Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి Textbook Questions and Answers.
AP Inter 2nd Year Economics Study Material 2nd Lesson జనాభా, మానవ వనరుల అభివృద్ధి
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జనాభా పరిణామ సిద్ధాంతం వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధి మరియు జనన మరణాల రేటును బట్టి ఈ సిద్ధాంతాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. ప్రతి దేశంలో ఈ క్రింది మూడు దశలను అనుసరించి జనాభా వృద్ధిరేటు ఉంటుంది.
1) మొదటి దశ: ఈ దశలో ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయ ప్రాధాన్యతగల ఆర్థిక వ్యవస్థలో జననాల రేటు, మరణాల రేటు అధికంగా ఉంటాయి. పోషకాహార లోపం, పరిశుభ్రత, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల మరణాల రేటు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా, నిరక్షరాస్యత అధికంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన లోపం, బాల్య వివాహాలు, సాంఘీక మూఢనమ్మకాలు, సంప్రదాయము మొదలైన వాటివల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది. ఈ దశలో అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు సమానంగా ఉంటాయి. కాబట్టి జనాభా వృద్ధిరేటు అధికంగా ఉండదు. భారతదేశంలో 1921కి పూర్వము ఈ దశ ఉన్నది.
2) రెండవ దశ: ఈ దశలో ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలు మెరుగుపడతాయి. తత్ఫలితంగా ప్రజల ఆదాయం పెరిగి ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి. ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ప్రాణరక్షణ ఔషధం మరియు మందుల లభ్యత వలన మరణాల రేటు తక్కువగా ఉంటుంది. మరణాల రేటు క్రమంగా క్షీణిస్తూ జననాల రేటు అదే విధంగా కొనసాగడం వలన జనాభా పెరుగుదల వేగంగా పెరుగుతుంది. దీనినే జనాభా విస్ఫోటనం అంటారు. ప్రస్తుతం భారతదేశంలో జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం రెండవ దశలో ఉన్నది. మనదేశంలో 1921 నుంచి ఈ దశ ప్రారంభం అయినది.
3) మూడవ దశ: ఈ దశలో పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ, అక్షరాస్యత అభివృద్ధి చెందటం వలన జనాభా పెరుగుదల సమస్య నుంచి దేశం బయటపడుతుంది. అభివృద్ధి అధిక స్థాయిలో ఉండడం, జీవన వ్యయం పెరగడం వలన గృహసమస్యలు పెరిగి జీవన విధానం కష్టంగా మారి ప్రజలు కుటుంబ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. ఈ మార్పు మొదట పట్టణ ప్రాంతాలలో మరియు అధిక ఆదాయ వర్గాలలో మొదలై క్రమంగా గ్రామాలకు విస్తరించింది. దీనివలన జనన రేటు ఒక్కసారిగా తిరోగమనం చెందుతుంది. దాని వలన జనన మరణ రేటులో సమతౌల్యత ఏర్పడుతుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు ఈ దశలో ఉన్నాయి.
ప్రశ్న 2.
జనాభా పెరుగుదల వలన లాభనష్టాలను వివరించండి.
జవాబు:
ఆర్థికాభివృద్ధిలో జనాభా మరియు మానవ వనరులకు అధిక ప్రాధాన్యత ఉంది. మానవులు ఉత్పత్తికి దోహదపడే సాధనాలే కాకుండా ఆ ఉత్పత్తిని వినియోగించేది కూడా మానవులే. భారతదేశం మరియు మూడవ ప్రపంచదేశాలు జనాభా విస్ఫోటన దశలో ఉన్నాయి.
భారతదేశంలో జనాభా అంటే ఒక నిర్ణీత కాలంలో దేశంలో నివసించే ప్రజలు. జనాభా దేశాభివృద్ధికి ఎంతో అవసరం.
జనాభా వలన లాభాలు:
- జనాభా వస్తువుల ఉత్పత్తికారి శ్రామిక శక్తిని సమకూరుస్తుంది.
- జనాభా వస్తుసేవలకు మార్కెట్ను కల్పిస్తుంది.
- జనాభా నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది.
- జనాభా వలన శ్రమ విభజన మరియు ప్రత్యేకీకరణ సాధ్యపడుతుంది,
నష్టాలు:
- జనాభా జీవన విధానం మీద ఒత్తిడిని పెంచుతుంది.
- అధిక జనాభా వలన నిరుద్యోగిత పెరుగుతుంది.
- జనాభా వలన సామాజిక అవసరాలైన ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులపై ఎక్కువ భారం పడుతుంది.
- అధిక జనాభా వలన వస్తువియోగం పెరుగుతుంది. పొదుపు మరియు మూలధన సంచయనము తగ్గుతుంది.
- జనాభా అనుత్పాధిక శ్రామికులను పెంచుతుంది.
ప్రశ్న 3.
భారతదేశంలో జనాభా పెరగడానికి గల కారణాలను తెలియజేయండి. [Mar ’16]
జవాబు:
భారతదేశంలో జననాల రేటు అధికంగా ఉన్నది. కుటుంబ నియంత్రణ పథకాలను పూర్తిగా ప్రజలు నమ్మినపుడే, జననాల రేటు తగ్గడానికి వీలుపడుతుంది. గత 50 సంవత్సరాల్లో జననాల రేటు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గకపోవడానికి ఈ క్రింది ఆర్థిక, సాంఘిక కారణాలుగా చెప్పవచ్చు.
1) ఆర్థిక కారణాలు: ఒక దేశం యొక్క ఆర్థిక వాతావరణం ప్రజల ప్రవర్తనపై చాలా వరకు ప్రభావాన్ని కలిగి వుంటుంది. వృత్తులవారీగా జనాభా విభజన, నగరీకరణ, పేదరికం దేశంలోని జననాల రేటును ప్రభావితం చేస్తాయి.
ఎ) వ్యవసాయరంగ ప్రాధాన్యత అధికంగా ఉండడం: వ్యవసాయరంగ సంబంధిత సమాజంలో పిల్లలను ఆర్థికభారంగా పరిగణించరు. అధిక జనాభా వ్యవసాయరంగంపై ఆధారపడి వున్న దేశంలో ఉత్పత్తి కార్యకలాపాల్లో ప్రాచీన పద్ధతులను సాధారణంగా ఉపయోగిస్తారు. వ్యవసాయ ఉత్పత్తి కార్యకాలాపాల్లో శ్రామికుల అవసరం ఉంటుంది.
బి) తక్కువ నగరీకరణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యత: దేశంలో పారిశ్రామికీకరణం వేగవంతంగా చోటుచేసుకోకపోవడం. నగరీకరణ చాలా తక్కువగా ఉన్నది. మన దేశంలో పెరిగిన నగరీకరణ జననాల రేటు తగ్గుదలకు సంబంధించిన సాంఘిక మార్పులను తీసుకురాలేదు.
సి) పేదరికం: మన దేశంలోని పేదరికం జననాల రేటుకు దోహదం చేస్తుంది. తక్కువ ఆదాయ స్థాయి కలిగిన ప్రజలు అదనపు శిశువును పొందడం వలన వచ్చే ఆదాయం, ఆ శిశువును పెంచడానికి అయ్యే ఖర్చు కంటే అధికం అని భావిస్తారు. పేద ప్రజలకు ఇతర ఆర్థిక ఆస్తులు ఏమీ ఉండవు కాబట్టి తమ శ్రమనే ఆస్తిగా పరిగణిస్తారు. కాబట్టి అధిక కుటుంబ సభ్యులు ఉంటే అధిక ఆదాయం పొందవచ్చని భావిస్తారు.
2) సాంఘిక కారణాలు:
ఎ) వివాహం తప్పనిసరి: భారతదేశం మతపరంగా, సామాజికంగా ప్రతి వ్యక్తికి వివాహం అన్నది తప్పనిసరి. ప్రతీ తల్లి, తండ్రి తమ పిల్లలకు వివాహం చేయడం సామాజికపరమైన బాధ్యతగా స్వీకరిస్తారు. స్త్రీల అక్షరాస్యత పెరిగినప్పుడు వివాహం తప్పనిసరికాకపోవచ్చు. కాని అక్షరాస్యత తక్కువగా ఉన్న సమాజంలో ఆశించిన ఫలితం రాకపోవచ్చు.
బి) తక్కువ వయస్సులో వివాహం: మన దేశంలో తక్కువ వయస్సులో వివాహం చేసుకోవడం జననాల రేటు అధికంగా ఉన్నది అని చెప్పవచ్చు. కాని భారతదేశంలో స్త్రీల సగటు వివాహ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రసూతి రేటు అధికంగా ఉండటం వల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది.
సి) మతపరమైన సాంఘిక మూఢనమ్మకాలు: చాలామంది భారతీయుల్లో మతపరమైన, సామాజికమైన మూఢనమ్మకాల వల్ల పిల్లల్ని కనడం అనేది తమ ఆర్థిక పరిస్థితులు గౌరవం చేకూరినట్లు భావిస్తారు. హిందువుల మత సాంప్రదాయం ప్రకారం కుమారుడు కర్మకాండలు నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువు కుమారున్ని కోరుకుంటారు.
డి) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. ఆధునిక సమాజంలో వైయుక్తిక కుటుంబాల ప్రాధాన్యత పెరుగుతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, యుక్త వయసులోని భార్యభర్తలు పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇ) తక్కువ అక్షరాస్యత: 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో అక్షరాస్యత 74.04 శాతం ఉన్నది. పురుషులలో 82.14 శాతం ఉంటే, స్త్రీలలో 65.46 శాతమే అక్షరాస్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు స్త్రీలలో సాధించిన ‘అక్షరాస్యత ఎక్కువ శాతం నగరాలలోనే గుర్తించడం జరిగింది. నిరక్షరాస్యత స్త్రీలలో ఎక్కువగా ఉండడం వలన జననాల రేటు అధికంగా ఉన్నది.
ప్రశ్న 4.
జనాభా పెరుగుదల నియంత్రణ చర్యలు ఏమిటి ?
జవాబు:
జనాభా పెరుగుదల నివారణ చర్యలు: జనాభా పెరుగుదల ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన సమస్యగా భావిస్తాము. అందువల్ల జనాభా పెరుగుదలను నియంత్రించవలసిన అవసరం ఎంతయినా ఉంది. ప్రస్తుతం జనాభా సమస్యలను పరిష్కరించడానికి మూడు రకాలైన చర్యలను తీసుకోవలసి ఉంది.
1) ఆర్థిక చర్యలు: భారతదేశంలో జనాభా ఆశించిన విధంగాకాని, తగ్గించడానికి సాధ్యం అయ్యే విధంగా కాని లేనటువంటి పెద్ద పరిణామంతో ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టి, ఆర్థిక చర్యల ద్వారా ప్రస్తుత జనాభా సమస్యను పరిష్కరించవలసి ఉన్నది.
- పారిశ్రామిక రంగాన్ని విస్తరించడం: వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న కుటుంబాల కంటే పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న కుటుంబాల పరిమాణం చిన్నదిగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందిచినప్పటికీ, కుటుంబ కమతాల్లో పనిచేస్తూ ఉంటారు. మన దేశంలో భూకమతాలు లాభదాయకంగా లేవు కాబట్టి, వ్యవసాయదారులు జీవనాధార వ్యవసాయంను కొనసాగిస్తారు. పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశం పొందటం చాలా కష్టమైన పని కాబట్టి పారిశ్రామిక రంగంలోని శ్రామికులు చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు. జీవన ప్రమాణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కుటుంబ పరిమాణాన్ని నియంత్రించుకుంటారు.
- నగరాలలో ఉద్యోగావకాశాల కల్పన: దేశంలో పారిశ్రామికీకరణ వలన నగర కేంద్రాలు పెరుగుతాయి. నగరాలలో ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లైతే, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతాయి. తత్ఫలితంగా నగరాలలో జనాభా పెరిగి పిల్లల పెంపకం, సమస్యలు ఉత్పన్నమై చిన్న కుటుంబాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అందువలన పారిశ్రామికీరణకు అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది.
- ఆదాయాన్ని సమానంగా పంపిణీ చేయడం మరియు పేదరిక నిర్మూలన: పేద ప్రజలకు తమ కుటుంబ పరిమాణాలపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పేద ప్రజల కనీస జీవన సదుపాయం పొందడానికి ఎప్పుడైతే ఇష్టపడతారో, అప్పుడు కుటుంబ పరిమాణంపై వారి ఆలోచనలు మారతాయి. ఇలా మార్పు వస్తే ప్రజలకు కుటుంబంపై శ్రద్ధ పెరుగుతుంది. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పరిమిత కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు.
2) సాంఘిక చర్యలు: జనాభా విస్ఫోటనం అనేది, ఆర్థిక సమస్యగా కంటే, సాంఘిక సమస్యగా భావిస్తాం. దీనికి అనేక రకాలైన సాంఘిక కారణాలు చెప్పుకోవచ్చు. నిరక్షరాస్యతా, మూఢనమ్మకాలు, ఆచార సాంప్రదాయాలు మొదలైన కారణాలు మనదేశంలోని జనాభా విజృంభనకు దోహదం చేస్తున్నాయి.
- విద్య: జననాల రేటును తగ్గించడంలో విద్య చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివాహం, కుటుంబ పరిమాణం, పిల్లల సంఖ్య మొదలైన వాటిని ప్రజలలో మార్పును తీసుకువస్తుంది. భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను విద్య మార్చి వేసి ప్రజలను కుటుంబ నియంత్రణ వైపు ప్రభావితులని చేస్తుంది. కాబట్టి గ్రామాలలో, నగరాలలో స్త్రీల అక్షరాస్యత వృద్ధిని పెంపొందించడానికి అత్యంత ప్రాధాన్యతని ఇవ్వాలి.
- స్త్రీల హోదాను మెరుగుపరచడం: భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులు సమానం కాని ఆర్థికంగా, సామాజికంగా స్త్రీలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సమాజంలో స్త్రీల గౌరవం పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతమంది పిల్లలకు జన్మనివ్వాలి అనే విషయంలో స్త్రీలకు స్వాతంత్ర్యం ఉన్నప్పుడే, జననాల సంఖ్య తగ్గించే అవకాశం ఉంటుంది.
- కనీస వివాహ వయస్సును పెంచడం: సామాజికంగా, చట్టపరంగా, విద్యాపరంగా కనీస వివాహ వయస్సును తప్పకుండా పెంచవలసిన ఆవశ్యకత ఉంది. 1903 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, స్త్రీలకు 15 సంవత్సరాలుగా నిర్ణయించారు. జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరంలో వివాహ వయస్సును సవరించి, పురుషులకు 25 సంవత్సరాలు, స్త్రీలకు 21 సంవత్సరాలు వివాహ వయస్సుగా నిర్ధారించారు. దీని ద్వారా జనాభా వృద్ధిని నియత్రించాలి అని ఆశించారు.
3) కుటుంబ నియంత్రణ పథకాలు: ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలను నియంత్రించడంలో కుటుంబ నియంత్రణ పథకాల ప్రాధాన్యతను గుర్తించారు. మన దేశంలో వివాహిత స్త్రీలు 41 శాతం గర్భనిరోధకాలను ఉపయోగిస్తే చైనా దేశంలో 85 శాతం స్త్రీలు వినియోగిస్తున్నారు. కాబట్టి మనదేశంలో జననాల రేటు (26: 1000) అధికంగా
వుంది.
- ప్రభుత్వ సమాచార పథకం: ఎలాంటి కుటుంబ నియంత్రణలను పాటించని వావాహిత జంటలకు ప్రభుత్వ సమాచార పథకం క్రింద కుటుంబ నియంత్రణ ప్రయోజనాలను తెలియచేయడం, సమాచార సాధనాలైన, సినిమా, రేడియో, పోస్టర్లు, టెలివిజన్లు, వార్తాపత్రికలు మొదలైన వాటి ద్వారా కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యాన్ని ప్రచారం చేస్తుంది.
- ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు: కుటుంబ నియంత్రణ పాటించే ప్రజలకు ప్రభుత్వం అనేక రకాలైన పథకాల ద్వారా వివిధ రకాలైన ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. నగదు బహుమతుల ద్వారా ప్రజలు ముందుకు రాకపోతే కుటుంబ నియంత్రణను పాటించని వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం, కుటుంబ నియంత్రణను నిరాకరించిన వారికి ప్రభుత్వం కల్పించే కొన్ని సదుపాయాలను తొలగించినట్లయితే జననాల రేటు తగ్గి జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు.
- కుటుంబ నియంత్రణ కేంద్రాలు: కుటుంబ నియంత్రణ పథకాలలో నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరి, ప్రభుత్వం ఈ కేంద్రాలలో అనేక రకాలైన వైద్య సదుపాయాలను కల్పించి కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఈ కేంద్రాలతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లో, నగరాల్లో గర్భనిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి జనాభా పెరుగుదలను నియంత్రిస్తుంది.
- పరిశోధన: సమాచార ప్రేరణ, జనాభా పునరుత్పత్తి, ప్రసూతి రేటు నియంత్రణ మొదలైన వాటికి కుటుంబ నియంత్రణ పథకాల్లో అధిక ప్రాధాన్యత కల్పించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం పరిమిత వనరులతో కుటుంబ నియంత్రణపై పరిశోధనలు చేసి గరిష్ట ప్రయోజనం పొందటానికి ప్రయత్నిస్తుంది.
ప్రశ్న 5.
జనాభా విధానం (2000)లోని ముఖ్యాంశాలు ఏవి ?
జవాబు:
జాతీయ జనాభా విధానాన్ని 6-4-1976న ప్రవేశపెట్టినంత వరకు మన దేశంలో కుటుంబ నియంత్రణ పూర్తిగా స్వచ్ఛందంగా ఉండేది. సత్వర ఆశయానికి సంబంధించిన, ఆరోగ్య అవస్థాపన సౌకర్యాలు కావాల్సిన గర్భనిరోధక అంశాలను కల్పిస్తు, ప్రాథమిక పునరుత్పత్తి, శిశు ఆరోగ్యాన్ని సంఘటిక పరచి వైద్య సేవలను కల్పించడం, దీని 2010 సంవత్సరం నాటికి మొత్తం ప్రసూతి రేటును సాధ్యమైనంత వరకు తగ్గించడం. 2045 సంవత్సరం నాటికి స్థిరమైన జనాభా వృద్ధిని సాధించడం దీర్ఘకాలిక ఆశయంగా పెట్టుకున్నారు. జాతీయ జనాభా విధానాన్ని (2000) ఈ క్రింది లక్ష్యాలతో రూపొందించారు.
- ప్రసూతి మరణాల రేటును 100: 100000 కు తగ్గించడం.
- శిశు మరణరేటును 30: 1000 కి తగ్గించడం.
- రోగాల బారి నుంచి రక్షించుకొనే విధంగా పిల్లల్లో వ్యాధి నిరోధకతను పెంచడం.
- 100 శాతం కాన్పులు వైద్యశాలలో జరిగేటట్లు చూడటం.
- ఎయిడ్స్, ఇతర అంటు వ్యాధుల నివారణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం.
- ఇద్దరు పిల్లల పరిమిత కుటుంబాన్ని ప్రోత్సహించడం.
- సురక్షితంగా గర్భస్రావాలు జరిగేటట్లు సదుపాయాలు కల్పించడం.
- బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం.
- 18 సంవత్సరాలలోపు స్త్రీలకు వివాహాలు జరగకుండా చూడటం.
- పేదవారిగా ఉండి, ఇద్దరు పిల్లల తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆరోగ్య బీమా సదుపాయాలను కల్పించడం.
జాతీయ జనాభా విధానం (2000) అమలు కోసం జనాభాపై జాతీయ కమీషన్ ఏర్పాటు చేశారు. ఇది జాతీయ జనాభా విధానం పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది.
ప్రశ్న 6.
భారతదేశంలోని వృత్తుల వారీగా జనాభా విభజనను వివరించండి.
జవాబు:
ఒక దేశం జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజింపబడి ఉండటాన్ని వృత్తులవారీగా జనాభా విభజన అని అంటారు. వివిధ రకాలైన వృత్తులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి:
1) ప్రాథమిక వృత్తులు: వ్యవసాయం, అడవులు, చేపల పెంపకం, జంతు సంపద, కోళ్ళ ఫారాలు, మొదలైన వాటిని ప్రాథమిక రంగంలో కలుపుతారు. ఈ రంగం ఉత్పత్తి మానవ మనుగడకు చాలా అవసరం. ఈ రంగం అధికంగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని జనాభా ఎక్కువశాతం ఈ రంగంపై ఆధారపడి ఉంటుంది.
2) ద్వితీయ వృత్తులు: వస్తువు తయారీ పరిశ్రమలు, చిన్నతరహా, కుటీర పరిశ్రమలు మరియు గనులు క్వారియింగ్ మొదలైన వాటిని ద్వితీయరంగంలో కలుపుతారు మూడవ ప్రపంచ దేశాల్లో ఈ రంగం చాలా చిన్నదిగా ఉండి తక్కువ శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తుంది.
3) సేవా వృత్తులు: వ్యాపారం, రవాణా, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, బీమా, విద్యా, ఆరోగ్యం, మొదలైనవి సేవారంగంలో కలుపుతారు. దేశంలోని సేవారంగం కార్యకలాపాలు, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం కార్యకలాపాలకు తోడ్పడుతాయి.
హాన్స్ సింగర్ ప్రకారం వ్యవసాయరంగంపై ఆధారపడి వున్న 85 శాతం శ్రామిక శక్తి మార్పు చెంది 15 శాతం మాత్రమే వ్యవసాయరంగంపై ఆధారపడి ఉంటే ఆర్థికాభివృద్ధి చోటుచేసుకున్నట్లు అనే అభిప్రాయపడ్డారు.
ప్రశ్న 7.
మానవ అభివృద్ధిని నిర్వచించి, దాన్ని ఏ విధంగా పెంపొందిస్తావు?
జవాబు:
మానవ వనరుల అభివృద్ధి – అర్థం: ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన విద్య, సామర్థ్యం, అనుభవంతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. మానవునిపై పెట్టుబడి పెడితే మానవ వనరులుగా అభివృద్ధి చెంది, మానవ అభివృద్ధికి ఉత్పాదక వనరులుగా ఉపయోగపడతారు.
చార్లెస్ ఘర్జ్ ఈ క్రింది ఐదు అంశాలు ఉపయోగపడతాయని తెలియచేశాడు.
- ఆరోగ్య సదుపాయాలు, సేవలపై వ్యయం, పెరిగితే ప్రజలు ఆయుర్థాయం, సామర్థ్యశక్తి, ఉత్సాహం పెరుగుతాయి.
- వలస వచ్చిన వ్యక్తులు, కుటుంబాలు మారుతున్న ఉద్యోగ అవకాశాలకు సర్దుబాటు కావలసి ఉంటుంది.
- ప్రాథమిక, ద్వితీయ, ఉన్నతస్థాయిలో విద్యను నిర్వహించవలసి ఉంది.
- సంస్థలు నిర్వహించిన వయోజన విద్య, విస్తరణ విద్య కార్యకలాపాలను వ్యవసాయరంగంలో ఏర్పాటు చేయవలిసి ఉంది.
- సంస్థలు ఉద్యోగస్తులకు పాత పద్ధతిలో అప్రెంటిస్ మరియు శిక్షణ కల్పించాల్సి ఉంది.
ప్రశ్న 8.
ఆర్థికాభివృద్ధిలో విద్య పాత్రను వివరించండి.
జవాబు:
1) విద్య మరియు ఆర్థికాభివృద్ధి: టొడారో, స్మిత్ ప్రకారం అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో విద్య ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. అది ఏ విధంగా అనేది ఈ క్రింది అంశాలతో వివరించవచ్చు.
- విద్యవల్ల పరిజ్ఞానం, నైపుణ్యత పెరిగి శ్రామికశక్తి యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.
- అదనంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయల స్థాపనవల్ల ఉద్యోగిత పెరుగుతుంది.
- విద్య ప్రాథమిక నైపుణ్యాలను మరియు ఆధునికంగా మెరుగైన ప్రవర్తనను అందిస్తుంది.
- ప్రభుత్వ సేవల్లో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మరియు వివిధ వృత్తుల్లో విద్యవల్ల సమర్థవంతమైన విద్యానాయకులు వస్తారు.
2) విద్య మరియు ఆదాయ అసమానతల తగ్గింపు: అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యకు, ఆర్థికాభివృద్ధికి దగ్గర సంబంధం ఉన్నప్పటికీ, పేదరికం, ఆదాయం అసమానతలు తగ్గించడానికి, విద్యకు గల సంబంధాన్ని చెప్పడం కష్టం. సాధారణంగా విద్య ద్వారా మానవ వనరుల సమతుల్యాన్ని పెంపొందించవచ్చు మరియు పేద ప్రజల, బలహీన వర్గాల ఆర్థికస్థోమతను కూడా మెరుగుపరచవచ్చు. పేదపిల్లలు నిరక్షరాస్యతతో కూడుకున్న ఇంటి పరిసరాలు మరియు పౌష్టికాహారలేమి, వారి మనస్సులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ధనవంతులైన పిల్లలు సాంఘిక సంబంధాలు, పలుకబడివల్ల సాపేక్షికంగా మెరుగైన ఉపాధి పొందుతారు.
3) విద్య గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధిలో విద్య అనేక విధాలుగా తోడ్పడుతుంది. గ్రామీణ ప్రజల పరిజ్ఞానాన్ని పెంపొందించి అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపుతుంది. వ్యవసాయదారులు విద్యావంతులైతే నూతన వ్యవసాయ సాంకేతికాలు, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను త్వరగా అర్థం చేసుకోగలరు. విద్యతో ప్రజల సామర్థ్యాలను, ప్రవర్తనను మార్చుకొని కుటుంబ సౌఖ్యతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. శ్రామికులు ఎక్కువగా ఉన్న మన దేశంలో విద్య ద్వారా ప్రజల నైపుణ్యత పేరిట కుటీర పరిశ్రమలను స్థాపించుకొని స్వయం ఉపాధి పొందుతారు.
4) విద్య మరియు కుటుంబ నియంత్రణ: ప్రజలను ఆధునికీకరణ, విప్లవాత్మక మార్పుల వైపు ఆలోచించే విధంగా విద్య తోడ్పడుతుంది. ఇది కుటుంబ పరిమాణాన్ని నియంత్రించుకొని జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడానికి సహకరిస్తుంది. కాబట్టి దీర్ఘకాలంలో విద్య, కుటుంబ సంక్షేమం పెంపొందిస్తుంది. స్త్రీలలో అక్షరాస్యత పెరగడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు లభ్యంకావడం వల్ల ప్రసూతి రేటు తగ్గి జననాల రేటు తగ్గుతుంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు పోషణ కష్టం అవుతుంది. కాబట్టి పరిమిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు.
5) విద్య వలన ఇతర ప్రయోజనాలు:
- అధిక విద్యను అభ్యసించినవారికి ఆదాయ వనరులు పెరుగుతాయి.
- విద్యావంతులైన ప్రజల ఆదాయ వనరులు భావితరాల వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది.
- నైపుణ్యవంతమైన మానవ వనరులు ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేస్తాయి.
- విజ్ఞాన శాస్త్రంలో, సాంకేతిక రంగంలో పరిశోధనలకు కావలసిన వాతావరణాన్ని కల్పిస్తుంది.
- మానవ ప్రవర్తన న్యాయబద్ధంగా మారి సంక్షేమ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారు.
ప్రశ్న 9.
ఆర్థికాభివృద్ధిలో ఆరోగ్యం పాత్రను వివరించండి.
జవాబు:
శ్రామికుల సామర్థ్యం వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం సరిగ్గా లేక తరచుగా రోగాలకు గురి అవుతుంటే వారి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా పనిచేయలేరు. శ్రామికుల ఆరోగ్యం పెరిగితే జాతీయ ఉత్పత్తి దానంతట అదే పెరుగుతుంది.
సంపూర్ణ ఆరోగ్యానికి ఈ క్రింది రెండు అంశాలు చాలా అవసరం.
- సంతులిత పౌష్టికాహారం
- వైద్యపరమైన జాగ్రత్త
60 సంవత్సరాల కృషి ఫలితం వల్ల ఆరోగ్య ప్రమాణాల పెరుగుదలలో చాలా వరకు విజయం సాధించాము. మశూచి, ప్లేగు మొదలైన వాటిని నివారించాం. మలేరియా, క్షయ, కలరా మొదలైన వ్యాధులను చాలావరకు నియంత్రిస్తున్నందువల్ల శిశుమరణాలు తగ్గుతూ ఆయుర్ధాయం పెరుగుతుంది.
12వ ప్రణాళికలో ఆరోగ్య లక్ష్యాలు 2016 – 2017.
- ప్రసూతి మరణ రేటును (MMR) 1,00,000 కు తగ్గించడం.
- శిశుమరణ రేటు (IMR)ని 1000కు 19 తగ్గించడం.
- మొత్తం ప్రసూతి రేటు (TFR)ని 2.1కి తగ్గించడం.
- పరిశుభ్రమైన త్రాగునీరు అందరికీ అందించడం.
- పౌష్టికాహార లోపాన్ని మూడు (3) సంవత్సరాల పిల్లల్లో 2015 నాటికి 29 శాతం, 2017 నాటికి 27%కి తగ్గించడం.
- స్త్రీలల్లో, బాలికల్లో రక్తహీనత (ANEMIA) 28 శాతం వరకు తగ్గించడం.
- స్త్రీ, పురుషుల నిష్పత్తి వయస్సును 0-6 సంవత్సరములు 914 నుండి 935 వరకు పెంచడం.
ప్రశ్న 10.
మానవ అభివృద్ధిని లెక్కించడంలో వివిధ సూచికలు ఏమిటి ?
జవాబు:
వర్థమాన కాలంలో స్థూల జాతీయోత్పత్తికి ప్రత్యామ్నాయంగా మానవ అభివృద్ధి సూచికను ఆధారంగా చేసుకొని ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని అంచనా వేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం UNDP తయారుచేసిన మొదటి మానవ అభివృద్ధి రిపోర్టు. మహబూబ్-ఉల్-హక్ నాయకత్వంలో 1990 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దీనిని విస్తరించి దానికి సంబంధించిన అనుబంధ సూచికలను, లింగ సంబంధిత అభివృద్ధి సూచిక (GDI) లింగ అధికారికి కొలమానం (GEM) మరియు మానవ పేదరిక సూచిక (HPI) లను 1997 సంవత్సరంలో UNDP ప్రవేశపెట్టింది.
మానవ అభివృద్ధి సూచిక మూడు రకాలైన మానవ అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక సగటు అంశాలను లెక్కిస్తుంది.
- దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆయుర్దాయం ద్వారా అంచనా వేస్తుంది.
- పరిజ్ఞానాన్ని వయోజన విద్య ద్వారా అంచనా వేయించడం జరుగుతుంది.
- ఉన్నత జీవన ప్రమాణాన్ని, అమెరికా డాలర్లతో స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి ద్వారా అంచనా వేయడం. మానవ
అభివృద్ధి సూచికకు అంచనా వేసే ముందు మూడు అంశాలతో ప్రతి దానికి ఒక దిశను నిర్ణయించి, ప్రతి సూచికకు కనీస విలువను, గరిష్ట విలువలకు కల్పిస్తారు.
ప్రతి అంశం ప్రదర్శనను 0 నుంచి 100 మధ్య విలువలను ఇచ్చి ఈ క్రింది సూత్రం ద్వారా అంచనా వేస్తారు.
కొన్ని దేశాలను ఎన్నుకొని 2014 సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచికను అంచనా వేసి దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించింది.
- మానవ అభివృద్ధి సూచిక విలువ 0.8 కంటే అధికంగా ఉన్న వాటిని అత్యధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
- మానవ అభివృద్ధి సూచిక విలువ 0.7 నుంచి 0.8 ఉన్న వాటిని అధిక మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
- మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 నుంచి 0.7 ఉన్న వాటిని మధ్యస్థ మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను,
- మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 కంటే తక్కువగా ఉన్న వాటిని తక్కువ మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను వర్గీకరించింది.
లింగ సంబంధిత అభివృద్ధి సూచిక:
లింగ సంబంధిత అభివృద్ధి సూచిక స్త్రీ – పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మూడు అంశాలు ఇమిడి ఉన్నాయి.
- స్త్రీల ఆయుర్ధాయం
- వయోజన స్త్రీల అక్షరాస్యత, స్థూల నమోదు నిష్పత్తి
- స్త్రీల తలసరి ఆదాయం
లింగ సమానత్వం, అసమానతలు లేకపోతే HDI, GDI విలువలు సమానంగా ఉంటాయి. కాని లింగపరమైన అసమానతలు ఉంటే GDI విలువ HDI విలువ కంటే తక్కువ ఉంటుంది. GDI, HDI విలువల మధ్య బేధం అధికంగా ఉంటే స్త్రీ పురుషుల వ్యత్యాసం అధికంగా ఉంటుంది.
లింగసాధికార కొలమానము (GEM): మానవ అభివృద్ధి రిపోర్టు లింగసాధికారక కొలమానమును 1995 సంవత్సరంలో ప్రవేశపెట్టినది. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీల యొక్క భాగస్వామ్యమును GEM తెలియజేస్తుంది. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీ, పురుషుల అసమానతను, స్త్రీల సాధికారతను దీనిద్వారా అంచనా వేస్తారు. GDI |ద్వారా
లింగపరమైన అసమానతలను లెక్కిస్తే GEM ద్వారా ఈ క్రింది అంశాలను లెక్కిస్తారు.
- రాజకీయ, ఆర్థిక నిర్ణయాల్లో స్త్రీలు పాల్గొనడం.
- ఆర్థిక, రాజకీయ అంశాల్లో స్త్రీల భాగస్వామ్యం (లింగభేదం) మరియు
- స్త్రీల సాధికారిత.
మానవ అభివృద్ధి రిపోర్టు 75 దేశాల GEM ను అంచనా వేసింది. మొదటి నాలుగు స్థానాలను ఐరోపా దేశాలు ‘ ఆక్రమించుకున్నాయి. అవి నార్వే, స్వీడన్, ఐస్లాండ్, డెన్మార్క్ ఈ దేశాలు స్త్రీల సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా స్త్రీలకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో పూర్తి అవకాశాలను కల్పిస్తాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రపంచ జనాభా.
జవాబు: ప్రపంచ జనాభా 1830 వ సంవత్సరము నాటికి 100 కోట్లు చేరింది. అదే ప్రపంచ జనాభా ఒక శతాబ్దకాలంలో 1930 సంవత్సరము నాటికి 200 కోట్లకు చేరింది. 1960 నాటికి ప్రపంచ జనాభా 300 కోట్లకు చేరింది. 1974 నాటికి 400 కోట్లుకా, 1987లో 500 కోట్లు, 1987లో 600 కోట్లు, 1999 లో 700 కోట్లకు 2011లో చేరింది. ప్రస్తుత జనాభా 730 కోట్లు. ప్రపంచ జనాభాలో 98 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంటుంది.
ప్రపంచ జనాభా 1830 – 2011
ప్రశ్న 2.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలు.
జవాబు:
ఈ క్రింది పట్టిక ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలను చూపిస్తుంది,
ప్రశ్న 3.
భారతదేశంలో జనాభా పెరుగుదలకు కారణాలు.
జవాబు:
సమాధానం కొరకు వ్యాసరూప ప్రశ్న 3ను చూడుము.
ప్రశ్న 4.
భారతదేశంలో కుటుంబ సంక్షేమ పథకాలు. [Mar ’17]
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలను నియంత్రించడంలో కుటుంబ నియంత్రణ పథకాల ప్రాధాన్యతను గుర్తించారు. మన దేశంలో అధిక జననాల రేటును తగ్గించడానికి ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించెను.
1) ప్రభుత్వ సమాచార పథకం: ఎలాంటి కుటుంబ నియంత్రణలను పాటించని వివాహిత జంటలకు ప్రభుత్వ సమాచార పథకాల క్రింద కుటుంబ నియంత్రణ ప్రయోజనాలను తెలియజేయడం, సమాచార సాధనాలైన సినిమా, రేడియో, పోస్టర్లు, టెలివిజన్లు, మొదలగువాటి ద్వారా కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యాన్ని ప్రచారం చేస్తుంది.
2) ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు: కుటుంబ నియంత్రణ పాటించే ప్రజలకు ప్రభుత్వం అనేక రకాలైన పథకాల ద్వారా వివిధ రకాలైన ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. నగదు రూపంలో బహుమతులు ఇవ్వడం వల్ల కొంత మంది ప్రజలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అదే విధంగా కుటుంబ నియంత్రణను నిరాకరించిన వారికి ప్రభుత్వం కల్పించే కొన్ని సదుపాయాలను తొలగించినట్లయితే జననాల రేటు తగ్గి జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు.
3) కుటుంబ నియంత్రణ కేంద్రాలు: కుటుంబ నియంత్రణ పథకాల్లో కుటుంబ నియంత్రణ కేంద్రాల స్థాపన తప్పనిసరి. ప్రభుత్వం ఈ కేంద్రాల్లో అనేక రకాలైన వైద్య సదుపాయాలను కల్పించి, కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తోంది. ఈ కేంద్రాలతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లో, నగరాల్లో, గర్భనిరోధక సాధనాల పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి, జనాభా పెరుగుదలను నియంత్రిస్తుంది.
4) పరిశోధన: సమాచార ప్రేరణ, జనాభా పునరుత్పత్తి, ప్రసూతి రేటు నియంత్రణ మొదలైన వాటికి కుటుంబ నియంత్రణ పథకాల్లో అధిక ప్రాధాన్యత కల్పించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం పరిమిత వనరులతో కుటుంబ నియంత్రణపై పరిశోధనలు చేసి, గరిష్ట ప్రయోజనం పొందటానికి ప్రయత్నిస్తుంది.
ప్రశ్న 5.
మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యత.
జవాబు:
ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన విద్య, సామర్థ్యం, అనుభవంతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అంటారు. మానవునిపై పెట్టుబడి పెడితే మానవ వనరులుగా అభివృద్ధి చెంది, మానవ అభివృద్ధికి ఉత్పాదక వనరులుగా ఉపయోగపడతారు.
మానవ వనరుల అభివృద్ధి ప్రాధ్యానత:
- మానవ వనరుల ద్వారానే భౌతిక వనరులు సమర్థవంతంగా వినియోగించబడతాయి.
- మానవ వనర్లులో తక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే భౌతిక వనరులు పరిమితంగా ఉపయోగించబడతాయి.
- ఉత్పాదక వనరులు పూర్తిగా వినియోగించుకోవడానికి సాంకేతిక నిపుణుల యొక్క అవసరం ఎంతైనా ఉంది.
- భౌతిక వనరులు సమర్థవంతంగా, సంపూర్ణంగా వినియోగించబడాలంటే మానవ వనరుల అభివృద్ధిలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టవలసి ఉంది.
- మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఒకదానిపై ఒకటి ప్రభావితమై ఉంటాయి.
ప్రశ్న 6.
గ్రామీణాభివృద్ధిలో విద్య పాత్ర.
జవాబు:
- గ్రామీణాభివృద్ధిలో విద్య అనేక రకాలైన విధాలుగా తోడ్పడుతుంది. గ్రామీణ ప్రజల పరిజ్ఞానాన్ని పెంపొందించి, అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపుతుంది.
- వ్యవసాయదారులు విద్యావంతులైతే నూతన వ్యవసాయ, సాంకేతికాలు, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను త్వరగా అర్థం చేసుకోగలరు.
- విద్యతో ప్రజల సామర్థ్యాలను, ప్రవర్తనను మార్చుకొని కుటుంబ నాణ్యతను పెంపొందించడానికి
ఉపయోగపడుతుంది. - శ్రామికులు ఎక్కువగా ఉన్న మన దేశంలో విద్య ద్వారా ప్రజల నైపుణ్యత పేరిట కుటీర పరిశ్రమలను స్థాపించుకొని స్వయం ఉపాధి పొందుతారు. ఈ విధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగులు గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటారు.
- విద్యవల్ల పరిజ్ఞానం, నైపుణ్యత పెరిగి శ్రామిక శక్తి యొక్క ఉత్పాదకత పెరుగుతుంది.
ప్రశ్న 7.
భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది ?
జవాబు:
ప్రపంచంలోని అతి పెద్ద విద్యా వ్యవస్థలో భారతదేశం ఒకటి. జాతీయ విద్యా విధానం 1980లో ప్రవేశ పెట్టారు. 1992లో ఈ విధానాన్ని సవరించడం జరిగింది. ఇది ప్రాథమిక విద్యకు సంబంధించి 3 అంశాలు తెలియజేయును. జాతీయ విద్యావిధానం ప్రకారం విద్య మీద చేసిన వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం లక్ష్యంగా ఇది 2011 12లో 48% మాత్రమే ఉంది. మన దేశంలో విద్యపైన చేసే వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించలేము. విద్యపైన ఖర్చుచేసే 106 దేశాలలో మన భారతదేశం 86వ స్థానంలో ఉంది. విద్య యొక్క ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని 11వ ప్రణాళికలో ప్రభుత్వరంగం విద్యపైన వ్యయం స్థూల దేశీయ ఉత్పత్తిలో 4% కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళికలో మానవ వనరుల మంత్రిత్వ శాఖకు 4,53,728 కోట్లు కేటాయించారు. అందులో 3,43,028 కోట్లు పాఠశాల మరియు మాధ్యమిక విద్యాశాఖకు 1,10,700 కోట్లు ఉన్నత విద్యాశాఖకు కేటాయించారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్నత విద్యను అభ్యసించగల అన్ని రకాల వసతులున్నాయి. విద్యను మానవాభివృద్ధి సాధనంగా |గుర్తించి ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి అనే ఆశయం పెట్టుకొన్నది. అందులో భాగంగా 2010 నాటికి దేశంలో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలకు అందరికి ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001, 2002 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ప్రశ్న 8.
భారతదేశంలో ఆరోగ్య కార్యక్రమాలు.
జవాబు:
జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (NRHM) 2005లో గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో సరసమైన మరియు నాణ్యత ఆరోగ్య సేవలు అందించడానికి ప్రారంభించబడింది.
- వివిధ గ్రామాలలో గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్యకార్యకర్తలను ఎంపిక చేసి వారికి ఆరోగ్య సంరక్షణలో శిక్షణ ఇస్తారు. (ASHAS)
- జనని సురక్ష యోజన (JSY) అనే కార్యక్రమం ప్రసూతి మరణాలు తగ్గించాలని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం 35 కోట్ల మంది మహిళలు లబ్ది పొందారు.
- ప్రధానమంత్రి స్వస్తీయ యోజన (PMSY) కార్యక్రమం దేశంలో ప్రాంతీయ అసమానతలు సరిదిద్ది లక్ష్యాలతో, ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి తేవడానికి ప్రారంభించబడింది.
- రోగి కల్యాణ సమితిలు.
- గ్రామీణ వైద్య మరియు పారిశుద్ధ్య కమిటి.
- మొబైల్ సంచార వైద్య యూనిట్లు.
- ఆయుర్వేద, యునాని, సిద్ధ, హెూమియో (Ayush) సేవలు.
- జనని శిశు సురక్ష కార్యక్రమం తల్లి, శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రారంభించబడింది.
ప్రశ్న 9.
భౌతిక ప్రమాణ జీవన సూచిక (PQLI)
జవాబు:
భౌతిక ప్రామాణిక జీవన సూచిక అంటే ఒక వ్యక్తి యొక్క నాణ్యమైన జీవితం లేదా దేశం యొక్క శ్రేయస్సు కొలిచేందుకు ఒక ప్రయత్నం. ఇది మూడు గణాంకాలు యొక్క సగటు ప్రాథమిక అక్షరాస్యత రేటు, శిశు మరణాలు మరియు ఆయుర్దాయు, ప్రాధాన్యత విలువ 0-100 వరకు ఉంటుంది. GNP వినియోగంలో అసంతృప్తి చెందడం చేత మోరిస్ డేవిడ్ మోరిస్ 1970ల మధ్యలో ఓవర్సీస్ డెవలప్మెంట్ కౌన్సిల కోసం దీనిని అభివృద్ధి చేశారు.
సాధారణ సమస్యలు పంచుకుంటుంది. కాని అది శిశు మరణాలు మరియు ఆయుర్ధాయం మధ్య గణనీయమైన తేడా చూపడం వల్ల ఇది కూడా విమర్శించబడింది. ఐక్యరాజ్య సమితి (UNO) మానవ అభివృద్ధి సూచిక (HDI) మరింత విస్తృతంగా కొలవడానికి ఉపయోగపడే కొలమానం.
భౌతిక ప్రామాణిక సూచిక కొలవడానికి గల దశలు.
- అక్షరాస్యులు ఉన్న జనాభా శాతాన్ని కనుక్కోండి. (అక్షరాస్యత శాతం)
- శిశు మరణాల రేటు కనుగొనేందుకు (ప్రతి 1000 మంది జననాలకు) ఇండెక్స్ శిశు మరణాల రేటు (166 – శిశుమరణాల రేటు) × 0.625
- ఆయుర్దాయాన్ని కనుగొనేందుకు = ఆయుర్దాయ సూచిక – (ఆయుర్దాయం – 42) × 2.4
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
జనాభా విస్పోటనం. [Mar ’17, ’16]
జవాబు:
మరణాల రేటు క్రమంగా క్షీణిస్తూ, జననాల రేటు అధికంగా కొనసాగడం వల్ల జనాభా పెరుగుదల వేగంగా పెరుగుతుంది. దీనినే జనాభా విస్ఫోటనం అంటారు. మన దేశంలో 1921 సంవత్సరము నుండి ఈ దశ ప్రారంభమైనది.
ప్రశ్న 2.
గొప్ప జనాభా విభజన సంవత్సరం.
జవాబు:
1921వ సంవత్సరము నుండి మన దేశం జనాభా పరిణామ సిద్ధాంతంలోని రెండవ దశలోకి ప్రవేశించింది. ఈ దశలో మరణాల రేటు తక్కువగాను, జననాల రేటు అధికంగాను ఉంది. కనుక 1921 సంవత్సరాన్ని గొప్ప జనాభా విభజన సంవత్సరం అంటారు.
ప్రశ్న 3.
శిశు మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సరంలో 1000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి ఈ శిశుమరణాల రేటు 1951లో సంవత్సరములో ప్రతి 1000 మందికి 27.4% కాగా 2012లో ఇది 7.0%కు తగ్గింది.
ప్రశ్న 4.
ప్రసూతి మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సర కాలంలో, ప్రసూతి సమయం ప్రతి లక్ష మంది స్త్రీలలో చనిపోయే వారి నిష్పత్తి. ఈ మరణాల రేటును 2012 నాటికి 341: 1,00,000.
ప్రశ్న 5.
జననాల రేటు.
జవాబు:
ప్రతి 1000 మంది జనాభాలో ఎంత మంది పుడుతున్నారు అనేది జనన రేటు సూచిస్తుంది.
ప్రశ్న 6.
మరణాల రేటు.
జవాబు:
ఒక సంవత్సరంలో 1000 మందిలో చనిపోయిన వారి నిష్పత్తి 1901లో వైద్య సదుపాయాలు లేకపోవడం, కరువు మొదలైన పరిస్థితుల వల్ల మరణాలరేటు 44.4గా ఉంది. ప్రస్తుతం ఇది 2012 నాటికి 7.0 గా ఉంది.
ప్రశ్న 7.
నగరీకరణ.
జవాబు:
జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 400 ఉండే ప్రదేశాన్ని పట్టణము లేదా నగరముగా చెప్పవచ్చు. పారిశ్రామిక ప్రగతి సాధించడంలో నగరీకరణ, పట్టణీకరణ దోహదం చేస్తాయి. మన దేశంలో 1951వ సంవత్సరంలో నగరీకరణ కేవలం 17.3% కాగా ఇది 2001 నాటికి 27.8% మాత్రమే పెరిగింది. నగరీకరణ ఆర్ధికాభివృద్ధికి ఒక సూచిక.
ప్రశ్న 8.
ఉమ్మడి కుటుంబం.
జవాబు:
భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలోని పెద్ద మొత్తం ఉమ్మడి కుటుంబ బాధ్యతను వహించి వారి అవసరాలు తీరుస్తుంటారు. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యుక్త వయసులోని భార్య – భర్తలు పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆధునిక సమాజంలో వైయుక్తిక కుటుంబాలకు ప్రాధాన్యత పెరుగుచున్నది.
ప్రశ్న 9.
వృత్తుల వారీగా జనాభా విభజన.
జవాబు:
ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజింపబడి ఉండటాన్ని వృత్తుల వారీగా జనాభా విభజన అంటారు. వివిధ రకాలైన వృత్తులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి 1. ప్రాథమిక రంగం, 2. ద్వితీయ రంగం, 3. సేవా రంగం. ఆర్థికాభివృద్ధి జరిగితే ఈ వృత్తుల వారి వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి. శ్రామిక శక్తి వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక, సేవారంగాలకు బదిలి అవుతాయి. 2011వ సంవత్సరంలో భారతదేశంలో ప్రాథమిక రంగంలో శ్రామిక శక్తి 48.9%, ద్వితీయరంగంలో 24.3%, తృతీయ రంగంలో 26.8% ఉంది.
ప్రశ్న 10.
ప్రాథమిక రంగం.
జవాబు:
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తులు, చేపల పెంపకం, కోళ్ళ పెంపకం మొదలైన వృత్తులన్నింటిని ప్రాథమిక రంగంగా పరిగణిస్తారు. దీనినే వ్యవసాయరంగమని కూడా అంటారు. మన దేశంలో జాతీయాదాయంలో ఎక్కువ భాగం ఈ రంగం నుండి ఉత్పత్తి చేయబడేది. ఆర్థికాభివృద్ధి జరిగే కొలది దీని వాటా నెమ్మదిగాను, క్రమంగాను, తగ్గుచూ, ద్వితీయ, తృతీయ రంగపు వాటాలు పెరుగుతాయి.
ప్రశ్న 11.
తృతీయ రంగం.
జవాబు:
తృతీయ రంగాన్ని సేవారంగం అని కూడా అంటారు. వ్యాపారం, వాణిజ్యం, గ్రంథాలయాలు, వైద్యశాలలు, పాఠశాలలు, రవాణా, సమాచారం మొదలైన వాటినన్నింటిని కలిపి సేవారంగం అంటారు. తృతీయ రంగం కార్యకలాపాలు, ప్రాథమిక, ద్వితీయ రంగాల కార్యకలాపాలకు తోడ్పడతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో తృతీయ రంగపు వాటాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రశ్న 12.
మానవ వనరుల అభివృద్ధి.
జవాబు:
ఒక దేశం రాజకీయ, ఆర్థికాభివృద్ధికి కావలసిన విద్య, సామర్థ్యం, అనుభవముతో కూడుకున్న మానవులను మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. విద్య, వైద్యం సేవలు నిరంతరంగా పెరగడం వల్ల మానవ మూలధన సామర్థ్యం పెరిగినది. తత్ఫలితంగా ఉత్పత్తి పెరుగుతుంది. మానవ వనరుల అభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఒక దానిపై ఒకటి | ప్రభావితమై ఉంటాయి.
ప్రశ్న 13.
అక్షరాస్యత రేటు.
జవాబు:
చదవటం, రాయటంలో మనిషికున్న సామర్థ్యమే అక్షరాస్యత. ప్రతి మనిషి తనకు తాను సహాయం చేసుకోవటానికి | అక్షరాస్యత సాధనంగా ఉపయోగపడుతుంది.
ప్రశ్న 14.
సర్వశిక్ష అభియాన్. [Mar ’17, ’16]
జవాబు:
విద్యను మానవాభివృద్ధి సాధనంగా గుర్తించి A.P. ప్రభుత్వం ప్రాథమిక విద్యలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలనే | ఆశయం పెట్టుకున్నది. 2010 సంవత్సరం నాటికి రాష్ట్రంలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికి ఉపయోగపడే విధంగా ప్రాథమిక విద్యను కల్పించడానికి 2001 02లో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిని రాజీవ్ విద్యా మిషన్ గా మార్చారు.
ప్రశ్న 15.
జననీ సురక్షా యోజన. [Mar ’16]
జవాబు:
2005-06 సంవత్సరంలో జననీ సురక్ష యోజన (JSY) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సంస్థాపరమైన కాన్పులను ప్రోత్సహిస్తూ శిశుమరణ రేటును తగ్గించడం దీని ఆశయం.
ప్రశ్న 16.
మానవ అభివృద్ధి సూచిక.
జవాబు:
1990వ సంవత్సరంలో మహబూబ్-ఉల్-హక్ దీనిని ప్రవేశపెట్టారు. మానవ అభివృద్ధి ఆధారంగా ఒక దేశ | ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తారు. 2013వ సంవత్సరంలో వచ్చిన రిపోర్టు ప్రకారం భారతదేశం 187 దేశాల్లో 136వ స్థానానికి దిగజారింది.
ప్రశ్న 17.
లింగ సంబంధిత సూచిక (GDI).
జవాబు:
ఈ సూచిక స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తుంది. దీనిలో మూడు అంశాలు ఇమిడి ఉన్నాయి. 1. స్త్రీల ఆయుర్ధాయం 2. వయోజన స్త్రీల అక్షరాస్యత 3. స్త్రీల తలసరి ఆదాయం.
ప్రశ్న 18.
లింగ సాధికారిక కొలమానం (GEM)
జవాబు:
దీనిని 1995 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆర్థిక, రాజకీయ జీవితంలో స్త్రీ యొక్క భాగస్వామ్యమును GEM తెలియజేయును. ఆర్థిక రాజకీయ కార్యకలాపాల్లో, స్త్రీ – పురుషుల అసమానతలు, స్త్రీల సాధికారతను దీని ద్వారా అంచనా వేస్తారు.
ప్రశ్న 19.
మానవ పేదరిక సూచిక.
జవాబు:
1997లో ఈ సూచికను ప్రవేశపెట్టారు. మానవ పేదరిక సూచిక మూడు అంశాల ద్వారా ప్రజల మెరుగైన జీవన ప్రమాణాన్ని లెక్కిస్తారు. అవి ఆయుర్ధాయం, విజ్ఞానం, జీవన ప్రమాణం.
ప్రశ్న 20.
మొత్తం ప్రసూతి రేటు.
జవాబు:
ఒక స్త్రీ తన పునరుత్పత్తి కాలంలో జన్మనిచ్చే మొత్తం పిల్లల సంఖ్య.