SCERT AP State 7th Class Telugu Textbook Solutions 13th Lesson ఆలోచనం Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu Solutions 13th Lesson ఆలోచనం
7th Class Telugu 13th Lesson ఆలోచనం Textbook Questions and Answers
ఆలోచించండి – మాట్లాడండి
 
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
 మొదటి చిత్రంలోని పిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తూంది?
 జవాబు:
 మొడటి చిత్రంలోని పిల్లలు అనాథలు, దిక్కులేనివారు, వారికి తల్లిదండ్రులు లేరు, పెద్ద పిల్లవాడు చిన్న పిల్లవాడిని ఊరుకోపెడుతున్నాడు. ఆ పిల్లలు బీదవాళ్ళనీ, ఏ దిక్కులేని వారనీ అనిపిస్తోంది. వారు అనాథ బాలురనిపిస్తూంది.
ప్రశ్న 2.
 రెండో చిత్రంలో ఏం జరుగుతోంది? యుద్ధాలు ఎందుకు జరుగుతాయి?
 జవాబు:
 రెండో చిత్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. రాజ్యాలను పాలించే ప్రభువులు, ప్రక్క దేశాలను ఆక్రమించడానికి యుద్దాలు చేస్తారు. అన్నదమ్ములు బంధువులు సైతం, రాజ్యాల కోసం యుద్ధాలు చేస్తారు. కులమత దురహంకారాలతో రాజులు యుద్ధాలు చేస్తారు.

ప్రశ్న 3.
 ఇలాంటి బాధలులేని లోకం కోసం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు?
 జవాబు:
 ప్రపంచంలోని పిల్లలు అందరూ శాంతి, ప్రేమ, సహనం అనే మంచి గుణాలు కలిగి, చెట్టాపట్టాలు వేసుకొని జీవించాలి. విశ్వశాంతి కోసం. మానవులు అందరూ కృషి చేయాలి. నేను కూడా ఆ విశ్వశాంతి యజ్ఞంలో ఓ సమిథగా నిలబడతాను.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
 ఈ గేయాన్ని రాగయుక్తంగా గానం చేయండి.
 జవాబు:
 గేయాన్ని పాటగా పాడడానికి, మీ గురువుగారి సాయంతో ప్రయత్నం చేయండి.
ప్రశ్న 2.
 కవి ఈ గేయం ద్వారా ఎవరిని గురించి చెప్పాడు?
 జవాబు:
- అసంతృప్తి గలవారిని గూర్చి
- భూగోళం పుట్టుక గూర్చి
- మానవరూపం పరిణామం గూర్చి
- సైనికులను గూర్చి
- శ్రమ జీవులను గూర్చి
- నవయుగాన్ని గురించి
- పేదలను గూర్చి
- పసి పాపలను గూర్చి
- కులమత యుద్ధ బాధితులను గూర్చి కవి ఈ గేయంలో చెప్పాడు.

ప్రశ్న 3.
 పాఠంలో కవి ఆవేదనను మీ సొంతమాటల్లో చెప్పండి.
 జవాబు:
- సముద్రం మధ్యలో ఎంతో బడబాగ్ని దాగి ఉంది.
- ఆకాశంలో కనిపించని సూర్యగోళాలు ఎన్నో ఉన్నాయి.
- ఎన్నో సూర్యగోళాలు బద్దలయితే, ఈ భూగోళం ఏర్పడింది.
- ఎన్నో మార్పులు వస్తే ఈ మానవుడు తయారయ్యాడు.
- యుద్ధాల్లో రాజుకోసం ఎందరో సైనికులు మరణించారు.
- ఎంతోమంది శ్రమజీవుల రక్తం త్రాగి, ధనవంతులు తయారయ్యారో?
- తిండిలేనివారు, అనాథలు ఉండని నవయుగం ఎప్పుడు వస్తుందో కదా !
- కరవు కాటకాలు లేని రోజు ఎప్పుడు వస్తుందో కదా !
- పేదల శోకంలో కోపం ఎంతో ఉంది.
- నిద్రించే పసిపాపల అదృష్టం ఎలా ఉంటుందో కదా !
- కులమతాల కొట్లాటలు ఎప్పుడు నశిస్తాయో కదా !
- భారతీయులు ఎప్పుడు తమ బలపరాక్రమాలు ప్రదర్శిస్తారో కదా ! అని కవి ఆవేదన పడ్డాడు.
II. చదవడం – రాయడం
ప్రశ్న 1.
 గేయాన్ని చదవండి. గేయంలోని కొన్ని పదాలు రెండు చిన్న పదాలతో కలిసి ఏర్పడ్డాయి. అలాంటి పదాలను వెతికి రాయండి.
 ఉదా : సముద్రగర్భం , కవి గుండె.
 జవాబు:
- నల్లని ఆకాశం
- సురగోళాలు
- మానవ రూపం
- నర కంఠాలు
- పచ్చినెత్తురు
- నవయుగం
- నిదుర కనులు
- పసిపాపలు
- సుడిగుండాలు
- బలపరాక్రమం
ప్రశ్న 2.
 ఈ గేయం ప్రశ్నలతో ఉన్నది కదా ! వీటిలో, మిమ్మల్ని బాగా ఆలోచించేటట్లు చేసిన ప్రశ్నలు ఏవి? వాటిని రాయండి.
 జవాబు:
- ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో?
- కరవంటూ, కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో?
- పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో?
- అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరం?
 అన్న ప్రశ్నలు నన్ను ఆలోచించేటట్లు చేశాయి.

ప్రశ్న 3.
 కింది వాక్యాలు చదవండి. ఈ భావాలు గల గేయపంక్తుల కింద గీత గీయండి.
 అ) పైకి చల్లగా, ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల, ఎవరికీ కనిపించని అగ్ని దాగి ఉంటుంది.
 జవాబు:
 “ఆ చల్లని సముద్రగర్భం, దాచిన బడబానల మెంతో ”?
ఆ) కులమతాల గొడవలకు, వివక్షలకు ఎంతోమంది గొప్పవారు, మంచివారు బలైపోయారు.
 జవాబు:
 “కులమతాల సుడిగుండాలకు, బలియైన పవిత్రులెందరో?”
ఇ) కరవుకాటకాలు లేని మంచికాలం ఎప్పుడు వస్తుందో?
 జవాబు:
 “కరవంటూ, కాటకమంటూ కనుపించని కాలాలెపుడో“!
ఈ) ‘ఆకలితో బాధపడే పేదల దుఃఖంలో ఎంత కోపం ఉంటుందో?
 జవాబు:
 “ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో”?
4. పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను పూరించండి.
 “భూగోళం ……………………..
 ……………………………………….
……………………………………….
 …………… పరిణామాలెన్నో”
 జవాబు:
 పద్యం పూరించడం :
“భూగోళం పుట్టుక కోసం
 కూలిన సురగోళాలెన్నో?
 ఈ మానవ రూపం కోసం
 జరిగిన పరిణామాలెన్నో”
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) ఈ గేయానికి మీరైతే ఏ పేరు పెడతారు? రెండు కారణాలు రాయండి.
 జవాబు:
 “మేధావి అంతరంగం” – అని నేను ఈ కవితకు పేరు పెడతాను. దాశరథి గొప్ప మేధావి. అభ్యుదయకాంక్షి. ఆయన మనోవేదనే ఈ. కవితగా వచ్చింది. కాబట్టి మేధావి ‘అంతరంగ మథనం’ అని కూడా దీనికి పేరు పెట్టవచ్చు. ఈ గేయానికి ఆలోచనం అని, ప్రశ్న అని కూడా పేర్లు పెట్టవచ్చు.
ఆ) కరవు కాటకాల వల్ల వచ్చే నష్టాలేమిటి?
 జవాబు:
 తినడానికి తిండి ఉండదు. కట్టుకోవడానికి బట్టలు ఉండవు. తిండిలేని వారు రక్తం లేక పాలిపోయి జబ్బుల పాలవుతారు.. ఎండి పీనుగుల్లా మనుషులు తయారవుతారు. ప్రజల ముఖాల్లో సుఖసంతోషాలు ఉండవు. దొంగతనాలు పెరిగిపోతాయి. ప్రజలు ఒకరితో ఒకరు తిండికోసం దెబ్బలాడుకుంటారు. త్రాగడానికి, స్నానం చేయడానికి నీరు దొరకక, పాడిపంటలు ఉండవు.
ఇ) “రాజును గెలిపించడంలో ఒరిగిన నరకంఠాలెన్నో” ఈ వాక్యాన్ని కవి ఎందుకోసం రాశాడు? కవి భావం ఏమిటి?
 జవాబు:
 తమ తమ రాజులను గెలిపించడానికి, ఆ రాజు వద్ద పనిచేసే సైనికులు ప్రాణాలకు తెగించి, కత్తి యుద్దాలతో, తుపాకీ గుండ్లతో పోరాటం చేస్తారు. అందులో ఎవరో ఒక రాజు గెలుస్తాడు. కాని ఆ రాజును గెలిపించడానికి, ఎందరో అమాయకులైన సైనికుల పీకలు తెగి యుంటాయి. గుండు దెబ్బలకు సైనికుల గుండెలు బద్దలయి ఉంటాయి. రాజు జయిస్తే పండుగలు చేసికొంటారు. కాని దానికోసం చచ్చిన సైనికులను గూర్చి, ఎవరూ పట్టించుకోరు అని కవి బాధపడ్డాడు.
ఈ) పేదల కోపాన్ని కవి లావాతో ఎందుకు పోల్చాడు?
 జవాబు:
 అగ్నిపర్వతం బద్దలయితే దాంట్లో నుండి ‘లావా’ అనే ద్రవం బయటకు వస్తుంది. అగ్నిపర్వతం లోపల బాగా మంట మండితేనే, ఆ పర్వతం బద్దలయి, లావా బయటకు వస్తుంది – అలాగే పేదవారి కడుపు బాగా మండితేనే, లావాలా వారి కోపం బయటకు ఎగదన్నుతుందని కవి భావం. లావా అగ్నిపర్వతంలో ఎప్పుడూ ఉంటుంది. కాని లోపల వేడి ఎక్కువయితే ఒక్కసారి పేదవాడి కోపంలా అది బయటకు ఎగదన్నుకు వస్తుంది.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) ఈ గేయం ఆధారంగా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు?
 జవాబు:
 కవి ఈ గేయం రాసేనాటి పరిస్థితులు ఇవి.
- యుద్ధాలు జరుగుతున్నాయి. వాటిలో ఎందరో అమాయకులైన సైనికులు తమ రాజుల కోసం మరణిస్తున్నారు.
- ధనవంతులు శ్రామికులను, కార్మికులను దోచుకు తిని, ధనవంతులు అవుతున్నారు.
- దేశంలో అనాథలు, తిండిలేనివాళ్ళు, కరవు కాటకాలతో బాధపడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
- పేదవారు కోపంతో కసిగా ఉన్నారు. పసిపాపల భవిష్యత్తు మంచిగా లేదు.
- కవుల మనస్సులు గాయపడ్డాయి. కులమతాల చిచ్చులో మంచివారు నలిగిపోయారు. స్వతంత్రం వచ్చినా భారతీయులు, తమ బల పరాక్రమాలను ప్రదర్శించడం లేదు. వారింకా బానిసత్వంలో ఉన్నట్లే ఉంటున్నారు.
ఆ) “కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో?” అని కవి ఆవేదన చెందాడు కదా ! దీన్ని గురించి వివరించండి.
 జవాబు:
 మన భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. ప్రజలు కులమతాల ప్రాతిపదికగా విడిపోతున్నారు. భారతదేశంలో పుట్టిన వారంతా ఒక్కటే. వారంతా భారతీయులు. అటువంటి ఐక్యత నశించి ఒకరిని ఒకరు ద్వేషించుకొంటూ, కొట్టుకుంటూ జీవిస్తున్నారు. అంటరానితనాన్ని పాటిస్తున్నారు. దీనికి సాయం ఓట్ల కోసం, నాయకులు కులమతాల ద్వేషాగ్నిని మండిస్తున్నారు. కులాలకు, మతాలకు రిజర్వేషన్లు అంటూ అల్లర్లు సాగిస్తున్నారు. సాటి మానవులను కొట్టి చంపుతున్నారు. కులమతాలు నిజానికి కూడు పెట్టవు. మానవులందరిలో ఒకే రక్తం ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ‘మానవత’ అనేదే నిజమైన కులమని అందరూ కలసి మెలసి సుఖంగా ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతకాలి.
ఇ) కులమతాలు లేని సమాజంలో ప్రజలందరూ ఎలా ఉంటారో ఊహించి రాయండి.
 జవాబు:
 కులమతాలు లేకపోతే ప్రజలంతా అన్నదమ్ములవలె. కలసిమెలసి ఆనందంగా జీవిస్తారు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ధనికులు పేదలకు సాయం చేస్తారు. బంధువుల్లా ప్రజలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పక్కవాడు తన తోటివాడు అనే ప్రేమభావం వారిలో పొంగిపొర్లుతుంది. అందరూ కలసి పండుగలు చేసుకుంటారు. అందరికీ ఒకే దైవం ఉంటాడు. ప్రజలలో హెచ్చుతగ్గులు భేదభావాలు ఉండవు.. ప్రజలందరూ ఒకే దేవుని బిడ్డలు. అంటే సోదరులు. లోకంలో అన్నదమ్ములు ఎలా ఐక్యతగా ప్రేమభావంతో జీవిస్తారో అలాగే కులమతాలు లేని సమాజంలో ప్రజలు ప్రేమభావంతో, సోదర భావంతో, కలిసిమెలిసి ఆనందంగా, హాయిగా ఉంటారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడ్పడతారు.
IV. పదజాలం
1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు, గేయంలో ఉన్నాయి. వాటిని గుర్తించి ఎదురుగా రాయండి.
 ఉదా : భారతదేశంలో దిక్కులేనివారు ఎందరో ఉన్నారు.
 జవాబు:
 అనాథలు
అ) ఆకలితో అలమటించే వారికోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది.
 జవాబు:
 అన్నార్తులు
ఆ) సముద్రంలో పుట్టే అగ్ని చాలా ప్రమాదకరమయింది.
 జవాబు:
 బడబాగ్ని
ఇ) సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు.
 జవాబు:
 భాస్కరుడు
ఈ) అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడి ద్రవం వల్ల చాలా వినాశనం కలుగుతుంది.
 జవాబు:
 లావా
ఉ) మన పాలపుంతలో ఎన్నో సూర్యగోళాలు ఉన్నాయి.
 జవాబు:
 సురగోళాలు
ఊ) దెబ్బతగిలితే పిల్లలు ఏడుపు ఆపుకోలేరు.
 జవాబు:
 శోకం

2. కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి, వికృతి పదాలు ఉన్నాయి. వాటిని పట్టికలో రాయండి.
అ) రాజరాజు రాజమహేంద్రవరాన్ని పాలించేవాడు. ఆ రాయల ఆస్థానకవి నన్నయ.
 ఆ) సముద్రంలో అలలు ఉంటాయి. సంద్రాలలో చేపలు ఎగసిపడతాయి.
 ఇ) చెట్ల రాపిడిలో అగ్ని పుట్టింది. ఈ అగ్గికి అడవి తగలబడిపోతుంది.
 ఈ) అతని రూపం ఎంతో మనోహరం. ఆ రూపురేఖలు కొందరికే ఉంటాయి.
 ఉ) ఆకాశం నిండా మేఘాలు అలముకున్నాయి. ఆకసం వర్షించడానికి సిద్ధంగా ఉంది.
 ఊ) పోతన భాగవత కబ్బాన్ని రచించాడు. ఆ కావ్యాన్ని దైవానికి అంకితం చేశాడు.
 జవాబు:
 ఉదా : రాజు (ప్రకృతి) – రాయలు (వికృతి)
 ప్రకృతి – వికృతి
 రాజు – రాయడు
 సముద్రం – సంద్రం
 అగ్ని – అగ్గి
 రూపం – రూపు
 ఆకాశం – ఆకసం
 కావ్యం – కబ్బం
 గర్భము – కడుపు
 కంఠము – గొంతు
 అనాథ – అనద
 నిద్రా – నిదుర
 కుండము – గుండము

3. గేయం ఆధారంగా కింది పదాలు వివరించి రాయండి
అ) కానరాని భాస్కరులు అంటే:
 కనబడని సూర్యులు అని అర్థం. ఆకాశంలో ఎన్నో సూర్యగ్రహాలు ఉంటాయి. కాని అవి మనకు కంటికి కనబడవు. అలాగే లోకంలో ఉన్న ఎందరో గొప్పవార్ని మనం గుర్తించలేము. వారంతా సూర్యుని వంటివారు.
ఆ) దాగిన బడబానలం అంటే :
 అంటే కనబడకుండా ఉన్న సముద్రం నీటిలోని బడబాగ్ని. బడబాగ్ని పైకి మనకు కనబడనట్లే, అసంతృప్తి గల మనుష్యుల గుండెల్లో అగ్ని వంటి కోపం ఎంతో దాగి ఉంటుంది.
ఇ) ఒరిగిన నరకంఠాలంటే :
 యుద్ధంలో తెగిపడిన సైనికుల పీకలు. రాజుల కోసం సైనికులు పరస్పరం కంఠాలు ఖండించుకుంటారు.
ఈ) రాయబడని కావ్యాలంటే :
 మనస్సులోని బాధను గ్రంథంగా రాయలేకపోవడం. లోకంలోని అసమానతల్నీ, అక్రమాల్నీ చూచి, ఆ బాధను కవితా రూపంలో పెట్టలేకపోవడం.
ఉ) నవయుగం అంటే : మరో ప్రపంచం, కరవు కాటకాలు, అనాథలు, అన్నార్తులు, పీడితులు లేని క్రొత్త ప్రపంచం అని అర్థం.
V. సృజనాత్మకత
ప్రశ్న 1.
 “ఆలోచనం” గేయ సారాంశం ఆధారంగా వచన కవిత రాయండి.
 జవాబు:
 వచన కవిత
 “సముద్రంలో దాగి యుంటుంది ‘బడబానలం’
 ఆకాశంలో దాగియుంటారు సూర్యసహస్రం
 సురగోళాలు విచ్ఛిన్నం భూగోళం ప్రసన్నం
 పరిణామ బహుళం నేటి మానవాకారం.
 పీకలెన్నో తెగితేనే ఒక రాజు విజయం,
 శ్రామికుల రక్తం త్రాగితేనే డబ్బుమయం.
 అనాథలు, అన్నార్తులు లేనికాలం రావాలి.
కరవు కాటకాలు అదృశ్యం కావాలి.
 అగ్నిపర్వతాల నుండి లావా పొంగుతుంది.
 పేదవారి ఆకల్లోంచి శోకం ఉప్పొంగుతుంది.
 పసిపాపల భవితవ్యం అది అంతా శూన్యం
 గుండె నొచ్చు కవి రాతలు అవి అన్నీ శూన్యం
 కులమతాల సుడిగుండంలో చిక్కారు పవిత్రులు
 దాస్యంలో చిక్కాయి భారతీయ బలశౌర్యాలు”.
ప్రశ్న 2.
 కవి నవయుగాన్ని కోరుకుంటున్నాడు కదా ! మీరు కోరుకునే నవయుగం ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించి రాయండి.
 జవాబు:
 భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీడ ఉండాలి. ప్రతివ్యక్తికి విద్యా, వైద్య సదుపాయాలుండాలి. ప్రతి పల్లెకు రోడ్డు, జద్యుచ్ఛక్తి ఉండాలి. చదువుకున్న వారందరికీ జీవనభృతి దొరకాలి. ఉద్యోగ సదుపాయాలు పెరగాలి. ధనిక పేద తారతమ్యం, కులమతాల భేదం, అంటరానితనం నశించాలి. రైతులు నవ్వుతూ జీవించగలగాలి. కులవృత్తులకు ప్రోత్సాహం లభించాలి. పల్లెలకు అన్ని సౌకర్యాలు ఉండాలి. నగరాలకు వలసలు తగ్గాలి. ఇదే నేను కోరుకొనే నవయుగం. పసిపాపలు నవ్వుతూ ఆనందంగా రోడ్లపై తిరగాలి.
VI. ప్రశంస
ప్రశ్న 1.
 ‘ఆలోచనం’ గేయం మీ తంగితిలో ఎవరు బాగా పాడారు ? ఎవరు బాగా అభినయించారు ? వాళ్ళను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి:
 జవాబు:
| ఒంగోలు, మిత్రుడు రవికుమార్‌కు, / స్నేహితురాలు కవితకు, మిత్రమా ! నీ లేఖ చేరింది. మీ అమ్మానాన్నలు కుశలం అని తలుస్తాను. ఈ మధ్య మా తరగతిలో గేయ పఠనం పోటీలు, అభినయం పోటీలు మా మేష్టారు సుజాత గారు పెట్టారు. గేయ పఠనంలో నా మిత్రుడు ‘రాజా’ మొదటి బహుమతి పొందాడు. నిజంగా వాడు గేయం పాడుతూ ఉంటే, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నట్లు అద్భుతంగా ఉంది. అలాగే అభినయం పోటీల్లో నా స్నేహితురాలు ‘కమల’ అద్భుతంగా నటించింది. కమల ఎప్పటికైనా సినిమాలలో నటిస్తుందని అనుకుంటున్నాను. ఆ రోజు మా తరగతి పిల్లలంతా రాజా, కమలలకు టీ పార్టీ ఇచ్చాము. మా సుజాత మేష్టారు వాళ్ళిద్దరినీ గొప్పగా మెచ్చుకున్నారు. ఉంటా. విశేషాలతో లేఖ రాయి. నీ ప్రియమిత్రుడు / మిత్రురాలు, చిరునామా : K. కవిత, | 
VII. ప్రాజెక్టు పని
1). దాశరథి రచించిన ఇతర రచనలను సేకరించండి.
 (లేదా)
 2) దాశరథి రచనలు, పొందిన అవార్డులు, బిరుదులతో ఒక పట్టిక తయారు చేయండి.
 జవాబు:
 దాశరథి కృష్ణమాచార్య రచనలు, అవార్డులు, బిరుదుల పట్టిక
| రచనలు | అవార్డులు | బిరుదులు | 
| 1) అగ్నిధార | 1) 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి బహుమతి | 1) కవిసింహం | 
| 2) పునర్నవం | 2) 1974లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి | 2) అభ్యుదయ కవితా చక్రవర్తి | 
| 3) రుద్రవీణ | 3) ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ | 3) ఆంధ్రప్రదేశ్, ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు | 
| 4) అమృతాభిషేకం | 4) వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి.లిట్’ | 4) ఆంధ్ర కవితా సారథి | 
| 5) మహాంద్రోదయం | ||
| 6) ఆలోచనాలోచనలు | ||
| 7) గాలిబ్ గీతాలు | ||
| 8) కవితా పుష్పకం | ||
| 9) తిమిరంతో సమరం | ||
| 10) వేయి సినిమాపాటలు | ||
| 11) నేత్ర పర్వం | 
VIII. భాషను గురించి తెలుసుకుందాం
1) కింది వాక్యాలను చదివి, గీత గీసిన పదాలను ఉదాహరణలలో చూపినట్లు విడదీయండి.
అ) చిట్టెలుక చెట్టు రంధ్రంలోకి దూరింది.
 ఉదా : కుట్టుసురు – కులు + ఉసురు
 చిట్టెలుక = చిఱు + ఎలుక
ఆ) కట్టెదుటి అన్యాయాలను ఎదిరిద్దాం.
 ఉదా : కట్టెదురు = కడు + ఎదురు
ఇ) నట్టిల్లు బాగుంది.
 నట్టిల్లు = నడు + – ఇల్లు
ఈ) నిట్టూర్పులతో కాలయాపన చేయవద్దు.
 నిట్టూర్పు : నిడు + ఊర్పు
పైన పేర్కొన్న పదాలు, రెండు విధాలుగా కనబడుతున్నాయి. వాటిలోని పూర్వ, పర స్వరాలను కలిపితే ఎలా. మారుతున్నాయో చూడండి.
 1. ఱు + ఉ = ట్టు
 2. ఱు + ఎ = ట్టె
 3. డు + ఊ = ట్టూ
 4. డు + ఎ = ట్టె
 5. డు + ఇ = ట్టి
గమనిక : అంటే, పూర్వపదం చివర ఉన్న ఐ, డ లకు, అచ్చు పరమైతే ‘మీ’ అంటే, ద్విరుక్త’ట’కారం వస్తున్నది. ‘ కాబట్టి దీన్ని ‘ద్విరుక్తటకార సంధి’ అంటారు.

2) కింది పదాలను విడదీసి సంధిని గుర్తించండి.
 చిట్టడవి = చిఱు + అడవి = ద్విరుక్తటకార సంధి
 నట్టేట = నడు + ఏట = ద్విరుక్తటకార సంధి
3) కింది పదాలను ఉదాహరణలో చూపినట్లు విడదీయండి.
 ఉదా : నట్టనడుమ =నడుమ + నడుమ
1. కట్టకడ = కడ + కడ
 2. ఎట్టెదురు = ఎదురు + ఎదురు
 3. తుట్టతుద = తుద + తుద
 4. చిట్టచివర = చివర + చివర
గమనిక : ఇవి ద్విరుక్త టకార సంధికి సరిపోతాయా? సరిపోవు కదూ ! ఇవన్నీ ఆమ్రేడిత సంధికి ఉదాహరణలే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పై తరగతుల్లో తెలుసుకుందాం.
1) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.
1. బడబానలము = బడబా + అనలము = (ఆ + అ + ఆ) – సవర్ణదీర్ఘ సంధి
 2. అన్నార్తులు = అన్న + ఆర్తులు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
 3. భరతావని = భరత + అవని = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
 4. అదేంత = అది + ఎంత = (ఇ + ఎ = ఎ) – ఇకార సంధి
 5. భానువులెందరో = భానువులు ఎందరో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
 6. సురగోళాలెన్నో = సురగోళాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
 7. పరిణామాలెన్నో = పరిణామాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
 8. నాటకమంతా = నాటకము + అంతా = (ఉ + అ = అ) – ఉత్వ సంధి
 9. కరవంటూ = కరవు + అంటూ = (ఉ +అ = అ) – ఉత్వ సంధి
 10. ఇంకెన్నాళ్ళో = ఇంక + ఎన్నాళ్ళో = (అ + ఏ = ఎ) – అత్వ సంధి
 11. కావ్యాలెన్నో = కావ్యాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
 12. అనాథలుండని = అనాథలు + ఉండని (ఉ + ఉ = ఉ) = ఉత్వ సంధి
 13. ధనవంతులెందరో = ధనవంతులు + ఎందరో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి

2) కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.
| సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు | 
| 1. సముద్రగర్భం | సముద్రము యొక్క గర్భం | షష్ఠీ తత్పురుష సమాసం | 
| 2. నరకంఠాలు | నరుల యొక్క కంఠాలు | షష్ఠీ తత్పురుష సమాసం | 
| 3. నవయుగం | కొత్తదైన యుగం | విశేషణ పూర్వపద కర్మధారయం | 
| 4. కులమతములు | కులమూ, మతమూ | ద్వంద్వ సమాసం | 
| 5. కవి గుండెలు | కవి యొక్క గుండెలు | షష్ఠీ తత్పురుష సమాసం | 
కవి పరిచయం
పాఠం పేరు : ఆలోచనం
కవి : దాశరథి కృష్ణమాచార్యులు
పాఠం దేని నుండి గ్రహింపబడింది : ఈ పాఠ్యభాగం ‘ఆలోచనం’ – దాశరథి రచించిన ‘అగ్నిధార’ కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.
రచయిత కలం పేరు : ‘దాశరథి’
జన్మస్థలం : చిన్న గూడూరు, వరంగల్ జిల్లా, – 1925 – 1987
రచనలు : అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం, ఆలోచనా ! లోచనాలు, గాలిబ్ గీతాలు.
బిరుదులు : కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి.
సాహిత్య సేవ : సినిమా గీతాలు, నాటికలు, వ్యాసాలు, పీఠికలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన ! కవిగా సేవలు అందించారు.
సామాజిక సేవ : వీరు హైదరాబాదు రాష్ట్ర విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
 పురస్కారాలు :
 1) దాశరథి గారి ‘కవితా పుష్పకం’ రచనకు, 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి , బహుమతి లభించింది.
 2) వీరి ‘తిమిరంతో సమరం’ అన్న కవితా సంపుటికి, 1974లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది.
 3) వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదునూ, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి.లిట్’ బిరుదును ఇచ్చాయి.
 4) 1977 నుండి 1983 వరకు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు.
1. ‘ఆలోచనం’ గేయ రచయిత దాశరథిని గూర్చి రాయండి.
 జవాబు:
 దాశరథి కృష్ణమాచార్యులుగారు అగ్నిధార అనే కవితా సంపుటిని రచించారు. ‘ఆలోచనం’ అనే గేయం అగ్నిధారలోనిది. ఈయన 1925లో వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించారు. ఈయన అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం వంటి కవితా సంపుటాలు, గాలిబ్ గీతాలు రచించారు.
ఈయనకు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి అనే బిరుదులు ఉన్నాయి. వీరి ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. వీరి ‘కవితా పుష్పకం’ రచనకు రాష్ట్ర సాహిత్యం అకాడమి బహుమతి లభించింది. వీరు అనేక సినీగేయాలు రచించారు.
గేయాలు – అర్థాలు – భావాలు
1. ఆ చల్లని సముద్రగర్భం
 దాచిన బడబానల మెంతో?
 ఆ నల్లని ఆకాశంలో
 కానరాని భాస్కరు లెందరో?
 అర్థాలు :
 సముద్రగర్భం = సముద్రము లోపల
 బడబానలము = ‘బడబా’ అనే అగ్ని
 కానరాని = కంటికి కనబడని
 భాస్కరులు = సూర్యులు
భావం :
 పైకి చల్లగా, ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల, బడబాగ్ని దాగి ఉంటుంది.. అలాగే ఎన్నో అసమానతలు గల ఈ ప్రపంచంలో అసంతృప్తి గలవాళ్ళ గుండెల్లో కూడా, అగ్ని దాగి ఉంటుంది. నల్లని మబ్బులతో నిండిపోయిన ఆకాశంలో కంటికి కనిపించని ఎన్నో సూర్యబింబాలు దాగి ఉంటాయి. అదే విధంగా, ఈ పెద్ద ప్రపంచంలో ప్రతిభ గలవారూ, గొప్పవాళ్ళూ, పైకి కనబడకుండా ఎంతమంది మరుగున పడియున్నారు?
విశేషం :
 1) ‘బడబాగ్ని’ :
 అనేది సముద్రం లోపల ఉండే అగ్ని. ఇది ఈశ్వరుడిచే పుట్టించబడిన “బడబా” అనే ఆడుగుఱ్ఱము నోటిలో ఉంటుంది. ఇది సముద్ర జలాలను తాగుతూ ఉంటుంది.
2) ఆకాశంలో కానరాని భాస్కరులు :
 ఆకాశంలో మొత్తం 12 మంది సూర్యులు ఉంటారు. వారినే ‘ద్వాదశాదిత్యులు’ అంటారు. ఈ 12 మందే కాకుండా, ఇంకా ఎందరో సూర్యులు ఆకాశంలో ఉండి ఉంటారని కవి భావన.
2. భూగోళం పుట్టుకకోసం
 కూలిన సురగోళా లెన్నో?
 ఈ మానవరూపంకోసం
 జరిగిన పరిణామాలెన్నో?
 అర్థాలు :
 భూగోళము = గోళాకారంలో ఉన్న భూమండలము
 సురగోళాలు = సూర్యగోళాలు
 పరిణామాలు = మార్పులు
భావం :
 ఈ భూమండలం ఏర్పడడం కోసం, ఎన్నో సూర్యగోళాలు కూలిపోయాయి. ఆదిమానవుడి దగ్గర నుంచి, నేటి మనిషి రూపం ఏర్పడే వరకూ, ఎన్నో మార్పులు జరిగాయి.
విశేషం :
 నక్షత్ర గ్రహాలు :
 మనం ఇప్పుడు నివసించే ‘విశ్వం’ కోటానుకోట్ల విశ్వరూపాల్లో ఒకటి. ఈ విశ్వం 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వం, చిన్న ముద్దగా ఉండేది. ఆ ముద్దలో చిన్న గోళీకాయ అంత పదార్థమును, “ఆదియుగపు బ్రహ్మాణువు” అంటారు. ఈ బ్రహ్మాణువులో ఉష్ణోగ్రత 1500 కోట్ల డిగ్రీలకు పెరిగి, అది బద్దలయ్యింది. ఆ పదార్థము నాలుగు వైపులకూ విస్తరించింది. ఈ విస్తరణ మార్పు, దాదాపు 2 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. క్రమంగా ఉష్ణోగ్రత 4000 డిగ్రీలకు తగ్గింది. ఈ పదార్థంలోని మూలకాలు ఒకదానిని. మరొకటి ఆకర్షించుకొని, పెద్ద మేఘాలుగా మారుతాయి. అవి క్రమంగా దగ్గరయి, తిరిగి ఉష్ణోగ్రత పెరిగితే, ఆ మేఘంలో పేలుళ్ళు జరుగుతాయి. అదే ‘నక్షత్రము” అవుతుంది. ఇందులో పదార్థం తక్కువగా ఉన్న మేఘాలు, గ్రహాలు అయి, ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతాయి. దీన్ని “బిగ్ బాంగ్ సిద్ధాంతం” అంటారు.
2. నరజాతి పరిణామం :
 నాలుగైదు కోట్ల సంవత్సరాల క్రితం ‘మనిషి’ లేడు. ‘మేట్స్’ అనే తులు ఉండేవి. ఈ కోతి జాతి నుండే, నేటి మానవజాతి పుట్టింది. ఈ మార్పు, 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. వానర జాతి నుండి నరజాతి పుట్టిందని ‘డార్విన్’ చెప్పాడు. మానవజాతికి చెందిన కోతులను నెపియన్స్’ అంటారు. ఇందులో మానవజాతి “హోమోసెపియన్స్” అనే ఉపజాతికి చెందినది. ఈ జాతి . అవశేషాలు, “క్రోమాన్యాన్ గుహలు” లో దొరికాయి. అందుకే ఈ జాతికి “క్రోమాన్యాన్ మానవులు” అంటారు. వీరే.నేటి నరజాతికి మూలపురుషులు.

3. ఒక రాజును గెలిపించుటలో
 జరిగిన నరకంఠా లెన్నో?
 శ్రమజీవుల పచ్చినెత్తురులు
 తాగని ధనవంతులెందరో?
 అర్థాలు :
 ఒరిగిన = తెగిపడిన
 నరకంఠాలు = మానవుల కంఠాలు
 శ్రమజీవులు = శ్రమపడి జీవించే మానవులు
 నెత్తురు = రక్తం
భావం :
 ఒక రాజును యుద్ధంలో గెలిపించడానికి, ఎంతమంది సైనికులు మరణించి యుంటారో? శ్రామికుల కష్టాన్ని దోచుకోనటువంటి, ధనవంతులెందరుంటారో? నేటి ధనికులు అందరూ పేదలను పీడించి పైకి వచ్చారని కవి భావన.
4. అన్నార్తులు అనాథ లుండని
 ఆ నవయుగ మదెంత దూరమో?
 కరువంటూ కాటకమంటూ
 కనుపించని కాలాలెపుడో?
 అర్థాలు :
 అన్నార్తులు (అన్న + ఆర్తులు) = అన్నం కోసం దుఃఖము పొందిన వారు
 అనాథలు = దిక్కులేనివారు
 నవయుగము = కొత్త యుగము
 కాటకము = కరవు
భావం :
 తిండి దొరకని వాళ్ళూ, దిక్కులేని వాళ్ళూ, ఉండని కొత్త ప్రపంచం ఎంతదూరంలో ఉందో ? కరవు కాటకాలు లేని సుభిక్షమైన కాలం, ఎప్పుడు వస్తుందో?
5. అణగారిన అగ్నిపర్వతం
 కని పెంచిన “లావా” యెంతో ?
 ఆకలితో చచ్చే పేదల
 శోకంలో కోపం యెంతో ?
 అర్థాలు :
 అణగారిన = శాంతించిన
 లావా = అగ్నిపర్వతం బలయినపుడు దానిలో నుండి వచ్చే ద్రవం
 శోకం = దుఃఖం
భావం :
 శాంతించిన అగ్నిపర్వతంలో కనపడని లావా ఎంత ఉంటుందో ? ఆకలితో మరణించే పేదవారి మనస్సులో ఎంత కోపమూ, బాధ, దాగి ఉంటాయో?

6. పసిపాపల నిదుర కనులలో
 ముసిరిన భవితవ్యం యెంతో ?
 గాయపడిన కవిగుండెల్లో
 రాయబడని కావ్యాలెన్నో?
అర్థాలు :
 పసిపాపలు = చిన్నబిడ్డలు, (శిశువులు)
 ముసిరిన = చుట్టుముట్టిన, (వ్యాపించిన)
 భవితవ్యం = భాగ్యము (శుభము)
 గాయపడిన కవిగుండె = అక్రమాలు, అసమానతలు, అన్యాయాలు, అధర్మ కార్యాలు చూసి బాధపడిన కవి హృదయం
భావం :
 హాయిగా నిద్రపోయే పసిపాపల కన్నులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, మరి అంత ప్రశాంతత, వారి భావి జీవితంలో ఉంటుందా ? ఎన్నో అసమానతలు ఉన్న ఈ లోకాన్ని చూసి, కవుల హృదయాలు ఎంత లోతుగా గాయపడతాయో ! ఆ ఆవేదనలో మునిగి ఎన్ని కావ్యాలను వారు రాయలేకపోయారో !
7. కులమతాల సుడిగుండాలకు
 బలియైన పవిత్రులెందరో?
 భరతావని బలపరాక్రమం
 చెర వీడే దింకెన్నాళ్ళకో?
 అర్థాలు :
 సుడిగుండాలు = కలతలు
 బలియైన = నాశనమైన
 భరతావని (భరత + అవని) భారత భూమి
 చెరవీడు = నిర్బంధం నుండి బయటపడు
భావం :
 ఈ కుల దురహంకార ప్రపంచంలో కులమతాలు అనే సుడిగుండాలలో చిక్కుకొని, బలి అయిపోయిన మంచివారు ఎంతమంది ఉంటారో? భారతదేశంలోని వీరుల శక్తి సామర్థ్యాలు, ఇంకెన్ని
 రోజులకు బయట పడతాయో !

పదాలు – అర్థాలు
బడబానలము = బడబాగ్ని, (సముద్రంలో ‘పుట్టిన అగ్ని)
 భాస్కరులు = సూర్యులు
 సురగోళం = సూర్యగోళం
 ఆర్తులు = దుఃఖము పొందినవారు
 లావా = అగ్నిపర్వతం నుండి వెలువడే ద్రవం
 చెరవీడు = నిర్బంధము నుండి బయటపడు
 నరకంఠాలు = మానవుల గొంతులు
 పరిణామాలు = మార్పులు
 నెత్తురు = రక్తం
 భవితవ్యం = అదృష్టం
