Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర Textbook Questions and Answers.
AP Inter 1st Year History Study Material 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
దక్కన్ చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న వివిధ ఆధారాలపై వ్యాసం రాయండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి పురావస్తు, సాహిత్య (వాఙ్మయ) ఆధారాల నుంచి ఎంతో |విలువైన చారిత్రక సమాచారం లభిస్తుంది. పురావస్తు ఆధారాల్లో శాసనాలు ముఖ్యమైనవి. భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత మౌర్య చక్రవర్తి అశోకుడికే దక్కుతుంది. మౌర్యులకు సమకాలీనులైన శాతవాహనులు వారి పరిపాలనా కాలంలో అనేక శాసనాలు వేయించారు. నాసిక్, కార్లే, అమరావతి, నాగార్జున కొండ, కొండాపూర్ మొదలైన చోట్ల వారి శాసనాలు ఉన్నాయి. క్రీ.శ. 1వ శాతాబ్దం నాటి దక్కన్ ప్రజల జీవనాన్ని ఇవి తెలియచేస్తున్నాయి. కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు వేయించిన శాసనాలు ఆ కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
ఈ యుగానికి చెందిన రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరమైన మొదలైన విషయాలను అధ్యయనం చేయడానికి, నేక సాహిత్య రచనలు ఉపకరిస్తున్నాయి. వీటిలో తెలుగు, కన్నడ, సంస్కృతం భాషలోని రచనలతో పాటు విదేశీ రచనలు కూడా ఉన్నాయి.
ప్రశ్న 2.
గణపతిదేవుని ఘనతను అంచనా వేయండి.
జవాబు:
కాకతీయ వంశ పాలకుల్లో గణపతిదేవుడు అత్యంత శక్తిసామర్థ్యాలు గల పరాక్రమవంతుడు. మహాదేవుడి తరువాత సింహాసనం అధిష్టించాడు. రాజనీతిజ్ఞుడు, సైన్యాలను నడపడంలో దిట్ట. ఇతడి తల్లిదండ్రులు బయ్యాంబ, మహాదేవుడు. మైలాంబ, కుందమాంబ గణపతిదేవుడి సోదరీమణులు. గణపతిదేవుడి పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనం కరీంనగర్ లోని మంథని వద్ద లభించింది. దీని ప్రకారం గణపతిదేవుడి పరిపాలన డిసెంబర్ 26, 1199 కంటే ముందే ప్రారంభమైంది. సుమారు అరవై మూడు సంవత్సరాలపాటు గణపతిదేవుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించి, అనేక చారిత్రాత్మక విజయాలు సాధించాడు. గణపతిదేవుడి సైనిక విజయాల్లో అతని సేనాధిపతి రేచెర్ల రుద్రుడు కీలకపాత్ర పోషించాడు. మల్యాల సేనాధిపతులు కూడా గణపతిదేవునికి అండగా నిలిచారు. గణపతిదేవుని సైన్యాలు యాదవసేనలను ఓడించాయి. తీరాంధ్ర ప్రాంతంపై గణపతిదేవుని సైన్యాలు దండెత్తాయి. వెలనాడు పాలకుడైన పృథ్వీశ్వరుణ్ణి కాకతీయ సేనలు ఓడించాయి. ఈ విషయం గణపతిదేవుని బావమరిది నతవాడి రుద్రుడు వేయించిన క్రీ.శ. 1201 నాటి బెజవాడ శాసనంలో ఉంది. పరాజయం పాలైన వెలనాటి రాజు పృథ్వీశ్వరుడు తాత్కాలికంగా తన రాజధానిని చందవోలు నుంచి పిఠాపురానికి మార్చి, కృష్ణా ప్రాంతంపై తన అధికారాన్ని తిరిగి కొనసాగించాడు. గణపతిదేవుని సైన్యాలు ధరణికోటకు చెందిన కోటనాయకులతో యుద్ధానికి సిద్ధంకాగా కోట నాయకులు కాకతీయ చక్రవర్తి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. ఆ తరువాత మల్యాల చెందుని నేతృత్వంలో కాకతీయ చక్రవర్తి సైన్యాలు కృష్ణానదీ ముఖద్వారం వద్ద అధికారం చెలాయిస్తున్న అయ్యవంశ రాజుల కేంద్రమైన ‘దివి’పై దండెత్తాయి. కాకతీయ సైన్యాలను విరోచితంగా ఎదుర్కొన్న దివిసీమ పాలకులు ఓటమిని అంగీకరించారు. అయ్యవంశం రాజు పిన్నచోడుడు కాకతీయ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాడు. రాజనీతిజ్ఞుడైన గణపతిదేవుడు దివిసీమను అయ్యవంశ రాజులనే పాలించమని కోరాడు. పినచోడుని కుమారుడైన ‘జాయపను’ గణపతిదేవుడు తన కొలువులో చేర్చుకున్నాడు. అతడిని ‘గజసాహనిగా’ నియమించాడు. గణపతిదేవుడు పినచోడుని కుమార్తెలైన నారాంబ, పేరాంబలను వివాహమాడి ఇరు రాజ్యాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేశాడు.
గణపతిదేవుడి సేనలు క్రీ.శ. 1206కు ముందు మరోసారి వెలనాటి రాజైన పృథీశ్వరునిపై దండెత్తి అతణ్ణి యుద్ధంలో ఓడించి చంపాయి. యావత్ కళింగ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. కొన్ని కాకతీయ శాసనాల్లో గణపతిదేవుడికి ‘పృథీశ్వర శిరఃఖండుక క్రీడావినోద’ అనే బిరుదు ఉంది. దీన్ని బట్టి పృథ్వీశ్వరుడు కాకతీయ సేనల చేతిలో హతుడైయ్యాడని గ్రహించవచ్చు. క్రీ.శ. 1213 నాటి చేబ్రోలు శాసనం గణపతిదేవుడు జాయప సేనానిని వెలనాడు రాజ్య గవర్నర్ నియమించాడని పేర్కొంటుంది.
గణపతిదేవుడు నెల్లూర్ రాజ్యాన్ని ఏలిన మనుమసిద్ధి కుమారుడైన తిక్కభూపాలుడు, రాజ్య సింహాసనం కోసం చేసిన అంతర్యుద్ధంలో గణపతిదేవుని సహాయం కోరాడు. గణపతిదేవుడు తిక్కభూపాలుని శత్రువులు నల్లసిద్ధి, తమ్మసిద్దిలను ఓడించి నెల్లూరు సింహాసనంపై తిక్క భూపాలుణ్ని నిల్పాడు. పశ్చిమగోదావరి జిల్లాలో కొలను ప్రాంతాన్ని ఏలుతున్న ‘కొలను’ నాయకులను కూడా క్రీ.శ. 1231కి ముందే కాకతీయ సైన్యాలు ఓడించాయి. ‘ఇందులూరి సోముడు’ కొలను రాష్ట్ర గవర్నర్ గా నియమించాడు. గణపతి దేవుడి కాలంలో యాదవరాజులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి.
గణపతిదేవుడు తన సుదీర్ఘ పరిపాలనా కాలంలో (క్రీ.శ. 1199-1263) ఎప్పుడూ ఓటమిని చవిచూడలేదు. క్రీ.శ. 1263వ సంవత్సరంలో పాండ్య సేనలతో జరిగిన ‘ముత్తుకూరు’ యుద్ధంలో జటావర్మన్-సుందర పాండ్యుని సేనల చేతిలో అతడు పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. తనకు మగసంతానం లేనందువల్ల కుమార్తె రుద్రమదేవిని తన వారసురాలిగా ప్రకటించాడు. క్రీ.శ. 1268 లో గణపతిదేవుడు మరణించాడు. రుద్రమదేవి తండ్రి కాలంలోనే రాజ్య నిర్వహణలో, సైన్యాలను నడపడంలో శిక్షణ పొందింది.
ప్రశ్న 3.
శ్రీకృష్ణదేవరాయల విజయాలను చర్చించండి.
జవాబు:
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో (క్రీ.శ. 1509 1529) అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశమంతటికి విస్తరించింది. దక్షిణ భారతదేశంలో సారస్వతం, కళలు వికసించాయి.
తొలి జీవితం: శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశస్థుడు. ఇతని తల్లిదండ్రులు నరసానాయకుడు, నాగమాంబ. బాల్యం నుండి అప్పాజీ అనబడే తిమ్మరుసు నేతృత్వంలో సకలవిద్యలు నేర్చుకొని పాలకునికి కావలసిన లక్షణములన్నింటిని తనలో జీర్ణించుకున్నాడు. తన అన్నయైన వీరనరసింహుని మరణానంతరం శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనాన్ని అధిష్టించాడు. సాళువ తిమ్మరుసు ఇతని ప్రధానమంత్రి.
ఆకృతి, వ్యక్తిత్వం: క్రీ.శ. 1520లో శ్రీకృష్ణదేవరాయలను దర్శించిన పోర్చుగీసు వర్తకుడు డామింగో పేస్ రాయల ఆకృతిని వర్ణించాడు. “శ్రీకృష్ణదేవరాయలు పొడగరికాదు, పొట్టికాదు. మధ్యరకం, చక్కని మూర్తి, బొద్దుగా, ముఖంపై స్పోటకం, మచ్చలతో ఉంటాడు. ఉల్లాసవంతుడు, విదేశీయుల పట్ల దయతో, మర్యాదతో వ్యవహరిస్తాడు. హిందూస్థాన్లో అతనంటే హడల్” అని వర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిలో, యుద్ధాల్లో సమర్థుడు. సంస్కృతాంధ్ర భాషల్లో సాహితీ సృష్ట, సంస్కృతీ ప్రియుడు.
చక్రవర్తిగా రాయలు ఎదుర్కొన్న పరిస్థితులు: శ్రీకృష్ణదేవరాయలు సింహాసనమును అధిష్టించే నాటికి విజయనగర సామ్రాజ్యము అనేక సమస్యలతో ఉన్నది. ఎక్కడ చూసినా తిరుగుబాట్లు చెలరేగుతున్నాయి. ఒక ప్రక్క గజపతులు, మరొక ప్రక్క బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యాన్ని కబళించటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజనీతిని ప్రదర్శించి పోర్చుగీసు వారితో సంధి చేసుకొన్నాడు.
పోర్చుగీసు వారితో సంధి: రాయలు క్రీ.శ. 1510లో పోర్చుగీసు వారితో ఒక ఒప్పందాన్ని చేసుకొన్నాడు. ఈ ఒప్పందం ప్రకారం రాయల సైన్యానికి మేలుజాతి గుర్రాలను సరఫరా చేయటానికి పోర్చుగీసువారు అంగీకరిస్తే, పోర్చుగీసువారు గోవాను ఆక్రమించుకోవటానికి శ్రీకృష్ణదేవరాయలు అడ్డుచెప్పలేదు. పైగా భట్కల్ ప్రాంతంలో పోర్చుగీసువారు కోటలు కట్టుకోవడానికి కూడా రాయలు అనుమతించాడు.
దిగ్విజయాలు: పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, తన సైన్యాన్ని బలపరచుకొన్న తరువాత శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రను ప్రారంభించాడు.
1. బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ అదిల్షా, బీదర్ సుల్తాన్ మామూన్షాలు విజయనగరంపై జిహాద్ను ప్రకటించి కృష్ణదేవరాయలతో ఘర్షణకు దిగారు. రాయలు వారిని ఓడించి రాయచూర్, ముద్గల్ దుర్గాలను ఆక్రమించాడు. యూసఫ్ అదిల్షా మరణానంతరం అతని కుమారుడు ఇస్మాయిల్ అదిల్షా పిన్న వయస్కుడవటం చేత కమాలాఖాన్ అనే సర్దారు సర్వాధికారాలు పొంది బీజాపూర్ పాలకుడయ్యాడు. అలాగే బీదర్ అహమ్మద్ బరీద్ అనే సేనాని బీదర్ సుల్తానైన మహమ్మదాను బంధించి తానే సుల్తాన్ నని ప్రకటించుకున్నాడు. రాయలు వారిద్దరిని ఓడించి, పాలకులను వారివారి సింహాసనాలపై కూర్చుండబెట్టి ‘యవన రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు పొందాడు.
2. తరువాత దక్షిణ దిగ్విజయ యాత్రను జరిపి పెనుగొండ, ఉమ్మత్తూర్, శివసముద్రాలను జయించి, ఆ ప్రాంతాలన్నింటిని కలిపి శ్రీరంగపట్నం అనే రాష్ట్రంగా ఏర్పరచాడు.
3. తూర్పు దిగ్విజయ యాత్రను ప్రారంభించి, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరంలను జయించి, కటకం వరకు నడిచి గజపతులను ఓడించాడు. అంతట ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెను రాయలకిచ్చి వివాహం చేశాడు. సింహాచలం, పొట్నూరుల దగ్గర విజయస్థంభాలను నాటి, కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న భూములను గజపతికి ఇచ్చి రాజధానికి తిరిగివచ్చాడు.
4. రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో ఉండగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్షాన్ ఠాయ రును తిరిగి ఆక్రమించగా క్రీ.శ 1520 లో రాయలు అతనిని ఓడించాడు. ఈ యుద్ధంలో పోర్చగీసు నాస్ “క్రిష్టవో ఫిగరేదో రామలకు చాలా సహాయం చేశాడు. క్రీ.శ.1523లో రాయలు మళ్ళీ దండలే చుపూర్. గుల్బర్గాలను ఆక్రమించి సాగర్ వరకు గల ప్రాంతాలను కొల్లగొట్టాడు. రాయలు క్రీ.శ. 1529లో ను రశించాడు. రాయలు మరణంచే వాటికి అతని సామ్రాజ్యం తూర్పున కటకం నుండి పడమరన సారేశెట్టి వరకు ఉత్తరాన గుల్బర్గా నుండి దక్షిణాన సింహళం వరకు వ్యాపించింది.
పరిపాలనా విధానం ; శ్రీకృష్ణదేవరాయలు ఆదర్శవంతమైన పాలనను ప్రజలకందించాడు. ఇతని కాలంలో విజయనగర వైభవం ఇనుమడించిందని “పేస్” పేర్కొన్నాడు. పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో కాలువ చెరువులు త్రవ్వించి, పంటపొలాలకు నీటి పారుదల సౌకర్యాలను కల్పించాడు.
పరమత సహనం: శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడైనను అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. వ్యాసతీర్థ, వల్లభాచార్య అప్పయ్యదీక్షిత, వేదాంతదేశిక అనే వేరువేరు మతములకు చెందిన పండితులను అదరించి సన్మానించాడు.
సారస్వత పోషణ: శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునకు భువనవిజయమని పేరు. భువనవిజయులలో, ‘అష్టదిగ్గజములనే’ ఎనిమిది మంది కవులుండేవారు. వారు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయగారి మల్లన, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి అని ప్రతీతి. ఈ అస్థానంలో జరుగుతుండేవి. సాహితీ గోష్టులు జరుగుతుండేవి భువనవిజయములో వసంతోత్సవం లాంటి వేడుకలు గొప్పగా సందర్భంలో సంగీత, సాహిత్యాలకు ఆదరణ లభించేది. శ్రీకృష్ణదేవరాయలకు ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడనే బిరుదు ఉంది. ఇతడు స్వయంగా కవి. ఆముక్తమాల్యద, జాంబవతీ పరిణయం, మదాలస చరిత్ర అనే గ్రంథాల్ని రచించాడు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి ఆంధ్రభోజుడు అని కీర్తించబడ్డాడు. “దేశ భాషలందు తెలుగు లెస్స”. అని రాయలే స్వయంగా పేర్కొన్నాడు.
కళాభివృద్ధి: శ్రీకృష్ణదేవరాయల కాలంలో కళలు కూడా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో కృష్ణాలయాన్ని, హజార రామాలయాన్ని నిర్మించాడు. తిరుపతి, కంచి, కాళహస్తి, సింహాచలం వంటి అలడులకు గోపురాలను, మండపాలను నిర్మించాడు. ఇతని కాలంలో విజయనగరం రోమ్ మహానగరమంత సుందరంగా ఉన్నట్లు ఇతని కాలంలో విజయనగరాన్ని సందర్శించిన “పేస్” అనే పోర్చుగీసు వర్తకుడు పేర్కొన్నాడు.
ఘనత: దక్షిణ భారతదేశాన్ని పాలించిన కడపటి హిందూ పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు ఇతడు విజయనగర చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే మహోన్నతమైన స్థానాన్ని అధిరోహించిన చక్రవర్తులలో ఒకడిగా విశిష్టమైన స్థావాన్ని సంపాదించుకున్నాడు.
ప్రశ్న 4.
విజయనగర కాలం నాటి సమాజం, ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర రాజుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగమని చెప్పవచ్చు. విజయనగర రాజులు రెండు శతాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతికి రక్షణ కల్పించారు. వీరితో పోరాడవలసి వచ్చినందునే బహమనీ సుల్తానులు ఉత్తర దేశం వైపు దృష్టి మళ్లించి విస్తరించలేకపోయారు.
పాలనా విధానం: వీరు మౌర్యులవలె కేంద్రీకృత రాజరికాన్నే అమలు చేశారు. విజయనగర పాలకులు సర్వజనామోదం పొందిన పాలనా విధానాన్ని పాటించారు. రాజులు ధర్మబద్ధులమని ప్రకటించుకున్నారు. అందువలన దేశంలో న్యాయం ప్రతిష్టించబడి ప్రజలు సుఖించారు. కట్టుదిట్టమైన పాలనా వ్యవస్థ ఉండటం వలన దేశంలో శాంత సౌభాగ్యాలు నెలకొన్నాయి. కే. కొలనలో చక్రవర్తే ముఖ్యుడు. అతని మాటే శాననం. కేంద్రంలో రాజుకు మంత్రిమండలి సభ్యులు సహకరించేవారు. సాళువ తిమ్మరుసు, విద్యారణ్య స్వామి మొదలగువారు ఉన్నత పదవులు చేపట్టినారు. నాడు మంత్రివర్గం సంఖ్య 6 లేదా 8 మంది.
సాంఘిక పరిస్థితులు: విజయనగరం పాలనాకాలంలో సంఘంలో వర్ణవ్యవస్థ బలపడి వర్ణభేదాలు కొనసాగాయి. బ్రాహ్మణుల హక్కులను శూద్రులు ధిక్కరించటం మొదలుపెట్టారు. సంఘంలో బహుభార్యత్వం, బాల్య వివాహాలు, సతీసహగమనం, వరకట్నం, కన్యాశుల్కం అమలులో ఉన్నాయి. స్త్రీలకు సంఘంలో గౌరవప్రదమైన స్థానమున్నప్పటికి వితంతువులకు గౌరవం లేదు. మద్యపానం, ధూమపానం సమాజంలో ప్రవేశించాయి. తురుష్క, పాశ్చాత్య సంప్రదాయాల ప్రభావం వేషధారణలో కన్పించసాగింది. ప్రభుత్వం వేశ్యావృత్తిని గుర్తించింది. ప్రభుత్వానికి వేశ్యావృత్తిపై వచ్చే ఆదాయం చాలా ఎక్కువని అబ్దుల్ రజాక్ వ్రాశాడు.
ఆర్థిక పరిస్థితులు: అబ్దుల్ రజాక్, నికోలోకోంటి, డామింగోపేస్, న్యూనిజ్ వంటి విదేశీ యాత్రికుల రచనలు విజయనగర వైభవానికి అద్దంపడుతున్నాయి. వీరి రచనల ప్రకారం విజయనగర రాజ్యం ఐశ్వర్యవంతంగా ఉన్నందువల్లనే తరచూ బహమనీ రాజ్యం దండయాత్రలకు గురైంది. విజయనగరం చుట్టుకొలత 60 మైళ్ళని, దాని చుట్టూ ఏడు ప్రాకారాలుండేవని నికోలోకోంటి పేర్కొన్నాడు.
విజయనగరాధీశులు కాలువలను త్రవ్వించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. దారులోహ పరిశ్రమలను స్థాపించి పరిశ్రమలను కూడా ప్రోత్సహించారు. రాయలసీమలోని రామళ్లకోట, వజ్రకరూర్లో వజ్రాలను త్రవ్వేవారు. వజ్రాలు, బంగారం, వెండి, ముత్యాలు వంటి విలువైన వస్తువులను నడిబజారులో రాసులుగా పోసి, ఈ నగరంలో విక్రయించేవారని నికోలోకోంటి పేర్కొన్నాడు. విజయనగరాధీశులు రాజధాని నగరం నుంచి పెనుగొండ, తిరుపతి, శ్రీరంగపట్టణం, కాంచీపురం, రామేశ్వరం, కొండవీడు మొదలగు ముఖ్య నగరాలకు బాటలు వేయించి, వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. గుర్రాలు, ఎడ్లు, పల్లకీలు, బండ్లు నాటి ప్రయాణ సాధనాలు. దేశంలో అనేక చోట్ల సంతలు జరిగేవి. విదేశీ వాణిజ్యం అరబ్బులు, పోర్చుగీస్వేరి హస్తగతమైంది. ఎగుమతుల్లో ముఖ్యమైనవి నూలుబట్టలు, రత్నకంబళీలు, దంతపుసామాన్లు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి.
ప్రశ్న 5.
కుతుబ్షాహీలు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్షాహీ వంశాధికారాన్ని క్రీ. శ. 1512లో సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్ స్థాపించాడు. బహమనీ సుల్తాన్ మూడో మహమ్మద్ షా కాలంలో ఆ రాజ్య విచ్ఛిన్నం జరిగింది. అహమద్ నగర్, బీజాపూర్, బీదర్, బీరార్, గోల్కొండ అనే ఐదు స్వతంత్ర రాజ్యాలు బహమనీ రాజ్య శిథిలాలపై వెలిశాయి. గోల్కొండ కుతుబ్షాహీలు వారి అధికారులు స్థానిక తెలుగు ప్రజల మద్దతుతో, సుమారు 175 ఏళ్ళపాటు నేడు తెలుగు మాట్లాడే అత్యధిక ప్రాంతాలనూ, కన్నడ, మరాఠి మాట్లాడే కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. సుప్రసిద్ధ చరిత్రకారులైన హరూన్-ఖాన్-షేర్వానీ, నేలటూరి వేంకటరమణయ్య మొదలైన వారు కుతుబ్షాహీలు అత్యంత ప్రజాసేవాతత్పరత కలిగిన పాలకులనీ, వారు ముస్లింలు అయినప్పటికీ హిందూ ప్రజలను, వారి ఆచారాలను, సంస్కృతిని గౌరవించారనీ, వీరిలో కొందరు తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించారనీ, వారు తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేశారనీ ప్రశంసించారు. కుతుబ్షాహీ సుల్తానుల్లో సుల్తాన్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1512 – 1543), ఇబ్రహీం కుతుబ్షా (క్రీ.శ. 1550-1580), మహమ్మద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1580-1612) సుప్రసిద్ధులు.
ఆధారాలు: కుతుబ్షాహీ సుల్తానుల పరిపాలనా కాలానికి సంబంధించిన వివిధ అంశాల గురించి సమకాలీన ముస్లిం చరిత్రకారుల రచనలు, విదేశీ బాటసారుల రచనలు, కుతుబ్షాహీ సుల్తానులు జారీ చేసిన ఫర్మానాలు, సమకాలీన తెలుగు సాహిత్యం ఎంతో అమూల్యమైన సమాచారాన్ని తెలియచేస్తున్నాయి. ముస్లిం చరిత్రకారుల రచనల్లో
ఫెరిస్టా రాసిన గుల్షన్-ఇ-ఇబ్రహీమి, ఖదీరాఖాన్ రాసిన తారీఖ్-ఇ-కుతుబ్షాహీ, సయ్యద్ అలీ-టబాటబీ రచన, బుర్హన్-ఇ-మాసిర్, అజ్ఞాత చరిత్రకారుడు రాసిన తారీఖ్-ఇ-సుల్తాన్ మహమ్మద్ షాహీ పేర్కొనదగినవి. ఈ రచనల్లో సుల్తానుల కాలం నాటి రాజకీయ చరిత్ర, పరిపాలన వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, సంస్కృత రచనల్లో, అద్దంకి గంగాధరుడు రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’, పొనగంటి తెలగనార్యుని రచన యయాతి చరిత్ర, మట్ల అనంతభూపాలుని రచన కుకుత్స విజయం, సారంగతమ్మయ్య రచన ‘వైజయంతీ విలాసం’, భద్రాద్రి శతకం, సింహాద్రి శతకం, భతృహరీ శతకం, కదిరీఫతీ రాసిన ‘హంసవింసతి’, అయ్యలరాజు నారాయణామాత్రుడు రాసిన సుకసప్తతి, వేమన పద్యాలు ఆనాటి ప్రజాజీవనాన్ని వర్ణిస్తున్నాయి. కుతుబ్షాహీల రాజధాని గోల్కొండ, కొత్త నగరం హైద్రాబాద్, దక్కన్లోని ఇతర నగరాలను, ప్రాంతాలను సందర్శించిన విదేశీ బాటసారులైన ఫ్రాన్స్ దేశస్థులైన టావెర్నియర్, బెర్నియర్, థీవ్నాట్, విలియం మాథోల్డ్ రష్యాకు చెందిన నిఖిటిన్ మొదలైన వారు ఈ యుగానికి చెందిన వివిధ విషయాలను తమ డైరీలలో, రచనల్లో పేర్కొన్నారు. ఇవి కుతుబ్షాహీల యుగచరిత్ర రచనకు ఎంతో అమూల్య సమాచారాన్ని అందచేస్తున్నాయి.
సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్-ముల్క్: స్వతంత్ర కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్. ఇతడు బహమనీల కొలువులో కొంతకాలం పనిచేశాడు. తెలంగాణా తరఢారుగా పనిచేశాడు. మూడో మహమ్మద్ షా పరిపాలన చివరి దశలో చెలరేగిన తిరుగుబాట్లతో ప్రేరేపితుడై క్రీ.శ. 1512లో స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు సమకాలీన విజయనగర, గజపతి రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. ఇతడు గోల్కొండ దుర్గాన్ని బలోపేతం చేయించాడు. అనేక మసీదులు, రాజప్రసాదాలు, భవనాలు నిర్మించాడు. గోల్కొండకు సమీపంలో ‘మహమ్మద్ నగర్’ అనే కొత్త పట్టణాన్ని కట్టించాడు. అతణ్ణి అధికారులు, ప్రజలు అభిమానించారు. 99వ యేట కుమారుడి (జంషీద్) చేతిలో హత్యచేయబడ్డాడు. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యం దక్కన్లోనే కాక సమకాలీన ప్రపంచంలో విశేష ఖ్యాతి గడించింది.
జంషీద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1543-1550): ఇతడు సుల్తాన్-కులీ మూడో కుమారుడు. స్వార్థపరుడు. కుట్రలకు పెద్ద వ్యూహకర్త. సొంత తండ్రినే అధికార దాహంతో హత్యచేసి సింహాసనం అధిష్టించి ఏడేళ్ళు పరిపాలన చేశాడు. ప్రజలు, అధికారులు ఇతని చర్యను ఏవగించుకున్నారు. మంచి పాండిత్యం కలవాడు. కవిత్వం రాసేవాడు. క్రీ.శ. 1550లో వ్యాధిగ్రస్తుడై మరణించాడు.
సుఖాన్-కులీ-కుతుబ్షా: జంషీద్ మరణానంతరం ఏడేళ్ళ పిన్నవయస్కుడైన అతని కుమారుణ్ణి అతని తల్లి, మంత్రులు గోల్కొండ సింహాసనంపై కూర్చోబెట్టి అధికారం చెలాయించారు. ఇతని పరిపాలన కేవలం ఏడు నెలలపాటు కొనసాగింది. రాజ్యంలో అంతరంగిక కలహాలు, సర్దారుల స్వార్థ రాజకీయాలు హద్దుమీరాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగర రాజ్యంలో అళియరామరాయల వద్ద శరణాగతునిగా ఉన్న ఇబ్రహీం-కులీ-కుతుబ్షా, రామరాయల మద్దతుతో గోల్కొండ రాజ్య సింహాసనాన్ని క్రీ.శ. 1550లో అధిష్టించాడు. ఈ విధంగా సుబాన్ కులీ పాలన అంతమైంది.
ఇబ్రహీం-కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1550-1580): ఇతడు గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ చిన్న కుమారుడు. తన సోదరుడైన జంషీద్ పన్నిన కుట్ర నుంచి ప్రాణాలతో తప్పించుకొని క్రీ.శ.1543లో విజయగనర రాజ్యం పారిపోయి అళియ రామరాయల శరణు పొందాడు. అక్కడే ఏడేళ్ళపాటు గడిపాడు. రామరాయలు ఇతణ్ణి సొంత కొడుకులా ఆదరించాడు. తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించాడు. క్రీ.శ. 1550లో గోల్కొండ సుల్తానుగా సింహాసనం అధిష్టించిన ఇబ్రహీం-కులీ-కుతుబ్షా ప్రజా బలంతో 30 సంవత్సరాలపాటు సమర్థవంతంగా పరిపాలన చేశాడు. ఇతడు రాజ్య విస్తరణ కోసం సోదర షియా సుల్తానులతో, విజయనగర రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. అళియ రామరాయల విభజించి పాలించు దౌత్యనీతికి ఇతడు నష్టపోయాడు. గత సహాయాన్ని విస్మరించి విజయనగర చక్రవర్తికి వ్యతిరేకంగా వైవాహిక సంబంధాల ద్వారా బీజాపూర్, అహమద్ నగర్ సుల్తానులను, బీరార్, బీదర్ సుల్తానులను ఐక్యం చేశాడు. చారిత్రాత్మక రాక్షసి తంగడి యుద్ధం (జనవరి 23, 1565)లో విజయగనరం సేనాధిపతియైన ఆళియ రామరాయలను మోసంతో దెబ్బతీశాడు. రాత్రిపూట సంప్రదింపుల సాకుతో వారి శిబిరంపై దాడిచేయించాడు. 80 ఏళ్ళ వయస్సులో రామరాయలు విరోచితంగా పోరాడి ఓడాడు. హుస్సేన్-నిజాం షా రామరాయల తలను ఖండించి యుద్దభూమిలో పగ తీర్చుకొన్నాడు. దీంతో విజయనగర సేనలు చిన్నాభిన్నమయ్యాయి. ఇతని పాలనలో గోల్కొండ రాజ్యం కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆర్థికంగా, సైనికంగా గోల్కొండ రాజ్యం బలోపేతమైంది. ఇతడు వ్యవసాయాభివృద్ధికై అనేక చెరువులు, కాలువలు నిర్మించాడు. వీటిలో పేర్కొనదగ్గవి హుస్సేన్ సాగర్ చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు. రైతాంగం సుఖసంతోషాలతో ఉండేది. స్వదేశీ, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. గోల్కొండ వస్త్రాలు, వజ్రాలు యూరోపియన్ రాజ్యాల్లో మంచి పేరు పొందాయి. సాహిత్యం, కళలు ఇతని పోషణలో వికసించాయి. ఇతడు క్రీ.శ. 1580లో మరణించాడు.
మహమ్మద్ కులీ-కుతుబ్షా (క్రీ.శ. 1580-1612): ఇబ్రహీం-కులీ-కుతుబ్షా మరణానంతరం అతని సోదరుడైన (సుల్తాన్-కులీ-మూడో కుమారుడు) మహమ్మద్-కులీ-కుతుబ్షా పదిహేను ఏళ్ళ పిన్నవయస్సులో గోల్కొండ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు దక్కన్ ముస్లిం పాలకుల్లో అత్యంత ప్రతిభావంతుడిగా కీర్తిగడించాడు. గొప్ప పరిపాలనాదక్షుడు. సైన్యాలను నడపడంలో దిట్ట. సాహిత్యప్రియుడు, గొప్ప కట్టడాల నిర్మాత. హైద్రాబాద్ నగరం ఇతని నిర్మాణమే. చార్మినార్, జామామసీద్, చందన్ మహల్ కూడా ఇతడే నిర్మించాడు. ఇతడు ఇబ్రహీం మాదిరిగానే తెలుగు భాషను ఆదరించాడు. అరబిక్, పర్షియన్, ఉర్దు భాషలతో సమానంగా తెలుగుభాష పురోగతి చెందింది. స్థానిక ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, పద్ధతులను గౌరవించాడు. ప్రజా సంక్షేమాన్ని కోరి పరిపాలించాడు. క్రీ.శ. 1612లో 32 ఏళ్ళ సుదీర్ఘ పాలన తరువాత మరణించాడు. ఇతడి ఏకైక కుమార్తె హయత్-బక్ష్-బేగం. ఈమె భర్త సుల్తాన్ మహ్మద్ కుతుబ్షా గోల్కొండ చరిత్రలో మహమ్మద్ కులీ-కుతుబ్షా పరిపాలనా కాలం ఒక చారిత్రక ఘట్టం.
సుల్తాన్ మహమ్మద్-కులీ-కుతుబ్షా (క్రీ.శ.1612-1626): మహ్మమద్ కులీ-కుతుబ్షా మరణానంతరం అతని మేనల్లుడు, అల్లుడైన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా గోల్కొండ సుల్తానుగా బాధ్యతలు చేపట్టాడు. ఇతడు గొప్ప పండితుడు. ఇతనికి మత సంప్రదాయాల పట్ల అభిమానం ఎక్కువ. అధిక సమయం పండితులతో చర్చల్లో గడిపేవాడు. క్రీ.శ. 1617లో హైద్రాబాద్ నగరంలో మక్కామసీదు నిర్మాణానికి ఇతడే పునాది వేశాడు. దీని నిర్మాణం డైబ్బైఏడేళ్ళ పాటు కొనసాగింది. క్రీ.శ 1687 లో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ మక్కామసీద్ నిర్మాణాన్ని 1694లో పూర్తిచేశాడు. ఇతడే సుల్తాన్ నగరాన్ని నిర్మించాడు.
అబ్దుల్లా-కుతుబ్షా (క్రీ.శ.1626 – 1672): ఇతడు సుల్తాన్ మహమ్మద్ కుమారుడు. పన్నెండు ఏళ్ళ పిన్న వయస్సులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని తల్లి హయత్-బక్ష్-బేగం రాజ్య వ్యవహారాలు నిర్వహించింది. ఇతడు విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇతని కాలంలో మొగల్ దాడులు గోల్కొండ రాజ్యంపై తీవ్రతరమయ్యాయి. పరాజయం పొందిన గోల్కొండ సుల్తాన్ మొగల్ చక్రవర్తికి కప్పం చెల్లించి అధికారం కొనసాగించాడు. ఇతడు క్రీ.శ.1672లో మరణించాడు.
అబుల్హాసన్ తానాషా (క్రీ.శ.1672–1687): కుతుబ్షాహీ సుల్తానుల్లో అబుల్హసన్ తానాషా చివరివాడు. ఇతడు అబ్దుల్లా కుతుబ్షా అల్లుడు. ఇతడి పదిహేను ఏళ్ళ పరిపాలనా కాలంలో కుతుబ్షాహీ రాజ్యంపై మొగల్ చక్రవర్తి సేనలు నిరంతర దాడులు చేశాయి. దీనివల్ల కుతుబ్షాహీ రాజ్య ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇతడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇతడు పరమత సహనం ప్రదర్శించాడు. ఔరంగజేబ్ సామ్రాజ్య కాంక్షకు అబుల్హాసన్ రాజ్యం బలైంది. సుమారు ఎనిమిది నెలలపాటు ధైర్యసాహసాలతో మొగల్ సేనలను కుతుబ్షాహీ సేనలు ఎదుర్కొన్నాయి. పరాజితుడైన సుల్తాన్ను మొగల్ సేనలు బందీగా బీదర్, దౌలతాబాద్లలో పన్నెండు ఏళ్ళపాటు ఉంచారు. క్రీ.శ. 1690లో చివరి కుతుబ్షాహీ సుల్తాన్ బందీగా దౌలాతాబాద్లోనే మరణించాడు.
ప్రశ్న 6.
కుతుబ్షాహీల కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను వర్ణించండి.
జవాబు:
గోల్కొండ సుల్తానుల కాలమునాటి ఆంధ్రదేశ పరిస్థితులను తెలుసుకొనుటకు ఆధారములేమనగా:
- అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీ సంవరణోపాఖ్యానము”
- పొన్నగంటి తెలగనార్యుని “యయాతి చరిత్ర”
- మట్ల అనంత భూపాలుని “కకుత్స విజయము”
- మల్లారెడ్డి విరిచితమగు “పద్మపురాణము”, “షట్చక్రవర్తి చరిత్రము”
- వేమన పద్యములు
- “భద్రాద్రి శతకము”, సింహాద్రిశతకము” మున్నగు శతకములు
- టావెర్నియర్, థీవ్ నాట్ మున్నగు విదేశీ యాత్రికుల రచనలు
- ఫెరిష్టా, ఖాఫీఖాన్ మున్నగు ముస్లిం చరిత్రకారుల రచనలు.
గోల్కొండ సుల్తాన్లు వ్యవసాయమును విస్తృతపరచి, పరిశ్రమలను నెలకొల్పి, వాణిజ్యమును ప్రోత్సహించి 3 ఆర్థికాభ్యుదయమును సాధించిరి. వారి పరమత సహన విధానము, ప్రజాహిత కార్యములు, ఆంధ్ర సారస్వత పోషణ ఆంధ్రుల అభిమానమును వారు చూరగొన్నారు.
A. సాంఘిక పరిస్థితులు: నాటి సమాజములో హిందువులు, ముస్లిములు అను రెండు ప్రధాన వర్గములుండెను. హిందువులలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులు, కర్షకులను మూడు తెగలు, ముస్లిములలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులను రెండు తెగలు కలవు.
(ఎ) హిందువులు: పూర్వకాలమునందువలె ఈ యుగమున కూడా చాతుర్వర్ణ వ్యవస్థ కలదు. కాని మహమ్మదీయుల ప్రాబల్యమధికమగుట వలన వర్ణవ్యవస్థలోని క్లిష్టత మాత్రమే సడలసాగెను. నాటి సమాజమున ప్రధానమగు కులములు నాలుగే అయినను వృత్తి కారణముగా అనేక కులములు ఏర్పడినవి. కాపు, రెడ్డి, వెలమ, యాదవ, బలిజ, కమ్మరి, వడ్రంగి, కాసె, కంచెర, అగసాలె, సాలె, సాతాని, చాకలి, మంగలి, కలిక, గాండ్ల, బెస్త, బోయ, మేదర మున్నగు కులములు నాటి సమాజమున కలవు. కాపులలో పంట, మోటాటి, పాకనాటి మున్నగు బేధముండెను. వీరు వ్యవసాయములో నేర్పరులు. వీరితోపాటు స్త్రీలు కూడా పొలము పనులలో పాల్గొనెడివారు. అగసాలె వారు బొమ్మలకు రంగులు వేసెడివారు.
బ్రాహ్మణులు పంచాంగము చెప్పుట వలన, భిక్షాటన ద్వారా, గ్రహశాంతి జపములు చేయుట వలన, గ్రహసంక్రమణ సమయములందు దానములను గ్రహించుట వలన ధనార్జన చేసి జీవించెడివారు. కొందరు బ్రాహ్మణులు ప్రభుత్వోద్యోగములలో నియుక్తులగుచుండిరి. వారు నియోగులనబడిరి. వారు గ్రామకరణములుగా కూడా ఉండెడివారు. నాటి బ్రాహ్మణులు వ్యవసాయము చేయుటయందును నేర్పరులే. కొందరు బ్రాహ్మణులు గాదెల నిండుగ ధాన్యమును, ఆవుల మందలను, గొట్టెల మందలను కలిగియుండిరి.
(బి) మహమ్మదీయులు: ఈ కాలమునకు మహ్మదీయుల పాలన ఆంధ్రదేశమున స్థిరపడెను. సుల్తానులు పరమత సహనమును ప్రదర్శించినప్పటికీ స్థానిక అధికారులు ఆంధ్రదేశమున వీరవిహారము సల్పుచుండిరి. స్త్రీలను చెరపట్టి, గోవులను వధించుచుండిరి. వీరి ప్రభావము వలన వేదశాస్త్ర, పురాణ పఠనములు నశించెను. సయ్యదులు, మౌల్వీలు, ఫకీర్లు మున్నగువారి ప్రభావము పెరుగుటతో బ్రాహ్మణులకు, విద్యాంసులకు, హరిభక్తులకు సంఘమున స్థానము దిగజారినది. మహమ్మదీయుల భాష కూడ ప్రచారములోనికి వచ్చెను. ఉర్దూ పదములు విరివిగా తెలుగులో ప్రవేశించెను.
(సి) ఆహారము: వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ నాటి ప్రధాన ఆహార ధాన్యములు. నేయి, కూర ప్రజల భోజనములో ప్రధాన భాగములు. పొంగలి, పులిహోర, దద్దోజనము, పప్పు, ఆవడులు, వడగులు, పచ్చళ్ళు, దోసెలు, గారెలు, బూరెలు, చక్కిలములు మున్నగు అనేక రకములగు ఆహార పదార్ధములు వారికి తెలియును. కొఱ్ఱలు, రాగి, సజ్జ, జొన్న, మొక్కజొన్న సామాన్య ప్రజల ఆహార ధాన్యములు. వరి ధాన్యములో అనేక రకములు కలవు. ముస్లిములు ప్రధానంగా మాంసాహారులు.
తాంబూలమును సేవించుట నాటి ప్రజలకు (ధనికులకు) అమిత ప్రీతి. తాంబూలములో కర్పూరము, కొత్త సున్నము, లేత తమలపాకులు ప్రధాన భాగములు.
(డి) దుస్తులు: వివిధ తరగతులవారు వివిధ రకముల దుస్తులను ధరించిరి. గోల్కొండ సుల్తానులు ఆదిలో పూర్వపు సాంప్రదాయము ప్రకారము తురుష్కుల శైలిలో దుస్తులు ధరించినను క్రమక్రమముగా స్థానిక పద్ధతులకు అలవాటుపడిరి. మహమ్మద్ కులీకుతుబ్షా తురష్కటోపి, ఉన్ని కోటులకు మారుగా, దక్కను ప్రాంతీయులు వాడు తలపాగాను, వదులుగానుండు చొక్కాను ధరించెను. లుంగీ, జుబ్బా (లాల్చి), పేటాలు ముస్లిం పురుషుల దుస్తులు. క్రమంగా వీటికి బదులుగా షేర్వానీ, ట్రౌజరు, తుర్కీట్రోపీ వాడుకలోనికి వచ్చెను. ముస్లిం స్త్రీలు చీరలు, జాకెట్లు లేదా పావడ పైట వేసుకొనెడివారు. పూర్వము గొంతు నుండి మోకాళ్ళ వరకు ఉండెడి “చౌలీలు” ధరించిరి. చేతులు గూడా పూర్తిగా కప్పబడి ఉండేవి. తరువాత ఈ చౌలీల స్థానములో పొట్టి రవికులు వచ్చినవి. “పర్ధా” ఘోషా అను ఆచారమును ముస్లిం స్త్రీలందరూ పాటించెడివారు.
హిందువులలో ధనవంతులు పగడం, పచ్చలు ధరించెడివారు. నల్ల అంచుగల పంచె, తలపాగ మున్నగునవి. వారి దుస్తులలోని భాగములు. చొక్కాలు చాలా తక్కువ, కాని అవి వాడుకలోనికి వచ్చి ఉండెను. సామాన్య జనులు ముతక దుప్పటి కప్పుకొనుచుండిరి. నాటి స్త్రీలు “సరిగ” రవికెలు ధరించేవారు. అంచులయందు అల్లిక పనిగలిగిన రవికెలను “సరిగ రవికె” అంటారు. స్త్రీలు నుదుట తిలకమును దిద్దుకొని కొప్పువేసుకొని పూలు తురిమిడివారు.
(ఇ) ఆభరణములు: మణి హారములు, పాపిట బొట్లు, జడబిళ్ళలు, కడియములు పగడాల పేరులు, గజ్జెలు, తాయెత్తులు, కుప్పెలు, సూర్య, చంద్రవంకలు, గండ్లపేరు, కంకణములు, కమ్మలు, ఉంగరములు నాటి స్త్రీల ఆభరణములు. నాటి స్త్రీలు బంగారు గాజులు కూడా ధరించినట్లు తెలియుచున్నది. ముస్లిం స్త్రీలు కాళ్ళకు కడియములు, చెవులకు బంగారు పోగులు, గొలుసులు, ముక్కుపుడకలు, విలువైన రాళ్ళు కూర్చిన బంగారు హారములు ధరించెడివారు. పురుషులకు చెవిపోగులుండట సర్వసాధారణము. చాలామంది దండ కడియమును కూడా ధరించిరి. మహమ్మద్ కులీకుతుబ్షా కూడా దండ కడియమును ధరించెడివారు. గొడుగులు, టోపీలు వాడుకలో ఉండెను.
(యఫ్) గృహములు, గృహోపకరణములు: గోల్కొండ సుల్తానులు, ప్రభువర్గముల వారు విశాల భవనములలో నివసించుచూ విలాస జీవితమును గడిపారు. మధ్యతరగతివారు కూడా సౌఖ్యప్రదమైన జీవితమును గడిపినట్లు తెలియుచున్నది. హైదరాబాద్ నగరంలో ఎనిమిది లక్షల జనులు నివసించినారు. ఆ కాలము నాటి ప్రజలు గృహ నిర్మాణ విషయమున మిక్కిలి శ్రద్ధ వహించిరి. పడకగది, వంటగది, దేవతార్చనగది, అటకలు, విశాలమగు చావడతో బావి, గాదెలతో పశువుల దొడ్డి మున్నగువానితో నాటి గృహములు కూడి ఉండెడివి. ధనవంతులు గాజుగిన్నెలలో దీపాలు వెలిగించుచుండిరి. సుల్తానులు, కులీనులు వెండి, బంగారు పాత్రలను వాడిరి. తివాచీలు, గాజు సామాగ్రిని కూడా ఎక్కువగా వాడుకలో ఉండెను. హైదరాబాదులోని విశాల భవనములను, వెండి, బంగారు పాత్రలను, తివాచీలను, గాజు సామాగ్రిని చూచి మొగలులు ఆశ్చర్యచకితులైనారు.
భోగపరాయణుల శయ్యా మందిరములు చక్కగా అలంకరింపబడేవి. పట్టే మంచములు, దోమతెరలు, ముత్యాల జాలీలు, తూగుటుయ్యాల, తాంబూలపు భరిణ, రుద్రవీణ, వట్టివేళ్ళ విసనకర్రలు, దీపపు స్థంభములు మున్నగువానిచే శయ్యామందిరములు అలంకరింపబడెను. విలాసప్రియులు పన్నీరు, గంధము మున్నగు సుగంధ ద్రవ్యములను వాడేవారు.
(జి) వినోదములు: పండుగలు, జాతరలు, రథోత్సవములు మున్నగునవి ఆనాటి ప్రజలకు సంతోషదాయకములు. ధనవంతులైన గ్రామ ముఖ్యులు ఉచితముగా వినోదములను ఏర్పాటు చేయుచుండిరి. గ్రామాధికారి ఏర్పాటు చేసిన దొమ్మరాటయే ఆ కాలపు సర్కస్. దొమ్మరివాళ్ల విద్యలు, వీధినాటకములు, తోలుబొమ్మలాటలు, విప్రవినోదములు, కోడిపందెములు మున్నగునవి ప్రజలకు వినోదము కలిగించెడివి. పులిజూదము, గుడిగుడిగుంచము, బొంగరములాట మున్నగునవి వారి వినోదక్రీడలు.
(హెచ్) విద్యా విధానము: ఆనాటి విద్యా విధానము ఓనమాలను దిద్దించుటతో ప్రారంభమగును. గుణింతములను, పద్యములను నేర్పెడివారు. విద్యనభ్యసించుటలో శ్రద్ధ చూపని విద్యార్థులకు గురువులు తొడ మెలిపెట్టుట, కోదండములు వేయించుట మున్నగు శిక్షలు విధించెడివారు. సాధారణముగా దేవాలయములు, మసీదులు, విద్యాకేంద్రములుగా ఉండేవి.
(ఐ) ఋణ పత్రములు: ఋణములు తీసుకొనుట, ఋణ పత్రములు వ్రాసి ఇచ్చుట మొదలగునవి ఆనాడు వాడుకలో ఉండెను. ఋణపత్రములను మ్రానిపట్టపై ఒకవిధమగు పసరుతో వ్రాసెడివారు.
(జె) శకునములు, విశ్వాసములు: నాటి ప్రజలకు శకునములపై విశ్వాసము కలదు. నంబి బ్రాహ్మణుడు, పాము, చెవులపిల్లి దుశ్శకునములనియు, గ్రద్ద మంచి శకునమనియు వారి విశ్వాసము. ఏదైనా కీడు కలిగినపుడు భూతములకు శాంతి చేసినచో, దోష నివారణమగునని వారి విశ్వాసము. ఎరుకసాని సోదియందునూ వారికి నమ్మకము
కలదు.
(కె) చలివేంద్రములు: వేసవి కాలములో చలివేంద్రములు ఏర్పాటు చేయబడుచుండెను. నాటి చలివేంద్రములలో మంచినీటితో పాటు మజ్జిగ, గంజి కూడా బాటసారులకు దాహము తీర్చుకొనుటకు ఇచ్చేవారు.
B. ఆర్థిక పరిస్థితులు: గోల్కొండ సుల్తానులు వ్యవసాయము, వర్తక వ్యాపారములను వృద్ధిచేసిరి.
(ఎ) వ్యవసాయము, పంటలు: గోల్కొండ సారవంతమైన తీర భూములతోను, అటవీ సంపదతోను కూడియున్న రాజ్యము. ఔరంగజేబు పేర్కొనినట్లు గోల్కొండ రాజ్యములో “సాగులో లేని భూమి లేదు”. గోధుమ, వరి, జొన్న, రాగి, సజ్జ, పప్పు ధాన్యములు అపారముగా పండుచుండెను. వ్యాపార పంటలైన ప్రత్తి, పొగాకు (దీనిని పోర్చుగీసువారు ప్రవేశపెట్టిరి) ఆదాయముల ద్వారా విదేశీ మారక ద్రవ్యము లభించేది. మామిడి, అరటి, నిమ్మ, దానిమ్మ, నారింజ, అనాస, జామ మున్నగు పండ్లు విరివిగా పండింపబడెను.
(బి) పరిశ్రమలు: గోల్కొండ రాజ్యము వ్యవసాయమునకే కాక పరిశ్రమలకు కూడా ప్రసిద్దికెక్కెను. ఒక మొగలు చిత్రకారుడన్నట్లు హైదరాబాద్ లో ఉన్న కళాకారులు, వ్యాపారులు, శ్రామికుల వివరములు తెలుపవలెనన్న అవి ఒక గ్రంథమగును.
1) నేతపని అభివృద్ధి దశయందుండెను. వివిధ రకములు బట్టలు (సన్ననివి, ముతకవి) తయారుచేయబడుచుండెను. ఓరుగల్లు సన్నని నూలు బట్టలు తయారీకి; మచిలీపట్టణము కలంకారీ అద్దకపు పరిశ్రమకు వాసికెక్కెను. కలంకారీ అద్దక వస్త్రములకు విదేశములలో కూడా మంచి గిరాకీ ఉండెను.
2) నిర్మల్, ఇండోర్ (నిజామాబాద్) సమీపమున ఉన్న ఇందల్వాయీలవద్ద ఖడ్గములు, బాకులు, బల్లెములు తయారుచేయబడినట్లు థీవ్ నాట్ రచనలను బట్టి తెలియుచున్నది. అవి భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేయబడుచుండెను.
3) కొండపల్లి, నరసాపురము దారు పరిశ్రమకు ప్రసిద్ధికెక్కెను. నరసాపురము వద్ద నౌకలు నిర్మింపబడుచుండెను. భారతీయులేగాక పోర్చుగీసువారు కూడా ఇచట నౌకలను తయారుచేయించుకొనెడివారు. ‘గ్లోబ్’ అను పేరుగల ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ నౌక కూడా ఇచటనే తయారుచేయబడినట్లు ఆ కంపెనీ ఉద్యోగియైన ష్కోరర్ (Schorer) తెలిపియున్నాడు.
4) ఖమ్మం మెట్టు సమీపంలో ఉన్న నల్గొండ వద్ద నీలిమందు తయారుచేయబడి ఎగుమతి అగుచుండెను.
5) మచిలీపట్టణంలో తుపాకీ మందు తూటాలు తయారుచేయబడుచుండెను. ఇచట లభించు తెరచాప దూలములు నాణ్యమైనవి. గోల్కొండ రాజ్యములో మొత్తం 23 గనులు కలవు. వానిలో సీసము, ఇనుము గనులు కూడా కలవు. గోల్కొండ ఉక్కు విదేశాలలో సైతం వాసికెక్కెను. ప్రపంచ ఖ్యాతినార్జించిన డమాన్కస్ కత్తులు గోల్కొండ ఉక్కుతో చేయబడినవే.
6) గోల్కొండ వజ్రపు గనులకు ప్రసిద్ధి. నాడు వజ్రములు సంచుల ద్వారా లెక్కింపబడుటను బట్టి అవి ఎంత సమృద్ధిగా లభించెడివో విశిదమగును. ఆంధ్రప్రాంతములోని కొండపల్లి, నరసాపురముల వద్ద, కర్ణాటక ప్రాంతములోని కంధికోట కొల్లూరుల వద్ద వజ్రముల త్రవ్వకము ముమ్మరముగా సాగుచుండెను. కర్ణాటక ప్రాంతములలోని వజ్రపు గనులలో ఇరవైవేలకు పైగా శ్రామికులు పనిచేయుచుండెడివారు.
(సి) వర్తక, వ్యాపారములు: విదేశీయుల రాకతో దేశీయ, విదేశీయ వాణిజ్యములు పతాకస్థాయికి చేరుకున్నవి. మచిలీపట్టణము విదేశీ వాణిజ్యమునకు కేంద్రముగా ఉండెను. ఈ విషయములో నేటి బొంబాయికి గల స్థానము నేటి మచిలీపట్టణమునకు కలదు. అరకాన్, పెగూ, టెనన్సరియమ్, మలయా ద్వీపకల్పము, సింహళము, మాల్దీవులు, తుర్కి స్థానము, అరేబియా, పర్షియా, ఐరోపాఖండ దేశములలో విదేశీ వాణిజ్యము జరుగుచుండెను. ముడి పదార్థములు, ఆహారపదార్థములు, నూలు బట్టలు మున్నగునవి ఎగుమతి అగుచుండెను. మిరియాలు, చందనపు చెక్క, శిల్కు, చక్కెర, కస్తూరి, లక్క, గాజుసామానులు దిగుమతి అగుచుండెను. 34% ఎగుమతి, దిగుమతి సుంకములు వసూలు చేయబడుచుండెను. దేశీయ వ్యాపారములో గోల్కొండ నగరము గొప్ప వ్యాపార కేంద్రముగా విలసిల్లెను. రత్నములకు, వజ్రములకు, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములకు గోల్కొండ వ్యాపార కేంద్రముగా ఉండెను.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
రుద్రమదేవి విజయాలు
జవాబు:
ఆంధ్రదేశాన్ని పాలించిన మొట్టమొదటి స్త్రీ పాలకురాలు రుద్రమదేవి లేక రుద్రాంబ క్రీ.శ. (1262 – 1296) గణపతిదేవునికి కొడుకులు లేనందున తన వారసురాలిగా తన కుమార్తె రుద్రమదేవిని నియమించాడు. ఈమె కాలంలో ఈమె స్త్రీ అన్న చులకన భావంతో యాదవులు, చోళులు, పాండ్యులు, కాకతీయ రాజ్యంపై దండెత్తగా, రుద్రమదేవి వారి దాడులను తిప్పికొట్టింది. పురుష వేషం ధరించి రాజధర్మాన్ని సమకాలీన రాజుల కంటే గణనీయంగా నిర్వహించింది. ఉదార పరిపాలన ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఈమెకు కుమారులు లేనందున తన కూతురు కొడుకైన రెండవ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని అతనికి రాజ్యాన్ని అప్పగించింది. రుద్రమదేవి కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించి ఈమె పాలనను కొనియాడాడు. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని సమర్ధవంతంగా పాలించిందని, ఆమె పరిపాలనా వ్యవస్థ ఆదర్శవంతంగా సాగిందని మార్కోపోలో పేర్కొన్నాడు.
ప్రశ్న 2.
రుద్రమాంబ (రుద్రమదేవి)
జవాబు:
ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు రుద్రమదేవి. ఈమె గణపతిదేవుని కుమార్తె. ఈమె భర్త చాళుక్య వీరభద్రుడు. ఈమెను సమర్థించి, పరిపాలనలో సహకరించి, విశ్వాస పాత్రుడుగా పనిచేసిన వారిలో రేచెర్ల ప్రసాదిత్యుడు ముఖ్యుడు. ఇతనికే కాకతీయ ‘రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు ఉన్నది.
గణపతిదేవునికి కొడుకులు లేనందున తన వారసురాలిగా తన కుమార్తె అయిన రుద్రమదేవిని నియమించాడు. రుద్రమదేవి స్త్రీ అని, ఆమె సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి నిరాకరించి, ధిక్కరించిన వారిని ఈమె అణచివేసింది. కాయస్థ నాయకుడు జన్మిగ దేవుడు, అతని తమ్ముడైన త్రిపురారి అంతరంగిక తిరుగుబాట్లను అణచివేయడంలో ఈమెకు అండగా నిలిచినారు. రుద్రమదేవి సైన్యాలు కడప, వేంగీ, తీరాంధ్రంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. రుద్రమదేవి ‘రాయగజకేసరి’ అనే బిరుదును ధరించింది. యాదవ రాజులు ఈమె శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసి తెలుగుదేశంపై దండెత్తారు. రుద్రమదేవి సైన్యాలు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయి.
ఈమె ప్రజాహితపాలన చేసింది. అనేక చెరువులు, కాలువలు నిర్మింపచేసింది. కాయస్థ అంబదేవుడు ఈమెకు నమ్మిన సేనాని. కాని రుద్రమదేవి పేరు ప్రతిష్టలు చూసి అసూయచెంది తిరుగుబాటు లేవదీశాడు. జన్మిగ దేవుడు, త్రిపురాంతకుడు ఈమెకు నమ్మిన అధికారులు. వీరి సోదరుడైన అంబదేవుడు కడప జిల్లా నందలూరు ప్రాంతానికి గవర్నర్గా పరిపాలించాడు. ఇతడు అధికార కాంక్షతో రుద్రమదేవికి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారుచేసి గొప్ప తిరుగుబాటును లేవదీశాడు. ఇతని తిరుగుబాటును అణచడానికి వెళ్ళిన రుద్రమదేవి యుద్ధభూమిలో వీరస్వర్గం పొందినట్లు తెలియుచున్నది. రుద్రమదేవికి మగసంతానం లేనందువల్ల తన కుమార్తె కుమారుడైన రెండవ ప్రతాపరుద్రున్ని తన వారసునిగా ప్రకటించింది. ఈమె కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించి ఈమె పాలనను కొనియాడాడు.
ప్రశ్న 3.
రాక్షసి – తంగడి యుద్ధం
జవాబు:
రాక్షసి – తంగడి యుద్ధం క్రీ.శ. 1565లో విజయనగరానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న రాక్షసి తంగడి అను గ్రామాల మధ్య విజయనగర సైన్యాలకు, బహమనీ సైన్యాలకు మధ్య జరిగింది. ఈ యుద్ధంలో విజయనగర సైన్యాలు ఓడి, సర్వనాశనమయ్యాయి. బహమనీ సైన్యాలు రామరాయలను అతిక్రూరంగా హతమార్చాయి. ఈ యుద్ధానంతరం ముస్లిం సైన్యాలు రక్షణ లేని విజయనగరంలో ప్రవేశించి, దోచుకొని, రాజప్రాసాదాలను, ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం పతనమైంది.
ప్రశ్న 4.
విజయనగర రాజుల కాలం నాటి వాస్తు – శిల్పాలు
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప పండితుడు, సాహిత్యప్రియుడు, కళాపోషకుడు. ఎందరో కవులు, పండితులు అతని స్థానములో గౌరవాన్ని పొందారు. ఇతని రచన ఆముక్తమాల్యద పండితుల ప్రశంసలు అందుకొంది. సంస్కృత భాషలో ఉషాపరిణయం అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. ఇతణ్ణి కవులు, పండితులు ‘ఆంధ్రభోజ’ అని కీర్తించారు. ఇతని ఆస్థానంలో ‘అష్టదిగ్గజాలనే’ ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారని ప్రతీతి. వీరిలో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు ముఖ్యులు. పెద్దన మనుచరిత్ర మహోన్నత ప్రబంధ కావ్యం. శ్రీకృష్ణదేవరాయలు వాస్తు-శిల్పకళలను పోషించాడు. ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టాడు. అనేక పాత దేవాలయాలకు మరమత్తులు చేయించాడు. శ్రీకృష్ణదేవరాయలు హంపీలోని విఠలాస్వామి గుడికి, హజరామస్వామి ఆలయానికి మరమత్తులు చేయించాడు. శ్రీకూర్మం, అహోబిలం, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచలం, అమరావతి మొదలైన చోట్ల అనేక ఆలయాలకు మరమత్తులు చేయించాడు. ఉదాహరంగా దానాలు చేశాడు, కానుకలు సమర్పించాడు. ఇతని కాలంలోనే హంపీలో భారీ గణేశ, హనుమాన్, ఉగ్రనరసింహ స్వామి రాతి విగ్రహాలను చెక్కించాడు. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం విజయనగర చరిత్రలో మైలురాయిగా మిగిలింది.
ప్రశ్న 5.
మూడో మహ్మద్ షా
జవాబు:
పదిహేను సంవత్సరముల ప్రాయమున సింహాసనమునకు వచ్చిన మహమ్మద్ కులీ రాజ్యాంగ తంత్రములను దూరదృష్టితోను, నేర్పుతోను నడిపిన దక్షుడు. ఇతని కాలము నాటికి ఆంధ్రదేశమంతయు గోల్కొండ రాజ్యములో చేరియుండెను.
రాజ్యవాప్తి: మహమ్మద్కులీ కాలమున నంద్యాల, గండికోట, కడప, కర్నూలు ప్రాంతములలో అధికభాగము గోల్కొండ రాజ్యములో చేర్చబడెను. ఈశాన్య దిక్కున గంజాం జిల్లా వరకు ఇతని రాజ్యము విస్తరించేను.
విదేశీ సంబంధాలు: ఇతని కాలములో మొగలు చక్రవర్తి అక్బరు నుండి రాయబార సంఘమొకటి గోల్కొండకు రాగా అతడు అక్బరుకు కానుకలిచ్చి పంపెను. పారశీక రాయబారిగా కూడా ఇతని ఆస్థానమును సందర్శించెను.
వర్తక వ్యాపారములు: మహమ్మద్ కులీ వర్తక వ్యాపారములను, పరపతి సంస్థలను పోత్సహించెను. పర్షియా నుండి అనేక వ్యాపార కుటుంబములను రప్పించి హైదరాబాద్లోను, మచిలీపట్టణమునందును, వారికి నివాస సౌకర్యములను కల్పించెను. సుల్తాన్ అనుమతి పొందిన ఆంగ్లేయులు 1611లో మచిలీపట్టణములో వర్తక స్థావరమును నెలకొల్పుకొనిరి.
వాస్తు నిర్మాణము: మహమ్మద్ కులీ గొప్ప వాస్తు నిర్మాత. ఇతడు తన ప్రియురాలగు ఒక హిందూ నర్తకిపేర (బాగ్మతి) భాగ్యనగర్ను నిర్మించెను. తదుపరి ఆ నగరము సుల్తాను కుమారుని పేర (హైదర్) హైదరాబాద్ అని వ్యవహరింపబడెను. హైదరాబాదులో చార్మినార్ (1593), జామామసీదు (1593), చందన మహలు, చికిత్సాలయములు, విశ్రాంతి భవనములు మున్నగువానిని ఇతడు కట్టించెను. మూసీనదికి ఆనకట్ట కట్టించి హైద్రాబాదుకు మంచినీటి వసతి కల్పించెను. ఇతడు తన రాజధాని చుట్టును పండ్ల తోటలు నాటించెను. మహ్మమద్ కులీ పండితుడు, కవి, దానశీలి.
ప్రశ్న 6.
ఫ్రాంకోయిస్ బెర్నియర్
జవాబు:
ఇతడు ఫ్రాన్స్ వాస్తవ్యుడు, వృత్తిరీత్యా వైద్యుడు, గొప్ప చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు. క్రీ.శ. 1656-1668 మధ్యకాలంలో గోల్కొండ రాజ్యంలో పర్యటించాడు. మొగల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడైన దారాషీకోకు ఆస్థాన వైద్యునిగా పనిచేశాడు. ఇతడు భారతదేశంలో పర్యటించిన కాలంలో మొగల్ సామ్రాజ్యంలో, దక్కన్లో ముమ్మరంగా పర్యటించి, తాను చూసిన, విన్న విషయాలను డైరీలో రాశాడు. 1670-71 సంవత్సరంలో ఇతని వివరణలు ‘ట్రావెల్స్ – ఇన్-మొగల్-ఎంపైర్’ అనే గ్రంథంగా ఫ్రాన్స్లో ముద్రించారు. బెర్నియర్ రచనలో ఆనాటి సామాజిక వ్యవస్థ, ఆచారాలు, వ్యవహారాలు, ఆర్థిక స్థితి, వృత్తులు, ఖార్ఖానాలు, చేతి వృత్తులు మొదలైన అంశాలు వర్ణించడమైంది. దక్కన్లో వ్యవసాయమే అధిక ప్రజల ముఖ్య వృత్తిగా పేర్కొన్నాడు. సమాజంలో శ్రీమంతులు, సర్దారులు, పేద ప్రజలు ఉన్నారని రాశాడు.
ప్రశ్న 7.
ఇబ్రహీం కుతుబ్షా
జవాబు:
జంషీద్ మరణానంతరము అతని కుమారుడు సుభాను గోల్కొండ సుల్తాన్ అయ్యెను. కాని విజయనగరములో తలదాచుకొన్న జంషీద్ సోదరుడగు ఇబ్రహీం గోల్కొండపై దాడి వెడలి సుభాను ఆరుమాసముల పాలన అంతమొందించి సింహాసనమధిష్టించెను. గోల్కొండ రాజ్య నిజమైన నిర్మాత ఇబ్రహీం కుతుబ్షా. కుతుబ్షా వంశీయులలో ప్రప్రథమంగా “షా” బిరుదును ధరించినది కూడా ఇతడే.. ఇతడు కడు సమర్థుడు. ఇబ్రహీం ముప్పై సంవత్సరములు రాజ్యమేలి పరిపాలనా వ్యవస్థను పటిష్టమొనర్చెను. దారిదోపిడీ దొంగలను అదుపులో ఉంచి వర్తకాన్ని, పరిశ్రమలను అభివద్ధి పరచెను. పరమత సహనాన్ని పాటించి హిందువుల అభిమానమునకు పాత్రుడయ్యెను. ఆంధ్రభాషా పోషకుడై ఆంధ్రులకు ప్రేమాస్పదుడయ్యెను.
ఇబ్రహీం ఆశయాలు: గోల్కొండ సుల్తానుగా ఇబ్రహీం ఆశయాలేమనగా (ఎ) దారిదోపిడీ దొంగలను పట్టుకొని ‘శిక్షించుట, (బి) పరిపాలనను వ్యవస్థాపితము చేయుట, (సి) రాజ్య విస్తరణ విధానమును విడనాడుట.
యుద్ధములు: ఇబ్రహీం ఆదిలో తనకు ఆశ్రయమిచ్చిన రామరాయలతో స్నేహసంబంధాలను కలిగివుండెను. తదుపరి ఇతని విధానంలో మార్పు వచ్చెను. గోల్కొండను విడిచి వెళ్ళిన జగదేకరావునకు రామరాయలు ఆశ్రయ మొసంగుట ఇబ్రహీంకు ఆగ్రహము కలిగించెను. అదికాక విజయనగర రాజ్య ప్రాబల్యమును దానివలన కలుగు ప్రమాదమును, అతడు గుర్తించెను. విజయగనర ప్రాబల్యమును, బీజాపూర్ రాజ్య విస్తరణను గాంచి ఆందోళన చెందిన ఇబ్రహీం, అహమ్మద్ నగర్ సుల్తాన్తో సంధి చేసుకొనెను. అందుకు ఆగ్రహించి రామరాయలు గోల్కొండపై దాడి జరిపి పానగల్లు, ఘనపురం దుర్గాలను ఆక్రమించెను. అంతట ఇబ్రహీం రామరాయలుపై పగ సాధించుటకు విజయనగరమును నాశనము చేయుటకు దక్కను సుల్తానులను సమైఖ్యపరచి 1565లో రాక్షసితంగడి యుద్ధంలో పాల్గొనెను.
ప్రశ్న 8.
కుతుబ్షాహీల పతనం
జవాబు:
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్హాసన్ తానీషా బ్రాహ్మణ సోదరులైన అక్కన్న, మాదన్నలను సేనాని, ప్రధానమంత్రులుగా నియమించెను. సనాతన ముస్లిం భావాలు, హిందువుల యెడల ద్వేషము గల ఔరంగజేబుకు ఈ నియామకాలు రుచించలేదు.
1) ఔరంగజేబు ఉత్తర హిందూదేశ పరిస్థితులను చక్కబెట్టుకొని, తిరుగుబాటు చేసిన తన కుమారుడు అక్బరును తరుముకొనుచు దక్కన్ వచ్చెను. బీజాపూర్ జయించిన పిమ్మట ఔరంగజేబు గోల్కొండపై దాడికి వెడలెను.
2) 1665-66లో జయసింగ్ నాయకత్వమున, 1679లో దిలీరాఖాన్ నాయకత్వమున, 1685లో యువరాజు ఆజమ్ నాయకత్వమున మొగలులు బీజాపూర్పై దండయాత్రలు జరిపినపుడు, గోల్కొండ సుల్తాన్లు మొగలులకు వ్యతిరేకంగా, బీజాపూర్ సుల్తాన్లకు సాయపడిరి.
3) గోల్కొండ సుల్తాన్ మొగలుల విరోధియగు శివాజీతో స్నేహము చేసి అతనికి సహాయము చేయుట, కర్నాటక దండయాత్రలో శివాజీకి తోడ్పడుట ఔరంగజేబుకు ఆగ్రహము కలిగించెను.
4) 1656లో కుదిరిన ఒప్పందము ప్రకారము చెల్లించవలసిన యుద్ధవ్యయము, కప్పము గోల్కొండ సుల్తాన్ మొగలులకు చెల్లింపలేదు. అదియునుగాక, కర్ణాటకలో మీర్ జుమ్లా జాగీరు భూముల నుండి మొగలులకు రావలసిన ఆదాయమును సుల్తాన్ వసూలుచేసి అనుభవించెను.
5) గోల్కొండ రాజ్య ఐశ్వర్యము ఔరంగజేబును ఆకర్షించెను.
6) తానీషా పరమత సహనము ఔరంగజేబుకు గిట్టలేదు.
7) ఔరంగజేబు సున్నీశాఖకు చెందినవాడు. గోల్కొండ సుల్తాన్ షియాశాఖకు చెందినవాడగుటచే అతని పాలనను అంతమొందించుటకు ఔరంగజేబు సిద్ధపడెను.
8) సామ్రాజ్య కాంక్షపరుడైన ఔరంగజేబు గోల్కొండ రాజ్యమును వశపర్చుకొనుటకు నిశ్చయించెను.
9) వీనికితోడు బీజాపూర్ సుల్తానుపై ఔరంగజేబు జరిపించిన దాడిని అబ్దుల్ హసన్ “తుచ్ఛమైన పిరికిపంద చర్యగా” (a mean minded coward’s act) అభివర్ణించుట ఔరంగజేబు గోల్కొండపై తక్షణ దాడికి ప్రోత్సహించెను.
గోల్కొండ పతనము – అక్టోబర్ 3, 1687: ఈ కారణముల వలన ఔరంగజేబు మొదట తన కుమారుడైన షా ఆలంను (1685, జూలై) గోల్కొండపై దండెత్తుటకు పంపెను. కాని మాల్కేడ్ వద్ద గోల్కొండ సైన్యము మొగలులను అడ్డెను. షాఆలం ఎట్టి విజయములు సాధించలేదు. అంతట అక్టోబరు, 1685లో గోల్కొండ సర్వసేనానియగు మీర్ మహమ్మద్ ఇబ్రహీంకు లంచమిచ్చి అతని సాయముతో షా ఆలం హైదరాబాద్ను ఆక్రమించెను. సుల్తానైన తానీషా హైదరాబాదు వదలి గోల్కొండకు పారిపోయెను. తానీషా, షా ఆలంతో సంధి చేసుకొనెను. ఆ సంధి ప్రకారము:
- అక్కన్న, మాదన్నలను కొలువు నుండి బహిష్కరించుటకు,
- మాల్కేడ్, సేరంలను మొగలులకిచ్చుటకు,
- యుద్ధ నష్టపరిహారము క్రింద ఒక కోటి 20 లక్షల రూపాయలు ఇచ్చుటకు,
- సాలుకు రెండు లక్షల హనులు (Huns) కప్పము క్రింద చెల్లించుటకు తానీషా అంగీకరించెను.
కాని తానీషా అక్కన్న, మాదన్నలను బహిష్కరించుటలో జాప్యము చేయసాగెను. అంతట గోల్కొండ రాణుల ప్రోత్సాహముతో అక్కన్న, మాదన్నలు గోల్కొండ వీథులలో హతులైరి. తానీషా మొగలుల మిత్రుడయ్యెను. షా ఆలం గోల్కొండ కోటలో ఉండెను.
ఔరంగజేబు దాడి: బీజాపూర్ ఆక్రమణ ముగియగానే, ఔరంగజేబు గోల్కొండను సైతము మొగలుల సామ్రాజ్యమున విలీనము చేయదలచి ఫిబ్రవరి 7, 1687లో గోల్కొండపై స్వయముగా దాడిచేసెను. గోల్కొండ కోటలో తానీషా, షా ఆలంల మధ్య రహస్య సమాలోచనలు గ్రహించి ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలంను నిర్భందించెను. తదుపరి గోల్కొండను ముట్టడి చేయడం ప్రారంభించెను. ఈ ముట్టడి 8 నెలలు కొనసాగెను. మొగలు సైన్యమునకు నష్టం కలిగెను. కాని గోల్కొండ దుర్గము ఔరంగజేబు వశము కాలేదు. చివరకు ఔరంగజేబు మాయోపాయముచే అనగా అబ్దుల్లా ఫణియను నౌకరుకు లంచమిచ్చి అక్టోబరు 3, 1687 తెల్లవారుజామున 3 గంటలకు గోల్కొండ తూర్పు ద్వారమును తీయించి కోటలో ప్రవేశించెను. అయినను గోల్కొండ సైనికులు తుదిక్షణము వరకు వీరోచితముగా పోరాడిరి. ఈ పోరాటములో 70 గాయములతో ఏకాకిగా మొగలులతో పోరుసల్పిన అబ్దుల్ రజాక్ లౌరీ అను గోల్కొండ సేనాని ప్రభుభక్తి, వీరోచిత శక్తి గోల్కొండ చరిత్రలో చిరస్మరణీయము. పాతఃకాల విందారగించిన తానీషా బంధీగా దౌలతాబాద్కు పంపబడెను. దీనితో గోల్కొండ మొగలుల వశము అయినది. కుతుబ్షాహీల పాలన అంతరించింది.
ప్రశ్న 9.
నిజాం-ఉల్-ముల్క్
జవాబు:
నిజాం రాజ్యమునకు మూలపురుషుడు నిజాం ఉల్ ముల్క్, ఇతడు 1724 48ల మధ్య నిజాం రాజ్యాన్ని పాలించాడు. అతడి అసలుపేరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. అతనికి చిన్ ఖిలిచ్ ఖాన్ అను మరొక పేరు కలదు. నిజాం ఉల్ ముల్క్ అనేది అతని బిరుదు మాత్రమే. ఇతడు ఆంధ్ర, నైజాం రాజ్యముల చరిత్రలోనేగాక భారతచరిత్రలో కూడా ప్రముఖవ్యక్తి. ఇతడు ‘అసఫ్ జాహి’ బిరుదుతో పాలించినందువల్ల అతని వంశమునకు ‘అసఫ్ జాహి’ పేరు వచ్చింది. ఇతడు మొదట మొగల్ సామ్రాజ్యమునకు దక్కన్ సుబేదారుగా పనిచేసెను. సయ్యద్ సోదరుల పతనంలో ప్రధాన పాత్ర వహించి మొగల్ సామ్రాజ్యమునకు ప్రధానిగా నియమింపబడ్డాడు. 1724లో స్వతంత్రుడై నిజాం రాజ్యమును స్థాపించారు. దానికి హైదరాబాద్ రాజధాని. 1858 వరకు మొగల్ సుబేదారులుగా నిజాంరాజులు పాలించినప్పటికీ వారు సర్వస్వతంత్రులు. నిజాం ఉల్ ముల్క్ స్థాపించిన రాజ్యము 1948లో సైనికచర్య జరిగి ఇండియన్ యూనియన్ హైదరాబాద్ కలిసే వరకు కొనసాగింది.
నిజాం-ఉల్-ముల్క్ పాలనలో జరిగిన ముఖ్య సంఘటనలు:
a) మునిషిన్ గాంప్ సంధి(1728): ఇతడు మహారాష్ట్రుల అధికార విస్తరణను అడ్డుకొనే యత్నములో భాగముగా వారిలో వారికి అంతఃకలహములు సృష్టించి స్వకార్యమును నెరవేర్చుకొనుటకు ప్రయత్నించెను. చివరకు పీష్వా బాజీరావు చేతిలో పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయి సంధికి అంగీకరించెను. ఆ సంధి (1728) ప్రకారము నిజాంచేత, సర్దేశ ముఖి కప్పములు చెల్లించుటకు అంగీకరించి, హామీగా కొన్ని దుర్గములను పీష్వా ఆధీనము చేసేను.
b) వార్నా సంధి: పీష్వాపై త్రియంబక్ రావును ఉసిగొల్పి త్రియంబక్ యుద్ధంలో విఫలమై వారా సంధిని చేసుకొనెను. 1731లో చేసుకున్న వార్నా సంధి ప్రకారం దక్షిణమున నిజాం – ఉల్ -ముల్క్ ఉత్తర హిందూ స్థానమున మహారాష్ట్రులు తమ ప్రాబల్యమును నెలకొల్పుకొనుటకు అంగీకారము కుదిరెను.
c) భోపాల్ యుద్దము (1738): మొగల్ చక్రవర్తికి, నిజాంకు ఉమ్మడి శతృవులైన మహారాష్ట్రులపై కత్తిగట్టిరి. అపుడు 1738 జనవరి నెలలో మహారాష్ట్రులకు నిజాం ఉల్ ముల్క్క భోపాల్ వద్ద జరిగిన యుద్ధంలో నిజాం పూర్తిగా ఓడిపోయెను. అపుడు చేసుకున్న సంధి ప్రకారము మాళ్వా రాష్ట్రమును, చంబల్, నర్మదా నదులు మధ్య దేశమును, యుద్ధ నష్టపరిహారముగా 50 లక్షల రూపాయలను మహారాష్ట్రులకు ఇప్పించుటకు నిజాం అంగీకరించెను.
d) నాదిర్షా దండయాత్ర: క్రీ.శ. 1738లో మొగల్ సామ్రాజ్యముపై నాదిర్షా దండయాత్ర జరిపెను. నాదిర్షా తనను ఎదిరించిన మహ్మద్, నిజాం ఉల్-ముల్క్ ఓడించి ఢిల్లీ చేరుకొనెను. ఆ సందర్భమున నాదిర్షా ఆగ్రహమునకు గురైన ఢిల్లీ పౌరులను నిజాం ఉల్ ముల్క్ కాపాడెను.
e) 1740 లో తన కుమారుడు నాజర్ జంగ్ చేసిన తిరుగుబాటును చాకచక్యంగా అణిచివేసి అతనిని క్షమించెను.
f) సర్కార్, కర్నూల్, ఆర్కాట్ పాలెగాండ్లను తన ఆధీనంలోకి తెచ్చుకొనెను.
మహారాష్ట్రుల దాడుల నుండి తన రాజ్యమును కాపాడుకొనుటకై తూర్పుతీరంలో వ్యాపార కేంద్రాలు నెలకొల్పుతున్న ఫ్రెంచివారితోను, ఆంగ్లేయులతోను వైరుధ్యము వహింపక స్నేహ హస్తమందించాడు. అతని మరణం నాటికి నిజాం రాజ్యం ఉత్తరమున తపతీ నది నుండి దక్షిణమున తిరుచునాపల్లి వరకు, పశ్చిమాన ఔరంగాబాద్ నుండి తూర్పున బంగాళాఖాతం వరకు విస్తరించింది.
ఘనత: ఇతడు గొప్ప రాజనీతిజ్ఞుడు. పరిపాలనాదక్షుడు. అసఫీ కళాపోషకుడు. అతని రాజధాని ఔరంగాబాద్ పదిలక్షల జనాభాతో వర్థిల్లుచుండెను. అది కవి పండితులకు నిలయమై ఉండెను. నిజాం ఉల్ ముల్క్ నిరాడంబరముగా జీవించెడివాడు. దర్బారుకు హాజరగు సమయంలో తప్ప ఎటువంటి ఆభరణములు ధరించేవాడుకాదు. అతడు గొప్ప వితరణ శీలి. గొప్పదాన ధర్మములు చేసేవాడు. మత గురువులను గౌరవంగా ఆదరించేవాడు. డా॥ యూసఫ్ హుస్సేన్ ఇలా వ్రాశాడు. “భారతదేశంలో 18వ శతాబ్ది ప్రథమార్థ భాగమున తన రాజకీయ లక్ష్యములను సఫలీకృతం చేసుకున్న రాజనీతిజ్ఞుడు ఇతడొక్కడే. ఇతడు జన్మతః రాజకీయ లక్షణాలు కలవాడు. గొప్ప యోధుడు. పరిపాలనా దక్షుడు”.
ప్రశ్న 10.
నిజాం-అలీ-ఖాన్ విజయాలు
జవాబు:
నిజాం-ఉల్-ముల్క్ వారసుల్లో నిజాం-ఆలీ ఖాన్ (క్రీ.శ. 1762-1803),నిజాం-సికందర్ (క్రీ.శ. 1803- 1829), నాసిరుద్దాలా (క్రీ.శ. 1829-1857), ఆఫ్ఘలుద్దాలా (క్రీ.శ. 1857-1869), ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ (క్రీ.శ. 1869-1911), 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ (క్రీ.శ. 1911-సెప్టెంబర్ 1948) ప్రముఖులు. వీరి సుదీర్ఘ పాలనలో తెలంగాణా ప్రాంతం దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. హైద్రాబాద్ నగరం ప్రపంచ ఖ్యాతి గడించింది. ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోని అత్యధిక భూభాగాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం నెలకొల్పడమైంది. దక్కన్లో జరిగిన ఆంగ్లో-కర్ణాటక, ఆంగ్లో-మరాఠా యుద్దాల్లో హైద్రాబాద్ నిజాంలు కీలకపాత్ర పోషించారు. ఫ్రెంచి వారితో వీరి స్నేహం కొన్ని అద్భుత విజయాలు చేకూర్చింది. కాని క్రీ.శ. 1768లో నిజాం-ఆలీ- ఖాన్ లార్డ్ వెల్లస్లీ రూపొందించిన సైన్యసహకార ఒప్పందం అంగీకరించాడు. దీంతో నిజాం తన స్వతంత్ర అధికారాలను కొంతమేరకు కోల్పోయాడు. మరాఠాల దాడుల నుంచి, ఇతర శత్రువుల దాడుల నుంచి తన రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడుకోవడానికి నిజాం ఈ ఒప్పందంలో చేరాడు. దీని ప్రకారం హైద్రాబాద్ నగరంలో బ్రిటిష్ సేనలు నిల్పారు. వాటికి అయ్యే ఖర్చులన్నీ చెల్లించడానికి నిజాం అంగీకరించాడు. నిజాం-ఆలీఖాన్ నగదు చెల్లించలేని పక్షంలో సారవంత భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ధారదత్తం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇతని వారసులైన సికందర్ , నాసిరుద్దాలా, అఫ్టలుద్దాలా ఈ సంధి షరతులు అమలుచేశారు. దీంతో కోశాగారంపై అదనపు భారం పడింది. నిజాం· బ్రిటీష్ స్నేహం క్రీ.శ. 1948 వరకు కొనసాగింది. ఆసఫ్జాహీల ప్రధానమంత్రిగా క్రీ.శ. 1853 -1883 మధ్య కాలంలో బాధ్యతలు నిర్వహించిన మొదటి సాలార్జంగ్ ప్రజా సంక్షేమానికై అనేక మహోన్నత సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అతడి భూమిశిస్తు, విద్యా, న్యాయ సంస్కరణలు ప్రజలకు మేలుచేశాయి.
ప్రశ్న 11.
ఉస్మాన్ అలీ-ఖాన్ విజయాలు
జవాబు:
నిజాం ప్రభువులలో ఆఖరివాడు ఉస్మాన్ అలీఖాన్. ఇతని పాలనాకాలంలో రెండు ప్రపంచ యుద్ధములు, భారత స్వాతంత్ర్యము, హైద్రాబాద్ పై పోలీసు చర్య, సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం వంటి అనేక సంఘటనలు జరిగెను. ఇతని కాలమున నిజాం రాజ్యము సర్వతోముఖాభివృద్ధి చెందెను. ఇతడు అనేక పరిపాలన చర్యలు తీసుకొనెను.
- ప్రభుత్వ కార్యాలయములలో అనేకమంది సిబ్బందిని నియమించి ప్రభుత్వ కార్యక్రమములు త్వరితగతిన జరుగునట్లు చేసెను.
- రాష్ట్రాదాయము క్రమబద్దము చేసి అనేక ప్రణాళికలను తయారుచేసెను. ఉస్మాన్సాగర్ నిర్మాణం జరిపినది ఇతడే.
- వ్యవసాయాభివృద్ధికి హిమాయత్ సాగర్, నిజాంసాగర్లను నిర్మించెను.
- అనేక దేశీయ పరిశ్రమలు స్థాపించబడెను. వాటిలో అజాంజాహి మిక్స్, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మొదలగునవి.
- ఇతడు అనేక ప్రజాసంబంధ నిర్మాణములు, విద్యాలయములు, వైద్యాలయములు నెలకొల్పెను.
- సాలార్జంగ్ ప్రారంభించిన పారిశ్రామిక వస్తు ప్రదర్శన క్రమబద్ధంచేసి కొనసాగించెను.
- స్థానిక కేంద్రాలలో అనేక కార్యాలయములు నిర్మాణం జరిపెను.
- పురాతత్వ శాఖను రూపొందించెను.
- నిజాం స్టేట్ రైల్వేను స్థాపించెను.
- మొదటి ప్రపంచ కాలమందు బ్రిటిష్ వారికి అన్నిరకాల సహకారమందించి “మహాఘనత వహించిన” అను బిరుదు ధరించెను.
అస్తమయం: 1948 సెప్టెంబర్ రజాకార్ల అలజడులు నైజాం ప్రాంతంలో ఎక్కువైనాయి. ఫలితంగా భారత ప్రభుత్వం పోలీసు చర్య కలిపి సంస్థానమును ఆక్రమించెను. చివరకు 1950 జనవరి 26న హైదరాబాదు సంస్థానము ఇండియన్ యూనియన్లో కలిసిపోయెను.
లఘు సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
కాకతీయుల శాసనాలు
జవాబు:
- మొదటిసారిగా క్రీ.శ. 956వ సం|| నాటి తూర్పు చాళుక్య రాజు దానార్ణవుని ‘మాగల్లు శాసనం’ కాకత్య గుండ్యన పేరు ప్రస్తావించింది. ఇతడే కాకతీయవంశ మూలపురుషుడు.
- హనుమకొండలోని వేయిస్తంభాల గుడి శాసనము రుద్రదేవుడు స్వతంత్ర్యాన్ని ప్రకటించుకొన్న విషయాన్ని అతని విజయాలను తెలివేస్తుంది.
- కాకతీయ ప్రభువులు, వారి బంధువులు, సేనాపతులు వేయించినారు.
- బయ్యారం శాసనము దీనిని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.
- పాలంపేట శాసనం, ద్రాక్షారామం శాసనము, చందుపట్ల శాసనము మొదలగునవి.
ప్రశ్న 2.
మార్కోపోలో
జవాబు:
మార్కోపోలో వెనిస్ యాత్రికుడు. కాకతీయ రుద్రమదేవి కాలంలో ఇతడు ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని సమర్థవంతంగా పాలించిందని, ఆమె పరిపాలనా వ్యవస్థ ఆదర్శవంతంగా సాగిందని మార్కోపోలో పేర్కొన్నాడు. కాకతీయ రాజ్యములో పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నదని, గోల్కొండ ప్రాంతంలో ప్రజల పరిశ్రమ అభివృద్ధిలో ఉన్నదని, ప్రజలు అప్లైశ్వర్యాలతో తులతూగుచుండేవారని కూడా పేర్కొన్నాడు.
ప్రశ్న 3.
నాయంకర వ్యవస్థ
జవాబు:
కాకతీయులు తమ రాజ్యంలోని భూములను సైనికాధికారులకు పంచిపెట్టారు. వారిని నాయంకరులు అంటారు. వారికిచ్చిన భూమిని నాయకస్థలం లేదా నాయకస్థలవృత్తి అనేవారు. నాయంకర భూములను తీసుకున్న సైనికాధికారులు కొంత సైన్యాన్ని పోషించి రాజుకు అవసర సందర్భాలలో సరఫరా చేయాలి. ఈ పద్ధతి ముస్లిమ్ల జాగీర్దార్ పద్ధతిని పోలి ఉంటుంది. ప్రతాపరుద్రుని కాలంలో 77 మంది నాయంకర్లు ఉండేవారని తెలుస్తున్నది.
ప్రశ్న 4.
పాలంపేట
జవాబు:
రేచర్ల రుద్రుడు పాలంపేటలో ఒక గొప్ప దేవాలయమును నిర్మించెను. ఈ దేవాలయం రూపశిల్పి ‘రామప్ప’. అందుచే దీనికి ‘రామప్ప దేవాలయం’ అని పేరు వచ్చింది. ఈ దేవాలయాలు కాకతీయ శిల్పకళకు పరాకాష్టకు చేరుకున్నాయి. రామప్ప దేవాలయంలో నంది విశిష్టమైనది. రామప్ప గోపుర నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే ఆకులవలె తేలడం ఒక అద్భుతం.
ప్రశ్న 5.
విజయనగర కాలంలో రాష్ట్రపాలన
జవాబు:
పరిపాలన సౌలభ్యం కోసం సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాన్ని రాజ్యమని వ్యవహరించారు. తంజావూర్, మధుర, ఇక్కేరి, చంద్రగిరి, శ్రీశైలం, కొండవీడు మొదలైనవి ముఖ్య రాజ్యాలు. ఈ రాజ్యాధిపతులు ఇంచుమించు స్వతంత్రంగానే వ్యవహరించారు.
రాష్ట్రంలో సీమలు, స్థలాలు, సమితులు, గ్రామాలు పాలన విభాగాలు. సీమకు పారుపత్యగారు, స్థలం మీద గౌడ, కరణం అధికార్లు. గ్రామంలో రెడ్డి, కరణం, తలారి మొదలైన వారుండేవారు.
ప్రశ్న 6.
బహమనీ రాజ్యస్థాపన
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మీద జరిగిన అనేకమైన తిరుగుబాట్లలో ఒకదాని పరిణామమే, బహమనీ రాజ్యస్థాపన. ఈ తిరుగుబాటును దక్కన్ ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసే ఉద్యోగులు జరిపారు. వీరినే ‘సాదాఅమీర్లు’ అనేవారు. వీరు గుజరాత్, దౌలతాబాద్ ప్రాంతాల్లో జిల్లా ఉద్యోగులుగా ఉండే విదేశీ ప్రభు కుటుంబాలవారు. తుగ్లక్ కాలంలో పన్నులు సరిగా వసూలుకానందున, అమీర్లను అదుపులో ఉంచడం కోసం, షిక్టార్లకు ఆజ్ఞలను జారీచేశాడు. అమీర్లలో భయాందోళనలు పుట్టి, వారంతా ఏకమై సుల్తాన్పై తిరగబడ్డారు. వారికి సమర్థుడైన ‘హసన్ గంగూ’ అనే జాఫరాఖాన్ నాయకుడిగా దొరికాడు. గుల్బర్గాను రాజధానిగా చేసుకొని, క్రీ.శ. 1347లో హసన్ గంగూ బహమన్షాను అమీర్లందరూ సుల్తాన్ గా ఎన్నుకోగా, బహమనీ రాజ్యస్థాపన జరిగింది. ‘బహమన్’ చేత ఏర్పాటు చేయబడ్డ సామ్రాజ్యం కాబట్టి, బహమనీ సామ్రాజ్యమని దీనికి పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయం. ఈ వంశంలో మొత్తం 18 మంది సుల్తాన్లు పరిపాలించారు.
ప్రశ్న 7.
మహ్మద్ గవాన్
జవాబు:
గవాన్ పారశీక ప్రభు కుటుంబంలో క్రీ.శ. 1404లో జన్మించాడు. మాతృదేశాన్ని విడిచి, వర్తకం చేసుకుంటూ, 1447లో బీదర్ చేరాడు. రెండో అల్లావుద్దీన్ కొలువులో ఉద్యోగంలో చేరాడు. తెలంగాణా తరల్దార్ తిరుగుబాటు చేయగా, అతనిని బాలకొండ యుద్ధంలో ఓడించి, సుల్తాన్ అభిమానాన్ని పొందాడు. గవాన్ రాజనీతి, యుద్ధనైపుణ్యం ప్రశంసలందుకొన్నాయి. అతని శక్తి సామర్థ్యాలను, సేవలను గుర్తించి మహమ్మదా అతణ్ణి ప్రధానమంత్రిగా నియమించాడు.
అధికారంలోకి వచ్చిన వెంటనే, గవాన్ విజయయాత్రలను జరిపి బహమనీ రాజ్యవిస్తరణకు పూనుకున్నాడు. మాళవ, గోవా, తెలంగాణ, రాజమహేంద్రవరం, కొండవీడు ప్రాంతాలను ఆక్రమించాడు. ఈ సందర్భంలోనే క్రీ.శ.1481లో గవాన్ తీరం వెంబడి కాంచీపురం వరకు దాడి చేశాడు. మార్గమధ్యంలో ఆలయాలను కొల్లగొట్టి అపార ధనరాసులతో తిరిగొచ్చాడు. ఈ విజయాలతో బహమనీ రాజ్యం తపతీ నది నుంచి తుంగభద్రనది వరకు, ఉభయ సముద్రాల మధ్య విస్తరించింది. రాజ్యవిస్తరణ కార్యక్రమంలో ఉన్నప్పుడే గవాన్ ప్రభుత్వాన్ని పటిష్టం చేసే సంకల్పంతో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
ప్రశ్న 8.
మీర్ మహబూబ్ అలీ కాలంలో విద్యాభివృద్ధి
జవాబు:
ఇతడు వైద్యాలయములు, విద్యాలయములు స్థాపించెను. సిటీ కళాశాల ఉస్మానియా వైద్యాలయము, యునాని వైద్యాలయములు స్థాపించెను. మ్యూజియము, జూబ్లీహాలు నిర్మింపబడెను. విద్యావ్యాప్తికి ఇతడు అనేక ప్రాంతాలలో పాఠశాలలు నిర్మించెను.