AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 11 భిక్ష
AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష
10th Class Telugu 11th Lesson భిక్ష 2 Marks Important Questions and Answers
ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
“ఇవ్వాటిమీద నాగ్రహముదగునె?” అనే మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? (March 2017)
జవాబు:
ఈ వాక్యం భిక్ష పాఠంలోనిది. కాశీ మహా నగరంలో వేదవ్యాస మహర్షికి ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. దానితో ఆయనకు కోపం వచ్చింది. కాశీని శపించబోయాడు. అంతలో పార్వతీదేవి ప్రాకృత వేషంలో వచ్చింది. భోజనానికి రమ్మంది. వేదవ్యాసునికి బుద్ధులు చెపుతూ కాశీ మహానగరం మీద కోప్పడడం తప్పని చెప్పింది.
ప్రశ్న 2.
భిక్ష పాఠ్యాంశ నేపథ్యం రాయండి.
జవాబు:
వేదవ్యాస మహర్షి తన 10 వేలమంది శిష్యులతో కాశీలో నివసిస్తున్నాడు. ఋషి ధర్మంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. శివుడు వ్యాసుని పరీక్షించాలనుకొన్నాడు. అతనికి భిక్ష దొరకకుండా చేయుమని తన భార్య పార్వతీదేవికి చెప్పాడు. ఆమె కాశీ నగర స్త్రీల హృదయాలలో ప్రవేశించి భిక్ష దొరకకుండా చేసింది.
ప్రశ్న 3.
భిక్ష పాఠం ఎవరు రచించారు? ఆయన గురించి రాయండి.
జవాబు:
భిక్ష పాఠం శ్రీనాథ మహాకవి రచించాడు. ఆయన రచించిన కాశీఖండం సప్తమాశ్వాసంలోనిది.
శ్రీనాథుడు 1380-1470 మధ్య జీవించాడు. అనగా 15వ శతాబ్ది కవి. రాజమహేంద్రవరంలో రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవి. మారయ, భీమాంబలు శ్రీనాథుని తల్లిదండ్రులు.
‘కవి సార్వభౌమ’ బిరుదాంకితుడు. పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడడిండిమ భట్టును పాండిత్యంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులకొట్టించాడు.
ప్రశ్న 4.
శ్రీనాథుని రచనా శైలిని, సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు చిన్నతనం నుండే కావ్యరచన ప్రారంభించాడు. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండం, శృంగారనైషధం మొదలైనవి రచించాడు.
చమత్కారానికీ, లోకానుశీలనకు, రసజ్ఞతకు, ఆయన జీవిత విధానానికి అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఆయన కవిత్వం ఉద్దండలీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలతో ఉంటుంది.
సీస పద్య రచనలో ఆయనకు ఆయనే సాటి. వృద్ధాప్యంలో కష్టాలనుభవించాడు.
ప్రశ్న 5.
వ్యాసునికి కోపకారణం తదనంతర పరిణామాలను వివరించండి.
జవాబు:
వ్యాసుడు కాశీనగరంలో శిష్యులతో భిక్ష కోసం తిరిగాడు. ఈశ్వరుని మాయతో వరుసగా రెండు రోజులపాటు ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడు తరాలదాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక అని శపించబోయాడు.
అప్పుడు పార్వతీదేవి కాశీ నగరాన్ని శపించడం తప్పని, ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని వ్యాసుడిని మందలించి, వ్యాసుడిని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. వ్యాసుడు, తన పదివేల శిష్యులు తినకుండా, తాను తినననే వ్రతం తనకు ఉందన్నాడు. అప్పుడు అందరికీ భోజనం పెడతాననీ శిష్యులతో తన ఇంటికి రమ్మని పార్వతి పిలిచింది.
వ్యాసుడు గంగలో స్నానం చేసి శిష్యులతో పార్వతీదేవి ఇంటికి వచ్చాడు. పార్వతి వారందరికీ భోజనం వడ్డించింది.
ప్రశ్న 6.
‘వ్రతము తప్పి భుజింపంగ వలను గాదు’ – ఈ మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంగా అన్నారు?
జవాబు:
‘వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు’ అని వ్యాసుడు సామాన్య స్త్రీవలె కనబడిన అన్నపూర్ణాదేవితో అన్నాడు. వ్యాసుడు తనకు రెండు రోజులుగా కాశీలో భిక్ష దొరకలేదని కోపించి కాశీనగరమును శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సామాన్య స్త్రీవలె కనబడి, వ్యాసుని మందలించి, తన ఇంటికి భోజనానికి రమ్మని వ్యాసుడిని పిలిచింది.
అప్పుడు వ్యాసుడు తనకు పదివేల మంది శిష్యులు ఉన్నారనీ, వారందరితో కలిసి భుజించే వ్రతం తనకు ఉందనీ, ఆ వ్రతాన్ని విడిచి పెట్టి తాను ఒక్కడూ ‘భోజనానికి రాననీ చెప్పిన సందర్భంలో ఈ మాటను అన్నపూర్ణాదేవితో ఆయన చెప్పాడు.
ప్రశ్న 7.
కాశీ పట్టణంలో స్త్రీలు అతిథులను ఎలా ఆదరించేవారు?
జవాబు:
కాశీనగరంలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి ప్రియమైన స్నేహితురాండ్రు. వారు వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగు అంచులూ కలిసేలా దానిపై ముగ్గు పెడతారు. ఆ ముగ్గు మధ్యలో నచ్చిన అతిథిని నిలిపి, వారికి అర్హపాద్యాలు ఇస్తారు. వారికి పూలతో, గంధముతో పూజ చేస్తారు.
తరువాత బంగారు గరిటెతో అన్నముపై ఆవునేయిని అభిఘరిస్తారు. తరువాత భక్తి విశ్వాసాలు కనబరుస్తూ, పండ్లతో, పరమాన్నముతో, పలురకాల పిండివంటలతో, గాజులు గలగల ధ్వని చేస్తుండగా, యతీశ్వరులకు వారు మాధుకర భిక్ష పెడతారు.
ప్రశ్న 8.
కోపం తగదని అన్నపూర్ణాదేవి వ్యాసునికి ఏయే ఉదాహరణల పూర్వకంగా తెలిపింది?
జవాబు:
వ్యాసుడికి కోపం తగదని అన్నపూర్ణాదేవి ఈ కింది విధంగా చెప్పి, ఆయనను మందలించింది.
“ఓ మహర్షీ! నీవు ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్షాన్నము దొరకలేదని చిందులు వేస్తున్నావు. ఇది మంచిపని కాదు. నీవు నిజంగా శాంత స్వభావం కలవాడవు కాదు. ఎందుకంటే, ఎంతో మంది మునులు పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళదీస్తున్నారు. మరికొందరు శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకుంటున్నారు. కొందరు వరిమళ్ళలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని దానితో బతుకుతున్నారు. మరికొందరు మునులు రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని బతుకుతున్నారు. వారంతా నీ కంటె తెలివితక్కువవారు కాదు కదా ! ఆలోచించు.
అదీగాక ఉన్నఊరు, కన్నతల్లి వంటిది. కాశీ నగరం శివునికి భార్య. “నీవంటివాడు అటువంటి కాశీ నగరాన్ని భిక్ష దొరకలేదని కోపించడం తగదు.” ఈ ఉదాహరణలతో అన్నపూర్ణాదేవి వ్యాసుడిని మందలించింది.
10th Class Telugu 11th Lesson భిక్ష 4 Marks Important Questions and Answers
ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి. (June 2018)
జవాబు:
- వ్యాసమహర్షి శిష్యులతో మండుటెండలో కాశీనగర బ్రాహ్మణ వీధులందు భిక్ష కోసం తిరుగసాగాడు.
- ఒక ఇల్లాలు వండుతున్నామని చెప్పగా మరో గృహిణి మళ్ళీ రమ్మని చెబుతుంది. ఇంకొక ఆవిడ వ్రతం అని చెబితే, వేరొక ఇల్లాలు అసలు తలుపులే తెరువదు.
- కాశీ నగర గృహిణులు అన్నపూర్ణాదేవికి ప్రియమైన చెలులు. అతిథిని పరమేశ్వర స్వరూపంగా భావించి సకల మర్యాదలతో భిక్ష సమర్పిస్తారు. అలాంటి స్త్రీలున్న కాశీలో ఒక్కరు కూడా భిక్ష సమర్పించకపోవడంతో వ్యాసుడు ఆశ్చర్యపోయాడు.
- మరుసటి రోజు కూడా విశ్వనాథుని మాయ వలన భిక్ష లభించకపోవడంతో వ్యాసుడు కోపావేశాలకు లోనై కాశీనగర జనులను శపించబోయాడు.
- అప్పుడు పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో బ్రాహ్మణ మందిరపు వాకిట నిల్చి, వ్యాసుడిని ఇటు రమ్మని పిల్చి “ఓ మునివరా ! ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అని నీవెరుగవా ? ఈ కాశీనగరిపై ఇంత కోపం తగునా ?” అని సున్నితంగా మందలించింది.
- “మా ఇంటికి భోజనానికి రా !” అని పార్వతీదేవి పిలువగా, శిష్యులను వదలి పెట్టి భుజించరాదన్న తన నియమాన్ని వ్యాసుడు వెల్లడించాడు. ఆమె తాను విశ్వనాథుని దయవలన ఎంతమంది అతిథులకైనా భోజనం పెట్టగలనని తెల్సింది. వ్యాసుడు తన శిష్యులతో పాటు, గంగానదిలో స్నాన, ఆచమనాలు ముగించి, భోజనానికి వచ్చాడు.
ప్రశ్న 2.
“కోపం మంచి చెడులను గ్రహించే జ్ఞానాన్ని నశింపచేస్తుంది” – భిక్ష పాఠ్యభాగం ఆధారంగా నిరూపించండి. March 2018
జవాబు:
- బ్రహ్మజ్ఞానియైన వేదవ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కాశీలో కొంతకాలం నివసించాడు. ఆ సమయంలో శిష్యులతో కలిసి భిక్షాటనం చేసి జీవించేవాడు. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది.
- పరమేశ్వర సంకల్పం వలన పట్టపగలు మండుటెండలో భిక్షాటనం చేస్తున్న వ్యాసునికి భిక్ష లభించలేదు. “నేను ఈ రోజు ఏ పాపిష్టి వాడి ముఖం చేశానో” అని వ్యాసుడు చింతించాడు. ఆ రోజుకు ఉపవాసం ఉండి మరునాడు భిక్ష కోసం తిరుగసాగాడు. కానీ విశ్వనాథుని మాయ వలన ఏ ఇల్లాలూ భిక్ష పెట్టలేదు.
- కోపంతో ఆలోచనాశక్తిని కోల్పోయిన వ్యాసుడు భిక్షపాత్రను నట్టనడివీథిలో విసిరికొట్టి ముక్కలు చేశాడు. ఈ కాశీ నగరంలో నివసించే వారికి మూడు తరాలదాక ధనము, విద్య, మోక్షము లభించకుండుగాక !” అని శపించబోయాడు.
- మహర్షులు మనోనిగ్రహం కలిగి ఉండాలి. కోపాన్ని జయించాలి. సంయమనాన్ని (ఓర్పును) వహించాలి. కానీ వ్యాసుడు అలా చేయలేకపోయాడు. వేదాలను విభజించినవాడు, అష్టాదశ పురాణాలను రచించిన వాడైన వ్యాసుడు తన గొప్పతనానికి తగినట్లు ప్రవర్తించక, మితిమీరిన కోపావేశాలకు లోనయ్యాడు. పార్వతీ పరమేశ్వరుల ఆగ్రహానికి గురియైనాడు.
- కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎంతటివారికైనా తిప్పలు తప్పవనే విషయం వ్యాసుని ప్రవర్తన ద్వారా
నిరూపితమైంది. “కోపం ఆలోచనాశక్తిని నశింపజేస్తుంది” అనటానికి వ్యాసుని వృత్తాంతమే నిదర్శనమని చెప్పవచ్చు.
ప్రశ్న 3.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. వ్యాసమహర్షి :
వేద విభజన చేశాడు. 18 పురాణాలు రచించాడు. 10 వేల మంది శిష్యులకు విద్య నేర్పేవాడు. ఋషి ధర్మంగా భిక్షాటన చేసినవాడు. రెండు రోజులు భిక్ష దొరకలేదు. తన శిష్యుల ఆకలి చూడలేక కాశీని శపించబోయాడు. అంటే కాశీని కూడా శపించగల మహా తపస్సంపన్నుడు. అన్నపూర్ణాదేవి స్వయంగా పిలిచి భిక్షను పెట్టింది. అంటే అన్నపూర్ణాదేవిని కూడా ప్రత్యక్షం చేసుకోగల పుణ్యాత్ముడు. ఆ జగన్మాత చేతి వంటను రుచి చూసిన మహాభాగ్యశాలి. కాని తన కోపం కారణంగా ఆ వైభవాలను కోల్పోయాడు. అల్పసంతోషి. తక్షణ కోపం కలవాడు.
2. కాశీలోని సామాన్య స్త్రీలు :
చక్కగా అలికి ముగ్గులు పెట్టి, ఇల్లు కలకలలాడుతూ ఉంచే స్వభావం కలవారు. అతిథులను సాక్షాత్తు దైవంగా భావించి పూజిస్తారు. బంగారు కంచంలో పిండి వంటలతో అన్నం పెడతారు. భిక్షుకులకు లేదు అనే మాట వారినోట రాదు. వారి హృదయాలలో నిరంతరం అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాశీలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి చెలికత్తెలు. అంతటి పుణ్యస్త్రీలు ఎక్కడా కనిపించరు. వారికి వారేసాటి.
3. అన్నపూర్ణాదేవి (పార్వతీదేవి) :
కేవలం భిక్ష దొరకనంత మాత్రాన ఇంత బాధపడిపోతావా? ఇది మంచిదా? అని బిడ్డను తల్లి మందలించినట్లు వ్యాసుని మందలించింది. పిడికెడు బియ్యం వండుకొని తినే వారున్నారు. కేవలం కాయలు తినే వారున్నారు. ఇంకా రకరకాల వారున్నారు కదా! వారంతా నీకంటే తెలివితక్కువ వారా! అని ప్రశ్నించింది.
ఒక బిడ్డకు తల్లి చెప్పే నీతులు, మందలింపులు, పోలికలు, ప్రశ్నలు సంధిస్తూ పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదువగా కనిపిస్తుంది. పరిపూర్ణ మాతృత్వం మూర్తీభవించినట్లుగా అన్నపూర్ణాదేవి స్వభావం కనిపిస్తుంది.
ప్రశ్న 4.
అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవడానికి కారణాలు వివరించండి.
జవాబు:
వేదవ్యాసుడు ఒకనాడు కాశీనగరంలో తన పదివేల మంది శిష్యులతో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ వారికి భిక్ష పెట్టలేదు. సామాన్యంగా కాశీనగరంలోని బ్రాహ్మణ స్త్రీలు, రోజూ అతిథులకు ఆదరంగా మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. కానీ ఆనాడు వ్యాసుడికి ఎవరూ భిక్ష పెట్టలేదు. ఒకామె ‘అన్నం వండుతున్నాము’ అంది. మరొక స్త్రీ ‘మళ్ళీ రండి’ అంది. ఒకామె తమ ఇంట్లో దేవకార్యం అని చెప్పింది.
ఆ రోజుకు ఎలాగో ఉపవాసం ఉందామనీ, మరునాడు తప్పక భిక్ష దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు కాశీ నగరంలో ఎవరూ భిక్ష పెట్టలేదు.
దానితో వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడు తరాల వరకూ ధనము, మోక్షము, విద్య లేకుండుగాక అని శపించడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు అన్నపూర్ణాదేవి, ఒక బ్రాహ్మణ భవనం వాకిటిలో సామాన్య స్త్రీవలె ప్రత్యక్షమయ్యింది. వ్యాసుడు కాశీ నగరాన్ని శపించకుండా అడ్డుపడి, ఆయనను మందలించడానికే అన్నపూర్ణాదేవి అలా ప్రత్యక్షమయ్యింది.
ప్రశ్న 5.
‘కోపం అన్ని అనర్ధాలకు కారణం అని ఎలా చెప్పగలవు?
(లేదా)
కోపం మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది అనే విషయాన్ని భక్ష పొఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
“కోపం వస్తే నేను మనిషిని కాను” అని అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలిసికోలేడు. కోపంలోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు.
ఈ కథలో వ్యాసుడి అంతటి బ్రహ్మజ్ఞాని రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్నే శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది.
కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచి పెట్టాలి.
దుర్యోధనుడికి పాండవుల పైన, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన కవి చెప్పాడు.
కాబట్టి మనిషి కోపాన్ని అణచుకోవాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమే తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం విడిచి పెట్టాలి.
ప్రశ్న 6.
‘ఆవేశం ఆలోచనలను నశింపచేస్తుంది’ – మీ పాఠం ఆధారంగా సమర్థించండి.
జవాబు:
కోపం వస్తే, ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే వివేచన శక్తి మనిషికి నశిస్తుంది. దానితో అతడు తప్పుడు పనులకు సిద్ధం అవుతాడు. ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్నీ కూడా చంపడానికి సిద్ధం అవుతాడు.
కోపం యొక్క ఆవేశంలో అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసమహర్షి అంతటివాడు, కన్నతల్లి వంటి కాశీ నగరాన్నే శపించబోయాడు. వ్యాసమహర్షి పదివేలమంది శిష్యులకు గురువు. నిత్యం కాశీ నగరంలో శిష్యులతో భిక్షకు వెళ్ళి ఆ భిక్షాన్నం తిని జీవించేవాడు. వ్యాసుడిని పరీక్షించాలని శివుడు భావించాడు. అన్నపూర్ణాదేవితో చెప్పి ఎవరూ వ్యాసునికి భిక్ష పెట్టకుండా చేశాడు.
ఒక రోజున వ్యాసుడికి, శిష్యులకూ ఎవరూ భిక్ష పెట్టలేదు. ఆ రోజు కాకపోయినా, మరునాడు తప్పక భిక్ష దొరకుతుందని వారు అనుకున్నారు. మరునాడు కూడా వ్యాసునికి ఎవరూ భిక్ష పెట్టలేదు.
దానితో వ్యాసుడు కోపంవల్ల వచ్చిన ఆవేశంతో, ఉద్రేకంతో తాను నివసిస్తున్న కాశీ నగరాన్నే శపించబోయాడు. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు. భిక్ష దొరకలేదనే ఆవేశంతో, వ్యాసుడు కాశీ నగరవాసులకు మూడు తరాల దాక విద్య, ధనము, మోక్షము లేకుండా పోవుగాక అని శపించబోయాడు.
దీనినిబట్టి ఆవేశం, ఆలోచనలను నశింపజేస్తుంది అని మనకు తెలుస్తోంది.
ప్రశ్న 7.
అన్నపూర్ణాదేవి పాత్ర స్వభావం వివరించండి.
జవాబు:
పార్వతీ స్వరూపం :
అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుని ఇల్లాలు. పరమశివుని భార్య పార్వతీదేవినే, కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి అని అంటారు. అన్నపూర్ణా విశ్వేశ్వరులు ఒకసారి కాశీ నగరంలో శిష్యులతో నివసిస్తున్న వ్యాసమహర్షిని పరీక్షిద్దాం అనుకున్నారు.
ఆదిశక్తి :
కాశీ నగరంలో అన్నం కావలసిన వారందరికీ అన్నపూర్ణాదేవి భిక్ష పెడుతుంది. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు అందరూ అన్నపూర్ణాదేవికి స్నేహితురాండ్రు. అన్నపూర్ణాదేవి వేదపురాణ శాస్త్ర మార్గాన్ని చక్కగా పాటించే ముత్తయిదువ. ఆమె కాశీనగర బంగారుపీఠాన్ని అధిష్ఠించిన ఆదిశక్తి.
ఆతిధ్యము :
వ్యాసుడు కాశీ నగరాన్ని శపించకుండా అన్నపూర్ణాదేవి అడ్డుపడింది. ఒక బ్రాహ్మణ గృహద్వారం దగ్గర సామాన్య స్త్రీ వలె ఆమె ప్రత్యక్షమై, వ్యాసుడిని మందలించింది. తన ఇంటికి వ్యాసుడినీ, శిష్యులనూ భోజనానికి పిలిచి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది.
మాట చాతుర్యం :
అన్నపూర్ణాదేవి మాటలలో మంచి నేర్పు ఉంది. “గొంతు దాకా తిండిలేదని గంతులు వేస్తున్నావు. మహర్షులు పిడికెడు నివ్వరి గింజలతో, కాయగూరలతో తృప్తి పడుతున్నారు కదా” అని వ్యాసుడిని చక్కగా మందలించింది. ఉన్న ఊరు కన్నతల్లి వంటిదని, కాశీ నగరం శివుడికి ఇల్లాలని, వ్యాసుడికి గుర్తు చేసింది. వ్యాసుడు అంతటివాడు కాశీని శపించడం తగదని హితవు చెప్పింది.
దీనినిబట్టి అన్నపూర్ణాదేవి మహాసాధ్వి అని, మంచి మాట చాతుర్యం కలదని, అతిథులకు అన్నం పెట్టే ఉత్తమ ఇల్లాలు అని తెలుస్తుంది.
10th Class Telugu 11th Lesson భిక్ష Important Questions and Answers
ప్రశ్న 1.
యాచన మంచిదికాదు అని చెబుతూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
యాచన మానండి – మాన్నించండి
ఆత్మాభిమానానికి గొడ్డలిపెట్టు యాచన. మర్యాదకు సమాధి యాచన. దరిద్రానికి పునాది యాచన.
అందుకే యాచన మానండి. కష్టపడండి. కాసులను ఆర్జించండి. దరిద్రాన్ని తరిమికొట్టండి. మీకెదురైన యాచకులకు ఆత్మసైర్యాన్ని కల్గించండి. జీవన మార్గాన్ని నిర్దేశించండి. ఉపాధి మార్గాలు చూపించండి. వృద్ధులైతే వృద్ధాశ్రమాల్లో చేర్చండి. అనాథలైతే అనాథాశ్రమాలలో చేర్పించండి. వారూ మన సోదరులే. వారిని ఉద్దరించడం, వారిలో ఆత్మాభిమానం కల్గించడం మన సామాజిక బాధ్యత.
ఇట్లు,
యాచనా వ్యతిరేక సంఘం.
ప్రశ్న 2.
కోపంవల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
‘కోపం – అనర్థాలు’
కోపము చెడ్డ లక్షణం. మనకు వ్యతిరేకంగా మాట్లాడితే, పనిచేస్తే, మనకు కోపం వస్తుంది. అనుకున్న పని జరుగకపోతే, కోపం వస్తుంది. కోపం వల్ల మోహం వస్తుంది. మోహం వల్ల బుద్ది నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి నశిస్తాడు అని గీత చెపుతోంది.
కోపంవల్ల చాలా అనర్థాలు సంభవిస్తాయి. మనిషి విచక్షణ శక్తిని కోల్పోతాడు. మనిషి కోపంలో తాను ఏమి చేస్తున్నాడో తెలిసికోలేడు. కోపంలో మనిషి తల్లిదండ్రులనూ, భార్యాబిడ్డలనూ, గురువులనూ సహితం, చంపడానికి సిద్ధం అవుతాడు. కోపంతో పగబట్టి మనిషి శత్రువులను చంపడానికి ప్రయత్నిస్తాడు.
కోపం మంచిదికాదని, మనకు పురాణాలు కూడా చెపుతున్నాయి. విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి మహర్షులు, కోపంతో విచక్షణ పోగొట్టుకొని, ఎన్నో చిక్కులు పడ్డారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడి చేతిలో భంగపడ్డాడు.
దుర్యోధనుడు పాండవులపై కోపంతో యుద్ధానికి దిగి, సర్వనాశనం అయ్యాడు. దుర్వాస మహర్షి అంబరీషుడిపై కోపపడి తానే కష్టాలపాలయ్యాడు. వ్యాసుడి వంటి బ్రహ్మజ్ఞాని కోపంతో కాశీని శపించబోయాడు.
కోపం మంచిది కాదని, మనకు నీతిశతకాలు చెపుతున్నాయి. భర్తృహరి “క్రోధమది శత్రువు” అని చెప్పాడు! “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన చెప్పాడు. “తన కోపమె తన శత్రువు” అని సుమతీశతకం చెప్పింది.
అందువల్ల మనము కోపాన్ని విడిచి, శాంతముగా బ్రతకాలి. ‘శాంతమే భూషణము’ అని మనం గ్రహించాలి.
ప్రశ్న 3.
కోపంవల్ల గౌరవం తగ్గుతుందనే విషయాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:
కోపం – గౌరవహీనం మిత్రులారా!
ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకుంటూ ఉంటాము. కోపం అన్ని అనర్ధాలకూ మూలకారణం. కోపంవల్ల విచక్షణా జ్ఞానం నశిస్తుంది. ముఖ్యంగా చీటికీ మాటికీ కోపపడే వ్యక్తులకు, సంఘంలో గౌరవం తగ్గుతుంది. కోపం ఉన్న వ్యక్తి, ఇతరుల మనస్సులను జయించలేడు. నవ్వుతూ మాట్లాడే వ్యక్తి, ప్రపంచాన్నే జయిస్తాడు.
క్రోధం వల్ల మోహం, మోహంవల్ల బుద్ధి నాశనం కల్గుతాయని భగవద్గీత చెప్పింది. పురాణాలలో చెప్పబడే మునులలో విశ్వామిత్రుడు, దుర్వాసుడు సులభకోపులు. కోపంవల్ల వారు ఎన్నో చిక్కులు పడ్డారని, ఇతరులను అకారణంగా వారు హింసించారని పురాణాలు చెపుతున్నాయి. కోపం మనిషికి గౌరవ హీనతను తెస్తుంది. కోపం మనిషి వివేకాన్ని పాతర వేస్తుంది.
అందుకే మనం కోపాన్ని దూరంగా పెడదాం. తన కోపం తన శత్రువు అని సుమతీశతకం చెప్పినమాట గుర్తు పెట్టుకుందాము. కోపంవల్ల ఆయుర్దాయం తగ్గుతుంది. గుండె బలం తగ్గుతుంది. పిల్లలకు కోపంతో చెప్పిన దానికంటె, నవ్వుతో చెప్పినధి సులభంగా ఎక్కుతుంది. కార్యసాధనకు కోపం మహాశత్రువు అని గుర్తించండి. కోపానికి తిలోదకాలు ఇవ్వండి. నవ్వుకు, ఆనందానికి స్వాగతం పలకండి. పదికాలాలపాటు ఆరోగ్యంగా బ్రతకండి. కోపాన్ని విడిచిపెడతాం అని మనం ప్రతిజ్ఞ చేద్దాం. పదండి. కదలండి.
ఇట్లు,
ఆరోగ్య మిత్ర సంఘం,
గుంటూరు యువత.
10th Class Telugu 11th Lesson భిక్ష 1 Mark Bits
1. గురుశిష్యులు మండుటెండలో భిక్ష కోసం తిరిగారు – గీత గీసిన పదానికి విడదీసిన రూపాన్ని గుర్తించండి. (June 2017)
A) మండుట + ఎండ
B) మండు + టెండ
C) మండు + ఎండ
D) మండుట + అండ
జవాబు:
C) మండు + ఎండ
2. పార్వతి కాశీనగరమును శపించబోయిన వ్యాసుని మందలించింది – గీత గీసిన పదంలోని సమాసమేది ? (June 2017)
A) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
B) సంభావనా పూర్వపద కర్మధారయం
C) అవధారణా పూర్వపద కర్మధారయం
D) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
B) సంభావనా పూర్వపద కర్మధారయం
3. మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్మువిశ్వనా – ఇది ఏ పద్యపాదమో గుర్తించండి. (June 2017)
A) మత్తేభం
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల
4. మేఘుడంబుధికి పోయి జలంబులు తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకిది సహజగుణము – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) అర్థాంతరన్యాసం
B) రూపకం
C) స్వభావోక్తి
D) అంత్యానుప్రాసం
జవాబు:
A) అర్థాంతరన్యాసం
5. విజ్ఞానం కోసం విహారయాత్రలు చేయాలి – (గీత గీసిన పదమునకు వికృతిని గుర్తించండి.) (March 2017)
A) యంత్రము
B) ప్రయత్నం
C) జతనం
D) జాతర
జవాబు:
D) జాతర
6. సామాన్యాన్ని విశేషంతో గానీ, విశేషాన్ని సామాన్యంతో గాని సమర్థించి చెప్పే అలంకారం గుర్తించండి. (June 2018)
A) శ్లేష
B) ఉత్ప్రేక్ష
C) రూపకము
D) అర్థాంతరన్యాసము
జవాబు:
D) అర్థాంతరన్యాసము
7. ‘స్వభావం చేతనే ఐశ్వర్యం గలవాడు” అను వ్యుత్పత్యర్ధము గల్గిన పదమును గుర్తించుము. (March 2018)
A) భాగ్యశాలి
B) సంపన్నుడు
C) ధనికుడు
D) ఈశ్వరుడు
జవాబు:
D) ఈశ్వరుడు
8. భవాని ఒక పెద్ద ముత్తైదువ రూపంలో వచ్చి వ్యాసుణ్ణి మందలించింది – గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థాన్ని గుర్తించుము. (March 2018)
A) ఇంద్రుని భార్య
B) భవుని భార్య
C) విష్ణువు భార్య
D) సూర్యుని భార్య
జవాబు:
B) భవుని భార్య
9. పద్యములోని మొదటి అక్షరమును ఏమంటామో గుర్తించండి?
A) ప్రాస
B) యతి
C) పాదం
D) పదం
జవాబు:
B) యతి
10. మాయింటికిం గుడువ రమ్ము ! (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) మాయింటికి భోజనానికి రావద్దు
B) మాయింటిలో అన్నం వండేందుకు రా
C) మాయింటికి భోజనానికి రా !
D) మాయింటికి భోజనానికి రాబోకుమా
జవాబు:
C) మాయింటికి భోజనానికి రా !
11. ఏ పాపాత్ముని ముఖంబు నీక్షించితినో – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఏ పాపాత్ముని చూసానో నేను
B) ఏ పాపాత్ముని ముఖాన్ని చూసానో
C) ఏ పాపాత్ముని ముఖాన్ని చూడలేదు
D) ఏ పాపాత్ముని చూడలేదు నేను
జవాబు:
B) ఏ పాపాత్ముని ముఖాన్ని చూసానో
12. బౌద్ధ భిక్షువులచే వేలాది దీపాలు వెలిగించబడ్డాయి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. (March 2018)
A) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించారు.
B) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించలేదు.
C) వేలాది దీపాలు బౌద్ధ భిక్షువులచే వెలిగించారు.
D) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగిస్తారు.
జవాబు:
A) బౌద్ధ భిక్షువులు వేలాది దీపాలను వెలిగించారు.
13. హరిహర బ్రహ్మలను పురిటి బిడ్డలను చేసిన పురంద్రీ లలామ అనసూయ – గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థాన్ని రాయండి. (March 2019)
జవాబు:
గృహమును ధరించునది
14. ఆకంఠంబుగ నిష్ణు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా – ఇది ఏ పద్యపాదము?
జవాబు:
శార్దూలము
15. అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణ
జవాబు:
హనుమంతుడు సముద్రమును లంఘించెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదుగదా !
చదవండి – తెలుసుకోండి
మాట్లాడటమూ ఒక కళ
మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలివారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతలామలకమవుతుంది.
ఒకాయన మెట్లు దిగుతున్నాడు. అదే సమయంలో మరొకాయన మెట్లు ఎక్కుతున్నాడు. దారి ఇరుకుగా ఉంది. ఇద్దరూ మధ్యలో ఎదురుపడ్డారు. కింద నుండి వస్తున్న అతనికి కోపమెక్కువ పై నుండి దిగుతున్న వానితో ‘నేను మూర్ఖులకు దారివ్వను’ అన్నాడు. వెంటనే ఎదుటివాడు ఏమాత్రం తడుముకోకుండా ‘పరవాలేదు నేనిస్తాను’ అన్నాడు. ఇప్పుడు ఎవడు మూర్ఖుడయ్యాడు?
ఒకావిడ ఇంకొకావిడతో పేచీ పెట్టుకున్నది. కోపంతో రెచ్చిపోయి ‘ఛీ కుళ్కా’ అనేసింది. అవతలావిడ ‘ఏమత్కా?” అన్నది. ఈ ముక్కతో మొదటావిడ తిక్క కుదిరింది.
తాంబూలం వేసుకోడానికి వెళ్ళాడో పెద్దమనిషి. తమలపాకులు కట్టేవానితో ‘ఏయ్, ఆకులో సున్నం తక్కువవేయి, దవడ పగులుతుంది’ అంటూ పక్కనేవున్న అరటిపండ్ల గెలకు చేయి ఆనించి నిలబడ్డాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న తమలపాకులవాడు ‘ఏమయ్యోయ్, చెయ్యితియ్యి, పండ్లు రాలుతాయి’ అన్నాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ.
సాహిత్యాభిలాషియైన ఒకడు కవిని కలిశాడు. ఎంతోకాలం నుండి తన మనసులో దాచుకున్న ఆశను బయటపెట్టాడు. ‘అయ్యా, నాకు ఏదైనా నాటికను రాసివ్వండి’ అనడిగాడు. దానికి బదులిస్తూ ఆ కవి ‘ఓ! దానికేముంది ఏనాటికైనా రాస్తాను’ అని అభయమిచ్చాడు.
ఒక పెండ్లి వేడుకలో కొందరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒక పెద్దాయన ‘మీవయసెంతండి’ అనడిగారు. దానితా పెద్దమనిషి ‘ఏడేళ్ళు’ అన్నాడు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎంత పెద్దమనిషైతే మాత్రం ఇంతగా పరిహాసమాడుతారా అని నిలదీశారు. అతడన్నాడు. ‘నేను నిజమే చెప్పాను నాకు ఏడేళ్ళు (7 x 7 = 49) అన్నాడు. అసలు విషయం తెలుసుకుని అందరూ గొల్లున నవ్వేశారు.
బజారులో వెళుతున్న ఒకతనికి మిత్రుడు తారసపడ్డాడు. చాలాకాలమైంది వాళ్ళు కలుసుకొని. మిత్రుడు చెప్పులు లేకుండా ఉండడం చూసి విషయమేమిటని ప్రశ్నించాడు. దానికి బదులిస్తూ ‘చెప్పుకొనుటకే మున్నద’ని పెదవి విరిచాడా మిత్రుడు.
తను తీయబోయే సినిమా విషయంలో నిర్మాత ఒక కవి దగ్గరకు వెళ్లాడు. ‘నా సినిమాత పాట రాస్తారా?” అని అభ్యర్థించాడు. దానికి కవి రాస్తారా’ అన్నాడు. ఎంత కవియైతే మాత్రం ఇంత అహంతారంగా తనను ‘రా’ అంటాడా అనుకున్నాడు నిర్మాత. అతని ఆంతర్యం గ్రహించిన కవి అయ్యా, నన్ను తప్పుగా అనుకుంటున్నట్లున్నారు నేనన్నది ‘రాస్తా, రా’ అని. హమ్మయ్య అనుకున్నాడు.
ఇలా మాటలలో విరుపులు మెరుపులను సృష్టిస్తాయి. వ్యంగ్యం గిలిగింతలు పెడుతుంది.