AP Inter 1st Year History Study Material Chapter 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భక్తి ప్రబోధకుల ప్రధాన లక్షణాలను తెలపండి.
జవాబు:
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270-1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారులు పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 2.
రామానందుడు, కబీర్లు భక్తి ఉద్యమానికి చేసిన సేవను వివరించండి.
జవాబు:
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు.

కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. ‘పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ? అని కబీర్ ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
సూఫీ మతాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు:
మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవటానికి ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీమతం. అరేబీయాలో సూఫీ మతం ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాప్తి చెందింది. సూఫీమతాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత అరబ్బులకే దక్కుతుంది.
క్రీ.శ 19వ శతాబ్దంలో ‘సూఫీఇజం’ అనే ఆంగ్లపదం వాడుకలోని వచ్చింది. సూఫీ అనే పదం ‘తసావూఫ్’ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ‘సపా’ అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘సుఫా’ అనే పదం నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే ‘అరుగు’ అని అర్థం. బస్రాకు చెందిన జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. క్రీ.శ 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక, మత జీవనాన్ని ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి.

హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాల్లో సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం వంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్ ‘గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు.

ప్రశ్న 4.
చిట్టీ, సూఫీ బోధకుల విజయాలను చర్చించండి.
జవాబు:
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి.

షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిష్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్తీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 5.
సుహ్రవర్థీ సిల్సిలా గురించి వ్రాయండి.
జవాబు:
సుహ్రవర్థి సిల్సిలా రెండవ ప్రసిద్ధ శాఖ. ఈశాన్య వాయువ్య భారతదేశంలో విలసిల్లింది. ముల్తాన్ దీవి ప్రధాన కేంద్రమైన తరువాత కాలంలో ‘సింధు’కు విస్తరించింది. భారతదేశంలో దీన్ని ముల్తాన్కు చెందిన షేక్ బహఉద్దీన్ స్థాపించాడు. ఆయన ముస్లిం విజ్ఞాన కేంద్రాలతో పాటు మక్కా – మదీనా, సమర్ఖండ్, బాగ్దాద్లను సందర్శించి ప్రజలు వారి సంస్కృతిని గురించి అనేక విషయాలను తెలుసుకొని తన గురువు షేక్ షహబుద్దీన్ సుహ్రవర్థీ (బాగ్దాద్)ని అనుకరించాడు. పేదరికంలో జీవించడాన్ని వ్యతిరేకించటంతో పాటు కఠిన ఉపవాసాన్ని తిరస్కరించాడు. ఆయన క్రీ.శ 1262లో మరణించాడు. షేక్ బహానంద్ దీన్ జకారియా సుహ్రవర్దీ మరణానంతరం ఈ సిల్సిలా రెండు భాగాలుగా చీలిపోయింది. అతని కుమారుడు బదర్ ఉద్దీన్ ఆరిఫ్ నాయకత్వంలో ముల్తాన్ శాఖ, సయ్యద్ జలాలుద్దీన్ సురఖ్ బుఖారి నాయకత్వంలో ఉచ్ శాఖలుగా విడిపోయాయి. సుహ్రవర్థీ సిల్సిలా చాలా విషయాల్లో చిష్టీ సిల్సిలాను వ్యతిరేకించింది. సుహ్రవర్ధలు పాలకుల మన్నన పొంది వారిచే కానుకలను స్వీకరించడం వంటివి చేశారు. వారు పేద, సామాన్య ప్రజలను గురించి పట్టించుకోలేదు.

సుహ్రవర్దీ సిల్సిలా తమ దర్గాలలో కేవలం సంపన్నులు, ఉన్నత వర్గాల సందర్శకులనే అనుమతించారు. మూడవ ప్రధానమైన సిల్సిలా ‘నక్షాబందీ సిల్సిలా’ దీన్ని ఖ్వాజాపీర్ మహ్మద్ స్థాపించాడు. ఇతడి శిష్యుడైన ఖ్వాజా బాకీభిల్లా భారతదేశం అంతటా దీన్ని వ్యాప్తి చేశాడు. పరిషత్ న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన వీరు చిష్టీ సిల్సిలాలు, ఇతర సిల్సిలాలు ముస్లింలలో ప్రవేశపెట్టిన మార్పులను వ్యతిరేకించారు. ఈ సిల్సిలాతో పాటు ఖాద్రీ, ఫిరదౌసియా సిల్సిలాలు కూడా సమాజంలోని కొన్ని వర్గాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

ప్రశ్న 6.
భక్తి, సూఫీ ఉద్యమాలు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయో వివరించండి.
జవాబు:
భక్తి, సూఫీ ఉద్యమకారుల బోధనలు భారతీయులకు కొత్త వేదికను సమకూర్చాయి. వీరి ఉదార, మానవతావాద బోధనలు అనేకమంది సామాన్యులను ఆకర్షించాయి. వీరి భావనలు బ్రాహ్మణుల, పూజారుల మౌల్వీల ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. ప్రజల భాషల్లో బోధన చేసి వీరు సామాన్యులను ఆకట్టుకున్నారు. కబీర్, నానక్ వంటి భక్తి ఉద్యమకారుల ముస్లింల మధ్య ఉన్న విభేదాలను తగ్గించాయి. అన్ని వర్గాల ప్రజలకు నీతితో కూడిన ఆత్మ విశ్వాసంతో జీవించాలని పిలుపునివ్వడంతో పాటు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. వీరి విధానాల సమానత్వాన్ని బోధించి మత మార్పిడులను నిరోధించాయి. భక్తి, సూఫీ సన్యాసులు తమ నిరాడంబర జీవితం, పవిత్రమైన వ్యక్తిత్వం ద్వారా పరస్పరం ప్రభావితులయ్యారని ప్రముఖ చరిత్రకారుల యూసఫ్ హుస్సేన్ ఎ.ఎల్. శ్రీవాత్సవ, ఆర్.సి. మంజూందార్, జె.ఎన్. సర్కార్ వంటి వారు అభిప్రాయపడ్డారు. వారిరువురూ హిందూ ముస్లింల మధ్య పెరుగుతున్న స్పర్ధను తగ్గించేందుకు కృషి చేశారు. ఈ ఉద్యమాల వల్ల ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందడంతోపాటు సమాజానికి కొత్త ఆశలు, రూపం ప్రసాదించబడ్డాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆళ్వారులు, నాయనార్లు
జవాబు:
క్రీ.శ. 6వ శతాబ్ద కాలంలో తమిళదేశంలో ఆళ్వారులు (వైష్ణవాచార్యులు), నాయనార్ల (శైవాచార్యులు) నాయకత్వంలో వాస్తవంగా భక్తి ఉద్యమం ప్రారంభమైంది. వారు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి దేవతలను గురించి పాటలు పాడుతూ భక్తిని ప్రచారం చేశారు.

ఆళ్వార్లు, నాయనార్లు కులవ్యవస్థను బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించినట్లు కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. తొండరిప్పొడి ఆళ్వారు, అప్పార్ అనే నాయనార్లు కులవ్యవస్థను వ్యతిరేకించడంతోపాటు ఉపయోగంలేని గోత్రాలు, శాస్త్రాలను తిరస్కరించారు. స్త్రీ అయిన ఆండాళ్ (ఆళ్వారు) తన రచనల్లో విష్ణువును ప్రస్తుతించింది. కరైకాల్ అమ్మయార్ (నాయనారు) మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అనుసరించింది. వీరిద్దరూ తమ రచనల్లో సనాతన సాంఘిక కట్టుబాట్లను వ్యతిరేకించారు.

ప్రశ్న 2.
శంకరాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో శ్రీ శంకరాచార్యులను ఆద్యులుగా చెప్పవచ్చు. శంకరాచార్యుడు బోధించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంగా ప్రసిద్ధిచెందింది. బెనారస్క చెందిన గోవిందయోగి బోధనలు శంకరాచార్యుడిని ప్రభావితం చేశాయి. శంకరాచార్యుడు హిందూమతానికి నూతన తాత్వికతను జోడించాడు. శంకరాచార్యుడు చేసిన ప్రయత్నాలు హిందూ మతస్తులకు నమ్మకాన్ని కల్పించడంతోపాటు మతాన్ని వదిలి వెళ్ళినవారు తిరిగివచ్చేలా చేశాయి. ఈ విధంగా శంకరాచార్యుడు భక్తి ఉద్యమానికి పునాదులువేసి నూతన హిందూమత రక్షకుడుగా పేరుపొందారు. మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని శంకరాచార్యులు బోధించాడు. అయితే శంకరాచార్యుల బోధనలు, సిద్ధాంతాలు సామాన్యుడికి అర్థమయ్యేలా లేకపోవడంతో తర్వాత భక్తి ప్రబోధకులు ప్రజలకు అర్థమయ్యే మార్గాన్ని బోధించేందుకు పూనుకొన్నారు.

ప్రశ్న 3.
రామానుజాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమకారుల్లో శంకరాచార్యుని తరవాత రామానుజాచార్యుడు ప్రధానమైనవారు. మోక్షం సాధించేందుకు శంకరాచార్యుని జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని బోధించాడు. తన గురువు యాదవ్ ప్రకాశ్ బోధించిన ఈ ప్రపంచమంతా మాయ, సంపూర్ణ ఏకేశ్వరోపాసన వంటి సిద్ధాంతాలను రామానుజాచార్యుడు వ్యతిరేకించాడు.
భగవంతుడిని చేరుకొనేందుకు ‘భక్తి’ ప్రధానమైన మార్గం. అన్ని కులాల వారు వారికి ఇష్టమైన దేవుడిని ఆరాధించేందుకు అర్హులేనని రామానుజాచార్యుడు బోధించాడు. ఈయన 120 సంవత్సరాల వయస్సులో సమాధి అయ్యారు.

ప్రశ్న 4.
గురునానక్
జవాబు:
కాలూరామ్, తృష్ణాదేవి దంపతులకు క్రీ.శ 1469 లో తల్వాండిలో గురునానక్ జన్మించాడు. ఆయన భార్య సులాఖని. వారికి శ్రీచంద్, లక్ష్మీచంద్ అనే కుమారులు కలిగారు. ఢిల్లీ సుల్తానుల పాలనలోని సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో గురునానక్ పనిచేశాడు. క్రీ.శ. 1494 సంవత్సరంలో గురునానక్కు జ్ఞానోదయం అయ్యింది.
గురునానక్ పండితుడు, పర్షియా, హిందీ, పంజాబీ భాషలను అధ్యయనం చేశాడు. గురునానక్ బోధనలన్నీ ‘ఆదిగ్రంథ్’ అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి. హిందూ, ముస్లింల ఐక్యతను ప్రచారం చేసిన గురునానక్ పేద ప్రజల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. గురునానక్ అనుచరులు ఈ ఆశ్రమాలను నిర్వహించి పేదవారికి ఆహారాన్ని | సమకూర్చారు. చివరకు గురునానక్ అనుచరులు సిక్కు అనే మతాన్ని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 5.
చైతన్యుడు.
జవాబు:
‘శ్రీ గౌరంగ’ అనే పేరుతో కూడా ప్రసిద్ధికెక్కిన చైతన్యుడు బెంగాలుకు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు, సంఘసంస్కర్త. 25 సంవత్సరాల వయస్సులో కేశవభారతి నుంచి సన్యాసం స్వీకరించిన చైతన్యుడు పూరి, సోమనాథ్, ద్వారక, పండరీపురం, మధుర, బృందావనంలో పర్యటించి అక్కడ ప్రజల సంప్రదాయాలను పరిశీలించాడు. చివరకు ఒరిస్సాలోని పూరిలో స్థిరపడ్డాడు. సర్వాంతర్యామి ఒక్కడేనని అతడే శ్రీకృష్ణుడు లేదా హరి అని చైతన్యుడు బోధించాడు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు అని ప్రబోధించాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించి విశ్వమానవ సోదర ప్రేమచాటాడు. ఇతడు బెంగాలీ భాషలో ‘శిక్ష అస్తక్’ రచించాడు. బ్రహ్మచర్యాన్ని ‘సన్యాసులు’ అనుసరించాలని, సంకీర్తనలను గానం చేయాలనే అంశాలను అనుచరులచేత ఆచరింపచేశాడు.

ప్రశ్న 6.
మీరాబాయి
జవాబు:
క్రీ.శ. 16వ శతాబ్ద ప్రారంభంలో ఆవిర్భవించిన మహిళా భక్తిబోధకురాలు మీరాబాయి. మేర్తా పాలకుడు రతన్ సింగ్ రాథోడ్ ఏకైక కుమార్తె అయిన మీరాబాయి 18 సంవత్సరాల వయస్సులో 1516 సంవత్సరంలో మేవాడ్ రాజైన రాణాసంగా కుమారుడు భోజోజ్ని వివాహం చేసుకొంది. చిన్నతనం నుంచే మత విశ్వాసాన్ని కలిగిన ఆమె తన పూర్వీకుల లాగానే కృష్ణుడిని ఆరాధించింది. భర్త మరణానంతరం మామగారి నుంచి కష్టాలను ఎదుర్కొన్న ఆమె చివరకు తన జీవితాన్ని కృష్ణుడి ఆరాధనకు అంకితం చేసి పాటలు పాడటం ప్రారంభించింది. బృందావనంలో స్థిరపడి మరణించేవరకు అక్కడే ఉంది.

ప్రశ్న 7.
షేక్ ఫరీద్
జవాబు:
షేక్ ఫరీద్ లేదా బాబా ఫరీద్ (క్రీ.శ 1175 – 1265) ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
షేక్ సలీం చిష్టీ
జవాబు:
షేక్ సలీం చిష్టీ అక్బర్ చక్రవర్తి సమకాలికుడు. సలీం చిష్టీ సిద్ధాంతాలు, జీవన విధానం అక్బర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీం అని అక్బర్ నామకరణం చేశాడు. చిట్టీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 9.
భక్తి సాహిత్యం
జవాబు:
భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. ఈ ఉద్యమం ప్రజలకు ఒక నూతన మార్గాన్ని చూపింది. భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందింది.