Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 9th Lesson పారిశ్రామిక విప్లవం Textbook Questions and Answers.
AP Inter 2nd Year History Study Material 9th Lesson పారిశ్రామిక విప్లవం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బ్రిటన్ దేశములో మొదటిగా పారిశ్రామిక విప్లవం జరగడానికి దోహదపడిన అంశాలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లోను, ఇతర పాశ్చాత్య ప్రపంచంలోనూ సంభవించడానికి కారణం అక్కడ శాస్త్ర విజ్ఞానం సమాజంతో జతకట్టి ఉండటమే. తత్త్వవేత్త, చేతివృత్తి నిపుణుడు సన్నిహితంగా సహజీవనం చేసిన పాశ్చాత్య సమాజాలలో అభివృద్ధి అనూహ్యంగా జరిగింది.
మానవ జాతికి ఆవశ్యకమైన కొన్ని వస్తువుల ఉత్పత్తి విధానంలో 18, 19 శతాబ్దాలలో ఇంగ్లాండ్లో పూర్తి మార్పు వచ్చింది. మానవ శ్రమ ద్వారా వస్తువుల ఉత్పత్తి విధానాన్ని మొదట యంత్రాల ద్వారా, తర్వాత భారీ యంత్రాల ద్వారా ఉత్పత్తి చేసే విధానాలు వచ్చాయి. ఈ మార్పులు అనేక ఇతర రంగాలలో మార్పులకు కారణభూతమయ్యాయి. ఉత్పత్తి పద్ధతుల్లో మార్పునకు స్థావరం కావటంతో, ఆ మార్పు ఫలితాలను అనుభవించటంలోను, ఐరోపా దేశాలలో ఇంగ్లాండ్ మార్గదర్శకమైంది. ‘ప్రపంచ కర్మాగారం’గా పరిగణించబడింది. లాభదాయకమైన యంత్రాగారాల స్థాపనకు దారితీసిన అనుకూల పరిస్థితులు, అవసరమైన రంగం ఇంగ్లాండ్లో సిద్ధంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
పాలనా పరిస్థితులు: ఆధునిక పరిశ్రమలను ఏర్పాటు చేసిన మొదటి దేశం బ్రిటన్. 17వ శతాబ్ది నుండి ఇంగ్లాండ్ ఒకే రాచరిక ఏలుబడిలో రాజకీయంగా స్థిరత్వం పొందింది. దేశమంతా ఒకే పాలనా చట్టం, ఒకే ద్రవ్యం చలామణిలోకి వచ్చాయి. బ్రిటన్ మినహా ఇతర ఐరోపా దేశాలలో స్థానిక అధికారుల ప్రాబల్యం ఉండటం వలన, వారు తమ ప్రాంతాల గుండా ప్రయాణించే వస్తువులపై పన్నులు వసూలు చేస్తూ ఉండటం వలన వస్తువుల ధరలు పెరిగినవి. కానీ ఇంగ్లాండ్లో ఇటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల వస్తువుల ధరలు చౌకగా అందుబాటులో ఉండేవి.
అనుకూల పరిస్థితులు: 17వ శతాబ్దం చివరి నాటికి వస్తు మారకంగా ద్రవ్యం విరివిగా వాడుకలోకి వచ్చింది. వస్త్ర పరిశ్రమకు కావలసిన పత్తి పరిశ్రమకు అనుకూలమైన తేమతో కూడిన వాతావరణం ఇంగ్లాండ్లో ఉండేది. ఇంగ్లాండ్కు నీరు, ముడిసరుకుల కొరత లేదు. బొగ్గు, ఇనుము పుష్కలంగా లభించేవి. ఫ్రాన్స్, జర్మనీ వంటి ఏ ఇతర యూరోపియన్ దేశంలో కూడా ఇంగ్లాండ్లో ఉన్నట్లు బొగ్గుగనులు, ముఖ్యమైన ఓడరేవులు సమీపంలో లేవు. ఇది జల రవాణాకు చాలా అనుకూలం. “ఇనుము, బొగ్గు, వస్త్రాల ఆధారంగా ప్రపంచం అంతా అనుకరించిన ఒక కొత్త నాగరికతను ఇంగ్లాండ్ రూపొందించింది” అని ఫిషర్ కొనియాడాడు.
పెట్టుబడి వ్యవస్థ: మూలధనం ఇంగ్లాండ్లో పెద్ద మొత్తంలో పోగుపడి ఉంది. ఈ సంపదకు అనేక కారణాలున్నాయి. 17వ శతాబ్దం ప్రారంభం నుండి బ్రిటన్ విదేశాలతో సమర్థవంతమైన వాణిజ్య విధానాలను అనుసరించి అత్యధికంగా లాభాలను గడించింది. మూలధనం ఉన్నా సరైన విధానంలో పెట్టుబడి పెట్టకపోతే ఉపయోగం ఉండదు. ‘ఇంగ్లాండ్ బ్యాంక్’ స్థాపన, ‘లండన్ ద్రవ్య మార్కెట్’, ‘జాయింట్ స్టాక్ బ్యాంక్’, ‘జాయింట్ స్టాక్ కార్పొరేషన్’ ఏర్పాటుతో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం తేలికయింది. మెథడిజం, పూరిటానిజం వంటి మత శాఖల ప్రభావం వలన ప్రజలు వ్యసనాలు మానుకుని నిరాడంబరంగా జీవిస్తూ ఉండటం వలన కూడా ధనం పొదుపు చేయబడి పెట్టుబడిగా మారింది. ఋణాలివ్వటంలోను బ్యాంకులు అవలంబించిన పటిష్టమైన విధానం నిధుల వినియోగ యంత్రాంగాన్ని ప్రభావితం చేసిందని ఫిషర్ పేర్కొన్నాడు.
సామాజిక పరిస్థితులు: పురాతన లాభసాటికాని, వ్యవసాయ పద్ధతులకు బదులుగా నూతన వ్యవసాయ పద్ధతులైన పంటల ఆవర్తన పద్ధతి, వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగటంతో ఆహార సరఫరా పెరిగింది. ఫలితంగా జనాభా కూడా పెరిగింది. 18వ శతాబ్దం నాటికి అనేక రాజకీయ, మత కారణాల వలన ఐరోపా దేశాల నుండి ఇంగ్లాండ్కు జనాభా వలసలు పెరిగాయి. కంచెలు వేసే ఉద్యమం వల్ల భూములు కోల్పోయిన చిన్న రైతులు, బానిస వ్యవస్థ నిషేధం వల్ల రోడ్డున పడ్డ పనివారు నూతనంగా ఏర్పాటైన పరిశ్రమలలో శ్రామికులుగా చేరారు. ఇది కూడా కొత్తగా ఏర్పడిన భారీ పరిశ్రమలకు అనుకూలమయింది.
రవాణా సౌకర్యాలు: 18వ శతాబ్దం నాటికి ఇంగ్లాండ్ సముద్ర వర్తకంలో ఆధిక్యత నెలకొల్పింది. ఇంగ్లాండ్లో ఎన్నో రేవులున్నాయి. ఆధునిక రోడ్లు, కాలువల నిర్మాణంతో దేశంలో కూడా రవాణా మెరుగుపడింది.
శాస్త్రీయ ఆవిష్కరణలు: ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ప్రజలు అనేక నూతన యంత్రాలను ఆవిష్కరించటంలోను, వాటిని ఉపయోగించి వస్తూత్పత్తి చేపట్టడంలోనూ ముందున్నారు.
ఈ కారణాలన్నింటి వలన ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ఐరోపా ఖండమంతా వ్యాపించింది.
ప్రశ్న 2.
వస్త్ర పరిశ్రమలో పారిశ్రామిక కాలంలో జరిగిన నూతన యంత్రాల ఆవిష్కరణలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవానికి ఆధారం ఆవిరి శక్తిని యంత్రాలకు, ఆ పైన మొదటగా వస్తూత్పత్తికి తర్వాత రవాణాకు ఉపయోగించడమేనని థాంప్సన్ అన్నాడు.
ఆవిరి యంత్రం: ఆవిరి శక్తి అందుబాటులోకి రావడం వల్లనే గణనీయమైన పారిశ్రామికీకరణ సాధ్యపడింది. ఆవిరి అధిక ఉష్ణోగ్రతల వద్ద అధిక పీడనాన్ని కలిగి ఉండి యంత్రాలు పనిచేయడానికి శక్తి వనరుగా ఉపయోగపడటంతో యంత్రాలు బహుళ వాడుకలోనికి వచ్చాయి
18వ శతాబ్ది ప్రారంభంలో ‘న్యూకామెన్’ అనే మెకానిక్ ఇంగ్లాండ్లోని గనుల నుంచి నీరు తోడటానికి ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. దానిలో కొన్ని లోపాలున్నాయి. తరువాత కాలంలో జేమ్స్ వాట్ ఒక ప్రత్యేక కండెన్సర్ తయారు చేయడం ద్వారా ఆవిరి యంత్రంలోని లోపాలను తొలగించాడు. వాట్ తయారుచేసిన ఆవిరి యంత్రం, ఆవిరి యుగాన్ని ఆరంభించింది. గ్రేట్ బ్రిటన్లోని పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చివేసింది. అంతకు ముందు కేవలం గనులకు మాత్రమే పరిమితమై ఉన్న ఆవిరి యంత్రం బండ్లను, యంత్రాలను ముందుకు కదిలించే సామర్థ్యం గల ఇంజన్ మారింది. గనుల నుండి నీరు తోడటానికి, క్రేన్ల ద్వారా బరువులెత్తడానికి, యంత్రాల రవాణాకు, రైలు రవాణాకు, ఆవిరి నౌకలు నడపడానికి ఈ ఆవిరి యంత్రం ఉపయోగపడింది. జలచక్రం కదలికను అనుసరించి రోటరీ మిషన్ ను కనిపెట్టడంతో 1781లో ఆవిరి యంత్రం ప్రతి కర్మాగారాలలో ప్రవేశించింది.
ప్రత్తి – వస్త్ర పరిశ్రమ: 1780 నుండి వస్త్ర పరిశ్రమ బ్రిటిష్ పారిశ్రామికీకరణకు చిహ్నంగా మారింది. వస్త్రోత్పత్తిలో రెండు ప్రధాన ప్రక్రియలున్నాయి. ఒకటి ముడిసరుకు, పత్తి, ఉన్ని, పట్టు నుంచి దారం తీయటం, రెండు దారాలను వస్త్రంగా నేయడం. ఈ ప్రక్రియలో అనేక కొత్త విషయాలు కనుగొన్నారు. ఫలితంగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ దారాలను తీయడం సాధ్యమైంది.
1) జానకే 17వ శతాబ్దంలో ఫ్లయింగ్ షటిల్ను కనిపెట్టాడు. నేతపనివాడు చేతితో దారాన్ని ముందుకు, వెనుకకు పంపే బదులు తీగలను లాగడం ద్వారా యంత్రాన్ని పనిచేయించవచ్చు. దీనివలన ఇద్దరికి బదులు ఒక పనివాడు పెద్ద మొత్తంలో వస్త్రాన్ని నేయడం సాధ్యపడింది.
2) 1765లో జేమ్స్ హర్ గ్రీవ్స్ ‘స్పిన్నింగ్ జెన్నీ’ ని అభివృద్ధిపరిచాడు. ఇది పదకొండు కుదుళ్ళను ఒకేసారి తిప్పగల సామర్థ్యం కలిగి ఉంది. దీనితో తయారుచేసిన దారం పురి తక్కువ ఉండి, వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు.
3) రిచర్డ్ ఆర్క్ రైట్ 1769లో కొత్త సూత్రాన్ని ఆధారం చేసుకొని ‘వాటర్ ఫ్రేమ్’ ను రూపొందించాడు. దీనితో చేసిన దారం దృఢంగా, ముతకగా ఉండి నేయడానికి అనుకూలంగా ఉండేది.
4) 1779లో శామ్యూల్ క్రాంప్టన్ మ్యూల్ తన పేరున ‘మ్యూల్ యంత్రాన్ని’ నిర్మించాడు. ఇది స్పిన్నింగ్ జెన్నీ, వాటర్ ఫ్రేమ్లలోని మేలైన లక్షణాలను కలిపి సన్నగా, దృఢంగా ఉండే దారాన్ని తీయగలిగింది. ఫలితంగా పలుచని ‘మస్లిన్’ వస్త్రాలు తయారు చేయగలిగారు.
5) ఎడ్వర్డ్ కార్టైరైట్ 1787లో ‘పవర్లూమ్’ కనుగొనడంతో సులభంగా పనిచేయడానికి, దారం తెగినా ఇబ్బంది లేకుండా, ఎటువంటి వస్త్రాన్నయినా నేయడానికి అవకాశం ఏర్పడింది.
బొగ్గు మరియు ఇనుము ఉక్కు కర్మాగారాలు: ఆవిరి యంత్రం, ఇతర యంత్రాల వాడకం, ఇనుము, బొగ్గుల అవసరాన్ని సృష్టించింది. యంత్రాల తయారీకి ఇనుము, ఆవిరి యంత్రాన్ని నడపడానికి కావలసిన ఆవిరి కోసం బొగ్గు అవసరమైనాయి. 18వ శతాబ్దం నుండి ప్రధాన ఇంధన వనరుగా బొగ్గు గుర్తించబడింది.
18వ శతాబ్దానికి ముందు ముడి ఇనుమును కరిగించి ఇనుప వస్తువులు తయారు చేయడానికి వంట చెరుకును ఉపయోగించేవారు. తరువాత రాతిబొగ్గును ఉపయోగించారు. 18వ శతాబ్దం ప్రథమార్థంలో బొగ్గును కోక్గా మార్చే ప్రయత్నంలో ముడి ఇనుమును కరిగించి శుద్ధి చేయడంలోను, బలమైన గాలి పేలుళ్ళ ద్వారా ‘డర్బీలు’ సఫలమయ్యారు. డార్బ ‘కోక్ బ్లాస్ట్’ ఇనుము ఉత్పత్తిని పెంచింది. ఈ ఆవిష్కరణతో మునుపటి కంటే పెద్ద నాణ్యమైన పోతలు పోయడం సాధ్యపడింది.
జేమ్స్ వాట్, స్టీమ్ హేమర్, హంట్స్మన్ యొక్క ‘స్టీల్ ప్రాసెస్’, జాన్ స్మిటస్ యొక్క గాలింపు, హెన్రీకార్ట్, పీటర్, ఓనియమ్ల రివర్బరేటరీ ఫర్నేస్, రోలింగ్ మిల్లులు నికొల్సన్ యొక్క మాట్లా బ్లాస్ట్ మొదలైనవి 19వ శతాబ్దపు తొలి దశలో ఇనుము ఉత్పత్తి బహుళంగా వేగంగా సాగడానికి తోడ్పడిన ఆవిష్కరణలు. 1815లో ‘హంఫ్రీ డేవిస్’ కనుగొన్న ‘సేఫ్టీలాంప్’ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి అధికమవడానికి దోహదమైంది.
రవాణా సౌకర్యాలు: పారిశ్రామికీకరణ, నూతన యంత్రాలతో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ప్రయాణ సాధనాలకు ఆవిరి యంత్రాన్ని ఉపయోగించడంతో ఇంగ్లాండ్లో రవాణా సమస్య పరిష్కారానికి దోహదమయింది. స్టీఫెన్సన్ మొదటి రైల్వే ఆవిరి ఇంజన్ ‘రాకెట్’ను 1814లో తయారు చేశాడు. 1825లో స్టాక్టన్, డార్లింగ్టన్ పట్టణాల మధ్య రైలు నడిచింది. వీటి మధ్య ఉన్న 9 మైళ్ళ దూరాన్ని 5 మైళ్ళ వేగంతో సుమారు రెండు గంటలలో అధిగమించారు. 20 సంవత్సరాల కాలంలోనే గంటకు 30 నుండి 50 మైళ్ళ వేగం సాధారణ విషయంగా మారిపోయింది.
విస్తృతంగా తవ్విన జలమార్గాలలో ఆవిరి పడవలు తిరగడం మరొక ముఖ్య పరిణామం. ఆవిరి ఓడల నిర్మాణంలో రాబర్ట్ పుల్టన్, నికొలస్ రూజ్వెల్ట్లు ముఖ్యపాత్ర పోషించారు. ఈ స్టీమర్ల ద్వారా అధిక మోతాదుల్లో సరుకులు, పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించడం సాధ్యపడింది.
ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవం వలన కలిగిన లాభనష్టాలను వివరించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, తాత్త్విక రంగాలలో ఊహించని ఫలితాలను, మార్పులను తీసుకువచ్చింది.
ఆర్థిక రంగం: యంత్రాగార వ్యవస్థ, పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థలు ఒక దానితో ఒకటి ముడిపడ్డాయి. కొత్త యంత్రాలు భారీవి, ఖరీదైనవి. అందువలన ధనవంతులు వాటి యజమానులైనారు. ఈ భారీ యంత్రాలను ప్రత్యేక భవనాలు, కర్మాగారాలలో స్థాపించి నడపటం ప్రారంభించారు. భారీ పరిశ్రమలకు పెద్ద పెద్ద పెట్టుబడులు కావాల్సి వచ్చాయి. అది కొత్తరకమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు దారితీసింది. యాంత్రిక శక్తి వలన ఎంతోమంది చేతివృత్తుల వారు కార్మికులుగా మారారు. ఇంగ్లాండ్లో వస్తూత్పత్తి అధికమై ‘ప్రపంచ కర్మాగారం’ గా మారింది. పెద్ద పారిశ్రామిక వ్యవస్థలు రైలు మార్గాల వంటి జాయింట్ స్టాక్ కంపెనీలు కార్పొరేషన్లుగా తలెత్తాయి. ఇవి వేతనంపై ఉద్యోగస్తులను పనిచేయించుకోవడం ప్రారంభించాయి.
సంపద పెంపు: యాంత్రిక శక్తి ఉపయోగంతో పెట్టుబడి అనూహ్యంగా పెరిగింది. 1870 తరువాత కొత్త పరిశ్రమలు తలెత్తటం, పాత పరిశ్రమల అధిక విస్తరణలు భారీ పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించాయి. ఎంతోమంది పారిశ్రామిక పెట్టుబడిదారులు, వ్యక్తిగత సామర్థ్యంతో పైకొచ్చినవారు ప్రపంచ పారిశ్రామిక నాయకులుగా ప్రసిద్ధికెక్కారు.
ప్రజా సౌకర్యాలు: 1870 నుంచి విద్యుచ్ఛక్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇది క్రమంగా పరిశ్రమలకు, గృహాలకు వ్యాపించింది. ఐస్ తయారీ, నిల్వ ఉంచడానికి రిఫ్రిజిరేటర్ తయారీ, ‘సింగర్’ కనిపెట్టిన కుట్టుమిషన్, రెమింగ్టన్ ఆవిష్కరించిన టైప్ రైటర్, శీఘ్ర చలనానికి ఆవిష్కరింపబడిన సైకిల్ వంటివి ప్రజా జీవితంలో ఎన్నో సౌఖ్యాలను, విలాసాలను సృష్టించింది.
పారిశ్రామిక విప్లవం మానవ జీవితాన్ని అనేక విధాలుగా మార్చివేసింది. ఎంతో సాంకేతిక అభివృద్ధితో పాటు ఎన్నో సామాజిక, ఆర్థిక సమస్యలను సృష్టించింది.
సామ్రాజ్యవాదం: పారిశ్రామిక విప్లవం వలన వస్తువుల అధికోత్పత్తి జరిగి వాటి ధరలు తగ్గిపోయాయి. తమ అధికోత్పత్తులు అమ్ముకోవడం కోసం అంతర్జాతీయ మార్కెట్ల కొరకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు వలస వాదానికి, క్రమేణా సామ్రాజ్యవాదానికి దారితీసి వలసల కొరకు యుద్ధాలు జరిగాయి. వీటి కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని ఎన్నో దేశాలను వీరు ఆక్రమించి ఆయా దేశాలను దోపిడీ చేసారు.
నగరీకరణ: పారిశ్రామిక విప్లవం ఫలితంగా భారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల చుట్టూ పెద్ద పట్టణాలు అభివృద్ధి చెందాయి. 1750 నాటికి యాభైవేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు 29కి పెరిగాయి. పట్టణాలలో రెండు సాంఘిక వర్గాలు ఏర్పడ్డాయి. మధ్య తరగతి ప్రజలు ఒక వర్గంగా, పనిచేసే శ్రామికులు ఒక వర్గంగా ఏర్పడ్డారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహాలు, త్రాగునీరు. ప్రజారోగ్య వసతులు పెరగలేదు. కొత్తగా నగరానికి వచ్చినవారు అప్పటికే కిక్కిరిసిన మురికివాడల్లో నివసించారు. సగర కాలుష్యం నుండి తప్పించుకోవడానికి ధనికులు నగరపు శివార్లకు చేరారు. నగరాలలో టైఫాయిడ్, కలరా. కాలుష్యంతో వేలాదిమంది ప్రజలు మరణించారు.
సామాజిక పరిణామాలు: పారిశ్రామిక విప్లనం వలన అనేక సామాజిక పరిణామాలు సంభవించాయి. ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు ప్రజలకు కష్టాలను, అసంతృప్తిని మిగిల్చాయి. పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులలో అకస్మాత్తుగా తలెత్తిన పరిణామాలు 1848 విప్లవానికి, ఇంగ్లాండ్లో చార్టిస్ట్ ఉద్యమానికి దారితీసాయి. శాఖోపశాఖలుగా విస్తరించిన పారిశ్రామిక విప్లవ ప్రభావాన్ని తట్టుకొనే పరిజ్ఞానం లేని చిన్న వ్యాపారులు, మధ్య తరగతి పెట్టుబడిదారులు అసంతృప్తికి గురయ్యారు. గమ్యం తోచని శ్రామికులు యంత్రాలు తమ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని భావించి వాటిని ధ్వంసం చేసారు. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకొని ఆదాయాలను విపరీతంగా పెంచుకున్నారు. ఆ ధనాన్ని తిరిగి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టారు. వారి ధనదాహం కార్మికులను తిరగబడేటట్లు చేసింది.
స్త్రీలు – బాలకార్మికులు: పారిశ్రామిక విప్లవం స్త్రీలు – పిల్లలు పనిచేసే విధానంలో మార్పు తెచ్చింది. లాంకై షైర్, యార్కైర్ నూలు మిల్లు కర్మాగారాలలో స్త్రీలు, పిల్లలు ఎక్కువగా పనిచేసేవారు. పెద్ద పెద్ద యంత్రాల మధ్య ఎందరో బాల కార్మికులు గాయాల పాలవడం లేదా సురణించడం జరిగేది. స్త్రీలు కూడా దుర్భర పరిస్థితులలో పనిచేసేవారు.
కార్మిక చట్టాలు: ఫలితంగా కార్మికులలో పెరిగిన నిరసనలు తొలగించడానికి కార్మిక చట్టాలు తయారయ్యాయి.
బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు. కానీ ఆ చట్టాలు సక్రమంగా అమలవ్వలేదు.
సామ్యవాద ప్రభావం: ఐరోపాలో నాటి పరిస్థితుల నుంచి సాన్యువాద భావం ఊపందుకుంది. కార్ల్ మార్క్స్ తన మిత్రుడు ఏంగిల్స్తో కలిసి కమ్యూనిస్ట్ మానిఫెస్టో గ్రంథాన్ని రచించాడు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చాడు. ఇతను ‘దాస్ కాపిటల్’ అనే గ్రంథం రచించాడు.
మానవ చరిత్రలో ఏ విప్లవం కూడా పారిశ్రామిక విప్లవం ప్రభావితం చేసినట్లుగా మానవ జీవితాన్ని ప్రభావితం చేయలేదు. ఈ విప్లవ ఫలితంగా ఇంగ్లండ్ తదితర ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలో ప్రజలను దోపిడీకి గురిచేసి చెప్పలేని కడగండ్లకు గురిచేసాయి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
టి. హర్ గ్రీవ్స్.
జవాబు:
హవ్స్ 1720లో ఇంగ్లాండ్ నందు జన్మించాడు. ఇతడు చేనేత కార్మికుడుగా ఉండేవాడు. నిరక్షరాస్యుడు. | 1765లో హర్ గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని అభివృద్ధి చేసాడు. ఇది పదకొండు కుదుళ్ళను ఒక్కసారే తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆ విధంగా 8 లేక 10 మంది పనిని చేయగలిగింది. దీని సహాయంతో తీసిన దారం పురి తక్కువగా ఉండి దారం తెగిపోయి వస్త్రం నేయడానికి దృఢంగా ఉండేది కాదు.
ప్రశ్న 2.
ఆవిరి యంత్రం.
జవాబు:
1698లో థామస్ సావొరి గనుల నుండి తోడటానికి ‘ద మైనర్ ఫ్రెండ్స్’ అనే నమూనా ఆవిరి యంత్రాన్ని రూపొందించాడు. ఈ ఇంజన్ నిదానంగా పనిచేసేది. 1712లో న్యూకామెన్ మరొక ఆవిరి యంత్రాన్ని తయారు చేసాడు. ఈ ఇంజన్ కండెన్సింగ్ సిలిండర్ను నిరంతరం చల్లబరుస్తూ ఉండటం వలన శక్తిని కోల్పోతూ సరిగా పనిచేసేది కాదు. 1769లో జేమ్స్వట్ తన యంత్రాన్ని రూపొందించే వరకు ఆవిరి యంత్రం గనులకే పరిమితమయింది.
జేమ్స్వాట్ ఆవిరి యంత్రాన్ని వాయువులను, నీరు వంటి ద్రవాలను వేగంగా ముందుకు తీయడంతో పాటు, బండ్లను, యంత్రాలను కదిలించే సామర్థ్యం గల ఇంజన్ గా మార్పు చేసాడు. మథ్యూ బౌల్డన్ అనే సంపన్న వ్యాపారవేత్త సహాయంతో బర్మింగ్రమ్ నందు జేమ్స్వట్ సోహా అనే కార్ఖానా స్థాపించాడు. గనుల నుండి నీరు తోడడానికి, క్రేన్లను ఉపయోగించి బరువులు ఎత్తడానికి, యంత్రాల రవాణాకు, రోడు, రైలు, జల రవాణాకు ఆవిరి యంత్రం (స్టీమ్ ఇంజన్) ఉపయోగపడింది.
ప్రశ్న 3.
లూధిజమ్.
జవాబు:
‘జనరల్ లూడ్’ అనే జనాకర్షక నాయకుడు మరొక నూతన నిరసన ఉద్యమాన్ని చేపట్టాడు. దీనినే లుద్దిజం అంటారు. లుద్దిజం కేవలం యంత్రాలపై దాడిచేసే తిరోగమన విధానాన్ని అనుసరించలేదు. కనీస వేతనాలు, స్త్రీలు, పిల్లలపై పనిభారం తగ్గించడం, యంత్రాల రాకతో పని కోల్పోయిన వారికి ఉపాధి కల్పించడం, తమ కోర్కెలను చట్టబద్ధంగా తెలియజేయడానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కును ప్రబోధించింది. పారిశ్రామిక విప్లవం సంభవించిన తొలినాళ్ళలో కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయి. వారికి నిరసన తెలియజేయడానికి కాని, ఓటు హక్కు గాని లేవు. లుద్దిజం ఈ లోపాలను తొలగించడానికి కృషి చేసింది.
ప్రశ్న 4.
బాల కార్మికులు.
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో ఏర్పడిన అనేక పరిశ్రమలలో ఎంతోమంది బాల కార్మికులుగా పనిచేసేవారు. లాంకైర్, యార్కైర్ నూలు మిల్లు కర్మాగారాలలో ఎందరో బాల కార్మికులు పనిచేసేవారు. నూలువడికి జెన్నీ వంటి యంత్రాలను బాల కార్మికులు చిన్న శరీరాలతో, చేతి వేళ్ళతో వేగంగా పనిచేయడానికి అనువుగా తయారు చేసారు. బాల కార్మికుల శరీరాలు ఇరుకైన యంత్రాల మధ్య అటూ ఇటూ తిరుగుతూ పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సుదీర్ఘ పనిగంటలు, ఆదివారాలు యంత్రాలను శుభ్రం చేయడం వంటి పనుల వల్ల వారికి కొద్ది సమయమైనా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి, వ్యాయామానికి కాని అవకాశం ఉండేది కాదు. వారి జుట్టు యంత్రాలలో ఇరుక్కుపోవడం, చేతులు యంత్రాలలో పడి నలిగిపోవడం, అధిక శ్రమవల్ల అలసటకు గురై నిద్రలోకి జారుకొని యంత్రాలలో పడి చనిపోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేవారు. చిన్న వయసులో బాలురతో పని చేయించడం భవిష్యత్తులో కర్మాగారాలలో వారు చేసే పనులకు శిక్షణగా భావించేవారు. బాల కార్మికుల పరిస్థితులు మెరుగుపరచడానికి ఎన్నో చట్టాలు చేసినా, ఆ చట్టాలు సరిగా అమలు కాలేదు.
ప్రశ్న 5.
జాన్ మెక్ మ్.
జవాబు:
పురాతన కాలం నుండి ఇంగ్లీషు రోడ్లు, వస్తువులు, మానవుల రవాణాకు అనుకూలంగా ఉండేవి కావు. రవాణా చాలా వ్యయప్రయాసలతో కూడి నిదానంగా జరిగేది. ఈ సమస్య పరిష్కారానికి జాన్మెక్మ్ అనే స్కాట్లండు చెందిన ఇంజనీర్ కంకరరోడ్డు నిర్మించే పద్ధతి కనుగొన్నాడు. రహదారి ఉపరితలం మీద చిన్న చిన్న రాళ్ళను పరచి, చదును చేసి, బంకమట్టితో అతికాడు. ఈ విధానం ‘మెకాడమైజేషన్’ అనే పేరు పొందింది. తరువాత కాలంలో వీరెందరో కాంక్రీట్, తారు ఉపయోగించి మరిన్ని మంచి ఫలితాలు సాధించారు. మెకాడమ్ కనిపెట్టిన ఈ విధానంతో రవాణా రంగం సులభంగా, వేగంగా జరిగింది.
ప్రశ్న 6.
రైల్వేల ప్రయోజనాలు.
జవాబు:
మొదటి రైల్వే ఆవిరి ఇంజన్ ‘రాకెట్’ ను స్టీఫెన్ సన్ 1814లో తయారు చేసాడు. సంవత్సరం పొడవునా రవాణా చేయడానికి అనుకూలమైన సాధనంగా రైల్వేలు ఆవిర్భవించాయి. ఇవి ప్రయాణీకులను, సరుకులను వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయసాగాయి. 1760 నాటికి కలప పట్టాలకు బదులు, ఇనుప పట్టాలు కనిపెట్టడంతో ఆవిరి యంత్రంతో పెట్టెలు లాగడం వలన ఇది సాధ్యపడింది.
రైలు మార్గాలలో పారిశ్రామికీకరణ రెండవ దశకు చేరుకుంది. రైల్వేలు అత్యంత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ రవాణా మార్గాలుగా ఆవిర్భవించాయి. బ్రిటన్లో 1850 నాటికి అత్యధిక భాగం రైల్వేలైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికొరకు పెద్ద మొత్తంలో బొగ్గు, ఇనుము ఉపయోగించబడ్డాయి. ఇందువల్ల ప్రజా పనులు, నిర్మాణ రంగానికి ప్రోత్సాహం చేకూరి అనేకమంది కార్మికులకు ఉపాధి లభించింది.