Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి Textbook Questions and Answers.
AP Inter 2nd Year Economics Study Material 8th Lesson పర్యావరణం మరియు సుస్థిర ఆర్థికాభివృద్ధి
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
‘పర్యావరణం’ అంటే ఏమిటో నిర్వచించి, పర్యావరణం యొక్క అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
ఎన్విరాన్మెంట్ (పర్యావరణం) అన్న ఆంగ్లపదాన్ని “ఎన్విరానర్” అనే ఫ్రెంచిపదం నుంచి గ్రహించడం జరిగింది. “ఎన్విరాన్” అంటే “చుట్టూ ఉన్న” అని అర్థం. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రతి విషయాన్ని సమిష్టిగా పర్యావరణం (ఎన్విరాన్మెంట్) అని పిలువవచ్చు.
జీవరాశిని ప్రభావితం చేస్తూ వున్న సజీవ, భౌతిక మూలపదార్థాల కలయికనే ‘పర్యావరణం’ అని చెప్పవచ్చు. పర్యావరణం-భావనలు:1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Einvironmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణం భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.
1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణం, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టుప్రక్కల ఉన్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్యస్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.
2) సాంఘీక పర్యావరణం: ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై ఉంటాయి.
3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరిక స్థాయి మొదలైనవి ఇందులో ఉంటాయి.
4) మనోహరమైన పర్యావరణం: ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్పసంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.
పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమైనవే గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.
పర్యావరణం – అనుఘటాలు:మన చుట్టూ పర్యావరణం జీవ, నిర్జీవ అనుఘటాలను, వాటి పరస్పర ఆధారిత పరస్పర ప్రభావితాలను కలిగి ఉంది. ఈ విషయాలన్నింటి అధ్యయనాన్నే ‘జీవావరణ శాస్త్రం’ అంటారు.
1) జీవావరణ వ్యవస్థ (Eco system):ఇంగ్లాడుకు చెందిన ఎ.జి. ట్రాన్సీ అనే జీవావరణ శాస్త్రవేత్త 1935లో మొదటిసారి ‘జీవావరణం’ అనే పదాన్ని ఉపయోగించెను. జీవావరణం అనునది ఒక నిర్ధిష్ట మరియు గుర్తించదగిన భూమి యొక్క భాగము అంటే అడవులు, గడ్డిమైదానాలు, ఎడారులు, తీరప్రాంతాలు మొదలైనవి అని అర్థం. పర్యావరణంలోని వృక్షాలు మరియు జంతువులతో కూడిన జీవపర భాగాలతో పాటు నిర్జీవ భాగాలన్నింటినీ కలిపి ‘జీవావరణం’ అనవచ్చు. ఇది ఆ ప్రాంతంలోని మొక్కలు, వృక్షాలు, జంతువులు, చేపలు, సూక్ష్మజీవులు, నీరు, నేల మరియు మానవులందరి కలయిక, ఇటువంటి జీవావరణంలో కూడా ‘వృద్ధి-క్షయం’ అనే సూత్రం వర్తించి జీవ, నిర్జీవకాలు సృష్టింపబడి తిరిగి నశింపజేయబడుతూ ఒక విధమైన సంతులిత స్థితి నిర్వహింపబడుతుంది. దీనినే ‘జీవావరణ స్థిరత్వం’ అని అంటారు.
2) జీవ వైవిధ్యం (Biodiversity):జీవవైవిధ్యం అన్న పదం 1986లో అమెరికా శాస్త్రవేత వాల్టర్ రోసెన్ ప్రతిపాదించారు. భూమి జీవరాశులకు నిలయం. జీవరాశులు రకరకాల రంగులు, ఆకారాలు, ఆకృతులు, నిర్మాణాలను కలిగి ఉంటాయి. జన్యువులు, పర్యావరణం మరియు ఆవరణ వ్యవస్థలు కలిసి జీవరాశుల్లో ఉండే వైవిధ్యానికి, సంక్లిష్టతకు కారణమవుతున్నాయి.
జీవవైవిధ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను అనేక ప్రయోజనాలుంటాయి. ప్రత్యక్షంగా ‘జీవ వైవిధ్యం’ మనకు ప్రాణాన్ని కాపాడే మందులు, ఆహారం, హార్మోన్లు, ఎంజైములు, పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు, అలంకరణకు పనికి వచ్చే తీగలు, మొక్కలు, మొదలైన వాటిని అందిస్తుంది.
జీవ వైవిధ్యం పరోక్షంగా కూడా ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్బన స్థాయిని స్థిరపరచడం పరపరాగ సంపర్కం, జన్యు ప్రవాహం, నీటి వలయాలను నిర్వహించడం, భూగర్భజలాలను తిరిగి నింపడం, నేలను రూపొందించడం, పోషక వలయాలను స్థిరీకరించడం, కాలుష్యాలను విలీనం చేసుకోవడం, వాతావరణాన్ని క్రమపరచడం, సహజ పర్యావరణం అందించే రససౌందర్య, మానసోల్లాసాన్ని సంరక్షించడం మొదలయిన ఎన్నో రకాల పరోక్ష ప్రయోజనాలు మనకు జీవ వైవిధ్యం వల్ల లభిస్తాయి.
3) గ్రీన్ హౌస్ ప్రభావం:భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీథైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటడ్ ఉష్ణాన్ని అట్టి పెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటికి పోనివ్వవు. ఈ ప్రక్రియ వల్ల భూ ఉపరితలము ఉష్ణవికిరణాన్ని గ్రీన్ హౌస్ వాయువుల సహాయంతో గ్రహించి అన్ని’ దిశలకు వ్యాపింపచేస్తుంది. అలా కొంతభాగం తిరిగి భూమి వైపుకు, వాతావరణ దిగువ పొరలకు చేర్చబడి ఫలితంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇటువంటి గ్రీన్ హౌస్ వల్ల ఉష్ణపెరగడం, వాతావరణం మార్పులు, ఋతుపవన గమనం మరియు వాటి సామర్థ్యం మొదలైనవి జరుగుతాయి.
4) భూమి వేడెక్కుట (Global Warming):హరితగృహ వాయులైన కార్బన్ డై ఆక్సైడ్ వాటి వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఈ కార్బన్ డై ఆక్సైడ్ ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైనే ఉండిపోతుంది. దీని వల్ల గత శతాబ్దం నుంచి భూ వాతావరణ ఉష్ణోగ్రత 1.1°F పెరిగింది మరియు సముద్ర మట్టము కూడా కొన్ని ఇంచుల దాకా పెరిగింది. భూమి వేడెక్కడం వల్ల వచ్చే దీర్ఘకాల ఫలితాల్లో ముఖ్యమైనవి ధృవ ప్రాంతపు మంచు కరగడం, తద్వారా సముద్ర మట్టాలు పెరిగి, తీర ప్రాంతాలు ముంపుకు గురికావడం, కొన్ని రకాల జీవులు నశించి జీవ సమతుల్యం దెబ్బతినడం, ఉష్ణ ప్రాంతాలకు తుఫాన్లు రావడం మొదలగునవి జరుగుతాయి.
5) ఆమ్ల వర్షాలు (Acid Rain):ఆమ్ల వర్షం అనగా వాతావరణంలోని నైట్రిక్, సల్ఫ్యూరికామ్లాలు ఉండవల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉండి తద్వారా పడే రసాయనిక వర్షాలే. ఇవి వృక్షజాలము తగ్గిపోవుటచే సహజ కారణాల వల్ల మరియు సల్ఫ్యూరిక్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను ఎక్కువగా విడుదల చేసే వాహనాలు వాడటం వంటి మానవ చర్యల వల్ల ఏర్పడుతాయి. ఆమ్ల వర్షాలు మొక్కల పెరుగుదలను అడ్డుకొని అవి చనిపోయేలా చేస్తాయి. కాబట్టి ఆమ్ల వర్షాల వల్ల వ్యవసాయం, అడవులు దెబ్బతింటాయి. అంతేగాక నీటిలో జీవించే జీవరాశులకు హానికరంగా మారుతాయి. శిల్పాలు, భవనాలు, వాహనాలు, పైపులు, కేబుల్ వైర్లు కూడా దీనికి ప్రభావితమవుతాయి. ఆమ్ల వర్షాల వల్ల సున్నితంగా వుండే సున్నపురాయి, ఇసుకరాయి కట్టడాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
6) ఓజోన్ పొర క్షీణత:స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ 03 తగ్గిపోవుటను ఓజోన్ క్షీణత అంటారు. ఈ ప్రాంతంలో హానికర క్లోరైన్ మరియు బ్రోమైన్ సంబంధ మూలాలు పెరగడం వల్ల ఓజోన్ క్షీణించడం లేక మందం తగ్గడం లేక రంధ్రాలు ఏర్పడడం జరగుతుంది. పర్యావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర కృశించి, రంధ్రాలు ఏర్పడతాయి.
ప్రశ్న 2.
ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మధ్యగల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
జీవరాశిని ప్రభావితం చేస్తూ, ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అని చెప్పవచ్చు. పర్యావరణం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడిసరుకులను సరఫరా చేయడమే కాక ఆర్థిక వ్యవస్థనుండి ఉత్పన్నమయ్యే వ్యర్థపదార్థాలను తనలో విలీనం చేసుకుంటుంది.
ఆర్థిక వ్యవస్థ అనగా నిరంతరం పెరిగిపోయే కోర్కెలను సంతృప్తి పరచడానికి అవసరమయ్యే వస్తు సముదాయాన్ని అందుబాటులో ఉన్న పరిమిత వనరుల సహాయంతో ఉత్పత్తి చేయటానికి రూపొందించుకున్న సముచితమైన సంవిధానాన్ని ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు.
పర్యావరణం ఒక వైపు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ముడి పదార్థాలు సప్లయి చేయడమే కాకుండా మరో వైపు ఆర్థిక వ్యవస్థ విడుదల చేసే వ్యర్థాలను సంగ్రహిస్తుంది. ఆధునిక కాలంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్లక్ష్యంగా దోపిడి తత్వంతో పెరిగిపోయి పర్యావరణ సామర్థ్యాన్ని, అది సప్లయి చేయగల వనరులను ప్రభాతం చేయును. అలాగే వ్యర్థాలను సంగ్రహించగల పర్యావరణ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. 1966లో బ్రిటీష్ ఆర్థికవేత్త ఇ. బిల్లింగ్ పర్యావరణ వనరులను విపరీతంగా వాడుకోవడం ఎంతో ప్రమాదకరమని హెచ్చరించారు.
ఆయన ఉద్దేశ్యంలో “ఈ ప్రపంచం పరిమిత జీవనాధార వనరులు కల్గిన ఒక పాత్ర వంటిది. కాబట్టి మానవాళి వనరుల వినియోగాన్ని గరిష్టంకాకుండా ఎంత కనిష్టం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక కార్యాకలాపాలు పర్యావరణంపై ఒత్తిడి ఎలా కలిగిస్తాయో ఈ క్రింది పటం తెలియజేయును.
పర్యావరణం మరియు ఆర్థిక కార్యకలాపాలు
పై పటంలో పర్యావరణ సహజ వనరులను వివిధ ఆర్థిక రంగాలైన వ్యవసాయ పారిశ్రామిక మరియు సేవారంగాలకు వనరులను ముడి పదార్థాల రూపంలో పంపిణీ చేస్తుంది. ఈ రంగాలు వనరులు ఉపయోగించుకొని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తున్నాయి. వస్తు సేవల ఉత్పత్తి పర్యావరణ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు పర్యావరణ భౌతిక ఉపయోగం పెరిగి, పర్యావరణ పరిమాణం తగ్గుతూ వస్తుంది. మరోవైపు ఆర్థిక కార్యకాలాపాలు పర్యావరణంలోకి వ్యర్థ పదార్థాలను మరియు వివిధ రూపాలలోని కాలుష్యాన్ని వదలుతున్నాయి. ఇది పర్యావరణ నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇది పర్యావరణం యొక్క కాలుష్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది.
ప్రశ్న 3.
గాలి కాలుష్యం అంటే ఏమిటి ? అందుకు గల కారణాలు, ఫలితాలు తెల్పండి.
జవాబు:
కాలుష్యం – రకాలు:పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిమాణాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘనవ్యర్థ పదార్థాల, ఉష్ణకాలుష్యాలు ప్రధానమైనవి.
గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో వున్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని ‘వాయు లేక గాలి కాలుష్యం’ అంటారు.
1) వాయు కాలుష్యం:మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో రకాలైన వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ మొదలయినవి ఆవరించి ఉంటాయి. భూమి చుట్టూ ఉన్న వాతావరణం ఇలాంటి వాయువుల కలయికతో ఏర్పడి, ఉమ్మడిగా వీటన్నంటిని కలిపి ‘వాయువు’ (గాలి) అని సామాన్య అర్థంగా పిలుస్తుంటారు. బరువు దృష్ట్యా చూస్తే మానవుడు రోజు తీసుకొనే పదార్థాల్లో 80% వరకు గాలి ఉంటుంది. మనుషులు సగటున ఒకరోజుకు 2200 సార్లు శ్వాసిస్తూ ఒక రోజులో సుమారు 16 నుంచి 20 కి.గ్రాల గాలిని పీల్చుకుంటూ ఉంటారు. అన్ని జీవరాశుల శ్వాసక్రియ ఈ వాయువు మీదనే ఆధారపడి ఉంటుంది. కాని మానవుని వివిధ కార్యకాలాపాల వల్ల గాలి కాలుష్యం కాబడి, అందులోని వివిధ వాయువుల సహజసిద్ధమైన కూర్పు భంగము చేయడుతుంది. కాలుష్యం వల్ల ప్రాణికోటికి అవసరమైన ప్రాణవాయువు తగ్గిపోయి, హానికారక బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) మరియు నత్రజని (నైట్రోజన్) స్థాయిలు పెరిగిపోతాయి.
వాయు కాలుష్యం కారణాలు:ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి 2 బిలియన్ టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి.
1) వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతూ ఉంటుంది.
2) వంట చెరుకును కాల్చడం, శిలాజ ఇంధనాలను వాడడం, పారిశ్రామికీకరణ, పంటలసాగు, వాహన విసర్జకాలు, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నాశనమైపోవడం, గనుల తవ్వకం, విద్యుత్పత్తి, శీతలీకరణ పరిశ్రమలు మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.
వాయు కాలుష్యం ప్రభావాలు:వాయు కాలుష్యం ప్రజలను, మొక్కలను, జంతువులను, జలచరాలను, ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మానవుల ఆరోగ్యాన్ని తారుమారు చేస్తుంది. చెట్ల, మొక్కల ఆకులను పాడుచేస్తుంది. కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగనీయదు. మొక్క వృద్ధిని అడ్డుకుంటుంది. చారిత్రాత్మక కట్టడాలను వర్ణవిహీనం చేస్తుంది. ఇండ్లు, కార్లులాంటి వాటికుండే వెలుపలి రంగులు పేలవంగా తయారుచేస్తుంది. సహజమైన అందాలను కలిగిన ప్రదేశాల స్వచ్ఛతను, నాణ్యతను క్షీణింపచేస్తుంది.
ఉదా:ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్ తెల్లటి పాలరాయి 1998లో పసుపు రంగులోకి మారడం ప్రారంభించింది. ఈ మార్పు ప్రమాదస్థాయిని కూడా మించిపోయింది. వాయుకాలుష్యం స్ట్రాటోస్పియరు, శీతోష్ణస్థితిని తారుమారు చేసి భూతాపానికి ఆమ్ల వర్షాలకు, ఓజోన్ పొర క్షీణతకు, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు కరువులు రావడానికి, మొక్కల, పంటల క్రిమికీటకాల, పశువుల స్వాభావిక లక్షణాలు మారిపోవడానికి, అతినీలలోహిత కిరణ ధార్మికతకు కారణమవుతూ ఉంటుంది.
ప్రశ్న 4.
నీటి కాలుష్యానికి కారణాలు, దాని ప్రభావాలను తెలపండి.
జవాబు:
నీటి కాలుష్యం:నీటిని ‘నీలి బంగారం’ అంటారు. జీవరాశులకు గాలి, ఎండ, ఎంత అత్యవసరమో నీరు కూడా అంతే అవసరం. మానవుని శరీర బరువులో 70 శాతం నీరు ఉంటుంది. భూమి ఉపరితంలో 80 శాతం వరకు నీరు ఆక్రమించి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97 శాతం “కు సముద్రాల్లో ఉంటుంది. మిగతా 3 శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు. అందులో 2.997 శాతం మంచు డ్డ డ లో ఉంది. మిగతా 0.003 శాతం చాలా కొద్ది పరిమాణంలో మాత్రమే మానవాళి ఉపయోగానికి లభిస్తోంది. కాబట్టి నీరు అత్యంత విలువైన వనరుగా పరిగణించబడుతోంది. నీరు లేకపోతే ఈ భూమి మీద అసలు జీవమే ఉండదు. సెలయేళ్ళు, సరస్సులు, చెరువులు, నదులు, సముద్రాలు, ఆనకట్టలు, జలధారల్లో నిల్వచేసిన నీరు మొదలైనవి ఉపరితల నీటి వనరులు. భూమి లోపల ఇంకిపోయిన బావులు, గొట్టపు బావుల ద్వారా లభించే నీటిని భూగర్భజలం అంటారు. ఆర్థిక కార్యకలాపాల్లోని ప్రతిదశలో నీరు చాలా అవసరం.
కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని, నీటిలో ఎక్కువగా చేరిపోయి, నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. మానవ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటంతో, నీరు వినియోగానికి కూడా పనికిరానంతగా కలుషితమవుతుంది. నీరు నాణ్యతను కోల్పోయి, వ్యవసాయానికేకాక, త్రాగటానికి కూడా పనికిరాకుండా పోతుంది. ఆర్థిక కార్యకాలాపాలు విస్తరించడంతో ఉపరితంలో ఉన్న నీరే కాకుండా భూగర్భ జలం కూడా కలుషితమౌతుంది.
నీటి కాలుష్యం – కారణాలు:గృహాలలో వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మేటవేయడం, పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలు, ప్రమాదవశాత్తు సముద్రంలో చిందిపోయే నూనెలు, విషపూరితమైన లోహాల మూలకాలు, గనుల తవ్వకం వల్ల వచ్చే వ్యర్థాలు, మొదలగు వాటి వల్ల నీరు కలుషితమవుతుంది.
నీటి కాలుష్యం – ప్రభావాలు :
- నీటి నుంచి పుట్టే వ్యాధులను వ్యాపింపచేస్తుంది. తద్వారా వైద్యఖర్చుల రూపంలో అధిక ఆర్థిక భారం మోపుతుంది.
- త్రాగు నీటి స్వచ్ఛతను క్షీణింపచేస్తుంది. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా ఉపయోగించడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
- సముద్ర ఉత్పత్తులు కలుషితమై తినడానికి వీలులేని ప్రమాదకరమైనవిగా మార్చేస్తుంది. తద్వారా ఎగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గుతుంది.
- నీటిలోని ఆక్సిజన్ని తగ్గిస్తుంది. అది సముద్ర వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు దారి తీసి, నీటిలో జీవించే జీవుల పునరుత్పత్తి తద్వారా దేశ సముద్ర ఉత్పాదక విలువను ప్రభావితం చేస్తుంది.
- మానవులు పనిచేసే రోజులు అనారోగ్యం వల్ల తగ్గిపోతాయి. తద్వారా ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గిపోతాయి.
ప్రశ్న 5.
‘ధ్వని కాలుష్యం’ అంటే ఏమిటో నిర్వచించి, అది పర్యావరణ స్వచ్ఛతను ఎలా కలుషితం చేస్తుందో వివరించండి.
జవాబు:
ధ్వని కాలుష్యం కారకాలు:ధ్వని కాలుష్యం (ఇంట, బయటా) ఉంటుంది. గృహోపకరణాల వాడకం వల్ల, లౌడ్ స్పీకర్ల వాడకం, గడియారం అలారం, శబ్దాల వల్ల ఊపిరి పీల్చడం, మాట్లాడటం, శబ్దాలు మొదలైనవి ఇంటిలోపల ధ్వనులకు ఆధారాలు. బయటి ధ్వని కాలుష్యం ముఖ్యంగా థర్మల్ ప్లాంటు, గనుల త్రవ్వకం, విమానాశ్రయాలు, వివిధ రవాణా సాధనాల ద్వారా ఏర్పడుతుంది.
ధ్వని కాలుష్యం – ప్రభావాలు:ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్చతను భూమిమీద జీవించే ప్రాణులను ప్రభావితం చేస్తుంది. ధ్వని కాలుష్యం అనేక ప్రభావాలకు దారితీస్తుంది. అందులో ముఖ్యమైనవి.
- సంగీతం, భాషణల యొక్క తియ్యదనం, ఇంపు నశించిపోతుంది.
- వార్తా ప్రసార శ్రవణాన్ని అడ్డుకుంటుంది.
- తాత్కాలికంగా కాని, శాశ్వతంగా కాని వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం వుంది.
- మానవుని శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది. నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేకుండా పోవడం, జీర్ణక్రియలు సరిగా లేకపోడం, రక్తపోటులాంటి అనారోగ్య పరిస్థితులు ధ్వని కాలుష్యం వల్ల కలుగుతాయి.
- నాడి సక్రమంగా కొట్టుకోకపోవడానికి లేదా వేగంగా కొట్టుకోవడానికి, రక్తంలో కొవ్వు శాతం పెరగడానికి కారణమవుతుంది.
- గర్భస్థ శిశువులకు సరిచేయలేనటువంటి ప్రమాదాలను కలుగచేస్తుంది.
ప్రశ్న 6.
పర్యావరణ క్షీణతకు గల ఆర్థిక కారణాలు ఏవి ?
జవాబు:
ఆర్థికాభివృద్ధి, పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం ఒకే దిశలో పయనిస్తాయి. విచక్షణారహితంగా, సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల భౌతిక పర్యావరణం క్షీణిస్తుంది. పర్యావరణ క్షీణత ప్రభావాలను మనం అనేక విధాలుగా చూడవచ్చు. కాలష్యాల దుష్ఫలితాలను క్రింద వివరించడం జరిగింది.
1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికలు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా అది | అల్ప ఉత్పాదకతకు దారితీస్తుంది.
ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవశరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మానికి చిరాకును కలిగించి బాధపెట్టే అలర్జీ మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే
కారణం.
బి) నీటి కాలుష్యం:వ్యాధులను వ్యాపింపచేసే సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు. వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లులాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.
సి) ధ్వని కాలుష్యం:ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దశబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బ తినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండెవేగం పెరగడంలను కలుగ చేస్తుంది.
2) వ్యవసాయంపై ప్రభావం:పర్యావరణ క్షీణత వల్ల వ్యవసాయరంగం దెబ్బతింటుంది. వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి.
ఎ) వాయు కాలుష్యం:వాయు కాలుష్యకారకాలైన సల్ఫర్-డై-ఆక్సైడ్ వదిలే పొగలు మొక్కలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మొక్కలలోని లెట్యూస్, బార్లీ, వైట్ – ఫైన్ మొదలైనవి ఈ పొగల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతాయి. సాధారణంగా వాయుకాలుష్యం మొక్కల ఆకులను దెబ్బతీస్తుంది. మొక్కల ఆకులలోని పత్రహరితాన్ని కోల్పోయి అవి పసుపు పచ్చగా మారతాయి. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తిని వాయుకాలుష్యం తగ్గిస్తుంది. వాతావరణంలో మార్పులకు వాయుకాలుష్యం కారణమని అనేక సూచికలు తెలియచేస్తున్నాయి. ఆమ్లవర్షాలకు కారణం వాయు కాలుష్యమే. వాతావరణంలో మార్పులు, ఆమ్ల వర్షాలు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
బి) నీటి కాలుష్యం:నీటి కాలుష్యం వ్యవసాయభూముల ఉత్పాదకతను అధికంగా దెబ్బతీస్తుంది. కలుషిత నీటిలో నిర్జీవ లవణాలు, ముఖ్యంగా క్లోరైడ్ ఉంటుంది. ఈ నీరు పంట పొలాలలోకి ఇంకి ఆవిరైపోతే లవణాలు మాగాణి భూమిలో కేంద్రీకృతం అవుతాయి. ఈ విధంగా లవణాలు భూమిలో పేరుకుపోయి కేంద్రీకృతమై, భూసారం తగ్గి, సాగుభూమి బీడుబారిపోతుంది.
సి) నేల కాలుష్యం:నేలకోత, లవణీకరణ, ఎడారీకరణ మొదలైనవి భూమి నాణ్యత, సాగుభూమి పరిమాణాన్ని తగ్గిస్తాయి. గనుల నిర్వహణ కూడా పంటపొలాలను తగ్గించి భూమికోతకు కారణమవుతున్నది. కావున భూకాలుష్యం పంటపొలాల విస్తీర్ణాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
3) పరిశ్రమలపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పారిశ్రామిక ఉత్తత్త్పిని తగ్గిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యత కూడా దీని వల్ల క్షీణిస్తుంది.
ఎ) వాయు కాలుష్యం:భవనాలు, కార్లు, వస్త్రాలు, మొదలైనవి గాలిలోని వ్యర్థపరమాణువుల వల్ల ప్రభావితం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్లు భవనాల తయారీలో ఉపయోగపడు పాలరాయి, సున్నపురాళ్ల క్షీణతకు కారణం అవుతున్నాయి. సల్ఫర్ ఆక్సైడ్ ప్రభావం వల్ల వస్త్రాలు, తోళ్లు, స్టీలు మొదలైనవి దెబ్బతింటున్నాయి. నైట్రోజన్ ఆక్సైడ్ సున్నితమైన రంగులను వెలసిపోయేటట్లు చేస్తుంది. వాయు కాలుష్యం పరిశ్రమల, యంత్రాల తరుగుదలకు కారణమవటంతో పాటు, పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను తగ్గిస్తుంది.
బి) నీటి కాలుష్యం:కలుషితమైన నీరు, పరిశ్రమలకు తక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. భిన్న పరిశ్రమలలో ఉపయోగపడే నీటి నాణ్యత భిన్నరకాలుగా ఉంటుంది. చల్లటి నీటిలో సాధారణంగా తక్కువ శుభ్రత కలిగి ఉంటాయి. అవసరం లేని వేడిమి, పదార్థాలని తీసివేసే గుణం వున్న నీరు పరిశ్రమలకు ఉపయుక్తం కాదు. కలుషిత నీటి వల్ల పరిశ్రమలలో వ్యయాలు ఎక్కువగా అవుతాయి. నీటిని శుద్ధిచేయటం, దెబ్బతిన్న యంత్ర సామాగ్రిని బాగుచేయటం, పారిశ్రామిక ప్రక్రియలో సర్దుబాటు వల్ల పరిశ్రమల వ్యయాలు పెరుగుతాయి.
సి) నేల కాలుష్యం:ఖనిజాలు, ఖనిజనూనెలు భూమిలో అంతర్భాగాలు. వీటిని ఉపయోగిస్తే అవి శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుంది. శక్తిని ఉత్పత్తి చేయటానికి బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ఖనిజాలను పరిశ్రమల్లో ముడి పదార్థాలుగా ఉపయోగించటం జరుగుతుంది. విచక్షణా రహితంగా ఈ వనరులను ఉపయోగిస్తే, ఇవి హరించుకుపోయి పారిశ్రామిక అభివృద్ధిని తగ్గిస్తాయి.
4) పశుసంపదపై ప్రభావాలు:పర్యావరణ కాలుష్యం పశు పక్ష్యాదుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను కల్గిస్తుంది. పశుపక్ష్య సంబంధమైన ఉత్పత్తులు కూడా తగ్గుతాయి. పశు ఆరోగ్యానికి అతి ప్రమాదకరమైన కాలుష్యకం ఫ్లోరైడ్ పాడి పశువులు ఫ్లోరైడ్ వల్ల అతిగా ప్రభావితమై, పాల ఉత్పత్తులు తగ్గిస్తాయి. ఫ్లోరైడ్ వల్ల వచ్చే ‘ఫ్లోరోసిస్’ అనే వ్యాధి వల్ల పళ్లు, ఎముకలు ప్రభావితమై అవిటి అవడం జరుగుతుంది.
5) సముద్ర ఆహార పదార్థాలపై ప్రభావం:నీటి కాలుష్యం మత్స్యవనరుల మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. నీటిని కలుషితం చేసే విషపదార్థాలు నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గించడం వల్ల నీటి ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి చేపల పునరుత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా అవి కలుషితమై భుజించడానికి కూడా పనికిరాకుండా చేస్తుంది.
6) ఇతర ప్రభావాలు:పై ఆర్థిక ప్రభావాలే కాకుండా, ఇతర పదార్థాలు కూడా పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడతాయి. ఇది జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుంది. జీవవైవిధ్యంలోని విభిన్న జంతువులు జీవరాశులు, మొక్కలు ప్రభావితం చేయబడి, వాటి మధ్య అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయి. ఈ కారణాల వల్ల పరస్పర ఆధారమైన, సున్నితమైన ఆహార గొలుసులోని బంధం తెగిపోవచ్చు లేదా బలహీనం కావచ్చు.
ప్రశ్న 7.
పర్యావరణ కాలుష్యానికి దారితీసిన కారకాలు ఏమిటి ?
జవాబు:
పర్యావరణ క్షీణత, వాతావరణం కాలుష్యం కన్నా కొద్దిగా భిన్నమైనవి. పర్యావరణ నాణ్యత తగ్గడాన్ని క్షీణత అంటాము. కాని ప్రకృతి కొన్ని హానికారక మూలకాలతో కాలుష్యం అవడాన్ని కాలుష్యం అనవచ్చు. పర్యావరణ మార్పులు ఆర్థికాభివృద్ధి, జనాభా వృద్ధి, నగరీకరణ, సాంద్ర వ్యవసాయం పద్ధతులు, విద్యుత్ వాడకం పెరగడం మరియు రవాణా వంటి అనేక కారణాల వల్ల ఏర్పడవచ్చు. పర్యావరణ క్షీణతకు ప్రాధమిక కారకాలను క్రింది విధంగా చర్చించవచ్చు.
1) సాంఘీక కారణాలు:పర్యావరణ క్షీణతకు కారణమైన సాంఘిక కారణాలను సంక్షిప్తంగా క్రింద వివరించడం జరిగింది.
ఎ) జనాభా:ఆర్థికాభివృద్ధి జరగాలంలే జనాభాయే మూలం. అయితే, ఒక హద్దు దాటి పెరిగితే పర్యావరణ క్షీణతకు కూడా జనాభాయే ముఖ్య కారణమవుతుంది. కాబట్టి పెరుగుతున్న జనాభా జీవ సహాయం వ్యవస్థల మధ్య సంబంధాన్ని స్థిరీకరించాలి. లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు, నవకల్పనలు, సత్ఫలితాలను ఇవ్వలేవు.
ప్రపంచ భూభాగంలో 2.4% ఉన్న భారతదేశం ప్రపంచ జనాభాలో 17% జనాభాను పోషిస్తుంది. ప్రస్తుత భారత జనాభా పెరుగుదల రేటు 1.77 (2011 జనగణన). ఈ రేటు భారతదేశం ఎదుర్కొనే జనాభా సమస్యను సూచిస్తుంది. కాబట్టి జనాభా, పర్యావరణ సంబంధాలను దృష్టిలో ఉంచుకొని జనాభా నియంత్రణకు ఉధృత చర్యలను (Vigourous Drive) చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
బి) పేదరికం:పర్యావరణ క్షీణతకు పేదరికం కారణం మరియు ఫలితం కూడా అని చెప్పవచ్చు. పేదరికానికి, పర్యావరణానికి ఉన్న చక్రరూప సంబంధం అతి క్లిష్టమైన దృగ్విషయం. అసమానతలు, వనరుల క్షీణతని పెంపొందిస్తాయి. ఎందుకంటే ధనికుల కంటే పేదలు ఎక్కువగా సహజ వనరులపై ఆధారపడతారు. కాబట్టి సహజ వనరలు తగ్గుతాయి. పేదవారికి ఇతర వనరుల ద్వారా సరైన ఫలితాలు పొందే అవకాశం లేదు. దేశంలో రంగరాజన్ కమిటీ ప్రకారం 29.5 శాతం మరియు సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 21.9% (2011-12)గా పేదరిక శాతాన్ని అంచనా వేశారు. కానీ నిరపేక్ష పేదరిక పరిమాణం అంటే దారిద్య్ర రేఖకు దిగువన నివసించే వారి మొత్తం సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
2) నగరీకరణ (Urbanization):గ్రామాలలో లాభసాటి ఉద్యోగవకాశాలు లేనందువల్ల పేదకుటుంబాలు పట్టణాలకు తరలి వెళ్ళడం జరుగుతోంది. అందువల్ల జీవావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. మెగా సిటీలు లేదా పెద్ద నగరాలు పెరగటంతో పాటు మురికివాడలు కూడా విస్తృతమవుతాయి. 2001 జనగణన ప్రకారం 28.6 కోట్ల ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారు. శాతంలో చెప్పాలంటే 27.8% మంది అన్నమాట. అదే 2011 జనగణన ప్రకారం 37.7 కోట్లకు (30%) పెరిగారు. ఈ విధమైన శీఘ్ర ప్రణాళికా రహిత పట్టణాలు పెరుగుదల, పట్టణాల పర్యావరణ ల క్షీణతకు దారితీస్తుంది.
3) ఆర్థిక అంశాలు (Economic Factors):పర్యావరణ క్షీణతకు చాలా వరకు మార్కెట్ వైఫల్యమే కారణం, అంటే పర్యావరణ వస్తు, సేవలకు సంబంధించి మార్కెట్ లేకపోవటమే లేదా మార్కెట్ సమర్థవంతంగా పనిచేయలేకపోవటమే కారణంగా చెప్పవచ్చు. ప్రైవేటు, సాంఘిక వ్యయాల (Social costs or benefits) వల్ల వినియోగం, ఉత్పత్తుల్లో బహిర్గత ప్రభావాలు ఏర్పడి పర్యావరణ క్షీణతకు కారణమవుతున్నాయి. మార్కెట్ వైఫల్యానికి స్పష్టంగా నిర్వచించని ఆస్తి హక్కు ఒక కారణం. అంతేకాకుండా ధరల నియంత్రణ, సబ్సిడీల వల్ల మార్కెట్ వక్రీకరణ ఫలితంగా సాధించవలసిన పర్యావరణ లక్ష్యాలను పెంచుతున్నాయి.
తత్ఫలితంగా సహజ వనరులు (ఖనిజ నూనెలు, ఖనిజాలు) తగ్గిపోవడం, నీరు, గాలి, భూమి, కలుషితమవటం ఫలితంగా ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు జీవావరణ వ్యవస్థ నాణ్యత తగ్గిపోతుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వివిధ పర్యావరణ భావనలను వివరించండి.
జవాబు:
1969లో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం (National Environmental Policy Act (NEPA) ప్రకారం పర్యావరణ భౌతిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు సౌందర్యపరమైన పర్యావరణాలుగా విభజింపబడి ఉంటుంది. రావ్’ మరియు ఊటెన్లు పర్యావరణాన్ని నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు.
1) భౌతిక పర్యావరణం:ఇది భౌతిక, రసాయన మరియు జీవ అంశాలైన భూమి, వాతావరణము, వృక్షసంపద, వన్యమృగాలు, చుట్టప్రక్కల వున్న భూమి మరియు దాని స్వభావము, అవస్థాపనా సౌకర్యాలు, గాలి మరియు శబ్ద కాలుష్య స్థాయి మొదలైన వాటిని కలిగి ఉంటుంది.
2) సాంఘిక పర్యావరణము:ఇందులో జనాభా మరియు జనసాంద్రత, సామాజిక కూర్పు, మతపరమైన, విద్యాపరమైన, సామాజిక సౌకర్యాలు అంటే పాఠశాలలు, ఉద్యానవనాలు, వైద్యశాలలు, వినోదాత్మక మరియు సాంస్కృతిక సౌకర్యాలు వంటి అనేక అంశాలు అంతర్భాగమై అంటాయి.
3) ఆర్థిక పర్యావరణం:ఆర్థికాంశాలైన ఉద్యోగిత, నిరుద్యోగం, ఆదాయవనరులు, ఉత్పత్తి కారకాల లభ్యత, డిమాండులో మార్పులు, పేదరికస్థాయి మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.
4) మనోహరమైన పర్యావరణం:ఇందులో చారిత్రాత్మక, పురావస్తు, శిల్ప సంపదకు సంబంధించిన ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఉంటాయి. ప్రజలు వీటిని చూసి ఆహ్లాదం పొందుతారు.
పర్యావరణంలో అనుఘటకాలు వైవిధ్యమానమై గాక ఒకదాని మీద మరొకటి ఆధారపడి పరస్పరం ప్రభావితం చేస్తూ, ప్రభావితమవుతూ ఉంటాయి. కాబట్టి పర్యావరణం అనేది ఒక సంపూర్ణమైన అన్ని శాఖలు కలిసిన విజ్ఞానశాస్త్ర అధ్యయనమని చెప్పవచ్చు.
ప్రశ్న 2.
నేల లేక భూమి కాలుష్యం.
జవాబు:
భూపటలంలోని పై పొరలను ‘నేల’ లేదా ‘మృత్తిక’ అంటారు. రాళ్ళు నిరంతరం భౌతిక, రసాయనిక, జీవ శైధిల్యానికి గురవుతూ ఉండడం వల్ల నేల ఏర్పడింది. ప్రకృతి మానవునికిచ్చిన వరమే నేల నేల ప్రాణంతో ఉన్న (సజీవ) వనరు.
నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం తద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే “నేల కాలుష్యమని” నిర్వచించవచ్చు.
నేల కాలుష్యానికి కారణాలు:నేల కాలుష్యం అనేది మృత్తికా క్రమక్షయ వల్ల ఏర్పడుతుంది. మృత్తికా క్రమక్షయం అనేది నేల ఉపరితలంలోని సారవంతమైన పొరలు కోతకు గురిచేసి, భూమి నిస్సారంగా మార్చడం వల్ల జరుగుతుంది. ఇది అడవుల నరికివేత, విస్తృత వ్యవసాయం వల్ల, గనుల త్రవ్వకం మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది. అదే విధంగా నేల కోతకు ఎడారీకరణ కూడా కారణమే. దీని వల్ల నేల జీవంలేకుండా ఇసుక సముద్రంగా తయారవుతుంది. ఎడారీకరణ అనేది పశువులను ఎక్కువగా మేపడం వల్ల తక్కువ సారం కలిగిన నేలలనే ఎక్కువగా ఉపయోగించడం వల్ల, క్షారీకరణ, లవణీకరణ మొదలగు వాటి వల్ల ఏర్పడుతుంది.
అధికంగా రసాయనిక ఎరువుల, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల వివిధ రసాయనాలు, ఆమ్లాలు, క్షారాలు, భూమిలోకి చొచ్చుకుపోయి భూమికి ఉండే సహజ రసాయనిక ధర్మాలు మార్పుచెంది మొక్కలు, పంటల నాశనానికి దారితీస్తుంది. వ్యర్థపదార్థాలతో భూమిని నింపటం వల్ల కూడా నేల క్షీణతకు ..రవుతుంది.
ప్రశ్న 3.
సహజ వనరుల రకాలు, ఉదాహరణలతో వ్రాయుము. [Mar ’16]
జవాబు:
భూమి వనరుల నిలయం. వనరులు ప్రకృతి ప్రసాదిం వరాలు. వనరులను మనం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకుంటాం.
సహజ వనరుల విభజన:సహజ వనరులను వాటి పరిమాణాన్ని బట్టి, నూర్పుచెందే గుణాలను బట్టి, వాటిని తిరిగి వాడుకొనే విధానాన్ని బట్టి విభజించవచ్చు. కాని సాధారణంగా రెండు రకాలుగా విభజించి పరిశీలించడం సౌకర్యంగా ఉంటుంది.
1) పునరావృతం అయ్యే వనరులు:ఎలాంటి తరుగుదల లేకుండా ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా క్షీణించని వనరులను పునరావృతమయ్యే వనరులు అంటారు. అవి తరిగిపోవు. స్వల్పకాలంలోనే ఆ వనరులు తమంతట తామే పునరుత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి నిల్వలు స్థిరంగా ఉండక పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. వీటినే “సాంప్రదాయేతర వనరులు” అని కూడా అంటారు. ఉదాహరణకు గాలి, సౌరశక్తి, సముద్రపు అలలు, భూగర్భ ఉష్ణవనరులు (Geo-Thermal) మొదలగునవి.
2) పునరావృతం కాని వనరులు:వాడుకొంటూ పోతే తరిగిపోయేటటువంటి సహజ వనరులను ‘పునరావృతం కాని వనరులు అంటారు. వీటిని సాంప్రదాయ వనరులు అంటారు. ఈ వనరులను మనం పునరుత్పత్తి చేయలేము. ఒక్కసారి ఈ వనరులు తరిగిపోతే, అవి వాడుకోవడానికి అందుబాటులో ఉండవు. ఇటువంటి వనరులను ఎంతగా వినియోగిస్తూపోతామో, రాబోయే తరాల వారికి ఇది అంత కొరతగా మారిపోతుంది.
ఉదాహరణకు బంగారం, వెండి, రాగి, శిలాజ ఇంధనాలు, నూనెలు మొదలైనవి.
ప్రశ్న 4.
కాలుష్యం అంటే ఏమిటి ? కాలుష్యాన్ని ఎన్ని తరగతులుగా విభజించవచ్చో వ్రాయండి.
జవాబు:
పర్యావరణానికున్న స్వాభావిక లక్షణాలల్లో భౌతికంగా, రసాయనికంగా లేదా జీవపరమైన అవాంఛనీయ పరిణామాలు కలిగితే దాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం వల్ల ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో స్వచ్ఛత తగ్గిపోయి ఉపయోగించుకోవడానికి పనికిరాకుండా పోతాయి. పర్యావరణంలోని కాలుష్యం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో వాయు, జల, నేల, శబ్ద, ఘన వ్యర్థ పదార్థాల, ఉష్ణ కాలుష్యాలు ప్రధానమైనవి. ఇతర కాలుష్యకారకాలు ధర్మల్ కాలుష్యం, రేడియో ఆక్టివ్ కాలుష్యం మొదలగునవి.
1) వాయు కాలుష్యం:గాలిలో ఇతర కాలుష్య కారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరగుతూ ఉంటుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామీకరణ, న్యూక్లియర్ పరీక్షలు, అడవులు నరికి వేయడం మొదలగునవి గాలి కాలుష్యానికి ముఖ్యకారణాలు.
2) నీటి కాలుష్యం:కొన్ని పదార్థాలుగాని, కారకాలుగాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించివేసి దానిని ఆరోగ్యానికి హానికరంగాను, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చివేస్తాయి. దానినే నీటి కాలుష్యంగా చెప్పవచ్చు. గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మొదలైనవి నీటి కాలుష్యంకు
కారణాలు.
3) నేల కాలుష్యం:నేల నాణ్యత కొన్ని ప్రతికూల మార్పులకు గురి అయి అందులోని సహజ మూలకాల కూర్పు తారుమారు కావడం ద్వారా భూమి ఉత్పాదకత తగ్గడమే నేల కాలుష్యం. రసాయనిక ఎరువుల వాడకం, ఆమ్లాలు, క్షారాలు భూమిలోనికి చొచ్చుకొనిపోవడం, మొదలైనవి నేలకాలుష్యానికి కారకాలు.
4) శబ్ద కాలుష్యం:ఏ ధ్వనులైతే 125 డెసిబెల్స్ పీడనం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి, మానవుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తాయో వాటిని ‘ధ్వని కాలుష్యం’ అంటారు. గృహోపకరణాల వాడకం, లౌడ్ స్పీకర్ల వాడకం, థర్మల్ పవర్ ప్లాంటు, గనుల త్రవ్వకం మొదలగునవి కారకాలు.
5) ఘన వ్యర్థ పదార్థాల కాలుష్యం:ఘన వ్యర్థ పదార్థాల్లో గృహ సంబంధింత వ్యర్థాలు, జంతువుల మృతకళేబరాలు, పరిశ్రమలు, వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వైద్య సంబంధ వ్యర్థాలు ఉంటాయి. ప్లాస్టిక్ ఘన వ్యర్థ పదార్థాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.
6) ఉష్ణ కాలుష్యం:సమీపంలో ఉన్న కాలువలు, సరస్సులు, చెరువులు, నదుల్లోకి వేడి నీటిని విడుదల చేసిన ఫలితంగా వచ్చే కాలుష్యాన్ని ఉష్ణ కాలుష్యంగా చెప్పవచ్చు. న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, శుద్ధి కర్మాగారాలు, కాగితం పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు మొదలగునవి ఉష్ణ కాలుష్యానికి కారణమవుతున్నాయి.
ప్రశ్న 5.
‘సుస్థిరత్వం’ అంటే అర్థం ఏమిటి ? సుస్థిరమైన అభివృద్ధిలోని అనుఘటకాలను గురించి వివరించండి.
జవాబు:
సుస్థిరత్వం భాగాలు:“సుస్థిరమైన అభివృద్ధి” అన్న భావనలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణమనే మూడు భాగాలు. ఇవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం కలిగిన స్వతంత్రమైన అనుఘటకాలు. సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలంటే ఈ మూడు అనుఘటకాల మధ్య సమతూకాన్ని సాధించవలసి వుంటుంది. ఇలాంటి సమతూకాన్ని సాధించడం ఎలాగో పటంలో చూపడం జరిగింది.
ఆర్థిక సంబంధమైన అంశాలు:మానవ నిర్మితమైన మూలధనం, మానవ మూలధనం, సహజ మూలధనం వంటి మౌలికమైన విలువలను సమాజాలు రక్షించుకుంటూ, అభిలషనీయ పరిమాణంలో ఆదాయ ప్రవాహాన్ని పెంపొందిచుకోవలసి వుంటుందని ఆర్ధికభావనలో కొనసాగించగలిగే అభివృద్ధి తెలియజేస్తుంది.
సామాజిక సంబంధమైన అంశాలు:సామాజిక పరమైన సుస్థిరత న్యాయం, సమానత్వం అనే రెండు సూత్రాలపై నిర్మితమైంది. అభివృద్ధిపథం కొనసాగాలంటే సంపద, వనరులు అవకాశాలు సమానంగా పంపిణీ జరగాలి. పౌరులందరికీ ! కనీస ప్రమాణంలో భద్రత, మానవ హక్కులు, సామాజిక ప్రయోజనాలైన ఆహారం, ఆరోగ్యం, విద్య, స్వయం అభివృద్ధికి అవకాశాలు చేకు చాలి.
పర్యావరణ సంబంధమైన అంశాలు:పర్యావరణ భావనలో కొనసాగించగలగడం అనేది వనరులను సుస్థిరంగా ఉపయోగించడం, సమర్థవంతంగా వృథాలను ఇముడ్చుకునే విధిని నిర్వర్తించడం, సహజ మూలధనాన్ని రక్షించుకోవడం, ఈ మూడు విధులను సమర్ధవంతంగా అంతరాయం లేకుండా నిర్వహించగలిగితే జీవావరణ వ్యవస్థలో స్థిరత్వం సాధించవచ్చు.
ప్రశ్న 6.
మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాన్ని చర్చించండి.
జవాబు:
1) మానవ ఆరోగ్యంపై ప్రభావాలు:పర్యావరణ క్షీణత, మానవ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నందున, శ్రామికులు తమ పనులకు హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్య కారణాలు, శ్రామికుల సామర్థ్యాన్ని తగ్గించగా, అది అల్ప ఉత్పాదకతకు దారి తీస్తుంది.
ఎ) వాయు కాలుష్యం (Air Pollution):వాయు కాలుష్యకారకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు, కణరూపద్రవ్యం మొదలైనవి శ్వాసకోశం ద్వారా మానవ శరీరంలోకి నేరుగా ప్రవేశించి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉబ్బసం (Bronchitis), ఊపిరితిత్తుల క్యాన్సర్, కళ్ళకి, చర్యానికి చిరాకును కలిగించే బాధపెట్టే అలర్జీ (Eye Irritation, Skin Irritation) మొదలైన వ్యాధులకు వాయు కాలుష్యమే కారణం.
బి) నీటి కాలుష్యం (Water Pollution):వ్యాధులను వ్యాపింపచేసే (transmission) సాధనాలలో అతి ముఖ్యమైనది నీరు, వివిధ వ్యాధులను కలిగించే వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవాలాంటి సూక్ష్మక్రిములు, నీటి ద్వారానే వ్యాపిస్తాయి. ఈ సూక్ష్మక్రిముల వల్ల విరోచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. –
సి) ధ్వని కాలుష్యం (Sound Pollution):ధ్వని కాలుష్యం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద శబ్దాలు నిద్రాభంగాన్ని కలిగించి, ఆరోగ్యం మీద ప్రభావాలను కలిగిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల వినికిడి దెబ్బతినడం, పనిపాటల్లో, సంభాషణలో అంతరాయాన్ని, ఏకాంతానికి భంగం, నిద్రాభంగాన్ని బాధను లేదా చిరాకును కలిగిస్తుంది. అలాగే ఏకాగ్రతకు భంగం కలిగించడం, రక్తపోటు, గుండె వేగం పెరగడంలను కలుగచేస్తుంది.
ప్రశ్న 7.
అడవుల పరిరక్షణకు కావలసిన జాగ్రత్తలు. [Mar ’17]
జవాబు:
అడవులను ‘కర్బన శోషణాగారాలని’ (carbon sinks), ‘ప్రకృతి సౌందర్యాల ఖజానాలని’ అంటారు. వాటికున్న ప్రాధాన్యాన్ని గమనించి, వాటిని సంరక్షించుకోవడం అత్యంత ఆవశ్యకం, అడవులను క్రింది చర్యల ద్వారా సంరక్షించుకోవచ్చు.
- పేదల ఇళ్ళు కట్టుకోవడానికిగాను అటవీ భూములను కేటాయించడం మానుకోవాలి.
- సామాజిక అటవీ కార్యక్రమాల క్రింద కొన్ని ప్రత్యేక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
- వృథాగా ఉన్న భూముల్లో మొక్కలు నాటడం జరగాలి.
- అడవులు మంటలపాలు కాకుండా (ముఖ్యంగా వేసవి కాలంలో) సంరక్షించుకోవాలి.
- అడవులు తరిగిపోయిన ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో చెట్లను నాటి తరిగిపోయిన అడవిని చేయాలి.
- సంయుక్త అటవీ యాజమాన్య, సంఘాలను స్థాపించడం చాలా అవసరం.
- పశువులను మేపడం, చట్టవిరుద్ధంగా చెట్లను నరికివేయడం మొదలైనవి అనుమతించకూడదు.
- అటవీ సంరక్షణ చర్యల్లో స్థానిక ప్రజలను కలుపుకొని, వారిని భాగస్వామ్యులను చేయాలి.
ప్రశ్న 8.
పర్యావరణాన్ని పరిరక్షించవలసిన ఆవశ్యకత.
జవాబు:
పర్యావరణం అనేది ఉమ్మడి ఆస్తి. పర్యావరణాన్ని మానవులు, జంతువులు, మొక్కలు మరియు చెట్లు, పక్షులు, చేపలు ఇలా ప్రపంచంలోని అన్ని జీవరాశులు ఉపయోగించుకుంటున్నాయి, అనుభవిస్తున్నాయి. ప్రత్యేకంగా మానవులు తమ అత్యాశతో ఈ ఉమ్మడి వనరులను అధికంగా ఉపయోగిస్తున్నారు. తత్ఫలితంగా, పర్యావరణం బలహీనమై, తన సహజ విధులను కూడా నిర్వహించలేకపోతుంది.
కావున దాదాపు ఆర్థికవేత్తలందరూ, ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ మనం వారి హెచ్చరికలను ప్రక్కకు పెడుతూ, పర్యావరణం దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నాము. పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే
- ప్రస్తుత తరానికి మరియు రాబోయే తరాల అవసరాలు తీరేందుకు.
- సమాన పంపిణీ జరుగుటకు (పర్యావరణ మరియు ఆర్థిక కార్యకలాపాలు).
- మానవ, భౌతిక మరియు సహజ మూలధనాలను కాపాడుటకు.
- జీవ వైవిధ్యాన్ని మరియు దాని అంతర్భాగాలైన, జంతు, వృక్ష జాతుల నాశనాన్ని నిరోధించుటకు.
- సున్నితమైన జీవవ్యవస్థలు మరింత క్షీణించకుండా నిరోధించుటకు పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం, ఎన్నో న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మరియు పరిపాలనా సంబంధ ప్రయత్నాలు చేస్తోంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
పర్యావరణం.
జవాబు:
పర్యావరణం “Environment” అనే ఆంగ్ల పదము ప్రాచీన ఫ్రెంచి పదము “Environ” నుండి రూపొందించబడింది. ఎన్విరాన్ అంటే ‘చుట్టూ ఉన్న’ జీవరాశిని ప్రభావితం చేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూల పదార్థాల కలయికనే పర్యావరణం అంటారు. దీనిలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ మరియు మేధోపరమైన
అంశాలు ఉంటాయి.
వాతావరణం:భూమి మొత్తాన్ని అవరించిన ఉన్న వాయువుల సమూహం. దీనిలో నాలుగు పొరలు ఉంటాయి.
- ట్రోపోస్పియర్,
- స్ట్రాటో స్పియర్,
- ఐనోస్పియర్,
- ధర్మోస్పియర్
ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థ. [Mar ’16]
జవాబు:
అవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సంవత్సరములో ‘విట్రాన్ల’ ప్రతిపాదించాడు. ఒక నిర్ణీత భౌగోళిక ప్రదేశంలో ఉన్నటువంటి స్వాభావిక, భౌతికమైన పర్యావరణ కలయికను వాటి మధ్య జరిగే చర్య, ప్రతిచర్యలను కలిపి ”ఆవరణ వ్యవస్థ’ గా చెప్పవచ్చు. ఆవరణ వ్యవస్థ స్థూలంగా రెండు రకాలు 1. సహజ ఆవరణ వ్యవస్థ, 2. కృత్రిమ ఆవరణ వ్యవస్థ.
ప్రశ్న 3.
గ్రీన్ హౌస్ ప్రభావం. [Mar ’17]
జవాబు:
భూగ్రహంపై ఉన్న వాతావరణం కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు మీధైన్ వంటి కొన్ని రకాల వాయువులు ఎక్కువైన కారణంగా సూర్యుని నుండి విడుదల అయ్యే రేడియేషన్ని తమ ద్వారా లోపలికి రానిస్తాయి. కాని తిరిగి ఆ రేడియేటెడ్ ఉష్ణాన్ని అట్టిపెట్టుకొని భూ ఉపరితలం నుండి బయటకు పోనివ్వవు. దీనినే గ్రీన్ హౌస్ ప్రభావం అంటారు.
ప్రశ్న 4.
గాలి కాలుష్యం.
జవాబు:
గాలిలో ఇతర కాలుష్యకారక పదార్థాల గాఢత ఎక్కువైపోయి, మానవుని శ్రేయస్సును, జీవకోటికి మరియు వివిధ రూపాలలో ఉన్న ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని వాయు లేక గాలి కాలుష్యం అంటారు. ఇవి సహజమైన, మానవ నిర్మితమైన ఆధారాల వల్ల జరుగుతుంది. వంటచెరకు కాల్చడం, పారిశ్రామికీకరణ, పంటల సాగు, అడవులు నరికివేయడం మొదలగునవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు.
ప్రశ్న 5.
నీటి కాలుష్యం. [Mar ’17]
జవాబు:
కొన్ని పదార్థాలు గాని, కారకాలు గాని నీటిలో ఎక్కువగా చేరిపోయి నీటి యొక్క స్వచ్ఛతను తగ్గించి వేసి దానిని అరోగ్యానికి హానికరంగానూ, వాడుకోవడానికి కూడా పనికి రాకుండా మార్చి వేస్తాయి. దానినే నీటి కాలుష్యం అంటారు. |గృహాల్లోని వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు మొదలైనవి నీరు కలుషితంకు కారణాలు.
ప్రశ్న 6.
ఓజోన్ పొర. [Mar ’17, ’16]
జవాబు:
సూర్యుని రేడియేషన్ వల్ల వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకొని భూమి మీద మానవుని జీవనానికి అవసరమైన శక్తిని ప్రసాదించే రక్షక కవచాన్ని ఓజోన్ పొర అంటారు. క్లోరోఫ్లోరోకార్బన్స్, హాలోజన్స్ అణువులు స్టోటోస్పియర్ను చేరి ఓజోన్ ను నాశనం చేస్తాయి.
ప్రశ్న 7.
భూగోళం వేడెక్కడం (Global Warming).
జవాబు:
హరితగృహ వాయువులైన CO2, మొదలైన వాటి వల్ల భూఉపరితల ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతూ ఉంది.. CO2 ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించుట ద్వారా, అడవుల నరికివేత వల్ల ఎక్కువగా వెలువడుతుంది. దీని ప్రభావంతో ఉష్ణం గ్రహింపబడి, తిరిగి భూమి నుండి పరావర్తనం చెందకుండా భూమిపైన ఉండిపోతుంది. దీనిని భూమి వేడెక్కుట అంటారు.
ప్రశ్న 8.
సుస్థిరమైన అభివృద్ధి.
జవాబు:
సుస్థిరమైన అభివృద్ధి అనగా మనం వారసత్వంగా పొందిన నాణ్యమైన జీవనాన్ని, ఆస్తులను ఏ మాత్రం తగ్గకుండా భవిష్యత్ తరాల వారికి అందించుట. సుస్థిరమైన అభివృద్ధిలో మూడు ముఖ్యమైన అనుఘటకాలున్నాయి. అవి ఆర్థిక, సాంఘిక, పర్యావరణం అనేవి.
ప్రశ్న 9.
వ్యయ – ప్రయోజన విశ్లేషణ.
జవాబు:
పర్యావరణ వ్యయ ప్రయోజనాలు అంచనా వేయడంలో ఒక ప్రాజెక్టు యొక్క మూలధన మూల్యాంకనము మరియు తులనాత్మకత జరగాలి. ప్రతి ఆర్థిక కార్యకలాపం ప్రయోజనాలను, నష్టాలను కల్గి ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టును మూల్యాంకనం చేసేటప్పుడు ఆర్థిక ప్రయోజనలతో పాటు పర్యావరణ నష్టాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
ప్రశ్న 10.
అటవి నాశనానికి గల కారణాలు.
జవాబు:
అడవులు ఎన్నో కారణాల వల్ల తొలగించబడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి జనాభా పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం, భూమి డిమాండ్ పెరగటం (ఇల్లు, వ్యవసాయం, కలపకోసం) పశువులను ఎక్కువగా మేపడం వల్ల అడవులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆనకట్టల నిర్మాణం, రోడ్లు, రైల్వేల నిర్మాణం అడవుల నరికివేతకు అతి ముఖ్య కారణాలు. అడవులలో మంటలు వ్యాపించుట, పోడు వ్యవసాయం మొదలగునవి ఇతర కారణాలు.
ప్రశ్న 11.
జీవవైవిధ్యం. [Mar ’17, ’16]
జవాబు:
‘జీవవైవిధ్యం’ అనే పదాన్ని 1986 సంవత్సరంలో అమెరికా శాస్త్రవేత్త వాల్టర్ రోసెన్ మొదటిసారిగా ప్రతిపాదించాడు. జీవవైవిధ్యం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. జన్యుపరమైన తేడాలు, జాతులలోని వైవిధ్యం ఆవరణ వ్యవస్థలోని విచ్ఛిన్న గుణాలను అన్నింటిని కలిపి జీవవైవిధ్యం అంటారు.
ప్రశ్న 12.
ధ్వని అంటే ఏమిటి ?
జవాబు:
నియమానుసారంగా, చెవులకు ఇంపైన తియ్యనైన, వినడానికి సౌకర్యంగా ఉండే శబ్దాన్ని ‘ధ్వని’ అని అంటారు. శబ్దము, ధ్వని అని రెండు పదాలలో ఒకే అర్థంలో వాడుతున్నా శబ్దం వేరు, ధ్వని వేరు. శబ్దాలన్ని ధ్వనులు కావు. గాఢమైన, తీవ్రమైన, గట్టిదైన శబ్దాన్నే ‘ధ్వని’ అంటారు. 50 నుండి 90 డెసిబెల్స్ మధ్య గల శబ్దాన్ని ‘ధ్వని’ అంటారు. 120 డెసిబెల్స్ స్థాయిని కలిగిన ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు.
ప్రశ్న 13.
భూమి విచ్ఛేదనం.
జవాబు:
ఎప్పుడైతే భూమి భౌతికస్థితి, స్వచ్ఛత, ఉత్పాదక శక్తిలో మార్పులు సంభవిస్తాయో అప్పుడు భూమి విచ్ఛేదనానికి గురైందని చెప్పవచ్చును. అడవులు అంతరించిపోవటం, పశువులు ఎక్కువగా మేయటం పంటలను సాగుచేయటం, పారిశ్రామికీకరణ, గాలి వికోషీకరణ, నీటి వల్ల వికోషీకరణం, నీరు ఎక్కువగా నిలబడిపోవడం, భూమి క్షారవంతమైపోవడం జనాభా వత్తిడి వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎక్కువ చేయడం మొదలైనవి భూమి విచ్ఛేదనానికి కారణమయ్యే కాలుష్య జనకాలు. భూమి ఇలా విచ్ఛేదనకు గురైతే భూమి ఉత్పాదకశక్తి, స్వచ్ఛత క్షీణించిపోతుంది.
ప్రశ్న 14.
పర్యావరణ బహిర్గతాలు.
జవాబు:
ఒక ఆర్థిక కార్యకలాపం వల్ల ఏ మాత్రం సంబంధం లేని మూడవ వర్గం ప్రభావితం కావడాన్ని బహిర్గతాలు అంటారు. ఇటువంటి బహిర్గతాలు అనుకూలం గాని ప్రతికూలంగా కాని ఉండవచ్చు. ఉదా:ఒక ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం పరిసర పర్యావరణాన్ని దగ్గరలోని నివాసమున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ప్రతికూల బహిర్గతంగా చెప్పవచ్చు. బాగా విద్యావంతులైన ప్రజలు ఉన్న ప్రాంతంలో ఫ్యాక్టరీని మొదలు పెట్టినపుడు ఉత్పాదకత పెరగడం అనుకూల బహిర్గత.
ప్రశ్న 15.
స్వచ్ఛ భారత్ అభియాన్.
జవాబు:
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి 2014 అక్టోబరులో 2న స్వచ్చ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇందుకోసం ఒక బహిరంగ వెబ్సైట్ను మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం లక్ష్యం వచ్చే 5 సంవత్సరాలలో భారత్న పరిశుభ్ర దేశంగా మార్చడమే తద్వారా గాంధీజీ 150వ జన్మదినోత్సవాన్ని పరిశుభ్ర భారతదేశంలో ఘనంగా జరుపుకోవడం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయగలిగితే అనేక పర్యావరణ సమస్యలను పరిష్కరించగలదు.