SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 11th Lesson డూడూ బసవన్న Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 11th Lesson డూడూ బసవన్న
6th Class Telugu 11th Lesson డూడూ బసవన్న Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
 
ప్రశ్న 1.
 పై సన్నివేశాలు ఏ పండుగరోజు కనిపిస్తుంటాయి?
 జవాబు:
 సంక్రాంతి పండుగ రోజులలో పై సన్నివేశాలు కనిపిస్తుంటాయి.
ప్రశ్న 2.
 ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు?
 జవాబు:
 సంక్రాంతి పండుగ రోజులలో సుమారు నెలరోజులు హరిదాసు మా ఇంటికి వస్తాడు.

ప్రశ్న 3.
 సంక్రాంతి పండుగరోజు ఇంకా మన ఇంటి ముంగిళ్ళ ముందు ఎవరు కనిపిస్తారు?
 జవాబు:
 సంక్రాంతి పండుగరోజులలో హరిదాసులు, గంగిరెద్దులవాళ్లు, పాములనాడించే వారు, పగటివేషగాళ్లు, చిలక జ్యోతిష్యం చెప్పేవారు, సోదమ్మలు మొదలైన వాళ్లంతా మన ముంగిట కనిపిస్తారు.
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
 మీరు చూసిన లేదా విన్న ఏదైనా కళారూపం గురించి చెప్పండి.
 జవాబు:
 మేము బుర్రకథను చూశాం. బుర్రకథలో ముగ్గురు ఉంటారు. ముగ్గురిలో మధ్య కథకుడు. అతని చేతిలో తంబూరా ఉంటుంది. తంబూరా మీటుతూ కథను నడుపుతాడు. అతనికి అటు, ఇటు ఇద్దరు ఉంటారు. వారిని వంతలు అంటారు. వారిద్దరి చేతిలో డోలకు ఉంటాయి. వారిలో ఒకరు రాజకీయం చెబుతారు. మరొకరు హాస్యం పండిస్తారు. ముగ్గురికి గజ్జెలు ఉంటాయి. తందాన ….. తాన తందనాన… అంటూ సాగుతుంది.
ప్రశ్న 2.
 గంగిరెద్దుల వాళ్ళను చూసినప్పుడు రచయితకు ఎందుకు బాధ కలిగిందో రాయండి.
 జవాబు:
 పాత ఆచారాలు పోతున్నందుకు రచయిత బాధపడ్డాడు. అందచందాలు ఉన్నది గంగిరెద్దాట. ఎంతోమంది రాజులూ, రాణులూ కూడా ఆదరించినది గంగిరెద్దాట. సామాన్య జనాన్ని కూడా సంతోషపెట్టిన ఆట గంగిరెద్దాట. అటువంటి గంగిరెద్దాట కనుమరుగవుతున్నందుకు రచయిత బాధపడ్డాడు.
ప్రశ్న 3.
 బసవయ్య గంగిరెద్దులు ఆడించడం ఎలా నేర్చుకున్నాడు?
 జవాబు:
 బసవయ్య చిన్నతనం నుండీ తండ్రితో ఊరూరా తిరిగాడు. తండ్రిని గమనిస్తూ ఉండేవాడు. ఆయన మాటల్ని, మన పద్ధతుల్ని అనుకరించేవాడు. అలా చిన్నతనం నుండీ గంగిరెద్దాటలోని మెలుకువలన్నీ నేర్చుకొన్నాడు. తన తండ్రి ఎద్దుచేత మోళీ చేయిస్తుంటే బసవయ్య రాండోలు వాయించేవాడు. అలా పూర్తిగా గంగిరెద్దులను ఆడించడం నేర్చుకొన్నాడు.
ప్రశ్న 4.
 కింది గద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి. వీటిలో ప్రత్యేకమైనది కురవంజి. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజి. కురవలు అనేవారు ఏదో వినోదం కోసం ఆరంభించినా క్రమంగా అదే జీవనోపాధి అయింది. వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థలపురాణాలను, పవిత్ర కథలు, గాథల్ని ఆశువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు. యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులిచ్చేవారు. కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెందింది. ఏకపాత్రగా మారి ఎఱుక చెప్పే సోదెగా నేడు మిగిలింది. వారు సోదె చెప్పే విధానం అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది.
అ) జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి?
 జవాబు:
 సమాజ వినోదం కోసం జానపద కళారూపాలు ఏర్పడ్డాయి.
ఆ) కురవంజి ప్రదర్శనలో వేటి గురించి కురవలు చెప్పేవారు?
 జవాబు:
 పుణ్యక్షేత్రాల స్థల పురాణాలు, పవిత్ర కథలు, గాథలను గురించి కురవంజి ప్రదర్శనలో కురవలు చెప్పేవారు.
ఇ) కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది?
 జవాబు:
 కాలక్రమేణా కురవంజి ఏకపాత్రగా మారింది. ప్రస్తుతం ఎఱుక చెప్పే సోదెగా మారింది.
ఈ) పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
 జవాబు:
 జానపద కళారూపాలు ఎక్కడ విస్తరించాయి ?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 “ఎక్కడ ధర్మప్రభువులుంటే అదే మా ఊరు” అని బసవయ్య ఎందుకు అని ఉంటాడు?
 జవాబు:
 బసవయ్య దృష్టిలో ధర్మప్రభువులు అంటే దానగుణం కలవారు. కళాపోషణ చేసేవారు. అటువంటి వారున్నచోట గంగిరెద్దాట ఆడేవారికి లోటుండదు. బియ్యం ఇస్తారు. డబ్బులు ఇస్తారు. బట్టలు ఇస్తారు. గంగిరెద్దుకు మేత పెడతారు. తమకు నివాసం చూపిస్తారు. గంగిరెద్దాట చూసి ఆనందిస్తారు. బహుమతులిస్తారు. కనుక ధర్మప్రభువులున్న ఏ ఊరైనా తమ ఊరేనన్నాడు. గుప్పెడన్నం ఎక్కడ దొరికితే అదే తన ఊరని బసవయ్య ఉద్దేశం. అందుకే అలా అన్నాడు.

ప్రశ్న 2.
 గంగిరెద్దాట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు?
 జవాబు:
 దేవతలలో ఆదిదేవుడు పరమేశ్వరుడు. ఆయన వాహనం నందీశ్వరుడు. ఆ పరమేశ్వరుడే నందీశ్వరుడిచేత గంగిరెద్దాట ఆడించాడంటారు.
ఒకసారి శివలింగాన్ని గజాసురుడు మింగేస్తాడు. శివుడి గురించి పార్వతీదేవి, వినాయకుడు, మొదలైన వారు ఆందోళన చెందుతారు. విష్ణువును ఆశ్రయిస్తారు. విష్ణువు గంగిరెద్దుల నాడించేవానిగా మారతాడు. నందీశ్వరుని చేత గజాసురుని ముందు గంగిరెద్దాటను ఆడిస్తాడు. గజాసురుడు ఏం కావాలో కోరుకోమంటాడు. ఆనందంతో పరమేశ్వరుడు కావాలంటాడు. సరే అంటాడు. గజాసురుని పొట్టను నందీశ్వరుడు తన కొమ్ములతో చీల్చాడు. శివుని తెచ్చాడు.
అలాగే రాజులు, రాణులు కూడా గంగిరెద్దాటను ఆస్వాదించారు. అందుచేత గంగిరెద్దాట చాలా ప్రాచీన కాలం నుండీ ఉంది. గంగిరెద్దును నందీశ్వరునిగా, గంగిరెద్దును ఆడించేవాసిని విష్ణువుగా, అతని భార్యను లక్ష్మీదేవిగా పూర్వం భావించేవారు. గంగిరెద్దు గుమ్మంలో ఆడితే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం.
ప్రశ్న 3.
 గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలుంటాయి? వాటిని ఎలా ఉపయోగిస్తారు?
 జవాబు:
 గంగిరెద్దుల వాళ్ళ దగ్గర డోలు, సన్నాయి ఉంటాయి. డోలును రాండోలు అని కూడా అంటారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి.
 జవాబు:
 ఒక వ్యక్తి గంగిరెద్దు చేత మోళీ చేయిస్తుంటాడు. మరొక వ్యక్తి రాండోలు వాయిస్తుంటాడు. రాండోలు వాయించడ మంటే రెండుచేతులతోనూ రెండు కర్రలు పట్టుకొంటారు. ఒక కర్రతో డోలు చర్మాన్ని రాపాడిస్తారు. మరో కర్రతో రెండోవైపున వరసలు వాయిస్తారు. ఇది గంగిరెద్దు మోళీకి తగినట్లుగా ఉండాలి.
గంగిరెద్దు మోళీ చేస్తుంది. ముంగాళ్లు వంచి ముందుకు నడుస్తుంది. వెనక్కు జరుగుతుంది. ఒంటికాలితో దండం పెడుతుంది. కాదు, ఔను అని తలలో సైగలు చేస్తుంది. రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేస్తుంది. అలుగుతుంది. కోపగించుకొంటుంది. ఆనందంతో చిందులు వేస్తుంది. కోపంతో కాలు దువ్వుతుంది. తోక ఎగబెట్టి రంకెలు వేస్తుంది. ఇలా ఏ పని చెబితే ఆ పనిని చేస్తుంది.
ప్రశ్న 2.
 గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండిపోవడానికి కారణాలు రాయండి.
 జవాబు:
 మారుమూల పల్లెటూళ్లలో కళాపోషణ ఉంటుంది. తోటివారిని ఆదుకొనే మనస్తత్వం ఉంటుంది. ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. వారి దగ్గర పశువులు కూడా ఉంటాయి. అందుచేత పశువుల మేత కూడా ఉంటుంది. తిండిగింజలకు లోటుండదు. భక్తి ఎక్కువ, ఆదరణ ఎక్కువ. గంగిరెద్దుకు, తమ కుటుంబానికి తిండికీ సౌకర్యానికీ, ఆదరణకూ లోటుండదు కనుక గంగిరెద్దుల వాళ్లు పల్లెటూళ్లలోనే ఉంటున్నారు. సాయంత్రం అయితే అందరూ ఇళ్లకు చేరతారు. గంగిరెద్దాటంటే పల్లెటూరి జనానికి ఇష్టం కూడా.

ప్రశ్న 3.
 మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి.
 జవాబు:
 నాకు గొరవయ్యల నృత్య ప్రదర్శన ఇష్టం. ఇది మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురాలలో ప్రసిద్ది చెందిన జానపద కళారూపం. దీనిని మాదాసి కురవలు అనేవారు ప్రదర్శిస్తారు. ఒక చేత్తో పిల్లనగ్రోవి వాయిస్తారు. మరో చేత్తో జగ్గు లేదా డమరుకం వాయిస్తూ మధ్యమధ్యలో వచనాలు పాడుతూ సామూహిక నృత్యం చేస్తారు. వీరు పెట్టుకొనే టోపీ ఖండాంతరాల కావల గల ఆదివాసీ పురాతన సంప్రదాయ నమూన కలిగి ఉంటుంది. వీరు కన్నడంలోనూ తెలుగులోనూ కూడా వచనాలు చెబుతూ అదరకొట్టేస్తారు. మన జానపద కళలకు ఇటువంటి వారే వారసులు.
భాషాంశాలు
అ) కింద గీతగీసిన పదాలకు అర్ధాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
 ఉదా : ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం ఉంటుంది.
 మకాం = నివాసం
 ఎలుకలు బొరియలలో నివాసం ఉంటాయి.
1. రాబర్ట్ వాళ్ళ బామ్మ నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తుంది.
 జవాబు:
 ఆప్యాయం = వాత్సల్యం
 మా ఉపాధ్యాయులు మమ్ము వాత్సల్యంతో చూస్తారు.
2. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడచుకోవాలి.
 జవాబు:
 అనుగుణం = తగినట్లు
 ప్రశ్నకు తగినట్లు జవాబు ఉండాలి.
3. కాలుష్యం ఎక్కువైతే ప్రకృతి అందాలు కనుమరుగు అవుతాయి.
 జవాబు:
 కనుమరుగు = నాశనం
 మానవులలో మంచితనం నాశనం అవుతోంది.
ఆ) కింది పదాలకు సమానార్థక పదాలు (పర్యాయపదాలు) వెతికి రాయండి.
 ఉదా : నదులలో నీరు తియ్యగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది.
 జవాబు:
 ఉదకం : నీరు, జలం
1. సునీల తండ్రి గురవయ్య. వినయ్ జనకుడు స్వామి.
 జవాబు:
 నాన్న = తండ్రి, జనకుడు
2. వృషభం, ఎద్దు, గోవు, ధేనువు, పాదపం.
 పై వాటిలో ‘బసవయ్య’ అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి.
 జవాబు:
 బసవయ్య = వృషభం, ఎద్దు
3. మా విజ్ఞానయాత్ర మాకు ఆనందాన్ని, మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది.
 జవాబు:
 సంతోషం = ఆనందం, సంతసం

ఇ) కింది పదబంధాలకు విశేషార్థాలు చదవండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
 ఉదా : రూపుమాపు = నాశనం చేయు
 మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి.
1. పట్టుకొని వేలాడు = వదిలిపెట్టకుండా ఉండు
 మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడకూడదు.
2. కాలుదువ్వు = తగవుకు సిద్ధపడడం.
 అయినదానికీ, కాని దానికి అందరి మీదా కాలుదువ్వడం మంచిదికాదు.
3. తిలోదకాలివ్వడం = సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం.
 దుర్మార్గానికి తిలోదకాలివ్వడం మంచిది.
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి.
1. మహేశ = మహా + ఈశ = ఆ + ఈ = ఏ
 2. మహోదధి = మహా + ఉదధి = ఆ + ఉ = ఓ
 3. రాజర్షి = రాజ + ఋషి = అ + ఋ = అర్
పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర అ ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదటి అచ్చులుగా ఇ, ఉ, ఋ లు ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వచ్చాయి కదా !
అలాగే కిందనున్న పదాలను విడదీసి రాయండి.
 1. రాజేంద్ర = రాజ + ఇంద్ర = అ + ఇ = ఏ
 2. తిలోదకాలు = తిల + ఉదకాలు = అ + ఉ = ఓ
 3. మహర్షి = మహా + ఋషి = ఆ + ఋ = అర్
పరిశీలించండి.

ఏ, ఓ, అర్ లను గుణములు అంటారు. ఇలా అకారానికి (అ, ఆ) “ఇ, ఉ, ఋ” లు (ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఋ) పరమైతే క్రమంగా ఏ, ఓ, అర్ లు వస్తాయి. దీనినే గుణ సంధి అంటారు.
ఆ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
1. పరోపకారం = పర + ఉపకారం – గుణ సంధి
 2. రమేశ = రమ + ఈశ = గుణ సంధి
 3. జాతీయోద్యమం = జాతీయ + ఉద్యమం – గుణ సంధి
 4. దేవర్షి = దేవ + ఋషి = గుణ సంధి
ఇ) కింది సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
1. సత్యాగ్రహం = సత్య + ఆగ్రహం = సవర్ణదీర్ఘ సంధి
 2. గిరీశుడు = గిరి + ఈశుడు = సవర్ణదీర్ఘ సంధి
 3. గురూపదేశం – గురు + ఉపదేశం = సవర్ణదీర్ఘ సంధి
 4. పిత్రణం = పితృ + ఋణం = సవర్ణదీర్ఘ సంధి
ఈ) కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి.
 1. శైల + అగ్రం = శైలాగ్రం = సవర్ణదీర్ఘ సంధి
 2. ముని + ఇంద్రుడు = మునీంద్రుడు = సవర్ణదీర్ఘ సంధి
 3. మధు + ఉదయం = మధూదయం = సవర్ణదీర్ఘ సంధి

ఉ) కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి.
1. అందచందాలు : అందమును, చందమును
 2. కాలుసేతులు : కాళ్ళును, చేతులును
 3. అన్నదమ్ములు : అన్నయును, తమ్ముడును
కింది విగ్రహ వాక్యాలను ద్విగు సమాస పదాలుగా మార్చి రాయండి.
1. రెండైన చేతులు = రెండు చేతులు
 2. మూడైన మాసాలు = మూడు మాసాలు
 3. ఐదుగురైన పిల్లలు = ఐదుగురు పిల్లలు
ఎ) కింది వాక్యాలను పరిశీలించండి.
1. మీరు లోపలికి రావచ్చు.
 2. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.
 3. మీరు సెలవు తీసుకోవచ్చు.
ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే, అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఉదాహరణకు “మీరు పరీక్ష రాయవచ్చు”. ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి.
1. మీరు ఆటలు ఆడుకోవచ్చు – అనుమత్యర్థక వాక్యం
 2. మీరు భోజనాలు చేయవచ్చు – అనుమత్యర్థక వాక్యం
 3. నీవు లోపలికి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం అలాగే
1. నీకు శుభం కలుగుగాక !
 2. నిండు నూరేళ్ళూ వర్దిల్లు
 3. నీకు మంచి బుద్ధి కలుగుగాక !
ఈ విధంగా ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీరర్థక వాక్యాలు అంటారు. ఆంటోనీ ! నీకు దైవానుగ్రహము కలుగుగాక ! – ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి.
1. నీవు కలకాలం చల్లగా ఉండుగాక ! – ఆశీరర్థక వాక్యం
 2. నీవు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవగు గాక ! – ఆశీరర్థక వాక్యం
 3. నీవు ఉన్నత స్థితికి వచ్చుగాక ! ఆశీరర్థక వాక్యం
ఏ) కింది వాక్యాలు చదివి అవి ఏరకం వాక్యాలో రాయండి.
 1. నాయనా ! వర్ధిల్లు !
 2. రహీమ్ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు.
 3. సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు !
 4. ఎల్విన్ ! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును.
 5. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక !
 6. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిరావచ్చును.
| వాక్యం | వాక్యపు రకం | 
| 1. నాయనా ! వర్ధిల్లు ! | ఆశీరర్థక వాక్యం | 
| 2. రహీమ్ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. | అనుమత్యర్థక వాక్యం | 
| 3. సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు ! | ఆశీరర్థక వాక్యం | 
| 4. ఎల్విన్ ! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. | అనుమత్యర్థక వాక్యం | 
| 5. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక ! | ఆశీరర్థక వాక్యం | 
| 6. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిరావచ్చును. | అనుమత్యర్థక వాక్యం | 

ఐ) జతపర్చండి.
| 1. నువ్వు పద్యం చదివావా? | అ) ఆశీరర్థకం | 
| 2. అల్లరి చేయకండి. | ఆ) ఆశ్చర్యార్థకం | 
| 3. అబ్బో! పువ్వు ఎంత బాగుందో ! | ఇ) ప్రశ్నార్థకం | 
| 4. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక ! | ఈ) నిషేధార్థకం | 
జవాబు:
| 1. నువ్వు పద్యం చదివావా? | ఇ) ప్రశ్నార్థకం | 
| 2. అల్లరి చేయకండి. | ఈ) నిషేధార్థకం | 
| 3. అబ్బో! పువ్వు ఎంత బాగుందో ! | ఆ) ఆశ్చర్యార్థకం | 
| 4. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక ! | అ) ఆశీరర్థకం | 
చమత్కార పద్యం
కప్పను చూసి పాము వణికింది అని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము వణకదు. ఈ సమస్యకు కవి కింది విధంగా పరిష్కారం చూపాడు.
కుప్పలు కావలిగాయగ
 చెప్పులు కర్రయును బూని శీఘ్రగతిం దా
 జప్పుడగుచు వచ్చెడి వెం
 కప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్.
భావం :
 పద్యం చివరిపాదంలో కప్ప దాని ముందరి అక్షరంతో కలిసి వెంకప్ప అయింది. ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకొని కర్రతో బయలుదేరాడు. ఆ వెంకప్పను చూసి ఒక పాము గడగడ వణికిందట.
డూడూ బసవన్న – రచయిత పరిచయం
రచయిత పేరు : రావూరి భరద్వాజ
జననం : 1927 జూలై 5వ తేదీన గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు.
తల్లిదండ్రులు : మల్లికాంబ, కోటయ్య దంపతులు.
ఉద్యోగం : వ్యవసాయం, ప్రెస్సులో ఉద్యోగం, జమీన్ రైతు పత్రికా సంపాదక వర్గంలోనూ, జ్యోతి, సమీక్ష మొదలైన పత్రికలో పనిచేశారు.
రచనలు : విమల – తొలికథ, అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రచించారు.
అవార్డులు : పాకుడు రాళ్లు నవలకు జ్ఞానపీఠ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మీ పౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు. ప్రస్తుత పాఠ్యభాగం ‘జీవన సమరం’ అనే వ్యథార్త జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకొన్నారు.
కఠినపదాలు – అర్థాలు
ప్రభువు = పరిపాలకుడు
 దణ్ణం = దండం
 కనుమరుగు = నశించు
 చందము = విధము
 ప్రాచీనం= పూర్వకాలం
 పుడక = పుల్ల
 గొడ్డుమోతు = సంతానం లేనిది
 ముంగాళ్లు = ముందరి కాళ్లు
 సుబ్బరంగా = శుభ్రంగా
 సాదిక = సారధ్య
 మకాం = నివాసం
 ఉడకేసుకొని = వండుకొని
 ఉత్తరీయం = పైబట్ట (తువ్వాలు, కండువా)
 దాటిపోయింది = వెళ్లిపోయింది

గడి = గంగిరెద్దాడే ప్రదేశం
 దేదీప్యమానంగా = ప్రకాశవంతంగా
 ఘట్టం = సంఘటన
 తిలోదకాలివ్వడం = వదిలేయడం
 గొడ్డు = పశువు
 చిందులు = గంతులు
 మాసం = నెల
 గంగడోలు = ఆవు మెడ దగ్గర మెత్తటి చర్మం
 క్రీడ = ఆట
