Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 7th Lesson ప్రణాళికలు – ఆర్ధిక సంస్కరణలు Textbook Questions and Answers.
AP Inter 2nd Year Economics Study Material 7th Lesson ప్రణాళికలు – ఆర్ధిక సంస్కరణలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘ప్రణాళికను’ నిర్వచించి, స్థూలంగా ప్రణాళికల లక్ష్యాలను వివరించండి.
జవాబు:
ప్రణాళిక అంటే నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపుకు ఒక క్రమంలో నడపడాన్ని ప్రణాళిక అని అంటారు. మన దేశంలో పంచవర్ష ప్రణాళికల అమలు 1951లో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తి అయి, 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఉన్నాయి.
ప్రణాళిక లక్ష్యాలు:
1) జాతీయాదాయ తలసరి ఆదాయాల వృద్ధి: భారత ప్రణాళికల ప్రధాన లక్ష్యం జాతీయాదాయాన్ని పెంచుట, తద్వార తలసరి ఆదాయము పెరుగుతుంది. పేదరికాన్ని నిర్మూలించి, జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి. అంటే తలసరి ఆదాయం పెరగాలి. అందువలన ప్రతి ప్రణాళికలలోను వృద్ధిరేటు నిర్ణయించబడింది.
2) ఉద్యోగిత: ప్రభుత్వం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి పరచటం ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది అని భావించి, దీనితో పాటు ఈ రెండు రంగాల అభివృద్ధి ఉద్యోగితా స్థాయిని పెంపొందిస్తుందని ప్రణాళికావేత్తలు భావించారు. నిరుద్యోగ నిర్మూలన ప్రణాళికలన్నింటిలోను ప్రధాన లక్ష్యంగా ఉంది.
3) సామ్యవాదరీతి సమాజస్థాపన: ప్రణాళికాభివృద్ధి యొక్క లక్ష్యం సామ్యవాద రీతి సమాజస్థాపన, విద్య, వృత్తి, ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు లభించేటట్లు చేయుట, ఆర్థిక శక్తి కొందరి చేతిలోనే కేంద్రీకృతం కాకుండా ఆదాయం అందరి మధ్య సమానంగా పంపిణీ జరిగేటట్లు చూచుట ప్రణాళికల ముఖ్యమైన ఆశయాలు. ప్రభుత్వం ఆర్థికశక్తి కేంద్రీకరణను నియంత్రణ చేసే అధికారం కలిగి ఉంది.
4) స్వావలంబన: ప్రతి ప్రణాళికలలోను “స్వయం సమృద్ధి” ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ 3వ ప్రణాళికలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. 9వ ప్రణాళిక ఆశయమును నికర విదేశీ సహాయం ‘0’ గా ఉండేటట్లు
చూచుట.
5) ఇతర లక్ష్యాలు:
- ఆర్థిక అసమానతలు తగ్గించుట.
- పేదరికం నిర్మూలన.
- ధరల స్థిరీకరణ ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించుట.
- ప్రాంతీయ అసమానతలు తొలగింపు.
- ప్రత్యేకించి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధికి కృషి.
ప్రశ్న 2.
పన్నెండవ’ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను వివరించండి. [Mar ’17, ’16]
జవాబు:
భారత ప్రభుత్వం అక్టోబరు 4న, 12వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను (2012-17)లో అంతకు ముందున్న వార్షిక సగటు వృద్ధిరేటు 9 శాతాన్ని, 8.2 శాతానికి తగ్గించి లక్ష్యాన్ని నిర్ధారించుకుంది. ఇందుకు కారణం అప్పటి ప్రపంచ వ్యాప్తం అయిన ఆర్థిక మాంద్యం. దీని ప్రకారం సాధించాల్సిన వృద్ధిరేటు 8.2 శాతం నుండి 9 శాతం వరకు ఉంటుంది. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం – “సత్వర, సుస్థిర మరియు మిక్కిలి సమ్మిళిత వృద్ధి”. 12వ పంచవర్ష ప్రణాళికకు అయిన మొత్తం వ్యయం, జి.డి.పిలో 37 శాతం కాగా, అంచనా వేయబడిన మొత్తం పొదుపు రేటు జి.డి.పిలో 34.2 శాతంగా ఉంది.
ముఖ్య లక్ష్యాలు: 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం – “సత్వర, సుస్థిర మరియు సమ్మిళిత వృద్ధి” కాగా ఇతర లక్ష్యాలను క్రింద పేర్కొనడం జరిగినది.
ఎ) ఆర్థిక వృద్ధి:
- వాస్తవ జి.డి.పి వృద్ధి రేటు 8.0 శాతం సాధించడం.
- సంవత్సరానికి తలసరి ఆదాయంలో వృద్ధి 6.5 శాతం సాధించడం.
- వ్యవసాయంలో 4.0 శాతం వృద్ధి రేటు సాధించడం.
- పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి రంగంలో 10 శాతం సాంవత్సరిక వృద్ధి రేటు సాధించుట.
- పారిశ్రామిక రంగంలో, 7.6 శాతం వృద్ధి రేటు సాధించడం.
- సేవా రంగంలో 9.0 శాతం వృద్ధి రేటు సాధించడం.
- ప్రతి రాష్ట్రం 11వ ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించుట.
బి) పేదరికం మరియు ఉద్యోగాలు:
12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి తలసరి వినియోగం ప్రకారం గణింపబడిన, అంతకు ముందున్న స్థాయి నుండి 10 శాతం బిందువుకు పేదరికాన్ని తగ్గించడం.
- ఈ ప్రణాళికా కాలంలో 50 మిలియన్ల ఉద్యోగావకాశాలు అసంఘటిత రంగంలో కల్పిస్తూ, అంతే సంఖ్యలో నైపుణ్యం అర్హత పత్రాలను అందించడం.
సి) విద్య:
2017 నాటికి అక్షరాస్యతను 85 శాతానికి పెంచడం.
- 12వ పంచవర్ష ప్రణాళిక అంతానికి బడిలో గడిపే సరాసరి సంవత్సరముల సంఖ్య 7కు పెంచడం. (సర్వ శిక్షా అభయన్)
- కళాశాలల్లో 2 మిలియన్ల సీట్లను పెంచడం ద్వారా ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలను పెంచడం (RUSA).
- 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి, పాఠశాలల్లో లింగ, వివక్షత, సామాజిక వివక్షతలను తొలగించడం.
డి) ఆరోగ్యం:
- 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తయ్యే నాటికి, ప్రతీ 1000 జననాలకు, శిశు మరణాల రేటును 25కు, మాతా మరణాల రేటును 1కి తగ్గించడం, అలాగే బాల్య లింగ నిష్పత్తి (0-6 సం) 950 కి పెంచడం. త్రాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు పెంచడం ద్వారా ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరచడం.
- మొత్తం పునరుత్పత్తి రేటును ప్రణాళిక చివరి నాటికి 2.1కి తగ్గించడం.
- 0-3 సంవత్సరముల వయసు పిల్లల్లో పోషకాహార లోపం కలిగిన వారి సంఖ్యను సగానికి తగ్గించడం.
ఇ) అవస్థాపనా సౌకర్యాలు (గ్రామీణ అవస్థాపనలతో కలిపి):
- జి.డి.పిలో శాతం పెట్టుబడిని అవస్థాపనా సౌకర్యాల కొరకు కేటాయించడం.
- స్థూల నీటి పారుదల గల ప్రాంతాన్ని 90 మిలియన్ హెక్టార్ల నుండి 103 మిలియన్ హెక్టార్లకు పెంచడం.
- ప్రతీ గ్రామానికి విద్యుత్తు సదుపాయాలు కల్పించడం. విద్యుత్ రవాణాలోని డ్రాపవుట్ నష్టాలను 20 శాతానికీ తగ్గించడం.
- అన్ని గ్రామాలను, అన్ని వాతావరణాలను తట్టుకోగల రోడ్డులతో అనుసంధానించడం.
- గ్రామీణ ప్రాంతాల్లో టెలిసాంద్రతను 70 శాతానికి పెంచడం.
ఎఫ్) పర్యావరణము – సుస్థిరత:
- అడవులను, చెట్లను మొత్తం భూభాగంలో 33 శాతానికి పెంచుట.
- ప్రతీ సంవత్సరం 1 మిలియన్ హెక్టార్ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపడం.
- పునరావృతమయ్యే శక్తి మూలాల నుండి ఉత్పన్నం చేసే విద్యుత్ను 30,000 మెగా వాట్లకు పెంచడం.
- జి.డి.పిలో 2020 నాటికి, కాలుష్య కారక సాంద్రతను 2005 నాటి స్థాయి కన్నా 20 నుండి 25 శాతం కన్నా దిగువకు పరిమితం చేయడం.
- కలుషితమైన ప్రధాన నదులను పరిశుభ్రం చేయడం.
జి) సేవలు:
ఈ ప్రణాళిక పూర్తయ్యే నాటికి 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందేలా చేయడం. ఆధార్ను బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం చేయడం ద్వారా రాయితీలు, నగదు బదిలీ నేరుగా ఉద్దేశింపబడిన వ్యక్తి అకౌంట్ను చేరే విధముగా చూడడం.
ప్రశ్న 3.
పదకొండు పంచవర్ష ప్రణాళికలలో మన దేశం సాధించిన విజయాలను, అపజయాలను సమీక్షించండి.
జవాబు:
విజయాలు: ప్రణాళికల అమలు సమయములో ఉన్న పరిస్థితులు చాలా దీనముగా ఉండేవి. కాని కొన్ని ప్రణాళికలు తమ లక్ష్యాలను చేరుకోలేక పోయినప్పటికిని అవి సాధించిన విజయాలను కొనియాడక తప్పదు. ఇందులోని కొన్ని ముఖ్యమైన విజయాలను క్రింది విధముగా పేర్కొనవచ్చును.
ఎ) జాతీయ – తలసరి ఆదాయాల్లో పెరుగుదల: మన దేశంలో ప్రణాళికల ప్రధాన లక్ష్యం మరియు తలసరి ఆదాయాల్లో పెరుగుదలను సాధించడం.
జాతీయ మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో కౌ 1.32 లక్షల కోట్లుగా ఉన్న జాతీయాదాయము 2004-05 ఆధార సంవత్సర ధరలలో 11వ పంచవర్ష ప్రణాళికా కాలము నాటికి (2012) 47.67 లక్షల కోట్లకు చేరింది.
మరోవైపు అధిక జనాభా పెరుగుదల వల్ల వాస్తవిక తలసరి ఆదాయ వృద్ధిరేటు మందకొడిగా పెరిగింది.
బి) వ్యవసాయంలో వృద్ధి: భారత ప్రభుత్వం, 60 సంవత్సరములుగా వ్యవసాయము, దాని అనుబంధ కార్యకాలాపాలపై 23 నుండి 24 శాతం వ్యయాన్ని ఖర్చు చేసింది. ఈ భారీ వ్యయం మరియు క్రొత్త వ్యవసాయ వ్యూహము (1960) వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయముగా పెరిగాయి.
భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950- 51లో 50.8 మి. టన్నులు కాగా, 2014 నాటికి అది 264 మి. టన్నుల రికార్డు స్థాయికి పెరిగింది. ఆహారేతర పంటలైన నూనె గింజలు, చెఱకు మరియు ప్రత్తి మొదలగు వాటి ఉత్పత్తి కూడా పెరిగింది. కానీ, పప్పు ధాన్యాల ఉత్పత్తి అనుకున్నంతగా పెరగలేదు.
సి) పరిశ్రమలలో వృద్ధి: రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలోనే పారిశ్రామికాభివృద్ధికి పునాది వేయబడింది. మౌలిక మరియు మూలధన పరిశ్రమలను నెలకొల్పడం జరిగింది. 11 పంచవర్ష ప్రణాళికలలో భారత ప్రభుత్వం ఎక్కువగా పారిశ్రామికాభివృద్ధి కోసం పెట్టుబడులను పెట్టడం జరిగింది. దాదాపు 55 శాతము ప్రణాళికా వ్యయాన్ని పారిశ్రామికాభివృద్ధికి కేటాయించడం జరిగింది.
1950-51లో బొగ్గు ఉత్పత్తి 32 మిలియన్ టన్నులు ఉండగా, 2011-12 నాటికి అది 583 మిలియన్ టన్నులు పెరిగింది.
డి) అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి: ప్రణాళికల వల్ల సాధింపబడిన మరొక అద్భుత విజయం సత్వర ఆర్థికాభివృద్ధికి అత్యవసరమైన నిబంధన అయిన ఆర్థిక మరియు సామాజిక అవస్థాపనా సౌకర్యాల సృష్టి. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలానికి భారతదేశ అక్షరాస్వత రేటు 18.3 శాతం ఉండగా ప్రస్తుతం అది 74 శాతానికి పెరిగింది. అందులో పురుష అక్షరాస్యత శాతం 82% కాగా, స్త్రీ అక్షరాస్యత 66%, శిశుమరణాల రేటు, మాతా మరణాలరేటు, బాల్యమరణాల రేటు తగ్గుదలను గమనించవచ్చును.
రవాణా: 1950-51 ప్రణాళిక అమలు తరువాత అన్ని మార్గాల ద్వారా రవాణా మంచి వృద్ధిని కనపరిచాయి. భారత రైల్వేల నెట్వర్క్ 1950-51లో 53,596 కి.మీ.ల నుండి ప్రస్తుతం 63,220 కి.మీకు పెరిగింది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు కూడా వస్తు రవాణా సామర్థ్యం మరియు రాబడి వంటి అనేక అంశాలలో పెరుగుదలను ప్రదర్శించాయి. బొగ్గు, విద్యుత్, పెట్రోలియం, సహజవాయువు అనునవి ముఖ్యమైన ఇంధన వనరులు. 2004లో డెలిఫోను వినియోగదారుల సంఖ్య 76.5 మిలియన్లు ఉండగా 2014 జనవరి నాటికి 922.04 మిలియన్లకు పెరిగింది. భారీ, మధ్య మరియు చిన్న ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా నీటి పారుదల వసతులు కూడా విస్తరింపబడుతున్నాయి.
ఇ) ఎగుమతులు మరియు దిగుమతుల్లో మార్పులు: 1990లో వచ్చిన నూతన ఆర్థిక సంస్కరణల వల్ల భారతదేశ దిగుమతుల్లో గొప్ప మార్పులు సంభవించాయి. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలానికి భారతదేశం ఎగుమతుల విలువ’ 606 కోట్లు ఉండగా, 12వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి కౌ 16,35,261 కోట్లకు పెరిగింది.
ఎఫ్) శాస్త్ర – సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి సాధించడం మరియు నిర్వహణా విభాగం, సాంకేతికాభివృద్ధి ప్రణాళికల మరొక ముఖ్యమైన విజయం. మనదేశం విదేశీ నిపుణులపై ఆధారపడడం తగ్గి, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలకు కూడా నిపుణులను ఎగుమతి చేయగల దేశంగా మారింది.
జి) విద్యా వ్యవస్థ అభివృద్ధి: ప్రపంచంలోనే విద్యా వ్యవస్థ అభివృద్ధిలో భారతదేశం రెండవ పెద్ద దేశంగా అవతరించింది. విద్యా వార్షిక నివేదిక 2012 ప్రకారం 6-14 సంవత్సరముల వయస్సుగల గ్రామీణ బాల బాలికలలో 96.5 శాతం మంది పాఠశాలల్లో నమోదు చేయబడ్డారు. 2011 నాటికి మన దేశంలో 573 విశ్వవిద్యాలయాలు 33,023 కళాశాలలు ఉన్నాయి.
అపజయాలు: భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఈ 65 సంవత్సరాల ప్రణాళికా శకంలో చెప్పుకోదగిన అభివృద్ధి సాధించినది. అయినప్పటికి కొన్ని బలహీనతలు, ప్రణాళికలు విఫలమవడానికి కారణాలయ్యాయి.
- 65 సంవత్సరాల ఆర్థికాభివృద్ధిలో పేదరికం, నిరుద్యోగం, మొదలైన సమస్యలు పరిష్కరింపబడలేదు.
- భూ సంస్కరణలు ప్రవేశ పెట్టి దశాబ్దాలు గడిచినా, వాస్తవిక పరిస్థితులలో భూ పంపిణీ సక్రమంగా అమలు కాలేదు.
- భారతదేశ పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం అసమానతలు లేని సమసమాజాన్ని నిర్మించడం, కానీ ఇది ఇప్పటి వరకు పూర్తి కాలేదు.
- అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని ఇప్పటకీ చేరుకోలేక పోయాం.
- సంతులిత ప్రాంతీయాభివృద్ధి సాధించడంలో ప్రణాళికలు విఫలమయ్యాయి.
ప్రశ్న 4.
భారతదేశంలో ప్రాంతీయ అసమానతలకు గల కారణాలరలను వివరించండి. [Mar ’16]
జవాబు:
దేశ సమగ్రతకి, సత్వర పురోగతికి, ఆర్థికాభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు అడ్డంకిగా ఉంటాయి. వివిధ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాల్లో వ్యత్యాసాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవడానికి ముందుగా, దీనికి గల అసలు కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. అవి:
ఎ) భౌగోళిక కారణాలు: భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు మిగతా ప్రాంతాల నుంచి వేరుపరచబడి ఉంటాయి. కొండలు, లోయల కారణంగా ఇలాంటి ప్రాంతాలు ఏర్పడవచ్చు. అలాంటి ప్రాంతాలు వెనకబడి ఉంటాయి. ఉదా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లోని ఉత్తర కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా వాతావరణం, రవాణా మార్గాలు సరిగ్గా లేకపోవడం వల్ల వెనుకబడి ఉన్నాయి.
బి) శీతోష్ణస్థితి పరిస్థితులు: వర్షపాతం, వాతావరణం మొదలైనవి అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. ఇలాంటి ప్రదేశాల్లో వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ తొందరగా అభివృద్ధి చెందలేవు.
సి) బ్రిటీషువారి పరిపాలన: చారిత్రాత్మకంగా చూస్తే భారతదేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి బ్రిటీషువారి పరిపాలన కూడా కొంత కారణం. పారిశ్రామిక ఉత్పత్తికి, తమ వ్యాపారానికి అనుకూలముగా ఉండి మన దేశ సంపదను తమ దేశానికి తరలించడానికి అనువుగా ఉండే ప్రాంతాలనే వారు ఎన్నుకొని అభివృద్ధి పరచడం జరిగింది. మహా నగరాలైన కలకత్తా, బొంబాయి, మద్రాసులను వ్యాపార కేంద్రాలుగా చేసుకోవడం వల్ల, భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడి వెనుకబడ్డాయి.
డి) పరిశ్రమల కేంద్రీకరణ: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ప్రైవేటు రంగం నూతన పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది కారణం, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పరిశ్రమలకు కావలసిన అవస్థాపనా వసతులైన నైపుణ్యం గల శ్రామికులు, రవాణా మరియు మార్కెట్ సౌకర్యాలు సులభంగా లభ్యం కావడం.
ఇ) సహజ వనరుల కొరత: ప్రకృతి పరంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వనరులు పుష్కలంగా లభించడం వల్ల ఆ ప్రాంతాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అలాంటి అవకాశాలు లేని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి అని చెప్పవచ్చు.
ఎఫ్) అవస్థాపనా సౌకర్యాల కొరత: పరిశ్రమల స్థాపనకు అవర్షాలైన విద్యుచ్ఛక్తి, రోడ్లు, తంతి తపాలా సౌకర్యాలు, నీరు, విద్య, ఆరోగ్యం, సాంకేతిక శిక్షణ సౌకర్యాలు, పరపతి మొదలైనవి కొరతగా ఉన్న ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. ఈ సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలు త్వరితంగా అభివృద్ధి చెందుతాయి.
ప్రశ్న 5.
ప్రాంతీయ సమానాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను వివరించండి.
జవాబు:
ప్రాంతీయ అసమానతలు అనే సమస్య బహుముఖమైనది మరియు ప్రత్యేకమైనది. కాబట్టి దానిని పూర్తిగా. తొలగించడం చాలా కష్టతరమైన పని. రెండవ పంచర్ష ప్రణాళిక కాలం నుండి ప్రాంతీయ అసమానతలను తొలగించుటకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నప్పటికిని ఈ దశలో ఇంకా చేయవలసింది, సాధించవలసింది చాలా ఉంది. వివిధ ప్రాంతాల్లో అసమానతలను తొలగించడానికి ఈ క్రింది చర్యలను తీసుకోవాలి.
వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక వనరులను బదిలీ చేయడం.
- వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు ప్రైవేటు రంగం ముందుకు రాదు కాబట్టి ఆ ప్రాంతాలలో ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించాలి.
- వెనుకబడిన ప్రాంతాల్లో అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను కల్పించడం.
ఉదా: విద్యుచ్ఛక్తి, తంతితపాలా, రోడ్డు, నీటి వసతి మొదలైనవి. - పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహించడం, ఉదాహరణకు ప్రాంతీయ ప్రణాళికలు, సూక్ష్మప్రణాళికలను సాధించవచ్చును.
- వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు.
- తరచూ క్షామాలకు, వరదలకు గురి అయ్యే ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి పధకాలు. కొండ, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకాలు.
- చిన్న తరహా పరిశ్రమలను వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించుటకు తగిన ప్రోత్సాహకాలను ఇవ్వడం. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన, అభివృద్ధి కోశపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఉదాహరణకు సబ్సిడీలు, పన్ను రాయితీలు, మొదలైనవి ప్రకటించడం.
ప్రశ్న 6.
ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం పాత్రను వివరించండి.
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించుటలో అంతర్జాతీయ వాణిజ్యం చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
ఎ) ఉత్పత్తి పెరుగుదల (Increases Output): అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభాలను గడించి, జాతీయ ఆదాయాన్ని, ఉత్పత్తిని పెంపొందించుకొని ఆర్థిక వృద్ధి రేటును అధికం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వ్యాపారం వల్ల అధిక ఉత్పత్తి సాధించి, పేదరికపు విష వలయాన్ని ఛేదించి ఆర్థికాభివృద్ధిని సాధించుకోవచ్చు.
బి) మార్కెట్ల విస్తరణ (Expands Markets): ఈ దేశాల్లో మార్కెట్ల పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం మార్కెట్లను విస్తృత పర్చటడమేకాక, పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిపిస్తుంది.
సి) ఉపాధి పెరగడం (Increase in Employment): చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకటి లేక రెండు ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధించి వాటికి ఎగుమతి చేసినట్లయితే మార్కెట్లు విస్తరిస్తాయి. అందుబాటులో ఉన్న ఉత్పాదక వనరులకు ఉపాధిని కల్పించి, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించకోవచ్చు. దేశంలో పొదుపు పెట్టుబడులు పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎగుమతి రంగం విస్తరిస్తున్నప్పుడు అనేక రకాల ఉత్పత్తి కారకాల ప్రవాహం ఈ రంగంలో పెరుగుతుంది.
డి) అంతర్గత – బహిర్గత ఆదాలు (Internal & External & Economies): ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణ మరియు మార్కెట్ అవకాశాలు పెరగడం వల్ల అనేక రూపాలలో అంతర్గత, బహిర్గత ఆదాలు లభ్యమవుతాయి. వీటి వల్ల ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారం వల్ల లభించే ప్రత్యక్ష ప్రయోజనం.
ఇ) పరోక్ష ప్రయోజనాలు (Indirect benefits): అంతర్జాతీయ వ్యాపారం వల్ల మార్కెట్ల విస్తరణ జరిగి మరియు ప్రత్యేకీకరణ సాధ్యమై దేశంలో యంత్రాల పూర్తిస్థాయి ఉపయోగం నవకల్పనలకు దారితీసి శ్రామిక ఉత్పాదకత శక్తి కూడా పెరుగుతుంది. నూతన వస్తువులు అందుబాటులోకి వచ్చి వాటిని పొందుటకు ప్రజలను కష్టపడే విధముగా, పొదుపు చేసే విధముగా ప్రేరేపిస్తుంది.
ఎఫ్) ప్రాధమిక వస్తువుల ఎగుమతి మూలధన వస్తువుల దిగుమతి (Import of Capital Goods against Export of Staple Commoditeis): తక్కువ అభివృద్ధికి దోహదపడే స్వదేశీ వస్తువులను, అధిక అభివృద్ధికి దోహదపడే విదేశీ వస్తువులతో వినిమయం చేసుకోవడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.
జి) విద్యాపరమైన కీలక ప్రభావాలు (Important Educative Effect): సాధారణంగా అంతర్జాతీయ వ్యాపారం విద్యపైన అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక నైపుణ్యత తక్కువగా ఉండటం వల్ల మూలధన కొరత ఏర్పడి ఆర్థికాభివృద్ధిని ఆటంక పరుస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం ఈ బలహీనతను | తొలగిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు పోటీతత్వాన్ని పెంచుకోవడానికి విద్య, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి విధానాల్లో మార్పులను తీసుకురావాలి.
హెచ్) విదేశీ మూలధన దిగుమతికి ఆధారం (Basis of Importation of Foreign Capital): అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధన కొరతను కలిగి ఉంటాయి. ఒక దేశం అంతర్జాతీయ వ్యాపారంలో చురుకుగా పాల్గొనడం వల్ల ధనిక దేశాలలోని ఉపయోగింపబడని మూలధనం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రవహించి ఇక్కడ సమర్ధవంతంగా ఉపయోగింపబడతాయి. విదేశీ మూలధనం ఉపాధి ఆదాయం మరియు ఉత్పత్తిని పెంచడమే కాక ప్రతికూల వర్తక శేషాన్ని కల్పించడానికి, ద్రవ్యోల్బణ ఒత్తిడులను అధిగమించడానికి ఉపయోగపడుతుంది.
ప్రశ్న 7.
ప్రపంచీకరణను నిర్వచించి, భారతదేశంలో ప్రపంచీకరణకు అవసరమైన పరిస్థితులను గురించి వ్రాయుము.
జవాబు:
దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడమే ప్రపంచీకరణ అంటారు. దీని వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తు సేవలు, సాంకేతిక, శ్రమ, మొదలగునవి సులభంగా ప్రవహింపబడి ప్రపంచ దేశాలన్ని అనుసంధానింపబడతాయి.
ప్రపంచీకరణకు అవసరమైన పరిస్థితులు:
1) వ్యాపార స్వేచ్ఛ: ప్రపంచీకరణ ప్రక్రియలో అవసరమైన ప్రభుత్వ నియమ నిబంధనలు ఉండరాదు. దిగుమతి నియంత్రణలు, విత్త వనరులపై నియమాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మొదలైన వాటికి ప్రభుత్వం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఆర్థిక సరళీకరణ చాలా ముఖ్యం.
2) అవస్థాపన సదుపాయాలు: స్వదేశీ సంస్థ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందటానికి కావలసిన సదుపాయాలను కల్పించవలసి ఉంది.
ఉదా: నీరు, రవాణా, విద్యుత్, ఫైనాన్స్ మొదలగునవి.
3) ప్రభుత్వ ప్రోత్సాహం: ప్రపంచీకరణ ప్రక్రియలో ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమవుతుంది. ఆర్థిక సంస్కరణలు, అవస్థాపన సౌకర్యాల కల్పన, పరిశోధన మరియు అభివృద్ధి మొదలైన వాటిని ప్రభుత్వం కల్పించినప్పుడే ప్రపంచీకరణ విజయవంతం అవుతుంది.
4) వనరులు: ఒక వ్యాపార సంస్థ ప్రపంచీకరణలో అభివృద్ధి చెందటానికి దానికి కావలసిన వనరులు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పరపతి, సాంకేతికత, నైపుణ్యం యజమాన్యాలు, మానవ వనరులు పరిశోధన మరియు అభివృద్ధి మొదలైన వనరులు ఉన్నప్పుడు వ్యాపార సంస్థలు ప్రపంచీకరణలో అభివృద్ధి చెందుతాయి.
5) పోటీతత్వం: అంతర్జాతీయ వ్యాపారంలో ఒక వ్యాపార సంస్థ విజయాన్ని, దానికి గల పోటీతత్త్వాన్ని బట్టి నిర్ణయించవచ్చు. సంస్థలు తక్కువ ధర, వ్యయం, మెరుగైన సాంకేతికం, వస్తుభిన్నత్వం మొదలైన వాటి ద్వారా చిన్న వ్యాపార సంస్థ ఎక్కువ తులనాత్మక ప్రయోజనాలతో లాభాలు పొందవచ్చు.
6) అనుసరణీయ వ్యూహాలు ప్రపంచీకరణలో వ్యాపార సంస్థలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే విజయాన్ని సాధిస్తాయో తెలుసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రపంచీకరణలో పాల్గొనే సంస్థలకు ప్రాపంచిక వ్యాపార వ్యూహాలపై తగిన అవగాహన అవసరం.
ప్రశ్న 8.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం తెలియజేయండి.
జవాబు:
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం:
- 1991లో ప్రపంచ ఎగుమతులలో భారతదేశం వాటా 0.53% వుండగా 2013 నాటికి 1.7% కు పెరిగింది.
- విదేశీ ద్రవ్య నిధులు 1 బిలియన్ యు.యస్. డాలర్ల స్థాయి నుండి 2015, ఫిబ్రవరి అంతానికి 333 బిలియన్ యు.యస్. డాలర్లకు పెరిగాయి.
- ఎగుమతుల ద్వారా ఆర్జించిన ద్రవ్యం, 65% మేరకు దిగుమతుల చెల్లింపులకు సరిపోవుచున్నది.
- దేశం యొక్క కరెంటు ద్రవ్యలోటుపై నియంత్రణ సాధ్యం అవుతుంది.
- విదేశీ రుణ పెరుగుదల రేటు సంస్కరణల ముందు కంటే బాగా తగ్గుదల చూపుతున్నది.
- అంతర్జాతీయంగా భారతదేశంపై నమ్మకం పెరిగింది.
- భారతదేశ వినియోగదారులు ఇప్పుడు వివిధ నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే సొంతం చేసుకుంటున్నారు.
- ప్రపంచీకరణ వల్ల ఉద్యోగ పరిస్థితి క్షీణించడం జరిగింది. ఉద్యోగాలవృద్ధి రేటు ప్రపంచీకరణ పూర్వఉన్న 2% నుండి 0.98%కి పడిపోయినది.
- ప్రభుత్వంపై బహుళజాతి సంస్థలు (MNC’s) అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (IMF) మరియు ప్రపంచ బ్యాంక్ (World Bank)ల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టింది. వాటి ఫలితంగా అనేక చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు మూతపడుచున్నవి.
- ప్రపంచీకరణ వల్ల ప్రజల మధ్య ఆదాయ అసమానతలు అదే విధముగా ప్రాంతీయ అసమానతలు కూడా పెరుగుచున్నాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రణాళిక రకాలు.
జవాబు:
ఒక నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపుకు ఒక క్రమంలో నడపడాన్ని ‘ప్రణాళిక’ అంటారు.
1) దీర్ఘదర్శి ప్రణాళిక: ఇది ఒక స్థూల ప్రణాళిక. అనగా 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాలానికి దీర్ఘకాల అవసరాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడుతుంది.
2) పంచవర్ష ప్రణాళికలు: ఇది 5 సంవత్సరాల కాలానికి రూపొందింపబడిన ప్రణాళిక. దీనిలో 5 సంవత్సరాలు పూర్తయిన తరువాత సాధించిన లక్ష్యాలను సమీక్షించడం జరుగుతుంది. ఇది దీర్ఘదర్శి ప్రణాళికలో అంతర్భాగంగా ఉంటుంది.
3) వార్షిక ప్రణాళికలు: వార్షిక ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉంటాయి. పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు వార్షిక లక్ష్యాలుగా విభజింపబడి ప్రతి సంవత్సరానికి సంబంధించిన వార్షిక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తారు.
4) నిరంతర ప్రణాళికలు: ఈ ప్రణాళికలకు నిర్ణీత సమయము ఉండదు. దీనిని గున్నార్ మిర్డాల్ మొట్టమొదటి సారిగా ప్రతిపాదించారు. ప్రణాళికలు ముందు కెళ్తున్న కొద్ది, పూర్తయిన సంవత్సరాన్ని మినహాయించి రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది. ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. 1979 సంవత్సరము తరువాత ఈ ప్రణాళికలు ఆపివేయబడ్డాయి.
ప్రశ్న 2.
ప్రణాళికా సంఘం.
జవాబు:
1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని 39వ అధికరణలోని ఆదేశిక సూత్రాల్లో భాగంగా ప్రణాళిక సంఘాన్ని స్థాపించారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. దీని ప్రధాన కార్యాలయం “యోజనా భవన్” న్యూఢిల్లీలో ఉంది. ప్రధాన మంత్రి
సంఘానికి అధ్యక్షుడుగాను, 5గురు దీర్ఘకాలిక సభ్యులుగా నియమితులు అవుతారు. కీలక శాఖల కేబినెట్ మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. ప్రణాళికా సంఘానికి మొట్ట మొదటి ఉపాధ్యక్షుడు శ్రీ గుల్జారీలాల్ నందా కాగా చివరి ఉపాధ్యక్షుడు శ్రీ మాంటెక్ సింగ్ అహ్లువాలియా చివరి ఉపాధ్యక్షుడు. జనవరి 1, 2015 నుండి ప్రణాళికా సంఘం “నీతి ఆయోగ్” గా రూపాంతరం చెందినది.
ప్రశ్న 3.
ప్రణాళిక సంఘం యొక్క లక్ష్యాలు. [Mar ’17]
జవాబు:
ప్రణాళిక సంఘంను 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కల్గినది. ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తుంది.
- సహజ వనరులు, మానవ వనరులు, మూలధన వనరుల లభ్యత ఎంత వరకు దేశంలో ఉన్నాయో అంచనా వేయడం.
- ఆశించిన దానికంటే తక్కువగా ఉన్న వనరుల పెంపుదలను పరిశోధన చేయడం.
- ప్రణాళికా ప్రాధాన్యతను లక్ష్యాలను నిర్ణయించడం.
- ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకాలుగా ఉన్న కారకాలను గుర్తించి మరియు వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించుట.
- ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని నిర్ణయించడం.
- ప్రణాళిక అమలు వల్ల సాధించిన ప్రగతిని అంచనా వేయడం.
- ప్రణాళిక విజయానికి అవసరమైన మధ్యంతర సిఫారసులు చేయడం.
ప్రశ్న 4.
ఏవేని 3 ప్రణాళికా వైఫల్యాలను గురించి పేర్కొనండి.
జవాబు:
- 65 సంవత్సరముల ఆర్థికాభివృద్ధిలో పేదరికం, నిరుద్యోగం మొదలైన సమస్యలు పరిష్కరింపబడలేదు. 2012లో భారత ప్రభుత్వ నివేదిక ప్రకారం 21.9 శాతం జనాభా దారిద్య్రరేఖను దిగువన ఉన్నారు. 1999-2000 నాటికి 26.58 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉండగా, 2009 – 10 నాటికి ఈ సంఖ్య 28.1 మిలియన్లకు పెరిగింది.
- భూ సంస్కరణలు ప్రవేశపెట్టి దశాబ్దాలు గడిచినా, వాస్తవిక పరిస్థితులలో భూపంపిణీ సక్రమంగా అమలు
కాలేదు. - భారతదేశ పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం అసమానతలు లేని సమ సమాజాన్ని నిర్మించడం కాని ఇది ఇప్పటికి పూర్తి కాలేదు.
- “అందరికీ ఆరోగ్యం” అనే లక్ష్యాన్ని ఇప్పటికీ చేరుకోలేకపోయాం.
ప్రశ్న 5.
భారత దేశంలో ప్రాంతీయ అసమానతలకు కారణాలు. [Mar ’17]
జవాబు:
దేశ సమగ్రతకి, సత్వర పురోగతికి, ఆర్థికాభివృద్ధికి ప్రాంతీయ అసమానతలు అడ్డంకిగా ఉంటాయి. వివిధ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాల్లో వ్యత్యాసాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవడానికి ముందుగా, దీనికి గల అసలు కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. అవి:
ఎ) భౌగోళిక కారణాలు: భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు మిగతా ప్రాంతాల నుంచి వేరుపరచబడి ఉంటాయి. కొండలు, లోయల కారణంగా ఇలాంటి ప్రాంతాలు ఏర్పడవచ్చు. అలాంటి ప్రాంతాలు వెనకబడి ఉంటాయి. ఉదా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లోని ఉత్తర కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా వాతావరణం, రవాణా మార్గాలు సరిగ్గా లేకపోవడం వల్ల వెనుకబడి ఉన్నాయి.
బి) శీతోష్ణస్థితి పరిస్థితులు: వర్షపాతం, వాతావరణం మొదలైనవి అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. ఇలాంటి ప్రదేశాల్లో వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ తొందరగా అభివృద్ధి చెందలేవు.
సి) బ్రిటీషువారి పరిపాలన: చారిత్రాత్మకంగా చూస్తే భారతదేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి బ్రిటీషువారి పరిపాలన కూడా కొంత కారణం. పారిశ్రామిక ఉత్పత్తికి, తమ వ్యాపారానికి అనుకూలముగా ఉండి మన దేశ సంపదను తమ దేశానికి తరలించడానికి అనువుగా ఉండే ప్రాంతాలనే వారు ఎన్నుకొని అభివృద్ధి పరచడం జరిగింది. మహా నగరాలైన కలకత్తా, బొంబాయి, మద్రాసులను వ్యాపార కేంద్రాలుగా చేసుకోవడం వల్ల, భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడి వెనుకబడ్డాయి.
డి) పరిశ్రమల కేంద్రీకరణ: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ప్రైవేటు రంగం నూతన పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది కారణం, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పరిశ్రమలకు కావలసిన అవస్థాపనా వసతులైన నైపుణ్యం గల శ్రామికులు, రవాణా మరియు మార్కెట్ సౌకర్యాలు సులభంగా లభ్యం కావడం.
ఇ) సహజ వనరుల కొరత: ప్రకృతి పరంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వనరులు పుష్కలంగా లభించడం వల్ల ఆ ప్రాంతాలు మాత్రం వేగంగా అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అలాంటి అవకాశాలు లేని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి అని చెప్పవచ్చు.
ఎఫ్) అవస్థాపనా సౌకర్యాల కొరత: పరిశ్రమల స్థాపనకు అవరాలైన విద్యుచ్ఛక్తి, రోడ్లు, తంతి తపాలా సౌకర్యాలు, నీరు, విద్య, ఆరోగ్యం, సాంకేతిక శిక్షణ సౌకర్యాలు, పరపతి మొదలైనవి కొరతగా ఉన్న ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. ఈ సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలు త్వరితంగా అభివృద్ధి చెందుతాయి.
ప్రశ్న 6.
ప్రైవేటీకరణ సమర్థతను తెలుపు 3 విషయాలను వివరింపుము.
జవాబు:
ప్రభుత్వ రంగంలోని ఉత్పాదక కార్యకలాపాలపై యాజమాన్య హక్కును ప్రైవేటురంగ వ్యక్తులకు పూర్తిగాగాని, పాక్షికంగా కాని బదిలి చేసే ప్రక్రియను ప్రైవేటీకరణ అంటారు..
1) సామర్థ్యం, ప్రదర్శన పెరుగుదల: ప్రైవేటు రంగం పూర్తిగా లాభార్జనతో కూడుకున్న నిర్ణయాలు చేస్తుంది. కాబట్టి వ్యాపార సంస్థల సామర్థ్యం మరియు ప్రదర్శన పెరుగుతాయి. అదిగాక ప్రైవేటు రంగం మేనేజర్లకు మార్కెట్టును సృష్టిస్తుంది. కాబట్టి నిర్వహణ నాణ్యత కూడా పెరుగుతుంది.
2) బాధ్యతను అప్పగించడం సులభం: ప్రభుత్వ రంగంలోని లోపాలకు ఎవరు కూడా బాధ్యత వహించరు. కాని ప్రైవేటు రంగంలోని ప్రతి అంశానికి బాధ్యతలను విభజించి వ్యక్తులకు అప్పచెప్పుతారు. కాబట్టి ప్రైవేటు రంగంలో ఎలాంటి పొరపాటు జరిగినా వారు సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
3) ప్రణాళిక సాధన: ప్రైవేటు సంస్థలో అన్ని నిర్ణయాలు ముందుగానే రూపొందిస్తారు. వాటికి అనుకూలముగా ఏ అధికారి అయిన నడుచుకోవలసి వస్తుంది.
4) ప్రైవేటు రంగంలో సత్వర పరిష్కార మార్గాలు: ప్రైవేటు సంస్థలన్ని లాభర్జనపై ఆధారపడి ఉంటాయి. వీటికి తమ సంస్థలను ప్రభుత్వం తీసుకుంటుందేమోననే భయం ఉంటుంది లేదా నష్టాలు రావచ్చు అనే భయం కారణాలు వల్ల పరిష్కార మార్గాలు చాలా వేగంగా చేపడతారు.
ప్రశ్న 7.
అంతర్జాతీయ వ్యాపార పాత్ర.
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించుటలో అంతర్జాతీయ వాణిజ్యం చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
ఎ) ఉత్పత్తి పెరుగుదల (Increases Output): అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభాలను గడించి, జాతీయ ఆదాయాన్ని, ఉత్పత్తిని పెంపొందించుకొని ఆర్థిక వృద్ధి రేటును అధికం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వ్యాపారం వల్ల అధిక ఉత్పత్తి సాధించి, పేదరికపు విష వలయాన్ని ఛేదించి ఆర్థికాభివృద్ధిని సాధించుకోవచ్చు.
బి) మార్కెట్ల విస్తరణ (Expands Markets): ఈ దేశాల్లో మార్కెట్ల పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం మార్కెట్లను విస్తృత పర్చటడమేకాక, పొదుపు పెట్టుబడులను ప్రోత్సహించి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిపిస్తుంది.
సి) ఉపాధి పెరగడం (Increase in Employment): చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒకటి లేక రెండు ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధించి వాటికి ఎగుమతి చేసినట్లయితే మార్కెట్లు విస్తరిస్తాయి. అందుబాటులో ఉన్న ఉత్పాదక వనరులకు ఉపాధిని కల్పించి, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించకోవచ్చు. దేశంలో పొదుపు పెట్టుబడులు పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎగుమతి రంగం విస్తరిస్తున్నప్పుడు అనేక రకాల ఉత్పత్తి కారకాల ప్రవాహం ఈ రంగంలో పెరుగుతుంది.
డి) అంతర్గత బహిర్గత ఆదాలు (Internal & External & Economies): ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణ మరియు మార్కెట్ అవకాశాలు పెరగడం వల్ల అనేక రూపాలలో అంతర్గత, బహిర్గత ఆదాలు లభ్యమవుతాయి. వీటి వల్ల ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారం వల్ల లభించే ప్రత్యక్ష ప్రయోజనం.
ఇ) పరోక్ష ప్రయోజనాలు (Indirect benefits): అంతర్జాతీయ వ్యాపారం వల్ల మార్కెట్ల విస్తరణ జరిగి మరియు ప్రత్యేకీకరణ సాధ్యమై దేశంలో యంత్రాల పూర్తిస్థాయి ఉపయోగం నవకల్పనలకు దారితీసి శ్రామిక ఉత్పాదకత శక్తి కూడా పెరుగుతుంది. నూతన వస్తువులు అందుబాటులోకి వచ్చి వాటిని పొందుటకు ప్రజలను కష్టపడే విధముగా, పొదుపు చేసే విధముగా ప్రేరేపిస్తుంది.
ప్రశ్న 8.
GATT యొక్క లక్ష్యాలు.
జవాబు:
సుంకాలు, వ్యాపారంపై సాధారణ ఒప్పందం (గాట్) 1.1.1948 నుంచి అమలులోనికి వచ్చింది. ఇది 1.1.1995 వరకు కొనసాగింది. 1.1.95 నుండి ఇది WTOలో వీలినమైనది.
లక్ష్యాలు:
- నిష్పక్షపాతంగా అత్యంత అభిమాన దేశంను అనుసరించడం.
- సంప్రదింపుల ద్వారా తగాదాల పరిష్కారం.
- కొన్ని విషయాలలో చట్ట బద్ధత కల్పించడం.
- సుంకాల ద్వారానే స్వదేశీ పరిశ్రమలకు రక్షణ కల్పించడం.
- బహుళ ఒప్పందాల ద్వారా సుంకాలను, సుంకేతర అంశాలను సరళీకరించడం.
- అంతర్జాతీయ వ్యాపారాన్ని పారదర్శకంగా విచక్షణ రహితంగా అమలు చేయడం.
ప్రపంప వ్యాపారంలో సరళీకరణ ద్వారా వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని, ఉత్పత్తి, స్థారక డిమాండ్ను క్రమంగా పెంపొందించి, సంపూర్ణ ఉద్యోగితను సాధించి, నిజ ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణాన్ని వృద్ధి పరచి ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినిమయాన్ని విస్తరించడం గాట్ లక్ష్యం.
ప్రశ్న 9.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) యొక్క లక్ష్యాలు.
జవాబు:
- WTO ప్రధాన లక్ష్యం – జీవన ప్రమాణాన్ని పెంచడం, సంపూర్ణ ఉద్యోగిత మరియు సుస్థిర వృద్ధి, ఉత్పత్తిని విస్తరించడం, వస్తుసేవల వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపచేయడం.
- సుస్థిరాభివృద్ధిని సాధించుటకు ప్రపంచ వనరులను అభిలషనీయముగా సద్వినియోగ పరుచుకొంటూ సుస్థిర ఆర్థికాభివృద్ధి అనే లక్ష్యానికి అనుగుణముగా వనరుల వినియోగం జరిగేటట్లు చూడడం.
- అంతర్జాతీయ వ్యాపారం వల్ల అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు రావాల్సినవి అందేలా చూడడం.
- సభ్యదేశాలను పరస్పర ఒప్పందాల ద్వారా అందరికి ప్రయోజనకరంగా ఉంటుందని ఒప్పించడం.
- ఒక సమగ్ర, నమ్మకమైన మరియు నాణ్యతతో కూడిన బహుళ పాక్షిక వర్తక వ్యవస్థను అభివృద్ధి చేయడం.
ప్రశ్న 10.
గాట్ (GATT), ప్రపంచ వాణిజ్య సంస్థల (W.T.O) మధ్య భేదాలు.
జవాబు:
గాట్ (GATT)
- దీనికి చట్టబద్ధత లేదు.
- ఇది శాసనసభల ద్వారా గాని, ప్రభుత్వాల ద్వారా గాని సృష్టింపబడలేదు.
- ఇది ఐక్యరాజ్య సమితి ఏజెంటు కాదు.
- కొన్ని ఎంపిక చేయబడిన అంశాలలో బహుళ పాక్షిక ఒప్పందాలకు సంబంధించి కొన్ని నియమ నిబంధలను కలిగి ఉంది.
ప్రత్యేక విషయాలకు ప్రత్యేక ఒప్పందాలు కలిగి ఉంటుంది. కాని సభ్యులు దానికి ఖచ్చితంగా లోబడి ఉండాల్సిన పనిలేదు. ఏ సభ్యదేశమైన ఒప్పందం బయటే ఉండిపోవచ్చు. కేవలం సంతకం చేసిన సభ్యులే అందుకు లోబడి ఉంటారు. - గాట్ సభ్యదేశాల మధ్య తలెత్తే తగాదాలపై చర్చించగలదు. కాని సభ్యులు ఖచ్చితంగా తన నిర్ణయాన్ని పాటించేలా చెయ్యలేదు.
- ప్రపంచ వర్తక సమస్యలను చర్చించుటకు ప్రతి దశాబ్దంలో సమావేశమయ్యే ఒక వేదికగా గాట్ పని చేస్తుంది.
- గాట్ నియమాలు వస్తు వ్యాపారానికి మాత్రమే సంబంధించినవి కలిగి ఉంది.
- ఇది డైరెక్టర్ జనరల్ ద్వారా నిర్వహింపబడే ఒక చిన్న సెక్రటేరియలు మాత్రమే కలిగి ఉండేది.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
- ఇది చట్టబద్ధమైనది.
- ఇది సభ్యదేశాల శాసన సభలు ప్రభుత్వాలచే ఒక ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడింది.
- ఇది ఐక్యరాజ్య సమితిలో సహకార సంబంధాలు కలిగి ఉంటుంది.
- ఇందులో ఒప్పందాలు శాశ్వతమైనవి మరియు సభ్యదేశాలన్ని తప్పనిసరిగా వాటికి లోబడక తప్పదు.
నిబంధనలను ఉల్లంఘించిన సభ్యదేశంపై ఇతర సభ్యులు క్రమ శిక్షణ చర్యలను తీసుకోవచ్చు. - WTO లోని తగాదాలను పరిష్కారణ యంత్రాంగం స్వయం చాలకము, వేగవంతం మరియు అన్ని దేశాలు నిర్ణయాలకు బద్దులై ఉండాలి.
- ఇది పటిష్ట నియమాలతో సక్రమంగా స్థాపించ బడిన సంస్థ కాబట్టి ఒప్పంద నిర్ణయాలు కాల బద్దతను కలిగి ఉంటాయి.
- WTO వస్తుసేవల వాణిజ్యమేకాక మేథస్సుకు సంబంధించిన మేథోసంపత్తి హక్కులు మరియు అనేక ఒప్పందాలు కలిగి ఉంది.
- ఇది పెద్ద సెక్రటేరియట్ను కలిగి పెద్ద నిర్వహణ స్వరూపాన్ని కలిగి ఉంది.
ప్రశ్న 11.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) విధులు.
జవాబు:
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) క్రింది విధులను నిర్వహిస్తుంది. [Mar ’16]
- ప్రపంచ వ్యాపార ఒప్పందాల అమలు, పరిపాలన మరియు కార్యాచరణలో చొరవ తీసుకుంటుంది.
- WTO తన సభ్యదేశాలను, వ్యాపార ఒప్పందాల్లో ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
- వ్యాపార తగాదాలను పరిష్కరిస్తుంది.
- ఇది సభ్యదేశాల జాతీయ వ్యాపార విధానాలను పర్యవేక్షిస్తుంది.
- ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా శిక్షణను, ఇతర సహాయాలను చేస్తుంది.
- ఇది IMF, IBRD మరియు దాని అనుబంధ సంస్థలతో శాంతియుత సహాయ సహకార సంబంధాన్ని కలిగి ఉంటుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ప్రణాళికను నిర్వచింపుము.
జవాబు:
ప్రణాళిక అంటే నిర్ణీత కాలవ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాలవైపు ఒక క్రమంలో నడవటాన్ని ప్రణాళిక అంటారు. మన దేశంలో ప్రణాళికలు 1951వ సంవత్సరములో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 12వ ప్రణాళిక అమల్లో ఉంది.
ప్రశ్న 2.
నిరంతర ప్రణాళిక అనగానేమి ?
జవాబు:
నిరంతర ప్రణాళికలు: దీనిని గున్నార్ మిర్డాల్ ప్రతిపాదించినాడు. ప్రణాళికలు ముందుకెళ్తున కొద్ది, పూర్తయిన సంవత్సరాన్ని మినహాయించి రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది. కావున ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
ప్రశ్న 3.
ప్రణాళికా విరామము.
జవాబు:
ప్రణాళికకు, ప్రణాళికకు మధ్య గల కాలంలో విరామమును ప్రణాళికా విరామము అంటారు. 1966-69 మధ్య కాలంలో ప్రభుత్వ ప్రణాళిక విరామము ఏర్పడినది. దీనికి కారణం ఆర్థిక, రాజకీయ ఒత్తుడులు, 1990-92 మధ్య కాలం ప్రభుత్వ అనధికార సెలవుగా ప్రకటించారు.
ప్రశ్న 4.
దీర్ఘదర్శి ప్రణాళికను నిర్వచింపుము.
జవాబు:
15 సంత్సరాల నుండి 20 సంవత్సరాల కాలానికి దీర్ఘకాల అవసరాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడే ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. ఇది ఇక స్థూల ప్రణాళిక.
ప్రశ్న 5.
వార్షిక ప్రణాళిక అనగానేమి ? ఉదాహరణ వ్రాయుము.
జవాబు:
పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు వార్షిక లక్ష్యాలుగా విభజింపబడి ప్రతి సంవత్సరానికి సంబంధించిన వార్షిక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. ఇది పంచవర్ష ప్రణాళికలో భాగముగా ఉంటాయి.
ప్రశ్న 6.
భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు.
జవాబు:
మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, బీహారు రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. వెనుకబడిన రాష్ట్రాలలో సగటు జీవిత కాలం, శిశు మరణాలు, స్త్రీ విద్య వంటి అంశాల్లో కూడా ఎంతో వెనుకబడ్డాయి.
ప్రశ్న 7.
ప్రాంతీయ అసమానతలను నిర్వచింపుము.
జవాబు:
దేశంలో ఒకవైపు కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెంది, మరో వైపు కొన్ని వెనుకబడి, ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల మధ్య ఈ రకమైన వ్యత్యాసాలు ఉండడాన్ని ప్రాంతీయ అసమానతలుగా పేర్కొనవచ్చు. ఈ విధమైన అసమానతలు ప్రకృతి సిద్ధంగా వనరుల లభ్యతలోని తేడాలు ఏర్పడినవి కావచ్చు లేదా మానవ ప్రయత్నాల ఫలితంగా ఏర్పడవచ్చు.
ప్రశ్న 8.
సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి.
జవాబు:
అన్ని ప్రాంతాలను ఒకే స్థాయిలో అభివృద్ధి చేయడం సమతౌల్య ప్రాంతీయాభివృద్ధి. అభివృద్ధి ఫలితాలు దేశ ప్రజలందరికి అందచేయడానికి శ్రామిక శక్తి, సహజ వనరులను సంపూర్ణంగా వినియోగించడానికి, ప్రాంతీయ అసమానతలు తొలగించి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం.
ప్రశ్న 9.
సరళీకరణ అనగానేమి ?
జవాబు:
ఉత్పత్తి కార్యకలాపాలలో ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగంతో పాటు సమాన ప్రతిపత్తిని కల్పిస్తూ, ప్రభుత్వ పరమైన ఆంక్షలను లైసెన్సులను సరళీకృతం చేయడం ద్వారా ప్రైవేటు రంగం ప్రగతికి దోహదపడే విధానమే సరళీకరణ భారతదేశ నూతన ఆర్థిక విధానం 1991లో సరళీకరణ ప్రధానమైన అంశం.
ప్రశ్న 10.
ప్రైవేటీకరణ భావనను వివరింపుము.
జవాబు:
ప్రభుత్వ నిర్వహణలోనున్న సంస్థల యాజమాన్యాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రైవేటు రంగానికి అప్పగించుటను ప్రైవేటీకరణ అంటారు.
ప్రశ్న 11.
ప్రపంచీకరణను నిర్వచింపుము.
జవాబు:
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడమే ప్రపంచీకరణ. ఎలాంటి ప్రభుత్వ ఆటంకాలు లేకుండా వస్తు సేవలు, సాంకేతిక, మూలధనం, శ్రామికులు లేక మానవ మూలధన ప్రవాహ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలు సంఘటితంగా ఏర్పడటాన్ని ప్రపంచీకరణ అంటారు.
ప్రశ్న 12.
TRIPs లోని అంశాలు.
జవాబు:
వ్యాపార సంబంధిత మేథో సంపత్తి హక్కులు, పేటంట్, భౌగోళిక గుర్తు లేఅవుట్లు, సమాచారం, కాపిరైట్, ట్రేడ్మార్కు మొదలైన వానికి సంబంధించినది.
ప్రశ్న 13.
ట్రిమ్స్ TRIMs భావన.
జవాబు:
వ్యాపార సంబంధిత పెట్టుబడి కొలమానములు ప్రకారం దేశంలోని అన్ని రకములైన నియమ నిబంధనలను తొలగించి విదేశీ పెట్టుబడులను స్వదేశీ పెట్టుబడులుగా పరిగణించడం ద్వారా జాతీయ భావం కల్పించడం.
ప్రశ్న 14.
M. F.N. నిబంధన. [Mar ’16]
జవాబు:
గాట్ ప్రాథమిక సూత్రాన్ని మొదటి ప్రకరణలో చేర్చారు. దీని ప్రకారం సభ్యదేశాల మధ్య విచక్షణా రహితంగా ప్రవర్తించరాదు. సభ్యదేశాలన్ని అధికార అనుకూల జాతీయత క్లాజ్ను అనుసరించటం. దీని ప్రకారం ఏదైనా ఒక సభ్య దేశానికి అనుకూలమైన తీర్మానం చేస్తే గాట్లోని అన్ని సభ్య దేశాలకు ఆ తీర్మానం వర్తిస్తుంది.
ప్రశ్న 15.
పెట్టుబడి ఉపసంహరణ.
జవాబు:
ప్రభుత్వరంగ సంస్థలలోని ఈక్విటీని ప్రైవేటు వ్యక్తులకు, ప్రజలకు పెట్టుబడుల సంస్థకు, మ్యూచవల్ ఫండ్స్క ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే శ్రామికులకు అమ్మడమే పెట్టుబడుల ఉపసంహరణ.
ప్రశ్న 16.
గాట్ (GATT).
జవాబు:
ప్రపంచంలో 1930 దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ వ్యాపారం చాలా వేగంగా తగ్గింది. అగ్రదేశాలు సరళీకరణలో కూడిన అంతర్జాతీయ వ్యాపారం ఉండాలని భావించాయి. వాటి ఆలోచనా ఫలితంగానే సుంకాలు వ్యాపారంపై సాధారణ ఒప్పందం (GATT) ఏర్పడినది. గాట్ 1.1.1948 నుండి 1.1.1995 వరకు తన విధులు నిర్వహించింది.
ప్రశ్న 17.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO). [Mar ’17]
జవాబు:
ఉరుగ్వే రౌండ్ అంతిమ చట్టంపై ఏప్రిల్ 1994 సంవత్సరంలో 124 గాట్ సభ్య దేశాలు సంతకాలు చేయటం వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. ఇది 1.1.1995 నుండి తన విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2013 వరకు దీనిలో 160 సభ్య దేశాలు ఉన్నాయి. ఇది చట్టబద్ధమైన వ్యవస్థ. ఇది ప్రపంచ వ్యాపారాన్ని, సేవలు, విదేశీ పెట్టుబడిని, మేథో సంపత్తి హక్కులను పరిరక్షించటం మొదలైన వాటిలో ముఖ్యమైన పాత్ర పోషించుచున్నది.
ప్రశ్న 18.
ఉరుగ్వే రౌండ్.
జవాబు:
గాట్ సభ్యదేశాల 8వ సమావేశాన్ని ఉరుగ్వే రౌండ్గా పిలుస్తారు. గాట్ సాధారణ సమావేశాలకు విరుద్ధంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం W.T.O. ఏర్పడటానికి మార్గదర్శకమైంది.
ప్రశ్న 19.
F.D.I (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి).
జవాబు:
విదేశాలలో పెట్టిన పెట్టుబడులపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండటం.