AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తురుష్కుల దండయాత్రల ఫలితాలు.
జవాబు:
భారతదేశ చరిత్రలో అరబ్బుల సింధు విజయము “సత్ఫలితాలివ్వని ఘన విజయము” అని స్టాన్లీ లేనప్పూల్ వర్ణించాడు.
1) అరబ్బులు విశాల భారతదేశమున అత్యల్ప భాగమును మాత్రమే జయించుట వలన అది పెద్దగా గుర్తించబడలేదు.

2) పటిష్టమైన వర్ణవ్యవస్థ గల హిందువులు, అరబ్బుల సాంగత్యమును పరిహసించారు.

3) అరబ్బులు ఎంత ప్రయత్నించినను ఇస్లాంను ఇండియాలో వ్యాప్తి చేయలేకపోయారు. కాని తరువాత ముస్లిం విజేతలకు మార్గదర్శకులయ్యారు.

4) హిందువుల కంటే సాంస్కృతికంగా వెనుకబడి వున్న అరబ్బులు హిందూవేదాంతం, ఖగోళ శాస్త్రము, గణితము, వైద్యము మొదలగు శాస్త్రాలను వారి నుండి అభ్యసించారు. బ్రహ్మసిద్ధాంతము, పంచతంత్రము, చరకసంహిత వంటి గ్రంథాలు అరబ్బీ భాషలోకి అనువదించబడ్డాయి. అరబ్బులు భారతీయ చిత్రకారులను, శిల్పులను, పండితులను ఆదరించారు. మొత్తము మీద కొన్ని ప్రాచీన కట్టడాలు తప్ప అరబ్బుల దండయాత్ర భారతదేశమున మిగిల్చినదేమీ లేదు. కాని అరబ్బుల విజయం నుంచి హిందువులు మాత్రం ఎటువంటి గుణపాఠాన్ని గ్రహించలేకపోయారు. మహమ్మదీయులలోని సమతాభావాన్ని గాని, ఐకమత్యాన్నిగాని, వారి యుద్ధతంత్రాన్నిగాని నేర్చుకోలేకపోవటం వల్ల తరువాత కాలంలో తురుష్కుల దండయాత్రలను తిప్పికొట్టలేకపోయారు.

ప్రశ్న 2.
రజియా సుల్తానా.
జవాబు:
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఇలుట్మిష్ కొడుకులు సమర్థులు కానందువల్ల తన వారసురాలిగా తన కుమార్తె రజియాను సుల్తానుగా ప్రకటించాడు. కాని ఇల్లుట్మిష్ మరణానంతరం ఢిల్లీ. సర్దారులు ఇల్టుట్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటంచేత అతడి తల్లి షా తుర్కాన్ పాలించసాగింది. కాని ఆమె అవినీతిపరురాలవటం చేత రజియా సైనికదళ సానుభూతితో ఫిరోజ్న వధించి, ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1236-1240) అధిష్టించింది. ఈమె గొప్ప ధైర్యసాహసాలున్న స్త్రీ, సైన్యాలను నడపటంలోను, ప్రభుత్వ నిర్వహణలోను కడు సమర్థురాలు. కాని ఒక స్త్రీ సుల్తాను కావటం తురుష్క సర్దారులు అవమానంగా భావించారు. ఇల్ల్యుట్మిష్ కాలంలో బానిసలుగా చేరిన వీరు క్రమంగా అమీరులై తమ ప్రాబల్యమును పెంచుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమినే చిహల్గనీ అంటారు. ఈ కూటమి రజియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగింది. చిహల్గానీ నిరంకుశాధికారాలను నిర్మూలించి, సుల్తాన్ అధికారమును పెంపొందించటానికి రజియా కొన్ని చర్యలు చేపట్టింది. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నతోద్యోగములలో నియమించింది. రాష్ట్ర గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. మాలిక్ యాకూబ్ అనే అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించి అతని పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించింది. రజియా యాకూబ్పై అభిమానము చూపటాన్ని సహించలేని ఢిల్లీ సర్దారులు రజియాను పదవీచ్యుతురాలిగా చేయుటకు భటిండా రాష్ట్ర పాలకుడైన కబీర్ ఖాన్ చేతులు కలిపి రజియాపై కుట్రచేసి ఆమెను అంతము చేయదలచారు. ఈ విషయము తెలిసిన రజియా అపార సైనిక బలముతో బయలుదేరి మొదట లాహోర్ పాలకుడైన కబీర్ ఖాన్ తిరుగుబాటును అణచివేసింది. కాని అల్ తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఢిల్లీ సర్దారులు యాకూబ్ను వధించారు. అంతట రజియా ఢిల్లీ నుంచి పారిపోయి అజ్ఞునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది. కాని మార్గమధ్యంలోనే రజియా, అల్ తునియాలు హత్యకు (క్రీ.శ 1240) – గురయ్యారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
బాల్బన్ రాజధర్మ స్వరూపం.
జవాబు:
ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఇనుమడింపచేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. బాల్బన్ ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించాడు. ‘నియాబత్-ఇ-ఖుదాయి’ (కింగ్ ఈజ్ వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్) ‘రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని అతని భావం’, సుల్తాన్ హోదాకు గౌరవస్థానం కల్పించి, ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం ‘నిరంకుశత్వానికి ప్రతిబింబం’ అని తన కుమారుడైన బుఖాన్కు బోధించాడు. తాను ‘జిల్లీ ఇల్హా’ (భగవంతుని నీడ) అని ప్రకటించాడు. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న ‘జమిన్ బోస్’, ‘పాయిబోస్’ సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు. సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడాలని కోరుకొన్నాడు. తాను సుల్తాన్ గా పదవి చేపట్టిన తరువాత తన హోదాకు తగిన అధికారులతోనే మాట్లాడేవాడు. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జూదం ఆడటం నిషేధించాడు. క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో ప్రేమతో వ్యవహరించాలనీ, అదే విధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నాడు. పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడు. ‘దివాన్-ఇ-ఆరీజ్’ (సైన్య వ్యవహారాలు) శాఖాధిపతులుగా తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్-ఉల్-ముల్క్న నియమించాడు. సైనికులకు జీతభత్యాల ఏర్పాటు చేశాడు. జాగీరులను రద్దుచేయించాడు. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్-ఇ-అరీజ్ శాఖకు, ఉన్నత సైనికాధికారులకు అప్పగించాడు. కోటలను నిర్మించారు. పాత కోటలకు మరమ్మత్తులు చేయించాడు.

ప్రశ్న 4.
అల్లావుద్దీన్ – ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు.
జవాబు:
అల్లావుద్దీన్ సంస్కరణలన్నింటిలో అత్యంత ఉత్తమమైనవి, ప్రశంసలందుకొన్నవి, అతను ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు. ఇందుకు ముఖ్యకారణం, ప్రభుత్వం చెల్లించే జీతంలో ఒక సాధారణ సైనికుడు సుఖంగా జీవించడానికి వీలుగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని నిర్ణయించాడు. వస్తువుల ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు సరుకులను అమ్మాలని అల్లావుద్దీన్ నిర్దేశించాడు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిని, తప్పుడు తూకాలు, కొలతలు వాడిన వారిని ఇతడు అతి కఠినంగా శిక్షించేవాడు. వ్యాపారస్థులు వారు అమ్మే వ్యాపార వస్తువులను ముందుగా ప్రకటించి, వారి పేర్లతో ప్రభుత్వం దగ్గర రిజిష్టర్ చేసుకోవాలని ఆదేశించాడు. వ్యాపారస్థులపై అజమాయిషీకి “దివానీ రియాసత్’, ‘షహనాయి మండి’ అను ఇద్దరు అధికారులను నియమించాడు. ఘనత : పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఖచ్చితమైన సంస్కరణలు ప్రవేశపెట్టినవాడు అల్లావుద్దీన్. తన పాలనా సంస్కరణల ద్వారా అల్లావుద్దీన్ భారతదేశంలో తురుష్క సామ్రాజ్య పునాదులను పటిష్టపరిచాడు.

ప్రశ్న 5.
మహ్మద్ – బీన్ – తుగ్లక్ సంస్కరణలు.
జవాబు:
జునాఖాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే బిరుదుతో క్రీ.శ. 1325లో ఢిల్లీ సింహాసనమధిష్టించి 1351 వరకు రాజ్యమేలాడు. ఢిల్లీ సుల్తానులలోనే గాక, మధ్యయుగ చక్రవర్తులందరిలో ప్రత్యేకమయిన వ్యక్తిత్వము ఉన్నవాడు తుగ్లక్.
పరిపాలనా సంస్కరణలు :
1) అంతర్వేది ప్రాంతంపై పన్నుల హెచ్చింపు: మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుటకై గంగా, యమునా, అంతర్వేది ప్రాంతంలో పన్నులను విపరీతముగా పెంచాడు. పుల్లరి, ఇంటిపన్ను, భూమిశిస్తు అమితముగా విధించుటయే గాక క్రూరముగా వసూలు చేశాడు. అసలే కరువుతో కటకటలాడుతున్న ప్రజలు ఈ పన్నుల భారము భరించలేక భూములు వదిలివెళ్ళారు. ఆ తరువాత సుల్తాన్ వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి ఫలించలేదు. ప్రజలలో సుల్తాన్ పట్ల విరక్తి కలిగింది.

2) వ్యవసాయ శాఖ ఏర్పాటు: మహమ్మద్ బీన్ తుగ్లక్ బంజరు భూములను సాగులోకి తెచ్చుట కొరకు వ్యవసాయ శాఖను ఏర్పరచాడు. ఇందుకుగాను ప్రభుత్వము 60 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. కాని ఉద్యోగుల అవినీతి వలన ఈ పథకం విఫలమైంది.

3) రాజధానిని మార్చుట : మంగోలుల దండయాత్రలకు దూరముగా దేశమునకు మధ్యభాగంలో రాజధాని వుండటం మంచిదని తుగ్లక్ తలచి తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. ఢిల్లీ పౌరులందరు తమ వస్తు, వాహనాలతో దేవగిరికి తరలివెళ్ళాలని ఆజ్ఞ జారీ చేశాడు. 700 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రజలు అనేక కష్టనష్టాలు అనుభవించారు. అనేకమంది మార్గమధ్యంలో మరణించారు. దేవగిరికి దౌలతాబాద్ అని నామకరణం చేశాడు. కాని మహమ్మదీయులు ఎవ్వరూ చిరకాలము అచ్చట వుండటానికి ఇష్టపడకపోవటం వలన ఈ పథకం కూడా విఫలమైంది. పైపెచ్చు ఢిల్లీలో సైనిక దళాలు లేవని తెలిసి మంగోలుల దండయాత్రలు పెరిగాయి. సుల్తాన్కు కూడా దౌలతాబాద్ వాతావరణం సరిపడలేదు. అందువలన పౌరులందరు మరల ఢిల్లీకి పోవాలని శాసించాడు. సుల్తాన్ చర్య వృథా ప్రయాసకు చిహ్నమని నిశితంగా విమర్శించారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

4) రాగి నాణేల ముద్రణ : నాణేల సంస్కరణలో సుల్తాన్కు ఆసక్తి ఎక్కువ. అతడు విభిన్నమైన నాణేలను ముద్రించి, వాని విలువలు భిన్నంగా నిర్ణయించాడు. రాగి నాణేలను ముద్రించి వాని విలువలను వెండి, బంగారు నాణెములతో సమానం చేశాడు. ఫలితంగా స్వార్థపరులైన ప్రజలంతా సొంతంగా నాణెములు ముద్రించుట మొదలుపెట్టారు. వారు బంగారం, వెండి దాచి, రాగి నాణెములు తయారుచేయుట ప్రారంభించారు. దీని ఫలితంగా డబ్బు విలువ పడిపోయి వస్తువుల ధరలు పెరిగాయి. వీరి చర్యలను సుల్తాన్ అరికట్టలేకపోయాడు. విదేశీ వర్తకులు ఈ నాణెములు నిరాకరించుటచేత, వర్తక వాణిజ్యాలు స్తంభించాయి. అరాచక పరిస్థితులేర్పడటం చేత రాగి నాణేలను ఉపసంహరించవలసి వచ్చింది. రాగి నాణేలకు బంగారు, వెండి నాణెములు ఇచ్చుటచే ప్రభుత్వ ధానాగారం ఖాళీ అయింది.

5) న్యాయపాలన: మహమ్మద్ బీన్ తుగ్లక్ మత విధానమునందు సామరస్య ధోరణి ప్రదర్శించాడు. మత సిద్ధాంతాలను పట్టించుకోక లౌకిక సూత్రాలపై పాలన సాగించాడు. మహమ్మదీయేతరుల పట్ల మత సహనం పాటించిన తొలి ముస్లిం పాలకుడు ఇతడే.

విదేశాంగ విధానము : దురదృష్టవశాత్తు ఇతని విదేశాంగ విధానం కూడా ఘోరంగా విఫలమైంది.
1) ఖురాసాన్ దండయాత్ర : ఖురాసాన్ ప్రముఖులచే ప్రేరేపింపబడి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖురాసాన్, ఇరాన్ ట్రాన్-ఆగ్జియానా ప్రాంతాలను జయించదలచాడు. అందుకు పెద్ద సైన్యమును సిద్ధపరచి ఒక ఏడాది జీతాన్ని ముందుగానే చెల్లించాడు. కాని తగిన నిధులు లేకపోవుటచే ఈ ప్రయత్నం నుండి విరమించవలసి వచ్చింది.

2) నాగర్ కోట, కారాజాల్ విషయములు : పంజాబులోని భాంగ్రా జిల్లాయందలి నాగర్ కోటను తుగ్లక్ జయించాడు. హిమాలయ ప్రాంతంలోని కారాజాల్ను ఆక్రమించుటకు పెద్ద సైన్యాన్ని పంపాడు. విపరీతమైన జన, ధన నష్టములకు ఓర్చి, ఢిల్లీ సైన్యం కారజాల్ను ఆక్రమించింది.

3) మంగోలులకు లంచములు ఇచ్చుట : మహమ్మద్ బిన్ తుగ్లక్ మంగోలులను ఎదిరించలేక వారికి లంచములు ఇచ్చి, శాంతింపచేయుటకు ప్రయత్నించాడు. సుల్తాన్ బలహీనతను గమనించిన మంగోలులు వారి దాడులను అధికం చేశారు.
తిరుగుబాట్లు : సుల్తాను చేపట్టిన పాలనా సంస్కరణల వల్ల, క్రూరమైన శిక్షల వల్ల విసుగు చెందిన గవర్నర్లు తిరుగుబాట్లు చేయసాగారు. మొత్తం మీద 22 తిరుగుబాట్లు జరిగాయి. మాబార్, వరంగల్, బెంగాల్ స్వాతంత్ర్యం పొందాయి. విజయనగర, బహమనీ రాజ్యాలు దక్షిణాపథంలో స్థాపించబడ్డాయి. సింధు ప్రాంతంలో జరిగిన తిరుగుబాటును అణచుటకు వెళ్ళిన మహమ్మద్ క్రీ.శ. 1351 లో థట్టా సమీపంలో మరణించాడు. అంతటితో “ప్రజలకు అతని పీడ, అతనికి ప్రజల పీడ” తొలగింది.

ప్రశ్న 6.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక పరిస్థితులు.
జవాబు:
భారతదేశం ముస్లిం దాడులకు ముందు అపార సిరిసంపదలతో తులతూగుతుండేది. కాని వీరి అధికార స్థాపన అనంతరం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అల్బెరూనీ, ఇబన్ బటూటా, మార్కోపోలో మొదలైన వారి వర్ణనలు ఆనాటి పట్టణ ఆర్థిక వ్యవస్థ విశేషాలను తెలియజేస్తున్నాయి. ఆధునిక చరిత్రకారులైన ఆచార్య ఇర్ఫాన్హాబీబ్, ఆచార్య యూసుఫ్ హుస్సేన్, డా॥ సతీష్ చంద్రల రచనలు ఢిల్లీ సుల్తానుల కాలం నాటి గ్రామీణ జీవనాన్ని, ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్నాయి. వ్యవసాయమే ఆనాటి ప్రధాన వృత్తి. చేతివృత్తులు, కుల వృత్తులు ఆదరణ పొందాయి. అనేక కొత్త పట్టణాలు, నిర్మించబడ్డాయి. వర్తక వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు, పండ్లు, పూలు పుష్కలంగా పండించారు. పత్తి పంట ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పండించారు. ఇబన్ బటూటా నీరు పుష్కలంగా ఉండి, సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి మూడు పంటలు కూడా పండించారని పేర్కొన్నాడు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ వీరి కాలంలో విచ్ఛిన్నమైంది. నిరంతర దాడులు, అధిక పన్నుల భారం ప్రజలను పీడించింది. వస్త్రాల ఉత్పత్తి కొంత మందికి జీవనభృతి కల్పించింది. సామాన్య ప్రజానీకం దుర్లభజీవనఁ గడిపారు. ప్రజలపై ఢిల్లీ సుల్తానులు విపరీత పన్నులు విధించారు. కొన్ని ప్రాంతాల్లో లోహ పరిశ్రమ కొనసాగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు కొంతమేరకు సైనికుల సంక్షేమానికి ఉపయోగపడ్డాయి. మహ్మద్-బీన్-తుగ్లక్ భూమిశిస్తు, టోకెన్ కరెన్సీ సంస్కరణలు విఫలమయ్యాయి. స్వదేశీ, విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. బెంగాల్ నుంచి మేలురకం బియ్యం మలబార్, గుజరాతు సరఫరా చేయడమైంది. గోధుమలు, అవధ్, కారా, అలహాబాద్లలో భారీగా పండించేవారు. రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందలేదు. ఎడ్లబండ్లపై, గుర్రాలపై సరుకుల రవాణా జరిగేది. ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్ ముఖ్య వర్తక కేంద్రాలు. తూర్పు ఆసియా దేశాలతో చైనాతో విదేశీ వర్తకం కొనసాగేది. జిటాల్, టంకా ప్రధాన నాణాలు. దేవాలయాలు, మసీదులు కూడా సొంత మాణ్యాలు, స్థిరాస్తులు కలిగి ఉండేవి. ముస్లిందాడుల వల్ల హిందూ మతసంస్థల ఆర్థిక స్థితి క్షీణించింది.

ప్రశ్న 7.
ఫిరోజ్ షా – తుగ్లక్ ఆంతరంగిక విధానం.
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఫిరోజ్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1351-1388) అధిష్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ బీన్ తుగ్లక్ వైఫల్యానికి దారితీసిన కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పూనుకున్నాడు.
1) యమునా నది నుంచి హిస్సార్ వరకు, సట్లేజ్ నుండి గాగ్రా వరకు, సిరూర్ పరిసర ప్రాంతాల నుంచి హన్సీ వరకు, గాగ్రా నుంచి ఫిరోజాబాద్ వరకు, యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు మొత్తం ఐదు కాలువలను త్రవ్వించి నీటి వనరులను కల్పించి, బంజరు భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయమును అభివృద్ధి చేశాడు. దీనివల్ల నీటి పారుదల పన్ను రూపంలో చాలా ఆదాయం రావటమే కాక బంజరు భూములు సాగువల్ల భూమి శిస్తు కూడా గణనీయంగా పెరిగింది.

2) ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జౌన్పూర్ మొదలగు నగరాలను నిర్మించాడు. ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను వేయించాడు. మహమ్మదీయ పకీర్లకు, హిందూ సన్యాసులకు ఎంతో ధనాన్ని విరాళాలుగా ఇచ్చాడు. దివానీ ఖైరత్ అనే పేర ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

3) సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయక సామంతరాజులు సరఫరా చేసే సైన్యం మీదనే ఆధారపడ్డాడు.

4) సైనికులకు జాగీర్లను ఇచ్చే పద్దతిని తిరిగి ప్రవేశపెట్టాడు. దీనివల్ల ప్రతిభ ఆధారంగా సైనికులను నియమించే పద్ధతి అంతమొంది అదీ సుల్తానత్ పతనానికి ఒక కారణమైంది.

5) బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ కింద 1,80,000 మంది బానిసలుండేవారు. వీరి నిర్వహణ ఖజానాకు చాలా భారమైంది. పైగా బానిసలు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అనేక కుట్రలు చేసి సుల్తానత్ పతనానికి కారకులయ్యారు.

6) శిస్తును వసూలు చేసుకొనే అధికారాన్ని సర్దారులకు ఇచ్చి వారి అభిమానాన్ని పొందాడు.

7) కఠిన శిక్షలను రద్దు చేశాడు.

8) రాజ్య వ్యవహారాలలో ఉలేమాల జోక్యాన్ని అనుమతించాడు. మత మౌఢ్యంతో హిందువుల పట్ల అసహనవైఖరిని అవలంబించాడు. వారి నుంచి జిజియా పన్నును వసూలు చేశాడు. ఒరిస్సాలో వున్న భువనేశ్వర ఆలయం, మాళ్వా, నాగర్కోటలలోని దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇతడు సున్నీ మతస్థుడైనందువల్ల షియాల పట్ల కూడా కఠినవైఖరి అవలంబించాడు. ఈ మతవిధానం ప్రజల్లో ఇతని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైంది.

ప్రశ్న 8.
ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు – శిల్పకళ.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల యుగంలో భారతదేశంలో ఒక కొత్తతరహా వాస్తు శిల్పకళ రూపుదిద్దుకొంది. ఢిల్లీలో, అజ్మీర్, లాహోర్, దౌలతాబాద్, ఫిరోజాబాద్ లో ఢిల్లీ సుల్తానులు వారి అధికారులు అనేక మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు నిర్మించారు. ఇస్లామిక్ వాస్తుకళ ముఖ్య లక్షణాలు 1. ఆర్చ్ & డోమ్ 2. సున్నపు మట్టిని గచ్చుగా వాడటం, 3. రాతిని, జిప్సంని వాడటం, 4. అలంకరణ అరేబియా, మధ్య ఆసియా, పర్షియా మొదలైన దేశాల నుంచి మేస్త్రీలు, వాస్తు శిల్పులు భారతదేశానికి ఆహ్వానించబడ్డారు. ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన కువ్వత్-ఉల్-ఇస్లాం-మసీద్ ఒక గొప్ప కట్టడం.

కుతుబ్మనార్ ఒక మహోన్నత కట్టడం. దీని నిర్మాణ లక్ష్య నమాజ్ కోసం, ఇరుగుపొరుగు ముస్లింలను ఆహ్వానించడానికి ఉద్దేశించింది. సుప్రసిద్ధ వాస్తు మేధావి పెర్గూసన్ దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ, అలియా దర్వాజాను, ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదు నిర్మించాడు. సిరి పట్టణాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించాడు. ఇబన్ బటూటా ఇక్కడి రాజప్రాసాద సౌందర్యాన్ని ఎంతో పొగిడాడు. నసీముద్దీన్ లాల్గుంబద్ అనే భవనాన్ని కట్టించాడు. ఢిల్లీలోని మోతీమసీదు సికిందర్ లోడీ వజీరైన ముబారక్షా కట్టించాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇండో- ఇస్లామిక్ అనే కొత్త శైలి వాస్తుకళ రూపుదిద్దుకొంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అరబ్ సింధ్ ఆక్రమణ.
జవాబు:
అరబ్బుల దండయాత్ర నాటికి సింధు ప్రాంతమును దాహిర్ పాలించుచున్నాడు. అతడు అసమర్ధుడు, బలహీనుడు కావటం చేత అతని పాలన ప్రజారంజకముగా లేదు.
సింధూను జయించుటకు రెండుసార్లు బలీయమైన సైన్యదళములను హజాజ్ పంపాడు. కాని అరబ్బు సేనాపతులు రెండుసార్లు ఓడిపోయారు. తుదకు హజాజ్ తన అల్లుడైన మహమ్మద్ బీన్ ఖాసిం అనువానిని అపారసైన్యంతో పంపాడు. ఖాసిమ్ యువకుడు, శక్తిశాలియైన సేనాధిపతి.

ఖాసిం 25,000 అరబ్బు సైన్యముతో దేబాల్ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు. ఇస్లాంమతము స్వీకరించని వారిని కత్తికి బలి ఇచ్చాడు. నెరూన్, శ్వాన్, శీలమ్ ప్రాంతములు తేలికగా ఆక్రమించుకున్నాడు. తుదకు క్రీ.శ. 712లో రోర్ యుద్ధరంగంలో దాహిర్ మరణించాడు. ఆ తరువాత బ్రాహ్మణాబాదు, సింధూ రాజధానియైన ఆలోర్ను ఖాసిం వశపరచుకున్నాడు. ఇట్లు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించి, ముల్తాన్ను కూడా జయించాడు. కనోజ్పై దండెత్తుటకు ప్రయత్నములు చేయుచున్నప్పుడు ఖాసింను ఖలీఫా వెనుకకు పిలిపించి క్రూరముగా చంపాడు.

ప్రశ్న 2.
మహమ్మద్ ఘోరీ.
జవాబు:
ఘజనీ వంశ పరిపాలన తరువాత ఘోరీ వంశం సుల్తానులు అధికారంలోకి వచ్చారు. హీరాట్-ఘజనీ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై ఘోరీలు అధికారం నెలకొల్పారు. ఘోరీ వంశ మూల పురుషుడు ఘియాజుద్దీన్ మహ్మద్. ఇతడు కడపటి ఘజనీల నుంచి ఘజనీ రాజ్యాన్ని ఆక్రమించాడు. దాని రాష్ట్రపాలకుడిగా తన సోదరుడైన ముయిజుద్దీన్ ను నియమించాడు. చరిత్రలో ఇతడే మహ్మద్ ఘోరీగా కీర్తి గడించాడు. క్రీ.శ. 1173వ సం॥లో ఇతడు ఘోరీ రాజ్య సింహాసనం అధిష్టించాడు. మహ్మద్ ఘోరీ సమర్థ నాయకుడు, గొప్ప సేనాధిపతి.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
ఆల్బెరూనీ.
జవాబు:
ఆల్బెరూనీ మహమ్మద్ గజనీ ఆస్థానకవి, పర్షియా దేశస్థుడు. సంస్కృత పండితుడు. మహమ్మద్ వెంట భారతదేశానికి వచ్చాడు. తారిఖ్-ఉల్-హింద్ అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 4.
జియాఉద్దీన్ – బరనీ
జవాబు:
తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహి గ్రంథ రచయిత జియా-ఉద్దీన్-బరౌనీ. ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి చెందిన బరౌనీ, తండ్రి ముయిద్-ఉల్-ముల్క్, మామయ్య అలా-ఉల్-ముల్క్లు, బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ మొదలైన సుల్తానుల సేవలో వివిధ పదవులు నిర్వహించినందువల్ల బరేనీకి సుల్తానులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఇతడి రచన 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక స్థితిగతులు, న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తుంది. బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచనే తారీఖ్-ఇ-ఫిరోజ్-షాహి.

ప్రశ్న 5.
కుతుబ్మనార్.
జవాబు:
కుతుబుద్దీన్ ఐబక్ దీనిని భక్తియార్ ఖాదిర్ అను సూఫీ సన్యాసి గౌరవార్ధం దీనిని ప్రారంభించగా ఇల్లుట్మిష్ దీనిని పూర్తి చేశాడు. ఇది ఢిల్లీలోని మొహరేవి వద్ద కలదు. దీని ఎత్తు 71.4 మీటర్లు. భారత్ పశ్చిమాసియా భవన నిర్మాణ సాంప్రదాయాలు అన్నీ దీనిలో ఉన్నాయి.

ప్రశ్న 6.
మంగోల్ దాడుల ప్రభావం.
జవాబు:
మంగోలులు ఒక సంచార జాతి. వారు ప్రథమం నుండి ఢిల్లీపై దాడులు జరిపి, తీవ్రనష్టం కలిగించారు. ముఖ్యముగా ఇల్టుట్మిష్ వీరి దాడి నుంచి తన రాజనీతిజ్ఞతతో ఢిల్లీని కాపాడెను. బాల్బన్ వీరి దాడుల నుంచి ఢిల్లీని కాపాడుటకు గట్టి ప్రయత్నం చేసెను. అయితే తన కుమారుడిని మంగోలాడుల వల్ల కోల్పోయెను. అల్లావుద్దీన్ ఖిల్జీ | కాలములో కూడా వీరు దాడులు జరిపి, ఢిల్లీకి తీవ్రనష్టము కల్గించారు.

ప్రశ్న 7.
టోకెన్ కరెన్సీ సంస్కరణలు.
జవాబు:
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్రకొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 8.
మొదటి పానిపట్ యుద్దం.
జవాబు:
బాబర్ భారతదేశ ఆక్రమణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. 1525లో దౌలతాన్ను తరిమివేసి పంజాబ్ను స్వాధీనపరచుకున్నాడు. ఆ తరువాత తన సైన్యాన్ని ఢిల్లీ వైపుకు నడిపించాడు. ఢిల్లీ పాలకుడైన ఇబ్రహీంలోడీ ఒక లక్ష సైన్యంతో పానిపట్టు వద్ద బాబర్కు ఎదురునిలిచాడు. 1526 ఏప్రియల్ 21న ఈ ప్రదేశం వద్ద జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడీ వధించబడ్డాడు. ఢిల్లీ, ఆగ్రాలు బాబర్ వశమయ్యాయి. మొదటి పానిపట్టు యుద్ధం చారిత్రాత్మకమైనది. లోడీ సైనిక పాటవం సర్వనాశనమైంది. భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. హిందూస్థాన్ సార్వభౌమత్వం ఆఫ్ఘనుల నుంచి మొగలుల చేతిలోకి పోయింది. మొగలుల వారసత్వం భారతదేశంలో 200 సంవత్సరాలు కొనసాగింది. మొగల్ పరిపాలనవల్ల భారతదేశంలో హిందూ, ముస్లిం సంస్కృతులు సంగమం చెంది మిశ్రమ సంస్కృతి విరాజిల్లింది.

మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయానికి అనేక పరిస్థితులు దోహదం చేశాయి. ఇబ్రహీంలోడీ అనుసరించిన అనుచిత రాజకీయ విధానం బాబర్కు సహకరించింది. బాబర్ యుద్ధ వ్యూహం, శతఘ్ని దళం, సుశిక్షితులైన సైనికులు బాబర్ విజయానికి దోహదపడ్డారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 9.
ఢిల్లీ సుల్తానుల కాలంలో సాహిత్య వికాసం.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల అధికార స్థాపనతో భారతదేశంలో స్వదేశీ భాషలకు ఆదరణ కరువైంది. పర్షియన్, అరబిక్ భాషలు సుల్తానుల ఆదరణ, పోషణ పొందాయి. ఈ భాషలో అనేక గొప్ప రచనలు జరిగాయి. ఉర్దూ అవతరించింది. స్వదేశీ పదాల కలయికతో ఉర్దూ బాగా ఆదరణ పొందింది. భక్తి-సూఫీ ఉద్యమకారులు స్థానిక భాషల్లో వారి బోధనలు కొనసాగించారు. దీంతో హిందీ, అవధ్, మరాఠి, కన్నడ, తమిళ, మైథిలీ, బెంగాలీ భాషలు అభివృద్ధి సాధించాయి. సామాన్య ప్రజలు వారు మాట్లాడుకొనే భాషలోనే భక్తి ప్రబోధకులు భక్తి మార్గాన్ని, ఐక్యత, మానవతా విలువలను, ప్రబోధించారు. దీంతో వారిలో సోదరభావం పెంపొందింది.

ప్రశ్న 10.
ఢిల్లీ సుల్తాన్ల పతనం.
జవాబు:
క్రీ.శ. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ తో ప్రారంభమైన ఢిల్లీ సుల్తానుల పాలన సుమారు మూడువందల ఇరవై ఏళ్ళపాటు కొనసాగి ఇబ్రహీం లోడీతో క్రీ.శ. 1526లో ముగిసింది. ఈ సుదీర్ఘ కాలంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐదు వంశాల పాలన కొనసాగింది. సుల్తాన్ల పతనానికి అనేక కారణాలు దోహదం చేశాయి.

  1. సామ్రాజ్య విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ, సుల్తానులు అన్ని ప్రాంతాలపై కేంద్ర అధికారాన్ని సమర్ధంగా చెలాయించలేకపోవటం.
  2. సుల్తాన్ స్వార్ధపూరిత విధానాలు, సర్దారుల తిరుగుబాట్లు.
  3. స్థానిక ప్రజల అభిమానం పొందలేకపోవడం, హిందూమత వ్యతిరేక విధానాలు.
  4. రాష్ట్రాల పాలకుల తిరుగుబాట్లు.
  5. సైన్యంలో క్షీణించిన పట్టుదల.
  6. మహ్మద్-బీన్-తుగ్లక్ విధానాల వైఫల్యం.
  7. తైమూర్ దండయాత్ర.
  8. దక్షిణాపథంలో వెలమ, రెడ్డి, విజయనగర, బహమనీ రాజ్యాల
  9. మితిమీరిన పన్నుల భారం.
  10. ముస్లిం వర్గాల్లో ఉన్న విభేదాలు మొదలైనవి.