SCERT AP Board 6th Class Telugu Textbook Solutions 8th Lesson మేలుకొలుపు Questions and Answers.
AP State Syllabus 6th Class Telugu Solutions 8th Lesson మేలుకొలుపు
6th Class Telugu 8th Lesson మేలుకొలుపు Textbook Questions and Answers
వినడం – ఆలోచించి మాట్లాడడం
 
ప్రశ్న 1.
 చిత్రం గురించి మాట్లాడండి.
 జవాబు:
 చిత్రంలో ఒక చక్రవర్తి, భరతమాత, ఒక కవి, ఒక ఋషి ఉన్నారు. ప్రజలకు జీవన విధానాన్ని తెలిపినవాడు ఋషి. కవి ఆ జీవితాలను చక్కగా జీవించడం, మంచిచెడులు తెలుసుకోవటం చెబుతాడు. రాజు ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాడు. భారతదేశంలోని అన్ని జీవులను ప్రకృతిని కాపాడేది భరతమాత. భరతమాత చేతిలోని జెండా ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణార్పణ చేస్తే వచ్చింది. ఆ జెండాను పింగళి వెంకయ్యగారు రూపొందించారు.

ప్రశ్న 2.
 రాజుల కాలం నాటికి, ఇప్పటికి మన దేశంలో వచ్చిన మార్పు ఏమిటి?
 జవాబు:
 రాజుల కాలంలో రాజు మాటే శాసనం. తనకు తోచింది చేసేవాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజుగారి అధికారాన్ని ప్రజలు భరించవలసిందే. అతని తర్వాత అతని కొడుకు రాజయ్యేవాడు. ఇలా అనువంశిక పాలన కొనసాగేది. ఇప్పుడు మన దేశంలో రాచరికం లేదు. రాజుల పాలన అంతమయ్యింది. ఇప్పుడు ప్రజలే పాలకులను ఓటు ద్వారా ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధుల పరిపాలన నచ్చకపోతే తర్వాత ఎన్నికలలో వారిని దింపేస్తారు. ప్రజల హక్కులను కాపాడడానికి రాజ్యాంగం ఉంది. న్యాయస్థానాలు ఉన్నాయి. ఇపుడు మనదేశంలో ప్రజలకు చాలా హక్కులు ఉన్నాయి.
అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
 ఈ పాఠంలో మీకు నచ్చిన పద్యం గురించి చెప్పండి.
 జవాబు:
 ఈ పాఠంలో ‘కాళిదాసాది’ అనే పద్యం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పద్యంలో భరతమాత యొక్క సమగ్ర స్వరూపాన్ని వర్ణించారు. . ఆమెను కాళిదాసాది మహాకవులను కన్న విద్యావంతురాలిగా వర్ణించారు. కృష్ణదేవరాయల వంటి మహావీరులను, చక్రవర్తులను కన్న వీరమాత భరతమాత అన్నారు. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు కలిగిన పుణ్యాత్మురాలన్నారు. కోహినూరు వంటి వజ్రాలు గల రత్నగర్భగా వర్ణించారు. సద్గుణవతి, పుణ్యవతి, తేజోవతి, దాతృత్వం కలది భరతమాత అని వర్ణించారు కనుక ఈ పద్యం అంటే నాకిష్టం.
ప్రశ్న 2.
 హక్కులకై పోరాడటం గురించి నాలుగు వాక్యాలలో రాయండి.
 జవాబు:
 హక్కులకై పోరాడాలి. సమయము దాటిపోకుండా పోరాడాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తికీ అన్నిటి పైనా అందరిలాగే హక్కులున్నాయి. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా ఫరవాలేదు. హక్కులను సాధించాలి.

ప్రశ్న 3.
 కుసుమ ధర్మన్న కవి గురించి రాయండి.
 జవాబు:
 కుసుమ ధర్మన్న కవి రాజమండ్రిలోని లక్ష్మీవారపు పేటలో జన్మించారు. నాగమ్మ, వీరస్వామి ఆయన తల్లిదండ్రులు. వైద్య విద్వాన్ చదివారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో ఆయన పండితుడు. నిమ్నజాతి ముక్తి తరంగిణీ, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం మొదలైనవి రచించారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు.
ప్రశ్న 4.
 ఈ కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
 అన్నమయములైన వన్నిజీవమ్ములు
 కూడులేక జీవకోటి లేదు
 కూడు తినెడికాడ కులభేదమేలకో
 కాళికాంబ హంసకాళికాంబ
అ) జీవులు దేనిమీద ఆధారపడి బ్రతుకుతాయి?
 జవాబు:
 జీవులు అన్నం మీద ఆధారపడి బ్రతుకుతాయి.
ఆ) కూడు లేకపోతే ఏమి లేదు?
 జవాబు:
 కూడు లేకపోతే జీవకోటి లేదు.
ఇ) అన్నం తినేదగ్గర ఏ భేదం చూపించరాదని కవి అంటున్నాడు?
 జవాబు:
 అన్నం తినేదగ్గర కుల భేదం చూపించరాదని కవి అంటున్నాడు.
ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
 జవాబు:
 పై పద్యంలోని అమ్మవారి పేరేమిటి?
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 దీనజనుల హక్కుల కోసం పోరాడటం నిజమైన స్వర్గమని పిలుపునిచ్చిన కవి గురించి రాయండి.
 జవాబు:
 కుసుమ ధర్మన్న కవి రాజమండ్రిలోని లక్ష్మీవారపు పేటలో జన్మించారు. నాగమ్మ, వీరస్వామి ఆయన తల్లిదండ్రులు. వైద్య విద్వాన్ చదివారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో ఆయన పండితుడు. నిమ్నజాతి ముక్తి తరంగిణీ, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం మొదలైనవి రచించారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు.
ప్రశ్న 2.
 కవి, తన కవితను ఎవరికి అంకితమిస్తానన్నాడు? ఎందుకు?
 జవాబు:
 పరుల ధనాన్ని అపహరించడం మహాపాపం. ఇతరుల గౌరవాన్ని పాడుచేయడం తప్పు. ఇతరుల ప్రాణాలను తీయడం మహాపాతకం. ఇలా ఆలోచించేవారికే కుసుమ ధర్మన్న కవి తన కవితను అంకితమిస్తానన్నాడు.
ఎందుకంటే అటువంటి వారు ధన్యులు. ఇతరులను పీడించకుండా ఉండే అటువంటి వారి వలన దేశంలో శాంతి పెరుగుతుంది.

ప్రశ్న 3.
 భరతమాత దుఃఖానికి కారణం వివరించండి.
 జవాబు:
 భరతమాత తన సంతానం యొక్క దీనత్వాన్ని చూసి దుఃఖిస్తోంది. వారి బాధలను చూసి బాధపడుతోంది. ఆమె దుఃఖానికి కారణం దీనుల కన్నీరు, అంటరానితనం, జాతి భేదాలు, విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం అనే మూడు గర్వాలు కలవారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
 భరతమాత గొప్పతనాన్ని కవి ఏమని వర్ణించాడు?
 జవాబు:
 భరతమాత సకల సద్గుణరాశి. ఆమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరిచేత పొగడ్తలందుకొంటుంది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మనకు భద్రతను కల్గిస్తోంది.
ప్రశ్న 2.
 స్వరాజ్య రథం ఎప్పటిదాకా సాగాలని కవి భావించాడు?
 జవాబు:
 దీనులైన తన సంతానాన్ని చూసి భరతమాత బాధపడుతున్నది. ఆ బాధ తగ్గేవరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఇంకిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి, భరతమాత శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దు కొనేవరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం (విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం) నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.
ప్రశ్న 3.
 కింది కవితను పొడిగించండి.
 జవాబు:
 భరతమాత మా మాత
 జగతినామె పరమ దేవత
 నేత వైరము మాకు రోత
 గాంధీజీ మాకు తాత
 ఆయన స్వాతంత్ర్యోద్యమ
 మారుస్తాం దేశపు తల రాత
భాషాంశాలు
అ) కింద గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
 ఉదా : మగవానితో సమానంగా వెలది ని గౌరవించాలి.
 వెలది = స్త్రీ
 స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.
1. రణం నాశనానికి దారితీస్తుంది.
 రణం = యుద్ధం
 యుద్ధం వలన అనర్థాలెక్కువ.
2. అఘం చేయకూడదు.
 అఘం = పాపం
 ఏ జీవినైన బాధపెట్టడం పాపం.
3. సన్నుతం విని పొంగిపోకు.
 సన్నుతం = పొగడ్త
 పొగడ్తలన్నీ నిజమనుకొంటే గర్వం పెరుగుతుంది.
4. తలపోటు దుర్భరంగా ఉంటుంది.
 దుర్భరం = భరింపరానిది
 భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి.

ఆ) కింద ఇచ్చిన పదానికి సమానార్ధక పదాలు వాక్యాలలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.
1. జనని ప్రేమకు వెలకట్టలేము. బ్రహ్మయైనా మాతకు కొడుకే.
 జవాబు:
 తల్లి = జనని, మాత
2. వెలదిని దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి.
 జవాబు:
 నారి = వెలది, పొలతి
3. తగిన సమయంలో కాలమును అనుసరించి మాట్లాడాలి.
 జవాబు:
 తరుణము = సమయం, కాలం
4. పాతకం చేసేటపుడు ఆ దురితం వల్ల వచ్చే నష్టాలను ఊహించుకోవాలి.
 జవాబు:
 పాపము = పాతకం, దురితం
ఇ) కింది వానిలో ప్రకృతి, వికృతులను జతపర్చండి.
| 1. కవి | అ) విద్య | 
| 2. విద్దె | ఆ) కృష్ణుడు | 
| 3. కన్నడు | ఇ) కయి | 
జవాబు:
| 1. కవి | ఇ) కయి | 
| 2. విద్దె | అ) విద్య | 
| 3. కన్నడు | ఆ) కృష్ణుడు | 
ఈ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.
1. విద్య × అవిద్య
 2. పుణ్యం × పాపం
 3. సద్గుణం × దుర్గుణం
వ్యాకరణాంశాలు
అ) కింది ఖాళీలను పూరించండి.
| సమాస పదం | విగ్రహ వాక్యం | సమాసం పేరు | 
| 1. అక్కాచెల్లెళ్లు | …………………………… | ద్వంద్వ సమాసం | 
| 2. …………………………… | తల్లియును తండ్రియును | …………………………… | 
| 3. తండ్రీకొడుకులు | …………………………… | …………………………… | 
| 4. …………………………… | ధర్మమును, అధర్మమును | ద్వంద్వ సమాసం | 
| 5. పాపపుణ్యాలు | …………………………… | ద్వంద్వ సమాసం | 
జవాబు:
| సమాస పదం | విగ్రహ వాక్యం | సమాసం పేరు | 
| 1. అక్కాచెల్లెళ్లు | అక్కాచెల్లెళ్లు అక్కయును | ద్వంద్వ సమాసం | 
| 2. తల్లిదండ్రులు | తల్లియును తండ్రియును | ద్వంద్వ సమాసం | 
| 3. తండ్రీకొడుకులు | తండ్రియును, కొడుకులును | ద్వంద్వ సమాసం | 
| 4. ధర్మాధర్మములు | ధర్మమును, అధర్మమును | ద్వంద్వ సమాసం | 
| 5. పాపపుణ్యాలు | పాపమును, పుణ్యమును | ద్వంద్వ సమాసం | 
ఆ) కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
1. భరతమాత కవులను కన్నది. భరతమాత కవులను పెంచింది.
 జవాబు:
 భరతమాత కవులను కని, పెంచింది.
2. హక్కులకై పోరాడాలి. హక్కులను సాధించాలి.
 జవాబు:
 హక్కులను పోరాడి, సాధించాలి.
3. దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తితో జీవించాలి.
 జవాబు:
 దేశభక్తిని కలిగి, జీవించాలి.

ఇ) సంధులు:
రెండు పదాల మధ్య సంధి జరిగినపుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ‘ఉ’ ఉంటే అది ఉత్వ సంధి. ‘అ’ ఉంటే అత్వ సంధి, ‘ఇ’ ఉంటే ఇత్వ సంధి.
అత్వ సంధి బహుళం కాబట్టి నాలుగు విధాలుగా సంధిరూపాలు ఏర్పడతాయి.
 ఉదా :
 చూసినప్పుడు = చూసిన + అప్పుడు = న్ + అ + అ = అ
 
 జవాబు:
 
ఈ) కింది అభ్యాసాలు పరిశీలించి రాయండి.
 1. తగినంత = తగిన + అంత
 2. చూసినప్పుడు = చూసిన + అప్పుడు
 3. ఇచ్చినంత = ఇచ్చిన + అంత
 4. చిన్నప్పుడు = చిన్న + అప్పుడు
చమత్కార పద్యం
వంగతోటనుండు వరిమళ్ళలోనుండు
 జొన్నచేలనుండు చోద్యముగను
 తలుపుమూల నుండు తలమీదనుండును
 దీని భావమేమి తిరుమలేశ !
పద్యం చదవగానే – వంగతోటలో, వరిమళ్ళలో, జొన్నచేలలో, తలుపు మూలలో, తల పైన ఉండేది ఏది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ సమాధానం అక్కడే ఉంది. వంగ – తోటలోనే ఉంటుంది. వరి – ‘మళ్ళ’ లోనే ఉంటుంది. జొన్న – ‘చేల’ లోనే ఉంటుంది. తలుపు – ఇంటికి, ‘మూల’నే ఉంటుంది. తల – శరీరానికి ‘మీద’ నే ఉంటుంది.
మేలుకొలుపు కవి పరిచయం
కవి పేరు : కుసుమ ధర్మన్న
జననం : 17.3. 1900న రాజమహేంద్రవరంలోని లక్ష్మివారపు పేటలో జన్మించారు.
తల్లిదండ్రులు : నాగమ్మ, వీరాస్వామి గార్లు.
చదువు : వైద్య విద్వాన్, సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం కలవారు.
రచనలు : నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం మొదలైనవి.
ప్రత్యేకత : దళిత వర్గం నుంచి అతికష్టం మీద చదువుకొని, పైకొచ్చి, ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించారు. చదువుకొనే రోజులలోనే సంఘసంస్కరణాభిలాష గల కందుకూరి వారిచే ప్రభావితం అయ్యారు. భారతరత్న, డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది, అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం తొలి దళిత కవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆయన రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడింది. 1946లో ఆయన స్వర్గస్థులయ్యారు.
పద్యాలు – అర్థాలు – భావాలు
1. సీ॥ కాళిదాసాది సత్కవి పుంగవుల గాంచి
 విద్యావతి యన నేవెలది యొప్పె ?
 రణశూరులగు కృష్ణరాయాదులను గని
 వీరమాత యన నేనారి తనరె?
 నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు గల్గి
 పుణ్యవతియన నేపొలతి నెగడె ?
 కొహినూరు మొదలగు మహిత మణులనీని
 రత్నగర్భయన నేరామ వెలసె ?
తే॥గీ|| నట్టి సద్గుణసంఘాత యఘ విదూర
 సన్నుతవ్రాత విపుల తేజస్సమేత
 బహుళ విఖ్యాత యాచక పారిజాత
 భద్రముల మీకొసగుగాత భరతమాత.
 అర్థాలు :
 సత్కవి పుంగవుడు = మంచి కవులలో శ్రేష్ఠుడు
 పుంగవము = ఎద్దు
 ఆది = మొదలైన
 వెలది = స్త్రీ
 రణము = యుద్ధము
 శూరుడు = వీరుడు
 వీరమాత = వీరులను కన్న తల్లి
 నారి = స్త్రీ
 తనరు = ఒప్పు
 అతుల = సాటిలేని
 పొలతి = స్త్రీ
 నెగడు = అతిశయించు
 మహిత = గొప్పదైన
 రామ = స్త్రీ
 సంఘాత = సమూహం
 అఘము = పాపము
 విదూర = దూరముగా నెట్టునది
 సన్నుతి = పొగడ్త
 వ్రాత = సమూహము
 సమేత = కూడినది
 విఖ్యాతి = కీర్తి
 యాచకులు = భిక్షువులు
భావం :
 సకల సద్గుణ రాశి మన భరతమాత. ఈమె అందరి పాపాలను దూరం చేస్తుంది. అందరూ పొగడ దగినది. గొప్ప తేజస్సు కలది. అనేక విధాలుగా కీర్తి కలది. కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మీకు భద్రతను కల్గిస్తోంది.

2. సీ॥ దీన జాతుల దుర్గతిగని ఘోషిలు భార
 తాంబ దుర్భర దుఃఖమణగు వఱకు
 నిమ్నులు కురియు కన్నీటి మున్నీరు సం
 పూర్ణంబుగా నింకిపోవువలకు
 అస్పృశ్యతాబాడబానల జ్వాల ది
 గంత భూములకు జల్లారువఱకు
 జాతిభేద చ్చిన్న సకలాంగకంబులు
 సంచితాకృతి ధరియించు వఱకు
తే॥గీ॥ ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు
 హైందవుల డెందముల నాశమందు
 వఱకు ప్రథిత మంగళదత్త స్వరాజ్యరథము
 తెంపు సాగింతురే భారతీయ హితులు
 అర్థాలు :
 దుర్గతి = చెడ్డ స్థితి
 దుర్భరము = భరింపరానిది
 అణగు = నశించు
 మున్నీరు = సముద్రము
 బడబానలము = సముద్రంలో ఉండే అగ్ని
 జ్వాల = మంట
 అంగకములు = అవయవాలు
 మదత్రయము = కుల, ధన, విద్యా గర్వములు మూడూ
 డెందము = హృదయము
 ప్రధిత = కీర్తి గల
 దత్త = ఇవ్వబడిన
 ఆకృతి, = ఆకారము
 హితులు = మిత్రులు
భావం :
 దీనులైన తన సంతానాన్ని చూసి బాధపడుతున్నది భరతమాత. ఆ బాధ తగ్గేవరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఇంకిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి, భరతమాత శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దు కొనేవరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం (విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం) నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి.
3. తే॥గీ॥ మేలుకొనుమయ్య తరుణము మించకుండ
 జన్మహక్కులకై పోరుసల్పు మిపుడె
 హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు
 స్వర్గపదమని నమ్ముము స్వాంతమందు
 అర్థాలు :
 తరుణము = సమయము
 పోరు = రణము
భావం :
 ఓ దీనజనుడా! మేలుకో! సమయం దాటిపోనివ్వకు. ఈ దేశంలో పుట్టిన నీకు అన్నింటిపై అందరిలా హక్కులున్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా పరవాలేదు. అదే స్వర్గం. దీనిని హృదయంలో నమ్ము.

4. తే॥గీ|| పరుల ధన మాన ప్రాణ సంపదల ద్రుంచి
 మనుచునుండుట పాతకంబని దలంచు
 వారలెందున ధన్యులు వారికెల్ల
 నంకితమొనర్తు దానినేనధికభక్తి
 దేశమున శాంతి చేకూరి తేజరిలగ
 అర్థాలు :
 మనుట = జీవించుట
 పాతకము = పాపము
భావం :
 ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలు, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడం మహాపాపం అనుకొనేవారు ధన్యులు. మన దేశానికి శాంతి కలిగేలాగా నేనటు వంటి వారికే నా కవిత్వం అంకితం చేస్తాను. కవి జీవించిన కాలంలో స్వాతంత్ర్య పోరాటం దేశమంతా తీవ్రంగా వ్యాపించింది. త్వరలోనే స్వాతంత్ర్యం వస్తుందని కవి నమ్మకం. అయితే ఈ పోరాట స్ఫూర్తి అధికారం మార్పుతో ఆగిపోకుండా దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అసమానతలు అంతమయ్యేవరకు కొనసాగాలని కవి ఈ విధంగా కోరుకున్నాడు.
