Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 7th Lesson ఆధునిక యుగారంభం Textbook Questions and Answers.
AP Inter 2nd Year History Study Material 7th Lesson ఆధునిక యుగారంభం
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి వివరించండి.
జవాబు:
రినైసాన్స్ అనగా పునరుద్ధరణ లేక పునర్జన్మ అని అర్థం. నూతనత్వం, విశాల దృక్పథం విశిష్ట లక్షణాలతో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవ కాలంగా దీనిని చెప్పవచ్చు. సాంస్కృతిక పునరుజ్జీవ కాలాన్ని ఐరోపాలో గతించిన ప్రామాణిక కాలాన్ని పునఃసమీక్ష చేయడం లేదా పునరుద్ధరించడంగా పేర్కొన్నారు. ప్రాచీన, గ్రీకు, రోమన్ల సంస్కృతిని వెలుగులోకి తెచ్చి, ప్రాచుర్యం కల్పించిన ఉద్యమమే సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం. దీని ద్వారా వ్యక్తి అభిరుచులు, కళాభినైపుణ్యాలు వెలుగులోకి వచ్చాయి. 14, 15 శతాబ్దాలలో ఐరోపాలోని ఫ్లారెన్స్, వెనిస్, రోమ్ నగరాలు కళలకు, సారస్వతానికి కేంద్రాలుగా నిలిచాయి. ఫ్లారెన్స్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి మొదటి కేంద్రం. సంపన్న వర్గాలు కళాకారులను, రచయితలను ప్రోత్సహించారు. ముద్రణా యంత్రాలలో ప్రజలకు విరివిగా గ్రంథాలు లభించాయి. ఐరోపాలోని సాంస్కృతిక పునరుజ్జీవనం అనేక రంగాలను ప్రభావితం చేసింది. కొత్తకొత్త భావాలు వ్యాపించాయి.
మానవతావాదం: ఇటలీలోని విశ్వ విద్యాలయాలలో నూతనంగా మానవతావాదం ప్రారంభమయింది. ఇటలీలో పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయం వరకు మానవతావాదం బోధింపబడింది. వీటిలో విద్యతో పాటు సంగీతం, కళలు నేర్పేవారు. వ్యక్తిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేయడమే మానవతావాదం యొక్క ముఖ్యోద్దేశం. వ్యక్తిలోని నైపుణ్యాన్ని చర్చలు, గోష్టుల ద్వారా ఆధునీకరించడం మానవతావాద ప్రధానోద్దేశం. విమర్శనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడంతో మానవతావాదం బలపడింది.
గ్రీకు సారస్వత అధ్యయనం: క్రీ.శ. 14 శతాబ్దంలో అనేకమంది పండితులు ప్లాటో, అరిస్టాటిల్ వంటి వారి రచనలను అనువాదం చేసారు. క్రీ.శ. 1453లో కాన్స్టాంట్్నపుల్ని టర్కీ ఆక్రమించినప్పుడు ఎందరో గ్రీకు పండితులు బైజాంటైన్ నుంచి, ఇటలీ పారిపోతూ తమతోపాటు గ్రీకు రచనలు తెచ్చుకొని ఫ్లారెన్స్ గ్రంథాలయాల్లో దాచుకున్నారు. ఇటలీ పండితులు ఎన్నో గ్రీకు గ్రంథాలు సేకరించారు. పాశ్చాత్యులు గ్రీకు సారస్వతాన్ని పరిశోధించారు, ఆస్వాదించారు. ప్లేటో ప్రవేశపెట్టిన ప్రేరేపిత పద్ధతి వైజ్ఞానిక శాస్త్ర ఆవిర్భావానికి, శాస్త్రీయ పద్ధతిలో సైన్సు అధ్యయనం చేయడానికి సహాయపడింది.
అచ్చుయంత్రం: క్రీ.శ. 1455లో జోహన్స్ గుటెన్ బర్గ్ అచ్చుయంత్రాన్ని కనిపెట్టి 150 బైబిల్ గ్రంథాలు ముద్రించాడు. క్రమంగా యూరప్ అంతా వ్యాపించి 200 మిలియన్లకు పైగా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పుస్తకాల వలన ఎన్నడూ లేనంత ఆధునిక భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తృతంగా వ్యాపించాయి. ప్రజలలో విద్య, వైద్య, న్యాయ, ఖగోళ, లోహం వంటి అనేక శాస్త్రాలపై అవగాహన పెరిగింది.
సాహిత్యం: పునరుజ్జీవ కాలంలో ఎందరో రచయితలు చైతన్యవంతమైన రచనలు చేశారు. ‘డివైన్ కామెడీ’ రచించిన డాన్టే సాంస్కృతిక పునరుజ్జీవవానికి ఆద్యుడు. పెట్రార్క్ ఎన్నో పురాతన నాణేలు, వ్రాతప్రతులను భద్రపరచడమే కాక ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని బోధించాడు.
కళలు: సాంస్కృతిక పునరుజ్జీవం వలన వాస్తు, శిల్పశాస్త్రాలు, చిత్రలేఖనం వంటి లలితకళలు వికసించి ప్రజలను అమితంగా ప్రభావితం చేసాయి. ఈ కళలను ధనవంతులు ప్రముఖంగా పోషించాయి. పోప్, చర్చి, వందలాది కళాకారులను ప్రోత్సహించారు. ప్రాచీన, గ్రీకు, రోమన్ కళల వైభవాన్ని పునరుద్ధరించారు. ఫ్లారెన్స్కు చెందిన ‘జిట్’ |400 అడుగుల పొడవైన గోపురానికి రూపకల్పన చేసాడు. మరో చిత్రకారుడు మైఖెలాంజిలో ‘ఫైటా’ అనే శిల్పం, లియొనార్డో డావెన్సీ చిత్రాలలో ‘మోనాలిసా’, ‘ది లాస్ట్ సప్పర్ ముఖ్యమైనవి. శిల్పాలలో డోనాటెల్లా యొక్క ‘గట్టమెంట’, మైఖలాంజిలో డేవిడ్ శిల్పాలు ప్రముఖమైనవి.
ఫ్లారెన్స్లోలో గొప్ప నిర్మాణ శైలి అభివృద్ధి చెందింది. పొడవైన గోపురాలు, పెద్ద డోములు, బలమైన గోడలతో చర్చిలు నిర్మించారు.
విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: సాంస్కృతిక పునరుజ్జీవ కాలంలో వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి జరిగి, అందులో భాగంగా ప్రకృతి రహస్యాలను ఛేదించి తార్కిక దృష్టితో చూశారు. 17వ శతాబ్దం నాటికి విశ్వానికి, శాస్త్ర సంబంధించిన ఎన్నో కొత్త సూత్రాలు, సిద్ధాంతాలు కనుగొనబడ్డాయి. కోపర్నికస్ సౌరకేంద్ర సిద్ధాంతం చర్చిని, బైబిల్లోని బోధనలను విభేదించింది. తరువాతి కాలంలో కెప్లర్, గెలీలియోలు ఈ సిద్ధాంతాన్నే బలపరిచారు. శాస్త్రీయ దృక్పథం పెరగడంతో సైన్స్ అకాడమీలు ఏర్పడి ఎన్నో ఆవిష్కరణలకు కారణమయ్యాయి.
మత సంస్కరణోద్యమం: కేథలిక్ చర్చి దురాగతాలను వ్యతిరేకిస్తూ, జర్మనీలోని వేదాంత పండితుడు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో ప్రొటెస్టంట్ మత ఉద్యమం ఏర్పడింది. ఇతను క్యాథలిక్ బోధనలను వ్యతిరేకిస్తూ, సామాన్యులకు విశ్వాసం ఒక్కటే దైవాన్ని చేరుస్తుందని, కర్మకాండలు అవసరం లేదని పేర్కొన్నాడు. యూరప్ లో ఎన్నో దేశాలలో ప్రొటెస్టెంట్ చర్చిలు ఏర్పడ్డాయి. ఫలితంగా క్యాథలిక్లు కూడా తమలోని లోపాలను సరిదిద్దుకుని నూతనోత్సాహంతో పునరంకితమయ్యారు.
ఉద్యమ ప్రభావం: పునరుజ్జీవ కాలంలో సృజనాత్మకత వెల్లివిరిసింది. ఐరోపాలో వచ్చిన సాంస్కృతిక మార్పులు కేవలం రోమ్, గ్రీకులనే కాక అనేక దేశాలను ప్రభావితం చేసాయి. వ్యక్తిలోని స్వేచ్ఛను, సృజనాత్మకతను వెలికితీసి, చర్చి ఆంక్షల నుండి వ్యక్తిని వేరుచేసింది మానవతావాదం. ఫలితంగా ప్రజల శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది. క్రైస్తవమతం కేథలిక్, ప్రొటెస్టెంట్లుగా విడిపోయారు. సారస్వత, వైజ్ఞానిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించగలిగారు.
ప్రశ్న 2.
మత సంస్కరణ ఉద్యమం అనగానేమి ?
జవాబు:
ఇంగ్లాండులోని థామస్ మోర్, హాలెండ్ లోని ఎరాస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందని, సాధారణ ప్రజల నుండి తమ ఇష్టం వచ్చినట్లు ధనాన్ని వసూలు చేస్తుందని విమర్శించారు. మత గురువులు ‘పాప పరిహార పత్రాలు’ అమ్మడం, ఈ పత్రాలను కొనేవారు తమ పాపభారం నుండి విముక్తులవుతారని చెప్పారు.
చర్చి సంస్కరణల ఆవశ్యకతను ఎరాస్మస్ తన రచనల ద్వారా తెలియజేసాడు. ఇతడు రాసిన ‘ది ప్రెయిస్ ఆఫ్ ఫాలీ’ అనే గ్రంథంలో మూఢ నమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాలను, మతాధికారులను అతడు విమర్శించాడు. ఎరాస్మస్ గ్రంథంలో రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా సంబంధించిన విమర్శనాస్త్రాలు పోప్కు హాని కలిగించాయి. మతాధికారుల అతీంద్రీయ శక్తులు, పాపపరిహార పత్రాలు అమ్మటంలోని మోసం, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం వంటి అంశాలను ఆయన తన గ్రంథంలో ప్రస్తావించారు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే వాటిని ప్రజలకు తెలియజెప్పటం ద్వారా చర్చిలో మార్పులు తేవచ్చని అతడు నమ్మాడు.
థామస్ మోర్ బైబిల్ను స్థానిక భాషలలోకి అనువదించడం వలన క్రైస్తవులు తమ మతం ఎలాంటి తప్పుడు ఆలోచనలను అనుమతించదని అర్థం చేసుకున్నారు. ఐరోపాలోని అన్ని ప్రాంతాల రైతులు చర్చి విధించిన పన్నులను తీవ్రంగా వ్యతిరేకించారు. మతాధికారులకు అధికారం కాన్స్టంటైన్ చక్రవర్తి జారీ చేసిన ‘డొనేషన్ ఆఫ్ కాన్ స్టాంటైన్ న్యాయ మరియు రాజకోశాగారం’ అనే రాజపత్రం నుండి వచ్చిందని చెప్పేవారు. మానవతావాదులు ఇది తరువాత కాలంలో కల్పించబడిన పత్రమని విమర్శించారు. అన్ని వర్గాల క్రైస్తవులు తమ సహనాన్ని కోల్పోయి మతాధికారుల మీద, చర్చి ఐహిక పారదర్శకత మీద తిరుగుబాటు చేసారు.
మార్టిన్ లూథర్: చర్చి దురాగతాలను వ్యతిరేకించే వారికి జర్మన్ వేదాంతశాస్త్ర అధ్యాపకుడైన మార్టిన్ లూథర్ (1483-1546) తిరుగుబాటుకు నాయకుడైనాడు. మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టాడు. దైవ సంబంధం కోసం మత గురువు అనుమతి అవసరం లేదని అతడు ప్రచారం చేసాడు. విశ్వాసం ఒక్కటే సరైన జీవన విధానమని, దేవునిపై పూర్తి విశ్వాసముంచాలని, అదే స్వర్గానికి దారి చూపిస్తుందని అతడు చెప్పాడు. విశ్వాసం ద్వారా స్వర్గం చేరుకోవచ్చని, మంచిపనులు చేసేవారికి స్వర్గం లభిస్తుందని చెప్పి కాథలిక్ బోధనలను వ్యతిరేకించాడు.
బైబిల్ గ్రంథంపై నమ్మకం ఉండాలన్నాడు. మత గురువులకు, చర్చి అధికారులకు అతీతమైన శక్తులు ఏమీ లేవన్నాడు. బైబిల్ను జర్మనీ భాషలోకి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. ప్రతి పట్టణంలో ఒక పాఠశాల ఉండాలని, బాలబాలికలు బైబిల్ను చదవాలని చెప్పాడు. ఈ ఉద్యమాన్ని ‘ప్రొటెస్టెంట్ ఉద్యమం’ లేదా ‘మత సంస్కరణ ఉద్యమం’ అంటారు. ఫలితంగా జర్మనీ, స్విట్జర్లాండ్ లోని చర్చిలకు క్యాథలిక్ చర్చితో, పోప్ తో సంబంధాలు తెగిపోయాయి.
స్విట్జర్లాండ్లో ‘ఉల్రిచేజ్వింగ్లి’, జాన్ కాల్విన్లు మార్టిన్ లూథర్ భావాలు ప్రచారం చేసారు. వ్యాపారస్థుల మద్దతుతో సంస్కరణావాదులు పట్టణాలలో ప్రజాదరణ పొందగా గ్రామీణ ప్రాంతాలలో క్యాథలిక్ చర్చి ప్రభావం కొనసాగింది. అనాబాప్టిస్ట్ వంటి జర్మన్ సంస్కర్తలు మరింత తీవ్రవాద మార్గాన్ని అనుసరించారు. అన్ని విధాలుగా సామాజిక, అణచివేతను అంతమొందించాలనే పునర్నిర్మాణ భావాన్ని పెంపొందించాడు. దేవుడు అందరినీ సమంగా సృష్టించాడు. కాబట్టి ఎవ్వరూ పన్నులు చెల్లించనవసరం లేదని ప్రచారం చేసారు. భూస్వామ్య వ్యవస్థలో అణచివేతకు గురైన రైతాంగం ఈ భావాలను ఆదరించింది. క్రీ.శ. 1524లో జర్మనీలో కర్షక తిరుగుబాటు జరిగింది. రైతులు భూస్వామ్య విధానం రద్దు చేయాలని కోరాడు.
మార్టిన్ లూథర్ ఈ తిరుగుబాటును వ్యతిరేకించాడు. దీనిని అణచివేయవలసిందిగా పాలకవర్గాన్ని కోరాడు. అయితే తిరుగుబాటుదారులు ఫ్రాన్స్లోని ప్రొటెస్టెంట్స్క, ఇంతకు ముందు క్యాథలిక్ అధికారులచే ప్రాసిక్యూట్ చేయబడిన వారిని కలిసి ప్రజలకు ఇష్టంలేని అధికారులు అవసరం లేదని, తమకు ఇష్టం వచ్చిన వారిని అధికారులుగా నియమించుకున్నారు. ఫలితంగా ఫ్రాన్స్లో వలే ఇతర ఐరోపా దేశాలలో ప్రొటెస్టాంట్స్కు తమకు ఇష్టం వచ్చిన వారిని ఎన్నుకునే హక్కు క్యాథలిక్ చర్చి ఇచ్చింది. ఇంగ్లాండ్ అధికారులు పోప్తో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు.
క్యాథలిక్ చర్చి ఈ సంఘటనల ప్రభావం నుండి తప్పించుకోలేకపోవడమే కాక అనేక అంతర్గత సమస్యలకు గురయింది. స్పెయిన్, ఇటలీలలో మత గురువులు పేద ప్రజలకు సహాయం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. స్పెయిన్లో ప్రొటెస్టెంట్ మతాన్ని ఎదుర్కోవడానికి ఇగ్నేషియాస్లయోలో సొసైటీ ఆఫ్ జీసస్ ను స్థాపించాడు. అతని అనుచరులను జెసూట్స్ అంటారు. పేదలకు సేవ చేయడం, ఇతర సంస్కృతులలో క్రైస్తవాన్ని వ్యాపింపజేయడానికి తమ జీవితాలను అంకితం చేసారు. ప్రొటెస్టెంట్ విప్లవంలో క్యాథలిక్ చర్చి తనను తాను సరిచేసుకుంది.
ప్రశ్న 3.
మానవతావాదం యొక్క లక్షణాలు వివరించండి.
జవాబు:
ఇటలీ నగరంలో విశ్వ విద్యాలయాలు ఆవిర్భవించాయి. 11వ శతాబ్దం నుంచి పాడువ, బొలాగ్నో విశ్వ విద్యాలయాలు న్యాయశాస్త్ర అధ్యయన కేంద్రాలుగా ఉండేవి. వీటి ద్వారా నూతన విద్యా విధానం, మానవతావాదం ఇటలీ నగరంలో ఆదరించబడింది. ఇటలీలో పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థలలో మానవతావాదం బోధించబడింది. వీటిలో విద్యతోపాటు సంగీతం, వ్యాయామం బోధించేవారు. ఈ కొత్త విద్యా విధానం వ్యక్తిలో సత్ప్రవర్తన, మంచి జీవితాన్ని తీర్చిదిద్దుకునే మార్గాన్ని నేర్పింది. వ్యక్తిని మానసికంగా, శారీరకంగా, దృఢంగా తయారు చేయడమే మానవతావాదం యొక్క ఉద్దేశ్యం.
15వ శతాబ్ది ప్రారంభంలో మానవతావాది అనే పదాన్ని వ్యాకరణం, అలంకారశాస్త్రం, పద్యభాగం, చరిత్ర, తత్త్వశాస్త్రం బోధించేవారికి వర్తింపచేసారు. లాటిన్ పదమైన మానవశాస్త్రం నుంచి మానవతావాదం అనే పదం అనేక శతాబ్దాల క్రితమే ఆవిర్భవించిందని రోమన్ న్యాయవాది, కథకుడు అయిన సిసిరో పేర్కొన్నాడు. సీజర్ సమకాలికుడైన ఇతడు మానవతావాదం అంటే సంస్కృతి అని పేర్కొన్నాడు. ఇందులోని అంశాలు మత సంబంధమైనవి కాదని సాంఘికంగా వ్యక్తి నైపుణ్యాన్ని చర్చలు, గోష్టుల ద్వారా ఆధునీకరించడం అని పేర్కొన్నాడు. ఈ మానవతావాద విద్య 16వ శతాబ్దం నాటికి ఉత్తర ఐరోపా అంతటా వ్యాపించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బహుళ ప్రచారం పొంది చర్చి పాఠశాలల్లో ప్రవేశించింది. ఇంగ్లండ్ లోని ప్రభుత్వ పాఠశాలలైన ఈటన్, హర్లలో ఈ విద్యను బోధించేవారు.
మానవతావాదులు విమర్శనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇటలీలోని పెట్రార్క్ సాంప్రదాయక రచనలు, వ్రాత ప్రతులను సేకరించడాన్ని అభిరుచిగా ఎంచుకున్నాడు. మరో మానవతావాది లారెంజోవిల్లా విమర్శనాత్మక దృక్పథాన్ని ఎంచుకున్నాడు. మాకియవెల్లి చారిత్రక అంశాలను చదివి, స్వానుభవంతో రూపకల్పన చేసేందుకు ప్రయత్నించాడు. ప్లాటో విషయాలను గమనించి, నిర్ణయం తీసుకునే విధానాన్ని అనుసరించి ఒక ముగింపుకు వచ్చేవాడు. ఈ మానవతావాదులు వివిధ రకాల మార్గాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. విశ్వ విద్యాలయాల్లో న్యాయశాస్త్రం, వైద్యం, తర్కశాస్త్రం, సాంఘికశాస్త్రం పాఠ్యాంశాలలో క్రమంగా ప్రవేశపెట్టబడ్డాయి. ఇటలీలోనే కాక ఐరోపా అంతటా మానవతావాదం వ్యాపించింది. మానవతావాద ఫలితంగా మానవ జీవితాలపై మతాధిపత్యం బలహీనపడింది. అయితే వీరు మతాన్ని వ్యతిరేకించలేదు.
మానవతావాదం క్రమంగా సాహిత్యం, సారస్వతం, సాంకేతిక విద్య, శిల్పకళ, చిత్రకళ, వాస్తుకళ ఇలా అన్ని రంగాలకు ప్రభావితం చేసింది.
సారస్వత రంగం: 14వ శతాబ్దంలో అనేకమంది పండితులు ప్లాటో, అరిస్టాటిల్ వంటివారి రచనలు అనువదించారు. 1453లో కాన్స్టాంట్్నపుల్ ఆక్రమణ సమయంలో గ్రీకు పండితులు బైజాంటైన్ నుంచి ఇటలీ పారిపోతూ, తమతో పాటు అనేక గ్రీకు గ్రంథాలను తీసుకొచ్చారు. ఇటలీ పండితుడు గ్లోవన్ని అరిష్ప 250 గ్రీకు వ్రాతప్రతులను, ఇతర గ్రంథాలను సేకరించాడు. మానవతావాదులు గ్రీకు సాహిత్యాన్ని ఆస్వాదించారు. ప్లాటో ప్రవేశపెట్టిన ప్రేరేపిత పద్ధతి వైజ్ఞానికశాస్త్ర ఆవిర్భావానికి శాస్త్రీయ పద్ధతిలో సైన్సు అధ్యయనం చేయడానికి సహాయపడింది. ఇది సైద్ధాంతిక దృక్పథానికి తోడ్పడింది.
సాంకేతిక పరిజ్ఞానం: అచ్చుయంత్రం కనిపెట్టబడిన తర్వాత ఇటలీ మానవతావాద సంస్కృతి, యూరప్ 15వ శతాబ్దాంతానికి వ్యాపించడానికి కారణం ముద్రిత పుస్తకాలు అందుబాటులోకి రావటం.
సాహిత్యం: లండన్లో ఆంగ్ల మానవతావాది జాన్ కోలేట్, సెయింట్ పాల్ మానవతావాద పాఠశాలలను ప్రారంభించారు. ఇంగ్లాండ్ చక్రవర్తి 8వ హెన్రీ దగ్గర ఛాన్స్లర్గా ఉన్న సర్ థామస్ మోర్ గొప్ప కవి, మానవతావాది. ఇతడు లాటిన్ భాషలో రచించిన యుటోపియాలో ఆదర్శరాజ్యం, సమాజం గురించి వివరించాడు. ఇంకా డాన్టే రచించిన డివైన్ కామెడీ మతపరమైన గ్రంథం. మిగేల్ డీసెర్వాంటెస్ రచించిన డాన్ క్విజోట్ మానవతావాద విలువలను ప్రబోధించేవి.
కళలు: మానవతావాద భావాలు కళలకు, వాస్తు శిల్పానికి కూడా విస్తరించాయి. చిత్రకళ, శిల్పకళ వంటి దృశ్య కళల ద్వారా ఇది యదార్థ రూపాన్ని కలిగి ఉంది. కళాకారులు ప్రకృతిని, ప్రజలను, ప్రదేశాలను యథాతధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించేవారు. లియోనార్డో డావెన్సీ చిత్రించిన మోనాలిసా చిత్రం, ప్రఖ్యాత శిల్పి డొనాటెల్లో రూపొందించిన కంచు విగ్రహం, గట్టమెలాట, అశ్వికుని విగ్రహం ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. మైఖెలాంజిలో చెక్కిన ‘డేవిడ్’ శిల్పం కూడా ప్రధానమయినది.
మహిళా విద్య పట్ల కూడా క్రమంగా సమాజంలో మార్పు వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛ, అతనిలోని సృజనాత్మకతను వెలికితీసి, చర్చి ఆంక్షల నుండి వ్యక్తిని వేరుచేసింది మానవతావాదం.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
మైఖెలాంజిలో.
జవాబు:
పాశ్చాత్య ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రకారులలో ఒకడైన మైఖెలాంజిలో క్రీ.శ. 1475లో ఇటలీలో జన్మించారు. ఒక శిల్పిగా, చిత్రకారుడిగా, కవిగా, ఆర్కిటెక్ట్ గా ఎన్నో అద్భుత కళాఖండాలను సృష్టించాడు. మైఖెలాంజిలో రోమ్లో పోప్ కోసం సిస్టన్ ఛాపెల్ మీద వేసిన ‘పైటా’ అనే శిల్పం మరియు ‘డేవిడ్’ అనే మరో శిల్పం ఇతనికి ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. సిస్టెన్ ఛాపెల్ గోడల మీద ఇతను చిత్రించిన ‘లాస్ట్ జడ్జిమెంట్’ అద్భుతమైన చిత్రరాజము. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ‘లారెంటియన్ లైబ్రరీ’ ని మేనరిస్ట్ విధానంలో నిర్మించాడు. సెయింట్ పీటర్స్ చర్చికి గుండ్రటి పై కప్పు (బాసిల్లా) లాంటి సృజనాత్మక నిర్మాణానికి డిజైన్ని రూపొందించాడు. అయితే ఈ నిర్మాణం మైఖెలాంజిలో మరణం తర్వాత పూర్తయింది. మైఖెలాంజిలో జీవించి ఉండగానే అతని మీద జీవిత చరిత్రలు రచించబడ్డాయి. తన సమకాలికులు ఎంతో ఖ్యాతిని సంపాదించుకుని ప్రపంచంలోని మేటి చిత్రకారులు, శిల్పులలో ఒకడిగా మిగిలిన మైఖెలాంజిలో క్రీ.శ. 1564లో 88 సంవత్సరాల వయసులో మరణించాడు.
ప్రశ్న 2.
మాకియవెల్లి.
జవాబు:
మాకియవెల్లి ఆధునిక కాలంలో రాజనీతిశాస్త్ర పితామహుడిగా పేరొందాడు. క్రీ.శ. 1469లో ఇటలీలో జన్మించారు. మానవతావాదంలో ప్రభావితుడయ్యాడు. మాకియవెల్లి తన గ్రంథం ‘ది ప్రిన్స్’ లో రాజకీయ వ్యవస్థ మీద, ఇటలీ రాజకీయ పరిణామాలపై విరుచుకుపడ్డాడు. మాకియవెల్లి ఫ్లారెన్స్లో దౌత్యాధికారిగా ప్రభువర్గం, వివిధ దేశాల సభలను సందర్శించి అధ్యయనం చేసాడు. ప్రాచీన రోమన్ చరిత్రను అతడు అధ్యయనం చేసాడు. అతడు ‘చర్చి’, ‘రాజ్యం’ రెండూ వేరని, రాజ్యం ఎప్పుడూ అద్భుత శక్తులపై ఆధారపడదని, దీనికొక ప్రత్యేక స్థానం ఉందని అభిప్రాయపడ్డాడు.
రాజ్యం ప్రజల నుండి అధికారం పొందింది కాబట్టి వారి అవసరాలను తీర్చడానికి రాజ్యం తప్పనిసరిగా కృషి చేయాలని అతడు పేర్కొన్నాడు. ఈ విధంగా మాకియవెల్లి రాజ్యం లౌకిక స్వభావాన్ని, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండాలని, ప్రజలను, సంస్థలను, ప్రభుత్వాన్ని క్రమపద్ధతిలో నడపాలని కోరాడు. మాకియవెల్లి క్రీ.శ. 1527లో తన 57వ ఏట
మరణించాడు.
ప్రశ్న 3.
ముద్రణాయంత్రం.
జవాబు:
అచ్చుయంత్రం (ముద్రణాయంత్రం) కనిపెట్టబడటం ఆధునిక మానవ చరిత్రలో ఒక ముఖ్య సంఘటన. ప్రప్రథమంగా కాగితాన్ని కనుగొని అచ్చులతో ముద్రించింది చైనీయులు. ఐరోపా వ్యాపారులు మంగోలు చక్రవర్తుల దగ్గర దౌత్యాధికారులుగా పనిచేసి ఈ జ్ఞానాన్ని పొందారు.
క్రీ.శ 1455లో జోహన్స్ గూటెన్బర్గ్ అనే జర్మనీ దేశానికి చెందిన స్వర్ణకారుడు. ఆధునీకరించిన అచ్చుయంత్రాన్ని తయారుచేసాడు. ప్రధమంగా 150 బైబిల్ ప్రతులను ముద్రించారు. నాటి నుండి యూరప్ చరిత్ర మారిందంటే అతిశయోక్తి కాదు. ఎన్నో రకాల శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు ముద్రితమయ్యాయి. ఇటలీ మానవతావాదం. యూరప్ అంతటా 15వ శతాబ్దాంతానికి వ్యాపించడానికి ముద్రిత పుస్తకాలు అందుబాటులోకి రావడం ప్రధాన కారణం. క్రమంగా ముద్రణ జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఇంగ్లాండ్లకు వ్యాపించింది. క్రీ.శ. 1560 నాటికి 20 మిలియన్ పుస్తకాలు ముద్రింపబడ్డాయి. తరువాత శతాబ్దానికే 150 నుండి 200 మిలియన్ గ్రంథాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వైద్యం, న్యాయం, జ్యోతిష్యం, లోహ, భూగోళశాస్త్రం వంటి విభిన్న అంశాలపై అపారమైన సాహిత్యం వెలువడింది.
ప్రశ్న 4.
కోపర్నికస్
జవాబు:
పోలెండు చెందిన నికోలస్ కోపర్నికస్ క్రీ.శ. 1473లో జన్మించాడు. ఇతను గణితశాస్త్రంలో, అర్థశాస్త్రంలోను, ఖగోళశాస్త్రంలోను ప్రతిభావంతుడు. తన యొక్క అధ్యయనం, పరిశోధనలతో విశ్వాన్ని గురించిన అనేక రహస్యాలను ఛేదించాడు. నాటికి ప్రచారంలో ఉన్న ‘భూకేంద్ర సిద్ధాంతాన్ని’ తప్పని, ‘సౌరకేంద్ర సిద్ధాంతాన్ని’ ప్రవేశపెట్టాడు. తన పరిశోధనలతో భూమి, చంద్రుడు, నక్షత్రాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని నిరూపించాడు. కోపర్నికస్ సిద్ధాంతం విప్లవాత్మకమైందే కాక చర్చి బోధనలకు వ్యతిరేకమయింది. అర్థ శతాబ్దం తర్వాత కోపర్నికస్ సిద్ధాంతాన్ని జర్మన్ శాస్త్రవేత్త జాన్ కెప్లర్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో బలపరచారు. ఈ సిద్ధాంతం ఎందరిలోనో పాత నమ్మకాలను, మూఢ నమ్మకాలను తొలగించింది.
ప్రశ్న 5.
మోనాలిసా.
జవాబు:
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడిగా గుర్తింపు పొందిన లియోనార్డో డావెన్సీ (1452 – 1519) గీసిన చిత్రాలలో మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ ముఖ్యమైనవి. వీటిలో బాగా ప్రజాదరణ పొందింది మోనాలిసా, ఇటలీకి చెందిన లియోనార్డో డావెన్సీ క్రీ.శ. 1503-1506 మధ్య కాలంలో ఈ చిత్రాన్ని వేసిఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు. శతాబ్దాలు గడిచినా నేటికీ అందులోని చిరుమందహాసం, స్త్రీ సహజత్వం ఇట్టే చూపరులను ఆకర్షిస్తోంది. లియోనార్డో సమకాలికుల ప్రకారం ఈ చిత్రాన్ని చిత్రించడానికి చాలా కాలం తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంపై ఎన్నో కట్టుకథలు ప్రచారంలోకి వచ్చాయి. క్రీ.శ. 1911లో ఈ చిత్రం చోరీకి గురైంది. చివరికి 1913 నాటికి ఈ చిత్రం ఫ్రాన్స్లోని లౌరే మ్యూజియంకి చేరింది. నేటికీ ఈ చిత్రం ఫ్రాన్స్లోని మ్యూజియంలో జనులకు కనువిందు చేస్తుంది.
ప్రశ్న 6.
ది లాస్ట్ సప్పర్.
జవాబు:
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావెన్సీ (1452 – 1519) సృష్టించిన మరొక అద్భుత చిత్రం ది లాస్ట్ సప్పర్. ఈ చిత్రాన్ని డావెన్సీ 1495-1498 మధ్య కాలంలో చిత్రించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఎక్కువమంది విమర్శకుల, పరిశోధకుల నిశిత పరీక్షలకు గురైన చిత్రరాజం. జాన్ సువార్త 13: 21 ప్రకారం ఏసు తన పన్నెండుమంది శిష్యులతో విందుకు కూర్చుని ఉన్న దృశ్యాన్ని అద్భుతంగా చిత్రించాడు. ఈ చిత్రం ఇటలీలోని మిలాన్ నగరంలో ఉంది. లాస్ట్ సప్పర్ చిత్రం ఏసు 12 మంది శిష్యులలో ఒకడు నమ్మకద్రోహం చేయబోతున్నాడు అని చెప్పినపుడు అక్కడున్న వారి హావభావాలను ఆ చిత్రంలో ప్రతిఫలించేటట్లు చేయగలిగాడు. లియోనార్డో ఈ చిత్రంలో ఎన్నో రహస్య సంకేతాలు నిక్షేపం చేసాడని కొందరి నమ్మకం.
ప్రశ్న 7.
మార్టిన్ లూథర్.
జవాబు:
రోమన్ క్యాథలిక్ చర్చి దురాగతాలను వ్యతిరేకించే వారికి వేదాంతశాస్త్ర అధ్యాపకుడైన జర్మన్ మత గురువు మార్టిన్ లూథర్ (1483 – 1546) తిరుగుబాటు నాయకుడయ్యాడు. మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రచార ఉద్యమం మొదలుపెట్టాడు.
దైవ సంబంధం కోసం మత గురువు అనుమతి అవసరం లేదని ప్రచారం చేసాడు. విశ్వాసం ఒక్కటే సరైన జీవన విధానమని, దేవునిపై పూర్తి విశ్వాసముంచాలని, అదే స్వర్గానికి దారి చూపిస్తుందని అతడు చెప్పాడు. క్యాథలిక్ బోధనలను వ్యతిరేకించాడు. బైబిల్ గ్రంథంపై నమ్మకం ఉండాలన్నాడు. చర్చి అధికారులకు అతీత శక్తులు ఉండవని బోధించాడు. మార్టిన్ లూథర్ 1524లో జర్మనీలో జరిగిన కర్షక తిరుగుబాటును వ్యతిరేకించాడు. మార్టిన్ లూథర్ బోధనల వలన ప్రొటెస్టెంట్ ఉద్యమం జరిగి, క్యాథలిక్ చర్చికి ప్రతిగా ప్రొటెస్టెంట్ చర్చి ఏర్పడింది. రోమ్లో జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలకు మతపరమైన సంబంధాలు తెగిపోయాయి.