Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు Textbook Questions and Answers.
AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
క్రీ.శ. 8వ శతాబ్దం వరకు గల దక్కన్ చరిత్రను అధ్యయనం చేయడానికి సహకరించే ముఖ్య ఆధారాలను చర్చించండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేందుకు అనేక సాహిత్య ఆధారాలతోపాటు శాసనాలు దోహదపడుతున్నాయి సంగం యుగంలోని తమిళ రచనల్లో తోలకప్పియార్ రచించిన ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథం సంగం యుగం నాటి సామాజిక, సాంస్కృతిక స్థితులను గురించి విలువైన సమాచారం అందిస్తోంది. ప్రసిద్ధ తమిళ రచయిత తిరువళ్ళువార్ రచించిన ‘తిరుక్కురల్’ తమిళ దేశానికి బైబిల్ వంటిది. ఈ రచన ఆ కాలం నాటి సాంఘిక జీవనం, నైతిక విలువలకు అద్దం పడుతుంది.
శాతవాహనుల కాలంనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులకు మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మ పురాణాలు, గుణాడ్యుడి బృహత్కథ, హాలుడి గాథా సప్తసతి, వాత్సాయనుడి కామసూత్రాలు, మెగస్తనీస్ ఇండికా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలతోపాటు ప్లినీ, టాలేమీ రచనలు అద్దం పడుతున్నాయి. మొదటి మహేంద్రవర్మ ‘మత్తవిలాసప్రహసనం’ అనే గొప్ప కావ్యాన్ని రచించాడు. భారవి ‘కిరాతార్జునీయం’ దండిన్ ‘దక్షకుమార చరిత్ర’ అనే గ్రంథాలు తమిళ ప్రజల సాంఘిక, మత, జీవనానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించాయి. చైనా యాత్రికుడు హుయానా త్సాంగ్ రచనలు పల్లవ, చాళుక్య యుగాలకు చెందిన విలువైన చారిత్రక విషయాలను వెల్లడించాయి.
శాసనాలు కూడా దక్షిణ భారతదేశ పాలకులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. శాతవాహనుల శాసనాలు నాసిక్, కార్లే, బెడ్స, అమరావతి, ధరణీకోట, నానాఘాట్, కొండాపూర్, పైథాన్, భట్టిప్రోలు, నాగార్జున కొండల్లో లభించాయి. వీటిలో శాతవాహనుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత విషయాలు వివరించబడ్డాయి.
చాళుక్యుల శాసనాల్లో బాదామి చాళుక్యుల ఐహోలు శాసనం రెండవ పులకేశి హర్షవర్ధనుడిపై సాధించిన విజయాన్ని వివరిస్తుంది. ఈ శాసనాలతో పాటు నాణాలు కూడా దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ప్రశ్న 2.
సంగం యుగంలోని ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
సంగం యుగంలో ఈ క్రింది అంశాలు కలవు. అవి.
రాజకీయ వ్యవస్థ: నాడు నిరంకుశ రాజరికపు వ్యవస్థ అమల్లో వుంది. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. సభ అనే ప్రజాసభ పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇచ్చేది. గ్రామపాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధంలో పాల్గొనడం, యుద్ధంలో వీరమరణం పొందడం గౌరవప్రదమైందిగా భావించేవారు.
సాంఘిక,ఆర్థిక, మతజీవనం: చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. వనం, వరైని, తుడియం, కడంబన్ అనేవి చతుర్వర్ణాలు. అయితే వర్ణ వ్యవస్థ నిరంకుశంగా ఉండేది కాదు. సమాజంలో బ్రాహ్మణులు గౌరవప్రదమైన స్థానాన్ని అనుభవించేవారు. వ్యాపారులు, సంపన్నులు సుఖమయమైన జీవితాన్ని గడిపారు. బానిస వ్యవస్థ అమలులో ఉన్నట్లు
ఆధారాలున్నాయి.
వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, పశుపోషణ, కుండల తయారి, నేతపని వంటి వృత్తులు కూడా ఉండేవి. ప్రజల ఆర్థిక జీవనాన్ని శ్రేణులు క్రమబద్ధీకరించేవి. శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే పద్ధతి అమలులో వుంది.
ప్రజల మత జీవనంలో వైదిక పద్ధతి, తమిళ సంప్రదాయం మిళితమై కనిపిస్తాయి. ప్రాచీన తమిళులు ప్రకృతి శక్తులు, సర్పాలు, వివిధ పిశాచాలను ఆరాధించేవారు. దేవతలకు యజ్ఞయాగాలను సమర్పించారు. దేవాలయ పూజా విధానంలో సంగీత, నృత్యాలు భాగంగా ఉండేవి. నాడు ప్రజలు శైవమతాన్ని అధికంగా అవలంబించారు. శివుడు, సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవతలు.
సాహిత్యం: సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని ‘తోలకప్పియార్’ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.
ప్రశ్న 3.
గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
శాతవాహన పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 78-102) 23వ వాడు. ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం వలన ఇతని ఘనతను తెలుసుకోవచ్చు. ఈ శాసనం వలన ఇతడు శక, యవన, పహ్లవ, క్షహరాట వంశాలను నాశనం చేశాడని, శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడని తెలుస్తున్నది. గౌతమీ బాలశ్రీ మరొక నాసిక్ శాసనంలో తాను గొప్ప చక్రవర్తికి తల్లినని, మరొక రాజుకు “మహారాజ పితామహి”నని చెప్పుకుంది. దీనిని బట్టి శాతకర్ణి గొప్ప యుద్ధవీరుడని తెలుస్తున్నది. ఇతడు అనేక క్షత్రియ రాజవంశాలను జయించి “క్షత్రియ దర్పమానమర్ధన” అనే బిరుదు ధరించాడు. మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించి “త్రిసముద్రతోయ పీతవాహన” అను బిరుదును ధరించాడు. మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, సౌరాష్ట్ర, మాళవ, విదర్భ రాజ్యాలు ఇతని ఆధీనంలో ఉన్నాయి. నాసిక్ శాసనాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని న్యాయబద్ధంగా పన్నులు విధించేవాడని, పేదవారికి, బ్రాహ్మణులకు భూదానాలు చేసేవాడని తెలుస్తున్నది. ఈ శాసనాలే గౌతమీపుత్ర శాతకర్ణికి వర్ణవ్యవస్థ మీద ప్రగాఢమైన నమ్మకముందని, బ్రాహ్మణ కులాన్ని వర్ణసంకరం కాకుండా రక్షించాడని, “ఏకబ్రాహ్మణుడు” అనే బిరుదు ధరించాడని పేర్కొన్నాయి. ఇతడికి ఉన్న “ఆగమనిలయ” అను బిరుదు వల్ల ఇతనికి ఆగమశాస్త్రాలపై అవగాహన ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కారణాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో గొప్పవాడని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
పల్లవ పాలకులైన మహేంద్రవర్మ, మొదటి నరసింహ వర్మ సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి మహేంద్రవర్మ (క్రీ.శ. 600-630): ఇతను సింహవిష్ణువు కుమారుడు. గొప్ప యోధుడు. ఇతను ఉత్తరాన కృష్ణానది వరకు తన అధికారాన్ని విస్తరింపచేశాడు. ఇతని కాలంలోనే పల్లవులకు చాళుక్యులకు మధ్య స్పర్థ ఆరంభమైంది. క్రీ.శ. 630లో చాళుక్య రాజైన రెండోపులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి, పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మను ఓడించాడు. యుద్ధం తర్వాత కొద్ది కాలానికే మహేంద్రవర్మ మరణించాడు. మహేంద్రవర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను మొదట జైనమతస్థుడైనప్పటికీ తర్వాత అప్పార్ బోధనలవల్ల శైవమతస్థుడయ్యాడు. ఇతను కవి. ‘మత్త విలాస ప్రహసన’మనే నాటకాన్ని రచించాడు. సంగీతంలో ఆసక్తి, ప్రవేశమూ ఉన్నవాడు. వాస్తు, శిల్ప, చిత్ర లేఖనాలను పోషించాడు. ఇన్ని విశిష్ట గుణాలున్నవాడవటం వల్ల ఇతను ‘చిత్రకారపులి’ అని, ‘విచిత్రచిత్తుడ’నే ప్రశంసనందుకొన్నాడు.
మొదటి నరసింహవర్మ (క్రీ.శ. 630-668): ఇతను మహేంద్రవర్మ కుమారుడు. పల్లవ రాజులందరిలోనూ అగ్రగణ్యుడు. సింహాసనమెక్కిన వెంటనే నరసింహవర్మ చాళుక్యుల దండయాత్రను ఎదుర్కోవలసి వచ్చింది. క్రీ.శ. 641లో రెండో పులకేశి పల్లవ రాజ్యంపైకి దండెత్తినప్పుడు పల్లవసేనలు అతణ్ణి ఓడించి తరమడమేకాక నరసింహవర్మ నాయకత్వంలో బాదామి వరకు నడిచి పులకేశిని వధించి బాదామిని దోచుకొన్నాయి. తర్వాత చోళ, పాండ్య ప్రభువులు నరసింహవర్మకు సామంతులయ్యారు. ఈ విజయాలకు నిదర్శనంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులను ధరించాడు.
నరసింహవర్మ కూడా తండ్రి మహేంద్రవర్మలాగా సారస్వతాన్నీ, వాస్తు, లలిత కళలనూ పోషించాడు. ఇతను మహామల్లపురం (మహాబలిపురం)లో ఏకశిలా రథాలనే దేవాలయాలను నిర్మింపచేశాడు. సంస్కృతంలో ‘కిరాతార్జునీయం’ అనే కావ్యాన్ని రచించిన భారవి కవిని ఇతను ఆదరించినట్లుగా తెలుస్తున్నది. నరసింహవర్మ కాలంలోనే హుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాంచీపురాన్ని దర్శించాడు. పల్లవుల రాజ్యాన్ని తమిళ దేశంగా వర్ణిస్తూ ఇక్కడి ప్రజలు నీతిపరులని, సత్యప్రియులని, శ్రమజీవులని, వీరికి విద్యావ్యాసాంగాలలో శ్రద్ధాసక్తులు అధికమని చెప్పాడు. కాంచీపురంలో దాదాపు 100 బౌద్ధారామాలు, 80 దేవాలయాలు ఉన్నట్లుగా కూడా ఇతను తెలిపాడు. నలందా విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుడి జన్మస్థలం కాంచీపురమని ఇతను రాశాడు.
ప్రశ్న 5.
పల్లవయుగంలోని రాజకీయ, సామాజిక ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.
మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హుయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.
విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.
వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ”గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.
ప్రశ్న 6.
రెండవ పులకేశి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
రెండోపులకేశి (క్రీ.శ. 609-642): రెండో పులకేశి బాదామి చాళుక్యుల్లోనే గాక ప్రసిద్ధ భారతీయ చక్రవర్తుల్లో ఒకడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణాపథాన్ని పూర్తిగా జయించి ఏలిన మొదటి సార్వభౌముడు రెండో పులకేశి. ఇతని విజయాలను రవికీర్తి అనే జైన పండితుడు ‘ఐహోలు’ (ఐహోళి) శాసనంలో వివరించాడు. అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత, రెండో పులకేశి దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇతడు బనవాసి, కొంకణ రాజ్యాలను జయించాడు. లాట, మాళవ, అళుప (ఉడిపి మండలం), ఘూర్జర ప్రభువులనణచి సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ కోసల, కళింగ రాజ్యాల మీద దండయాత్రలను నిర్వహించాడు. పిష్ఠపురం, కునాల (కొల్లేరు) యుద్ధాల్లో విజయాన్ని సాధించి వేంగిని ఆక్రమించాడు. అనంతరం తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు. పులకేశి మరణం తర్వాత, వేంగీ పాలకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులుగా ప్రసిద్ధి గాంచారు. తర్వాత ఇతడు చేర, చోళ, పాండ్యరాజుల మైత్రిని సంపాదించి, పల్లవ రాజ్యంపై దండెత్తి, మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు ఇది నాంది. పులకేశి విజయాలన్నిటిలో ఘనమైంది హర్షవర్ధనుణ్ణి ఓడించడం. ‘సకల ఉత్తరాపథేశ్వరుడైన, హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలని దండెత్తి వచ్చినప్పుడు పులకేశి అతణ్ణి నర్మదానది ఒడ్డున ఓడించి ‘పరమేశ్వర’ బిరుదును స్వీకరించాడు.
ఈ విజయ పరంపరలతో పులకేశి కీర్తి ప్రతిష్ఠలు దిగంతాలకు వ్యాపించాయి. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పులకేశి శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాడు. అజంతా మొదటి గుహలోని రెండు చిత్రాలు, ఈ రాయబారాలకు సంబంధించినవేనని కొందరి అభిప్రాయం. క్రీ.శ. 640-641 ప్రాంతంలో చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ చాళుక్య రాజ్యాన్ని దర్శించి తన అనుభవాలను వివరించాడు. పులకేశి సామ్రాజ్యం సారవంతమై, సిరి సంపదలతో తులతూగుతున్న దేశమని అతను తెలిపాడు. అక్కడి ప్రజలు యుద్ధప్రియులని, మేలు చేసిన వారిపట్ల కృతజ్ఞులై ఉంటారని వారికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సంసిద్ధులవుతారని, అలాగే కీడు తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనిదే నిద్రపోరని అతను వివరించాడు. వారి రాజు పు-లో-కే-షి (పులకేశి) క్షత్రియ వీరుడని, తన ప్రజలను, సైనిక బలాన్ని చూసుకుని అతడు గర్విస్తాడని, పొరుగు రాజ్యాలంటే అతనికి లక్ష్యం లేదని అతను వర్ణించాడు.
ఇన్ని గొప్ప విజయాలను సాధించిన పులకేశి జీవితం విషాదాంతమైంది. క్రీ.శ. 641లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యం మీద దండెత్తినపుడు పల్లవరాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించాడు. ఈ పరాజయం నుంచి బాదామి చాళుక్యులు ఒక శతాబ్దం వరకు కోలుకోలేదు.
ప్రశ్న 7.
అమోఘవర్ష సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
రాష్ట్రకూట పాలకుల్లో మొదటి అమోఘవర్ష (క్రీ.శ. 814-878) గొప్ప పాలకుడు. ఇతడు మూడవ గోవిందుడి కుమారుడు. అతడు స్థానిక పాలకులు, సామంతుల తిరుగుబాట్లను అణచివేశాడు. అతడు వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. గంగరాజును ఓడించాడు. అతడు స్వయంగా గొప్పకవి, కవిపండిత పోషకుడు. కన్నడంలో ‘కవిరాజమార్గం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ‘మంఖేడ్’ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అమోఘవర్ష తరువాత అతని కుమారుడైన రెండవ కృష్ణుడు సింహాసనాన్ని అధిష్టించాడు. రెండవ కృష్ణుడి పాలనాకాలంలో రాష్ట్రకూట రాజ్యం ప్రాభావాన్ని సంతరించుకొన్నది. చివరకు రాష్ట్ర కూట రాజ్యాన్ని (క్రీ.శ. 974-975 సం॥లో) తూర్పు చాళుక్య రాజు రెండవ శైలుడు అంతమొందించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
ప్రశ్న 8.
రాజరాజ చోళుడు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదులున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను యుద్ధం చేసి ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు.
రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వేచేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.
ప్రశ్న 9.
మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి రాజేంద్రుడు (క్రీ.శ. 1014-1044): రాజరాజు తరువాత చోళ సింహాసనాన్ని అధిష్టించినవాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతడు తండ్రిని మించిన శూరుడుగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. అతడు తండ్రివలెనే దిగ్విజయ యాత్రలు సాగించి సామ్రాజ్య వ్యాప్తికి పాటుపడ్డాడు. మొదట పాండ్య, చేర రాజ్యములను జయించాడు. ఆ తరువాత సింహళముపై నౌకాదండయాత్రలు సాగించి దానినంతటిని జయించి తన ఆధిపత్యము క్రిందకు తెచ్చాడు. చాళుక్యరాజ్యంలో జరిగిన వారసత్వ యుద్ధాల్లో వేంగి చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునకు సహాయం చేశాడు. రాజరాజనరేంద్రునికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. తరువాత గంగానది వరకు దండయాత్రలు చేసి, బెంగాల్ పాలవంశీయుడైన మహీపాలుని ఓడించి “గంగైకొండచోళ” అను బిరుదు ధరించాడు. ఈ విజయానికి గుర్తుగా “గంగైకొండ చోళాపురము” అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత గొప్ప నౌకాబలమును రూపొందించుకొని జావా, సుమత్రా ప్రాంతములను పాలించే శ్రీవిజయ సామ్రాజ్యాధినేతయైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి, అతని రాజధాని కడారం స్వాధీనం చేసుకొన్నాడు. ఈ విజయమునకు చిహ్నంగా “కడారంకొండ” అనే బిరుదును ధరించాడు. ఇట్టి దిగ్విజయముల వలన రాజేంద్రచోళుడు భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తిని పొందాడు. ఇతడు తన తండ్రివలె గొప్ప పరిపాలనాదక్షుడు. వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక నీటివనరులను ఏర్పరచాడు. వైదిక కళాశాలను స్థాపించి, దాని పోషణకు కొంత భూభాగమును దానము చేశాడు. ఇతడు గొప్ప భవన నిర్మాత. ప్రజాసంక్షేమ పాలన సాగించి, “తండ్రిని మించిన తనయుడు” అనే కీర్తిని పొందాడు. ఇతడు శిల్పకళను ఆదరించాడు. గంగైకొండ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు.
ప్రశ్న 10.
చోళుల స్థానిక స్వపరిపాలనలోని గొప్ప అంశాలను తెలియచేయండి.
జవాబు:
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.
గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.
గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్. 2) సభ. 3) నగరం. ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.
సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.
అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు
- 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
- విద్యావంతుడై వుండాలి.
- సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి.
అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు. గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి
- పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు.
- గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు.
- ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే.
- నేరస్తులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.
గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.
ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
దక్కన్, దక్షిణ భారతదేశం అనే పదాలను నిర్వచించండి.
జవాబు:
‘దక్కన్’ అనే పదానికి భాషాపరంగా భారతదేశ భూభాగంలోని దక్షిణ, ద్వీపకల్పభాగం అని అర్థం. క్రీ.శ. 1945సం||లో హైద్రాబాద్ లో జరిగిన దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో దక్కన్ భౌగోళిక సరిహద్దులను పేర్కొన్నారు. దీని ప్రకారం ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన చివరి భూభాగం వరకు, తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రం వరకు ఉన్న భూభాగమే దక్కన్. సాధారణంగా వింధ్య పర్వతాలు, నర్మదానదికి దక్షిణాన తూర్పు నుంచి పడమర వరకు ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశంగా వ్యవహరిస్తారు.
ప్రశ్న 2.
సంగం యుగం నాటి సాహిత్యం
జవాబు:
సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని తోలకప్పియార్ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధానపాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.
ప్రశ్న 3.
కరికాల చోళుడు.
జవాబు:
చోళ రాజుల్లో కరికాల చోళుడు (క్రీ.శ.190) గొప్పవాడు. అతను ‘వెన్ని’ వహైప్పరండలై యుద్ధాలలో చేర, పాండ్య రాజులపై గొప్ప విజయాన్ని సాధించాడు. పూహర్ (కావేరీ పట్టణం) అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. ప్రజాసంక్షేమానికి కృషి చేసి వ్యవసాయ, వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించాడు. శ్రీరంగం సమీపంలో కావేరీనదిపై ఆనకట్టను నిర్మింపచేసి వ్యవసాయానికి నీటిపారుదల వసతిని కల్పించాడు. వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు.
ప్రశ్న 4.
శాతవాహనుల శిల్పకళ
జవాబు:
శాతవాహనుల కాలంలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. ఆంధ్రదేశంలో బౌద్ధ విహారాలు, చైత్యాలు, స్థూపాలు, అధికంగా నిర్మించబడ్డాయి.. బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించిన గొప్ప నిర్మాణమే స్తూపం. చైత్యం ఆరాధన ప్రదేశం. ప్రస్తుత గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరంలోగల అమరావతిలో ఉప స్థూపం శాతవాహనుల కాలం నాటి శిల్పకళావైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ప్రశ్న 5.
శాతవాహనుల కాలంలో మతం
జవాబు:
హిందువులు ఉన్నత స్థితిలో ఉండేవారు. వారిలో కొందరు శైవులు, మరికొందరు వైష్ణవులు. పశుపతి, గౌరి, రుద్రుడు, పార్వతి, లక్ష్మీనారాయణులను దైవాలుగా ప్రజలు పూజించేవారని గాథాసప్తశతి పేర్కొంది. అయితే వారందరిలోనూ త్రివిక్రముణ్ణి గొప్ప దైవంగా పేర్కొంది. కృష్ణుడి కథలు, లీలలు కూడా పరిచితమే. ఈ దేవతలతోబాటు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, కుబేరుడు మొదలైన దేవతల ప్రసక్తి కూడా ఉంది.
రాజులు వైదిక మత క్రతువులను నిర్వహించేవారు. పుణ్యక్షేత్రాలను దర్శించడం, పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం వాడుకలోకి తెచ్చారు. బావులు, చెరువులను తవ్వించడం, బాటలకిరువైపుల చెట్లను నాటించడం, మార్గమధ్యంలో సేద తీర్చుకోవడానికి సత్రాలు కట్టించడం, మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం, బ్రాహ్మణులకు ఎన్నో రకాల దానాలు చేయడం ఆనాటి రాజులు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు.
బౌద్ధమతానికి కూడా విశేష ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా రాణుల ప్రోత్సాహంలో, బౌద్ధభిక్షువులు అంకిత భావంతో ప్రచారం చేయడం వల్ల బౌద్ధమతం ఎంతో అభివృద్ధి చెందినది.
ప్రశ్న 6.
ఐహోలు శాసనం
జవాబు:
ఐహోల్ కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ ప్రదేశంలో పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క సేనాని రవికీర్తి వేయించిన “ఐహోల్” శాసనం ఉంది. ఈ శాసనంలో రెండవ పులకేశి యొక్క దిగ్విజయ యాత్ర, హర్షునిపై అతని విజయం వర్ణించబడ్డాయి. ఐహోల్లో పశ్చిమ చాళుక్యుల నాటి దేవాలయాలున్నాయి.
ప్రశ్న 7.
పల్లవుల శిల్పకళ
జవాబు:
భారతీయ వాస్తు శిల్పకళా రంగాల్లో పల్లవుల కళకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ శిల్పకళ దక్షిణ భారతదేశంలో పల్లవులతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. కట్టడాల్లో రాతిని ఎక్కువగా ఉపయోగించింది మొట్టమొదటగా పల్లవులే కావటం విశేషం. కాంచీపురం, మహాబలిపురం పల్లవుల కాలం నాటి గొప్ప శిల్పకళా కేంద్రాలు. మహేంద్రవర్మ అనేక ఏకశిలా ఆలయాలను నిర్మింపచేశాడు. అందుకు మహాబలిపురంలోని వరాహ, దుర్గ గుహలు చక్కని తార్కాణం. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అద్భుతమైన ఏడు పగోడాలను నిర్మింపచేశాడు. వీటినే ఏడు రథాలు అంటారు. కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం, మహాబలిపురంలోని తీర దేవాలయాలు పల్లవుల నిర్మాణశైలికి, శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రశ్న 8.
బృహదీశ్వర ఆలయం
జవాబు:
తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని చోళరాజు మొదటి రాజరాజు క్రీ.శ. 1009లో నిర్మించాడు. ఇది శివాలయం. ఇది భారతదేశ నిర్మాణాలన్నింటిలో పెద్దది. దీని విమానం ఎత్తు 200 అడుగులు. ఈ ఆలయం వెలుపలి గోడల నిండా మనోహరమైన శిల్పాలు, లోపలి భాగంలో వర్ణచిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశ ఆలయ వాస్తు సాంప్రదాయానికి మకుటాయమానం వంటిది.