AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 4th Lesson భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మహ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు గూర్చి సంక్షిప్తంగా తెలియజేయుము. ఆయన ఏమి బోధించెను ?
జవాబు:
అరేబియాలోని ఎడారి ప్రాంతంలో గల మక్కా నగరంలో క్రీ.శ. 570లో ఖురేషి జాతికి చెందిన హాష్మయిట్ కుటుంబంలో మహ్మద్ జన్మించాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ అయిన మహమ్మదు అతని మేనమామ అబూతాలిబ్ పెంచాడు. మామతోపాటు వర్తక వ్యాపారాలలో పాల్గొని మంచి సామర్థ్యం సంపాదించాడు. దక్షిణ అరేబియా, సిరియా వంటి అనేక ప్రాంతాలలో వర్తక బిడారులతో, విస్తృతంగా పర్యటించాడు.

ఖదీజా అనే బాగా డబ్బున్న వితంతువు వద్ద ప్రతినిధిగా చేరి కొద్ది కాలంలోనే ఆమె అభిమానాన్ని, ప్రేమను చూరగొని ఆమెను వివాహమాడాడు. మహమ్మద్ నిరంతరం ఆలోచనా నిమగ్నుడై ఉండేవాడు. మక్కా సమీపంలో ధ్యానం చేసేవాడు. జీవిత సత్యాలకై అన్వేషించాడు. మహ్మద్కు తన 40వ ఏట నిజమార్గం లభించింది. మహ్మద్ తనకు కలిగిన సత్యానుభూతితో ప్రవక్తగా మారాడు. తాను దేవుని దూతనని (రసూల్) భావించాడు. మహ్మద్కు కలిగిన దైవానుభూతితో ‘అల్లా’ ఒక్కడే దేవుడని తాను అల్లా యొక్క ప్రవక్తను అని విశ్వసించాడు. అట్లాగే బోధించాడు. ఇటువంటి విశ్వాసులందరినీ ఒక జనసామాన్యంగా తయారు చేసాడు.

మక్కా ఒక వ్యాపారకేంద్రంగానే కాక పవిత్రమైన దేశంగా మారింది. మక్కాలోని ‘కబ్బా’ అనే ఒక దీర్ఘచతురస్రాకారం రాయి ముసల్మానులకు పవిత్ర స్థలమయింది. ఇస్లాం అనగా దేవుని వలన శాంతిని పొందుట.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ఇస్లాం మత లక్షణాలు: దైవం యొక్క ఏకత్వాన్ని, ఆధిక్యతను అంగీకరిస్తూ ఆయనకు సేవలు చేయడం ద్వారా శాంతిని సాధించవచ్చు. అల్లా అనే ఒకే ఒక దేవుడున్నాడని, ఆయన సర్వాధికుడని ఇస్లాం చెబుతుంది. ప్రపంచంలోని ముసల్మానులందరూ సమానులే. వారు సోదర సమానులు. ఏకేశ్వరోపాసన ఇస్లాంలో కనిపిస్తుంది. విగ్రహారాధన లేదు. ఇస్లాంలో పూజారులు లేరు. వారి ఆరాధనలో సులభమైన పద్ధతులు కలవు. ప్రతిరోజు ప్రార్థన, ప్రతి ముసల్మాను తన మతవిధిగా దేవుని పేరుతో పేదలకు దానధర్మాలు చేయుట, దొంగతనాలు చేయకుండుట వంటి నియమాలు అనుసరించాలి. మహ్మద్ చెప్పిన సర్వసమానత్వం కులీనులకు కంటగింపుగా మారింది. ఆ వర్గం మహ్మద్ను అనేక ఇబ్బందులకు గురి చేసింది. ప్రాణాపాయం నుండి తప్పించుకొనుటకు క్రీ.శ.622లో మహ్మద్ మక్కాను వదిలి మదీనాకు ప్రవాసం పోయాడు. ఈ ప్రవాసాన్ని ‘హిజరా’ పేరుతో ముసల్మానుల కేలండర్ ప్రథమ సంవత్సరంగా గుర్తించారు. క్రీ.శ. 632లో మహ్మద్ మరణించే నాటికి అరేబియా అంతా ఒక్కటై గొప్ప మత సమైక్యతను సాధించింది. మహమ్మదీయులు తమ మత ప్రచారం, వ్యాప్తి పట్ల తీవ్రమైన ఉత్సాహం, ఉద్రేకం కలిగి ఉండేవారు.

మహ్మద్ ప్రవక్త బోధనలు: ఈ నూతన మత సారాంశం వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్తో కనుగొనవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం. మహ్మద్ విగ్రహారాధనను ఖండించాడు. అల్లాను విశ్వసించే భక్తులు సహోదరులు వలె జీవించాలి. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ‘లా ఇలాహ ఇల్ అల్లా మహమ్మద్ ఉర్
రసూల్ అల్లా (అల్లా తప్ప మరో దేవుడు లేడు) మహ్మద్ అతని ప్రవక్త, ఇది వారి ప్రార్థనాగీతం, దీని పునఃచరణనే కల్మా అంటారు. మహ్మద్ యొక్క స్వంత తెగ ఖురేషీకి చెందినవారు మక్కాలో నివసించి కాబాపై అధికారం చలాయించారు. ప్రతి ముసల్మాను రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేయాలి. దీనినే నమాజ్ అంటారు. శుక్రవారం మధ్యాహ్నం తప్పనిసరిగా మసీదులో ప్రార్ధన చేయాలి.

ఇస్లాం మతానికి పవిత్రమైన రంజాన్ నెలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఎటువంటి ఆహారం తీసుకోరాదు. ప్రతి ముసల్మాను తన మత విధిగా, దేవునికి కానుకగా పేదలకు దానం చేయాలి. ఈ పవిత్రమైన చర్యను ‘జకాత్’ అంటారు. ప్రతి మహమ్మదీయుడు తన జీవితకాలంలో ఒక పర్యాయమైన మక్కాలోని పవిత్ర స్థలాన్ని సందర్శించాలి. ఈ తీర్థయాత్రనే ‘హజీ’ అంటారు. ఇవి కాక మరికొన్ని నియమాలను, ఆచారాలను ముసల్మానులు ఆచరించాలి. అణకువ, దాతృత్వం, నిజాయితీ, మహిళల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవం, బానిసలపై కారుణ్యం, జంతువులపై దయ, మధ్యపానం, జూదంలకు దూరంగా ఉండటం వంటి సద్గుణాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఇస్లాం మతం హేతువాదానికి ప్రాధాన్యత ఇచ్చింది. మంత్రతంత్రాలు, అర్థం కాని ఆధ్యాత్మిక సూత్రాలు ఇందులో లేవు. అందరూ సమానులే అన్న సిద్దాంతం ఇస్లాం ఉదారవాదానికి ప్రతీక. మహమ్మదీయులలో విశ్వమానవ సౌభ్రాతృత్వం, దేవునికి మనిషికి మధ్య గల ప్రీతిపాత్రమైన సంబంధం వంటి అనేక లక్షణాలు ఇస్లాం మతాన్ని ప్రపంచ మతాలలో ఒక గొప్ప మానవతామతంగా తీర్చిదిద్దాయి.

ప్రశ్న 2.
ఇస్లాం వారసత్వం గురించి వివరింపుము.
జవాబు:
రోమన్ సామ్రాజ్యం వలె విస్తరణలోను, వివిధ రకాలైన ప్రజలతో కూడుకొని అరబ్ లేదా ఇస్లాం సామ్రాజ్యం కూడా ప్రసిద్ధిగాంచింది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియా ప్రాంతాలకు చెందిన ప్రజలు అరబ్ సామ్రాజ్యంలో అంతర్భాగం. ప్రాజ్ఞులైన ఎందరో ఈ రాజ్యాన్ని పాలించారు. వారిలో హరున్-అల్-రషీద్, ఆయన కుమారుడు మామున్లు మిక్కిలి ఖ్యాతి గాంచారు. హరున్-అల్-రషీద్ పాండిత్యం, కళలు, సాహిత్యం, విజ్ఞానం, వర్తక వ్యాపారులను ప్రోత్సహించాడు.

విద్య: అరబ్బుల ఇస్లాం సామ్రాజ్యంలో గర్వించదగిన బాగ్దాద్, కైరో, డమాస్కస్, కార్గోవా, సెవిలె, బార్సిలోనా వంటి చోట్ల గొప్ప విద్యాకేంద్రాలుండేవి. వీరు ప్రాచీన గ్రీకు మహాకావ్యాలు హైందవుల గణిత గ్రంథాలను తర్జుమా చేసారు. మహమ్మదీయులు ‘మదర్సాలు’ అనే విద్యాకేంద్రాలు స్థాపించారు. మదర్సాలు మసీదులకు అనుబంధ కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. భారతీయులు ఖగోళ, గణిత శాస్త్రాలలో చేసిన కృషి అరబ్బులనెంతో ఆకర్షించింది. అరబ్బుల ద్వారా ఈ జ్ఞానం యూరపు అందింది. డా. ఇబిన్సినా (980-1037) యొక్క వైద్యగ్రంథాలు అరబ్ దేశాలలో విస్తృతంగా అధ్యయనం చేయబడింది. అవిసెన్నా రచించిన “అలనూన్, ఫిల్ టిబ్” అనే వైద్య గ్రంథంలో 760 రకాల మందులు గురించి పేర్కొన్నారు. ఈ వైద్య గ్రంథం యూరప్లో పాఠ్యగ్రంథంగా చేయబడింది.

అరబ్బులు సంఖ్యామానాన్ని భారతీయుల వద్ద నేర్చుకున్నారు. వారి ద్వారా యూరప్ కు చేరింది. గణితశాస్త్రంలో అరబ్బులు మరిన్ని పరిశోధనలు చేసారు. కళ్ళ జబ్బులు, అంటురోగాల వ్యాప్తికి మందులు కనిపెట్టారు. బస్రాకు చెందిన ‘అల్హసన్’ అనే శాస్త్రజ్ఞుడు దృష్టికి సంబంధించిన మూలగ్రంథాన్ని రచించాడు. ఇది తదుపరి లాటిన్లోకి అనువదించబడి ‘ఆప్లికేథెసారస్’గా ప్రసిద్ధిచెందింది.

ఉత్పత్తులు: అరబ్బులు పేపర్ తయరీ, బ్లాక్ ముద్రణ విధానాలు చైనా వారి నుండి గ్రహించారు. వీరి ద్వారా ఐరోపా వారు గ్రహించారు. అనేక రసాయన సమ్మేళనాలను కనుగొన్నారు. నత్రికామ్లం, సల్ఫ్యూరిక్ఆమ్లం, సిల్వర్ నైట్రేట్ మొదలైన రసాయనాలు తయారుచేసారు. ‘మస్లిన్’ వస్త్రం తయారీ రంగంలో ప్రసిద్ధిగాంచారు. పారసీక తివాచీలు, చర్మకారుల తయారీలు జగత్ప్రసిద్ధి చెందాయి. ఆయుధాలను అందంగా తీర్చిదిద్దడంలో వీరిది అందెవేసిన చేయి. బాకులు, కటారులు మణిఖచితమైన అందాన్ని సంతరించుకున్నాయి.

ప్రయాణాలు, విదేశీ వ్యాపారం: అరబ్బులు అలవాటుపడిన బాటసారులుగా గుర్తింపు పొందారు. వారు వస్తు, విశేషాలతో చైనా, భారతదేశాలకు బిడారులుగా వెళ్ళేవారు. భూ, సముద్ర మార్గాల ద్వారా సుదూర ప్రాంతాలకు దీర్ఘప్రయాణాలు చేసేవారు. అల్బేరూని, ఐఇబన్ బతూత, అల్ ఇద్రిసి వంటి ప్రయాణీకులు ఇట్టివారే. నావికాబలంలోను, సముద్రయానంలోను, నూతన ప్రదేశాల అన్వేషణలో అరబ్బులు అగ్రగణ్యులు. ఈ సముద్రప్రయాణాలు వర్తక, వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చాయి. ఇండియా, చైనా, తీర ఆఫ్రికాతో విస్తృత వాణిజ్య సంబంధాలు పెరిగాయి. అరబ్బులు తమ ప్రత్యేక ఉత్పత్తులను విదేశీ విపణులలో అమ్మేవారు. రగ్గులు, తివాచీలు, పరిమళ వస్తువులు, మల్లుసెల్లాలు, గాజుగుడ్డలు, పండ్ల పానీయాలు మొదలైన వాటికి గిరాకీ. బాగ్దాద్ సిరిసంపదలతో తులతూగుతూ గొప్ప ఖ్యాతినార్జించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

కళలు, వాస్తు నిర్మాణాలు: అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు. అరబ్బుల కళలు ఇరాన్, బైజాంటిన్ సామ్రాజ్యాలచే ప్రభావితం చెందాయి. నిర్మాణంలో వీరిది ప్రత్యేకశైలి. వీరి వాస్తుశిల్పికళా ప్రక్రియలు మసీదులలోనే కాక పుస్తక భాండాగారాలలో, వైద్యశాలల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నాటి ప్రసిద్ధిగాంచిన నిర్మాణాలలో అల్ హమ్ర్బా (స్పెయిన్లోని గ్రనడా వద్ద), అల్కాజర్ (సెవిల్ వద్ద), గొప్పమసీదు (బాగ్దాద్)లో కలవు. డోమ్, ఆర్చి, మినారట్ల నిర్మాణ ప్రక్రియ వారి వాస్తు శైలికి నిదర్శనం. ఖురాన్ మానవులను, జంతువులను సూచించే బొమ్మలను నిషేధించినందున మహమ్మదీయ కళాకారులు రాజభవనాలు, మసీదు లోపల, వెలుపల గోడలపై చెక్కుడు పనితనాన్ని చూపారు. రాజభవనాల చుట్టూ అందమైన తోటలు, ఎగజిమ్మే నీటి ఊటలు నిర్మించుకున్నారు. సుందరంగా తీర్చిదిద్దినట్లుగా రాయడాన్ని వారు ఒక కళగా అభ్యసించారు. దీనిని కాలిగ్రఫి అన్నారు.

సాహిత్యం, చరిత్ర: అరబ్బుల సాహితీ సేవ వర్ణనాతీతం. అలబారి ‘అన్నాల్స్ ఆఫ్ ది అపోస్టల్స్ మరియు రాజులు’ అనే గ్రంథాన్ని రచించాడు. ఉమర్ ఖయ్యమ్ రాసిన రుబాయత్, ఫిరదౌసీ – షానామా, అరేబియన్ రాత్రులు అనే వేయిన్కొక్క కథలు నాటి సాహితీసంస్కృతికి అద్దం పడతాయి. అరేబియన్ రాత్రులు ప్రపంచంలోని అనేక భాషలలోకి అనువాదమైంది. ఇంకా లుల్డూరీ రచించిన అన్సాబ్ అల్ అష్రఫ్, తబారీ రచించిన తారిఖ్-అల్-రసూల్, వాల్ ములుక్ గొప్ప గ్రంథాలుగా ఖ్యాతిగాంచాయి. అల్బెరూనీ రచన ‘తహకీక్ మలీల్ – హింద్’ లో ఇస్లాంకు అతీతంగా ఇతర సంస్కృతి యొక్క విలువను ప్రస్తుతించే ప్రయత్నం చేయబడింది.

ఆర్థిక రీతి: వ్యవసాయ భూములు రాజ్యాధీనం. భూమి శిస్తు రాజ్యాదాయంలో అధిక భాగం. భూమిశిస్తు (ఖరజ్) పంటలో 1/2 నుండి 1/5 వరకు ఉండేది. మహమ్మదీయ రైతులు ఆధీనంలో గల భూమిపై 1/10వ వంతు పన్ను వసూలు చేసారు. అన్యమతస్థులపై పన్నుల భారం విపరీతంగా ఉండేవి. రకరకాల పంటలు పండించేవారు. యూరపు వాటి ఎగుమతులు కూడా జరిగేవి. మధ్యధరా, హిందూ మహాసముద్రాల మధ్య ఎన్నో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందాయి. చైనా, ఇండియా, యూరప్ల మధ్య జరిగే నౌకా మార్గ వ్యాపారం అరబ్బు, ఇరానియన్ వర్తకుల హస్తగతమై ఉండేది. ఆనాటి వాణిజ్యం ప్రధానంగా రెండు మార్గాల గుండా సాగేది.

1) ఎర్ర సముద్రం, పర్షియన్ అఖాతం మీదుగా, 2) ఇరానియన్ వర్తకుల ఆధ్వర్యంలో సిల్క్ రూట్ గుండా చైనాకు ప్రయాణం చేసేవారు. ఈ వ్యాపారంలో బంగారు, వెండి నాణేలు చలామణీలో కొనసాగాయి. సుడాన్ నుండి బంగారం, మధ్య ఆసియా నుండి వెండి లభించేవి. అరువు పత్రాలు సక్ (ఆధునిక కాలపు చెక్కు) వంటివి వర్తకులు, బ్యాంకర్లు ద్రవ్య మార్పిడికి వాడేవారు.

ఈ విధంగా మధ్యయుగ చరిత్రలో అరబ్బులు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. వీరి ద్వారా ఐరోపా వారు భారతీయుల పరిజ్ఞానాన్ని, గ్రీసువారి మహాకావ్యాలను గురించి తెలుసుకున్నారు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఖలీఫా
జవాబు:
క్రీ.శ 632లో మహమ్మద్ మరణాంతరం అరేబియాలోని ప్రముఖులు అబూబాకర్ అనే మహమ్మద్ ప్రవక్త స్నేహితుడిని అతని వారసునిగా గుర్తించారు. అతన్ని ఖలీఫా లేదా కాలిఫ్ అని పిలిచేవారు. ఖలీఫా అనే అరబిక్ పదానికి వారసుడు అనే అర్థం ఉంది. అబూబాకర్ తర్వాత ‘ఉమర్’ ఖలీఫా అయ్యాడు. ఖలీఫా అంటే యావత్ ముస్లిం ప్రపంచానికి రాజకీయ, మతపరంగా మహ్మద్ ప్రవక్తకు వారసుడుగా గుర్తింపబడిన వ్యక్తి. అతనికి మత, రాజకీయ అధికారాలు ఉండేవి. మొదటి నలుగురు ఖలీఫాల తర్వాత ఖలీఫా పదవి వంశపారంపర్యమైంది. ‘ఉమయ్యద్లు, ”అబ్బాసిడ్లు,’ ‘ఆట్టోమన్లు’ సుదీర్ఘకాలం ఖలీఫాలుగా ఉన్నారు. ఒక శతాబ్దకాలంలో ఖలీఫాలు ఇరాన్, సిరియా, ఈజిప్ట్, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా, స్పెయిన్ ప్రాంతాలలో అతి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. మతప్రచారం పట్ల వారికున్న ఉత్సాహం, భాగ్యవంతమైన ప్రదేశాలనాక్రమించుకోవాలనే కోరిక వారి అద్భుత విజయాలకు కారణమయింది. సుదీర్ఘకాలం కొనసాగిన ఖలీఫా వ్యవస్థను మొదట ప్రపంచ యుద్ధం తర్వాత ఆధునిక టర్కీ జాతిపిత అయిన ముస్తాఫా కమాల్పాషా 1923లో రద్దు చేసాడు.

ప్రశ్న 2.
క్రూసేడులు.
జవాబు:
క్రీ.శ. 638లో జెరూసలేంను అరబ్బులు ఆక్రమించారు. అయినప్పటకీ క్రైస్తవ యాత్రికులు ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన పవిత్ర స్థలాలు చూడటానికి అనుమతించబడ్డారు. క్రీ.శ.11వ శతాబ్ది మధ్యకాలానికి పరిస్థితులు మారిపోయాయి. ఐరోపా క్రైస్తవులు, అరబ్బులు మధ్య పరంపరాగత ఘర్షణలు తలెత్తాయి.

సెలుక్ తురుష్కులు మధ్య ప్రాచ్యంలో మత దురహంకారంతో క్రైస్తవ యాత్రికులను బాదించసాగారు. వీరి దుర్మార్గాలను విని చలించిపోయిన ‘పోప్ రెండవ అర్బన్’ క్రైస్తవ రాజ్యాలన్నీ కలిసి తురుష్కులను ఎదుర్కోవాలని ప్రబోధించాడు. పవిత్రభూమిని (పాలస్తీనా) విముక్తి చేయాలని ఆదేశించాడు. ఇది కాస్తా రెండు శతాబ్దాల పాటు రెండు ఏకేశ్వరోపాసన మతాల మధ్య భీకర యుద్ధాలకు, ఎంతో రక్తపాతానికి దారి తీసింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

విశేష క్రైస్తవ ప్రజానీకం పవిత్రయుద్ధానికి సిద్ధమయ్యారు. కులీనులు, వర్తకులు, సైన్యాధికారులు, నేరస్థులు, భూస్వాములు, జులాయిలు, సాహసికులు ఇలా ఎందరో యుద్ధంలో చేశారు. ఫ్రాన్స్, ఇటలీ సైన్యాలు 1099 నాటికి జెరూసలేంను ఆక్రమించుకోవడం జరిగింది. క్రీ.శ 1187 నాటికి సలాదిన్ చక్రవర్తి తిరిగి జెరూసలేంను ఆక్రమించుకున్నాడు. క్రైస్తవ, మహమ్మదీయుల మధ్య నాలుగు ప్రధాన యుద్ధాలు జరిగాయి. కానీ రెండు శతాబ్దాల పోరాటం తరువాత కూడా జెరూసలేం తురుష్కుల చేతిలో ఉండిపోయింది. అంతటా ఇస్లాం వ్యాపించింది. క్రైస్తవుల సంస్కృతి, యుద్ధ పద్ధతులకన్నా ముస్లింల నాగరికత బలమైనదని నిరూపితమయింది. క్రూసేడులలో పాల్గొనుట వలన ప్రభువులు, భూస్వాములు మరణించడంకాని, దరిద్రులవడం కాని జరిగి భూస్వామ్య వ్యవస్థ క్షీణించింది. ఐరోపాలో పోప్ ఆధిక్యత తగ్గింది. క్రూసేడులు మతం వల్ల ఉత్తేజితమై, వర్తక వ్యాపార అభివృద్ధితో పారిశ్రామిక ప్రగతితో, సాంస్కృతిక పునరుజ్జీవనంతో ముగిసాయి.

ప్రశ్న 3.
మధ్య ఇస్లాం ప్రాంతాలు ఆర్థిక రీతి.
జవాబు:
వ్యవసాయ భూములు రాజ్యాధీనం. భూమిశిస్తు రాజ్యాదాయంలో అధికభాగం. భూమిశిస్తు(ఖరజ్) పంటలో 1/2 నుండి 1/5 వరకు ఉండేది. మహమ్మదీయ రైతు ఆధీనంలో గల భూమిపై ఆదాయంలో 1/10వ వంతు వసూలు చేస్తే అన్యమతస్థులపై పన్నుభారం విపరీతంగా ఉండేది. పాలకులు కేటాయించిన భూములను ‘ఇక్తా’లు అనేవారు.
నైలునది లోయలో రాజ్యం ఆధీనంలో గల సాగునీటి వనరులు ఉండేవి. ప్రత్తి, నారింజ, అరటి వంటి అనేక రకాలు పండించబడేవి. యూరప్కు ఎగుమతులు కూడా జరిగేవి. నాడు కూఫా, బస్రా, కైరో, బాగ్దాద్, డమాస్కస్లు ప్రసిద్ధి చెందిన నగరాలు.

మధ్యదరా, హిందూ మహా సముద్రాల మద్య ఎన్నో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందాయి. చైనా, ఇండియా, యూరప్ మధ్య జరిగే నౌకా వ్యాపారం అరబ్బు, ఇరానియన్ వర్తకుల హస్తగతమై ఉండేది. ఆనాటి వాణిజ్యం రెండు ప్రధాన మార్గాల గుండా జరిగేది. 1) ఎర్ర సముద్రం పర్షియన్ అఖాతం మీదుగా 2) ఇరానియన్ వర్తకుల ఆధిపత్యంలోని సిల్క్ రూట్ గుండా సమర్ఖండ్ల మీదుగా చైనాకు ప్రయాణం చేసేవారు. ఈ వ్యాపార అల్లిక మార్గంలో ట్రాన్స్ ఆక్సియానా ఒక ప్రముఖ గొలుసు లేదా వలయం. నాటి వ్యాపారంలో బంగారు, వెండి నాణేలు చలామణిలో కొనసాగాయి. సుడాన్ నుండి బంగారం, మధ్య ఆసియాలోని జరఫన్య నుండి వెండి లభించేది. అరువు పత్రాలు, చెట్లు వాటి వర్తకులు, బ్యాంకర్లు ద్రవ్యమార్పిడికి ఉపయోగించారు.

ప్రశ్న 4.
ఇస్లాం మత కట్టడాలు.
జవాబు:
అరబ్బులు గొప్ప భవన నిర్మాతలు. అరబ్బుల కళలు ఇరాన్, బైజాంటియన్ సామ్రాజ్యాలచే ప్రభావితం చెందాయి. వారు ప్రత్యేకమైన నిర్మాణశైలి కలిగి ఉన్నారు. వారి వాస్తు శిల్పకళా ప్రక్రియలు మసీదులలోనే కాక పుస్తక భాండాగారాలలో, వైద్యశాలల్లో, విద్యాసంస్థలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పరిపాలకుల ఆదరణలో ఎన్నో గొప్ప భవనాలు రూపు దిద్దుకున్నాయి. నాటి ప్రసిద్ధ కట్టడాలలో ‘అల్హమ్రా భవనం (స్పెయిన్లోని గ్రనడా వద్ద), అల్కాజర్ (సెవిలె వద్ద) గొప్పమసీదు (బాగ్దాద్) కలవు. డోమ్, ఆర్చి, మినారట్ల ప్రక్రియ వారి వాస్తుశైలికి నిదర్శనం.

ఖురాన్ మానవులను, జంతువులను సూచించే బొమ్మలను నిషేధించినందున మహమ్మదీయ కళాకారులు రాజభవనాల, మసీదుల లోపలి, బయటి గోడలపై చెక్కుడు పనితనాన్ని చూపారు. మసీదు, రాజభవనాల చుట్టూ అందమైన తోటలు, ఎగజిమ్మే నీటి ఊటలు నిర్మించారు. వారి రాజభవనాలలో రోమన్, ససానియన్ కళావిశేషాల్ని మేళవించారు. వాటిలో మితిమీరిన అలంకరణ కన్పిస్తుంది. అబ్బాసిడ్లు సమర్రాలో నిర్మించిన సామ్రాజ్య నగరం తోటలతో, ప్రవహించే నీటి ఊటలతో బహుసుందరంగా ఉండేది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇస్లాం కాలెండర్.
జవాబు:
ఇస్లాం కాలెండరే హిజరీ కాలెండర్ అంటారు. క్రీ.శ. 622లో హిజరా యుగం ప్రారంభమయింది. ఈ యుగంలో AH (Anno Hegirae(లాటిన్) In the year of the Hijra)తో గుర్తించబడుతోంది. మహమ్మద్ క్రీ.శ. 622లో మక్కా నుండి మదీనాకు ప్రవాసం పోవడాన్ని ‘హిజరా’ గా గుర్తించారు. ఇస్లాం కాలెండర్, చాంద్రమానాన్ని అనుసరించి ఉంటుంది. 12 నెలలు 354 రోజులు ఉంటాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ప్రశ్న 2.
ఫాతిమా.
జవాబు:
ఫాతిమా మహమ్మద్ ప్రవక్తకు, ఖదీజాకు జన్మించిన కుమార్తె. క్రీ.శ 604లో జన్మించింది. ఫాతిమాను ‘ఆలీ’ వివాహమాడాడు. మహ్మద్ ప్రవక్త (తండ్రి)తో ఎంతో సన్నిహితంగా ఉంటూ, తండ్రి కష్టకాలంలో తోడుగా ఉంది. భర్తను పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకొనేది. మహ్మద్ ప్రవక్తకు వారసులు ఫాతిమా ద్వారానే వ్యాపించారు. ఈ విధంగా యావత్ ముస్లిం ప్రపంచంలో ‘ఫాతిమా’ ఒక ఆదర్శమహిళగా గుర్తింపు పొందింది.

ప్రశ్న 3.
ఖురాన్.
జవాబు:
మహ్మద్ ప్రవక్త స్థాపించిన నూతన మత సారాంశం ‘ఖురాన్’ అనే మత గ్రంథంలో కనుగొనవచ్చు. అరబిక్ భాషలో ఖురాన్ అనగా కంఠస్తం చేయడం. ఇస్లాం మత సిద్ధాంతాలకు మూలాధారం ఖురాన్.

అరబిక్ భాషలోని ఖురాన్ 114 అధ్యాయాలు (సురలు)గా విభజింపబడింది. అరబ్బు సంప్రదాయాన్ని బట్టి మహ్మద్ ప్రవక్తకు భగవంతుడు తెలియజేసిన సందేశాల సంపుటియే ఖురాన్. ప్రస్తుతం లభిస్తున్న ఖురాన్లలో అత్యంత ప్రాచీనమైనది. 9వ శతాబ్దానికి చెందినది. ప్రపంచంలోని మేటి గ్రంథాలలో ఒకటిగా ఖురాన్ గుర్తింపు పొందింది.

ప్రశ్న 4.
వైద్య సూత్రాలు.
జవాబు:
వైద్య శాస్త్రంలో అరబ్బుల ప్రగతి గణనీయమైనది. అవిసెన్నా రచించిన ‘అలనూన్ఫెల్ టిబ్’ అన వైద్యగ్రంథంలో 760 రకాల మందుల గురించి పేర్కొన్నారు. లంకణం పరమౌషధమని, కొన్ని వ్యాధులు ఉపవాసం చేయుట ద్వారా తగ్గిపోతాయని ఈ గ్రంథం పేర్కొంది.

ప్రశ్న 5.
షహనామ.
జవాబు:
షానామ అనే దీర్ఘ చారిత్రక కావ్యాన్ని గొప్ప పారశీక కవి ఫిరదౌసి రచించాడు. దాదాపు 60,000 పద్యాలతో ఉన్న ఈ కావ్యంలో ప్రాచీన పర్షియాను పాలించిన రాజుల యొక్క చరిత్ర వివరించబడింది. క్రీ.శ. 977లో ప్రారంభించిన ఈ కావ్యం క్రీ.శ. 1010 సంవత్సరంలో పూర్తయింది. సాహిత్య చరిత్రలోని అత్యుత్తమ కావ్యాలలో ఒకటిగా ఫిరదౌసి
నిలిచింది.

AP Inter 2nd Year History Study Material Chapter 4 భూఖండ మధ్య ప్రాంత ఇస్లామ్ సామ్రాజ్యం

ప్రశ్న 6.
మదర్సాలు.
జవాబు:
మదర్సా అనే అరబిక్ పదానికి విద్యాసంస్థ అని అర్థం. మహమ్మదీయులు మదర్సాలు అనే విద్యా కేంద్రాలుగా స్థాపించారు. మదర్సాలు మసీదులకు అనుబంధ కేంద్రాలుగా వృద్ధి పొందాయి. బాగ్దాద్ లో గల ‘ముస్తాన్ సిరియా’ మదర్సా 1233లో నెలకొల్పబడింది. అలెగ్జాండ్రియా, సిరియా, మెసపిటోమియాలోని మదర్సాలలో గ్రీకుతత్త్వ శాస్త్రం, గణితం, వైద్యశాస్త్రం బోధింపబడేది. అనువాదం అనేది మదర్సాలలోని ముఖ్య ప్రక్రియలు ఒకటి. అనేక భారతీయ ఖగోళ, గణిత, వైద్య గ్రంథాలు ఇలా అనువాదం చేయబడ్డాయి.