AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు
10th Class Telugu 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers
ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి
జడ్డ ఆకలి అమ్మకి తెలుస్తుంది. ఈ తల్లులకు తమ ఆకలేకాదు, అనాథల క్షుద్బాధా తెలుసు. ఇంత తెలిసిన వీరంతా గొప్ప స్థితిమంతులేం కాదు. అలాంటప్పుడు లేనివారికి గుప్పెడు మెతుకులు పంచేదెలా? ఆలోచించగా ఆలోచించగా వారికొక దారి దొరికింది. రోజూ పిడికెడు గింజలు దాచాలన్న ఊహ కలిగింది. పిడికిలి జగిస్తే ఉద్యమం అవుతుంది. ఆ ఊళ్లో జనం పిడికిలి తెరిచారు. తమ దగ్గరున్న గింజల నుంచి ప్రతిరోజూ పిడికెడు పంచడం నేర్పారు. ఇవ్వడం సాయం, పంచడం మానవత్వం. సాటి మనుషుల ఆకలి తీర్చడం దైవత్వం.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఈ పేరా ద్వారా మీరేం తెలుసుకున్నారు?
జవాబు:
సాటి మనుషుల ఆకలి తీర్చాలి అని తెలుసుకొన్నాం.
ప్రశ్న 2.
మానవత్వంతో చేసే పనులు ఏవి?
జవాబు:
మన దగ్గరున్న సంపదను ఇతరులకు పంచడం మానవత్వం. అనాథలను, అభాగ్యులను, పేదలను ఆదుకోవడం
మానవత్వంతో చేసేపని.
ప్రశ్న 3.
సహాయపడే గుణం, మానవత్వం కలిగిన వారి వల్ల సమాజానికి కలిగే మేలు ఏమిటి?
జవాబు:
సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా సహాయపడతారు. వారి వలన బలహీనులు రక్షించబడతారు. అందరికీ మేలు
జరుగుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది. ఎంతోమంది జీవితాలలో వారు వెలుగులు నింపుతారు.
ప్రశ్న 4.
మీరు ఇతరులకు ఎప్పుడైనా సాయం చేశారా? ఎప్పుడు? ఎందుకు?
జవాబు:
నేను, ఇతరులకు చాలాసార్లు సాయం చేశాను. ఒకసారి మా స్నేహితుడు టిఫిను చేయకుండా పాఠశాలకు వచ్చాడు. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాడు. వెంటనే మాష్టారికి చెప్పాను. వెంటనే మాష్టారు బిస్కెట్లు, టీ తెప్పించి ఇచ్చారు. నీరసం తగ్గింది.
(గమనిక : తరగతిలోని ప్రతి విద్యార్థి తన అనుభవాన్ని చెప్పాలి.)
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
“గోరంత దీపాలు” అనే శీర్షిక ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? సకారణంగా చర్చించండి.
జవాబు:
(గమనిక : విద్యార్థి తనకు శీర్షిక నచ్చితే నచ్చిందని సకారణంగా నిరూపించవచ్చును. నచ్చకపోతే ‘శీర్షిక తగదు’ అని సకారణంగా నిరూపించవచ్చును. రెండు అభిప్రాయాలను ఇస్తున్నాం. ఒక దానిని మాత్రమే గ్రహించండి.)
1) శీర్షిక తగినదే :
గోరంత దీపాలు పాఠంలో అనాథ శిశువులను వృద్దుడు చేరదీసి వారి జీవితాలను ఆనందమయం చేస్తున్నాడు. చాలామంది బాలబాలికలు ఆయన వద్ద ఆశ్రయం పొందుతున్నారు. వారందరు ఆయన ప్రేమాప్యాయతలతో పాటు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఆ పిల్లలంతా అనాథలే ? రైలు పెట్టెలు శుభ్రం చేసేవారు కొందరు, యాచన, చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారు కూడా ఆ పిల్లల్లో ఉంటారు. వాళ్ళు ఈ విశాల ప్రపంచంలో దిక్కుమొక్కు లేక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే చేరదీసి అక్కున చేర్చుకున్నాడా వృద్ధుడు. ఆ పసి పిల్లలందరు చిఱుగాలికి రెపరెపలాడే గోరంత దీపాల్లాంటివారు. ఆ గోరంత దీపాలకు కొండంత అండగా నిలబడ్డాడు వృద్ధుడు. వారికి ఆశ్రయం కల్పించి తీర్చిదిద్దుతున్నాడు వృద్ధుడు. ఈ కథలోని వృద్ధుడు చదువుతున్న వారపత్రికలోని కథ కూడా అనాథబాలుని కథే. అందుచేత ఈ పాఠానికి గోరంత దీపాలనే శీర్షిక తగిన విధంగా ఉంది.
2) శీర్షిక తగినది కాదు :
గోరంత దీపాలు పాఠంలో అనాథబాలలు కంటే వృద్ధుని ఔదార్యం ప్రధానమైనది. ఆ వృద్ధుని ఔదార్యాన్ని పదిమంది ఆదర్శంగా స్వీకరించాలి. ఈ శీర్షికలలో వృద్ధుని ఔదార్యం ఎక్కడా ధ్వనించదు. శీర్షిక ఎప్పుడు అంశంలోని ప్రధాన విషయాన్ని ధ్వనించేదిగా ఉండాలి. గోరంత దీపాలు అనేది అనాథ బాలల దీనస్థితిని తెలియజేస్తోంది తప్ప ఇక దేనిని తెలియచేయటం లేదు. అంతేకాక ఆ గోరంతదీపాలకే కొండంత అండగా నిలబడి తీర్చిదిద్దిన త్యాగమూర్తిని పట్టించుకోలేదు. పెరిగి పెద్దయ్యాక ఆ గోరంత దీపాలే ఆ వృద్ధుని పాదాలకు కృతజ్ఞతతో కన్నీటి అభిషేకాలు చేసారు. ఇంతటి మహోన్నతమైన త్యాగనిరతిని బాధ్యతను, మానవత్వాన్ని, శీర్షిక విస్మరించడం విజ్ఞులను ఆశ్చర్యపరుస్తుంది. శీర్షికను చూచిన మరుక్షణం ఉత్తేజం కలగాలి. కథలోని ఆశయం తెలియాలి. దీనికి మానవత్వపు పరిమళం అనే శీర్షిక పెట్టి ఉంటే సార్థకత చేకూరి ఉండేది.
ప్రశ్న 2.
పాఠం చదవండి. “వేపచెట్టు” గురించి వివరించిన, వర్ణించిన వాక్యాలు ఏమేమి ఉన్నాయి? వాటిని గుర్తించి చదవండి.
జవాబు:
పాఠ్యాంశం మొదటి ఐదు వాక్యాలు వేపచెట్టుని వర్ణించాయి. వేపచెట్టును తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే చెట్టుగా వర్ణించారు. ఆ చెట్ల కొమ్మలను దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన అంతులేని ఆశల్లా అభివర్ణించారు. నాలుగు కొమ్మలు నాలుగు దిక్కుల్లా బాగా విస్తరించాయని చెప్పారు. కలిగిన వాడికి బాగా కండపట్టినట్లు ఆ కొమ్మలు పూతా పిందెలతో నిండుగా ఉన్నాయని వర్ణించారు.
మధ్యలో ఎక్కడా వేపచెట్టు వర్ణన లేదు. చివరి నుండి రెండవ పేరాలో వేపచెట్టు వర్ణన ఉంది. అది ఆ వృద్ధుడు వచ్చిన మనిషితో వేపచెట్టు గురించి చెప్పాడు. వేపచెట్టు అనగానే చేదు అనే భావన మనసులో మొదలవుతుంది. కానీ వేపచెట్టుని ఆశ్రయిస్తే చల్లని నీడ నిస్తుంది.
కనీసం ప్రతీరోజు ఒక వేపకాయని నమిలిన అనేక దీర్ఘరోగాలు తగ్గుతాయి. వేపపుల్లతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు, నోటి జబ్బులు రావు. (పిప్పిపళ్ళు) (పుచ్చుపళ్ళు) ఉండవు.
ప్రశ్న 3.
పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలలో వేటి గురించి వివరించారో తెల్పండి. ఆ పేరాల్లోని వివరణ/వర్ణనకు సంబంధించిన కీలక పదాలను రాయండి.
జవాబు:
ప్రశ్న 4.
క్రింది వాక్యాలు చదవండి. ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు?
అ) అవును బాబూ ! నిజంగా అతడు అదృష్టవంతుడే!
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.
సందర్భం :
తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని ఎప్పుడు వచ్చావని వృద్ధుడు అడిగితే అదృష్టవంతుడికి (వృద్ధుడికి) కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు అని అతను చెప్పిన సందర్భంలో తన పాదాలను కన్నీటితో అభిషేకం చేసిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని చెప్తున్న సందర్భంలోని వాక్యమిది.
భావం:
వృద్ధుని ఆశ్రయంలో చక్కగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన అనాథ చాలా అదృష్టవంతుడు అని వృద్ధుని భావం.
ఆ). “పెట్టమన్న చోటల్లా కండ్లు మూసుకొని సంతకాలు పెడుతున్నాను. అనాథలయిన పిల్లలు, వాళ్ళ అధోగతికి దారితీస్తే పుట్టగతులుండవు” ఇది మాత్రం మనసులో పెట్టుకోండి !”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.
సందర్భం :
తన గుమాస్తా తెచ్చిన చిట్టా పుస్తకంలో వృద్ధుడు సంతకాలు పెడుతూ, అతనితో మాట్లాడిన మాటలివి.
భావం:
అనాథ బాలల ఆశ్రమ చిట్టా పుస్తకాలలో వృద్ధుడు పరిశీలించకుండా సంతకాలు పెడుతున్నాడు. ఆ అనాథ పిల్లలకు సంబంధించిన ఖర్చులు దానిలో ఉంటాయి. ఆ లెక్కలలో తేడాపాడాలుంటే మహాపాపం. అందుచేత పాపభీతితో పనిచేయాలి అని వృద్ధుని మాటల సారాంశం.
ఇ) “అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు!”
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.
సందర్భం :
కథా రచయితను వృద్ధుడు ఎప్పుడు వచ్చావు బాబు, అని అడిగినపుడు రచయిత చెప్పిన సమాధానమిది.
భావం:
అనాథను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి అతని జీవితంలో కొండంత వెలుగును నింపి అతని కృతజ్ఞతకు పాత్రుడైన వృద్ధునికి అతడు కన్నీటితో నమస్కరించాడు అని భావం.
ఈ) “మీరెక్కడున్నా, నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మహా అదృష్టంగా భావిస్తాను”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.
సందర్భం :
వృద్ధుని ఆశ్రయంలో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొన్న వ్యక్తి బదిలీపై వేరే ఊరికి వెళుతూ 3 . వృద్ధుని పాదాలకు నమస్కరించి కృతజ్ఞతతో పలికిన వాక్యమిది.
భావం:
వృద్ధుడంటే ఆ వ్యక్తికి దైవంతో సమానం అని భావం.
ఉ) “అవి గోరంత దీపాలే కావచ్చు. ఏనాటికో ఒక నాటికి, అవి కొండంత వెలుగునిస్తాయి”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.
సందర్భం :
కథకుని ప్రశ్నకు సమాధానంగా వృద్ధుడు పలికిన వాక్యమిది. అనాథలను, వీథి బాలలను, కొడిగట్టిన దీపాలతో, వేపచెట్టుతో పోల్చి చెప్పుచున్న సందర్భములోని వాక్యమిది.
భావం:
అనాథలైన బాలలు గోరంత దీపాల వంటివారు. వారిని ఆదరించి కాపాడితే ఉన్నతులై కొండంత వెలుగును ఇస్తారు.
ప్రశ్న 5.
పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
బతకడానికి ఉద్యోగం వెతుక్కుంటారు కొందరు. జీవితానికి అర్థం వెతుక్కుంటారు మరికొందరు ….. లక్ష్మీకాంతం రెండో కోవకు చెందుతారు. ఒక బిడ్డ కన్నీరు తుడవడమే భాగ్యం. ఒక బిడ్డకు తల్లి కావడం ఇంకా భాగ్యం. అలాంటిది లక్ష్మీకాంతం అరవై ఎనిమిది మంది అనాథలకు అమ్మలా మారారు. వాళ్ళకు కంటిపాప అయ్యారు. పైపైన చేస్తే ఉద్యోగం అవుతుంది. హృదయంలో నుంచి చేస్తే మానవత్వం అవుతుంది. లక్ష్మీకాంతం మానవీయ మూర్తి. వీధి బాలలుగా ముద్రపడిన అనాథలకు విశాఖ వాకిట నేడొక అమృతహస్తం దొరికింది. కన్నతల్లి ఒడి దక్కినట్టయింది. వీళ్ళ జీవితాలకు అండగా నేనుంటానంటూ పోడూరి లక్ష్మీకాంతం ముందుకు వచ్చింది. మాటలు కాదు – గత పదేళ్ళుగా ఆప్యాయతానురాగాలను చేతల్లో చూపుతోంది. అరవై ఎనిమిది మంది వీధి బాలల (స్ట్రీట్ చిల్డ్రన్) కు అమ్మగా
అవతరించింది. కన్నబిడ్డల కంటే వీధి బాలలనే ఎక్కువగా చూసుకుంది.
ప్రశ్నలు:
అ) పై పేరా దేని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
పోడూరి లక్ష్మీకాంతం గారి ఔదార్యం గురించి తెలియజేస్తోంది. అనాథ బాలలను ఆమె ఆదుకొంటున్న విధానం గూర్చి తెలియజేస్తోంది.
ఆ) పై పేరాలోని కీలకపదాలను ఏరి రాయండి.
జవాబు:
(గమనిక : కీలకపదాలు అంటే ముఖ్యమైన పదాలు. పేరాలోని విషయం సూటిగా తెలియజేసే పదాలు అని గ్రహించండి.)
ఉద్యోగం వెతుక్కోవడం, అర్థం వెతుక్కోవడం, రెండో కోవ, కన్నీరు తుడవడం, తల్లి కావడం, అనాథ, కంటి పాప, మానవత్వం, మానవీయమూర్తి, వీధి బాలలు, ముద్రపడడం, అమృతహస్తం, తల్లి ఒడి, అండ, ఆప్యాయతానురాగాలు, అవతరించడం, కన్నబిడ్డలు.
ఇ) ‘అమృతహస్తం’ అనే పదానికి అర్థమేమిటి?
జవాబు:
‘అమృతం’ బాధలను రూపుమాపుతుంది. అలాగే అమృతం లాంటి చెయ్యిగల వారు అంటే పదిమందికి సహాయం చేసేవారు అని అర్థం. ఇతరుల కష్టాలను నివారించి, ఆదుకొనే వారని అర్థం.
ప్రశ్న 6.
పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వృద్ధుడి వద్దకు వచ్చిన కుర్రాడు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? రచయిత అతని ప్రవర్తనను ఏఏ వాక్యాలతో వివరించాడు.
జవాబు:
వృద్ధుని వద్దకు వచ్చిన కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతను నిలబడటంలో వినయం ఉట్టిపడుతోంది. అతని వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
ఆ కుర్రవాడు వినయానికి మారుపేరుగా ఉన్నాడు. సంస్కారవంతంగా ప్రవర్తించాడు. వృద్ధుడు ఆశీర్వదిస్తుంటే కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. అతనికి ఆనంద భాష్పాలు వచ్చాయి. వృద్ధుని పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. పైకి లేచి మళ్ళీ నమస్కరించాడు. అలా నమస్కరిస్తూనే నాలుగు అడుగులు వెనక్కు వేసి, శిరసువంచి నమస్కరించి హుందాగా వెళ్ళి పోయాడు. ఈ ప్రవర్తనను బట్టి ఆ కుర్రవాడు కృతజ్ఞత కలవాడని తెలుస్తోంది. ఆదర్శవంతమైన ప్రవర్తన కలవాడు. ఉపకారం పొందినవారెవరయినా, ఉపకారం చేసిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలో ఆ కుర్రవాని ప్రవర్తన బట్టి తెలుసుకోవచ్చును.
రచయిత అతని ప్రవర్తనను చక్కటి పదాలతో భావస్పూరకంగా వర్ణించాడు. ఆ కుర్రవాడు నిలబడి ఉండడంలో వినయం ఉట్టిపడుతూ ఉంది. వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది అని వర్ణించాడు. అతని కనుకొలుకుల్లో నిలచిన నీళ్ళు సంజెవెలుగులో ముత్యాలలా మెరుస్తున్నాయి. అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావం అతని ముఖంలో దోబూచులాడుతూ ఉంది. ఆనందానుభూతిలో తడుస్తూ మూగబోయాడు. తనివితీరనట్లు మళ్ళీ ఒకసారి ఆ కుర్రవాడు అతని పాదాలను ఒడిసిపట్టుకున్నాడు. పాదాల మీద తలను ఆనించాడు. కన్నీటితోనే అతని పాదాలను కడుగుతున్నాడేమో అనే వాక్యాలతో అతని ప్రవర్తనను వివరించాడు.
కన్నీటితో నిండిన కండ్లను జేబురుమాలుతో వత్తుకున్నాడు. మళ్ళీ ఒకసారి రెండు చేతులు జోడించాడు. జోడించిన చేతులు జోడించుకున్నట్లే ఉంచుకుని అలాగే నాలుగు అడుగులు వెనక్కు వేశాడు. అక్కడ నిలబడి మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి నమస్కరించాడు. గిరుక్కున వెనక్కు తిరిగి హుందాగా ముందుకు సాగిపోతున్నాడనే వాక్యాలతో అతని ప్రవర్తనను వర్ణించాడు.
ఆ) విద్యానగరం ఒక విద్యాలయం కదా! దాని ఆవరణ, వాతావరణం ఎలా ఉంది?
జవాబు:
విద్యానగరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అది దాదాపు రెండు, మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడ ఒక వేపచెట్టు, అంత కంటే పెద్దవైన రావి చెట్లున్నాయి. మట్టిమానులున్నాయి. జువ్వి చెట్లున్నాయి. రకరకాల పూల మొక్కలున్నాయి. కూరల తోటలున్నాయి. పాలపిట్టలు పరవశంగా పాడుకొంటుంటాయి.
ఆ ఆవరణలో బాలబాలికలకు వసతి గృహాలున్నాయి. అతిథులకు ప్రత్యేక సదుపాయాలతో గదులున్నాయి. వయోవృద్ధులకు వసతులు ఉన్నాయి. గ్రంథాలయం ఉంది. సాయంసమయాలలో పూజకు ప్రార్థనాలయం ఉంది. వేలాది మంది అనాథలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని వందలమంది ఉపాధ్యాయులు ఆ అనాథలకు విద్య నేర్పుతున్నారు.
ఇ) వృద్దుడు చేస్తున్న సేవాకార్యక్రమం గురించి లోకం ఏమనుకునేది ? దానికి వృద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది?
జవాబు:
పరులకు సేవ చేస్తున్నాననే పేరుతో స్వార్థం పెంచుకొన్న మనిషిగా వృద్ధుడిని లోకం నిందించింది, నోరు లేని పిల్లలకు అర్థాకలిగా అన్నం పెడుతున్నాడు. వాళ్ళ నోళ్ళు కొడుతున్నాడని కూడా ఆడిపోసుకొంది.
అయినా వృద్దుడు పట్టించుకోలేదు. పుండు మీద మాత్రమే కారం చల్లినా, ఉప్పు చల్లినా మంట పుడుతుంది. పుండ్లులేని దేహానికి మండదు కదా ! అలాగే తప్పు చేస్తుంటే లోకం అనే మాటలకు బాధపడాలి. తన తప్పేమీలేనపుడు ఆ మాటలు గాలిలో కలిసి పోతాయి. కాబట్టి లోకానికి భయపడి, మంచి లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచి పెడితే అది చేతగానితనమే అవుతుంది.
ఈ) వారపత్రికలో చదివిన కథ ఏమిటి?
జవాబు:
వృద్ధుడు చదివిన కథలో దొరైరాజ్ పదేండ్ల కుర్రవాడు. అతడు రైలు పెట్టెలు తుడుస్తాడు. ప్రయాణీకులు దయతలచి ఇచ్చిన డబ్బులతో జీవితం గడుపుతాడు. ఇచ్చిన వారికి నమస్కారం చేస్తాడు. ఇవ్వకపోతే పట్టించుకోడు. అలాగే ఒక వ్యక్తి ముందు చేయి ఊపుతాడు. ఆ వ్యక్తి, దొరైరాజ్ ను ఆప్యాయంగా దగ్గరికి పిలుస్తాడు. పేరు అడుగుతాడు. నిర్లక్ష్యంగా తన పేరు చెబుతాడు దొరైరాజ్, చేతిలో చిల్లర పైసల్ని ఎగరేసుకొంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న దొరైరాజ్ న్ను చూసి, ఆలోచనలో పడతాడు ఆ వ్యక్తి. ఇది ఆ కథ, అంటే జీవితం గడవక పోయినా, గడిచినా ఎవరి ధోరణి వారిది. ఎవ్వరూ తమ ధోరణిని మార్చుకోరు. ఆప్యాయతలు, అనురాగాలతో పనిలేదు. తమ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టరు. అలాగ అనాథలైన పిల్లలను చేరదీయాలి. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని ఉన్నా ఆ అనాథలు రావాలి కదా! మారాలి కదా ! అవకాశాలు వినియోగించుకోవాలి కదా !
ఉ) రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడి గురించి వృద్ధుడు ఏం చేశాడు?
జవాబు:
రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడిని పరీక్షించాలనుకొన్నాడు. నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ పిల్లవానిని గమనించాడు. పనిలో శ్రద్ధను పరిశీలించాడు. ఆనందించాడు. ఐదు రూపాయిల కాగితం జారవిడిచాడు. దానిని ఆ కుర్రవాడు ఆ కాగితాన్ని తీసి, వృద్ధుని లేపి ఇచ్చేశాడు. అతని నిజాయితీ వృదుని ఆనంద సంభ్రమాలలో ముంచింది. ఒక పావలా ఇచ్చాడు. ఆ కుర్రవాడు అది అందుకొని, నమస్కరించాడు. తర్వాత తన పనిలో లీనమయ్యాడు. తర్వాత ఆ పిల్లవానిని పిలిచి, కుశలప్రశ్నలు వేశాడు. తనతో రమ్మన్నాడు. ఆలనాపాలనా చూశాడు. చదువు చెప్పించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. వాడు జీవితంలో స్థిరపడ్డాడు.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “గోరంత దీపం” కథానిక ద్వారా మీరు గ్రహించిన ముఖ్యమైన ఐదు విషయాలు రాయండి.
జవాబు:
గోరంత దీపం కథానికలో వృద్ధుని ద్వారా అనాథలను అక్కున చేర్చుకొని, ఆదుకోవాలి అని తెలుసుకొన్నాము. ఆదుకొంటే ఆ గోరంత దీపాలే సమాజానికి కొండంత వెలుగునిస్తాయి అని తెలుసుకొన్నాము. కుర్రవాని పాత్ర ద్వారా, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలి అని తెలుసుకొన్నాం. మనకు ఉపకారం చేసిన వారిపట్ల కృతజ్ఞతతో ఉండాలి అని తెలుసుకొన్నాం. పెద్దలతో స్నేహంగా ఉండాలి. వారి అనుభవాలను వినాలి, వారు చెప్పే విషయాలు విని, ఆచరిస్తే జీవితంలో ఉన్నతులుగా గుర్తించబడతామని తెలుసుకొన్నాం, వేపచెట్టులోని ఔషధ గుణాలు కూడా తెలిసాయి.
ఆ) “ఆ కుర్రవాడి బతుకుమీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను.” అన్న వృద్ధుడు ఏం ప్రయత్నం చేశాడు? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
వృద్ధుడు రైలు పెట్టెలోని అనాథబాలుని గమనించాడు. అతనికి పనిపై ఉన్న శ్రద్ధను గమనించాడు. తను చదివిన కథ దీనికి బలం చేకూర్చింది, ఆ పిల్లవాడి నిజాయితీ పరీక్షించాలనుకొన్నాడు. ఐదు రూపాయిలనోటు జారవిడిచి, నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ కుర్రవాడు ఆ నోటును తీసి, వృద్ధుని నిద్రలేపి ఇచ్చేశాడు. కుర్రవాడికి ఒక పావలా ఇచ్చాడు. నమస్కరించి, తనపనిలో లీనమయ్యాడు కుర్రవాడు.
అతనికి ఉన్న పనిపట్ల శ్రద్ధ, కష్టపడే స్వభావం, నిజాయితీ వృద్ధునికి నచ్చాయి, చేరదీసి చదివించాడు. కష్టపడి చదువుకొన్నాడు. మంచి ఉద్యోగి అయ్యాడు. ఆ బాలుడి జీవితం స్థిరపడింది. వృద్ధుని ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది.
ఇ) “బాబూ! ఈ వయస్సులో చదువుకొంటే, ఆ వయస్సులో సంపాదించుకోవచ్చు”ఈ వాక్యం గురించి మీ అభిప్రాయాల్ని రాయండి.
జవాబు:
ఎవరైనా చిన్నతనంలో చదువుకోవాలి. బాల్యం జీవితానికి పునాది వంటిది. బాల్యంలోని ప్రవర్తనను బట్టి ఆ మనిషి
జీవితం ఉంటుంది. బాల్యంలో బాగా చదువుకొంటే, మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. డబ్బు సంపాదించుకొని జీవిత మంతా సుఖపడవచ్చును. 100 సంవత్సరాల జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకొంటే మిగిలిన 80 సంవత్సరాలూ సుఖపడవచ్చు. మొదటి ఇరవై సంవత్సరాలు చదువుకోకుండా, డబ్బులు సంపాదించుకొంటూ సుఖపడితే, మిగిలిన 80 సంవత్సరాలూ కష్టపడాలి. అందుకే ‘పిల్లలు బడికి – పెద్దలు పనికి’, ‘పనికెందుకు తొందర ? చదువుకో
ముందర’ అని ప్రభుత్వం నినాదిస్తోంది.
ఈ) ‘ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే మన నేస్తాలు’ అనే వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు తప్పని సరిగా పుస్తకాలే మన నేస్తాలు అనే వాక్యంతో ఎవరైనా ఏకీభవించాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. వాటిలో చెడు ఆలోచనలు కూడా రావచ్చును. ఏదైనా పుస్తకం చదువుకొంటే అటువంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉండదు. సమయం కూడా తెలియదు. జ్ఞానం పెంపొందుతుంది. పుస్తకాలలో కూడా మంచి ఉన్నత విలువలతో కూడిన వాటిని మాత్రమే చదవాలి. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఒంటరితనం మరచిపోతాం. “ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం” అని ఆర్యోక్తి. అందుచేత పుస్తకాలే మన నేస్తాలుగా చేసుకొంటే, ప్రపంచమంతా మన కుటుంబమవుతుంది.
2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “గోరంతదీపాలు” కథానికలోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గమనిక :
ఏ పాత్ర స్వభావం రాయాలన్నా కథలోని ఆ పాత్ర ప్రవర్తన, మాటల తీరును గమనించాలి. ఆ విషయాన్నే సొంతమాటలలో రాయాలి.
వృద్ధుడు :
నేస్తాలు లేనపుడు పుస్తకాలే మన నేస్తాలని భావించే స్వభావం కలవాడు. కేవలం పుస్తకాలలో చదవడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టే స్వభావం కలవాడు. పరోపకారి. ముఖ్యంగా అనాథలను, వృద్ధులను ఆదరిస్తాడు, అతిథులను గౌరవిస్తాడు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తాడు. దైవభక్తి కలవాడు, నీతి నిజాయితీలు కలవారిని, నిబద్ధతతో, శ్రద్ధతో పనిచేసే వారిని ఇష్టపడతాడు. పచ్చటి ప్రకృతిలో జీవించడమంటే ఇష్టపడతాడు.
గొప్పతనం :
ఒక అనాథను పరీక్షించాడు. అతని నీతి నిజాయితీలను తెలుసుకొన్నాడు, పనిపట్ల శ్రద్ధను గమనించాడు, చదివించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. అతను స్థిరపడ్డాడు. అనాథలోని మంచి గుణాలను గుర్తించి, తీర్చిదిద్దిన మహోన్నతుడు, ఒక్కడినే కాదు వేలాది మంది బాలబాలికలను తీర్చిదిద్దాడు. వందల మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించిన మహానుభావుడు వృద్ధుడు.
ఆ) వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? వారి మధ్య ఉన్న సంబంధాన్ని, అనురాగాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
‘గోరంతదీపం’ కథానిక ద్వారా వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో విశ్లేషిస్తూ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
వృద్ధునికి, యువకునికి మధ్య ఉన్న సంబంధం తల్లీ పిల్లల అనుబంధం కంటె గొప్పది. తండ్రీ తనయుల సంబంధం కంటే మిన్న, భగవంతునికి భక్తునికీ మధ్య ఉన్న సంబంధం వంటిది అని చెప్పవచ్చును. ఇద్దరు సత్పురుషుల మధ్య సంబంధం ఏర్పడితే అలాగే ఉంటుంది.
ప్రయోజకుడైన యువకుడు వృద్ధుని వద్ద నిలబడిన తీరు, అతని వేషం గమనిస్తే ఇది బోధపడుతుంది. భగవంతుడు ప్రత్యక్షమైతే, భక్తుడు ఎంత పరవశిస్తాడో అంతగా పరవశించాడు వృద్ధుని చూసిన యువకుడు. ఆ వృద్ధుని పాదాలకు కన్నీటితో అభిషేకం చేసిన తీరును గమనిస్తే అతనికి గల గౌరవభావన తెలుస్తుంది. అతనిని ఆశీర్వదిస్తున్న వృద్ధుని కళ్ళలోని ఆనందభాష్పాలు చూస్తే అతని పట్ల గల వాత్సల్యం తెలుస్తుంది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వృద్ధుడికి తనకంటే కూడా ఆ కుర్రవాడంటేనే ఇష్టం. అలాగే ఆ కుర్రవానికీ, వారిద్దరి అనురాగాన్ని గమనిస్తే ఒకే ప్రాణం రెండు శరీరాలలో ఉందేమో అనిపిస్తుంది.
ఇద్దరూ అదృష్టవంతులే. అనాథ కుర్రవాడు అదృష్టవంతుడు కనుకనే వృద్ధుడు రైలు పెట్టెలో కనిపించాడు. చేరదీశాడు, ఆలనాపాలనా చూశాడు, చదువు చెప్పించాడు, పెండ్లి చేశాడు. ఉద్యోగం సంపాదించుకొందుకు దారి చూపాడు. ఎటో పోవలసిన జీవితం గౌరవంగా స్థిరపడింది.
వృద్ధుడు కూడా అదృష్టవంతుడే తన అంచనా తప్పు కాలేదు. తను పడిన శ్రమ ఫలించింది. అతని జీవితం బాగుపడింది. ప్రయోజకుడయ్యాక కూడా తనపట్ల కృతజ్ఞతతో ఉన్నాడు. జీవితాంతం ఉంటాడు. అటువంటి భక్తిప్రపత్తులు కలవాడు దొరకడం వృద్ధుని అదృష్టం.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ‘విద్యాలయం’ ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా! దీని ఆధారంగా, మీరు మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణించి రాయండి.
జవాబు:
పాఠశాల : మా పాఠశాల చాలా బాగుంటుంది. మా పాఠశాల సరస్వతీ మాత నిలయం. మా పాఠశాల ఆవరణచుట్టూ పచ్చటి చెట్లతో నిండి ఉంటుంది. పూల మొక్కలు వరుసలలో ఉంటాయి. క్రోటన్సు మొక్కలు పూల మొక్కలకు రక్షక భటులుగా ఉంటాయి. రకరకాల పళ్ళనిచ్చే చెట్లు కూడా ఉన్నాయి. దానిమ్మ, జామ, కమలా, బత్తాయి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు కూడా ఉన్నాయి.
మా పాఠశాలలో 20 తరగతి గదులున్నాయి. అన్ని గదులూ అందంగా అలకరించి ఉంటాయి. మచ్చుకైనా ఎక్కడా చెత్త కనబడదు. తరగతి గదులలోని గోడలకు పిల్లలు వేసిన బొమ్మల చార్టులు, కవితలు, కథల చార్టులు ఉంటాయి. మా పాఠశాల గోడ పత్రికలలో రోజూ ఏవేవో కథలూ, కవితలూ, కార్టూన్లూ, సూక్తులూ వచ్చి చేరుతుంటాయి. మా ఉపాధ్యాయులు జ్ఞాన జ్యోతులు. చిరునవ్వుతో పాఠాలు చెబుతారు. కథలు కూడా చెబుతారు. ఎన్నో మంచి విషయాలు చెబుతారు. మమ్మల్ని చెప్పమంటారు. ఆలోచించమంటారు.
మా పాఠశాల ఆటస్థలం 500 చదరపు గజాలు ఉంటుంది. అన్ని రకాల ఆటలు ఆడతాము. అనేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. పెద్ద గ్రంథాలయం కూడా ఉంది. 6 బీరువాల పుస్తకాలు ఉన్నాయి. నాకు మా పాఠశాల అంటే చాలా ఇష్టం.
పర్యాటక క్షేత్రం :
తిరుపతి మంచి పర్యాటక క్షేత్రం. ఎంతో మంది భక్తులు రోజూ తిరుమలకు వస్తారు. తిరుమల కొండ నడిచి ఎక్కేటపుడు చాలా బాగుంటుంది. ఎంత దూరం నడిచినా తరగదు. కొండదారి, చుట్టూ అడవి. జింకలు కనబడతాయి. అవి భలే గంతులువేస్తూ పరుగెడతాయి. మోకాటి పర్వతం మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. ఆకాశంలో చందమామలాగా ఎక్కడో పైన గోవిందనామాలు కనిపిస్తుంటాయి. చుట్టూ అడవులలో దట్టమైన పొదలు, పెద్ద పెద్ద చెట్లు, తీగలు కనిపిస్తాయి. మా సైన్సు టీచర్లనడిగి వాటి పేర్లు, లక్షణాలు తెలుసుకొన్నాం. గుడిలోకి వెడితే శ్రమంతా మరచిపోతాం. అంత ప్రశాంతత. నాకైతే తిరుమల అంటే చాలా ఇష్టం. సువర్ణ ముఖీ నదిలో స్నానం చాలా బాగుంటుంది.
(గమనిక : విద్యార్థులు ఏ క్షేత్రాన్నినా వర్ణించవచ్చు. )
అ) పాఠంలో “దాదాపు రెండు, మూడు ……… పరవశంతో పాడుతున్నారు” పేరా చదవండి. దీనికి సంబంధించిన చిత్రం ీయండి. రంగులు వేయండి. కవిత రాయండి.
జవాబు:
(గమనిక : డ్రాయింగు మాష్టారు వద్ద చిత్రం నేర్చుకొని గీయాలి. రంగులు వేయాలి.)
కవిత :
విస్తీర్ణం చూడండి రెండు, మూడు చదరపు మైళ్ళూ
వేపచెట్టు, రావిచెట్లు, జవ్విచెట్లు, మర్రిచెట్లి పిట్టల లోగిళ్ళూ
పూల బాల పాదులలో కిలకిల లాడాలి
కూరల సుకుమారం తోటలలో కలకలలాడాలి.
సంజవెలుగు కెంజాయకు బంగారం తళతళలూ
అనుభూతుల హృదయాలకు అనురాగపు స్నానాలూ
నక్కినక్కి చక్కనైన చిలకమ్మా, కోకిలమ్మా
పాలపిట్ట, పరవశించి పాటలందుకొన్నాయి.
భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా కథల పుస్తకం నుంచి గాని లేదా ఏదైనా పత్రిక నుంచి గాని సామాజిక సేవ, మానవ సంబంధాలు, గురుశిష్య సంబంధం మొదలైన విషయాలకు సంబంధించిన మంచి కథను చదివి ఎంపిక చేయండి. దాన్ని రాసి ప్రదర్శించండి. అది మీకు ఎందుకు నచ్చిందో, దాంట్లోని గొప్పతనమేమిటో నివేదిక రాయండి.
జవాబు:
(గమనిక : కనీసం 10 వాక్యాలలో రాస్తే చాలును)
III. భాషాంశాలు
పదజాలం
1) ఈ కింద ఇచ్చిన రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) వినయం – విధేయత
జవాబు:
సొంతవాక్యం : వినయం – విధేయత నేర్పని చదువుల వలన ప్రయోజనం లేదు.
ఆ) రాజు – మకుటం
జవాబు:
సొంతవాక్యం : ధరణికి వెలుగు రాజు – మకుటం కాంతిని బట్టి ఉంటుంది.
ఇ) ప్రదేశం – ప్రశాంతత
జవాబు:
సొంతవాక్యం : నివాస ప్రదేశం – ప్రశాంతత కలిగినదైతే అన్ని సౌఖ్యాలూ ఉన్నట్లే.
ఈ) గుడిసె – దీపం
జవాబు:
సొంతవాక్యం : కనీసం గుడిసె – దీపం లేని బతుకులెన్నో దేశంలో ఉన్నాయి.
ఉ) ప్రయాణం – సౌకర్యం
జవాబు:
సొంతవాక్యం : ఈ రోజులలో ప్రయాణం – సౌకర్యంలేని ఊరులేదు.
2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : సంజవెలుగులో తటాకంలోని నీరు కొత్త అందం సంతరించుకుంది.
సంజవెలుగు = సంధ్యా సమయంలో వెలువడే కాంతి.
అ) నా పుట్టిన రోజున మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాను.
జవాబు:
ఆశీర్వాదం : దీవెన
ఆ) రాజు ప్రకృతి అందాల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు.
జవాబు:
తదేకంగా = అది ఒకటే (పని) అన్నట్లుగా
ఇ) శివ పుస్తకాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు.
జవాబు:
కాలక్షేపం – సమయం గడపడం
ఈ) రాణి ముఖం నిండా పసుపు పులుముకుంది.
జవాబు:
పులుము = పూసు
ఉ) లత పాఠాన్ని చక్కగా ఆకళింపు చేసుకొంది.
జవాబు:
ఆకళింపు. – అవగాహన
3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు
ఆ) సమయం – బుద్ధి, సంకేతము, ప్రతిజ్ఞ
ఇ) కృషి – స్త్రీ, సేద్యము, కరిసనము
ఈ) కన్ను ‘ – ఏరు, వలిపము, తీరు
ఉ) కొమ్మ – శాఖ, ఆడుది, కోటకొమ్మ
ఊ) ఆశ – దిక్కు కోరిక
4. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) పక్షి – నీడజము, ద్విజము, పతగము
ఆ) నేత్రం – అక్షి, చక్షువు, నయనం
ఇ) శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకము
ఈ) సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు
ఉ) చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షము
ఊ) కొండ – అచలము, శైల్యము, ఆహార్యము
5. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) అతిథి – తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనమునకు వచ్చువాడు.
ఆ) అక్షరం – నాశనము పొందనిది (వర్ణము)
ఇ) పక్షి – పక్షములు కలది (విహంగము)
ఈ) మౌని – మౌనము దాల్చియుండువాడు (ఋషి)
6. అనాథలను చేరదీసే సంస్థలను అనాథ శరణాలయాలు అంటారు కదా ! ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని రాయండి.
అ) పక్షులను రక్షించే సంస్థ :
జవాబు:
పక్షి సంరక్షణ కేంద్రం
ఆ) జంతువులను రక్షించే సంస్థ :
జవాబు:
జంతు ప్రదర్శనశాల
ఇ) వృద్ధులను చేరదీసే సంస్థ :
జవాబు:
వృద్ధాశ్రమం
ఈ) మనోవైకల్యం గలవాళ్ళకు చేయూతనిచ్చే సంస్థ :
జవాబు:
మనోపునర్వ్యవస్థీకరణ సంస్థ
ఉ) కుష్ఠురోగుల పునరావాస కేంద్రం :
జవాబు:
కుష్టువ్యాధి నిరోధక మరియు ఆరోగ్య సంస్థ
వ్యాకరణాంశాలు
1) కింది పదాల్లోని పుంప్వాదేశ సంధి, టుగాగమ సంధి, అత్వ సంధి, ద్విరుక్తటకార సంధుల పదాలను గుర్తించి, విడదీసి సూత్రాలను రాయండి.
సరసంపుమాట, కట్టెదుట, చింతాకు, తూగుటుయ్యేల, నట్టడవి, ముద్దుటుంగరము, మధురంపుకావ్యం, పల్లెటూరు, రామయ్య
పుంప్వాదేశ సంధి : 2
1) సరసము + మాట = సరసంపుమాట
2) మధురము + కావ్యం – మధురంపు కావ్యం
సూత్రం :
కర్మధారయము నందు “ము” వర్ణకములకు పుంపులగు.
టుగాగమ సంధి :
1) తూగు + ఉయ్యేల = తూగుటుయ్యేల
2) పల్లె + ఊరు = పల్లెటూరు
3) ముద్దు + ఉంగరము = ముద్దుటుంగరము
సూత్రం :
కర్మధారయములందు ఉత్తున కచ్చు పరమగునపుడు టుగాగమంబగు.
అత్వసంధి :
1) రామ + అయ్య = రామయ్య
2) చింత + ఆకు = చింతాకు
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.
ద్విరుక్తటకారాదేశ సంధి :
1) కడు + ఎదుట = కట్టెదుట
2) నడు + అడవి = నట్టడవి
సూత్రం :
కులు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఐ, డ లకు అచ్చు పరమగునపుడు ద్విరుక్తటకారంబగు.
సకార త వర్గం | శకార చ వర్గం |
స | శ |
త | చ |
థ | ఛ |
ద | జ |
ధ | ఝు |
న | ఞ |
శ్చుత్వ సంధి :
క్రింది ఉదాహరణలు పరిశీలించండి.
నిస్ + చింత = నిశ్చింత
సత్ + ఛాత్రుడు = సచ్చాత్రుడు
శరత్ + చంద్రికలు = శరచ్చంద్రికలు
జగత్ + జనని = జగజ్జనని
శార్జ్గిన్ + జయః – శార్జ్గియః
పై ఉదాహరణలలో మొదటి పదాల (నిస్, సత్, శరత్, జగత్, శార్జిన్) లో దాంతాలుగా ‘స’ కారం కాని, ‘త’ వర్గ కాని ఉంది. వాటికి ‘శ’ కారం కాని, ‘చ’ వర్గ (చ, ఛ, జ, ఝు, ఞ) కాని పరమైంది. శాంతి, ఛాత్రుడు, చంద్రిక, జనని, జయః లలో మొదటి అక్షరాలైన శ,చ,ఛ,జ పరమయ్యా యి. అప్పుడు వరుసగా “శ, ఛ, చ, జ, ఞ” లు ఆదేశమయ్యా యి కదా ! దీనిని సూత్రీకరిస్తే : ‘స’ కార ‘త’ వర్గ అక్షరాలకు ‘శ’ వర్ణ ‘చ’వర్గాలతో సంధి కలిస్తే ‘శ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.
అభ్యాసం:
సత్ + జనుడు = సజ్జనుడు
సత్ + చరిత్రము = సచ్చరిత్రము
సూత్రం :
‘స’ కార ‘త’ వర్గ అక్షరాల (త, థ, ద, ధ, న) కు ‘శ’ వర్ణ, ‘చ’ వర్గాక్షరాలతో సంధి కలిస్తే ‘శ’ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.
అదనపు సమాచారము
సంధులు
1) గ్రంథాలయం గ్రంథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
2) ప్రార్థనాలయం = ప్రార్థన + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
3) ఆనందానుభూతి = ఆనంద + అనుభూతి – సవర్ణదీర్ఘ సంధి
4) జీవితానుభవం = జీవిత + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి
5) పరహితార్థం = పరహిత + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
6) స్వార్థం = స్వ + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
7) వయోవృద్ధులు = వయః + వృద్ధులు – విసర్గ సంధి
8) అహరహం = అహః + అహం – విసర్గ సంధి (విసర్గ రేఫగా మారడం)
9) ఏమంటావు = ఏమి + అంటావు – ఇత్వ సంధి
10) ఏమనుకున్నావు = ఏమి + అనుకున్నావు – ఇత్వ సంధి
11) చేయెత్తి = చేయి + ఎత్తి – ఇత్వ సంధి
12) – కొండంత = కొండ + అంత – అత్వ సంధి
13) గొంతెత్తి = గొంతు + ఎత్తి – ఉత్వ సంధి –
14) పాదాలు = పాదము = లు – లులన సంధి
15) ముత్యాలు = ముత్యము + లు – లులన సంధి
16) అడ్డం పెట్టు = అడ్డము + పెట్టు – పడ్వాది సంధి
17) ఆశ్చర్యపడు = ఆశ్చర్యము + పడు – పడ్వాది సంధి
18) తదేకంగా = తత్ + ఏకంగా – జత్త్వ సంధి
19) భవిష్యజ్జీవితం = భవిష్యత్ + జీవితం – శ్చుత్వ సంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1) వేపచెట్టు | ‘వేము’ అనే పేరు గల చెట్టు | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
2) రావి చెట్టు | ‘రావి’ అనే పేరు గల చెట్టు | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
3) నాలుగుదిక్కులు | నాలుగైన దిక్కులు | ద్విగు సమాసం |
4) నాలుగు బారలు | నాలుగైన బారలు | ద్విగు సమాసం |
5) రెండు చేతులు | రెండైన చేతులు | ద్విగు సమాసం |
6) నాలుగడుగులు | నాలుగయిన అడుగులు | ద్విగు సమాసం |
7) ఏడు గంటలు | ఏడు సంఖ్య గల గంటలు | ద్విగు సమాసం |
8) రెండు రోజులు | రెండు సంఖ్య గల రోజులు | ద్విగు సమాసం |
9) నికృష్ట జీవితం | నికృష్టమైన జీవితం | విశేషణ పూర్వపద కర్మధారయం |
10) మహాయోగి | గొప్పవాడయిన యోగి | విశేషణ పూర్వపద కర్మధారయం |
11) మహా మెరుపు | గొప్పదయిన మెరుపు | విశేషణ పూర్వపద కర్మధారయం |
12) అరమోడ్పు కనులు | అరమోడ్పయిన కనులు | విశేషణ పూర్వపద కర్మధారయం |
13) చిరునవ్వు | చిన్నదయిన నవ్వు | విశేషణ పూర్వపద కర్మధారయం |
14) ముగ్గమనోహరం | ముగ్ధము, మనోహరము | విశేషణ ఉభయపద కర్మధారయం |
15) సంజ వెలుగు | సంజ యొక్క వెలుగు | షష్ఠీ తత్పురుష సమాసం |
16) గ్రంథాలయం | గ్రంథములకు ఆలయం | షష్ఠీ తత్పురుష సమాసం |
17) కనుల పండువు | కనులకు పండువు | షష్ఠీ తత్పురుష సమాసం |
18) మబ్బు తునకలు | మబ్బు యొక్క తునకలు | షష్ఠీ తత్పురుష సమాసం |
19) చేతి చలువ | చేతి యొక్క చలువ | షష్ఠీ తత్పురుష సమాసం |
20) జీవితానుభవం | జీవితమందలి అనుభవం | సప్తమీ తత్పురుష సమాసం |
21) వయోవృద్ధులు | వయస్సు చేత వృద్ధులు | తృతీయా తత్పురుష సమాసం |
22) ప్రార్థనాలయం | ప్రార్థన కొఱకు ఆలయం | చతుర్డీ తత్పురుషం |
23) అనిర్వచనీయం | నిర్వచనీయం కానిది | నఞ్ తత్పురుషం |
24) బాలబాలికలు | బాలురును, బాలికలును | ద్వంద్వ సమాసం |
25) నిమీలిత నేత్రుడు | నిమీలితములయిన నేత్రములు గలవాడు | బహువ్రీహి సమాసం |
ప్రకృతి – వికృతి
వేషము – వేసము
ఆశ – ఆస
ముఖం – మొగం
సంధ్య – సంజ
పుష్పము – పూవు, పువ్వు
దీపము – దివ్వె
సంధి – సంది
కథ – కత
మౌక్తికము – ముత్యము, ముత్తియము
భృంగారము – బంగారము
నిమిషము – నిముసము
పీఠము – పీట
శక్తి – సత్తి
భారము – బరువు
భంగము – బన్నము
స్నేహము – నెయ్యము
పేటిక – పెట్టె
పర్యాయపదాలు
1) చెట్టు : 1) వృక్షము 2) తరువు 3) మహీరుహము
2) ముత్యము : 1) మౌక్తికము 2) ముక్తాఫలము 3) ఆణి
3) కన్నీరు : 1) అశ్రువు 2) బాష్పము 3) అస్రము
4) కన్ను : 1) నేత్రము 2) నయనము 3) చక్షువు
5) ఓర్పు : 1) తాల్మి 2) సహనము 3) ఓరిమి
నానార్థాలు
1. ఆశ : కోరిక, దిక్కు
2. మాను : విడుచు, చెట్టు
3. పాదము : అడుగు, కాలు, పద్యపాదము, పాతిక
4. చిత్రము : చిత్తరువు, చమత్కారం, ఆట, ఆశ్చర్యము
5. సమయము : కాలము, శపథము, ఆజ్ఞ
6. కథ : కత, చెప్పడం, గౌరి
7. కద : దిక్కు, మరణము, ప్రక్క
8. అక్షరము : పరబ్రహ్మము, అక్కరము, నీరు, తపస్సు
రచయిత పరిచయం
కృష్ణారెడ్డి జననం :
పులికంటి కృష్ణారెడ్డి క్రీ.శ. 1931లో జన్మించారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలోని జక్కదన్న గ్రామం వీరి స్వగ్రామం. పులికంటి పాపమ్మ, గోవిందరెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ కుటుంబం. మధ్యతరగతి కుటుంబం.
పులికంటి నటజీవితం:
పులికంటి కృష్ణారెడ్డి మంచి నటుడు, బెల్లంకొండ రామదాసు రచించిన ‘పునర్జన్మ’ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంతో ఆయన నటజీవితం ప్రారంభమైనది. నటునిగా చాలామందిచేత ప్రశంస లందుకొన్నాడు. మంచినటుడే కాక మంచి రచయిత కూడా.
రచనా వ్యాసంగం :
పులికంటి కృష్ణారెడ్డి పేరు వినగానే గుర్తు వచ్చేది కథా సాహిత్యం . 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిన “గూడుకోసం గువ్వలు” ఆయన రచించిన మొదటి కథ. ‘నాలుగ్గాళ్ళ మండపం’ ఆయన మరో రచన. సుమారు 150 కథలు రచించారు.
అవీ – ఇవీ :
పులికంటి కృష్ణారెడ్డి మంచి బుర్రకథా కళాకారుడు. కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన అంశాల మీద సుమారు 100 బుర్రకథలను రచించాడు. వాటిని ప్రదర్శించి, అందరి మెప్పును పొందాడు. జనజీవనాన్ని ‘కళ్ళకు కట్టినట్టు రచనలు చేసిన దిట్ట. అంతేకాక, ఆయన జానపద కళాకారుడు, కవి. ప్రతిభాశాలియైన పులికంటి కృష్ణారెడ్డి గారు క్రీ.శ. 2007లో స్వర్గస్తులైనారు.
కఠిన పదాలకు అర్థాలు
బోదె = ప్రకాండము
కండ = మాంసము
కృతజ్ఞత = చేసిన మేలు మరచిపోకపోవడం
కనుకొలుకులు = కనుల చివరలు
యోగి = యోగాభ్యాసం చేయువాడు
మైలపరచడం = అశుచి చేయడం
బార = రెండుచేతులు పొడవుగా చాచిన మధ్యదూరం
తటస్థస్థితి = ఎటూకాని స్థితి
ఒడిసి = నేర్పుతో
మేరువు = బంగారు పర్వతం, దీనిపై దేవతలు విహరిస్తారు
విస్తీర్ణం = వ్యాపించిన ప్రాంతం
సంజ = సంధ్య
పరవశం = పరాధీనం
జోడించడం = జతచేయడం
చేతులు జోడించడం = నమస్కరించడం
హుందా = దర్జా
అతిథి = తిథితో నిమిత్తం లేకుండా వచ్చేవాడు
సదుపాయం = సౌకర్యం నివాసం
వసతి = ఉండే చోటు
మకుటం = కిరీటం
మారుపేరు = మరొక పేరు
లీనము = కలసిపోవడం, తన్మయం కావడం
గోరంత = చిన్నది
నిర్వర్తించడం = చేయడం
కొండంత = చాలా ఎక్కువ
అనుభూతి = అనుభవం
తేలిపోవడం = లీనమవడం
చెవిని పడడం = వినబడడం
బిలబిలా = అతి త్వరితముగా
గుమి = సమూహం
తెగిన గాలిపటం = తాడు విడిచిన
బొంగరం = ఎవరూ పట్టించుకోని అనాథ
మనిషి = విద్వాంసుడు
అక్షరసత్యం = కచ్చితమైన నిజం
స్మృతి = జ్ఞాపకం
వడదెబ్బ = వేడి తాకిడి
గుడ్డివెలుగు = తక్కువ వెలుగు
బుడ్డి దీపం = చిన్న దీపం
ఓనమాలు = అక్షరమాల
ధ్యేయం = లక్ష్యం
అహరహం = ప్రతిరోజు, నిరంతరం
పరహితం = ఇతరులకు మంచి
స్వార్థం = తన గురించి
గాలిలో కలిసిపోవడం = నాశనమైపోవడం, మిగలక పోవడం
కాచి వడబోయడం = బాగా అవగాహన చేసుకోవడం
పరమసత్యం = కచ్చితమైన నిజం
గాలివాటం = గాలి వీలు
నిదర్శనం = ఉదాహరణ
పరామర్శ = చక్కగా విచారించుట
ఏకాగ్రత = ఒకే విషయంపై దృష్టి నిలపడం
అలోచించండి- చెప్పండి
ప్రశ్న 1.
తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
తల్లి ప్రేమ నిర్మలంగా ఉంటుంది. తల్లి, తన బిడ్డలకు తనకు ఉన్నదంతా పెట్టాలని కోరుకుంటుంది. బిడ్డలకు తన పాలను ఇచ్చి పెంచుతుంది. తన కడుపు కూడా కట్టుకొని, బిడ్డలకు పెడుతుంది. తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు.
ప్రశ్న 2.
వినయంతో నిలబడడం, వేషంలో సంస్కారం అంటే మీకేమర్థమైంది?
జవాబు:
వినయంతో నిలబడడంలో, ఎదుటి వ్యక్తి యందు, ఆ వ్యక్తికి గల గౌరవం, ప్రేమ, ఆదరం వెల్లడవుతాయి. వేషంలో సంస్కారం అంటే నిండుగా బట్టలు వేసుకోడం, చక్కగా నుదుట బొట్టు పెట్టుకొని మర్యాదస్తులు ధరించే దుస్తులు ధరించడం.
ప్రశ్న 3.
అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావాన్ని ఎవరి పట్ల, ఎందుకు ప్రదర్శిస్తారు?
జవాబు:
మన జీవితాన్ని మంచి దారిలో పెట్టినవారిపై కృతజ్ఞత ప్రదర్శిస్తాము. ఎదుటి వ్యక్తి తమకు చేసిన గొప్ప మేలునకు ప్రతిగా, ఆ వ్యక్తి యందు వ్యక్తులు కృతజ్ఞతను ప్రదర్శిస్తారు. మనకు ఉపకారం చేసిన వారికి కృతజ్ఞత చెప్పడం, వారి యందు పూజ్యభావం కలిగి యుండడం అన్నవి, మానవుని సంస్కారానికి గుర్తులు.
ప్రశ్న 4.
మీ బడి, మీ ఇల్లు ప్రశాంతతకు మారుపేరుగా ఉండా లంటే ఏం చేయాలి ? ఏం చేయకూడదు?
జవాబు:
బడిలో పిల్లలు అల్లరి చేయరాదు. క్రమశిక్షణతో మెలగాలి. పిల్లలు గురువుల యందు గౌరవం కలిగి ఉండాలి. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల యందు గౌరవాదరాలు కలిగి ఉండాలి. అల్లరి పనులు, కొంటె పనులు చేయకూడదు. ఇంట్లో టి.వి ధ్వనిని బాగా పెంచరాదు. కోపంతో పరుష వాక్యాలు మాట్లాడరాదు. అప్పుడు ఇల్లు, బడి కూడా ప్రశాంతంగా ఉంటాయి.
ప్రశ్న 5.
విద్యాలయావరణం కనులపండువుగా ఉంది కదా? మీ కంటికి కనులపండువుగా ఏమేమి గోచరిస్తాయి?
జవాబు:
1) పద్మాలతో నిండిన చెరువును చూసినపుడు.
2) మా చెల్లి మంచి అందమైన గౌను వేసుకొని నగలు పెట్టుకున్నప్పుడు.
3) ఆగస్టు 15వ తేదీకి పాఠశాలను రంగు రంగు కాగితాలతో అలంకరించినపుడు.
4) సినిమాలలో అందమైన పార్కులలో, నటీనటులు నాట్యాలు చేస్తున్నప్పుడు, నాకు కనులపండువుగా ఉంటుంది.
(గమనిక : గ్రామం, బడి, ఇల్లు మొ|| వాటి గురించి విద్యార్థులంతా సొంతంగా మాట్లాడాలి.)
ప్రశ్న 6.
పెద్దల మాటలు, జీవితానుభవాలు అక్షరసత్యాలు ఎందుకో వివరించండి.
జవాబు:
పెద్దలు ఏది మాట్లాడినా తమ అనుభవాల నుండో, తాము చదివిన గ్రంథాల నుండో ఉదాహరిస్తారు. అవి వారి జీవితాన్ని ప్రభావితం చేసినవై ఉంటాయి. అవి పిల్లలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ‘పెద్దలమాట – చద్దిమూట’ అన్నారు పెద్దలు. పెద్దల మాటలు విని, ఆచరిస్తే కష్టాలు దరిదాపులకు రావు. వారి జీవితానుభవాలు కూడా పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. అవి పిల్లల జీవితాలకు దిక్సూచిల వంటివి. పెద్దలు తమ జీవితానుభవాలను పిల్లలకు చెప్పాలి. అందువల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయి.
పరాకాష్ఠ = అత్యున్నత స్థితి
కుతూహలం = ఆత్రుత
వాయిదా = గడువు
గతాన్ని నెమరువేయడం = జరిగిన దానిని తలచుకోవడం
సందర్శనం = చూడడం
పుంగవము = ఎద్దు
పుంగవుడు = శ్రేష్ఠమైనవాడు
తలపు = ఆలోచన
ముగ్ధమనోహరం = అమాయకపు అందం
శ్రుతి = వినికిడి
నేస్తాలు = స్నేహితులు
అదిరిపడడం = భయపడడం
నివ్వెరపడు = ఆశ్చర్యపడడం
నిర్దాక్షిణ్యం = దయలేకపోవడం
పరధ్యానం = ఇతర ఆలోచన
నడివయస్సు = మధ్యవయస్సు (40-50 సం||లు)
పొదివి = జాగ్రత్తగా, అపురూపంగా
అథోగతి = హీనమైన స్థితి
పుట్టగతులుండవు = సర్వనాశనం
పొంతన = పోలిక
వేళకాని వేళ = అనువుకాని సమయం
మునుపు = పూర్వం
కుతూహలం = ఆత్రుత
నికృష్టం = అధమము
బుడతడు = చిన్నవాడు
నిర్లక్ష్యం = లక్ష్యం లేకపోవడం
ఉడాయించడం = పారిపోవడం
ధోరణి = విధానం
క్లుప్తం = సంక్షిప్తం, తగ్గించడం
ఏమరుపాటు = అకస్మాత్తుగా
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
సమయం, సందర్భం కలిసి రావడమంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
సమయం, సందర్భం కలిసి రావడమంటే, కాలమూ దానికి తగిన సంఘటన కలిసిరావడం. ఉదాహరణకు చదువుకొందుకు సరియైన సమయం ఉదయకాలం. ఉదయం 4 గంటల నుండి చదువుకొందుకు సరియైన సమయం. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏరకమైన అలజడులూ ఉండవు. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అటువంటి సమయంలో చదువు కొంటే చదువు బాగా వస్తుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి.
ఆ సమయంలో చదవాలంటే మెలుకువ రాదు. మెలుకువగా ఉండాలంటే కొంచెం కష్టం. కనుక ఉదయం 4 గంటలకు ఎవరైనా ప్రయాణమై వెడుతుంటే, ఎలాగూ నిద్రలేస్తాం. ఆ ప్రయాణ సందర్భంగా నిద్రలేస్తాం. కనుక మంచి సమయం, సందర్భం కలిసివచ్చాయి. అప్పుడు చదువుకోవడం మంచిది.
అలాగే, కంచి దైవదర్శనానికి వెడతాం. అది మంచి సమయం కనుక అక్కడ ఉన్న చూడదగిన ప్రదేశాలన్నీ చూస్తాం. దేవాలయాలు కూడా చూస్తాం. కంచిలో పట్టుబట్టలు నాణ్యమైనవి. చౌకగా దొరుకుతాయి. అంతదూరం వెళ్ళాం. పట్టుబట్టల దుకాణాలు చూశాం. ఆ సందర్భంలో నచ్చిన బట్టలు కూడా కొనుక్కొంటే సమయం, సందర్భం కలిసి వస్తాయి.
ప్రశ్న 2.
“తెలుగు వారికి తెలుగంటే బోలెడంత అభిమానం” దీన్ని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
ఎవరి భాషపైన వారికి అభిమానం ఉంటుంది. ఈ విషయంలో తమిళనాడు వారే ఆదర్శవంతులు. వారు తమిళానికి ఇచ్చినంత గౌరవం ఏ భాషకూ ఇవ్వరు. వారు సాధ్యమైనంత వరకు తమిళంలోనే మాట్లాడతారు.
తెలుగు వారికీ తెలుగంటే అభిమానమే కాని, అంతేకాదు, మన వారికి పరభాషా వ్యా మోహం ఎక్కువ. తెలుగులో మాట్లాడడం నామోషీగా భావిస్తారు. పరభాషలలో మాట్లాడడం గొప్పతనంగా భావిస్తారు. తెలుగులో కూడా పరభాషా పదాలను ఎక్కువగా చేర్చి, మాట్లాడతారు. అది కొంతమంది తెలుగువారి పద్దతి.
తెలుగంటే ఎడతెగని అభిమానం కలవారు కూడా చాలామంది ఉన్నారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కళాకారులు మొదలైనవారు. వారు తెలుగులోనే ఎంతో చమత్కారం కల పదాలు ప్రయోగిస్తూ చక్కగా మాట్లాడతారు. ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది. తెలుగులోని తియ్యదనం చవిచూస్తే జన్మ ధన్యమౌతుంది. తెలుగు పలుకుల వెలదికి తేనెచినుకుల చిలకరింపులకు మనసు పులకరిస్తుంది.
ప్రశ్న 3.
పిల్లలు ఎందుకోసం వచ్చి ఉంటారు? ఆయన వారితో ఏం మాట్లాడి ఉంటారు? ఊహించండి.
జవాబు:
పిల్లలు తమకు కావలసిన అవసరాలను ఆ వృద్ధునికి చెప్పాలని ఆయన దగ్గరికి వారు వచ్చి ఉంటారు. వారు తమకు పుస్తకాలు కావాలనో, వారు బడిలో ఫీజు కట్టాలనో, వారికి దుస్తులు కావాలనో ఆయనను అడిగి ఉంటారు.
ప్రశ్న 4.
కథల పుస్తకాలు లేదా ఇతర పుస్తకాల్లో బొమ్మలు ఎందుకు వేస్తారు?
జవాబు:
పుస్తకంలోని విషయం దేని గురించి ఉందో అట్లపై బొమ్మ చెబుతుంది. కథలోని విషయం కళ్ళకు కట్టినట్లు తెలియజెప్పడానికే బొమ్మలు వేస్తారు. బొమ్మను చూపి కథ ఊహించుకోవచ్చు. కాని, కథ పూర్తిగా అవగాహనకు రాదు. అదేమిటో తెలుసుకోవాలనే తపన బయలు దేరుతుంది. ఆ తపన తీరాలంటే ఆ కథ తెలియాలి. ఆ కథ తెలియాలంటే చదవాలి. అందుచేత బొమ్మ చూస్తే, అది ఆ కథను చదివిస్తుంది.
క్రింది తరగతులలోని పాఠ్యపుస్తకాలలోని బొమ్మలు కూడా మమ్మల్ని ఇదే విధంగా ప్రేరేపించాయి. పాఠ్యపుస్తకం చేతికి రాగానే బొమ్మలు చూసేవాళ్ళం. ఆ బొమ్మలను బట్టి కథ ఊహించుకొని, ఆ పాఠం చదివేసేవాళ్ళం. పద్యాలైతే అర్థంగావు, కాని పాఠాలంటే భలే ఇష్టం. బొమ్మలు లేని పుస్తకం అలంకారాలు లేని మనిషిలా ఉంటుంది. సరిగ్గా సర్దుకోని ఇల్లులా ఉంటుంది. ఒక లక్ష్యం లేని జీవితంలా ఉంటుంది. బొమ్మలు పుస్తకాలకి ప్రాణం.
ప్రశ్న 5.
వృద్ధుడిని ఆకట్టుకొన్న బొమ్మ ఏమిటి? ఆ బొమ్మను చూసి ఎలాంటి అనుభూతిని పొందాడు?
జవాబు:
వృద్ధుడిని ఆకట్టుకొన్నది. రైలు పెట్టెలో యాచిస్తున్న కుర్రవాడి బొమ్మ, ఆ బొమ్మలోని కుర్రవాడిని చూడగానే రైలు పెట్టె తుడుస్తున్న కుర్రవాడిని తీసుకొనివచ్చి, చదివించి, ప్రయోజకుడిని చేయాలి అనిపించింది. అప్పుడు తన ఎదుట ఆ బొమ్మలోని కుర్రవాని వలె అనాథగా నిలుచున్నవాడే ఈ రోజు సంఘంలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకొంటూ బ్రతుకుతున్నాడు.
చాలామంది కథలలోను, నవలలలోనూ ఆదర్శ వంతమైన ఊహలు రాస్తారు. ఉపన్యాసాలలో కూడా ఆదర్శవంతమైన మాటలు చెబుతారు. కాని, ఆచరణలో శూన్యం. కొందరు మాత్రం ఆ కథలు విని, ఉపన్యాసాలు విని అలా చేస్తారు. కాని, ఈ వృద్దుడు చేసిన ఆదర్శ వంతమైన పనికి మూలం కథ. అందుచేత వృద్ధుడు తాను చేసిన పనికి చాలా ఆనందానుభూతిని పొందాడు. మాటలలో వర్ణించలేనంత సంతృప్తిని పొందాడు.
ప్రశ్న 6.
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ ఏమై ఉంటుంది?
జవాబు:
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ బహుశః “రైలు పెట్టెల్లో చిక్కుకొన్న అనాథ బ్రతుకు” అనే కథ అయి ఉండవచ్చు.
స్వభావం = తనయొక్క భావం
తటాలున = అకస్మాత్తుగా
ఇంటివాడవ్వడం = పెళ్ళి చేసుకోవడం
గాద్గదికం = బొంగురు
పూడుకపోవడం = మూసుకొనిపోవడం
దీర్ఘవ్యాధి = చాలాకాలం ఉండే వ్యాధి
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ణ జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనదే. ఎందుకంటే గృహహింస తట్టుకోలేక చాలామంది బాలలు ఇళ్ళలో నుండి పారిపోతారు. పిల్లల అభిప్రాయాలను పెద్దలు పట్టించుకోకపోయినా, వారికి ఇష్టంలేని పనులు చేయమని బలవంత పెట్టినా, కోప్పడినా పిల్లలు పారిపోతారు. తర్వాత వారు ఏ ముఠాలకో దొరుకుతారు. వారు, రైలు పెట్టెలు తుడిచే పనులు, భిక్షాటన, దొంగతనాలు మొదలైన వాటిలో ప్రవేశపెడతారు. ఇక ఆ పిల్లల జీవితాలు నికృష్టంగా తయారౌతాయి. తల్లి తండ్రులెవరో తెలియని అనాథ పిల్లల జీవితాలు కూడా ఇంతే, కొంతమంది పిల్లలను దొంగలు ఎత్తుకొనిపోయి కూడా ఇలాంటి పనులు చేయిస్తారు. అందుచేత వృద్ధుడి భావన సరైనది. సరైనది కాదు : రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనది కాదు. ఎందుకంటే తను సుదీర్ఘమైన జీవితాన్ని చూసినవాడు, అనుభవం గడించిన వాడు. ఆ పిల్లలు అలాగ తయారు కావటానికి కారణం పెద్దలే. తమ పిల్లలను అపు రూపంగా చూసుకొంటే ఇలాంటి పరిస్థితులు రావు. దుర్వ్యసనాల పాలైన పెద్దలు పెట్టే బాధలను పిల్లలు భరించలేరు. కనీసం సమాజంలోని వాళ్ళు ఆ పిల్లలను పట్టించుకొని ఇళ్ళకు చేరిస్తే ఈ బాధలుండవు. కౌన్సిలింగ్ ద్వారా పిల్లల పెంపకంపై అవగాహన కలిగించాలి. లేదా చట్టప్రకారం చర్యలు తీసుకొనేలా చేయాలి. అన్నిటిపైనా అవగాహన గల ఆ వృద్ధుడు చేతగానివాడిలా బాధపడడం సమర్థనీయం కాదు. (సూచన : పై వానిలో ఒక అభిప్రాయమే గ్రహించాలి.
రెండూ గ్రహించకూడదు.)
ప్రశ్న 2.
“ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగు తుంది” దీంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
ఏ ప్రయత్నమూ లేకుండా కలిగే ఫలితం ఆనందం కలిగించదు. కష్టపడి పనిచేసి ఫలితాన్ని పొందితే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరో చేసిన ప్రయత్నానికి ఫలితాన్ని మనం అనుభవించడమే దోపిడి అంటే అది మోసం, దగా, నయవంచన. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. దానిలో కష్టాలు ఎదురుకావచ్చును. నష్టాలు రావచ్చును. బాధలు కలగవచ్చును. శ్రమ కలగవచ్చు. కొన్ని మాటలు కూడా పడవలసిరావచ్చును. కాని, ఫలితం అందుకోగానే అవన్నీ మరచిపోతాం. చాలా ఆనందం పొందుతాం. చాలా సంతృప్తి కలుగుతుంది. చాలా గర్వంగా ఉంటుంది. ఉప్పొంగి పోతాం. పడిన శ్రమంతా మరచిపోతాం. గంతులు వేస్తాం, ఇంత హడావుడికి కారణం? మన ప్రయత్నంతో సాధించుకోవడం. అందుకే దేనినైనా సాధించుకోవాలి తప్ప దక్కించుకోకూడదు. యాచించకూడదు.
ప్రశ్న 3.
అందరు పిల్లలూ తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి కదా ! మరి అలా ఎందుకు జరగడం లేదు?
జవాబు:
మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. బీదల సంఖ్య ఎక్కువ. చిన్న చిన్న వృత్తులతో పొట్టపోసుకొనేవారు చాలామంది ఉన్నారు. కుటుంబంలోని వారంతా కష్టపడి డబ్బు సంపాదించకపోతే రోజు గడవదు. అందుచేత పిల్లలను కూడా డబ్బు కోసం పనులకు పంపుతారు. సంపాదనలో పెడతారు. సంచార జాతులవారు తమ పిల్లలను తమ కూడా తిప్పుకొంటారు. అందుచేత వారి పిల్లలు కూడా బడులకు రాలేరు.
కొంతమంది పిల్లలు మొండితనం, అల్లరి, అతిగారాబం వలన బడులకు వెళ్ళరు. వెళ్ళినా అక్కడ అందరితోటి కలవలేక బడి మానివేస్తారు. చిన్నతనం నుండీ పెద్దలు సరిగా పట్టించుకోక దురలవాట్లకు బానిసలౌతారు.
కొన్ని కుటుంబాలలోని ఆడపిల్లలకు చిన్నతనంలోనే వివాహాలు చేసేస్తారు. అది కూడా బాలల విద్యాభ్యాసానికి ఆటంకంగా ఉంది. నిరక్షరాస్యత, నిరక్షరాస్యులకు అక్షరాల విలువ తెలియదు. తమకు చదువు లేకపోయినా చక్కగా గడుస్తోంది కదా ! దేనికీ లోటులేదు. అలాగే తమ పిల్లలకూ గడుస్తుంది అనే ఆలోచన. ఎంత చదువు చదివినా ఉద్యోగాలు రావు. అంతకంటే పని నేర్చుకొంటే నయం అనే భావన కూడా కారణం. బాలలు తప్పనిసరిగా బడికి రావాలంటే వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించాలి.
ప్రశ్న 4.
“గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావడం” అంటే, మీకేమి అర్థమైంది ? ఇది ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది ? మీ అనుభవాలు తెల్పండి.
జవాబు:
కన్నుల వెంట నీరు రెండు సందర్భాల్లో వస్తుంది. దుఃఖం కలిగితే వస్తుంది. అలాకాక ఆనందం ఎక్కువగా వస్తే కన్నుల వెంట నీటి బిందువులు ముత్యాల్లా రాలుతాయి. వాటినే ఆనందబాష్పాలు అంటారు.
మనం ఊహించని మంచి మేలు జరిగితే, మనకు ఆనందబాష్పాలు వస్తాయి. అలాగే మనం విజయం సాధిస్తే ఆనందబాష్పాలు వస్తాయి.
నా అనుభవాలు :
- నాకు 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు వచ్చింది. అప్పుడు నాకు ఆనందబాష్పాలు వచ్చా యి.
- నాకు పాటల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ బహుమతి ఇచ్చే సందర్భంలో ఆనాడు పాఠశాలకు వచ్చిన ముఖ్యమంత్రి గారి ఎదుట నాచే ఆపాట పాడించారు. ఆ బహుమతిని నాకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చారు. ఆ సందర్భంలో నాకు ఆనందబాష్పాలు వచ్చాయి.
ప్రశ్న 5.
“ఒక వ్యక్తి బాధ్యతల్ని స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు చేరుతుందో ?” అనే ఆవేదన సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
వ్యక్తి బాధ్యతను సమాజం స్వీకరించాలి. ఒక వ్యక్తిని రక్షించి, తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వారు తమ బాధ్యతను విస్మరిస్తే, ఆ బాధ్యతను సమాజం స్వీకరించాలి. వారికి రక్షణ కల్పించాలి. వారికి విద్యాబుద్ధులు నేర్పాలి. అప్పుడు వారు ప్రయోజకు లౌతారు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారు. ఆ విధంగా ఆదుకొందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ధనవంతులు కొన్ని ‘ఆశ్రయ భవనాలను’ నిర్మించాలి. కొంతమంది ఉద్యోగులను కూడా నియమించాలి. అప్పుడే ఈ సమాజంలో అనాథలు, నిర్భాగ్యులు, నికృష్టజీవనులు ఉండరు. ముఖ్యంగా భావిభారత పౌరుల జీవితాలు ఆనందమయం అవుతాయి.
సరైనదికాదు :
పదిమంది వ్యక్తులు కలిస్తేనే సమాజం. అనేకమంది ఊహలకు రూపకల్పన సమాజం. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. రకరకాల అవసరాలు ఉన్నవారు ఉంటారు, అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎవరి బాధలు వారివి. ఎవరి ఆనందాలు వారివి. ఒకరికి బాధకలిగితే, సమాజం ఓదార్చాలి. ధైర్యం చెప్పాలి. సహాయం చేయాలి. వెన్నుదన్నుగా నిలబడాలి. కాని, బాధ్యతలను స్వీకరించకూడదు. అది బద్ధకాన్ని నేర్పుతుంది. ఎవరి పిల్లలను వారు పెంచుకోవాలి. తీర్చిదిద్దుకోవాలి. ఆర్థికంగా కాని, సామాజికంగా కాని సహాయం కావాలంటే సమాజం ఇవ్వాలి అంతేకాని, పిల్లలను పెంచే బాధ్యత కూడా సమాజమే స్వీకరిస్తే, వారు సోమరులుగా తయారౌతారు. పిల్లలను పట్టించుకోని పెద్దలను శిక్షించాలి. పిల్లల సంరక్షణకు చట్టాలు చేయాలి. కఠినంగా అమలుపరచాలి. అప్పుడే భావి భారతం ఆనందమయం అవుతుంది. పెద్దలకు బాధ్యత తెలుస్తుంది.
( గమనిక : పై వాటిలో ఏ అభిప్రాయమైనా చెప్ప వచ్చును. రెండూ చెప్పకూడదు.)