SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 10th Lesson త్రిజట స్వప్నం Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 10th Lesson త్రిజట స్వప్నం
6th Class Telugu 10th Lesson త్రిజట స్వప్నం Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
 
ప్రశ్న 1.
 చిత్రంలో ఎవరెవరు ఉన్నారు?
 జవాబు:
 చిత్రంలో అన్నాచెల్లెలు ఉన్నారు.
ప్రశ్న 2.
 పాప ఎందుకు బాధపడుతుంది?
 జవాబు:
 పాప తన తండ్రి గురించి బాధపడుతోంది.
ప్రశ్న 3.
 అన్నయ్య చెల్లికి ఎలాంటి మాటలు చెబుతున్నాడు?
 జవాబు:
 అన్నయ్య చెల్లికి ఓదార్పు మాటలు చెబుతున్నాడు.
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
 పాఠంలోని పద్యాల భావం సొంత మాటలలో చెప్పండి.
 జవాబు:
 ఓ స్త్రీలారా ! వినండి. అని త్రిజట చెప్పింది. తను కలగన్నది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయినట్లు, రావణుని రత్న కిరీటాలు నేలపడినట్లు, రాముడు మదించిన ఏనుగు నెక్కి సీతాదేవిని తీసుకొని వెడుతున్నట్లు కలగన్నది. రాముడు, సీత పవిత్రులు. సీతాదేవితో కఠినంగా మాట్లాడవద్దన్నది. ఇటుపైన ఆమె వలన రక్షణ పొందాలన్నది. సీతమ్మను తప్పక రాముడు తీసుకొని వెడతాడని చెప్పింది. తమను కాపాడమని ప్రార్థించింది. రాక్షస స్త్రీలు నిద్రపోయేరు. సీతాదేవి దుఃఖించింది. శ్రీరాముడు బాగున్నాడు. సీతాదేవిని తప్పక తీసుకొని వెడతాడని ‘హనుమ సీతతో చెప్పాడు.

ప్రశ్న 2.
 త్రిజటకు లంకను గురించి ఏమని కల వచ్చిందో రాయండి.
 జవాబు:
 త్రిజటకు కల వచ్చింది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోతున్నట్లు కనిపించింది. రావణుని తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడినట్లు ఆమెకు కలలో కనిపించింది.
ప్రశ్న 3.
 త్రిజట స్వప్నం పాఠ్యభాగ నేపథ్యం రాయండి.
 జవాబు:
 రావణుడు సీతను అపహరించాడు. సీతతో లంకకు చేరాడు. అశోకవనంలో శింశుపా వృక్షం కింద ఆమెను ఉంచాడు. తనకు అనుకూలంగా సీత మనసును మార్చమని రాక్షస స్త్రీలను ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిదురించిన త్రిజట మేల్కొంది. తనకు వచ్చిన కలను గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పింది. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యం.
ప్రశ్న 4.
 కింది పద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
 తనవారు లేనిచోటను
 జనవించుక లేనిచోట, జగడము చోటన్
 అనుమానమైనచోటను
 మనుజుడచట నిలువదగదు మహిలో సుమతీ !
అ) తనవారు అంటే ఎవరు?
 జవాబు:
 తనవారు అంటే తన బంధువులు, తన మిత్రులు.
ఆ) జగడం అంటే ఏమిటి?
 జవాబు:
 జగడం అంటే గొడవ.
ఇ) ఈ పద్యం ఏ శతకంలోనిది?
 జవాబు:
 ఈ పద్యం సుమతీ శతకంలోనిది.
ఈ) మనిషి ఎక్కడెక్కడ నివసించకూడదు?
 జవాబు:
 తనవారు లేనిచోట, చనువు లేనిచోట, గొడవలు జరిగేచోట, అనుమానించే చోట మనిషి నివసించకూడదు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 త్రిజట తోటి రాక్షస స్త్రీలతో సీతాదేవిపట్ల ఎలా నడచుకోవాలని చెప్పింది?
 జవాబు:
 రాముడు పవిత్రాత్మ గలవాడు. సీతాదేవి ఆయన రాణి. కనుక సీతాదేవిని రక్షిస్తున్న రాక్షస స్త్రీలెవ్వరూ కఠినంగా మాట్లాడకూడదు. ఇటుపైన సీతాదేవి వల్లనే రాక్షస స్త్రీలందరూ రక్షించబడాలి. కనుక సీతాదేవిని జాగ్రత్తగా చూడాలని త్రిజట రాక్షస స్త్రీలకు చెప్పింది.

ప్రశ్న 2.
 కవయిత్రి మొల్ల గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
 జవాబు:
 మొల్ల పూర్తి పేరు ఆత్కూరి మొల్ల. ఆమె 16వ శతాబ్దపు కవయిత్రి. ఆమె రామాయణం తెలుగులో రచించారు. ఆమె పద్యాలు సరళంగా, రమణీయంగా ఉంటాయి.
ప్రశ్న 3.
 తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవిని హనుమంతుడు ఏమని ఓదార్చాడు?
 జవాబు:
 శ్రేష్ఠుడైన శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి ఉన్నాడు. వానరులతో కలిసి వస్తాడు. తప్పనిసరిగా ఆమెను తీసుకొని వెడతాడు. అది నిజమని సీతాదేవిని హనుమంతుడు ఓదార్చాడు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 త్రిజట తన కలలో వచ్చిన అంశాలను తోటి వారితో ఎలా వివరించిందో మీ సొంతమాటల్లో రాయండి.
 జవాబు:
 అశోకవనంలో సీతాదేవికి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో త్రిజట తన కలలో వచ్చిన అంశాలను వివరించింది. తను కల కనినట్లు చెప్పింది. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగిపోయింది. తమ ప్రభువు తలలపై ప్రకాశించే రత్న కిరీటాలు నేలపై పడ్డాయి. రాముడు ఆనందంగా ఉన్నాడు. మదించిన ఏనుగును శ్రీరాముడు ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతను శ్రీరాముడు తీసుకొని వెడుతున్నాడు. అని వివరించింది.
ప్రశ్న 2.
 త్రిజట సీతను ఎలా ఓదార్చింది? ఆ తరువాత ఏం జరిగిందో వివరించండి.
 జవాబు:
 త్రిజట “అమ్మా ! మీరు భయపడవద్దు. మనసులో ఆనందం నింపుకో ! నీ భర్త వచ్చి నిన్ను త్వరలో తీసుకొని వెళతాడు. నీవే మమ్ములనందరిని రక్షించాలి” అని సీతను ఓదార్చింది. ఆ తరువాత రాక్షస స్త్రీలందరూ నిద్రపోయారు. అప్పుడు హనుమంతుడు మానవ భాషలో “సీతమ్మ తల్లీ ! రాముడు క్షేమంగా ఉన్నాడు. వానర సైన్యంతో త్వరలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఈ మాటలు నిజం” అని చెప్పి సీతను ఓదార్చాడు.
ప్రశ్న 3.
 రాష్ట్రస్థాయి ఆటలపోటీకి ఎన్నికై గెలుపు గురించి ఆందోళన చెందుతున్న మీ మిత్రుడికి ధైర్యం చెబుతూ లేఖ రాయండి.
 జవాబు:
| లేఖ కర్నూలు, ప్రియమైన ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను. నీవు రాష్ట్రస్థాయి ఆటలపోటీకి ఎన్నికైనందుకు అభినందనలు. జిల్లాస్థాయిలో నెగ్గినవాడికి రాష్ట్రస్థాయిలో నెగ్గడం పెద్ద కష్టమేం కాదు. దీని గురించి ఆందోళన చెందకు. నీ పట్టుదల, కృషి మాకు తెలుసు. పట్టుదలతో కృషి చేస్తే దేనినైనా సాధించవచ్చనే మన తెలుగు ఉపాధ్యాయుల మాటలు మరచిపోకు. మన వ్యాయామ ఉపాధ్యాయులు జాతీయస్థాయి క్రీడా విజేత. ఆయన పర్యవేక్షణలో అపజయం ఉండదు. నీ ఆత్మవిశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది. ధైర్యంతో ఆడు. విజయం సాధించు. నీ పేరు టి.వి.లోనూ, పేపర్లలోనూ మార్ర్మోగాలి. ఉంటాను. నీ విజయగాథతో రిప్లై రాయి. ఇట్లు, చిరునామా: | 
భాషాంశాలు
అ) కింద గీతగీసిన మాటలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యం రాయండి.
 ఉదా : ఆ చెట్టు కింద ఉన్న ఇంతి సీతాదేవి.
 ఇంతి = స్త్రీ
 మసం స్త్రీలను గౌరవించాలి.
1. రావణుని తల పైనున్న కోటీరం నేలపై పడింది.
 కోటీరం = కిరీటం
 ప్రజాస్వామ్యంలో రాచరికాలు కిరీటాలు లేవు.
2. ఈ ఉర్వి పై మనమంతా నివసిస్తున్నాము.
 ఉర్వి = భూమి
 ఈ భూమిని జాగ్రత్తగా కాపాడాలి.
3. సీతాదేవి భర్త అయిన రాఘవుడు వస్తాడు.
 రాఘవుడు = శ్రీరాముడు
 శ్రీరాముడు ధర్మ స్వరూపుడు.
4. శ్రీరాముడు లెస్సగా ఉన్నాడు,
 లెస్స = బాగు
 అన్ని భాషలలోకీ తెలుగుభాష బాగుగా ఉంటుంది.

ఆ) కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్ధం వచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాలను గుర్తించి రాయండి.
 ఉదా :
 భూమిపై మనం నివసిస్తున్నాం. ఈ ధరణిలో మనతోపాటు అనేక ప్రాణులున్నాయి.
1. సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు. శ్రీరాముని గురించి వినగానే సీతమనసు ఎలమితో పొంగిపోయింది.
 జవాబు:
 సంతోషం , ఎలమి
2. గురువు చెప్పిన మాట వినాలి. ఆ ఉక్తి మనకు మేలు చేస్తుంది.
 జవాబు:
 మాట, ఉక్తి
3. చంద్రుడి కాంతి మనకు ఆనందాన్నిస్తుంది. ఆ వెలుగు ప్రకృతిని కూడా పరవశింప జేస్తుంది…
 జవాబు:
 కాంతి, వెలుగు
4. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిపై కరుణ చూపాలి. మనం చూపే దయ వారికి ఆ బాధను తగ్గిస్తుంది.
 జవాబు:
 కరుణ, దయ
ఇ) కింది పదాలకు ప్రకృతి, వికృతులను జతపరచి రాయండి.
 భాష, అమ్మ, నిద్ర, బాస, అంబ, నిదుర
 జవాబు:
 ప్రకృతి – వికృతి
 ఉదా : భాష – బాస
 అంబ – అమ్మ
 నిద్ర – నిదుర
వ్యాకరణాంశాలు
ఈ) కింది పదాలను విడదీయండి.
 ఉదా : శుద్ధాత్ముడు = శుద్ధ + అత్ముడు
 రామాలయం = రామ + ఆలయం
ఉదా : రవీంద్రుడు = రవి + ఇంద్రుడు
 2. కవీంద్రుడు = కవి + ఇంద్రుడు
ఉదా : భానూదయం = భాను + ఉదయం
 3. గురూపదేశం = గురు + ఉపదేశం
ఉదా : పితౄణం = పితృ + ఋణం
 4. మాతౄణం = మాతృ + ఋణం
పై మాటలలో ఈ కింది మార్పు జరిగింది.
 1. అ + ఆ = ఆ
 2. ఇ + ఇ = ఈ
 3. ఉ + ఉ = ఊ
 4. ఋ + ఋ = ఋ
 ‘అ-ఇ-ఉ-ఋ’ అనే వర్ణాలకు అవే వర్ణాలు (సవర్ణాలు) కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని ‘సవర్ణదీర్ఘ సంధి’ అంటారు.
 ‘అ’ వర్ణానికి ‘అ ఆ’ లు సవర్ణాలు.
 ‘ఇ’ వర్ణానికి ‘ఇ ఈ’ లు సవర్ణాలు .
 ‘ఉ’ వర్ణానికి ‘ఉ-ఊ’ లు సవర్ణాలు.
 ‘ఋ’ వర్ణానికి ‘ఋ ఋ’ లు సవర్ణాలు.
పైన సంధి జరిగిన పదాలు సంస్కృత పదాలు / సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను ‘సంస్కృత సంధులు’ అంటారు.

ఉ) కింది పదాలను విడదీయండి.
ఉదా : విద్యార్థి = విద్యా + అర్థి = (ఆ + అ = ఆ)
 1. కవీశ్వరుడు = కవి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ)
 2. కోటీశ్వరుడు = కోటి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ)
 3. వధూపేతుడు = వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ)
 4. దేవాలయం = దేవ + ఆలయం = (అ + ఆ = ఆ)
ఊ) కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి.
1. సీతకు ఆనందం కలిగింది.
 రామునికి ఆనందం కలిగింది.
 సంయుక్త వాక్యం : సీతారాములకు ఆనందం కలిగింది.
2. త్రిజట బాధపడింది.
 ద్విజట బాధపడింది.
 సంయుక్త వాక్యం : త్రిజట, ద్విజటలు బాధపడ్డారు.
3. మీరు కఠినంగా మాట్లాడకండి.
 మీరు కోపంగా మాట్లాడకండి.
 సంయుక్త వాక్యం : మీరు కఠినంగానూ, కోపంగానూ మాట్లాడకండి.
4. హనుమంతుడు గొప్పవాడు.
 హనుమంతుడు మంచి భక్తుడు.
 సంయుక్త వాక్యం : హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు.
5. అపర్ణ సంగీతం నేర్చుకుంది.
 అపర్ణ నృత్యం నేర్చుకుంది.
 సంయుక్త వాక్యం : అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది.

ఎ) ప్రశ్నార్థక వాక్యం :
 వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానిని ప్రశ్నార్థక వాక్యం అంటారు.
 ఉదా : 1. త్రిజట ఏం మాట్లాడుతుంది ?
 2. సీత ఎందుకు బాధపడింది?
మీరు కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు రాయండి.
 1. హనుమంతుడు ఎవరిని చూశాడు?
 2. త్రిజట తన కల గురించి ఎవరికి చెప్పింది?
 3. సీతాదేవి భర్త పేరేమిటి?
ఏ) ఆశ్చర్యార్థక వాక్యం :
 వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చినట్లైతే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు.
 ఉదా :
 1. ఆహా ! ఎంత బాగుందో !
 2. ఔరా ! సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో !
మీరు కొన్ని ఆశ్చర్యార్థక వాక్యాలను రాయండి.
 1. ఆహా ! అరణ్యం ఎంత పచ్చగా ఉందో !
 2. అబ్బ ! హనుమ ఎంత బలవంతుడో !
 3. ఓహో ! ఇది ఇల్లా ! నందనవనమా !
త్రిజట స్వప్నం కవయిత్రి పరిచయం
కవయిత్రి పేరు : ఆత్కూరి మొల్ల
 కాలం : 16వ శతాబ్దం
 జన్మస్థలం : కడప జిల్లాలోని గోపవరం
 రచనలు : 871 గద్య పద్యాలతో మొల్ల రామాయణం రచించారు. చక్కని పద్యాలతో సరళంగా,రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటకట్టుగొన్న రచయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది.
పద్యాలు – అర్థాలు – భావాలు
1. మ! కలగంటిన్ వినుఁడింతులార! మన లంకాద్వీప మీయబి లో
 పల వ్రాలన్, మన రావణేశ్వరుని శుంభద్రత్నకోటీరముల్
 కలనన్ గూల రఘూద్వహుండెలమితో గంధిద్విపం బెక్కి, యు
 జ్జ్వలకాంతిన్ విలసిల్లుసీతఁ గొనిపోవన్ మిన్నకే నిప్పుడే
 అర్థాలు :
 కంటిన్ = చూచితిని
 ఇంతులు = స్త్రీలు
 అబ్ధి = సముద్రం
 ఈశ్వరుడు = ప్రభువు
 శుంభత్ = ప్రకాశించే
 కోటీరములు = కిరీటాలు
 ఎలమి = సంతోషం
 ద్విపం = ఏనుగు
 ఉజ్జ్వలము = వెలుగునది
 విలసిల్లు = ప్రకాశించు
భావం :
 “ఓ స్త్రీలారా! వినండి. నేను కలగన్నాను. ఆ కలలో లంకాద్వీపం సముద్రంలో మునిగి పోయింది. రావణుని తలలపై ప్రకాశించే రత్నకిరీటాలు నేలపై రాలిపడ్డాయి. రాముడు ఆనందంతో ఉన్నాడు. మదించిన ఏనుగును ఎక్కాడు. కాంతితో ప్రకాశిస్తున్న సీతాదేవిని తీసుకుని వెళుతున్నాడు” అని అప్రయత్నంగా తనకు కలిగిన కలను త్రిజట వివరించింది.

2. క॥ శుద్దాత్ముఁడైన రాముఁడు
 శుద్దాంతపుదేవిఁ గానశుభసూచకముల్
 శుద్ధమయి తోఁచుచున్నవి
 సిద్ధం బీమాట వేదసిద్ధాంతముగాన్
 అర్థాలు :
 శుద్ధాత్ముడు = పవిత్రమైన ఆత్మ గలవాడు
 శుద్ధాంతము = అంతఃపురము
 శుద్ధమయి = పవిత్రమయి
 సిద్ధాంతము = స్థిరమైన నిర్ణయం
 సిద్ధము = న్యాయమైనది
భావం :
 రాముడు పవిత్రమైన ఆత్మ కలవాడు. ఆయన అంతఃపుర రాణి సీతాదేవి కనుక అన్నీ పవిత్రమైన శుభసూచకాలే కనిపిస్తున్నాయి. వేదం యొక్క స్థిరమైన నిర్ణయం లాగా నా మాట న్యాయమైనది.
3. క॥ కావున నిక్కోమలియెడఁ
 గావలి యున్నట్టిమీరు కఠినోక్తులు గా
 నేవియు నాడకుఁ, డిఁక నీ
 దేవియ రక్షింప మనకు దిక్కగు మీఁదన్
 అర్థాలు :
 కావున = కనుక కావలి = కాపలా
 కఠిన + ఉక్తులు – పరుషమైన మాటలు
 ఆడకుడు = మాట్లాడకండి
 దిక్కు = శరణు
 మీదన్ = ఇటుపైన
భావం :
 అందువల్ల సీతాదేవిని రక్షిస్తున్న మీరు కఠినంగా మాట్లాడవద్దు. ఇకమీదట ఈ సీతాదేవి వల్లనే మనం రక్షింపబడతాము.
4. వ|| అని చెప్పి మటియును
 భావం : అని చెప్పి ఇంకా ఇలా అంది.
5. క॥ అమ్మా వెఱవకు మదిలో
 నిమ్ముగ మటి వేడ్క నుండు మిఁక, నీ మగఁడున్
 నెమ్మిగ నినుఁ గొనిపోవును
 మమ్మందఱ మనుపు మమ్మ! మఱవక కరుణన్
 అర్థాలు :
 వెఱవకు = భయపడకు
 మది = మనస్సు
 ఇమ్ముగ = ఆనందంగా
 నెమ్మిగ = ప్రేమగ
 మునుపు = ముందు, పూర్వం
 మనుపుము = బ్రతికించుము
 కరుణన్ = దయతో రక్షించుము
భావం :
 “అమ్మా! భయపడవద్దు. మనసులో ఆనందాన్ని నింపుకుని సుఖంగా ఉండు. నీ భర్త ప్రేమతో నిన్ను తీసుకొని వెళతాడు. తప్పక దయతో మమ్మల్ని కాపాడు.”
6. ఆ|| అనుచు దనుజకాంత లంతంత నెడఁబాసి
 నిదుర వోయి రంత నదరి సీత
 తనకు దిక్కు లేమిఁ దలపోసి దుఃఖింపఁ
 బవనసుతుఁడు మనుజ భాషఁ బలికె
 అర్థాలు :
 దనుజకాంతలు = రాక్షస స్త్రీలు
 ఎడబాసి = విడిచి
 అదరి = భయపడి, ఉలిక్కిపడి
 లేమి = లేకపోవడం
 తలపోసి = ఆలోచించి
 పవనము = గాలి, వాయువు
 సుతుడు = కొడుకు
 పవనసుతుడు = హనుమంతుడు
భావం :
 అంటూ రాక్షస స్త్రీలు దూరంగా జరిగి నిద్ర పోయారు. సీత తనకు సమీపంలో రక్షించేవారు ఎవరూ లేరనే భావనతో దుఃఖించింది. అప్పుడు ఆంజనేయుడు మానవ భాషలో ఇలా పలికాడు.

7. క॥ ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
 డున్నాఁ డిదె కపులఁ గూడి, యురుగతి రానై
 యున్నాఁడు, నిన్నుఁ గొని పో
 నున్నాఁ డిది నిజము నమ్ము ముర్వీతనయా!
 అర్థాలు :
 లెస్స = బాగుగా
 రాఘవుడు = రాముడు
 కపులన్ = కోతులతో
 కొనిపోవుట = తీసుకొని వెళ్లుట
 ఉరుగతి = వేగంగా, గొప్పగా
 ఉర్వి = భూమి
 తనయ = కుమార్తె
 ఉర్వీతనయ : సీతాదేవి
భావం : ఓ సీతమ్మా! శ్రేష్ఠుడైన రాముడు నిన్ను రక్షించడానికి ఉన్నాడు. ఇప్పుడే వానరులతో కలిసి తగిన మార్గంలో వస్తాడు. నిన్ను తీసుకొని వెళతాడు. ఇది నిజం.
