Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 4th Lesson జయగీతం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 4 జయగీతం
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలో ఏం జరుగుతున్నది ?
జవాబు:
చిత్రంలో ఉపాధ్యాయురాలు అంబేద్కర్ పటానికి దండవేస్తుంటే పిల్లలు నమస్కరిస్తున్నారు.
ప్రశ్న 2.
ఎవరెవరు ఉన్నారు ? ఇలాంటివి మీ పాఠశాలలో ఏమేమి జరుగుతాయి.
జవాబు:
చిత్రంలో నలుగురు పిల్లలు, ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు.
అందులో ఇద్దరు విధ్యార్థినులు, ఇద్దరు విద్యార్ధులు, ఒక ఉపాధ్యాయురాలు. గోడకు ఆనించి పెద్ద అంబేద్కర్ పటం ఉన్నది.
ఇలాంటివే మా పాఠశాలలో – నవంబర్ 14న బాలల దినోత్సవం జరుగుతుంది. చాచా నెహ్రూ పటానికి దండ వేస్తాము. అలాగే – అక్టోబర్ 2 గాంధీ పుట్టిన రోజు జరుగుతుంది. గాంధీ మహాత్ముని పటానికి దండవేసి వేడుక చేస్తాం.
ప్రశ్న 3.
మీకు తెలిసిన దేశ నాయకుల గురించి చెప్పండి.
జవాబు:
- గాంధీ,
- నెహ్రూ,
- పింగళీ వెంకయ్య,
- టంగుటూరి ప్రకాశం పంతులు,
- సర్దార్ వల్లభాయ్ పరేల్,
- సుభాష్ చంద్రబోస్.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
గేయాన్ని రాగయుక్తంగా, పాడండి.
జవాబు:
ఉపాధ్యాయులు విద్యార్థులచేత గేయాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా పాడించాలి.
ప్రశ్న 2.
నవ భారత సంవిధాన నిర్మాత ఎవరు ?
జవాబు:
డా॥ భీంరావ్ రాంజీ అంబేద్కర్
ప్రశ్న 3.
గేయ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి?
జవాబు:
ఓ అంబేద్కరుడా! నీకు జయము. దళిత జనుల ఉద్దరణ కోసం గొంతెత్తిన నీకు జయము. నువు మానవ మందారము. నువు భారతీయుల పాలిట సూర్యుడవు. రాజ్యాంగ నిర్మాతవు. పీడిత జనుల దుఃఖాన్ని నిర్మూలించి శాంతి ప్రసాదించిన బుద్ధ భగవానుడవు. వేదాలను, వేదాంతాలను (ఉపనిషత్తులను) చదివిన వాడవు.
మనిషి మనిషిగా బ్రతకటమే గొప్ప విషయమని చెప్పిన మహాశయుడవు. అస్పృశ్యతను రూపుమాపి, ఎక్కువ – తక్కువలను సమంచేసిన వాడవు. కుల ప్రశక్తి లేని భారత జాతిని కోరిన బోధి ప్రియవు. జాతీయ సమైక్యతకు, మత ప్రమేయం లేని రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి నీవు ప్రాణమైన సంఘర్షివి. జగతికి స్వేచ్చను, సమతను, సౌభ్రాత్రములను అందించడానికి జన్మంతాం పోరాడిన విప్లవ వీరుడవు.
అంధంకారంలోని జగతికి వెలుగును చూపినవాడవు. అజ్ఞానమనే బురదలో కూరుకుపోయిన జగతికి జ్ఞానమనే సువాసనలను చూపించిన పండితుడవు. కఠినమైన రాళ్ళవంటి జనులకు జీవంపోసిన వాడవు. ఎండిపోయిన మోడులాంటి జీవితాలను చిగురింపచేసి మట్టినుండి మానవులను తీర్చిదిద్దిన కారణజన్ముడవు! ఓ అంబేద్కరుడా! నీకు జయము.
చదవడం – వ్యక్త పరచడం
అ) గేయం ఆధారంగా ప్రాస పదాలు గుర్తించండి.
జవాబు:
మందారా
శోధించి
భాస్కరా
అధిగమించి
పుట్టి
పోటి
పెట్టి
అమ్మ
ఆ) కింది సంభాషణ చదవండి.
మోహన్ : నమస్కారం! గురువుగారూ!
ఉపాధ్యాయుడు : నమస్కారం ! ఎవరూ!
మోహన్ : నేను గురువుగారూ! మీ శిష్యుడు మోహన్ ని.
ఉపాధ్యాయుడు : మోహన్! ఎంత పెద్దవాడవయ్యావ్! ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. గుర్తు పట్టలేకపోయాను. ఇప్పుడేం చేస్తున్నావ్?
అమ్మ : అయ్యా! మీ చలువ వల్ల మోహన్ చదువుకుని బడిపంతులైనాడు. రేపే బడిలో చేరాలి. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం.
ఉపాధ్యాయుడు : నా చలువేముందమ్మా! నీ బిడ్డను చదివించావు. అందుకే ప్రయోజకుడైనాడు.
అమ్మ : ఆ రోజు చదువుకుంటే ఏమొస్తదిలే అనుకొని, మోహన్ని చేపల వేటకు తీసుకువెళ్ళేవాళ్ళం.
ఉపాధ్యాయుడు : అవును ! మోహన్ బడికి రాకపోతే నా మనసు ఊరుకునేది కాదు.
అమ్మ : అవునయ్యా! మీరు మాయింటికి ఎన్నిసార్లు వచ్చేవారో! ఎంతగా బతిమలాడే వారో! నేనే బడికి పంపేదాన్ని కాదు. పైగా విసుక్కొనేదాన్ని. నా మనసు మార్చి బడికి పంపేలా చేసారు. మీరు లేకుంటే నా బిడ్డ ఎందుకూ పనికిరాకుండా పోయేవాడు.
మోహన్ : అవును ! గురువుగారూ! ఆరోజు మీరు చేసిన పని వల్ల నా జీవితం మారిపోయింది. నాలాగా బడి మానేసిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా అలాంటి పిల్లల కోసం పని చేస్తాను. నన్ను ఆశీర్వదించండి.
ఉపాధ్యాయుడు : నాకు చాలా గర్వంగా ఉంది మోహన్. నీ ఆశయం చాలా గొప్పది. మిగిలిన పిల్లలకు కూడా నువ్వు ప్రేరణ కావాలి. నీకు శుభం కలుగుగాక! వెళ్ళిరా నాయనా!
నోట్ : విద్యార్థులచేత పూర్తి సంభాషణను పాత్రోచితముగా చదివించాలి. ఆ తరువాత
కింది వాక్యాలు చదవండి. సంభాషణ ఆధారంగా ఎవరు ఎవరితో అన్నారో రాయండి.
ప్రశ్న 1.
నేను గురువుగారూ !
జవాబు:
మోహన్ ఉపాధ్యాయునితో అన్నాడు.
ప్రశ్న 2.
చేపల వేటకు తీసుకువెళ్ళేవాళ్ళం
జవాబు:
అమ్మ, ఉపాధ్యాయునితో అన్నది.
ప్రశ్న 3.
గుర్తు పట్టలేక పోయాను.
జవాబు:
ఉపాధ్యాయుడు, మోహ” అన్నాడు.
ప్రశ్న 4.
మాయింటికి ఎన్నిసార్లు వచ్చేవారో!
జవాబు:
అమ్మ ఉపాధ్యాయునితో అన్నది.
ప్రశ్న 5.
మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి.
జవాబు:
ఉపాధ్యాయుడు, మోహ’ అన్నాడు.
ఇ) కింది కవితను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
విద్యకొరకు కదలిరా! ఆత్మగౌరవంతో కఠిన దీక్షతో జ్ఞాన సంపదలు సేకరించుకో విద్య లేనిదే జీవితం వృథా ఆనంద జీవనం విద్యతోనే కదా! సోమరిగా గడపవద్దు విద్య కొరకు కదులు ముందు మన బిడ్డలను చదివిద్దాం బ్రతుకు చక్కదిద్దుకుందాం సువర్ణావకాశ మొకటి నీ ముందున్నది తెలుసుకో విద్యకొరకు కదలిరా!
ప్రశ్న 1.
మనం జ్ఞానసంపదను ఎలా సేకరించుకోవాలి ?
జవాబు:
ఆత్మ గౌరవంతో, కఠిన దీక్షతో మనం జ్ఞాన సంపదను సేకరించుకోవాలి.
ప్రశ్న 2.
మనం ఏవిధంగా గడపకూడదు ?
జవాబు:
మనం సోమరిగా గడపకూడదు.
ప్రశ్న 3.
సువర్ణావకాశం అంటే ఏమిటి ?
జవాబు:
బ్రతుకు చక్క దిద్దుకోవడానికి, చదువుకోవడమే సువర్ణావకాశం.
ప్రశ్న 4.
ఈ కవిత దేని గురించి చెపుతున్నది ?
జవాబు:
చదువు గొప్పదనాన్ని గురించి చెపుతున్నది. చదువుకోవటంవల్ల కలిగే లాభాల గురించి చెపుతున్నది.
పదజాలం
అ) గేయం చదవండి. కింది పదాలు – అర్థాలు జతపరచండి.
1. సంవిధానం ( ) అ) పండితుడు
2. తథాగతుడు ( ) ఆ) ఉపనిషత్తులు
3. వేదాంతము ( ) ఇ) వీరుడు
4. యోద్ధ ( ) ఈ) బుద్ధుడు
5. సూరి ( ) ఉ) రాజ్యాంగం
జవాబు:
1. సంవిధానం (ఉ) అ) పండితుడు
2. తథాగతుడు (ఈ) ఆ) ఉపనిషత్తులు
3. వేదాంతము (ఆ) ఇ) వీరుడు
4. యోద్ధ (ఇ) ఈ) బుద్ధుడు
5. సూరి (అ) ఉ) రాజ్యాంగం
ఆ) కింది పదాలు చదవండి. పదాలకు సొంత వాక్యాలు రాయండి.
ప్రశ్న 1.
సూర్యుడు
జవాబు:
సూర్యుడు ఆరోగ్య ప్రదాత.
ప్రశ్న 2.
భారతదేశం
జవాబు:
భారత దేశం ధర్మ భూమి, కర్మ భూమి.
ప్రశ్న 3.
జగతి
జవాబు:
జగతి ధర్మంతో నడుస్తుంది, నడిపిస్తుంది.
ప్రశ్న 4.
భూమి
జవాబు:
భరించే గుణం కలిగింది. భూమి (లేదా)
భూమికి ఓర్పు ఎక్కువ
ప్రశ్న 5.
పంకం.
జవాబు:
‘పంకం’ నుండి పంకజం పుడుతుంది.
(బురద నుండి పద్మం పుడుతుంది)
ప్రశ్న 6.
వేదాంతం
జవాబు:
వేదాంతం ఎప్పటికీ రహస్యమైనదే! (లేదా)
అర్థమయ్యీ, అర్థం కాకుండా ఉండేదే వేదాంతం.
ప్రశ్న 7.
మ్రోళ్ళు / మోదు
జవాబు:
నీరుపోస్తే మోడు చివురిస్తుంది.
చదువుకుంటే బ్రతుకు చివురిస్తుంది.
ప్రశ్న 8.
అంత్య
జవాబు:
తెలుగు పదాలకు అచ్చు అంత్యము
స్వీయరచన
ప్రశ్న 1.
ఎలా బ్రతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు ?
జవాబు:
మనిషి మనిషిగా బ్రతకడమే గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు.
ప్రశ్న 2.
మీ తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థికి నీవు ఏ విధంగా సహాయం చేస్తావు?
జవాబు:
పాఠంలో అర్థంకాని విషయాన్ని మళ్ళీ తనకు అర్థమైన రీతిలో చెప్తాను. చదివే విధానం నేర్పిస్తాను. చక్కని దస్తూరి (వ్రాత) నేర్పిస్తాను. చదవిన దానిని ధారణ చేయిస్తాను. ఒకటికి రెండుసార్లు చూసి మరియు చూడకుండా వ్రాయిస్తాను. అప్పచెప్పుకుంటాను. అన్ని విధాల ఆ వెనుకబడిన విద్యార్థికి మంచి మార్కులు వచ్చేలా సహకరిస్తాను.
ప్రశ్న 3.
భవిష్యత్తులో నీవు ఏమవ్వాలనుకుంటున్నావు? దానికి నీవు ఏంచేస్తావు?
జవాబు:
భవిష్యత్తులో నేను మంచి ఉపాధ్యాయుడనవుదామనుకుంటున్నాను. అందుకునేను ఇప్పటినుండే శ్రమిస్తాను. ఎంతో జ్ఞానాన్ని పొందటానికి ఎన్నో గ్రంథాలు చదువుతాను. ముందుగా మా టీచర్మా ష్టారుగారిని అనుసరిస్తాను. వారి సూచనలు సలహాలు పాటిస్తాను. ఈ విధంగా ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురువునౌతాను.
ప్రశ్న 4.
అంబేద్కర్ గురించి రాయండి.
జవాబు:
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. దళిత జనులను ఉద్దరించిన సూర్యుడు. భూమిమీద సమస్త పీడితజనుల దుఃఖాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించిన బుద్ధుని వంటివాడు. అస్పృశ్యతను రూపుమాపినవాడు. మనిషి మనిషిగా బ్రతకాలని బోధించిన కారణజన్ముడు.
సృజనాత్మకత
ప్రశ్న 1.
బాలకార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి.
జవాబు:
- పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి.
- పని వద్దు – బడి ముద్దు
- పని మానేద్దాం – చదువుకుందాం
- బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం, బాల మేధావులను తయారుచేద్దాం
- పిల్లల చేతికి పనిముట్లు వద్దు – కలం, పుస్తకం ముద్దు.
- తోటకు పూలు అందం. పిల్లలకు చదువు అందం.
ప్రశంస
ప్రశ్న 1.
బాలు వాళ్ళ పక్కింటిలో ఒక ముసలమ్మ ఉంది. ఆమె ఒక రోజు జ్వరంతో లేవలేక మూల్గుతూ ఉంది. విషయం తెలుసుకున్న బాలు వాళ్ళ నాన్న సహాయంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. బాలుని నీవు ఎలా ప్రశంసిస్తావు ?
జవాబు:
బాలూ! నిన్ను నేను అభినందిస్తున్నాను. నిన్న నువ్వు ఎంతో గొప్ప పనిచేశావు. మీ పక్కింటిలో ముసలమ్మను నాన్నగారి సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్ళావటకదా! ఆమెకు జ్వరం తగ్గేలా చేసావట. నువ్వు చేసిన పని మా అందరికీ స్పూర్తి దాయకం. ఈ రోజు తరగతి గదిలో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు అందరూ అభినందనలు చెప్తున్నారు. నీకు నా ప్రత్యేక అభినందనలు.
భాషాంశాలు
ప్రశ్న 1.
కింది పేరాను చదవండి. గీత గీతసిన పదాలను గమనించండి.
జవాబు:
నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ ఒక గదిలో చిన్న, పెద్ద వీణలు వరుసగా ఉన్నాయి. ఒక చోట పిల్లలు అందమైన నృత్యం చేస్తున్నారు. మరొక చోట చక్కని పిల్లన గ్రోవులు కనబడ్డాయి. ఇంకొక చోట పిల్లలు శ్రావ్యమైన పాటలు పాడుతున్నారు. మరొకచోట మృదంగం వాయిస్తున్నారు. నరసింహకు మంచి కచ్చేరీకి వెళ్ళిన అనుభూతి కలిగింది.
విశేషణాలు : నామవాచక గుణాలను తెలియచేసే పదాలను విశేషణాలు అంటారు.
ఆ) ఈ కింది వాక్యాలను చదవండి. సరైన విశేషణాలు రాయండి.
(ప్రాచీన, నల్లని, ఎర్రని, కొత్త, శ్రావ్యమైన)
1. రాము ………………… చొక్కా తొడుక్కున్నాడు.
2. ఆకాశం ……………….. మబ్బులతో ఉంది.
3. జయంతి ……………….. కలం కొన్నది.
4. తోలు బొమ్మలాట ……………….. కళారూపం.
5. స్వర్ణ ……………….. పాట పాడుతుంది.
జవాబు:
1. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు.
2. ఆకాశం నల్లని మబ్బులతో ఉంది.
3. జయంతి కొత్త కలం కొన్నది.
4. తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం.
5. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది.
ఇ) కింది పేరాను చదవండి. గీత గీసిన పదాలను గమనించండి.
అమల ఉదయం నిద్ర లేచింది. కాలకృత్యాలు తీర్చుకున్నది. రాత్రి మిగిలిపోయిన ఇంటిపని పూర్తి చేసింది. అమ్మను అన్నం పెట్టమని అడిగింది. భోజనం చేసింది. పుస్తకాలు సర్దుకుంది. బడికి వెళ్ళింది.
క్రియలు : పనిని తెలియజేసేవి క్రియలు. ఖాళీలను సరైన క్రియతో పూరించండి.
1. తాతయ్య కథ ………………
2. అనూష పుస్తకం ……………………
3. పుస్తకం బల్ల పై ……………………….
4. ఏనుగు చెరుకుగడ ………………………..
5. రవి చిత్రాలు ………………….
జవాబు:
1. తాతయ్య కథ చెప్పాడు
2. అనూష పుస్తకం చదువుతున్నది
3. పుస్తకం బల్ల పై ఉన్నది
4. ఏనుగు చెరుకుగడ తిన్నది
5. రవి చిత్రాలు గీసాడు
ఈ) కింది వాక్యాలు చదవండి.
క్రియా విశేషణాలు : క్రియా పదానికి ముందు కూడా కొన్ని విశేషణాలు వస్తాయి. వాటిని క్రియా విశేషణాలు అంటారు.
ఉదా : “రాము పాట చక్కగా పాడాడు”
ఇందులో ‘పాడాడు’ అనేది క్రియ. ముందున్న ‘చక్కగా’ అనేది క్రియా విశేషణం.
కింది వాక్యాలలో కింది పదాలముందు సరైన విశేషణ పదాన్ని చేర్చి రాయండి.
(గబగబ, వేగంగా, అందంగా, నెమ్మదిగా)
ప్రశ్న 1.
నిషాంత్ …………………. పరుగెడుతాడు
జవాబు:
వేగంగా
ప్రశ్న 2.
సక్రు చెట్టు పైకి …………………….. ఎక్కాడు.
జవాబు:
గబగబ
ప్రశ్న 3.
తేజు – అందంగా.. నాట్యం చేస్తుంది.
జవాబు:
అందంగా
ప్రశ్న 4.
గౌతమ్ ……………………….. నడుస్తున్నాడు.
జవాబు:
నెమ్మదిగా
ధారణ చేస్తాం
ప్రశ్న 1.
ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్టి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్టించునది సమంజస బుద్దిన్
భావం :
జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి. మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి. తెలుసుకున్న ధర్మాన్ని మరవకుండా మంచి బుద్ధితో ఆచరించాలి.
– నన్నయ్య
జవాబు:
విద్యార్థి పద్యాన్ని – భావాన్ని పద విభాగంతో చదవటం నేర్చుకుని, భావయుక్తంగా, అర్థవంతంగా ధారణ చేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. అందులోని నీతిని, విషయాన్ని వంటపట్టించుకోవాలి.
కవి పరిచయం
కవి : బోయి భీమన్న
కాలము : 19-09-1911 నుండి 16-12-2005 వరకు
రచనలు : పాలేరు, కూలిరాజు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధురగీతి (ఖండకావ్యం)
పురస్కారం : పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
విశేషాంశాలు : 1. వీరు కవి, నాటక కర్త, వీరు పద్యం, పాట, వచనం మూడింటిలో సిద్ధహస్తులు. 2. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది వీరి స్వీయ చరిత్ర.
పదాలు – అర్థాలు
భాస్కరా! = సూర్యుడా!
సంవిధానం = రాజ్యాంగం
తథాగతా! = బుద్ధుడా!
వేదాంతము = ఉపనిషత్తులు
మథించి = చిలికి
జగతి = లోకం
శోధించి = పరిశీలించి
మహితము = గొప్పతనము
అస్పృశ్యత = అంటరానితనం
అంత్య = చివర
ఉడిపి = తొలగించి
సౌభ్రాత్రం = సోదరభావం
పంకం = బురద / మట్టి
ఘోళ్ళు = ఆకులు రాలిన చెట్లు
శోధించి = పరిశీలించి
సంఘర్షణ = మదనపడు
నిష్కుల = కులము లేని
చదువు – అర్థం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు.
చిక్కు ప్రశ్న- వివేకవంతమైన జవాబు
అనగనగా ఒక రాజు. ఆ రాజు గారు అరవై ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. “రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను”. ఇదీ రాజు గారి ప్రకటన.
పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు.
“మహారాణిగారికి గుత్తివంకాయకూర తినాలని పించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. కూరలలో మసాలా బాగా వెయ్యి, గుత్తివంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నెకల్లు మీద మసాలా నూరుతున్నాడు. కూర వండక ముందే వాసన గుబాళించేస్తోంది.
వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తోంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకొని నంటవాడి కొడుకు ఆడుకొంటున్నాడు. ఆ నీళ్లుపడి మంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది.
దీన్ని వంటవాడి భార్య చూసింది. “ఓరేయ్! నీకు పొయ్యిదగ్గర ఏం పనిరా? పొయ్యిలో – పడ్డావంటే నీకు చావు మూడుతుంది”. అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది. ఎలాగైతేనేం గుత్తివంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది.” అని కథ చెప్పడం ముగించారు. “కథ బాగా విన్నారుగా! రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ?
ఇది ప్రశ్న. సమాధానం కథలోనే ఉంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి”. అన్నాడు రాజు. పండితులందరూ తలలు గోక్కున్నారు. జవాబును మాత్రం ఒక్క రైనా ఊహించలేకపోతున్నారు. 5వ తరగతి చదివే వెన్నెల కూడా కథను బాగా విన్నది. “రాజుగారూ! నేను జవాబు చెబుతాను” అంటూ పెద్దగా అరిచి చేతులూపింది. జవాబు చెప్పమన్నాడు మహారాజు, మహారాజా! రాణిగారిచ్చిన కాసులు “వెయ్యి నూట పదహారు” అంది వెన్నెల. “శభాష్! చిన్నదానివైనా సరిగా చెప్పావు”. అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు. సింహాసనం మీద కూర్చోపెట్టుకున్నాడు.
“పాపా జవాబు ఎలా చెప్పగలిగావమ్మా?” అని వెన్నెలను అడిగాడు రాజుగారు “జవాబు మీ కథలోనే ఉంది మహారాజా! మసాలా వెయ్యిలో ‘వెయ్యి’ ఉంది. నూరుతున్నాడులో ‘నూరు’ ఉంది. ఏడుస్తోందిలో ఏడు’ ఉంది. ఆరుతున్నాయిలో ‘ఆరు’ ఉంది. మూడుతుందిలో ‘మూడు’ ఉంది. మొత్తం కలిపితే ‘వెయ్యి నూటపదహారు’ అని జవాబు చెప్పింది వెన్నెల. జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు. రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది.
– జానపద కథ