Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Zoology Study Material Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ Textbook Questions and Answers.
AP Inter 2nd Year Zoology Study Material Lesson 4(b) రోగనిరోధక వ్యవస్థ
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రోగనిరోధకత, రోగనిరోధక వ్యవస్థలను నిర్వచించండి.
జవాబు:
1) వ్యాధికారక జీవులకు వ్యతిరేకంగా పోరాడే అతిది లేదా జీవి యొక్క సామర్ధ్యాన్ని రోగనిరోధకత అంటారు. 2) హానికర, సంక్రమణ జీవులు అయిన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, శీలీంధ్రాల నుంచి దేహానికి రక్షణ కలిగించే అవయవాలను, కణాలను, ప్రోటీన్లను కలిసి ఏర్పడిన వ్యవస్థనే రోగనిరోధక వ్యవస్థ అంటారు.
ప్రశ్న 2.
శరీరంలోని అవిశిష్ఠి రక్షణ రేఖలను నిర్వచించండి .
జవాబు:
శరీరంలో అవిశిష్ఠ రక్షణ రేఖలు. ప్రథమ రక్షణ రేఖలుగా పనిచేస్తాయి. వీటినే స్వాభవిక రోగనిరోధకత అనికూడా అంటారు. ఇది జీవులపుట్టుకతోనే కలిగి ఉండే రోగనిరోధక శక్తి. దీనిలో నాలుగు రకాల అవరోధాలుండి రక్షణక్రియా యంత్రాలుగా తోడ్పడతాయి. అవి:
- భౌతిక అవరోధాలు
- శరీరధర్మపరమైన అవరోధాలు
- కణపరమైన అవరోధాలు
- సైటోకైన్ అవరోధాలు
ప్రశ్న 3.
పరిపక్వ B – కణాలు, క్రియాశీల B – కణాలు మధ్య గల భేదాలను తెలపండి.
జవాబు:
పరిపక్వ B – కణాలు
- ఇవి అస్థిమజ్జ కాండకణాల నుండి ఉద్భవించి పరిపక్వ B – కణాలుగా అభివృద్ధి చెందుతాయి.
- పరిపక్వ B -కణాలు వాటి ప్లాస్మాత్వచం ఉపరితలం పై ప్రతిదేహాలను ప్రదర్శిస్తాయి.
ఇది ప్రతిజనకాలను గుర్తించి వాటిని అంతర్గతం చేసుకొని ప్రక్రియీకరణ చేసి, T – కణాలకు MHC II ప్రోటీన్ల ద్వారా సమర్పిస్తాయి.
క్రియాశీల B – కణాలు
- క్రియాశీల B – కణాలు, పరిపక్వB – కణాల నుండి ఏర్పడతాయి.
- క్రియాశీల B కణాలు విభేదన మరియు విభజన చేంది. ప్లాస్మాకణాలు, జ్ఞప్తికణాలను ఏర్పరుస్తాయి. ప్లాస్మా కణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి, ప్రతి జనకాలను తొలగించుతాయి.
ప్రశ్న 4.
ఏవైనా నాలుగు ఏకకేంద్రక ఫాగోసైట్ల (భక్షక కణాల ) పేర్లు రాయండి.
జవాబు:
- హిస్టియోసైట్లు సంయోజక కణ జాలంలో ఉంటాయి.
- కూఫర్ కణాలు – కాలేయంలో ఉంటాయి.
- మైక్రోగ్లియల్ కణాలు – మెదడులో ఉంటాయి.
- మిసెంగియల్ కణాలు – మూత్రపిండంలో ఉంటాయి.
ప్రశ్న 5.
పరిపూరక ప్రోటీన్లు అంటే ఏవి ? [A.P. Mar. ’17]
జవాబు:
ఇవి ప్లాస్మాలోనూ, కణత్వచ ఉపరితలం పైన ఉండే అచేతన ప్రోటీన్లు వీటిని రోగనిరోధక వ్యవస్థ లేదా సూక్ష్మ జీవులు చైతన్యపరుస్తాయి. చైతన్యమైన పరిపూరక ప్రోటీన్లు బ్యాక్టీరియం కుడ్యం పై వలయాల రూపంలో అతుకొని త్వచదాడి సంక్లిష్టం (MAC) ను ఏర్పరుస్తాయి. ఇవి బ్యాక్టీరియా త్వచం పై రంధ్రాలు చేస్తాయి. ఈ రంధ్రాల ద్వారా కణబాహ్య ద్రవ్యం బ్యాక్టీరియంలోకి ప్రవేశించి, బ్యాక్టీరియం ఉబ్బి చనిపోతుంది. కొన్ని పరిపూరక ప్రోటీన్లు ఉజ్వలనం కలుగజేయడం ద్వారా కూడా రక్షణనిస్తాయి.
ప్రశ్న 6.
అప్పుడే జన్మించిన శిశువులకు ‘కొలోస్ట్రమ్’ అత్యావశ్యకం నిరూపించండి. [T.S. Mar. ’17, ’16]
జవాబు:
ప్రసవించిన తల్లి మొదటి కొద్ది రోజులిచ్చు పసుపు రంగు చనుపాలను కొలోస్ట్రమ్ లేదా ముర్రుపాలు అంటారు. ఇవి అప్పుడే జన్మింఛిన శిశువుకు ఇవ్వడం అవసరం ఎందుకంటే, దీనిలో IgA రకపు ప్రతిదేహాలు అధికంగా ఉండి శిశువుకు రోగ నిరోధకతను కల్పిస్తాయి.
ప్రశ్న 7.
పెర్ఫోరిన్స్, గ్రానై జైమ్స్ మధ్య గల భేదాలు తెల్పండి. [A.P. Mar.’17]
జవాబు:
పెర్ఫోరిన్స్: ఇవి క్రియాశీల TC కణాల నుండి విడుదలై, మార్పుచెందిన కణాల ప్లాస్మాత్వచాలలో రంధ్రాలు చేస్తాయి. ద్వారా నీరు లోనికి ప్రవేశించి, కణదేహం ఉబ్బి చివరకు పగిలి నశిస్తుంది.
గ్రామ్స్: ఇవి కూడా క్రియాశీల Tc కణాల నుండి విడుదలై, సంక్రమణ దేహకణాలలోనికి ప్రవేశించి ప్రణాళికాబద్ద కణ మరణంను కలుగజేస్తుంది. దీనినే అపోటోసిన్ అంటారు.
ప్రశ్న 8.
ఆప్సనైజేషన్ అంటే ఏమిటి ?
జవాబు:
చైతన్య పరచబడిన పరిపూరక ప్రోటీన్లు బ్యాక్టీరియం ఉపరితలంపై అచ్చాదనం / పూతలాగా అంటుకుంటాయి. ఈ ప్రక్రియను ఆప్సనైజైషన్ అంటారు. దీనివల్ల భక్షక కణాలు బ్యాక్టీరియా వైపు ఆకర్షింపబడి వాటిని భక్షిస్తాయి.
ప్రశ్న 9.
వివిధ రకాల రోగనిరోధక అపస్థితుల పేర్లు రాయండి.
జవాబు:
వివిధ రకాల రోగనిరోధక అపస్థితులు:
- రోగనిరోధకత లోపం వల్ల వచ్చే అపస్థితులు
- అతిసున్నితత్వ అపస్థితులు
- స్వయం రోగనిరోధకత అపస్థితులు
- అంటుతిరస్కరణ చర్యలు.
ప్రశ్న 10.
ప్రతిజనకం, ప్రతిదేహాలను నిర్వచించండి.
జవాబు:
ప్రతిజనకం: దేహంలో గుర్తించగలిగే రోగనిరోధక అనుక్రియను కలుగజేసే పదార్థాన్ని ప్రతిజనకం అంటారు. సాధారణంగా ప్రోటీన్లు, పాలిశాకరైడ్లు ప్రతిజనకాలుగా పనిచేస్తాయి.
ప్రతిదేహం: వ్యాధిజనక జీవులకు లేదా ప్రతిజనకాలను ప్రేరణగా B – లింఫోసైట్లు ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ప్రతిదేహాలు అంటారు.
ప్రశ్న 11.
ఎపిటోప్, పారాటోప్ అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
ఎపిటోప్: ప్రతిదేహంతో బంధితమయ్యే ప్రతిజనకపు భాగాన్ని ఎపిటోప్ అంటారు.
పారాటోప్: ప్రతిజనకంతో బంధితమయ్యే ప్రతిదేహ భాగాన్ని పారాటోప్ అంటారు.
ప్రశ్న 12.
రెండు ప్రతిజనక కణాలను పేర్కొనండి.
జవాబు:
ప్రతిజనకాల ఉనికిని బట్టి ఇవి
- స్వేచ్ఛా / ప్రసరణ ప్రతిజనకాలు: ఇదిదేహ ద్రవాలలో ప్రసరణం చెందుతాయి.
- కణాంతర ప్రతిజనకాలు: ఇవి సాంక్రమిక కణం లోపల ఉండే ప్రతిజనకాలు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
B – కణాల గురించి లఘుటీక రాయండి. [Mar. ’14]
జవాబు:
B – లింఫోసైట్లు అస్థిమజ్జ కాండ కణాల నుంచి ఉద్భవిస్తాయి. క్షీరదాలలో అస్థిమజ్ఞ, భ్రూణపు కాలేయంలోనూ, పక్షులలో బర్సాఫాబ్రిసియస్లోనూ పరిణితి చెంది B- కణాలుగా మారతాయి. పరిణితి చెందిన B- కణాలు ప్రతిదేహాలను సంశ్లేషించి వాటిని (Ig M మరియు Ig D) త్వచ ఉపరితలం పై ప్రదర్శిస్తాయి. ఇవే ప్రతిజననక గ్రాహకాలుగా పనిచేస్తాయి. ఇవి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలలో పరిణితి చెందిన B – కణాలు క్రీయాశీల B– కణాలుగా మారుతాయి. తరువాత ఇది ప్లాస్మాకణాలు మరియు జ్ఞప్తికణాలుగా మారుతాయి. ప్లాస్మాకణాలు, ప్రతిజనకాలకు వ్యతిరేకంగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ జ్ఞప్తికణాలు శోషరస కణువులలో కొన్ని దశాబ్ధాల వరకు జీవించి ఉంటాయి. అదే ప్రతిజనకం రెండవ సారి దేహంలోకి ప్రవేశించినప్పుడు జ్ఞప్తికణాలు వేగంగా విభజన, విభేదనం చెంది రెండవతరం క్రియాశీల క్లోన్లు ఏర్పడతాయి. దీనినే ద్వితీయ రోగనిరోధక అనుక్రియ అంటారు. B కణాలు ముఖ్యంగా హ్యుమోరల్ లేదా దేహద్రవనిర్వర్తిత రోగ నిరోదకతలో పాల్గొంటాయి.
ప్రశ్న 2.
ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ గురించి లఘుటీక రాయండి. [T.S. Mar. ’15]
జవాబు:
వ్యాధి జనక జీవులకు లేదా ప్రతిజనకాలకు ప్రేరణగా B – లింఫోసైట్లు ప్రతిదేహాలు అనే ప్రోటీన్ అణువులను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఇమ్యునోగ్లోబ్యులిన్లు అంటారు. ప్రతిజనక – ప్రతిదేహ చర్య జరిపేటప్పుడు ప్రతిజనకం బందితమయ్యే ప్రతిదేహ భాగాన్ని పారాటోప్ అంటారు.
ప్రతిదేహాలు రెండురకాలు అవి
- స్వేచ్ఛా లేదా ప్రసరణ ప్రతిదేహాలు: ఇవి దేహద్రవాలు అనగా సీరమ్, లింపులలో ఉంటాయి.
- ప్లాస్మాత్వచం పై బందింపబడిన ప్రతిదేహాలు: ఇది పరిణితి చెందిన B కణాల త్వచ ఉపరితలంపై ఉంటాయి.
ఇమ్యునోగ్లోబ్యులిన్ నిర్మాణం: ఇమ్యునోగ్లోబ్యులిన్ ‘Y’ ఆకారపు అణువు దీనిలో. నాలుగు పాలిపెప్టైడ్ గొలుసులుంటాయి.
అందులో రెండు సరూప, పొట్టి, తేలికపాటి గొలుసులు (L) మిగిలిన రెండూ సరూప, పొడవాటి భారగొలుసులు (H) కాబట్టి ప్రతిదేహం నిర్మాణాన్ని H2, L2 అమరికగా సూచిస్తారు. ఒకదానితో మరొకటి డైసల్ఫైడ్ బంధాలతో బంధించబడి ఉంటాయి. ప్రతిదేహం ఒక చివరను Fab ఖండం లేదా ప్రతిజనక బంధన ఖండం అని వేరొక చివరను Fc ఖండం లేదా స్ఫటికీకరణం చెందే ఖండం లేదా నిర్మాణాన్ని బట్టి ప్రతిదేహాలు అయిదురకాలు అవి IgG, IgA, IgM, IgD మరియు IgE. వీటిలో IgG, IgD, IgE లు ఏకాణుకరూపంగానూ, IgA ద్విఅణుక రూపంలోనూ, IgM పంచఅణుక రూపంలోనూ ఉంటాయి.
ప్రశ్న 3.
సహజ లేదా స్వాభావిక రోగ నిరోధకతలోని వివిధ రకాల అవరోధాలను వివరించండి. [T.S. Mar. ’17]
జవాబు:
పుట్టుకతోనే కలిగి ఉండే రోగనిరోధక శక్తిని సహజ లేదా స్వాభావిక రోగనిరోధకత అంటారు. ఈ నిరోధకత దేహంలో సూక్ష్మజీవుల దాడి జరగకముందే ఏర్పడుతుంది. కాబట్టి అవిశిష్టంగా ఉంటుంది.
దీనిలో నాలుగు రకాల అవరోధాలుండి రక్షణక్రియా యంత్రాలుగా తోడ్పడతాయి. అవి:
ఎ) భౌతిక అవరోధాలు: చర్మం, శ్లేష్మస్తరాలు ప్రధాన భౌతిక అవరోధాలు. చర్మం సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. శ్వాస, జఠరాంత్ర, మూత్రజననేంద్రియ నాళాల లోపలి తలంలో ఉండే శ్లేష్మస్తరాలు దేహంలో ప్రవేశించిన సూక్ష్మజీవులను బంధిస్తాయి.
బి) శరీరధర్మపరమైన అవరోధాలు: జీర్ణాశయంలో స్రవించే HCl, లాలాజలం, కన్నీరు మొదలయిన దేహ స్రావకాలు ప్రధాన శరీరధర్మపరమైన అవరోధాలు. ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి.
సి) కణపరమైన అవరోధాలు: రక్తంలో బహురూప కేంద్రక ల్యూకోసైట్లు, మోనోసైటులు, సహజ హంతకకణాలు, కణజాలాలలోని మాక్రోఫ్రేజ్లు మొదలయిన కణాలు ప్రధాన కణపరమైన అవరోధాలు. ఇవి సూక్ష్మజీవులను భక్షించి రక్షణ కల్పిస్తాయి.
డి) సైటోకైన్ అవరోధాలు: రోగనిరోధక కణాలు సైటోకైనిన్లను స్రవిస్తాయి. ఇవి కణ విభజనను, కణవిభేదనను ప్రేరేపిస్తాయి. కొన్ని సైటోకైన్లు పొరుగునున్న కణాలను వైరస్ సంక్రమణ నుంచి రక్షిస్తాయి.
ప్రశ్న 4.
హ్యుమోరల్ లేదా దేహద్రవనిర్వర్తిత రోగనిరోధకత సంవిధానాన్ని వివరించండి.
జవాబు:
ప్రతి జనకానికి ప్రేరణ చెందిన B – కణాలు విశిష్ఠ ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్లాస్మా, శోషరసం మొదలయిన దేహ ద్రవాలలోకి విడుదల చేస్తాయి. ప్రతిదేహాల ద్వారా జరిగే రోగ నిరోధకతను హ్యూమోరల్ లేదా దేహద్రవనిర్వర్తిత రోగనిరోధకత అంటారు.
దేహద్రవ నిర్వర్తిత రోగనిరోధకతా సంవిధానం: మన శరీరంలోకి ప్రతిజనకం ప్రవేశించినప్పుడు అది ద్వితీయ లింఫాయిడ్ అవయవాలను చేరతాయి. అక్కడ స్వేచ్ఛా ప్రతిజనకాలు B- కణాలపై ఉండే ప్రతిజనక గ్రాహకాల Fab చివరలు ప్రతిజనకాలతో బంధనం చెంది, చైతన్యవంతమవుతాయి. B కణాలు గ్రాహకాలకు బంధింపబడిన ప్రతిజనకాలను అంతర్గతం చేసుకొని దాన్ని ప్రక్రియీకరణ చేసి, ప్రతిజనక తునకలను రెండవ తరగతి MHC అణువులతో తమ త్వచ ఉపరితలంపై ప్రదర్శిస్తాయి. సరియైన TH కణాలు ఈ ప్రతిజనక MHC – II సంక్లిష్టాన్ని గుర్తించి దానితో కలిసి ఇంటర్ల్యుకిన్లను స్రవిస్తాయి.
దీనివల్ల B కణాలు విభేదనం చెంది విస్తృత విభజన ద్వారా క్రియాశీల B – కణాలు ఏర్పడతాయి. ఇవి తరువాత ప్లాస్మాకణాలు, జ్ఞప్తి కణాలను ఏర్పరుస్తాయి. ప్లాస్మాకణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్రతి జనకంతో పోరాడతాయి. ఈ చర్యను ప్రాథమిక రోగనిరోధక అనుక్రియ అంటారు. అదే ప్రతిజనకం రెండవసారి దేహంలోని ప్రవేశించినప్పుడు జ్ఞప్తి కణాలు వేగంగా విభజన, విభేదనం చెంది రెండవ తరం ప్లాస్మాకణాలను, కణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్లాస్మాకణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి.
ఈ ఉత్పత్తి అయిన విశిష్ఠ ప్రతిదేహాలు ప్రతిజనకంతో బంధనం చెంది ప్రతిజనక – ప్రతిదేహ సంక్లిష్టం ఏర్పడుతుంది. ఈ సంవిధానం 4 రకాలుగా జరుగుతుంది. అవి తటస్థీకరణం, గుచ్ఛీకరణం, అవక్షేపం మరియు పరిపూరక ప్రోటీన్లను చైతన్యపరచడం. ఈవిధంగా దేహ ద్రవ నిర్వర్తిత రోగనిరోధకత ప్రతిజనక – ప్రతిదేహ చర్యల ద్వారా విశిష్ట రక్షణతోపాటు స్థూల భక్షక కణాలు పరిపూరక ప్రోటీన్ల సహాయంతో అవిశిష్ఠ రక్షణ కూడా కలుగజేస్తుంది.
ప్రశ్న 5.
కణనిర్వర్తిత రోగనిరోధకత సంవిధానాన్ని వివరించండి.
జవాబు:
T – లింఫోసైట్ల చర్యల వల్ల జరిగే రోగనిరోధక అనుక్రియాలను కణనిర్వర్తిత రోగనిరోధకత అంటారు. ఈ విధానంలో T – లింఫోసైట్లు దేహంలోని మార్పు చెందిన స్వీయకణాలపై దాడిచేసి నిర్మూలిస్తాయి. అంతేకాక కణనిర్వర్తిత రోగనిరోధకత దేహంలోని స్వ, పర కణాలను గుర్తిస్తుంది.
కణనిర్వర్తిత రోగనిరోధకత సంవిధానం: కణ నిర్వర్తిత రోగనిరోధకత ప్రతిజనక సమర్పణ చర్యతో ప్రారంభమవుతుంది. ఈచర్య ఫలితంగా మొదటి TH కణాలు ఆ తరువాత T కణాల చైతన్యవంతమై రోగ నిరోధక సంవిధానం కొనసాగుతుంది. a) ప్రతిజనక ప్రక్రియీకరణ సమర్పణ: స్థూలభక్షక కణాలు, B కణాలు మార్పు చెందిన స్వీయకణాల త్వచ ఉపరితలం పై ఉండే విశిష్ఠ ప్రతిజనకాలను గుర్తిస్తాయి. వీటిలో ప్రతిజనకాలు రెండు విధాలుగా ఏర్పడతాయి. (i) సాంక్రమిక కణాలలోనికి ప్రవేశించిన సూక్ష్మజీవులు జీర్ణించబడి, చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. వీటిలోని ప్రోటీన్లు MHC లతో కలిసి వెలుపలికి వచ్చి ప్లాస్మాత్వచం ఉపరితలంపై అతుక్కొంటాయి. (ii) ఇతర మార్పు చెందిన స్వీయ కణాలలో కొత్త ప్రోటీన్లు ఏర్పడి అవికూడా MHC ప్రోటీన్లతోపాటు కణ ఉపరితలాన్ని చేరుకుంటాయి. ఈచర్యనే ప్రతిజనక ప్రక్రియీకరణం అంటారు.
b) T కణాలు క్రియాశీలమవడం: ప్రతిజనక సమర్పక కణాలు TH కణాలు వద్దకు చేరినప్పుడు వాటి గ్రాహకాలు ప్రతిజనకానికి బంధించబడతాయి. వెంటనే ప్రతిజనక సమర్పక కణం IL-I ను విడుదల చేస్తుంది. ఇది TH కణాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఈవిధంగా క్రియాశీలమైన TH కణం IL-II ను విడుదల చేస్తుంది. ఇది TH కణాలలో కణవిభజనను ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా క్రియాశీల TH జ్ఞప్తి కణాల క్లోన్లు ఏర్పడతాయి. క్రియాశీల TH కణాలు B – లింపోసైట్లను ప్రేరేపించి వాటి నుంచి ప్రతిదేహాల ఉత్పత్తిని అధికం చేస్తాయి.
c) T కణాలు క్రియాశీలమవడం: TH కణాల నుండి విడుదలైన IL-II, Tc కణాలను కూడా చైతన్యవంతం చేస్తాయి. చైతన్యం చెందిన Tc కణాలు కణ విభజన జరిపి క్రియశీల Tc కణాలు జ్ఞప్తి కణాలు క్లోన్లు ఏర్పడతాయి.
అదే సమయంలో క్రియాశీల Tc కణాల, నుంచి పెర్ఫోరిన్లు, గ్రానైజైమ్లు అనే ప్రోటీన్లు విడుదలవుతాయి. పెర్ఫోరిన్లు మార్పుచెందిన స్వీయ కణాల ప్లాస్మాత్వచాలలో రంధ్రాలు చేస్తాయి. వీటి ద్వారా నీరు లోపలికి ప్రవేశించి కణదేహం ఉబ్బి చివరకు పగిలి నశిస్తుంది. గ్రామ్లు సంక్రమణ దేహ కణాలలోనికి ప్రవేశించి ప్రణాళికాబద్ద కణ మరణంను కలుగజేస్తుంది. దీనినే అపోటోసిస్ అంటారు.
అదే ప్రతిజనకం రెండవసారి దేహంలోనికి ప్రవేశిస్తే జ్ఞప్తి కణాలు అత్యంత వేగంగా విభేదనం, విభజన చెంది రెండవతరం జ్ఞప్తి, క్రియశీల, క్లోన్లు ఏర్పడతాయి. ఇవి కూడా కణవిచ్ఛిన్న క్రియను కొనసాగిస్తాయి. జ్ఞప్తికణాలు శోషరస కణుపులలో దశాబ్ధాల పాటు నిల్వ ఉంటాయి.
ప్రశ్న 6.
HIV ఏవిధంగా AIDS ను కలుగజేస్తుందో వివరించండి. [A.P. Mar. ’15]
జవాబు:
AIDS అంటే అక్వయిర్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది జన్మతః కాని, బదిలీచెందే, లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే ప్రాణాంతక వ్యాధి. ఇది హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ వల్ల కలుగుతుంది. HIV ఒక రిట్రోవైరస్. దీని మధ్య భాగంలో జన్యుపదార్ధంగా రెండు ssRNA అణువులు ఉంటాయి.
సంవిధానం: HIV మానవశరీరంలోకి ప్రవేశించి సహాయక T – కణాలు, మాక్రోఫెజ్లు, డెండ్రైటిక్ కణాలపై దాడి చేస్తుంది. ఈ కణాలలో HIV లోని RNA రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ ఎన్జైమ్ సహాయంతో తిరోఅనులేఖన ప్రక్రియ ద్వారా యుగళపోచల వైరల్ DNA ను సంశ్లేషణ చేస్తుంది. ఈ వైరల్ DNA వైరల్ ఎంజైమ్ ఇంటిగ్రేస్ సహాయంతో ఆతిథేయి కణ DNA అణువుతో కలిసిపోయి ప్రోవైరస్ ఏర్పడుతుంది. ఈ ప్రోవైరస్ కొంతకాలం తరువాత వైరస్ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. ఈవిధంగా సాంక్రమిక మానవ కణాలు వైరస్ రేణువులను నిరంతరం ఉత్పత్తి చేసే HIV ఉత్పత్తి కర్మగారాలుగా పనిచేస్తాయి. ఆతిథేయి కణాల నుండి ఏర్పడ్డ క్రొత్త వైరస్లు రక్తంలోకి విడుదలై కొత్త TH కణాలపై దాడి చేస్తాయి. దీని ఫలితంగా HIV సాంక్రమిక మానవుడి దేహంతో TH కణాల సంఖ్య రానురాను తగ్గిపోతూ రోగనిరోదకత లోపానికి దారి తీస్తుంది. చివరకు AIDS ను కలుగజేస్తుంది.