Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 6th Lesson ఐరోపాలో భూస్వామ్య పద్ధతి Textbook Questions and Answers.
AP Inter 2nd Year History Study Material 6th Lesson ఐరోపాలో భూస్వామ్య పద్ధతి
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఐరోపా భూస్వామ్య లక్షణాలను వివరించుము.
జవాబు:
‘ఫ్యూడ్’ అనగా ‘ఒక చిన్న భూభాగం’ అని అర్థం. ఈ వ్యవస్థ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ ఇటలీలలో ఏర్పడింది. మధ్యయుగంలో తరచూ సంభవించే యుద్దాలలో ప్రజల ప్రాణాలను, సంపదను, భూములను కాపాడుకోవడానికి ఏర్పడిన వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ఇది ఒక రకమైన సామాజిక వ్యవస్థ ఆర్థికంగా చెప్పాలంటే ఫ్యూడలిజం అనగా భూమి, వ్యవసాయ ఉత్పత్తులు భూమికి సంబంధించిన భూస్వాములు మరియు రైతులు మధ్య ఉండే సంబంధాల వ్యవస్థగా చెప్పవచ్చు.
భూస్వామ్య వ్యవస్థ మూలాలు పవిత్ర రోమన్ చక్రవర్తి కాలం (8వ శతాబ్దం) నుండే ప్రారంభమైనప్పటికి క్రీ.శ. 11వ శతాబ్దం నుండి భూస్వామ్య వ్యవస్థ ఒక జీవన విధానంగా మారింది. దాదాపు ఐరోపాలోని అనేక ప్రాంతాలలో ఏర్పడింది. భూస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ బలహీనపడి, రాజ్యపాలన వికేంద్రీకరణ జరిగి, రాజ్యవ్యవస్థకు మూలాధారమైన సైనికులను పోషించడానికి రాజు తనకు విశ్వాసపాత్రులైన కొందరు ప్రభువులకు కొంత ప్రాంతంపై అధికారమిచ్చి వారిని తనకు విశ్వాసపాత్రులుగా ఉంచేవారు. కాలక్రమంలో ఈ వ్యవస్థ వంశపారంపర్యమైంది. భూస్వామ్య వ్యవస్థ రైతుల, సామాన్యుల, శ్రామికుల యొక్క శ్రమను దోపిడీ చేసింది.
సామాజిక వ్యవస్థ: భూస్వామ్య వ్యవస్థలో మతాధికారులు (క్లెర్జీ) అత్యున్నత స్థానంలో ఉండేవారు. రాజులు వీరికిచ్చిన భూములపై స్వతంగా పన్నులు విధిస్తూ రాజుపై ఆధారపడకుండా స్వతంత్రంగా, శక్తివంతంగా ఉండేవారు. చర్చికి ‘పోప్’ ఉన్నతాధికారి, కాగా ఐరోపాలో ఎందరో క్రైస్తవులు, బిషప్లు ఎస్టేట్లు కలిగి ఉండేవారు. పైగా వీరు మొదటి శ్రేణి పౌరులుగా పరిగణింపబడేవారు. వీరికి ఎటువంటి పన్నుల బెడద ఉండేది కాదు.
సమాజంలో రెండవ స్థానం ప్రభువర్గానిది. వీరికి భూములపై అధికారం ఉండటంచే వీరికి ఆ హోదా లభించింది. భూస్వాములు మెనోరియల్ ఎస్టేట్స్కు అధిపతులుగా ఉండేవారు. వీరి క్రింద ఉండే రైతులు, అర్థ బానిస రైతులు, కార్మికులను తమ అవసరాల కోసం పని చేయించుకునేవారు. వీరిపై పన్నుల బెడద అధికం. శ్రమ దోపిడి విపరీతంగా ఉండేది.
సమాజంలో మూడవ స్థానం రైతులు, సామాన్యులు ఉండేవారు. స్వేచ్ఛ కలిగిన రైతులు తమ ప్రభువుల వద్ద భూమిని, కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. వీరిని వెసల్ (కౌలుదారుడు) అనేవారు. కౌలుకిచ్చే భూమిని ‘ఫీఫ్’ అనేవారు. ప్రభువుకు కౌలుదారుడు రక్షణ కల్పించినందుకు రకరకాల సేవలు చేయాలి. రాజు వీరి నుండి ‘టైలీ’ అనే పన్నును వసూలు చేస్తారు. సెర్చ్లోనే బానిసలకు ఏ విధమైన హక్కులుండవు వీరిని అర్థ బానిసలుగా పరిగణించబడేవారు.
ఆర్థిక పరిస్థితులు: క్రీ.శ.11వ శతాబ్దం నుండి ఐరోపాలో ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడంతో మంచు తగ్గి, వ్యవసాయ కాలం పెరగడంతో ఐరోపాలో అడవులు తగ్గి, వ్యవసాయ భూమి పెరిగింది. మొదట వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. మనుషులే పశువులుగా పనిచేసేవారు. ఇంత కష్టపడినా రైతులకు సరైన ప్రతిఫలం లభించేది కాదు. ఇది క్రమంగా సామాజిక ఉద్రిక్తతలకు దారితీసింది.
కాలక్రమంలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. భారీ యంత్రాలతో అధిక ఉత్పత్తులను సాధించగలిగారు. క్రమంగా భూస్వామ్య ఆర్థిక వ్యవస్థలో డబ్బు ముఖ్యపాత్ర పోషించింది. ప్రభువులు కూడా ధాన్యానికి, సేవలకు బదులు డబ్బు రూపంలో వసూలు చేయసాగారు. రైతులు కూడా తమ పంటలను పట్టణాలకు తీసుకెళ్ళి డబ్బుకు అమ్మటం ప్రారంభించినారు.
వ్యవసాయం విస్తరించడంతో జనాభా పెరిగి క్రమంగా నగరీకరణకు దారి తీసింది. పెరిగిన జనాభా వ్యవసాయ అధిక ఉత్పత్తి పోషించగలిగింది. రైతులు పట్టణాలకు వెళ్ళి కొనుగోలు, అమ్మకాలు చేయడంతో క్రమంగా నగరాలు విస్తరించుకుంటూ పోయి, వాటి నిర్వహణకు ప్రభుత్వ అధికారులు అవసరమయ్యారు. సేవకులు, సేవలకు బదులుగా ప్రభువులకు పన్ను డబ్బు రూపంలో చెల్లించారు. గ్రామాలలోని సేద్యపు బానిసలు పారిపోయి రహస్యంగా నగరాలలో తలదాచుకొనేవారు. ‘పట్టణ స్వేచ్ఛా వాయువునిస్తుంది’. అనే సామెత ఏర్పడింది. 15వ శతాబ్దానికి రాజులు బలపడినందున, ప్రజలలోని వ్యతిరేకత వలన కాని క్రమంగా భూస్వామ్య వ్యవస్థ అంతరించిపోయింది.
ఈ విధంగా భూస్వామ్య (ఫ్యూడల్) వ్యవస్థలో ‘మతం’ పూర్తి అధికారాన్ని చలాయిస్తూ రాజరిక వ్యవస్థను మార్చివేసింది. మతాధికారులు మతం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసారు. రాజులు బలహీనులగుటచే మధ్యవర్తులను నియమించి, వారు విలాసాలకు, భోగాలకు, అనవసర యుద్ధాలకు ఖర్చు పెట్టి, ఆ మొత్తాన్ని సామాన్యులు లేక రైతుల నుంచి అధిక పన్నుల రూపంలో దోపిడి చేసేవారు. సేద్యపు బానిసలు సెక్స్లుగా అర్థబానిసత్వంలో జీవించారు. భూస్వాములు చివరకు వీరి వ్యక్తిగత, కుటుంబ జీవితాలలో కూడా జోక్యం చేసుకుని వారి జీవితాలను ఛిద్రం చేసేవారు. అల్ప సంఖ్యాకులు అధికులను దోపిడీ చేస్తూ వారు సుఖంగా ఉంటూ, అధిక సంఖ్యాకులు కష్టాల్లో ఉండే వ్యవస్థే యూరప్ లో సుదీర్ఘకాలం రాజ్యమేలింది.
ప్రశ్న 2.
భూస్వామ్య విధాన నిర్మాణమును తెలియజేయుము.
జవాబు:
ఐరోపా ఖండంలో రాజ్యాల మధ్య తరచు యుద్ధాలు జరుగుతుండేవి. అందువలన ప్రజల ప్రాణాలను, సంపదను, భూమిని రక్షించుకోవడానికి ఏర్పడిన సామాజిక వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ‘ఫ్యూడ్’ అనగా ఒక చిన్న భూభాగము అని అర్థం. భూస్వామ్యానికి చెందిన మూలాలు పవిత్ర రోమన్ చక్రవర్తి కాలం నుండే ప్రారంభమై క్రీ.శ. 11వ శతాబ్దం నుండి ఐరోపాలో ఒక జీవన విధానంగా మారినది.
భూస్వామ్య వ్యవస్థ శ్రేణులు: ఫ్రాన్స్లో భూస్వామ్య వ్యవస్థ విభిన్న రకాలుగా విభజితమై ఉంది. వాటిలో మతాధికారులు (క్లెర్జి) మొదట శ్రేణి అధికార వర్గం కాగా, ప్రభువులు (నోబిలిటి) రెండవ శ్రేణి అధికార వర్గం కాగా, రైతులు, సామాన్య ప్రజలు మూడవ శ్రేణి (సామాన్యులు) వర్గంగా ఏర్పడింది.
మొదటి శ్రేణులు (మతాధికారులు): ఫ్రాన్స్లోని కాథలిక్ చర్చికి తన చట్టాలను తానే తయారు చేసుకోవడం, స్వంత భూములు, రాజులచే ఇవ్వబడిన గ్రామాలపై పన్నులు విధించే అధికారం ఏర్పడింది. ఈ విధంగా రాజుపై ఆధారపడకుండా ఒక శక్తివంతమైన సంస్థగా చర్చి ఉండేది. పశ్చిమ ఐరోపా చర్చికి పెద్దగా ‘పోప్’ వ్యవహరించేవారు. ఐరోపాలోని క్రైస్తవులు, బిష నిబంధనల ప్రకారం నడుచుకునేవారు. వీరికి ఎస్టేట్లు, భూములు ఉండటమే కాక వీరు మొదటి శ్రేణికి చెందినవారుగా పరిగణించబడేవారు.
ప్రజలు ప్రతి ఆదివారం చర్చిలో పూజారి చేసే ప్రార్థనా కార్యక్రమాలు, బోధనలను వినటానికి వెళుతుండేవారు. అయితే ప్రతి ఒక్కరు పూజారి కాలేరు. అదే విధంగా సెర్ఫ్ లు, స్త్రీలు, పూజారులు కావడానికి అనర్హులు. పుజారి వివాహం చేసుకోరాదు. ప్రజలు తమ సంపాదనలో 10 శాతం పన్నుల రూపంలో చర్చికి విధిగా చెల్లించాలి. దీనిని ‘టైత్’ అంటారు. ధనవంతులు చర్చి అభివృద్ధికి ధనసహాయం చేసేవారు. చర్చి అనుబంధ వ్యవస్థ మోనాస్త్రిలు క్రమంగా విద్య, వైద్య, సేవా కేంద్రాలుగా మారాయి.
ప్రశ్న 3.
14వ శతాబ్దంలో జరిగిన మార్పులను తెలియజేయుము.
జవాబు:
క్రీ.శ. 13వ శతాబ్దం చివరి నాటికి ఉత్తర ఐరోపాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి విపరీతమైన మంచు, చలి పెరగటం వలన పంట, ఉత్పత్తులలో బాగా మార్పులు వచ్చాయి. వ్యవసాయ నేలలు కూడా తగ్గిపోయాయి. దీనికి తోడు తుఫానులు మరియు సముద్ర అలలు ఉవ్వెత్తున చెలరేగడం వల్ల పంట పొలాలు దెబ్బతిని ప్రభుత్వానికి రావలసిన ఆదాయం బాగా తగ్గిపోయింది. నేలను బాగా లోతుగా సంవత్సరాల తరబడి దున్నటం వలన పంట పొలాల మార్పిడి జరిగి ఉత్పత్తి తగ్గిపోయింది. అడవిలో పశువులకు గడ్డి తగ్గిపోయింది. పట్టణాలలో జనాభా విపరీతంగా పెరగడం వలన సహజవనరులు తరిగిపోయి క్షామాలు ఏర్పడ్డాయి. క్రీ.శ 1315, 1317, 1320లలో ఐరోపాలో భయంకరమైన కరువులు ఏర్పడ్డాయి.
సామాజిక అలజడి: క్రీ.శ.1323లో ఐరోపాలోని ప్లాండర్స్లో, 1358లో ఫ్రాన్స్, 1381లో ఇంగ్లాండ్లో రైతులు తిరుగుబాట్లు చేసారు. ప్రభువులు ఈ తిరుగుబాట్లను అణచివేసినప్పటికీ అంతకు ముందు భూస్వామ్య పద్ధతిలో ప్రభువులు అధికారాలు పొందినట్లు పొందలేకపోయారు.
బ్లాక్ డెత్: యూరప్ ఖండాన్ని మొత్తం కుదిపేసిన ఘటన ‘బ్లాక్ డెత్’ సంఘటన. క్రీ. శ. 1346 – 53 వరకు ప్రాణాంతక ప్లేగు మహమ్మారి వ్యాధి యూరప్ అంతటా వ్యాపించింది. ఎటుచూసినా చావులతో ప్రజానీకం అల్లాడిపోయింది. యూరప్ ఖండంలో 75 నుండి 200 మిలియన్ల వరకు ప్రజలు ఈ వ్యాధులతో చనిపోయారని ఒక అంచనా. యూరప్ జనాభాలో 30 నుంచి 60 శాతం వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించారు.
ఇంగ్లాండ్ – ఫ్రాన్స్ల మధ్య వంద సంవత్సరాల యుద్ధం: యూరప్ లోని రెండు ప్రముఖ రాజ్యాలైన ఇంగ్లాండ్ – ఫ్రాన్స్ మధ్య 1338 నుంచి 1453 వరకు అనేక మారులు యుద్ధాలు జరిగాయి. రెండు రాజ్యాలతో ఎన్నో రాజ్యాలుగా సంబంధాలు ఏర్పరచుకుని యుద్ధాలు చేసాయి. మధ్యయుగాలలో జరిగిన యుద్ధాలలో ప్రముఖమైనవి. దాదాపుగా ఐదు తరాల రాజులు యుద్ధాలలో నిమగ్నులయ్యారు. రెండు దేశాలలోను తీవ్రమైన జాతీయ భావనలను రేకెత్తించింది. యుద్ధం ముగిసే సరికి ఫ్యూడల్ ప్రభువులు, సైనికులు ఎక్కువయ్యారు. ఇంగ్లాండ్ ప్రధానంగా ఒక ద్వీపంగా మిగిలింది.
సామాజిక మార్పులతో పాటు రాజకీయాలలో కూడా అదే స్థాయిలో మార్పులు వచ్చాయి. 15,16 శతాబ్దాలలో ఐరోపా రాజులు తమకున్న సైనిక, ఆర్థిక శక్తుల వల్ల బలపడినారు. చరిత్రకారులు వీరిని ‘కొత్తరాజులు’ అని వర్ణించారు. ఫ్రాన్స్లో 11వ లూయి, ఆస్ట్రియాలో మాక్సిమిలయన్, ఇంగ్లండ్లో 7వ హెన్రీ, స్పెయిన్లో ఇజబెల్లా మరియు ఫెర్డినాండ్ రాజులు బలమైన రాజులుగా తయారైనారు. భూస్వామ్య పద్ధతిలో రాజు సైన్యం కొరకు సేవకుడి మీద ఆధారపడి బలహీనంగా ఉన్నవాడు, ఆ పద్ధతి సన్నగిల్లటం తానే ప్రత్యక్షంగా ప్రజలపై పన్నులు వేసి సైన్యాన్ని నిర్వహిస్తూ ప్రభువులకు భూస్వాముల అవసరం లేకుండా పోయింది. ఆ స్థానంలో రాజులు తమ అధికారాలను పెంచుకున్నారు. రాజులే స్వయంగా కాల్బలాన్ని, నూతన తుపాకులు, మందు గుండు సామాగ్రిని తయారు చేసుకొని తను అధికారంలోనికి తెచ్చుకున్నారు.
క్రీ.శ.1461-1559 కాలంలో ఫ్రాన్స్, 1484 – 1556లో స్పెయిన్లో, క్రీ.శ 1485 – 1548 మధ్యకాలంలో ఇంగ్లాండ్లో నూతన రాజరిక వ్యవస్థలేర్పడినాయి. ఇంగ్లాండ్లో 1498, 1536, 1546, 1553లలో తిరుగుబాట్లు రాగా వాటిని అణచి వేశారు. ఫ్రాన్స్లో లూయీ రాజు, డ్యూక్లలో మరియు యువరాజులకు వ్యతిరేకంగా పోరాడటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. చిన్న విస్తరణను వ్యతిరేకించారు. 16వ శతాబ్దంలో ఫ్రాన్స్లో భూస్వాములు, స్థానిక అసెంబ్లీల సభ్యులు, రాజులు అధికారం జరిగిన మత యుద్ధాలు ఒక రకంగా రాజు యొక్క అధికారాలకు మరియు ప్రాంతీయ అధికారులు స్వేచ్ఛకు మధ్య జరిగిన యుద్ధంగా అర్థం చేసుకోవచ్చు.
ప్రభువర్గం చాలా తెలివిగా నూతనంగా అధికారం పొందిన రాజులతో పూర్తిగా ఘర్షణకు దిగకుండా వారిని సమర్ధిస్తూ, వారికి విధేయులుగా మారినారు. అందువల్లనే విపరీతమైన రాజుల అధికార స్వరూపాన్ని, ఆధునిక భూస్వామ్య వ్యవస్థగా భావించవచ్చు. భూస్వామ్య పద్ధతిలో భూస్వాములు ఏ విధంగానైతే సమాజంలో అధికారం చెలాయించారో వీరి పాలనలో పెద్ద పెద్ద ఉద్యోగాలు పొంది అటువంటి అధికారాలనే తిరిగి పొందినారు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మేనర్ పద్ధతి నిర్మాణం.
జవాబు:
ఐరోపాలోని భూస్వామ్య వ్యవస్థలో ప్రముఖమైనది మెనోరియల్ ఎస్టేట్. ప్రభువులు లేక భూస్వాములు తమ అధికారంలో కొన్ని గ్రామాలను ఉంచుకొనేవారు. అయితే అందరు భూస్వాముల ఆధీనంలో నిరిష్ట సంఖ్యలో గ్రామాలు ఉండేవి కావు. చిన్న మేనర్ ఎస్టేట్ అంటే పన్నెండు కుటుంబాలు ఉండే ప్రాంతం. ఈ మేనర్ ఎస్టేట్ లో ప్రభువు నివాస ప్రాంతాన్ని ‘మేనర్స్’ అంటారు. ఆ గ్రామాలలో ఉండే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గృహ నిర్మాణదారులు మొదలగువారు ఆయా కార్యక్రమాలు నిర్వహించాలి. స్త్రీలు నూలు వడకడం, బట్టలు నేయడం, పిల్లలు ద్రాక్షరసం (వైన్) తయారు చేయాలి. వ్యవసాయదారులు ప్రభువు కొరకు పంటలు పండించాలి. ఆ ఎస్టేట్లో కార్యక్రమాలన్నీ ప్రభువు కనుసన్నలలో జరగాలి. ఎస్టేట్ సైన్యం ఉండే భవనాన్ని ‘కాజెల్’ అనేవారు.
‘మేనర్’ లు స్వయం సమృద్ధిగా ఉండేవి కావు. అన్ని వస్తువులు మేనర్లో తయారవలేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఉదా: ఉప్పు, పిండిమరరాళ్ళు, లోహపు పనిముట్లు మొదలైనవి బయట నుంచి తెచ్చుకోవాలి. ప్రభువులకు ఖరీదైన, విలావంతమైన గృహోపకరణాలు, సంగీత వాయిద్య పరికరాలు, ఆభరణాలు మొదలగు వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకునేవారు.
ప్రశ్న 2.
ఫ్రాన్స్లో మతాధికారుల శ్రేణి రూపము.
జవాబు:
ఫ్రాన్స్లో మతాధికారులు మొదటి శ్రేణికి చెందినవారు. సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉంటూ, పాలకులను, ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేవారు. మతాధికారులకు పన్నుల నుండి మినహాయింపు ఉండేది. ఫ్రాన్స్లోని కాథలిక్ చర్చికి తన చట్టాలను తానే తయారు చేసుకోవడం, స్వంత భూములు, రాజులచే ఇవ్వబడిన గ్రామాలపై పన్నులు విధించే అధికారం ఏర్పడింది. ఈ విధంగా రాజుపై ఆధారపడకుండా ఒక శక్తివంతమైన సంస్థగా చర్చి ఉండేది. పశ్చిమ ఐరోపా చర్చికి పెద్దగా ‘పోప్ ‘ వ్యవహరించేవారు. ఐరోపాలోని క్రైస్తవులు, బిషప్ నిబంధనల ప్రకారం నడుచుకొనేవారు. వీరికి ఎస్టేట్లు, భూములు ఉండేవి.
ప్రజలు ప్రతి ఆదివారం చర్చిలో పూజారి చేసే ప్రార్థనా కార్యక్రమాలు, బోధనలు వినడానికి వెళుతుండేవారు. అయితే ప్రతి ఒక్కరూ పూజారి కాలేరు. అదే విధంగా సెర్ఫ్లు, స్త్రీలు పూజారులుగా కావడానికి అనర్హులు. పూజారి వివాహం చేసుకోరాదు. ప్రజలు తమ సంపాదనలోని 10శాతం పన్నుల రూపంలో చర్చికి విధిగా చెల్లించాలి. దీనిని ‘టైత్’ అని పిలుస్తారు. ధనవంతులు చర్చి అభివృద్ధికి ధనసహాయం చేసేవారు. ఈ విధంగా మధ్యయుగంలో మతాధికారులు పూర్తి సౌఖ్యాలు అనుభవిస్తూ, రాచరికానికి పూర్తిగా మద్దతు పలికి, మతం పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందికి గురి చేసేవారు.
ప్రశ్న 3.
నాల్గవ శ్రేణి.
జవాబు:
వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందడంతో యూరప్ రోమన్ నాగరికత పతనంతో దెబ్బతిన్న పట్టణాలన్నీ తిరిగి వెలిసాయి. వ్యవసాయ రంగంలోని విపరీత ఉత్పత్తి అధిక జనాభా గల పట్టణాలకు ఆహారాన్ని అందించగలిగింది. రైతులు తమ మిగులు ధాన్యాన్ని పట్టణాలకు వెళ్ళి అమ్ముకొని తమకు కావలసిన దుస్తులు, వస్తువులు, పరికరాలు కొనుగోలు చేసేవారు. కొనుగోలు, అమ్మకాలకు అనువైన స్థలాలు సంతలుగా మారాయి.
సేవకులు సేవలకు బదులుగా తమకు దగ్గరగా ఉన్న పట్టణాలలో ప్రభువుకు పన్ను డబ్బు రూపంలో చెల్లించారు. గ్రామాలలో వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన యువకులకు పట్టణాలలో వారు చేయగల పనులకు నగదు రూపంలో చెల్లింపులు లభించాయి. (పట్టణం స్వేచ్ఛా వాయువును ఇస్తుంది.) అనే సామెత ఏర్పడింది. చాలామంది సేద్యపు బానిసలు గ్రామాల నుండి పారిపోయి పట్టణాలలో రహస్యంగా తలదాచుకున్నారు. ఏ సెర్ఫ్ అయిన ఒక సంవత్సరము ఒక రోజు లోపల ప్రభువుచే కనిపెట్టబడకపోయిన ఆ సెర్ఫ్క స్వతంత్రమొచ్చినట్లు. ఆ విధంగా పొందిన స్వేచ్ఛతో ప్రజలు నైపుణ్యంతో సంబంధం లేని పనులు చేయడానికి అలవాటుపడ్డారు. వీరి సంఖ్య ఎక్కువయ్యే కొలది నైపుణ్యం కలిగిన బ్యాంకర్లు, లాయర్లు అవసరమయ్యారు. పెద్ద పట్టణాలంటే 30,000 మంది ప్రజలు ఉండటం. ఈ ప్రజలే నాల్గవ శ్రేణికి చెందినవారు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సేద్యపు బానిసత్వము.
జవాబు:
మధ్యయుగ యూరప్లో స్వేచ్ఛలేని రైతులను ‘సెర్ఫ్’లు అని పిలిచేవారు. ఈ రైతులకు స్వంత భూములుండవు. వీరు ప్రభువుల భూమిలో రైతు కూలీలుగా పనిచేయాలి. ఆ ప్రతిఫలమంతా ప్రభువుకే చెందుతుంది. వీరికి వేతనాలుండవు. ఎస్టేట్ బయటకు వెళ్ళే స్వేచ్ఛ లేదు. వీరికి సంబంధించిన ప్రతి విషయం ప్రభువుల పర్యవేక్షణలో జరగాలి.
ప్రశ్న 2.
పవిత్ర ఒడంబడిక.
జవాబు:
రైతులు, సామాన్యులు, భూస్వాములకు, మతాధికారులకు సేవకులు. వీరు యజమానికి విధేయుడిగా ఉండాలి. ప్రతిగా ప్రభువు సేవకుడికి రక్షణగా ఉంటాడు. ఇది ఇద్దరి మధ్య జరిగే ఒప్పందం. రైతుకు భూమిని కౌలుకు ఇచ్చే ఈ ఒప్పంద వేడుకలో ప్రభువు, తన సేవకుడికి ఒక రాతప్రతిని గాని, కొంత మట్టిముద్ద కానీ సంకేతంగా ఇస్తూ భూమిపై హక్కులు ఇస్తాడు. దీనికి ప్రతిఫలంగా సేవకుడు బైబిల్ మీద ప్రమాణం చేసి తాము ఎల్లప్పుడూ ప్రభువులకు విధేయులుగా ఉంటామని చర్చిలో ఒప్పందం చేసుకోవాలి.
ప్రశ్న 3.
పవిత్ర రోమన్ చక్రవర్తి.
జవాబు:
పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని పాలించే ప్రభువు పవిత్ర రోమన్ చక్రవర్తి. ‘పోప్’ ఆశీస్సులతో పవిత్ర రోమన్ చక్రవర్తి నియమింపబడతాడు. పవిత్ర సామ్రాజ్యానికి చక్రవర్తిగా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తూ, దాని సంరక్షణగా బాధ్యతను చక్రవర్తి స్వీకరించేవాడు. పవిత్ర రోమన్ సామ్రాజ్య వ్యవస్థ క్రీ. శ. 1453లో కాన్స్టాంటినోపుల్ పతనం వరకు కొనసాగింది. క్రీ. శ. 742లో మొదటి చార్లెస్ పవిత్ర రోమన్ చక్రవర్తి అయ్యాడు. వీరి పాలనా కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ మూలాలు ఆరంభమయ్యాయి.
ప్రశ్న 4.
మఠం (మోనాస్త్రి).
జవాబు:
క్రైస్తవమతంలో వెలసిన ఒక ప్రత్యేక వ్యవస్థ ‘చర్చి అనుబంధ వ్యవస్థ’ ‘మోనాస్త్రి’. క్రీ. శ. 529లో ఇటలీ దేశస్థుడైన సెయింట్ బెనెడిక్ట్ బుర్గుండీలో స్థాపించాడు. ‘మోనాస్త్రి అనే పదం ‘మోనోస్’ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మోనోస్ అనగా ఏకాంత జీవితం గడుపుట అని అర్థం. మతంపై ధృఢ విశ్వాసం ఉన్నవారు సన్యాసులుగా మారి దైవ కార్యంలో నిమగ్నులయ్యేవారు. కాలక్రమేణా ఈ మోనాస్త్రీలు పెద్ద భవనాలతో ఎస్టేట్లుగా మారి విద్య, వైద్య, సేవలు చేయడం ఆరంభించాయి.
ప్రశ్న 5.
ఇంగ్లాండ్.
జవాబు:
ఆంగ్లిస్ మరియు సాక్షన్ జాతులు మధ్య ఐరోపాలో క్రీ.శ. 6వ శతాబ్దంలో వచ్చి ప్రస్తుత ఇంగ్లండ్ ప్రదేశంలో స్థిరపడినారు. ‘ఇంగ్లాలాండ్’ అనే ప్రాచీన ఆంగ్ల పదమే ఇంగ్లండ్ గా మారింది. ఇంగ్లలాండ్ అనగా లాండ్ ఆఫ్ ఏంజెల్స్ (దేవదూతల ప్రదేశం) అని అర్థం. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవంతో ఇంగ్లాండ్తో పాటుగా, ప్రపంచ చరిత్రే మారిపోయింది. ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఆక్రమించుకుని దోచుకుని, ఆ దేశాలలో వలసలు ఏర్పాటు చేసుకున్నారు. మన దేశం కూడా వీరి చెర నుంచి 1947లో విముక్తి చెందింది.
ప్రశ్న 6.
భూస్వామ్యము (ఫ్యూడలిజమ్).
జవాబు:
‘ఫ్యూడ్’ అనగా ‘ఒక చిన్న భూభాగం’ అని అర్థం. ఈ వ్యవస్థ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ ఇటలీలలో ఏర్పడింది. మధ్యయుగంలో తరచూ సంభవించే యుద్ధాలలో ప్రజల ప్రాణాలను, సంపదను, భూములను కాపాడుకోవడానికి ఏర్పడిన వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. ఇది ఒక రకమైన సామాజిక వ్యవస్థ, ఆర్థికంగా చెప్పాలంటే ఫ్యూడలిజం అనగా భూమి, వ్యవసాయ ఉత్పత్తులు, భూమికి సంబంధించిన భూస్వాములు మరియు రైతుల మధ్య ఉండే సంబంధాల వ్యవస్థగా చెప్పవచ్చు.