Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 8th Lesson ఫ్రెంచి విప్లవం – 1789 Textbook Questions and Answers.
AP Inter 2nd Year History Study Material 8th Lesson ఫ్రెంచి విప్లవం – 1789
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఫ్రెంచి విప్లవమునకు ప్రధాన కారణాలు పేర్కొనుము.
జవాబు:
క్రీ.శ 1789లో జరిగిన ఫ్రెంచి విప్లవం ప్రపంచ చరిత్రలోని మహావిప్లవాలలో ఒకటిగా నిలిచింది. ఈ విప్లవం తరువాత ఐరోపాలో, ప్రపంచంలో పూర్వమున్నది ఏది పూర్వం వలె మిగుల లేదు. తరువాత తరాల మీద దాని ప్రభావం శాశ్వతంగా నిలిచింది. ఫ్రెంచి విప్లవం జరగడానికి అనేక కారణాలు తోడ్పడ్డాయి.
బూర్బన్ రాజవంశస్తుల నిరంకుశత్వం: ఫ్రెంచి విప్లవానికి బీజాలు 14వ లూయీ కాలంలోనే పడ్డాయి. 14వ లూయీ పూర్తి నిరంకుశుడు. ‘నేనే రాజ్యాన్ని’ అనేవాడు. ఎన్నో యుద్ధాలు చేసాడు. 15వ లూయీ కాలంలో కూడా నిరంకుశత్వం సాగింది. రాచరికం దైవదత్తమని ప్రజాసమ్మతితో పనిలేదని వీరి విశ్వాసం. రాజు తనకు నచ్చిన చట్టాలు చేయవచ్చును. తనకు తోచిన పన్నులు విధించవచ్చు. ప్రభుత్వాదాయాన్ని తనకు నచ్చినట్లుగా ఖర్చు చేసేవారు. రాజకుటుంబం ఎంతో విలాసవంతంగా బ్రతికేది. దేశ ప్రజలు దయనీయ స్థితిలో ఉండేవారు.
నాటి సాంఘిక పరిస్థితులు: నాటి ఫ్రెంచి సమాజం మూడు ప్రధాన వర్గాలుగా విభజింపబడింది. వీరు ప్రభువులు, మతాధిపతులు, సామాన్యప్రజలు. మొదటి రెండు వర్గాలు ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉండేవారు. వీరికి ఎలాంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. అన్నిరకాల పన్నులపై మినహాయింపు ఉండేది. మూడవ వర్గం వారు అధిక పన్నులు చెల్లిస్తూ తీవ్ర నిరాశ, నిస్పృహలలో ఉండేవారు. ఎలాంటి కరువు పరిస్థితులలోనయినా పన్నులు మాత్రం చెల్లించవలసిందే. అధిక పన్నుల భారం, బానిసత్వం, సకల కష్టాలు తీవ్రస్థాయికి చేరుకొని విప్లవానికి దోహదం చేసాయి.
తత్త్వవేత్తలు బోధనలు: ఫ్రెంచి తత్త్వవేత్తలైన మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసో బోధనలు విప్లవానికి ప్రజలను ప్రేరేపించాయి.
మాంటెస్క్యూ: మాంటెస్క్యూ విప్లవాన్ని బోధించలేదు, కానీ నిరంకుశత్వాన్ని విమర్శించాడు. అతని ప్రఖ్యాత గ్రంథం ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనేక దేశముల పరిపాలనా విధానాలను పరిశీలించి రాయబడిన గ్రంథం. మాంటెస్క్యూ, ఇంగ్లాండ్ దేశములోని రాజకీయ అధికార వర్గం అన్నీ దేశముల కంటే ఉత్తమమైనదని భావించాడు.
ఓల్టేర్: ఐరోపా చరిత్ర తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త. ఇతడు మాంటెస్క్యూ సమకాలికుడు. ప్రభువులను మతాధిపతులను విమర్శించి చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. రోమన్ కాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించేవాడు. ఇతని దృష్టిలో క్రైస్తవ మతం మానవుని ఆలోచనా స్వేచ్ఛకు అవరోధం కలిగిస్తుంది. అతడు తన శక్తివంతమైన వ్యంగ్య రచనలతో రాచరికాన్ని, చర్చిని లక్ష్యాలుగా చేసాడు.
రూసో: ఫ్రెంచి సమాజాన్ని సమూలంగా మార్చవలసిన అవసరం ఉందని తేల్చిచెప్పాడు. ఇతని ప్రఖ్యాత గ్రంథం ‘సోషల్ కాంట్రాక్ట్’ గ్రంథంలో ‘స్వేచ్ఛగా పుట్టిన మానవుడు అన్నిచోట్ల సంకెళ్ళతో బంధించి ఉన్నాడు’ అని పేర్కొన్నాడు. మానవుడు తన సామాజిక హక్కుల సాధనకై తిరుగుబాటు చేసేలా ఇతని రచనలు ప్రజలను చైతన్యవంతం చేసాయి. ఈ విధంగా మేధావి త్రయమైన మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసోల రచనలు ఫ్రెంచి విప్లవానికి విత్తనాలుగా పని చేసాయి.
ఆర్థిక పరిస్థితులు: 14వ లూయీ పాలనాకాలంలో జరిగిన అనేక యుద్ధాలు, వైభవోపేతమైన దర్బార్ నిర్వహణ వ్యయం, 15వ లూయీ కాలం నాటికి అధికమైన ఋణాలు అమెరికా స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం అనేక రంగాలలో ప్రభుత్వ దుబారా వలన ఫ్రాన్స్ ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. టుర్గాట్, నెక్కర్, కాలెగ్నెలను ఒకరి తర్వాత మరొకరని సంక్షోభంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి నియమించారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు 16వ లూయీ 175 సంవత్సరాల తర్వాత ఎస్టేట్ జనరల్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. తనకు కావలసిన ఆర్థిక వనరులను ఇది సమకూర్చగలదని భావించాడు. కానీ 16వ లూయీ ఆశించిన దానికి భిన్నంగా ఈ సమావేశం విప్లవానికి దారితీసింది.
అమెరికా విప్లవ ప్రభావం అమెరికా స్వాతంత్ర్యయుద్ధంలో బ్రిటీష్ వారిపై వ్యతిరేకతతో ఫ్రాన్స్ అమెరికా వారికి సహాయం చేసింది. ఎంతోమంది ఫ్రెంచివారు వాలంటీర్లుగా అమెరికా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వారు అమెరికా నుంచి తిరిగి వచ్చాక, ఫ్రెంచి ప్రజలలో విప్లవ భావాలను రేకెత్తించి బూర్బన్ నిరంకుశత్వాన్ని కూలదోయాలని ప్రబోధించారు.
టెన్నిస్ కోర్ట్ శపథం: 1789 జూన్ 20న ఎస్టేట్ జనరల్ సమావేశం కొరకు సామాన్యులు రాజధానికి చేరుకున్నారు. కానీ అక్కడి సమావేశపు హాలు తలుపులు మూసిఉండడంతో వారు ప్రక్కనే ఉన్న టెన్నిస్కోర్ట సమావేశమైనారు. “మనమంతా ఎటువంటి పరిస్థితులలో విడిపోకుండా ఒకేదారిలో నడిచి, నూతన రాజ్యాంగము, నూతన పరిపాలనా వ్యవస్థ ఏర్పడేవరకు కలిసి పోరాడతాము”. అని శపథం చేసారు. దీనినే ‘టెన్నిస్కోర్ట్ శపథం’ అంటారు. నూతన రాజ్యాంగం రూపొందించే వరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయమని తాము మాత్రమే జాతీయ అసెంబ్లీ అని ప్రకటించుకున్నారు. మూడవ ఎస్టేట్స్ సభ్యులు రాజాజ్ఞలు ధిక్కరించడంతో విప్లవానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
ప్రశ్న 2.
ఫ్రెంచి విప్లవంపై మేధావుల ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
ఆధునిక యుగములో అనేక సంస్కరణలకు మూలకారణము సాహిత్యం. సాహిత్యం వలన కొత్త ఆలోచనలు ప్రారంభమై, ఆ ఆలోచనలు ఫ్రాన్స్ దేశమంతా వ్యాపించాయి. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో విరబూసిన సాహిత్య, తత్త్వవేత్తల ప్రభావం వలనే ఫ్రెంచి విప్లవం ప్రారంభమైనదని చెప్పవచ్చు. మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసో, డిడిరో వంటి గొప్ప మేధావులు వ్రాసిన గ్రంథాలు, వ్యాసాలు ఫ్రాన్స్ ప్రజల హృదయాలలో కొత్త ఆలోచనలు, రేకెత్తించడంలో సఫలీకృతమయ్యాయి.
మాంటెస్క్యూ (1685-1755): మాంటెస్క్యూ ప్రభువర్గ కుటుంబంలో జన్మించాడు. న్యాయశాస్త్రం చదువుకొని ‘బోర్డెక్స్’ పార్లమెంట్ లో న్యాయాధిపతిగా పని చేసేవారు. ఇరవై సంవత్సరాల నిరంతర కృషి చేసి ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే పుస్తకం రచించాడు. ఈ గ్రంథం అనేక దేశాల పరిపాలనా విధానాల పరిశీలన, రాజకీయ పరిస్థితుల విశ్లేషణకు సంబంధించినది. ఈ గ్రంథంలో వివిధ విషయాలపై చక్కని పరిశీలనతో కూడిన విశ్లేషణతో పాటు, వివిధ రాజకీయ వ్యవస్థలలో ఉన్న మంచి, చెడు లక్షణాలను వివరిస్తుంది. మాంటెస్క్యూ అనేక విషయాలపై వివరణాత్మక పరిశోధన జరిపాడు. ప్రతి రాజకీయ విశ్లేషణలో రెండు, మూడు మంచి సలహాలు, సూచనలు కూడా జోడించాడు.
మాంటెస్క్యూ ఇంగ్లాండ్ దేశములోని రాజకీయ అధికార వర్గం అన్ని దేశముల కంటే ఉన్నతమైనదని భావించాడు. కార్యనిర్వహణాశాఖ, న్యాయశాఖ వేరువేరుగా ఉండటం చాలా అవసరం అని భావించాడు. మాంటెస్క్యూ తన రచనలలో విప్లవాన్ని బోధించనప్పటికీ నిరంకుశత్వాన్ని విమర్శించాడు.
ఓల్టేర్ (1694–1778): ఐరోపా చరిత్రను తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త ఓల్టేర్. మేధావిగా చెప్పబడటానికి అన్ని అర్హతలున్న వ్యక్తి, ఇతను మాంటెస్క్యూ సమకాలికుడు. ఇతడు కవి, చరిత్రకారుడు, నాటకకర్త మరియు శాస్త్రవేత్త. తనదేశంలో సమానత్వం కొరకు పోరాటం జరగడానికి ఇతడు పగటిపూట మబ్బుల వలె, రాత్రిపూట వెలుగునిచ్చే నుంటవలె సహాయపడ్డాడు. ఇతడు ప్రభువుల వర్గాన్ని, మతాధిపతులను విమర్శించి చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. ఇతనికి తన దేశంలో ప్రాణభయం ఉండటం వలన ఎక్కువ కాలం ఇతరదేశాలలో గడిపాడు. జైళ్ళలో ఖైదీలకు కల్పించే సదుపాయాలను, పెట్టే చిత్రహింసలను ఓల్టేర్ తీవ్రంగా ఖండించాడు. ఇతడు నాస్తికుడు కాదు. కాని రోమన్ క్యాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించేవాడు., వీరి వలన తను క్రైస్తవ మతానికి వ్యతిరేకం అని ప్రకటించాడు. ఇతని దృష్టిలో మానవుని ఆలోచనాశక్తికి, స్వేచ్ఛకు క్రైస్తవమతం అవరోధం కల్పించుతున్నది. ఇతను రాసిన వ్యాసాలలో రాజకీయ, మతాధికారులపై అనేక వ్యంగ్య విమర్శలు కలవు. ఓల్టర్ ప్రాజ్ఞ నిరంకుశ రాచరికాన్ని ఉత్తమమైన ప్రభుత్వంగా భావించినప్పటికీ ఫ్రాన్స్లో నిరంకుశ, సర్వాధికార, రాచరికపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫ్రాన్స్ నిరంకుశ రాచరికంపై అతడు సాహితీ సాధనంతో పవిత్రయుద్ధాన్ని కొనసాగించాడు.
రూసో (1712–1778): మాంటెస్క్యూ, ఓల్టేర్, రూసోలు వ్యక్తి స్వేచ్ఛకొరకు సంస్కరణలు కావాలని ఆకాంక్షించాడు. కానీ రూసో విధానాలు, పద్ధతులు వేరుగా ఉంటాయి. రూసో మొత్తం సమాజాన్ని పునర్వ్యవస్థీకరించాలని భావించాడు. సమాజంలోని లోపాలను కొన్ని సవరణలతో కొనసాగించడం వలన వ్యక్తి స్వేచ్ఛకు కావలసిన స్వాతంత్ర్యం లభించదని విశ్వసించాడు.
18వ శతాబ్దం నాటి రూసో ప్రముఖ రాజకీయ రచన సోషల్ కాంట్రాక్ట్ (సామాజిక ఒడంబడిక) ప్రజలను చాలా ప్రభావితం చేసింది. ఈ గ్రంథం “మానవుడు జన్మతః స్వతంత్రుడే ఐనా ప్రతిచోటా శృంఖలాబద్దుడే” అనే తొలి వాక్యాలతో ప్రారంభమౌతుంది. ఇతని ఉద్దేశంలో మనిషి జన్మతః చాలా మంచివాడు, సంతోషంగా జీవించే వ్యక్తి. కానీ నాగరికత వలన ఇతడు అవినీతిపరుడుగా, విలువలు దిగజారిన వ్యక్తిగా మారాడు. అందుచేత మానవుడు తనకు నచ్చిన చట్టములు తయారు చేసుకోవాలి. “ప్రజలే సార్వభౌమాధికారం, ప్రజలందరికీ సమానత్వం ఈ సిద్ధాంతాలే ఫ్రాన్స్లోని సామాన్య ప్రజానీకాన్ని కదిలించివేసింది. అదే విధంగా ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసింది. మానవులు తమ సామాజిక హక్కుల సాధనకై తిరుగుబాటు చేయాలనేది ఇతని రాజకీయ రచనల సారాంశం.
ఈ రచయితల బోధనలు, ఆనాటి నిరంకుశత్వ స్వభావాన్ని సమాజంలో గల లోపాలను తమ రచనా దృష్టితో – కేంద్రీకరించి, వాటికి వ్యతిరేకంగా ప్రజల ఉద్రేకాలను రెచ్చగొట్టడం ద్వారా పరోక్షంగా విప్లవానికి రంగం సిద్ధం చేసాయి. ఫ్రెంచి మేధావులు వేసిన విత్తనాలు ఫ్రాన్స్లో మంచి పంట పండించాయి. వారి రచనల వలన వచ్చిన మంచి ఫలితాలు విప్లవకాలంలోను, నెపోలియన్ పాలనాకాలంలోను స్పష్టంగా కనబడతాయి.
ప్రశ్న 3.
మొదటి కాన్సల్స్ నెపోలియన్ నిర్వహించిన పాత్ర ఏమిటి ?
జవాబు:
ఫ్రాన్స్లో కొత్తగా తయారైన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగి, దేశ పాలనా వ్యవస్థను నడపటానికి ఐదుగురు సభ్యులతో కూడిన డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడింది. వారు సమర్థవంతంగా వ్యవహరించకపోవడంతో పరిపాలన అలకల్లోలంగా, అవినీతిమయంగా మారింది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడి, పాలనావ్యవస్థ గాడితప్పి సంఘవిద్రోహ శక్తులు బలపడసాగారు.
దేశంలో అంతర్గతంగా అల్లకల్లోల స్థితి, డైరెక్టర్పాలన విఫల దశలో నెపోలియన్ విదేశీ దండయాత్రలు ముగించుకొని పారిస్ పట్టణంలో అడుగుపెట్టాడు. అవినీతి బాగా ముదిరిపోయి ప్రజలు విసిగిపోయి ఉన్న సమయం, నెపోలియన్ పరిస్థితిని తనకనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడానికి సిద్ధపడ్డాడు. ఫ్రాన్స్ దేశ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్రాన్స్ భాషలో ఈ కుట్రను ‘కూపియట్” అంటారు. దీని అర్థం సైనికబలంతో విధ్వంసకర పద్ధతిలో ఆయుధ దాడితో ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను చేపట్టడం.
నవంబర్ 10, 1799లో సైనికకుట్ర జరిగింది. ఆ రోజున డైరెక్టరేట్లో శాసనసభ్యులు అయిన పెద్దల సభ. 500 మంది కౌన్సిల్ సభ్యుల సమావేశం పారిస్ పట్టణానికి దూరంగా ‘సెయింట్ క్లాడ్’ భవనంలో ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశం జరుగుతుండగా నెపోలియన్ తన సైన్యంతో అక్కడకు చేరుకున్నాడు. నెపోలియన్ అతడి సోదరుడు లూసిన్ బోనపార్టీ సైన్యంతో సమావేశ మందిరంలో ప్రవేశించి శాసనసభ్యులను భయభ్రాంతులను చేసాడు. చాలా మంది సభ్యులు పారిపోయారు. సాయంత్రం ఈ కుట్రకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది సభ్యులతోనే సమావేశం నిర్వహించి డైరెక్టరేట్ పరిపాలన రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రత్యామ్నాయంగా ముగ్గురు సభ్యులతో కూడిన ”కాన్సల్’ పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ముగ్గురిలో ఒకరు నెపోలియన్ బోనపార్టీ. ఈ విధంగా నెపోలియన్ పాలనా అధికారాలను హస్తగతం చేసుకున్నాడు. నెపోలియన్ నిర్వహించిన ఈ సైనిక తిరుగుబాటుకు ప్రజల మద్ధతు లభించింది. ఈ ముగ్గురు కాన్సల్స్ ఆ సమావేశంలో అధికార బాధ్యతలు చేపట్టి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాభాగస్వామ్యాలను పరిరక్షిస్తామని శపథం చేసారు.
మొదటి కాన్సల్స్ నెపోలియన్: ఫ్రాన్స్ దేశంలోని ఆంతరంగిక, విదేశీ పరిస్థితులు సక్రమంగా లేవని, ఈ స్థితిలో దేశాన్ని కాపాడగలవారు ఒక్క నెపోలియన్ మాత్రమే అని ప్రజల నమ్మకం. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నెపోలియన్ తన అధికారాన్ని బలపరుచుకున్నాడు. 1799లో తయారు చేయబడిన నూతన పాలనా వ్యవస్థను కాన్సల్ ప్రభుత్వం అంటారు. నాటి నుంచి నెపోలియన్ సర్వాధికారాలలో నియంతగా పాలించాడు. సైనిక అధిపతి అయిన నెపోలియన్ మొదటి కాన్సల్, మిగిలిన ఇద్దరు (అబెనైస్, డ్యూకోస్) ఇతర పరిపాలనా విభాగాలు పరిపాలించేవారు.
నెపోలియన్ దేశంలోని వివిధ పాలనా విభాగాలలో నూతనంగా ఉద్యోగులను నియమించాడు. నెపోలియన్ 1799 నుండి 1804 వరకు కాన్సల్గా పరిపాలన సాగించిన కాలం మరపురానిది. మొదటి కాన్సల్గా నెపోలియన్ విజయవంతం అయ్యాడు. ప్రజలు కోరుకున్న బలమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలిగాడు. ఆ కాలంలో అనేక దీర్ఘకాలిక ఫలితాలనిచ్చే సంస్కరణలను రూపొందించడం జరిగింది. మొదటి చర్యగా దేశంలోని అరాచకాన్ని అణచివేసి, శాంతి భద్రతలు స్థాపించాడు. అవసరమైన చోట సైన్యాన్ని వినియోగించి శాంతిభద్రతలు నెలకొల్పాడు. ప్రభుత్వాధికారాన్ని పునరుద్దరించి, పన్నుల విధానాన్ని సంస్కరించి జాతీయాదాయాన్ని అభివృద్ధి చేసాడు. ఫ్రాన్స్ జాతీయ బ్యాంక్ ‘ది బ్యాంక్ ఆఫ్ ఫ్రాంస్’ స్థాపించి వ్యాపార వాణిజ్యాలను మెరుగుపరిచాడు.
నెపోలియన్ చేపట్టిన మరిన్ని చర్యలు: దేశప్రగతికి గణనీయమైన సేవలనందించిన వారిని గౌరవించడానికి ‘లిజియన్ ఆఫ్ ఆనర్’ ను ఏర్పాటు చేసాడు. విద్యా విషయాలపై ఆసక్తితో ఒక జాతీయ విద్యామండలిని ఏర్పాటు చేసాడు. ఫ్రెంచి విశ్వవిద్యాలయం స్థాపించాడు. అనేక వృత్తి విద్యాసంస్థలు ఏర్పాటు చేసాడు.
నెపోలియన్ సంస్కరణలలో పేరొందింది, శాశ్వత కీర్తిని తెచ్చి పెట్టింది ‘నెపోలియన్ కోడ్’ పౌరుల సమానత్వ సిద్ధాంతాలు ఈ చట్టంలో ప్రముఖ స్థానం వహించాయి. ‘పోప్’కు నెపోలియన్కు మధ్య 1801లో మత విషయాలపై జరిగిన ఒడంబడికను ‘కంకార్డెంట్’ అంటారు. దీనిని నెపోలియన్ రాజనీతిజ్ఞతకు నిదర్శనంగా భావిస్తారు.
నెపోలియన్ను ‘విప్లవం కన్నబిడ్డ’ అని అందరూ పొగిడారు. విప్లవం కోరుకున్న ఫలాలను సామాన్య ప్రజలకు అందించడంలో నెపోలియన్ సఫలీకృతుడైనాడు. చివరకు 1804లో నెపోలియన్ కాన్సల్ విధానాన్ని రద్దుచేసి తననుతాను ఫ్రాన్స్కు చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
ఎస్టేట్ జనరల్.
జవాబు:
ఫ్రాన్స్ దేశంలో రాజుకు సహాయపడటానికి, సలహాలు ఇచ్చేందుకు ఎస్టేట్స్ జనరల్ అనే సంస్థ కలదు. మతాధిపతులు, ప్రభువులు మిగిలిన ఫ్రాన్స్ ప్రజానీకంతో ఎస్టేట్స్ జనరల్ ఏర్పడింది. ఆగమ్యగోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను కాపాడి బూర్బన్ రాజవంశస్థులను గట్టెక్కించడానికి | 16వ లూయీ క్రీ.శ. 1789లో 175 సంవత్సరాల తర్వాత ఎస్టేట్ జనరల్ సమావేశం పిలవబడింది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి నెక్కర్ను ఆర్థిక సలహాదారునిగా నియమించడం జరిగింది.
1789 మే 5న ఎస్టేట్స్ జనరల్ సమావేశం జరిగింది. సుమారు 300 మంది ప్రభువుల వర్గం, 300 మంది మతాధిపతుల వర్గ ప్రతినిధులు, 600 మంది మూడవ వర్గ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఓటింగ్ పద్ధతి దగ్గర వివాదం ఏర్పడింది. మొదటి రెండు వర్గాలు ఎస్టేటు ఒక ఓటు ఉండాలని భావించగా, మూడవ ఎస్టేట్ సభ్యులు ఈ వాదనను తోసిపుచ్చి సభ్యునికొక ఓటు ఉండాలని వాదించారు. ఈ వివాదానికి పరిష్కారం దొరకనందున జూన్ 20, 1789న ఎస్టేట్స్ జనరల్ భవనాల దగ్గరలోని టెన్నిస్కోర్ట్లో మూడవ వర్గం వారు సమావేశమై ‘టెన్నిస్కోర్ట్ ప్రతిజ్ఞ చేసారు.’ దీనితో విప్లవానికి శ్రీకారం చుట్టినట్లయింది. 16వ లూయీ ఆశించిన దానికి భిన్నంగా ఎస్టేట్స్ | జనరల్ సమావేశం విప్లవానికి నాంది పలికింది.
ప్రశ్న 2.
రూసో (1712-1778).
జవాబు:
ఫ్రాన్స్ దేశాన్ని ప్రభావితం చేసిన మేధావి త్రయంలో రూసో ఒకరు. రూసో క్రీ.శ 1712లో జెనీవా నగరంలో జన్మించారు. మాంటెస్క్యూ, ఓల్టేర్లతో పోల్చిచూస్తే డీనా జాక్విస్ రూసో విధానాలు, పద్ధతులు వేరుగా ఉంటాయి. రూసో మొత్తం ఫ్రెంచి సమాజాన్ని సమూలంగా అవసరం ఉందని తేల్చి చెప్పాడు. సమాజంలోని లోపాలను కొన్ని సవరణలతో కొనసాగించడం వలన వ్యక్తి స్వేచ్ఛకై కావలసిన స్వాతంత్య్రం లభించజాలదని విశ్వసించాడు.
18వ శతాబ్దమందలి అతని ప్రముఖ రాజకీయ రచన “సామాజిక ఒడంబడిక” ప్రజలను చాలా ప్రభావితం చేసింది. ఈ రచన “మానవుడు జన్మతః స్వతంత్రుడే ఐన ప్రతిచోట శృంఖలాబద్ధుడే” అనే వాక్యంతో ఆరంభమౌతుంది. రూసో ఉద్దేశంలో మనిషి జన్మతః మంచివాడు. సంతోషంగా జీవించే వ్యక్తి కానీ, నాగరికత వలన ఇతడు అవినీతిపరుడుగా
విలువలు దిగజారిన వ్యక్తిగా మారాడు. అందుచేత మానవుడు తనకు నచ్చిన చట్టములు తయారు చేసుకోవాలి అని ప్రబోధించాడు. ప్రజలకే సార్వభౌమాధికారం, ప్రజలందరికీ సమానత్వం ఈ సిద్ధాంతాలే ఫ్రాన్స్లోని సామాన్య ప్రజానీక హృదయాలను తట్టి లేపాయి. అదేవిధంగా ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసాయి.
ప్రశ్న 3.
బాస్టిలో కోట పతనం.
జవాబు:
పారిస్ పట్టణంలో సామాన్య ప్రజలు 16వ లూయీ జాతీయసభను అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకంగా దొమ్మీలు, దోపిడీలు, లూటీలు ప్రారంభించారు. బహుశా ప్రజల ఆందోళనకు దృష్టిలో పెట్టుకొని రాణి మేరి అంతు వానెత్ తన పుట్టిల్లు ఆస్ట్రియా నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తెప్పించి తన నివాసమైన బాస్టిల్ కోటలో భద్రపరచింది. ఈ వార్తలు తెలుసుకున్న సామాన్యులు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు ధ్వంసం చేసారు. అక్కడితో ఆగకుండా 1789 జులై 14న బాస్టిలో కోటపై దాడి చేసారు.
కోటలో బంధించబడి ఉన్న రాజకీయ ఖైదీలను విడిపించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సామాన్యులు పారిస్ నగరంలో మునిసిపల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. 16వ లూయీ ఈ మార్పు అంగీకరించక తప్పలేదు. ఫ్రెంచి విప్లవం విజయవంతమైన తర్వాత ఆ దినాన్ని జాతీయ దినంగా ప్రకటించారు. ఎరుపు, తెలుపు, నీలి రంగులతో కూడిన నూతన త్రివర్ణపతాకాన్ని (కొకాడ్) ప్రవేశపెట్టారు. బూర్బన్ల తెల్లరంగు పతాకం తొలగించబడింది.
బాస్టిలో కోట పతనాన్ని నిరంకుశ రాచరిక అంతాన్ని సూచించేదిగా సమకాలీన రచయితలు దాన్ని గొప్ప సంఘటనగా ప్రశంసించారు.
ప్రశ్న 4.
ఫ్రెంచి విప్లవ ఫలితాలు.
జవాబు:
ఫ్రాన్స్ను విముక్తి చేసి స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకురావటంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. నెపోలియన్ తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడంతో విప్లవం విఫలం అయినట్లు భావించనక్కరలేదు. ఎందుకంటే విప్లవం కోరుకున్న అనేక ఫలములు సామాన్యుడికి అందించబడ్డాయి.
సమాజంలో ప్రభువులకు, మతాధిపతులకు గల ప్రాధాన్యం తొలగిపోయి, వ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రారంభమైనాయి. చర్చి ప్రభుత్వానికి లోబడింది. క్రమంగా హేతువాద ప్రాముఖ్యం పెరిగింది. మూఢవిశ్వాసాలు, నమ్మకాలు క్రమంగా క్షీణించి, వాటి స్థానాన్ని హేతువాదం, శాస్త్రీయ దృక్పథం ఆక్రమించింది. విప్లవం కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజలకు అందించబడినవి. మానవ హక్కుల ప్రకటన ద్వారా ప్రపంచానికంతటకి ఫ్రాన్స్ మార్గదర్శి కాగలిగింది.
భూస్వామ్యవిధానం అంతం కావడం, బిరుదులు రద్దు కావడం, న్యాయస్థానాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ద్వారా దేశ ప్రజలలో సమానత్వం సాధించింది. బానిసత్వాన్ని రద్దు చేసారు. సామాన్యుని శక్తి ముందు రాజులు, ప్రభువులు, మతాధిపతులు అందరూ తలదించవలసిందే అని బుజువయింది. ఆసియా, ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలు ఫ్రెంచి విప్లవం వలన ప్రభావితం అయ్యాయి. ప్రజాస్వామ్య విధానాలు రాజ్యాంగ సవరణలు, ప్రజాప్రాతినిధ్యం మొదలైన అంశాలకు ఫ్రెంచి విప్లవంతోనే ప్రాధాన్యం పెరిగినట్లు పరిశీలకులు భావిస్తారు.
ప్రశ్న 5.
జాతీయసభ ప్రవేశపెట్టిన సంస్కరణలు.
జవాబు:
జాతీయసభ 1789 ఆగస్ట్ 4న దేశంలో భూస్వామ్యవ్యవస్థను రద్దు చేసారు. జాతీయ అసెంబ్లీ సభ్యులైన భూస్వాములు, జమీందార్లు ఒకరి తర్వాత మరొకరు తమ భూస్వామ్య అధికారాలు ప్రత్యేక హక్కులు వదులుకున్నారు. బానిసత్వం రద్దయింది. అలాగే మొదటి వర్గం మతాధిపతులు వసూలు చేస్తున్న ‘టైత్’ పన్నును రద్దు చేసారు.
1789, ఆగస్ట్ 26న నూతన జాతీయ అసెంబ్లీ మానవ హక్కుల ప్రకటన పత్రం విడుదల చేసింది. ఇందులో పౌరుల హక్కులు, వాటి అమలు గురించిన వివరాలు తెలియజేయబడ్డాయి. ఇది ఆధునిక యుగానికి ఒక వరంగా భావించబడింది. మానవ హక్కుల ప్రకటనలో గల పదిహేడు అంశాలలో మానవులందరూ సమానులేనని, ప్రజల చేతనే ప్రభుత్వ అధికారం నిర్ణయించబడుతుందని, శాసనాలు, చట్టాలు ప్రజల అభీష్టం మేరకు చేయబడతాయని ఈ ప్రకటన స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్రం, అసెంబ్లీలోని ప్రభుత్వంలో పాల్గొనడానికి అందరికీ సమాన అవకాశాలు కల్పించింది.
1791 నాటికి జాతీయ అసెంబ్లీ తయారు చేసిన మొదటి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 745 మంది ఎన్నుకోబడిన సభ్యులతో, రెండు సంవత్సరాల పదవీ కాలంతో అసెంబ్లీ ఏర్పడింది. నామమాత్రపు అధికారాలతో చక్రవర్తి కొనసాగాడు. న్యాయవ్యవస్థను, స్థానిక పరిపాలనా వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించారు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
16వ లూయీ చక్రవర్తి.
జవాబు:
(1774 – 1793) ఫ్రాన్స్లో ఎంతోకాలం పేరుకుపోయిన సమస్యలన్నీ తన నెత్తిమీద వేసుకున్న దురదృష్టవంతుడు 16వ లూయీ చక్రవర్తి. అపరిష్కృత సమస్యలే ఫ్రెంచి విప్లవానికి కారణమయ్యాయి. ఫ్రాన్స్ను పాలించిన బూర్బన్ రాజవంశంలో చివరివాడు ఇతడే. 20 సంవత్సరాల వయసులోనే రాజయ్యాడు. ఇతడు మంచి భావాలు కలిగి ఉన్నవాడు, కానీ మనసుకు సరైన లక్ష్యం లేక పెద్దగా చదువుకోలేదు. నిర్ణయాలు తీసుకోవటంలో సంకోచం, మందకొండితనం, బద్దకం వంటి అవలక్షణాలు కలిగినవాడు. చెప్పుడు మాటలు విని నష్టపోయాడు. ఫ్రెంచి విప్లవం తర్వాత 16లూయీ రాజ్యాన్ని వదిలి పారిపోయే ప్రయత్నం చేసాడు. కానీ ‘వెర్నస్’ సరిహద్దులలో దొరికిపోయాడు. చివరకు కన్వెన్షన్ 1793లో ఇతనిని ఉరితీసింది.
ప్రశ్న 2.
మేరీ అంతు వానెత్.
జవాబు:
మేరీ అంతు వానెత్ (1755-1793) ఆస్ట్రియా రాణి మరియు థెరిస్సా కుమార్తె. ఫ్రెంచి యువరాజు 16వ లూయీని వివాహం చేసుకుంది. ఆమె అందమైనది, చురుకైనది. గట్టి నిర్ణయాలు తీసుకునే శక్తి, ధైర్యం మొదలైనవి ఆమె లక్షణములు. అయితే ఆమెకు విజ్ఞత, సామాన్య ప్రజల మనస్తత్వములు అర్థం చేసుకునే శక్తి లేదు. రాచ కుటుంబంలో జన్మించిన అంతు వానెత్కు తన కంటే తక్కువ ధనవంతుల పట్ల చులకన భావముండేది అంతు వానెల్కు చదువుట, వ్రాయుట కూడా తెలియదు. అహంకారం, గర్వం అతి ఆత్మవిశ్వాసం ఎక్కువ. చివరకు క్రీ.శ 1793లో విప్లవకారులు ట్రిబ్యునల్ విచారణలో దోషిగా తేల్చి ‘గిలిటిన్’ ద్వార మరణశిక్ష విధించారు.
ప్రశ్న 3.
టెన్సిస్ కోర్ట్ శపధం.
జవాబు:
1789 జూన్ 20న ఎస్టేట్స్ జనరల్ సమావేశం కొరకు సామాన్యులు రాజధాని చేరుకున్నారు. కానీ అక్కడ సమావేశం జరగవలసిన హాలు తలుపులు మూసిఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా ఉన్న మూడవ వర్గం వారు ప్రక్కనే ఉన్న టెన్నిస్కోర్ట్ నందు సమావేశమయ్యారు. వారంతా ఏకకంఠంతో ఎట్టి పరిస్థితులలో విడిపోకుండా ఒకే దారిలో నడిచి, నూతన రాజ్యాంగము నూతన పాలనా వ్యవస్థ ఏర్పడే వరకు కలిసి పోరాడదాము” అని శపథం చేసారు. దీనినే ‘టెన్నిస్ కోర్ట్ శపథం’ అన్నారు.
ప్రశ్న 4.
ఓల్టేర్.
జవాబు:
ఐరోపా చరిత్రను తిరగరాసిన గొప్ప రాజకీయ తత్త్వవేత్త ఓల్టేర్ (1694-1778). ఇతడు కవి, చరిత్రకారుడు, నాటకకర్త మరియు శాస్త్రవేత్త. తన దేశంలో సమానత్వం కొరకు పోరాటం జరగడానికి ఇతడు పగటిపూట మబ్బులవలె, రాత్రి పూట వెలుగునిచ్చే మంటవలె సహాయపడ్డాడు. ప్రభువులను, మతాధిపతులను విమర్శించి ఎన్నోసార్లు జైలు పాలయ్యాడు. రోమన్ క్యాథలిక్ మతాధిపతులు చేసే ఆకృత్యాలను తీవ్రంగా ఖండించి వారి వలనే తాను క్రైస్తవమతానికి వ్యతిరేకం అని ప్రకటించాడు. ఇతని దృష్టిలో మానవుని ఆలోచనాశక్తికి, స్వేచ్ఛకు క్రైస్తవమతం అవరోధం కల్పిస్తున్నది. ఇతని వ్యాసాలలో రాజకీయ, మతాధిపతులపై అనేక వ్యంగ్య విమర్శలు కలవు.
ప్రశ్న 5.
మాంటెస్క్యూ,
జవాబు:
మాంటెస్క్యూ (1685-1755) ప్రభువర్గ కుటుంబంలో జన్మించాడు. న్యాయశాస్త్రం చదువుకొని బోరెక్స్ పార్లమెంట్లో న్యాయాధిపతిగా పనిచేసాడు. 20 సంవత్సరాల నిరంతర కృషి చేసి ‘స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే పుస్తకం రచించాడు. ఈ గ్రంథం దేశాల పాలనా, రాజకీయ విధానాలపై నిశిత విశ్లేషణ. ఈ గ్రంథంలో రాజకీయ వ్యవస్థలోని మంచి, చెడులను వివరించాడు. మాంటెస్క్యూ ప్రకారం ఇంగ్లాండ్ దేశంలోని రాజకీయ అధికారం అన్ని దేశముల కంటే ఉన్నతమైనది. మాంటెస్క్యూ తన రచనలతో కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ వేరువేరుగా ఉండటం చాలా అవసరం అని పేర్కొన్నాడు.
ప్రశ్న 6.
గిలిటిన్.
జవాబు:
ఫ్రెంచి విప్లవంలో గిలిటిన్ భయోత్పాతానికి చిహ్నము. గిలిటిన్ అనేది ఒకరకమైన శిరచ్ఛేదనా యంత్రం. కొంతమంది వైద్యులు ప్రతిపాదించిన ఈ మరణదండన విధానం వలన తక్కువ సమయంలో ఎక్కువ మందికి మరణశిక్ష విధించే అవకాశం కలుగుతుంది. ఫ్రాన్స్లో ఆ రోజులలో ఇది ఒక గొప్ప వినోదంగా, వేలాది మంది చూడటానికి వీలుగా ఏర్పాటు చేయబడింది. ఫ్రాన్స్ రాజు 16వ లూయీ, రాణి మేరి అంతువానెత్లు కూడా గిలిటిన్ ద్వారా మరణదండనకు గురైనారు.
ప్రశ్న 7.
టైత్స్.
జవాబు:
ఫ్రెంచి విప్లవానికి ముందున్న ఫ్రాన్స్ సమాజంలో మొదటి వర్గానికి చెందిన మతాధిపతులకు క్రైస్తవుల నుండి ‘టైత్’ అనే పన్నును వసూలు చేసుకునే హక్కు ఉండేది. ప్రతి క్రైస్తవుడు తన ఆదాయంలో కొంత భాగం తప్పనిసరిగా మతాధిపతికి చెల్లించే పన్ను. ఈ పన్ను ద్వారా మతాధికారులకు అధిక మొత్తంలో ఆదాయం లభించేది. చాలా మంది మతాధిపతులు ఈ ధనంతో విలావంతంగా జీవించేవారు.
ప్రశ్న 8.
మూడవ వర్గం.
జవాబు:
ఫ్రెంచి సమాజంలో ప్రభువుల, మతాధిపతులు కాకుండా మిగిలిన వారందరూ మూడవ వర్గానికి చెందినవారే. మూడవ వర్గానికి చెందినవారిలో కొంతమంది భూస్వాములు, వృత్తిపనివారు మరియు వ్యవసాయదారులు ప్రధానమైనవారు. ఫ్రాన్స్లో ఎక్కువ మంది మూడవ వర్గానికి చెందినవారే. మూడవ వర్గంలో న్యాయవాదులు, వైద్యులు, సైనికులు, వడ్డీవ్యాపారులు, వస్తువుల తయారీదారులు కలరు. వీరిలో చాలామంది ధనవంతులు, సమాజంలోని అసమానతల పట్ల తీవ్ర వ్యతిరేక భావంతో ఉండేవారు. తమ వర్గానికి రాజకీయ అధికారంలో భాగస్వామ్యం ఉండాలని వీరు కోరుకున్నారు. మూడవ వర్గంలో అత్యంత దయనీయంగా రైతులు జీవించారు. వీరు తమ ఆదాయంలో ఐదింట నాలుగు వంతులు పన్నుల రూపంలో చెల్లించేవారు. మిగిలిన ఆదాయంలో అతను, అతని కుటుంబం జీవించవలసి వచ్చేది.