AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యుల పరిపాలనపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో ప్రప్రథమంగా ఒక నిర్దిష్టమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసింది మౌర్యులే. వీరి పాలనావిధానాన్ని తెలుసుకోవటానికి కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’, మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథం ముఖ్య ఆధారాలు.
1. కేంద్ర ప్రభుత్వం: మౌర్య పాలనావ్యవస్థలో చక్రవర్తి సర్వోన్నత అధికారి. అతడే ఉన్నత కార్యనిర్వహణాధికారి, శాసనాధికారి, న్యాయాధికారి కూడా. స్వధర్మాన్ని అమలుచేయటం, ప్రజల ప్రాణాలను కాపాడటం, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల ప్రగతికి కృషిచేయటం, న్యాయాన్ని పంచటం, విదేశీ వ్యవహారాల నిర్వహణ, సాహిత్య, లలితకళల పోషణ మొదలైన విషయాలను రాజు ఆచరించవలసిన ముఖ్య ధర్మాలుగా పరిగణించారు. మౌర్య చక్రవర్తులు నిరంకుశులైనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని పాలించారు. “ప్రజల సుఖమే తన సుఖంగా, వారి కష్టాలే తన కష్టాలుగా చక్రవర్తి భావించాలి” అని కౌటిల్యుడు చెప్పడాన్నిబట్టి మౌర్య చక్రవర్తి నియంతగా వ్యవహరించి ఉండకపోవచ్చునని భావించవచ్చు.

ఎ) మంత్రిపరిషత్తు: పరిపాలనలో చక్రవర్తికి సలహాలను ఇవ్వడం కోసం ఒక మంత్రిపరిషత్తు ఉండేది. మంత్రిపరిషత్తు సభ్యుల్లో మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి మొదలగువారు ముఖ్యులు. మంత్రిపరిషత్తును విధిగా సంప్రదించాలనే నిబంధన లేనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని సాధారణంగా మంత్రుల సూచనలను చక్రవర్తి పాటించేవాడు.

బి) ప్రజా సభలు: మౌర్య చక్రవర్తులు ప్రజాభిప్రాయాలకు విలువనిచ్చేవారు. నాడు పౌరసభ, జానపదసభ అనే ప్రజాప్రతినిధులతో కూడిన సభలుండేవి. ఆ సభలను సమావేశపరచి వాటితో ప్రభుత్వ కార్యక్రమాలను చర్చించేవారు. అశోకుని కాలంలో ధర్మ ప్రచారార్థం ధర్మమహామాత్రులు అను ప్రత్యేక అధికారులు నియమింపబడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు 32 శాఖలుగా విభజించబడి అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి.

సి) సైనిక వ్యవస్థ: మౌర్యులు సమర్థవంతమైన సైనిక వ్యవస్థను నిర్మించారు. మౌర్య సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వదళం, 9 వేల గజబలం, 8 వేల రథాలు వున్నట్లు గ్రీకు చరిత్రకారులు పేర్కొన్నారు. సైన్యానికి అనుబంధంగా నౌకాదళం కూడా ఉంది. సైనిక పర్యవేక్షణ బాధ్యతను 30 మంది సభ్యులున్న ఒక సంఘానికి అప్పగించారు. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 ఉపసంఘాలుగా విడివడి గజ, అశ్వక, రథ, పదాతి, నౌకాదళాల రవాణా, సరఫరా శాఖల నిర్వహణా బాధ్యతలను చేపట్టేది. మౌర్యుల కాలంలో గూఢచారి దళం కూడా అప్రమత్తతతో పనిచేసి, కీలకమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించేది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

డి) భూమిశిస్తు: మౌర్య సామ్రాజ్యానికి ప్రధానమైన ఆదాయం భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 6 నుంచి 4వ వంతు వరకు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. అశోకుడు బౌద్ధమతము యెడల భక్తితో లుంబినీ వనములో భూమిశిస్తును 8వ వంతుకు తగ్గించాడు. రాచపొలాలు, గనులు, నౌకాకేంద్రాలు, తదితర మార్గాల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. గోపుడు భూమిశిస్తును వసూలు చేసేవాడు. ఆదాయశాఖకు ముఖ్య అధికారి సమాహర్త. ప్రభుత్వ ఆదాయంలో 4వ వంతు ఉద్యోగుల జీతాలు, ప్రజాపనుల పద్దుల క్రింద ఖర్చయ్యేది.

ఇ) న్యాయపాలన: మౌర్యుల పాలనలో చక్రవర్తీ సామ్రాజ్యానికి ఉన్నత న్యాయాధిపతి. రాజాస్థానమే అత్యున్నత న్యాయస్థానం. ఆస్తి తగాదాలు మొదలగు సివిల్ కేసుల పరిష్కారానికి ధర్మస్థియ అను న్యాయస్థానాలు కృషిచేసేవి. అపరాధ విచారణ కోసం కంటకశోధన అనే క్రిమినల్ న్యాయస్థానాలుండేవి. నేరస్తులను దివ్యపరీక్షల ద్వారా విచారించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అయితే అశోక చక్రవర్తి కాలంలో ఈ కాఠిన్యాన్ని కొంతవరకు సడలించారు.

2. రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్య సామ్రాజ్యాన్ని జనపదాలుగా విభజించారు. అశోకుని కాలంలో తక్షశిల, అవంతి, పాటలీపుత్రం, గిర్నార్లు రాజధానులుగా గల ఉత్తరాపథ జనపదాలు, ఉజ్జయిని, కళింగ, సౌరాష్ట్ర అను దక్షిణాపథ జనపదాలు వుండేవి. జనపదాలకు పాలకులుగా రాజకుమారులను నియమించేవారు. జనపదాన్ని తిరిగి ఆహారాలు, విషయాలు, ప్రదేశాలుగా విభజించారు. ప్రదేశానికి అధికారి ప్రాదేశికుడు. పరిపాలనా యంత్రాంగానికి గ్రామమే ప్రాతిపదిక. గ్రామానికి అధికారి గ్రామికుడు.

3. నగరపాలన: మౌర్యుల కాలంలో నగరపాలన గురించి మెగస్తనీస్ తన ఇండికా అను గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి సవివరంగా వర్ణించాడు. ఈ కాలంలో నగరపాలనకు ఒక విశిష్ట స్థానం ఉంది. నగరపాలనను నాగరికుడు అనే అధికారి నిర్వహించేవాడు. పాటలీపుత్ర నగరపాలన నిర్వహణలో నాగరికుడికి 30 మంది సభ్యులున్న ఒక సంఘం తోడ్పడేది. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 పంచాయితీలుగా ఏర్పడి 1) పరిశమ్రలు 2) విదేశీయుల సౌకర్యాలు 3) జనన, మరణాల లెక్కలు 4) వాణిజ్యం, వ్యాపారం, తూనికలు, కొలమానాలు 5) వస్తువిక్రయం 6) సుంకాల వసూలు అనే శాఖలకు సంబంధించిన విధులను నిర్వహించేది.

ముగింపు: మౌర్యుల పాలనలో కొన్ని గుణదోషములున్నాయి. ఉద్యోగుల పీడన, కఠిన శిక్షలు ఇందులోని లోపాలు. పౌర, సైనిక శాఖలు వేర్వేరుగా ఉండటం, సమర్థవంతమైన నగరపాలన, ప్రజాసంక్షేమ పాలన అనునవి. ఇందులోని సుగుణాలు. మౌర్యుల పరిపాలనా విధానం ఉత్తమము, ఉదారము, ఆదర్శప్రాయమైనది. వీరి పాలన మొఘలుల పాలన కంటే విశిష్టమైనదని వి.ఎ. స్మిత్ అను పండితుడు వ్యాఖ్యానించాడు. నేటి పాలనా వ్యవస్థలోని మౌలికాంశాలు మౌర్యులనాటివే అని సర్దార్ కె.ఎమ్. పణిక్కర్ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
గుప్తుల పాలనా లక్షణాలు పరిశీలించండి.
జవాబు:
గుప్త చక్రవర్తులు ఉత్తర భారతదేశమున రాజకీయ ఐక్యతను సాధించి సుభిక్షమైన పాలనావ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరి పాలనలో ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ లేదు. ఫాహియాన్ “గుప్త పాలన ఉదారమైనది, ప్రభుత్వము ప్రజల విషయములో అనవసరముగా జోక్యం చేసుకొనెడిది కాదు” అని పేర్కొన్నాడు. అట్టి ఉదాత్త పాలనలో ప్రజలు సుఖశాంతులను అనుభవించారనుట అతిశయోక్తి కాదు.

కేంద్ర ప్రభుత్వము: గుప్త సామ్రాజ్యమునకు సర్వాధికారి చక్రవర్తి. గుప్త చక్రవర్తులు మహేశ్వర్, మహారాజాధిరాజా, పరమభట్టారక మొదలగు బిరుదులు ధరించారు. రాచరికం వంశపారంపర్యంగా లభించేది. రాజు దైవాంశ సంభూతుడని ప్రజలు విశ్వసించారు. రాజు నిరంకుశుడైనా ప్రజాక్షేమమే తన క్షేమముగా భావించేవాడు. పరిపాలనలో రాజుకు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉండేది. ఈ మండలిలో 1. మహాప్రధానామాత్యుడు 2. సచివుడు 3. కుమారామాత్యుడు 4. సంధి విగ్రహకుడు 5. మహాదండ నాయకుడు 6. రణభండారికుడు అనే ఉద్యోగులుండేవారు. వీరే కాకుండా కంచుకి అనే ఉద్యోగి చక్రవర్తికి, మంత్రిమండలికి మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఉద్యోగుల నియామకంలో కుల, మత భేదములను పాటింపక అభ్యర్థుల శక్తిసామర్థ్యములను పరిగణనలోనికి తీసుకునేవారు. ఈ కాలంలో గూఢచారి వ్యవస్థ అమలులో ఉంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్త చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తులను విషయాలుగా, విషయాలను ప్రదేశాలుగా విభజించారు. భుక్తికి అధిపతిని ఉపరిక అని పిలిచేవారు. విషయానికి అధిపతి విషయపతి. విషయపాలనలో విషయపతికి సహకరించేందుకు 5గురు సభ్యులు గల సభ సహాయపడేది. వారు నగరశ్రేష్టి, సార్ధవాహుడు, ప్రథమకులికుడు, ప్రథమ కాయస్థుడు, పుస్తపాలడు మొదలైనవారు. పాలనా వ్యవస్థలో చివరిది గ్రామము. గ్రామానికి పెద్ద గ్రామికుడు. గ్రామ పాలనలో గ్రామ పంచాయితీ అతడికి తోడ్పడేది.

నగరపాలన: నగర పరిపాలనకు గుప్తుల కాలంలో ప్రత్యేక ఏర్పాటు ఉంది. నగర పరిపాలనాధికారిని ”పురపాలుడు’ అనేవారు. పరిపాలనలో అతనికి సహాయపడేందుకు ఒక నగరసభ ఉండేది.

భూమిశిస్తు: గుప్త చక్రవర్తులకు ఆదాయం ముఖ్యంగా భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 1/3వ వంతు పంటను భూమిశిస్తుగా నిర్ణయించేవారు. భూమిశిస్తును భాగకర, ఉద్యంగ అనేవారు. భూమిశిస్తుతో పాటు వృత్తిపన్ను, ఉప్పుపన్ను, వర్తక సుంకం, వాణిజ్య పన్నులు, రేవులు, అడవులు, గనులు మొదలగు వానిపై కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది.

న్యాయపాలన: గుప్త పాలకులు ప్రజలకు నిష్పక్షపాతమైన, సమర్థవంతమైన పాలనను అందించారు. న్యాయ వ్యవహారాలలో చక్రవర్తి మాటకు తిరుగులేదు. ఆయనే ఉన్నత న్యాయాధీశుడు. న్యాయశాఖలో మహాదండ నాయకుడు, మహాక్షపతిలక వంటి న్యాయాధికారులుండేవారు. రాజదండన కఠినంగా ఉండేది కాదు. కాని తిరుగుబాటు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించేవారు. శిక్షగా వారి కుడిభుజాన్ని ఖండించేవారు లేదా కళ్ళు పీకించేవారు. మరణదండన తప్పనిసరైనప్పుడు అట్టివారిని ఏనుగులతో తొక్కించి చంపేవారు.

సైనిక వ్యవస్థ: గుప్త సామ్రాజ్యానికి చక్రవర్తే సర్వసైన్యాధ్యక్షుడు. గుప్త చక్రవర్తులు సంప్రదాయంగా అనుసరించబడుతున్న చతురంగ బలాలను పోషించారు. సైనిక రంగంలో సేనాపతి, మహాసేనాపతి, దండనాయకుడు మొదలైన ఉద్యోగులుండేవారు.

ముగింపు: గుప్తుల పరిపాలనలో అధికార వికేంద్రీకరణ చోటుచేసుకుంది. రాష్ట్రపాలకులు ఎక్కువ అధికారాలు అనుభవించారు. ప్రభువులు ప్రజాక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని పరిపాలన సాగించటం గుప్త పాలనలోని విశేషం.

ప్రశ్న 3.
పుష్యభూతి వంశస్థుల పాలనలో రాజకీయ పరిస్థితులను వివరించండి.
జవాబు:
గుప్త సామ్రాజ్య పతనం తర్వాత దాని శిథిలాలపై ఉత్తర భారతదేశంలో అనేక చిన్నచిన్న స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. అవన్నీ దాదాపు ఒకప్పుడు గుప్త సామ్రాజ్యానికి సామంత రాజ్యాలుగా ఉన్నటువంటివే. అలాంటి రాజ్యాలలో ఒకటి స్థానేశ్వర రాజ్యం.

గుప్తులకు సామంతులుగా ఉన్న ఈ రాజ్య పాలకులు బలపడి ఇతర సామంత పాలకులను తమ అధికార పరిధిలోకి తెచ్చుకుని ఉత్తర భారతదేశంలో మళ్ళీ రాజకీయ సమైక్యతను, సుస్థిరతను సాధించగలిగారు. పుష్యభూతి వంశస్థులు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించగా ఈ వంశంలోనివాడైన హర్షవర్ధనుడి కాలంలో ఉత్తరాపథం తిరిగి మహోన్నత దశకు చేరుకుంది.

పుష్యభూతి వంశ చరిత్ర: మహాశివభక్తుడైన పుష్యభూతి ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల, ఈ వంశానికి ఆ పేరు వచ్చినట్లు బాణుని “హర్షచరిత్ర” వల్ల తెలుస్తున్నది. ఈ వంశంలో మూడోతరంవాడైన ఆదిత్యవర్ధనుడి కుమారుడు ప్రభాకరవర్ధనుడు. ఇతను “మహారాజాధిరాజు” బిరుదాన్ని ధరించాడు. ప్రభాకరవర్ధనుణ్ణి ‘హూణ హరిణకేసరి” అంటూ
”హర్షచరిత్ర’ వర్ణించింది. ఇతని పట్టపురాణి యశోమతీదేవి మాళవరాజైన యశోధర్ముడి కుమార్తె కావడం వల్ల యశోధర్ముడితోపాటు ప్రభాకరవర్ధనుడు కూడా హూణులతో పోరాటంలో పాల్గొన్నాడని భావించవచ్చు. ప్రభాకరవర్ధనుడికి రాజ్యశ్రీ అనే కుమార్తె, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడనే కుమారులున్నారు. కుమార్తె రాజ్యశ్రీని మౌఖరీ రాజైన గృహవర్మకిచ్చి వివాహం జరిపించాడు.

క్రీ.శ. 604లో స్థానేశ్వర రాజ్యంపై హూణులు దండెత్తినప్పుడు, ప్రభాకరవర్ధనుడు తన పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుణ్ణి హూణులను ఎదుర్కొనేందుకు పంపాడు. వారిపై విజయాన్ని సాధించి రాజ్యవర్ధనుడు రాజ్యానికి తిరిగి వచ్చేసరికి ప్రభాకరవర్ధనుడు జబ్బుచేసి మరణించాడని, యశోమతి సతీసహగమనం చేసిందని తెలిసింది. ఈ కారణంగా రాజ్యవర్ధనుడు పట్టాభిషక్తుడయ్యాడు.

ఇదేసమయంలో మాళవ రాజైన దేవగుప్తుడు గౌడ రాజైన శశాంకుడితో కలిసి కనోజ్పై దండెత్తి రాజ్యశ్రీ భర్త గృహవర్మను వధించాడు. ఇది తెలుసుకున్న రాజ్యవర్ధనుడు సైన్యంతో కనోజ్పై దండెత్తి దేవగుప్తుణ్ణి ఓడించాడు. రాజ్యశ్రీని బందిఖానా నుంచి విడిపించడానికి ముందే, దురదృష్టవశాత్తు రాజ్యవర్ధనుడు శశాంకుడి కుట్రకు బలయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో హర్షవర్ధనుడు స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాజకీయ పరిస్థితులు: హర్షవర్ధనుడు గొప్ప విజేతగాను, గొప్ప పరిపాలనదక్షుడిగాను పేరుపొందాడు. హర్ష చరిత్ర, సి-యూ-కి గ్రంథాల్లో హర్షుణ్ణి ఆదర్శవంతమైన ప్రభువుగా వర్ణించారు. హర్షుడు పరిపాలనలో స్వయంగా శ్రద్ధ వహించాడు. రాజ్యంలో స్వయంగా పర్యటించి, ప్రజల కష్టసుఖాలను స్వయంగా విచారించి, తక్షణమే న్యాయం చేకూర్చేవాడు. ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించడంలో హర్షుడికి వ్యవధి చాలేది కాదని, సి-యూ-కి గ్రంథంలో వివరంగా ఉంది.

పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలు గాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి-విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

భుక్తికి అధికారి ఉపరిక. ఇతనికే ‘భోగపతి’ అనికూడా పేరు ఉంది. విషయానికి అధికారి ‘విషయపతి’. ఇతనిని ‘కుమారామాత్య’ అనికూడా పిలిచేవారు. గ్రామమే ప్రభుత్వానికి పునాది. గ్రామంలో అక్షపడలిక, కరణిక అనేవారు ఉద్యోగులు. వీరికి గ్రామ వృద్ధుల సహకారం ఉండేది.

ఆదాయం: భూమిశిస్తు రాజ్యానికి ముఖ్య ఆదాయం. ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది కాదు. పంటలో ఆరోవంతును మాత్రమే పన్నుగా వసూలుచేసేవారు. పన్నులను ధాన్యరూపంగాగాని, ధనరూపంగాగాని చెల్లించవచ్చు. బాటల మీద, రేవుల మీద సుంకాలుండేవి. వస్తువుల అమ్మకాల మీద కూడా పన్నులు ఉండేవి. అయితే ఇవి ఆయా వస్తువుల బరువులనుబట్టి, విలువలనుబట్టి ఉండేవి. ఈ విధంగా వస్తువుల బరువు ఆధారం చేసుకొని వసూలు చేసే అమ్మకం పన్నునే ‘తుల్యమేయ’ అన్నారు. పన్నులను వసూలు చేయడానికి ధ్రువాధికరణ, గౌల్మిక మొదలైన ఉద్యోగులు ఉండేవారు. ప్రభుత్వాదాయాన్ని ముఖ్యంగా నాలుగు పద్దుల మీద ఖర్చు పెట్టేవారు. అవి: 1. ప్రభుత్వ యంత్రాంగం 2. రాజప్రాసాదం 3. పండిత సత్కారం 4. దానధర్మాలు.

హర్షయుగంలో నేరాలు ఎక్కువని తెలుస్తున్నది. ఆ కారణంగా శిక్షాస్మృతి కఠినతరమైంది. దేశద్రోహ నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష, సాంఘిక నియమావళిని ధిక్కరించిన వారికి, తల్లిదండ్రుల పట్ల అవిధేయులైన వారికి అంగచ్ఛేద శిక్షగాని లేదా దేశబహిష్కార శిక్షగాని అమలుపరిచేవారు. చిన్నచిన్న నేరాలకు జరిమానాలను విధించేవారు. నేర నిర్ణయానికి ‘దివ్య పరీక్షలుండేవి. రాజ పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో బాధితులను విడిచిపెట్టే ఆచారం ఉండేది.

సైన్యం: హర్షుడు పెద్ద సైన్యాన్ని పోషించాడు. సైన్యంలో చతురంగ బలాలుండేవి. క్రమంగా రథానికి ప్రాముఖ్యం తగ్గింది. హర్షుని సైన్యంలో 5000 ఏనుగులు, 2000 అశ్వాలు, 50,000 కాల్బలం ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రశ్న 4. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు భారతదేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి.
జవాబు:
క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7 వరకు గల ఆర్థిక పరిస్థితులు:
మౌర్యుల ఆర్థిక వ్యవస్థ:
1) వ్యవసాయం: మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. పన్నులు వసూలు చేయడంతో ఆర్థిక, సాంఘిక భద్రత ఉన్నట్లు భావించారు. రాజు తన సొంతభూముల ద్వారానే కాకుండా, రాజ్య భూముల నుంచి కూడా పన్నులు వసూలుచేసేవారు. రాజ్య ప్రధాన ఆదాయం పంటలో 1/4 నుంచి 1/6 వ వంతు శిస్తుగా వసూలు చేసేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శిస్తులు మారేవి. మధ్యవర్తులు లేకుండా అధికారులే స్వయంగా శిస్తు వసూలు చేసేవారు.

2) పారిశ్రామిక వృత్తులు:
లోహ పరిశ్రమ: వివిధ రకాల లోహాలను ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి లోహాలను తమ పరిజ్ఞానంతో వెలికితీసి వివిధ రకాలైన వస్తువులు తయారుచేశారు. దారు (కొయ్య) పరిశ్రమ, రాతి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ వంటివి. మధుర, కాశీ, పాటలీపుత్రం, వంగ, మహీశ మొదలైన నగరాల్లో కుండల తయారీ, మౌర్య రాజ్యంలోని వివిధ ప్రాంతాలలోనూ అభివృద్ధి చెందింది.

3) కుషాణుల పాలనలో వర్తక, వాణిజ్యం: మౌర్యుల కాలానికి భిన్నంగా క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 300 కాలంలో అనేక చిన్నరాజ్యాలు ముఖ్యంగా విదేశీ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందుకే సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని ‘అంధయుగం’గా భావించారు. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ కాలాన్ని ‘భారతదేశ వాణిజ్యయుగం’గా చెప్పారు. ఎందుకంటే ఆ కాలంలో వర్తక వాణిజ్యాలు చాలా బాగా అభివృద్ధి చెందినాయి.

4) గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక, గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాజ్యభాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

5) భూస్వామ్య అంశాల అభివృద్ధి:

 • భూదానాలు చేయడం: పురోహితులకు దేవాలయాల భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
 • సేద్యపు బానిసలు: భూదానాలు భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు ఇతరులకు ఇచ్చినప్పుడు దానితో సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

6) పుష్యభూతి పాలనలో ఆర్థికవ్యవస్థ: పుష్యభూతి వంశపాలనలో ఆర్థికవ్యవస్థ స్వయంసమృద్ధిగా, మరింత భూస్వామ్య విధానాలతో ఉండేది. గుప్తుల కాలంలో ప్రారంభమైన వర్తక, వాణిజ్య క్షీణత, హర్షుని కాలంలో కూడా కొనసాగింది. వర్తక కేంద్రాలు క్షీణత నాణాల కొరత, వర్తక సంఘాలు లేకపోవటం దీనికి ఉదాహరణ. చేతివృత్తులు, ఇతర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా వ్యవసాయం కూడా పరోక్షంగా దెబ్బతిన్నది.

ప్రశ్న 5.
మౌర్యుల నుంచి పుష్యభూతి వంశం వరకు జరిగిన కళ, శిల్ప, నిర్మాణ అభివృద్ధిని చర్చించండి.
జవాబు: మౌర్యుల కళలు:
1) స్తంభాలు, శిల్ప నిర్మాణాలు: మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్థూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్టించాడు. స్తంభాలను రెండు రకాలైన రాతితో నిర్మించారు. అవి:

 1. మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని నిర్మించబడ్డాయి.
 2. బాగా పొడిచేసిన ఇసుకరాయి, బనారస్ సమీపంలోని చూనార్ వద్ద లభ్యం అవుతుంది. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చూనార్ నుంచి రాతిని రవాణాచేసి, అక్కడ శిల్పకారులు, తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో చెక్కారు.

2) స్తూపాలు: స్తూపం అనేది ఇటుక లేదా రాయితో నిర్మించిన అర్ధగోళాకార నిర్మాణం. క్రింద గుండ్రని ఆధారపీఠం ఉంటుంది. చుట్టూ గొడుగు ఆకారం సార్వభౌమాధికారానికి గుర్తుగా ఉంటుంది. అశోకుడు భారతదేశంలోను, ఆఫ్ఘనిస్థాన్లలో ఎనభై నాలుగువేల స్థూపాలు నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ తన భారత పర్యటనలో వీటిని చాలావరకు చూశాడు. వీటిలో మంచి ఉదాహరణగా చెప్పదగింది భోపాల్ సమీపంలోని సాంచి స్తూపం.

3) గుహలు: మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి గుహలు. గట్టిరాళ్ళు, చీలిన రాళ్ళతో చెక్కబడినవి. గుహల లోపలి గోడలు బాగా నునుపుగా, అద్దంలాగా ఉంటాయి. ఈ అద్భుత కట్టడాలు సన్యాసుల నివాసగృహాలు, అసెంబ్లీ గదుల వలె ఉపయోగపడ్డాయి.

గాంధార, మధుర అమరావతి శిల్ప నిర్మాణాలు:
A. గాంధార శిల్పం:
1) కాలం, ప్రదేశం, పోషకులు: క్రీ.పూ. 1వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిల్పాలను గాంధార శిల్పాలు అంటారు. భారతీయ గ్రీకు శిల్పకళా సమ్మిళిత నిర్మాణంగా చెబుతారు. బాక్ట్రియా గ్రీకు రాజులు, వాయువ్య భారతం నుంచి ఆవిర్భవించాయి. శకులు, కుషాణులు
వీటి పోషకులు.

2) గాంధార శిల్ప లక్షణాలు: గ్రీకు, రోమన్ సంప్రదాయాల్లో బుద్ధుని విగ్రహాలు నిర్మించబడ్డాయి. మానవ శరీరాన్ని చాలా సహజంగా శిల్పులు చెక్కారు. కండరాలు, మీసాలు, ఉంగరాల జుత్తు మొదలైనవి చక్కగా ఉంటాయి.

B. మధుర శిల్పం: జైనమతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో మత భావనలు ప్రదర్శితమయ్యేట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తిభావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్పశైలిలో నిర్మించడం జరిగింది.

C. అమరావతి శిల్పం: అమరావతి స్తూపం దీనికి గొప్ప ఉదాహరణ. సున్నపురాయి సొబగులు, బుద్ధుని జీవితానికి సంబంధించిన చిత్రాలు, స్వతంత్రంగా ఉన్న బుద్ధుని విగ్రహాలు చుట్టూ ప్రదర్శితం అవుతాయి. భారతీయ శిల్పానికి అది గొప్ప మకుటంలాంటిది.

గుప్తుల కాలం నాటి సంస్కృతి:
1) నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
a. రాతి గుహలు: అజంతా, ఎల్లోరా, బాగ్ గుహలు రాతి గుహలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
b. దేవాలయాలు: దేవాలయాల్లో ముఖ్యమైనవి.

 1. చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
 2. రెండో అంతస్తు (విమాన) గల చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
 3. ఒక శిఖరంతో చతురస్రాకార దేవాలయం.
 4. దీర్ఘచతురస్రాకార దేవాలయం.
 5. వృత్తాకార దేవాలయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

నచనాకుధార వద్ద గల పార్వతీ దేవాలయం, భూమ్రా వద్ద గల శివాలయం రెండో రకం దేవాలయానికి చెందినవి. మధ్యప్రదేశ్లోని దేవఘడ్, భట్టార్గాంవ్ దేవాలయాలు మూడో రకానికి చెందినవి. వీటి ప్రాధాన్యత ఏమిటంటే గర్భగుడిపైన శిఖరం ఉంటుంది. ఇది నగరశిల్ప నిర్మాణశైలి.

గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి

 1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
 2. మధ్యప్రదేశ్లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాధ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాధ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసులు చిత్రాలు అద్భుతమైనవి.

b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్ లోని బుద్ధ విగ్రహం 7/2 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 6.
గుప్తుల కాలాన్ని ‘స్వర్ణయుగం’ అని ఎందుకు అంటారు ?
జవాబు:
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్దాంత’మనే గ్రంథాన్ని, వరాహమిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తులకాలం వారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదా: దేవఘర్లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాధ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

7. క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు జరిగిన సాహిత్యాభివృద్ధిని తెలపండి. జవాబు: మౌర్యుల కాలంలో విద్యారంగంలో చాలా అభివృద్ధి జరిగింది. ప్రజలను విద్యావంతులను చేయడానికి పాలకులు చాలా శ్రద్ధ తీసుకొన్నారు. అశోకుని శాసనాలు సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకొనేట్లు ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో తక్షశిల అతిప్రాచీన విద్యాలయం. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సమానంగా విద్యాభ్యాసం చేయగల అత్యంత ప్రామాణిక విశ్వ విద్యాలయం. భారతదేశం నలుమూలల నుంచేగాక, ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు కుల, మత, భేదాలు లేకుండా తక్షశిలకు వచ్చి విద్యాభ్యాసం చేశారు.

సారస్వత కార్యక్రమాలు: సారస్వత సంబంధ ప్రగతిలో మౌర్యుల కాలం ఉన్నత ప్రగతి సాధించింది. అశోకుని శాసనాల ద్వారా రెండు లిపులు ఉన్నట్లు తెలుస్తోంది. అవి బ్రహ్మ, ఖరోష్ఠి, కౌటిల్యుడు వ్రాసిన ‘అర్థశాస్త్రం’, భద్రుడు వ్రాసిన ‘కల్ప సూత్రాలు’, బౌద్ధ గ్రంథాలు కథావస్తువు, ధర్మ సూత్రాలు, గృహ సూత్రాలు ఈ కాలంలో రచించబడ్డాయి. కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ మౌర్యుల కాలంనాటి ప్రసిద్ధ గ్రంథం. మౌర్యుల పరిపాలన గురించి సమాచారం ఈ గ్రంథంలో ఉంది.

కనిష్కుడు – గొప్ప సాహిత్య పోషకుడు: కనిష్కుడు గొప్ప సాహిత్య, కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుడు ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు వ్రాసిన గ్రంథాలు “బుద్ధచరిత్ర”, “సౌందరానంద కావ్యం”, “సరిపుత్త ప్రకరణ” ముఖ్యమైనవి. నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు తమ గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. కనిష్కుని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం (కాశ్మీరు), పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు. బుద్ధుడి విగ్రహాలను గాంధార శిల్ప శైలిలో నిర్మింపజేశాడు. గ్రీకు – భారతీయ శిల్పకళా సమ్మేళనమే గాంధార శిల్పం.

గుప్తుల సారస్వతాభివృద్ధి గుప్తుల కాలంలో సంస్కృతభాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో “నవరత్నాలు” అనే కవులుండేవారు. 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం’ అనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. “మృచ్ఛకటికం” నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలం వాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభు వర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

పుష్యభూతి వంశస్తుల సాంస్కృతిక ప్రగతి: హర్షుడు గొప్ప సాహిత్య, కళా పోషకుడు స్వయంగా పండితుడు. డా॥ రాయిచౌదరి హర్షుని గురించి ఇలా చెప్పాడు. “హర్షుడు గొప్ప సేనాపతి, పరిపాలనాదక్షుడు. మతపోషకుడిగా, సాహిత్య పోషకుడిగా ప్రఖ్యాతిగాంచాడు. విద్యా బోధనకు, పండితుల పోషణకు ఉదారంగా విరాళాలిచ్చాడు. సంస్కృతంలో హర్షవర్ధనుడు ‘నాగానందం’, ‘రత్నావళి’, ‘ప్రియదర్శిక’ అనే గ్రంథాలు వ్రాశాడు. అతడి ఆస్థానంలో ఉన్న బాణభట్టు గొప్ప పండితుడు. హర్షుడు ఉదార దానాల ద్వారా విద్యావ్యాప్తికి కృషిచేశాడు. నలంద విశ్వవిద్యాలయ పోషణకు వంద గ్రామాలను దానం చేశాడు. చాలామంది విద్యార్థులు సుదూర ప్రాంతాలైన చైనా, టిబెట్, మంగోలియా దేశాల నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చారు. ఈ విశ్వవిద్యాలయంలో 1500 మంది అధ్యాపకులు ఉన్నారు. శీలభద్రుడు విశ్వవిద్యాలయ అధ్యక్షులు వేదాలు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, గణితం, జ్యోతిష్యం, సాహిత్యం, నైతిక విలువల బోధన సంస్కృత భాషలో చేశారు. హుయన్ త్సాంగ్ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి, ధర్మపాలుడు, చంద్రపాలుడు, గుణమతి, స్త్రీర్మతి, ధ్యాన్ చంద్ర, కమల్ శీల మొదలైనవారు ఆచార్యులు. డా॥ R.C. మజుందార్ అభిప్రాయంలో “హర్షుడు యుద్ధం, శాంతి, కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు. కలం, కత్తి సమానంగా వాడగల నిపుణుడు, మేధావి అతడు”.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యులకు చెందిన ప్రధాన చారిత్రక ఆధారాలు తెలపండి.
జవాబు:
భారతదేశ చరిత్రలో మౌర్య వంశానికి ఒక విశిష్టస్థానం ఉంది. ఈ వంశంవారు ప్రప్రథమంగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి దేశ సమైక్యతను చాలావరకు సాధించారు. తత్ఫలితంగా మౌర్య సామ్రాజ్య స్థాపనతో ఉత్తర భారతదేశ చరిత్రలో సామ్రాజ్యాల యుగం ప్రారంభమైనది. తమిళ, కేరళ ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా వీరి సార్వభౌమాధిపత్యం క్రిందికి రావడం గమనించదగ్గ విషయం. వీరు సమర్థవంతమైన పాలనావ్యవస్థను రూపొందించి ప్రజారంజకంగా పాలించారు. విశ్వమానవ కళ్యాణం, పరమత సహనం, శాంతి, అహింస, సర్వ మానవ సౌభ్రాతృత్వం వంటి ఉదాత్త లక్ష్యసాధనకు చివరి వరకు అహోరాత్రులు కృషిచేసిన విశ్వవిఖ్యాతులైన సామ్రాట్టులో అగ్రగణ్యుడైన అశోక చక్రవర్తి ఈ వంశానికి చెందినవాడు. ఇటువంటి మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు ఈ క్రింది చారిత్రక ఆధారాలు ప్రధానమైనవి. అవి:

మౌర్యుల చరిత్ర అధ్యయనానికి ఉపకరించే ప్రధానమైన ఆధారాలు. శిలలపై రాతిస్తంభాలపై కనిపించే అశోకుడి శాసనాలు, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం గ్రీకు రచయితల రచనలు. అంతేగాక పురాణాలు బౌద్ధమత గ్రంథాలు, ‘ముద్రారాక్షసం’ అనే నాటకం కూడా వీరి చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 2.
చంద్రగుప్త మౌర్యుడు మొదటి జాతీయ పాలకుడు – చర్చించండి.
జవాబు:
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు చాణిక్యుని నేతృత్వంలో సకల విద్యాపారంగతుడై ఉత్తమ సైనికుడిగా రూపుదిద్దుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు రెండు ఘనకార్యాలు సాధించాడు. మొదటిది వాయువ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకోవటం కాగా, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించటం రెండవది. అలెగ్జాండర్ భారతదేశమును వదిలివెళ్ళిన పిమ్మట చాణక్య, చంద్రగుప్త మౌర్యుడు మొదటగా పంజాబ్ ప్రాంతంలో ధైర్యసాహసాలకు పేరుబడ్డ జాతులవారిని చేరదీసి ఒక శక్తివంతమైన సైన్యమును సమకూర్చుకున్నారు. ఈ సైన్యం సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ప్రథమంగా గ్రీకులను పారద్రోలి పంజాబును విదేశీపాలన నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత నందరాజు నిరంకుశత్వాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని అధిష్టించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. జైన, బౌద్ధ ఐతిహ్యాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రెండుసార్లు మగధపై దండయాత్ర జరిపాడని, రెండవ దండయాత్రలో విజయం సాధించి సామ్రాజ్య స్థాపనగావించాడని తెలుస్తున్నది. క్రీ.పూ. 305లో భారతదేశముపై దండెత్తి వచ్చిన గ్రీకు సేనాని సెల్యూకస్ నికటార్ను ఓడించి అతని వద్ద నుండి కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్థాన్లను వశపరచుకొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో భారతదేశమంతటిని జయించాడని ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ దండయాత్రల వలన చంద్రగుప్త మౌర్యుని మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పున బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా వరకు విస్తరించింది.

భారతదేశంలోని అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోనికి తీసుకొనివచ్చిన ఘనత చంద్రగుప్తు మౌర్యునికే దక్కుతుంది. అందువలన భారతదేశ చరిత్రలో చంద్రగుప్తమౌర్యుని జాతీయ పాలకుడుగా భావిస్తారు.

ప్రశ్న 3.
అశోకుని గొప్పతనాన్ని సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ చక్రవర్తులలోనే గాక ప్రపంచ చక్రవర్తులలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యం ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించింది.

తొలి జీవితం: అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే అశోకుడికి, అతని సోదరులకు మధ్య సింహాసనం కోసం పోరాటం జరగటం వల్ల అశోకుడు తన పట్టాభిషేకాన్ని క్రీ.పూ. 269లో జరుపుకున్నాడు. సింహళ చరిత్ర గ్రంథాలు అశోకుని స్వభావం క్రూరమైనదని, తండ్రి మరణానంతరం తన 99 మంది సోదరులను వధించి సింహాసనాన్ని ఆక్రమించాడని వివరిస్తున్నాయి. అయితే అశోకుడు ఒక శిలాశాసనంలో తన సోదరుల, బంధువుల సంక్షేమానికి తీసుకున్న శ్రద్ధను ప్రస్తావించాడు. కాబట్టి అశోకుని వ్యక్తిత్వాన్ని మార్చటంలో బౌద్ధమతం యొక్క గొప్పదనాన్ని నొక్కిచెప్పటం కోసం ఈ ఐతిహ్యాన్ని సృష్టించారని, అది వాస్తవం కాదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

అశోకుని చరిత్రకు ఆధారాలు: అశోకుని ఉదాత్త లక్ష్యాలు, ఆదర్శాలు, పరిపాలనా కాలంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకోవడానికి అతడు దేశంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శిలాస్తంభ శాసనాలు ఎంతో ఉపకరిస్తాయి. ఈ శాసనాలు బ్రాహ్మీలిపిలో వున్నాయి. బౌద్ధమత గ్రంథాలైన “మహావంశ”, “దివ్యావదాన” కూడా అశోకుని చరిత్రకు సంబంధించిన అంశాలను వివరిస్తాయి. అశోకుడు తన శాసనాలలో తనను ‘దేవానాంప్రియ’ (దేవతలకు ప్రియమైనవాడు), ‘ప్రియదర్శి’ (చక్కని రూపం కలవాడు) అని చెప్పుకున్నాడు.

కళింగ యుద్ధం: అశోకుడు మౌర్య సింహాసనాన్ని అధిష్టించక పూర్వం ఉజ్జయిని పాలకుడుగా పనిచేసి పరిపాలనానుభవాన్ని గడించాడు. పట్టాభిషేకం జరుపుకున్న 9 సంవత్సరాలకు (క్రీ.పూ. 261) సామ్రాజ్య విస్తరణకాంక్షతో కళింగపై దండెత్తాడు. అందుకు కారణం మగధ సామ్రాజ్యంలో భాగంగా వున్న కళింగ, నందరాజుల పతనంతో స్వతంత్రించింది. పైగా దక్షిణ భారతదేశానికి వున్న, భూ, జల మార్గాలు కళింగ ద్వారా వుండటం వల్ల దానిని స్వాధీనం చేసుకోదలిచాడు. క్రీ.పూ. 261లో జరిగిన కళింగ యుద్ధంలో లక్షమంది హతులైనట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడినట్లు అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. ఈ విజయంతో కళింగ మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. కళింగ యుద్ధం అశోకునిలో వినూత్నమైన హృదయ పరివర్తనను తెచ్చింది. చండాశోకుడు ధర్మాశోకుడుగా మారాడు. ఇకముందు యుద్ధాలు చేయకూడదని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు. ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుని వద్ద బౌద్ధమత దీక్ష తీసుకున్నాడు. రెండు సంవత్సరాల తరువాత బౌద్ధ భిక్షువుగా మారి బుద్ధగయ, లుంబిని, కపిలవస్తు, శ్రావస్తి, కుశ నగరాలను సందర్శించాడు. బౌద్ధభిక్షువుగానే రాజ్యభారాన్ని నిర్వహించాడు.

సామ్రాజ్య విస్తీర్ణం: అశోకుని సామ్రాజ్యం సువిశాలమైనది. తమిళనాడు, అస్సాం ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యంలో భాగంగా వుంది. భారతదేశం వెలుపలి ప్రాంతాలైన కాబూల్, కాందహార్, హీరత్, బెలూచిస్థాన్లు ఇతని సామ్రాజ్యంలో చేరివున్నాయి.

బౌద్ధమత వ్యాప్తి: బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత అశోకుడు స్వదేశంలోను, విదేశాల్లోను బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలను ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలను శిలలు, స్తంభాలపై చెక్కించి జనసమ్మర్ధ ప్రదేశాలలో, యాత్రాస్థలాల్లో వాటిని నెలకొల్పాడు. అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా జంతు బలులు, వేటలు, మాంసాహార వంటకాలను నిషేధించాడు. పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ధర్మబోధన చేయటానికి ధర్మ మహామాత్రులనే ప్రత్యేక అధికారులను నియమించాడు. మత ప్రచారకులను ఈజిప్టు, మాసిడోనియా, సైప్రస్, ఎపిరస్ మొదలైన దేశాలకు పంపాడు.

అశోకుని ధర్మం: తన సామ్రాజ్య పటిష్టత కోసం అశోకుడు ఒక ధర్మాన్ని ప్రవచించాడు. అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అశోకుని ధర్మంలో కనిపిస్తాయి. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దంపడుతుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి: జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చెయ్యాలి. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారానే తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి. ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు.

అశోకుని పరిపాలన: అశోకుడు తన సామ్రాజ్యంలో రాష్ట్రస్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. పరిపాలనలో అతనికి యువరాజు, రాజకుమారుడు, కుమార, ఆర్యపుత్ర మొదలైనవారు సహాయపడేవారు. తక్షశిల, ఉజ్జయిని, వైశాలిలను రాష్ట్రాలకు కేంద్రాలుగా చేసి వాటికి కుమారులను రాష్ట్రపాలకులుగా నియమించాడు. రాజ్య వ్యవహారాల్లో రాజుదే తుదినిర్ణయం. న్యాయవిచారణలో అశోకుడు న్యాయమూర్తుల జాగు, అసహనాలను తొలగించి ప్రశంసనీయమైన మార్పులను ప్రవేశపెట్టాడు.

ప్రశ్న 4.
అశోకుని ధర్మము అంటే ఏమిటి ?
జవాబు:
అశోకుని కాలంలో వివిధ మతశాఖలు సామాజిక ఉద్రిక్తతను సృష్టించాయి. నగరాల్లో వ్యాపారవర్గాలు బలపడటంవల్ల నూతన సామాజిక స్థితి ఏర్పడింది. సామ్రాజ్య సువిశాలత్వం కూడా కొన్ని సమస్యలను సృష్టించింది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమైక్యతను సాధించటానికి ఒక క్రొత్త విధానం కావలసి వచ్చింది. అందువలననే అశోకుడు తన ధర్మాన్ని ప్రతిపాదించాడు.

అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అతనిలో కనిపిస్తాయి. బౌద్ధధర్మం, అశోకుని ధర్మం ఒకటి కాదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో అశోకుడు తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరిచాడు. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దం పడుతుంది. అశోకుని ధర్మం ముఖ్యంగా మానవుల ప్రవర్తన, నీతికి సంబంధించిన నియమావళికి వర్తిస్తుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి:

 1. జీవహింస చేయరాదు.
 2. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి.
 3. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి.
 4. బానిసలు, సేవకులపట్ల దయతో మెలగాలి.
 5. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చేయాలి.
 6. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారా తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి.

ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుడు కర్మకాండను, మూఢాచారాలను ఖండించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో కుషాణుల కాలానికి గల ప్రాధాన్యత తెలపండి.
జవాబు:
కనిష్కుడి ఆస్థానం ఎంతోమంది పండితులకు ఆశ్రయం కల్పించింది. పార్శ్వుడు, వసుమిత్రుడిలాంటి బౌద్ధ పండితులు నాల్గవ బౌద్ధసంగీతిని నిర్వహించారు. ‘బుద్ధచరిత్ర’, ‘సౌందరనందం’ అనే గ్రంథాలు వ్రాసిన అశ్వఘోషుడు గొప్ప తత్వవేత్త, కవి. మహాయాన మతాన్ని ప్రచారం చేసిన నాగార్జునుడు కూడా కనిష్కుని కాలంవాడే. వీరిరువురు కనిష్కుని ఆదరణ అందుకొన్నారు. కనిష్కుడు మత గ్రంథాలనే కాకుండా లౌకిక గ్రంథాలు, శాస్త్రాలను కూడా ఆదరించాడు.

మాతంగుడనే రాజకీయ దురంధరుడు కనిష్కుడి అమాత్యుడు. ‘చరక సంహిత’ను రచించిన చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు. ఈ చరక సంహితలో రోగనిర్ధారణ, రకరకాల రోగాలు, అవి రావడానికి కారణాలు, రక్తప్రసరణ-పరీక్ష, మానవ శరీరశాస్త్రం, పిండోత్పత్తి (embryology) మొదలైనవి విపులీకరించడం వల్ల పారశీకం మొదలైన భాషల్లోకి ఈ గ్రంథం అనువాదాలు వెలువడ్డాయి.

కళాసేవ: అశోకుడిలాగా ఎన్నో శిల్పాలు చెక్కించడానికి, కట్టడాలు నిర్మించడానికి, చిత్రాలు గీయించడానికి కనిష్కుడు పూనుకొన్నాడు. ‘కనిష్కపురం’ లోని 13 అంతస్తుల స్తంభం (Tower), మధురలోని శిల్పాలు, ‘పురుషపురం’ లోని బౌద్ధవిహారం, స్తూపం ఎంతో ప్రసిద్ధిచెందాయి. రాజధాని పురుషపురంలో 400 అడుగుల ఎత్తు గోపురం నిర్మించి అందులో నిలువెత్తు బుద్ధ విగ్రహం ప్రతిష్టించాడు. గాంధార శిల్పం ఇతని కాలంలోనే ఉచ్ఛస్థితికి చేరుకుంది. శిల్పాలకు మధుర కేంద్రమయింది. అనేక భంగిమలలో బుద్ధుని ప్రతిమలు మలచబడ్డాయి.

కనిష్కుడు విదేశీయుడైనా 41 సంవత్సరాల సుదీర్ఘపాలనలో భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో ఉత్తమ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని తర్వాత వచ్చిన రాజుల (హనిష్కుడు, వసిష్కుడు) బలహీనత వల్ల, కుషాణుల రాజ్యం అంతరించింది.

ప్రశ్న 6.
గుప్తుల కాలానికి సంబంధించిన ప్రధాన చారిత్రక ఆధారాలను తెలపండి.
జవాబు:
కుషాణ సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో, క్రీ.శ. 4వ శతాబ్ది వరకు ఏ రాజ వంశము సామ్రాజ్యాధికారాన్ని నెలకొల్పలేదు. క్రీ.శ. 4వ శతాబ్ది ప్రథమార్థంలో గుప్త సామ్రాజ్య స్థాపన మగధలో జరిగింది. అంతవరకు, ఈ ప్రాంతమంతటా చిన్నచిన్న రాజ్యాల వ్యవస్థ కొనసాగింది. ఈ చిన్నచిన్న రాజ్యాల్లో రాజకీయ అస్థిరత్వం నెలకొనడంతో రాజకీయ ఆధిక్యత కోసం ఇక్కడి రాజులు తరచు యుద్ధాలు చేశారు. ఇటువంటి రాజకీయ కల్లోల పరిస్థితుల్లో, రాజకీయంగా, సాంస్కృతికంగా, దేశాన్ని సమైక్యపరిచి అన్నివిధాలా స్వర్ణయుగాన్ని సృష్టించడానికి కృషి చేసినవారు గుప్తులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్ది నుంచి క్రీ.శ. 6వ శతాబ్ది మధ్య వరకు, భారతదేశాన్ని
పరిపాలించారు.

గుప్తుల కాలంనాటి ప్రాచీన భారతదేశ చరిత్ర రచనకు ఆధారాలు అనేకం ఉన్నాయి. ఆ ఆధారాలను మూడు విభాగాలు చేయవచ్చు. అవి 1. గ్రంథాలు 2. శాసనాలు 3. జ్ఞాపకచిహ్నాలు, ముద్రలు, కళాఖండాలు, చిత్రాలు, నాణాలు మొదలైనవి.

గ్రంథాల్లో ముఖ్యమైనవి, విశాఖదత్తుడు రచించిన ‘ముద్రారాక్షసం’, ‘దేవి చంద్రగుప్తం’ మొదలైన స్వదేశీ గ్రంథాలు, హుయాన్ త్సాంగ్, ఫాహియాన్ అనే విదేశీ రాయబారులు రచించిన సి-యూ-కి, షో-కువో-కి అనేవి.

శాసనాల్లో ముఖ్యమైనవి రెండో చంద్రగుప్తుడి కాలంనాటి ఉదయగిరి గుహల్లోని శాసనాలు, మధుర శిలా శాసనం, సాంచి శిలా శాసనం మొదలైనవి. ఇవి ఆనాటి ప్రభుత్వ విధానాన్ని, మత విధానాన్ని తెలియజేస్తాయి. జునాగఢ్ శాసనం, ఇండోర్ రాగి రేకు శాసనం, స్కంధగుప్తుని గురించి తెలుపుతున్నాయి.

ఇంకా గుప్తుల కాలంనాటి జ్ఞాపక చిహ్నాలైన అజంతా, ఎల్లోరా గుహల్లోని చిత్రలేఖనం, వారు ప్రవేశపెట్టిన వివిధ రకాలైన నాణాలు వారి ఆర్థిక, సాంస్కృతిక రంగాల ప్రగతిని తెలియజేస్తున్నాయి.

ప్రశ్న 7.
సముద్రగుప్తునిపై సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు:
గుప్తచక్రవర్తులలో సముద్రగుప్తుడు (క్రీ.శ. 335-380) అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

తొలి జీవితం: సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. మొదటి చంద్రగుప్తుడు తన వారసుడిగా సముద్రగుప్తుడిని నియమించాడు. కాని సముద్రగుప్తుడు జ్యేష్ఠుడు కానందున వారసత్వయుద్ధం జరిగిందని, అందులో తన అన్న “కచుని” సముద్రగుప్తుడు ఓడించాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కాని “కచుడు” అనునది సముద్రగుప్తునికి గల మరియొక పేరని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్ లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1) మొదటి ఆర్యావర్త విజయాలు 2) దక్షిణభారత విజయాలు 3) రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం 9 మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సరిహద్దు రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు వున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.

ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 351లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 8.
గుప్తుల పాలనలో సమాజం, ఆర్థిక స్థితి, మతం వివరించండి.
జవాబు:
సమాజం: సామాజిక ఏర్పాటుకు కుల వ్యవస్థ ఆధారం. సమాజం నాలుగు వర్గాలుగా విభజించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణులు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవించబడ్డారు. చక్రవర్తులు కూడా వీరిని సత్కరించేవారు. అనేక విషయాల్లో పురోహితుడే చక్రవర్తికి ప్రధాన సలహాదారుడు. బ్రాహ్మణుల తరువాత క్షత్రియులు, వైశ్యులు గౌరవ స్థానాల్లో ఉన్నారు. ‘చండాలుర’ గురించి ఫాహియాన్ తెలిపాడు. సాధారణంగా వారు వేటగాళ్ళు, మత్స్యకారులు, కసాయి వారు అయి ఉండవచ్చని తెలుస్తుంది.

స్త్రీ స్థానం: కొన్ని అంశాల్లో స్త్రీ హోదా గుప్తుల కాలంనాటి సమాజంలో తగ్గింది. బాల్య వివాహాలు విస్తారంగా జరిగేవి. ‘సతీసహగమనం’ క్రమంగా వాడుకలోకి వచ్చింది.

ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్ రాజ్య భాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

పెద్ద కేంద్ర సైన్యం, అధికార వర్గం లేకపోవడం: మౌర్యులకు భిన్నంగా, గుప్తులకు పెద్ద వ్యవస్థీకృత సైన్యం లేదు. భూస్వాములు పంపే సైన్యమే గుప్తుల సైన్యంలో ప్రధాన భాగం. అదేవిధంగా అధికార వర్గం కూడా లేదు. వీటివల్ల పాలనా యంత్రాంగంపై చక్రవర్తి నియంత్రణ తగ్గింది.

భూస్వామ్య అంశాల అభివృద్ధి:

 • భూదానాలు చేయడం: పురోహితులకు, దేవాలయ భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
 • సేద్యపు బానిసత్వం: భూదానాలు, భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు, ఇతరులకు ఇచ్చినప్పుడు దానితోపాటు సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

ప్రశ్న 9.
హర్షవర్ధుని గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
గుప్త సామ్రాజ్యం పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. వాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వర పాలకులలో హర్షుడు ప్రముఖుడు. (క్రీ.శ. 606-647). హర్షుడు తన జైత్రయాత్ర ద్వారా ఉత్తర భారత రాజకీయ ఏకీకరణను సాధించాడు.

చారిత్రక ఆధారాలు: హర్షుని చరిత్రను తెలుసుకోవటానికి బాణుడు రచించిన హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సి-యూ-కి, హర్షుడు వేయించిన బన్సీభేరా, మధుబన్, సోనేపట్ శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాలు కూడా నాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తాయి.

తొలి జీవితం: హర్షుడు పుష్యభూతి వంశస్థుడు. ఇతడి తండ్రి ప్రభాకర వర్ధనుడు. ప్రభాకర వర్థనుడి మరణానంతరం హర్షుని సోదరుడు రాజ్యవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. అయితే గౌడ శశాంకుని కుట్రకు రాజ్యవర్ధనుడు బలైపోయాడు. అంతట క్రీ.శ. 606 లో హర్షుడు తన 16వ ఏట స్థానేశ్వర రాజ్య సింహాసనాన్ని ‘రాజపుత్ర’ అను బిరుదుతో అధిష్టించాడు.

తొలి ఘనకార్యాలు: సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతియైన భాస్కరవర్మతో మైత్రిని పొందాడు. తరువాత మాళవ, గౌడాధీశులను ఓడించాడు. వింధ్య అడవులకు పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తన సోదరి రాజ్యశ్రీని రక్షించాడు. అంతట కనోజ్ మంత్రి పరిషత్ విన్నపం మేరకు స్థానేశ్వరం, కనోజ్ రాజ్యాలను కలిపి “శ్రీలాదిత్య” అను బిరుదుతో పరిపాలనను ప్రారంభించాడు. తన రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్కు మార్చాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు హర్షుడు రాజ్యశ్రీతో కలిసి పాలించినట్లు తెలుస్తున్నది.

జైత్రయాత్రలు: శూరుడైన హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకొని 6 సంవత్సరాలపాటు నిరంతరంగా దిగ్విజయ యాత్ర సాగించి సామ్రాజ్యాన్ని విస్తరింపచేసినట్లు హుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. మొదట గృహవర్మ మరణానికి కారకుడైన మాళవరాజు దేవగుప్తుడిని తొలగించి, అతని తమ్ముడు మాధవగుప్తుడికి సింహాసనాన్ని అప్పగించి తనకు సామంతుడిగా చేసుకున్నాడు. వల్లభిరాజు ధృవసేనుడిని ఓడించి అతనికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు. క్రీ.శ. 637లో తూర్పు ప్రాంతానికి దండయాత్రలకు వెళ్ళి వంగ, మగధ, గంజామ్ (ఒరిస్సా) ప్రాంతాలను పాలిస్తున్న శశాంకుడిని ఓడించాడు.

పులకేశి చేతిలో ఓటమి: ఉత్తరాపథంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని దక్షిణాపథాన్ని కూడా జయించాలని హర్షుడు నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనతో దక్షిణాపథంపై దండయాత్రకు బయలుదేరాడు. కాని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి హర్షుని నర్మదానదీ తీరప్రాంతంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మదానది ఇరువురి రాజ్యాలకు మధ్య సరిహద్దు అయింది. ఈ విషయాన్ని రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో వివరించాడు.

రాజ్య విస్తీర్ణం: హర్షుని సామ్రాజ్యంలో తూర్పు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, గంజామ్ ప్రాంతాలు మాత్రమే చేరాయి. రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో హర్షుని “సకలోత్తరపధేశ్వరుని”గా వర్ణించటాన్ని బట్టి ఉత్తర భారతదేశమంతా హర్షుని ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

పాలన: హర్షుడు సమర్ధవంతుడైన పాలకుడు. ప్రజాసంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. ప్రజల స్థితిగతులను కనుగొనుటకు అతడు విస్తృతంగా పర్యటించేవాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. హర్షుడు తన సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, విషయాలుగాను, గ్రామాలుగాను విభజించాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసేవాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరములు అధికంగా ఉండేవి. హర్షుని సైన్యంలో 5వేల ఏనుగులు, 2వేల గుర్రాలు, 50వేల కాల్బలము ఉన్నట్లు తెలుస్తున్నది.

దాన ధర్మాలు: బీదలకు దానధర్మములు చేయుటలో హర్షుడు అశోకుని అనుసరించాడు. రోగులకు, బాటసారులకు అనేక సౌకర్యములు కల్పించాడు. ప్రయాగలో మహామోక్షపరిషత్తును ఐదేండ్లకొకసారి జరుపుచూ, సర్వస్వదానము అను మహావ్రతమును చేశాడు. అందు మొదటిరోజు బుద్ధుని, రెండవ రోజు సూర్యుని, మూడవ రోజు శివుని పూజించి 5 లక్షల జనులకు దానధర్మములు చేశాడు.

విద్యా, సారస్వత పోషణ: హర్షుడు విద్యా, సారస్వతాలను కూడా ఆదరించాడు. నలందా విశ్వవిధ్యాలయానికి 100 గ్రామాలను దానం చేశాడు. పండిత పోషణకు తన ఆదాయంలో 4వ వంతును వినియోగించాడు. హర్షుడు స్వయంగా కవి. ఇతడు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలను రచించాడు. ఇతని ఆస్థాన కవి బాణుడు “హర్షచరిత్ర”, “కాదంబరి” అను వచన కావ్యాలను రచించాడు. సుభాషిత శతకాన్ని రచించిన భర్తృహరి, సూర్య శతకాన్ని రచించిన మయూరుడు, మతంగ దివాకరుడు హర్షుని ఆస్థానంలోనే వారే.

ఘనత: ప్రాచీన చరిత్రలో అగ్రగణ్యులైన చక్రవర్తులలో హర్షుడు ఒకడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. విజేతగా, సామ్రాజ్య నిర్మాతగా, ధర్మతత్పరుడిగా, ఉదార పాలకుడిగా, సాహితీవేత్తగా, విద్యాభిమానిగా హర్షుడు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాడు. ఇతనిలో అశోకుడు, సముద్రగుప్తుడు, భోజరాజువంటి ప్రముఖుల విశిష్ట లక్షణాలన్నీ ఉన్నాయి. గుప్త యుగానికి, రసపుత్ర యుగానికి మధ్య వారధిగా హర్షుని చరిత్రకారులు పేర్కొన్నారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’
జవాబు:
అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారములలో అర్థశాస్త్రము ప్రముఖమైనది. అర్థశాస్త్రమనగా ఆర్థికశాస్త్రము కాదు. ఇది రాజనీతి శాస్త్రము. ఇందు చక్రవర్తి యొక్క విధులు, సైనిక విధానము, దండనీతి మొదలగు అంశములు పేర్కొనబడెను. అయితే రాజనీతి అంశములతోపాటు ఆర్థిక విషయములు కూడా పేర్కొనబడెను. అర్థశాస్త్రమందు కౌటిల్యుడు “రాజ్యమును సంపాదించుటకు కుటిల మార్గములను” కూడా పేర్కొనెను. అటులనే చెరువులో గల చేపలు నీరు త్రాగకుండా ఎట్లు ఉండలేవో, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు కూడా తీసుకోకుండా ఉండలేరు అని పేర్కొనెను.

ప్రశ్న 2.
ఇండికా
జవాబు:
చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాజైన సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్. భారతదేశంలో ఉన్నంతకాలం తాను చూచిన, విన్న విషయాలను ఇండికా అను పేరుతో గ్రంథస్తం చేశాడు. అయితే ఇండికాలోని కొన్ని భాగాలు మాత్రమే నేడు లభ్యమౌతున్నాయి. ఈ గ్రంథం వల్ల నాటి పాలనావిధానం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. భారతదేశంలో బానిసవ్యవస్థ లేదని, భారతీయులలో 7 కులాలవారున్నారని మెగస్తనీస్ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి మెగస్తనీస్ సవివరంగా వివరించాడు. ఇతడు విదేశీయుడు. ఇతనికి భారతీయ సంస్కృతీ పరిజ్ఞానం పూజ్యం కాబట్టి ఇతని రచనను స్వవిమర్శతో స్వీకరించవలసి ఉంటుంది.

ప్రశ్న 3.
ధమ్మ మహామాత్రులు
జవాబు:
అశోకుడు నూతన నైతిక నియమావళిని ప్రజలముందుంచాడు. ప్రజల నైతికతను అభివృద్ధి చేయాలనుకొన్నాడు. తన మతాన్ని వ్యాప్తిచేయడానికి ‘ధమ్మ మహామాత్రులు’ అనే ఉద్యోగులను నియమించాడు. 13వ శిలాశాసనంలో అశోకుడు ధమ్మ మహామాత్రుల నియామకం గురించి ఇలా అన్నాడు. “అన్ని మత శాఖలకు ధమ్మ మహామాత్రులను నియమించాను వారు అన్ని ధార్మిక ప్రదేశాలను పరిరక్షిస్తూ ఉంటారు. ప్రజలకు తన మత నైతిక నియమావళిని బోధించడమే వారి విధి. మానవుల సంక్షేమం, వివిధ మత, ధార్మిక కార్యక్రమాల అమలుకు కృషిచేయాలి”. 6వ శిలాశాసనంలో ‘ధమ్మ మహామాత్రుల పనితీరుపై పర్యవేక్షణ కోసం తగిన ఏర్పాట్లు అశోకుడు చేశాడు’ అని పేర్కొనబడింది.

ప్రశ్న 4.
కళింగ యుద్ధం
జవాబు:
కళింగ ప్రాభవం తగ్గించడానికి అశోకుడు కళింగ యుద్ధం (క్రీ.పూ. 261) చేశాడు. అనేకమంది చంపబడటం తీవ్ర రక్తపాతానికి దారితీసింది. చివరికి అశోకుడు యుద్ధంలో గెలిచాడు. కళింగ యుద్ధ వివరాలు అశోకుని 13వ శాసనంలో ఉన్నాయి. ఇది చాలా ప్రాధాన్యత ఉన్న యుద్ధంగా గుర్తించబడింది. ఎందుకంటే ఈ యుద్ధానంతరం అశోకుడు ధర్మ అశోకుడిగా గుర్తించబడ్డాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
సారనాధ్
జవాబు:
అశోకుడు నిర్మించిన స్తంభాలలో మిక్కిలి ప్రఖ్యాతి గాంచినది సారనాధ్ స్తంభం. సారనాధ్ స్తంభంపై గంట, ఫలక, నాలుగు దిక్కులను తెలిపే నాలుగు జంతువులు (ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం) ఉన్నాయి. జంతువుల మధ్య ధర్మచక్రం ఉంది. వీటికిపైన నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. అవి నాలుగు దిక్కులకు అభిముఖంగా, తమ వెనుక భాగాలు ఒకదానితో ఒకటి తాకుతున్నట్లుగా నిలిచి ఉన్నాయి. స్తంభపీఠం అంచులచుట్టూ మృగాలు, పుష్పాలు, పక్షులు మనోహరంగా చిత్రించబడి ఉన్నాయి. నాలుగు సింహాలలో మూడు మాత్రమే మనకు కనిపిస్తాయి. సింహాల క్రింద భాగంలో ‘సత్యమేవజయతే’ (సత్యమే జయిస్తుంది) అని వ్రాసి ఉంది.’ ఈ సూక్తిని మండకోపనిషత్ నుండి గ్రహించారు. ఈ సారనాధ్ సింహాల కిరీటాన్ని భారత ప్రభుత్వం అధికార చిహ్నంగా స్వీకరించింది.

ప్రశ్న 6.
ఫాహియాన్
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్. బుద్ధుడు జన్మించిన పవిత్రభూమిని చూడాలని, బుద్ధుని ధాతువులను, బౌద్ధ గ్రంథాలను సేకరించాలని ఇతడు భారతదేశం వచ్చాడు. గుప్తుల కాలంనాటి భారతదేశ స్థితిగతులను తన పో-కూ-వో-కి అను గ్రంథంలో వివరించాడు.

ప్రశ్న 7.
అలహాబాద్ స్తంభ శాసనము
జవాబు:
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 8.
కాళిదాసు
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానమును అలంకరించిన నవరత్నములు అను కవులలో అగ్రగణ్యుడు కాళిదాసు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము, కుమార సంభవము, విక్రమోర్వశీయము, మేఘసందేశము, మాళవికాగ్నిమిత్రము మొదలగు ప్రముఖ గ్రంథములు రచించాడు.

ప్రశ్న 9.
అజంతా గుహలు
జవాబు:
భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్దతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభోగానికి ప్రతీకగా నిలిచిన అజంతా గుహలు ముఖ్యమైనవి. ఈ అజంతా గుహలు మహారాష్ట్రలో కలవు. ఈ గుహల నిర్మాణం ఆనాటి కళానైపుణ్యమునకు నిదర్శనం.

ప్రశ్న 10.
కనిష్కుడు
జవాబు:
కనిష్కుడు గొప్ప సాహిత్య కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుని ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు ‘బుద్ధ చరిత్ర’, ‘సౌందరానంద కావ్యం’ ముఖ్యమైనవి. ఇతని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత, కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 11.
గాంధార శిల్పం
జవాబు:
భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధూ నదికి ఇరువైపులావున్న ప్రాంతాన్ని గాంధారము అంటారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన కళను గాంధార కళ అంటారు. ఇక్కడి బౌద్ధశిల్పాలు భారతీయ, గ్రీకో-రోమన్ లక్షణాలను కలిగివుంటాయి. కనుక భారతీయ, గ్రీకు, రోమన్ శిల్పకళల సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. ఈ శిల్పంలో మలచబడిన బుద్ధుని విగ్రహాలకు పలుచని వస్త్రాలు, రోమన్ ఉంగరాల జుట్టు, సహజత్వం, కండలు తిరిగిన శరీర భాగాలు ఎంతో అందంగా ఉంటాయి. అందువల్లనే గాంధార శిల్పికి భారతీయుల హృదయము, గ్రీకుల నేర్పరితనము ఉన్నాయని అంటారు. ఈ కళ ఇండో-గ్రీకుల కాలంలో భారతదేశంలోకి ప్రవేశించింది. కుషాణుల కాలంలో, ముఖ్యంగా కనిష్కుని కాలంలో ఉచ్ఛస్థితికి చేరుకుంది.

ప్రశ్న 12.
మధుర కళ
జవాబు:
జైన మతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో, మత భావనలు ప్రదర్శితమయ్యేటట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తి భావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్ప శైలిలో నిర్మించడం జరిగింది.

ప్రశ్న 13.
హుయన్సాంగ్
జవాబు:
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ (క్రీ.శ. 630-644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వవిద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యూ-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

 

ప్రశ్న 14.
మహామోక్ష పరిషత్
జవాబు:
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్కు హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడట.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 15.
హూణులు
జవాబు:
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 16.
బాణుని ‘హర్ష చరిత్ర’
జవాబు:
హర్షచరిత్ర అను గ్రంథాన్ని హర్షుని ఆస్థానకవి బాణుడు రచించాడు. మహాశివభక్తుడైన ‘పుష్యభూతి’ ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల హర్షుని వంశానికి పుష్యభూతి వంశమని పేరు వచ్చినట్లు ఈ గ్రంథం వల్ల తెలుస్తున్నది. ఈ గ్రంథం హర్షుని తండ్రి ప్రభాకరవర్ధనుని ‘హూణ హరిణకేసరి’ అని వర్ణించింది. ఈ గ్రంథము హర్షుని జీవితమును, |అతని పాలనాకాలం నాటి దేశ, కాల పరిస్థితులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది.