ఆటంకాలుగా ఉన్నాయి.
5) అభివృద్ధి చెందాలనే కోరిక: అభివృద్ధి చెందాలనే ప్రజల కోరిక ఆదేశ అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. రిచర్డ్. W. గిల్ ఉద్దేశ్యం ప్రకారం “ఆర్థికాభివృద్ధి అనేది ఒక యాంత్రికమైన ప్రక్రియ కాదు. అది మానవుని యొక్క ప్రయత్నం. ఆర్థికాభివృద్ధి దేశంలోని ప్రజల నైపుణ్యం, నాణ్యత, దృక్పధాలపై ఆధారపడి ఉంటుంది”.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆర్థికవృద్ధి.
జవాబు:
ఆర్థికవృద్ధి అనేది దేశంలోని వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచించును. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది.
ప్రశ్న 2.
ఆర్థికాభివృద్ధి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధితో పాటు సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పులను తెలియజేయును. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది.
ప్రశ్న 3.
తలసరి ఆదాయం.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే దానిని తలసరి ఆదాయం అంటారు.
తలసరి ఆదాయం = జాతీయాదాయం / దేశ జనాభా
ప్రశ్న 4.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రణాళికా సంఘం ఇచ్చిన నిర్వచనం.
జవాబు:
వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అంటే ఒక ప్రక్క పూర్తిగా ఉపయోగించని లేదా తక్కువ ఉపయోగించిన మానవ వనరులు, మరో ప్రక్క పూర్తిగా వినియోగించని సహజ వనరులు కలిసి ఉంటాయి.
ప్రశ్న 5.
మానవ మూలధనం.
జవాబు:
విద్య, ఆరోగ్యం, పరిశోధన, శిక్షణ మరియు నైపుణ్యాల కల్పనపై చేసే వ్యయాన్ని మానవ మూలధనం అంటారు.
ప్రశ్న 6.
ప్రపంచ దేశాల వర్గీకరణకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిర్వచనం.
జవాబు:
తలసరి స్థూల జాతీయాదాయం ఆధారంగా ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ప్రపంచ దేశాలను ఈ క్రింది విధంగా వర్గీకరించినవి.
- తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు. తలసరి GNI 1.045 డాలర్లు లేదా అంతకంటే తక్కువ తలసరి GNI ఉన్న దేశాలు.
- మధ్య ఆదాయం గల దేశాలు. తలసరి GNI 1.046 డాలర్లు కంటే ఎక్కువగాను, 12,746 డాలర్ల కంటే తక్కువగా ఉన్న దేశాలు.
- అధిక ఆదాయం గల దేశాలు. తలసరి GNI 12,747 డాలర్ల కంటే ఎక్కువగా ఉండే దేశాలు.
ప్రశ్న 7.
ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. [Mar ’17, ’16]
జవాబు:
బెంజిమిన్ హెగిన్స్ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనే భావనను ప్రవేశపెట్టారు. ఒకే ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు అనగా ఆధునిక రంగం మరియు సంప్రదాయ రంగం ప్రక్క ప్రక్కనే ఉండటాన్ని ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు.