Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 4th Lesson వ్యవసాయ రంగం Textbook Questions and Answers.
AP Inter 2nd Year Economics Study Material 4th Lesson వ్యవసాయ రంగం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు:
భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం అత్యంత కీలకపాత్రను పోషిస్తుంది. క్రింద పేర్కొన్న అంశాలు ద్వారా భారత ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగం పాత్రను తెలుసుకోవచ్చు.
1) స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి, పశుపోషణ, కోళ్ళ పెంపకం, పట్టు పరిశ్రమ, తోటపంటలు, గనులు, క్వారీలు మొదలైనవన్నీ, కలిపి వ్యవసాయ రంగం అంటారు. నేటికి జాతీయాదాయంలో వ్యవసాయరంగం ముఖ్య భూమికను పోషిస్తూ వుంది. మొత్తం స్థూల, దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయరంగంలో వాటా 1950-51 సంవత్సరంలో 56.5 శాతంగా వుంది. ఈ వాటా క్రమేపీ తగ్గుతూ 2013-14 నాటికి 13.9 శాతానికి చేరుకుంది. ఈ తగ్గుదలకు ప్రధానకారణం వ్యవసాయేతర రంగాలు అభివృద్ధి చెందడం ఉదాహరణకు జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా ఇంగ్లాండులో 2 శాతం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 3 శాతం, ఆస్ట్రేలియాలో 6 శాతం ఫ్రాన్స్లో 7 శాతంగా వుంది.
2) ఉపాధికల్పనలో వ్యవసాయరంగం: భారత ప్రజల ప్రధాన వృత్తి, వ్యవసాయం, నేటికి ఉపాధికల్పనలో వ్యవసాయరంగం కీలక భూమిక పోషిస్తుంది. వ్యవసాయరంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది.
వ్యవసాయరంగంపై ఆధారపడిన జనాభా (మిలియన్లలో)
పట్టిక 4.2 పరిశీలిస్తే 1951 జనాభాలెక్కల ప్రకారం మొత్తం పనిచేస్తున్న జనాభాలో వ్యవసాయం మీద ఆధారపడిన వారి సంఖ్య 98 మిలియన్లు వుండగా 2011 నాటికి 234.1 మిలియన్లకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయరంగంపై ఆధారపడిన జనాభాశాతం చాలా తక్కువగా వుంది. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్ దేశాలలో వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి సంఖ్య 2 శాతంకాగా, ఆస్ట్రేలియాలో 6 శాతం, జపాన్, ఫ్రాన్స్లలో 7 శాతంగా వుంది.
3) అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయరంగం పాత్ర: అంతర్జాతీయ వ్యాపారంలో భారతవ్యవసాయరంగం కీలకపాత్ర పోషిస్తుంది. చాలాకాలం వరకు మనదేశ వ్యవసాయ ఉత్పత్తులలో ముఖ్యంగా మూడురకాలైన ఉత్పత్తులైన నూలు వస్త్రాలు, జనుము, టీ అంతర్జాతీయ ఎగుమతులలో 50 శాతం ఆక్రమించాయి. వీటికి ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను కలిపితే మొత్తం విదేశీ వ్యాపారంలో వ్యవసాయరంగం వాటా 70 శాతానికి చేరుతుంది. ప్రస్తుతం భారతదేశం ప్రత్తి, పొగాకు, పంచదార, బియ్యం, కాఫీ, టీ, చేపలు, మాంసం, పండ్లు, పప్పుధాన్యాలు, నూనెపిండి, జీడిపప్పు, సుగంధద్రవ్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఎగుమతుల ద్వారా మనకు విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది.
4) సామాజిక రక్షణ కవచం: భారతదేశం గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్న పేదప్రజలలో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. భారతదేశ జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 15శాతం కంటే తక్కువగా వున్నప్పటికీ నేటికి పనిచేస్తున్న జనాభాలో సగం మందికి వ్యవసాయమే జీవనాధారంగా వుంది. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ స్థాయిలో పంటలతో పాటు, పాడి, పశుపోషణ, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, వ్యవసాయ అడవులు మొదలైన అనుబంధ వృత్తులను ప్రోత్సహిస్తే దారిద్య్రం, ఆకలి వాటంతట అవే తొలగిపోతాయి. ఈ విధంగా వ్యవసాయం గ్రామీణ ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తూ, వారి సామాజిక జీవిత భద్రతకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
5) ఆహార భద్రత: వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహారభద్రతకు సమకూర్చడానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి. తాజా ఆకలిసూచిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం 75 ఆకలి పీడిత దేశాలలో మనదేశంలో 55వ స్థానంలో ఉంది. మనదేశంలో ఆహార సంక్షోభాన్ని నివారించాలంటే వ్యవసాయరంగం స్థిరంగా అభివృద్ధి చెందాలి. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 255 మిలియన్ టన్నులను చేరినపటికీ నేటికి మనదేశంలో ఆహారభద్రత కరువైంది.
6) పారిశ్రామికీకరణలో వ్యవసాయరంగం పాత్ర: సాధి ౦గా కొన్ని పరిశ్రమలు తమ ముడిపదార్థాల కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి వుంటాయి. అలాంటి పరిశ్రమలను వ్యవసాయధార పరిశ్రమలు అంటారు. ఉదాహరణకు జనపనార, వస్త్ర, పంచదార పరిశ్రమలు, నూనెమిల్లులు, పిండిమిల్లులు మొదలైనవి ప్రత్యక్షంగా ముడిసరుకుల |కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి వున్నాయి. ఇవికాగా బియ్యం మిల్లులు, నూనె మిల్లులు, తోటపంటలు, ఆహారతయారీ మొదలైన చిన్న, కుటీర పరిశ్రమలు కూడా ముడిసరుకుల కోసం వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరెన్నో పరిశ్రమలకు వ్యవసాయరంగం తోడ్పడుతుంది.
అదేవిధంగా పారిశ్రామికాభివృద్ధి వ్యవసాయరంగ ప్రగతికి దోహదపడుతుందని చెప్పవచ్చు. పరిశ్రమలు అభివృద్ధిచెందితే వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు మొదలైన ఉత్పాదకాలను అందిస్తాయి. ఈ విధంగా వ్యవసాయ పారిశ్రామికరంగాలు పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి అభివృద్ధి చెందుతున్నాయి.
7) పారిశ్రామిక వస్తువులకు గిరాకీ: భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూడవవంతు గ్రామీణ ప్రాంతాలలోనే నివశిస్తున్నారు. వీరికి ఆదాయం చాలా తక్కువగా వుండి పారిశ్రామిక వస్తువులను కొనగల సామర్థ్యం లోపించింది. గ్రామీణ ప్రజల కొనుగోలుశక్తి పెరుగుదల వ్యవసాయరంగ అభివృద్ధిపై ఆధారపడి వుంటుంది. వ్యవసాయరంగం అభివృద్ధి చెందితే వ్యవసాయరంగం ఉత్పాదకత, విక్రయం కాగల మిగులు పెరిగే వ్యవసాయదారుల ఆదాయాలు, శ్రామికుల వేతనాలు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన ఆదాయంవల్ల పారిశ్రామిక వస్తువుల గిరాకీ పెరిగి పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభ్యమవుతుంది.
8) ఇతర అంశాలు:
- వ్యవసాయరంగం ప్రగతి రవాణా రంగాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా ఈ రంగం ఆదాయాన్ని ఆర్జిస్తుంది. .
- వ్యవసాయరంగం ప్రగతి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలను కనిష్టస్థాయిలో ఉంచుతుంది.
- పశువులకు కావలసిన మేత, దాణా మొదలైనవి వ్యవసాయరంగం సరఫరా చేయడం ద్వారా పశుగణాభివృద్ధికి తోడ్పడుతుంది.
- వ్యవసాయ ఆధారిత పర్యాటకాన్ని పెంపొందించవచ్చు.
- వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అభివృద్ధి చెందితే జీవవైవిధ్యం పరిరక్షించబడుతుంది.
పైన పేర్కొనబడిన అంశాల ఆధారంగా భారతదేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయరంగం ప్రముఖపాత్ర పోషిస్తుంది చెప్పవచ్చు. అందువల్ల భారతదేశ వ్యవసాయ దేశంగా పరిగణించబడింది.
ప్రశ్న 2.
వ్యవసాయ శ్రామికుల ప్రస్తుత స్థితిగతులను వివరించి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి తీసుకోవలసిన పరిష్కార మార్గాలను సూచించుము.
జవాబు:
సంవత్సరంలోని మొత్తం పనిదినాలలో సగానికి పైగా వ్యవసాయరంగంలో పనిచేసే వ్యక్తులను వ్యవసాయ శ్రామికులంటారు.
జాతీయ వ్యవసాయ శ్రామికుల పరిశీలనా సంఘం వ్యవసాయ శ్రామికులను రెండు రకాలుగా వర్గీకరించింది. 1) సాధారణ శ్రామికులు 2) రైతుల వద్ద పనిచేసే శ్రామికులు.
వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు:
1) అల్పసాంఘిక హోదా: నేటికీ వ్యవసాయ శ్రామికులలో ఎక్కువమంది తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన అణగారిన వర్గాలకు చెందినవారు. సాంఘిక అసమానత్వం, దోపిడీ భావన వీరి విషయంలో సర్వసాధారణం. వీరు తమ హక్కుల పరిరక్షణకు ఏమాత్రం పోరాటం చేయలేని దయనీయస్థితిలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్షకు గురైన వీరి సాంఘిక హోదా తక్కువగా ఉంటుంది.
2) అసంఘటిత శ్రామికులు: మనదేశంలో వ్యవసాయ శ్రామికుల మారుమూల గ్రామాలలో నివసిస్తున్నారు. అందువల్ల వీరు సంఘటితం కాలేకపోతున్నారు. వీరికి కార్మికసంఘాలు లేవు. అంతేకాక వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. అందువల్ల అసంఘటితంగా వున్న వీరికి భూస్వాములతో బేరమాడే శక్తి లోపించి తగిన వేతనాలు పొందలేకపోతున్నారు.
3) రుతుసంబంధిత ఉద్యోగిత: వ్యవసాయ కార్యకలాపాలు రుతువులపై ఆధారపడి వుంటాయి. వ్యవసాయ కార్మికులు నాట్లు వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు మాత్రం ఉపాధిని పొంది సంవత్సరంలో ఎక్కువ భాగం ఖాళీగా వుంటారు. నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత వీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అందువల్ల వీరి ఆదాయాలు తక్కువగా ఉండి జీవన ప్రమాణాలు అల్పంగా ఉంటాయి.
4) అల్ప వేతనాలు: వ్యవసాయ శ్రామికులకు చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వారి కుటుంబ ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికులకు వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే వేతనాలలో భిన్నత్వం వుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో తప్ప ఎక్కువ రాష్ట్రాలలో వీరికి చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నాయి. హరిత విప్లవనాంతరం వీరికి చెల్లించే ద్రవ్యవేతనాలు పెరిగినప్పటికీ వస్తుసేవల ధరలు పెరిగినందువల్ల వీరి నిజవేతనాలు
పెరగలేదు.
5) మహిళా శ్రామికుల పట్ల వివక్షత: వ్యవసాయరంగంలో పురుష శ్రామికులతో సమానంగా మహిళా శ్రామికులకు వేతనాలు ఇవ్వరు. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలతో వీరిచే బలవంతంగా అధికశ్రమ చేయిస్తారు. అనగా వ్యవసాయరంగంలో మహిళాశ్రామికులు వివక్షతకు గురవుతున్నారు.
6) గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ శ్రామికుల ఆదాయం తక్కువగా ఉండి పేదరికంలో ఉన్నారు. అందువల్ల వీరికి రుణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సంస్థాగత పరపతి సంస్థలనుంచి రుణం తీసుకోవడానికి అవసరమైన హామీపత్రాలు లేనందువల్ల సంస్థాగతం కాని వడ్డీవ్యాపారస్థులు, భూస్వాముల నుంచి అధికవడ్డీలకు రుణం పొందుతున్నారు. ఈ రుణభారం అధికమై తరతరాలుగా వారసత్వంగా సంక్రమించి వ్యవసాయ శ్రామికులు వెట్టిశ్రామికులుగా మారుతున్నారు.
7) అధికసంఖ్యలో బాలకార్మికులు: ఆసియాఖండంలోని బాలకార్మికులలో మూడవ వంతు మంది భారతదేశంలో ఉన్నారు. మనదేశంలోని బాలకార్మికులలో అధిక సంఖ్యాకులు వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. వీరికి ‘చెల్లిస్తున్న వేతనాలు అత్యల్పంగా వుండి వారి కుటుంబ జీవన ప్రమాణంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి.
8) వ్యవసాయేతర వృత్తుల కొరత గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర వృత్తులు అభివృద్ధి చెందలేదు. అందువల్ల శ్రామికులు ఉపాధికోసం ఎక్కువగా వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో శ్రామికుల సంఖ్య అధికమై ప్రచ్ఛన్న నిరుద్యోగితకు దారితీసింది.
వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు పెంపొందించే చర్యలు: వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయి. వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం కింద పేర్కొన్న కొన్ని చర్యలను చేపట్టింది.
1) కనీస వేతనాలు: వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులను పెంపొందించడానికి భారత ప్రభుత్వం 1948లో కనీసవేతనాల చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని జీవన వ్యయాలను, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మూడు సంవత్సరాలలోపు కనీసవేతన చట్టాలను రూపొందించి అమలు చేయాలి.
2) భూమి లేని శ్రామికులకు భూపంపిణీ: వ్యవసాయ శ్రామికుల ఆర్థికస్థితులను పెంపొందించాలంటే ఉద్దేశంతో భూమిలేని శ్రామికులకు భూపంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్య సాధన కోసం కమతాల గరిష్ట పరిమితి చట్టం ద్వారా, భూదాన గ్రామదానోద్యమాల ద్వారా లభించిన 70లక్షల హెక్టారుల మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ శ్రామికులకు పంపిణీ చేయడం జరిగింది.
3) నివాస గృహాలను, ఇళ్ల స్థలాలను కల్పించడం: వ్యవసాయ శ్రామికులలో ఎక్కువ మందికి సరైన స్వంత నివాస గృహాలు లేవు. సాధారణంగా వీరు గాలి, వెలుతురు లేని మట్టిచే నిర్మించబడిన గుడిసెలలో నివశిస్తూ తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఇందుకు పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరా ఆవాస్ యోజన, కనీస అవసరాల కార్యక్రమం వంటి పథకాలను రూపొందించి పేదవారికి ఉచితంగా నివాస స్థలములు యిచ్చి రాయితీ ప్రాతిపదికన ఇండ్లను నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టాయి.
4) శ్రామిక సహకార సంఘాలను ఏర్పరచడం: రెండవ పంచవర్ష ప్రణాళికల కాలంలో శ్రామిక సహకార సంఘాల ఏర్పాటు చేయబడ్డాయి. రహదారుల నిర్మాణం, కాలువలు, చెరువులు తవ్వడం, అటవీకరణ మొదలైన కార్యక్రమాల నిర్వహణను ఒప్పంద ప్రాతిపదికపైన ఈ శ్రామిక సంఘాలు చేపట్టుతాయి. దీని వల్ల శ్రామికులకు దోపిడీ రహిత ఉపాధి లభిస్తుంది.
5) ప్రత్యేక ఉపాధి కల్పనా పథకాలు: ప్రణాళికల కాలంలో ఉపాధి అవకాశాలు కల్పించుటకు అనేక పథకాలు ప్రారంభించబడ్డాయి. ఉదాహరణకు పనికి ఆహార పథకం (FWP) ఉపాధి హామీ పథకం (EGS) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP) గ్రామీణ భూమిలేని శ్రామికుల ఉపాధి హామీ పథకం (RLEGP) జవహర్ రోజ్ గార్ యోజన (JRY) సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన (SGRY), చిన్నరైతుల అభివృద్ధి సంస్థ (SFDA).
6) రుణాలు, రాయితీలు మంజూరులు: మనదేశంలో వ్యవసాయ శ్రామికులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అల్పవడ్డీ రేట్లపై రుణాలు మంజూరు చేస్తున్నారు. వ్యవసాయ శ్రామికులకు తక్షణం రుణవిముక్తి కల్పించడానికి రుణమాఫీని సైతం చేస్తున్నాయి. వ్యవసాయ శ్రామికుల స్వయం ఉపాధిని చేపట్టడానికి ప్రభుత్వం, రుణాలు, రాయితీలు మంజూరు చేస్తున్నాయి.
7) వెట్టిచాకిరి నిర్మూలన: దోపిడీ, బానిసత్వం అమానుషమైన కార్యక్రమాలే గాక శిక్షార్హులైన నేరాలు కూడా, 1976లో భారత ప్రభుత్వం వెట్టిచాకిరి నిర్మూలనా చట్టాన్ని రూపొందించింది. కాని నేటికీ వ్యవసాయ రంగంలో వెట్టిచాకిరి కొనసాగుతూనే వుంది. రైతులను విద్యావంతులను చేయడం, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం వెట్టిచాకిరి నిర్మూలనకు చక్కని పరిష్కారమార్గాలు.
8) కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం: వ్యవసాయరంగంపై జనాభా ఒత్తిడిని కనిష్ట స్థాయికి తగ్గించాలి. అందుకుగాను ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కుటీర, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. ప్రణాళికా కాలంలో ప్రభుత్వం నిర్వహించిన ఈ విధమైన కృషి ఫలితంగా వ్యవసాయరంగంపై ఒత్తిడి కనిష్టస్థాయికి తగ్గి వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు గరిష్టస్థాయికి పెరిగాయి.
ప్రశ్న 3.
భారతదేశంలో పంటతీరును ప్రభావితం చేసే అంశాలు ఏవి ? పంటల తీరును మెరుగుపరిచే చర్యలను సూచించుము.
జవాబు:
పంటల తీరు: సాధారణంగా ఒకదేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో లభించే సహజ వనరుల లభ్యత, వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులైన భూమి, నీరు, ఖనిజాలు మొదలైన వాటిని సమర్థవంతంగా, అభిలషణీయంగా, వినియోగించినప్పుడే కొనసాగించగలిగే అభివృద్ధి సాధ్యమవుతుంది. అదేవిధంగా భూసారం, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి దేశంలో విభిన్న పంటలు పండించడం జరుగుతుంది. దేశంలో పండే వివిధ పంటల తీరు ఆ దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది.
పంటలతీరును ప్రభావితం చేసే అంశాలు: భారతదేశంలో పంటల తీరును భౌతిక, సాంకేతిక ఆర్థిక అంశాలతోపాటు ప్రభుత్వవిధానాలు కూడా ప్రభావితం చేస్తాయి.
I) భౌతికాంశాలు: పంటలతీరును నిర్ణయించడంలో భౌతికాంశాల పాత్ర కీలకమైంది.
1) శీతోష్ణస్థితి, వర్షపాతం: శీతోష్ణస్థితి, వర్షపాతం, పంటలతీరును ప్రభావితం చేస్తాయి. ఉష్ణ ప్రాంతాలలో, శీతల ప్రాంతాలలో పండే పంటలు వేర్వేరుగా వుంటాయి. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో మాత్రమే ఆపిల్స్ వుంటాయి. అదేవిధంగా వర్షపాతం కూడా పంటలతీరును ప్రభావితం చేస్తుంది.
2) భూస్వరూపం, భూసారం: భూసారం, భూస్వరూపంపై ఆధారపడి పంటలు పండుతాయి. ఉదాహరణకు నల్లరేగడి మృత్తికలు, పత్తిపంటకు అనుకూలం. అదేవిధంగా గోధుమ పంటకు సారవంతమైన ఒండ్రు, తడిబంకమన్ను మృత్తికలు అవసరం. ఈ విధంగా భూసారం, భూస్వరూపం పంటలతీరును ప్రభావితం చేస్తాయి.
3) నీటిపారుదల: నీటిపారుదల సౌకర్యాలు పంటలతీరును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమైనపుడు వరి, చెరకు, గోధుమ మొదలైన పంటలు పండుతాయి. నీటిపారుదల సౌకర్యాలు తగినంతగా లేనిచోట రాగులు, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలు పండుతాయి.
II) ఆర్థికాంశాలు:
1) ధరలు, ఆదాయం: సాధారణంగా వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను అధికధరలకు విక్రయించి తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవాలనుకుంటారు. వరి, గోధుమలాంటి ఆహార పంటల ధరలపై మార్కెట్ ప్రభావం లేకుండా నిర్దేశిత సేకరణ ధరల పేరుతో ప్రభుత్వం ఈ పంటల ధరలను ముందుగా నిర్ణయిస్తుంది. ఈ విధమైన నియంత్రణల వల్ల రైతులు తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవడానికి వాణిజ్య పంటలైన చెరకు, పత్తి, వేరుశెనగ మొదలైన వాటిని పండిస్తున్నారు.
2) భూకమతాల పరిమాణం: భూకమతాల పరిమాణం పంటల తీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా చిన్న కమతాల రైతులు ఆహారపంటలను, పెద్దకమతాల రైతులు వాణిజ్యపంటలను పండిస్తారు. ఇటీవల కాలంలో చిన్న కమతాల రైతులు కూడా అధిక లాభాలను ఆశించి వాణిజ్యపంటలను పండిస్తున్నారు.
3) ఉత్పాదకాలు, అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయ ఉత్పాదకాలు కూడా పంటల తీరును నిర్ణయిస్తాయి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు మొదలైన ఉత్పాదకాల లభ్యత పంటల తీరును ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా రవాణా, గిడ్డంగులు, మార్కెటింగ్, నీటిపారుదల వంటి అవస్థాపనా సౌకర్యాల లభ్యతపై కూడా పంటల తీరు ఆధారపడి వుంటుంది.
4) భీమా సౌకర్యాలు: సాధారణంగా వ్యవసాయదారులు విభిన్నమైన పంటలు పండిస్తారు. ఏదైన ఒక పంట నష్టానికి గురైనప్పుడు ఆ నష్టాన్ని ఇతర పంటల నుండి రాబట్టుకోవచ్చు అన్న ఉద్దేశ్యంలో బహుళపంటలు పండిస్తారు. అదే ప్రభుత్వం నష్టభయాన్ని ఎదుర్కొనడానికి ఏ పంటలకు బీమా సౌకర్యాలను కల్పిస్తుందో ఆ పంటలను రైతులు ధీమాగా పండిస్తారు.
5) కౌలుదారీ పద్ధతి: సాధారణంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇచ్చేటప్పుడు ఏ పంటలు పండించాలో ముందుగానే కౌలుదార్లతో ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి పంటలతీరు భూస్వాముల ఇష్టాలపై చాలావరకు ఆధారపడి వుంటుంది.
6) సాంఘీక కారణాలు: పరిసరాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మొదలైన సాంఘిక అంశాలు పంటల తీరును నిర్ణయించడంలో కొంతమేరకు ప్రభావాన్ని చూపుతాయి. ఈ అంశాలు రైతులను సాంప్రదాయ పంటలను, సాంప్రదాయ పద్దతుల్లో పండించేటట్లు ప్రేరేపిస్తాయి.
III) ప్రభుత్వ విధానాలు: విభిన్న పంటలు, ఎగుమతులు, పన్నులు, రాయితీలు, సాంకేతిక విజ్ఞానం, ఉత్పాదకాల సరఫరా, పరపతి లభ్యత, మద్దతుధరలు మొదలైన అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు పంటలతీరును నిర్ణయిస్తాయి.
- కొన్ని పంటల ఉత్పత్తికి కొన్ని ప్రాంతాలు మాత్రమే అనుగుణంగా వుంటాయి. అంటే అన్ని పంటలు అన్ని ప్రాంతాలలో పండవు. కాబట్టి ప్రభుత్వమే ముందుగా ఏ ప్రాంతం ఏ పంటకు అనుకూలంగా ఉందో నిర్ణయించి ఆ ప్రాంతానికి అనుకూలమైన పంటను మాత్రమే పండించేటట్లు చట్టాలను రూపొందించాలి.
- పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు అనుగుణంగా ఆహార పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలి.
- ప్రభుత్వం నూతన వ్యవసాయ వ్యూహాన్ని ప్రోత్సాహించడం ద్వారా పంటల తీరును ప్రభావితం చేయాలి.
ప్రశ్న 4.
భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి గల కారణాలేవి ? ఉత్పాదకత పెంచడానికి తీసుకోవలసిన చర్యలను తెలియజేయండి. [Mar ’17]
జవాబు:
భారత వ్యవసాయరంగంలో ఉత్పత్తి అల్పంగా వుండటానికి అనేక కారణాలు వున్నాయి. వీటిని ప్రధానంగా నాలుగురకాలుగా వర్గీకరించారు.
- సాధారణ కారణాలు
- వ్యవస్థాపూర్వక కారణాలు
- సాంకేతిక కారణాలు
- పర్యావరణ కారకాలు
I) సాధారణ కారణాలు: వ్యవసాయ ఉత్పత్తి అల్పంగా వుండటానికి గల కారణాలు కింద విశ్లేషించబడినాయి.
1) వ్యవసాయరంగంపై జనాభా వత్తిడి: భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 263 మిలియన్ల జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగం మీద ఆధారపడి వున్నారు. దీనికి తోడు వ్యవసాయేతర రంగాల్లో ప్రగతి చురుకుగా లేనందువల్ల పెరుగుతున్న జనాభా జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల వ్యవసాయరంగం మీద ఒత్తిడి ఎక్కువై కమతాల విభజన, విఘటనలతో పాటు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అధికమవుతుంది.
2) నిరాశాపూరిత గ్రామీణ వాతావరణం: మనదేశంలో గ్రామీణ వాతావరణం నిరాశాజనకంగా వుండి, వ్యవసాయ ప్రగతికి ప్రతిబంధకంగా మారింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు, అందువల్ల వీరు మూఢనమ్మకాలకు, సనాతన సాంప్రదాయాలకు విలవినిస్తూ నూతన వ్యవసాయ వ్యూహం యెడల నిరాసక్తతను కనపరుస్తున్నారు. రైతులలో సంకుచిత ధోరణి ఏర్పడి ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమవడం, భూమిపై మక్కువ మొదలైన గ్రామీణ పరిస్థితుల వల్ల వ్యవసాయ కమతాలు విభజన, విఘటనలకు గురై వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాలలో కక్షలు, కుట్రలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటి కారణంగా నిరుత్సాహపూరితమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడి రైతులు తమ విలువైన సమయం, ధనం వృథా చేసుకుంటున్నారు. ఫలితంగా మనదేశ వ్యవసాయరంగంలో ఉత్పాదకత తక్కువగా ఉంది.
3) అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయాభివృద్ధికి అవసరమైన పరపతి, రవాణా, మార్కెటింగ్, గిడ్డంగి, సౌకర్యాలు రైతుల అవసరాలకు సరిపడినంతగా లేవు. జాతీయ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు, వ్యవసాయ విస్తరణ సేవాకేంద్రాల ప్రోత్సాహం రైతులందరికి అందుబాటులో లేదు. ఈ విధమైన అవస్థాపనా సౌకర్యాల కొరత వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలకు ప్రతిబంధకంగా తయారైంది.
4) బ్రిటీష్ పాలనా ప్రభావం: బ్రిటీషువారు తమ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని ఒక వలసదేశంగా భావించారే తప్ప మనదేశ వ్యవసాయాభివృద్ధికి ఏవిధమైన చర్యలు చేపట్టలేదు. వారనుసరించిన భూస్వామ్య విధానాలు, కౌలుదారి విధానాలు, భూమిశిస్తు వసూళ్ళు భారత వ్యవసాయరంగ ప్రగతిని దెబ్బతీశాయి. మనదేశ వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా వుండటానికి బ్రిటీషువారి పాలన చాలావరకు కారణమైంది.
II) వ్యవస్థాపూర్వక కారణాలు:
1) అల్ప కమతాల పరిమాణం: మనదేశంలో భూకమతాల పరిమాణం చాలా అల్పంగా ఉంది. జాతీయ సర్వేక్షణా సంస్థ నివేదిక ప్రకారం 1960 – 61లో రెండు హెక్టారుల కంటే తక్కువ పరిమాణం ఉన్న కమతాలు మొత్తం కమతాలలో 52 శాతం వుండగా 2010-11 నాటికి వీటి సంఖ్య 85 శాతానికి పెరిగింది. ఎక్కువ భూమి కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. వీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపరు. వారసత్వ చట్టాలు, కమతాల విభజన, విఘటనల ఫలితంగా కమతాల పరిమాణం అల్పంగా వుండి తక్కువ భూమి ఎక్కువ మంది రైతుల ఆధీనంలో వుంది. చిన్న కమతాలు నూతన వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉంది.
2) భూస్వామ్య వ్యవస్థలోని లోపాలు: బ్రిటీషువారి పరిపాలనా కాలంలో మనదేశంలో ఏర్పాటు చేసిన జమీందారీ పద్ధతి, జాగిర్దారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి మొదలైన లోపభూయిష్టమైన భూస్వామ్య పద్ధతులు వ్యవసాయప్రగతిని ఆటంకపరచాయి. స్వాతంత్ర్యానంతరం రైత్వారీ పద్ధతి అమలులోకి వచ్చింది. ఈ విధానంలో కౌలుదారులకు కౌలుభద్రత, నిశ్చితమైన కౌలు పరిమాణం భూయాజమాన్యం హక్కులు వుండేవి కావు. ఈ అభద్రతల కారణంగా కౌలుదారుల వ్యవసాయంపై శ్రద్ధ చూపలేరు. ఫలితంగా వ్యవసాయరంగం యొక్క ఉత్పాదకత తగ్గింది.
3) మార్కెట్, పరపతి సౌకర్యాల కొరత: వ్యవసాయభివృద్ధికి అవసరమైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు కొరత వలన నూతన పద్ధతిలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమైంది. వీరికి కావలసిన పరపతి సముచితమైన వడ్డీరేట్లకు లభించదు. అంతేగాక ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తులకు అందించే రాయితీలు సంతృప్తికరంగా లేవు. ఈ కారణాల వల్ల అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుదల సౌకర్యాలను ఉపయోగించి నూతన పద్ధతులలో సాగుచేయడానికి బదులు సాంప్రదాయ పద్దతులలో సాగుచేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో ఉత్పాదకత తగ్గింది.
III) సాంకేతిక కారణాలు:
1) పురాతన ఉత్పత్తి పద్ధతులు: భారతదేశంలోని రైతులు పేదరికం, అవగాహనారాహిత్యం కారణంగా పురాతన పనిముట్లు సహాయంతో సాంప్రదాయమైన వ్యవసాయ పద్ధతులలో సాగుచేయడం వల్ల పురాతన ఉత్పత్తి ఉత్పాదకత తక్కువగా వున్నాయని టి.డబ్ల్యు. హార్ట్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడినారు. నేటికి భారతీయ రైతులు కొడవళ్ళు, చెక్కనాగళ్ళు, ఎడ్లబండ్లు ఉపయోగిస్తున్నారు. వీరు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులను, క్రిమిసంహారక మందులను, యంత్రాలను పరిమితంగా వాడుచున్నారు. కాని ప్రభుత్వ నిర్విరామ కృషి, విద్యావ్యాప్తి ఫలితంగా ఇటీవల కాలంలో ఈ పరిస్థితులలో కొంతమేరకు మార్పు వచ్చింది.
2) నీటిపారుదల సౌకర్యాల కొరత: 2011 నాటికి వివిధ పంటల కింద సాగవుతున్న భూవిస్తీర్ణం 198.97 మిలియన్ హెక్టారులు వుండగా అందులో 89.36 మిలియన్ హెక్టారుల భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. అంటే 55శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. అకాల, అల్ప, అనిశ్చిత వర్షాల వల్ల వర్షాధార ప్రాంతాలలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితులలో నూతన వ్యవసాయ వ్యూహం దేశమంతా విస్తరించడం కష్టమై వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకాలు, తక్కువగా వున్నాయి.
3) వ్యవసాయ ఉత్పాదకాల కొరత: అధిక దిగుబడిని సాధించుటకు ఆధునిక ఉత్పాదకాల వినియోగం తప్పనిసరి. ఆధునిక ఉత్పాదకాలైన సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, యంత్రాలు, క్రిమిసంహారక మందుల సరఫరా రైతుల అవసరాలకు సరిపడినంతగా లేదు. ఉత్పాదకాలు సరిపడినంతగా లభ్యం కానందువల్ల వాటి వినియోగం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత అల్పంగా వున్నాయి.
IV) పర్యావరణ కారణాలు: వ్యవసాయ ఉత్పాదకతను నిర్ణయించడంలో పర్యావరణం పాత్ర ప్రముఖమైనది. భూసార క్షీణత, వాతావరణంలో మార్పులు, నీటికాలుష్యం, వాయు కాలుష్యం, మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకాల మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. పంటల క్షీణతకు కింది పర్యావరణ ప్రతికూల అంశాలు కారణభూతాలు అవుతున్నాయి.
- భూతాపం.
- భూసారం క్షీణించడం.
- అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించి సాంద్రవ్యవసాయం చేయడం.
- మితిమీరి రసాయనిక ఎరువులను వాడటం.
- పోడు వ్యవసాయం.
- పర్యావరణ పరిరక్షణా ప్రణాళికలు లేకపోవడం.
- సాంప్రదాయ పంటలను సాగుచేయకపోవడం.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి తీసుకోవలసిన చర్యలు:
ఏ అంశాలు వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి కారణభూతాలు అవుతున్నాయో వాటికి పరిష్కారాలను సూచిస్తే వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుంది.
1) భూసంస్కరణలు: భారత వ్యవసాయరంగంలోని వ్యవస్థాపూర్వక లోపాలను తొలగించడానికి స్వాతంత్య్రానంతరం భారతప్రభుత్వం “దున్నే వానికే భూమి’ అనే నినాదంతో భూసంస్కరణలను ప్రవేశపెట్టింది. అల్పకమతాల సమస్య పరిష్కారానికి కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం మొదలైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం
జరిగింది.
2) జనాభా పెరుగుదలను అరికట్టడం: భారతదేశంలో జనాభావిస్ఫోటనం కొనసాగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పెరుగుదల వార్షిక వృద్ధిరేటు 1.64 శాతంగా వుంది. భూమి మీద జనాభా ఒత్తిడిని తగ్గించడానికి వేగంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడంతోపాటు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తృత
పరచాలి.
3) నీటిపారుదల సౌకర్యాలు: వ్యవసాయానికి నీరు అత్యంత ఆవశ్యకమైన ఉత్పాదక వనరు. నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విరివిగా భారీతరహా, మధ్యతరహా, చిన్న తరహా ప్రాజెక్టులను స్థాపించి నీటిపారుదల సౌకర్యాలు వున్న భూవిస్తీర్ణాన్ని పెంపొందించాలి.
4) వ్యవసాయ సేవాకార్యక్రమాల విస్తరణా సంస్థలు: వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) పంటలలో భిన్నత్వం, జీవవైవిధ్య పరిరక్షణ, భూసార సంరక్షణ కోసం వాలు ప్రాంతాల వ్యవసాయ భూసాంకేతిక విజ్ఞానం (SALT), వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, వివిధ పంటల రకాలకు సంబంధించిన సమాచారం అందించడానికి ఇ-వ్యవసాయం మొదలైన వ్యవసాయ విస్తరణా సేవా సంస్థలను, పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
5) అవస్థాపనా సౌకర్యాలు: వ్యవసాయ ఉత్పాదకతను అవస్థాపనా సౌకర్యాలు విశేషంగా ప్రభావితం చేస్తాయి. వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, సంకరజాతి విత్తనాలతో పాటు అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, పరపతి, గిడ్డంగులు, మార్కెటింగ్, నిరంతర విద్యుత్ సరఫరా మొదలైన వ్యవసారంగం యొక్క ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
6) వ్యవసాయ యాంత్రీకరణ: వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయరంగం యొక్క ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ‘కాబట్టి వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పంపుసెట్లు, ట్రాక్టర్లు, పంటమార్పిడి యంత్రాలు నాట్లు వేసే యంత్రాలు, డ్రిల్లర్లు మొదలైన వాటి వినియోగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
7) మార్కెటింగ్, పరపతి సౌకర్యాలు: నూతన వ్యవసాయ వ్యూహం అమలుకు అధిక వ్యయంతో కూడుకున్న సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుదల సౌకర్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పాదకాలను విరివిగా వినియోగించాలి. వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు అందించాలి.
8) అక్షరాస్యతను పెంపొందించడం: భారతీయ రైతుల ఉత్పాదక సామర్థ్యాన్ని అక్షరాస్యత పెంపొందిస్తుంది. కాబట్టి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు విరివిగా వయోజన విద్యాకేంద్రాలను స్థాపించి రైతులను విద్యావంతులను చేయాలి. అప్పుడే రైతుల యొక్క ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.
9) వ్యవసాయ పరిశోధనలు: భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అనేక ఇతరసంస్థల కృషి, పరిశోధనల ఫలితంగా అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది. ఈ పరిశోధనలు భూసార పరీక్ష, భూసార పరిరక్షణ, తెగుళ్ళు నివారణ, నూతన వ్యవసాయ పరికరాల సృష్టి మొదలైన కార్యక్రమాలను కూడా విస్తరించాలి.
భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం: హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.
2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61లో 110 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. నూనెగింజలు ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ల టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.
3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.
4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు: వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.
5) ఆదాయల్లో పెరుగుదల: ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.
6) పేదరికం తగ్గుదల: హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని * కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.
ప్రశ్న 5.
భారతదేశంలో వివిధ రకాల నీటిపారుదల సౌకర్యాలను వివరించి, నీటిపారుదల సౌకర్యాల ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధికి నీటిపారుదల అత్యంత ఆవశ్యకమైన ఉత్పాదక వనరు. మనదేశంలో కొన్ని ప్రాంతాలలో వర్షపాతం కొరతగాను అనిశ్చితంగా వుంది. ఈ పరిస్థితులలో వర్షంపై ఆధారపడి సంవత్సరం పొడవునా వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం అసాధ్యం. నేటికీ సాగుచేయబడుతున్న భూవిస్తీర్ణంలో 55 శాతం వర్షపాతంపై ఆధారపడి వుంది. వర్షంపై ఆధారపడి సాగుచేయడం అంటే “రుతువులతో జూదం ఆడటమే.”
1) కాలువలు: భారతదేశంలో వ్యవసాయరంగానికి వున్న నీటిపారుదల వనరులలో కాలువలు అత్యంత ప్రధానమైనవి. కాలువల తవ్వకం, నిర్వహణ అధిక వ్యయంతో కూడుకున్న కార్యక్రమం. కాని ఎక్కువ భూవిస్తీర్ణానికి కాలువలు నీటిపారుదల సౌకర్యాలను అందిస్తాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో కాలువలు ఎక్కువ భూమికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మొత్తం సాగుభూమిలో కాలువలు ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం 2011-12 నాటికి 16.1 మిలియన్ల హెక్టారులుగా వుంది. కాలువలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
ఎ) శాశ్వత కాలువలు
బి) వెల్లువ నీటికాలువలు
ఎ) శాశ్వత కాలువలు: నదులపై అడ్డంగా ఆనకట్టలు కట్టగా ఏర్పడిన జలాశయాలకు ఈ కాలువలను అనుసంధానం చేస్తారు. అందువల్ల ఇవి వ్యవసాయానికి సంవత్సరం పొడవునా నీటిని అందించి శాశ్వత కాలువలుగా పిలవబడుతున్నాయి. ఈ కాలువలు ఎక్కువ విస్తీర్ణంలో భూమికి నీటిని అందిస్తాయి.
బి) వెల్లువ నీటికాలువలు: వరదలు వచ్చినపుడు పంటలు ముంపునకు గురికాకుండా ఈ కాలువలను ఏర్పాటు చేస్తారు. అందువల్ల వీటిని “వెల్లువ నీటికాలువలు” అంటారు. వేసవికాలంలో ఈ కాలువలు పూర్తిగా ఎండిపోతాయి. కరువు కాటకాల సందర్భాలలో అవసరమైతే అల్ప భూమివిస్తీర్ణానికి సాగునీరు అందించడానికి కూడా నీటిని ఉపయోగిస్తారు.
2) బావులు: బావులు ఆధారపడదగిన ముఖ్యమైన నీటి వనరులు. బావులను సాధారణ బావులని, గొట్టపు బావులని రెండు రకాలుగా వర్గీకరించారు. సాధారణ బావులు ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం గొట్టపు బావుల ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం కంటే చాలా తక్కువగా వుంది.
3) చెరువులు: సాధారణంగా బావులు, కాలువలు ద్వారా, నీటిపారుదల సౌకర్యాలు లభ్యంకాని ప్రాంతాలలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులు. చెరువులు వర్షంతో నిండి రైతులకు అవసరమైనపుడు నీరు అందిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో చెరువుల ద్వారా సాగుచేస్తున్న భూవిస్తీర్ణం అధికంగా
ఉంది.
నీటిపారుదల ప్రాధాన్యత:
1) అకాల అనిశ్చిత వర్షాలు: వర్షాలు రుతువులపై ఆధారపడి సంవత్సరంలో నాలుగు నెలలకు మాత్రమే పరిమితమై వుంటాయి. కొన్నిసార్లు రుతువుల్లో సైతం వర్షపాతం అల్పంగా ఉండటమే గాక, అకాల వర్షాలు వస్తుంటాయి. నీటిపారుదల సౌకర్యాలను విస్తృత పరుచుట ద్వారా కరువుకాటకాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
2) ఉత్పాదకత పెరుగుదల: నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా వున్నచోట వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువగా వుంటుంది. నీటిపారుదల సౌకర్యాలు వున్నప్పుడే ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలైన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలు, ఎరువులు మొదలైన వాటిని వినియోగించడానికి వీలవుతుంది. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో వార్షిక పెరుగుదల 1.6 శాతం నుండి 2.6 శాతానికి పెరిగింది. అదే నీటిపారుదల సౌకర్యాలు అల్పంగా వున్న ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల 1శాతం లేదా గమనించలేనంత తక్కువగా నమోదైంది.
3) బహుళ పంటలు పండించడం: భారతదేశం ఉష్ణమండల, ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితులు విస్తరించి వున్నాయి. ఈ దేశానికి సంవత్సరమంతా పంటలు పండించగల సామర్థ్యం వుంది. మనదేశంలో వర్షపాతం నాలుగు నెలలలోపు కాలానికి మాత్రమే పరిమితమైంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే సంవత్సరమంతా బహుళ పంటలు పండించవచ్చు.
4) నూతన వ్యవసాయ వ్యూహంలో ప్రధానపాత్ర: నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా ప్రవేశపెట్టబడిన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను, రసాయనిక ఎరువులను విజయవంతంగా వినియోగించాలంటే సకాలంలో, సరిపడినంత నీటిపారుదల సౌకర్యాలు అవసరం. ఈ విత్తనాలు, ఎరువుల వినియోగానికి క్రమబద్ధంగా పుష్కలంగా నీటిని అందించాలి. నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే నూతన వ్యవసాయ వ్యూహం కిందసాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది.
5) సాగుభూమి విస్తీర్ణంలో పెరుగుదల: భూవినియోగ గణాంకాల ప్రకారం మనదేశంలో లెక్కించిన మొత్తం భూమి 2009-10 నాటికి 305.56 మిలియన్ల హెకార్టు. ఇందులో 42.95 మిలియన్ల హెక్టార్లు వ్యవసాయం చెయ్యని భూములు కాగా 26.23 మిలియన్ల హెక్టార్లు బంజరు భూములుగా వున్నాయి. నీటిపారుదల సౌకర్యాల కల్పిస్తే నిరుపయోగంగా వున్న ఈ భూములను కొంతమేరకు సాగులోకి తీసుకురావచ్చు.
6) సంపద పెరుగుదల: కరువు కాటకాలు సంభవించినప్పుడు సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు అస్థిరతకు లోనవుతాయి. కాని నీటిపారుదల సౌకర్యాల కరువు కాటకాల సమయంలో పంటలను రక్షించి వ్యవసాయ ఉత్పత్తులను ఒడిదుడుకులకు గురికాకుండా స్థిరీకరిస్తాయి. ఉత్పత్తులలో స్థిరీకరణ సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పరిరక్షించబడి సంపద స్థిరంగా పెరుగుతుంది.
7) పరోక్ష ప్రయోజనాలు: నీటిపారుదల సౌకర్యాలను దేశం నలుమూలలకు విస్తరింపజేయడం ద్వారా ఆహారధాన్యాలు ఉత్పత్తిలో అసమానతలు రూపుమాసిపోతాయి. అంతేకాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా సాధించబడిన పెరుగుదల వ్యవసాయ ఉత్పతుల ధరల స్థిరీకరణకు తోడ్పడుతుంది. భారత ఆర్థికవ్యవస్థ ప్రాధాన్యతా రంగాల్లో ఒకటైన వ్యవసాయ రంగాన్ని ప్రగతి ప్రధాన నడపడంలో నీటిపారుదల సౌకర్యాలు కీలక భూమికను పోషిస్తున్నాయి.
ప్రశ్న 6.
భారతదేశంలో కమతాల పరిమాణం అల్పంగా ఉండటానికి గల కారణాలేవి ? కమతాల పరిమాణం అల్పంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యలు సూచింపుము.
జవాబు:
రైతు వ్యవసాయ కోసం వినియోగించే భూమి పరిమాణానికి “భూకమతం” అంటారు. కుటుంబ సభ్యులందరికి సముచిత జీవనప్రమాణం, ఉపాధి అవకాశాలు కల్పించే భూమి పరిమాణాన్ని “ఆర్థికకమతం” అంటారు. భారతదేశంలో రైతులు సాగుచేస్తున్న భూకమతాలు చిన్నవిగా ఉండటమే గాక కాలక్రమేణ తగ్గిపోతున్నాయి. మనదేశంలో కమతాల సగటు పరిమాణం 1980-81లో 1.84 హెక్టార్లు వుండగా 2010-11 నాటికి 1.16 హెక్టార్లకు తగ్గింది. కాని అమెరికాలో కమతాల సగటు పరిమాణం 122.5 హెక్టార్లుగా వుంది.
భారతదేశంలో కమతాల పరిమాణం అల్పంగా వుండటానికి గల కారణాలు: మనదేశంలో కమతాల సగటు పరిమాణం అల్పంగా ఉన్నందువల్ల వ్యవసాయ ప్రగతి కుంటుపడి ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించాలంటే అందుకు గల కారణాలను అన్వేషించాలి.
1) వారసత్వ చట్టాలు: మనదేశంలో కమతాల విభజన, విఘటనలకు వారసత్వ చట్టాలు ముఖ్య కారణం. హిందూ, మహమ్మదీయ చట్టాల ప్రకారం పిత్రార్జితమైన ఆస్తిని పంచుకోవడానికి కుమారులు మరియు కుమార్తెలు అర్హులు. ఈ కారణంగా కమతాల పరిమాణం విభజనకు, విఘటనకు లోనై కాలక్రమేణా తగ్గిపోతుంది.
2) భూమిపై జనాభా ఒత్తిడి: మనదేశంలో జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1.64 శాతంగా వుంది. జనాభా పెరుగుదల రేటు వేగంగా ఉన్నప్పటికీ వ్యవసాయ యోగ్యమైన భూవిస్తీర్ణంలో పెరుగుదలరేటు అత్యల్పంగా వుంది. అంతేగాక మనదేశంలో వ్యవసాయేతర రంగాలు వేగంగా విస్తరించక పోవడం వల్ల పెరుగుతున్న జనాభా వ్యవసాయరంగాన్ని ఆశ్రయించడంలో కమతాల విభజన విఘటనలకు దారితీస్తుంది.
3) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడం: తరతరాలుగా కుటుంబ సభ్యులు కలిసి జీవించే ఉమ్మడి కుటుంబాలు పాశ్చాత్యీకరణ వల్ల విచ్ఛిన్నమై వాటాస్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఆవిర్భవించాయి. వ్యక్తిగత కుటుంబాల సంఖ్య పెరిగి, వ్యవసాయ భూమి అనేకసార్లు విభజనకు గురై కమతాల సగటు పరిమాణం క్రమేపి తగ్గిపోతున్నది.
4) గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ ప్రాంతాలలోని రైతులు సంస్థాపరమైన పరపతి సౌకర్యాల అందుబాటులో లేక వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడి పీకల్లోతు అప్పుల్లో మునిగి ఉన్నారు. కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు, చిన్న, సన్నకారు రైతుల భూమిని కబళించాలనే ఉద్దేశంలో వీరికి భూముల తనఖా మీద అప్పులిస్తుంటారు. అంతేకాక వీరు మోసపూరిత కార్యకలాపాలను అవలంభిస్తారు. రైతుల బాకీల పరిష్కారం కొరకు తమ భూమిని అమ్ముకునే పరిస్థితులు కల్పిస్తారు. తత్ఫిలితంగా వ్యవసాయదారుల భూకమతాలు క్రమేపి తగ్గిపోతున్నాయి.
5) భూమిపై మక్కువ ఎక్కువ: సాధారణంగా గ్రామీణ ప్రాంత రైతుల మానసిక, సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల భూమిపై మక్కువ కలిగి ఉంటారు. వీరు భూమి కలిగి ఉండటాన్ని ఆస్థిగా కాక సాంఘిక హోదాగా, గౌరవంగా భావిస్తారు. అందువల్ల వీరు భూమిపై మమకారాన్ని అనుబంధాన్ని పెంచుకొని తమకు వారసత్వంగా లభించిన భూమి పరిమాణం ఎంత స్వల్పమైనప్పటికీ వదులుకోవడానికి ఇష్టపడరు. భూమి మీద ఉన్న ఈ అతి మక్కువ వల్ల ‘కమతాల పరిమాణం క్రమంగా క్షీణిస్తుంది.
6) చేతి వృత్తుల, కుటీర పరిశ్రమలు క్షీణించడం: పారిశ్రామికీకరణకు పూర్వం గ్రామీణ ప్రాంతాలలో చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు వైభవోపేతంగా విరాజిల్లుతుండేవి. పారిశ్రామికీకరణ తర్వాత అధునాతన యంత్రాల సహయంతో తయారయ్యే వస్తువుల పోటీకి తట్టుకోలేక చేతివృత్తులు, కుటీరపరిశ్రమలు కాలక్రమేణా క్షీణించడం ప్రారంభించాయి. ఈ రంగాలపై ఆధారపడిన గ్రామీణ వృత్తి కళాకారులు, ఇతరులు జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల కమతాల పరిమాణం క్షీణించడం ప్రారంభమైంది.
చిన్న కమతాల పరిమాణం వల్ల ఏర్పడే దుష్పరిణామాలు:
1) వ్యవసాయపు భూమి వృథా: విభజన, విఘటన వల్ల కమతాల సంఖ్య పెరిగే కొద్ది విలువైన వ్యవసాయ భూమి గట్లు, కంచెలు, కాలిబాటలు మొదలైన వాటి రూపంలో మొత్తం భూమిలో మూడు నుండి నాలుగు శాతం వరకు వృథా అవుతుంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో కమతాల సగటు పరిమాణం 0.006 ఎకరాలుగా వుంది. దీనిని బట్టి మనదేశంలో అల్పకమత పరిమాణ తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.
2) పర్యవేక్షణ కష్టం: మనదేశంలో రైతులుకున్న భూమి చిన్నచిన్నకమతాలుగా వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి వుంటాయి. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలు రుతుబద్ధకంగా వుంటాయి. అందువల్ల వేర్వేరు ప్రాంతాలలో నిర్వహింపబడే వ్యవసాయ కార్యకలాపాలను వ్యవసాయదారులు ఏకకాలంలో పర్యవేక్షించలేరు. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యం, ఉత్పత్తి క్షీణిస్తున్నాయి.
3) ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవకాశం తక్కువ: వ్యవసాయకమతాలు చిన్నవిగా వున్నప్పుడు వ్యవసాయ కార్యకలాపాలలో యంత్రాలను వినియోగించడం కష్టం. అంతేకాక ఈ అల్పకమతాల అధిక పెట్టుబడితో కూడుకున్న ట్రాక్టర్లు విద్యుత్ మోటార్లు, డ్రిల్లర్లు, స్ప్రేయర్లు, పంటమార్పిడి యంత్రాలను వినియోగించి ఆధునిక పద్ధతుల్లో సాగుచేయడానికి అననుకూలం. తత్ఫలితంగా వ్యయసాయ యాంత్రీకరణ లోపించి ఉత్పత్తి క్షీణిస్తుంది.
4) ఉత్పత్తి పరికరాల రవాణా: కమతాల విభజన, విఘటనల ఫలితంగా వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి ఉన్న చిన్న కమతాలలో వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకై వ్యవసాయ పరికరాలను యంత్రాలను, పశువులను, విత్తనాలను ఇతర ఉత్పత్తి పరికరాలను ఒకచోటు నుంచి వేరొక చోటుకు రవాణా చేయవలసి వుంటుంది. అందువల్ల రైతుల సమయం, ధనం వృథా అవుతాయి.
5) సరిహద్దు తగాదాలు, కోర్టు వ్యవహారాలు: సాధారణంగా చిన్న కమతాల సంఖ్య పెరిగే కొలది గ్రామీణ ప్రాంతాలలో కాలిబాటలు, సరిహద్దులు, కంచెలు, పంటలను దొంగిలించడం, దొంగతనంగా పశువులను మేపడం మొదలైన విషయాలలో గొడవలు జరగడం సర్వసాధారణం. వీటివల్ల గ్రామీణ వాతావరణం, కలుషితమై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. రైతులు న్యాయస్థానాలు చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని, ధనాన్ని వృథా చేసుకుంటూ వ్యవసాయ కార్యకలాపాలను అశ్రద్ధ చేస్తున్నారు.
6) ప్రచ్ఛన్న నిరుద్యోగిత: వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడంతో అవకాశాలు కొరవడి రైతు కుటుంబ సభ్యుల తప్పనిసరి పరిస్థితులలో జీవనోపాధికై తమ చిన్న వ్యవసాయ కమతాలలోనే పనిచేయడం తప్పనిసరైంది. ఫలితంగా వ్యవసాయరంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏర్పడింది.
7) శ్రమ, మూలధనాల అల్పవినియోగం చిన్న రైతులు శ్రామికులను, మూలధనాన్ని పూర్తిగా వినియోగించుకోలేరు. అంతేకాక మార్కెటింగ్, పరపతి సౌకర్యాలను కూడా సరిపడినంతగా పొందలేరు. అందువల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి తగిన ప్రతిఫలం పొందలేకున్నారు.
రైతులు తమ చిన్న వ్యవసాయ కమతాలలో భూసారపరిరక్షణ, భూమి పునరుద్ధరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేరు. అంతేకాక పంటల మార్పిడి, పంటల విరామం వంటి నూతన పద్ధతులలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించలేరు.
ప్రశ్న 7.
సహకార వ్యవసాయం వల్ల లభించే లాభాలను, నష్టాలను వివరింపుము.
జవాబు:
సహకార వ్యవసాయం – అర్థం: “ఒక్కరికోసం అందరు – అందరికోసం ఒక్కరు” అనే మహత్తర భావనతో 1904 సంవత్సరంలో మనదేశంలో సహకార వ్యవసాయానికి పునాదులు ఏర్పడ్డాయి. గ్రామంలోని రైతులంతా స్వచ్ఛందంగా ఒక సంఘంగా ఏర్పడి తమ భూములు, వ్యవసాయ పరికరాలు, పశువులు మొదలైన ఉత్పాదకాలన్నంటిని సంఘానికి అందించి మొత్తం భూమిని ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికన నిర్వహించే వ్యవసాయాన్ని “సహకార వ్యవసాయం” అంటారు. పండిన పంటను రైతులు సంఘానికి అందించిన భూమి అనుపాతానికి అనుగుణంగా పంచుకొంటారు. ఈ విధంగా రైతులు భూమిమీద తమ యాజమాన్యపు హక్కులను కోల్పోరు.
సహకార వ్యవసాయం – ప్రయోజనాలు:
1) ఉత్పత్తిలో పెరుగుదల: సహకార వ్యవసాయంలో భూములన్నింటినీ ఏకఖండంగా చేయడంలో గట్లు, కాలిబాటల రూపంలో వుండే భూములు, బంజరు భూములు కూడా సాగులోకి తేవడంవల్ల సాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తి, అధికమై విక్రయం కాగల మిగులు పరిమాణం పెరుగుతుంది.
2) పెద్దతరహా ఆదాలు: సహకార వ్యవసాయం ద్వారా ఉత్పత్తిలో సాంకేతిక, మార్కెటింగ్, ద్రవ్యపరమైన ఆదాలు లభిస్తాయి. అందువల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గి ఉత్పత్తిలో పెద్దతరహా ఆదాలు లభిస్తాయి.
3) వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు: సహకారవ్యవసాయం, పెద్దతరహా వ్యవసాయం, అయినందువల్ల భూసార సంరక్షణ భూమి పునరుద్ధరణ, గొట్టపుబావులు త్రవ్వకం మొదలైన కార్యక్రమాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అధిక పెట్టుబడి అవసరమయ్యే ఈ కార్యకలాపాలను సంఘంస్థాయిలో సమిష్టిగా చేపట్టి వ్యవసాయాభివృద్ధిని సాధించవచ్చు.
4) నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానం సహకార వ్యవసాయంలో నూతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని పెద్ద తరహాలో ప్రవేశపెట్టవచ్చు. అందువల్ల సగటు వ్యయం తగ్గి లాభాల స్థాయి పెరుగుతుంది.
5) సమర్థవంతమైన క్షేత్ర నిర్వహణ: విస్తృత ప్రాతిపదికన జరుగుతున్న సహకార వ్యవసాయంలో వ్యవసాయ శాస్త్రవిజ్ఞాన నిపుణుల సేవలను వినియోగించి క్షేత్ర నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టవచ్చు. అంతేకాక శ్రమ విభజనను ప్రవేశపెట్టి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక ఫలితాలు పొందవచ్చు.
6) వ్యవసాయరంగంలో ఉద్యోగిత అవకాశాలు: సహకార వ్యవసాయ విధానంలో సాంద్ర, విస్తృత వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ ఫలితంగా శ్రామికులకు డిమాండ్ పెరిగి రుతుసంబంధిత, ప్రచ్ఛన్న, నిరుద్యోగితలు తగ్గి ఉపాధి, అవకాశాలు పెరుగుతాయి.
7) సాంఘీక సమానత్వం: సహకార సంఘాలలోని రైతులందరూ పరస్పరం సహకరించుకుంటూ, సమిష్టిగా ఆలోచిస్తూ, ఉమ్మడిగా వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా వారి మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం ఏర్పడి సాంఘిక సమానత్వం సాధించబడుతుంది.
సహకార వ్యవసాయంలోని సమస్యలు:
1) రైతుల వ్యతిరేకత: సహకార వ్యవసాయ విధానంలో రైతులకు తమ భూముల మీద యాజమాన్యపు హక్కులు కోల్పోతామనే అపోహలుండేవి. అంతేగాక తాము శ్రామికుల స్థాయికి దిగజారుతామనే ఎక్కువమంది రైతుల విశ్వాసం. అందువల్ల వ్యతిరేకత ఈ కార్యక్రమ ప్రగతికి ప్రతిబంధకమైంది.
2) నిర్వహణ సమస్యలు: సాధారణంగా భారతీయ వ్యవసాయదారులకు చిన్న కమతాల నిర్వహణలో మాత్రమే సమర్ధులు. వీరికి పెద్ద కమతాలను నిర్వహించగల నిపుణత, దక్షత లేదు. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో నిపుణుల |కొరతవల్ల సహకార వ్యవసాయం నిరుత్సాహపరచబడింది.
3) నిరుద్యోగిత: సహకార వ్యవసాయ నిర్వహణలో భారీ ఎత్తున యంత్రాలను ఉపయోగించడానికి అవకాశాలు ఎక్కువ. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల శ్రామికులు ఉపాధి కోల్పోవడంతో నిరుద్యోగిత మరింత అధికమవుతుంది.
4) పెద్ద రైతుల ఆధిపత్యం: సహకార వ్యవసాయం నిర్వహణలో పెద్దరైతుల ఆధిపత్యం కొనసాగి, చిన్న రైతుల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పెద్ద రైతులు చిన్న రైతులను ఎప్పటికీ తమలో సమానంగా చూడరనేది దాగిన సత్యం. అందువల్ల ఈ విధానంలో సమానత్వం సాధించడం సాధ్యం కాదు.
5) శిక్షణ, పొందిన సిబ్బంది కొరత: విస్తృత ప్రతిపాదికన జరిగే సహకార వ్యవసాయాన్ని నిర్వహించడానికి | శిక్షణ పొందిన నిపుణులు అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్యా స్వల్పంగా ఉంది.
6) ఇతర సమస్యలు:
- రైతులలో సహకార వ్యవసాయం పట్ల ఆసక్తిని ప్రేరేపించకుండా పూర్తిగా స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ విధానాన్ని ఏర్పరచడం వల్ల విఫలమైంది.
- సహకార వ్యవసాయం ద్వారా లభించిన ఉత్పత్తి ఫలాలు ఏ ప్రాతిపదికన రైతులు, వ్యవసాయ కూలీల మధ్య పంపిణీ చేయాలి అన్న విషయం పట్ల నిర్థిష్ట ప్రమాణాలు లేవు.
ప్రశ్న 8.
భారతదేశంలో కౌలు సంస్కరణలను వివరింపుము.
జవాబు:
ఏ రైతులు జీవనోపాధి కోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు.
- జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు
- ఉపకౌలుదార్లు
- ఏ హక్కులు లేని కౌలుదారులు.
జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు:
1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లను శాశ్వత కౌలుదారులంటారు. వీరికి తమ అధీనంలోని భూములపై యాజమాన్యపు హక్కులుంటాయి. వీరు కౌలు సక్రమంగా చెల్లిస్తున్నంత కాలం వీరిని భూస్వాములు భూమి నుంచి తొలగించలేరు. వీరు చెల్లించాల్సిన కౌలు పరిమాణం ముందుగా నిర్ణయించబడి కౌలు భద్రత కల్గి ఉంటారు.
2) ఉపకౌలుదారులు: ఉపకౌలుదారులను “తాత్కాలిక కౌలుదారులు” అంటారు. శాశ్వత కౌలుదారులు తమ అధీనంలోని భూమిని ఇతరులకు కౌలుకిస్తారు. వీరినే ఉపకౌలుదారులు అంటారు. వీరికి తాము వ్యవసాయం చేస్తున్న భూములపై ఎలాంటి హక్కులుండవు.
3) ఏ హక్కులు లేని కౌలుదార్లు ఈ కౌలుదారుల పరిస్థితి అనిశ్చితం, దయనీయం, కౌలు పరిమాణాన్ని పెంచడం, భూమి నుంచి తొలగించడం వంటి చర్యల వల్ల వీరు దోపిడికి గురి అవుతారు.
కౌలుదారులను దోపిడి నుంచి రక్షించడానికి ప్రభుత్వం కౌలు సంస్కరణలు చేపట్టింది. కౌలుదారులు కౌలు భద్రత కల్పించడం, కౌల పరిమాణాన్ని నిర్ణయించడం కౌలుదారులకు యాజ్యమాన్యపు హక్కులు కల్పించడం కౌల సంస్కరణలలో ప్రధాన అంశాలు.
1) కౌలు పరిమాణం క్రమబద్ధీకరణ: స్వాతంత్ర్యానికి పూర్వం మనదేశంలో కౌలుపరిమాణం చాలా ఎక్కువగా ఉండేది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కౌలపరిమాణంలో వ్యత్యాసాలున్నాయి. చట్ట ప్రకారం నిర్ణయించిన కౌలు పరిమాణం కంటే వాస్తవంగా చెల్లించే కౌలు పరిమాణం ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం, భూమి మీద జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉండటం.
2) కౌలు భద్రత: మనదేశంలో కౌలుదారులు భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. అందువల్ల కౌలుదారులు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపేవారు కాదు. కౌల భద్రత ఉన్నప్పుడే మీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. అప్పుడు మాత్రమే వారు భూమి అభివృద్ధి కార్యక్రమాలు, భూసార పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించగలరు.
3) కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు: “దున్నేవానికే భూమి” అనేది మన దేశ కౌలు సంస్కరణల ప్రధానోద్దేశం. ఈ లక్ష్య సాధన కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కౌలదారులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ శాసనాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా 12. 42 మిలియన్ల కౌలదారులకు 6.32 మిలియన్ల హెక్టారుల భూమిపై యాజమాన్యపు హక్కులు లభించాయి.
ప్రశ్న 9.
భారతదేశంలో వివిధ రకాల భూ సంస్కరణలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధి కొరకు ఉత్పత్తిని అధికం చేయుటకు, ప్రణాళిక బద్ధంగా ఆర్థికాభివృద్ధిని సాధించుటకు, సాంఘిక న్యాయాన్ని చేకూర్చుటకు మనదేశంలో భూ సంస్కరణలు అమలులోకి వచ్చాయి.
1) మధ్యవర్తుల తొలగింపు: మనదేశంలో భూ సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులుపొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.
2) కౌలు సంస్కరణ: ఏ రైతులు జీవనోపాధికోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు. 1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు 2) ఉపకౌలుదార్లు 3) ఏ హక్కులూ లేని కౌలుదార్లు వ్యవసాయదారులలో సుమారు 50% మంది ఏ హక్కులు లేని కౌలుదారులుగా ఉన్నారు. వారు ఎటువంటి కౌలు భద్రతా లేదు. ఇష్టం వచ్చినప్పుడు భూస్వామి కౌలుదారులను తొలగించవచ్చు. అందుచేత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కౌలు సంస్కరణలు ప్రవేశపెట్టాయి.
- కౌలు భద్రత: కౌలుదారుడు సక్రమంగా కౌలు చెల్లించినంత కాలం భూస్వామి అతనిని తొలగించుటకు వీలులేదు. చట్టం నుండి తప్పించుకొనుటకు భూస్వాములు సొంత వ్యవసాయం చేసే నెపముతో కౌలుదార్లును తొలగించరాదు.
- కౌలు పరిమాణం: కౌలుదారుల నుండి భూస్వాములు వసూలు చేసే కౌలుకు పరిమితి నిర్ణయించారు. మొత్తం ఉత్పత్తిలో కౌలుదారులు చెల్లించవలసిన కౌలు ఉత్పత్తిలో 25 నుండి 50% మించకూడదని నిర్ణయించారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య కౌలు పరిమాణంలో తేడాలున్నాయి. ఆంధ్రలో మొత్తం ఉత్పత్తిలో 20 నుండి 30 శాతం గుజరాత్లో 1/6; కర్ణాటకలో 1/5 నుండి 1/4 భాగం.
- కౌలుదార్లుకు యాజమాన్యపు హక్కులు భూమిని దున్నే రైతులకు ఆ భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించవలెననేది కౌలు సంస్కరణల ముఖ్యలక్ష్యం.
3) కమతాల గరిష్ట పరిమితి నిర్ణయం: వ్యవసాయ రంగంలో సాంఘిక అన్యాయాలను తొలగించి కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించవలెను. భూమి దున్నేవారికి భూములు కల్పించటం కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించటం ముఖ్య లక్ష్యం. కమతాల గరిష్ట పరిమాణం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు భూసారం, నీటిపారుదల వసతులు, సేద్యపు పద్ధతులు మొదలగునవి పరిగణనలోనికి తీసుకోవడం, జరుగుతుంది. కుటుంబ సభ్యులు 5గురు కన్నా మించి ఉన్నట్లయితే గరిష్ట పరిమితి పెంచబడుతుంది.
4) చిన్న కమతాల సమస్యలు పరిష్కరించుట: కమతాల సమీకరణ,. లాభసాటి కమతాలను ఏర్పరుచుట, సహకార వ్యవసాయం మొదలగునవి చిన్న కమతాల సమన్వయ పరిష్కరించుటకు తీసుకొనిన చర్యలు.
5) సహకార వ్యవసాయం ప్రోత్సహించుట: భూ సంస్కరణల లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయరంగ సామర్థ్యాన్ని పెంచడానికి సహకార వ్యవసాయం ఒక మంచి మార్గమని ఆర్థికవేత్తలు సూచించడం జరిగింది. ఈ విధానంలో రైతులందరూ సహకరించి చేసే ఉమ్మడి వ్యవసాయం. వ్యవసాయం పెద్ద తరహాలో చేస్తే వచ్చేలాభాలంటిని రైతులందరూ ఈ విధానంలో పొందే అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించడం తేలిక. వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలుంటుంది.
ప్రశ్న 10.
భారతదేశంలో హరిత విప్లవం రావడానికి గల కారణాలను, భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం వ్యవసాయరంగ ప్రగతిని వేగవంతం చేసేందుకు అనేక వ్యవస్థాపూర్వక, వ్యవస్థేతర సంస్కరణలను చేపట్టింది. వ్యవస్థేతర సంస్కరణలో నూతన వ్యవసాయ వ్యూహం అత్యంత ప్రధానమైంది. భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించిన ఈ నూతన వ్యవసాయ వ్యూహం వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు పునాది వేసింది.
ఆచార్య నార్మన్ బోర్లెగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. అంతర్జాతీయ అభివృద్ధి సంఘ సమావేశంలో ఉపన్యసిస్తూ విలియం ఎస్. గాండ్ అనే ఆర్థికవేత్త హరితవిప్లవం అనే పదాన్ని మొదటి సారిగా ఉపయోగించారు. అనేకమంది ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని క్రింది విధంగా నిర్వచించారు.
1) వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవచైతన్యాన్ని రగిల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, యంత్రపరికరాలను ఉపయోగించి జీవనాధార, వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పుల కూర్పును ‘హరిత విప్లవం’ అంటారు.
పై నిర్వచనం ప్రకారం రైతుల్లో ప్రేరణ కలిగించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రవేశపెట్టబడిన మౌలికమైన మార్పులను హరిత విప్లవం అంటారు.
2) జాన్, కేరీ వంటి ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని రసాయన ఎరువులు, విత్తనాల విప్లవం అంటారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. భారతదేశ హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎమ్. ఎస్. స్వామినాథన్ వ్యవసాయరంగ ప్రగతికి భూసార పునరుద్ధరణ, అభిలషణీయ నీటి వినియోగం, సరిపడినంత పరపతి, యాంత్రికీకరణ, సరైన మార్కెట్ సౌకర్యాలు ఆవశ్యకం అని సూచించారు.
హరిత విప్లవాన్ని ప్రభావితం చేసే అంశాలు:
భారత ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికోసం అనేక పథకాలు, ప్రణాళికలు రూపొందించి అమలుచేసింది. ఈ చర్యల ఫలితంగా భారతదేశంలో హరిత విప్లవం ఆవిర్భవించింది. కింది అంశాలు హరిత విప్లవం ఆవిర్భవించడానికి కారణభూతాలైనాయి.
1) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP): భారత ప్రభుత్వం 1964లో ఫోర్ట్ ఫౌండేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటివనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి, వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్యల తీవ్రత తక్కువగా వున్న ఏడు జిల్లాలను చూచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి కృషి ప్రారంభించింది.
సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి పథకం కింద రైతులకు అవసరమైన ఉత్పాదకాలను అన్నింటినీ ఒకేసారి అందించడం జరుగుతుంది. అందువల్లనే ఈ పథకాన్ని “పేకేజ్ పథకం” అని కూడా పిలుస్తారు.
2) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (IAAP): భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయం కింద ఉన్న భూ విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకుగాను ఈ పథకాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఈ పథకం కొన్ని ఎంచుకున్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని మనదేశంలోని 114 జిల్లాలకు విస్తరింపచేశారు.
సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమంలాగానే సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం కూడా కొన్ని ఎంచుకున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్నప్పటికీ ఈ ప్రాంతాల్లోని అభివృద్ధి ఫలితంగా సమీప ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనినే ‘విస్తరణ ప్రభావాలు’ అంటారు.
3) అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమం (HYVP): ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం. హరిత విప్లవాన్ని సాధించడంలో సంకరజాతి విత్తనాల పాత్ర కీలకమైనది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) పంజాబ్లోని వ్యవసాయ విద్యాలయాలు, వివిధ పరిశోధనా కేంద్రాల సమిష్టి కృషి ఫలితంగా అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది.
4) అల్పఫలన కాలపు పంటలు: భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఇక్రిశాట్ (ICRISAT) మొదలైన సంస్థల సమిష్టి కృషి, పరిశోధనల ఫలితంగా మనదేశంలో పంటల ఫలన కాలం గణనీయంగా తగ్గి అల్పఫలన కాలపు పంటలు అనుభవంలోనికి వచ్చాయి. వరి, గోధుమ, మొక్కజొన్న మొదలైన పంటల ఫలన కాలం బాగా తగ్గింది. వరి పంట ఫలనకాలం 6 నెలల కాలవ్యవధి నుండి 120 రోజులకు తగ్గింది. అద్భుత గోధుమ (MIRACLE WHEAT) ప్రాచుర్యం పొందిన మెక్సికన్ రకం గోధుమ, 188, 12Ro, 1001, 1010 మసూరి, బాసుమతి, జయ, పద్మ వంటి వరి రకాలు మనదేశంలో పండించబడుతున్నాయి. ఈ విత్తనాల ఫలన కాలం తగ్గినందువల్ల సంవత్సరానికి రెండు లేదు మూడు పంటలను పండించడం సాధ్యమైనది.
5) నీటిపారుదల సౌకర్యాల విస్తరణ: నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమయ్యే ప్రాంతాలలో వ్యవసాయ పరిశోధనలు, ప్రయోగాలు చేయడానికి వీలవుతుంది. అంతేగాక అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలకు సమృద్ధిగా నీటిపారుదల సౌకర్యాలు అవసరం.
6) వ్యవసాయ యాంత్రికీకరణ: ఇది హరిత విప్లవంలో అంతర్భాగం వ్యవసాయ యాంత్రికీకరణలో భాగంగా విద్యుత్ పంపుసెట్లు చెరకు క్రషర్స్, ట్రాక్టర్లు పంట మార్పడి యంత్రాలు మనదేశంలో విరివిగా వాడుకలోకి వచ్చాయి. వ్యవసాయ యాంత్రీకీకరణ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి.
7) రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందుల వినియోగం: అధిక దిగుబడినిచ్చే విత్తనాలకు అధిక పరిమాణంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం అవసరం. అప్పుడు మాత్రమే ఈ విత్తనాలు సత్ఫలితాలాలను ఇస్తాయి. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అందువల్ల భారత ప్రభుత్వం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల సరఫరా అధికం చేసే ఉద్దేశంతో వీటిని ఉత్పత్తి చేసే సంస్థలకు సౌకర్యాలు, రాయితీలు కల్పించి ప్రోత్సహించింది.
8) ఇతర అంశాలు: భారతదేశంలో హరిత విప్లవ ఆవిర్భావానికి పైన పేర్కొనబడిన అంశాలు కూడా దోహదం చేశాయి.
1) వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి అవసరమైన విస్తరణాధికారులను, గ్రామీణ విజ్ఞాన కేంద్రాలను, (RKC), వ్యవసాయం సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) ను స్థాపించి రైతులకవసరమైన విస్తరణ సేవలను ప్రభుత్వం అందించింది.
2) విద్యావంతులైన రైతులు మాత్రమే నూతన వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకోగలరు. అందుకే రైతుల్లో నిరక్షరాస్యతను తొలగించడం కోసం ప్రభుత్వము వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసింది.
3) రైతులు వ్యవసాయ కార్యకలాపాలను సకాలంలో నిర్వర్తించడానికి పరపతి అవసరం. అందువల్ల భారత ప్రభుత్వం వాణిజ్య బ్యాంకులను, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను, ప్రాథమిక వ్యవసాయ పరపతి .సంఘాలను స్థాపించి సకాలంలో పరపతి అందిస్తుంది.
భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం: హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.
2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల: హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61లో 110 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. నూనెగింజలు ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ల టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.
3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.
4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు: వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.
5) ఆదాయల్లో పెరుగుదల: ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.
6) పేదరికం తగ్గుదల: హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని * కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.
ప్రశ్న 9.
భారతదేశంలో వివిధ రకాల భూ సంస్కరణలను సంక్షిప్తంగా వివరింపుము.
జవాబు:
వ్యవసాయాభివృద్ధి కొరకు ఉత్పత్తిని అధికం చేయుటకు, ప్రణాళిక బద్ధంగా ఆర్థికాభివృద్ధిని సాధించుటకు, సాంఘిక న్యాయాన్ని చేకూర్చుటకు మనదేశంలో భూ సంస్కరణలు అమలులోకి వచ్చాయి.
1) మధ్యవర్తుల తొలగింపు: మనదేశంలో భూ సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులు పొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.
2) కౌలు సంస్కరణ: ఏ రైతులు జీవనోపాధికోసం, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని సాగుచేస్తారో వారినే కౌలుదార్లు అంటారు. వీరిని మూడు రకాలుగా వర్గీకరించారు.
1) జిరాయితీ హక్కులున్న కౌలుదార్లు 2) ఉపకౌలుదార్లు 3) ఏ హక్కులూ లేని కౌలుదార్లు వ్యవసాయదారులలో సుమారు 50% మంది ఏ హక్కులు లేని కౌలుదారులుగా ఉన్నారు. వారు ఎటువంటి కౌలు భద్రతా లేదు. ఇష్టం వచ్చినప్పుడు భూస్వామి కౌలుదారులను తొలగించవచ్చు. అందుచేత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కౌలు సంస్కరణలు ప్రవేశపెట్టాయి.
1. కౌలు భద్రత: కౌలుదారుడు సక్రమంగా కౌలు చెల్లించినంత కాలం భూస్వామి అతనిని తొలగించుటకు వీలులేదు. చట్టం నుండి తప్పించుకొనుటకు భూస్వాములు సొంత వ్యవసాయం చేసే నెపముతో కౌలుదార్లును
తొలగించరాదు.
2. కౌలు పరిమాణం: కౌలుదారుల నుండి భూస్వాములు వసూలు చేసే కౌలుకు పరిమితి నిర్ణయించారు. మొత్తం ఉత్పత్తిలో కౌలుదారులు చెల్లించవలసిన కౌలు ఉత్పత్తిలో 25 నుండి 50% మించకూడదని నిర్ణయించారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య కౌలు పరిమాణంలో తేడాలున్నాయి. ఆంధ్రలో మొత్తం ఉత్పత్తిలో 20 నుండి 30 శాతం గుజరాత్లో 1/6; కర్ణాటకలో 1/5 నుండి 1/4 భాగం.
3. కౌలుదార్లుకు యాజమాన్యపు హక్కులు భూమిని దున్నే రైతులకు ఆ భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించవలెననేది కౌలు సంస్కరణల ముఖ్యలక్ష్యం.
3) కమతాల గరిష్ట పరిమితి నిర్ణయం: వ్యవసాయ రంగంలో సాంఘిక అన్యాయాలను తొలగించి కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించవలెను. భూమి దున్నేవారికి భూములు కల్పించటం కమతాలపై గరిష్ట పరిమితి నిర్ణయించటం ముఖ్య లక్ష్యం. కమతాల గరిష్ట పరిమాణం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు భూసారం, నీటిపారుదల వసతులు, సేద్యపు పద్ధతులు మొదలగునవి పరిగణనలోనికి తీసుకోవడం, జరుగుతుంది. కుటుంబ సభ్యులు 5గురు కన్నా మించి ఉన్నట్లయితే గరిష్ట పరిమితి పెంచబడుతుంది.
4) చిన్న కమతాల సమస్యలు పరిష్కరించుట: కమతాల సమీకరణ,. లాభసాటి కమతాలను ఏర్పరుచుట, సహకార వ్యవసాయం మొదలగునవి చిన్న కమతాల సమన్వయ పరిష్కరించుటకు తీసుకొనిన చర్యలు.
5) సహకార వ్యవసాయం ప్రోత్సహించుట: భూ సంస్కరణల లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయరంగ సామర్థ్యాన్ని పెంచడానికి సహకార వ్యవసాయం ఒక మంచి మార్గమని ఆర్థికవేత్తలు సూచించడం జరిగింది. ఈ విధానంలో రైతులందరూ సహకరించి చేసే ఉమ్మడి వ్యవసాయం. వ్యవసాయం పెద్ద తరహాలో చేస్తే వచ్చేలాభాలంటిని రైతులందరూ ఈ విధానంలో పొందే అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించడం తేలిక. వనరులు సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలుంటుంది.
ప్రశ్న 10.
భారతదేశంలో హరిత విప్లవం రావడానికి గల కారణాలను, భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము.
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం వ్యవసాయరంగ ప్రగతిని వేగవంతం చేసేందుకు అనేక వ్యవస్థాపూర్వక, వ్యవస్థేతర సంస్కరణలను చేపట్టింది. వ్యవస్థేతర సంస్కరణలో నూతన వ్యవసాయ వ్యూహం అత్యంత ప్రధానమైంది. భారత ప్రభుత్వం 1965లో ప్రారంభించిన ఈ నూతన వ్యవసాయ వ్యూహం వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు పునాది వేసింది.
ఆచార్య నార్మన్ బోర్లెగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. అంతర్జాతీయ అభివృద్ధి సంఘ సమావేశంలో ఉపన్యసిస్తూ విలియం ఎస్. గాండ్ అనే ఆర్థికవేత్త హరితవిప్లవం అనే పదాన్ని మొదటి సారిగా ఉపయోగించారు. అనేకమంది ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని క్రింది విధంగా నిర్వచించారు.
1) వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవచైతన్యాన్ని రగిల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, యంత్రపరికరాలను ఉపయోగించి జీవనాధార, వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పుల కూర్పును ‘హరిత విప్లవం’ అంటారు.
పై నిర్వచనం ప్రకారం రైతుల్లో ప్రేరణ కలిగించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి వ్యవసాయరంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రవేశపెట్టబడిన మౌలికమైన మార్పులను హరిత విప్లవం అంటారు.
2) జాన్, కేరీ వంటి ఆర్థికవేత్తలు హరిత విప్లవాన్ని రసాయన ఎరువులు, విత్తనాల విప్లవం అంటారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. భారతదేశ హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఎమ్. ఎస్. స్వామినాథన్ వ్యవసాయరంగ ప్రగతికి భూసార పునరుద్ధరణ, అభిలషణీయ నీటి వినియోగం, సరిపడినంత పరపతి, యాంత్రికీకరణ, సరైన మార్కెట్ సౌకర్యాలు ఆవశ్యకం అని సూచించారు.
హరిత విప్లవాన్ని ప్రభావితం చేసే అంశాలు:
భారత ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికోసం అనేక పథకాలు, ప్రణాళికలు రూపొందించి అమలుచేసింది. ఈ చర్యల ఫలితంగా భారతదేశంలో హరిత విప్లవం ఆవిర్భవించింది. కింది అంశాలు హరిత విప్లవం ఆవిర్భవించడానికి కారణభూతాలైనాయి.
1) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP): భారత ప్రభుత్వం 1964లో ఫోర్ట్ ఫౌండేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటివనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి, వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్యల తీవ్రత తక్కువగా వున్న ఏడు జిల్లాలను చూచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి కృషి ప్రారంభించింది.
సాంద్ర వ్యవసాయ జిల్లాల అభివృద్ధి పథకం కింద రైతులకు అవసరమైన ఉత్పాదకాలను అన్నింటినీ ఒకేసారి అందించడం జరుగుతుంది. అందువల్లనే ఈ పథకాన్ని “పేకేజ్ పథకం” అని కూడా పిలుస్తారు.
2) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (IAAP): భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయం కింద ఉన్న భూ విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకుగాను ఈ పథకాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఈ పథకం కొన్ని ఎంచుకున్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని మనదేశంలోని 114 జిల్లాలకు విస్తరింపచేశారు.
ప్రశ్న 11.
భారతదేశంలో వివిధ రకాల పరపతి మూలాలు ఏవి ?
జవాబు:
ఆర్థిక కార్యకలాపాలకు ధనం ప్రధాన ఇంధనం, వ్యవసాయ కార్యకలాపాల నిర్వాహణకు సకాలంలో సరిపడినంత పరపతి అవసరం. కాబట్టి వ్యవసాయాభివృద్ధి పరపతిలో ప్రత్యక్షంగా ముడిపడి ఉంది. వ్యవసాయం చేయడానికి సకాలంలో సరిపడినంత పరపతి లభించక మనదేశ రైతులు తగిన వ్యవసాయ ప్రతిఫలాలు పొందలేకున్నారు. T.W. ఘర్జ్ అనే ఆర్థికవేత్త అభిప్రాయంలో పరపతి కొరత వ్యవసాయాభివృద్ధిని కుంటుపరచడం మాత్రమే గాక సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో ప్రతిబంధంకంగా తయారైంది.”
వ్యవసాయ పరపతి వర్గీకరణ: సాధారణంగా వ్యవసాయ పరపతి పరిమాణం సాగులోవున్న భూకమతం పరిమాణం, ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి కారకాల లభ్యత, సాంకేతిక విజ్ఞానం, కుటుంబ అవసరాలు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైతులు పరపతిని ఉపయోగించే కార్యకలాపాల ఆధారంగా తిరిగి చెల్లించే కాలవ్యవధి ఆధారంగా వర్గీకరిస్తారు. అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం సూచనలను అనుసరించి రైతుల పరపతి అవసరాలను మూడు రకాలుగా వర్గీకరించారు.
1) స్వల్పకాలిక పరపతి: విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వేతనాలు, పశువుల దాణా, రవాణా మొదలైన అవసరాల కోసం పొందే పరపతిని ‘స్వల్పకాలిక పరపతి’ అంటారు. దీనిని 15 నెలల కాలవ్యవధిలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
2) మధ్యకాలిక పరపతి: భూమిని మెరుగుపరుచుట, బావుల తవ్వకం, పశువుల, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు మొదలైన అవసరాలు తీర్చుకొనుటకు పొందే పరపతి మధ్యకాలిక పరపతి అంటారు. దీనిని 15 నెలలు నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధిలో తీర్చవలసి ఉంటుంది.
3) దీర్ఘకాలిక పరపతి: నూతన భూములు కొనుగోలు, శాశ్వతంగా భూమిని అభివృద్ధి చేయుట, ట్రాక్టర్లు, విద్యుత్తు పంపుసెట్లు, పంట మార్పిడి యంత్రాలు మొదలైనవి కొనుగోలు చేయుటకు, పాత బాకీలు చెల్లించుటకు మొదలైన అవసరాల కోసం రైతులకు పెద్దమొత్తంలో అవసరమయ్యే పరపతిని దీర్ఘకాలిక పరపతి అంటారు. దీనిని 5 నుంచి 20 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
ఉత్పాదక, అనుఉత్పాదక రుణాలు: రుణాలను ఉత్పాదక, అనుత్పాదక రుణాలని రెండు రకాలుగా వర్గీకరించారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు, బావులు త్రవ్వకం, కంచెల నిర్మాణం మొదలైన ఉత్పాదకాల కొనుగోలు తీసుకున్న రుణాలను ఉత్పాదక రుణాలు అంటారు. కానీ మత సంబంధ కార్యక్రమాలు, వివాహాలు, పండుగలు, నగలు కొనుగోలు మొదలైన కార్యక్రమాల కోసం తీసుకున్న రుణాలను అనుత్పాదక రుణాలు అంటారు.
భారతదేశంలో వ్యవసాయ పరపతి ఆధారాలు: వ్యవసాయ కార్యకలాపాల నిర్వాహణకు పరపతి అత్యంత ఆవశ్యకం. రైతుల పరపతి ఆధారాలను సంస్థాగత మూలాధారాలు, సంస్థేతర మూలాధారాలు అని రెండు రకాలుగా వర్గీకరించారు. కాలక్రమేణా వ్యవసాయ పరపతిలో సంస్థాగత పరపతి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది.
1) ప్రభుత్వం: సంస్థాగత పరపతి విస్తరించిన కాలంలో ప్రభుత్వమే వ్యవసాయ పరపతిని అందించే ముఖ్యమైన సంస్థ. సాధారణంగా వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు రైతులకు ప్రభుత్వం అందించే పరపతి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. వరదలు, కరువు కాటకాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకొనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యక్షంగా తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేస్తుంది. ఈ రుణాలను ‘తక్కువ రుణాలు’ అంటారు. రైతులు ఈ రుణాలను సులభ వాయిదాలలో ప్రభుత్వానికి చెల్లించవచ్చు.
2) భారత రిజర్వు బాంకు పాత్ర: 1935లో మనదేశంలో స్థాపించిన కేంద్ర బాంకును 1949లో జాతీయం చేశారు. అదే భారత రిజర్వ్ బాంకుగా ప్రారంభం నుంచి గ్రామీణ పరపతిని అందించడంలో విశిష్టమైన పాత్ర పోషిస్తుంది. ఈ బాంకు భారత వ్యవసాయాభివృద్ధి కోసం 1956లో రెండు రకాల నిధులను ఏర్పాటు చేసింది.
- జాతీయ వ్యవసాయ పరపతి – దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి.
- జాతీయ వ్యవసాయ పరపతి – స్థిరీకరణ నిధి.
రైతులకు అవసరమైన దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు మొదటి నిధిని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకోవడానికి రెండవ నిధిని ఏర్పాటు చేశారు.
3) సహకార, పరపతి సంఘాలు: జర్మనీలో విజయవంతంగా అమలు చేయబడిన సహకార పరపతి విధానాన్ని ఆసరాగా తీసుకొని భారతదేశంలో 1904లో సహకారోద్యమం ప్రారంభించబడింది. గ్రామీణ రైతులను రుణ విముక్తులను చేసి వారిలో పొదుపు – అలవాట్లను పెంపొందించడం సహకార పరపతి సంస్థల మఖ్యోద్దేశం. మనదేశంలో సహకార పరపతి విధానాన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది.
4) వాణిజ్య బాంకులు: “లాభోద్దేశంలో బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బాంకులే వాణిజ్య బ్యాంకులు” 1951 వరకు వ్యవసాయానికి అందించబడిన మొత్తం పరపతిలో వాణిజ్య బాంకుల వాటా కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది.
1. వాణిజ్య బాంకులు గ్రామీణ రైతులకు అవసరమైన మొత్తం స్వల్పకాలిక పరపతిలో 42 నుంచి 45 శాతం వరకు అందిస్తున్నాయి. అదే విధంగా రైతులు, యంత్రాలు, ట్రాక్టర్లు, పంపుసెట్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం దీర్ఘకాలిక పరపతిలో 35 నుంచి 37 శాతం వరకు అందిస్తున్నాయి.
2. వాణిజ్య బాంకులు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన పశుపోషణ, పాడి, పందుల పెంపకం, కోళ్ళు పెంపకం, చేపల పెంపకం మొదలైన కార్యక్రమాలకు కూడా పరపతిని అందిస్తున్నాయి.
5) ప్రాంతీయ గ్రామీణ బాంకులు: భారత ప్రభుత్వం ఆచార్య యమ్. నరసింహం కమిటీ సిఫార్సులు ఆధారంగా 1975 అక్టోబర్ 2వ తేదీన ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 5 ప్రాంతీయ గ్రామీణ బాంకులను ప్రారంభించింది.
చిన్న రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, హస్తకళాకారులు, చిన్న వ్యాపారస్తులు మొదలైన వారికి పరపతిని సమకూర్చి ఉత్పాదక కార్యక్రమాల్లో ప్రగతిని సాధించడం గ్రామీణ బాంకుల ప్రధాన ఆశయం.
6) జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకు (NABARD): వ్యవస్థీకృత పరపతి సౌకర్యాల సమీక్షా సంఘం (CRAFICARD) సిఫార్సుల మేరకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కోసం 1982 జులై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకును ప్రారంభించారు.
- వ్యవసాయం, కుటీర, గ్రామీణ, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు మొదలైన కార్యక్రమాలకు పరపతిని అందించి సమగ్ర గ్రామీణాభివృద్ధికి నాబార్డ్ తోడ్పడుతుంది.
- గ్రామీణ బాంకులు, సహకార సంఘాలు కార్యకలాపాలను పర్యవేక్షించడమేగాక పరపతికి సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వానికి నాబార్డ్ సలహాదారుగా వ్యవహరిస్తుంది.
సంస్థేతర మూలాధారాలు:
1) వడ్డీ వ్యాపారస్తులు: మనదేశంలో సంస్థాపరమైన పరపతి అభివృద్ధి చెందకపోవడం వల్ల చాలాకాలంగా భారతదేశ వ్యవసాయ పరపతిలో వడ్డీ వ్యాపారస్తులు పాత్ర ఎక్కువగా ఉంది. వడ్డీ వ్యాపారస్తులు రెండు రకాలు. 1) వ్యవసాయదారులైన వడ్డీ వ్యాపారస్తులు. వీరు వ్యవసాయం చేస్తూ వడ్డీ వ్యాపారాన్ని మాత్రమే నిర్వహిస్తారు. సాధారణంగా వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీని వసూలు చేయడమేగాక అనుత్పాదక రుణాలను ప్రోత్సహిస్తారు. వీరు తప్పుడు లెక్కల ద్వారా రైతులను దోచుకుంటారు ప్రస్తుతం వడ్డీ వ్యాపారస్తుల పాత్ర క్రమేపి తగ్గుతున్నది.
2) భూస్వాములు: ఎక్కువ సందర్భాల్లో సన్నకారు రైతులు, కౌలుదారులు తమ పరపతి అవసరాల కోసం | భూస్వాముల దగ్గర నుంచి రుణాలు తీసుకొంటారు. భూస్వాములు అధిక వడ్డీని వసూలు చేయడమే కాక ఉత్పాదక, అనుత్పాదక కార్యక్రమాలు రెండింటికీ రుణాలిస్తుంటారు. వీరు తమ సమీపంలోని సన్నకారు రైతుల భూమిని కబళించాలనే దురాలోచనలో అధిక వడ్డీరేట్లకు వారికి తరచుగా రుణాలిస్తుంటారు. రైతులు అధిక వడ్డీతో కూడుకున్న ఈ రుణాలను చెల్లించలేక కొంతకాలం తరువాత రుణ పరిష్కారం కోసం తమ భూములను రుణాలిచ్చిన భూస్వాములకే అమ్మి వ్యవసాయ శ్రామికులుగా మారుతుంటారు. మొత్తం వ్యవసాయ పరపతిలో వీరి వాటా 1951లో 15శాతం ఉండగా 2002 నాటికి 1 శాతానికి తగ్గింది.
3) వ్యాపారులు కమీషన్ ఏజెంట్లు: వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు ఉత్పాదక కార్యక్రమాల కోసం పంట తనఖా మీద రైతులకు రుణాలిస్తారు. పంట పండిన తరువాత రైతులు తమ పంటను వీరికి మాత్రమే అమ్మవలసి ఉంటుంది. వీరు రైతులకు తక్కువ ధరలను చెల్లించడమేగాక, అధిక కమీషన్ వసూలు చేస్తారు. అందువల్ల రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందలేక రుణగ్రస్తులు అవుతున్నారు.
ఉదాహరణకు వాణిజ్య పంటలైన పత్తి, చెరకు మొదలైన పంటలకు తనఖా మీద రుణాలిస్తారు. మొత్తం వ్యవసాయ పరపతిలో 1951లో 55 శాతంగా ఉన్న ఈ పరపతి 2012 నాటికి 2.6 శాతానికి తగ్గింది.
4) బంధువులు స్నేహితులు: రైతులు తరచుగా వ్యవసాయ అవసరాల కోసం బంధువులు, స్నేహితుల వద్ద రుణాలు తీసుకొంటారు. మొత్తం వ్యవసాయ పరపతిలో ఈ విధమైన పరపతి వాటా తక్కువ. వీరు వడ్డీ వసూలు చేయవచ్చు లేదా తక్కువ వడ్డీకి రుణం ఇవ్వవచ్చు. ఇది దోపిడీ రహిత పరపతి విధానం.
సాధారణంగా రైతులు పంట చేతికి రాగానే ఈ రుణాలను తిరిగి చెల్లిస్తారు. మొత్తం వ్యవసాయ పరపతిలో వీరి వాటా 1951 నాటికి 14.2 శాతం ఉండగా 2002 నాటికి 7.1 శాతానికి తగ్గింది.
ప్రశ్న 12.
భారతదేశంలో గ్రామీణ రుణగ్రస్తతకు కారణాలేవి? రుణ విముక్తికి కొన్ని పరిష్కారాలను సూచించుము. [Mar ’16]
జవాబు:
గ్రామీణ రుణగ్రస్తత: గ్రామీణ రుణగ్రస్తతకు భారతదేశంలో వ్యవసాయదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య. రుణగ్రస్తత వ్యవసాయ కార్యకలాపాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా రైతులు ఉత్పాదక, అనుత్పాదక కార్యక్రమాల కోసం రుణాలు తీసుకొంటారు. రైతులు తాము తీసుకున్న రుణంలో అధిక భాగం అనుత్పాదక కార్యక్రమాల కోసం వ్యయం చేస్తున్నారు. అందువల్ల వీరు రుణాలను తిరిగి చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం చేసే రుణాలు పెరుగుతూనే వున్నాయి తప్ప చెల్లించలేకపోతున్నారు. దీనినే గ్రామీణ రుణగ్రస్తత అంటారు.
గ్రామీణ రుణగ్రస్తతకు కారణాలు:
1) వారసత్వపు అప్పులు: సాధారణంగా ఆస్తుల్లాగా అప్పులు కూడా వారసత్వంగా సంక్రమిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ రుణం వారసత్వంగా సంక్రమించినదే. వాస్తవంగా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులతో పాటు అప్పులకు కూడా బాధ్యత వహించాలి. భారతదేశంలోని రైతులు వారసత్వపు రుణాలను తీర్చడం గౌరవంగాను, నైతిక బాధ్యతగాను భావిస్తున్నారు. అందువల్ల ఎక్కువమంది రైతులు తమ జీవితాలను అప్పులతోనే ప్రారంభిస్తున్నారు.
2) పేదరికం: గ్రామీణ రుణగ్రస్తతకు మరో ప్రధాన కారణం పేదరికం. పేదరికం కారణంగా పొదుపు చేయలేని రైతులు తమ కుటుంబ, వ్యవసాయ అవసరాలకోసం, పాత బాకీలు చెల్లించడం కోసం రుణం తీసుకోవడం తప్పనిసరైంది. పేదరికం, రుణగ్రస్తత ఒకదానికి మరొకటి కారణం మాత్రమేగాక ఫలితం కూడాను.
3) ప్రకృతి వైపరీత్యాలు: భారతదేశంలో వ్యవసాయం రుతువులపై ఆధారపడే జూదంలాంటి కార్యకలాపం రుతువుల వైఫల్యం వల్ల తరచుగా కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. అధిక వర్షపాతం వల్ల విధ్వంసం జరిగి వరదలు రావడం మూలంగా పంటలు నాశనమవుతున్నాయి. వర్షపాతానికి అనిశ్చితివల్ల వ్యవసాయదారులు కనీస ప్రతిఫలాలు కూడా పొందలేకపోతున్నారు. అదేవిధంగా తుఫానులు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా రైతులు తమ పంటలను నష్టపోయి రుణగ్రస్తులవుతున్నారు.
4) రైతుల దుబారా వ్యయం: భారతీయ రైతులు వివాహాలు, పుట్టుకలు, పండుగలు, కర్మక్రతువులు, విందులు, వినోదాలు, ఆభరణాల కొనుగోలు మొదలైన సాంఘీక, ఆర్థిక, మత సంబంధ అంశాలపై దుబారా వ్యయం చేయడం వల్ల రుణగ్రస్తులవుతున్నారు.
5) వడ్డీ వ్యాపారులు: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పరపతిని సులువుగా అందించే ముఖ్యమైన మూలాధారం వడ్డీ వ్యాపారస్తులు. రైతుల భూములను కబళించాలనే ఉద్దేశంతో అధిక వడ్డీరేట్లకు అనుత్పాదక కార్యక్రమాల కోసం అప్పు తీసుకొనేటట్లు వడ్డీ వ్యాపారస్తులు రైతులను ప్రోత్సహిస్తారు. వీరు నిరక్షరాస్యులైన వ్యవసాయదారులను తప్పుడు లెక్కల ద్వారా మోసగిస్తున్నారు.
6) అల్ప కమతాలు: భారతదేశంలో సగటు భూకమతం పరిమాణం విభజన, విఘటనలకు గురై స్వల్పంగా ఉంది. ఈ కమతాలు నూతన వ్యవసాయ వ్యూహానికి అనువుగా లేకపోవడం వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉన్నది. అందువల్ల రైతులు వ్యవసాయరంగం ద్వారా లాభదాయకమైన ప్రతిఫలాలు పొందలేక రుణగ్రస్తులవుతున్నారు.
7) న్యాయపరమైన వ్యవహారాలు: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కాలిబాటలు, హద్దులు, కంచెలు మొదలైన విషయాలపై గొడవలు పడి కోర్టులు చుట్టూ తిరుగుతారు. వీరు కోర్టు వ్యవహారాల్లో గెలుపొందడం వ్యక్తిగత లేదా కుటుంబ ప్రతిష్టగా భావిస్తారు. ఈ విధంగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకుంటూ వ్యవసాయ కార్యకలాపాలను నిర్లక్ష్యం చేసి రుణగ్రస్తులవుతున్నారు.
8) భూమిపై మక్కువ ఎక్కువ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భూమి కావాలనే తీవ్రవాంఛ కలిగివుంటారు. వీరు కొంత భూమైనా కల్గి ఉండటాన్ని హోదాగా, గౌరవంగా భావిస్తారు. భూమిపై అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఎంత వ్యయమైనా వెనుకాడరు. వీరు పొదుపు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమునుంచి పరిణామం అయినప్పటికీ ఈ కార్యక్రమాల కోసం రైతులు తలకు మించిన అప్పులు చేసి రుణగ్రస్తులు కావడం ఆందోళనకరం. 9) ఇతర కారణాలు: రైతులు విలాసవంతమైన కుటుంబ జీవితం గడపడం, దురలవాట్లపై వ్యయం చేయడం, వ్యవసాయ ఖర్చులు పెరగడం, ప్రైవేటు రుణాలుపై ఆధారపడటం మొదలైన కారణాలవల్ల రైతులు రుణగ్రస్తులవుతున్నారు.
గ్రామీణ రుణగ్రస్తత నివారణకు తీసుకోవలసిన చర్యలు:
1) సంస్థాగత పరపతి సౌకర్యాల విస్తరణ: గ్రామీణులకు ముఖ్యంగా రైతులకు సకాలంలో సరిపడినంత పరపతిని సంస్థాగత పరపతి సంస్థల ద్వారా అందించాలి. ఈ లక్ష్య సాధన కోసం వాణిజ్య బాంకులను, గ్రామీణ బాంకులను సహకార పరపతి సంఘాలను స్థాపించి వాటి ద్వారా సంస్థాగతమైన పరపతిని అందించి రుణవిముక్తి కలిగించాలి.
2) వడ్డీ వ్యాపారస్తుల నియంత్రణ: వడ్డీ వ్యాపారస్తుల నుండి గ్రామీణులను రక్షించడానికి అవసరమైన చట్టాలను ప్రభుత్వం రూపొందించి అమలుచేయాలి. అవసరమైన లైసెన్సులు, నిర్దేశించిన పద్ధతిలో వడ్డీ వ్యాపార గణకాల నిర్వహణ, గరిష్ట వడ్డీరేటుకు నిర్ణయించడం, చెల్లింపులకు రశీదులు ఇవ్వడం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
3) రుణమాఫీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాల ద్వారా చిన్న ఉపాంత రైతులను, వ్యవసాయ శ్రామికులను రుణవిముక్తులను చేయడానికి రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.
4) రైతులను విద్యావంతులను చేయడం: ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యాకేంద్రాలను స్థాపించి రైతులను, గ్రామీణులను విద్యావంతులను చేయాలి. అంతేగాక రైతులు సాంఘిక, మత సంబంధ వ్యయాలు, న్యాయపరమైన ఖర్చులు మొదలైన అనవసర వ్యయాలను తగ్గించుకొని రుణవిముక్తులు అవుతారు.
5) ఉత్పాదకాల సరఫరా సంస్థాగత పరపతి సంస్థలు రైతులకవసరమైన పరపతిని ద్రవ్యరూపంలో కాక ఉత్పాదకాల రూపంలో అందించాలి. ఫలితంగా అనుత్పాదక వ్యయం తగ్గి సకాలంలో రుణాలను చెల్లించే సామర్థ్యం పెరగడంతో రైతులు రుణవిముక్తులు అవుతారు.
6) ఇతర చర్యలు: పైన పేర్కొనబడిన చర్యలతో పాటు పేదరిక నిర్మూలన కోసం. ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలుచేయాలి.
ప్రశ్న 13.
భారతదేశంలో వ్యవసాయ, గ్రామీణ పరపతి రంగంలో నాబార్డ్ పాత్రను వివరింపుము.
జవాబు:
వ్యవస్థీకృత పరపతి సౌకర్యాల సమీక్షాసంఘం (CRATICARD) సిఫార్సుల మేరకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి |కోసం 1982 జులై 12వ తేదీన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బాంకును (NABARD) ప్రారంభించారు. రిజర్వు బాంకులోని గ్రామీణ పరపతి ప్రణాళిక విభాగం, వ్యవసాయపరపతి కోసం ఏర్పాటైన రెండు ప్రత్యేక విధులు, వ్యవసాయ పునర్విత్త అభివృద్ధి సంస్థ (ARDC) మొదలైన వాటిని రిజర్వ్ బాంకు నాబార్డ్ బదిలీ చేసింది. నాబార్డ్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శిఖరాగ్ర సంస్థగా పనిచేస్తుంది. ఈ బాంకు యొక్క అధీకృత మూలధనం 500 కోట్ల రూపాయలు చెల్లించిన మూలధనం 100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బాంకు సమానంగా సమకూర్చినాయి.
ఎ) నాబార్డ్ విధులు: నాబార్డ్ ప్రధానంగా మూడు రకాల విధులు నిర్వర్తిస్తుంది.
1) పునర్విత్త విధులు 2) అభివృద్ధి ప్రోత్సాహక విధులు 3) పర్యవేక్షణ విధులు. నాబార్డ్ ప్రత్యేకంగా క్రింది విధులను నిర్వర్తిస్తుంది.
- రాష్ట్ర సహకార బాంకులను, ప్రాంతీయ గ్రామీణ బాంకులను భూమి అభివృద్ధి బాంకులను రిజర్వ్ బాంకు అనుమతితో గ్రామీణభివృద్ధిలో పాల్గొంటున్న విత్తసంస్థలు మొదలైన వాటన్నింటికి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతిని అందించి తద్వారా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి నాబార్డ్ పరోక్షంగా తోడ్పడుతుంది.
- సహకార సంస్థలకు వాటా మూలధనాన్ని అందించటం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు దీర్ఘకాలిక రుణాలను నాబర్డ్ మంజూరు చేస్తుంది.
- వ్యవసాయం, కుటీర గ్రామీణ, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు మొదలైన కార్యక్రమాలకు పరపతిని అందించి సమగ్ర గ్రామీణాభివృద్ధికి నాబర్డ్ తోడ్పడుతుంది.
- గ్రామీణ బాంకులు సహకార సంఘాలు కార్యకలాపాలను పర్యవేక్షించుడయే గాక పరపతికి సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వానికి, నాబర్డ్ సలహాదారులు వ్యవహరిస్తుంది.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రణాళికా సంఘం, ఇతర సంస్థల కార్యకలాపాలను సమన్వయలా పరిచి చిన్న, కుటీర గ్రామీణ పరిశ్రమలు, చేతివృత్తులు, హస్తకళలు మొదలైన వీటి అభివృద్ధికి నాబార్ట్ పునర్వత్త సహాయం చేస్తుంది.
- తన ఆధీనంలోని విధులు అభివృద్ధి పథకాలను పరిశీలించడమే కాక వాటి పురోగతిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది.
- వ్యవసాయం గ్రామీణాభివృద్ధితో సంబంధం కలిగి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ సంస్థకైన నాబార్డ్ రుణాలనిచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తుంది.
- వ్యవసాయం గ్రామీణాభివృద్ధి రంగాలలో పరిశోధనల కోసం ప్రత్యేకనిధిని నాబార్డ్ ఏర్పాటు చేస్తుంది.
బి) పునర్విత్త విధులు: నాబార్డ్ గ్రామీణ అవస్థాపనానిధి (RIDF) రైతుల పరపతి కార్డులు, (KCC) రైతు క్లబ్బులు, రైతు సాంకేతిక విజ్ఞానం బదిలీ నిధి (FTTF) వ్యవసాయంలో నూతన కల్పనల అభివృద్ధి నిధి (FIDF) మొదలైన నూతన పథకాలను రూపొందించింది. ఈ పధకాల ద్వారా పరపతిని అందిస్తూ నాబార్డ్ గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది.
1) గ్రామీణ అవస్థాపనా అభివృద్ధి నిధి: ఈ నిధిని 1995-96 సం॥లో ఏర్పాటు చేసారు. వాణిజ్య బ్యాంకుల ప్రాధాన్యత రంగాలకు వ్యవసాయానికి ఇచ్చే ఋణాలు పోను మిగిలిన పరిమితి మొత్తంలో ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగినది. ఆనాటి నుండి నాబార్డ్ గ్రామాలలో అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం వహిస్తూ వుంది.
ఈ నిధికి 1995-96 బడ్జెట్ లో 2000 కోట్ల రూపాయలను కేటాయిస్తే 2012-13 బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2012-13 నాటికి ఈ నిధి కింద మొత్తం 1,72,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. భారత్ నిర్మాణ్ ఆశయమైన రహదారులు కల్పనకు ఈ నిధి 18,500 కోట్ల రూపాయలు అందించింది.
2) రైతుల పరపతి కార్డుల పథకం: కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను ఆగష్టు 1998 సం||లో ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో సకాలానికి తగినంత స్వల్పకాల పంట ఋణాలను రైతులకు అందించేందుకుగాను ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉత్పత్తికి సంబంధించిన ఖర్చుల కోసం, వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసేందుకుగాను ఈ పథకం రైతులకు సహాయపడుతుంది. ఈ పథకం కింద 2012 ఆగష్టు నెలలో 9.54 కోట్ల కార్డులను మంజూరు చేసి 91,676 కోట్ల రూపాయల రుణాన్ని రైతులకందించడం జరిగింది.
3) సూక్ష్మవిత్తం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు స్వల్పమొత్తంలో విత్త సహాయాన్నే అందించడమే సూక్ష్మవిత్తం యొక్క లక్ష్యం. అందుకుగాను బాంకింగ్ సేవలకు పేదవారికి ముంగిటకు తీసుకువచ్చే నూతన కార్యక్రమమే సూక్ష్మవిత్తం. ఈ పథకం పొదుపును ప్రోత్సహించి వడ్డీ వ్యాపారస్తుల కబంద హస్తాలలో పేదవారు చిక్కకుండా కాపాడుతుంది. ఈ పథకం కింద 1986 87 నాబార్డ్ 2012-13 వార్షిక బడ్జెట్ లో 3916.64 కోట్ల రూపాయలు నిత్య సహాయాన్నే స్వయం సహాయక బృందాలకు అందించింది. ప్రభుత్వేతర సంస్థలు కూడా సూక్ష్మవిత్తం అందిస్తున్నాయి.
4) స్వర్ణజయంతి గ్రామీణా స్వయం ఉపాధి ప్రణాళిక: ఈ ప్రణాళికను 1999 సం॥ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రణాళిక ద్వారా ఇచ్చిన ఋణాల మధ్య కాలిక ఋణాలుగా ఉంటాయి. ఈ ప్రణాళిక 2009-10 సం|| బడ్జెట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా మార్పు చేసి అమలుపరుస్తున్నారు. స్త్రీలు బలహీన వర్గాలవారు సాధకారతను సాధించడమే ప్రధానలక్ష్యంగా ఈ పునర్నిర్మాణం జరిగింది. నాబార్డ్ కూడా ఈ ప్రణాళికలకు పునర్విత సహాయాన్ని అందిస్తుంది. నాబర్డ్ 2012- 13 సం|| వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి 111.72 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.
ప్రశ్న 14.
భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలను వివరించి పరిష్కార మార్గాలను సూచింపుము.
జవాబు:
భారత వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలు: భారత వ్యవసాయ మార్కెటింగ్లో దోపిడీ అధికంగా ఉంది. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను పొందలేకపోతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్లోని ముఖ్యమైన లోపాలను కింద వివరించడం జరిగింది.
1) మధ్యవర్తుల జోక్యం: మన వ్యవసాయ మార్కెటింగ్లో రైతులకు, వినియోగదారులకు మధ్య దళారీలు ఎక్కువగా ఉన్నారు. దళారీలు వ్యాపారులతో రహస్యమంతనాలు జరిపి ఉత్పత్తులను తక్కువ ధర చెల్లించి రైతులను మోసగిస్తున్నారు. రకరకాల మోసపూరిత పద్ధతుల ద్వారా వీరు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఉత్పత్తి యొక్క మార్కెట్ ధరల్లో 60 నుంచి 70% వరకు మధ్య దళారీలే దోచుకుంటున్నారన్నది ఒక అంచనా.
2) మార్కెట్లోని మోసపూరిత విధానాలు: వ్యవసాయ మార్కెటింగ్లో అనేక మోసపూరిత విధానాలు నెలకొని వున్నాయి. వ్యాపారులు, దళారులు కుమ్మకై రైతులను మోసం చేసి తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు, కొలతలు ప్రామాణికమైనవి కావు. వీరు నాణ్యతా, పరీక్షలు, ధర్మాలు, మామూళ్ల పేరిట ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని కాజేస్తుంటారు. అంతేగాక వ్యాపారస్తులు రైతులకు ఉత్పత్తుల ప్రతిఫలాలను పాయిదా పద్ధతుల్లో చెల్లిస్తుంటారు. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు.
3) రవాణా సౌకర్యాల కొరత: మనదేశంలో రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. నేటికి మన గ్రామీణ ప్రాంతాలలో చాలావరకు మట్టి రోడ్లు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ రోడ్లు మీద రవాణా అసాధ్యం. ఎక్కువ భాగం గ్రామీణ రహదారులు రైలు మార్గాలతోను, పక్కారోడ్లు, మార్గాలతో అనుసంధానం చేయబడలేదు. అధికభాగం రైతులు తమ ఉత్పత్తులను స్థానిక సంతలలో లేదా మండీలలో గిట్టుబాటుకాని ధరలకు అమ్ముకోవడం తప్పనిసరైంది.
4) గిడ్డంగి సౌకర్యాల కొరత: ఈ వ్యవసాయ మర్కెటింగ్లో మరో ప్రధాన లోపం రైతులు తాము పండించిన పంటను నిల్వ చేసుకోవాలంటే సరిపడే గిడ్డంగి సౌకర్యాలుండాలి. వీటి కొరతవలన రైతులు తమ ఉత్పత్తులను పాతర్లలోను, మట్టికుండల్లోను అశాస్త్రీయ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. ఈ అశాస్త్రీయ పద్ధతుల వల్ల తేమ తగిలి పంట నాణ్యత తగ్గుతుంది. అంతేకాక 10 నుంచి 20% వరకు పంటను చీమలు, ఎలుకలు, పందికొక్కులు తింటున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు ధాన్యాన్ని దాచుకోలేక తక్కువ ధరలకు నిర్భందంగా అమ్ముకోవలసి వస్తుంది.
5) మార్కెట్ సమాచార లోపం: మనదేశంలోని రైతులు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం వల్ల వీరికి సమాచారం తెలియదు. నిరక్షరాస్యులైన వీరికి డిమాండ్, సప్లయ్, ధరల్లో మార్పులు, ప్రభుత్వ ధరల విధానం మొదలైన విషయ పరిజ్ఞానం ఉండదు. సమాచార లోపం కారణంగా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను పొందడంలో విఫలమవుతున్నారు.
6) శ్రేణీకరణ, ప్రామాణీకరణ సదుపాయాల కొరత: వ్యవసాయ ఉత్పత్తులను మనదేశంలో తగినరీతిలో శ్రేణీకరణ చేయడము లేదు. సాధారణంగా రైతులు తమ ఉత్పత్తులను నాణ్యతాపరంగా శ్రేణీకరణ, ప్రామాణికీకరణ చేయకుండా మొత్తం ఉత్పత్తినంతటికి ఒకే ధరకు అమ్ముతున్నారు. శ్రేణీకరణ చేయకపోవడం వల్ల రైతులు తమ నాణ్యమైన ఉత్పత్తులను సైతం తక్కువ ధరలకు అమ్ముకొని నష్టపోతున్నారు.
7) పరపతి సౌకర్యాల కొరత: సంస్థాగత పరపతి సౌకర్యాల కొరతవల్ల మనదేశంలోకి పేద రైతులు గ్రామీణ ప్రాంతాలలో పరపతి కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడతారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పరపతికి వ్యవసాయ మార్కెటింగ్కు మధ్య సమన్వయం కొరవడింది. రైతులు పంట చేతికొచ్చిన తక్షణమే మార్కెట్ ధరలు ఎంత తక్కువగా ఉన్నప్పటికీ అమ్మి వడ్డీ వ్యాపారులకు చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు వేచిఉండలేక రైతులు నష్టపోతున్నారు.
8) రైతులు అసంఘటితంగా ఉండటం: మనదేశంలోని రైతులు వేర్వేరు ప్రాంతాలలో నివసించడంవల్ల సంఘటితం కాలేకపోతున్నారు. కాని వ్యాపారస్తులు మాత్రం సంఘటితంగా ఉండి రైతులను గిట్టుబాటు ధరలు పొందకుండా అడ్డుకుంటున్నారు. ఫలితంగా అసంఘటితమైన రైతులు సంఘటితమై సమిష్టిగా బేరమాడుతున్న వ్యాపారస్తులను ఎదుర్కొని గిట్టుబాటు ధరలు పొందలేక నష్టపోతున్నారు.
నివారణ చర్యలు: వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలను అరికట్టి రైతులు మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. కింద పేర్కొన్న చర్యలు రైతులు మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతున్నాయి.
1) క్రమబద్ధమైన మార్కెట్లు (Regulated Markets): రైతుల ఉత్పత్తులకు సముచితమైన ధరలు చెల్లించడం, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య ధరలలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలన్న లక్ష్యాలతో 1951లో భారత ప్రభుత్వం 200లకు పైగా క్రమబద్ధమైన మార్కెట్లను ఏర్పాటుచేసింది. 2005 మార్చి చివరకు వీటి సంఖ్య 7521 కి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లోని లోపాలను సరిదిద్దడం కోసం, వ్యాపారస్తులకు, కమీషన్ ఏజెంట్లకు వారి విధులపరంగా కాకుండా లభించే మార్జిన్లను తగ్గించడం కోసం ఈ మార్కెట్లను రూపొందించారు. క్రమబద్ధమైన మార్కెట్లు కింది విధంగా నిర్వహిస్తాయి.
- వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నోటీస్ బోర్డులో ఉంచుతాయి.
- ప్రామాణికమైన తూనికలు, కొలతల వాడకాన్ని తప్పనిసరి చేస్తాయి.
- మధ్యవర్తుల సంఖ్యను తగ్గించి వారికి లైసైన్సులను మంజూరు చేస్తాయి.
- తూకం చార్జీలు, దళారీలు కమీషన్లను ముందుగానే మార్కెట్ కమిటీలు నిర్ణయిస్తాయి.
2) సహకార మార్కెటింగ్: భారతదేశంలో మొట్టమొదటి సహాకార మార్కెటింగ్ సంఘం 1951లో ఏర్పడింది. ఈ విధానం డెన్మార్క్ విజయవంతంగా అమలు చేయబడి సత్ఫలితాలనిచ్చింది. ఈ సంఘాల ముఖ్య ఉద్దేశం రైతులు తమ ఉత్పత్తులకు లాభసాటి ధరలు వచ్చేంతవరకు విక్రయించకుండా వేచిఉండేటట్లు చేయడం.
ఈ విధానంలో గ్రామంలోని రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడతారు. రైతులు తమ ఉత్పత్తులను సహకార సంఘానికి అందచేసిన వెంటనే కొంత ద్రవ్యాన్ని ముందస్తుగా అందజేస్తారు. సహకార సంఘాల గిట్టుబాటు ధరలు రాగానే ఈ ఉత్పత్తులను విక్రయించి ముందస్తు చెల్లింపులు పోగా మిగిలిన మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు. ప్రతి సంఘం పరిధిలో కొన్ని గ్రామాలు ఉంటాయి.
3) ఒప్పందపు వ్యవసాయం: వ్యవసాయ మార్కెటింగ్ విధానంలోని లోపాలను పరిష్కారించడానికి ఒప్పందపు వ్యవసాయం మరొక మంచి పరిష్కార మార్గం. రైతులు తమ ఉత్పత్తులను వినియోగించే సంస్థలతో ప్రత్యక్షంగా ఒప్పందాలను కుదుర్చుకొని చేసే వ్యవసాయ విధానాన్ని ‘ఒప్పందపు వ్యవసాయం’ అని నిర్వచించవచ్చు.
- ఈ విధానంలో ముందుగా ధరలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో ఉండే అస్థిరతలను తొలగించి రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు.
- రైతులు ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవి పరపతి, సాంకేతిక సహాయం అందిస్తాయి. 3. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు లభించడానికి అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే రైతులు ముందుగా చేసుకొన్న ఒప్పందాలు మేరకు నాణ్యమైన ఉత్పత్తులను అందించవలసి ఉంటుంది.
4) రైతుబజార్లు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1999 జనవరి 26వ తేదీన వ్యవసాయ ఉత్పత్తిని విక్రయించడానికి రైతుబజార్లు అను నూతన మార్కెట్లను ప్రశేశపెట్టింది. ఈ మార్కెట్ కేంద్రాలను నగరాల్లోను, పట్టణాల్లోను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్లలో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు దళారీల ప్రమేయం లేకుండా విక్రయించుకోవచ్చు. రైతులు ఈ మార్కెట్ కేంద్రాలలో బియ్యం, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను సహేతుకమైన ధరలకు విక్రయిస్తున్నారు. ఈ మార్కెట్లలో ధరలు ఉత్పత్తిదారులైన రైతులకు, కొనుగోలుదారులకు ఇరువురికి లాభసాటిగా ఉంటాయి. ఈ మార్కెట్లలో వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. దళారులు ఉండరు కనుక రైతులు ఎలాంటి దోపిడికి గురికారు.
5) శ్రేణీకరణ, ప్రామాణికీకరణ: వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణీకరణ, ప్రామాణీకరణ సౌకర్యాల కల్పన కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్ చట్టం 1937 కింద భారత ప్రభుత్వం జైపూర్, భోపాల్, నాగపూర్, భువనేశ్వర్, షిల్లాంగ్ మొదలైన ప్రాంతాలలో వస్తుగుణ నిర్ణయ కేంద్రాలను స్థాపించింది. ఈ ప్రయోగశాలల్లో వస్తువుల యొక్క భౌతిక, రసాయన ధర్మాలను విశ్లేషించి నాణ్యతా ప్రమాణాలను నిర్ధారిస్తారు. ఈ కేంద్రాలలో 162 వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను శ్రేణీకరించి ప్రామాణికీకరిస్తారు. ఉదాహరణకు బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, నూనెలు, నెయ్యి, వెన్న, పత్తి, తేనె, మసాల దినుసులు మొదలైనవి. గ్రేడింగ్ చేసిన వ్యవసాయ వస్తువుల నాణ్యతకు చిహ్నంగా అగ్మార్క్ (AGMARK) గుర్తును ముద్రిస్తారు. అగ్మార్క్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ యొక్క సంకేతం. ఈ గుర్తు ఉన్న వస్తువుల మార్కెట్ విస్తరించడమేగాక, వాటికి సముచితమైన ధరలు లభిస్తాయి.
6) గిడ్డంగి సదుపాయాలు: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి అవసరమైన గిడ్డంగి సౌకర్యాలు ఉన్నప్పుడు పంట చేతికి రాగానే అమ్మడానికి సిద్ధపడరు. ఉత్పత్తులను నిల్వచేయగల సామర్థ్యం రైతుల యొక్క బేరమాడే శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాక రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలు వచ్చేంతవరకు వేచి ఉండగల శక్తిని కూడా గిడ్డంగి సౌకర్యాలు కల్పిస్తాయి. గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన సరుకుకు ఇచ్చే రశీదు ఆధారంగా వాణిజ్య బాంకులు రైతులకు రుణాలను మంజూరు చేస్తాయి. అందువల్ల భారత ప్రభుత్వం దేశం నలుమూలల గిడ్డంగులను ఏర్పాటుచేస్తుంది.
7) రవాణా సౌకర్యాలు: చక్కని రహదారులు, తక్కువ రవాణా చార్జీలు, అనువైన రవాణా సాధనాలు ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా తమ ఉత్పత్తులను మార్కెట్ కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధరలకు అమ్ముకుంటారు. ఎందుకంటే ఈ సౌకర్యాలు రైతులు బేరమాడే శక్తిని పెంపొందిస్తాయి. కాబట్టి ప్రభుత్వం పక్కా రోడ్లను నిర్మించి ట్రాక్టర్లు, ట్రాలీలు మొదలైన చిన్న వాహనాలను గ్రామీణ రవాణా నిమిత్తం ప్రోత్సహించాలి.
8) పరపతి సౌకర్యాలు: రైతులకు సకాలంలో, సరిపడినంత, సంస్థాగత పరపతి సౌకర్యాలు కల్పిస్తే రుణం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించరు. అంతేగాక తమ ఉత్పత్తులకు లాభసాటి ధరలు వచ్చేంతవరకు వేచి వుండి విక్రయిస్తారు. దీని కోసం భారత ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, వాణిజ్య బాంకులు, ప్రాంతీయ గ్రామీణ బాంకులు మొదలైన సంస్థాగత పరపతి సంస్థలను ఏర్పాటుచేసింది. పరపతి, మార్కెటింగ్ సౌకర్యాల నడుమ సమన్వయం కుదిరి, రైతులు లాభపడతారు.
9) మార్కెట్ ధరల సమాచారం: రైతులు ఎప్పుడైతే మార్కెట్లోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సంబంధించిన పక్కా సమాచారం తెలుసుకొని ఉంటారో అప్పుడు మాత్రమే సముచిత ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించగలరు. ఇందుకోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేడియో, టి.వి, వార్తాపత్రికలు మొదలైన సమాచార సాధనాల ద్వారా ధరల సమాచారం రైతులకు తెలియజేయాలి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
భారతదేశ వ్యవసాయరంగం – లక్షణాలు వివరింపుము.
జవాబు:
1) అనిశ్చితమైన వ్యవసాయ ఉత్పత్తులు:భారతదేశ వ్యవసాయరంగం అభివృద్ధి శీతోష్ణస్థితి, రుతువులపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ వ్యవసాయరంగ అభివృద్ధిపై దుష్పరిణామాలు చూపుతున్నాయి. దీనిని బట్టి భారత వ్యవసాయరంగం రుతువులతో జూదం ఆడుతుందని చెప్పవచ్చు.
2) వ్యవసాయరంగంలో భూస్వామ్యం:స్వాతంత్య్రానంతరం మనదేశంలో భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపాలైన, జమీందారీ, మహల్వారీ విధానాలు అమలులోకి వచ్చాయి. అందువల్ల కౌలుదారులు రైతుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేవారు.
3) గ్రామీణ రుణగ్రస్తత:స్వాతంత్య్రానంతరం భారతప్రభుత్వం సంస్థాగత సంస్థలైన సహకార పరపతి సంఘాలు, వాణిజ్య బాంకులు మొదలైన వాటిని స్థాపించి గ్రామీణ ప్రజలకు పరపతిని అందిస్తుంది. వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీ వసూలు చేయడంలో పాటు, లెక్కలను తారుమారు చేసి రైతులను మోసం చేయడం పరిపాటైంది, రైతులకు రుణగ్రస్తత నిత్యసమస్యై తగిన పెట్టుబడి లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు అల్పంగా ఉన్నాయి.
4) శ్రామిక మార్కెట్లో ద్వంద్వత్వం:వ్యవసాయరంగంపై జనాభా ఒత్తిడి అధికమై ఈ రంగంలో పనిచేసే శ్రామికుల వేతనాల వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే శ్రామికుల వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికుల వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వీరిని అధిక సంఖ్యలో వినియోగించి శ్రమ సాంద్ర వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు.
5) వ్యవసాయరంగంలో భిన్నత్వం:దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు భూసారాలు, నీటిపారుదల సౌకర్యాలు, వర్షపాత పరిమాణాలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో వరదలు, కరువుకాటకాలు, నీటి లవణీయతలు అధికంగాను మరికొన్ని ప్రాంతాలలో అల్పంగాను ఉన్నాయి.
6) సాంకేతిక ద్వంద్వత్వం:నేటికి మనదేశంలో అధిక సంఖ్యాక రైతులు వ్యవసాయ కార్యకలాపాల్లో సనాతన ఉత్పాదకాలైన శ్రామికులు, పశువులు, వర్షాలు, పశువుల పేడ ఎరువు మొదలైన వాటిపై ఆధారపడి జీవనాధార వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి, సాగుచేయడం వల్ల అధిక దిగుబడిని పొందుతున్నారు.
ప్రశ్న 2.
వ్యవసాయ శ్రామికుల ప్రస్తుత స్థితిగతులను వివరింపుము.
జవాబు:
వ్యవసాయ శ్రామికుల స్థితిగతులు :
1) అల్పసాంఘీక హోదా:నేటికీ వ్యవసాయ శ్రామికులలో ఎక్కువమంది తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన అణగారిన వర్గాలకు చెందినవారు. సాంఘీక అసమానత్వం, దోపిడీ భావన వీరి విషయంలో సర్వసాధారణం. వీరు తమ హక్కుల పరిరక్షణకు ఏమాత్రం పోరాటం చేయలేని దయనీయస్థితిలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వివక్షకు గురైన వీరి సాంఘిక హోదా తక్కువగా ఉంటుంది.
2) అసంఘటిత శ్రామికులు:మనదేశంలో వ్యవసాయ శ్రామికుల మారుమూల గ్రామాలలో నివసిస్తున్నారు. అందువల్ల వీరు సంఘటితం కాలేకపోతున్నారు. వీరికి కార్మికసంఘాలు లేవు. అంతేకాక వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. అందువల్ల అసంఘటితంగా వున్న వీరికి భూస్వాములతో బేరమాడేశక్తి లోపించి తగిన వేతనాలు పొందలేకపోతున్నారు.
3) రుతుసంబంధిత ఉద్యోగిత:వ్యవసాయ కార్యకలాపాలు రుతువులపై ఆధారపడి వుంటాయి. వ్యవసాయ కార్మికులు నాట్లు వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు మాత్రం ఉపాధిని పొంది సంవత్సరంలో ఎక్కువ భాగం ఖాళీగా వుంటారు. నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత వీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అందువల్ల వీరి ఆదాయాలు తక్కువగా ఉండి జీవన ప్రమాణాలు అల్పంగా ఉంటాయి.
4) అల్ప వేతనాలు:వ్యవసాయ శ్రామికులకు చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నందువల్ల వారి కుటుంబ ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శ్రామికులకు వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే వేతనాలలో భిన్నత్వం వుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో తప్ప ఎక్కువ రాష్ట్రాలలో వీరికి చెల్లించే వేతనాలు అల్పంగా ఉన్నాయి. హరిత విప్లవనాంతరం వీరికి చెల్లించే ద్రవ్యవేతనాలు పెరిగినప్పటికీ వస్తుసేవల ధరలు పెరిగినందువల్ల వీరి నిజవేతనాలు పెరగలేదు.
5) మహిళా శ్రామికుల పట్ల వివక్షత:వ్యవసాయరంగంలో పురుష శ్రామికులతో సమానంగా మహిళాశ్రామికులకు వేతనాలు ఇవ్వరు. అంతేగాక వ్యవసాయ కార్యకలాపాలతో వీరిచే బలవంతంగా అధికశ్రమ చేయిస్తారు. అనగా వ్యవసాయరంగంలో మహిళాశ్రామికులు వివక్షతకు గురవుతున్నారు.
6) గ్రామీణ రుణగ్రస్తత:గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ శ్రామికుల ఆదాయం తక్కువగా ఉండి పేదరికంలో ఉన్నారు. అందువల్ల వీరికి రుణ అవసరాలు ఎక్కువగా వుంటాయి. వీరికి సంస్థాగత పరపతి సంస్థలనుంచి రుణం తీసుకోవడానికి అవసరమైన హామీపత్రాలు లేనందువల్ల సంస్థాగతం కాని వడ్డీవ్యాపారస్థులు, భూస్వాముల నుంచి అధికవడ్డీలకు రుణం పొందుతున్నారు. ఈ రుణభారం అధికమై తరతరాలుగా వారసత్వంగా సంక్రమించి వ్యవసాయ శ్రామికులు వెట్టిశ్రామికులుగా మారుతున్నారు.
7) అధికసంఖ్యలో బాలకార్మికులు:ఆసియాఖండంలోని బాలకార్మికులలో మూడవ వంతు మంది భారతదేశంలో ఉన్నారు. మనదేశంలోని బాలకార్మికులలో అధిక సంఖ్యాకులు వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. వీరికి చెల్లిస్తున్న వేతనాలు అత్యల్పంగా వుండి వారి కుటుంబ జీవన ప్రమాణంపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి.
8) వ్యవసాయేతర వృత్తుల కొరత గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర వృత్తులు అభివృద్ధి చెందలేదు. అందువల్ల శ్రామికులు ఉపాధికోసం ఎక్కువగా వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో శ్రామికుల సంఖ్య అధికమై ప్రచ్ఛన్న నిరుద్యోగితకు దారితీసింది.
ప్రశ్న 3.
పంటల తీరును ప్రభావితం చేసే అంశాలను వివరింపుము.
జవాబు:
పంటల తీరు:సాధారణంగా ఒకదేశ ఆర్థికాభివృద్ధి ఆ దేశంలో లభించే సహజ వనరుల లభ్యత, వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులైన భూమి, నీరు, ఖనిజాలు మొదలైన వాటిని సమర్థవంతంగా, అభిలషణీయంగా, వినియోగించినప్పుడే కొనసాగించగలిగే అభివృద్ధి సాధ్యమవుతుంది. అదేవిధంగా భూసారం, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి దేశంలో విభిన్న పంటలు పండించడం జరుగుతుంది. దేశంలో పండే వివిధ పంటల తీరు ఆ దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేస్తుంది.
పంటలతీరును ప్రభావితం చేసే అంశాలు:భారతదేశంలో పంటల తీరును భౌతిక, సాంకేతిక ఆర్థిక అంశాలతోపాటు ప్రభుత్వవిధానాలు కూడా ప్రభావితం చేస్తాయి.
I) భౌతికాంశాలు:పంటలతీరును నిర్ణయించడంలో భౌతికాంశాల పాత్ర కీలకమైంది.
1) శీతోష్ణస్థితి, వర్షపాతం:శీతోష్ణస్థితి, వర్షపాతం, పంటలతీరును ప్రభావితం చేస్తాయి. ఉష్ణ ప్రాంతాలలో, శీతల ప్రాంతాలలో పండే పంటలు వేర్వేరుగా వుంటాయి. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో మాత్రమే ఆపిల్స్ వుంటాయి. అదేవిధంగా వర్షపాతం కూడా పంటల తీరును ప్రభావితం చేస్తుంది.
2) భూస్వరూపం, భూసారం:భూసారం, భూస్వరూపంపై ఆధారపడి పంటలు పండుతాయి. ఉదాహరణకు నల్లరేగడి మృత్తికలు, పత్తిపంటకు అనుకూలం. అదేవిధంగా గోధుమ పంటకు సారవంతమైన ఒండ్రు, తడిబంకమన్ను మృత్తికలు అవసరం. ఈ విధంగా భూసారం, భూస్వరూపం పంటలతీరును ప్రభావితం చేస్తాయి.
3) నీటిపారుదల:నీటిపారుదల సౌకర్యాలు పంటలతీరును నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా లభ్యమైనపుడు వరి, చెరకు, గోధుమ మొదలైన పంటలు పండుతాయి. నీటిపారుదల సౌకర్యాలు తగినంతగా లేనిచోట రాగులు, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలు పండుతాయి.
II) ఆర్థికాంశాలు :
1) ధరలు, ఆదాయం:సాధారణంగా వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను అధికధరలకు విక్రయించి తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవాలనుకుంటారు. వరి, గోధుమలాంటి ఆహార పంటల ధరలపై మార్కెట్ ప్రభావం లేకుండా నిర్దేశిత సేకరణ ధరల పేరుతో ప్రభుత్వం ఈ పంటల ధరలను ముందుగా నిర్ణయిస్తుంది. ఈ విధమైన నియంత్రణల వల్ల రైతులు తమ ఆదాయాలను గరిష్టం చేసుకోవడానికి వాణిజ్య పంటలైన చెరకు, పత్తి, వేరుశెనగ మొదలైన వాటిని పండిస్తున్నారు.
2) భూకమతాల పరిమాణం: భూకమతాల పరిమాణం పంటల తీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా చిన్న కమతాల రైతులు ఆహారపంటలను, పెద్దకమతాల రైతులు వాణిజ్యపంటలను పండిస్తారు. ఇటీవల కాలంలో చిన్న కమతాల రైతులు కూడా అధిక లాభాలను ఆశించి వాణిజ్యపంటలను పండిస్తున్నారు.
3) ఉత్పాదకాలు, అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయ ఉత్పాదకాలు కూడా పంటల తీరును నిర్ణయిస్తాయి. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు మొదలైన ఉత్పాదకాల లభ్యత పంటల తీరును ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా రవాణా, గిడ్డంగులు, మార్కెటింగ్, నీటిపారుదల వంటి అవస్థాపనా సౌకర్యాల లభ్యతపై కూడా పంటల తీరు ఆధారపడి వుంటుంది.
4) భీమా సౌకర్యాలు:సాధారణంగా వ్యవసాయదారులు విభిన్నమైన పంటలు పండిస్తారు. ఏదైన ఒక పంట నష్టానికి గురైనప్పుడు ఆ నష్టాన్ని ఇతర పంటల నుండి రాబట్టుకోవచ్చు అన్న ఉద్దేశ్యంలో బహుళపంటలు పండిస్తారు. అదే ప్రభుత్వం నష్టభయాన్ని ఎదుర్కొనడానికి ఏ పంటలకు బీమా సౌకర్యాలను కల్పిస్తుందో ఆ పంటలను రైతులు ధీమాగా పండిస్తారు.
5) కౌలుదారీ పద్ధతి:సాధారణంగా భూస్వాములు తమ భూములను కౌలుకు ఇచ్చేటప్పుడు ఏ పంటలు పండించాలో ముందుగానే కౌలుదార్లతో ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి పంటలతీరు భూస్వాముల ఇష్టాలపై చాలావరకు ఆధారపడి వుంటుంది.
6) సాంఘీక కారణాలు:పరిసరాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మొదలైన సాంఘీక అంశాలు పంటల తీరును నిర్ణయించడంలో కొంతమేరకు ప్రభావాన్ని చూపుతాయి. ఈ అంశాలు రైతులను సాంప్రదాయ పంటలను, సాంప్రదాయ పద్ధతుల్లో పండించేటట్లు ప్రేరేపిస్తాయి.
ప్రశ్న 4.
నీటిపారుదల సౌకర్యాల ప్రాధాన్యతను వివరింపుము.
జవాబు:
నీటిపారుదల ప్రాధాన్యత :
1) అకాల అనిశ్చిత వర్షాలు:వర్షాలు రుతువులపై ఆధారపడి సంవత్సరంలో నాలుగునెలలకు మాత్రమే పరిమితమై వుంటాయి. కొన్నిసార్లు రుతువుల్లో సైతం వర్షపాతం అల్పంగా ఉండటమేగాక, అకాల వర్షాలు వస్తుంటాయి. నీటిపారుదల సౌకర్యాలను విస్తృత పరుచుట ద్వారా కరువుకాటకాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
2) ఉత్పాదకత పెరుగుదల:నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా వున్నచోట వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువగా వుంటుంది. నీటిపారుదల సౌకర్యాలు వున్నప్పుడే ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలైన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి. విత్తనాలు, ఎరువులు మొదలైన వాటిని వినియోగించడానికి వీలవుతుంది. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో వార్షిక పెరుగుదల 1.6 శాతం నుండి 2.6 శాతానికి పెరిగింది. అదే నీటిపారుదల సౌకర్యాలు అల్పంగా వున్న ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల 1శాతం లేదా గమనించలేనంత తక్కువగా నమోదైంది.
3) బహుళ పంటలు పండించడం:భారతదేశం ఉష్ణమండల, ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితులు విస్తరించి వున్నాయి. ఈ దేశానికి సంవత్సరమంతా పంటలు పండించగల సామర్థ్యం వుంది. మనదేశంలో వర్షపాతం నాలుగు నెలలలోపు కాలానికి మాత్రమే పరిమితమైంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే సంవత్సరమంతా బహుళ పంటలు పండించవచ్చు.
4) నూతన వ్యవసాయ వ్యూహంలో ప్రధానపాత్ర:నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా ప్రవేశపెట్టబడిన అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను, రసాయనిక ఎరువులను విజయవంతంగా వినియోగించాలంటే సకాలంలో, సరిపడినంత నీటిపారుదల సౌకర్యాలు అవసరం. ఈ విత్తనాలు, ఎరువుల వినియోగానికి క్రమబద్ధంగా పుష్కలంగా నీటిని అందించాలి. నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తే నూతన వ్యవసాయ వ్యూహం కిందసాగులో వున్న భూవిస్తీర్ణం పెరుగుతుంది.
5) సాగుభూమి విస్తీర్ణంలో పెరుగుదల:భూవినియోగ గణాంకాల ప్రకారం మనదేశంలో లెక్కించిన మొత్తం భూమి 2009-10 నాటికి 305.56 మిలియన్ల హెకార్టు. ఇందులో 42.95 మిలియన్ల హెక్టార్లు వ్యవసాయం చెయ్యని భూములు కాగా 26.23 మిలియన్ల హెక్టార్లు బంజరు భూములుగా వున్నాయి. నీటిపారుదల సౌకర్యాల కల్పిస్తే నిరుపయోగంగా వున్న ఈ భూములను కొంతమేరకు సాగులోకి తీసుకురావచ్చు.
6) సంపద పెరుగుదల:కరువు కాటకాలు సంభవించినప్పుడు సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు అస్థిరతకు లోనవుతాయి. కాని నీటిపారుదల సౌకర్యాల కరువు కాటకాల సమయంలో పంటలను రక్షించి వ్యవసాయ ఉత్పత్తులను ఒడిదుడుకులకు గురికాకుండా స్థిరీకరిస్తాయి. ఉత్పత్తులలో స్థిరీకరణ సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పరిరక్షించబడి సంపద స్థిరంగా పెరుగుతుంది.
7) పరోక్ష ప్రయోజనాలు:నీటిపారుదల సౌకర్యాలను దేశం నలుమూలలకు విస్తరింపజేయడం ద్వారా ఆహారధాన్యాలు ఉత్పత్తిలో అసమానతలు రూపుమాసిపోతాయి. అంతేకాక వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా సాధించబడిన పెరుగుదల వ్యవసాయ ఉత్పతుల ధరల స్థిరీకరణకు తోడ్పడుతుంది.
భారత ఆర్థికవ్యవస్థ ప్రాధాన్యతా రంగాల్లో ఒకటైన వ్యవసాయ రంగాన్ని ప్రగతి ప్రధాన నడవడంలో నీటిపారుదల సౌకర్యాలు కీలక భూమికను పోషిస్తున్నాయి.
ప్రశ్న 5.
వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి గల కారణాలు వివరింపుము.
జవాబు:
భారత వ్యవసాయరంగంలో ఉత్పత్తి అల్పంగా వుండటానికి అనేక కారణాలు వున్నాయి. వీటిని ప్రధానంగా నాలుగురకాలుగా వర్గీకరించారు.
1) సాధారణ కారణాలు 2) వ్యవస్థాపూర్వక కారణాలు 3) సాంకేతిక కారణాలు 4) పర్యావరణ కారణాలు సాధారణ కారణాలు:వ్యవసాయ ఉత్పత్తి అల్పంగా వుండటానికి గల కారణాలు కింద విశ్లేషించబడినాయి.
1) వ్యవసాయరంగంపై జనాభా వత్తిడి:భారతదేశంలో జనాభా వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 263 మిలియన్ల జనాభా తమ జీవనోపాధికై వ్యవసాయరంగం మీద ఆధారపడి వున్నారు. దీనికి తోడు వ్యవసాయేతర రంగాల్లో ప్రగతి చురుకుగా లేనందువల్ల పెరుగుతున్న జనాభా జీవనోపాధికై వ్యవసాయరంగంపై ఆధారపడటం తప్పనిసరైంది. అందువల్ల వ్యవసాయరంగం మీద ఒత్తిడి ఎక్కువై కమతాల విభజన, విఘటనలతో పాటు ప్రచ్ఛన్న నిరుద్యోగిత అధికమవుతుంది.
2) నిరాశాపూరిత గ్రామీణ వాతావరణం:మనదేశంలో గ్రామీణ వాతావరణం నిరాశాజనకంగా వుండి, వ్యవసాయ ప్రగతికి ప్రతిబంధకంగా మారింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు, అందువల్ల వీరు మూఢనమ్మకాలకు, సనాతన సాంప్రదాయాలకు విలవినిస్తూ నూతన వ్యవసాయ వ్యూహం యెడల నిరాసక్తతను కనపరుస్తున్నారు. రైతులలో సంకుచిత ధోరణి ఏర్పడి ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమవడం, భూమిపై మక్కువ మొదలైన గ్రామీణ పరిస్థితుల వల్ల వ్యవసాయ కమతాలు విభజన, విఘటనలకు గురై వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాలలో కక్షలు, కుట్రలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటి కారణంగా నిరుత్సాహపూరితమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడి రైతులు తమ విలువైన సమయం, ధనం వృథా చేసుకుంటున్నారు. ఫలితంగా మనదేశ వ్యవసాయరంగంలో ఉత్పాదకత తక్కువగా వుంది.
3) అవస్థాపనా సౌకర్యాల కొరత: వ్యవసాయాభివృద్ధికి అవసరమైన పరపతి, రవాణా, మార్కెటింగ్, గిడ్డంగి, సౌకర్యాలు రైతుల అవసరాలకు సరిపడినంతగా లేవు. జాతీయ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు, వ్యవసాయ విస్తరణ సేవా కేంద్రాల ప్రోత్సాహం రైతులందరికి అందుబాటులో లేదు. ఈ విధమైన అవస్థాపనా సౌకర్యాల కొరత వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలకు ప్రతిబంధకంగా తయారైంది.
4) బ్రిటీష్ పాలనా ప్రభావం: బ్రిటీషువారు తమ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని ఒక వలసదేశంగా భావించారే తప్ప మనదేశ వ్యవసాయాభివృద్ధికి ఏవిధమైన చర్యలు చేపట్టలేదు. వారనుసరించిన భూస్వామ్య విధానాలు, కౌలుదారి విధానాలు, భూమిశిస్తు వసూళ్ళు భారత వ్యవసాయరంగ ప్రగతిని దెబ్బతీశాయి. మనదేశ వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా వుండటానికి బ్రిటీషువారి పాలన చాలావరకు కారణమైంది.
II) వ్యవస్థాపూర్వక కారణాలు :
1) అల్ప కమతాల పరిమాణం: మనదేశంలో భూకమతాల పరిమాణం చాలా అల్పంగా ఉంది. జాతీయ సర్వేక్షణా సంస్థ నివేదిక ప్రకారం 1960 – 61లో రెండు హెక్టారుల కంటే తక్కువ పరిమాణం ఉన్న కమతాలు మొత్తం కమతాలలో 52 శాతం వుండగా 2010-11 నాటికి వీటి సంఖ్య 85 శాతానికి పెరిగింది. ఎక్కువ భూమి కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. వీరు వ్యవసాయ కార్యకలాపాలపై శ్రద్ధ చూపరు. వారసత్వ చట్టాలు, కమతాల విభజన, విఘటనల ఫలితంగా కమతాల పరిమాణం అల్పంగా వుండి తక్కువ భూమి ఎక్కువ మంది రైతుల ఆధీనంలో వుంది. చిన్న కమతాలు నూతన వ్యవసాయ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉంది.
2) భూస్వామ్య వ్యవస్థలోని లోపాలు:బ్రిటీషువారి పరిపాలనా కాలంలో మనదేశంలో ఏర్పాటు చేసిన జమీందారీ పద్ధతి, జాగిర్దారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి మొదలైన లోపభూయిష్టమైన భూస్వామ్య పద్ధతులు వ్యవసాయప్రగతిని ఆటంకపరచాయి. స్వాతంత్ర్యానంతరం రైత్వారీ పద్ధతి అమలులోకి వచ్చింది. ఈ విధానంలో కౌలుదారులకు కౌలుభద్రత, నిశ్చితమైన కౌలు పరిమాణం భూయాజమాన్యం హక్కులు వుండేవి కావు. ఈ అభద్రతల కారణంగా కౌలుదారుల వ్యవసాయంపై శ్రద్ధ చూపలేరు. ఫలితంగా వ్యవసాయరంగం యొక్క ఉత్పాదకత తగ్గింది.
3) మార్కెట్, పరపతి సౌకర్యాల కొరత: వ్యవసాయభివృద్ధికి అవసరమైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు కొరత వలన నూతన పద్ధతిలో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడం కష్టమైంది. వీరికి కావలసిన పరపతి సముచితమైన వడ్డీరేట్లకు లభించదు. అంతేగాక ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తులకు అందించే రాయితీలు సంతృప్తికరంగా లేవు. ఈ కారణాల వల్ల అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలు, నీటిపారుల సౌకర్యాలను ఉపయోగించి నూతన పద్ధతులలో సాగుచేయడానికి బదులు సాంప్రదాయ పద్దతులలో సాగుచేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయరంగంలో ఉత్పాదకత తగ్గింది.
III) సాంకేతిక కారణాలు :
1) పురాతన ఉత్పత్తి పద్ధతులు:భారతదేశంలోని రైతులు పేదరికం, అవగాహనారాహిత్యం కారణంగా పురాతన పనిముట్లు సహాయంతో సాంప్రదాయమైన వ్యవసాయ పద్ధతులలో సాగుచేయడం వల్ల పురాతన ఉత్పత్తి ఉత్పాదకత తక్కువగా వున్నాయని టి. డబ్ల్యు. హార్ట్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడినారు. నేటికి భారతీయ రైతులు కొడవళ్ళు, చెక్కనాగళ్ళు, ఎడ్లబండ్లు ఉపయోగిస్తున్నారు. వీరు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులను, క్రిమిసంహారక మందులను, యంత్రాలను పరిమితంగా వాడుచున్నారు. కాని ప్రభుత్వ నిర్విరామ కృషి, విద్యావ్యాప్తి ఫలితంగా ఇటీవల కాలంలో ఈ పరిస్థితులలో కొంతమేరకు మార్పు వచ్చింది.
2) నీటిపారుదల సౌకర్యాల కొరత:2011 నాటికి వివిధ పంటల కింద సాగవుతున్న భూవిస్తీర్ణం 198.97 మిలియన్ హెక్టారులు వుండగా అందులో 89.36 మిలియన్ హెక్టారుల భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. అంటే 55శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. అకాల, అల్ప, అనిశ్చిత వర్షాల వల్ల వర్షాధార ప్రాంతాలలో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితులలో నూతన వ్యవసాయ వ్యూహం దేశమంతా విస్తరించడం కష్టమై వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకాలు, తక్కువగా వున్నాయి.
3) వ్యవసాయ ఉత్పాదకాల కొరత:అధిక దిగుబడిని సాధించుటకు ఆధునిక ఉత్పాదకాల వినియోగం తప్పనిసరి. ఆధునిక ఉత్పాదకాలైన సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, యంత్రాలు, క్రిమిసంహారక మందుల సరఫరా రైతుల అవసరాలకు సరిపడినంతగా లేదు. ఉత్పాదకాలు సరిపడినంతగా లభ్యం కానందువల్ల వాటి వినియోగం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత అల్పంగా వున్నాయి.
IV) పర్యావరణ కారణాలు:వ్యవసాయ ఉత్పాదకతను నిర్ణయించడంలో పర్యావరణం పాత్ర ప్రముఖమైనది. భూసార క్షీణత, వాతావరణంలో మార్పులు, నీటికాలుష్యం, వాయు కాలుష్యం, మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకాల మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. పంటల క్షీణతకు కింది పర్యావరణ ప్రతికూల అంశాలు కారణభూతాలు అవుతున్నాయి.
- భూతాపం.
- భూసారం క్షీణించడం.
- అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉపయోగించి సాంద్రవ్యవసాయం చేయడం.
- మితిమీరి రసాయనిక ఎరువులను వాడటం.
- పోడు వ్యవసాయం.
- పర్యావరణ పరిరక్షణా ప్రణాళికలు లేకపోవడం.
- సాంప్రదాయ పంటలను సాగుచేయకపోవడం.
ప్రశ్న 6.
ప్రస్తుతం భూమి వినియోగం తీరును వివరింపుము.
జవాబు:
ఆర్థిక వ్యవస్థ ప్రగతి సహజవనరులు లభ్యత, వినియోగం పై ఆధారపడి ఉంటుంది. సహజ వనరులలో భూమి అత్యంత ప్రధానమైన వనరు. భూమి యొక్క పరిమాణం అవ్యాకోచంగా ఉంటుంది. భూమి పరిమాణం ఆర్థికాభివృద్ధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల నేటి ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా భూ వినియోగం తీరులో మార్పులు తీసుకొని రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారతదేశంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణం 328.72 మిలియన్ల హెక్టార్లు మొత్తం సాగవుతున్న పంట భూమి 192.. మిలియన్లు హెక్టార్లు. బీడుభూములు మొత్తం పరిమాణం 26 మిలియన్ల హెక్టార్లు. అడవుల క్రింద వున్న భూవిస్తీర్ణం 70 మిలియన్ల హెక్టార్లు.
ఇటీవల కాలంలో భూమి వినియోగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూస్వాముల ఆధీనంలోని బంజరు భూములను భూసంస్కరణల తరువాత వ్యవసాయయోగ్యంగా మార్చడం జరిగింది. బంజరు భూముల పునరుద్ధరణ “ఫలితంగా సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ వల్ల అల్ప ఫల కాలపు సంకరజాతి వంగడాల సృష్టి ఫలితంగా ఒకటి కంటే ఎక్కువ పంటలు పండే భూవిస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
నాటికి కౌ 23 మిలియన్ల హెక్టార్లు భూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించడం జరిగింది. వ్యవసాయేతర అవసరాలైన నివాస స్థలాలు, పరిశ్రమల స్థాపనకు భూవనరుల వాడకం అధికమైంది. దీని ఫలితంగా పొలాలలో ఉన్న భూవిస్తీర్ణం తగ్గి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. కాబట్టి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి భూవనరులను అభిలషణీయంగా వినియోగించాలి.
ప్రశ్న 7.
భారతదేశంలో కమతాల సమీకరణ.
జవాబు:
మనదేశంలో కమతాల విభజన విఘటనకు గురై చిన్న పరిమాణానికి చేరి పంటల సాగును లాభదాయకం కాని పరిమాణానికి చేరినాయి. ఈ చిన్న కమతాలన్నింటిని కలిపి ఒక పెద్ద కమతంగా ఏర్పాటు చేయడం చాలా అవసరం. విడివిడిగా చిన్న చిన్నగా ఉన్న కమతాలను ఒక్కటిగా చేయటమే కమతాల సమీకరణ అంటారు. ప్రారంభంలో ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. 2001 సం॥ సెప్టెంబరు నాటికి 1,633 లక్షల ఎకరాలలో మాత్రమే కమతాల సమీకరణ సాధ్యపడింది. రైతులు సమీకరణకు సహకరించలేదు. అందువల్ల ఉత్తరప్రదేశ్లో తప్ప మిగతా రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. కమతాల సమీకరణ కార్యక్రమం విజయవంతం అవడానికి రైతుల సహకారం చాలా అవసరం.
ప్రశ్న 8.
లాభసాటి కమతాలు ఏర్పాటు.
జవాబు:
చిన్న కమతాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలకు ముఖ్యమైన పరిష్కారం మార్గం లాభసాటి కమతాల ఏర్పాటు. భారత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి లాభసాటి కమతాల ఏర్పాటు తప్పనిసరి. కొంతమంది ఆర్థికవేత్తలు లాభసాటి కమతాలను “కుటుంబ కమతాలు” లేదా “అభిలషణీయ కమతాలు” అంటారు.
లాభసాటి కమతాలను ఏర్పాటు చేయడానికి క్రింది సూచనలు సహకరిస్తాయి.
- ప్రభుత్వం లాభసాటి కమతాలను ఏర్పాటు చేయడానికి ముందు భూములను, శాస్త్రీయంగా వర్గీకరించాలి.
- ప్రభుత్వం భూములను శాస్త్రీయంగా వర్గీకరించి, ఆర్థిక కమతం పరిమాణాన్ని నిర్ణయించేటపుడు భూసారాన్ని, నీటిపారుదల, రవాణా సౌకర్యాలను పరిగనణలోనికి తీసుకోవాలి.`
- ప్రభుత్వం చట్టాలను రూపొందించి, “ప్రామాణిక కమతం” పేరుతో లాభసాటి కమతాల కనీస పరిమాణాన్ని నిర్దేశించాలి.
- ప్రభుత్వం జనాభా పెరుగుదలను అరికట్టడానికి చట్టాలను రూపొందించి భూమిపై జనాభా ఒత్తిడిని తగ్గించి కమతాల విభజనను అరికట్టి ఆర్థిక కమతాల ఏర్పాటును ప్రోత్సహించాలి.
- ప్రభుత్వం లాభసాటికాని చిన్న కమతాలలో సాగు చేస్తున్న చిన్న రైతులను జీవనోపాధికై తమ కమతాలను వదిలి వ్యవసాయేతర రంగాలపై ఆధారపడేటట్లు ప్రోత్సహించాలి.
ప్రశ్న 9.
భారతదేశంలో భూ సంస్కరణల ఆవశ్యకత. [Mar ’17, ’16]
జవాబు:
భూసంస్కరణల ఆవశ్యకత :
1) వ్యవసాయాభివృద్ధి:వ్యవసాయాభివృద్ధిని ఆటంకపరిచే వివిధ రకాల ప్రతిబంధకాలను భూసంస్కరణల ద్వారా నిరోధించవచ్చు. ఉదాహరణకు మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, కమతాల సమీకరణ, కమతాల విభజనను అరికట్టుట, సహకార వ్యవసాయం మొదలైన సంస్కరణలు. అప్పుడు మాత్రమే సాంకేతిక సంస్కరణలు సఫలమై వ్యవసాయాభివృద్ధి జరుగుతుంది.
2) ఆర్థికాభివృద్ధి:భూసంస్కరణల మరొక లక్ష్యం ఆర్థికాభివృద్ధిని సాధించడం. వ్యవసాయాభివృద్ధి పరిశ్రమలు, వ్యాపారం, రవాణా మొదలైన ఇతర రంగాల అభివృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ముందుగా వ్యవసాయరంగం, అభివృద్ధి చెందాలి. తద్వారా కొనసాగించగల అభివృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది.
3) సాంఘీక న్యాయం:భూసంస్కరణలను అమలుచేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించి, సాంఘిక న్యాయాన్ని సాధించి సామ్యవాదరీతి సమాజ స్థాపనకు పునాదులు వేయవచ్చు. ఉదాహరణకు, కౌలు భద్రత వల్ల కౌలుదార్లు వ్యవసాయం మీద శ్రద్ధ చూపుతారు. కమతాల గరిష్ట పరిమితి చట్టాలు భూపంపిణీలోని అసమానతలను రూపుమాపుతాయి. అంతేకాక బలహీన వర్గాల ప్రజలకు భూమి పంపిణీ చేయడం, నివాస స్థలములు ఇవ్వడం, స్త్రీలకు భూమిపై యాజమాన్యపు హక్కులను కల్పించడం మొదలైన కార్యక్రమాల ద్వారా సాంఘిక న్యాయాన్ని సాధించవచ్చు.
4) వ్యవసాయ ఉత్పాదకత:భూసంస్కరణ ద్వారా భూమి యాజమాన్యానికి సంబంధించి, వ్యవస్థాపూర్వక మార్పులు తేవడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించవచ్చు. యాజమాన్యపు హక్కులు కల్పించడం ద్వారా కౌలుదార్లు, రైతుకూలీలు శ్రద్ధలో వ్యవసాయం చేసి అధిక ఉత్పత్తిని సాధిస్తారు. ఈ విధంగా అదనపు వ్యయం లేకుండానే భూసంస్కరణల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను అధికం చేయవచ్చు.
ప్రశ్న 10.
భూ సంస్కరణలలో భాగంగా మధ్యవర్తుల తొలగింపు.
జవాబు:
మధ్యవర్తుల తొలగింపు:మనదేశంలో భూ సంస్కరణలను అమలుచేయడంలో భాగంగా మధ్యవర్తులను తొలగించడమైనది. జమీందారి విధానం, జాగీరుదారుని విధానం, రైత్వారీ విధానంలోని లోపాలను తొలగించడం. 1948లో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేశారు. ఫలితంగా 30 లక్షల మంది కౌలుదార్లు 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్యపు హక్కులు పొందారు. మనదేశం తొలగించిన మధ్యవర్తులకు నష్టపరిహారం చెల్లించింది.
ప్రశ్న 11.
కమతాల గరిష్ట పరిమితి.
జవాబు:
కమతాల గరిష్ట పరిమితి చట్టాలు రైతులకు ఉండవలిసిన భూమి గరిష్ట పరిమితిని నిర్ధేశిస్తాయి. కమతాల గరిష్ట పరిమాణం అన్నీ రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు. ప్రభుత్వం గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించేటప్పుడు భూసారం నీటి పారుదల సౌకర్యాలు, వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు, పంటల స్వభావం మొదలైన అంశాలను పరిగణలోనికి తీసుకొంటుంది.
గరిష్ట పరిమాణం నిర్ణయించడంలో ఏకరూపకతను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 1972లో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
1) గరిష్ట పరిమితి పరిమాణం:నిశ్చితంగా నీటిపారుదల సౌకర్యాలు కలిగి, సంవత్సరానికి రెండు పంటలు పండే సారవంతమైన భూములు విషయంలో గరిష్ట పరిమితి 18 ఎకరాలుగా నిర్ణయించడమైనది. ఈ ప్రత్యేక రకాల భూముల గరిష్ట పరిమితిని నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు విచక్షణాధికారం ఉంది.
2) గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించే యూనిట్:కమతాల గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించేటప్పుడు కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటారు. కుటుంబం అంటే భార్య, భర్త, సంతానంగా నిర్వచించబడింది. ‘ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఐదుగురు మించినట్లైతే, ప్రతి అదనపు సభ్యునికి భూమిని కేటాయించి గరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. ఈ విధంగా నిర్ణయింబడిన గరిష్ట పరిమితి కుటుంబ యూనిట్ గరిష్ట పరిమితి రెట్టింపు కంటే ఎక్కువగా ఉండకూడదు. కుటుంబంలో యుక్త వయస్సుకు వచ్చిన ప్రతీ సభ్యుడిని వేరే యూనిట్గా పరిగణిస్తారు.
3) మినహాయింపులు:కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించేటప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన గరిష్ట పరిమితి మినహాయింపు చట్టాల్లో ఏకరూపకత లేదు. కాఫీ, టీ, రబ్బరు, కోకో మొదలైన తోట పంటల భూములను పంచదార కర్మాగారాలు, సహకార వ్యవసాయ క్షేత్రాల ఆధీనంలో ఉన్న భూములను గరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయించారు..
4) మిగులు భూమి పంపిణీ:కమతాల గరిష్ట పరిమితి చట్టాల అమలుచేయడం ద్వారా లభించిన మిగులు భూమిని భూమి లేని రైతు కూలీలు, చిన్నరైతులు, ఉపాంత రైతులకు పంపిణీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రశ్న 12.
భూ సంస్కరణలు విఫలం కావడానికి కారణాలు.
జవాబు:
భూ సంస్కరణలు పేదరికాన్ని నిర్మూలించి పేదవారికి సాధికారిత కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించినప్పటికీ ఆచరణలో అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాయి.
కారణాలు :
- రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడం.
- బీనామి పేర్ల పై భూమి బదిలీ చేయడం.
- భూసంస్కరణ శాసనాలలో ఏక రూపత లేకపోవడం.
- న్యాయస్థానాల జోక్యం.
- భూమికి సంబంధించిన రికార్డులు సరిగ్గా లేకపోవడం.
- భూసంస్కరణ మినహాయింపు చట్టాలలో లొసుగులు ఉండటం.
- గ్రామీణ పేదలు అసంఘటితంగా ఉండటం.
- అవినీతిమీయమైన పరిపాలనా యంత్రాంగం.
ప్రశ్న 13.
భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావాన్ని వివరింపుము. [Mar ’17]
జవాబు:
భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం:హరిత విప్లవం భారత ఆర్థిక వ్యవస్థపై విశేష ప్రభావాన్ని చూపింది. హరిత విప్లవం వల్ల ఏర్పడిన సత్ఫలితాలను కింది విధంగా వివరించవచ్చు.
1) ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల హరిత విప్లవం యొక్క ప్రత్యక్ష ఫలితం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అధిక పెరుగుదల సాధించడం. హరిత విప్లవం ప్రభావం వరి, గోధుమ ఉత్పత్తి మీద ఎక్కువ ఉంది. 1960-61లో వరి, ధాన్యం ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 104 మిలియన్ టన్నులకు పెరిగింది. గోధుమ ఉత్పత్తి 1960-61లో 11 మిలియన్ టన్నులు ఉండగా 2011-12 నాటికి 255 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 2012-13 నాటికి 257 మిలియన్ టన్నులకు పెరిగింది.
2) వాణిజ్య పంటల ఉత్పత్తిలో పెరుగుదల:హరిత విప్లవం ప్రారంభంలో ఆహార పంటలకు మాత్రమే పరిమితమై వాణిజ్య పంటల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. హరిత విప్లవం 1973-74 తరువాత వాణిజ్య పంటలైన చెరకు ఉత్పత్తి మీద విశేషమైన ప్రభావాన్ని, నూనె గింజలు, బంగాలదుంపల ఉత్పత్తుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపింది. చెరకు ఉత్పత్తి 1960-61 లో 110 టన్నుల నుంచి 2011-12 నాటికి 358 మిలియన్ టన్నులకు పెరిగింది. మానె గింజల ఉత్పత్తి 1960-61లో 7 మిలియన్ టన్నుల నుంచి 2011-12 నాటికి 30 మిలియన్ టన్నులకు పెరిగింది.
3) ఉపాధి అవకాశాల పెరుగుదల: హరిత విప్లవం ఫలితంగా సాగులోవున్న భూ విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. వ్యవసాయరంగంలో శ్రమశక్తి ఎక్కువ అవసరమయ్యే వరి, చెరకు, తోటపంటలు, బంగాళదుంపలు కూరగాయలు మొదలైన పంటలు సాగుచేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. అంతేగాక సాంద్ర వ్యవసాయంలో భాగంగా బహుళ పంటలు పండించటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు వృద్ధి చెందాయి. కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయరంగంలో చిల్లర అమ్మకాలు చేపట్టడంతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి.
4) బలిష్టమైన ముందు, వెనుక బంధాలు:వ్యవసాయ పారిశ్రామిక రంగాలు రెండూ పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడే రంగాలు వ్యవసాయం పరిశ్రమలకు కావల్సిన ముడిసరుకులనూ అందిస్తుంది. దీన్నే “ముందువైపు బంధం” అంటారు. అనాదిగా బలిష్టంగా ఉంది. పరిశ్రమలు వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలను అందిస్తుంది. దీనిని “వెనుకవైపు బంధం” అంటారు. అయితే ఈ బంధం బలహీనంగా ఉంది. హరిత విప్లవ ఫలితంగా పారిశ్రామిక రంగం సరఫరా చేసే వ్యవసాయ ఉత్పాదకాలను విపరీతంగా గిరాకీ పెరిగింది. తద్వారా వెనుక వైపు బంధం కూడా బలిష్టమైనది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండూ బలోపేతం చేయబడ్డాయి.
5) ఆదాయల్లో పెరుగుదల:ఈ నూతన వ్యవసాయ వ్యూహం రైతులు తాము పండించిన పంటలను శ్రేణీకరణ, ప్రామాణీకరణ చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధరలకు ప్రత్యక్షంగా చిల్లర వ్యాపారం. చేసే కంపెనీలకు, అమ్ముకొనే అవకాశాలను కల్పించింది. ఈ కంపెనీలు రైతులకు లాభసాటి ధరలను, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే గాక ధరల నియంత్రణకు తోడ్పడ్డాయి. హరితవిప్లవ ఫలితంగా పంజాబ్, హర్యానా మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతుల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.
6) పేదరికం తగ్గుదల:హరిత విప్లవం ఉపాధి అవకాశాలను వ్యవసాయరంగంలోనే కాక వ్యవసాయేతర రంగాలైన రవాణా, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పరిశ్రమల్లో, బ్యాకింగ్, సేవారంగాల్లో ఉపాధిని కల్పించింది. అంతేకాక హరితవిప్లవ ఫలితంగా ఆహారధాన్యాలలో లభించిన మిగులును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరలకు పేదవారికి అందించడం జరుగుతుంది. దీని ఫలితంగా పేదవారి వాస్తవిక ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది.
ప్రశ్న 14.
గ్రామీణ పరపతినందించడంలో ప్రాంతీయ గ్రామీణ బాంకుల పాత్ర.
జవాబు:
భారత ప్రభుత్వం ఆచార్య యమ్. నరసింహం కమిటి సిఫార్సుల ఆధారంగా 1975 అక్టోబర్ 2వ తేదిన ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 5 ప్రాంతీయ, గ్రామీణ బాంకులను ప్రారంభించింది. తరువాత కాలంలో వీటి సంఖ్య 196కి చేరింది. ప్రభుత్వ గ్రామీణ బాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీటిని ఏకీకృతం చేసింది. సాధారణంగా గ్రామీణ బాంకులను ఒక జాతీయ బాంకు పూచిపై స్థాపించటం జరుగుతుంది. 2013 మార్చి చివరకు 26 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 635 జిల్లాలలో 17,856 గ్రామీణ బాంకు శాఖలు ఉన్నాయి.
ప్రతి గ్రామీణ బాంకు అధీకృత మూలధనం ఒక కోటి రూపాయలు, దీనిలో చెల్లించిన మూలధనం 25 లక్షల రూపాయలు. ఈ మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 35 శాతం పూచీ ఇచ్చిన ప్రభుత్వ బాంకు సమకూరుస్తాయి.
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బాంకు, రిజర్వుబాంకు ప్రాంతీయ గ్రామీణ బాంకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఏట కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
చిన్న రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు, హస్త కళాకారులు, చిన్న వ్యాపారస్తులు మొదలైన వారికి పరపతిని సమకూర్చి ఉత్పాదక కార్యక్రమాల్లో ప్రగతిని సాధించటం గ్రామీణ బ్యాంకుల ప్రధాన ఆశయం.
2011-2012 లో గ్రామీణ బాంకులు వ్యవసాయదారులకు 54,550 కోట్ల రూపాయల రుణం అందించాయి. ఇది మొత్తం సంస్థపరమైన పరపతిలో 10.65 శాతంగా ఉన్నది. ప్రస్తుతం గ్రామీణ బాంకులు, వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే సాధారణ బాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
ప్రశ్న 15.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు.
జవాబు:
సహకార పరపతి సంఘాలు:జర్మనీలో విజయవంతంగా అమలు చేయబడిన సహకార పరపతి విధానాన్ని ఆసరాగా తీసుకొని భారతదేశంలో 1904లో సహకారోద్యమం ప్రారంభించబడింది. గ్రామీణ రైతులను రుణ విముక్తులను చేసి వారిలో పొదుపు అలవాట్లను పెంపొందించడం సహకార పరపతి సంస్థల ముఖ్యోద్దేశం.
స్వల్పకాలిక సహకార పరపతి విధానాన్ని మూడు అంచెల్లో నిర్మించడం జరిగింది. మొదటి అంచెలో గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేశారు. రెండవ అంచెలో జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేశారు. మూడవ అంచెలో రాష్ట్ర సహకార బాంకులను ఏర్పాటు చేశారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు గ్రామ స్థాయిలో 10 లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులచేత ప్రారంభించబడతాయి. ఈ సంఘాలు ఎన్నుకోబడిన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులచే నిర్వహించబడతాయి. రిజర్వ్ బాంకు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది.
1976లో జరిగిన ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘాల పునర్వ్యవస్థీకరణ వల్ల “ఏకగవాక్ష విధానం” అమల్లోకి వచ్చింది.
2012 మార్చి 31 నాటికి 31 రాష్ట్ర సహకార బ్యాంకులు, 370 జిల్లా సహకార బాంకులు, 92,432 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల స్వల్పకాలిక పరపతిని అందిస్తున్నాయి.
ప్రశ్న 16.
వాణిజ్య బాంకులు – గ్రామీణ పరపతి.
జవాబు:
లాభోద్దేశంతో బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బాంకులే వాణిజ్య బాంకులు “1951 వరకు వ్యవసాయానికి అందించబడిన మొత్తం పరపతిలో వాణిజ్య బాంకులు వాటా కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. 1964 లో 14, 1980లో 6 బాంకులను జాతీయం చేసిన తరువాత వాణిజ్య బాంకులు విజయవంతంగా నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తున్నాయి. 2012 జూన్ నాటికి బాంకు శాఖలు 98,591 విస్తరించాయి.
వాణిజ్య బాంకులు కింది కార్యక్రమాలు కోసం గ్రామీణ పరపతిని అందిస్తున్నాయి.
1) వాణిజ్య బ్యాంకులు గ్రామీణ రైతులను అవసరమైన మొత్తం స్వల్పకాలిక పరపతిలో 42 నుంచి 45 శాతం వరకు అందిస్తున్నాయి. అదే విధంగా రైతులు యంత్రాలు, ట్రాక్టర్లు, పంపుసెట్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం దీర్ఘకాలిక పరపతిలో 35 నుండి 37 శాతం వరకు అందిస్తున్నాయి.
2) వాణిజ్య బాంకులు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలైన పశుపోషణ, పాడి, పందుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం మొదలైన కార్యక్రమాలను కూడా పరపతిని అందిస్తున్నాయి.
3) వాణిజ్య బ్యాంకులు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో గ్రామీణ పేదరిక నిర్మూలనా పథకాలైన సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం, జవహర్ రోజ్ గార్ యోజన పథకం కింద లబ్దిదారులకు రుణ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
4) వాణిజ్య బాంకులు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల కంపెనీలకు, భారత ఆహార సంస్థకు, కేంద్ర గిడ్డంగుల సంస్థకు సహకార పరపతి సంఘాలకు, గ్రామీణ బాంకులకు పరపతి అందించి తద్వారా రైతులకు పరోక్షంగా లబ్ది చేకూరుస్తున్నాయి.
ప్రశ్న 17.
గ్రామీణ పరపతినందించడంలో రిజర్వుబాంకు పాత్ర.
జవాబు:
మనదేశంలో రిజర్వుబాంకు 1935 సం॥లో స్థాపించి 1949లో జాతీయం చేశారు. ఈ రిజర్వుబాంకు ప్రారంభం నుంచి గ్రామీణ పరపతిని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించుచున్నది. ఈ బాంకు వ్యవసాయభివృద్ధి కోసం 1956లో రెండు రకాల నిధులను ఏర్పాటు చేసింది.
- జాతీయ వ్యవసాయ పరపతి – దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి.
- జాతీయ వ్యవసాయ పరపతి – స్థిరీకరణ నిధి, రైతులకు అవసరమైన దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు మొదటి నిధిని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను అదుకోవడానికి రెండవ నిధిని ఏర్పాటు చేశారు.
1. స్వల్పకాలిక పరపతి:రిజర్వు బాంకు 15 నెలల కాలవ్యవధి కలిగిన పరపతిని అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ సెక్యూరిటీలపై, తక్కువ వడ్డీకి పరపతి అందిస్తుంది.
2. మధ్యకాలిక పరపతి:రిజర్వు బాంకు 15 నెలల నుంచి 5 సం॥ కాలపరపతి గల రుణాలను వర్తమాన వడ్డీ రేటు కంటే తక్కువవడ్డీ రేటుకు ప్రభుత్వ సెక్యూరిటీలపై రాష్ట్ర సహకార బాంకులకు మధ్యకాలిక రుణాలను అందిస్తుంది.
3. దీర్ఘకాలిక పరపతి:ఇది 20 సం॥లదీర్ఘ కాల పరపతి గల దీర్ఘకాలిక పరపతిని అందిస్తుంది.
4. ఇతర సేవలు:1) వ్యవసాయ పరపతిని అందించే సంస్థలన్నింటికి రిజర్వుబాంకు రుణాలు మంజూరు చేయును. 2) చిన్న రైతులకు ఉపాంత రైతులకు, అభివృద్ధి సంస్థల ద్వారా రుణాలు రిజర్వు బాంకు అందించుచున్నది.
ప్రశ్న 19.
వ్యవసాయ మార్కెటింగ్ లోని వివిధ దశలు.
జవాబు:
రైతులు పంటను పండించిన వెంటనే అమ్మకం జరపలేరు. విక్రయానికి ముందు ఈ ఉత్పత్తులు అనేక దశలను దాటవలసి ఉంటుంది. ఈ దశలనే వ్యవసాయ మార్కెటింగ్ దశలు అంటారు.
- అసెంబ్లింగ్:వివిధ ప్రాంతాలలోని అనేక మంది రైతులు అల్ప పరిమాణంలో చేసిన ఉత్పత్తులను సేకరించి పెద్ద మొత్తంగా పోగుచేసి ఒక నిర్ణీత ప్రదేశంలోకి చేర్చేప్రక్రియను ‘అసెంబ్లింగ్’ అంటారు.
- రవాణా:వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి కేంద్రాల నుంచి మార్కెట్ కేంద్రాలకు తరలించటాన్ని రవాణా అంటారు.
- శ్రేణీకరణ:రైతులు పండించిన ఉత్పత్తుల నాణ్యతలో తేడాలుంటాయి. నాణ్యతలను బట్టి మన్నికను బట్టి ఉత్పత్తుల వర్గీకరించటాన్ని శ్రేణికరణ అంటారు.
- ప్రాసెసింగ్:వినియోగదారుల అన్ని వ్యవసాయ వస్తువులును నేరుగా వినియోగించే వాటిని వినియోగానికి అనువుగా మార్చాలి. ఈ ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు. ఉదా:వరి ధాన్యం బియ్యంగా, నూనెగింజలను వంటనూనెగా మార్చడం.
- ప్రతిచయనీకరణ:వ్యవసాయ వస్తువులను ప్రామాణికరించడం కోసం శ్రేణీకరణ చేయబడిన ఉత్పత్తుల నుంచి కొన్ని ప్రతిచయనాలను ఎంపిక చేయుట.
- పాకింగ్:ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులను పాకింగ్ చేయాలి.
- నిల్వ చేయడం:గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయాలి. నశ్వర వ్యవసాయ వస్తువులను భద్రపర్చుటకు శీతల గిడ్డంగులు అవసరం.
ప్రశ్న 20.
క్రమబద్దీకరించిన మార్కెట్లు. [Mar ’16]
జవాబు:
మార్కెట్లను 1951 సం॥లో ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లోని లోపాలను సరిదిద్దడం కోసం, వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లకు వారి విధులు పరంగా కాకుండా లభించే మార్జిన్లు తగ్గించడం కోసం ఈ మార్కెట్లు రూపొందించారు. ఈ మార్కెట్లు నిర్వహించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతులు, వ్యాపారస్తుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విధులు :
- వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నోటీస్ బోర్డులో ఉంచుతాయి.
- మధ్యవర్తుల సంఖ్యను తగ్గించి వారికి లైసెన్సులను మంజూరు చేస్తాయి.
- తూకం చార్జీలు, దళారీల కమీషన్లు ముందుగానే మార్కెట్ కమిటీలు నిర్ణయిస్తాయి.
- ప్రామాణికమైన తూనికలు, కొలతలు వాడకాన్ని తప్పనిసరి చేస్తాయి.
- అవసరమైన ప్రదేశాలలో సాధారణ, శీతలీకరణ గిడ్డంగులను ఏర్పాటు చేస్తాయి.
- మార్కెట్ మోసాలను పూర్తిగా నియంత్రిస్తాయి.
ప్రశ్న 21.
సహకార వ్యవసాయం.
జవాబు:
గ్రామంలోని రైతులంతా స్వచ్ఛందంగా ఒక సంఘంగా ఏర్పడి, తమ భూములు వ్యవసాయ పరికరాలు, పశువులు మొదలైన ఉత్పాదకాలన్నింటికీ సంఘానికి అందించి మొత్తం భూమిని ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికన నిర్వహించే వ్యవసాయాన్ని ‘సహకార వ్యవసాయం’ అంటారు.
- సహకార వ్యవసాయం వల్ల ఉత్పత్తి అధికమై మిశ్రమం కొరకు మిగులు ఏర్పడుతుంది.
- ఈ వ్యవసాయం వల్ల ఉత్పత్తిలో సాంకేతిక, మార్కెటింగ్, ద్రవ్యపరమైన ఆదాలు లభిస్తాయి.
- భూమి పునరుద్ధరణ, గొట్టపు బావుల త్రవ్వకం మొదలైన కార్యక్రమాలకు అధిక పెట్టుబడి అవసరం. ఈ కార్యకలాపాలను సంఘం స్థాయిలో సమిష్టిగా చేపట్టి వ్యవసాయాభివృద్ధి సాధించవచ్చు.
- ఈ వ్యవసాయ విధానంలో సాంద్ర, విస్తృత వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ.
- సహకార సంఘంలోని రైతులందరూ పరస్పరం సహకరించుకుంటూ, ఉమ్మడిగా వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా వారి మధ్య సాంఘిక సమానత్వము సాధించవచ్చు.
ప్రశ్న 22.
ఒప్పందపు వ్యవసాయం.
జవాబు:
వ్యవసాయ మార్కెటింగ్ విధానంలోని లోపాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన పరిష్కార మార్గం ఒప్పంద వ్యవసాయం రైతులు తమ ఉత్పత్తులను వినియోగించే సంస్థలతో ప్రత్యక్షంగా ఒప్పందాలను కుదుర్చుకొని చేసే వ్యవసాయ విధానాన్ని ‘ ఒప్పంద వ్యవసాయం’ అంటారు.
- ఈ విధానంలో ముందుగా ధరలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో ఉండే అస్థిరతలను తొలగించి రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని పెంపొందించవచ్చు.
- రైతులు ఏ పరిశ్రమలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవి పరపతి, సాంకేతిక సహాయం అందిస్తాయి.
- నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు లభించడానికి అవకాశం పెరుగుతుంది.
- రైతులు వ్యక్తిగతంగా కాక సహకార ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకుంటే వారికి బేరమాడే శక్తి పెరుగుతుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వ్యవసాయరంగం.
జవాబు:
వ్యవసాయం, దాని అనుబంధరంగాలైన అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి, పశుపోషణ, తోటల పెంపకం, గనులు, క్వారీలు మొదలగువాటన్నింటికి కలిపి వ్యవసాయరంగం అంటారు.
ప్రశ్న 2.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు.
జవాబు:
పరిశ్రమలు వాటికవసరమైన ముడిసరుకులు అది వ్యవసాయరంగముపై ఆధారపడితే వాటిని వ్యవసాయ ఆధార పరిశ్రమలంటారు. మనదేశంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు అనేకం ఉన్నాయి. ఉదా:జనపనార, పంచదార మొదలగు పరిశ్రమలు. ఈ పరిశ్రమల అభివృద్ధికి వ్యవసాయ ప్రగతి తోడ్పడుతుంది.
ప్రశ్న 3.
ఆహార భద్రత.
జవాబు:
ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనాన్ని కొనసాగించడానికి ప్రజలందరికి అన్ని కాలాలలో చాలినంత పరిమాణంలో ఆహారం అందుబాటులో ఉండటం “ఆహార భద్రత”.
ప్రశ్న 4.
బంజరు భూముల పునరుద్ధరణ.
జవాబు:
వ్యవసాయరంగంలో మధ్యవర్తుల తొలగింపు ఫలితంగా బంజరు భూములు మీద యాజమాన్యపు హక్కులు పొందిన రైతులు వాటిని వ్యవసాయ యోగ్యంగా మార్చడమే “బంజరు భూముల” పునరుద్ధరణ.
ప్రశ్న 5.
పంటల తీరు .
జవాబు:
నిర్ణీత కాలంలో ఒకదేశంలో వ్యవసాయ భూమిని వివిధ పంటలు పండించటానికి ఉపయోగిస్తున్నారు. ఈ రీతిని “పంటతీరు” అంటారు.
ప్రశ్న 6.
శాశ్వత నీటి కాలువలు.
జవాబు:
నదులపై అడ్డంగా ఆనకట్టలు కట్టగా ఏర్పడిన జలాశయాలకు ఈ కాలువలను అనుసంధానం చేస్తారు. అందువల్ల ఇవి వ్యవసాయానికి సంవత్సరం పొడవున నీటిని అందించి శాశ్వత కాలువులుగా పిలవబడుతున్నాయి.
ప్రశ్న 7.
బిందు నీటి పారుదల.
జవాబు:
మొక్కల యొక్క వేరు మొదలులో నీటిని బొట్లు బొట్టుగా చేయడం ‘బిందు నీటిపారుదల’.
ప్రశ్న 8.
తుంపరల నీటి పారుదల.
జవాబు:
మొక్కల్ని తడపడానికి సాంకేతిక పరికరాల సహాయంతో నీరు తుంపర్లుగా పడేటట్లు చేస్తారు. దీనినే తుంపర్ల నీటి పారుదల.
ప్రశ్న 9.
భూ సంస్కరణలు.
జవాబు:
సమానత్వం, సాంఘీకన్యాయం, వ్యవసాయాభివృద్ధి సాధించడానికి భూమి మీద చేపట్టే ఆర్థిక, ఆర్థికేతర చర్యలను “భూసంస్కరణలు” అంటారు.
ప్రశ్న 10.
సేంద్రీయ వ్యవసాయం. [Mar ’16]
జవాబు:
ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులను, క్రిమిసంహారక మందులను ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని “సేంద్రియ వ్యవసాయం” అంటారు.
ప్రశ్న 11.
ఆర్థిక మతం
జవాబు:
కుటుంబ సభ్యులందరికి సముచితమైన జీవనప్రమాణం,ఉపాధి కల్పించే భూపరిణాన్ని “ఆర్థిక కమతం” అంటారు.
ప్రశ్న 12.
వ్యవసాయ యాంత్రీకరణ.
జవాబు:
వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణలో ట్రాక్టర్లు, పంపుసెట్లు, పంటమార్పిడి యంత్రాలు మొదలగునవి వినియోగించడాన్ని “వ్యవసాయ యాంత్రీకరణ” అంటారు.
ప్రశ్న 13.
కమతాల సమీకరణ.
జవాబు:
గ్రామంలో వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి ఉన్న భూకమతాలను ఏకఖండంగా చేసే ప్రక్రియను కమతాల సమీకరణ అంటారు.
ప్రశ్న 14.
సహకార వ్యవసాయం.
జవాబు:
గ్రామంలోని రైతులందరూ స్వచ్ఛందంగా తమ భూములను ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికపై నిర్వహించే వ్యవసాయ విధానాన్ని “సహకార వ్యవసాయం” అంటారు.
ప్రశ్న 15.
భూ సంస్కరణల ఆశయం.
జవాబు:
- గత సంవత్సరం నుండి వారసత్వంగా వచ్చినటువంటి అడ్డంకులను తొలగించటం.
- భూమిని దున్నే వాడికి రక్షణ కల్పించడం
- వివిధ రూపాలలో ఉన్న దోపిడీలను అరికట్టడం మొదలగునవి.
ప్రశ్న 16.
జమీందారీ విధానం.
జవాబు:
ఈ పద్ధతిలోని 1793 లార్డ్ కార్నవాలీస్ మొదట బెంగాల్లో ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో జమీందారులు తమపరిధిలోని భూములపై యాజమాన్యపు హక్కులు కలిగి ప్రభుత్వానికి పన్ను చెల్లించే బాధ్యత వహించేవారు. అయితే వారు రైతుల దగ్గర అధిక మొత్తాన్ని వసూలు చేసేవారు.
ప్రశ్న 17.
రైత్వారీ విధానం.
జవాబు:
దీనిని సర్ థామస్ మాన్రో 1792లో మద్రాసు రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. తరువాత ఈ విధానం మహారాష్ట్ర, బీహారు, తూర్పు పంజాబు విస్తరించింది. ఈ విధానంలో రైతులు తమ భూములమీద యాజమాన్యపు హక్కులు కలిగి ఉంటారు. రైతుకి, ప్రభుత్వానికి మధ్యవర్తులు ఉండరు. రైతులే ప్రత్యక్షంగా భూమిశిస్తు చెల్లిస్తారు.
ప్రశ్న 18.
జిరాయితీ హక్కు గల కౌలుదార్లు. [Mar ’16]
జవాబు:
ఏ కౌలుదారులను భూస్వాములు కౌలు చెల్లిస్తున్నంతకాలం తొలగించలేరో వారిని “జిరాయితీ హక్కున్న ‘కౌలుదారులు’ లేదా శాశ్వత కౌలుదారులు అంటారు.
ప్రశ్న 19.
హరిత విప్లవం.
జవాబు:
ఆచార్య నిర్మల్ బోర్లోగ్ ఈ నూతన వ్యవసాయ వ్యూహానికి పితామహుడు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవ చైతన్యాన్ని రగల్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన మార్పును హరిత విప్లవం అంటారు.
ప్రశ్న 20.
IADP.
జవాబు:
సాంద్రత వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP) భారత ప్రభుత్వం 1964లో ఫోర్సు ఫౌండేషన్ కమిటీ సిఫార్సును ఆధారంగా అధిక భూసారం, నిశ్చితంగా లభించే నీటి వనరులు, తగిన వర్షపాతం మొదలైన సౌకర్యాలుండి వరదలు, మురుగునీరు, భూసార క్షీణత వంటి సమస్య తీవ్రత తక్కువగా ఉన్న ఏడు జిల్లాలను ఎంచుకొని సాంద్ర వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి ప్రారంభించబడినది. ఉదా:ఆంధ్రలో పశ్చిమగోదావరి,
ప్రశ్న 21.
IAAP.
జవాబు:
సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం. భారత ప్రభుత్వం 1967లో సాంద్ర వ్యవసాయ కింద ఉన్న భూసార విస్తీర్ణాన్ని అధికం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని కొన్ని ఎంచుకొన్న పంటలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పథకాన్ని దేశంలో 114 జిల్లాలకు విస్తరింప చేశారు.
ప్రశ్న 22.
HYVP అధిక దిగుబడిలునిచ్చే విత్తనాలు కార్యక్రమాలు.
జవాబు:
దీనిని 1965లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం, హరిత విప్లవం సాధించడంలో సంకర జాతి విత్తనాల పాత్ర కీలకమైంది. ICAR, ICRISAT మొదలగునవి అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను సృష్టించడం జరిగింది.
ప్రశ్న 23.
RIDF
జవాబు:
నాబార్డ్ ఆధ్వర్యంలో గ్రామీణ అవస్థాపనా నిధి 1995-96లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఆశయం అవస్థాపనా సౌకర్యాల కొరత కారణంగా మధ్యలో ఆగిపోయిన వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందించడం.
ప్రశ్న 24.
కిసాన్ క్రెడిట్ కార్డు. [Mar ’17]
జవాబు:
ఈ స్కీమ్ను 1998లో ప్రవేశపెట్టింది. రైతులకు వ్యవసాయ ఖర్చులకోసం, వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలు కోసం తక్కువ వడ్డీకి సకాలంలో సరిపడినంత స్వల్పకాలిక పంట రుణాలు అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.
ప్రశ్న 25.
SGSY.
జవాబు:
స్వర్ణ జయంతి గ్రామీణ స్వరోజ్ గార్ యోజన సంస్థాపరమైన పరపతి అందిస్తున్న పెద్ద పథకం, IRDP, TRYSEM, DWCRA ఇతర అనుబంధ పథకాలన్నింటిని ఒక్కటిగా విలీనం చేసి దీనిని 1999న ప్రారంభించిరి. పేదరికాన్ని నిర్మూలించడం ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం.
ప్రశ్న 26.
సూక్ష్మ విత్తం. [Mar ’17]
జవాబు:
గ్రామీణ, పట్టణ ప్రాంతపు పేదలకు స్వల్ప మొత్తంలో పరపతిని తక్కువ వడ్డీకి అందించడాన్ని సూక్ష్మ పరపతి అంటారు.
ప్రశ్న 27.
అసెంబ్లింగ్.
జవాబు:
వివిధ ప్రాంతాలలోని అనేక మంది రైతులు అల్పపరిమాణంలో చేసిన ఉత్పత్తులను సేకరించి పెద్ద మొత్తంగా పోగు చేసి ఒక నిర్ణీత ప్రదేశంలోనికి చేర్చే ప్రక్రియను “అసెంబ్లింగ్” అంటారు.
ప్రశ్న 28.
ప్రాసెసింగ్.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తులను వినియోగానికి అనువుగా మార్చే ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు. ఉదా: వడ్లు లేదా ధాన్యంను బియ్యంగా మార్చడం.
ప్రశ్న 29.
AGMARK.
జవాబు:
వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతల గుర్తుగా వ్యవసాయ మార్కెటింగ్ యొక్క సంకేతాక్షరం AGMARK.
ప్రశ్న 30.
విక్రయం కాగల మిగులు. [Mar ’17]
జవాబు:
వ్యవసాయదారులు తాము పండించిన మొత్తం ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించలేరు. అందులో కొంత భాగాన్ని విత్తనాలకు, వేతనాలకు సొంత వినియోగానికి దాచుకుంటారు. ఈ అవసరాలు పోను మిగిలిన మొత్తం మార్కెట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మిగులునే విక్రయం కాగల మిగులు అంటారు.
ప్రశ్న 31.
రైతు బజార్లు. [Mar ’17, ’16]
జవాబు:
ఏ మార్కెట్లలో అమ్మకందారులైన, రైతులకు కొనుగోలుదారులకు మధ్య దళారీలు ఉండరో అ మార్కెట్లను “రైతు బజార్లు” అంటారు.